గోన గన్నారెడ్డి/సప్తమగాథ

వికీసోర్స్ నుండి

సప్తమగాథ

కాకతమ్మ

1

కాకతమ్మ ఉత్సవాలు శాలివాహనశక 1185 రుధిరోద్గారి సంవత్సర ఆశ్వయుజ పాడ్యమినుంచి ప్రారంభమయ్యాయి. ఓరుగల్లునగరంలో కాకతమ్మ ఉత్సవాలకు ఆంధ్రదేశం అన్ని విషయాలనుండీ లక్షలకొలది జనం వచ్చిపడతారు. ఆ సమయంలోనే ఏకవీరాదేవి ఉత్సవమూ జరుగుతుంది.

కాకతమ్మ కాకతీయులకు కులదేవత. కాకతీయ బొట్టభేతరాజు కాలానికే కులక్రమానుగతమైన ఈ గాథ ప్రచారంలో ఉంది. కాకతమ్మ గాథ ఆ దసరా పండుగలకు ప్రతిరోజూ మహారాజుల నగరంలో పాడుతూ ఉంటారు.

కాకతీదేవి పురాణకాలంనుంచీ కాకతీయ గణానికి కులదేవత. కాకతీయ గణం ఆర్య క్షత్రియ గోత్రాలలో ఒకటి. ఈ గణం వేదకాలం నుంచీ ప్రసిద్ధి కెక్కింది. ఆ పురాతనకాలంలోనే కాకతీయగణం ఆంధ్రదేశానికివచ్చి వారి దేవతను ఆంధ్రదేశంలోనూ నెలకొల్పారు. ఆ దేవతను కొలుస్తూ వచ్చిన ఒక దుర్జయ క్షత్రియవంశం శాతవాహనుల కాలంనుంచీ కాకత్య వంశంవారై చాళుక్యుల కాలంలో సబ్బసాహిర మండల ప్రభువు లయ్యారు. తూర్పు పశ్చిమ చాళుక్య రాజ్యాల మధ్యస్థమైన ఈ మండలం ఒకసారి వీరికి, ఒకసారి వారికి, ఇంకొకసారి కాంచీపుర పల్లవులకు సామంత రాజ్యంగా ఉండేది.

ఈ సబ్బిసాహిరదేశంలో గోదావరీతీరంలో ఉన్న కొఱవిదేశంకూడా ఉండేది. ఈ మండలానికి అనుమకొండ ముఖ్యపట్టణంగా ఉండేది.

బొట్టభేత మహాప్రభువు చిన్నబాలకుడై ఉన్న సమయంలో ఆయన తండ్రి అయిన ప్రోలమహారాజు దివంగతుడై నాడు. ఆ సమయంలో కాకతివంశ సామంతుడైన గాడయనాయకుని అన్న వచ్చి అనుమకొండను ఆక్రమించుకొన్నాడు.

ప్రోల మండలేశ్వరుని భార్య అనంగదేవి చిన్నకుమారుడయిన బొట్టభేత రాకుమారునితో పిల్లలమఱ్ఱి పారిపోయి కాకతీయ సామంతుడైన విర్యాల ఎఱ్ఱ నరేంద్రునికడ తలదాచుకొన్నది. ఎఱ్ఱనరేంద్రుడు కాకతీయవంశం అంటే మహాభక్తి కలవాడు. ఆతడు వెంటనే సైన్యాలు పోగుచేసుకొని, అప్పుడు కొఱవిదేశంలో ఉన్న గాడయనాయకుని అన్న కామయనాయకుని ఎదిరించి, మహాయుద్ధంచేసి, విజయంపొంది బొట్టభేతనికి తిరిగి కొఱవిదేశం సమర్పించాడు. ఇంతట్లో ఎఱ్ఱన చనిపోయాడు. అతని భార్య కామమసానిదేవి పల్లవ చక్రవర్తి కడకు బొట్టభేతని తీసుకువెళ్ళి సమస్తమూ పల్లవచక్రవర్తికి నివేదించింది. బొట్టభేత డప్పుడు పదునాలుగేండ్ల బాలుడు. అప్పటికే అతని పరాక్రమం కథలు చెప్పుకుంటున్నారు. ఆ బాలుణ్ణి చూచి పల్లవ చక్రవర్తి భాస్కరవర్మ ఆనందించి ఏబదివేల సైన్యం భేతనికి ఇచ్చినాడు.

భేతభూపతి కామమసాని కుమారుడు. సూరనాయకుడు మొదలయిన సేనాపతులతో కూడి అనుమకొండ ముట్టడించాడు. గాడనాయకుడు అనుమకొండ ఆక్రమించి వున్నాడు. బొట్టభేతడు ఎన్నాళ్ళు ముట్టడి జరుపుతున్నా అనుమకొండ కోటను పట్టలేకపోయాడు. అప్పు డనుమకొండలో వెలసి వున్న తన కులదైవతము కాకతమ్మను ప్రార్థించి బొట్టభేతడు తనతోవున్న ఆ తల్లిపూజా విగ్రహాన్ని పూజించి తన తల పూర్ణాహుతి ఇవ్వబోతే, ఆదేవి ఆకాశవాణిగా ‘నాయనా, వీరభద్రతటాకం ప్రక్కన బురుజును రేపు తాకవయ్యా! విజయం లభిస్తుంది’ అని పలికినదట.

బొట్టభేతడు తన తల బదులు వేయి నారికేళాలు పూర్ణాహుతి ఇచ్చి, మరునాడు కాకతమ్మ చెప్పినచోట బురుజును, కోటగోడను అతి ఉద్థృతంతో తాకినాడట. పదిఘడియలు యుద్ధం జరుగగానే ఆ కోటగోడ పెళపెళ విరిగి పడి పోయిందట. ఆ దారిని బొట్టభేతడు అనుమకొండ కోటలో జొరపడి గాడయను యుద్ధంలో హతమార్చినాడట.

కాకతమ్మ గాథలు ఈలా ఎన్నో ఉన్నాయి. గణపతిదేవచక్రవర్తి పెదతండ్రి రుద్రమహారాజు కలలో కనపడి కాకతమ్మ రాజధాని అనుమకొండ నుండి ఇంకో నూతన స్థలానికి మార్చు మన్నదట. ‘ఆమె ఎక్కడ వెలుస్తుందా’ అని చూస్తూఉంటే, అనుమకొండకు కొంతదూరంలో ఒకకాపు దున్నుకుంటూ ఉండగా నాగేటి చాలులో అమ్మవారి విగ్రహం ఒకటి దొరికిందట. అక్కడే వున్న గొల్లసానికి కాకతమ్మ పూని ‘నేను కాకతమ్మను, నాకు గుడి కట్టండఱ్ఱో’ అని ఊగిసలాడిపోయిందట. రుద్రమహారాజు వెంటనే ఆమె కక్కడ గుడి కట్టించి, అక్కడే కోట కట్టించాడట. ఆ కోటమధ్య ఒంటిశిలకొండ ఉండడంవల్ల ‘ఏకశిలానగరం’ లేక ‘ఓరుగల్లు’ అని పేరు వచ్చింది.

అది మహాపట్టణమై కాకతీయ చక్రవర్తుల నూతన రాజధాని అయినది. కాకతమ్మతోపాటు ఏకవీరాదేవి గుడికూడా ఆ ప్రక్కనే ప్రతిష్ఠ చేయించాడు రుద్రచక్రవర్తి.

ఆ దసరా మహోత్సవాలకు కాకతిమహాదేవి విగ్రహానికి బంగారు తొడుగు తొడుగుతారు, వజ్రవైడూర్యాది రత్నాలు పొదిగిన భూషణాలు పెడతారు. నెల పొడుగుచీరలు కట్టుదురు, కంచుకాలు తొడుగుతారు. దినాని కొక వాహనం చొప్పున ఆమెను రాత్రి అంతా మేళతాళాలతో, నర్తకీమణుల నాట్యాలతో ఊరేగిస్తారు. దేశ దేశాలనుండి అనేక విచిత్ర వస్తువులను కొనివచ్చి విపణి ఏర్పాటు చేస్తారు. కోనేరు స్నానాలాడి భక్తులు, భక్తురాండ్రు అమ్మవారికి పూజలు చేస్తారు.

ఆ మహోత్సవాలకు రుద్రదేవ మహారాజుకూడా వస్తూఉండేవారు. ఆమె స్వయంగా పూజచేస్తూ ఉండేది. ఆమె మనస్సులో ఉన్న ఆలోచనలకు అంతు లేదు. పూజచేస్తూ అమ్మవారిముందు ఒక దంతపీఠంపై అధివసించి తల్లీ! నా కర్తవ్యం ఏమిటమ్మా? అని ప్రశ్నిస్తూ ఉండేది.

ఆ దినాల్లో ఆమె మనస్సుకు నిలకడలేదు, ‘చాళుక్య వీరభద్రుని వివాహ మాడడమా, లేక బ్రహ్మచారిణిగా గడపడమా’ అనే ప్రశ్నకు ఈ రెండేళ్ళన్నర నుండి ప్రత్యుత్తరంలేదు. చూస్తూచూస్తూ ఉండగా రెండేళ్ళన్నర గడిచి పోయింది. తండ్రిగారు, మాట్లాడరు. శివదేవయ్యమంత్రి ‘ఏమీ ఆలోచించారు’ అని ఎన్నోసారు లడిగినారు.

2

చాళుక్య రాజకుమారుడు వీరభద్రప్రభువు, కాచనాయకుని గోన గన్నారెడ్డి ఏనుగుపై నుండి ఉరివేసి క్రిందకులాగి చంపినవెంటనే సైన్యాలతో మేడిపల్లి పోయి ఆ నగరాన్ని ఆక్రమించుకొని రెండేండ్లయినది. జాయపసేనాని మధుమావతీదేవితో సంగమేశ్వర తీర్థసేవావ్యాజమున నేగి లకుమయారెడ్డి సైన్యాలను ఓడించి వానిని నాశనంచేశాడు. గన్నారెడ్డి మాయచేసి తన పినతండ్రి లకుమయను పట్టుకొని, శివదేవయ్య మంత్రికడకు పంపెను. ఆయనను తన నగరిలోనే ఉంటూ, శివభక్తుడై కాలం గడపవలసిందని రుద్రదేవ మహాప్రభువు హెచ్చరించారు. గన్నారెడ్డి వందిభూపాలాది రాజద్రోహ సామంతులను అనేకులను అణచివేసెను.

గోన గన్నయ్య కాచనాయని నాశనం చేయడంతోనే ఊరకొనక, కాచనాయకునికి సహాయం చేయడానికి సిద్ధపడ్డ కాళింగాంధ్రులపైకి ఎత్తిపోయి వడ్డాది దగ్గర వారి సైన్యాలను మూడువైపులనుండి పొదివి హతశేషుల్ని కూడా విడువకుండా నాశనంచేసినవా డాయెను.

ఆ తర్వాత గన్నారెడ్డి తన కోటకు పోయినాడు. ఆ కోటను పట్టుకోవాలని ఎంతమందో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసేవారిలో హరిహరదేవ మురారిదేవులు ముఖ్యులు. హరిహర మురారిదేవులు అతిరహస్యంగా లకుమయారెడ్డిని ఓరుగల్లులో కలుస్తూనే ఉండిరి. లకుమయారెడ్డి ఆ కారణంగా తన ఓరుగల్లు నిర్భందవాసము తన మేలుకొరకే వచ్చిందని సంతోషించినాడు. దుర్గాష్టమినాడు ఊరంతా మహోత్సవమై సకల దేవలోకాలు భూమికి దిగివచ్చి, ఓరుగల్లు అమితోత్సాహాన తాండవించిపోయింది. ఆ మహోత్సవ సమయాన రాత్రి కాకతిదేవిని బంగారు సింహవాహనంమీద నగరం అంతా ఊరేగించారు. ఆ ఊరేగింపులో మండలాధిపులు, సేనాపతులు మొదలగువా రెందరో పాల్గొన్నారు. రుద్రదేవమహారాజు భద్రగజారోహణంచేసి కొంతదూరం ఊరేగింపులో పాల్గొన్నారు.

రాత్రి అర్ధయామం దాటినంతట మహారాజు, మండలేశ్వరులు, సేనాపతులు ఎవరి ఇళ్ళకు వారు పోయి తెల్లవారి స్నానాదికాలు నిర్వర్తించుకొని మహానవమి ఉత్సవానికి కోటలోకి వస్తారు. ఆ మహారాజు తర్వత వెళ్ళిపోయిన సామంతులలో గోన లకుమయారెడ్డి మొదటివాడు. తరువాత ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయినారు. ఆ తెల్లవారుగట్ల కాకతమ్మ గుడిబైట వీధిప్రక్క అక్కడక్కడ ఇరువదిమందియు, నల్గురు మనుష్యులు వీధి మండపంలోనూ చేరారు.

గుడిలో అయిదారు దీపాలు మినుకు మినుకు మంటున్నాయి. గుడిలో, గుడి ఆవరణలో, గుడిబైటా వెలిగించి ఉంచిన కాగడాలన్నీ ఆరిపోయినవి. కొన్ని లక్షలమంది జనులు ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఉత్సవమంతా కాగడాలే, ఆముదము కాగడాలు, కొబ్బరి కురిడీ కాగడాలూ, నేతికాగడాలతో నగరం అంతా పగలైంది. కాని కాకతీదేవి గుడిదగ్గరమాత్రం కటికచీకటి. ఆ మండపంలో చేరినది గోన లకుమయప్రభువూ, హరిహరదేవుడూ, మురారిదేవుడూ, లకుమయ మంత్రి రుద్రామాత్యుడున్నూ.

“మనం అతి కష్టంమీద కలుసుకొన్నాము. ఈ మధ్య రహస్యచారులను పెట్టి ప్రసాదాదిత్యుడు అతిజాగ్రత్తగా ఉంటున్నాడు. నేను కదిలితే ఆ విషయం ప్రసాదాదిత్యునకు తెలుస్తుంది. ఈ దినం పుణ్యదినం. అందుకనే కాకతమ్మ గుడే మనకు అనువైన ప్రదేశమైనది. మీ నగరి చుట్టూకూడా ప్రసాదాదిత్యుడు రహస్య చారుల్ని కాపుంచి ఉండాలి. ఎప్పుడు తాము ఈ సింహాసనం ఆక్రమించుకుంటారో అని ఎదురుచూస్తూన్నాము, మేమంతా” అని హరిహర మురారులతో లకుమయారెడ్డి అన్నాడు.

హరిహరదేవుడు: గోనప్రభూ! మీరంతా మా పక్షాన పనిచేయడం మాకు లక్ష ఏనుగుల బలంగా ఉంది. మేము యాదవ మహాదేవరాజుకు వేగు పంపించినాము. తమ తండ్రి కృష్ణభూపతి అవసానకాలం సమీపించినదనిన్నీ, తమతండ్రిగారి మూలంగా తాము ఓరుగల్లుపైకి ఎత్తిరావడానికి వీలుకలగడం లేదనిన్నీ, తమతండ్రి పరమపదారోహణ చేయగానే తాము ఇదివరకేసర్వసైన్య సన్నాహంతో ఉండడంచేత వెంటనే బయలుదేరివచ్చి ఓరుగల్లు ముట్టడించి తీరుతామని, రుద్రమ్మనూ గణపతినీ హతమార్చిన వెనుక తమకు తొమ్మిదికోట్ల మాడల ధనం ఇవ్వవలసి ఉంటుందనిన్నీ మాకు యాదవమహాదేవరాజు వేగు పంపించారు.

లకు: మేముకూడా వేగుపంపించి ఉంటిమి. ఈ రుద్రయామాత్యుల వారే మహాదేవరాజుకడకు వేగు తీసుకువెళ్ళి తిరిగి వస్తూఉంటే దారిలో ఆ రాక్షసుడు పట్టుకొని బందీచేసి తీసుకు వెళ్ళిపోయినాడు,

మురారిదేవుడు: ఎవ డా రాక్షసుడు?

రుద్రయామాత్యుడు: మరి ఎవరున్నారు ప్రభూ? గన్నయ్య! నన్ను బందీగా పట్టుకువెళ్ళి ఏమీ బాధపెట్టనూలేదు, రహస్యములు అడగనూలేదు.

హరిహర: ఎవడండీ ఈ గజదొంగ?

రుద్ర: మా ప్రభువు వారి అన్న కొమారుడు. ఆ ప్రభువు పేరూ, పవిత్రమైన గోనవంశం పేరూ కళంకం చేస్తూ పుట్టుక చక్కా వచ్చాడు.

మురారి: వీడికి గజదొంగ అని పేరు సార్ధకమే! నెమ్మది నెమ్మదిగా మనలో చేరిన సామంతులనందరినీ చావగొడుతున్నాడు. వాళ్ళదగ్గర ధనం దోస్తున్నాడనుకోండి!

లకు: అది వాడు వేసిన మంచి ఎత్తండీ! వాడు దోచడానికి చక్కనివీలు. ఏవో అనుమానాలున్న ప్రభువును చూస్తాడు, ఆ ప్రభువుమీదకు వెళ్ళి విరుచుకు పడతాడు.

హరిహర: ఎంతయినా చక్కని యుద్ధం చేస్తాడు. ఆ నేర్పు తండ్రి పినతండ్రుల పోలికలను బట్టి వచ్చి ఉండాలి.

రుద్ర: ఏమి నేర్పులెండి. దొంగతనాలు చేసేవారు మొదట సులభంగా బళ్ళు దోచుకుంటారు. మనుష్యునికి ఉండే సాధారణపు అశ్రద్ధ దొంగకు మంచి వీలునిస్తుంది. అలాగే నాయకుల అశ్రద్ధ ఈ దొంగకు అదనయింది. రహస్య వర్తనం రెండవబలం, దొంగకు రాత్రిబలం అన్నట్లు. ఇకరమ్మనండి. ఈయనగారి కృత్రిమాలన్నీ ప్రతివానికీ తెలిసిపోయాయి. మగవాడైతే బరిమీదపడి యుద్ధంచెయ్యాలి.

హరిహర: తాము చెప్పింది నిజమే మంత్రీ! ఈ రాజ్యాధిపులంతా, నిమ్మకు నీరెత్తినట్లు గజదొంగను ఈ దేశాన విచ్చలవిడిగా తిరుగనిస్తున్నారు. ఎలా తిరుగనిస్తున్నారు? అదీ నా కాశ్చర్యం.

రుద్ర: సామ్రాజ్యం దుర్బలం కావడమే ఇంతకూ మూల మనుకోండి, ప్రజ లెవరికీ ఆడది రాజ్యం చేయడం ఇష్టంలేదు. ఆవిడ సామంతులకు మాత్రం ఇష్టమా ఏమిటండీ? వారు అదనుకోసం చూస్తూ ఉన్నారు మహారాజా!

లకుమయ్య: శివదేవయ్య అసాధ్యుడు, ఎవరై తేనేమి? తను వేసే ఎత్తుగడలకు సహాయంచేస్తే సరి! తన అవసరం తీరిన తరువాత అతన్ని హతమారుస్తాడు. హరిహర: లకుమయమహారాజా! మీ అన్నగారి కుమారుడని ఇంతకాలమూ సందేహించాము. ఇక ఆ గన్నయ్యను నాశనంచేసే ఎత్తు ఎత్తుదాము.

రుద్ర: మా మహారాజుగారికీ అందుకు అభ్యంతరములేదు. అయితే నా మనవి, మనం వేసిన పెద్ద ఎత్తుగడ నెగ్గితే, ఈ దొంగను నాశనం చేయడం ఎంతసేపు అని. జాయప మహారాజు మా సైన్యాన్ని నాశనం చేశాడని అనుకుంటున్నారు. అది వట్టిమాట. ఈ దినాన వర్థమానపురం పట్టుకోవాలంటే పది లక్షల సైన్యం వెళ్ళాలి!

మురారి: మహారాజా! మీరు వెంటనే ఈ నగరం వదిలి పారిపోయే వీలు కొరకు మేము అన్ని మార్గాలూ సిద్ధం చేస్తున్నాము. మా సైన్యమూ వృద్ధి అయినది.

లకుమయ: అవును, మనకు సర్వవిధాలా సహాయం చేస్తామని ఒక రహస్యమైన వేగువస్తూ ఉంటుంది. వారు ఎవరో తెలియలేదు!

హరిహర: ఆ పురుషు డెవరో నాకూ గ్రాహ్యం కావటంలేదు.

లకు: చోడోదయుడు పూర్తిగా మన పక్షమే చేరినాడు. మధుర పాండ్య మహారాజో, చోడమహారాజో అయి ఉంటాడని నా ఉద్దేశం. కళింగభూపతి కాదు. మేడిపల్లి కాచయనాయకుని విషయంలో వారు బయలుపడినారు. ఈ వార్త దక్షిణాన్నుంచే వస్తున్నదండీ!

లకుమయ: అదే మా అనుమానమున్నూ !

3

శ్రీ మల్యాల కుప్పసానమ్మ దేవేరి రెండేండ్ల క్రిందనే బుద్దపురం వెళ్ళిపోయింది. శివదేవయ్య మంత్రి ఆలోచన ప్రకారం అన్నాంబికాదేవిని, రుద్రమాంబాదేవి అంతఃపురంలో ఉంచి, కుప్పసానమ్మ వెళ్ళిపోయింది.

ఆవల తల్లి దగ్గరనూ ఉండక, ఈవల తాను ప్రేమించే వీరుని అక్కగారి కడనూ ఉండక, రుద్రమదేవి అంతఃపురంలో ఉండడానికి అన్నాంబిక కొంచెం బాధపడింది. కాని, రుద్రమాంబికాదేవి ప్రేమ చవి చూచీ, ముమ్మడాంబిక అపేక్ష కడుపార గ్రోలీ ఆమె చివరకు రుద్రాంబ నగరిలో ఉండడానికి ఒప్పుకొన్నది.

దుర్గాష్టమి కాకతమ్మ ఊరేగింపుకు రుద్రాంబతోపాటు పురుషవేషం వేసుకొని అన్నాంబిక తానున్నూ పట్టపుటేనుగుపై ఊరేగి తిరిగి నగరు చేరింది. వారిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు అక్కాచెల్లెళ్ళుగా పిల్చుకొంటున్నారు. రుద్రాంబ నిజంగా అన్నాంబికా రాకుమారిని ఒక్క నిమేషం వదలి వుండలేకపోయింది. ఏ విషయం తాను ఆ బాలికతో చర్చించినా ఆమెకూడా చదువుకున్నదే అయివుండడంచేత, ఇద్దరకూ ఎంతో గాఢంగా చర్చ సాగేది. ఒకనాడు కావ్యవిషయం వచ్చేది. రసము ముఖ్యమా, ధ్వని ముఖ్యమా, రీతి ముఖ్యమా అనే చర్చవచ్చేది. అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యం ఈయకూడదని ఒకరంటే, ఇవ్వాలని ఒకరనేవారు. వారి వాగ్వాదాలలో ముమ్మడమ్మ చేరేది. ముమ్మడమ్మ ఒకసారి రుద్రమ్మతో చేరితే, పెక్కుసార్లు అన్నాంబికతో చేరేది. ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు అన్నాంబికా ముమ్మడమ్మలు. ఒక్కొక్కప్పుడు రుద్రాంబ భావానికీ, రసానికీ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి వాదించేది. ఆ సమయంలో అన్నాంబికా ముమ్మడమ్మలు రీతి, ధ్వనీ ఎక్కువ అని వాదించేవారు. వ్యాకరణం, తర్కం, వేదాంతం, గణితం అన్నీ వారి వాదనలలో నాట్యం చేస్తూ వుండేవి. మత సిద్ధాంతాలను చర్చించేవారు. అన్నాంబికా రుద్రాంబలు మాత్రమే వున్నప్పుడు, అన్నాంబ తన హృదయం అంతా రుద్రాంబకు ప్రస్ఫుటం చేసింది.

అన్నాంబిక: ఒక్క చూపులో హృదయం అర్పించుకోవడం సంభవమా అక్కా?

రుద్రాంబ: ఓసి వెఱ్ఱిపిల్లా! ఒక్కచూపులో, ఒక్కమాటలో, ఒక్క వినికిడిలో హృదయం అర్పించుకోవడం సంభవమే! కొన్నిఏళ్ళు కలిసి మెలిసి ఉన్నా, స్త్రీ పురుషులలో స్పందనం ఏమీ కలగకపోవచ్చును.

అన్నాం: ప్రేమ అనేది ఏమిటి? ఒక స్త్రీ పురుషుని కోరడం, ఒక పురుషుడు స్త్రీని కోరడమేకాదా?

రుద్రాం: ఓయి చెల్లీ, అది కామం అవుతుంది. ప్రేమ ఎట్లా అవుతుంది? స్త్రీకి తన పురుషుడు భర్త అవడానికి సావకాశం లేకపోయినా, ఆమె జీవితానికీ, ఆ పురుషుని జీవితానికీ పరమపవిత్ర సంబంధం ఏర్పడిపోతుంది.

అన్నాం: జీవితానికీ జీవితానికీ ఈ ప్రేమసంబంధము వేరవుతుందా లేక ఎన్నోరూపులతో ఆ పురుషుడే తిరిగి తిరిగి ఉద్భవిస్తూ ఉంటాడా?

రుద్రాం: చెల్లీ, ఇవన్నీ గడ్డుప్రశ్నలు. తర్కంప్రకారం ఆలోచిస్తే ఈ కారణాలూ లేవు. ప్రేమలూ లేవు!

అన్నాం: ఉన్నవి?

రుద్రాం: ఆత్మే! ఆత్మలన్నీ ఒక్కటిగదా! అలాంటప్పుడు ఒక ఆత్మ ఇంకో ఆత్మను ప్రేమించడం అనేది లేదుకాబట్టి సంపూర్ణజ్ఞానం లేనివారికే భౌతికమైన ప్రేమవాదన.

అన్నాం: అక్కా! నా వివాహం ఏర్పాటుచేసిన దినాన, ఒక పురుషుణ్ణి చూచాను. ఆ చూచినది మూడు నాలుగు క్షణికాలుమాత్రం. ‘ఆ పురుషునికొరకే నేను జన్మఎత్తినది’ అని నా హృదయానికి తట్టినది. నా కా వివాహం కాదని, ఆ పురుషుడే నా భర్త అవుతాడని నాకు తొలకరి మెరుపులా తత్ క్షణం తోచింది. ఆ వివాహం జరుగలేదు.

రుద్రాం: ఆ పురుషుడే నీ భర్త అవుతాడు.

అన్నాం: అక్కా! వేళాకోళం వద్దండీ!

రుద్రాం: ఓసి వెఱ్ఱితల్లీ! నీతోడనా వేళాకోళాలు? నాకు ఏదో అనుమాన రహితమైన భావం హృదయానికి తట్టింది.

అన్నాం: ఆ పురుషుడే మొదటిసారి వివాహం తప్పించాడు.

రుద్రాం: రెండవసారి ప్రధానమూ తప్పించాడు. నీ రహస్యం నేను గ్రహించలే దనుకున్నావా? ఆతడు గజదొంగ! ఇది నీలో దాగివున్న మనోవ్యధ! అందుకనే నా సేనాపతులకూ, సైన్యాలకూ ఆ గజదొంగను ఏవిధంగానూ బాధించక బందీగా పట్టుకోవలసిందని ఆజ్ఞయిచ్చాను.

అన్నాంబిక రుద్రాంబమాటలు వినగానే ఎంతో సిగ్గుపడింది. ఒకసారి ఆనందంలో మునిగిపోయింది. ఒకసారి గజగజ వణికిపోయింది. ఆ వీరుడు గజదొంగయై ఈలా అందరికోపానికి గురి అవడమా? దేశాలు దోచుకుంటున్న మనుష్యునిపై తన మనస్సు లగ్నమైందేమి? అతనిపై అందరూ కత్తిగట్టితే ఇంక ఆయన ఏలాంటి ఆపత్తులో పడిపోవునో?

ఆయన పట్టుబడెనా! ఎంత అవమానం? ఆ అవమానంవల్ల ఏమి వైపరీత్యాలు సంభవించునో? అన్నాంబిక మౌనం వహించి, కంటినీరు తిరుగుతుండగా క్రుంగిపోయి కూర్చుండుట చూచి రుద్రాంబ ‘తల్లీ లోకంసంగతి ఆడువారికి ఏమి తెలుస్తుంది. వారికి తెలిసున్న కొద్దిలోకము పుట్టిల్లూ, అత్తిల్లూను! అందులో రాజవంశాలవారికి భర్తే సర్వలోకమూ! ఇంత చిన్నతనంలో నీ కెన్ని మనోవ్యాకులతలు వచ్చినాయితల్లీ! నీమనస్సులో చీకాకులేమీ పెట్టుకోకులే! ఈ శరత్కాల జ్యోత్స్నాసమయంలో ఈలా కూర్చోడం ఎందుకు? కాకతమ్మతల్లిని ప్రార్థించు, మనస్సు నిర్మలంచేసుకో, అన్నీ ఆ దేవికే అప్పజెప్పు. ఆమే చక్కపరుస్తుంది’ అని అనునయించింది.

వారిద్దరూ మహానవమిరాత్రి అంతస్తులు గడిచి ఉప్పరిగమీదకుపోయారు.

శారదాకాశంలో చిన్న చిన్న మేఘాలు కలయికలేని భావాలులా అక్కడక్కడ తేలుచున్నవి వెన్నెలమాత్రం మల్లెపువ్వులా, పాలసముద్రంలా అన్నాంబికా రుద్రాంబికల నవ్వులా, మధురంగా పరీమళ పూరితమైన విశ్వం అంతా నిండివుంది.

ఆ వెన్నెలను సర్వాంగాలతో ఆస్వాదిస్తూ ఆ చెలులిద్దరూ ఉప్పరిగమీద ఒక రత్నకంబళిపై ఆసీనులై, ఏదో మాయాప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉప్పొంగినారు.

ఆ వెన్నెల సంగీతము పాడినట్లయి, ఆ వెన్నెల కాకతమ్మ చల్లని చూపులై ప్రసరించిపోయినది.

4

వెన్నెలలో కూరుచున్నవారు ఈలోకమే మరచిపోతారు. దసరా దినాలలో వానలు కురియడం ఆంధ్రదేశంలో ఎక్కువ. ఆంధ్రబాలిక లా దినాలలో బొమ్మల పండుగ చేసుకుంటారు. ఆంధ్రబాలు రా పదినాళ్ళు వీరవిద్యాఖేలనాలలో వువ్విళ్ళూరిపోతారు. ప్రతి ఇంటా పండుగే. ఆ నాటి ఆంధ్రదేశంలో ఈ నవరాత్రి, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమీ పెద్ద పండుగలు. ఆంధ్రబాలికలు ఈ నవరాత్రి ఉత్సవాలలో బొమ్మలు చిత్ర విచిత్రరీతుల అలంకరించి ఇరుగుపొరుగు బాలికలను పేరంటానికి పిలిచి, బొమ్మలకు హారతు లిచ్చి, నృత్య గీతాది వినోదా లర్పించి, శక్తికొలది పుణ్య స్త్రీలకు బహుమతు లందిస్తారు.

గణపతిరుద్ర మహారాజులవారి దేవేరుల నగరులలో గణపాంబాదేవి బాల్యమున ఈ ఉత్సవాలు బాగా జరిగేవి. ఈఏడు పెళ్ళికాని బాలిక అయిన అన్నాంబిక ఉండడంచేత రుద్రమదేవి బొమ్మలపండుగ తలపెట్టింది. ఈ పండుగకు నెలదినాల నుండీ రాజోద్యోగులు దేశదేశాల సాలభంజికలు, విగ్రహాలు, చిత్రాలు, విచిత్రాలు, వినోదాలు, కర్రబొమ్మలు, మట్టిబొమ్మలు, కొమ్ముబొమ్మలు, బంగారపు బొమ్మలు, వెండిబొమ్మలు, దంతమంజూషలు, కీలుబొమ్మలు రాచనగరిలో తెచ్చి వేసినారు.

దక్షిణాదినుండి దంతపుబొమ్మలు, ధరణికోటనుండి పాలరాతివిగ్రహాలు, నతనాటీసీమనుండి కఱ్ఱబొమ్మలు, సిందవాడినుండి ఎఱ్ఱచందనపు బొమ్మలు, గాంగవాడినుండి మంచిగంధపుచెక్క బొమ్మలు, కళింగమునుండి కొమ్ము బొమ్మలు, ఉత్తరాదినుండి ఇత్తడిబొమ్మలు, ఆంధ్రదేశమునం దంతటినుండి చిత్రలేఖనములు వచ్చినవి. చీనా, సువర్ణ, యవ, మలయ ద్వీపాల నుండి లక్కబొమ్మలు మోటుపల్లిలో దిగుమతి అయినవి. భారతావనిలో ఏదేశంలో ఏపనుల ప్రసిద్ధికెక్కినవో అవన్నీ వచ్చినవి.

ఒక మహామందిరమందు శిల్పు లీ విచిత్రమైన వస్తువులన్నీ అలంకరించినారు. ధూపకరండాలనుండి ధూపాలు వస్తున్నవి. ఆకాశంలోని నక్షత్రాలులా దీపాలు వేనకువేలు మిరుమిట్లాడుతూ ఆ మందిరం అంతా స్వర్గలోకం చేశాయి.

ఆవైపు శివలీలలు, ఈ వైపు విష్ణులీలలు, ఈవల పురాణగాథలు, ఇవన్నీ ఆంధ్ర దైనందిన జీవితఘట్టాలు. అక్కడక్కడ నర్తకీమేళం, ఇటు రాజసభ, అది సుధర్మ, అల్లదిగో ఆంధ్రగ్రామం ఒకటి. ఆ ఇళ్ళన్నీ బొమ్మలే. ఇళ్ళలోనుంచి రైతులు వచ్చి పొలాలకు పోతున్నారు. అదే గ్రామసభ. అది గ్రామంలోని పశువులు మేసే బయలు. ఈ నూతిలోనుంచి నీళ్ళు తోడుకుంటున్నారు. అక్కడ పొలం దున్నుతున్నారు. ఓరుగల్లునగరంలో పెద్దకుటుంబాల స్త్రీలు, బాలికలూ అందరూ పేరంటానికి ఆహూతులైనారు. సాయంకాలం ఇరువది ఘడియలు కొట్టినప్పటినుండి పేరంటాండ్రు రుద్రదేవ రాజనగరుకు రథాలమీద, అందలాలమీద విచ్చేసినారు. వారు కట్టుకున్న పట్టుచీరలు, వారు ధరించిన రత్నాల ముత్యాల భూషణాల వెలుగులు మిలమిలలతో, జలజలలతో, తళతళలతో ఆ మందిర మంతా నిండిపోయాయి.

రుద్రదేవి బాలికగా వారి కందరికీ ప్రత్యక్షమగుట అదే మొదటిసారి. ఎంత అందమైనది! ఆమె ఫాలము ఎంత విశాలమైనది! ఆమె కన్నులలో సహస్ర పత్రకమలాలువికసించాయే! ఎంత తీయనికంఠ మీ రాజకుమారిది! సత్యభామ ఈలాగే ఉండేదా? ఈమెను ఈలా దర్శించడం ఎంతపుణ్యం చేసుకుంటే మనకు సంభవమైంది! శచీదేవి, లక్ష్మి, సరస్వతి ఈలాగే ఉంటారుకాబోలు! ఇదివరకు ఊరేగింపులలో మహాసభలలో దర్శించినప్పు డచ్చముగ సుందరుడగు బాలకునిలా కనపడి, ఈ రాజకుమారి, నేడు ఎంత ఠీవిగా, గంభీరంగా, సుందరిగా మనలను ఆహ్వానించింది! ఈలాంటి, ప్రశ్నలు వేనకువేలు ఆనా డక్కడ సమకూడిన ఆంధ్ర రాచభామల, నియోగిమంత్రిల అంగనల; పండితవంశ సుందరాంగుల హృదయాలలో మెరుములు మెరిసి పోయినవి.

ఈ ఉత్సవం చేసేది ముగ్గురు కన్యలు. రుద్రమదేవికన్య, ముమ్మడమ్మకన్య, అన్నాంబికకన్య. ఈ విషయం ఆ దినాన అక్కడకు పేరంటం వచ్చిన ఆంధ్ర కులాంగన లందరూ గ్రహించారు.

ఒకప్రక్క నృత్యగీత వాద్యాలూ, ఒకప్రక్క తీయని ఆంధ్ర యోషల పాటలూ ఆ మందిరమంతా లలితాదేవి దివ్యమందిరాన్ని చేసినవి.

చెలికత్తెలు బంగారు పళ్ళెరాల ముత్యాలు, వివిధ ఫలజాతులు, వివిధ పుష్పాలు, ఆకులు, వక్కలు, లవంగ, జాజికాయ, జాపత్రి, కస్తూరి, కుంకుమ, జవ్వాజి, పిస్తల, చార, ఆరోటు పప్పులు పట్టుకొని వెనుకరా రుద్రాంబ, ముమ్మడమ్మ, అన్నాంబలు వచ్చిన పేరంటాండ్రకు వాయినాలిచ్చేరు.

వేలకువేలు ఇతర స్త్రీ లా నగరిలో నిండిపోయినారు. వారందరికీ చెలులు రాచకన్నెలకు ఇచ్చిన వాయినాలవంటివే ఇచ్చారు. మంగళహారతులు పాడిన వెనుక ఎవరి నగరులకూ, ఇళ్ళకూ, వారు వారు వెళ్ళిపోయినారు.

ఆ రాత్రి రుద్రాంబిక నగరిలోనే ముమ్మడాంబిక భోజనము చేసినది. ఆ వెనుక వారు కావ్యవిచారణ చేసినారు. ముమ్మడమ్మ తన నగరికి వెడలిపోయినది. ఆ వెనుక ఆ మహానవమీ శారదజ్యోత్స్నలో రుద్రాంబ, అన్నాంబిక ఉప్పరిగపై కూర్చుండి ఆ అమృతాల వెన్నెలలో మునిగి తేలుతూ ఏవేవో స్వప్నలోకాలలో విహరించడం ప్రారంభించారు. వెన్నెలకూ స్వప్నాలకూ దగ్గరి సంబంధం. వెన్నెలలో స్వప్నాలు అమృత తుషారంలా, ముత్యాల రజనులా సుడులు తిరుగుతుంటాయి. ఆ స్వప్నాలు వెన్నెలలో తడిసి మత్తిల్లి, గాఢపరీమళపూరితాలయి, మధురరసోపేతాలయి హృదయము, మనస్సు, జీవితమూ నిండిపోతాయి. ఆ వెన్నెల అతిసున్నితంగా యోషల జీవితంలో ప్రసరిస్తుంది. సౌందర్యవంతుల సౌందర్యము ఆ వెన్నెలలో మరింత సుందరమై లోకాల నావరిస్తుంది.

రుద్రాంబిక అన్నాంబికలు ఒక్కసారిగా తమ తమ కలలలోనుండి ఉలిక్కిపడి మెలకువపొంది పక పక నవ్వారు.

“అక్కా ఏమిటమ్మా! మీరు కలలు కంటున్నారు?”

“చెల్లీ! ఏమిటే నువ్వు స్వప్నాలలో మునిగిపోయినావు?”

5

ఒక్క ఓరుగల్లులోనే కాకుండా సబ్బిసాహిరవిషయమూ, పానుగంటి విషయం, పిల్లలమఱ్ఱి విషయం, మానువనాడు మొదలయిన అనేక దేశాలలో కాకతమ్మ ఉత్సవం ఎంతో ఆనందంతో ప్రజలు జరుపుతూ ఉండేవారు. ప్రజలకు కాకతమ్మ అయినా ఒకటే ముమ్మడమ్మ, మారెమ్మ, మాంచాలమ్మ ఎవరయినా ఒకటే. అమ్మవారికి దసరాలలో ఉత్సవం జరపడం భరతదేశాచారము.

బీదలు, సాదలు సాధారణ మనుష్యులు హీనదేవతలనూ, నాగరికజనులు శక్తిని, ఉమను, కాళిని, పార్వతిని, లలితను, రాజరాజేశ్వరిని పూజించేవారు. వామాచారులు మధుమాంసాదులు అమ్మవారికి అర్పించి తాము సేవించేవారు. దక్షిణాచారులు దానిమ్మపళ్ళు, జపాకుసుమాలు, పంచామృతాలు అర్పించేవారు.

యుగయుగాలనుండీ శాక్తేయమున్నది. ఉషోదేవ్యర్చన, మాతృపూజ, సావిత్య్రర్చన, సురపూజ, దేవ్యర్చన వేదకాలంలోనే ఉండేవి. ఉపనిషత్కాలంలోనూ పరదేవతార్చన కద్దు. పురాణయుగంలో దేవీపూజ ఉచ్చస్థితికి పోయింది. బౌద్ధయుగంలో తార, పారమితషట్కార్చన, జైనులు భగవతీ విద్యార్చనలు చేసినారు ఈనాటికీ తెలంగాణపు పల్లెటూళ్ళలో కాకతమ్మ పూజ బ్రతకమ్మ ఉత్సవంగా వెల్లివిరిసింది.

పిల్లలమఱ్ఱికి యోజనదూరంలో నున్న ప్రోలేశ్వరమనే గ్రామంలోను ఆబాలగోపాలమూ కాకతమ్మ ఉత్సవం చేస్తున్నారు. ఊరిమధ్య మఱ్ఱిచెట్టు క్రింద పల్లెలో పూలతో కాకతమ్మ విగ్రహమునుచేసి, తంగేటిపూలు, గొనుగు పూలు, గొబ్బిపూలు, ఇతర అడవిపూలు అమ్మవారిచుట్టూ పేరుస్తూ ఉంటారు. ఏదినాని కాదినము బాలికలందరూ ‘కాకతమ్మ నువ్వు బ్రతుకు దేవతవు, ఉయ్యాల జంపాల ఉయ్యాల!’ అంటూ పాటలు పాడుతూ, ఏదినాని కాదినం కాకతమ్మను ఊరబావిలోనో, చెరువులోనో, వాగులోనో కలుపుతూ ఉంటారు. దుర్గాష్టమినాడు ప్రతికుటుంబము కాకతమ్మను ఊరేగిస్తూ ఊరిమధ్య ఉన్న దేవాలయందగ్గర చేరి నాట్యా లాడుతూ, పాడుతూ బాలికలు, ప్రౌఢాంగనలు అందరూ బాజాభజంత్రీలతో అమ్మవారిని నీటకలిపేచోటికి పోయి, పాటలు పాడుతూ నాట్యాలుసల్పి చివరకు బ్రతుకుదేవత కాకతమ్మను నీటిపాలుచేస్తారు. తెచ్చిన ప్రసాదాలను అందరికీ పంచుతారు.

ప్రోలేశ్వరంలోనూ కాకతమ్మ ఉత్సవం దుర్గాష్టమినాడు అఖండంగా సాగినది. ఊరిలోని బాలికలు, ప్రౌఢలు, జరఠలు చేరి కోలాహలముగా కాకతమ్మ ఉత్సవం చేస్తూఉండిరి.

ప్రోలేశ్వరంలో ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు దశగ్రామాధికారి ఉన్నాడు. ఆయన కాశ్యపగోత్రీకుడైన మాచయమంత్రి చెన్నాప్రగడ వంశీకుడు. మాచయ మంత్రి చదువుకున్నవాడు, ఉత్తమకవి, శాంతచిత్తుడు. ప్రోలేశ్వరగ్రామములో ఉండి దశగ్రామ సంఘాధ్యక్షుడై చల్లని కాకతీయ ధవళచ్ఛత్రం క్రింద రామరాజ్యం నెలకొల్పినాడు.

గ్రామభూమి గ్రామ ప్రజలది. ప్రజలందరూ భూమైనా పంచుకునేవారు; లేకపోతే పంటయినా సమంగా పంచుకునేవారు. రాజు కీయవలసిన ఆరవవంతు గ్రామం పంటలోనే కేటాయించి, తక్కినపంట సమంగా పంచుకునేవారు. తిండికి కావలసిన పంట ఉంచుకొని, తక్కినపంట ఎగుమతికి పంపించేవారు.

ప్రతిగ్రామానికి గ్రామకంఠం - రాజభూమి ఉండేది. రాజభూమి గ్రామ ప్రజ లుపయోగించుకొని తమపాలు పోగా తక్కినది ప్రభువునకు పంపేవారు. కొన్ని గ్రామాలకు సామంతప్రభువు ఒకడు ఉండేవాడు. ఆ ప్రభువు తన మహా మండలేశ్వరులకు, ఆయన చక్రవర్తికి కప్పం పంపించేవారు. సైన్యాలకు ప్రజలు సహాయాలు చేయవలసి ఉండేది.

కాకతీయ గణపతిరుద్రుడు సింహాచలమునుంచి కంచివరకు, తూర్పుతీరము నుండి కుంతలదేశంవరకు రాజ్యం అంతా జయించి తనకు నమ్మకమున్న మండలేశ్వరుల, మహామండలేశ్వరుల ఆ యా నాడులకు, విషయాలకు అధిపతుల చేసినాడు.

మాచయామాత్యునకు దేశపరిపాలన, రాజనీతి అన్నీ క్షుణ్ణంగా తెలుసును. వైద్యవిషయంలో అందెవేసిన చెయ్యి. చెన్నాప్రగడవారు, చాళుక్య మంత్రి హరితసగోత్రీకుడైన చెన్నయ్యమంత్రి కాలంనుండీ ఉత్తములైనవైద్యులు. ఆ మహోత్తమవిద్య చెన్నాప్రగడవారి కులవిద్య అయినది.

మాచయమంత్రికి ముగ్గురు కొమరితలు, ఇరువురు కుమారులు. కాకతమ్మ ఉత్సవానికి మంత్రిగారి భవనంనుండి ముగ్గురు బాలికలు కాకతమ్మను పట్టుకొని, మేళతాళాదులు ముందునడువ గణికలు నాట్యంచేస్తూ ఉండగా ప్రోలేశ్వరస్వామి గుడికి వెళ్ళినారు.

ఊరిలోని రాచవారైన రెడ్లు, బ్రాహ్మణులు, వర్తకులు, వ్యవసాయదారులు అయిన ఆంధ్రవైశ్యులు, ఆంధ్ర శిల్పబ్రాహ్మణులు, కుమ్మరివారు, మంగలివారు, గొల్లలు, చాకలివారు, కురవలు, బోయీలు, ఉప్పరులు ఆ ఉత్సవానికి దేవాలయంకడ చేరినారు.

బాలికలందరూ తీయని కంఠస్వరాల పాటలు పాడుచు, నాట్యంచేస్తూ ఉండిరి. వేళాకోళాలు, కేకలు, నవ్వులు ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించి పోయినాయి. ఆ వెనుక మేళతాళాలతో కాకతమ్మ బొమ్మలను కొనిపోయినారు. ప్రోలేశ్వరము గ్రామం బైటవున్న ప్రోలసముద్ర మను బ్రహ్మాండమైన చెరువులో కాకతమ్మను ఓలలాడించారు.

అటువెనుక ఊరివారూ, బాలికలూ తమ తమ ఇళ్ళకు వస్తూఉండగా, మాచయమంత్రి పెద్దబాలిక పదునారేండ్ల ఈడుగల జవ్వనిఎదురుగా ఒక యువకుడు రావడం గమనించింది. ఆ బాలిక తలవంచేసింది. చిరునవ్వులు పెదవులపై, కన్నులపై, బుగ్గలపై తాండవించిపోయినాయి.

పక్కనునడిచే అక్క అడుగు తడబడడం, అక్క ఏదో అయిపోవడం పెద్దచెల్లెలు గమనించింది. పదమూడేండ్ల ఆ బాలిక అక్క మొగంవైపు చూచి, ఇటు నటు తలత్రిప్పి చూచింది. ఎదురుగా తమ్ముచూచి నవ్వుతూ అక్కినప్రగడ నడిచివస్తూవున్నాడు. కవచం ధరించి కరవాలం నడుముకు వ్రేలాడుతూ ఉండగా చేత శిరస్త్రాణం ధరించివచ్చే అక్కినప్రగడను సీతమ్మ కొంతసేపు ఆనవాలు పట్టలేకపోయింది. ఆనవాలు పట్టిన పిమ్మట నాలుగేండ్ల ఈడుగల తన చెల్లెలు, కల్యాణిని చూచి, చెల్లాయీ! బావే! అక్కినబావే! దొంగబావ! ఎక్కడనుంచి వచ్చాడు?’ అని కేక వేసి, అక్కగారివంక చూచింది. అక్కగారు తన చేయి గట్టిగాపట్టుకొని ‘అందరూ వింటారు నెమ్మది’ అని గుసగుసలాడింది. తల మాత్రం ఎత్తలేదు. సీతమ్మ మాటలకు ప్రక్కనున్న ఆడవారూ, బాలికలూ అక్కినప్రగడవైపుకు చూపులు మరల్చారు.

ఆడవారందరూ తన్ను తేరిపార చూడడం గమనించి, మోమునందు సిగ్గు ఉదయింప అక్కిన వెనుకకు తిరిగి విసవిస నడిచి వెళ్ళిపోయాడు, కామేశ్వరి తనకు కానున్న భర్తగారు అలా వెళ్ళిపోవడం తలవంచే వాలు చూపులు పరపి గమనించింది. ఈమె విషయం ఆమెతోపాటు నడిచే కొందరు బాలికలు గమనించారు. ఓహో! అమ్మవారిని పూజచేసిన ఫలం ఇప్పుడే కనబడుతోందమ్మా!’ అని ఒక బాలిక అన్నది. ఒక పుణ్యస్త్రీ అలా వస్తుంది కాబోలు సిగ్గు’ అన్నది. ఇంకొక ఇల్లాలు ‘అవును, కాబోయే మగడువస్తే సిగ్గుపడక నాట్యం చేయమన్నావా కామేశ్వరిని?’ అని తల తిప్పినది.

కన్ను గిలిపిస్తూ, కామేశ్వరి బుగ్గ గిల్లుతూ ‘ఓయమ్మా? ఎన్నాళ్ళకు వచ్చాడు? మంచిదినానే వచ్చాడు. కాని వస్తూ వస్తూ మూడు గడియలు ముందుగా ఎందుకు వచ్చాడుకాడు? కామేశ్వరి నాట్యం చేసే పరమాద్భుత సౌందర్యం చూచేవాడే!’ అని వారి దగ్గర చుట్టమైన బిడ్డలతల్లి అన్నది. వారందరూ మాచయ మంత్రి ఇంటికి చేరారు. సభాగృహంలో మాచయమంత్రీ, అక్కినప్రగడా మాట్లాడుకుంటున్నారు. వారి కుశలప్రశ్నలూ, ప్రతివచనాలూ అప్పుడే అయినవి.

బాలికలూ, స్త్రీలూ లోనికి వెళ్ళిపోయినారు. ‘బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీశెడు గంధం పూసేరూ, వీధీ వీధీ తిప్పేరు’ అంటూ సీతమ్మ లోనికి కలకల నవ్వుతూ పరుగెత్తింది.

మాచనమంత్రి చిరునవ్వు నవ్వుకొని, మళ్ళీ గంభీరుడై ఏమి అక్కినా! నువ్వా గజదొంగ జట్టులోనే ఉండి మాకుటుంబాలన్నీ తలెత్తకుండా చేస్తూ ఉండవలసిందేనా?’ అని ప్రశ్నించాడు.

“ఏమి మామయ్యా! ఇప్పటికి అయిదేళ్ళనుండి మన గజదొంగల సైన్యం పెరిగింది, పెరిగింది. ఇప్పుడు మా ప్రభువూ ఒక రాజ్యం స్థాపించారు. మేము ప్రజలను దోచుకోలేదు. గ్రామాలు కొల్లగొట్టలేదు. రాజ్యాలపేరిట అరాజకంనింపిన వాళ్ళను హతమార్చాము, హతమారుస్తున్నాము. హతమారుస్తాము. అది తప్పా!”

మాచన: అయితే ఎందుకు మీ గన్నయ్య చక్రవర్తిని శరణు వేడరాదు?

అక్కిన: మాకంత కర్మమేమి? మేమూ చక్రవర్తికి లోబడే ఉన్నాము. మేము చేసినదంతా ప్రజలను దోచేవారిని దోస్తున్నాము. దానివల్ల అధర్మమేమి కలిగింది? ఈ రెండేళ్ళనుండీ మా ప్రభువు చక్రవర్తికి కప్పం కట్టుతూనే ఉన్నవాడాయెను.

మాచన: దోపిడీసొమ్ము కప్పమా? ఏ ధర్మశాస్త్ర ప్రకారం అవుతుంది?

అక్కిన: (పక పక నవ్వుతూ) మామయ్యా! ధర్మశాస్త్రప్రకారం మా సొమ్ము ‘దోపిడీ సొమ్ము’ అని ఋజువు చేయవలసిన భారం నీది.

మాచన: అందరూ అంటున్నారు.

అక్కిన: అపవాదు ధర్మశాస్త్రంలో అనుమాన సాక్ష్యమే అవుతుంది.

మాచన: అబ్బాయీ! నువ్వు ఉద్దండ పండితుడవు. నీతో నేను వాదించి నెగ్గగలనా?

అక్కిన: నీ మేనల్లుణ్ణి కానా మామయ్యా? ఒక్కటిమాత్రం నమ్ము. ఇన్ని శాస్త్రాలు చదువుకొని, అక్కినమంత్రి మనుమణ్ణయి, మాచయమంత్రి మేనల్లుణ్ణయి, సోమయామాత్యుల కుమారుణ్ణయి అధర్మకార్యం ఒకటీ చేయనని మాత్రం నమ్ము. అధర్ముని కొలువులో ఉండను. నేను ద్రోహిని కాను. మా ప్రభువు రామచంద్రప్రభువు అవతారము. అంతకన్న ఎక్కువ నేను వాదించను. ఇక వచ్చిన పని మిమ్ముల నందరినీ చూచి చాలాదినాలైనది. ఒక్కసారి అత్తయ్యను, మరదళ్ళను, మరదులను చూడాలనీ, దీవెన అందుకోవాలనీ.

మాచన: (కన్నులనీరు గిర్రున తిరిగితే, ఉత్తరీయాన తుడిచికొని) నాయనా! మీ అమ్మ ధైర్యమేమిటో చెప్పలేను, నీ విషయం ఏమీ అనుమానం లేకుండా ఎప్పటి రీతిగా ఆనందంగా ఉంది. కాని మీ తాతగారు నీ విషయంలో ఉగ్రుడై ఉన్నాడు. నీ పేరెత్తితే మండిపోతారు. నీమీది కోపం అంతా నామీద చూపించారు. మీ నాన్న ఏదో నిన్ను తలుచుకొని విచారిస్తాడు. కోపం మాత్రం లేదు. మీ అమ్మ బావను గట్టిగా చివాట్లు పెడుతూ ఉంటుంది.

అక్కిన: మా అమ్మ అచ్చంగా పార్వతీదేవి. నాన్నగారు తమ కుమారు డంటే అంత అనుమానం ఎందుకుపడాలి?

మాచన: అవన్నీ అలాఉంచు! కామేశ్వరిని చూచావా?

6

ఉద్ధండ పండితులను లెక్కచెయ్యని అక్కినప్రగడ సిగ్గునంది చిరునవ్వు మోమును ప్రపుల్లం చెయ్యగా ‘చూచాను మామయ్యా! బాగా చదువుకుంటోందా?’ అని ప్రశ్నించాడు.

“అక్కినా: నీ భార్య చదువుకోదా! నీకు తగినభార్య కావద్దూ? పంచ కావ్యాలు చదువుకుంది. అలంకార శాస్త్రాలు, వ్యాకరణమూ చదువుకుంటున్నది. లే! స్నానంచేసి సంధ్యావందనం చేసుకో,”

“ఊరిబయట వాగులోముగించుక వచ్చాను. కాని మళ్ళీ స్నానంచెయ్యాలి.”

‘అమ్మడూ, సీతా? బావకు స్నానానికి నీళ్ళు తోడించమ్మా వంటలక్క చేత' అని మాచయమంత్రి కేక వేసినాడు.

సీతమ్మ ఈవలకు పరుగునవచ్చి ‘బావకు పన్నీరు తోడించా నాన్నగారూ!’ అంటూ అక్కినప్రగడవైపు తిరిగి, ‘రావయ్యా బావా! నీ సామాగ్రి అంతా నీ సేవకులుకాబోలు పట్టుకువచ్చారు. మిద్దె గదిలో పెట్టించాను. మహానుభావుడవు! మా అక్క మాకే కనపడడం మానేసింది. పెళ్ళయి నాలుగేళ్ళయింది. ఇప్పటికా రావడం అత్తింటికి, మహాపండితుడుగారూ!’ అన్నది. మాచయమంత్రి ‘సీతా!’ అని కేక వేసినాడు. సీత ‘ఏమీలేదండీ నాన్నగారూ! మా బావను నేను అనుకుంటున్నానండీ’ అని నవ్వుతూ బావగారిని లోనికి తీసుకొనిపోయినది.

అక్కినప్రగడకు ఇరవైమూడు సంవత్సరము జరుగుతూ ఉన్నది. అతనికి పందొమ్మిది సంవత్సరాల ప్రాయంలో మేనమామ కూతురు నిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన రెండు నెలలకే అక్కినప్రగడ గోన గన్నారెడ్డి జట్టులో కలిసిపోయినాడు.

కామేశ్వరి అందాలముద్ద, విద్యావినయసంపన్న, ఇంత చిన్నతనాన్నుంచి ‘మేనత్తకొడుకే తన భర్త’ అని ఉవ్విళ్ళూరిపోతూ అతనికి తగిన పండితురాలు కావాలని దీక్షతో ఉభయభాషలయందూ పాండిత్యము సంపాదించుకొంటున్నది. పెద్దలందరూ చిన్నతనాన్నుంచీ అక్కినా కామేశ్వరీ భార్యాభర్తలన్న పేరు పెట్టనే పెట్టిరి. అక్కిన హృదయంలో అంత చిన్నతనంలోనూ మేనమామ కొమరిత, ముద్దుగుమ్మ, కామేశ్వరి సింహాసనం అధివసించి కూరుచున్నది.

మొదటినుండీగన్నారెడ్డికి ప్రాణస్నేహితుడైన అక్కిన, గన్నారెడ్డి తక్కిన మిత్రులతో మాయమై వెళ్ళిపోయినా, తన వివాహం తాతగారూ, తండ్రిగారూ తలపెట్టడంవల్ల అప్పటికి ఆగిపోయి, వివాహం గృహప్రవేశమూ, మనుగుడుపులూ అయిన వెనుక, ఒక శుభముహూర్తాన మాయమై గన్నారెడ్డి జట్టులో తానూ కలిశానని తాతగారికిలేఖ పంపినాడు. నాటికి నేడు అక్కినమంత్రి అత్తవారింటికి వచ్చినాడు. కాని ఈ నాలుగు సంవత్సరములు తాను క్షేమముగా ఉన్నాననియు, తనకు ఏమాత్రమూ వీలుచిక్కినా వత్తుననియూ మేనమామకు ఎప్పటికప్పుడు ఉత్తరములు వ్రాయుచూ ప్రతిఉత్తరములు తెప్పించుకొనుచునే ఉండెను.

కామేశ్వరి రహస్యముగా కంటినీరు కుక్కుకొనుచు, తన హృదయంలోని బాధ ఇతరులకు తెలియనీయక అన్నినోములు నోచుకొనుచు, విద్య మరిన్నీ దీక్షగా అభ్యసిస్తూ ‘భర్త ఎప్పుడువచ్చునా’ అని ఎదురుచూస్తూ ఉండెను. ఆమె భర్తను చూడగానే ఆనవాలు కట్టింది. ఆమెలో ఉప్పెనలా సంతోషము పొంగిపోయింది. ఎలా నడచి తమ భవనము చేరిందో, వెంటనే పూజాగృహములోకి పరుగిడి తమ కులదేవత అయిన కామేశ్వరికి సాగిలబడి కంటినీరు పొర్లిపోగా పరిపరివిధాల ప్రార్థించింది.

ఇంతలో మాచనమంత్రి భార్య గౌరీదేవమ్మ అల్లునికి స్వయంగా వెండి చెంబుతో కాళ్ళు కడిగికొనుటకు నీరము తెచ్చి, ‘నాయనా! ఎన్నాళ్ళకు మా యింటికి రావడం! ఎక్కడనుంచి? ఓరుగల్లులో అన్నయ్యగారూ, నాన్నగారూ క్షేమమా?’ అన్న ప్రశ్నలవర్షం కురిపించింది. మాచనమంత్రి తన భవనంముందు కవచశిరశ్త్రాణాలంకృతుడై గుఱ్ఱాన్ని దిగుచున్న ఈ యువకుడెవ్వరా అని తన మేనల్లుని మొదట ఆనవాలు కట్టలేక పోయినాడు. అక్కినప్రగడ శిరస్త్రాణం తీసి చేత బుచ్చుకొని, ‘మామయ్యా! నన్నానవాలు పట్టలేదా ఏమిటి?’ అని పల్కరించగానే మాచనమంత్రి ‘నువ్వా అక్కినా’ అని వణికిపోయాడు. తక్షణమే దగ్గర వున్న సేవకులు ‘సామాను దక్షిణపు గదులలో పెట్టించండర్రా’ అని, కన్నుల తిరిగిన రెండు నీటి బొట్టులను కుడిబొటన వ్రేలితో తుడుచుకొని ‘వస్తానని వ్రాశావు కాని, ఎప్పుడు వచ్చేదీ వ్రాయలేదే!’ అని అల్లుణ్ణి ప్రశ్నించాడు. అక్కిన మామగారికి పాదాభివందనం చేశాడు.

“నేను ఎప్పుడు వచ్చేది ఎలా వ్రాయను మామయ్యా!” అనినవ్వుతూ అక్కినమంత్రి ప్రతివచనమిచ్చి. ‘సీత ఏదీ’ అని అడిగాడు.

“ఈ దినము బ్రతుకమ్మ అయిన కాకతమ్మ పండుగ - మరిచి పోయావా, అక్కినా?” అని మాచనమంత్రి ప్రశ్నించాడు.

“అవునవును, నేను మరిచిపోలేదు మామయ్యా! అయితే ఊరిబయటి ఏటికో, చెరువుకో ఓలలాడింప వెళ్ళివుంటారు. నేనూ వెళ్ళి చూచివస్తా” అని అక్కినప్రగడ లేచి అలా శిరస్త్రాణం చేతిలో ఉంచుకొనే ప్రోలసముద్రం చెరువుకు బయలుదేరినాడు. దారిలో కామేశ్వరీ, మరదలు సీతా, ఇతరులూ రావడం చూచి, తానే సిగ్గుపడి తిరిగి వచ్చేసినాడు.

మొదట తాను భార్యను ఒక్కనిమేషం ఆనవాలు కట్టలేకపోయినాడు. ఆమె తన వైపు ఒక్క క్షణికం ప్రేమనిశితాలైన చూపులు పరపేసరికి అక్కిన ఆమెను ఆనవాలు పట్టి ఆమె సౌందర్యంతో నవయౌవనభాసితయై వెలిగిపోవడం గమనించి తనలోని ప్రేమ, రాకాసుధాకరజ్యోత్స్నలులా వెల్లివిరిసిపోవ, కన్ను అరమూతలుపడ, హృదయము వేగాన నాట్యము చేయ, ఏదో దివ్యానందంలో లయమై మేనమామ ఇంటికి చేరినాడు.

అతను వేడినీళ్లు స్నానం చేస్తూ మేనమామ భవనంనిండా వెలిగింపబడిన దీపాలు గమనిస్తూ, సంధ్యావందనం ఆచరించుకుంటూ, భోజనం చేసి, లేచి మరదలు సీత అందిచ్చే తాంబూలం వేసుకుంటూ తన్నేమీ ఎరగని చిన్న మరదలిని ఒళ్ళో కూర్చుండ బెట్టుకొని, భయమూ, సిగ్గూ బాపి, తీయనిమాటలు చెప్పుతూ, పెద్దమరదలితో వేళాకోళాలు సల్పుతూ, మరదలు ప్రశ్నలకూ, మేనమామప్రశ్నలకూ ప్రతివచనమిస్తూ తన సౌందర్యనిధి, ఆత్మేశ్వరిని తలచుకుంటూ, లోపలి ఆలోచనలు ఎవ్వరికీ తెలియనీయకుండా, భార్య ఒక్కసారైనా మళ్ళీకనబడదా అనిఎదురుచూస్తూ ఉండెను.

భోజనము చేసి అత్తగారు వచ్చి ఏమయ్యా! మీ విషయం ఏమిటి ప్రజలందరూ విస్తారంగా చెప్పుకుంటారు? మీ గజదొంగల పనేమిటి? మీ నాయకుడు గోన గన్నారెడ్డి తనరాజ్యం తిరిగి స్వాధీనం చేసుకొని, రుద్ర దేవమ్మగారి పాదాల బడి క్షమాపణ వేడకుండా, పినతండ్రిని పట్టుకొని ఓరుగల్లుకు బందీగా పంపించి మాత్రం ఊరుకొన్నాడేమిటి?’ అని అల్లుణ్ణి పృచ్ఛ చేసింది.

చిన అక్కినమంత్రి చిరునవ్వునవ్వి ‘అత్తయ్యా! ఏమిటి అట్లాఅడుగుతారు? దొంగలను దొంగతనం ఎందుకు చేస్తావయ్యా అంటే చెపుతారా!’

‘అదికాదయ్యా! నీ అంత చదువుకొన్నవాడు లేడు. నువ్వు మళ్ళీ అవతారం ఎత్తిన కాళిదాసు వంటారు. నీకు ఇల్లాంటి బుద్ధిపుట్టిందేమా అని మా కందరికీ తీరని విచారము తండ్రీ!’

మాచనమంత్రి లేచి ‘నీ అనుచరులందరూ భోజనాలు చేశారు. ఈ భవనం చుట్టూ వంతులుగా కాపలా ఉంటారట. వారు చీకట్లో కూడా చూడగలరట! నేను వెళ్ళి విశ్రమిస్తాను. మీ అత్తగారు నీ పడకగది చూపిస్తుంది’ అంటూ మేనల్లుడు లేచి తనకు పాదాభివందనం చేయగా ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు.

ఇంతలో సర్వాభరణ భూషితురాలై, బంగారపువులు చేసిన కాశ్మీర పుష్ప వర్ణపు పట్టుచీర ధరించి ‘ఎరుపు పట్టు కంచుకము తాల్చి, సరిగలతల తెల్లపట్టు చీర వల్లె చేసుకొని బంగారుబొమ్మ లా కామేశ్వరి సిగ్గుపడుతూ వచ్చి భర్తపాదాలకు నమస్కరించింది.

చిన అక్కిన ప్రగడ కరిగి పోయినాడు. తా నామెను అత్తగారి ఎదుట ఏలాగు స్పృశించును! అయినా ఏదో మొండిధైర్యము చేసి ఆమె రెండు భుజాలు పట్టి లేవనెత్తి ‘బాగా చదువుకుంటున్నావట?’ అని ప్రశ్నించాడు.

“ఎవరు చెప్పినారు!”

“మీ పెద్ద చెల్లి,”

“అది వట్టి అల్లరిపిల్ల!”

“నీ పోలికే! నీ చెల్లి కాదా ఏమిటి?”

“ఆ మరదలిని చూడడానికై నా ఇన్నాళ్ళకుగాని తీరిక కలగలేదు కాబోలు!”

అత్తగారు మాయమైపోయినారు. అక్కినప్రగడ సౌందర్యనిధియై, వలపుల మిటారియై, నవయౌవన పరమావధియైన భార్యను చూచి ప్రేమచే వబికి పోయినాడు. ఆతని సరసత్వ ‘మామెను గాఢంగా హృదయానికద్దుకో, కెంపులులా, తామర పూవు మొగ్గలులా, ఎఱదానిమ్మగింజల కాంతిలా, తేనెలు ఊరే ఆమె పెదవుల్ని ఆస్వాదించు’ అని ప్రబోధించింది. ‘కురుగౌరవమయ్యా! సంప్రదాయమయ్యా! నీకు పునస్సంధానం కాలేదయ్యా! ఆమెను ముట్టరాదయ్యా’ అని ఆచారము బోధించింది. ఒకసారి స్పర్శానందం అణువణువునా అనుభవించి, అమృత మారగించిన దేవేంద్రునిలా ఉన్న అక్కిన ప్రగడ ఆచారము ఒప్పదని అనుకొంటూకూడా కామేశ్వరిని చటుక్కున దరికి తీసుకొని, గాఢంగా కౌగిలించి, ఆమె చిబుకముపట్టి తలపై కెత్తి ‘నువ్వు నా జన్మసాఫల్యలక్ష్మివి కామం!’ అని ఆమె పెదవులు ముద్దిడినాడు. ఆమె సంతోషముతో, పారవశ్యంతో, భయంతో, ఆతని దృఢసంశ్లేషానంద మనుభవిస్తూ ‘చెల్లాయివస్తుంది’ అని కౌగిలి నెమ్మదిగా తప్పించుకొని, ‘అమ్మవచ్చేవేళ అయింది, రేపు’ అని తుఱ్ఱున మాయమైంది.

ఇంతలో మేడ దిగివచ్చి గౌరీదేవమ్మ అల్లుణ్ణి సమీపించి, ‘రావయ్యా పండుకొందువుగాని, సీతమ్మ ఇక్కడికి రాలేదూ?’ అని ప్రశ్నించింది.

పక పక నవ్వు పుత్తడిబొమ్మ సీత సువ్వున పరుగునవచ్చి ‘బావా బావా! పన్నీరు’ అని ఆరంభించి ‘అమ్మతోచెప్పనా?’ అన్నది. అతడు నిర్ఘాంతపోయినాడు. ‘అమ్మా! బావేఁ అక్కకు రత్నాలహారం తెచ్చాడే’ అంది.

‘అమ్మయ్యా’ అని అతడు సంతోషాన నిట్టూర్పు విడిచినాడు.

సీత అక్కినప్రగడ తెచ్చిన రత్నాలహారం సంగతి తెలిసి బావగారి వంక చూచి పక పక విరగబడి నవ్వింది. అక్కినకూడా నవ్వుతూ ‘అల్లరిదానా, నీపని చెబుతా వుండు’ అని లేచినాడు. సీత తల్లివెనుక దాగికొన్నది. అక్కిన మరదలిని చూచి ‘ఇదా నేర్పు? అన్నాడు. సరే పట్టుకో నన్ను’ అంటూ సీత మేడమెట్టుపై కి దూకింది. ఒక గదిలో దూరింది. అక్కిన వెనకాల! ఆ గదిలో కామేశ్వరి తెల్లబోతూ, నవ్వుతూ నిలుచునిఉంది. అక్కిన గుమ్మందగ్గర ఆగిపోయాడు. అక్కగారి వెనుకనుంచి బావగారిని నాలుకచాపి వెక్కిరించి అక్కగారి గదిలో నుంచి తన గదిలోకి గంతువేసి తలుపు దభాలున వేసింది సీత.

కామేశ్వరికీ మాటలేదు, అక్కినకూ మాటలేదు, కామేశ్వరి ఇదివరకు ధరించిన బట్టలు, నగలు మార్చివేసింది. చక్కని సన్నని తెలుపుచీర ధరించి, తెలుపురైక తొడిగి, నీలివల్లె వేసుకొని, దోమజాలరువేసిన తన తల్పంపై పండుకొన పోతున్నది.

అక్కిన సుందరరూపం చిత్రించిన ఫలకం ఆమె మంచాని కెదురుగా ఒక సింహాసనంపైన పెట్టి ఉన్నది. ఆ చిత్రంపైన రాధాకృష్ణుల చిత్రంఉంది. ఆరెండు చిత్రలేఖనాలచుట్టూ పూలదండలున్నాయి. కామేశ్వరి పదిక్షణికా లా లాగున తలవంచి నిలుచుండి, ‘అమ్మవచ్చి మీగది చూపుతుంది’ అన్నది.

నిట్టూర్పు విడుస్తూ నెమ్మదిగా గుమ్మందాటి ఈవలకు అక్కిన వచ్చాడు. అక్కడ సీతమ్మవచ్చి బావగారి బుజాలుపట్టి, ‘బావా! నన్ను పెళ్ళిచేసుకోకుండా మా అక్కను చేసుకున్నందుకు నిన్ను ఈలా ఏడ్పిస్తూ వుంటానులే!’ అన్నది.

“ఎంతకాలం?” “నేను ఇష్టపడినంతకాలం.”

“ఎవడో మా తోడల్లుడు ఒకడువచ్చి నిన్నెత్తుకుపోకుండా వుంటాడు గనుకనా!”

“అందాకా అక్కమొగుడే దిక్కు.”

“ఆసి, నీ ఇల్లు బంగారకానూ, నువ్వు మీ ఆయన్ను ఏ ఉత్సవంలోనో అమ్ముకు చక్కావచ్చేటట్లున్నావు!”

“మా ఆయన్ను నేను ఎందుకమ్ముకుంటాను! మా బావనే అమ్ముకుంటా, కావలసినంత మూల్యం వస్తుంది!”

“మీ అక్క నీతో దెబ్బలాడదూ!”

“మొగుణ్ణి అమ్మగల నాకు మా అక్క అక్కగాదా?”

“నువ్వు అమ్మనన్నావుగా, అలాగే మీ అక్కా అమ్మడానికి ఇష్టపడదేమో?”

“ఇద్దరం అమ్ముక వచ్చి లాభాలు చూసుకుంటాం!”

“అమ్మో అయితే పారిపోవాలి!”

“ఆఁ! అది సులభమనే నీ ఉద్దేశం! మేము గజదొంగల్ని అమ్మగల సింహదొంగలం!”

అక్కిన పగలబడి నవ్వినాడు. “అమ్మయ్యో, ఇంకెక్కడ దాక్కోవడం?” అన్నాడు.

“అక్క ఒళ్ళో” అంటూ, తుఱ్ఱుమని పారిపోతూ, ‘అదిగో అదే నీగది!’ అని తనగదిలోనికి వెళ్ళి మాయమై తలుపు వేసుకుంది. ఆమె చూపించిన గదిలోనికి పోయి అక్కిన పాన్పుచేరి ఆలోచిస్తూ, స్వప్నాలుకంటూ నిదురకూరినాడు.

ఆ మరునాడు ఉదయం, తెల్లవారగట్ల నే లేచి అక్కినప్రగడ ఊరి చివరకు పోయి, స్నానాదికాలు జరిపి, సంధ్యావందనంచేసి, తిరిగి సూర్యోదయం అవుతూ వుండగానే మేనమామగారి ఇల్లు చేరాడు. ఆతడు లోనికివచ్చి బట్టలు మార్చుకొని, తన పరివారంలోని చారులు తెచ్చిన కొన్ని రహస్యవిషయాలు విని, వారికి తగు సమాధానాలు అందిచ్చినాడు. అతని పనులు తీరగానే మరదలు సీతా, చిన్నమరదలు కల్యాణీ బావగారిదగ్గరకు వచ్చారు. కల్యాణి తన చదువూ, పాటలు బావగారికడ ప్రదర్శించింది. అటువెనుక సీత వీణ తీసుకొనివచ్చి బావగారిని తన గాన విద్యలో తేల్చివేయ నారంభించింది.

మరదలు కంఠంలో అప్పుడే ఒదుగులు ఏర్పడుతూ ఉన్నవి. సాంస్కృతిక గీతాలు, ఆంధ్రపదాలు, రాగాలాపన, తానము ఆంధ్రులసొమ్ము. అవన్నీ సీతమ్మ సౌరభాలు సేకరించుకొంటున్న పుష్పముకుళంగా బావగారికి పాడి వినిపించింది. “బావా! నా పాటకేమిగాని, అక్క సంగీతం వినాలి నువ్వు!” అని ముగించింది.

“ఈ సాయంకాలం మీ అక్కను పాడమను సీతా! నీ పాట అద్భుతము! నీ కేమి బహుమానం ఈయగలను? ఇదిగో ఈ చిటికెనవ్రేలి ఉంగరం నీకు అర్పిస్తున్నాను.”

“నాకిస్తావేమి ఉంగరం, అక్కడ ఇవ్వాలిగాని”

“ఆ గొడవ నీ కెందుకు? నీకు ఉంగరం, చిన్నమరదలు కల్యాణికి నేను పట్టుకువచ్చిన బంగారు ఏనుగ బహుమానం” అని అవి తన గుండ్రని తోలుపెట్టెలోనుంచి తీసి ఆ విగ్రహం కల్యాణికి ఇస్తూ’ సీతవేలికి ఉంగరం తొడిగాడు. మధ్యవేలికికూడా ఆ ఉంగరం కొంచెం వదులయింది.

“బావా! ఈ ఉంగరం వదులైనా, ముద్దులు మూటగట్టుతూంది. ఏదారమో చుట్టు నా వేలినుండి ఎప్పుడూ పోనివ్వను” అని సీత కంటినీటితో అస్పష్ట వాక్యాలు పలికింది.

అక్కిన మరదలు కంటినీటికి ఆశ్చర్యమంది, ‘సీతా! అదేమిటమ్మా అలా బెంబేలుపడతావు. ఒక్కటిమాత్రం నీకు మాటఇస్తాను. ధర్మదేవత సాక్షిగా మేము ఏవిధమైన పాపము చేయటంలేదని నీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను. రెండవది, నీకు, కల్యాణికి, మీ అక్కకు నే నిచ్చిన బహుమతులలో ఏ అసత్యార్జనా లేదు. అవి ధర్మవిరుద్దం కాకుండా నాకు బహుమానాలుగా వచ్చాయి. నేను గజదొంగను కాకమునుపే, నా పాండిత్య దిగ్విజయయాత్రలో వచ్చినవి’ అని పలికినాడు.

కంటినీటితో నవ్వుతూ సీత ‘బావా! అందుకుకాదు నాకు కన్నీరు వచ్చింది. మా కెవ్వరికీ నీమీద అనుమానం లేదు. అధర్మమైన పని ఏదీ నువ్వు చెయ్యవని మాకందరికీ నమ్మకమే బావా! కాని నువ్వు మళ్ళీ ఎన్నాళ్ళకు వస్తావా అని తలచుకొంటే కన్నీళ్ళు తిరిగాయి. అక్క నీ పేరే మంత్రంగా, నీ చిత్రాన్ని పూజింపని దినం లేనేలేదు. అక్క సాక్షాత్తు సరస్వతీ, లక్ష్మీ, పార్వతీనీ! అక్క ఇంకెన్నాళ్లు నిన్నువదలి ఉండగలదు? నీ కష్టాలలో పాలు పంచుకోవడానికి నీతో వచ్చి వేస్తానంది అక్క!’

అక్కినప్రగడ ఆనందంతో ఉప్పొంగాడు. ఆశ్చర్యంతో మ్రాన్పడినాడు. ‘సీతా! ముహూర్త నిశ్చయం పెద్దలచే చేయించే వచ్చాను. మా నగరంలో అందరూ కుటుంబాలు తెచ్చుకున్నారు. ఆలాగే మీ అక్క నాతో తప్పక వస్తుందని, మీ అక్కతో చెప్పు’ అన్నాడు.

8

ఆ మరునాడు గోన గన్నారెడ్డి ఉత్తమాశ్వం ఒక దానిని అధివసించి, ఏబదిమంది వీరులు తన వెంటరా మెరుము వేగాన ప్రోలేశ్వరము వచ్చి, దశ గ్రామాధికారి అయిన శ్రీ మాచనమంత్రిసత్తముల భవన మెక్కడని తెలిసికొంటూ మాచనమంత్రి భవనం చేరాడు. మాచనమంత్రి భవనంచుట్టూ కావలికాచే తన సైన్యంలోని భటులు త న్నానవాలుపట్టి వంగి నమస్కరింప వారిని ఆశీర్వదిస్తూ, గుఱ్ఱం చెంగున ఉరికాడు.

ద్వారపాలకునితో ఒక సైనికుడు ‘శ్రీ గన్నారెడ్డి సాహిణి మహారాజులం వారు వచ్చారు’ అని మంత్రిగారికి తెలపవయ్యా అనేసరికి, వాడు ఉలిక్కిపడి, సభాశాలకు పరుగిడి అక్కడ పంచాయతీదారులతో, తన మహామండలేశ్వరునికడ నుండి వచ్చిన ఉద్యోగితో మాట్లాడుతూ ఉన్న మాచనమంత్రికి ‘శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువులవారు వేంచేసినారు’ అని మనవి చేశాడు.

మాచనమంత్రి మొదలైనవారు ఆశ్చర్యాన ఒక్కసారిలేచి ‘ఏరి ఏరి’ అంటూ సింహద్వారంకడకు వచ్చారు. గోన గన్నా రెడ్డి చిరునవ్వు నవ్వుతూ, ‘మాచనమంత్రిగారూ! నమస్కారాలు! అని నమస్కరించాడు.

మాచనమంత్రి ‘దిగ్విజయమస్తు దీర్ఘాయురస్తు, సత్వర వివాహ ప్రాప్తిరస్తు సుసంతాన ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదిస్తూ ‘మహాప్రభూ! ఎప్పుడు దయచేశారు, లోనికి విచ్చేయండి. ప్రభువుస స్నేహితుడు సుఖముగానే ఉన్నాడు’ అంటూ వారిని లోనికితోడ్కొని వచ్చెను.

గోన: బాబయ్యగారు! పిల్లలందరూ క్షేమమా? పిన్నిగారూ క్షేమమా! మా బావగారూ అత్తవారింటికి వచ్చి మమ్ములనందరినీ మరచి పోయారుకాబోలునని నేనే స్వయంగా ఆయనగారిని కలుసుకొనడానికి వచ్చాను.

మాచ: చిత్తం చిత్తం, మా అక్కిన ఒక నిమేషమైనా తన ప్రభువులను మరిచిపోతాడా! దినదినమూ ఏవో ఉత్తరాలు తమకు పంపుతూనే ఉన్నాడు ప్రభూ! దినదినమూ ఏవో ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి.

గోన: బాబయ్యగారూ! బావమరిదిగనుక ఊరికే వేళాకోళం చేశాను! త్వరగా వెళ్ళి పునస్సంధానం చేసుకొని రావలిసిందని మా పురోహితులచే మంచి ముహూర్తం పెట్టించి పంపాను.

మాచన: ముహూర్త విషయంలో ప్రభువులు నాకు వ్రాసిన ఉత్తరం అందింది. ఈ విషయం మా బావకు, అక్కకు, మామగారికి తెలిపి ఆహ్వానిస్తూ ఓరుగల్లు శుభలేఖలు పంపనా వద్దా అని తటపటాయిస్తున్నాను ప్రభూ!

గోన: శుభలేఖలు పంపి ఆహ్వానించండి, వస్తేవస్తారు. రాలేకపోయినామంచిదే. ఎటువచ్చినా అత్తయ్యగారు రాని లోటు కనబడుతుంది. వెంటనే తాము ఉత్తరాలు వ్రాయించండి. మా చారుడు అవి తీసుకొని వెళ్ళే పురోహితుని వారికడకు కొనిపోతాడు. మా ఏనుగులు ఊరిచివర ఉన్నాయండి.

మాచన: చిత్తం మహాప్రభూ!

ఇంతలో లోననుండి అక్కినప్రగడ వేగంతో వచ్చాడు. అతని వెంటనే సీతమ్మా, కల్యాణికూడా ఉన్నారు. అక్కిన రాగానే గోన గన్నారెడ్డి చేతులు చాచి అతన్ని గాఢంగా కౌగలించుకొని వదలి ‘ఏమయ్యా బావా! ఏమి ఇంత అందం ఎక్కడనుండి వచ్చింది! ఓహోహో ఆవిలాసమేమిటి’ ఆసిగ్గు, ఆహొయలు! మోము వెలిగిపోతోందే! అవును, అందంలేనివారు, కొంచెం అందం కలవారిని చూస్తేనే కొంత అందం ప్రసరిస్తుందట, అలాంటిది సౌందర్యనిధి అయిన మా చెల్లెలిని చూచిన ఒక అబ్బాయిగారికి మరీ అందం వచ్చిందే!’ అని నవ్వాడు.

అక్కినప్రగడ నవ్వుతూనే ‘ఏమండీ బావగారూ! మీరూ కొంచెం ఓపిక పట్టండి, ఎక్కడో మా అక్కగారు ఎదురుచూస్తున్నారు. మీరువెళ్ళి ఎంత వద్దంటున్నా ఆ క్షణంలోనే తలవంచి మెళ్ళో దండ వేయించుకోకుండా ఉంటారా? అప్పుడు అందమనే విషయం మీకు బాగా తెలుస్తుందిలెండి!’ అన్నాడు.

వారందరూ అక్కడి సభాశాలలో రత్నకంబళ్ళపై అధివసించి దిండ్లకాని కూర్చున్నారు. మాచన, గోన గన్నారెడ్డిని చూచి ‘మహాప్రభూ! తాము మా ఇంట ఆతిథ్యం స్వీకరించాలి’ అని మనవిచేశాడు. గోన గన్నారెడ్డి ‘బాబయ్యగారూ! మీ అబ్బాయిని మీరు కోరడమా, ఆజ్ఞాపించాలిగాని! తప్పకుండా తమ ఇంటనే నా భోజనం’ అని ప్రతివచన మిచ్చారు.

“తమ అనుచరులందరూ ఇక్కడేనండి.”

“వారందరూ ఊరిచివర ఉన్నారు. వారు తక్కిన సైన్యంతోబాటు అక్కడే భోజనంచేస్తే మంచిది బాబయ్యగారూ.”

“నా మనవి.”

“తమ ఆజ్ఞ అనండి, అలాగే కానివ్వండి.”

“ధన్యుణ్ణి.”

“మా అక్కినబావగారి వెనుకనే వచ్చి నన్ను చూచి పారిపోయిన అమ్మాయిలు?”

అక్కిన: మా పెద్ద మరదలు సీతా, మా చిన్న మరదలు కల్యాణీ

గోన: బావమరదు లెంతమంది?

అక్కిన: ఇద్దరు బావగార్లు, ఒకరు ఓరుగల్లులో చదువుకుంటున్నారు. పెద్ద బావమరిది, చక్రవర్తి కొలువులో లేఖకుడు, అయిదుగురే మా మామయ్యకు బిడ్డలు,

గోన: మా చిన్న చెల్లెళ్ళిద్దరినీ ఇట్లా రమ్మనవయ్యా బావగారూ! లోనికి తన అతిథులకు భోజనాదికమ్ము లేర్పాటు చేయడానికి వెళ్ళిన మాచనమంత్రి సభాశాలలోనికి వస్తూ ఆ మాటలు విని ఒక పరిచారికను పిలిపించి ‘అమ్మాయి సీతను, కల్యాణినీ తీసుకొనిరా’ అనిఆజ్ఞ ఇచ్చినారు. పది క్షణికాలకు నూత్నాలంకారాలు తాల్చిన సీతా, కల్యాణీ పరిచారిక వెంట అక్కడకు వచ్చారు. గోన గన్నారెడ్డి వారివంక చూచి, నా చిన్నచెల్లీ! రావమ్మా కల్యాణీ! మీ పెద్దన్నగారిదగ్గర సిగ్గేమిటమ్మా!’ అన్నాడు నవ్వుతూ.

సీత: సిగ్గుకాదండి, అన్నయ్యగారిని దర్శనం చేయడానికి సరియైన వేషంతో రావాలని పారిపోయాం.

గోన: నేను వచ్చేసరికి నువ్వే వీణవాయిస్తూ పాడుతున్నావు కాదూ! గొంతుక పోల్చుకుంటున్నాను.

సీత: అవునండి. మాబావ పాడమంటే.....

గోన: అవును తల్లీ బావే నిన్ను పాడమంటాడు. బావను రెండు పద్యాలు చదువ మనలేకపోయినావూ ఆయనగారు చేసినవానినే!

అక్కిన: ఆయన మాటలు నమ్మకు సీతా!

కల్యాణి: నువ్వు దొంగవులే, నీమాటలేమీ నమ్మనులే బావా!

గోన: నిజం తల్లీ! వట్టి దొంగబావ! నమ్మదగిన మనిషికాడు. అతి తియ్యగా అద్భుతంగా కవిత్వం చేయగల కవి! ఈమధ్య స్కాందము ఆంధ్రాన రచన చేస్తున్నాడు. వినితీరాలి చెల్లీ!

అక్కిన: మా ప్రభువు గంభీరకంఠంతో పాడుతూఉంటే మందార కుసుమాలు విరిసి మధువులు ప్రవహిస్తాయి సీతా!

మాచన: ఇద్దరూ ఒకరి రహస్యాలు ఒకరు వెల్లడించుకొంటున్నారు. అయితే ప్రభూ! ఈ మధ్యాహ్నము వర్జ్యమేమీలేదు. శుభలేఖలు వ్రాయించి పంపుతాను.

గోన: తప్పకుండా పంపించండి బాబయ్యగారూ !

9

భోజనానంతరం గన్నారెడ్డి, అక్కినప్రగడ ఇద్దరూ కూర్చుండి కొంచెం కాలం సీతమ్మ వీణపాట విన్నారు. కొంతసేపు కల్యాణి పాడిన ముద్దులుగులికే పాటలు విన్నారు. గన్నారెడ్డి వారిద్దరకూ చెరి ఒక ముత్యాలహారమూ బహుమాన మిస్తూ ‘ఈ హారాలు మాకు దొరికిన పాతులోవి’ అన్నాడు.

ఆ బాలలు వెళ్ళిపోగానే, ఆ యిద్దరే అక్కడ కూరుచుండిరి. వెంటనే అక్కిన గోన గన్నారెడ్డిని చూచి, ప్రభూ! అన్నీ తెలిసికొన్నాను. పూగినాటి విషయాధిపతి కోట పేర్మాడిరాయుడు, చక్రవర్తికీ తనకూ ఉన్న చుట్టరికమైనా తలుచుకోకుండా తనజ్ఞాతి, చక్రవర్తిగారి అల్లుడు, ఆరువేల సీమాధిపతి అయిన శ్రీ కోట భేతమహారాజులం వారిపైకి, తెరాల ప్రభువు కాటయనాయకునితో కలిసి దండెత్తి వస్తున్నాడని తెలిసింది. మనకు మొదటవచ్చిన వేగులన్నీ వీరిరువురూ కలిసి మనపై కే వస్తున్నారని వచ్చాయి. అది పొరపాటు. మనం ఎక్కడున్నామో వాళ్ళిద్దరికీ సరిగా తెలియదు. అదీగాక మీ పినతండిగారి జైత్రయాత్రాపరిణామం అందరి హృదయాల్లో పిడుగులు కురిపించింది. కాబట్టి వీరిరువురూ ధాన్యకటకం మీదకే వెడుతున్నారు. ధాన్యకటకం దిగువను కృష్ణవేణ్ణను పడవలమీద దాటడానికి భేతమహారాజుగారి అనుజ్ఞ కోరితే ఆ వెఱ్ఱిమహారాజు సరేనన్నారు.

“అవునయ్యా బావా! చిత్రం ఏమీటంటే సైన్యాలన్నీ దాటేవరకూ తన జ్ఞాతికి భేతమహారాజు అఖండాతిథ్యం ఇవ్వ సంసిద్దుడైనాడట. నీకు వచ్చిన వేగు నిజమయితే వెంటనే మనం పేర్మాడిరాయని పేరు మాయిడి చేయించాలి. నువ్వు ‘అతివేగము’ అనగానే అతివేగంగానే వచ్చాను. నాతో ఉన్న సైన్యము అయిదువేలు. మా విఠలయ్య తక్కిన సైన్యంతో అటు పల్నాటి వైపునుంచి వచ్చి ఆ సైన్యాలను చుట్టుముట్టుతాడు. మూడువేలమందిని కృష్ణవేణి కీవల కాపుంచి, నాలుగువేలమందితో విజయవాడ దిగువ ఏరుదాటి నేను తమ్మునికి సహాయంగా వెడతాను. వాళ్ళిద్దరి సైన్యాలు భేతమహారాజు సిద్ధంచేసిన పదివేల పడవలలో దాటకుండా మన మూడువేలమంది సిద్ధంగా ఉంటారు. నువ్వుమాత్రం కదలడానికి వీలు లేదు. బావా! వస్తే కృష్ణ ఈవలి సైన్యాలకడకు రావచ్చును. అంతే! ఇది నా ఆజ్ఞ, బహుశః నీ పునస్సంధాన ముహూర్తంనాటికి వాళ్ళిద్దరి వ్యాపారమూ చక్కబెట్టి వస్తాను. వచ్చితీరుతానులేవయ్యా, అల్లరిపెట్టకు మీ తాతగారు వస్తారో, రారో?” అని గన్నారెడ్డి లేచి, ‘బావగారూ నేను బాబయ్యగారితో చెప్పి వెళ్తున్నాను’ అన్నారు.

“నేను మీతో వచ్చి యుద్ధంలో పాల్గొనరాదనే ఆజ్ఞా?”

“ఆజ్ఞే! ఉల్లంఘించడము పనికిరాదు. వస్తే కృష్ణ ఈవలకు రావచ్చును.”

“అక్కడికే వస్తాను.”

“మా బాబయ్యగారి అనుమతి అడిగిరావాలి మరి!”

“అనుమతి అడిగితే ఇస్తారా?”

“అయితే ఒక పని చేస్తాను. మూడువేల సైన్యాలు ఇక్కడే ఉంచి, నేను వెళతాను. నువ్వు ఎల్లుండి బయలుదేరి రా!”

అక్కినప్రగడ లేచి, వెంటనే లోనికివెళ్ళి మేనమామ మాచనమంత్రిని తీసుకొని వచ్చాడు. మాచనమంత్రికి గన్నారెడ్డి లేచి నమస్కరించి ‘బాబయ్యగారూ! నేను వెంటనే వెళ్ళిపోవాలి. పునస్సంధాన మహోత్స వానికి తప్పకుండా వస్తాను. ఎల్లుండి మా బావగారు ఇక్కడ నేను ఉంచే మూడువేల సైన్యాన్ని నడుపుకుంటూ ఒకచోటికి వెళ్ళాలి. ఆయన యుద్ధానికిరారు. ముహూర్తం మూడుదినాలుండగా ఇక్కడకు వస్తాడు. ముహూర్తం నాటికి మేమందరమూ వస్తాము. ఈలోగా మీరు నిర్భయంగా ఉండండి. ఏమీ భయపడవలసిన అవసరంలేదు” అని మాచనమంత్రికి పాదాభివందనమాచరించి, వా రాశీర్వదిస్తూ ఉండగా వీధిలోనికి వెళ్ళి అక్కడొక వీరభటుడు సిద్ధంచేసి ఉన్న గుఱ్ఱంపై చంగున ఉరికి, సహచరులు కూడరా గోన గన్నారెడ్డి సాహిణి వెళ్ళిపోయినాడు.

అక్కినప్రగడ ఆలోచనతో లోనికివచ్చి తిన్నగ మేడమీద తన గదిలోనికి పోయినాడు. అతడు అక్కడ ఒక బల్లమీద పరిచిన రత్నకంబళిపై కూరుచుండి దిండ్లనానుకొని ఆలోచనానిమగ్నుడై ఉండెను. మనుష్యుల ఆశకు అంతేమున్నది. పేర్మిడిరాయనికి చక్రవర్తి కావలెననే! దుర్మార్గులు! శ్రీ శ్రీ గణపాంబదేవి భర్త తెలివైన మహారాజేకాని ముందుచూపు లేనివాడు. కృష్ణార్జునుల ఏకరూపమైనవాడు తన ప్రభువు, గన్నారెడ్డి? కాని ప్రభువు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

ఈ మహాపురుషుడు తనకు వివాహం వలదంటాడు. అధర్మం అణచడమునకే తాను పుట్టినాడట. దేవునినామం ధరించినందుకు ఆయన ఆజ్ఞపరిపాలించడమే తన విధి అట. ఆయన వెన్నదొంగ, ఈయన గజదొంగ. తమలో స్త్రీవాంఛ లేదట. తనకున్న ప్రేమంతా స్నేహితులకూ, సైనికులకూ, ప్రజలకేనట. స్త్రీ తన కవసరము లేదట?

ఈ మాటలు నమ్ముటెట్లు? ఆయనజాతకంలో సప్తమస్థానమూ, స్థానాధిపతీ, శుక్రుడూ మంచిస్థితిలో ఉన్నారు, ఇంక వివాహం ఎలా తప్పించుకుంటాడు?

అక్కినప్రగడ సేనలను గూర్చుకొని యుద్ధాభిముఖుడై వెళ్ళుదునని చెప్పగానే కామేశ్వరి గజగజ వణికింది. ఆమె కన్నుల నీరుతిరిగింది.

‘కామేశ్వరి! అలా కంటినీరు పెట్టకు. మహావీరుడు ఖడ్గతిక్కన చరిత్ర వినలేదా? నన్ను ఆడదానిలా ఇంట్లో కూరుచుండమంటావా? మగువ మంచాలవలె,

“నాతో బెనంగిన నయమేమిలేదు
 కడువడిఁ గలనికిఁ గదలండి మీరు,
 కుల వైరముం దీర్ప గురుసాహసుండు
 పరికించిచూడ నెవ్వరు మీరుదక్క”

అనాలి. ఆమె ఇంకా ఏమిచేసిందో తెలుసునా, ఆయన కటారితెచ్చి చేతికిచ్చి,

“రతిరాజ్యసౌందర్య! రణరంగధీర
 కమలబాంధవతేజ! కరుణాలవాల

వినతాత్మజునిలావు వెసమీకు కలుగు
సామీరిసమమైన సాహసం బబ్బు
గృష్ణుని కెనయైన కీర్తి ఘటిల్లు
శ్రీగిరిలింగంబు, చెన్న కేశవుడు
వరములొసంగగ వర్థిల్లగలరు
శాత్రవవిజయంబు సమకూరు మీకు
ఈ యాయుధము వడివిచ్చును జయము
కలియుగంబున మీకు ఘనపూజ లమరు”

అన్నదట.

కామే: (రోషంతో) నాకీ పలనాటివీరుల గాథలు తలనొప్పి తెస్తాయి మన దేశంలో రాజ్యాలకోసం పోరి, అన్నదమ్ములు, చుట్టాలు నాశనం అవుతూ ఉంటారు. పలనాటివీరులు మహాపరాక్రమవంతులు కావచ్చును, కాని చిప్పెడు రాజ్యల కోసం తమలోతాము కొట్లాడుకు చస్తే దానిని వీరకర్మ అనడం అధర్మం.

అక్కిన: రాజ్యంకోసం పోరడం అధర్మమంటావు!

కామే: అవును. రాజ్యాన్ని పరులాక్రమింపవస్తే అప్పుడు ధర్మరక్షణకోసం పోరవచ్చు.

అక్కిన: కామేశ్వరి నువ్వు పసిదానవు.

కామే: మీరు మహా పెద్దవారా!

వెంటనే అక్కిన ఆనందపూర్ణుడై కామేశ్వరిని చటుక్కున హృదయానికి హత్తుకున్నాడు. నిట్టూర్పువిడుస్తూ, ఆమెను వదలి ‘కామేశ్వరి నేను కత్తి పట్టాలని వెళ్ళడంలేదు. వద్దని నా ప్రభువు ఆజ్ఞ. పరిశీలించడానికి వెడుతున్నాను. అంతే! పరాక్రమవంతుడై, ధర్మపరిపాలనంచేసే శ్రీ కోట భేతభూపతిమహారాజులంవారిని కోటపేర్మాడిరాయుడు నాశనం చేయబోతున్నాడు.

కామే: భేతమహారాజు చక్రవర్తి అల్లుడేకాదూ!

అక్కిన: అవును, అందుకని?

కామేశ్వరి: ‘దొంగలకు ధర్మం అధర్మం ఉందా?’ అని చిరునవ్వు నవ్వెను.

అక్కిన: బాగాఅన్నావు. మరి నేను రేపు వెళ్ళవచ్చునా?

కామే: మీరంతా ఇంత ధర్మంగా ఉంటే, ధర్మావతారులైన అన్నగారు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు మీకు నాయకులై ఉంటే మీకందరికీ గజదొంగలన్న ఈ అపవాదు ఏమిటి? ఆమె కంటినీరు తిరిగింది.

అక్కిన: వహ్వా! అదా నీ పరితాపం? సరే మళ్ళీ సుముహూర్తంనాడు నీ దర్శనం. నీనవ్వుముఖమే నాకు తాయెత్తు. నీతీయనివాక్కులే నాకు పంచాక్షరి. కామేశ్వరీ, కామేశ్వరీ! శుభముహూర్తంవరకూ నిన్ను ఉదయాస్తమానాలు చూడరాదని బాధ! ఈలోగా ధాన్యకటకం దగ్గర కృష్ణకీవల కొంత కాలం ఉండివస్తాను.

భార్య తనకు నమస్కారముచేయ ఆమెను రెండుచేతుల పైకెత్తి పెన్నిధిని వలె హృదయానికి హత్తుకొని, ఆమె కెంబెదవి పుణికి ముద్దాడి నెమ్మదిగా బయటికేగి ఆ తెల్లవారగట్ల అతడు మూడువేల సైన్యాన్ని నడుపుకొంటూ ధాన్యకటకంవైపు ప్రయాణం సాగించినాడు. అతనికి దారిపొడుగునాచిన్నారి భార్య కామేశ్వరి ముద్దుల మోము ఎదుట ప్రత్యక్షమవుతూనే ఉంది. ఆమె మోము చంద్రబింబమువలె స్నిగ్ధమైనది. గుండ్రమూ కోల కాని ఆ మోములో ఆ ఫాలం స్వర్ణది. ఆ ఫాలందిగువ కన్నులు ఇందీవరపత్రాలు. ఆ పత్రాలలో నీలి ఆకాశాలు కను పాపలు. ఆమె నాసిక వికసించిన బంగారు చంపకము. ఆమె పెదవులు చిన్నవి. వంపులు తిరిగినవి. క్రిందిపెదవి ఎఱుపు మందార పూ మొగ్గ. పై పెదవి వికసించిన ఎఱ్ఱకలువరేకు. ఆమె అందము వెన్నెల ప్రవాహము, ఆమె అందము సర్వ సంగీత సారము. ఆమెయౌవనము పారిజాత మల్లీకుసుమసంయోగ పరీమళ లహరి.

10

విజయదశమి ఉదయాన్నే, రుద్రప్రభునకు చక్రవర్తి ఆహ్వానం వచ్చింది. రుద్రమదేవి పురుషునివేషం వేసికొని అంగరక్షకులు కొలిచిరా చక్రవర్తినగరి కేగెను.

చక్రవర్తి పూజ చాలించి విద్యామందిరంలో దిండ్ల నానుకొని ఆసీనులై ఉన్నారు. రుద్రదేవి ఆ మందిరంలోనికి ప్రవేశించి వీరమహేశ్వరుడగు తండ్రి పాదాల వ్రాలింది. ప్రేమతో తండ్రి కుమార్తె నాశీర్వదించి తన ప్రక్క కూర్చుండ బెట్టుకొన్నారు.

“బాబూ! మీ యీ సుందరమూర్దంపై ఎక్కువభారం ఉంచాను. అందుకు మీకు కోపంగా లేదుకదా!”

“నాకు తమ ఆజ్ఞ భగవదాజ్ఞకదా మహాప్రభూ! నన్నెరగరా?”

“మా అనంతరం మీరు ఈ భారం ఇంకా ఎక్కువ వహింపవలసి వస్తుంది.”

“తాము ఈభుజాలకు మహాశక్తిని ప్రసాదించారు. ఆ భారం అతి సులభంగా వహించడానికి తగిన రహస్యం శివదేవయ్య దేశికులకు తెలుసును. అయినా తాము నూరేండ్లు ఈ మహారాజ్యభారం వహించి ఉండనే ఉంటారాయెను!” వెఱ్ఱితల్లీ! నేను ఇంకకొద్ది నెలలుమాత్రమే ఉంటానని నాకు పూర్తిగా నమ్మకము. అయినా మన దేశికులు వసిష్ఠసమానులు. ఎన్నిసామ్రాజ్యాలన్నా చిటికెనవ్రేలితో మోయగలరు.”

“అదేధైర్యం నాయనగారూ! లేకపోతే ఈ మహారాజ్యభారం వహించడం స్త్రీమాత్రకు శక్యమా?”

“అవేమిమాటలు తల్లీ! సంపూర్ణబాధ్యతతో రాజ్యభారం సునాయాసంగా వహించగలుగునట్లుగా నీకు శిక్షగరిపాము. మొదట అంత ధైర్యంచెప్పి మళ్ళా సాధారణ స్త్రీవలె భయపడిపోతావేమి?”

“మీరు నాకు అప్పగింతలు చేయుచున్నట్లు మాట్లాడితే భయంవేసింది!”

అప్పుడే శివదేవయ్య దేశికు లక్కడకు వస్తున్నారని దౌవారికుడు మనవి చేశాడు.

వెంటనే చక్రవర్తి రుద్రదేవ సహాయంతో లేచి, శివదేవయ్య మంత్రి రాగానే ఇరువురు వారికి నమస్కరించారు.

అందరూ ఆసీనులైన వెనుక ఈ మాటలూ ఆ మాటలూ జరిగాయి. మత విషయకమైన విషయాలేవో వచ్చాయి. శివదేవయ్య అప్పుడు రాజకుమార్తె మోము వంక చూచి, ‘రాజకుమారీ! చక్రవర్తికి ఏదో సందేహం కలిగింది. మీరు స్త్రీలు కాబట్టి ధర్మశాస్త్రప్రకారం రాజ్యం పాలించడానికి అర్హత ఉన్నా, ఆచారప్రకారము లేదు. అయినా దేశమూ, దేశపరిస్థితులూ ఆలోచించి చక్రవర్తి మిమ్ము భావిచక్రవర్తిగా నిర్ణయించాడు’ అనిగంభీరముగా పలికెను. మరల నామె మోమున చూడ్కి నిలిపి ‘ఆ నిశ్చయప్రకారం తమకు వీర విద్య నేర్పి యువరాజులనే లోకంలో ప్రచురించారు. తరువాత రాజనీతిని అనుసరించి తాము స్త్రీలే అని ప్రచురిస్తూ రాజ ప్రతినిధిని చేశారు’ అనియెను.

రుద్ర: చక్రవర్తి ఆజ్ఞలు శిరసావహించితినికదా గురుదేవా?

శివ: అవును మహాప్రభూ! ఇక చక్రవర్తిగారూ సంపూర్ణంగా లోక వ్యవహారాలు వదలివేయదలచుకొని తమ్ము కొన్ని వాగ్దానా లిమ్మని కోరదలచుకున్నారు.

రుద్ర: మహాప్రసాదం.

శివ: తాము సార్వభౌమత్వ భారం వహించి నవమ చక్రవర్తులు కావాలనీ; రెండు - తాము వివాహం చేసుకొన్న పురుషుడెంత మహోత్తముడైనా ఆయన చక్రవర్తి కాకూడదనీ; మూడు - రాజ్యార్హుడైన తమ కుమారుడు రాజ్యం వహించేముందు కాకతీయవంశానికి దత్తుడు కావాలనీ.

రుద్రమ ఇవన్నీ విన్నది. ఏవేవో ఆలోచనలకు లోనయింది. తాను వివాహం చేసుకున్న పురుషుడు చక్రవర్తి కాకుండుటెట్లు? సామ్రాట్టు భార్య సామ్రాజ్ఞి. సామ్రాజ్ఞి భర్త సామ్రాట్టు కారా? దేశికులిట్లు పలుకునపుడు తండ్రిగారి సర్వప్రజ్ఞలూ వారి కళ్ళలో పుంజీభవించి తన దెస ప్రసరించినాయి. ఆ కళ్ళలో తనపై అత్యంత విశ్వాసము వెల్లివిరిసింది. ఆ కళ్ళలో ప్రార్థన కాంతించినది. ఆ కళ్ళలో దివ్యప్రేమ నర్తించింది. ఆ కళ్ళలో ఒక మహాగర్వము ప్రవహించింది.

వెంటనే రుద్రమదేవి ‘నాన్నగారూ! నేను నా పితృపాదులకూ, నా చక్రవర్తికీ, సర్వదేవతల సాక్షిగా నేను తండ్రిగారికి వారసురాలుగా చక్రవర్తిని అవుతాననీ, నేను వివాహం చేసుకున్న పురుషుడు చక్రవర్తి కాడనీ, నా కుమారుడు కానీ, నేను దత్తుచేసుకొన్న బాలుడు కానీ కాకతీయ వంశజుడు అవుతాడనీ, నేనూ కాకతీయవంశగానే ఉంటాననీ మాటఇస్తున్నాను. ఇది నేను ఆడితప్పితే ఏడేడు కాలాలు నరకంలో ఉండగలదాన్ని, కాశీలో గోవును చంపినదాన్ని, గురుహత్య చేసినదాన్ని, బ్రాహ్మణధనం దోచినదాన్ని’ అని ఆమె గంభీరంగా పలికింది.

ఆ మాటలు విన్న గణపతిదేవ చక్రవర్తి సంతోషం నిండిన మోముతో కుమార్తెకు వీడ్కోలొసంగెను, రుద్రదేవి ఏవేవో ఆలోచనల పాలయి నెమ్మదిగా తన నగరు చేరింది.

తనకు సామ్రాజ్యం వదలి, సాధారణగృహిణిగా, ఆనందజీవితం అనుభవించాలన్న కాంక్ష కలగడం తండ్రిగారు గ్రహించారో లేదో! శివదేవయ్య దేశికులు మాత్రం గ్రహించారు. తనకు వివాహం అయితే కాకతీయవంశంలో తా నెట్లా ఉండగలదు? అందుకనే తండ్రిగారా వాగ్దానం అడిగారు. వివాహం నిజం. కాని తనభర్త సామ్రాట్టు కాకూడదు. అలా సామ్రాట్టు అయితే అనేక కలహాలు, అపశ్రుతులు సంభవింపవచ్చు. కాని తనభర్త చక్రవర్తి కాకుండా ఉండుట ఎలా? అది ధర్మమా? నీతియా?

ధర్మశాస్త్రప్రకారం స్త్రీ వివాహంకాకుండా ఎలా ఉండుట? సన్యాసిని కావాలి. తాను వివాహం చేసుకుంటే తనభర్త చక్రవర్తి కాకూడదు! రాజనీతి ననుసరించి, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల మహాసామ్రాజ్య సింహాసనం అధివసించిన స్త్రీ వివాహిత కాకున్నా తప్పేమీ ఉండదు. అందుకే తండ్రిగారు వివాహం చేసుకొని తీరుతాననే వాగ్దానం కోరలేదు. అంతవరకుశుభం! తాను ఆ దివ్యపురుషునే ప్రేమించి వారికి తన హృదయంలో పట్టము కట్టుకొన్నమాట నిశ్చయం. అట్టి ఆ పురుషోత్తముని తాను వివాహం చేసుకొంటే వారికి అర్ధసింహాసనమిచ్చి చక్రవర్తిగా చేయకుండుటెట్లు?

ఇంతకూ ఆ వీరోత్తముడు తన్నెట్లు ప్రేమించగలడు? తాను స్త్రీ నని ఈ రెండేండ్లు వా రెరిగిఉన్నమాట నిశ్చయమే. ఆనాడు తోటలో నిజ స్వరూపము చూచినారు. ఆ చూచినది నన్నేనని వా రెరుగరు. తన్ను వివాహ మాడుడని వారిని కోరితే, తాను చక్రవర్తులు కాకూడదని వారికి నివేదిస్తే....వారు పరమోత్తమ పురు షులు కావడంవల్ల చక్రవర్తి ఆజ్ఞగా ఎంచి ఒప్పుకోకపోవచ్చును. కాని అట్టి అధర్మానికి తా నెట్లు ఒడి పట్టగలదు?

ఈ నిష్టుర రాజధర్మాన్ని తాను నిర్వికారియై నిర్వహించి తీరుతుంది. తాను పురుషుడై పుట్టినచో తండ్రిగారికీ విరుద్ధరాజనీతి అవలంబించవలసిన అవసరం ఉండదుకదా!

రుద్రమదేవి పూజాగృహంలోనికిపోయి కాకతీదేవీ పూజాపీఠానికి ఎదుట సాగిలబడి ‘భవిష్యత్తు తెరలను తొలగించి కర్తవ్యం ఉపదేశించు తల్లీ’ అని ప్రార్థించింది.

11

దుర్గాష్టమి మొదలు అన్నాంబిక ఉపవాసవ్రతం చేస్తూ, కాకతీదేవీ పూజ చేస్తూ ఉన్నది. ఉదయం పూజలు కాగానే ఏవో ఖర్జూర, ద్రాక్ష, అత్తి, మారేడు, జామ, అరటి, నారింజ, నారికేళాది ఫలాలను ఆరగించి, సాయంకాలం పూజ చేసి రాత్రి పాలుమాత్రం త్రాగిఉండేది! ఆలాగు మూడు దినాలు పూజచేసి విజయదశమికి పూజ పూర్తిచేసింది.

విజయదశమి వెళ్ళిన మరునాటికి కోట పేర్మిడిరాయుడు తెఱాల కాటయ, గుంటూరి నాగవిభుడు కలిసి భేతమహారాజులను హతమార్చడానికి సైన్యాలతో ధాన్యకటకం చేరుతున్నాడని శివదేవయ్య దేశికులకడకు వేగు వచ్చింది.

ద్వాదశినాడు పేర్మాడిరాయుడు భేతమహారాజులను, వారి రాణివాసాన్ని వారి నగరిలోనే బంధించి, ధాన్యకటకనగరం ఆక్రమించాడనీ, ఏదో వంకను భేతమహారాజును కైలాసవాసిని చేయ ఆలోచిస్తున్నాడనీ, గుంటూరి నాగవిభుడు సర్వసైన్య ఆయత్తంచేసి, ధాన్యకటకంమీదకు వెళ్ళబోతున్నాడనీ, వా రిరువురు, తెఱాల కాటయ్య కలసి ఓరుగల్లు ముట్టడించడానికి సిద్ధమౌతారనీ వేగు వచ్చింది.

శివదేవయ్యమంత్రి రుద్రమహారాజు దర్శనంచేసి మహారాజుతో మంతనంసలిపినారు. ఇంతలో ప్రసాదాదిత్య ప్రభువును, సబ్బిసాహిరమండల సకల సేనాపతిపట్టసాహిణి పడికము బాప్పదేవప్రభువునకును, జాయపమహారాజునకును వార్త పంపినారు.

వారందరిసభలో రుద్రప్రభువు ‘నేను సకలసేనాపతిగా పడికము బాప్పదేవ ప్రభువు సేనాపతిగా గుంటూరుమీదకు దండయాత్ర చేస్తాను. జాయపమహారాజు ప్రసాదాదిత్య ప్రభుసహాయంగా ఓరుగల్లునగరం కాపాడడం, మధ్యరాజ్యాలన్నీ చూస్తూఉండడం చేయవలసింది! జన్నిగదేవుని, వారికుమారులు త్రిపురాంతక అంబయ్య దేవులను కొంచెం జాగ్రత్తగా ఉండవలయునని తెలియచేయాలి! నేను గురుదేవులు ఏర్పరచిన శుభముహూర్తానికి జైత్రయాత్రకు వెడతాను. నాతో నా సవితితల్లి శ్రీ నారాంబా మహారాణీగారు దయచేయగలవారు’ అని చెప్పినారు.

శివదేవయ్యమంత్రి చాలా బాగున్నదని సమ్మతించినారు.

అన్నాంబిక రుద్రప్రభువును త్రయోదశినాడు దర్శించినది. ‘మహాప్రభూ! తామే స్వయంగా జైత్రయాత్రకు వేంచేస్తున్నారని నగరమంతా వాదు ప్రసరించింది’ అన్నది.

రుద్ర: చెల్లీ! ఎన్నిసారులు నన్ను ప్రభూ గిభూ అని పిలువవద్దన్నాను? అయినా నువ్వల్లాగేపిలుస్తున్నావు!

అన్నా: క్షమించండి అక్కా! ఈసమయంలో మాకు సర్వసేనాపతులు, మహారాజులు మీరు. ఆ భావంతో అన్నాను. నేను మనవిచేసేది ఏమిటంటే, మిమ్మువదలి ఇక్కడ ఉండలేను. నేనూ వీరవేషంతో మీకు అంగరక్షకురాలుగా ఉంటాను.

రుద్ర: తల్లీ! నీకు ఏమైనా మొప్పం రావచ్చును.

అన్నా: మీకు రాదుకాబోలు! నన్ను ఇంటిదగ్గర సౌఖ్యంగా కూరుచుండమంటారా? ఏమి పక్షపాతమండీ అక్కా?

రుద్ర: అలాగే చెల్లీ! నువ్వు ప్రయాణసన్నాహంలో ఉండు. నీ అక్కకు అంగరక్షకురాలివిగా ఉండు. ఈమగవాళ్ళకు స్త్రీలు ఎలాయుద్ధం చేయగలరో చూపిద్దాము.

అన్నా: అక్కా! మీరు ఒప్పుకుంటే మనరాజ్యంలో వీరస్త్రీదళం ఒకటి సిద్ధంచేసి, ‘ఆంధ్ర వీరరమణులు శ్రీశ్రీరుద్రమహాదేవ పరిపాలనంలో ఉన్నారు’ అని లోకానికి చాటిస్తాను.

రుద్ర: నీ అభిప్రాయం అద్భుతం. కైకేయి, సత్యభామా మహాయుద్ధాలు చేశారు. దన్యులను వేదకాల స్త్రీలు చెండాడేవారు. మనమూ తక్కువకాదు. ఇప్పుడు నేను స్వయంగా జైత్రయాత్రకు బయలుదేరడంలో పరమోద్దేశం ఒకటి ఉన్నది. అది గురుదేవులూ గ్రహించారు. నేను ఈ మహారాజ్యాలన్నీ పరిపాలించక తప్పదు. నేను నీరసురాలనని తెలిస్తే, ప్రతిసంవత్సరమూ ఈలాగే ఎవరో మాండలీకులు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. దేశంలో అధర్మంనిండి, విచ్ఛిన్న శక్తి తాండవం చేస్తుంది. ఒక్కసారి నేను యుద్ధయాత్రచేసి దక్షిణం అంతా సంచారంచేసి దుర్మార్గులైన మాండలీకులను శిక్షించి, తక్కినవారి హృదయంలో ‘జాగ్రత్త’ అని ప్రతిధ్వనింప చేస్తాను.

అన్నా: ఇంకో రహస్యంకూడా ఉంది. మీరు స్వయంగా ఏ మహాయుద్ధంలోనూ పాల్గొని ఉండలేదు. ఇప్పుడా అవకాశం లభించింది. అదీ గాక మీరు స్వయంగా వెళ్ళితే, రాజద్రోహు అనేకుల హృదయంలో రాజ భక్తి తిరిగి ప్రవేశించవచ్చును. రుద్రా: ఎంతచక్కగా అన్నావు చెల్లీ! ఇక సిద్ధంకా!

పూర్ణిమ వెళ్ళిన తదియనాడు మహారాజు పడికము బాప్పదేవమహారాజుతో సైన్యాలన్నీ నడుపుకొంటూ మహావేగంతో కృష్ణాతీరంవైపు వెడుతున్నారు. ధాన్యకటకందగ్గర దాటడంకన్న విజయవాటికకు దిగువను కృష్ణానదిని పడవలలో దాటడానికి రుద్రమహారాజు ఆజ్ఞ దయచేయించారు. అపసర్పగణనాయకశ్రేష్ఠులైన గొంక ప్రభువులున్నూ, నతవాటిసీమవారైన మేనత్తల వంశంవారూ అనేకాలైన నావలను పోగుచేస్తున్నారు.

దారిలో ప్రధానఅంగరక్షకాధిపతిగా ఒక యువకవీరుడు కవచధారియై మహారథం ప్రక్క రథం అధివసించి అంగరక్షక చక్రరక్షక నాయకుడై వస్తున్నాడు. మహారాజు గుంటూరు పట్టుకుంటే ఆ వెనుక ముమ్మడాంబిక రావచ్చుననీ, అటువెనుక కంచి, కాళహస్తి, శ్రీశైలాది క్షేత్ర దర్శనం చేసి సంక్రాంతినాటికి తిరిగి ఓరుగల్లు రావడానికి నిశ్చయంచేసుకున్నాననీ చెప్పి ముమ్మడాంబికను ఒప్పించెను.

అన్నాంబిక ఉప్పొంగిపోయింది. ఆమె మోము తేజరిల్లిపోయింది. ఆమెకు రుద్రాంబికవలె ఇదే ప్రథమయుద్ధం,

శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు ధాన్యకటకమహారాజును పట్టుకొన్న కోట పేర్మాడిరాయుడిపైకి వెళ్ళినారని రుద్రమహారాజు తనతో చెప్పినారే! వారు ఎప్పుడూ గన్నారెడ్డిప్రభువుపై కత్తికట్టరే! ఆప్రభువైనా చక్రవర్తివైపు కన్నెత్తి చూడరే! దొంగలు పెద్దప్రభువుల జోలికి పోక చిన్నవారిని దోచుకుంటారు కాబోలు! అయితే ప్రభువులు ప్రజలను రక్షించాలికదా! అందుకేకాబోలు దొంగలూ, ఇళ్ళు తగులబెట్టినవారూ, పంటలు నాశనము చేసినవారూ కఠినశిక్షలకు పాత్రులవుతున్నారు. ఇది దొరతనమా! దొంగతనమా!

గన్నారెడ్డి సమున్నత విగ్రహమూ, ఆయన సింహపరాక్రమమూ, ఆయన పరమాద్భుత యుద్ధనిర్వహణశక్తీ, వ్యూహరచనా చమత్కృతి లోకసమ్మోహనకరాలు, అలాంటి ఉత్తమపురుషుడు పినతండ్రి తనకన్యాయం చేసినంతమాత్రాన గజదొంగైపోవాలా?

ఆయన విశాలఫాలం, కన్నులలో కాంతి, వెడదఉరము, సన్నని నడుము, దీర్ఘబాహువులు, బంగారాన్ని నలుపుచేయు పసిమి, సోగమీసాలు, ముత్యాలకోవ పలువరుస ప్రతిదినమూ అన్నాంబిక ఒంటిగా ఉన్నప్పుడు తలచుకొంటూ ఏవేవో స్వప్నాలు కంటూ ఉంటుంది.

ప్రతిదినమూ భోజనాలు కాగానే ప్రయాణముసాగును. సాయంకాలమొక నగరం బైట శిబిరముల స్థాపింతురు. రాత్రి అంతయు, ఆ స్కంథావారంలో విశ్రమిస్తూ, వారు ప్రయాణం చేస్తున్నారు మహారాజపథం వెంటనే. మహారాజు శిబిరాలు స్కంధావారంమధ్య ఉంటాయి. దాని చుట్టూ నిరంతరం అప్రమత్తతతో అంగరక్షకులు కాపలాకాస్తూ ఉంటారు. స్కంధావారంతో పాటు గోపాలకులు వేలకొలది గోవులను, వర్తకులు విపణివస్తువులను తీసుకొని వస్తారు. వేలకొలది కుంభకారులు, రజకులు, మంగలివారూ కూడా వత్తురు. వంట చేయుటకు గొల్ల లుందురు.

ఆంధ్రసైన్యం కదిలిపోవు ఒక మహా పురములా ఉన్నది.

12

గోన గన్నారెడ్డి మహావేగంతో విజయవాడకడ కృష్ణ దాటాడు. కృష్ణ ప్రక్కనే ఇరవై మైళ్ళూ ప్రయాణించి ధాన్యకటకపుకోట తాకినాడు. తమ్ముడు విఠలభూపతి ఇంకా రాలేదు. గన్నారెడ్డి తన మామూలు విధానాన్ని రాత్రి వచ్చి కోట ముట్టడించాడు.

ఏయుద్ధాని కాయుద్ధంలో తన్ను తారసిల్లిన ప్రత్యేక పరిస్థితులు ఆలోచించి గన్నారెడ్డి వ్యూహరచన చేస్తాడు. తా నెంత గజదొంగ అయినా సార్వభౌమవంశం వారికిగాని, వారిదగ్గిర బంధువులకుగాని ఆపద రాకూడదు అని మొదటినుండీ తన పవిత్రధర్మంగా ప్రతిజ్ఞ చేసుకొన్నాడు. అందుకు ఎవరు వ్యతిరేకించినా ఓర్చలేడు. ఆ ధర్మాన్ని వ్యతిరేకించినవాడు ఎంత బలవంతుడైనా గన్నయ్య ఏమీ సందేహించక, అతన్ని ఎదిరించి నాశనము చేయవలసిందే! అతనికి కోపంవస్తే ఒకలక్ష గన్నారెడ్లుగా మారిపోతాడు. ఎక్కడ చూచినా తానే! అంతకోపములోనూ ఏమాత్రమూ ఉచితజ్ఞత, సమయస్ఫూర్తి మరువడు. అప్పు డా శక్తులు ఇమ్మడియై భాసిస్తాయి.

ఆ రెండువేల సైన్యంతో ధాన్యకటక నగరంపై ఒక వైపున ఒత్తిడి ఎక్కువచేశాడు. తనవారు పదునేనువందలమంది నాపనికి చాలించి, తక్కిన అయిదువందలమందినీ కోటచుట్టూ నియోగించెను. ఆరాత్రి గన్నయ్య ఎంత సైన్యంతోవచ్చి కోట తాకినాడో పేర్మిడిరాయనికిగాని, తెఱాల కాటయ్యకుగాని తెలియదు. ‘గన్నారెడ్డి వచ్చి ముట్టడించా’ డని కేకలు వేయించి గన్నారెడ్డి లోకం అంతా చాటినంతపని చేశాడు.

పేర్మాడిరాయుడు, కాటయ్య ఇద్దరు ప్రభువులూ ఏపక్కఅయితే గన్నయ్య కోటముట్టడింపు ఎక్కువ సాగించాడో ఆ ప్రక్కనే అశ్వాలపై వచ్చి చేరారు.

పేర్మాడి: గన్నారెడ్డి మనపై వచ్చిపడ్డాడేమిటి?

కాటయ్య: ఆ రాక్షసునికి నీతి, నియమం ఉందా మహారాజా!

పేర్మాడి: వీడు అసాధ్యుడు. పట్టినపట్టు విడువడు. ఏలాగు? కాటయ్య: నిజమే. మేడిపల్లి బాచయనాయకునిగతి ఏమయింది మహారాజా! ఉప్పలసోముడు, కోసగిమైలి, వందిభూపాలుడు ... వీడు ఎదుర్కొన్నవాడు బ్రతికి బయటపడలేదు.

పేర్మాడి: ఏమిచేయాలి? భేతరాజునుచంపి ఆ కండలు కోటగోడ నుంచి అవతల పారవేస్తే?

కాటయ్య: ఆ తలపువద్దు మహారాజా! మనల నిద్దరిని గుఱ్ఱాలకుకట్టి దేశాలన్నీ ఈడ్పిస్తాడు.

పేర్మాడి: ఏమయ్యా! మీరు వట్టి పిరికివారై పోయినారేమిటి?

కాటయ్య: రావణాసురుడి ఎదుట నుంచుంటే పిరికివాళ్ళుకాక ఎగరగలరా ఎవరైనా మహారాజా!

పేర్మాడి: అయితే వీడికి లోబడి శరణువేడుకోవడమే ఉత్తమం. తరువాత మనకు సహాయం చేస్తానని రహస్యవేగులు పంపిన ఆ మహానుభావుడి పనైనా కనుక్కుందాము.

అతివేగంతో, రౌద్రంతో తలపడిన గన్నారెడ్డి సైనికులకు బాసటగా నడి రేయి దాటిన రెండుగడియలకు ఉప్పెనలా విఠలయ్య, తక్కిన సైన్యముతోవచ్చి ధాన్యకటకాన్ని ముట్టడించాడు.

పేర్మాడిరాయని సైన్యాలలో దొరకిన ఒక దళపతిని పట్టుకొని గన్నయ్య కోటలోనికి వార్త పంపించాడు. ‘తెల్లవారేలోపుగా మాకు కోట స్వాధీనం చేయవలసింది. శ్రీ భేతమహారాజులంవారికిగాని శ్రీ గణపాంబాదేవి మహారాణులకుగాని, రాజబంధువులకుగాని, రాజభక్తులకుగాని, రాజప్రియులకుగాని, రాజోద్యోగులకు గాని ఏమాత్రం హానికలిగినా పేర్మాడిరాయని, కాటయ్యను బోనులలో పెట్టి సర్వదేశాలు తిప్పుతాను’ అని.

పేర్మాడిరాయుడు గజగజ వణకిపోయాడు. తెఱాల కాటయ్య చెమటలు కారిపోయాడు. వారు తమ సర్వసైన్యాలను ఆయుధాలను విసర్జింపచేసి కోటతలుపులు పూర్తిగా తెరిచి, కాగడావెలుగులలో తెల్ల జెండాలు ధరించి చేతులు కట్టుకు వచ్చి గోన గన్నయ్య పాదాలమీద పడినారు. కోటద్వారాలగుండా గన్నయ్య, విఠలయ్యల సైన్యాలన్నీ ధాన్యకటక నగరంలోనికి వచ్చాయి.

తెల్ల వారింది. కోట పేర్మాడిరాయని, తెఱాల కాటయ్యను రక్షకభటులు రాజసభాసమావేశం చేయించారు. స్నానసంధ్యానుష్ఠానాలన్నీ తీర్చి గోన గన్నయ్య తన తమ్మునితో స్నేహితులతో సభాప్రవేశం చేశాడు. శ్రీ కోట భేతమహారాజును సగౌరవంగా బందునుండి విముక్తి చేశారు. రాజబంధువులు, మంత్రులు, సేనాపతులు మొదలైనవారందరూ విముక్తులయినారు. వారందరూ యథోచితంగా రాజసభను ప్రవేశించినారు. మహావీరులైన చక్రవర్తి జామాత శ్రీ కోట భేతమహారాజులంవారు తమ రాజసభను ప్రవేశించినారు. అందరూ లేచి నిలిచారు. మహారాజు సింహాసనం ఆక్రమించక పూర్వం గోన గన్నయ్యను సమీపించి ఆ గజదొంగను కౌగిలించి చేయిపట్టుకొని తమతోపాటు అర్ధసింహాసనాన్ని అధివసింపచేసుకొన్నాడు.

మహారాజు: గన్నారెడ్డిప్రభూ! మాకు బంధువుగా ఈ పేర్మాడిరాయుడు, స్నేహితుడుగా ఈ కాటయనాయకుడూ మా రాజ్యం చొచ్చి, మా నగరం ప్రవేశించి, మా కోటకు అతిథులై దొంగపాటున మేమంతా నిదురపోతున్న సమయంలో మమ్ము బందీచేశారు. మీరు సమయానికి రాకపోతే ఈ కుత్సితులు మా ప్రాణాలే హరించి ఉందురు.

గన్నారెడ్డి: మహారాజాధిరాజా! ఇందులో నా గొప్ప ఏమీలేదు. మేము కోట ముట్టడించగానే, కోటలోఉన్న తమ సైన్యం అంతా తిరగబడి దొరికిన ఆయుధాలతో, ఈ దుర్మార్గుల సైన్యాలకడ లాగుకొన్న ఆయుధాలతో యుద్ధంచేయ ప్రారంభించారు. ఈ రెండు అగ్నులమధ్య నాశనంకాలేక వీళ్ళు నాకు లోబడినారు. మేము రాకపోయినా మహాప్రభువులు ఈ పిశాచులను నాశనం చేసేవారే.

మహారాజు: ఏమి పేర్మాడిరాయా! నీకు తగిన శిక్ష ఏది ?

పేర్మాడి: మహాప్రభువుల అనుగ్రహం. బంధుద్రోహం చేసిన నాకు మరణమే శిక్ష!

కాటయ: మహాప్రభూ! నేను శిక్షింపడానికికూడా తగను.

ఇంతలో దౌవారికుడొకడు ప్రవేశించి మహారాజు సింహాసనం ఎదుట మోకరించి ‘మహారాజాధిరాజా! మహారాణీవారు వీరిద్దరినీ శిక్షించేపని శ్రీశ్రీ గోన గన్నారెడ్డి ప్రభువులకు వదలవలసిందని మహారాజులంవారికి మనవిచేస్తున్నారు’ అని మనవిచేశాడు.

మహారాజు: మా ఉద్దేశమే మహారాణిగారికీ కలిగింది. చాలా సంతోషము. శ్రీ గన్నయ్య మహారాజా! మా ప్రేమా, మా కృతజ్ఞతా తమకు ఏలాగు తెలియ జేయగలం? తాము మా ప్రార్ధనా, మహారాణీగారి ప్రార్ధనా అంగీకరించి తమ రాజ్యం తాము స్వీకరించండి. మే మిరువురమూ చక్రవర్తులతో, రుద్రదేవ మహారాజులతో మనవిచేస్తాము.

గోన: మహాప్రభూ! నావిధి నేను నిర్వర్తించాను. ఈ బందీల విషయంలో శ్రీ గణపాంబా మహారాజ్ఞివారి భావమే ఉత్తమమైనది. ఇదివరదాకా ఈ ప్రభువు లిద్దరూ తమకు భక్తిగల సామంతులు. ఈనాడు ఏదో చెడుబుద్ధి పుట్టి ఈలా అయ్యారు. అదుగో! మా మంత్రి అక్కినప్రగడ కృష్ణదాటి వచ్చాడు.

అప్పుడు చినఅక్కినప్రగడ సభలోనికి ప్రవేశించి ‘మహారాజాధిరాజా! జయము! జయము! నేను రాకుండా యుద్ధం పూర్తి అయినందుకు విచారముగా ఉన్నది. కాని మహాప్రభువులకు, మహారాణీవారికీ ఇంతయినా ఆపత్తు కలుగ నందుకు యెంతో ఆనందంగా ఉన్నది. శ్రీ స్వయంభూదేవుల పరమకరుణ! మహారాజా! గుంటూరి నాగయ్యప్రభువు విజయవాడకడ కృష్ణదాటి డెబ్బది అయిదువేల కాల్బలంతో, పదమూడువేల అశ్వికులతో, యేడువందల గజాలతో ఓరుగల్లును ముట్టడించడానికి సాగిపోతున్నారనిన్నీ, అటు ఓరుగల్లునుంచి శ్రీశ్రీశ్రీ కుమార రుద్రదేవ మహారాజులు, శ్రీ పడికము బాప్పదేవ మహారాజులు నాగదేవరాజును ఎదుర్కొనడానికి వస్తున్నారనిన్నీ వేగు. మహారాజులు, ఈ పేర్మాడి ప్రభువుకొరకు సిద్ధంచేయించిన పడవలలోనే ససైన్యంగా కృష్ణదాటి వెళ్ళి శ్రీ రుద్రమహారాజులకు సహాయం చేయవలసిందని కోరుతున్నాను. మా మహారాజు, మేమూ అనతిదూరంలో కృష్ణవేణ్ణకు ఈవలి ప్రక్క ఉండి, నాగదేవయ్యను హతమారుస్తాము. ఇక ఈ పేర్మాడిరాయ, కాటయనాయకుల విషయంలో శ్రీ మహారాణీవారి అభిప్రాయం విన్నాను. ఈ పేర్మాడిరాయని రాజకంఠాభరణం నేను ఈ నిండు పేరోలగంలో భటులచే ఒలిపించి మా ప్రభువు కంఠాభరణం చేసెదను గాక. ఈ కాటయ్యనాయకుడు మోకరించి తమ పాదాలు, మా ప్రభువు పాదాలు అంటాలి. తమ తమ సైన్యాలు మహారాజులకు అప్పగించి తమ తమ మండలాలకు వీరు వెళ్ళుదురుగాక. ఇక్కడినుండి మహాప్రభువులకు వారు మూడేళ్ళవరకు రెట్టింపు కప్పము కట్టుతూ ఉంటారుగాక. ఇప్పుడు అపరాధంగా పేర్మాడిరాయ ప్రభువు మహాప్రభువులకు ఆరులక్షల టంకాలు, మాకు రెండులక్షల టంకాలు, కాటయ్యనాయకులు మహాప్రభువులకు లక్షటంకాలు, మాకు ఇరువదివేల టంకాలు బంగారము తప్పు చెల్లింతురుగాక’ అని సవినయంగా మనవిచేశాడు.

సభ్యులందరూ హర్షధ్వనులు చేసినారు. శ్రీ కోట భేతమహారాజులంవారు అతిసంతోషంతో చినఅక్కినప్రగడ ఆలోచన అంగీకరించారు. భేత మహారాజులు తమ మెడలోనున్న నాయకమణిహారం గోన గన్నయ్య మెడలో వైచి, విఠలధరణీశునుకి తమ ముత్యాలహారం అర్పించారు.

పేర్మాడిరాయని రాజకంఠాభరణం మంత్రులు తీసి గోన గన్నయ్యకు అర్పించారు. కాటయనాయకుడు సింహాసనంఎదుట మోకరించి తల భూమిపై వాల్చినాడు.

13

గుంటూరు నాగమహారాజు కోట భేతమహారాజులంవారికి ముఖ్య సామంతుడుగానూ, గణపతిదేవ చక్రవర్తికి నమ్మకమైన సేనాపతిగానూ ఉంటూ ఉండెను. కాని చక్రవర్తి అవసానదశలో ఉండడమూ, రుద్రమహారాజు స్త్రీ కావడమూ, అతని హృదయంలోనూ దుర్బుద్ధి పుట్టించింది. అదివరకు గణపతి చక్రవర్తితో కలిసి కమ్మనాటి, ఆరువేలనాటి, సిందవాడివిషయం పాకనాటి సామంతుల ఓడించడం విషయంలో ఎంతో యుద్ధనిర్వహణ దక్షత చూపించి చక్రవర్తివల్ల ఎంతో మెప్పుపొంది ఉండటంవల్ల, తన సహాయంవల్లనే చక్రవర్తి ఇన్ని విజయాలు సంపాదించాడనే అభిప్రాయం అతని హృదయంలో హత్తుకు పోయింది.

ఒకవేళ చక్రవర్తిలో ఏమన్నా శక్తివుంటే, ఆయన కొమరితకు ఆశక్తి ఎట్లా ఉండగలదు? ఇదే మంచి అదను. తానా వ్యూహనిర్వహణ చతురుడు! తనకు కలిగినట్లే ఇతరులకు స్త్రీ సామ్రాజ్యంలో ఉండడానికి కష్టం కలిగిఉండాలి. ఇంకనేమి? అతను అతిధీమాతో, నమ్మకంతో ఓరుగంటిని ముట్టడించడానికే బయలుదేరాడు. ఒకసారి ఓరుగల్లు పట్టుకొని సామ్రాజ్యాభిషేకం పొందితే తన్ను కదిలించడానికి ఆ వీరభద్రునికి కూడా తరంకాదు.

గుంటూరు నాగదేవరాజు పూర్ణిమవెళ్ళిన తదియనాడు కృష్ణదాటాడు. ఇక్కడి నుండి పంచమినాటికి నతనాటిసీమకు ఉత్తరపుభాగంలో ప్రయాణం చేస్తూ సప్తమినాటికి గార్లకు తూర్పుగా పదిగవ్యూతుల దూరంలో విడిదిచేసి ఉన్నాడు. ఒకవేళ గార్ల మండలేశ్వరుడు, శ్రీ రేచెర్ల గణనాథుడు ‘మీరు ఎక్కడికి, ఎందుకు వెడుతున్నా’ రని ప్రశ్నిస్తే ‘ప్రసిద్ధికెక్కిన మంత్రకాళేశ్వరము దర్శించడానికి వెడుతున్నా’ మని చెప్పవచ్చును అని నాగదేవరాజు అనుకొన్నాడు.

అపసర్పనాథులలో మహోత్తమవిద్యాసంపన్నుడైన గొంకప్రభువు నాగప్రభువు యాత్రవిషయం అడుగడుగూ తెలుసుకుంటూనే ఉన్నాడు. ప్రతిక్షణికము వార్తలు రుద్రమహారాజుకు అందిస్తూనే ఉన్నాడు. రుద్రమహారాజు పడికము బాప్పదేవుని, గొంకప్రభువును పిలిచి వర్థమానపురం విడిదిలో యుద్ధవిధానం మంతనము సలిపినాడు. ఆమె అంగరక్షకుడగు ఆ యువకుడు కూడా ఆ మంత్రాంగంలో పాల్గొన్నాడు.

తమ లక్ష ఇరువదివేల సైన్యమూ మూడుభాగాలుచేసి, ఏబదివేల సైన్యం నడిపించుకొని తాను గాళ్ళపైనుండి ఉత్తరంగావచ్చి నాగదేవుణ్ణి తాకుతాననీ, రుద్రమహారాజులు ఏబదివేల సైన్యంతో దక్షిణంగావచ్చి అతన్ని తాకవలసిందనీ, గొంకప్రభువు ఇరవైవేల సైన్యంతో గార్ల వెళ్ళి, అక్కడ రేచెర్ల గణనాథ ప్రభువు సైన్యముతో కలిసి పడమటగా వెళ్ళి నాగయ్యను మార్కొన వలసిందనీ, ఇదివరకే వేగులుఅందిన గాళ్ళప్రభువు నాగదేవయ్య పారిపోకుండా ఇట్లా చేయవలసిందనీ పడికము బాప్పదేవుడు సలహా ఇచ్చాడు.

నవమివెళ్ళిన దశమినాడు ఏమరుపాటున ఉన్న నాగదేవయ్యను మూడువై పులనుండి మూడు సైన్యాలు తాకినాయి. వెంటనే నాగదేవరాజు తన సైన్యాలను చక్రవ్యూహము రచించి నెమ్మదిగా తూర్పుకు తిరోగమింప జేయసాగినాడు. నాగదేవరాజు మంచివీరుడు, యుద్ధనిపుణుడు. పడికము బాప్పదేవు డెంతవేగంగా వచ్చి ఎన్నిసార్లు తాకినా, నాగదేవుని చక్రవ్యూహాన్ని బద్దలుకొట్టలేక పోయినాడు. దక్షిణమునుండి రుద్రదేవి ఎన్నిసారులో ఆ చక్రబంధనాన్నితాకి, దానిని చీల్చలేక వేలకొలదివీరులు కూలిపోవడంవల్ల వెనుకకు వెళ్ళవలసివచ్చింది. గొంకప్రభువు, గజనాథప్రభువుకూడా నాగదేవరాజు చక్రవ్యూహాన్ని ఏమీ చేయలేకపోయినారు.

ఇంతలో గన్నారెడ్డిప్రభుని వేగువారు దారిచూపిస్తుండగా శ్రీ కోట భేతమహారాజు తన సైన్యాలను పూర్ణిమవెళ్ళిన విదియనాటికి కృష్ణదాటించారు. అక్కడి నుండి వేగంగా ఉత్తరంగా ప్రయాణంచేస్తూ తన మేనమామ అయిన నతనాటి ప్రభువుల సహాయం చేసికొని భేతమహారాజు హుటాహుటి ప్రయాణంచేస్తూ ఇల్లింద గ్రామానికి తూర్పున రుద్రమహారాజు సైన్యంతో తన ఏబదివేల సైన్యముతో నతనాటివారి ముప్పదివేల సైన్యంతోనూ వచ్చి కలుసుకున్నాడు. ఈ మహాసైన్యం అంతా నాగదేవరాజు సైన్యాన్ని చుట్టుముట్టింది, ఆ దినమందు జరిగిన మహాయుద్ధం దేవాసురయుద్ధాన్ని జ్ఞాపకం చేసిందని ప్రజలందరూ చెప్పుకొన్నారు.

మరునాడు మధ్యాహ్నానికి బాప్పదేవుడు అతివీరావేశంతో నాగదేవుని చక్రబంధం ఛేదించి నాలుగువేలమంది వీరులతో విరోధుల నరుకుతూ, పొడుస్తూ మదగజం చెరువులోనికి చొచ్చుకుపోయినట్లు పోయి నాగదేవునితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. ఒకచోట చక్రవ్యూహం నాశనం కాగానే, ఆ బంధం నాలుగువైపులా విచ్ఛిన్నమైంది. రుద్రమహారాజు మహాశక్తివలె తన రథాన్ని తోలించుకుంటూ అంగరక్షకులతో వ్యూహమధ్యమునకు చొచ్చుకుపోయింది.

అటునుంచి గొంకప్రభువు, రేచెర్ల గణపతిప్రభువు చొచ్చుకువచ్చారు. భేతమహారాజు మరొకవైపునుంచి వచ్చాడు. ఈలోగా బాప్పదేవుడు మహాగరుడుడు మహానాగాన్ని చీల్చినట్లుగా నాగదేవరాజును నూరుబాణాలతో రథంమీద నిర్జీవుని చేసి పడవైచెను.

“జై గుంటూరి నాగదేవ తలగొండుగండ! జై పడికము బాప్పదేవా! జై రుద్రమహారాజా!” అని విజయధ్వానాలు మిన్నుముట్టాయి.

14

మహారాజు వేగంతో ప్రయాణంచేస్తూ ఉండిరి. ధరణికోటలో ముమ్మడాంబిక వచ్చి మహారాజును కలుసుకొన్నది. ఎక్కడికి రుద్రమహారాజు వెళ్ళినా అక్కడ సామంతులు మహాగౌరవంతో మహారాజును ఎదుర్కొని అఖండోత్సవాలు చేస్తూ ఉండిరి. కోట పేర్మాడిరాయుడు మహారాజు ఎదుట మోకరించి క్షమాభిక్ష వేడుకొన్నాడు. తెఱాల కాటయ్య కీటకమే అయిపోయినాడు. మార్జవాడినుండి పానుగంటివరకు మహాసామంతుడుగా రాజ్యంచేసే జన్నిగదేవుడు చక్రవర్తిని ఎదుర్కొని గౌరవించాడు. ఆయన కుమారులైన అంబయదేవ మహారాజు, త్రిపురాంతకదేవ మహారాజు రుద్రమహారాజుపట్ల భక్తి వెల్లడించారు.

మహారాజు శ్రీశైలం, విక్రమసింహపురం, కంచి మొదలైనవన్నీ చూసుకుంటూ కర్నూలు వచ్చారు. కర్నూలునుండి ఆదవోని వెళ్ళినారు. ఆదవోనినుండి బుద్ధపురం, వర్థమానపురం, అక్కడనుండి కతిపయ ప్రయాణాలు చేస్తూ భీష్మ ఏకాదశికి తిరిగి ఓరుగల్లు నగరం చేరారు. దారిపొడుగునా మహారాజపథంవెంట సేనలకు చలువపందిళ్ళువేసి సామంతులు మహానగరంగుండా ప్రయాణం చేస్తున్నట్లే అనిపించారు సైనికులకు.

అన్నాంబిక దేశాలన్నీ చూస్తూ, దేవుళ్ళను కొలుస్తూ రుద్రమహారాజుకు కుడిభుజంగా సంచరించింది. అయినా ఆమెహృదయంలో ఏదోబాధ కుములుతూనే ఉన్నది. ఆమెకు ఏవిధంగానైనా తాను చూడవలెనని కోరిన ఒక వీరుడుమాత్రం దర్శనం ఈయలేదు. ఆ వీరు డేమిచేస్తుంటాడు? సకలాంధ్ర భూమండలమూ ఏలే చక్రవర్తితనయ ఎదుట ఆ గజదొంగ ఎలా పడగలడు?

ఆ గజదొంగే శ్రీ కోట భేతమహారాజులను విడిపించారు. ఆ వీరునకట్టి అవసరమేమి కలిగినదో! ఈలా గోన గన్నారెడ్డి ప్రభువు చేశాడనీ, వీరుణ్ణి తాను ఏదో ఉడతాభక్తిలా గౌరవించాననీ భేతమహారాజులు చెప్పినప్పుడు రుద్రమహారాజులు తనవైపు చూచి చిరునవ్వు నవ్వినా రెందుకో? ఆదవోని వెళ్ళినప్పుడు తండ్రి తన్ను చూడలేదు. తన కొమరిత కాలగతి నందినదని దుఃఖించి ఊరుకొన్నానని వారితో అన్నారట!

తనతల్లి ఎంత దుఃఖించింది! పౌరుషంగల రెడ్డి రాజకుటుంబమువారు ఏకష్టాలకైనా ఓరుస్తారు. తండ్రిచేసిన అవమానం రుద్రప్రభువు అర్థంచేసుకొని ఊరుకొన్నారు. ఆ ప్రభువుకు తానేమీ చెప్పకపోయినా అర్థం చేసుకొన్నారు.

రాజకుటుంబాలన్నీ ఇలా బాధపడవలసిందే! మనుష్యుడు తోటిమానవులను తనకు బానిసలుగా చేసుకోవాలనీ, సమస్తవైభవాలూ తానే అనుభవించాలనీ కోరుతూ ఉంటాడు. అప్పుడే ఈ ప్రళయాలు సంభవిస్తాయిగదా!

సాధారణ స్త్రీయే తానై, సాధారణజీవితం జీవించి, మన్నైపోయినా ఒకటే, లేక క్షత్రియకన్యయై రాజ్యానికి పోరే నాయకుని బిడ్డయి, భార్యై, తల్లియై వారి ఆవేదనలు తనకూ సంక్రమిస్తే తానూ ఆవేదనపడుతూ ఏకాలానికి తాను తండ్రిలేనిదిగా, విగతభర్తృకగా, బిడ్డలేని తల్లిగా అవుతుందో తెలియక ఏదో గౌరవం అని, ప్రాణాలు అరచేత పెట్టికొని, బడాయికో, భక్తికో దానధర్మాలుచేస్తూ శాసనాలు చెక్కిస్తూ జీవించినా ఒకటే! ఇవన్నీ ఒక జీవితనాటకంలో భాగాలు. తానూ పురుషవేషం వేసుకొని యుద్ధం చేసింది. లోకంలో ధర్మం నిలబెట్టుతున్నామనీ, విజయం పొందుతున్నామనీ విఱ్ఱవీగుతూ తోటిమానవుల్ని హతమారుస్తుంటాము. ఆ మానవులు, శ్రీకృష్ణ భగవానుడు వచించినట్లు ఇదివరకే చచ్చినవారు!

చిన్ననాటి తన ఆటలు - చిన్న పూరిళ్ళలో ఆటలకన్న ఏమి ఎక్కువ ఆనందము తనకు సమకూర్చాయి? బీదబాలికకూ, తనకూ ఆనందం ఒకటే! తన చదువులు, బీదబాలిక చదువులకన్న ఎక్కువా? ఎక్కడ ఉన్నదీ ఆనందం? జీవితపరమావధి ఏమిటి?

ఇంతట్లో రుద్రమహారాజు అక్కడికి వేంచేసినారు.

“చెల్లీ, నువ్వు ఆనాడు చేసిన మహాయుద్ధము నేను నా జన్మలో మరువను. నువ్వు రెండుసార్లు నా ప్రాణం రక్షించావు. అలా చల్లగా ఏమీ తెలియనట్లు ఉంటావు. నీకు ప్రతి ఏమిచేయగలను? దారిపొడుగునా నువ్వు నన్ను కోరిన కోర్కెనుగూర్చి ఆలోచిస్తున్నాను.”

“అక్కా, నేను మీ ప్రాణం రక్షించానా? ఎందుకు అబద్ధాలాడుతారు?”

“మంచిదానివేలే! నిజం చెప్పనీయకపోవడంకూడా నేర్పేనా? సరే నీపని చెబుతా ఉండు.”

15

విజయయాత్ర నిర్విఘ్నంగా జరిగినందుకు కాకతమ్మ, ఏకవీరాదేవుల పూజ జరిగింది. సంక్రాంతినాడు, ఆ పూజకు సర్వసామంతులు ఆహూతులైనారు. సర్వ సేనాపతులు, సామ్రాజ్యోద్యోగులు, మహాపండితులు, కవులు, గాయకులు, శిల్ప బ్రాహ్మణులు, తక్కిన నియోగాల నాయకులు అందరూ వేంచేసినారు. నిడుదప్రోలు నుండి చాళుక్యప్రభువు అరుదెంచినారు. విద్యానాథకవీంద్రుని తండ్రిగారు వేంచేసినారు.

అ పూజలు మూడు రోజులు జరిగినవి. కాకతమ్మ, ఏకవీరల బంగారు విగ్రహాలు ఊరేగినవి. ఈ ఉత్సవము కేవలం రాజోత్సవము. విజయచిహ్నమైన ఈ ఉత్సాహం యావత్తూ అర్షసాంప్రదాయంగా నడిచింది.

ఈ మహోత్సవాలు, సంక్రాంతి పండుగలు రుద్రదేవి హృదయంలో మాత్రం సంతోషం నింపలేదు.

రుద్రదేవి మరల చాళుక్య వీరభద్రమహారాజును దర్శించగానే ఆమె సంపూర్ణస్త్రీ యైనది. ఆయనకు తెలియకుండా స్త్రీవేషముతో ఆయన్ను సందర్శించవలయునని రుద్రమదేవికి గాఢకాంక్ష కలిగినది. కాని ఆ పనివలన ఫలమేమి? రిక్తకాంక్షలు జీవితములో అనవసరావేదనలు ఉద్భవింప చేసి నిదానంగా ప్రవహింపవలసిన బ్రతుకునదిని ఎగుడుదిగుడుగా చేసి లోకంలో శాంతిని నాశనంచేస్తాయి.

శివదేవయ్య రుద్రమహాదేవి హృదయంలో జరుగుతూన్న మహాయుద్ధం గమనిస్తూనే ఉన్నారు. బంగారు ఛాయతో, సన్నగా శలాకలాగ పొడుగరియై వెలిగిపోయే దివ్యఫాలమూ, పొడుగాటిముక్కూ, లోతుకళ్ళూ, సన్నటిపెదవులూ గల శివదేవయ్యదేశికులు - “ఆ యుద్ధం జరిగితీరవలసినదే, లోకకల్యాణార్థమైన జీవితాన్ని సరితీర్చవలసిందేకాని మనుష్యు డంతకన్న ఏమిచేయాలి? రుద్రమదేవి యుద్ధం రుద్రమదేవి నిర్వహింపవలసిందే! కాని ఆమెకు లేనిపోని క్లిష్టసమస్య కలిపించి, ఆమె జీవితనౌక తెరచాపలపై నాలుగువైపుల నుంచీ నాలుగు గాలులనూ వదలి ఆమెనౌక ఆమె నడుపుకోవా లనడం ఏమి ధర్మం?” అనుకుంటూ ఉంటారు.

ఆమెను ఈ మహారాజ్యభారం వహించమన్నారు. ఆమెభర్త ఆమెతోపాటు చక్రవర్తి కాకూడదు. ఆమెకు చక్రవర్తి చిన్నతనములో పెండ్లిచేయకపోయెను. చేయకపోగా, మగవానినిగా పెంచి ముమ్మడమ్మనుఇచ్చి పెండ్లికూడ చేసినారు.

ఈ విషయాలన్నిటికీ తన సలహాయే ముఖ్యమైన కారణమయినది. చక్రవర్తికి ఈ బాలికవల్లనే కాకతీయవంశం నిలవాలనీ, కాకతీయ సామ్రాజ్యం అంతరించకూడదనీ ఉన్నగాఢకాంక్ష ఈ పరిస్థితులకు మూల కారణం. తాను పన్నిన ఎత్తుగడలన్నీ ఆకాంక్షమీద ఆధారపడి ఉన్నవి.

‘చాళుక్య వీరభద్రుడే రుద్రమదేవికి తగినభర్త’ అని వా రిరువురనూ దగ్గరకు తీసుకొని వచ్చి వారి హృదయాల రాగం ఉద్భవింపడానికి తానువేసిన ఎత్తులన్నీ ఫలించాయి కాని రుద్రమ ఉత్తమురాలవడంచేత తనభర్త తనతోపాటు చక్రవర్తి కావాలని కోరితీరుతుంది. ఆమెభర్త చక్రవర్తి అయినట్లయితే కాకతీయరాజ్యంలో ఉండాలని ఇష్టపడే సామంతులు చాలమంది చాళుక్యుల పాలనంలో, ఉండుటకు ఏ మాత్రమూ ఇష్టపడకపోవచ్చును. పురుషుడు భార్యతోపాటు చక్రవర్తి అయినట్లయితే స్త్రీ నెమ్మది నెమ్మదిగా అంతఃపురంలో ఉండిపోవడమూ, పురుషుడే ఏకైక చక్రవర్తి అవడమూ జరుగుతుంది అందుకనే రుద్రమదేవిని ‘నీభర్త చక్రవర్తి కాకూడదు’ అని కోరవలసివచ్చింది.

కాబట్టి కర్తవ్యం అంతా ఆ యువతీ యువకులమీద ఉంది! కాని కథానాయికా నాయకులిద్దరూ అత్యుత్తమ వంశజాతులవడంవల్ల తా మిరువురూ ఒక్కొక్క అడుగువేయడానికి, ఒక సంవత్సరము ఆలోచిస్తారు. కనుకనే తన సూత్రధారిత్వము తప్పదు. చక్రవర్తి వృద్ధుడు. ఏక్షణంలో ఏమి జరుగుతుందో? శివదేవయ్య ఆ యా విషయాలు ఆలోచిస్తూ తన పూజామందిరంలోనే ఉన్నాడు. ఉదయం ప్రార్థన చేసి, యోగాభ్యాసము చేసి, అవసరమైతే సభామందిరానికిపోయి రాజకీయ వ్యవహారాలు పరిశీలించి, రుద్రమహారాజునో, చక్రవర్తినో దర్శించి మధ్యాహ్నామునకు తిరిగి ఇంటికి వేంచేసి అతిథి అభ్యాగతులతో ద్వితీయస్నానానంతరం భోజనంచేసి, సాయంకాలం వరకూ గ్రంథకాలక్షేపమూ, పండితకాలక్షేపమూ చేసి, సాయంకాలం రాచకార్యాలు పరిశీలించడం శ్రీ శివదేవయ్యదేశికుల అలవాటు.

“ఇంతకూ ఈరాజ్యానికి ఆపత్తువస్తే దేవగిరి యాదవులవల్ల రాగలదు. ఆ గజదొంగ గన్నారెడ్డి పుణ్యమా అని ఎంతమందో రాజద్రోహులు హతమారిపోయినారు. ఇంక ఆలోచించవలసిన విషయము ఒకటి ఉన్నది. తెరవెనుక ఉండి ఈ రాజ్యమంతా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే ఒక మహావ్యక్తి! ఆ వ్యక్తిఎవరో చూచాయగా తనకు గోచరించింది.

“కాని అంతమాత్రంచేత ఆయన్ను నాశనంచేయడానికి వీలులేదు. ఆ నిజా నిజాలు కూడా కొద్దిదినాలలో తేలుతవి.”

“యాదవులు ఎప్పుడు వచ్చి పడతారో? అందుకు ఈ రాజ్యం తట్టుకోవలసిఉన్నది. సామంతులలో ఇంకను కొందరు రాజద్రోహం చేయడానికి సిద్ధపడినవా రున్నారు. వారితోపాటు కాంచీపుర చోడమహారాజు, పాండ్యులు ఉన్నారు. వారివిషయం తేల్చుకోవడానికేగదా తాను రుద్రమహారాజును జైత్రయాత్రకు పంపించింది! అప్పుడు ఒక్కరూ ఈ మహారాజ్యంపై తిరగబడెడి సామంతులు గాని ఇతర రాజ్యాలవారుగాని లేకపోయారు.

“ఈ లోగా రుద్రమహారాజుచేత ఓరుగల్లుకోటను సర్వవిధాలా సిద్ధంచేయించడం, రుద్రమహారాజు వివాహం నిశ్చయంచేయడం ఇవి ముఖ్యకార్యాలు” అని శివదేవయ్య దేశికులు అనుకుంటూ తన మహానగరులోని సభామందిరానికి వచ్చీ రావడంతోనే, ఒక సేనాపతి వారి పాదాల వ్రాలి, “మహామంత్రీ! కల్యాణపుర చోడోదయుడు తాను స్వతంత్ర చక్రవర్తిననీ, తాను చాళుక్యరాజ్యమైన సకల కుంతల రాజ్యభారం వహించినాననీ, పశ్చిమాంధ్రావనీశులు కుంతల సామంతునకే కప్పము కట్టవలసి ఉంటుందనీ లోకమంతా చాటించినాడట” అని మనవిచేసినాడు.

“ఏమీ! చక్రవర్తి కాలంనుంచీ మనకు కప్పం కట్టే కల్యాణపుర చోడులు ఇప్పుడు మానివేస్తారేమి? ఈ మహాదక్షిణావని అంతా ఏకచ్ఛత్రాధిపత్యం వహించి రాజ్యం ఏలిన చాళుక్యుల రాజధానిలో చోడులు ప్రవేశించడానికి కారణం రుద్రచక్రవర్తి లేడనుకున్నారా? సరే, మీరు వెంటనేపోయి రుద్రమహారాజుతో ఈ విషయం మనవిచేసి అక్కడ ఉండండి. నేను ఇంతలో అక్కడకు వస్తున్నాను” అని శివదేవయ్య దేశికులు ఆ సేనాపతికి సెలవిచ్చినారు.

16

“చాళుక్య వీరభద్రుడు శ్రీ కాకతీయ రుద్రమాంబదేవిని ప్రేమించిన మాట వాస్తవము. గాఢంగా పవిత్రంగా ప్రేమించాడు. సీతామహాదేవిని రాముడు ప్రేమించినట్లే ప్రేమించినాడు. కుణాలుడు కాంచనమాలను ప్రేమించినట్లు ప్రేమించినాడు. ఆమె సామ్రాజ్ఞి కాబోతున్నది, చాళుక్య వీరభద్రు డొక సాధారణ సామంతుడు. మహారాజు కొమరితలను సామంతుల కివ్వడం ఆచారం కావచ్చుగాక! రుద్రమదేవి చెల్లెలు గణపాంబాదేవిని సామంత శ్రేష్ఠుడైన కోట భేతమహారాజుకు ఈయలేదా?” ఈ ఆలోచనలతో శివదేవయ్య మంత్రి తన్ను దర్శించడానికి వచ్చిన చాళుక్య వీరభద్రుని కలుసుకొన్నాడు.

“రుద్రమదేవివారి విషయం అంతా వేరు ప్రభూ! ఆమె చక్రవర్తిని అయితీరాలి. ఆమె సాటి మహారాజును వివాహం చేసుకుంటే రెండు రాజ్యాలు ఏకమౌతాయి. ఏ కళింగాధిపతినో, ఏ యాదవ మహారాజునో, ఏ పాండ్యభూపతినో, ఆ రుద్రమహారాణి వివాహం చేసుకుంటే ఆంధ్రరాజ్యం అంతరించిపోతుంది! కాబట్టి ఆమెను అత్యుత్తమ సామంతునకు వివాహం చెయ్యాలికాదా మహారాజా?” అని శివదేవయ్యమంత్రి చాళుక్య వీరభద్రుని మోముచూచి ప్రారంభించారు.

వీర: మహామంత్రి! మీరన్నది నిశ్చయం. అయినా సకల ఆర్యావర్తంలో, దక్షిణాపథంలో ఆంధ్రమహారాజ్యంవంటిది ఇంకొకటిలేదు.

శివ: చిత్తం మహారాజా, ఎవ్వరికీ తెలియనిదినాల్లో ‘రుద్రప్రభువు’ స్త్రీ అని తమ కొక్కరికే తెలిపాను. జ్ఞాపకముందా?

వీర: చిత్తం! అప్పుడు నేను పొందిన ఆశ్చర్యానికి పరిమితిలేదు.

శివ: తాము మొదటినుండి రుద్రదేవి బాలకుడనుకొన్నారు. ఆ దినాలలో తాము తమ హృదయాంతరాల జరిగిన స్పందనమిచేత ఆ బాలకునియందు చాలా అనురాగం, ఆపేక్షా చూపిస్తూవచ్చారు.

వీర: చిత్తం. అప్పట్లో చక్రవర్తి కాబోయే ఆ బాలునియందు నాకు జనించిన భక్తి కాబోలు నను కున్నాను.

శివ: ఆమె బాలిక అని తెలియగానే తమ హృదయం, తాళగతులు తప్పింది మహారాజా! అవునా కాదా? మీరు ఉత్తమచాళుక్యులు. ఈ మహాసామ్రాజ్యము దక్షిణ చోళసామ్రాజ్యంతో కలిపి ఏలిన చక్రవర్తి వంశంవారు, ఆ వేంగి సామ్రాజ్యంలోనే, ఇప్పటికీ మహాంధ్ర చిహ్నంగా రాజ్యంచేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించండి. ఈ మహాసామ్రాజ్య చక్రవర్తినితో సరిసమానంగా గద్దె నెక్కగలశక్తి తామొక్కరికే ఉందని, నేనూ గణపతిదేవచక్రవర్తీ ఆలోచించాము. అందుకనే ఆమె బాలిక అని చాలాకాలం క్రిందటనే తమకు తెలియజేసి ఉన్నాము. కాని ఇక్కడ ఎన్నోచిక్కులు తటస్థించాయి. పురుషులు, ఇరువురు ముగ్గురు స్త్రీలను ప్రేమించగలరు. కాని స్త్రీ తన జన్మలో ఒక్క పురుషునే ప్రేమించగలదు! అయినా పురుషులలో మహోత్తములు మాత్రమే ఏకపత్నీవ్రతస్థులు కాగలరు. - శ్రీరాముడు, నలుడు, సత్యవంతుడు మొదలయినవారు. మహాప్రభూ! తామెందుకు ఇంతవరకూ వివాహం చేసుకోలేదు? మీచరిత్ర అంతా నాకు పూర్తిగా అర్థం అయింది. అనేకమంది రాజకుమారులు వివాహం చేసుకోకముందు తమ అంతఃపురంలో ఉన్న సుందర బాలికలతో క్రీడించి తమ మదనజ్వర తాపానికి మందు సంతరించుకొందురు. తాము ఇంతవరకు ఒక స్త్రీనైనా కన్నెత్తి చూడలేదు. మహారాజా! నేను మీకు తండ్రివంటివాడను. నాదగ్గర సందేహించకుండా నిజం తెలియ జేయండి. మీరు మా మహారాణి రుద్రమదేవిని ప్రేమిస్తున్నారు. అది నిజం! ఒక మహారాజ్యానికి ఉత్తమస్త్రీ ఒకర్తు సామ్రాజ్ఞి కానుండడం అపూర్వం. అది తమ మనస్సును మిక్కిలి రజింపజేసింది. ఉత్తమప్రేమ అనే దివ్యానుభూతి మానవ జీవితంలో కలగడం అపురూపం. ఆ సన్నివేశం లభించిన నాయికా నాయకుల చరిత్రలు పురాణాల కీర్తింపబడతాయి. సావిత్రీ సత్యవంతు లొకరికొరకు ఒకరు ఉద్భవించారు. ఒకరినొకరు చూచుకొన్నారు; ప్రేమించారు. వారి ప్రేమను కాలుడుకూడా విచ్ఛిన్నం చేయలేకపోయాడు. మహారాజా! మిమ్ము రుద్రమదేవి మహారాణి ప్రేమిస్తున్నారు. మీప్రేమను సామ్రాజ్యాలు, రాజనీతులు అడ్డుకోలేవు!

వీర: గురుదేవా! నేను తమ ఆజ్ఞానువర్తిని.

శివ: ఇంక తామూ, మా మహారాణీ లోక కల్యాణకోసం, వివాహం చేసుకొనితీరాలి. మహారాణి సర్వధర్మ స్వరూపిణి అవడంచేత, ఆమెకర్తవ్యం ఆమె నిర్ణయించుకోవాలి. ఈ లోగా తాము సంకల్పించుకున్న కేదారాది యాత్రలు మానివేయవలసిందని మనవిచేస్తున్నాను.

ఆ మాటలకు చాళుక్య వీరభద్రుడు ఆశ్చర్యమందినాడు. తన మనస్సులోని ఆలోచన ఈ మహానుభావుడు, ఈ శివస్వరూపులు ఎలా గ్రహించగలిగారు? ‘మహాభాగా! గురుదేవా! తమ ఆజ్ఞ నా శిరస్సున కిరీటం కన్న ఎక్కువ గౌరవంగా తాల్చబడుతుంది’ అని చాళుక్య వీరభద్రుడు శివదేవయ్యమంత్రి పాదాభివందన మాచరించి వెడలిపోయినాడు. ఆ సాయంకాలము వీరభద్ర ప్రభువు తిన్నగా కాకతమ్మ దేవాలయానికిపోయి పూజాదికము లైన వెనుక ఆదేవి ఎదుట సమాలింగితభూతలుడై ‘తల్లీ కాకతీదేవి! నువ్వే ఈ రాజ్యాన్ని రక్షించడానికి ఆ సుందరగాత్ర, ఆ వీరచరిత్రగా ఉద్భవించినావు కాబోలు! మేము నీ కనుసన్నల మెలిగే హీనమానవులం! తల్లీ, పరమపావనీ!

“కాకతీయ వంశోద్భవకారిణీం
 లోకోద్ధరణ స్వరూపిణీం
 కృపామయీం కలుషహారిణీం
 శక్తిమయీం రిపువిదారిణీం
 నమామి, శర్వాణీం ముక్తిదాయినీం”

అని ప్రార్థిస్తూ కన్నులు మూసినాడు. అతని హృదయంలో సింహవాహనా రూఢయై కోటిసూర్యప్రభాసితయైన ఒక నిర్మల తేజోమూర్తి చిరునవ్వుతో ప్రత్యక్షమైనది. హృదయంలోనుండి వేయి బరువులు పటాపంచలుకాగా ఆ ఉత్తమ చాళుక్యుడు లేచి, దేవీప్రసాదము కన్నుల కద్దుకొని ఆరగించి దేవాలయం వెడలి రథము ఆరోహించి తన నగరు చేరినాడు.