Jump to content

చంద్రరేఖావిలాపము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చంద్రరేఖావిలాపము

ప్రథమాశ్వాసము

శా.

శ్రీకంఠుండు భుజంగభూషణుఁడు భస్మీభూతపంచాస్త్రుఁ డ
స్తోకాటోపబలప్రతాపపురరక్షోదక్షసంశిక్షణుం డా
కాశోజ్వ్జలకేశపాశుఁడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
వీఁకం జింతలపాటి నీలనృపతిన్‌ వీక్షించు నేత్రత్రయిన్‌.

1


ఉ.

అక్షయబాహుగర్వమహిషాసురదుర్ముఖచక్షురోల్లస
ద్రాక్షసదక్షులన్‌ సమరరంగములోనఁ ద్రిశూలధారచే
శిక్ష యొనర్చి శోణిత మశేషము గ్రోలిన దుర్గదుర్గుణా
ధ్యక్షుని నీలభూవిభుని దద్దయు నిర్ధనుఁ జేయుఁ గావుతన్‌.

2


సీ.

స్తబ్ధశబ్దగ్రహద్వయుఁడు సంవేష్టితో
            త్తాలవాలుండు కరాళవజ్ర
కర్కశదంష్ట్రాక్రకచభయంకరమహా
            విస్తృతవక్త్రుండు విపులదీర్ఘ
పటుతరకహకహస్ఫుటచటువికటాట్ట
            హాసనిర్దళితవేదాండభాండుఁ

డాలోకకాలానలాభీలవిస్ఫుర
            న్నేత్రుండు ఖడ్గసన్నిభనిశాత


గీ.

నఖరుఁడు హిరణ్యకశిపువినాశకుండు
సింహగిరివర్తి యగు నరసింహమూర్తి
యడరు చింతలపాటి నీలాద్రినృపుని
సిరియు గర్వం బడంగంగఁ జేయుఁగాత.

3


ఉ.

నీరదనీలవర్ణుఁడు శునీవరవాహుఁడు విద్యుదాభవి
స్ఫారజటాభరుండు బహుశష్పసమన్వితదీర్ఘమేఢ్రుఁ డం
భోరుహగర్భమస్తకవిభూషితహస్తసరోజుఁ డా మహా
భైరవుఁ డిచ్చుఁగాత నశుభంబులు నీలనృపాలమౌళికిన్‌.

4


చ.

అనుపమవిక్రమక్రమసహస్రభుజార్గళభాసమానసా
ధనజితసిద్ధసాధ్యసురదానవదక్షుఁడు దక్షశీర్షఖం
డను డగు వీరభద్రుఁడు గడంకను జింతలపాటి నీలభూ
జనపతిపుంగవు న్విభవసారవిహీనునిగా నొనర్చుతన్‌.

5


చ.

నలువగు రక్తమాల్యవసనంబులు డంబుగ దాల్చి కన్నులన్‌
జలజల బాష్పబిందువులు జాలుకొనంగఁ జెలంగుచుండు న
క్కలుములచేడె యక్క కలకాలము నీలనృపాలు నింటిలో
గలిపురుషానుషంగ యయి గాఢరతి న్నటియించుఁగావుతన్‌.

6


చ.

అనుదినవక్రమార్గగతు లై చరియించుచు వైరివర్గముల్‌
దనరఁ బరిస్పరాత్మతను దాలిచి మంగళుఁడు న్గురుండునన్‌
శనియును రాహువు న్మిగులసమ్మతి ద్వాదశజన్మరాసులన్‌
గొనకొని నిల్చి నీలనృపకుంజరుని న్గడతేర్తు రెంతయున్‌.

7


కం.

భీమకవి రామలింగని
స్త్రీమన్మధుఁడై చెలంగు శ్రీనాథకవిన్‌
రామకవి ముఖ్యులను ప్రో
ద్దామగతిం జిత్తవీథిఁ దలఁచి కడంగన్‌.

8


వ.

ఇట్లు సకలదేవతాప్రార్థనంబును సుకవిజనతాభివందనంబును
గావించి యే నొక్క హాస్యరసప్రధానమగు ప్రబంధంబు “సుకవి

నికరమనోనురాగసంధాయకంబు”గా రచియింప నుద్యోగించి
యున్న సమయంబున.


సీ.

తన యపకీర్తి మాద్యత్కృష్ణకోకికి
            గురుతరాజాండంబు గూఁడు గాఁగ
తన లోభగుణవినూతనదురాలభలత
            కష్టదిశల్‌ మ్రాకు లై చెలంగ
తన పందతన మను ఘనతమోవితతికి
            బహుగృహంబులు శైలగుహలు గాఁగ
తనదు వారత్వచోరునకు సంకరశర్మ
            నాటకం బర్థాంజనంబు గాఁగ.


గీ.

నవని దీపించుఁ జంద్రరేఖాభిధాన
వారనారీత్రికోణసంవర్ధమాన
రసపరిప్లుతసుఖగదాప్రణకిణాంక
భూషణుం డైన నీలాద్రి భూమిపుండు.


వ.

వెండియు నఖండభూమండలమండవాయమాన మానవాధినాథ
సాధుయూధ నిర్నిరోధావరోధసభాభవనాభ్యంతరనితాంత
వర్ణనీయ కాలకూట కాకకజ్జలఖంజరీటకంబళేంగాలకాలమార్జాల
గండోపల ఘనాఘనగంధేభబంభరకదంబ సంభాసమానానూనాం
తదిగంతాక్రాంతాపయశోమండలుండును, సుభగుండును,
మైరావణ రావణ కుంభకర్ణ కుంభ నికుంభ శుంభ నిశుంభ జంభ
హిడింబ ప్రలంబ పౌలోమ బక వత్సక బాణ చాణూర ఘటోత్కచ
కాలనేమి ఖర దూషణ త్రిశిర మారీచ మాలి సుమాలి మకరాక్ష
ధూమ్రాక్ష శోణితాక్షప్రముఖ రక్షోదక్షసదృక్షాక్షుద్ర
నిర్నిద్రద్రాఘిష్టదుర్దమదుర్గుణాధ్యక్షుండును, సర్వావలక్ష
ణుండును, కిరాతగుణగరిష్టుండును, దుర్మార్గప్రవీణాస్పదుండును
బ్రాహ్మణద్రవ్యభక్షణదీక్షితుండును, బాలరండాకర్షసమాణకు
తూహలుండును, నిరంతరానంతదురంతప్రాంతకాంతారాంతరా
ళకరాళమార్గానర్గళసంచరద్గవయ గోమాయు గోపుచ్ఛ కురంగ

శశ మర్కటోలూక గ్రామసూకరప్రముఖ ప్రకట మృగయా
విహారవిశారదుండును, మహోన్మాదుండును, సుకవినికురంబ
విద్వత్కదంబవందిసందోహ వైణికశ్రేణికా మనోరధార్థ-న్యర్థీ
కరణాసంహారణాకారణానిర్దయస్వాంతుండును, విగతశాంతుం
డును, బహువారనారీజనాలింగన దుర్గంధబంధురభగచుంబన
తాడనపీడన దంతక్షత నఖక్షత మహిష మార్జాల మర్కట
కుక్కుట కృకురప్రముఖబంధనైపుణీగుణగరిష్టుండును, దుర్జన
శ్రేష్టుండును, శ్రీమచ్చింతలపాటివంశపారావారఘోరజాజ్వ
ల్యమానానూనశిఖాసందోహసందీప్తబడబానలుండును, చల
చిత్తుండును, సంగరాంగణభీరుండును, విషయశూరుండును, నీచపాచ
కాధారుండును, పరమదుర్బలదుర్భరశరీరుండును, ఆత్మీయదాస
విలాసినీజనమనోధనపశ్యతోహరుండును, పతయాళుండును నగు
నీలాద్రిరాజన్యపుంగవుం డొక్కనాడు.

11


సీ.

వేఁటవేఁపులు పదివేలు మచ్చికమీఱ
            మూతి నాకుచు దండ మొఱుఁగుచుండ
ఱొమ్ముతప్పెట లూని క్రమ్మి రసాలాలు
            జోహారనుచు వేఁటసొంపు దెలుపఁ
దురకనేస్తలు సురాపరిమళం బెసఁగంగఁ
            జెవిచెంత మనవులఁ జెప్పుచుండ
రసపొక్కు లడర వారస్త్రీలు ముంగలఁ
            దాథై యటంచు నృత్యంబు సలుప.


గీ.

వినయ మెసఁగంగఁ గుంటెనపనులు సేయు
సేవకులు దాసికలు డాసి క్రేవ నిలువ
నలరు కొప్పాక గ్రామసింహాసనమున
గడఁక దళుకొత్తఁ బేరోలగమున నుండి.

12


మ.

సరసాగ్రేసరుఁ గూచిమంచికులభాస్వద్వార్థిరాకావిధున్‌
జిరకీర్తిన్‌ బహుళాంధ్రలక్షణవిదున్‌ శ్రీమజ్జగన్నాథసు

స్థిరకారుణ్యకటాక్షలబ్ధకవితాధీయుక్తునిన్‌ జగ్గరా
డ్వరనామాంకితు నన్నుఁ జూచి పలికెన్‌ వాల్లభ్యలీలాగతిన్‌.

13


సీ.

రచియించితివి మున్ను రసికు లౌనని మెచ్చ
            సురుచిరజానకీపరిణయంబు
వచియించితివి కవివ్రాతము ల్పొగడంగ
            “ద్విపద” రాధాకృష్ణదివ్యచరిత
ముచ్చరించితివి విద్వచ్చయంబు నుతింపఁ
            జాటుప్రబంధముల్‌ శతకములును
వడి ఘటించితివి నిరువదిరెండు వర్ణనల్‌
            రాణింపఁగా సుభద్రావివాహ


గీ.

మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు
భూరిరాజన్యసంప్రత్ప్రపూజితుఁడవు
భళిర నీ భాగ్యమహిమ చెప్పంగ దరమె
జగ్గరాజకవీంద్ర వాచాఫణీంద్ర.

14


ఉ.

అర్ణవమేఖలం గల మహాకవికోటులలోన నెంతయున్‌
బూర్ణుఁడ వీవు సత్కవిత బూఁతులరీతుల గోరుకొండగా
వర్ణనసేయనేరుతువు వాతెముఁ జుల్కఁగఁ బల్కు మూర్ఖులన్‌
దూర్ణమె తిట్టి చంపుదువు ధూర్తవు, పౌరుషశాలి వెంతయున్‌
నిర్ణయ మిత్తెఱం గెఱిఁగి నేర్పున నిన్ను బహూకరించినన్‌
స్వర్ణవిభూషణాంబరగజధ్వజచామరగోధనాశ్వదు
ర్వర్ణవిచిత్రపాత్రబహురాజ్యరమారమణీయపుత్రసం
కీర్ణసమస్తవస్తువరగేహసమంచితభోగభాగ్యముల్‌
కర్ణసమానదానము, నఖండపరాక్రమశక్తి, నిత్యదృ
క్కర్ణకులీనవాగ్విభవగౌరవ, మాశ్రితబంధురక్షణో
దీర్ణకృపారసంబును, నతిస్థిరబుద్ధి, చిరాయువున్‌, సుధా
వర్ణయశంబునున్‌ గలిగి వర్ధిలఁజేతువు జగ్గసత్కవీ.

15


వ.

అని యనేకప్రకారంబులం గొనియాడి యీడులేని వేడుకం జం
ద్రరేఖాభిధాన వారవారణరాజయాన యూరుప్రదేశంబున

శిరంబు మోపి పరుండి క్రిందు చూచుచు నా రాజాత్మజుం డిట్లనియె.

16


క.

వేంకటశాస్త్రులు మాకు న
లంకారగ్రంథ మొకటి లలి సురభాషన్‌
బంకించె నాంధ్రకావ్యం
బంకిత మొనరింపు మీవు నట్లనె మాకున్‌.

17


క.

అని మున్ను సత్ప్రబంధం
బొనరింపుమటంచు జెప్పియుంటిమి వెస న
ట్లనె రసముగ జెప్పితి వది
గొన నిపుడు ధనంబు లేదు కొదువ లభించెన్‌.

18


సీ.

విను మదియెట్లన మనుజులు నామీఁద
            బిట్టుగఁ జలమూని విజయరామ
ధరణీశుతోఁ జెప్ప దండుగ పన్నెండు
            వేలరూపాయలు వేగఁగొనియె
నిచ్ఛాపురంబులో నేనొక్క లంజతో
            భోగించి నిద్దుర బోవఁ జోరు
లెలమి డేరా జొచ్చి బలువైన గుఱ్ఱంబు
            వెండిపల్లముఁ బదివేల్వరాల.


గీ.

సొమ్ము దొంగిలిపోయిరి సొమ్ముపక్కి
సాటిదేశంబు రాయభూషణుఁడు ద్రొబ్బెఁ
దప్పె భాగ్యంబు నిర్భాగ్యదశ లభించెఁ
దవిలి సత్కృతిఁ గొన పదార్థంబు లేదు.

19


తే.

సత్కృతులు మున్ను రాజు లసంఖ్యగాఁగ
నంది రవియెల్ల జగతి నందంద యణఁగె
ఘనత జగదేకవిఖ్యాతి గలుగదయ్యె
వ్యర్థమయ్యె బదార్థంబు వారిదెల్ల.

20


క.

అపకీర్తియు కీర్తియు భువి
నెపుడుం బోకుండు; గీర్తి కియ్యగవలయున్‌

విపులముగ ధనము; మాకిపు
డుపకారము గాఁగ చెప్పు మొకకృతి సరగన్‌.

21


క.

చెప్పిడుము హాస్యరసముగ
గుప్పున ముందెవరుఁ జెప్పుకొన విననదిగా
నిప్పుడు నాకును నొప్పుల
కుప్పకు నీ చంద్రరేఖకును ముద మొదవన్‌.

22


క.

గంగి సుమీ మును పేరును
భృంగి సుమీ నాట్యకలన పేర్కొన మదుసా
రంగి సుమీ దీనమ్మను
దెంగి సుమీ కామరతుల దిట్టఁడనైతిన్‌.

23


తే.

వారకన్యక యని నీవు కేరవలదు
దీనితో నాకు నేస్తంబు పూనఁ జేసి
కడకమై నాడిమళ్ళ వేంకటమనీషి
దీనితల్లిని విషయించు దృష్టికలన.

24


క.

బోగమువారందఱు న
చ్చో గుంభనమెసఁగ వచ్చిచూడఁగ నతఁడా
యాగాయతనము లో సం
యోగము గావింపఁజేసె నొగి నిర్వురకున్‌.

25


క.

ఆతనికిఁ గూఁతు రగుటన్‌
జాతుర్య మెలర్ప నేర్పె చౌశీతిగతుల్‌
ఖ్యాతిగ నిది నా మదికిన్‌
జేతస్సంజాత సుమని శిఖమై నాటెన్‌.

26


ఉ.

దీని మొగంబుడంబు మఱి దీని విలంబకుచంబు లందమున్‌
దీని ఘనోరుకాండయుగ దీర్ఘవికీర్ణసుకేశపాశమున్‌
దీని మధుప్లుతాధరము దీని మహోన్నతరోమరాజియున్‌
దీని సుబాహుమూలరుచి తెల్లమ నాకెడఁబాయ వెప్పుడున్‌.

27


ఉ.

సానులఁ గూడనో మునుపు చక్కని చిక్కని నిక్కుముక్కు పె
న్యోనులఁ జూడనో కడు సముజ్వల పంకజపత్త్ర విభ్రమా

నూనవిలాసపేశల మనోహరయోనికి సాటి సేయఁగాఁ
గానఁగరాదు వస్తువది కన్నులఁ గట్టిన యట్ల తోఁచెడిన్‌.

29


సీ.

చంద్రబింబస్ఫూర్తిఁ జౌకసేయఁగఁ జాలు
            ముద్దుఁగారెడి నవ్వుమోముతోడ
కలువరేకులడాలు గడకొత్తగాఁ జాలు
            తోరంపు నిడుదకందోయితోడ
కరటికుంభంబులఁ బరిభవింపగఁ జాలు
            కర్కశకుచయుగ్మకంబుతోడ
బంధుజీవముల తోడఁ బ్రతిఘటింపగఁ జాలు
            రాగసంయోగాధరంబుతోడ.


గీ.

సొగసు గులుకంగ నుపరతిఁ జొక్కఁజేసి
కొసరి నా మానసంబెల్లఁ గొల్లలాడి
నన్ను దాసునిగా నేలె నన్నిగతుల
దీని వర్ణింపుమా రసోదీర్ణముగను.

30


క.

ఎన్ని విధంబుల దెంగిన
తన్నదు తిట్టదు వరాలు ధాన్యము సొమ్ముల్‌
సన్నపు కోకలు తెమ్మని
నన్నడుగదు యిట్టి వారనారులు కలరే.

31


క.

భగముబిగి మొగముజిగియును
జిగురాకన్మోవికావిఁ జెప్పఁగఁతదరమా
తగ నన్నును దీనిని గడు
సొగసుగ వర్ణింపవలయు సుకవివతంసా.

32


వ.

అని యత్యంతప్రేమాతిరేకంబున వేఁడిన నే నిట్లంటి.

33


సీ.

ఆది పురోహితులైన దేజోమూర్తు
            లను గతాయులకడ కనిపినావు
సాధు జయంతి మహాదేవు మాన్యంబు
            లెలమి కాసాలంజ కిచ్చినావు
రాయవరంబు మిరాశిదారుల వెళ్ళఁ

            గొట్టి కొంపలఁ బసుల్గట్టినావు
ధర్మాత్ముడును దాతతమ్ముఁడు నగు రాయ
            విభు నిరుద్యోగిఁ గావించినావు.


గీ.

బోయగొల్లాములోఁ గాసు బోకయుండ
వేంకటమనీషి చేత నిరంకుశగతిఁ
గ్రతువు సేయించితివి నీకు గృతి యొనర్ప
నర్హ మగునట్లు జేతు నీలాద్రిరాజ.


వ.

అనినం బ్రహృష్టదుష్టహృదయుండై శిరఃకంపంబు సేయ నేనును బరమానందకందళితమానసారవిందుండ నై వచ్చి యతనికి షష్య్టంతంబు లీ ప్రకారంబునం జెప్పంబూనితి.


క.

నీచాధారునకు మహా
యాచక శుక శాల్మలీ ద్రుమాకారునకున్‌
బ్రాచుర్యవికారునకున్‌
రాచినృపకులాబ్ధిగరళ రససారునకున్‌.


క.

క్రూరునకు సాధుబాధా
చారునకు న్యోనిపానసరశీలునకున్‌
జారునకు విప్రతతిధన
చోరునకున్‌ బుద్ధిహీన శుభరహితునకున్‌.


క.

పరనారీభగచుంబన
పరతంత్రున కఖిలదుష్టపాపాత్మునకున్‌
నిరుపమదుర్గుణశీలికి
ధరలో నీలాద్రిరాజ దౌర్భాగ్యునకున్‌.


క.

అతిమూఢశీలునకు సం
తతమృగయాఖేలునకును దాసీవనితా
వితతరతిలోలునకు ఘన
పతితకుజనపాలునకును బతయాళునకున్‌.


క.

దుర్భరతనునకు రండా
గర్భాపాతనవిధానకౌశలకలనా
విర్భూతాపయశునకున్‌
నిర్భరకలుషాత్మునకును నిర్లజ్జునకున్‌.


క.

ఆవిష్కృతచంద్రీభగ
దేవీపూజావిధాన ధీసారునకున్‌
గేవల రణభీరునకున్‌
భూవలయోద్ధరణ ఘోర భూధారునకున్‌.


క.

వారవధూసారమధూ
ద్గారివదనచుంబనక్రకచభవ దురువ
క్త్రారూఢ రదనునకుఁ గాం
తారాంతరసదనునకు వితతనిధనునకున్‌.


క.

చింతలపాట్యాన్వయతత
కాంతారకుఠారునకును ఘనతరచింతా
క్రాంతునకు నీలధరణీ
కాంతునకు న్వీతసుగుణ గణశాంతునకున్‌.


వ.

అనభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన చంద్రరేఖా
విలాపం బను సత్ప్రబంధరాజంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన.


వ.

మున్ను శ్రీ శివబ్రాహ్మణవర్ణాగ్రగణ్యుం డగు వీరభద్రభట్టారకేంద్రునకు శ్రీ
మద్వైఘానసవంశోత్తంసం బగు నంబి నరసింహాచార్యవర్యుం డిట్లని చెప్పందొడంగె.


సీ.

బహుళనానావిధపశుకళేబరచర్మ
            కంకాళవాలఖురాంకితంబు
మస్తిష్కవల్లూరమాంసఖాదనమోద
            కంకవాయసగృధ్రసంకులంబు
సాంద్రక్షతజబిందుసందోహపరిమళ
            న్మక్షికాక్రిమికీటకాక్షయంబు
పలలాశనానందభరితపరస్పర
            కలహహృత్కౌలేయగవయశివము.


గీ.

మధురతరమదిరాపానమదభరాతి
ఖేలబాలిశచండాలజాలతాడ్య
మానతూర్యనినాదసమన్వితముదు
రాపవనపల్లి బోయగొల్లావుపల్లి.


గీ.

బోయలును గొల్లలును నందుఁ బొందుఁగూడి
యుండుటను బోయగొల్లయై యూరు వెలసె
మఱియుఁ దద్గ్రామమున నొక మాలపెద్ద
చెఱువుఁ ద్రవ్వించె జనుల కచ్చెరువు గాఁగ.


వ.

అంతఁ గొంతకాలంబునకు.


క.

అప్పారావున కొక కృతిఁ
చెప్ప నతం డడఁగ నందుఁ జేరెను వినయం
బొప్పన్‌ వేంకటశాస్త్రులు
గుప్పున నతఁ డాడిమళ్ళకులుఁ డెన్నంగన్‌.


గీ.

వానిఁ బ్రార్థింప నొక పెనుపాకఁ జూప
వాసముగ నందు వసియించి వలనుమీరఁ
గొడుకులును దాను వాఁడిచ్చు కోలుఁ దినుచు
నిడుములకు నోర్చి కాలంబు గడుపుచుండి.


క.

నీలాద్రివిభున కా కృతి
వాలాయము నిచ్చి సిరులు వడయఁగ వలెనం
చాలోల చిత్తమునఁ దా
నాలోచన సేయుచుండె నాత్మజ తోడన్‌.


వ.

అంత.


క.

కటకపు వేంకటసానికి
విటుఁ డగుటను నూజివీడు విడిచి యచటికిన్‌
దటుకునఁ గూఁతుం దోడ్కొని
మటుమాయలు పన్నుకొనుచు మచ్చికఁ జేరెన్‌.


క.

చేరిన దాని నతఁడు గని
కూరిమితోఁ గౌఁగిలించికొని మక్కువ నా
హారాదికంబు లిడుచును
మారక్రీడలఁ జెలంగి మన్నన నునిచెన్‌.


వ.

అది యెట్టిదనిన.


సీ.

పుట్టకాల్‌ సొట్టకేల్‌ వట్టివ్రేలుంజెవుల్‌
            పట్టులే కట్టిట్టు బిట్టు కదలు
మిట్టపండ్లును బెనులొట్టకన్గవయును
            బిట్టులై చుట్టలై నిట్టనిగిడి
దట్టమై బలుకొంగపిట్ట చట్టువలను
            గొట్టంగ సమకట్టినట్టి తెలుపు
రెట్టింప నౌదలఁ బుట్టి చెంపలమీఁద
            నట్టాడు నీఁకలకట్టచుట్ట.


గీ.

తొట్టిపెదవులుఁ దుంపర లుట్టిపడెడు
చట్టికెన యగు నోరును గట్టిలేక
గొట్టుమిట్టాడు బలుజను లుట్టిపడెడు
యోని గలయది వేంకటసాని మఱియు.


సీ.

కల్లు పెల్లుగఁ ద్రావి కాఱుకూఁతలు గూయు
            మాలని నైనను మరులుగొల్పు
కాసువీసంబులు వాసిగా లంకించి
            జుడిఁగి నెల్లాళ్లలో జోగిఁ జేసి
యిల వెళ్ళఁగాఁగొట్టు నెక్కువ తక్కువ
            మాటలాడును వట్టిబూటకములు
వేంకటశాస్త్రుల వేశ్య నెవ్వరితోడ
            నవ్వదంచును జనుల్‌ నమ్మ తిరుగు.


గీ.

కూఁతునకు నెవ్వనిం దెచ్చి కొమరు కన్నె
సాయ మిప్పించి యేరీతిఁ బ్రబలు నట్లు
చేసెదవొ యంచుఁ జెవిలోనఁ జెప్పుచుండు
శాస్త్రిగారికి వేంకటసాని యెపుడు.


క.

ఈసరణిఁ దెలుప నాతం
డా సానిం జూచి పలికె నలివేణి! మదిన్‌
వేసరక తాళి యుండుము
నీ సుతకున్‌ గూర్మిఁ గూర్తు నీలాద్రినృపున్‌.


క.

నా కృతికన్యకకును గన
దాకృతి యీ కన్యకకును నతనిం బతిగా
నీకొనఁ జేసిన మనకున్‌
జేకుఱు భాగ్యం బటంచుఁ జెప్పి రయమునన్‌.


ఉ.

యాగము పేరుచెప్పికొని యర్థము భూప్రజ వేఁడి తెచ్చినన్‌
భోగము సేయవచ్చు నిజపుత్త్రసహోదరదారబంధుసం
యోగము గాఁగ నంచు మది నూహ యొనర్చి యతం డఖండమా
యాగుణదూషితాత్ముఁడయి యచ్చొటు వెల్వడి యెల్లభూములన్‌.


క.

నీచత్వమునకు రోయక
చూచిన నరులెల్ల వేఁడి సుడివడక కడున్‌
యాచనఁ జేసి పదార్థ మ
గోచరముగ సంగ్రహించుకొని వచ్చి వెసన్‌.


ఆ.

మాలవాని చెఱువు మఱువునఁ బందిళ్ళు
సాలలును ఘటించి సంభ్రమమున
యాజకులును బెద్దలైన విప్రులఁ గూర్చి
దీక్షఁ బూని నిజసతియును దాను.


ఆ.

కడఁక దక్షిణాగ్ని గార్హపత్యాహవ
నీయవహ్నులందు నిలిపి మంచి
మేఁకపోతుగముల మెదలకుండ వధించి
వెరవు మీఱ నందు వేల్చుచుండి.


ఆ.

ముఖముఁ జూడ వచ్చు మనుజుల కిష్టిష్టి
గాఁగ నన్నమిడఁడు, గదుముఁడనుచుఁ
గొడుకుతోడఁ దనదు కూఁతుమగనితోడఁ
జెప్ప వారు లోభచిత్తు లగుచు.


క.

కొందఱ కొకింత కూ డిడి
కొందఱకుం గూర లొసఁగి కొందఱ కిడకే
దండన సేయుచు గెంటుచుఁ
గొందఱుఁ దిట్టుచును వెళ్ళఁగొట్టుచుఁ గడఁకన్‌.


సీ.

పుడమిఱేం డ్లంపిన గుడదధిహైయంగ
            వీనముల్‌ లోనిండ్లలోన దాఁచి
కరణంబు లంపిన కంద పెండలములు
            పదిలంబుగా నేలఁ బాఁతివైచి
బ్రాహ్మణు ల్దెచ్చిన బహువిధఫలములు
            లోలోనఁ దనదు చుట్టాల కిచ్చి
కోమట్లు దెచ్చిన గురుతరవస్తువుల్‌
            మెల్లమెల్లనఁ దారె మ్రింగివైచి.


గీ.

పప్పులో నుప్పు మిక్కిలి పాఱఁజల్లి
నేతిలో నాముదమ్మును నిండ నింపి
పులుసులో గంజి మిక్కిలి కలయబోసి
భక్ష్యములలోన మిరియంపుఁ బదడు కలిపి.


తే.

మంచి బూరెలు పొణకల మాటు వెట్టి
పిండిబూరె లొక్కొక్కముక్క పెద్దవారి
విస్తరులలోనఁ బాఱంగ విసరివైచి
కసరికొట్టిన విప్రు లాఁకటను లేచి.


క.

శపియించుచు నెండలచేఁ
దపియించుచు నేఁటి కేమి తాళుఁ డటంచున్‌
జపలస్వాంతుం డీతఁడు
కపటపుయజ్ఞంబు సేయఁ గడఁగె నటంచున్‌.


క.

చప్పట్లు చఱచుకొంచును
ముప్పున నితఁ డేల క్రతువు మొనసి యొనర్చెన్‌
మొప్పెతనంబున, అర్థము
గుప్పున నిక్కపటవృత్తిఁ గూర్చె నటంచున్‌.


తే.

జవ్వనంబున వేంకటసాని యధర
మధువు గ్రోలిన రోఁత వో మదిఁ దలంచి
వృద్ధదశ సోమపాన మివ్విధి నొనర్చెఁ
గాని స్వర్గాపవర్గేచ్ఛఁ గాదు సుండు.


తే.

అనుచు జను లెల్ల నిబ్భంగి నాడుచుండి
రంత వేంకటశాస్త్రి యాగాయతనము
ప్రకటముగఁ జూడఁ జింతలపాటి నీల
నరవరగ్రామణి మనంబునం దలంచి.


క.

బోగము మిడిమేళంబులు
భాగవతులు వేఁటకాండ్రు భషకచయంబుల్‌
మూఁగి తనవెంటఁ గొలువఁగ
వేగంబునఁ దరలి యటఁ బ్రవేశంబయ్యెన్‌.


వ.

ఇట్లు ప్రవేశించి యవ్విప్రపుంగవు దర్శించి యుడుగర లొసంగి శాలాసమీపంబునం
బటకుటీరాభ్యంతరంబున నిలిచి తదీయ క్రతుమంత్రతంత్రప్రయోగప్రధాన
విధానంబు లాలోకించి హాళిం గనుచుండె; నయ్యవసరంబున.


సీ.

విష్ణలోపలి పుచ్చవిత్తులగతిఁ గప్పు
            గల గొగ్గిపండ్ల సింగార మడర
విప్పు గల్గిన పేడకుప్పలోఁ బురువుల
            చొప్పునఁ గొప్పున సుమము లమర
కప్పచిప్పలఁ బొల్సుకండ లూడెడి రీతిఁ
            జీఁకుకన్నులఁ బుసు లేపుమీఱ
నూతిచెంగట వ్రేలు నునుతంబ కాయల
            సరణి పొక్కిలి దండ చన్ను లొప్ప.


గీ.

గడ్డిబొద్దు వలెను మేను గానిపింప
బారకఱ్ఱల తెఱఁగున బాహు లలర
జనకయాగంబుఁ జూడవచ్చెను ద్రికోణ
సాంద్రతరరోమరేఖ యా చంద్రరేఖ.


క.

ఇటు వలె నచటికి వచ్చెడు
విటకంటకిఁ జూచి చిత్తవిభ్రమ మొదవన్‌
దటుకున నీలనృపతి హృ
త్పుటమున సోలుచును దానిఁ బొగడఁదొడంగెన్‌.


క.

జడకుచ్చును మెడహెచ్చును
నడగచ్చును బొచ్చు పెఱిఁగి నలుపగు మేనున్‌
నిడుద లగు తొడల బెడఁగున్‌
గడు వలమగు నడుముఁ గలుగు కలి కిది భళిరా.


క.

నిక్కు పొగపిడుత గదరా
ముక్కు; మొగం బెన్నఁ గోఁతిముఖమున కెనయౌ
బొక్కిలి మొలలో తగు భళి
యక్కజపుం నూనెసిద్దె లౌర కుచంబుల్‌.


తే.

మోవి పీయూష మూరును కేవలముగ
గవ్వదళసరి పండ్లహా! కలికిమేని
మృదువు కోరింతకంపలఁ గదుమఁ జాలు
చెక్కు లలరారు లోహపునక్కు లౌర.


ఆ.

చూపు కాకిచూపు నేపారు కన్నులు
పిల్లికనులఁ గదుమ నుల్లసిల్లు
స్వరము గార్దభమును పరిహసింపఁగఁ జాలు
మదనసదన మెల్ల మంగలంబు.


క.

ఈ నీటుసాని నెచ్చటఁ
గానము గద మున్ను; నేడుఁ గట్టిగ దీనిన్‌
బోనీక రతి గలంపక
యే నేక్రియఁ దాళువాఁడ నిఁక నిచ్చోటన్‌.


క.

భషకకపిచటకగార్దభ
వృషభాదికబంధగతుల వేమఱు దీనిన్‌
విషయింపక నేలాగున
విషమశరుశరాళి బాధ వీడునె నాకున్‌.

సీ.

బాలరండలఁ బదివేల మరుల్గొల్పి
            కోర్కె దీరఁగ మున్ను గూడినాఁడ
మగవాండ్రఁ బెక్కండ్ర మచ్చిక ల్గావించి
            కొంచక రతులఁ జొక్కించినాఁడ
దాసికాజనులకుఁ గాసువీసం బీక
            వెసఁ గొల్లవంపులు వెట్టినాఁడ
సానిబోగమువాండ్రఁ జనవుబల్మినిఁ బట్టి
            పలుమాఱు రతికేళి గలసినాఁడ.


గీ.

కాని యీసోయగమును నీ కలికి మీఁది
ప్రేమమును పెఱచోట లభింపలేదు
మరుని మాయావికారమో మగువ మచ్చు
మందు చల్లెనో నామది మందగించె.

81


క.

ఈ మాపీ యింతిని నా
కామాతురత మెల్లఁ దీఱ గాఢతరమహా
స్తోమాయత ఖరబంధో
ద్దామత మెఱయంగ దెంగెదను వల పాఱన్‌.

82


జా.

పుణ్యంబేదిన నేదనీ, జనులు గుంపుల్గూడి కా దంచుఁ గా
ర్పణ్యప్రక్రియఁ దెల్పినం దెలుపనీ, రాజు ల్మహాదుర్గుణా
గణ్యుం డంచును బల్కినం బలుకనీ, కౌతూహలం బొప్ప నీ
పణ్యస్త్రీమధురాధరోదితసుధాపానంబు గావించెదన్‌.

83


ఉ.

చెక్కిలి నొక్కి ముద్దుఁగొని చిక్కని చక్కని గుబ్బచన్నులం
దొక్కట గోరులుంచి జిగియూరువు లంటుచు గోర్కెఁదీరఁగాఁ
గుక్కుటబంధవైఖరులఁ గూడినఁగాక మనోజుధాటిచే
నిక్కడ నిల్వఁగాఁదరమె యించుకయున్‌ బెఱమాట లేటికిన్‌.

84


క.

అని యనివారితమోహము
మనమునఁ బెనఁగొనఁగ నతఁడు మఱిమఱి చూడన్‌
వనితయు నాతనిఁ దప్పక
కనుఁగొని యనురాగ మొదవఁ గడఁక నుతించెన్‌.

85

సీ.

పరువంపుఁ బ్రాయంపుఁ దురకబిడ్డనిఁ రీతి
            మట్టుమీఱఁగఁ బాగఁ జుట్టినాడు
కులుకుజవ్వనపు బల్గుజరాతిపాపని
            వీలుగాఁ బ్రోగులు వెట్టినాడు
ఆఁడుభాగవతుని జాడగడ్డము మూతి
            నున్నగా గొఱిగించుకొన్న వాఁడు
డుబుడక్కకొమరుఁడు డుంక నిజారును
            బుడమి జీరెడి నగ ల్దొడిగినాడు.


గీ.

మడుఁగులోఁ బడ్డ మహిషంబుమాడ్కి మేన
నందముగ మంచిగంద మలందినాడు
భళిర యీ నీలనృపతితోఁ గలయఁ గలుగు
బాలికామణిదే కదా భాగ్య మరయ.

86


క.

ఖరఘృష్ణిసదృశతేజుఁడు
పరమాత్మజతుల్యరూపశాలి సుభగభా
సురవదనుఁడు హరిసన్నిభ
గురుతరగుణుఁ డిట్టి రాచకొమరుఁడు గలఁడే.

87


ఆ.

గుహ్యకేశతుల్యగురువైభవుండు పీ
నోరుశాలి సమరభీరుఁ డుర్వి
జనుల నమలుబుద్ధిఁ జనువాఁ డితనిఁ దేఱి
వాసుదేవుఁ డెట్లు చేసెనొక్కొ.

88


క.

ఆ వాలుఁగన్ను లందము
పీవరభుజదండములును బృథుగండములున్‌
గేవలశోభాతనుఁ డీ
భూవరుఁ డర్మిలిని నాకు బొజుఁగగు నొక్కో.

89


సీ.

బూరుగు పెనుమ్రాను పొడవు, గానుఁగఱోటి
            వలయదేహము, దాకవంటి నోరు
పెనురసపుం బొల్లిపెదవులు, వలమైన
            బుఱ్ఱముక్కును, గ్రొత్త బోడిగడ్డ

మల జ్యేష్టకిరవగు వెళుపుమొగంబును,
            బొడకంత తలకాయ, కుడితిగూనఁ
బోలెడు బొజ్జయుఁ, బొలసుకన్నులు, లావు
            నడుము, రా పాడెడు నడుగు లౌర.


గీ.

పెద్దయేనుఁగుకా లంత కద్దుశిశ్న
మిట్టి సౌందర్యనిధి భువిఁ బుట్టఁ జేసి
నట్టి తామరపట్టి నే ర్పరయఁ దరమె
చాలఁ జదివిన వేంకటశాస్త్రికైన.

90


క.

నా పూర్వపుణ్యఫలమున
నీ పురుషునితోడ నేస్త మెనసినఁ గూర్మిన్‌
రే పిచ్చెద మా పిచ్చెదఁ
గాపట్యము లేని నిండు కౌఁగి లితనికిన్‌.

91


చ.

జడ కటిసీమ దూల, నిడుజన్నులు ఱొమ్మున వ్రేల, గొప్పు వె
న్నడరుచుఁ జిందులాడఁ, బురుషాయితబంధకళాప్రవీణతన్‌
జెడుగుడు లాడి వీని ఘనశిశ్నపటుత్వమహత్వ మెన్నుచున్‌
విడువక వీనిఁ గూడి మది వెఱ్ఱి దగుల్కొన జేయు టెన్నఁడో.

92


సీ.

కూఁతుబుడమ, మర్లమాతంగియాకును
            మూత్రంబుతో నూరి ముద్దఁ జేసి
పచ్చిపసుపుతోడ బాగుగా మర్దించి
            నూనెతోడను కూర్చి మేన నలుగు
వెట్టిన నుమ్మెత్తవిత్తులు గుండెత
            ల్లడపాకు పసరు నుల్లాసమునను
గాల్మడిఁ గలిపి పోకలు దానిలోపల
            నానించి యెండించి లోని కిముడ.


గీ.

వీడియముతోడఁ బెట్టిన విడువ కితఁడు
బంటు తెఱఁగున నా వెనువెంటఁ దిరుగు
నట్లు సేయఁగ నతఁ డెన్న డబ్బు నొక్కొ
మెల్లమెల్లగఁ గలధనంబెల్ల దొబ్బ.

93

క.

కొందఱు మలయుక్తముగా
మం దిడుదురు మరులుకొనఁగ మా వారసతుల్‌
మందతఁ జెందును విటుఁ డటు
నింద గదా యటుల సేయ నృపవర్యునకున్‌.

94


క.

ఏలాగు మాట లాడుదు
నేలాగున మరులు కొలిపి యెలయింతును నే
నేలాగు లోలుఁజేయుదు
నేలాగునఁ గలుగు విత్త మెల్ల హరింతున్‌.

95


క.

అని చాల జాలినొందుచుఁ
జనుగుబ్బలఁ బైఁట జార్చి చక్కఁగ నొత్తున్‌
మొనవాఁడిచూపుఁ జూచును
బెనుకొ ప్పటు జాఱఁజేసి బిఱబిఱ ముడుచున్‌.

96


తే.

ఆవ ద్రావిన పసరమ ట్లది మెలంగఁ
జూచి నీలాద్రిభూపతి సొమ్మసిల్లి
మెల్లమెల్లన తెలివొంది కల్లు ద్రావి
పరవశత నొందు చండాలు పగిదిఁ దోఁచి.

97


సీ.

వలఁ బడ్డ మీను కైవడి, నిప్పుఁ ద్రొక్కిన
            కోఁతి భాతిని, వెఱ్ఱిగొన్న కుక్క
పద్ధతి, గుడితిలోఁ బడిన మూషిక మట్లు,
            శ్లేష్మంబులో నీఁగ లీల, సన్ని
పాతి చందంబున, వాతంపుగొడ్డు వి
            ధంబున, లాహిరీదళము మిగులఁ
తినిన పాశ్చాత్యుని తీరున, నురి వడ్డ
            పక్షి కైవడిఁ, బెనుపాము పగిది


గీ.

భూత మూనిన మనుజుని పోల్కిఁ, బెట్టు
మందు మెసవిన మాన్యు మాడ్కి, దేహ
మెఱుఁగ కెంతయుఁ గళవళం బెసఁగ దాని
పైఁ దలం పిడి కన్ను మోడ్పక యతండు.

98

క.

తలనొప్పియుఁ దాపజ్వర
మలసటయును మిగులఁ బొడమ నసురసు రనుచున్‌
నిలువంగ బలము చాలక
తలిమముపై వ్రాలి దానిఁ దలచుచు నుండెన్‌.

99


క.

అని నంబి నారసింహుం
డనువొప్పఁగ నిట్లు చెప్ప నా తంబళి వీ
రన యావలికథ లెస్సగ
వినయంబునఁ జెప్పు మనుచు వెస వేఁడుటయున్‌.

100


ఉ.

నీచచరిత్ర! వారరమణీభగరుక్తతగాత్ర! నిత్యదు
ర్యాచకమిత్ర! సజ్జనపదార్థపరిగ్రహణైకసూత్ర! దు
ష్కాచపిశంగనేత్ర! నృపకర్మమహాలతికాలవిత్ర! శ్రీ
రాచినృపాలగోత్రవనరాశికసద్బడబాగ్నిహోత్రమా.

101


భుజంగప్రయాతము.

దురాలాపదుర్దోషదుర్మార్గవర్తీ!
ధరామండలఖ్యాతధౌర్య్తాపకీర్తీ!
పరస్త్రీరతాసక్తభావప్రపూర్తీ!
స్థిరాయుస్స్థిరాజాతదీర్ఘోగ్రమూర్తీ!

102


గద్యం.

ఇది శ్రీమజ్జగన్నాథదేవకరుణాకటాక్షవీక్షణానుక్షణసంలబ్ధసరస
కవితావిచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచి
కులపవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూనసమాననానావిధరంగ
త్రిలింగదేశభాషావిశేషభూషితాశేషకవితావిలాసభాసురాఖర్వసర్వల
క్షణసారసంగ్రహోద్దామ శుద్ధాంధ్రరామాయణప్రముఖబహుళ
ప్రబంధనిబంధనబంధురవిధాన నవీనశబ్దశాశనబిరుదాభిరామ తిమ్మకవి
సార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథ
నామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపం బను హాస్యరసప్రబంధ
రాజంబునం బ్రథమాశ్వాసంబు.

సంపూర్ణము