గోన గన్నారెడ్డి/షష్ఠగాథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

షష్ఠ గాథ

గజదొంగ

1

గన్నారెడ్డికి ఇప్పుడు ఇరువదినాల్గవయేడు జరుగుతున్నది. అతనికన్న రెండేళ్ళు చిన్న విఠలధరణీశుడు. గన్నారెడ్డి ఆరడుగుల పొడవు, కోలమోము, వెడదఫాలం, తుమ్మెదరెక్కలవంటి చిన్న కోరమీసాలు.

విఠలధరణీశుడు ఏనుగుగున్న. ఆతని బలం భీమబలం. అతడు ఎంత పెద్ద బండరాయినైనా బంతివలె ఎత్తి ఆవలకు గిరవాటు వేయగలడు. ఏనుగులతో కుస్తీ పట్టగలడు. సింహాలతో, పెద్దపులులతో నిరాయుధుడై యుద్ధంచేసి, చిన్న గాయమైనా లేకుండా వాని ప్రాణాలు హరింపగలడు; ఆతని దండలు చిన్న మద్దిచెట్టుల మొదళ్ళవలె ఉంటాయి; ఆతని ఛాతీ ఒక కొండచరియయే. ఆతడు వేళాకోళంగా వీపుమీద చరిస్తే స్నేహితులు కూలబడి మూడు పల్టీలు వేస్తారు.

గన్నారెడ్డికి విఠలధరణీశుడు కుడిచేయి అయితే, అయిదడుగుల పది అంగుళాలున్న సూరనరెడ్డి అనే యువకుడు ఎడమచేయి. సూరనరెడ్డి దేహం ఒక చిన్న కొండే. అతన్ని శూలంతో పొడిస్తే చీమ కుట్టిం దనుకుంటాడు. శూరులు అతనికి ప్రత్యర్థులుగా ఎదుట పడడం అంటే వణకిపోతారు. మనుష్యుల్ని, గుఱ్ఱాల్ని, ఏనుగుల్ని, రథాల్ని సునాయాసంగా ఎత్తి నేలనేసి కొట్టడం అంటే అతనికి మహాప్రీతి.

సూరనరెడ్డీ, విఠలుడూ మల్ల యుద్ధంచేస్తే రెండు కొండలు, రెండు భూగోళాలు ఢీకొన్నట్టే! ఇద్దరూ పెద్ద ఇనుపగదలతో యుద్ధం చేయడమంటే ఎంతో ముచ్చట పడతారు. కాని వీ రిరువురికన్నా సన్నగా ఉన్నా సింహవిక్రముడైన గన్నారెడ్డితో వారు మల్ల యుద్ధానికి తలపడరు. గన్నారెడ్డి పట్టుకు దొరకడు. ఆతని మాయలు ఒరు లెరుగరు.

గన్నారెడ్డికి ఇరవై ఒకటవ సంవత్సరం జరుగుతూఉన్న సమయంలో రాజవంశాలలోని యువకులు మూడువందల నలభై మందితో కలిసి ఓరుగల్లు వీడి అడవుల బడ్డాడు. తమ తమ మండలాలనుంచీ, విషయాలనుంచీ నాడులనుంచీ ఆ యా యువవీరులు దిట్టరులైన సైనికుల్ని సేకరించుకొన్నారు.

“మే మందరం గజదొంగలం, శ్రీ శ్రీ గణపతిదేవ చక్రవర్తి వృద్ధులై, రాజ్యభారం వహించలేని స్థితిలో, ఈ దేశంలో అరాచకం వచ్చింది కాబట్టి మేము మా ఇష్టంవచ్చినట్లు దేశాలను దోచుకుంటాము. అధర్మంలో అధర్మ మౌతాము. రాక్షసులలో రాక్షసులమైతాము” అని శివదేవయ్య మంత్రికి కమ్మ వ్రాసి, వాండ్లు అడవులదారి పట్టినారు.

ఆ దినం ఓరుగల్లు దద్దరిల్లింది. కాకతీయవంశానికి భక్తులై, చక్రవర్తులకై తమ ప్రాణాలూ, తమ సర్వస్వమూ సమర్పించడానికి సిద్ధంగా ఉన్న మాండలికుల పుత్రు లెంతమందో ఆ గజదొంగల జట్టులో చేరారు. రేచెర్ల వారి బిడ్డ లెందరో అందులో చేరారు. మాల్యాల చౌండ్యసేనాని మనుమ డా జట్టులో చేరాడు. విర్యాలవారి బిడ్డలు చేరినారు.

ఈగజదొంగలజట్టుకు సర్వసేనాని గోనగన్నారెడ్డి, అతనిమాట ఆయువకులకు దేవాజ్ఞ. ఆతడంటే ప్రాణాలు విడుస్తారు. అతడు నిప్పులో దూకమంటే దూకుతారు. పెద్దపులిచెవులు పట్టుకొని లాక్కురమ్మంటే లాక్కువస్తారు.

గన్నారెడ్డి తాను గజదొంగల నాయకుడు కాకముందే శ్రీశైలానికి పడమరగా ఉండు నల్లమల అడవులలో, భయంకర ప్రదేశంలో పాడుపడిన పట్టణం ఒకటి చూచాడు. ఆ పట్టణం ఆంధ్ర శాతవాహన చక్రవర్తులనాటిది. నాగార్జున పర్వతలోయలో ఉన్న ఇక్ష్వాకుపట్టణమైన విజయపురంవలె ఈ నగరము ఆ పూర్వ కాలంలో మహోత్తమదశను అనుభవించింది. శాతవాహన రాజ్యాలు అడుగంటిన వెనుక పల్నాటిరాజులైన పల్లవులు విజృంభించినారు. ఆ దినాలలో ఈ నగరం పాలించే ఆంధ్రభృత్యుడైన ఒక శాతకర్ణి పల్లవులను ఎదిరించి ఆరేండ్లు పెక్కు యుద్ధాలలో ఓడించాడు. చివరకు పల్లవులచే ఓడిపోయారు. పల్లవు లా నగరమును నాశనంచేశారు. ఇరవై ఏళ్ళలో ఆ నగరాన్ని భయంకరరారణ్యం కబళించి వేసింది.

ఈ నగరం చుట్టూ, ఇక్ష్వాకుల విజయపురిచుట్టూ ఉండే కొండలకన్న ఎత్తయిన కొండ లున్నాయి. ఆ లోయలోనికి ఒక్కటేదారి. అది కృష్ణఒడ్డునుండే ఉన్నది. శ్రీశైల పర్వతప్రాంతాల కృష్ణానది కొండల దొలచుకొనిపోయి పాతాళ గంగలా ప్రవహిస్తున్నది. శ్రీశైలానికి పన్నెండుమైళ్ళ ఎగువలో కృష్ణకు తాకి ఉన్న ఒక కొండ రెండువందల బాహువుల ఎత్తు ఉంటుంది. (1 బాహువు = ఈనాటి 2 గజాలు) ఆ కొండప్రక్క ప్రదేశంఅంతా అడవితో నిండి ఉంది. ఆ అడవిలో ఒక విచిత్రమైనదారి ఉంది. తెలియనివారు ఆ దారిని ఒక సంవత్సరం పాడుపడినా కనుగొనలేరు.

ఆ పాడుపడిన నగరంలోని ఇళ్ళు, మేడలు గన్నారెడ్డి బాగు చేయించాడు. కూలిపోయిన కోటగోడలు మళ్ళీ యధా ప్రకారంగా కట్టించినాడు. అయినా ఆ గోడలమీద అడవితీగెలు, గుబురుచెట్లు ఇంకను పెంచినారు. పైకిచూస్తే పాడుపడి, మొక్కలతో నిండి ఉన్నట్టుంటుంది. కాని మేడలూ, నగరాలూ చక్కగా యథారీతి బాగుచేయించినాడు గన్నారెడ్డి. ప్రతిగృహమూ, అలాగే ఉన్నది. పైన పాడు, లోన సౌందర్యము. ఆ కోట బాగుచేయించే సమయంలో గన్నారెడ్డికి నాలుగునిధులు దొరికాయి. ఒక నిధిలో వెండి బంగారు నాణెములు కొన్నిలక్ష లున్నవి. ఇంకొక నిధిలో నవరత్నఖచిత సువర్ణాభరణాలు వేలకువే లున్నవి. ఒక చోట పూర్వకాలపు ఆయుధాగారము కాబోలు! దానినిండా పూర్వకాలపు ఆయుధాలు తుప్పుపట్టినవి, తుప్పుపట్టక ఇప్పటికీ సరియైన స్థితిలో ఉన్నవి దొరికినవి. నాల్గవనిధిలో రాగి కడ్డీలు, సీసపుకడ్డీలు, ముక్కలు, ముద్దలు, వెండి ఇటుకలు ఇరవై ముప్పదిబళ్ళ వస్తువులు బయల్పడినాయి.

గోన గన్నారెడ్డికి ఇట్లు మూలధనం దొరికింది. సైన్యాలతో పోయి చిన్న సామంతులకు కొద్దికొద్ది పన్నులు విధించి ధాన్యాలు, ధనాలు సేకరిస్తున్నాడు. ఈతడు దాగుకొని ఉన్న ఆ పాడుపట్టణం చుట్టుప్రక్కల ఉన్న రైతులు కూరగాయలను పండించి అతని సైన్యాలకు అందిస్తున్నారు. వారి కాతడు ఎక్కువ మూల్యం అందిచ్చేవాడు.

ఆ రహస్యదుర్గానికి చుట్టూఉన్న చెంచులూ, బోయలూ, గోన గన్నారెడ్డి సైన్యానికి ఉపసైన్యాలుగా ఉంటూ ఆ దుర్గరహస్యం లోకానికి ఎవ్వరికీ తెలియకుండా కాపాడుతున్నారు. ఆ పరిసరాల ఎక్కడో గన్నారెడ్డి దుర్గము ఉందని మాత్రం అందరికీ తెలియును. కాని అది ఎక్కడో ఎవ్వరికీ తెలియదు.

2

ఆ రహస్యదుర్గంలో గన్నారెడ్డీ, అతని సహచరులూ సర్వకాలం మల్లయుద్ధాలలో శిక్షణ పొందుతూ ఉంటారు. గన్నారెడ్డి వారికి యుద్ధవిధానాలు అనేకం నేర్పుతూ ఉంటాడు, సైనికు లనేకులు భార్యలను, ప్రియురాండ్రను, తల్లులను తెచ్చుకొన్నారు. ఒక్కొక్కప్పుడు సైనికుల వినోదార్థము తోలుబొమ్మలు, యక్షగానాలు, జక్కులకథలు, పల్నాటి వీరగాధలవంటి బుర్రకథలు, పురాణ శ్రవణము, సంగీతసభలు, విద్యావ్యాసంగము, నాట్యసభలు ఆ రహస్య దుర్గంలో జరుగుతూ ఉంటాయి.

గన్నారెడ్డి మంత్రులలో దిట్టమైన ఆరువేల నియోగి బ్రాహ్మణ బాలకులున్నారు. ఆ బాలకులలో మేటి సోమయామాత్య కుమారుడైన చినఅక్కినమంత్రి. ఈ అక్కిన శివదేవయ్యమంత్రి శిష్యుడు. రాజనీతి తన దేశికునికడ సంపూర్ణంగా గ్రహించి ఆ చిన్న తనంలోనే పెద్దరాజ్యరధపు పగ్గాలను దృఢముష్టితో పట్టుకున్నాడు.

గన్నారెడ్డి చినఅక్కినమంత్రిని తనకు ముఖ్యమంత్రిగా, అపసర్ప విద్యాపరిశోధకుడుగా ఏర్పరచాడు. అపసర్పనాయకుడు సబ్బప్ప ఆ విద్యలో ఆరితేరినవాడు. ఓరుగల్లు అపసర్పగణనాయకుడైన శ్రీ విరియాల గొంక ప్రభువు తనయుడు. అతడు వేయని వేషం లేదు. ఆ రహస్యదుర్గంలోని సేనాపతులు ఒకరినొకరు చూచుకొని నువ్వు సబ్బప్పవు కాదుగదా అని ప్రశ్నించు కుంటారట. ఒకనాడు ఒక బాలనాయకుడు ఒక తేలును చంపుతూఉంటే, పక్కవారు ఆ తేలు సబ్బప్పేమో చంపవద్దన్నారట.

ఆ రహస్యదుర్గంలో కొలువుతీర్చిఉన్న గోన గన్నారెడ్డికి సబ్బప్ప ఒకనాడు ఒక లేఖామంజూషను తెచ్చి ఇచ్చినాడు. ఆ మంజూషచుట్టూ ఉన్న దారపు ముడిని సునాయాసంగా విప్పి గన్నయ్య శ్రీ శివదేవయ్య దేశికుల లేఖ చదువుకొన్నారు. వెంటనే ఆయన తనమంత్రి చినఅక్కినప్రెగడను చూచి “ఏమండీ అక్కినామాత్యులవారూ, మా బాబయ్యగారు లక్షలాది సైన్యం నడిపించుకొని ఈ చుట్టుప్రక్కల విడిదిచేసి ఉన్నారని మనకందరకూ తెలుసును. వారితో మా తమ్ముడు వరదారెడ్డిప్రభువు తన్ను తీసుకొనివచ్చిన దారి జ్ఞాపకం ఉంచుకొని తండ్రికి దారి చూపించి అంతవరకు తీసుకు రాగలిగాడు. కాని కళ్ళకు గంతలుకట్టి మనం మన దుర్గానికి తీసుకువచ్చాము. ఆ రహస్యదుర్గం కని పెట్టాలని ఇప్పటికి నెలరోజులనుండి మా చిన్నాయనగారు ప్రయత్నం చేస్తున్నారు. కాని ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి.

“ఇక్కడ శ్రీ శివదేవయ్య మంత్రులవారి ఉత్తరంచూస్తే ఒక విచిత్రం చేద్దామని తోస్తున్నది. మా చిననాయనగారిని మాయచేసి, ఒక్కణ్ణి బంధించి, ఓరుగల్లు చేర్పించి, అక్కడ శివదేవయ్య మంత్రులవారి చేతుల్లో పడేటట్లు చూద్దాము. వెంటనే మనం వెళ్ళి మా వర్ధమానపురపు కోటను ముట్టడిస్తాము. పట్టుకుందాము. అదికూడ చిత్రంగానే! వీనికి మీమీ ఉద్దేశాలు చెప్పండి” అని సభాముఖమై అడిగెను.

విఠలధరణీశుడు వెంటనే, ‘అద్భుతం’ అన్నాడు. సూరపరెడ్డి తలఊచాడు. చినదామానాయుడు చాలా బాగుందన్నాడు. అందరూ ‘వెంటనే’ అన్నారు. అప్పుడు చినఅక్కినప్రెగడ లేచి గన్నారెడ్డిని చూచి ‘ప్రభూ! తాము ఆలోచించినది సరియైనదేకాని మనం ఎందుకోసం ఈలా గజదొంగలం అయ్యామో ఆ ఉత్కృష్ట కార్యం అలా ఉండగానే వర్ధమానపురపుకోట పట్టుకోగూడదు. లకుమయను ఖైదీగా పట్టుకొని ఓరుగల్లు మహానగరం పంపిద్దాము. అంతే! ముందుంది ముసళ్ళ పండుగ! మీరే ఆలోచించండి’ అని మనవిచేశాడు. ఇరువదిఒక్క సంవత్సరం ఈడుగల అక్కిన తలఊపుతూ ఒక్కొక్కమాటే ఆలోచనాపూర్వకంగా ఈలా చెప్పినాడు.

గన్నారెడ్డి విని ‘అవును, అక్కినమంత్రీ మీ మాటలు నాకు నచ్చాయి. ఆలాగ చేద్దాము. మా చిననాయనగారిని రాత్రిరాత్రి మాయంచేయాలి. దానికి ఉపాయం ఈ రాత్రే ఆలోచిస్తాను’ అని చెప్పి లేచినాడు సభ ముగిసింది. ఆ రాత్రి ‘ఏమయ్యా సబ్బనాయకా! మీ వేగులవారు పరిశీలించి తేల్చుకొని వచ్చిన విషయాలు కొన్ని కావాలి నాకు’ అని తన ఏకాంతమందిరంలోనికి సబ్బయ్య నాయకుని పిలిపించి గన్నయ్య అడిగాడు.

సబ్బ: మహారాజా! సైన్యం అంతా కృష్ణాతీరం పొడుగునా విడిశారు. మీ పినతండ్రిగారి శిబిరం శ్రీశైలందగ్గర ఉన్నది. వివిధ సైన్యాలన్నీ కలిపి ఒకలక్ష ముప్పదివేలమంది ఉన్నారు. ఆయన వేగులవారు ఈ ప్రదేశాలన్నీ సూదిని వెదికినట్లు వెదుకుతున్నారు. జల్లెడతో గాలిస్తున్నారు. ఎన్ని సారులు చూచినా ఈ దుర్గానికి మార్గం దొరకటంలేదు. ప్రభువుల ఆజ్ఞ చొప్పున మన దుర్గంలో ఒక్కదీపం, ఒకమంటకూడా రావటంలేదు. పగలు పొగరాకుండా వంటలు చేయిస్తున్నాను. అయినా మన దుర్గాన్ని వారు కనిపెట్టవచ్చునని ఏచారు డైనా రావచ్చు. అలా విడిగావచ్చిన చారులు మళ్ళీ వారికి కనబడ రనుకోండి. అయినా ఏ కొండశిఖరాన్నుంచో గమనించి, అనుమానించి సైన్యాన్ని తీసుకు రావచ్చు, వారు హతమారారే అనుకోండి. అయినా దుర్గరహస్యం బయలవుతుంది.

గన్న: అందుకనే నేను ఒక ఉపాయం ఆలోచించాను. మనవాళ్ళు రెండు మూడువేలమంది, రహస్యమార్గాన వీరి సైన్యాలకు దూరంగా కనబడి, వారిని ఆ అడవులలో తప్పుదారుల పట్టించాలి. ఇంకొకవేయిమంది, ఈ ఎగుడు దిగుడు కృష్ణవెంబడినే దిగువకు తీసుకొనిపోయి వాళ్ళపాట్లు వాళ్ళకుపెట్టాలి. ఇంకొక అయిదారు వందలమంది ముందు పరుగుతీయాలి. ఆ వెనుక వీరి సైన్యం ఎంత వస్తుందో రానీ, అలా పరుగుతీస్తూ కృష్ణ ఎగువకు లాక్కుపోవాలి. మూడు నాలుగు వేలమంది మన గజదొంగ పతాకం రాచటేనుగుకు కట్టి ఈ సైన్యానికి కనబడి దొరక్కుండా కందనోలుపోయి ఆ కోటలో ఉంటారు. ఈ గడబిడలో చిన్నాయనగారు ఏ సైన్యంలో ఉన్నారో నాకు వేగు అందించు. మా విఠలయ్యతో, సూరన్నరెడ్డితో, చినదామానాయనితో ఇతర నాయకులతో సంప్రతించి వారి వారిని ఆ యా పనులకు నియోగిస్తాను. నీ వేగు ఆ యా సైన్యాలకూ, ఇక్కడే ఉండే నాకూ ఎప్పటికప్పుడు వార్తలు అందజేయాలి.

సబ్బనాయకుడు చిత్తమని సెలవుపొంది మాయమయ్యాడు. గన్నారెడ్డి తాను వేసిన వ్యూహవిధానాల ప్రకారం వివిధ సైన్యాలను వివిధ స్థలాలకు పంపించాడు.

తాను మెరికలవంటి నూరుమంది దళపతులతో, సైనికులతో సబ్బానాయని కడనుండి వేగురాగానే రంగంలోకి ఉరకడానికి సిద్ధంగా ఉండెను. విఠలు డొక సైన్యాన్ని, సూరయ్యరెడ్డి ఒక సైన్యాన్ని, దామనాయుడొక సైన్యాన్ని, అక్కినమంత్రి ఒక సైన్యాన్ని నడుపుకుంటూ కృష్ణకు దూరంగా ఒక ఎత్తయిన కొండమీదినుండి ఉన్న రహస్యమార్గంగుండా వారి వారి పనులు నిర్వర్తించడానికి వెళ్ళిపోయారు.

గన్నారెడ్డి ఒక వేగులవానికి ఏదో రహస్యాలు కొన్నిచెప్పి ఎచ్చటికో పంపించాడు.

మూడురోజు లైనవెనుక ఒక భయంకరమైన చెంచువాడు వచ్చి గన్నారెడ్డి ఎదుట నిలుచున్నాడు. గన్నారెడ్డి చెంచుభాషతో ‘ఏమిదొరా! నీ మొగం నాకు కొత్తదిగాఉంది’ అన్నాడు.

ఆ దొర మొగం చిట్లించుతూ ‘ఏమిదొరా! నా మొగం కొత్త అని పెబువులు నన్ను అవమానం చేయదలచుకొన్నారా’ అనుచు వంగి నమస్కరించి ‘ప్రభూ! నన్నే ఆనవాలు పట్టలేదా?’ అని సబ్బినాయని గొంతుకతో అన్నాడు.

గోన గన్నారెడ్డి పకపక నవ్వి ‘ఓయీ! అసాధ్యుడా! ఎంత మాయచేశావు! సరే, విషయాలు తొందరగా తెలుపు’ అన్నాడు.

సబ్బ: ప్రభూ! మీ పినతండ్రిగారు సైన్యాలన్నిటినీ మన సైన్యాలవెంట ఎండమావులవెంటబడిన పిపాసిరీతిగా పంపించాడు. తానుమాత్రం పదివేలమంది మెరికలవంటి సైన్యంతో శ్రీశైలంలోనే విడిదితీర్చి ఉన్నాడు. దినదినమూ పూజలూ పునస్కారాలు చేయిస్తున్నారు. చక్రవర్తిపై భక్తి ఉన్నట్లు వారి పేరున కొన్ని దానాలు ధర్మాలు చేసి దానశాసనాలు వేయించాడు. శ్రీశైలం మఠాలన్నీ పండుగలు చేసుకుంటున్నాయి.

గోన: శ్రీశైలంలో మన అనుయాయులు అప్రమత్తులై ఉన్నారా?

సబ్బ: చిత్తం, మీఆజ్ఞకోసం నిరీక్షించండని వారికి బోధించివచ్చాను, తమ శలవు.

గోన: సబ్బనాయకా! మీ పని అద్భుతము. ఉదయాస్తమానాలు మిమ్ము పొగడడంఅంటే నాకిష్టంలేదు! కాని అది తప్పటంలేదు. మీకు అద్భుతమైన బిరుదు అర్పించుకోగలను. అది తర్వాత. ఈ దినమే ఇక్కడ సాధారణంగా కాపలాఉండే వారుకాక తక్కినసైనికులు మారువేషాలతో శ్రీశైలనగర మహాక్షేత్రాన్ని చేరాలి. వారందరినీ శివాచార్యులుగా, శివభక్తులుగా, జంగమదేవరలుగా, ఆరాధ్యులుగా శ్రీశైల వివిధ మఠభక్తులుగా చేర్పించండి. నాగుర్తు ‘జయ మహాదేవ శంభో! పార్వతీనాథ!’ అని. దానికి ప్రతివచనసంజ్ఞ ‘త్రిలోక్య నగరారంభ మూలస్తంభాయ శంభవే!’ అని. ఇవి ప్రతివారికీ రావాలి. లేకపోతే చాలా తంటా ఉన్నది. రేపు రాత్రి శంభుమహోత్సవం, మైలారుదేవ ఉత్సవం. వీరభద్రపళ్ళెం పట్టించండి. మొక్కుబడి తీరేందుకుగాను ఎవరో ధనవంతుడైన భక్తుడు ఉత్సవం చేయిస్తున్నాడు. నువ్వొక శివాచార్యుడవు. నీ ఐంద్రజాలమంతా చూపించాలి. రేపురాత్రంతా ఒళ్ళుతెలియని ఉత్సవాలు. మా చిననాయనగారి సైన్యాలు అనేక కార్యాలమీద చెదిరిపోవాలి రెండుజట్లు ఒకచోట ఉండకూడదు. నేను వచ్చి ఆ ఉత్సవంలో ఉంటాను. ఆతర్వాత నేను చెప్తాను మీరు ఏమిచేయాలో. మా చిన నాయనగారు మాయంకాగానే మీరందరూ చప్పగా, చల్లగా పారిపోవాలి. ఈలోగా మన అంచెధారలు మా చిననాయనగారిని ఓరుగల్లు చేర్పించగలవు. నేను నా సాధారణపు గజదొంగరూపంలో ప్రత్యక్షమవుతాను. మా చిననాయనగారికి, అంగరక్షకులకు గొప్ప శివభక్తులు ఒక చిన్న బంగారుపళ్ళెంలో ప్రసాదం ఇవ్వగలరు. వారు చక్కగా నిద్రపోతారు. మీశిష్యులు వర్థమానపురాంతఃపుర రక్షక భటులవుతారు. ఇక తరువాయివిషయాలు నే నక్కడ చెప్పుతాను.

సబ్బనాయకుడు మరి పది క్షణికాలు మాట్లాడి మాయమైపోయాడు.

• • • •

శ్రీశైలము పురాతనకాలమునుండీ మహాశైవక్షేత్రము. ఆంధ్రులు మొదట నుండీ శైవమతావలంబకులు. శాలివాహనశక పూర్వమునందు ఒక వేయి సంవత్సరాలనుండి శ్రీశైలము అనేక ఋష్యాశ్రమసంకీర్ణమై బహుజనాకర్షమై పవిత్ర యాత్రాస్థలమై ఉండేది. బౌద్ధమతముగాని, జైనమతముగాని ఈక్షేత్రాన్ని చెక్కు చెదర్చలేకపోయాయి.

ఈ దివ్యపర్వతము చుట్టూ ఉన్న నాడులలో ఆంధ్ర మహారాజవంశాలు అనేకం ఉద్భవించి దేశాలు పాలించాయి. ఈ పర్వతానికి తూర్పున పల్లవ భోగములో రాజులు పల్లవులై విజృంభించారు. వారికి ముందు ఇక్ష్వాకులు, వారికిముందు శాతవాహనులు సామ్రాజ్యాలేలినారు.

శ్రీశైలానికి దక్షిణంగా చళుకవిషయ రాజవంశమువారు చాళుక్యులై శాతవాహనులకు సామంతులై వారి మాండలీకులుగా, సేనాపతులుగా పడమటి కుంతల దేశానికి పోయి అక్కడ బాదామిలో శాతవాహనులకు పిమ్మట స్వతంత్రులై చక్రవర్తులైనారు. వారిలో వేరొకశాఖ తూర్పునకువచ్చి తూర్పుచాళుక్యులుగా వేంగిలో సామ్రాజ్యం స్థాపించారు.

శ్రీశైలానికి పడమటిదేశం శాతకర్ణాటదేశమై, కర్ణాటమై చాలాకాలం శాతవాహనభృత్యవంశమైన శాతకర్ణాటుల రాజ్యమై, ఆ వెనుక యాదవులపాలై, గాంగుల పాలై, చివరకు కొంతభాగం భల్లాణులచేతికి వచ్చింది.

అట్టి దివ్యపర్వతం కాకతీయ గణపతిదేవ సార్వభౌముని కాలంలో విశ్వేశ్వర గోళకమఠము, శివమఠము మొదలైనవానితో నిండి ఒక మహాపట్టణంలా విరాజిల్లుతూ ఉండేది. ఈ కాలంలో ఆ ప్రదేశమంతా అడవి ఏడాది కొకసారి శివరాత్రి నాడు ఉత్సవం జరుగుతుంది.

ఆ శ్రీశైలంలో శివభక్తులగు రాజన్యులు అనేక మఠాలు కట్టించి శివయోగులకూ, ఆరాధ్యులకూ ఆశ్రమాలు నిర్మించి అర్పించుచుండిరి. లకుమయారెడ్డి ఒక మఠం తన ఉనికిపట్టు చేసికొని, అందులో నూరుమంది రక్షకభటులతో, చిన్నయామాత్యులతో, సేనానులతో ఉన్నాడు.

‘గన్నయ్య సైన్యాలు కనబడినవి’ అని వినగానే వారిని నాశనం చేయవలసిందని ఆజ్ఞఇచ్చి తాను శ్రీశైలమందే ఉండి వేగులచేత వార్తలు తెప్పించు కొనుచూ ఉండెను. ఒకనాడు కాశీనుంచి భక్తు లనేకులు శివాచార్యుల శైవక్షేత్ర యాత్రలుచేస్తూ శ్రీశైలం వచ్చారు. వారితో కోటీశ్వరులగు భక్తు లనేకులు వచ్చి ఆ శైవమునులకు, శివాచార్యులకు ఉత్సవాలు చేయించినారు. మైలారభటులు, వీరభద్రభక్తులు నిప్పులు త్రొక్కియు, శూలాలు పొడుచుకొనియు రుద్రతాండవాలు సలుపుచుండిరి. రుంజలు, ఢక్కలు, భేరులు, నాగస్వరాలు దెసలు మారుమ్రోయించుచుండెను. మహాదేవార్చన పరమాద్భుతంగా జరుగుచుండెను. మల్లికార్జున దేవునకు ఎడతెగని అర్చన, అభిషేకము జరుగుచుండెను.

ఆ రాత్రి భక్తులు కొందరు మూడు బంగారు పళ్ళెరాల శ్రీ లకుమయమహారాజునకు శివప్రసాదము అర్పించినారు. వారి భటులు, సేనాపతులు వెండిపళ్ళెరాలతో వచ్చిన శివప్రసాదాల స్వీకరించారు. అత్యంత మధురమై సుగంధపూరితాలైన ఆ ప్రసాదము కాశీనివాసి అయిన పరమశివమఠ పరమశివాచార్యులవారు అర్పించినవని అపరశివమూర్తులైన శివయోగులు తెచ్చి అవి లకుమయారెడ్డి మహారాజు కడ ఉంచినారు.

మహారాజు, ఆయన సేనాపతులు, అంగరక్షకులు, దౌవారికులు, ద్వారపాలకులు, కంచుకులు దాసదాసీజనం అందరూ భక్తితో ఆ ప్రసాదము ఆరగించినారు. వారందరికీ శివప్రసాదమహిమవల్ల ఒడలు తెలియని నిద్ర పట్టినది. ఇంతలో కొందరు క్రొత్తరక్షకభటు లా విడిదిలో అప్రమత్తులై కాపలా కాయుచునేఉండిరి. తెల్ల వారినది. నిద్రమత్తు వీడి రక్షకభటులు, సేనానాయకులు, తదితర పరివార జనము లేచినారు. కాని మహారాజు లకుమయారెడ్డి ప్రభువు తమ హంసతూలికా తల్పంమీద లేరు! ఒక్కసారి ఆ విడిది గృహాల్లో ‘మహారాజు!’ అని గగ్గోలు బయలుదేరింది.

గోన గన్నారెడ్డి చిన్నతనాన్నుంచి ఉత్సాహంతో పొంగిపోయే బాలుడు. చదువుకొనడంలో, ఆటలు ఆడడంలో, వీరవిద్య శిక్షణపొందడంలో ఎప్పుడూ సంతోషం, ఉప్పొంగు. గురువు ‘ఈ పని చేయగలవా రాజకుమారా’ అంటే ‘చేస్తా! చేస్తా! చేస్తా! ఓ చేసితీరుతా’ అని ఆ పనియొక్క కష్టం, నిష్ఠురము, స్వరూపం ఒక్క నిమేషం ఆలోచించి, వానిని అధిగమించే విధానం ఇంకో నిమేషం ఆలోచించి, మనస్సు, బుద్ధి, హృదయము ఆ పనిపై నిశితంగా ప్రయోగించి మూడవ నిమేషంలో నిర్వర్తించేవాడు. ఈ పాఠము ‘కొత్త’ అని లేదు. అ పండు బాణంతో కొట్టడం ‘కష్టసాధ్యం’ అని లేదు ‘ఆ గుఱ్ఱం పొగరుగలది, రౌతులను పరాభవం చేయడంలో అందెవేసిన జంతువు’ అన్నా లెక్క లేదు. ‘కళ్ళెంలేకుండా గుఱ్ఱాన్ని స్వారి చేయలేము’ అని లేదు. ఏపని అయినా చేయడానికి ముందుగా సిద్ధం.

చదువులేని సమయంలో, వీరి శిక్షణలేని సమయంలో అంత చిన్నతనాన్నుంచీ గన్నయ్య ఏదో ఆలోచించుకొంటూనే ఉండేవాడు. తెల్లవారగట్ల అతనికి మెలకువ వచ్చేది. బంగారు పట్టుదారాలు కుట్టిన కాశ్మీర శాలువ కప్పుకొని పడుకొన్న చలికాలంలో, కండలుకట్టిన తన బంగారుదేహం పోతపోసిన విగ్రహంలా కనబరచు సన్నని పంచెతో మాత్రం ఆ పట్టు పరుపులపై పండుకొన్న వేసవి కాలంలో, వానకురుయుచు తన శయనమందిరానికి పైన శ్రుతివేసే వానకాలంలో కదలక పడుకొని కలలపా లయ్యేవాడు. పసితనంలో, బాల్యమందు, జవ్వనం పొడచూపే దినాల ఎప్పుడూ ఆలోచనలే!

ఆ ఆలోచనలలో రాజ్యపాలనం, దుష్టనాశనం, ఉత్తమ విద్యావ్యాసంగము, మహోత్తమ వీరవిద్యా కౌశలము సుడులు తిరుగుతూ ఉండేవి. ప్రపంచం అంతా పురాణాలలో ఒకవిధంగా వర్ణించి ఉంది. గణితశాస్త్రంలో ఇంకోవిధంగా వర్ణించి ఉంది. సముద్రం ఎంతవరకు? భూమి ఎంతవరకు? సముద్రం అడుగున భూమి ఆ భూమి అడుగున అంటే ఆ భూమి తవ్వుకుపోతోంటే, దానికి అంతుఉన్నదా? అలా ఎన్నిక్రోశాలు తవ్వుకుపోవాలి? అలా తవ్వుకుపోగా తర్వాత ఏమి ఉంటుంది? ఆకాశంలో ఎగిరే పక్షి ఎంతదూరం ఎగురుతుంది? ఒక మనుష్యుడు ఎగిరేశక్తి సంపాదించుకుంటే ఎంతదూరం ఎగురగలడు? అతని కేమీ అడ్డం రాదా? నక్షత్రాలు వానిదగ్గరకు వెళ్ళి చూస్తే ఎల్లాఉంటాయి? ‘సూర్యగోళం భూమికన్న అనేకలక్షల రెట్లు పెద్దది’ అని గణికాచార్యులన్నారు. ఆ గోళం దగ్గరకు వెళ్ళగలమా? అందులో సూర్యు డెటులుండును?’

ఈలా అంతులేని ప్రశ్నలు వేసుకొని వానికి సరియైన సమాధానాలుతోచక వేదనపడేవాడు. ‘కొండలు, నదులు, అడవులు, వానలు, వరదలు, వేసవి, శీతాకాలం, చలి, వేడి ఇవి ఏలావస్తాయి?’ అని ప్రశ్నించుకొనేవాడు.

వీని అన్నింటికి గురువులనుండి సమాధానాలు కోరేవాడు. వానికి గురువు లిచ్చిన సమాధానాలు ఒక్కొక్కప్పుడు నచ్చేవి కావు. అతని హృదయంలోని ఈ ప్రశ్నపరంపరలవల్ల విపరీతమైన ప్రకృతిజ్ఞానం అలవడింది. ఎప్పుడు వాన వచ్చునో, నది ఈఏడు ఎంతపొంగునో అతనికి కరతలామలకము.

అత డొంటిగా ఏకొండశిఖరంపై నో కూర్చుండి నిశ్చలతారకాయామినీవేళల నక్షత్రపథాలలోనికి, తన హృదయంలోని ప్రశ్నలకు సమాధాన మా చోటుల ప్రత్యక్షమవునేమో యని పారకించి చూచేవాడు. కృష్ణఒడ్డున మధ్యాహ్నాల కూర్చుండి నీటిమేఘాలు; సుడిగుండాలు, నదిలోని రాళ్ళు వాని చుట్టూనదీజలాలు ప్రవహించే విధానము గమనిస్తూ జీవితమునుగూర్చి చర్చించు కొనేవాడు. “ఈ జీవితమూ నదివంటిదేనా? నదికి ఆ కొండ పుట్టుకస్థలమంటారు. ఆ చుట్టుప్రక్కల ఎన్నోవందలమైళ్ళ ప్రదేశంలో పుట్టే ప్రతి చిన్న నీటిబిందువు ఆ నదికి పుట్టిన స్థలమే! అలా మనుష్య జీవితాలు అనేకవందల బిందువుల కలయికా? అవి మాతృగర్భంలో కలుస్తాయా? మేఘాలు నీటిఆవిరి అని పెద్దలు చెప్పారు. ఆ నీటిఆవిరి సముద్ర జనితం. సముద్రాలలోనికి నదులు, నదులు అనేక జీవబిందువుల కలయిక, జీవసముద్రంలో మృత్యుసూర్యతప్తమై అవి ఆవిరిగా మారి మానవమూర్తి మేఘాలలోచేరి, అక్కడే పెరిగి స్త్రీగర్భకుహరాలలోనుండి బయలువెడలుతాయా జీవితాలుగా? అయితే అవి మనుష్యులలో ఏలా చేరుతాయి? శుక్లం బాల్యావస్థలో పురుషుని దేహంలో లేదు. శుక్లం ఎప్పటికప్పుడు మనుష్యునిలో వృద్ధి. అది స్త్రీ గర్భంలోకిపోయి స్త్రీలో చిన్న తనంలో లేని శోణితబిందువులలో కలిసి ఒక పూర్ణరూపం అవుతుందీ? అది మనుష్యుడుగా ఉద్భవిస్తుందీ?

“ఈ రాజ్యాలు, ఈ నాగరికతలు, ఈ అర్చనలు వివిధ నామాలుగా భగవంతుని భావించుకోడం, కొందరు భగవంతుడే లేడనడం, కొందరు శివుడే భగవంతుడని, కొందరు విష్ణువే భగవంతుడని, కొందరు వీరందరూ హుళక్కే - ఆద్యంత రహితము. నామ రహితము అయిన బ్రహ్మమే నిజము - అని వాదించడం ఏది నిజం?”

ఈలా ఆ యువకుని ఆలోచనలు అనంతములై ప్రవహించేవి. కార్యోన్ముఖుడైనప్పు డేయాలోచనలు ఉండక ఆ కార్యఫలాకాంక్షమాత్రం మాతన్ని ఉఱ్ఱూత లూచేది.

వర్థమానపురంలో తండ్రియైన బుద్ధారెడ్డిప్రభువు గన్నయ్యకు, అతని తమ్ముడు విఠలయ్యకు చిన్నతనంలో నుంచి గురువులచే చదువు చెప్పించినాడు. అతడు పోగానే లకుమయ్య ఈ బాలకుల నిద్దరినీ ఓరుగల్లు చదువుకై పంపినాడు. అక్కడ వారిద్దరూ తమ నగరిలో దాసదాసీజనసేవితులై పెరిగారు. రాజబంధువులలో ఒక ముదుసలియామె వారి పోషణభారం వహించింది.

గన్నయ్య ఎంత చురుకువాడో, విఠలయ్య అంత మందమతి - అసలు చదవలేకపోవడం కాదు. ఏదో చదివేవాడు. విఠలయ్య చిన్నతనాన్నుంచి భీముడే! తోటి బాలు రెవ్వరూ అతనిని మల్లయుద్ధంలో ఓడించలేకపోయేవారు సరిగదా, మొదటి గడియలోనే ఓడిపోయేవారు. అతడు చేయలేని బరువుపని ఏదీ లేనేలేదు.

విఠలయ్యకు ఎప్పుడూ రాదు కోపం ఏపని చేసినా ఉద్రేకము వచ్చేది కాదు. చదువూ అంతంతమాత్రమే! పంచకావ్యాలై సాహిత్యమాపినాడు. ఏదో వ్యాకరణమూ, ఏదో గణితము, ఏదో వేదాంతము చదివినాడు. కాని ఆంధ్ర కర్ణాట మహారాష్ట్రాది ద్రావిడ భాషలూ చదివినాడు. ఆంధ్రభాషలో భారతము, శివనీతిసారము చదివినాడు. ఎప్పుడూ చదువుట మానలేదు. అన్నగారికి చదువు గరుత్మంతునికి ఎగురుట వచ్చినట్లు రావడం, తనకు చదువుదూరదూరాననే ఉండటం అతనికి నవ్వువచ్చేది. అన్నగారే అతనికి ముఖ్యగురువై పాఠాలు నేర్పేవాడు.

అన్నగారు విఠలయ్యకు భగవంతుడు. అతనికి మల్లయుద్ధం అంటే అపరిమితప్రేమ. అన్నగారిని ఎవరైనా నిరసించినట్లు కనబడితే వెంటనే ఆ యువకు డెంత పెద్దవాడైనా, పూలచెండులా పై కెత్తి ‘జాగ్రత్త’ అని మళ్ళీ క్రిందకు దింపేవాడు.

గన్నారెడ్డి ఓరుగల్లులో చదువుకునే దినాల్లో లకుమయారెడ్డి మహారాజు భూతాది ప్రాభృతాలు పండించటం మానివేయడం జరిగినప్పుడు వర్థమానపురం నుంచి బుద్ధారెడ్డిని ప్రేమించిన కొందరు ఓరుగల్లు వచ్చి లకుమయ్య దుస్తంత్రము గన్నయ్యకు నివేదించారు. గన్నయ్య గరుడునివలె సమస్తరాజకీయాలు గ్రహిస్తూ ఉండెను. ఓరుగల్లు గురుకులాన అతనితోపాటు చదువుకొనుచుండిన రాజకుమారు లందరూ గన్నయ్యను నాయకునిగా ఎన్నుకొని అనేక వినోదాలలో పాల్గొనేవారు.

గన్నారెడ్డి వారందరినీ ఒకనాడు చేరదీసి ఆరుగడియల కాలం ఏమేమో బోధించాడు. ఆ వెనుక గన్నారెడ్డి మూడు నెలలు తమ్మునితో, తనకు సర్వ విధాల బాసట అయిన సూరపరెడ్డితో దేశం అంతా తిరిగాడు. తక్కిన యువకులు అయిదుగురు, ఆరుగురు జట్టులుగా వారివారి సేవకులతో దేశం నలుమూలలా తిరిగారు.

వా రందరూ ఏర్పరచుకొన్న గడువు మూడు నెలలూ దాటగానే ఓరుగల్లులో మళ్ళీ అందరూ కలుసుకొన్నారు.

5

రహస్యంగా రాజకుమారు లందరూ ఓరుగల్లులో గోనవారి నగరులో కలుసుకొన్నారు. గన్నారెడ్డి వారందరినీ చూచి, “అన్నలారా! మనం స్వయంభూనాథుని పాదపద్మాలుసాక్షిగా ఏర్పాటుచేసుకొన్న ప్రతిజ్ఞను అనుసరించి, నేను మీతోపాటు దేశాలన్నీ తిరిగాను. నాకు మన విడిదికి తగిన అద్భుతప్రదేశం శ్రీశైలందగ్గర కనబడింది. ఆ ప్రదేశం పాడుపడిన పురాతన పట్టణం. ఆ పట్టణానికి ఒకటే దారి ఉన్నది. ఆ చాటుదారిని నాకు ప్రాణస్నేహితుడైన ఒక చెంచుదొర చూపించాడు. ఇంకో రహస్యమార్గం ఉంది. తెలియనివాళ్ళు కొన్ని వేల యేండ్లు గాలించినా ఆ పట్టణం దొరకదు. చెంచువారి సహాయంతో ఆ పట్టణం సర్వవిధాలా బాగుచేయించడానికి మా విఠలయ్య, చిన అక్కినప్రగడ గారలు వెళ్ళారు. అది సిద్ధంకాగానే మనం ఒకమంచిదినాన గజదొంగలం అవు దాము. ఈ లోగా వారు వారు తగిన ధనం, బలగం పోగుచేసికొని సిద్ధంగా ఉండండి” అని గన్నారెడ్డి తెలిపెను.

వీర యువకలోక మంతా ‘వల్లె’ యని కత్తులు పై కెత్తెను. ఆ జట్టుకు నాయకుడు గోన గన్నయ్య. అతని నాయకత్వం అంటే ఎవ్వరికీ ఏవిధమైన అనుమానాలూ లేవు.

ఈ సమావేశం జరిగిన నెలదినాలకు ‘సర్వం సిద్ధమైనది. కాబట్టి ఇక రావచ్చు’ అని విఠలయ్యదగ్గరనుంచి వార్త వచ్చింది. ఒకదినాన వారందరూ కలుసుకొని శుభముహూర్తం ఏర్పరచుకొన్నారు. మైలారదేవుని సాక్షిగా, వీరభద్రుని సాక్షిగా, ఏకవీర సాక్షిగా, స్వయంభూదేవ సాక్షిగా వారు ఒట్లు పెట్టుకొన్నారు. ఏర్పరచుకొన్న శుభముహూర్తాన వారందరూ ఓరుగల్లు విడిచి పోయారు. వారు ఓరుగల్లు వదలిన వారము దినాలకు గన్నా రెడ్డికడనుండి శివదేవయ్య మంత్రికి ఉత్తరం వచ్చింది.

“శ్రీ శ్రీ శ్రీ అపరగురుమల్లికార్జునావతార, శివదేవయ్య పండితారాధ్య దేశికులకు పాదపద్మాల సాగిలంబడి గోన గన్నయ్య మనవి.

“మా పినతండ్రి నా రాజ్యం తన హస్తగతం చేసుకొన్నాడు. ఈలాంటి అన్యాయాలు శ్రీశ్రీశ్రీ సప్తమ చక్రవర్తులైన మా సార్వభౌములు వృద్ధులవడం వల్ల సంభవించినవి. మా కీ రాజ్యంలో న్యాయం దృశ్యం కావటంలేదు. కాబట్టి మే మంతా దోపిడి దొంగల మవుతున్నాము. నాతోపాటు ఇరవై అయిదుగురు రాజకుమారులు వచ్చారు. శ్రీ చిన అక్కినప్రగడ మహామంత్రీ వచ్చినాడు. మేము మా రాజ్యం స్థాపించుకొన్నాము. మేము ఎవరు ఎంత ప్రయత్నించినా దొరకము. ఆ యా రాజకుమారులు వారి వారి తల్లిదండ్రులకు ఉత్తరాలు వ్రాసుకొన్నారు. మమ్మల్ని పట్టుకొనవచ్చినవారిని హతమారుస్తాము. అన్యాయము చేసే వారిని దోస్తాము. మాకు స్వయంభూదేవుడే నాయకుడు. ఇట్లు తమ శిష్యపరమాణువు గోన గన్నయ్య. ఇవే అనేక శుభలేఖార్థములు.”

ఆ ఉత్తరం చూచి శివదేవయ్య చిరునవ్వు నవ్వుకొన్నాడు. ఆ సాయంకాలంలోగా వివిధ రాజనగరులనుండి ప్రభువులు, పెద అక్కిన మంత్రులవారు హుటాహుటి ముఖ్యమంత్రి శివదేవయ్యకడకు వచ్చారు.

“మీ మీ కుమారులకు భయ మేమీలేదు. నేను వారినందరినీ మంచి మార్గానికి దింపే సాధనం ఆలోచించి తిరిగి రప్పిస్తాను. మీ మీరేమీ తొందర పడకండి” అని శివదేవయ్య దేశికులు బోధించారు.

ఆ నాటినుండి ఊళ్ళు దోచకపోయినా, ఇతరులను దోచకపోయినా గన్నారెడ్డినిగూర్చి ప్రపంచమంతా గగ్గోలుపుట్టింది. ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు గన్నారెడ్డి పెద్దసైన్యము సమకూర్చినాడు. కోట్లకొలది టంకాల వెల గలిగిన బంగారుపాత్రలు దొరికినవి. అనేక విధాలుగా ఎక్క డెక్కడినుంచో ధనం వస్తూ ఉన్నది. ఆ రహస్య పర్వతప్రదేశంలో ఒక విచిత్రరాజ్యం ఉద్భవించింది.

గన్నారెడ్డి వేలకొలది జాతిగుఱ్ఱాలను బంగారు రాసులు పోసి సముపార్జించినాడు. గుఱ్ఱాలమీద అతివేగంగా స్వారీచేస్తూ ఉరకడం, అతివేగంగా పరుగిడే గుఱ్ఱంమీదకు ఉరకడం, పగ్గములులేక గుఱ్ఱముల స్వారిచేయుట, గుఱ్ఱములపై పండుకొని స్వారిచేయుట, అతివేగంగా గుఱ్ఱముపై స్వారిచేస్తూ బాణముల గురి చూచి కొట్టుట మొదలయిన పనులన్నీ వేలకొలది అశ్వికులకు నేర్పించినాడు. దుష్టతురగరేఖావంతుడై అతడు అతిరథశ్రేష్ఠుడై వెలిగిపోయాడు.

అక్కడినుండి అప్రతిమాన వ్యూహరచనాసామార్థ్యంతో, యుద్ధనైపుణ్యంతో దేశా లన్నిటిలో రాజు లందరికీ గుండెబెదు రయినాడు. ఇరువదివేలమంది అశ్వికులు, వాయువుతో పందెములు వేయువారు ఆ లోయలో శిక్షణ పొందినారు. నదులు ఈదుట, కొండ లెక్కుట, ఎంతనున్నటి గోడలనైనా ఎగబ్రాకుట, తాటి నిచ్చెనలు సిద్ధముచేయుట, వివిధాయుధ యుద్ధముచేయుట, అనేక నూత్న యుద్ధములు సృష్టించుట, జట్టులు దళములు పంక్తులు బారులు వ్యూహాలు చెడకుండా అతివేగాన పరుగులిడి శత్రువులను గదియుట, బాణములు పరుగులో గురితప్పకుండావేయుట, పండుకొని, కూర్చుండి, మోకరించి, బాణాలు గురిచెడకుండవేయుట, శూలయుద్ధము, శూలములు దూరాన గురితప్పకుండా విసిరివేయుట, మల్లయుద్ధము చేయుట, అన్నివిధములైన కత్తియుద్ధములుచేయుట, గజములతో, వ్యాఘ్రములతో యుద్ధము చేయుట గన్నారెడ్డి సైనికు లందరూ నేర్చుకొన్నారు.

6

గన్నారెడ్డి పినతండ్రి లకుమయ్యను బందీచేసినా అత్యంత గౌరవంతో ఓరుగల్లుపురం చేర్చినాడు. ఒక వార్తాహరునిచే శివదేవయ్యమంత్రికి ‘లకుమయారెడ్డిని, ఆయనమంత్రి రుద్రయామాత్యులను బందీలుగా సార్వభౌముల సేనాపతుల కెవరికైనా పిల్లలమఱ్ఱికడ అప్పగింతుమనీ, వారిని అత్యంత గౌరవంగా గోనవారి నగరులో ఉంచవచ్చుననీ, విధేయుడు గజదొంగ’ అని ఉత్తరం పంపించాడు.

వెంటనే ప్రసాదాదిత్యనాయకులు దళపతులతో పదివేల గుఱ్ఱపుసైన్యం తీసుకొని రెండురోజులలో పిల్లలమఱ్ఱి చేరినాడు. మరునా డుదయం ఒక భద్ర దంతావళముపై బంగారు చవుడోలుపై పట్టుపరుపులపై పరుండి నిద్రపోవు లకుమయారెడ్డి మహారాజును, రుద్రయామాత్యులను నలుగురు అశ్వికులు ప్రసాదాదిత్యనాయని సైన్యంకడకు తీసుకువచ్చారు. వెంటనే అశ్వికుల్ని ప్రసాదాదిత్యుని దళపతులు బందీలను చేశారు. ప్రసాదాదిత్యులు గౌరవంతో రుద్రయామాత్యునికి స్వాగతంఇచ్చి శ్రీ లకుమయారెడ్ది ప్రభువును ఆ భద్రగజంమీదనే పిల్లలమఱ్ఱి తీసుకొనిపోయి, అచ్చట కోటలో రాజభవనంలో దింపి తూలికాతల్పంమీద పరుండబెట్టినారు. రేచెర్లవారి రాజవైద్యుడు వచ్చి లకుమయారెడ్డి నాడిచూచి ప్రభువు జ్ఞానపత్రి, నల్లమందు తినియుండుటచే వారి కా మత్తు కలిగినదనిన్నీ, మత్తువదిలే సూచనలు కనబడుతున్నవనీ చెప్పాడు.

ఆ వుదయం పదునొకండు గడియలకు లకుమయప్రభువు కండ్లు తెరిచాడు. ఆయన కండ్లుతెరిచిన కొద్దికాలంవరకూ తా నెక్కడున్నదీ తెలియక ఏవేవో అసందర్భవాక్యాలు పలుకుతూ వుండెను. దాసీ లాయన నుదురు చల్లని సుగంధ జలముతో తడుపుచుండిరి. ఒకగడియ అయినవెనుక లకుమయ మహారాజుకు సంపూర్ణంగా తెలివి వచ్చింది. ‘ఇప్పుడు నే నెక్కడున్నాను?’ అని చటుక్కున లేచి ప్రశ్నించాడు.

“మహారాజా, మీ రిప్పుడు పిల్లలమఱ్ఱిలో రాచనగరులో అతిథిమందిరంలో వున్నారు” అని రుద్రయామాత్యుడు మనవిచేశాడు.

లకు: రుద్రయామాత్యులవారూ! మీ రేల వచ్చినారు? ఆ రాక్షసుడు మిమ్ము బందీగా కొనిపోయాడని మీ భటులు ఎంతకాలంక్రిందటో మాకు చెప్పారు. అప్పటినుండి మీరు కనపడలేదుకూడా!

రుద్ర: మహాప్రభూ! మీకు వచ్చినవార్త నిజమైనదే. నన్ను గన్నారెడ్డి ప్రభువు...

లకు: ఆ పరమనీచుని పేరు నా ఎదుట తీసుకురాకండి.

రుద్ర: చిత్తం మహాప్రభూ! ఆ గజదొంగ నన్ను పట్టుకొని శ్రీశ్రీ యువ మహారాజులవారిని గంతలుకట్టి తీసుకొని వెళ్ళిన స్థలానికే నన్నూ తీసుకువెళ్ళాడు. నాకూ గంతలుకట్టారు.

లకు: ఏమిటీ! వీడి దౌర్జన్యానికి అంతులేకుండా ఉంది. ఇంతకూ శ్రీశైలంలో ఉన్న మేము ఇక్కడి కెలా వచ్చాము?

రుద్ర: చిత్తం మహాప్రభూ! అదే మనవిచేస్తున్నాను. వారు నన్ను గౌరవంగానే చూస్తూ ఒక ఇంటిలో ఆ రహస్యనగరంలో ఉంచారు. నిన్న సాయంకాలం నా కళ్ళకు గంతలుకట్టి వారు ఒక గుఱ్ఱంమీద ఎక్కించి ఎక్క డెక్కడో తిప్పి ఒకప్రదేశంలోదింపి కళ్ళకు గంతలువిప్పారు. ఎదురుగుండా మహాప్రభువుల భద్రగజమూ, బంగారపు అంబారీ ఉన్నవి. నన్నుకూడా అంబారీ ఎక్కించారు. లోన ప్రభువులు నిద్రపోతున్నారనీ, నేను జాగ్రత్తగా ఉండాలనీ ఎవరో నాతో చెప్పారు. మాచుట్టూ వేయిమంది అశ్వికులుకూడా వస్తూ ఉండగా ప్రభువులను వాళ్ళు ఈ పురం చేర్చి ప్రసాదాదిత్యనాయకులవారికి తమ్ము అప్పగించారు. లకు: ఏమిటీ ప్రసాదాదిత్యనాయకులకా? ఆయన ఈ ఊరు ఏల వచ్చాడు? అశ్వికులు ఆయన సైనికులా? అప్పగించడ మేమిటి?

రుద్ర: మహాప్రభూ! ఆ వేయిమందిలో నలుగురుతక్క తక్కినవారందరూ ఈ నగరం అయిదు గవ్యూతు లుందనగనే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఆ నలుగురూ తీసుకొనివచ్చి, ఈ నగరానికి ఏకారణంచేతనో వచ్చిన ప్రసాదాదిత్య నాయకునకు అప్పగించినారు. వారు మిమ్మల్ని ఈ రాచనగరిలో ప్రవేశపెట్టారు.

లకు: ఎంతపని జరిగిందీ! మాకు శ్రీశైలం ఎవరో ప్రసాదం పంపారు. మేము దానిని తిన్నాము. ఎదో నిద్రమత్తు విపరీతంగా వచ్చింది. పోయి పడుకొంటిమి, తరువాత ఇదే మెలకువరావడం.

లకుమయారెడ్డి తాను లక్ష సైన్యంతో గన్నారెడ్డిని పట్టడానికి రావడం, గన్నారెడ్డి కందూరి కేశినాయని చంపివేయడం మొదలయినవన్నీ రుద్రయామాత్యునితో పూర్తిగాచెప్పి, ‘మన మిరువురము వెంటనే వర్థమానపురం చేరాలి. శ్రీశైలం దగ్గర సైన్యాలవిషయం ఏమయిందో తెలియలే’ దన్నారు.

రుద్రయామాత్యులు గన్నయ్య వందిభూపాలుని, ఉప్పల సోముని నాశనం చేయడం, ఆదవోని ప్రభువు కొమార్తె నెత్తుకుపోయి తన అక్కగారికడ వుంచడం మొదలయిన విషయాలన్నీ తన ప్రభువు చెప్పగా విన్నారు. ఏది ఎటులవునో అని గజగజ వణికిపోయినాడు.

లకుమయారెడ్డి స్నానాదికములన్నీ అయి, రేచెర్ల ప్రభువు పంపిన నూతన వస్త్రాదికములు ధరించి, తన విడిదిలో సుఖాసీనుడై ఉండగానే ప్రసాదాదిత్యనాయుడు తాను లకుమయతో మాట్లాడవలసియున్నదని సందేశ మంపినాడు. లకుమయారెడ్డి ‘అంతకన్న ఆనందమేమి ఉన్న’ దని మరల సందేశమంపినాడు. వెంటనే ప్రసాదాదిత్యప్రభువు లకుమయకడకు వచ్చినాడు. లకుమయ సగౌరవంగా ఆతని నెదుర్కొని తీసుకువచ్చి పీఠాన్ని అధివసింపచేశాడు. ప్రసాదాదిత్యనాయుడు లకుమయప్రభువును చూచి ‘మహాప్రభూ! నేను రాజప్రతినిధి అయిన రుద్రదేవుల ఆజ్ఞచేత, గజదొంగ గన్నారెడ్డిని పట్టుకొనడానికి ఈ ప్రాంతాలకు వచ్చాను. అప్పుడు గజదొంగజట్టులోని నలుగు రాశ్వికులు మిమ్ము తీసుకొనివచ్చి నా కప్పగించినారు. నేను వెంటనే వారిని బంధించితిని. కాని వారు ఎటుల చిత్రముగా తప్పించుకొనిపోయిరో తెలియలేదు. నూరుగు రాశ్వికులు వారిని వెదకుచున్నారు. ప్రభువులకు వేయిసైన్యం రక్షణ కిస్తున్నాను. తమరు ఓరుగల్లు వెళ్ళవలసిన ముఖ్య కారణ మొకటి వచ్చింది. ఓరుగల్లు వెళ్ళి ప్రభువులు తమనగరు చేరుకోవచ్చును. పిల్లలమఱ్ఱి పాలకుల సహాయంతో నేను గన్నారెడ్డిని పట్టుకొనడానికి వెళ్ళుతున్నాను’ అని మనవిచేసి వెళ్ళిపోయినాడు.

7

లకుమయారెడ్డి సైన్యాలు గన్నయ్య సైన్యాలను ఆ అడవులలో, ఆ లోయలలో, ఆ కొండలలో, ఆ వాగులలో వెన్నంటి తరుముచు నాల్గురోజులు ఎన్నో కష్టాలకు లోనై, చిట్టచివరకు శత్రువుల జాడ తెలుసుకోలేక, తమలో ఎందరో పడిపోతుంటే, వారిని జాగ్రత్తగా తీసుకొని రాదగిన సైనికులను ఆపి తక్కిన వారు సాగిపోతూ గజదొంగలజట్లు భాగాలుగా విడిపోతే, తాము భాగాలై విడిపోతూ తుదకు శత్రువుల జాడలు, వారి అంతూ ఏమీ తెలియక, వెఱ్ఱిమొగాలు వేసుకొని తిరిగిరావడం ప్రారంభించారు.

చిన్న చిన్న జట్టులవారు తరుముతూ తరుముతూఉండగా, ఎలా వచ్చేదో ఒక పెద్ద విరోధివాహిని; వీళ్ళని వెనుకనుంచి చుట్టి కత్తులు, కటారులు మొదలయిన ఆయుధాలను లాక్కొని, బందీలచేసి తీసుకొని పోయేవారు. ఈ విధంగా నాల్గయిదు దినాలకు గన్నారెడ్డి సైన్యాలకు పదిహేనువేలమందికి పైగా బందీలు దొరికారు. వారినందరిని ఆ అడవులలోకి తీసుకొనిపోయి, ఇంత తినడానికి జొన్నరొట్టె, పిండి రెండుమాడల చొప్పున ఇచ్చి వదిలెడివారు. చాలమంది తమకు నిజమైన ప్రభువు గన్నారెడ్డేననీ, వారి సైన్యాలలో తాము చేరుతామనీ చెప్పిరి. గన్నారెడ్డి కోరిన ప్రతిజ్ఞలన్నీ నెరవేర్చి గన్నారెడ్డి సైన్యంలో చేరారు. అలా చేరినవారు మూడువేలమంది ఉండిరి.

లకుమయారెడ్డి సైన్యం ఈ విధంగా చిందరవంద రై పోయింది. అందులో పెద్దసైన్యాలు తిరిగి శ్రీశైలం చేరేసరికి లకుమయారెడ్డిని గన్నయ్య బందీచేసి తీసికొనిపోయాడని తెలిసి భయాక్రాంతు లైపోయారు. సేనాపతులు సమాలోచించుకొని మాట్లాడక వర్థమానపురం దారిపట్టి ప్రయాణాలు సాగించారు.

లకుమయారెడ్డి అన్నకుమారునిపై సలిపిన విజయయాత్ర ఈలా విచ్ఛిన్నమై దేశాలన్నిటిలో నవ్వులపాలైన పదిహేను దినాలకు గన్నారెడ్డి తన రహస్యపురంలో కొలువుతీర్చి తక్కిన ప్రభుకుమారులతో విషయపర్యాలోచన చేస్తూ ఉండెను.

అపసర్పగణాధిపుడైన సబ్బప్రభువు గన్నారెడ్డివైపు చూచి “ప్రభూ! లకుమయారెడ్డిని తమకు ఆలోచనచెప్పుతూ ఓరుగల్లునగనగరంలోనే ఉండవలసిందిగా శ్రీశ్రీశ్రీ రుద్రదేవమహారాజులంవారు ఆజ్ఞ ఇచ్చారు. ప్రసాదాదిత్య నాయకమహారాజు సైన్యాలతో కంచి చేరుకున్నారు. వర్థమానపురంలోని సైన్యాలలో నాల్గింట మూడువంతులు తగ్గింపవలసిందనిన్నీ, అలా చేయకపోతే వర్థమానపురం ముట్టడించి నేలమట్టం చేస్తామనీ నిండుసభలో శ్రీశ్రీశ్రీ రుద్రదేవ మహారాజులు లకుమయ మహారాజుతో చెప్పారు. లకుమయప్రభువు మొగం జేవురించింది. కత్తి వాటుకు రక్తపుచుక్క లేనట్లయింది మహాప్రభూ! అప్పుడు శివదేవయ్య మంత్రుల వారు లకుమయప్రభువువంక జూచి ‘మహారాజా! ఈ మహారాజ్యంలో స్త్రీలపై కుట్రచేసేవారు ఉద్భవించారు. రాజద్రోహం దుష్టవాసనలా దేశాలన్నీ కమ్మింది. మీపైన కొందరు రాజద్రోహనేరం మోపుతున్నారు. సార్వభౌములు కాని, యువ మహారాణీవారు కాని ఆ మాట నమ్మలేదు. అయితే తమ కెందు కంత సైన్యం? ఆ విధమైన సన్నాహం? వెంటనే మీ ఆజ్ఞలు వర్థమానపురం పంపండి, సైన్యంలో మూడువంతులు తగ్గించుడని. అదీగాక మీరు మీ అన్నగారి కుమారునికి రాజ్యం ఎందుకు అప్పగించలేదు? ఆ కారణంచేత ఆ తెలివితక్కువ బాలకుడు గజదొంగయై దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అతని శిక్షించడానికి ప్రసాదాదిత్యనాయకుడు సైన్యాలతో వెళ్ళాడు. కంచి మొదలైన క్షేత్రాలు సేవించి వస్తారు. మీరు సార్వభౌములతో వేదాంతచర్చ చేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తారుగాక!’ అని చెప్పిరట” అని మనవి చేశాడు.

గన్న: మనం అనుకున్నట్లే అయింది. ఇప్పటికైనా వీరందరికీ నాయకు డెవడో తెలుసుకున్నావటయ్యా సబ్బయ్యా!

సబ్బ: లేదండీ. చాలావరకూ గాలించాను. దేశంలో ఎవరు అఖండ సైన్యాలు సమకూరుస్తున్నారో పిల్లికళ్ళతో రాత్రిళ్ళు వేయికళ్ళతో తెల్లవారగట్ల చూస్తున్నాను. మహారాజా! నా కొక అనుమానం ఉన్నది. అది....

గన్న: నాకు నీవు చెప్పబోయేకడనే అనుమానం ఉంది. నేనూ మీరూ స్వయంగా వెళ్ళి విచారిద్దాము. ఈలోగా వేంగీ మహారాష్ట్రంలో గోదావరీతీర నగరమైన మేడిపల్లి లో కాచయనాయకుడు చాలా గర్వించి పోతున్నాడనీ, ఆంధ్రరాజ్యం విచ్ఛిన్నం చేయటానికి కాళింగుల సహాయం కోరుతున్నాడనీ, మొన్ననే తరిమి వేయబడినా కటకాధిపతి కొంత సైన్యమూ, బానలకొలదీ ధనమూ కాచయనాయకునికి పంపించాడనీ మీవాళ్ళు పట్టుకువచ్చిన వేగువిషయంలో నేను ఒక విచిత్రాలోచనకు వచ్చాను. ఈ సభావా రందరూ ‘వల్లె’ అంటే మనం వెంటనే కాచయ్యను గోదావరి కెరటాలలో ఊగిస్తూ చల్లంగి పంపించవలసి ఉంది.

అప్పు డొక యువక ప్రభువు లేచి ‘ప్రభూ! మనం ఇంత సైన్యంతో అన్ని వందలమైళ్ళు ఎలాప్రయాణం చేయగలం?’ అని వినయంగా అడిగినాడు.

గన్నారెడ్డి చిరునవ్వునవ్వి “ఓయి మహారాజా! గజదొంగలు అవసరమైతే రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళలేరా? మనం భక్తుల జట్టులుగా పదివేలమంది గోపాదక్షేత్రమూ, తదితర గోదావరితీర క్షేత్రాలు చేరుకొంటాము. మన అశ్వికులు రెండువేలమంది పదిగా, ఇరవైగా వివిధమార్గాలను నిడుదప్రోలుకు ఎగువనున్న మలయపర్వతారణ్యాలకు చేరాలి. నేనూ మారు వేషంతో ముందుగా అన్ని విషయాలు విచారించి మన జైత్రయాత్రావిధానం నిశ్చయం చేస్తాను. నాతో ముప్పదిమంది అపసర్పులుంటారు. నేను వారిద్వారా వివిధజట్టులవారికి సందేశా లందజేస్తాను. సబ్బప్రభువు నాతో వుంటాడు. అందరూ అప్రమత్తులుగా వుండండి. మనకు యధాప్రకార సాంకేతికాలలో ‘కాచపాత్ర’ అనే సాంకేతికం కొత్తది” అని సభ ముగించాడు.

గోన గన్నయ్య తర్వాత తన ముఖ్యనాయకులతో ఆలోచనా మందిరాన సంప్రతించి యుద్ధయాత్రావిధానంలోని తక్కిన అంశాలన్నీ బోధించాడు.

8

మేడిపల్లినగరం గోదావరీ తీరానకు ఆరు గవ్యూతులలో వున్నది. జొన్న, పత్తి, కందులు, పెసలు, మినుములు, వులవలు, అలచందులు, బొబ్బర్లు పంట పండే బంగారంవంటి గోదావరి వండ్రుభూములమధ్య మేడిపల్లినగరం తోటలతో, పూలవనాలతో వెలిగిపోతూ వున్నది.

మేడిపల్లిని కాచయనాయకుడు పరిపాలిస్తూ వున్నాడు. కాచయనాయకుడు నిడుదప్రోలు చాళుక్య ఇందుకేశ్వర మహారాజుకు సామంతుడు. పరాక్రమవంతుడైన సేనాపతి. చాళుక్య సేనాపతియై కళింగ ప్రభువులు సింహాచలం దాటకుండా యుద్ధంచేసి అనేకమార్లు తరిమివేసిన వీరుడు. కాకతీయ మహాసామంతులైన చాళుక్యులకు సామంతుడై అడవి కోయదొరలను భయ, భక్తి, స్నేహాలతో అదుపాజ్ఞలలో వుంచి, ఆ గోదావరీ తీరారణ్య ప్రదేశాల శాంతి నెలకొల్పి అడవి వస్తువులు దేశాల కెగుమతిచేయిస్తూ అనేక లక్షల మాడలను తన ధనాగారాన్ని నింపుతూ వుంటాడు.

అతడు గండ్రగొడ్డలితో మహాయుద్ధం చేయగలడు. ఆ గండ్రగొడ్డలికి రెండువైపులా పదును వున్నది. ఆ గొడ్డలిని ఖడ్గంగా మహావేగంతో వుపయోగించి ఎంతటి వీరునితలనైనా ఆకాశానకు బంతిలా ఎగరగొట్టగలడు. ఆ గొడ్డలి తలకట్టునకు భల్లశిరంకూడా వుండడంచేత, విరోధుల గుండెల్లో భల్లంలా పొడిచి వారిని హతమార్చగలడు. అతని గొడ్డలికి చిరుగంట లున్నాయి, దంతపుపిడి వున్నది. రత్నాలు పొదిగిన ఆ పిడితో వజ్రసదృశమై దర్శనమాత్రాన శత్రువుల గుండె లవియచేస్తూ వుంటుంది ఆ గొడ్డలి.

కాచనాయకుని పరాక్రమం ఎదుట నిలబడలేని కళింగాధిపతులు, ఈ రాక్షసుని తమ దెసకు తిప్పుకోవాలని చాలా ప్రయత్నించి విఫలమనోరథులయ్యారు. అంతటితో వారు తమ ప్రయత్నం మానుకోలేదు. ‘మహావీరులు బానిసలై మరొకరిక్రింద సామంతులై వుండడము వీరపురుషలక్షణం కాదనిన్నీ, సంపూర్ణస్వాతంత్య్రంతో మహారాజై, సార్వభౌముడై చాళుక్యాది ప్రభువులకు మండలేశ్వరేశ్వరుడై మహాసింహాసనం అధివసించడము ప్రజ్ఞా, పౌరుషమూతెలియ జేస్తాయనీ, అందుకు కటకప్రభువులు సర్వసహాయం చేస్తారనీ, ఆంధ్రరాజుల శిరోమాణిక్యమై అతడు కటక ప్రభువుతో వుజ్జీగావుండి వారితో వియ్యమందుట రాజలోకంలో మహాయశఃకారణ మనిన్నీ’ వేగులు పంపించారు.

కాచనాయకు డాలోచించాడు. ఆలోచించి తాను సార్వభౌముడు కావాలని నిశ్చయించుకొన్నాడు. ఆలోచన తీరగానే, ఎక్కడనుండో ఒక విచిత్రమైన వేగు వచ్చింది. ఆ వేగులో ‘ఆడదాని చేతిక్రింద నువ్వు దాసీదానవా మహారాజా?’ అనే ప్రశ్న వున్నది. కొన్ని దినాలు పోయిన వెనుక ‘సార్వభౌముడు కాటికి కాలుచాచుకొని కూరుచున్నాడు’ అని వచ్చింది. ఇంకొక వేగు ‘ఓరుగల్లునగరం నూరు గవ్యూతుల దూరంలోవుంది’ అని వచ్చింది.

వేగు తెచ్చినవా రెవరినీ కాచయప్రభువు ఎంత ప్రయత్నించినా కనుగొన లేకపోయినాడు. మంచి వెండిపెట్టెలలోపెట్టి తాటియాకు పత్రాలపైన ఆ వేగు వుత్తరాలువచ్చేవి. ఒకనాడు కాచయప్రభువునకు ఆలాంటి వేగు వుత్తరంతోపాటు ఎనిమిది లక్షల మాడల ధనంగల పెట్టెలువచ్చాయి. ‘ఈ ఎనిమిదిలక్షల మాడలు తమకు ఆడవాళ్ళరాజ్యం నాశనంచేసే వుత్తమకృషికి సన్నద్ధులయ్యేందుకు. ఈ లాంటి ప్రాభృతాలు ఇంకావస్తాయి! కాని అతిరహస్యం! జాగ్రత్తగా వుండండి మహారాజా!’ అని వున్న దా పెట్టెలలో.

కాచయప్రభువు తాను చక్రవర్తి అయినట్లు వుప్పొంగిపోయాడు. చక్రవర్తి కాబోయే అఖండ ప్రయత్నంలో నిమగ్నుడైపోయాడు.

కాచయప్రభువు పంపిన ప్రణిధులు ముప్పదిమంది మోటుపల్లి రేవుకు, కోరంగి రేవుకు జాతిగుఱ్ఱములను కొనుటకు పోయినారు. కొందరు వర్తకులు ఏనుగుల బేరమాడుటకు కటకపురికి పోయినారు. కొందరు దళపతులు కోయవారిని, శబరులను సన్నద్ధము చేయుటకు పోయినారు.

తన మహాప్రయత్నాలవిషయం ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చడానికి, తాను గణపతిరుద్రదేవుని పేర గోదావరీతీరమందు గోపాదక్షేత్రంలో నెలకొల్పిన గణపేశ్వర మహాదేవునికి కోటిఘటాభిషేకం, శ్రీశ్రీశ్రీ సప్తమ చక్రవర్తులైన గణపతిదేవ సార్వభౌముల దీర్ఘాయురారోగ్యాలకై చేయించబోతున్నానని ప్రకటించాడు. ఆ మహోత్సవానికి కాచనాయకుడు అనేక మండలేశ్వరులను ఆహ్వానించాడు.

తన ప్రయత్నాలన్నీ గోదావరిపై ఎగిరిపోయే తెరచాపలెత్తిన పడవలులా గమ్యస్థానం చేరుతున్నాయని కాచయప్రభువు మేఘాలమీద నడుస్తున్నాడు. రెట్టింపు పెరిగినట్లయ్యాడు. ఒక దినాన వుదయపూజలన్నీ నిర్వర్తించుకొని, సంతోషముతో అభ్యంతర సభాభవనంలోనికి వెళ్ళగానే అక్కడ చిన్న వెండిపెట్టె వున్నది, ఓహో! మళ్ళీ ఆ పరమాద్భుతమైన వేగు వచ్చిం దనుకొని, ఆయన ఆ మంజూషను తెరిచాడు. లోన ఒక చిన్న చుఱకత్తియున్నూ, ఒక తాళపత్ర లేఖయున్నూ వున్నవి.

“కాచయప్రభూ! కపటరాక్షసుడా! నీవు చక్రవర్తి అవుతావా? కటకం వారితో వియ్యమా? శ్రీశ్రీశ్రీ రుద్రదేవప్రభువు వట్టి ఆడదా? నువ్వు వీరాధివీర ప్రచండ దోర్బల ఘట్టనఘరట్ట గండరగండడివా? నీవు వీరాధివీర కదన ప్రచండుడవా? అభినవ మనుకుల పరశురాముడవా? పశువా! నువ్వు చాలాచోట్లనుండి చాలాధనం ప్రోగుచేశావట? ధనం వుండగానే దొంగలు రారట్రా పరశుధారీ! నేను గజదొంగనురా, నీ ధనం, నీ వీర్యధనం, నీ మానధనం అపహరించడానికే వస్తున్నానురా! ఇవన్నీ భద్రంగా దాచుకో, మహారాజాధిరాజ పరమేశ్వరుడా!” అని వున్న దా లేఖలో.

కాచనాయకుని గుండెల్లో రాయిపడింది. వెంటనే వెఱ్ఱికోపంవచ్చింది. అతని గుప్పెడుమీసాలు గాలివానకు ఊగిపోయినవి. ఆతని విశాలవక్షం భూకంపంలో భూమి పొంగినట్లుగా విస్ఫారితమైంది. వెంటనే సింహగర్జనంతో ‘ఎవ్వడురా అక్కడ?’ అని కేకవేశా డా ప్రభువు, దౌవారికుడు గజగజ వణకుతూ వచ్చి ప్రభువుఎదుట సాష్టాంగపడి లేచినాడు.

“ఏమిరా దొంగా, ఇక్కడికి ఈ వెండిపెట్టె ఎలావచ్చిందిరా? పిలు. ఈ నగరిలో కాపలా వుండేవాళ్ళందరినీ కనుక్కో. మీ వీపులమీద చర్మాలు వుండవు. వెంటనే అంతఃపుర రక్షకాధిపతిని పిలు.” అని పొలికేకలు పెట్టాడు.

9

కాచయ్య పొలికేకలలో భయంవల్ల కలిగిన కోపం వుంది. అంతఃపురరక్షకుడు, ద్వారపాలకులు, దౌవారికులు, కంచుకులు, ఆయుధరక్షకులు, రహస్యచారులు, రక్షకస్త్రీలు గడగడలాడుతూ ఆ మందిరంలోనూ బైటా నిండిపోయారు. అంతఃపురరక్షక నాయకుడు భయంతో కాచయనాయకుని ఎదుట నిలబడినాడు.

కాచ: ఏమయ్యా, ఈ వెండిపెట్టె ఈ మందిరంలోకి ఎలా వచ్చింది?

అంతః: చిత్తం మహాప్రభూ! అది ఎలా వచ్చిందో నాకు తెలియదు మహారాజా!

కాచ: ఇక నీ అంతఃపురరక్షణ ఏం తగలబడిందయ్యా?

అంతః: (మౌనం) కాచ: రజితపేటిక ఇక్కడకు ఎలావచ్చిందో ఎవరైనా చెప్పగలరా?

ఒకరక్షకస్త్రీ: మహారాజా! నే నా పెట్టెను తెల్లవారకట్ల మూడవయామం వెళ్ళిన గడియకు వస్తూ చూచానండి. కాని ఆ వెనుక ఏదో వుత్తరాలతో వచ్చే పెట్టెలవలె ఆ పెట్టె వుండడంచేత అలాంటిదే మళ్ళీ వచ్చిం దనుకొని చూచే ఊరకున్నాను. మహారాజా!

ఇంతలో ఆ మందిరంలోకి చిరునవ్వు నవ్వుతూ గోన గన్నారెడ్డి చేతిలో ఒక పరశువును ధరించి వచ్చాడు. అతని వెనుకే విఠలధరణీశుడు గద ధరించి వచ్చాడు. సూరనరెడ్డి మహాఖడ్గం ధరించి వచ్చాడు. వీరి ముగ్గురిని చూచి అక్కడ చేరిన రక్షకభటులు, సాయుధులూ, నిరాయుధులూ అందరు నిశ్శబ్దం అయిపోయినారు. కాచభూపతి నోటిలోనుండి రాబోయిన మాట అక్కడే ఆగిపోయింది. తెరిచిన నోరు తెరిచినట్లే ఉంది. అతని బుంగమీసాలు వణకిపోయాయి.

గోన గన్నారెడ్డి నవ్వుతూనే “ఓయీ కాచయనాయక ప్రభూ! నువ్వు నా వుత్తరంచూచి అంత భయపడిపోయా వేమిటి? నీకు పనికివచ్చే వుత్తరాలు వస్తే ఆనందమా? అప్పుడు నీ అంతఃపురరక్షకులు మంచివారా? ఇప్పుడు ద్రోహులైపోయారేమి! ఏమి ధర్మవిచారణ ధురీణుడవు! ఎవరో పిశాచులు కాకతీయ విరోధులు నీకు ధనం పంపిస్తే ధనాగారంలో దాచుకుంటావూ! నా చిన్న చురకత్తి వస్తే వంటింటికుందేలు వవుతావూ! ‘సర్వ సన్నాహం చేయి’ అని ఆ కటక జంతువులు నీకు వార్త పంపిస్తే శ్రీశ్రీశ్రీ గణపతిదేవచక్రవర్తిపై తిరుగు బాటు చేస్తావుగా! నేనురా, ఈ రాజ్యం దోచుకునేందుకు అధికారం కలవాణ్ణి. నా దొంగతనానికి నువ్వా అడ్డం వచ్చేది? శ్రీచాళుక్య వీరభద్రప్రభువు, శ్రీమహాదేవప్రభువు నిడుదప్రోలులోలేరని ఇదే అద ననుకున్నావు!” అని పక పక నవ్వాడు.

కాచప్రభువు దిగ్భ్రమచెంది, ‘ఓరి దొంగా, కన్నంవేసే ముచ్చూ! నువ్వట్రా నాకు నీతులు నేర్పేది?’ అని ఆంబోతులా రంకె వేశాడు.

గన్నారెడ్డి ‘అవునురా! నేను ముచ్చును, నీబలం దొంగిలించడానికి వస్తున్నానని వార్త పంపానుగా’ అని, ఆశ్చర్య మందినట్లు తమ్మునివైపు చూచి ‘విఠలప్రభూ! మనం వస్తామని వార్త పంపిస్తే ఈలా అంతఃపురరక్షకు లందరిని చుట్టూపెట్టుకొని నాటకమాడుతున్నా డేమిటి ఈ రాజద్రోహి?’ అని మెల్లగా ప్రశ్నించాడు.

విఠలధరణీశుడు సింహగర్జనలా నవ్వుతూ, ‘అన్నయ్యగారూ! మనం వచ్చామని గౌరవం చేయడేమిటి? రండి పోదాము’ అని పలికాడు.

కాచయనాయుడు ‘కోటలోకి ఎల్లావీరు వచ్చారు? ఇంత నిర్భయంగా ఎలా రాగలిగారు; ఎందుచేత వీరి కింత నిర్భయం? అని అనుకుంటూ వుండ గానే దుర్గరక్షకాధికారి పరుగున ఆ మందిరంలోకి వచ్చి, ‘మహాప్రభూ, కోటంతా గోన గన్నారెడ్డి గజదొంగలజట్టు నిండిపోయారు. కోటలో ఉన్న మన సైన్యాన్నంతా ఆక్రమించుకొని నిరాయుధుల్ని చేశారు. రాజప్రసాదాలన్నీ ఆ దొంగలు నిండిపోయారు. పురమంతా ఆ దొంగలే! మన ఎక్కడిసైన్యం అక్కడే నిలబెట్టి నిరాయుధుల్ని చేశారు. నేను వారి కందకుండా పారిపోయి తమకడకు వచ్చాను’ అని అతడు రోజుకుంటూ చెప్పినాడు. గన్నారెడ్డి అతన్ని చూచి పక పక నవ్వుతూ, ‘ఓయి దుర్గరక్షకుడా! నీ ఆయుధం రేచెరువుల ప్రభువు చేతిలో ఉందిలే! మల్లిరెడ్డి ప్రభువును ఎరుగవుకాబోలు! పోనీలే! ఇప్పుడు నీ ప్రభువునకు ఏమి ఆలోచన చెప్తావు?’ అని ప్రశ్నించాడు.

సూరన్నరెడ్డి మాట సముద్రంహోరే! ‘గన్నమహారాజా! ఈ మాటలన్నీ ఎందుకు? ఏదో మహాయుద్ధం జరుగుతుందని నన్ను అనవసరంగా మన కోట నుండి లాక్కువచ్చారు. కత్తి ఒరనుండి తీయనేలేదు! కోట ఎలాగా పట్టుకున్నారు. ఈ కాచభూపతిని మేడిపల్లిపురానికి అవతల విడిదిచేసిఉన్న అతని సైన్యాలకడకు పంపండి. ఆతడు సైన్యాల నన్నింటిని పంపివేసి తిన్నగా నిడుదప్రోలు శ్రీ ఇందుశేఖర మహారాజులంవారికి లోబడి వారు విధించిన శిక్ష అనుభవిస్తే మనదారిని మనం వెళ్ళుదాము. కాదంటారా మనతో యుద్ధం చేస్తాడు’ అని అతడు మనవి చేశాడు.

అవునవు నంటూ గన్నారెడ్డి చిరునవ్వు నవ్వుతూ ‘ఓయి కాచనాయకా! నువ్వు నా ఆలోచన వినదలచుకొంటే ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని మాకు పదిలక్షల బంగారు టంకాలు ఇచ్చి, నీ సైన్యం ముప్పాతికమందిని పంపించివేయి. ఆ వెనుక నిడుదప్రోలు ప్రభువు శరణివేడు, లేదా నిన్ను ఈ పరశువుతో ఖండ ఖండాలు చేసి కాకులకు గద్దలకు విసిరివేస్తాను. నడు, కోటలోనుంచి. నీకు నమ్మక ముంటే నీ కుటుంబాన్ని ఇక్కడ ఉంచు. నమ్మకం లేకపోతే కూడా తీసుకుపో. ఏ విషయమూ వెంటనే చెప్పు’ అన్నాడు.

ఉగ్రుడై మండిపోతూ కాచయనాయకుడు మాట్లాడకుండా ఆ మందిరంలో నుండి వెడలిపోయాడు.

10

కోటలోనూ నగరంలోనూ ఉన్న తన అయిదువేల సైన్యాన్నీ బందీలు చేసినాడు గాబోలు ఈ గన్నారెడ్డి గజదొంగ. వీ డెక్కడనుంచి వచ్చాడండీ! వీడికి తన విషయాలన్నీ ఎలా తెలిశాయి? వీడిని గురించి తాను విన్న విచిత్రాలన్నీ నిజమేనా? ఇంతదూరం ఎంతసైన్యంతో వచ్చాడు? ఎల్లా వచ్చాడు? ఎల్లా తన సైన్యం అంతా బందీచేయగలిగాడు? తాను ప్రస్తుతం చల్లగా ఊరుకొని వీలు వచ్చిన వెంటనే మళ్ళీ యుద్ధసన్నాహం చేయడమా, లేకపోతే తెగబడి యుద్ధం చేయడమా?

తాను ఈ రాక్షసితో యుద్ధంచేయడంలో మేళ్ళు చాలా ఉన్నాయి. ఒకటి వాడకి అందుబాటులో లేనిదేశం. దేశంఅంతా తనవాళ్ళు. తనకు కొత్తసైన్యాలు వస్తాయి. వీడికి ఉన్న సైన్యమే, కోటలోఉన్న తినుబండారపు వస్తువులే వీడికి; తనకు దేశం అంతా ఉంటుంది. తాను మహాయుద్ధాలు చేయడానికి సన్నాహం చేశాడు. తెలిసిఉన్న తనకోట తాను పట్టుకోవడం సులభం. ఈ పిశాచిగాడికి కోట అనుపానులు తెలియవు.

అయితే తన ధనం కోటలో ఉంది. తన సైన్యాలకై తెచ్చిన ఆహారసామగ్రులు నగరంలోనూ, కోటలోనూ ఉన్నాయి. ఆ తిండితో , ఆ యుద్ధసామాగ్రితో వీడూ, వీడి సైన్యమూ ఆరునెలలు యుద్ధంచేయవచ్చును. అయితే తన నగరంలోని ప్రజలందరూ తనపక్షం.

ఈలా చేసినాడేమి? ఇంత నిర్భయంగా తన్ను ఇలా వదలివేయడంలో ఉద్దేశ మేమిటి? ఇంత గజదొంగ ఏదో కారణంలేక త న్నలా వదలిపెట్టునా? పై నుంచి ఈతనికి సహాయం ఏమివస్తుంది? ఎక్కడనుంచి వస్తుంది?

తాను గజదొంగను నాశనం చేస్తున్నాడు అని లోకం అనుకుంటుంది. గణపతిచక్రవర్తి ఈతని తలచూస్తే చాలా సంతోషం పొందుతాడు. వారందరూ ఈ గజదొంగను పట్టుకోవాలని ఏలాగూ చూస్తున్నారు; అందుకని ఈ దుర్మార్గుడు తెలివితక్కువగా తనకు ఇచ్చిన ఈ సావకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? తన నగరాన్ని తాను ముట్టడింపవలసినా, అదీ శుభమే! ఎలా అయినా తాను చక్రవర్తి అయ్యే శకునాలు ఎన్నో కనబడుతున్నాయి.

కాచనాయకుడు గన్నారెడ్డికడనుండి తన అంతఃపురంలోకి వెడుతూ ఆలోచించుకొన్నాడు. భార్యను, బిడ్డలను వెంటబెట్టుకొని శిబికలపై నెక్కి నగరం బైటకు వెళ్ళి అక్కడకు నాలుగుమైళ్ళు దూరంలోఉన్న తనసైనిక శిబిరంకడకు వెళ్ళాడు. అక్కడ ఉన్న తన సైన్యాధిపతులకు గజదొంగ గన్నారెడ్డి నగరమూ, కోటా ఆక్రమించుకొన్నాడనీ, తాము వెంటనే ముట్టడించాలనీ ఆజ్ఞ ఇచ్చి సాయంకాలానకు సర్వసైన్యాలతో నగరం ముట్టడించాడు.

ముట్టడించిన వెంటనే కాచయనాయకుని సైన్యాన్ని గన్నారెడ్డి రెండవ సైన్యం ముట్టడించింది. ఆ రాత్రి జరిగినయుద్ధం గోదావరీతీరంలో ఎప్పుడూ జరుగలేదని పెద్దలు చెప్పుతారు.

గన్నారెడ్డి సైనికులు రాత్రియుద్ధంలో ఆరితేరినవారూ, సర్వవిధాలా నిగ్గులు తేలిన కఱకుబంటులూ. వారికి రాత్రియుద్ధపు మాయలు ఎన్నైనా తెలుసును. కొద్ది మంది దెబ్బకొట్టి పారిపోవడం, ఒక అర్ధగవ్యూతి పారి పోయి వెనక్కు తిరగడం, అక్కడే పొంచివున్న ఇతర సైన్యాలతో విరోధుల సైన్యంమీద విరుచుకుపడడం తమలోతాము ప్రత్యేకించి ఏర్పరచుకొన్న సాంకేతికాలతో ఒకరినొకరు తెలుసుకుంటూ విరోధిమూకను చెండాడడం! ఈలా కోటను ముట్టడించిన సైన్యంలో గగ్గోలుపుట్టించి కొన్ని దళాలను నాశనం చేసివైచిరి.

కోటతలుపు తెరచి నగరకుడ్యాలదగ్గర ఉన్నసైన్యంలోకి రాక్షసులవంటి సైనికులు వచ్చి చేసినయుద్ధం అప్రతిమానం.

గన్నారెడ్డి, విఠలధరణీశుడు, సూరనరెడ్డి ఏబదిమంది వీరులతో కోటలో నుంచి కాచయనాయకునిముందే నగరంవదలి వెళ్ళిపోయారు. వా రిప్పుడు వేయిమంది అశ్వికులను వెంటబెట్టుకొని, సైన్యం ఎక్కడ పల్చగాఉన్నదో అక్కడ జొరపడ్డారు. ఆశ్వికవీరుల ప్రాణాలు ఒత్తుగాఉన్న విరోధుల ప్రాణాలు ఆకాశానకు ఎగరగొట్టుతున్నాయి. నదికి మధ్యగా ఒక హిమాలయ పర్వతం చొచ్చినట్లు వారు విరోధిసైన్యాలను చొచ్చారు. వారివెంట మూడువేలమంది ఆరితేరిన పదాతులు చొచ్చినారు.

మొదటిరాత్రే ఈలా పైనుంచి సైన్యంవచ్చి తన సైన్యాన్ని పొదుపుతుందని కాచయనాయకుడు కలలోనన్నా అనుకొనలేదు. తాను మహాగజం ఎక్కి సైన్యాలకు ఎంత ఉత్సాహం కలిగిస్తున్నా కాచయసైన్యాలు తలకొకదిక్కుగా చెదిరిపోయాయి.

గన్నయ్య గుర్రపుసైన్యం కాచయనాయకుని ఏనుగులదండును చుట్టుముట్టింది. గజయుద్ధంలో ఆరితేరిన ఆ ఆశ్వికసైన్యం, ఆ ఇరువది ఏనుగులపైన అగ్నిభాణాలుకురిపించింది. ఏనుగులు చెల్లాచెదరై పోయినవి. కాచయనాయకు డధివసించిన భద్రగజంమాత్రం విచిత్రగతులతో గన్నయ్యసైన్యాన్ని చికాకుపరుస్తున్నది. అప్పుడు గన్నయ్య మూడు అగ్నిబాణాలు అంబారిమీద వేయించాడు. ఆ వెంటనే గన్నయ్య అశ్వంమీదఉన్న తాడును అతివేగంతో అంబారీమీదకు విసిరాడు.

కాచయనాయకుని రక్షిస్తున్న అంగరక్షకులు ఆ అగ్నిబాణాలు తిరిగి విసిరి వేశారు గాని వానితోపాటు భయంకర కాలనాగంలా వచ్చిన సూత్రాస్త్రమును వారు గమనించలేదు. ఆ సూత్రం చివరఉన్న జారుముడి టక్కునవచ్చి కాచయ నాయకుని శిరస్సుపై నబడి జారి బిగుసుకుపోయింది. ఆ తాడుతోపాటు బంతిలా ఎగిరి కాచయనాయకుడు ఆ అంబారీలోనుంచి కిందకు పడిపోయాడు.

తాడు ఉరై బిగుసుకుపోయి కిందపడడంలో కాచనాయకుని ప్రాణాలు భగవంతునిలో లీనమైపోయాయి.

గన్నారెడ్డి తాడుపట్టుకొనే గుఱ్ఱాన్ని పరుగెత్తించాడు. కాచయ కళేబరము బరబర ఆతనివెంట నలుబదిబారల దూరంలో భూమిమీదకర్రలావచ్చింది.