చంద్రరేఖావిలాపము/చుక్కాని

వికీసోర్స్ నుండి

చుక్కాని

ధనార్జనార్థమును బాండిత్యప్రకటనార్థమును బహుదేశాటనముం జేసి రాజసంస్థానములలో సత్కారముల నంది కీర్తిశేషుఁ డైన కూచిమంచి జగ్గకవి యొకప్పుడు విజయనగరమునకుఁ జని విజయనగరసంస్థానాధిపతు లగు శ్రీ పూసపాటి విజయరామరాజుగారి చెల్లెలి పెనిమిటి యగు చింతలపాటి నీలాద్రిరాజు నాశ్రయింపఁగా నాతఁడు తా నుంచుకొనిన వేశ్యను నాయిఁకఁగా జేసి తనమీఁద ప్రబంధము రచింపు మని కోరఁగా జగ్గకవి యందుట కియ్యకొని చంద్రరేఖావిలాస మను శృంగారకావ్యమును రచించుటయు నంతలో నాడిమళ్ళ వేంకటశాస్త్రి సంస్కృతకావ్య మొండు రచించి యిచ్చెద నని చెప్పి జగ్గకవి కావ్యమును నిరసించులటులఁ బ్రోత్సాహించి నీలాద్రిరాజు మతిని మరలించుట వలన నా నీలాద్రిరాజు జగ్గకవికిఁ దగిన బహుమాన మిచ్చి సత్కరింపక తిరస్కారమును గనఁబరచుటయు నందువలన జగ్గకవి తాను రచియించిన చంద్రరేఖావిలాసమును చింపివైచి చంద్రరేఖావిలాపం బను నీ హాస్యరసప్రబంధమును రచించుటయు దటస్థమైనది. అనంతర మీ జగ్గకవి హైదరాబాదునకుఁ బోయి తురకదొరల నాశ్రయించి వారికిఁ దన పాండత్యప్రతిభను జూపి వారి దయను సంపాదించి వారి సామంతరాజ్య మైన విజయనగరమునకుఁ బ్రభుఁడగు శ్రీ విజయరామరాజుగారివద్దకుఁ దన గ్రంథమును నీలాద్రిరాజు సమ్ముఖంబున సభలోఁ జదివించునటుల నవాబుగారివద్దనుండి ఫర్మానా తెచ్చి య ట్లొనర్చె నని జనశ్రుతి గలదు.

ఈ జగ్గకవి యిరువది సంవత్సరములు వచ్చునంతదనుక చదు వెఱుఁగక పలుగాకివలెఁ దిరుగుచుఁ గాలము గడుపుచుండె ననియు, కందరాడవాస్తవ్యుఁ డై బహుళప్రబంధకర్త యై పీఠికాపురప్రభు వగు రావు నీలాద్రిమాధవరాయరాజశిఖామణిచే కవిసార్వభౌమబిరుద మంది సుప్రసిద్ధకీర్తి గాంచిన తిమ్మకవి యీతని కగ్రజుం డగుటవలన నవిభక్తకుటుంబగౌరవమున జగ్గకవికి వివాహ మాయె ననియు, ననంతరము జగ్గకవి మనుగుడుపుల కేఁగియున్నపు డతని ప్రవర్తనమును జూచి పరమశుంఠ యగు నల్లుఁడు దొరికినందులకు జగ్గకవిమామగా రనుతాపబడి తన మిత్త్రులతో “నా తొమ్మండ్రు కూఁతులను గుక్కలను జంపుకొని తిను కొయ్యలకే యిచ్చితిని” అని యనెననియు, నందుపై జగ్గకవి మామగారి మాటలకు రోషము తెచ్చుకొని దేశాంతర్గతుండై మంగళగిరి కరిగి వేంకటాచార్యులను సుప్రసిద్ధపండితునియొద్దం జేరి యాతని నాశ్రయించి విద్యాభ్యాస మొనర్చి పది పండ్రెండేండ్లలలోఁ బండితుండై యనర్గళముగా కవిత్వము చెప్పనారంభించెనని పుక్కిటపురాణముగాఁ జెప్పికొందురే గాని కేవల మిక్కధ కల్పితమని తోఁపకమానదు. ఈకథయే నిక్కమగుచో జగ్గకవి కవిత్వము చెప్పనారంభించునప్పటికి ముప్పది రెండు సంవత్సరముల ప్రాయమై యుండవలెనుగదా! కూచిమంచి తిమ్మకవి తాను ముప్పదిసంవత్సరముల వయస్సుననే రచింప నారంభించిన “సింహాచలమహాత్యము”నఁ దన పెద్దతమ్ముఁడైన సింగన్నను వర్ణించిన తరువాత రెండవతమ్ముఁడైన యీ జగ్గకవినిగూర్చి యిట్లు వ్రాసియుండెను.

క. అతని యనుజన్ముఁ డతులిత
       మతియుతుఁడు, సమస్తరాజమాన్యుఁడు, సుగుణా
       న్వితుఁడు, సమంచితకవితా
       చతురుఁడు, జగ్గప్రధాని చంద్రుఁడు తనరున్.
క. భోటకలాటకిరాటవ
       రాటమరాటాంగవంగరాజన్యసభా
       ఝాటనిరాఘాటనట
       చ్చాటుకవిత్వాంకుఁ డరయ జగ్గన ధరణిన్.
సీ. నిరతంబు నుడి వోని సిరి నిర వొందియుఁ
                         దవుటినిప్పటి మెక్కఁ దలఁపఁ డేని

       సదమలాచారప్రశస్తి గాంచియు వర్ణ
                          ములు సంకరంబుగాఁ గలఁపఁ డేని
       ఖలజనసంశిక్ష గావింపుచుండియుఁ
                         బతితుల నెపుడుఁ జేపట్టఁ డేని
       యురుపుణ్యవర్తి యయ్యును బాడబాశ్రయ
                         సీమ నిల్లుగను వసింపఁ డేని.
గీ. యల జగన్నాయకుఁడు సాటి యనఁగఁబోలు
       భోగమున నిర్మలాచారమున విశిష్ట
       రక్షణంబునఁ బుణ్యమార్గమున నరయ
       గంగనామాత్యు జగ్గయ ఘనునితోడ.

ఈ పద్యములు రచియింపఁబడిన కాలమునకు జగ్గకవి కించుమించుగా నిరువదియైదు సంవత్సరముల ప్రాయమై యుండును. ఇరువదియైదు సంవత్సరముల ప్రాయమునాఁటి కన్నిదేశములు దిరిగి రాజసభలలో బ్రఖ్యాతి గాంచఁగల్గుటకు కవి యిరువదియేండ్ల వయస్సునకు ముందే పండితుండయి కవనచాతురి గలవాఁడయి యుండవలెను. అందువలన జగ్గకవి యిరువదిసంవత్సరముల ప్రాయము వచ్చువఱకును నక్షరజ్ఞానములేనివాఁ డని చెప్పెడిమాటలు నమ్మందగినవి కావు. ఈ జగ్గకవి తనయన్న యగు తిమ్మకవి జీవించినంతకాలము జీవించియున్నటుల కనఁబడుచున్నది గా 1700 సంవత్సరప్రాంతముమొదలు 1760వ సంవత్సరమువఱకును జీవించియుండెనని తేలుచున్నది.

మఱియు నీ జగ్గకవి చంద్రరేఖావిలాపపీఠికయందు “రచయించితిని” అను పద్యమునందు తాను రచించిన గ్రంథములను బేర్కొనియుండెను. అవిగాక మఱికొన్ని గ్రంథములనుగూడ రచియించినటు లతని మనుమనిమనుమఁ డగు వేంకటరాయకవి రచితమైన నీ సీసమువలనఁ దెలియుచున్నది.

సీ. ప్రతిభ మై జానకీపరిణయంబున నర్మ
                          దాపరిణయము రాధాకథాసు

       ధానిధానము ద్విపదయు సుభద్రాపరి
                         ణయము నుమాసంహితయును దండ
       కములును బహుశతకములును గీతప్ర
                         బంధముల్ ఖడ్గాదిబంధములును
       గద్యలు రగడలు ఘనతరమంజరుల్
                         బహుసువృత్తంబులు భాసురముగఁ.
గీ. జెప్పి శ్రీ పురుషోత్తమక్షేత్రపతికి
       శ్రీ జగన్నాయకులకు నర్చించి మించె
       ధైర్యగాంభీర్యచాతుర్యశౌర్యముఖస
       మిద్ధగుణపాళి జగ్గకవీంద్రమౌళి.

ఇతఁ డిన్నిగ్రంథములను రచించినను బూర్వప్రబంధమార్గమునే త్రొక్కియుండెను. గావున సర్వసాధారణకవిగా నెన్నఁబడెడివాఁడె గాని మానవవ్యవహారములను బ్రదర్శించు పాత్రలను జిత్రించుచు హృదయంగముగానుండి హాస్యరసప్రబంధరాజం బనందగు నీ చంద్రరేఖావిలాపమును రచించుటవలన నీతని యసాధారణప్రజ్ఞయు, నపూర్వకల్పనాశక్తియు, నాత్మగౌరవపురస్సరమగు పౌరుషాతిశయమును, వేయినోళ్ళ నుద్ఘాటింపఁజాలు శాశ్వతకీర్తికిఁ గారణమైనది.

క్షీరసముద్రమువంటి యీ గ్రంథరాజమును బూఁతులతో బూరించుటవలన నీ యిరువదవ శతాబ్దమున గర్హింపబఁడుచుండుట కేవలము కాలముయొక్క దోష మనవచ్చును.

పూర్వకాలమున బూఁతును నిప్పటివలె దోషముగాఁ బరిగణింపక గుణముగాఁ బరిగణించినటులఁ గానవచ్చుచున్నది. కావుననే జగ్గకవి “బూఁతులన్ బూర్ణుఁడ” వని ప్రభువు తన్ను నుతించినటుల వ్రాసుకొనెను. మఱియు సుప్రసిద్ధకవులగు కాళిదాసు డిండిమాదులంతవారు సైతము సంస్కృతమునఁ దమ ప్రహసనములను బూఁతులతోఁ బూరించిరి. ప్రతాపరుద్రీయాదులందలి హాస్యరస లక్షణములు బూఁతులతోడనే బూరింపఁబడినవి. ఇవిగాక యాంధ్రమున –.

క. నీతుల కేమి యొకించుక
       బూఁతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
       నీతులు బూఁతులు లోక
       ఖ్యాతులురా కుందవరపుఁ గవి చౌడప్పా.
క. పదినీతులు పదిబూఁతులు
       పదిశృంగారములు గల్గు పద్యములు సభం
       జదివినవాఁడే యధికుఁడు
       గదరప్పా కుందవరపుఁ గవి చౌడప్పా.
క. బూఁ తని నగుదురు తమతమ
       తాతలు ముత్తాతమొదలు తరతరములవా
       రే తీరున బూఁ తెఱిగిరి
       ఖ్యాతిగ మఱి కుందవరపుఁ గవి చౌడప్పా.

ప్రాచీనకవులు హాస్యరసపోషణమునకు బూఁతులే ప్రధాములని యూహించిరో? నీతిబాహ్యప్రవర్తనములయెడ రోఁత పుట్టించుట కవి ముఖ్యములని యెంచిరో? రాజ్యసంక్షోభాదులవలన నీతుల చెడిన తమకాలమునాఁటి జనతాస్థితిని కావ్యదర్పణములం బ్రతిఫలింపఁజేసిరో? గాని యాంగ్లమునఁ గూడ హోమరు వర్జిలు వికటకవిత్వపుపోకడ లిట్లే యుండునని బ్రౌనుదొరగారే వ్రాసిరి.

సంపూర్ణవికటకవితామహత్వమునం జేసి నిరుపమానమై యపూర్వకల్పనాశిల్పవైదుషీమనోహరమై ధారాళమై నీతిబోధకమైన యీహాస్యరసప్రబంధరాజ మజ్ఞాతవాసము పాలు గాకుండ కళాపోషణమునకైనను సురక్షితముగా దాచి యుంచవలె నని మాయుద్దేశము.

మఱియు నాకాలపు బ్రాహ్మణులయొక్కయు కవులయొక్క నవినీతులను దెల్పుచు, సాంఘికకల్లోలములను వెలిబుచ్చుచు సాంఘికపరిస్థితులను విపులీకరించుచు, వ్యభిచారమునం దసహ్యత గలిగించుచు, రాఁబోవు చరిత్రకారుల కుపయోగకరమగు నీ కావ్యపు వ్రాఁతప్రతులు దేశమంతటను బ్రబలియున్నను గొంతకాలమునకు నశించు నను తలంపుతో నీకామగ్రంథమాలలో రెండవగ్రంథముగా బ్రకటించి చందాదారులకు నందున ట్లొనర్చుచుంటిమి. కావున చందాదారు లెల్లరు దీనిని భద్రపరుతురని తలంచుచున్నారము.

సంస్కృతమున గల కాళిదాస ప్రహసనమును హాస్యకళానిధి యని మావలన బిరుదము నందిన నవీనకవివరుం డొక్క రాంధ్రమున ననువదించి "లంబోదరప్రహసన"మని నామకరణ మొనర్చి మాకుఁ బంపిరి. కావున కాళిదాసకృతమగు సంస్కృత ప్రహసన మొకప్రక్కను యాంధ్రమున ననువదింపఁబడిన "లంబోదర ప్రహసన" మొకప్రక్కను ముద్రించి యచిరకాలముననే కామగ్రంథమాలయొక్క మూఁడవగ్రంథముగాఁ బ్రకటించి చందాదారుల కెల్లరకుఁ బంపగలమని మనవి సేయుచున్నారము.

ఇట్లు

పుదుచ్చేరి

యస్. చిన్నయ్య

10-6-22

సంపాదకుఁడు

"కామగ్రంథమాల"