Jump to content

చంపూరామాయణము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

చంపూరామాయణము

షష్ఠాశ్వాసము

కిష్కింధాకాండము

క.

శ్రీక్షితివాణీవారీరు, హాక్షీశ్రితదృగ్భుజాస్య యఖిలచ్ఛందో
లక్షణలక్ష్యవిచక్షణ, రక్షుణగుణభోజ కసవరాజబీడౌజా.

1


ఉ.

పంప న్వల్గదనూననిమీనయుగళీపారంపరీశాంబరీ
శంపం గల్గొని సీతకన్దళుకు సాక్షాత్కార మైనట్లు వ
ర్తింపన్ ధైర్యము నిల్పలేక విరహార్తి న్రాఘవుం డాత్మఁగం
పింపం జైత్రుఁడు నింతనంతటఁ బ్రతాపింపం దొడంగె న్వడిన్.

2


సీ.

జిగితీవపడఁతికిఁ జెంగావిపావడ యవనీపదోచితయావకంబు
మాధవశ్రీకి నమంత్రసిందూరంబు కలికానికాయతారలకు సంజ్ఞ
పరభృతవాఙ్మయప్రదశాంభవీరుచి వనికాపురంధ్రి కాననహరిద్ర
వనదేవతచనుంగవకుఁ గుంకుమముడంబు ధారణీరుహశైలగైరికంబు


గీ.

కామినీకాముకవినోదకలనకొఱకు, సమయవర్ధకి పొదరింటిగమికిఁ గీలు
కొలిపిన రుటంపుఁగెంపుఱాతళుకుటోడు, బిల్లగుము రెల్లకడ నుద్భవిల్లెఁ జిగురు.

3


మ.

మరునందు న్మరుసృష్టి మ్రాఁకులయెడం బాలించు టెక్కు న్హిమో
పరిసంహారముఁ జూపి తత్త్రిపురుషీభాగౌచితిం జై త్రుఁ డొం
దురజస్సత్త్వతమోగుణోన్నతు లనం దోఁచెం జిగుళ్లుం జిగు
ళ్ల రకం బయ్యెడుక్రొవ్విరు ల్విరులపట్ల న్వ్రాలుభృంగంబులున్.

4


చ.

చనదు వినోదోప మిఁక సాగవు బింకము లాలకింపుఁడీ
మనసిజుఁ డానతిచ్చినక్రమం బిది యంచు విటీవిటాళికిం
బనుప వసంతుఁ డక్షరసమాజము వ్రాసిన కాగితంబులో
యనఁ దనరె న్సబంభరవనాంతరకాంతలతాంతబృందముల్.

5


మ.

సహకారద్రుమసౌరసంయమి పికీసందోహచంచూపుటీ
మహతిం గైకొని పంచమం బతిశయింపన్ షట్పదీగీతికా
బహుళీభూతనినాదరక్తి హవణింపం జొచ్చెఁ ద్రైలోక్యలో
కహృతాహ్లాదకుఁ డైనమాధవుఁడు సాక్షాత్కారముం జెందుటన్.

6

సీ.

సుమనో౽పచయ మయ్యె సుదతిచూడ్కుల కబ్బుజనములందు వినోదవనములందుఁ
దవిలె డోలాకేళి ధవయుగ్వధూగాత్రతతులయందు వియోగిమతులయందుఁ
బ్రసవసంపద దోఁచెఁ బ్రతివత్సరవసంతయాజులందు మహీజరాజులందుఁ
గానిపించె రసాలఘనచాపలత కంతుపాణియందునుఁ బికశ్రేణియందు


గీ.

నొదవెఁ గడురంగు రక్తియు మదనవీర, కదనజయభద్రకాహళీకలకలాను
కరణచణకోకిలకలాపకంఠకలిత, కాకలికలందును బలాశకలికలందు.

7


సీ.

నవలాకటాక్షంబునకు నోఁచెఁ దిలకంబు సకియమో మీఁదగెఁ జంపకంబు
తరుణికే లంటఁ బాత్రం బయ్యె లేమావి గుబ్బెతకౌఁగిటి కబ్బెఁ గ్రోవి
వెలఁదినిట్టూర్పు తావి భజించె వావిలి వనితవక్త్రాసవం బెనసెఁ బొగడ
యతివపదాహతి కనువయ్యెఁ గంకేళి పడఁతి నవ్వింపఁ బాల్పడియెఁ బొన్న


గీ.

మాటవినెఁ బాటయాలించెఁ బోఁటివలన, గోఁగుప్రేంకణ మనఁగ లోకులకు నింకఁ
బంకజాక్షుతులు రేవగలంకపాళి, గీలుకొనకున్న నవ్వేళఁ దాళవశమె.

8


వ.

ఇట్లు జాతకౌతూహలావహదశావతారగౌరవుం డైనమాధవుండు కూర్మిఱేఁడై తావుకొన ఠీవిమెఱయు వనరాశిలో నమందరాగం బభినవానంతమణికిరణమహెగ్రాహిగుణయుతంబుగాఁ బలాశసుమనఃపరంపర లలవరింప నత్తఱిం గరం బుద్భవిల్లి యుద్వేలకాలకంఠకంఠనిర్భరార్భటీరసాలంబుఁ జెంది రంభాదు లమరగణికలు ప్రభూతలై తనరఁ, గైతకరజోవిసరపరిపాండురాంగసారంగంబు లసమాసజననతం జెలంగఁ, జంద్రమండలసుధామధురసోద్యల్లతాంతసంతానమందారపారిజాతప్రభృతు లభ్యుదయంబు నెనయ, నంత నెన యిడంగరాని మేనిసౌందర్యంబుతో దోఁచునిందిరాదేవి యన, భుజాంతరనిశాంతవిశ్రాంతిం జెందినట్లై, యనంగశాంబరీవిజృంభణం బనెడు కాదంబినిం బొడమి యలయించుచంచలాలతికరీతి, లక్ష్యాలక్ష్యతరాకార యై మనోరథమయారామసీమ నుల్లసిల్లు కల్పవల్లియుల్లాసంబునఁ, బాటలప్రభాధరప్రవాళంబన మరులుకొలుపుచు, నవేలమోహమయవిభావరీసమాగమోదిత యై, శీతాంశురేఖ యన, లోచనచకోరికల నూరించు సంచితగుణాభిజాత యగుసీత డెందంబునం దవిలి జూలినొందింపఁ బంపాతటరసాలసాలమూలశీతలశీలోపరి నధివసించి, పంచశరశరవికాసకారణపటీరగిరిమరుత్ప్రపంచసంచాలితగభీరతాశరధి యగు దాశరథి లక్ష్మణుం జూచి యిట్లని వితర్కింపందొడంగె.

9

సీ.

హృదయవ్యథాశాంతి నొదవించుసవ్యదివ్యౌషధి యనఁగ నేయుత్పలాక్షి
కేళియం దనురక్తిఁ గీలించు కూర్మి నెచ్చెలికత్తె యనఁగ నేలలితగాత్రి
యనుకూలత వహించు యజ్ఞదీక్షల ధర్మపత్ని యనంగ నేపద్మపాణి
కలనిలో ధీరయై మెలఁగువీరక్షత్రియాణియనంగ నేయలరుఁబోణి


గీ.

శిష్టగురుదేవపూజల శిష్య యనఁగ, నాపదల బంధువన మించు నేపురంధ్రి
యట్టిత్రైలోక్యనుత సీత యిట్టియడవి, నేదియుం గాక డాఁగె నిం కేమి సేయ.

10


మ.

మలయాద్రి న్నెలవై మెలంగెడు మరున్మత్తేభ ముత్తుంగత
న్వలరామావుతుఁ డెచ్చరింపఁ బథికవ్రాతంబు లేఁదేఁటిశృం
ఖల మట్టాడుచు శైత్యమాంద్యభరసౌగంధ్యంబుల న్దానభా
రలతోఁ జేరెడు మన్మనోజలజవప్రక్రీడకు న్లక్ష్మణా!

11


చ.

అని రఘువీరుఁ డార్తినొలయం గలికాకృతిఁ జెందుమందపుం
జనకు నలక్ష్యపున్నడత సైఁచుట కామనువంశమౌళికిం
జనకజసేమముం దెలుపఁజాలినవాఁ డయి వాలిభీతిచే
నినతనయుంచు దౌత్య మెనయించి వడిం దనుఁ బంపఁ బంపకున్.

12


మ.

కటిసూత్రంబును ముంజి పిల్లసిగయుం గౌపీనముం జింకతో
ల్పటుజందె౦బుఁ బలాశదండ మమరం బౌలస్త్యకీర్తిక్షపా
విటనాశోచితకృష్ణపక్షచరితస్వీకారదౌరంధరి
న్వటువేషంబు వహించి వచ్చె నటకు న్వాతాత్మజుం డత్తఱిన్.

13


ఉ.

వచ్చి యతండు పల్కు రఘువర్యుల నోయనవద్యులార మీ
రిచ్చటికాన యామని కనేకతఁబూన్స నిమిత్త మేమి యు
ష్మచ్చరణంబు లీయుపలమార్గము సొచ్చుట కెట్టులోర్చె వై
యచ్చరలోకు లిచ్చలకు నచ్చెరువైనవి మీవిలాసముల్.

14


సీ.

జిష్ణుచాపవిభూతిఁ జెనయుమీఘనతకు జనలోకసువినతాచరణ మరిది
తమముఁ బోనిడుభవజమార్తాండవర్తన కింతయౌగపద్యంబు వింత
ధృతజటావల్కలోన్నతిఁ దోఁచు మీభవ్యకల్పనాకృతికి జంగమత హెచ్చు
ప్రాప్తరూపతఁ గాంచు భవదీయమాధవాత్మభవస్థితికి ఘోరతపము చిత్ర


గీ.

మౌర యుష్మధభీరత లమృతలహరి, చెవికి లాహిరి గొలుప నాజిహ్వ ప్రహ్వ
యైన దటుగాన మీసమ్ముఖాన కిప్పు, డేను వచ్చినవృత్తాంత మేర్పరింతు.

15

మ.

కలఁ డుద్యత్తరధైర్యనిర్జితహిమగ్రావుండు సుగ్రీవుఁ డ
న్బలియుం డద్రిచరావలి న్మనుపఁ బెంపం దక్షుఁ డామేటికిం
జెలినై యుందుఁ బ్రభంజనాంశజననశ్రీ నాంజనేయుండ లో
కులు నన్ను న్హనుమంతుఁ డండ్రు మిముఁ గన్గోవచ్చితి న్వర్ణి నై.

16


క.

వాలి నిరాతంకమహః, కేలిని వారింపఁ గరుణ క్రేఁగంట నిడన్
వ్రాలినవా రని మీకడ, కేలినవాఁ డనిచె నను మహీవరులారా!

17


మ.

అను నయ్యర్కతనూజుమంత్రికి నిజోదంతంబు సౌమిత్రి దె
ల్ప నతం డంత విధేయుఁ డై తెరువు సూప నృశ్యమూకాద్రికిం
జని సుగ్రీవునిఁ గాంచి రాఘవుఁడు తత్సఖ్యంబు జాతావనీ
జనసౌఖ్యం బనలాభిముఖ్య మమరం జల్పెం బ్రసన్నాతుఁ డై.

18


చ.

అనిలకుమారుఁ డిట్లు హరి యై సమవర్తియు నైనభానునం
డనునకు రామచంద్రునకు నం టికమీఁదట బ్రహ్మ నౌదు నే
నను మహిమన్ ఘటింప హరియై సమవర్తియు నైనభానునం
దనునకు వాలికి న్నలువ నం టొనరింపఁదలంచు టబ్రమా!

19


ఉ.

అంబుజబంధుసూనుఁ డపుడాధిపయోధి నడంచు మిత్రభా
నంబు తనందుఁ గీల్కొపి వాలికిఁ గీలి కవార్యమైన శౌ
ర్యంబు నొసంగుసంగరధురంధరుఁ డై తరుణీవియోగజా
తం బగుదుర్ధశం దెలుపు దాశరథి న్నెఱనమ్మి యంతటన్.

20


మ.

ధరకు న్రావణఘర్మతాప మడఁగం దద్రామసఖ్యంబు తొ
ల్కరికిం గట్టు మెఱుంగువిత్తనము రేఖ న్జానకీపాతితా
భరణంబుల్ గని తాను దాఁచినవి చూప న్వానిఁ గన్నీట సం
స్కరణాభావరజంబు వోఁ దడిపె నైక్ష్వాకుండు శోకార్తుఁ డై.

21


గీ.

అంతట నిజానుజుఁడు దేర్చ వంతయుడిగి, తపనతనయునిఁ జూచి యోకపికులేంద్ర
యింద్రనందనుతో వైర మేల నీకుఁ, గలిగె నన నాతఁ డి ట్లని తెలుపఁదొడఁగె.

22


మ.

మనుజేంద్రా విను మున్ను దుందుభికి మున్మాయావి యన్వాఁడు వా
లి నరిధ్వాంతమరీచిమాలి రణకేళిం రేఁచికోలై పడిం
జని పాతాళము సొచ్చిన న్విడువ కాశాఖామృగాధీశుఁ డా
తని వెన్నాడి నను న్రసాతలబిలద్వారస్థితుం జేయుచున్.

23

మ.

అరి వెన్నాడి హరీశుఁ డాకరణిఁ బోరాడ న్వడిం గ్రొత్తనె
త్తురు లేఱయ్యును వాలి రామి మిసిమింతుండౌట నూహించి ది
వ్యరిపుక్రోధగతి న్శిలావృతబిలద్వారుండ నై వచ్చితిం
బురికి న్మంత్రులయాజ్ఞ వారముదినంబు ల్పూనితి న్రాజ్యమున్.

24


క.

ఆలో నాలోలశిఖి, జ్వాలోపమకోపశీలి వాలి వడిం బా
తాలోదితుఁడై కృతనతి, నై లోఁగెడునాపయి న్దురాలోచనుఁ డై.

25


క.

ఉసురుకొనం గసరిన వెస, దెస చెడి యిక్కొండ నెక్కితి నతం డిటుఁ దా
రసమై వచ్చుటకు న్సా,ధ్వసపడఁ గారణముఁ దేటపడ విను మింకన్.

26


ఉ.

దుందుభిదానవోగ్రజయదుందుభి సైరిభమై నిజోన్నతి
న్వందురి వింధ్య మంతటిది వంధ్యముగా జలధిం గలంచి సం
క్రందననందనుం బిలిచి కయ్యము దీయఁ గపీంద్రుఁ డంత వా
నిం దెగటార్చి తత్తనువు నెత్తురుచేతులఁ ద్రిప్పివైచినన్.

27


మ.

లయవాతూలనిలోలతూలగతి లౌలాయాంగ మిచ్చో మతం
గయమిస్వామివనాగ్రభూమిఁ బడి రక్తం బూన్ప నాతండు కో
పయుతుం డై హరిసూతి కీగిరి భజింప న్హానిదోఁప న్శపిం
చె యతీశోక్తి నవాలిపశ్య మగుటం జేకొంటి నీదుర్గమున్.

28


ఉ.

వాలిభయంబు వెన్దగుల వర్తిలు నార్తుఁడ నౌట మిమ్ము నా
పాలిటిభాగ్య మంచుఁ దలప న్ధృతిసాలనినాదుడెంద మాం
దోళముఁ బాపె మబ్బు దవధూమముగాఁ దలపోయుకేకి కే
కాలపనంబు నింప వలిగాలిగతి న్హనుమంతుఁ డిత్తఱిన్.

29


ఉ.

నావుడు రాఘవుండు రవినందన చెందెద వెల్లసౌఖ్యము
ల్నీ విఁక నావలీముఖు శీలీముఖయుక్తి ననూనవృత్తికిం
దావొనరింతుఁ జిత్రవధనైపుణి నంచు వచించినంతట
న్లావరియంచు నమ్ముట కిలం దగుదుందుభిదేహదుందుభిన్.

30


క.

తనపదనఖమున దశయో, జనములు చనమీటి వానిసంశయ ముడివో
మి నతం డదె వాలి దెమ,ల్చిన చెట్లని సప్తసాలిచే వణఁగించెన్.

31


క.

లుప్తాశర మగుశరమున, సప్తజగద్భృతినిమిత్తజడజాతజనుః
కౢప్తస్తంభాశయకృతి, దీప్తం బగుసాలసమితి దెగిపడ నేసెన్.

32

చ.

ననుఁ గొని సప్తతాళదళనం బొనరించితి వాపులస్త్యనం
దననగరంబు సాలదలనంబు ఘటించుట యేమిదొడ్డు నీ
కినజునివంటిబం టనుచు నింద్రజుఁ దున్ముట కెచ్చరించె న
దినమణివంశ్యు నత్తఱిఁ దదీయశరంబు శిలాహతిధ్వనిన్.

33


క.

సందేహ ముడిగి యంతట, మందేహవిరోధిసుతుఁడు మాత్సర్యభర
స్పందనుఁ డై పోరికి సం,క్రందననందనునిఁ జీరె గర్జారభటిన్.

34


సీ.

నృహరికంఠకరాళకహకహధ్వనిశంక శరభాకృతికి శూలి సంభ్రమింప
వీరభద్రోగ్రహుంకారమోహవిభీతి దక్షుఁ డంబుజభవాస్థాని కొదుగఁ
బ్రలయాభ్రనిస్వనభ్రమచేత స్వర్లోకజనులు మహర్లోక మనుసరింపఁ
గిరిరాజముఖపుటీఘుటఘుటభ్రాంతిచే వసుమతీయువతి సంతసముఁ జెంద


గీ.

భయద మగుసింహనాద మాభానుసూను, వలన నాలించి కోపించి వాలి వెడలి
వచ్చి చిచ్చుఱపిడుగుకైవడి నిజాను, జన్ము మార్కొని యనిసేయుసమయమందు.

35


చ.

కరము లురంబులు న్నఖముఖంబులు భిన్నతఁ జెంద నొంచుసం
గర మొనరింపఁ బాల్పడియు గాత్రవిభిన్నతఁ దోఁపనీని య
య్యిరువురఁ జూచి సాయకము నేయక యూరక యుండె రాఘవే
శ్వరుఁడు సభాంతరంబునఁ బ్రసంగము సేయనివానికైవడిన్.

36


గీ.

తరణిజుం డంత వితరణీకరణి మార్గ,ణాగతి కెదురెదురు చూచి యరికిఁ దలఁకి
తనుఁగదియరా నబాణమోచననిమిత్త, మతని కెఱిఁగించి క్రమ్మఱ ననికిఁ బూన్చి.

37


ఉ.

గ్రీవం గుర్తుగ నొక్కపువ్వుసరముం గీలించి రాముండు సు
గ్రీవుం బంప నతం డకాండఘనమై కిష్కింధఁ జేరం దదా
రావాకర్ణనచే నకర్ణభరతారావాక్యుఁ డై వాలి కో
పావేశంబున వచ్చి కూలె రఘువీరాస్త్రాహతోరస్కుఁ డై.

38


క.

అంతట వాలినిపాతో, దంతము చెవిసోఁకి తార యశ్రులహర్యా
క్రాంతతరతారయై శుద్ధాంతనిశాంతంబు వెడలి యాళీయుతయై.

39


సీ.

ఉడివోని కన్నీటిజడి ముద్దునెమోము హిమభూసరాబ్జవిభ్రమముఁ జూపఁ
జిఱునవ్వు దవ్వైన చెంగావిజిగిమోవి ననలేనిచిగురాకు నెనకుఁ దీయ
గద్గదస్వరయుక్తిఁ గంఠనాళంబు మం, ద్రధురీణ మగువీణెవిధముఁ జెంద
ముడి వీడి క్రొమ్ముడి ముంచుకో నెమ్మేను మొగులులోనిమెఱుంగువగలు నెఱప

గీ.

వచ్చి హరిలూనకరివోలె వ్రాలియున్న, వాలిఁ గని సోలి జాలిఁ దన్మౌలి నంక
పాలి నిడి హేళిజహితానుశూలి నంశు, మాలికులుఁ బల్కె శోకవరాలి దొలుక.

40


చ.

సకలజనార్తిహారి యగుచల్లఁదనంబు సుధాంశుమూర్తికిం
బ్రకృతిగఁ దోఁచుకైవడిఁ గృపాళుత నీకు నిసర్గ మట్టి తా
వకకరుణార్ద్రభావనిరవద్యత నెక్కడ నిద్రపుచ్చెనో
యకట మదీయపాతకఫలావగుణం బది రాఘవేశ్వరా.

41


మ.

ప్రియుఁ డీరీతి రుజన్ భజింప నొడలం బెన్బ్రాణముం దాల్చుని
దీయు రా ల్రక్కసి యంచు బాణహతి న న్దండించినం బాప మే
మియు ని న్నంటదు తాటకావధముచే మే ల్సేయవా యుర్వికి
న్దయితాశ్లేషము గా నొసంగు టది పుణ్యంబే యగు న్రాఘవా.

42


ఉ.

భూమిపతు ల్ముృగవ్యరతిఁ బూనుట యుక్త మటంచు ధార్మిక
స్వామివి నీవె యానతి యొసంగుట నా చెవి సోఁకి యుండ శా
ఖామృగిఁ దావకీనశరఘాతనిపాతితఁ జేయకుందురా
యేమృగిమీద నేమృగయుఁ డెక్కటికం బిడు రాఘవేశ్వరా.

43


క.

ఇతనికి భయపడి మును నీ, హితబంధుఁడు ఋశ్యమూక మెక్కినగతి మ
త్పతియు న్నెలకొనియెడు నా, శితవిశిఖాభేద్యహృదయశిఖరీంద్రంబున్.

44


మ.

ఇనవంశ్యోత్తమ నీమొనం దునిసిపో నే వాలినో సప్తసా
లినొ మారీచునితల్లినో యవిశిఖాళీభేద్యత న్వజ్రసా
రనిరాతంకహృదంతరాళ సగుతారాకాంత నింతే యిఁక
న్నను నిర్జింపక నీవు ధన్వి ననుకొన్న న్నవ్వరే యెవ్వరున్.

45


గీ.

ఇనకులనృపాలు రాదిగర్భేశు లగుట
శౌర్యమును బోలె మౌగ్ధ్యంబు సహజమేమొ
వాలి నిరపాయమన్మనోవసతినుండ
వీనికై యేల తొడరెదు విల్లుపూని.

46


చ.

అని విలపించు తార నయనాశ్రుజలశ్వసనాప్తిజాతచే
తనుఁ డగురీతిఁ గన్దెఱచి దాశరథీశ్వరుచేతి కంగదు
న్మనుచుట కొప్పగించి దిననాయకసూతికిఁ దా వహించుకాం
చనమయదామకం బొసఁగి సద్గతికిం జనె వాలి యత్తఱిన్.

47

ఉ.

హాకపినాయకప్రవర హాదశకంధరదందశూకబం
దీకరణాహితుండికపతీకృతవాలధి హాగుణైకర
త్నాకర పోయితే దివికి నంచు వలీముఖు లాచరించి రై
క్ష్వాకునియాజ్ఞ సంస్క్రియలు వాలికి శౌర్యజితాంశుమాలికిన్.

48


క.

మహితనయావిభుఁ డంతట, మిహిరజు నభిషిక్తుఁ జేయ మేఘము లీర్ష్యా
వహము లయినట్లు తన్మహి, మహిషిని నభిషిక్తఁ జేయ మఱి దివిఁ దోఁచెన్.

49


చ.

తనుఁ గిష్కింధ వసింప వేడుకపినేత న్రాఘువుం డేఁ బురం
బునకు న్వచ్చుట యుక్త మీఘనదినంబు ల్వీట నీ వుండి ర
మ్మని వీడ్కొల్ప నతండు నేగి నిజరాజ్యప్రాజ్యసౌఖ్యాప్తి బొ
ల్చెను రాముండును మాల్యవంతమున నిల్చె న్వానకై యయ్యెడన్.

50


వర్షాకాలవర్ణనము

సీ.

హలధరహృదయప్రియావహారంభణం బాశాంతవిపినాంతహవ్యవహము
శాంబరాడంబరచ్ఛన్నాబ్జహితబింబ మచిరాంశురుచిదీపితాంబరంబు
నవనవారచితార్జునవికాసగరిమంబు ధార్తరాష్ట్రనిరాసదాయకంబు
శితికంఠబాంధవప్రతిపాదనోచితం బాయతశక్రగోపావనంబు


గీ.

వితతఘనఘోషపోషణం బతిశయోద, యాశ్రితకదంబమాత్తమహావనాగ్ర
జాతికమునై తనర్చి వర్షాదినంబు, దేవకీనందనునిఠీవిఁ దెలిపె నపుడు.

51


చ.

సరకుఁగొనండు నన్నుఁ దనచాయల వాలి నడంచె మత్పురం
దరవిభు సడ్డసేయక యితం డని రాఘవునాలిజాలి ము
న్నరకకుఁ దెచ్చుపోలిక ఘనాఘనమాలిక తత్ప్రియాసమా
హారణజలాశలాశలను నాఁగె సగర్జితసింహనాద యై.

52


క.

కయికొనియె న్రాజులపస, మొయి లపుడు నిరస్తతాపము నృత్పథవ
రియుఁ బౌరస్త్యమహాబల, రయచలితము జీవనస్ఫురద్వనుధము నై.

53


వ.

అత్తఱి వియత్తలంబు హత్తి లాగెత్తు మెఱుపుటొఱపులాఁడిన నర్తనచమత్కృతికి నచ్చెరుపడి వియచ్చరోచ్చయంబు లిచ్చిన చిరత్ననవరత్నబిరుదమంజీరవలయంబు మంజిమం జదల నాఖండలీయకోదండంబు దోఁప, నాపురందరశరాసనంబుఁ గొని ఘనుం డఖండనిజమండలాసహంబు లిప్పాండురాండజంబు లని శరాసారంబుఁ గురియింప సొంపు సెడి యంచగుంపు లలక కెలఁకుకొలఁకునకై నఱవ నవి పఱచి వెఱచఱచుటకుఁ గేకవైచు కేకికలకలంబునకు నలికి

కేతకీతతి భుజంగసంఘం బడంగ, నారీతి భోగినీపతుల కగు మొగలితెగల తగులునకు నగుపగిది వికచకుటజనిచయరుచిర యగునరణ్యానిచే నగణ్య యగు ప్రావృషేణ్యప్రక్రియకు విక్రియం బూని యాజానకీజాని లక్ష్మణు నిరీక్షించి యిట్లనియె.

54


మ.

మెఱుపుందళ్కు మిటారిచాయ దెలుప న్మేఘుండు తన్వంగిపె
న్నెఱిగుంపు న్నెఱయింప జాదినవలా నెత్తావి పై నింప ముం
దఱఁ జిందుల్గొను నెమ్మికొమ్మ నటన ల్దార్పంగఁ గందర్పుఁ డి
త్తఱి నేపాంథుని నొంపఁ డీనవపయోధారాసమిరాహతిన్.

55


పృథ్వి.

చెలంగె నలుదిక్కులన్ శిఖశిఖావళీకంఠకా
హళీధ్వని వియోగితా మపి నరేషు నారీషు వా
జలాకులఘనే దినే సపది యాంతి కే కా యితి
చ్ఛలారభటితో మనోజరణవేగసంసూచి యై.

56


ఆ.గీ.

అభ్రగర్భనిర్యదంబుధారాకరం, భితసమీరభరసమీర్యమాణ
వికచకుటజకుసుమవిసరంబువలన నా, కాశవలయ మనవకాశ మయ్యె.

57


మ.

వనధింగ్రోలెడునీటితోఁ దొడరునౌర్వజ్వాలచేఁ గుక్షియె
ల్లను దస్తంబగుటం జలించి యవి మర్లం గ్రాయఁజొచ్చెన్ ఘనా
ఘనసందోహము లభ్రచారిదివిషద్గాణిక్యమాణిక్యమో
హనభూషామతిదాయివైద్యుతలతావ్యాజంబుచే నియ్యెడన్.

58


క.

సౌమిత్రీ కంటివె చా,లై మహి డిగువర్షధార లభినవజలద
స్తోమశ్యామలపత్ర, వ్యోమన్యగ్రోధశాఖియూడలువోలెన్.

59


వ.

అని వియోగవ్యథాదూయమానుం డగురఘుసూనుం డొక్కవిధంబునం బయోదమలినంబు లగుదినంబులు గడపె నంతట.

60


మ.

హరినిద్రారజనీదినోదయము హర్షాకర్షణోపాయమం
త్రరహస్యం బచిరోపయోగ్యఫలకేదారం బనాలక్ష్యపా
దరిఖేలానటనాంతమాంగలికగేయం బన్వితాన్యోన్యజై
త్రరణోద్యోగమహీధవంబు శరదారంభంబు దోఁచె న్దివిన్.

61


సీ.

కాకుత్స్థువిరహాకులాకారదశఁ బూనుకరణి మేఘుండు పాండురతఁ జెందె
నినవంశ్యుఁ డెత్తు వి ల్లింకనంచుఁ డాఁగిపోయినరీతి నిలదయ్యె నింద్రధనువు

రఘువీరకీర్తి నర్తకిజక్కిణికి యుక్త మగుచామరంబు లై యమరె ఱెల్లు
కపివాహినులపిండు కాఁగల్గు టూహించి యంబువాహినులెల్ల నాఱఁదొడఁగె


గీ.

లంక వంటిది యింక నిశ్శంకరాజ, హంససంచారమునకుఁ దా వగు నటంచుఁ
డెంకియై తోఁచెఁ బుడమి నిశ్శంకరాజ, హంససంచారమునకు నయ్యవసరమున.

62


శా.

చేతోజాతశరప్రణీతహృదయచ్ఛిద్రప్రణాళీవిని
ర్యాతస్నేహమయప్రతిశ్రవభరుం డై యుండుమార్తాండి రా
గాతివ్యాప్తి నిరాకరింప భృతకోపాటోపచాపోద్గతిన్
సీతానాయకుఁ డంప లక్ష్మణుఁడు వచ్చె న్వేగఁ గిష్కింధకున్.

63


లక్ష్మణుఁడు కిష్కింధకుఁ బోవుట

శా.

వాలిప్రోద్భవుఁ డప్పు డంతిపురికేవ న్నిల్చి రాగాంధత
న్రేలెల్ల ప్రతిజాగరూకుఁ డగుట న్మేల్కోని సుగ్రీవుని
ద్రాళుత్వమ్మునకు న్విచారపడుచో రామానుజాలోక భీ
తాలోలప్లవగారవాపహృతనిద్రారక్తనేత్రాబ్జుఁ డై.

64


క.

లేచి కొలువుండి సచివుల, వాచోన్నతిఁ బ్రకృతిఁ జెంది వర్తిలు నవ్వై
రోచని సౌమిత్రిధను, ర్జ్యాదండనినాదనిశమనానతముఖుఁ డై.

65


మ.

ఘనఘోషశ్రుతిచేఁ దలంకునహిరేఖం బీఠముం డిగ్గుచో
హనుమంతుందు నినున్ జయోన్నతునిఁ జేయ న్నెయ్యపున్గిన్కఁ ద
మ్మునిఁబంపం జను రాఘవుం డని భయంబు న్మాన్ప సౌమిత్రిసాం
త్వనకై తారనుఁ బూన్ప వెల్వడియె నత్తన్వంగి శుద్ధాంతమున్.

66


గీ.

వారుణీయుక్తిఁ దేజంబు వదలి రాజు, కనఁబడ నిశాంత మపుడు నిష్క్రాంతతార
మపగతతమంబు నయ్యెఁ బూర్వాశ వత్త, మిలెడు సత్పథసంచారి మిత్రుఁ డమర.

67


ఉ.

తారధరావతారకరతార యనం దులలేని మేనిశృం
గారముతోడ నెన్నడలఁ గార్యవశత్వరఁ దెల్పు నూత్నము
క్తారశనాగుణాంఘ్రికటకస్వనితార్భటితోడ లక్ష్మణుం
జేరఁగవచ్చి కేల్మొగిచి చిల్కఁదొడంగె వచోమరందమున్.

68


చ.

బిసరుహబంధుసూతి నొకపెన్గిరి పైఁ జెఱయిడ్డ యింద్రజ
వ్యసనమడంచె మున్ను రఘువర్యుశరం బది యుండుఁగాక నేఁ

డొసపరిచంటిగట్టుఁ దిగనోపని యీకపిరా జుపేంద్రజ
వ్యసనముఁ బాపె నద్దిర భవద్దృఢచాపవిటంకటంక్రియల్.

69


శా.

లోకాలోకముదాఁక నేకగతి నాలోకింపఁ బాల్పడ్డ యీ
లోకాలోకవిధాయిసూనుఁ డిఫు డిల్లు న్వాకిలిం గల్గి వ
ర్షాకాలోదిత మైనపోణిమికి నోఁచంజాలె నిన్నాళ్లకు
న్మీకారుణ్యమువంక నిట్టి హితుని న్మీ రిట్లు కోపింతురా?

70


వ.

ఏవంవిధోదారతారావచనచారిమాపనీతకోపాటోపసముత్పన్నప్రసన్నతామిళన్నిరవధికమైత్రి యగుసౌమిత్రివెంబడి హనుమదానీతనానావిధానూనవానరానీకినీవితానసంసేవ్యమానుం డగునచ్చండభానుసూనుండు రాఘవుం డున్నకొండదరి కరిగి యతనియడుగుతొగరుఁజిగురులకు నెఱఁగి తదాదరణభరితకౌతూహలాంతరంగతం జెలంగి యంతట.

71


సుగ్రీవుఁడు సీతను వెదకుటకు వానరుల నంపుట

సీ.

తళుకుబేగడకొండదండనుండు నితంతు పారియాత్రతటీవిహారుఁ డితఁడు
వలిగట్టుచెట్టుపట్టుల మెలంగు నితండు నిషధాద్రిమేఖలానిలయుఁ డితఁడు
తఱిమెట్టుజాళువాదరి కాఁపరి యితండు గంధమాదనవనోత్కంఠుఁ డితఁడు
కడనేలదాల్పు నిల్కడఁ జెలంగు నితండు వింధ్యాటవీజాతవిహృతి యీతఁ


గీ.

డని మఱియు నెన్న వసపోని యచలవితలి, నధివసించియు సంఖ్యకు నధికమైన
వానరేశుల వేర్వేఱఁ గానిపించి, యినతనయుఁ డప్పు డారాఘవేంద్రునాజ్ఞ.

72


సీ.

మిహిరుండు వొడముచో మేనుతొల్సంజకుంకుముటెక్కుఁబూనుదిక్కునకు వినతుఁ
బరువంపువిరివింటిదొరమత్తకరి యత్తమిలుహరిత్తునకు సమీరతనయు
మొసలితేజివయాళిమురిపంపుజగరౌతు సామి గా నోఁచునాశకు సుషేణు
జంటనాలుకకంటసరిదంటచెలినంటు గలదిశకును శతబలికపీంద్రు


గీ.

నెలకు జానకిసేమంబుఁ దెలిసిరండ, టనుచుఁ బంచిన వారలు నచట నచట
నరసి ధరణిజఁ గానక మరలి రంత, హనుమదాదులు దక్షిణంబునకు నడచి.

73


శా.

పోవం బోవ నఖండకండుజటిలభ్రూభంగజాతస్థలీ
భావోదగ్రసరణ్యరణ్యధరణీభాగంబునం దొక్కర
క్షోవీరుం డెదిరింప వానరబలస్తోమంబు గంపింప న
చ్చో వాలిప్రియసూనుఁ డానిశిచరు న్శూలాగ్రభీతామరున్.

74

క.

కినుకం దొడరి కచాకచి, యని సలిపి తదీయగాత్ర మసురహితముగా
నొనరించె సురహితం బగు, తనచరితము జనుల కద్భుతము గావింపన్.

75


ఉ.

అంతట వానరప్రముఖు లద్రివనద్రుమదంతురీభవ
త్ప్రాంతరయానుజన్య మగుశ్రాంతత వాయ నుపాంతవర్తివే
శంతము పొల్పుఁ దెల్పునవసారససౌరభవంతము న్నభ
స్వంతము మెచ్చి యొక్కబిలవాటము సొచ్చి తదంతరంబునన్.

76


చ.

మును పజుఁ డొక్కమౌనితపముం జెఱుప న్మది మెచ్చి హేమ కి
చ్చిన మయ కౢప్తహేమవనిఁ జెల్వగు మేరుసవర్ణి కూర్మినం
దన నొకతె న్స్వయంప్రభ యనందగు దివ్యవధూటిఁ గాంచి యా
వనిత మహత్త్వశక్తి బిలవాటము వెల్వడి వచ్చి యొక్కెడన్.

77


హనుమదాదుల ప్రాయోపవేశప్రయత్నము

క.

మిట్టాడ నరుఁడుపుట్టని, నట్టడవి వసించి కపులు నాథుఁడు మనతోఁ
బెట్టినమితిఁ దప్పియు మహి, పట్టిం గనమైతి మెట్టిపాపం బనుచున్.

78


చ.

కళవళమంద నంగదుఁ డిఁక న్మన మూరక పోయినప్పుడే
తలఁ దెగవ్రేయుఁ గాని యొకతప్పును గావఁడు భానుసూనుఁ డా
ఖలమతియుగ్రదండమునఁ గాయము వాయుటకంటె నీవన
స్థలి మునివృత్తిఁ బ్రాణములు దాల్చుట మే లగునంచుఁ బల్కినన్.

79


మ.

హనుమంతుం డను నేటిమాట పతికార్యం బట్లు పోకార్చి యీ
వని నెట్లుండెడువార మాదొరకు దవ్వా యివ్వనం బెందుఁ దూ
ఱినఁ బోనీయక పంపువెట్టి తల లేఱించుం గపిస్వామి యొ
ప్సనియాలోచన మాని మే న్సడలుఁడీ ప్రాయోపవేశంబునన్.

80


గీ.

అనుచు హనుమదాదు లైనవానరులు ప్రా, యోపవేశమునకు నుద్యమంబు
సలిపి కుశలయందు శయనించువా రార్తి, తోడఁ జింతసేయఁ దొడఁగి రిట్లు.

81


మ.

మనువంశంబునఁ బుట్ట నేమిటికి రామస్వామి దాఁ బుట్టుఁగా
క నిగాఢాటవి కేల వచ్చె గురువాక్యస్వీకృతి న్వచ్చుఁగా
క నిశాటేశుఁడు సీత నెత్తికొని లంకామార్గముం జేరనే
ల నతండేగ జటాయు వాయసుర నేలా తాకి కూలె న్మహిన్.

82


క.

కూలినజటాయు వట్టె పొ, కాలక రఘుపతికి సీతఁ గైకొని చనియెం
బౌలస్త్యుఁ డనుచుఁ దెలుపఁగ, నేల యతం డలకబంధు నేలా తునుమన్.

83

గీ.

చచ్ఛినకబంధుఁ డేటికి శబరితెఱఁగుఁ, జెప్పె నది యేటి కినసూను చెలిమిఁ దెల్పె
వాలి పడనేల సుగ్రీవుఁ డేల నేల, మనము రానేల యీనేల వనరనేల?

84


క.

అని వనరుకపుల పరిదే,వనమునఁ జెవిసోఁకు రాఘవుకథాసుధ ము
న్నినరుచిఁ గమరినఱెక్కల, పునరాగమ మనుజవిగమముం దెల్పుటయున్.

85


మ.

మది నామోదము ఖేద మొక్కట జనింప న్లేచి తా నున్నవ
న్యదరి న్వెల్వడి వచ్చి యత్తఱి నిజోదంతం బెఱింగించి యే
ల దిగు ల్మీ కిఁక రామదూతలకుఁ గల్యాణంబె సంధిల్లు న
ల్లదె మున్నీ రదె లంక దాశరథియిల్లా లందు వర్తిల్లెడున్.

86


క.

జనకజకుశలముఁ దెలియం, జనుఁ డని సంపాతి తెలుప సంతసపడి యా
తని గారవించి యంగద, హనుమన్ముఖు లచటుఁ గదలి యటు చని యెదుటన్.

87


సీ.

అంజనగిర్యధిత్యకశాద్వలస్థలి పచ్చఱాకొణిగెలోఁ బారువంబు
బలుతుంగమడువులోపలికరేణువు వట చ్ఛదములో నిసువైన శౌరిమూర్తి
దానవారియురంబులోని శ్రీవత్సంబు భానుజాంతరపద్మపత్రసమితి
కాదంబవనిఁ దోఁచు నాదిమశ్యామిక మింటనంటిననీలమేఘరేఖ


గీ.

యనఁగ నిజమధ్యమున ధాత్రి దనర మెఱయు
బహులవాతూలజవముహర్ముహురుదగ్ర
లహరికాజాలడోలికావిహరదంబు
నరవితానంబు జలనిధానంబుఁ గనిరి.

88


గీ.

కని దురాలోకశరత భీకరతఁ జూపు, శరధికి మొగంబుగాక దాశరథి శరధి
యట్టిదగుటకు బెట్టిదం భైనకలఁకఁ, గపు లలుకతోడ నుండ నంగదుఁడు పలికె.

89


మ.

తగునా వానరులార మౌనయుతు లై తర్కింప మీ కియ్యెడ
న్సగరు ల్ద్రవ్విన యుప్పుకాలువఁ దరించన్ శక్తి లే కున్నచో
నగసంస్తంభనమౌనిగాతి కటు డాయంగాక యౌర్వాగ్నికిం
దెగనాడ న్వసపోని దుర్యశపుటబ్ధి న్శక్యమా దాఁటఁగన్.

90


జాంబవంతుఁడు హనుమంతుని సముద్రలంఘనమునకుఁ బ్రోత్సహించుట

వ.

అని పలుకునంగదునివలన నంగద లడంగ సుఖిలప్లవంగపుంగవు లభంగురతరంగిణీభుజంగపారీణప్రసంగరీణత మెలంగెడు తెఱంగు లూహించి యంచితనయోపాయవంతుం డగు జూంబవంతుం డుదయగిరిశిఖరజాతచూతనూ

తనఫలవిమోహకౌతూహలగృహీతాభినవమార్తాండమండల ప్రచల్యబాల్యచాపల్యకుపితపురుహూతకరవిధూతభిదురపాత నిహళహనుమదతివిఖ్యాతనామధేయుండును, జరాచరనిరోధబాధాకరసమీరణ ప్రసాదనాయాతజలజాతజాత కరుణాసమాసాదితాసాధారణబహువిధవధానపాయకాయుండును, నఖండజవసమానాయమానపవమానవైనతేయుండును, నగునాంజనేయుం డున్నయెడ కరుగుదెంచి, యతనియతిశయంబు బహుధా నుతించి, వెండియు నావలీముఖశిఖామణుల కిట్లనియె.

91


సీ.

శాఖామృగస్వామిశాసనంబుఁ దరింప గండ మై యుండిన నుండుఁగాక
విగళితారికళంక యగులంక యిచటికి దూరమై తోచినఁ దోఁచుఁగాక
దశకంఠభుజమహాదర్ప మల్పేతరస్థేమ వర్తిలిన వర్తిల్లుఁగాక
యవనిజయునికి మర్త్యామర్త్యగోచరేతరవృత్తిఁ దొరసిన దొరయుఁగాక


గీ.

చింత యేటికి మన కింక నెంతకార్య
మైనఁ బవమానసూనుఁడు పూనుకొన్న
సులభత వహించు నితఁడె కావలయు నన్న
గోష్పదముకంటె మున్నీరు కొంచియంబు.

92


మ.

అని భల్లూకనిలింపనేత పలుక న్హర్షాకులస్వాంతుఁ డై
హనుమంతుండు త్రివిక్రమానుకృతిచే నంగంబు పొంగల బ్లవం
గనికాయంబు చెలంగఁ దుంగలహరీగంభీరవారాశిలం
ఘనజంఘాలజవానుషంగమునకుం గావించె నుత్సాహమున్.

93


క.

తత్తాదృశాసిధారా, కృష్ణారాతిక్షితీశకీర్తిశ్రీరా
జత్తర యహార్యధీరా, చిత్తశయాకార యార్యశేఖరగేయా.

94


చ.

సలలితరత్నకందుకలసత్కుచభారధురీణహూణకుం
తలరమణీసకంకణఝణత్కరణాంచితపాణిపల్లవాం
చలపరిధూయమానసితచామరమారుతలోలమానమం
జులచికురచ్ఛలభ్రమరచుంబితచారుతరాననాంబుజా.

95


క.

సాధూన్నతిగారిగేయ, క్ష్మాధర ప్రాహ్ణాపరాహ్ణమధ్యాహ్నసమా
రాధితరాధారమణ య,సాధారణవారణేంద్రసప్తాంగహరా.

96

ఉత్సాహ.

సింగరిక్షితీంద్రచంద్రసేవ్యమానభవ్యతి
ర్వేంగలావనీకళత్రవిశ్రుతాగ్రసంభవా
రంగనాథపాదపద్మ రాజహంసమానసా
సంగరాంగణప్రచండశౌర్యగాండివాయుధా.

97


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస, వాసిష్ఠవంశకీర్తిప్రతిష్టాసంపాదక, ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకర, జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక, వేంకటాచలపతిప్రణీతంబైన చంపూరామాయణం బనుమహాప్రబంధంబునందు షష్ఠాశ్వాసము.