చంపూరామాయణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చంపూరామాయణము

పంచమాశ్వాసము

ఆరణ్యకాండము

క.

శ్రీవేంకటపెరుమాళ్వసు, ధావరసంసేవితాంఘ్రితామరసలస
త్కావేరీవల్లభ పా, రావారగభీర కసవరాజవజీరా.

1


శా.

కాకుత్స్థాగ్రణి దండకావిపినభాగ వ్యోమసీమాఘనుం
డై కోదండము దోఁపఁ గాండనిచయం బాచాంతరక్షోదవా
నీకం బై మెఱయన్ మెఱుంగు కరణి న్దేవేరి వెన్వెంటఁ దాఁ
గేకింబోలి త్రిలోకి రంజిల మెలంగె న్నీలశైలచ్ఛవిన్.

2


మ.

వనశుండాలకపోలకార్షవిగళత్వగ్జాలసాలాతినూ
తననిర్యాసము తావిమాటు హుతగంధంబుల్ నదంబుల్ తపో
ధనపుణ్యాశ్రమభూములం దెలుపఁ దత్తన్మౌనిపూజాహృతా
యనజాతి న్మనువంశు లాయడవి నుద్యానంబుగా నెన్నుకోన్.

3


క.

శాతాయస్త్రిశిఖశిఖా, ప్రోతశవవ్రాతుఁ డై తిరుగువాఁ డచిర
జ్యోతిర్లతాశతావహ, సీతావనితావలోకచిత్రాకృతి యై.

4


గీ.

యాతుధానుఁ డొకఁడు విరాధాభిధానుఁ
డలరుసరి మాంసమతిఁ గాక మపహరించు
కరణి ధరణిజఁ గొని యభ్రసరణి నిలిచి
రాకొమలఁ జూచి తలయూఁచి కేకవైచి.

5


మ.

కట్టినవల్కలంబు జడగట్టిన కైశికముం గరంబులం
బట్టిన విండ్లుఁ జూడఁ గనుపట్టిన దచ్చెరు వెవ్వరో కదా
పెట్టెఁడుసొమ్ముచే సొగసు వెట్టెడు నిట్టి మిటారికత్తెతో
నట్టడవిం జరించెదరు నాయపదానము లాలకింపరో.

6


క.

కాచితి మి మ్మిపు డీచెలి, నాచే నొప్పించి చనుఁ డన న్రాముఁడు దో
షాచరు చనుమొన నొకనా, రాచము నాటింప సృక్కి రక్కసుఁ డలుకన్.

7

సీ.

సీత నుర్వికి డించి చేకొద్ది వైచుశూల మమర్త్యహృదయశూలంబుతోడ
నడువ గేడించి మార్గావరోధాపరాధము సైఁప నిందు భాస్కరుల సాను
వునఁ దాల్చువింధ్యమ ట్లనుజుతోడను నెత్తికొని మింటి కరుగు దైత్యుని భుజంబు
లిరువురు ఖండింప ధరపై నొఱఁగి మేనుఁ దొఱఁగి వాఁ డమరుఁడై తొలుత రంభ


గీ.

బలిమిఁ బైకొనుటను నైలబిలుని కినుక, గనినయొడ లిది గర్తార్హ మనుచు వేఁడఁ
దత్తనువు మున్ను నెత్తుటఁ దడిసిపదన, యినధరణిఁ ద్రవ్విపూడ్పించె నినకులుండు.

8


క.

శరభంగయతికి నతఁడా, శరభంగజకీర్తి రాక చాటుచు గంగా
శరభంగసంగరాశన, శరభంగజజనితదక్షిసఫలత సలిపెన్.

9


గీ.

ఇంద్రుఁ జూచియుఁ దను మానవేంద్రుఁ జూచు
దనుకననటుండి జటిలుండు ననలశిఖకు
సమిధ యై మింటి కరుగ నైక్ష్వాకుమణి సు
తీక్ష్ణు నాతిథ్య మెనసి యాదిక్కు వాసి.

10


చ.

అరిగి కనెం గుఱంగట జలాశయసింధుమరందకందళీ
కరణధురీణపాణిమయకంజితదంతికభీతభీతసం
చరణవిధాయతోయధరసంశయదాయక హోమధూమ దం
తురితపురోవని ఘటతనూజతపోవని లోకపావనిన్.

11


రాముఁ డగస్త్యాశ్రమముం జేరుట

వ.

కనుంగొని యనుంగుటొయారి యగుమహీకుమారి కి ట్లనియె.

12


సీ.

సెలయేటివడి నగస్థలినుండి పడి వాసవాభాసుగతి దెల్పు నజగరములు
నజగరములనోళ్ల కబ్బి వెల్వడలేక వాతాపిదశ చూపు వనగజములు
వనగజాహతులఁ గైవ్రాలి వింధ్యనగంబుభాతిఁ జొప్పడు సల్లకీతరువులు
దరువుల శాఖాగ్రసరణిఁ జూపట్టి వార్ధి తెఱంగనుకరించు తేనెపెఱలు


గీ.

నహుషఋషివిద్విషన్మేరుమహిధరప్ర,దీప వనరాజదుర్మదాటోపహరణ
పటుతరఘటీతనూభవప్రాక్చరిత్ర, మెదురుకొలిపెడు మదికి నిం దిగురుఁబోఁడి.

13


మ.

జలరాశి న్వలకేలఁ గుంభభవుఁ డాస్వాదించుచో నీఁగలుం
బలెఁ బైమూఁగు మొయిళ్ల డాపలిచెయి న్వారింపఁ గంపించి శం
పలకుం బాసి నిలింపమార్గము భజింపన్లేక యామబ్బు లిం
దు లులాయాకృతిఁ బూని పల్వలముల న్వర్తిల్లెడుం గంటివే.

14

గీ.

అని యగస్త్యునాశ్రమాభిరామతకు వి,స్మితమనస్కుఁ డగుచుఁ జేరఁబోవు
నెడఁ దదీయశిష్యు లెదురుగా వచ్చి తో, డ్కొనుచుఁ జనఁగ నరిగి మనుకులుండు.

15


సీ.

నహుషనామ భుజంగవిహృతిఁ దప్పించె మిన్వీటి కీతనిదిగా విప్రవరత
యంభోధి నొకగ్రుక్క నాపోశనముగొన్న వీడు పూనినదిగా బాడబాఖ్య
కేలనంటి నగంబు నేలమట్ట మొనర్చె నీమేటిదిగదా యతీంద్రచర్య
యసురప్రాణంబున కెసరువెట్టినకుక్షి గలుగు వీనిదిగదా కలశజన్మ


గీ.

మనఁ దనరు లోకవంద్యు నిరాశుఁడయ్యు, దక్షిణాశభజించు చిత్రప్రచారు
బ్రహ్మతేజోమయు నిజప్రభావగాతృ, గౌతమాత్రిపులస్త్యు నగస్త్యుఁ గాంచె.

16


క.

నామము గోత్రము నొడివి ప్ర,ణామము గావింప మౌనినాయకుఁ డాశీ
స్తోమముతో నొదవె ముని, క్షేమము లిఁక నని సపర్య సేయుచు నంతన్.

17


మ.

మురజిచ్చాపముఁ దమ్మిచూలివిశిఖంబున్ వజ్రితూణీరముం
గరవాలంబు నొసంగి యానియమిలేఖస్వామి తన్ బంప నేఁ
గి రఘూత్తంసుఁ డొనర్చెఁ బంచవటి చక్కిం డెంకి గోదావరీ
సరసిజాతమరందమందరమరుత్సంప్రీతచేతస్కుఁ డై.

18


మ.

పులుఁ గొక్కం డెదుటం జటాధరనిరంభోవార్ధియై వజ్రియా
వలిఁ దం జేరెడు గట్టురాకొమరు ఠేవం దోఁచి మీ తండ్రికిం
జెలినై యుందు జటాయువందురు ననుం జేకోఁ దగు న్నాయెడం
బలలాదభ్రమ మేలరామ! యని సంభాషించి పో నంతటన్.

19


క.

పంచవటిన్ సౌమిత్రిఘ, టించిన కారాకునగరిటెక్కు లయోధ్యన్
మించ న్సంతోషించి వ,సించె న్రఘుపుంగవుండు సీతాన్వితుఁ డై.

20


శ్రీరాముఁడు పంచవటిని వసించుట

శా.

అంతం దోచె నీతాంతకంతువిజయోదంతంబు సిందూరితా
నంతాశాలివిపాకశీలితపిశంగాకార కేదారసీ
మంతం బాదినయౌవనోదయ మిళన్మాంద్యాంశుమంతంబు హే
మంతం బధ్వచరోద్ధవాదినటఝంపానాట్యపర్యంతమై.

21


క.

శరదాతపతప్తనభః, క్షరదమితనిదాఘబిందుసంఘము లతుల
స్మరమడకుంజరసరసీ, కరనికరము లొలసెఁ దుహినకణవిసరంబుల్.

22


సీ.

జాడ్యాకరం బయ్యెఁ జంద్రోపలవితర్ది శరపాత మయ్యెఁ గాసారవిహృతి
యప్రదృశ్యం బయ్యె హల్లకోత్పలవాటి విపదావహం బయ్యె నుపవనంబు

చర్చాగళితమయ్యెఁ జందనాలేపనం బతిశైత్య మయ్యెఁ జంద్రాతపంబు
గగనమయ్యె గృహాగ్రగతచంద్రశాలిక యసుకరం బయ్యె లాజానిలంబు


గీ.

విరచితామోద మైతోఁచె విరులశయ్య, భారము ఘటించెఁ బూనంగహారవల్లి
కంటకోత్సేధ మొనరించెఁ గప్పురంబు, నిరవధికభోగపరులైనదొరల కపుడు.

23


మ.

బురునీసుల్ సకళాతియాంతరగృహాభోగాసికల్ దోమబ
త్తెరమంచంబుల ధూమధూసరహసంతీయంత్రముల్ కుంకుమా
గురుసారంగమదానులేపనములుం గోష్ణాంబుజాతేక్షణా
గురువక్షోజభరోపగూహములు భోగు ల్గాంచి రాసీతునన్.

24


క.

నెఱసునటి విశ్రమింపం, దఱియై నెఱిమించు మంచుతాఁకుల జిగివా
తెజు పిల్లగ్రోవిఁబూనం, గొఱమాలె న్వెలమిటారికూఁతురితెగకున్.

25


ఉ.

అట్టియెడం గడంగి జగమంతయు నాఁగెడు మంచుదాడి కి
ట్టట్టు చనంగలేక శరణంచుఁ దము న్భజియించు వెట్టకుం
దట్టుపునుంగు వాసనలతావగు లేజవరాండ్ర చొక్కపుం
గట్టిమెఱుంగుచన్గవలు గట్టె నిజోపరిపట్టబంధమున్.

26


గీ.

అనతిచకితదివాంధంబు లైనయెండ, లనతిముదితమరాళంబు లైనకొలఁకు
లనతిసుఖితచకోరిక లైనచంద్రి, కలుఁ బ్రియము లౌనె జనులకుఁ గంటుగాక.

27


సీ.

హృత్పద మాతంక మెనయనీయక మాటుకరణిఁ గరస్వస్తికంబు దోఁపఁ
జలివో జపించు నోజు వణంకునఁ దొలంకు రదనఘట్టనమునఁ బెదవులదరఁ
గృపపుట్టి విధి యొసంగిన కంబళమనంగ నంగంబు రోమాంచ మాదరింప
దౌర్గత్యమయనృపధ్వజపతాకికరీతిఁ గటిఁ బటచ్చరవేష్టి గానిపింపఁ


గీ.

దిరుగుభిక్షాశనులమీఁద దృష్టియిడని
యదయురాలగు కలిమితొయ్యలిగృహంబు
లలజడికిఁ దార్చుకైవడిఁ బులుముకొనియె
వనజవిసరంబు హేమంతవాసరంబు.

28


క.

ఎన్నులతుద హిమకణము, ల్బెన్నుగఁ దట్టొరగి రాజిలె న్రాజనముల్
సన్నిహితలవనచింతా, సన్నతిఁ గన్నీరునించు చందము దోఁపన్.

29


క.

తాలిమివదలి విరాళిన్, జాలిం బడి వెఱచు నళికచామణు లచ్చోఁ
జాల రతివ్యసనాంబుధి, వేలయు రజనీవిరామవేలయుఁ దెలియన్.

30

శ్రీరామునికడకు శూర్పణఖ వచ్చుట

మ.

దిశ లాకాశము ముంచుమంచుల మృగీదృష్టిస్తనాశ్లిష్టులన్
దశమావస్థలఁ బెట్టునట్టి తఱి సీతాసేవ్యుఁ డౌ నేతకున్
దశకంఠాసురు చెల్లె లాసపడెఁ బద్మాదేవి కేల్ దమ్మికిం
బిశితంపున్సవి నేఁగు డేఁగచెలి తబ్బిబ్బైన చందంబునన్.


క.

ఆసపడి చుప్పనాతిపి,సాసి తనుం డాసి హృదయజాతానీతా
యాసముఁ దెలిపిన విని పరి,హాసము దొలఁకంగ నాతఁ డాసతిఁ బలికెన్.

32


చ.

ఓఱవరి వౌదు నీ వయిన ; నొక్కతె కోర్వమి నన్నొకప్పుడే
మఱక భజించు నీతరుణి ; మంటికి వింటికీ భంగురంపుటే
డ్తెఱ ఘటియింపఁ జాలిన యతి ప్రమదావహ, దీనిమాయకు
న్వెఱతుము గాక లేక కనువిందగు నిం దగులంగఁ జెల్లదే.

33


చ.

మగువరొ వీఁడె లక్ష్మణుఁడు మన్మథమన్మథుఁ డీశుభాంగుఁ డే
తగులును లేక యీయడవి దండొనరింపఁగ వచ్చినాడు, నీ
జిగిబిగిఁ జూచెనేని తమిఁ జిత్తము హత్తకపోదు వానికిం
బగలును రాత్రియు న్నిదురపట్టదు కంటికి విప్రయుక్తతన్.

34


క.

కాన నతం డీమేనుం, గౌనుం జిగితొడలు నడలు కన్నులుఁ జన్నుల్
వేనోళ్లఁ బొగడఁ జనుమన, నానీలిపిసాళి మోహనొకృతి యగుచున్.

35


మ.

చరణాబ్దంబుల గిల్కు మట్టెలరొద ల్సంధిల్లఁ బాలిండ్లపై
నెరజాఱున్నును పైఁట నీ టిడఁ గటాక్షాలోకనాళీక దం
తురితోపాంతధరిత్రి యై కవసి యెంతోమైత్రి సౌమిత్రితో
సరసాలాపము చూప నాతఁ డను హాస్యప్రక్రియాశీలుఁడై.

36


ఉ.

దాసుఁడ నేను రామున కతండు మదీశ్వరుఁ డామహాత్ము పొం
దే సవరించి లోకులకు దేవులసానివి గాక నీ నిఁకన్
దాసివి గాఁ దలంచు టుచితంబె విదేహతనూజ కిప్పు డా
భూసుతపుణ్య మేమి నినుఁ బోలునె రూపవిలాససంపదన్.

37


ఉ.

కొమ్మరొ దండు తాణెమునకు న్వెనుకోఁ దగుదానవీవు నీ
యెమ్మెకు రాముఁ డాసపడు నింతయ కాక నిరాకరింపఁ బోఁ
డిమ్మగు దుష్టసత్త్వముల కివ్వని యయ్యవనీజ యిచ్చటం
ద్రిమ్మరనోప దన్నిటను నీ కతఁడే పతి చుమ్ము పొ మ్మనన్.

38

మ.

మరుజాలిం గుఱి దప్పి శూర్పణఖ పల్మా ఱిట్లు నిర్లజ్జయై
గఱిక న్నీటగు నేటియిద్దరులకుం గాంక్షించు నాఁబెయ్యవై
ఖరి నీ యిద్దఱసుద్దులన్ బ్రమసి రాకాపోక గావించె వే
సరి సీతాహృతి కొగ్గ నగ్రజునికన్సన్నన్ గృహీతాసి యై.

39


మ.

వనివా రీచెలి జాలిముక్కు గలుగ న్వర్తించి తౌరా యన
న్మనువంశ్యాగ్రణికూర్మితమ్ముఁ డురుకామక్రోధసంకల్పశూ
ర్పణఖాశ్వాససమీరధోరణులకు బల్బాట వాటింప న
య్యనిమేషాంతకురాలు కాలజలదోగ్రారావదాక్రంద యై.

40


ఉ.

రక్కసిజోదు లంద ఱిఁక రాఘవుడాక విహస్తు లౌదు రీ
ముక్కిఁడిజంతకుం దగిన మొండివిటుండు నిశాటజాతియం
దొక్కఁడు లేక తక్కఁ డని యూహపరుల్ నగఁ జేఁటగోటిబ
ల్మొక్కలపుంబిసాళి ఖరుముందటికిం జని నిల్చె నిల్చినన్.

41


ఉ.

విగ్రత నీకుఁ దెచ్చినవివేకపరాఙ్ముఖుఁ డెవ్వఁడో యతం
డుగ్రతదీయసాయకతదుద్భవులం దొకఁ డైన నేమి? య
వ్యగ్రత గెల్తు లెమ్మని నిజావరజోదితరామలక్ష్మణో
దగ్రత కాగ్రహించి ఖరుఁ డాహవసన్నహనార్హవేషుఁ డై.

42


చ.

వెలుపడి త్రోవకు న్భగిని వేగరి గాఁ బదునాల్గువేలజో
దులు పదునాల్గుచేరువలతో మునుకో నని కేఁగుదేఱ ద
త్కలకల మాలకించి సతిఁ గావ సహోదరుఁ బంచి సింగిణీ
విలు గుణయుక్తి మ్రోవ రఘువీరుఁ డెదుర్కొనె యాతుధానులన్.

43


వ.

ఇ ట్లెదుర్కొని జనోదర్కగోచరేతరామోఘశరలాఘవుం డగు రాఘవుండు మండలీకృతసముద్దండకోదండపిండితప్రచండకాండపారంపరి నిలింపులకు సొంపు సంపాదింప, నావిలం బగు రక్షోబలంబు తత్క్షణంబ హైమవదినంబు కైవడి ననవాప్తపుండరీకం బై రాశిచక్రంబువైఖరి నవిభిన్నకేతుపాతం బై, యంబుజేక్షణావక్షోరుహంబులీల నాలక్ష్యమాణపత్రభంగం బై, ధారాధరసమయరంగత్తరంగిణి తెఱంగునఁ బరివహదవేలకీలాలజాలం బై, యనార్యగోష్ఠి పోలిక ననేకప్రకారహతకవచస్స్ఫురణం బై, శారదావసరవాసరంబుసరణి విశకలితాపఘనసంకులం బై, చాంద్రమసబాల్యచరితంబురీతి సంభృతగురూత్త

మాంగనాశం బై, పాండవబలంబురేఖ ధర్మరాజాధీనదేహం బై, పరశురామాపదానంబుభాతిఁ బాతితసరోషకుంభినీధవకులం బై, పౌలస్త్యనగరంబులాగునఁ బలాశనప్రతిష్ఠాసమంచితశివాలయం బై, యంబురుహబంధుబింబంబుడంబున ననంతాభిపతదురుతరకరసహస్రం బై, దినావసానంబుచందంబున వియోగభాజనరథాంగయుగశతాంగసంఘం బై, హరయదుప్రవరసమరంబువీఁక నప్రాణితత్రిశీర్షం బై, నిర్మలాంతరంగశీలంబుపగిది నిర్ధూతదూషణం బై, యద్వైతతత్త్వంబుఠీవి నాత్మావశేషం బై, నశింప రోషించి దోషాచరసమాజశేఖరుం డగు ఖరుం డడరినప్పుడు విపశ్చిజ్జనంబునకు నైన నిశ్చయింపంగూడని జయాపజయఖేలనంబు దోఁపఁ జూపఱ కననుసంధీయమానంబు లగు విశాఖసంధానమోక్షణంబుల నంతరిక్షచరనిరీక్షణాద్భుతవితరణవిచక్షణం బగు రణం బిరువురకుం బ్రవర్తిల్లు నెడ మార్తాండకులతిలకుచాపంబు నయ్యసురలోపంబు గావింపఁ గోపయావకితముఖసరోజుం డై దశథతనూజుండు కుంభసంభవుఁ డొసంగిన శరాసనంబు మోపెట్టి బెట్టిదంపు బాణంబు దండకావనతపోధనతనుత్రాణనిర్మాణపారీణంబుగాఁ బ్రయోగించె నంతట.

44


క.

ఆఖరునిశిరము రవికుల, శేఖరునిశరంబు దునుమ జితలేఖనదీ
మౌఖరి యగు జటిలాశీ, ర్వైఖరిఁ గొనె ముందె మంథర రఘుస్వామిన్.

45


మ.

మునుము న్మంథర కైకయు న్వరయుగంబున్ సూనృతాపాయభీ
తనృపాలోక్తియు జానకీరమణకాంతారప్రచారం బనం
జను పేళ్లన్ దశకంఠహీనతకు నోఁచంజాలు త్రైలోక్యభా
గ్యనికాయంబు రహింప నావని మునుల్ సానందు లై రందఱున్.

46


మ.

ఖరనక్తంచరుఁ గీటణంచి యుటజాగ్రక్షోణి విల్లెక్కు డిం
చి రజోధూసరజాటజూటరుచిరశ్రీ మించు నైక్ష్వాకుశే
ఖరువక్షోజభరానురూపతదురఃకాఠిన్య యై కౌఁగిలిం
చి రణశ్రాంతి హరించె సీత యధికస్నేహాదరాన్వీత యై.

47


క.

సౌమిత్రియు రాముజయ, స్థేమం దా రెండువేలజిహ్వలుగలవాఁ
డై మెచ్చె మువ్వురున్ సుఖు, లై మునుపటికరణి నుండి రాసమయమునన్.

48


మ.

అజహన్మత్సరవృత్తి చిత్తమెగపోయం జేటబల్గోటిజం
జ తనస్థానమురీతి లంక నజనస్థానంబు గావింపఁ బా

కజితుం గీలి జముం బలాదు వరుణున్ గాడ్పున్ ధనేశున్ భవు
న్ఫుజకండూతిఁ దృణీకరించుదశకంఠుం జేరి యానమ్ర యై.

49


చ.

వినుము జగత్త్రయీభయదవిక్రమ నే నటుమొన్న దండకా
వనికి వినోదకేళిఁ జని వర్తిల్లుచో భవదీయధాటి కొ
య్యన మునివృత్తిఁ జెందినజయంతవసంతులొ పుష్పవంతులో
యనఁదగు శౌర్యవంతులు మదక్షులపాల్పడి రిద్ద ఱత్తఱిన్.

50


చ.

చరగతిఁ జిత్రపుత్రికకుఁ జాటెడునెన్నడ దోఁపఁ దానిటె
క్కరిది గదా కడానిలత కన్మతిఁ జిల్కెడుమేనితళ్కు, తొ
ల్కరికరిమించు మించు లిడఁ గంతునొయారపుఁ జిక్కటారివై
ఖరి నొకహొంతకారి మెలఁగన్ గనుఁగొంటిఁ దదంతికంబునన్.

51


సీ.

అది పూనువేణిసోయగముఁ జెందరు కదా పన్నగీమణు లెంద ఱున్న నేమి
యది వహించునెలుంగు హవణింప లేదు గా! కిన్నరీతతి దావుకొన్న నేమి
యది చెందుపొక్కిలిహరువు చేకోదు గా యప్సరోనికర మెం తైన నేమి
యది గాంచుపిఱుఁదుసంపదకు నోఁచరు గదా యుర్విబోటులు పెక్కు రున్న నేమి


గీ.

యది గదా యింతి యటువంటియలరువింటి
దంటమదహస్తి నెద హత్తి యుంటి వేని
గంటి వన వచ్చు వెలిదమ్మికంటివలఁతి
కలికి గావించుకలిమి రాక్షసకులేంద్ర!

52


ఉ.

రాముఁడు లక్మణుం డనెడురాచకొమా ళ్లఁట వారు వారిలో
రాముఁడు పెద్దవాఁ డఁట! యరాళకచామణి సీతపేరియ
క్కోమలి యమ్మహామహునకున్ జవరా లఁట దానిమేనితీ
రామరవారకామినుల కైన నధీశతఁ గోరఁ జేయదే?

53


క.

నీ కాయొసపరి దగు నని, కైకోఁ జని విగ్ర నైతి ఖరుఁ డంత మదీ
యాకృతిఁ గనలి బలాన్వితుఁ, డై కదలి తదీయవిశిఖహతిఁ బడె ననుడున్.

54


మ.

దశకంఠుం డనునాసికోక్తు లటు లొందం జెల్లెలిం గొన్నదు
ర్దశ భావించి ఖరాదితాదృశజనస్థానోగ్రరక్షశ్చతు
ర్దశసంఖ్యాకసహస్రహంత్రి యగు సీతానేతచాపప్రతా
పశిఖిజాలిక నాలకించి ఘనకోపవ్యాపృతస్వాంతుఁ డై.

55

ఉ.

వింటి నపూర్వ ముర్వి నొకవింటినరుండె జయించువాఁడు ము
క్కంటిమలం దెమల్చినమగంటిమిజో దిడుతాణె మింక నా
పంటవలంతినోముగుమిపంట వహిన్ రహిమించువానివా
ల్గంటి వడిన్ హరించి తెఱగంటివజీరుల త్రు ళ్లడంచెదన్.

56


గీ.

మతకరిమెకంబు చేకొని మరులువట్టి, ధరణిఁ బో నోమిన త్రిశంకుతనయుకులము
వాఁడగుట వీఁక నాచేత నేఁడు రాముఁ డింతిఁ గోల్పోవ మారీచు మృగ మొనర్తు.

57


క.

అని మారీచునికడకుం, జని దశకంధరుఁడు తనవిచారము దెలుపన్
విని యతఁ డీదుర్మతి కీ, తని కేమిటికొ వలె ననుచుఁ దహతహఁ బలికెన్.

58


శా.

నీబోధం బిపు డెందుఁ బోయె నకటా! నిశ్శంకలంకాపుర
ప్రాబల్యంబుఁ బొకాల్పఁ జూచెదవు ధర్మంబా రఘాత్తంసభా
ర్యాబందీకరణంబు శూర్పణఖయూహాపోహ లాలింతురా?
“స్త్రీ బుద్ధిః ప్రలయాంతికా” యనుట నీచిత్తంబునం దోఁపదా!

59


క.

మౌని నయినాఁడ రాముని, చే నొకచేపెట్టు మేసి చిత్తంబున కు
ద్యానారామపదం బవ, సానవిరామాహ్వయంబు జళు కగు ననినన్.

60


ఉ.

కన్నుంగ్రేవలఁ గెంపు దోఁప నదిరా కాఱొడ్డెమా నేను జె
ప్ప న్నీ విప్పని కొప్పుకోమి యిది నీ పాండిత్యమో? చాలు నం
చు న్నైష్ఠుర్యము వుట్ట నాడుటయు నచ్చో వాఁడు నిమ్మూర్ఖుఁ డిం
క న్నాబుద్ధులఁ జక్కఁగాఁ డనుచుఁ దత్కార్యానుకూలాత్ముఁ డై.

61


ఉ.

భానుకులీనుదేవిఁ జెఱపట్ట దశాననుఁ డెంచ బ్రహ్మ త
త్ప్రాణసమీరు సౌరపురయాత్ర కమర్చిన పైఁడిజోడునె
మ్మేనిరుటంపు లేటితలమిన్న పఠాణి యనంగఁ దాట కా
సూనుఁడు దండకావనము సొచ్చె హిరణ్మయపుంగురంగ మై.

62


క.

ఇటువలె నేతెంచి కుఱం, గట మెలఁగెడు పైఁడిమెకముఁ గని దానిం దె
చ్చుట కవనిజ వేఁడన్ ధూ, గ్జటి యజ్ఞమృగంబువెంట జరిగెడుకరిణిన్.

63


ఉ.

వింట న్నారి ఘటించి రాముఁ డసుర న్వెన్నంట బల్ గుఱ్ఱపుం
గంటుంగొంటుపఠాణిరావుతుఁడు మున్ గాధేయుజన్నంబునన్
గంటిం జెందక పాఱిచన్నబడు గిన్నా ళ్లెచ్చటం డాఁగెనో
కంటింగంటి నటంచుఁ బాశము కరగ్రాహ్యంబు గావింపఁగన్.

64

మ.

మనువంశ్యుం బెనుమాయదారిమెక మై మారీచనీచుండు కా
నను ద వ్వట్లలయించికొంచుఁ జని యంతం దత్కలంబాహతిం
దనకార్తస్వరశంబరాకృతి చన న్వ్రాలెన్ “హతో౽స్మీతి” వా
గ్జనకార్తస్వర ముర్విపట్టి యధిపోక్తం బంచుఁ గంపింపఁగన్.

65


ఉ.

కంపముఁ జెంది సీత యనుకంప వహింపవు కంటనుం దడి
న్నింపవు లక్ష్మణా యతఁడు ని న్నదె చీరెడు నన్న నల్లనై
లింపకుమారి మాయకుఁ జలింపకు రామునకా భయం బనం
దెంపరి యై దురుక్తు లవనీజ వచింపఁగ నాతఁ డార్తుఁ డై.

66


మ.

అకటా! నిన్ను సుమిత్ర గాఁ దలఁప హేయంపుందురుక్తంపు నా
లికెతూపుం జెవిగాఁడ నాడితివి తల్లిం బట్టనూహించుపా
తకుఁడే లక్ష్మణుఁ డేమి చేయ వశమా దైవేచ్ఛకు న్నే నయో
ధ్య కెడై వచ్చియుఁ గైకఁ బోలి పడఁ బాలైనాఁడ నేఁ డీవనిన్.

67


క.

విపరీతకాల మింతే, యిపు డెవ్వరి నొచ్చుకొనఁగ నేఁటికి నీచే
నపవాద మగుట నిజ మని, తపియించి సుమిత్రపట్టి తరలఁగ నంతన్.

68


సీ.

మితిమీఱి వెలికిఁ గ్రమ్మెడుమనోరాగంబుసరణి నీ టగు ధాతుశాటితోడ
కామాంధతకు నూఁతగాఁ గొన్నయట్టిచందము దెల్పువేణుదండంబుతోడ
తలదిమ్ము కామవార్తలఁ గ్రమ్మనిడినప ట్టనఁ దోఁచు గోపిచందనముతోడ
బలిమి చేఁ జేపడ్డబ్రహ్మాండభాండంబువలెఁ జెలంగెడుకమండలువుతోడ


గీ.

నహమికనుబోలె “నచ్యుతో౽హం శివోహ”
మనుపలుకుతోడ నిజతుంగఘనశతాంగ
ముడుపదవి మాటి మున్నీటినడిమివీటి
నట్టురాకాసి దొరఁకుసన్నాసి యగుచు.

69


చ.

దళనిలయం బరాఘవయుతం బగుటం గని సీత సత్కృతుల్
సలిపెడురూపు మాని సహజం బగు నెప్పటిమేనిఁ బూని యా
నళినముఖిన్ హరించె విజనం బగుకోవెలఁ జొచ్చి జాగిలం
బలరుసరంబు నామిషదురాశ సవింగొనిపోవు కైవడిన్.

70


ఉ.

ఈకరణిన్ హరించి యతఁ డేగెడుచో హరిదబ్జమాల్యద
వ్యాకులదృష్టిచాకచకి నశ్రువు లాఁగికొనంగ హా! జయ

శ్రీకమనీయ! హారఘువరేణ్య! త్రిలోకశరణ్య! నాయెడ
న్నీకుఁ బరాకు సేయఁదగునే యని యాపికవాణి కూయిడన్.

71


లయగ్రాహి.

ఆయెలుఁగుచేఁ బులుఁగురాయనికి జోడగు
        జటాయు వమరాలి పగదాయకు మొనై యో
రీ యెచటికిం జుణిఁగి పోయెదు పలాదపశదాయని
        గరున్నఖముఖాయుధసహాయుం
డై యనికిఁ దార్కొని తదీయమగు తేరయుగమై
        యహరిసారథికమై యపరథాంగం
బై యిలఁబడంగెడపి యాయసురనాయకుని
        కాయమునఁ గొన్ని యసిగాయములు చేసెన్.

72


గీ.

నిశితనఖభిన్నదశముఖత్రిశిఖవిశిఖ
పాశకుంతము నగుచును నాశకుంత
మాతనికృపాణిఁ గనెఁ బక్షపాత మమర
పదమొసఁగుభూమిసుతపక్షపాత మమర.

73


సీ.

సుగ్రీవసాత్కృతోదగ్రపంక్తిగ్రీవ బహుదోఃప్రతాపసంగ్రహ మనంగ
వాలిరాజ్యప్రాజ్యవైభవాతిశయాచితోత్పాతహేతుభూతోల్క యనఁగ
మనువంశ్యమైత్రీకృతినిమిత్తపుత్త్రాధిపతదుగ్రభానుబింబం బనంగఁ
నంగదయౌవరాజ్యరమావినోదోచితాసాదివైయన్నదాబ్జ మనఁగ


గీ.

నంత వ్రాలె మతంగాద్రి హరులచెంత, నిశిచరేంద్రరథాంతరనీయమాన
జనకతనయోత్తరసంగకనకపటని, బద్ధవిక్షిప్తమణిమయాభరణసమితి.

74


ఉ.

ఏతరిదైత్యుఁ డాతఱి మహీతనయాకృతభూషణావళీ
పాతము నైజతేజమునిపాత మెఱుంగక లంక కుద్గదా
జ్ఞాతవిరోధిజాతభయశబ్దకలంకకు నేగి శోకసం
స్యూతను సీత నప్పురి నశోకనికేత నొనర్చె వింతగన్.

75


గీ.

సోఁకుటింతులు నలువంకఁ జుట్టి యున్న, జనకతనయామణి నశోకవని భజించెఁ
గేసరితనూజువాలోగ్రకీలితోగ్ర, హుతవహస్తంభనౌషధిలతిక వోలె.

76


శా.

సారంగం బగుతాటకేయునియెడన్ శార్దూలవిక్రీడితో
దారుం డై చనుదెంచు రాఘవుఁడు సీతాప్రేరణం జేసి తన్

జేరన్వచ్చినతమ్మనిం గని మదిం జింతాపరుండై దళా
గారం బంత మెఱుంగులేనిమొగు లై కంటం దడి న్నింపఁగన్.

77


క.

వనదేవత లీతనికా, జనకాత్మజవిరహ మనుచు సహితాశ్రువు లై
కనుఁగొనఁగ వియోగవిడం, బనకు న్దొరకొనియె దూయమానాశయుఁ డై.

78


ఉ.

కుందనపు న్మెకంబు నిటు గొంచు రయంబున రాక నీవు కా
నం దడ వుండినాఁడ వని నాపయి నేరమి నంత నించి నీ
మందసితస్మితేందురుచి మామకదృష్టిచకోరి చెందకుం
డం దరువాటిలోఁ గినుక డాఁగితి వేమె? తలోదరీమణీ.


మ.

సకియా నీమదిలోని కోరిక ఘటించన్ లేక మోహాబ్ధివే
లకుఁ జేరం గొఱగాక పంచవటి చుట్లన్వెట్టు నామీఁదికి
న్కకు నీకున్ సమయంబె తావకవియోగం బిట్లు సైఁపంగ మా
మకదేహం బిది లోహమో విరసపుంబాషాణసందోహమో.

80


శా.

నీకు న్వింతమెకంబుమీఁదఁ దమియుం టే నేమి కా దంటి నా
రాకాచంద్రున కంతరంగ మగుసారంగంబు రప్పించెదన్
గైకొ మ్మాహరిణంబు నీకరమునం గన్పట్టునందాఁక శు
ద్ధాకారుం డతఁ డొందుఁగాక భవదీయాస్యైకదాస్యోన్నతిన్.

81


సీ.

నేనింత తపియింపఁ బ్రాణంబుతో నున్నఁ జేర రాకుండునా చిగురుఁబోణి
క్రొత్తనెత్తుట నేల జొత్తిల్లమి గజాదిచర్విత గాదుగా జలదవేణి
పోదుగా తా నొంటి గోదావరీచారుపులినకేలి ఘటింప నలినపొణి
మునిసతీగోష్ఠిఁ జెందె న టన్నఁ బొరుగింటికెలన డాయదు గదా కీరవాణి


గీ.

మున్ను సౌమిత్రిహేతిచే ముక్కుకొఱఁత, వడినపగ దీర్చికొననెంచి యడవిఁబొంచి
యున్నజగజంతరక్కసి యుదరశిఖికిఁ, గబల మై తోఁచెనేమొకో కంబుకంఠి.

82


చ.

అని తలపోయు, నుస్సురను, నబ్జముఖీ నినుఁ బాయ శక్యమా
యను, వనవాసపూర్తియెడమ న్దివికేగిన మామసేవకుం
జను టుచితంబె నీ కవనిజా యనుఁ జానరొ నీసమీపమున్
నను దొరయించుకోమి తగునా యను, హాయను, దుర్విధీ యనున్.

83


సీ.

వని నొక్కయెడ మిన్కుఁ గని చాకచకి చూపుజనకజతనుాంతి యని చలించుఁ
బొదరింటికిసలయం బదరిపాటుగఁ దోఁపఁ నదిగొ వైదేహికే లని భ్రమించుఁ

గలకంఠ మెలమావిఁ గంఠకాకలి నింప నిదె సీతరొద యంచుఁ గదియఁ బోవుఁ
గెలఁకుతమ్మికొలంకు చలిగాలి మై సోఁక నవనినందనతావి యని తలంచు


గీ.

మఱియు రఘువీరుఁ డలఁతఁద్రిమ్మరినతెఱఁగు, వినఁదరమె యట్టిదురవస్థ కనికరంబు
లేక వర్ణించినట్టివాల్మీకి యెట్టి, బోయయో కాక తొలుతటిపుట్టువందు.

84


వ.

ఈకరణిఁ దరణికులశిఖామణి నిజహృదయపంజరవిహారకంజశరవినోదకీరమణి యైనజానకీరమణి నయ్యరణ్యాని లక్ష్మణసమేతుఁ డై వెదకుచుం బోయి ముందటం బురందరాదిబృందారకజయామందభుజబృంద మందోదరీశబందీకృతవిభీతసీతానిమిత్తజాతాహతాలూన పక్షమూలతవలన నేల వ్రాలి యున్న తనజాలి విన్నవించి యంచితవిముక్తి చలేక్షణాకుచాభోగమృగమదమేదురామోదసఫలితప్రాణవాయు వగు జటాయువు నజతనయదురవాపనైవాపసలిలయోజనంబునకు భాజనంబు గావించి, తత్క్షణంబ దక్షిణాశాముఖలక్ష్యమాణ యగు నయోముఖిముఖంబున దశముఖానుజాననప్రియసఖ్యంబు గా సంఘటించి, నిలింపులు భయంపడఁ గబంధదోర్బంధనిర్బంధంబున కవరజయుతంబు గాఁ గొంతవడి తగుల్పడి, యనంతరం బనశ్రుపాత్రంబు లగు రక్షఃకలత్రంబుల నేత్రంబుల కవేలతరవారు లొసఁగుతరవారులం దదీయచండతరబాహుదండకదలీయుగళవేదండతుండపాండిత్యంబు హత్తుకొన వర్తిల్లి, యత్తఱి నరాదుండు మొండెంబు చెండఁ బొలదిండిమేనుం బోనోమి వైమానికుం డై కేలు మొగిచి నిలిచి యొకమునికినుక దనుజతను వెనసి మీకతన నతిపావనుండ నైతి నని భావిభావుకనిదానశ్రమణ్యాశ్రమపథంబు సూచించి దివి కరుగ, నురుగహనసంగతం బగుమతంగమునితపోవనిం దావుకొని, శబరిసవిధంబు చేరి యప్పులిందసుందరీసమాచరితపూజనోపచారి యై ఋశ్యమూకసరణి విజ్ఞాపనంబు సలుపఁ దదనుజ్ఞచే మనోజ్ఞకీరశారికామృగనికాయంబునకు నాస్పదం బైన గహనపదంబుఁ గడచి వికచారవిందసౌగంధికానుబంధగంధిలంబును, ననుపమేయవనదేవతావితానడోలావిహరణానుకూలంబును నతివిశాలకూలానువేలఖేలావిలోలశుండాల గండమండలమదాస్వాదనానుషంగియు, ననంగజయనిషంగరంగత్తరతటరసాలసాలకుసుమ విసరవిలసదాసవాసారభరవిసారియు, ననేకలతికాపదేశలాసికాదేశికంబును, ననూనకాయమానమానితలతాగృహవినోద సాదరనిషాదశాతోదరీకచనిచయవిచికిల మకరంద

బిందుతుందిలంబును, సభంగబిసభంగ భోజనప్రమోదజాలపదగరుత్పరంపరాసంపాతరయ సముత్పతత్పాథోలవాకలితపాథేయంబును, నగు ననుతటోత్సంగపవనంబుచే నెదుర్కొనెడుపంప నవలోకించె నంత.

85


శా.

హిందూరాజ్యరమాధురీణభుజభూయిష్టప్రజాబర్హిణీ
సందోహాభినవాంబువాహ ఘనవాచాస్వాదుమోదా శతా
నందానందకుమారపాదయుగళీనాళీకపూజాపరి
ష్పందాభ్యంచితపంచశాఖ సుఖతాసంధా కబంధాహితా.

86


క.

కుటిలారిమరున్నారీ, ఘటనాచణభుజవిహారికౌక్షేయభవ
స్ఫుటకీర్తివధూటీపద, కటకీకృతచక్రవాళ గండరబాలా!

87


నత్కుటవృత్తము.

అయివరగండ కుండలికులాధిపవాగ్విభవా
నయవినయప్రధాన సుగుణస్ఫురణాభరణా
జయరఘురామభీమబల శత్రువిరామధనం
జయనిభధామ ధీమహితసామ రసామఘవా.

88


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాద సమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాత కవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి ప్రణీతంబయిన చంపూరామాయణం బను మహాప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము.