చంపూరామాయణము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

చంపూరామాయణము

సప్తమాశ్వాసము

సుందరకాండము

క.

శ్రీకర విధ్యండసరో, జాకర వర్ధిష్ణుకీర్తిహంసత్రోటీ
ధీకృత్కాంచనశైల ని, రాకృతరిపుజాల కసవరాజనృపాలా.

1


ఉ.

చారణమార్గసీమను నిశాచరనాయకనీత యైనసీ
తారమణీశిఖామణిని దా వెదక న్మదిఁ గోరి వైరిసం
హారిబలోజ్జ్వలుం డెగసె నారఘునాథునిదూత తుంగశృం
గోరుమహేంద్రసానువుననుండి యఖండఖగేంద్రవేగుఁ డై.

2


హనుమంతుఁడు సముద్రముం దాఁటుట

వ.

అప్పు డప్పుడమితా ల్పనల్పకల్లోలినీవల్లభసముల్లంఘనదృఢతరనిహితహనుమచ్చరణతలపీడనంబు సైరింపంగ నక్షమం బై, నిశ్శేషనిస్సరన్నిర్ఝరౌఘం బగుట నిరంతరనిష్పతద్భాష్పవర్షంబునుంబలె, నితస్తతోవితతజీమూతజాతం బగుటఁ బారిప్లవశిథిలధమ్మిల్లంబునుంబలె, సంత్రాసపుంజితకుంజరయూథం బగుట సంజాతశ్వయథుకంబునుంబలె, సాధ్వసధావమానహరిణగణఖరతరఖురకోటిపాటనోద్ధూతధాతుధూళీపాళీపాటలీతవికటకటకం బగుటఁ బ్రక్షరితశోణితంబునుంబలెఁ, దత్క్షణప్రబుద్ధకంఠీరవకంఠకహకహారాపముఖరితకందరం బగుటఁ గృతాక్రందనంబునుంబలెఁ, బరిసరగహ్వరనిబిడనిస్సరత్సరీసృపం బగుట నిర్గళితాంత్రమూలంబునుంబలెఁ, బ్రస్ఫరితతటోపలపతనదళితకీచకసుషిరసమ్మూర్ఛత్పవనపూరపూరితగగనం బగుటఁ భ్రవర్ధమానోర్ధ్వశ్వాసంబునుంబలె, వాగగోచరం బైనదుర్దశావిశేషంబు నొందె నయ్యెడ.

3


ఉ.

కేసరిసూనువెంబడిని ఖేచరపద్ధతి నుద్గమించి యెం
తే సరయంబుగా జలనిధిం బడి బంతిగ నుచ్ఛిఖంబులై
భాసిలు భూమిజాతములు భావిసలాళినిమిత్తసూత్రవి
న్యాసనిఖాతశంకునివహంబుగతిం గనుపట్టె నంతటన్.

4

ఉ.

శ్రీకరపక్షఘాతరయరేచితవీచివిరోచమానర
త్నాకరకుక్షినుండియు మహాబలనందనవిశ్రమార్థ మై
ప్రాకటతుంగశృంగతలరాజితనిర్జరలోక మైనమై
నాకనగంబు సంభ్రమమునం బొడసూపె మహాద్భుతంబుగన్.

5


క.

తనయాత్రకుఁ బ్రత్యూహము, జనియించె నటంచుఁ దను భుజామధ్యతటం
బునఁ దాఁకి త్రోయు ప్రాభం, జనిఁ జూచి హిరణ్యనాభశైలం బనియెన్.

6


క.

మోదమున వచ్చితిఁ జుమీ, నీదుపథిశ్రాంతి నడఁప నే నిపుడు కృత
జ్ఞోదధిపనుపున నిచ్చట, సాదరముగ విశ్రమించి చనుమా హనుమా.

7


క.

పూని గిరిభేదివలనం, దా ననుఁ గాచె న్భవజ్జనకుఁ డటుగానన్
గాను విపక్షుఁడ నీకిపు, డేనుసపక్షుఁడఁ జుమీ సమీరకుమారా.

8


వ.

ఇవ్విధంబునం బ్రార్థించునవ్వసుంధరాధరంబును సబహుమానంబుగా నాదరించి పవమానతనయుం డరిగె నయ్యవసరంబున.

9


మ.

జలరాశి న్వలమానమూర్తి యగునాశైలాధిరాజాత్మజు
న్వలమానాతిశయప్రమాథికులిశవ్యాపారుఁ డీక్షించి త
ద్బలవన్మారుతసూనుసేవనవిధిప్రాగల్భ్యము న్మెచ్చి యిం
పొలయంగా శతమన్యుఁ డయ్యు గతమన్యుం డయ్యెఁ జిత్రంబుగన్.

10


ఉ.

అంత నిశాచరేశ్వరపురాభిముఖంబుగ నేగు నంజనా
సంతతి సాధుపద్ధతికి సంభరితోద్ధతిరోధహేతు వై
యెంతయు నీల్చె నాగజనయిత్రి వడి స్సురసాఖ్య మున్ను భా
స్వంతునిత్రోవ కడ్డుపడు శైలకులప్రవరంబు చాడ్పునన్.

11


మ.

స్థిరసామర్థ్యమునం దనర్చె సురసాధిక్కారలీలాసమా
దరసాధిష్ఠత మీఱు మారుతిపదద్వంద్వంబు కల్లోలినీ
శ్వరసాంగత్యసమేధమానమయి మస్తం బామరద్వీపినీ
సరసాంభఃకణమాలికాభరణశస్తం బై సమ ద్భాసిలెన్.

12


క.

తనువుం దనూకరించుచు, హనుమంతుఁడు సురసయుదరమందుఁ బ్రవేశం
బొనరించి వెడలి వర్తిలె, దనుజారి త్రివిక్రమావతారముదారిన్.

13


శా.

భూయఃప్రస్తుతనిస్తులాంబరపథాభోగప్రయాణుండు త
చ్ఛాయేశాన్వయుదూత శాతముఖతాజాగ్రన్నఖాగ్రంబులన్

మాయాసింహముకైవడిం గడువడి న్మమ్మారె! చించె న్నిజ
చ్ఛాయాగ్రాహిణి యైనసింహికచకాసన్మూర్తి నత్యుగ్రుఁ డై.

14


హనుమంతుఁడు సీతాన్వేషణమునకై చింతించుట

ఉ.

అంబుజబంధుతేజుఁ డగునాహనుమంతుఁడు వారిరాశిపా
రంబునుఁ జేరి లంబశిఖరంబున నిల్చి యనంతరంబ తీ
వ్రంబుగ లంకయుత్తరపువాకిటనుండియు ఖండితాంతరం
గంబునఁ జింతిలం దొణఁగెఁ గార్యసిసాధయిషాధురీణుఁ డై.

15


సీ.

కడచు నేకరణి శాఖామృగానీకంబు ప్రత్యూహకరము వారాకరంబుఁ
గడచుఁగా కేవీఁక వడిఁ బ్రవేశించు నీరజనీచరాధీశరాజధాని
గావున సర్వధా కడునిరర్థకమనోరథుఁ డౌఁ గదా పంక్తిరథకుమారుఁ
డదికాక యేను మహారౌద్ర మగునీసముద్రమ్ము దాఁటు టమోఘ మయ్యెఁ


గీ.

గటకట యెఱుంగ సకలలోకప్రతీత, సేమమున నున్నదియొ లేదొ భూమిజాత
యని తదన్వేషణార్థమై యాంజనేయుఁ, డరుణకిరణాస్తమయమాత్మ నభిలషించె.

16


క.

శతమఖనిక్షేప మహెూ, ద్ధతధనువునకుం బ్రయోజనావసర ముపా
గత మని పాశికిఁ దెలుపఁగ, ధృతిఁ జనుగతి భానుఁడుం బ్రతీచిం జేరెన్.

17


రాత్రివర్ణనము

సీ.

చరమాచలనితంబసంభవోజ్జ్వలదావపావకోత్కటశిఖాపాటలితమొ
నవిధార్కరశ్మివేష్టనభృతావలతటీసూర్యకాంతప్రభాశోణితంబొ
యాగంతుమిత్రపూజార్ఘ్యార్థవరుణోద్ధృతాంభోధిరత్నకాంత్యరుణితంబొ
ఖనదీరసగ్రహోగ్రత్వరాపరపయోరాశిబాడబహేతిరంజితంబొ


గీ.

యని జనులు డెందముల సందియంబు నొందఁ
గరము రాణించు సాంధ్యరాగంబు వలన
గగనభాగంబు కౌసుంభకంజరాగ
పల్లవజపాభిరూపమై యుల్లసిల్లె.

18


గీ.

క్షీరవారాశికన్యానికేతనములు, ముందుగా నత్తఱిని బీగముద్ర లయ్యె
వికచకుముదాళి మధుకరద్విజకులంబు, నవ్యమకరందభిక్షాటనం బొనర్చె.

19


మ.

నలుదిక్కు ల్ముదమంద వీవఁ దొడఁగె న్సంఫుల్లశేఫాలికా
కలికాకాషకషాయగంధవహము ల్గాఢాంధకారచ్ఛటా

చ్ఛలకాలాగురుధూపధూమసమితిశ్యామీకృతం బయ్యె ను
జ్జ్వలదిక్పాలపురాభిరామసముదంచద్గోపురంబు ల్వెసన్.

20


గీ.

పొడమె విశేషవేదనాపూర్వరంగ, మై కొలంకులఁ జక్రవాకార్తరవము
లలితనక్షత్రమాలికాలంక్రియాభి, శోభితం బయ్యె గగనమత్తేభ మపుడు.

21


క.

సంతమసతమాలద్రుమ, కాంతారకుఠారధార కహ్లారవనీ
కాంతుఁ డుదయాద్రిఁ దోఁచె, న్సంతతశృంగారసారసర్వస్వం బై.

22


క.

ఆజాబిల్లికరంబులు, తేజరిలె న్దివి దమస్తతినిరుద్ధము లై
రాజిలుకొలఁకుల శైవల, రాజితిరోహితబిసాంకురమ్ములు వోలెన్.

23


చ.

అనిలజుఁ డాప్రదోషసమయంబున శాత్రవకీర్తిమండలం
బనువిలసత్తిరస్కరణి యాశుగతి న్సడలించి కన్పడెన్
ఘనసుమనోగణంబునకుఁ గౌతుక మావహిలం బులస్త్యనం
దనకటకప్రవేశనవనాటకపాటవసూత్రధారుఁ డై.

24


సీ.

ఆవేళ లంకాధిదేవత తనతోడ విగ్రహింపఁగ వధూవిగ్రహంబు
ధరియించి పథినిరోధము సేయఁ దద్వినిగ్రహ మొనరించి యుగ్రత వహించు
తనుఁ జూచి వారిజాసనశాసనముఁ దెల్పు తొలువేల్పుపడఁతుకపలుకులకును
డెందంబునందు నానందం బమంద మై నలువొంద నంజనానందనుండు


గీ.

తదనుమతిఁ గాంచి లంకాభిధానరాజ, ధాని వేగఁ బ్రవేశించి ధరణిసుతను
వెదక మది నెంచి యంచితవిభవ మైన, యసురపతిసౌధరాజంబు నధిగమించె.

25


మ.

ఇది రక్షోబలగుప్త లంక యిది లేఖేంద్రారిసౌధాగ్ర మ
ల్లదె యక్షేశ్వరు గెల్చి తెచ్చినవిమానాధ్యక్ష మీక్షింపు మం
చెదురం దెల్పె సమీరనందనున కెంతే చంద్రమోదీపసం
పదభిద్యోతితవిశ్వదిఙ్ముఖత్రియామావేళ తా నయ్యెడన్.

26


ఉ.

వారక రామనేత కిటువంటిసహాయతఁ జేసి కీర్తిఁ గ
న్కూరిమిసూనుచే రవి తగుం గృతకృత్యతఁ గాంచి యౌర యా
దారినిఁ దానుఁ బేరసముఁ దాల్తునటంచుఁ దలంచి లంక నెం
తే రఘునాథుదూతసరణి న్నెల కన్పడె దిండుకైవడిన్.

27


హనుమంతుం డశోకవనముం జొచ్చుట

సీ.

అప్పు డప్పవనజుం డస్వప్నసుందరీసౌందర్యముద్రాతిశాయిమూర్తి
నిద్రాముకుళితాక్షినీరజాతంబును వేశవిలాసినీవృతము నైన

యవరోధకామినీనివహంబు ననవరోధంబుగా నీక్షించి తత్క్షణంబ
వితథమనోరథవృత్తి యై విరచితచింతాసమాకులస్వాంతుఁ డగుచు


గీ.

నంతఁ బ్రాకారలంఘనం బాచరించి, సురుచిరాశోకకాననాంతరమునందు
విశ్వవిఖ్యాతసీతను వెదకఁ దలఁచి, యిష్ట దైవతవందనం బిటు లొనర్చె.

28


శ్లో.

నమో౽స్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమో౽స్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో౽స్తు చంద్రార్కమరుదణేభ్యః

29


వ.

అని యిష్టదేవతానమస్కారంబు సమనస్కారంబుగా నొనర్చి యంత.

30


చ.

ధరణిజ నిందు నందును బదంపడి రోసి వృథార్తి రోసి ధీ
సురుచిరుఁ డైనమారుతి యశోకవనావనిఁ జెందె శాంతిమం
దిరుఁ డగుమౌని తాఁ బరగతి న్భజియించునుపాయ మాత్మయం
దరయుచుఁ గల్మషప్రశమనైకశుభౌషధి యౌ త్రయింబలెన్.

31


వ.

అందు మందేతరపిచుమందమందారకందరాళ నాగపున్నాగతాలహింతాలతమాలకృతమాల సరళవకుళతిలకామలకలికుచకుటజతక్కోలాంకోల లవంగలుంగవికంకతకేతకీ కదంబోదుంబర కపిత్థాశ్వత్థకురవకమరువక మధూకమాకందచందనస్యందన చంపకచాంపేయ పనసవేతసపలాశపాటలప్రియాళుప్రాయానేకానోకహనికాయపరివృతం బైన యావనావనిం బరిభ్రమించుచు, నభ్రంకషవిటపనిబిడితగగనప్రపంచం బగు నొకానొకకాంచనశింశుపాతరువుం గాంచి, యారోహించి తత్పత్రసంఛన్నగాత్రుం డై వటవిటపిదళపుటనిలీనకపటవటునిచందంబు నొంది యంత.

32


ఉ.

మామిడితోఁపునం దనరుమల్లిని భిల్లుఁడు కల్లిఁ జేర్చిన
ట్లామిషబుద్ధి వేఁపి యమరాలయమాల్యముఁ గాడుదార్చిన
ట్లామఘవారి యాత్మపురి కాశ్రమధారణినుండి తెచ్చి దు
ష్కామత నిల్పినట్టి మహికన్యను జూచె నభూషితాకృతిన్.

33


క.

ప్రతిపత్పారైకసము,ద్యతుఁ డగునధ్యేతవిద్యహరువునఁ గార్శ్యా
న్విత యగుతత్సతిఁ గనుఁగొని, జితారి సామీరి యిటులు చింతిలె నాత్మన్.

84


ఉ.

యామినిఁ జంద్రికారహితుఁ డై శశియుండిన నుండు వానర
గ్రామణి చాయఁ బాసి యధికప్రథ నుండిన నుండుఁగాక యీ
తామరసేక్షణామణినిఁ దా నెడబాసి కకుత్స్థవంశ్యసు
త్రాముఁడు మేనఁ బ్రాణములు దాలిచియుంచుట చిత్ర మెన్నఁగన్.

35

వ.

అని యిత్తెఱంగునం జింతాయత్తచిత్తుం డగుమరుత్తనూజుండు నిశీథసమయంబుఁ గడప, నిశీధినీనాథుండును జరమగిరిశిఖరోపకంఠసేవోత్కంఠితుం డగుడు, దశకంఠుండు నిద్రావశేషంబున నతనుశరప్రహారవిశేషంబునం గలుషీకృతాక్షుండును సరసహరిచందనచర్చానుచర్చిక న్జానకీదర్శనేచ్ఛాహలాహలికం బ్రకటీకృతరాగహృదయుండును, బరివర్తితవైకక్ష్యదామంబునం బ్రకటమకుటఘటితరత్నధామంబునం దిరస్కృతనక్షత్రమాలికుండు నై యల్లనల్లన నశోకవనికాప్రవేశంబు గావించిన.

36


ఉ.

ఆసమయంబునం బరీనరాగతవారవిలాసినీకరో
ల్లాసితదీపమార్జనికలం దరళీకృత మై చతుర్దిశా
ధ్యాసితమోవితానము సమస్తము వైళమె చేరెఁ బంక్తికం
ఠాసురసార్వభౌమహృదయం బొకటే శరణంచు నెంతయున్.

37


ఉ.

దానవలోకనాయకుఁ డతండు నితాంతమదాంధుఁ డై కడు
న్మానవకాంత యంచు రఘునాథవధూమణిఁ జేరె నక్కటా!
యానిజమూలపల్లవిత యై తగు సల్లకి యంచు వేగ వై
తానకృశానుకీల సవిధంబును జేరు గజేంద్రముంబలెన్.

38


సీతాదేవి రావణునికి హితము చెప్పుట

సీ.

ఆదశాననుఁ జూచి యాకంపితాంగి యై వైదేహరాజన్యవరునికన్య
పరుషతాసంపత్తిభాజనంబులు విపర్యాసితలోకమర్యాదములును
నాత్మప్రశంసతాప్రాంచన్నృశంసతాపత్రపంబులు నైనపంక్తిముఖుని
సాటోపదుష్ప్రతాపానుపూర్వికల చేత విదార్యమాణచేతస్క యగుచు


గీ.

సంతతాశాంతనుతకీ ర్తిమంతుఁ డైన, కాంతు శౌర్యం బెఱింగినగఱిత గాన
నసురఁదృణముగ నెంచినయదియుఁబోలెఁ, బులు నడుమ నుంచి ధీరతఁ బలికె నిటులు.

39


క.

సకలసదాచారస్థాపకుఁ డగువిధి కులగురుండు పౌలస్త్యుఁడ వీ
వకట పరకాంతఁ గోరెద, వొకయింతయు సిగ్గు లేదా యోహో నీకున్.

40


మ.

విపరీతోక్తులు మాని విన్ దశముఖా విఖ్యాతకూలోపకం
ఠపరిభ్రష్టతరి న్సదాశుగము కుంఠంబై యథాస్థానము
న్నిపుణత్వంబునఁ జేర్చుచందమున నన్నీవుం బ్రతిష్ఠించినం
గృపయు న్మామకజీవితేశ్వరున కెంతే సంధిలు న్నీయెడన్.

41

సీ.

అటులు గాదేని ఖరాసుకదూషణత్రిశిరఃప్రముఖదైత్యదేహరక్త
పటలమేదోమాంసపంకిలముఖము లై మొనయురాఘవశిలీముఖములకును
నైజగాత్రక్షరన్నవశోణితమునఁ బ్రక్షాళనం బెవ్వఁడు సలుపఁగలఁడు
నీవు దక్కఁగను వెండియు నఖండితశాతసౌమిత్రిపటుపత్రిచాతకముల


గీ.

కేఘనుఁ డమర్చు నభినవాసృక్పరంప, రారనవదంబుధోరణి పారణంబు
ననుపమపవిత్రచారిత్రఘనపులస్త్య, కులపయోరాశికాకోల కుటిలశీల.

42


గీ.

పంచబాణవిభిన్నుఁడౌ పంచముఖుని, నిందుముఖి యేకవాణియుఁ బొందదయ్యెఁ
బంచవక్త్రాహిదష్టుఁడౌ పంచజనుని, వినిహతవిషార్తి యౌషధి మనుపఁగలదె.

43


సీ.

ఈ తెఱంగునఁ బల్కు సీతానతోదరి యవధీరణోక్తుల నవధరించి
కినుకచే విముఖుఁడై తనరుపంక్తిముఖుండు తత్కాంత చెంత సంతతమునుండు
కావలిపడతులఁ గనుఁగొని మీరీనృపాంగనఁ జతురుపాయములచేత
వశ్యఁగాఁ జేయుఁ డవశ్యంబు నటుగాని, తఱి వీహతాశ నిత్తలిరుఁబోణిఁ


గీ.

బ్రాతరాశంబునకు వేగఁబాకశాల, గుణుల కొప్పించుఁ డనుచు దుర్గుణగరిష్ట
తానిధానంబు కుమతియై యానతిచ్చి, యంతట నిశాంత మగుడు నిశాంత మొందె.

44


సీ.

తదనంతర ముదారదారుణవీక్షణక్షణదాచరాంగనాజనకఠోర
వచనదోషోన్మేషవశముకుళీకృతహృత్పుండరీక యై యినకులాధి
నాథునికూరిమినారీశిరోమణి యాభీలపుండరీకావృత యగు
రమణీయసారంగరమణిచందమునఁ దాపసదత్తఘోరశాపంబువలన


గీ.

వసుమతీభాగమందు గీర్వాణతరుణి, కరణి నత్యంతదీనతాకలిత యగుచు
బంధుజనహైన్యపరితాపభరముచేత, నెంతయును జింతిలఁదొడంగె నివ్విధమున.

45


క.

నావృత్తాంత మెఱింగిన, యావిహగాగ్రణి జటాయు వటవి నిలిగెనే
మో విన్నవాఁడు కాఁ డటు, గావున నాయునికి నిచటఁ గాకుత్స్థుండున్.

46


క.

రక్కసుల పెక్కుమాయల, జిక్కువడినయార్యపుత్త్రు చేతోభువియం
దక్కట యాస్థ గణింపఁగ, నొక్కింతయుఁ బొడమదయ్యెనో నెయ్యమునన్.

47


క.

న న్నపహరించి తెచ్చిన, యన్నీచాత్మకుఁడు సహజ మగు రాముకృపా
భ్యున్నతి హరించెనో కా,కున్నఁ బ్రపన్నావవనుఁ డతఁ డూరక యున్నే.

48


వ.

ఇవ్విధంబున నవ్వధూలలామ బహువిధంబులుగఁ బరిదేవనం బొనర్చి యంతరంగంబున రఘుపుంగవుం గని సంతతంబునుం జాతించుచు మూర్ఛాక్రాంత యై యున్న సమయంబున.

49

మ.

తగువిఖ్యాతచరిత్ర రామరమణిం దర్శించుదుర్జాతభా
వగరిష్ఠక్షణదాచరప్రమదల న్వారించి తెల్పె న్మనో
జ్ఞగుణశ్రీనిధి యైనయాత్రిజట యస్వప్నాంతరంగోత్సవం
బగుసుస్వప్నము సాధుసీధుమధురవ్యాహారధౌరంధరిన్.

50


క.

భూమిజ ముపఘ్న మొక్కటి, లేమి నిలం బొరలుచు నవలిప్తాసురకాం
తాముఖదర్శిత యగుసీ, తామహిలాలతకుఁ ద్రిజట తా జట యయ్యెన్.

51


హనుమంతుఁడు సీతాదేవితో సంభాషించుట

గీ.

అపు డసుత్యాగ మొనరింప నభిముఖియగు, సీత ననుపేక్షణీయఁగాఁ జిత్తమునను, దెలిసి నీతి విచారించి ధృతి వహించి, యంతికముఁ జేరె నలభవిష్యద్విరించి.

52


మ.

ధరణీభృద్రిపువైరి నిష్ఠురవచోదంభోళిదీర్ణావనీ
వరకన్యాశ్రవణాంతరవ్రణశమవ్యాపారభైషజ్యము
న్నిరవద్యాన్వయసంగతిప్రథితము న్విస్రంభణార్థంబు దా
శరథిస్వామిగుణానుకీర్తనసుధాసారంబుఁ జిల్కె న్రహిన్.

53


సీ.

తదనంతరము సమంతాత్ప్రసారితదృష్టి యై శాఖిశాఖాగ్ర మధివసించు
శాఖామృగంబును సత్వరంబుగఁ జూచి చకితాంతరంగ యై సానుజుఁ డగు
రామభద్రునకు భద్రంబు గావుత మని వచియించి యపుడు దుస్స్వప్నబుద్ధి
నడలుచు నిర్నిద్రమగు నిజ్జనమునకుఁ గలవచ్చుటకు నేమి కారణం బ


గీ.

టంచు నూహించి జనకకన్యాలలామ, ప్రబలమాయాసమాయాతపంక్తికంఠ
యామినీచరవల్లభుఁ డనుచు నల్ల, గంధవాహాత్మజునివల్లఁ గరము తలఁకె.

54


క.

ఆసమయంబున డిగి వి,శ్వాసనిదానంబు లైనవచనములఁ గృతో
ల్లాసుఁడు ప్రాంజలి యగుచు మహీసుత నీక్షించి హనుమ యి ట్లని పలికెన్.

55


క.

వేగమున నెసఁగు నీదువి,యోగమున నితాంతశాంతి నొందించిననా
భాగాన్వయపతిదూతను, గా గరిమ నెఱుంగు నన్నుఁ గల్యాణి మదిన్.

56


ఉ.

నీకును దోడుగాఁ దనదు నెమ్మనముం గడువేగ నంచి యం
గీకృతజాగరాగరిమభేదవిశేషమున న్విభావరీ
కోకసమానధర్ముఁ డగుకోసలరాజతనూజుఁ డిమ్మెయి
న్నీకుశలంబు దా నడిగె నీరజలోచన మన్ముఖంబునన్.

57


క.

ఔదలను వంచి మీ కభి, వాదన మొనరించి భక్తివైభవ మెసఁగ
న్వైదేహి లక్ష్మణుఁడు మఱి, యాదిత్యసుతుండు సేమ మడిగె న్మిమ్మున్.

58

గీ.

అని మఱియు జాతవిశ్వాస యైనసీత, కనిలజుఁడు వాలివధము సూర్యజునిచెలిమి
నొడివి వాల్మీకిమనసుకైవడిని గలిత, రామనామాంక మగునుంగరం బొసంగె.

59


క.

మరుదాత్మజనీతశ్రీ, కరరఘురామాంగుళీయకలితోత్సవవా
సరశతతమాంశమునకు, న్సరియే సీతావివాహసంభ్రమదినముల్.

60


క.

క్షిత్యాత్మజాత యంతట, నత్యంతప్రమద యగుచు నసురేంద్రునకుం
బ్రత్యాసన్నం బయ్యెను, మృత్యువు హనుమంత! యని మఱియు ని ట్లనియెన్.

61


చ.

అనల యనంగఁ బేరు గనినట్టి విభీషణుపుత్రి తల్లిపం
పునఁ జనుదెంచి రావణుఁడు పో రొనరించియ కాని యూరకే
యినకులసార్వభౌమునకు నీయఁడు ని న్నని పల్కే నేనునుం
దనువును మాసమాత్రమును దాల్చెదఁ బ్రాణముల న్యరాకినై.

62


క.

నావుడు మారుతి యిట్లను, దేవీ! వెఱవకుము నిన్ను ధృతిఁ దోడ్కొని నే
నీ వారిఁ గడచి దక్షతఁ, బోవుదు రఘుపతిసమీపమునకు న్వేగన్.

63


గీ.

అని మహామేదినీధరంబునకు సాటి, యైన దేహాభివృద్ధిచే నతిశయిల్లు
నపుడు గాంభీర్యవిస్తారహారి యైన, జలధి యెలదోఁటకాలువచంద మొందె.

84


ఉ.

అంతట సంతసం బొదవ నాహనుమంతునిఁ జూచి రామసీ
మంతిని పల్కె లంఘితమహాంబుధి యై తగునీకు దుష్కరం
బింతయు లేదు పెంపున వహించి ననుం జనువేళ నంబర
ప్రాంతరయానలీల ననపాయిని నీకు నుపాయపారగా.

65


వ.

మఱియును.

66


శా.

పాతివ్రత్యమువాసిచే దశముఖున్ భస్మంబు గావించినన్
ఖ్యాతైక్ష్వాకుశరాళికి న్సముచితగ్రాసంబు సంధిల్లఁబో
దే తత్కీర్తి నిశాకరుండును విభాహీనుం డగుం గావునన్
దైతేయు న్రఘునేత గూల్చినతఱి న్నారాక యుక్తం బగున్.

67


వ.

అని సమాఖ్యాతవినయవచనజాత యగుసీతం గనుంగొని శ్రీరామదూత యిట్లనియె.

68


ఉ.

ఓమిథిలాపురాధిపకులోదధిచంద్రకళా! వనోర్వి మా
యామృగవంచితాత్మకత నాశరగేహమునంది నీవు శా
ఖామృగనీత వై యిపుడు కన్పడిన న్దివసేశ్వరాన్వయ
గ్రామణి కార్ముకంబులకుఁ గల్గునె కీర్తి యొకింతయు న్భువిన్.

69

సీ.

అది యటులుండని మ్మవనికన్యామణి రఘువీరగృహిణి కర్హంబు లీదృ
శాచారమునకును సదృశంబు పంక్తిముఖాపరాధతక్రియ కనుగుణంబు
కులకాంతయీలువుకును ననుకూలంబు క్షత్రియాణ్యుక్తికి సముచితంబు
నగు నట్లు పలికితి వనుచుఁ బ్రశంసించి యంజనానందనుం డనియె మఱియు


గీ.

రామలక్మణు లీదైత్యరాజధానిఁ, జేరినా రని యెంచుమీ చిత్తమునను
రాఘవజ్ఞాతపూర్వకశ్లాఘనీయ, మగు నభిజ్ఞాన మిచ్చి న న్ననుపు మిపుడు.

70


హనుమంతునితో సీత ప్రత్యభిజ్ఞానంబు దెల్పుట

వ.

అనుటయు నజ్జనకరాజనందన నిట్టూర్పు నిగిడించి యి ట్లనియె నోయసాధారణమేధానిధానా! సావధానంబుగా నాకర్ణింపుము. మున్ను సమున్నతానేకమాణిక్యచాకచక్యప్రకటతటనిరాఘాటం బగుచిత్రకూటనికటంబున సముల్లసత్పల్లవాంతరసంఫుల్లకుసుమసందోహస్యందమాన మకరందధారాస్వాదనిర్భరానందతుందిలమిలిందబృంద ఝంకారహుంకారితసంక్రందనోద్యానవైభవం బగువనంబున, రఘునందనోపధానీకృతోత్సంగ యగు నాసముత్తుంగపయోధరపరిసరంబు ప్రఖరనఖరముఖవిదారితం బొనరించిన ధారాధరనామకాకంబు నైక్ష్వకుం డాలోకించి.

71


చ.

సమధికరోషయుక్తవిలసత్కుశరూపకుశేశయాసనా
స్త్రము వడి నేసె దుర్మదపురందరనందనవాయసంబు పై
దమితమదంబు నై యదియుఁ దత్కృపచేత హృతాక్షిమాత్ర మై
క్షమఁ జిరజీవి నాఁదనరుసంజ్ఞ వహించె యథార్థ మై తగన్.

72


క.

అని పూర్వకథాస్మరణం, బున ద్విగుణితదుర్ధశాసమున్నతి యై యి
త్తు నభిజ్ఞానాంతర మను, చును హనుమంతున కొసంగెఁ జూడామణియున్.

73


మ.

మతి నెంతేఁ బ్రమదంబు సంధిల మణిం బౌలస్త్యసంత్రాసపుం
జితయాగాగ్నిదశం గృశాంగి యగురాజీవాక్షి యీయం బ్రణ
మ్రతచేఁ గైకొని యంజనాతనయుఁడు న్మాణిక్యగర్భాసనాం
చితభోగిప్రతిమానబాహుఁ డగుచుం జెందెం బ్రయాణత్వరన్.

74


క.

కృతకృత్యుం డయ్యె విని, ర్గతుఁ డై తనరాక దశముఖజ్ఞాతము గా
మతిఁ దలఁచి పావని గుణా, ద్భుతుం డశోకవనభంగముం గావించెన్.

75


సీ.

తనదుకృత్యములచేఁదగు భూరిశాఖల కవనతిసంధాత యగుటవలన
మఱి సుమనఃకదంబకముల కెల్లను ముఖభంగ మొనరించి పొలుచువలన

శ్రుతిమధురో క్తిసంగత నద్ద్విజాలికి నతిభీతినిర్మాత యగుటకతన
చారణమార్గనంచారక్రియాధురంధరత నుద్దాముఁ డై తగుటవలన


గీ.

నముచిదానవరిపుదూతనందనుం డు, దారలంకాపురాంతరోద్యానమునను
బూని వస్వౌకసారాధిపానుజన్ము, పటుతరాటోపలీలను బరిభవించె.

76


హనుమంతుఁ డశోకవనభంగ మొనర్చుట

సీ.

అంత సత్వరముగా నారక్షకమహూగ్రరక్షోనివేదితప్రమదవనవి
భంజనజాతకోపవశారుణాలోకభీకరదశముఖప్రేషితులును
గాలకింకరభయంకరులు ప్రహస్తకుమారవిశ్రుతజంబుమాలిసహితు
లై యరుదెంచిన యాతుధానులఁ ద్రుంచి చైత్యతోరణసదేశంబు నొందె


గీ.

మారుతాత్మజుఁ డామాట మఱియు విని ని, శాచరానీకమారణశ్రవణకుపిత
పంక్తిముఖుఁ డావలీముఖుఁ బట్టి తెండ, టంచు వడిఁబంచెఁ బంచసేనాగ్రగులను.

77


క.

వీరులను సప్తమంత్రికు,మారులనుం బనుప సమరమత్తాశయుఁ డై
తోరణపరిఘముచేత స, మీరణనందనుఁడు వారి నెల్లం గెడపెన్.

78


క.

వెండియుఁ బవసతనూజుఁ డ, తం డురువడి కోసలేంద్రదాసుఁడ ననుచుం.
జండత నని ఘోషింపఁగ, భండనమున కక్షుఁ బనిచెఁ బౌలస్త్యుండున్.

79


శా.

వక్షశ్చూర్ణితహేమభిత్తి భృశదీవ్యచ్చైత్రధూళిం బగ
ల్నక్షత్రాధ్వము నెఱ్ఱసేయుచు సఖేలద్వీరలక్ష్మీకుఁ డై
రక్షశ్శారములన్ క్షమాఫలకనిర్వర్ణంబులం జల్పఁగా
నక్షక్రీడ యొనర్చె వాయుజుఁడు లంకాళిందభాగంబునన్.

80


చ.

అమరవిరోధియోధుల మహాకుపితాత్మకుల న్నిమేషమా
త్రమున వధించి పంక్తిరథరాజతనూజునిదూత గీతవి
క్రముఁ డలచైత్యసౌధమున కంబముఁ జేకొని తద్భవాగ్ని హ
ర్మ్యమును దహించి తోరణసమాశ్రయుఁ డయ్యె యథాపురోద్ధతిన్.

81


క.

ఏవంవిధవృత్తాంతము, దా విని కుపితాత్ముఁ డైనదశకంధరుఁ డెం
తే వింశతివీక్షణముల, దేవాధిపజేతఁ జూచి ధీరతఁ బలికెన్.

82


క.

భువినిం దివినిఁ బురంగర, భవనంబున నైన సమరపరు నిను వీక్షిం
ప వలంతి యెవ్వఁ డిచటికిఁ, బ్లవగంబును దెమ్మటంచుఁ బనిచె న్సుతునిన్.

83


ఉ.

సౌరవిరోధిసేనకును సంహృతి, బెట్టగురోదనంబు ర
క్షోరమణీగణంబునకు, శోకము రాక్షసనేత, కర్కక

హ్లారసఖానవాప్య యగులంకకు నగ్నివిశుద్ధి, సేయఁగాఁ
దోరణమందు వాయుజునితో రణ మయ్యె సురేంద్రజేతకున్.

84


శా.

ధారాపాతశరాభిఘాతనిరవద్యస్ఫూర్తికం బౌమహో
దారాస్కందనదుర్దినాంతరమున న్హర్షించెఁ దన్మేఘనా
దారంభంబున గంధవాహతనయుం డత్యంతము న్మేఘనా
దారంభంబున నుల్లసిల్లెడు భుజంగాహారిచందంబునన్.

85


శా.

హంకారోద్గతుఁ డై నిజాస్త్రచయవైయర్థ్యంబు సంధించు ని
శ్శంకాతంకజయేందిరాసఖుని రక్షశ్శిక్షకు న్మారుతిన్
లంకాధీశ్వరనందనుండు విజయాలంకారధౌరేయుఁ డై
పంకేజోద్భవసాయకోత్తమమునన్ బంధించె నాలంబునన్.

86


గీ.

అమ్మహూగ్రచతుర్వదనాస్త్రమునను, బరవశశరీరుఁ డై యున్నప్లవగవరుని
గట్టిశణవల్కలంబులఁ గట్టివైచి, రేచి యామవతీచరనీచు లకట.

87


ఉ.

ఆసమయంబున న్సమదయామవతీచరపాశకౢప్త మౌ
వాసవదూతసూనుదృఢబంధము బంధవిమోక్షహేతు వై
భాసిలె ము న్బులస్త్యకులపాంసనుఁ డుద్ధతచిత్తవృతిఁ గా
రాసదనంబుఁ దార్చిన సురప్రమదాజనకోటి కెంతయున్.

88


క.

చతురాననాస్త్రబంధ, చ్యుతుఁ డయ్యును నితరబంధయుతుఁ డగు నమ్మా
రుతిమహిమఁ దెలిసి రావణి, ద్రుతముగ నిజజనకుసభకుఁ దోడ్కొనిపోయెన్.

89


వ.

అయ్యెడ.

90


మ.

కనియె న్మారుతసూతి పంక్తిముఖునిం గాలారిలీలాద్రితో
లనఖేాపటుతాపరీక్షి తబలాలంకారబాహుం దపో
ఘను బందీకృతనిర్జరేంద్రనగరీగాణిక్యహస్తావిం
దనటచ్చామరమారుతాంకురచలన్మంజూత్తరీయాంశుకున్.

91


మ.

పురుహూతాదిభయంకరాజికలనప్రోత్సాహనిర్భగ్నస
త్వరమగ్నామరదంతిదంతకృతముద్రాడంబరక్రోడభీ
కరు ఛాయాత్మకవిభ్రమప్రతితరంగభ్రాజమానక్షపా
కరబింబౌఘసనాథశైవలినికాకాంతోపమానాకృతిన్.

92


మ.

ఘననిశ్శ్రేయసమార్గరోధన మొగం గావింప మూర్తీభవిం
చినలోకత్రయపాపరాశికరణం జె న్నొందుగర్వాంధునిన్

దిననాథేందుకృశానుతేజములను న్నిర్జించి యంచత్తపం
బున సాక్షాదభిషిక్త మైనతిమిరంబుం బోలు దుశ్శీలునిన్.

93


మ.

తరుణాపాటలపల్లవాధరపుటాంతస్ఫారదంష్ట్రామహో
గరిమవ్యాపనశాతఘోరతరజాగ్రద్విగ్రహాభు న్మనో
హరసంధ్యాసమయాంబుదాంతరితమధ్యాబ్జాతరేఖాధురం
ధరసంక్రందననీలశైలముగతిన్ రాజిల్లులంకేశ్వరున్.

94


ఉ.

అంత దశాననుండును మహాబలనందనుఁ జూచి విస్మయా
క్రాంతహృదంతరుం డగుచు రాజతభూమిధరప్రకంపనా
సంతతమంతువేగమున శాప మొసంగినయట్టినంది ని
శ్చింతత నిట్టిరూపమునఁ జెంతకు వచ్చె నటంచు నెంచుచున్.

95


క.

తనసమ్ముఖమున నిలిచిన, యనుయోగవిధిప్రశస్తుఁ డైనప్రహస్తుం
గనుఁగొని యిట్లనియె ఘనా, ఘనరసితవిజృంభమాణగంభీరోక్తిన్.

96


ఉ.

ఎక్కడనుండి వచ్చె నిపు డిక్కపి యెవ్వఁడు పంచినాఁడు తా
నిక్కడ కేగుదెంచుటకు నెయ్యది కార్య మభిఖ్య యెద్ది యో
నిక్కముగాగఁ దెల్పు మని నీ వనుయోగ మొనర్సు మన్న నా
రక్కసిఁ జూచి యిట్లనియె రాఘవదూత యభీతచిత్తుఁ డై.

97


హనుమంతుఁడు రావణునితోఁ బ్రసంగించుట

వ.

లంకాపురాధిపా! యనహంకారుఁడ వై మదాగమనకారణం బాకర్ణింపుము, త్రిలోకదీపకుం డగుకోకబాంధవునియన్వయం బనుమహెూదన్వంతంబునకుఁ బార్వికశర్వరీకరుండును సాతత్యసత్యసంధానుబంధబంధురుండును, బితృనియోగసముపనతవనవాసలీలానిరతశీలుండును, బ్రచండశూర్పకారాతిబాధితశూర్పణఖాప్రాప్తవైరూప్యకువ్య త్ఖరప్రముఖనిశిచరబలపలాలజాలకల్పాంతనలకల్పశిలీముఖుండును, గపటహరిణహననసమయపరిముషితదారాన్వేషణసంజాతసమగ్రసుగ్రీవసఖ్యుండును సముత్ఖాతవాలికంటకుండును దుర్వృత్తశత్రువంశవనపవనసారథియు నగుదాశరథిదూతను, సీతాన్వేషణంబునకుం బ్రతిదిశంబును దపసతనయప్రేషితు లగువానరులయం దేనొకండ, గంభీరలవణాంభోరాశిలంఘనజంఘాలుండ నై భవదీయనగరప్రమదవనసీమంబున రామస్వామిధర్మదారావలోకనంబుఁ గావించి నమస్కరించి కృతకృత్యుండ నై పునఃప్రయాణావసరంబున భవద్దర్శనకుతూహలి నై నారాక నీకుఁ దెల్పుటకుఁ బ్రమ

థితాశోకవనికానోకహనివహుండను, సమనుభూతనైరృతలూతాతంతుసహనుండను నై దురాపం బగునీసమీపంబునకు వచ్చితి నని మఱియును.

98


చ.

ఒఱపగులోకవంద్యగుణయూథము రామనృపావరోధముం
జిర మిచట న్నిరోధమును జేసి విరోధము గొంటి వోరి చే
టెఱుఁగనికూన! నీతిగుణహీన! వితానవితర్దిజాత మౌ
కరువలినెచ్చెలిం బటినిఁ గట్టఁగ యత్నముచేసి తక్కటా.

99


చ.

అనిమొన లక్ష్మణాస్త్రహత మై పడు నీమెయిపైఁ బలాశ డా
సినఖగమండలిన్ గొడుగు సేయకు మింక భవన్నిమిత్త మై
యనఘపులస్త్యవంశలయ మయ్యెడునప్పుడు త్వత్పురంధ్రిదృ
గ్వనజగళన్నవాపము నివాపజలం బొనరింపఁబోకుమీ.

100


మ.

పరదారైకపరిగ్రహాదరమతిం బాటించు నీ వావిభా
కరవంశోత్తముభార్యఁ దెచ్చుటయె దుష్కార్యం బనార్యాశయా!
మరుదాహారి నటంచుఁ గుండలి గరుత్మత్తుండనిశ్వాసని
ర్భరవాయుస్పృహయాలుతాలుయుగధుర్యం బైనచందంబునన్.

101


క.

వైళమ భుజచందనధా, రాళేషుధికోటరాంతరచ్యుతరామా
భీలాశుగజిహ్మగ మిఁక, వాలాయము నీదుప్రాణవాయువుఁ గ్రోలున్.

102


చ.

సరభసశాంబరీమృగము సంగరనాటకసూత్రధారత
న్నెరపఁగ శాఖికామృగము నీ కరయం బ్రతికూలవాత మై
పరఁగఁగ వీక్షితోద్యమత భాసిలురాముజగాలకోరికిన్
సరయగతిప్రణామకవచంబు వినా కవచంబు గల్గునే.

103


చ.

అని తను జీరికింగొనక యాడినవాయుజుఁ జంపుఁ డంచుఁ గో
పనుఁ డయి యానతిచ్చె భటపంక్తికిఁ బంక్తిముఖుండు నప్పు డా
జననవిశుద్ధుఁ డైనమతిశాలి విభీషణుఁ డగ్రజన్మునిం
గనుఁగొని దూతమారణ మకార్య మటంచును మాన్చె నంతటన్.

104


సీ.

శర్వరీచరలోకసార్వభౌముఁడు దురూహ మొనర్చి కపిసమూహమున కెల్ల
నంగరంబులయందు లాంగూల మెంతయు ముఖ్యంబు గావున మున్ను దానిఁ
గార్పాసవాసోనికాయవేష్టితముఁ గావించి పావకశిఖాసంచయప్ర
దీపితం బొనరించి యీపురంబున వీథివీథులందును దోషవితతి నుగ్గ

గీ.

డింపుచును సంప్రహారపారంపరీక, ముగను ద్రిప్పుడు మీరని మూర్ఖయాతు
ధానులకు సెల విచ్చిన నానృశంస, చరితులును నట్ల చేసిరి సరభసముగ.

105


గీ.

నిర్ణయాగోచరంబును గర్ణికార, వర్ణరుచిరంబు నైనతద్వాలకీలి
నిర్ణిమేషులభాగ్య మున్మేషశాలి, యగుటఁ బూర్ణశిఖోదీర్ణ మయ్యె నపుడు.

106


లంకాపురదహనము

క.

అగచరుదుర్దశ కావలి, మగువలు వినిపింప దూయమానాత్మిక యై
జగతీసుత ప్రార్థించెం, దగ “శీతోభవ హనూమత” యటంచు శిఖిన్.

107


శా.

వాలిప్రాణహరప్రియాఘనతపోవహ్నింధనత్వంబు నే
వాలాయంబుగఁ బొందఁజాల ననుచున్ వైశ్వానరుం డత్తఱిన్
వేలాతీతసుజాతశీతలగుణావిర్భూతి వాతాత్మభూ
వాలాగ్రంబున రత్నదీపముగతిన్ వర్తిల్లెఁ జిత్రంబుగన్.

108


ఉ.

రాతిరి యీదశాస్యునగరంబు ప్రకాశము గాఁగఁ జూడలే
దీతఱి నగ్నిసాక్షిగ రహిం గనుఁగొందు నటంచు దైత్యసం
ఘాతము లెల్లఁ దోరణలగత్పరిఘంబున సంహరించి సీ
తాతరుణీమనోహరునిదానుఁడు దుస్సహదోర్విలాసుఁ డై.

109


ఉ.

భూవనితాసుతేందిరను బూషకులేంద్రున కీఁదలంచి లం
కావనధిం బరిక్షుభితగాఢబలోర్మి భయంకరంబు నెం
తే వనజోద్భవుండు మథియించెను రజ్జుభుజంగరాజభో
గావృతగంధవాహతనయాహ్వయమందరభూధరంబుచేన్.

110


మ.

దనుజస్త్రైణముఖారవిందరజనిన్ ధాత్రీమయూరీఘనా
ఘనవేలాసదృశి న్దశాననయశఃకాదంబకాదంబినిన్
ఘనవైధవ్యదశార్హవేషవిధి లంకాస్త్రీజట న్రామమో
హనకుం దత్త్రిజటాసమం బఱపె ధూమ్యం గీశుఁ డౌరా దివిన్.

111


ఉ.

ఇట్టులు పావమాని మెఱయించినశౌర్యముఁ జూచి కన్నులం
దొట్టడుహర్షబాష్పములతోన బుధుల్ దనుజేంద్రభీతి ను
ద్ఘట్టితులౌట మాటుకొన దానినెపంబయి పర్వె ధూమ్య యి
ప్పట్టున హా దివంబునకు భానుజ జాల్కొనె నంచు నెంచఁగన్.

112


చ.

గురుజఘనంబునం దసితకోమలశాటి కటీతటంబున
న్మరకతబద్ధనీవి కుచమండలి గస్తురి గ్రీవ నుత్పలో

త్కరసరము న్గనుంగవను గాటుక యయ్యె దిశాంగనాళికిన్
ధరణీధరారివైరిపురదాహసముద్వహధూమ్య యత్తఱిన్.

113


మ.

అతివేగంబున లంక కాలెడునెడన్ హాతాత హామాత హా
సుత హాబాంధవ హామనోదయిత హాసుస్నిగ్ధ మీ రెందుఁ బో
యితిరో నేను హతుండనైతి నని భూయిష్టంబుగాఁ బౌరసం
తతినా నాపరిదేవనోక్తులఁ బరీతం బయ్యె నల్దిక్కులున్.

114


చ.

వఱలు సురీముఖాళికి నివాళి యనీరద మైననింగికిన్
మెఱుపులభంగి యంబుధికి మిక్కిలి బాడబ మయ్యె నెద్ది యా
గురుతరవాలకీలి మిణుఁగుర్లు గనుంగొన నద్భుతంబు లై
హరహర వర్తిలె న్ద్రిచతురాహము లాఱక ఘోరకాంతులన్.

115


ఉ.

ఆరయ దీప్యమానపవనాత్మజువాలముసంగతి న్మహాం
గారసమూహశేష మగుకర్బురరాజుపురంబుఁ జూచి బృం
దారకవైరు లంబరపథంబుననుండి సృజించి రశ్రువుల్
జోరన నాత్మగేహములఁ జొప్పడ నార్చుతెఱంగు దోఁపఁగన్.

116


చ.

శతమఖవైరియాజ్ఞ నని సల్పినకృత్యము దైత్యరాణ్ణియో
జితులయి యుండియుం గడఁగి చేయ నిశాటు లశక్తు లైరి య
ద్భుత మిది మారుతిప్రథితభూరికృశానుఁడు లంకఁ గాల్చె నే
గతి మఱి యిట్లు తత్పితృసఖత్వము నొందియుఁ గాల్పలేఁడుగా.

117


శా.

ఆహనుమన్మహారణిభవానలునందుఁ బ్రణీతశుద్ధి యై
యాహవరంగవిక్రమవిహారకుతూహలిదైత్యుఁ డుల్లస
ద్భాహుబలంబునం దొడరి పట్టిన నిర్జరరాజలక్ష్మి స
స్నేహతచే నిజాధిపునిఁ జేరుటకుం దగ నిచ్ఛయింపఁగన్.

118


క.

ఏల యిఁక వేయుమాట, ల్పౌలస్త్యభుజాగ్రగుప్త లంకాపురము
న్వాలిరిపుదూత చేరెను, గాలునిదూతయు సుఖంబుగాఁ జేరుటకున్.

119


చ.

మలినదశాస్యపాతకిసమాగమసంభ్రమజాయమాన మౌ
కలుషము నెల్ల శోధితము గా నొనరింపఁ దలంచీ యామహా
బలసుతయజ్వ యక్షజయపండితుఁ డై నిజవాలవహ్నిలో
నలఘుగతిం బలాశసమిదావళి హోమము సేసి భాసిలెన్.

120

సీ.

లలితనిరాతంకలంకాపురీమహాదాహక్రియాసముత్సాహసమయ
మందును లవలేశ మైన నార్తి నెఱుంగ కిరవొందు భానువంశ్యేంద్రురాణి
సుస్థితి రాణించుశుభచారణోక్తిచేఁ దెలిసి హర్షమునఁ దద్దేవి కెరఁగి
ప్రతియానవిధికిఁ దత్సతినియోగముఁ గాంచి శీఘ్రంబె యారిష్టశిఖరి నెక్కి


గీ.

భూరిగంభీరభీకరాంబునిధి దాఁటి, మఱి మహేంద్రధరాధర మధివసించు
కపికులాధీశ్వరులఁ బూర్ణకాములుగను, బళిరె యొనరించె ధృతిఁ బూని పావమాని.

121


మధువనభంగము

క.

వెండియుఁ దనవృత్తాంతము, చండాంశుకులేంద్రుదూత సైన్యేశులకున్
నిండుమనంబునఁ దెలిపె న, ఖండితబహుమానపూర్వకంబుగ నంతన్.

122


క.

ఆనిలివాక్ప్రముదితకపి, సేన యహంపూర్వికఁ జని (జితశేఖరుమా
ర్గాన) న్దధిముఖకృత మవ, మానము నిరసించి చలిపె మధుపానంబున్.

123


గీ.

అపుడు మధువనభంగదృష్ట్యరుణముఖుఁడు
దధిముఖుఁడు వల్కె వాలినందనునిఁ జూచి
మొనసి మధుపానవిధిశిలీముఖము లైన
యీవలీముఖులను మాన్పు మీవె యనుచు.

124


వ.

అంత గిరిశృంగతుంగనిజాంగుం డైన యంగదుండును దధిముఖుం గనుంగొని యిట్లనియె.

125


మ.

కనుఁగొంటి న్రఘునాథవల్లభను లంకారాజధానీవనాం
గనమధ్యంబున నంచు నేఘనుఁడు మత్కర్ణామృతాభాషణం
బును జిల్కె న్మఱి వానిమాటకును దప్పుం గల్గునే కీశవా
హిని తాఁగ్రోలు యథేచ్ఛగా మధువు నెంతే యీవనాంతంబునన్.

126


గీ.

అనినయంగదోక్తి నాలించి భీతుఁ డై , దధిముఖుండు వోయి తపనసుతుని
తోడ విన్నవించె దుర్వారవనభంగ, మతఁడు రాముకెలన హర్ష మొందె.

127


ఉ.

సానుమదగ్ర మెక్కి వరుసన్ డిగి మ్రాకులఁ గౌఁగిలించుచుం
గానలఁ బండ్లు మెక్కి మఱి గంతులువైచుచుఁ గూయుచు న్మదా
నూనతఁ దోఁక పట్టుకొని యొండొరుల న్వడిదాఁటి పాటవా
[1]పీనకపీశసేన గనిపించె నదూరత నద్భుతంబుగన్.

128


ఉ.

నిద్దురలేమి శోణతరనిర్భరమై తగుకన్నుదోయిచే
నొద్దన యుండి యూర్మిప్రియుండు గనుంగొన నాంజనేయుఁడుం

దద్దయు భక్తిఁ జూడమణి దాను గరంబునఁ దాల్చి మ్రొక్కె శ
శ్వద్దయమానుఁ డైనరఘువర్యునియంఘ్రులకు న్ముదంబునన్.

129


మ.

నిరవద్యప్రభవద్గతాగతముల న్నిస్తీర్ణవిస్తీర్ణదు
స్తరఘోరార్ణవుఁ డయ్యు నభ్రమణివంశ్యగ్రామణీదూత వా
నరసేనాసవిధంబునందుఁ బరమానందాపదేశాపగా
పరిణీమధ్యమున న్మునింగె జనదృక్పాళి విచిత్రంబుగన్.

130


క.

హనుమంతుఁడు కలితమహా, ధనచూడారత్నసన్నిధానముదిత రా
మనృపాయుక్తుం డై చ, య్యనఁ దెలిపెను సతియుదంత మాద్యంతంబున్.

131


ఉ.

నైకనిశాచరీసముదయాన్వహబాధితయై ద్విషత్పురా
శోకవని న్వసించు పరిశుద్ధచరిత్రను సీతఁ జూచితిం
బ్రాకటపూర్వపాతవిపాకముచోత సుపర్ణలోకబం
దీకృతయైన నాగతరుణీమణిఁ బోలినదీనమానసన్.

132


చ.

అసదృశచిత్రకూటవిపినాంతరసీమ నుదీతమైన త్వ
ద్బిసరుహసంభవాశుగవిభీతజయంతదురంతకౢప్తసా
హసమును దెల్చి యెంతయు నుదశ్రుముఖాంబుజ యైనసీత యిం
పెసఁగ నొసంగె మౌళిమణి నిత్తఱి నీ కిది యానవాలుగాన్.

133


గీ.

పోవ నుద్యోగ మొనరించి దేవ యిప్పు, డతులితాశావిశేషపాలితము లైన
సాధ్విప్రాణము ల్మీయభిజ్ఞానముద్ర, చేత ముద్రించి వచ్చితి శీఘ్రముగను.

134


చ.

పటుగుణకారువీటిపురభాస్వదలంకరణప్రసన్న వేం
కటపతిపాదపంకరుహగంధమిళిందమనోవిటంక వేం
కటపెరుమాళ్నృపాగ్రజ యగారచరిష్ణురమాంఘ్రినూపురా
ర్భటిమతికారి గృహ్యకమరాళివిరావ యరాజితజ్వరా.

135


క.

కంఠేకాలపరాక్రమ, శుంఠీనవఖండయోగ శుభవాక్కవిరా
ట్కంఠీరవనుతసద్యః, కుంఠీకృతవిమతయత్న గుణరత్ననిధీ.

136


తోటకం.

అరికాళమహాబిరుదాంక లస, త్కరికాళమహీభృదుదారకులా
భరణా శరణాగతపాలన జి, త్వరతాద్వరిదావనదానఘనా.

137


గద్యము.⁠

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక తిరువేంగళార్య కలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి ప్రణీతంబైన చంపూరామాయణంబను మహాప్రబంధంబునందు సప్తమాశ్వాసము.

  1. పిన గపిసేన నప్డు గనుపించె నదూరత మద్భుతంబుగన్-మాతృక.