గోన గన్నారెడ్డి/పంచమగాథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పంచమగాథ

ఓరుంగల్లు

1

ఓరుంగల్లు ఎనిమిది లక్షల పౌరులు సుఖంగా కాపురంచేసే మహానగరం. రెండు గవ్యూతుల వెడల్పు, మూడు గవ్యూతుల పొడుగు గల కోటనగరము. ఆ కోటచుట్టు మహానగరము ఉన్నది. తీర్చిన వీధులు, పెద్ద చెరువులు, చిన్న సెల యేరులు, తోటలూ, దేవాలయాలూ, విపణీవీధులతో ఆ మహానగరానికి ఈడైన మహానగరము దక్షిణాపథమందుకాని, ఆర్యావర్తమునందుకాని లేనేలేదు.

కోటనగర మధ్యమందు మహారాజుల కోట ఉన్నది. ఆ కోటయే పెద్ద పురమంత ఉన్నది. కోటలో ఏకశిలకు తూర్పుగా మహారాజ శుద్ధాంతాలు, మహారాజ నగరులు ఉన్నాయి. ఉత్తరంగా, వాయవ్యంగా స్వయంభూదేవేశ్వరాలయం, కేశవ దేవర గుడి, ఏకవీరాదేవిగుడి ఉన్నవి. నైరుతిగా పడమట కోట తటాకం, ఈ తటాకాన్ని ఆనుకొని రాజోద్యానమూ ఉన్నవి.

స్వయంభూదేవాలయంకడకు నాల్గు మహావీధులు కూడుతాయి. ఆ దేవాలయానికి తూర్పువీధినంటి రాజబంధువుల మందిరా లున్నవి. చక్రవర్తి హర్మ్యం పావు గోరుతం పొడవు వెడల్పు ఉంటుంది. ఆ మహాభవనాల చుట్టూ ఎత్తయిన గోడ లున్నాయి. వానికి తూర్పుగా ప్రధానామాత్య శివదేవయ్యవారి హర్మ్య మున్నది. ఆ భవనానికి దక్షిణంగా దుర్గపాలకుడైన ప్రసాదాదిత్యనాయనింవారి సౌధాలున్నాయి. వానికి తూర్పుగా మహారాజాతిథిభవనా లున్నవి. ఆ భవనాలకు తూర్పుగా తంత్రపాల ప్రోలనాయనింవారి సౌధా లున్నవి. అ సౌధాలకు దక్షిణంగా ప్రోలనాయనింవారి కుమారులైన ఎక్కినాయని, రుద్రినాయని, పినరుద్రినాయని, పోతనాయనింవారల సౌధా లున్నాయి. వీ రందరు సేనాపతులు.

ఏకశిలకు పడమటగా కుమార రుద్రదేవమహారాజులకు అంగరక్షకులైన తంత్రపాల వల్లయనాయకులవారి సౌధాలున్నవి. ఇంక దక్షిణంగా మారమరాజులంవారి, ప్రోలనాయనింవారి భవనా లున్నాయి. చక్రవర్తి నగరులకు ఉత్తరంగా మహాసేనాపతియైన రుద్రనాయనింవారి భవనా లున్నాయి. ఆయన ఏకశిలానగర పాలకుడు. నగరసైన్యాధ్యక్షుడు నాగచమూపతి, నాగచమూపతి మామగారయిన మేచయ నాయకుడు ఎంతకాలమునుంచో తలవరిగా నున్నాడు. మేచయనాయకుని కుమార్తె అయిన మల్ల మాంబిక నాగచమూపతి ఇల్లాలు. నాగచమూపతి తండ్రి మల్ల చమూపతి గణపతిదేవుని మహాసేనాపతులలో ఒకరు.

రాచకోట లోపలిగోడ ననుసరించి ఉపసేనాపతు లనేకుల భవనాలున్నాయి. అక్కడక్కడ సైన్యశాల లున్నవి. రాజోద్యోగు లనేకుల మేడలు రాచకోటలో పడమటిద్వారం దగ్గరగానున్నూ, ఉత్తరపు గోడపొడుగునా రాజకాది శూద్రుల గృహాలు, రాచవారి సేవచేసేవారి ఇళ్ళు ఉన్నాయి.

అన్నాంబికకు ఓరుగల్లు చూడడం ఇదే ప్రథమపర్యాయం. మహారాణి కుప్పసానమ్మతోపాటు ఆ బాలికకూడా మత్తగజంపై అంబారిలో అధివసించి ఓరుగల్లు నగర మహావైభవం ఆనందంతో పరికించుతున్నది. నగరబాహ్యంలో ఉన్నవాడలలోనికి పొలాలనుండి రైతులు తిరిగి వస్తున్నారు. చిన్నపూరిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు, మేడలు ఆ మహారాజపథానికి ఈవలావల వాడలలో ఉన్నాయి. నేత శాలలముందు నూలు పడుగులు చేస్తున్నారు. సన్నని నూలును ముతకనూలును భామలు కండెలకు చుట్టుతున్నారు. కొందరు వనితలు కళింగమునుండీ, ఆంధ్ర మంజిష్టాది దేశాలలో అనేక భాగములనుండి వచ్చిన నూలును సన్నతనం, ముతక తనమునుబట్టి కేటాయింపులు చేస్తున్నారు.

ఆంధ్రదేశంలో దూదిబట్టల పరిశ్రమ అతి పురాతనకాలంనుండీ ప్రసిద్ధికెక్కినది. పది మడతలు పెట్టి ధరించినా దేహాన్ని స్పష్టంగా కనిపింపజేయగల సన్న నూలు వడకడంలో ఆంధ్రవనితలు జగత్ప్రసిద్ధి నందినారు. ఎంత ఉత్తమకుటుంబీకు రాలయినా, వ్రతములతోపాటు, పవిత్రమైన నూలునుకూడా వడకవలసిందే! ఆంధ్రవనితల నైపుణినిబట్టి వివిధపుంజాలుగా తేలు నూలు వస్తుంది. దేశానికి కావలసిన వస్త్రాలు సిద్ధం చేయడమేకాకుండా, ఇతరదేశాలకు సరిపోయే వస్త్రాదికాలను నేసి, ఆంధ్రులు ఎగుమతి చేసేవారు.

నేతలో ఆంధ్రసాలెవా రంత కౌశలంకలవారు అఖిల భారతదేశంలో ఇంకొకరు లేరు. మానువనాటి, బుద్ధనాటిలో, పెనాదాడిలో, సిద్ధవాడిలో ఉన్నిని నూలంత సన్నంగా వడకగలిగేవారు గొల్ల భామలు. ఆ నూలును కురవసాలీలు సన్నని కంబళ్ళుగా నేసేవారు. ఆ కంబళ్ళు కాశ్మీరశాలువలకు, హిమాలయరాంకవాలకు ఏమీ తీసిపోయేవి కావు. కళింగము, దక్షిణకోసలము చక్కని దుకూలాలకు ప్రసిద్ధి. చీనాదేశాన్నుండి తళతళలాడే మెత్తని పట్టునూలు దిగుమతి అయ్యేది. కామరూపాన్నుంచి వచ్చిన పట్టునూలున్ను ఉత్తమమైనదే. ఆ పట్టునూళ్ళతో ఆంధ్ర పట్టుసాలీలు నేసిన చీనీ చీనాంబరాలు, దుకూలాలు జగత్ప్రసిద్ధి పొందినవి.

ఆంధ్రదేశంలో పట్టునూలుపై బంగారము కరగించి పూతపూసి హోంబట్టు చేయుట పురాతనకాలంనుంచీ ఉన్నది. ఈ నూలుకు పారశీకులు జరీస్‌తారు (జలతారు) అనే పేరుపెట్టారు. పారశీకవర్తకులు ఈ హోంబట్టు నూలును విపరీతంగా కొనుక్కుపోయేవారు. ఈ పరిశ్రమచేసే శాలలు ఒరంగల్లులో ఎన్నో ఉండేవి. ఈ పరిశ్రమను పట్టుసాలీలు, స్వర్ణకారులు కలిసి చేసేవారు.

2

మల్యాలవారి సైన్యం ఓరుగల్లునగర బాహ్యపువాడలలో ఆగింది. మల్యాల వారివాడ. రేచర్లవారివాడ, విరియాలవారివాడ, ఇందులూరివారివాడ, గోనవారివాడ మొదలయిన సామంతుల సైన్యాలూ, ఉద్యోగులూ ఉండే పేటలు ఉండేవి.

మల్యాలవారి సైన్యం, సిబ్బందీ మల్యాలవాడ చేరుకున్నారు. గుండయ భూపతి, కుప్పసానమ్మ, అన్నాంబిక, కోటలోపల ఉన్న మల్యాలనగరు చేరుకున్నారు. మల్యాలవారి రాచఏనుగులు, గుఱ్ఱాలు దక్షిణద్వారాన ఓరుగల్లుపురం చొచ్చాయి. అలాగే దక్షిణపు గోపురద్వారాన కోటలోనికిన్నీ వెళ్ళి ఉత్తరంగా ప్రయాణించి తూర్పుకు తిరిగి తూర్పుద్వారానికి కొలది దూరంలోఉన్న మల్యాలనగరు చేరుకున్నవి.

ముందుఏనుగుపై మల్యాల గుండయ్య ప్రభువు అధివసించి ఉన్నారు. వారి వెనుక మహారాణి, అన్నాంబిక అధివసించిన మత్తేభము, ఆ వెనుక రాజకుమారుల ఏనుగులు మూడు వచ్చినవి. ఆవెనుక రాజగుఱ్ఱాలు ఏబది, ఆ గుఱ్ఱాల వెనుక దాస దాసీజనులు ఎడ్ల బండ్లపై శిబికలపై వచ్చినారు. వీని అన్నింటికి ముందు భజంత్రీలు, నాదస్వర మేళము నడుస్తున్నది. వందులు గుండయప్రభువు బిరుదావళులు చదువుతున్నారు. అంగరక్షకసైన్యం ముందు, ప్రక్కల, వెనుక నడుస్తున్నది. రాజవీధులు బళ్ళతో, గుఱ్ఱాలతో, ఏనుగులతో, శిబికలతో, స్యందనాలతో నిండి ఉన్నవి. రాచవారు ఎవరు వెడుతున్నా అది ఒక ఊరేగింపే !

అక్కలవాడ, భోగంవీధి, స్వర్ణకారవీధి, శిల్పకారులవీధి అన్నీ పురంలో ఉన్నాయి. కోటనగరంలో ఉన్న గుళ్ళల్లో ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చక్రవర్తుల దుర్గనగరానికి ఎదురుగుండాఉన్న రాజవీధిలో కొంతదూరం పోయిన తర్వాత సార్వభౌమ చిత్రశాల, గ్రంథాగారము లున్నాయి. నగరిలో సార్వభౌమ సౌధాలలో ఒక్కొక్క మహాభవనంలో ఒక్కొక్క చిత్రశాల ఉన్నది.

మాండలికులు చిత్ర, నృత్య, గ్రంథశాలల తమతమ నగరులలో ఉంచుకొనేవారు. మల్యాలవారి నగరిలో ఉన్న చిత్రశాల దేశప్రసిద్ధమైనది.

అన్నాంబిక ప్రయాణపు బడలిక తీరునట్లు సుగంధాలు కలిసిన వేడి నీట జలకమాడి శుభ్రవస్త్రాలు ధరించి సుగంధతై లదీపాలతో స్వర్గలోకంలా ఒప్పారే చిత్రశాలకు వెళ్ళింది. ఆ చిత్రశాలలో ఉన్న శివలీలా విలాసాలు గమనిస్తూ హంసతూలికల పరుపులు పరచిన దంతపుపీఠంపై అధివసించి ఆ చిత్ర లేఖనా లన్నీ అనేక రీతులుగా తన్ను గమనిస్తూ వుండగా ఆలోచనకు లోనయింది. తనభక్తికి ఆకరమైన తండ్రికిని, ప్రేమ నిధానమైన గన్నారెడ్డి ప్రభువుకు యుద్ధం సంభవించవచ్చును.

ఒకమాటు ఇక్కడ, మరొకమాటు అక్కడ నీడ వున్నచోట నిలువక, ఎండ వున్నచోట నిలిచి, తిరిగే గన్నారెడ్డి తనతండ్రిగారి ఔద్దాత్యానికి ఎన్నికష్టాల పాలవునో? తనతండ్రిగారికి పట్టుదల విపరీతము. ఈమధ్య సైన్యా లెన్నో కూరుస్తున్నారు. ఏదో భయంకరమైన సంఘటన రాబోతున్నది. ఈ సంఘటనలోగా తన తండ్రిగారికీ గన్నారెడ్డికీ సంఘర్షణవస్తే తన గతి ఏమి? ఒక వంక తండ్రి, వేరొకవంక తాను భగవంతుడుగా ప్రేమించే ప్రియుడు. వీ రిరువురు ఒకరివల్ల ఒకరు పరాభవం పొందినా, లేక నాశనమైనా తన కది ప్రాణంపోకడే అవుతుంది.

ప్రేమకై స్త్రీపురుషులు సర్వమూ అర్పిస్తారు. ఆప్రేమ ఎంత క్షణికమో అంత మహాశక్తిపూరితము. ప్రేమిస్తున్నానని, ప్రేమకై రుక్మిణీదేవి అలా తన తలిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ వదలి, పురుషునితో పారిపోయింది. సీత అడవులలో భర్తతోపాటు సర్వకష్టాలు పడింది. సావిత్రి భర్తప్రాణం కోసం యముణ్ణికూడా వెంటాడింది.

స్త్రీ ప్రేమకోసం సర్వమూ త్యజిస్తే పురుషు డట్లా చేయగలడా? స్త్రీలు ప్రేమకోసం అన్నింటినీ అర్పిస్తూ ఉంటే పురుషుడు రాజ్యంకోసం అన్నీ సమర్పిస్తాడు. క్షణికమై, నశ్వరమైన ఈజీవితం భోగభాగ్యాలకోసం గజిబిజి చేసుకొనే పురుషుడు నిజము గ్రహించే ఈనాటకము ఆడుతున్నాడా?

ఈ సమస్యను, తన చరిత్రమును అంతా శ్రీ శివదేవయ్యదేశికులను కలుసుకొని తాను యిదమత్థమని తేల్చుకొంటుంది గాక.

అన్నాంబిక చిత్రశాలలో ఉన్నదని తెలిసి కుప్పసానమ్మ ఆ మందిరానికి విచ్చేసింది. అన్నాంబిక లేచి నిలిచింది.

కుప్ప: అన్నాంబికా! చాలా ప్రొద్దుపోయింది. అలసటపడి వున్నారు. మనం భోజనాదికాలు కానిచ్చి శయనమందిరాలు చేరుకుందాము.

అన్నాంబిక: ప్రయాణంలో నా కేమీ కష్టం కలుగలేదు. ఆదవోనిలో, బుద్ధపురంలో, కందనోలులో ఏమి గడబిడలు జరుగుతుంటాయో అని భయపడుతూ ఆలోచించుకుంటున్నాను.

కుప్ప: రాజకుమారీ! మా తమ్ముడు ఎవ్వరికీ ఏమీ కష్టం రానియ్యడు. అతని యుద్ధనైపుణ్యం ఎంతటిదో నీతిసంపదకూడా అంతటిదే.

3

శివదేవయ్యమంత్రి ఆరాధ్య ఆరువేల నియోగిబ్రాహ్మణుడు. ఉత్తమ రాజ్యతంత్రజ్ఞుడు, పండితుడు, సకలశాస్త్రపారంగతుడు, మహాకవి. శివదేవయ్య చక్రవర్తితోపాటు గోళకీమఠ శైవగురుపరంపరలోని విశ్వేశ్వర శివాచార్యులకు శిష్యుడై, తమ గురువు గుప్తమైన వెనుక తాను శివదేశికులై, రాజ మంత్రియై శ్రీ కాకతి గణపతి రుద్రప్రభునిచే ఆంధ్రమహాసామ్రాజ్యము అఖండముగ, రామరాజ్యముగ పరిపాలనము చేయించుచున్న పరమాద్భుత సత్త్వుడు. ఇసుమంతైనా రోగ మెరుగని తప్పస్సంపన్నుడు. సర్వవేదాంత సారములూ కూలంకషంగా తెలుసుకొని, శంభుమహిమను పూర్తిగా ఎరిగిన ముముక్షువు. జనకచక్రవర్తివలె రాజధర్మం అనే తామరాకులో నీటి బిందువులా ప్రకాశిస్తూ, యుద్ధంచేయని పార్థసారధిలా, కాకతీయ మహారాజ్య పరిపాలనా రథానికి చోదకుడై నడుపుతున్నాడు. ఆయనమాట గణపతి రుద్రదేవునకు శివాజ్ఞ.

ఈ నా డీ ఉత్తమపురుషుడు కళింగమునుండి కంచివరకు, మోటుపల్లినుండి కళ్యాణివరకు విస్తరించిఉన్న ఈ సామ్రాజ్యమున విచ్ఛేదక శక్తులు తాండవ మాడుచున్నవని గ్రహించాడు.

ఈ స్థితి రావడానికి తానూ ఒకవిధంగా కారకుడే! మగబిడ్డలు లేని, గణపతిరుద్రుని కూతునే కుమారునిగా పెంచుమని ఆలోచన చెప్పినది తాను ఆ బాలికకు వేరొక బాలికను తెచ్చి వివాహం చేయించింది, తాను. ఈ రహస్యం ఆలా పరమగోప్యంగా ఉండిపోవాలని తా నెప్పుడూ అనుకోలేదు.

మహారాజ్య పరిపాలనాదక్షతా, శక్తీ రుద్రదేవి సముపార్జించి సామ్రాజ్ఞి కాగోరి తా నీ రీతిగా రాజధర్మము నడిపినాడు.

ఇప్పుడు గణపతిరుద్రదేవుడు కైలాసాభిముఖుడై ఉన్నాడు. నెమ్మదిగా తన నిమంత్రణంచే, రుద్రదేవి వనిత అని లోకం అంతటా వ్యాపించింది. దీనినిగూర్చి ప్రధమంలో దేశం అంతటా గుసగుసలు బయలుదేరతీసింది తాను. మగవాడై పెరిగిన రుద్రదేవిని మరల స్త్రీగా మార్చు శక్తులను తాను ప్రయోగించాడు. అందుకు నిమిత్తుడు చాళుక్య వీరభద్రదేవుడు. ఆ నిరవద్యపుర రాజ కుమారుడు, ఇందుశేఖర మహారాజు ప్రధమతనయుడు రుద్రమదేవిని తన బుద్ధిలో ఆత్మేశ్వరిగా నిర్ణయించుకొన్నాడు. అది శుభం! ఇటు రుద్రదేవి కుమారియు చాళుక్య వీరభద్రునిపై మరులుకొన్నది. చదువుకొన్నది, ఈడు మీరినది. ఆ కుమారి కొన్ని ధర్మాలు నిర్ణయించుకొన్నది. ఇప్పు డా రాజమార్గమునుండి తప్పి నడవడానికి శంకిస్తున్నది. ఆమె దారి ఆమెయే వెదకుకొనాలి. అది ఉత్తమ ధర్మమార్గం కావాలి. ఆ అన్వేషణ క్రమ వికాసితంగా వుండేటట్లు చూడవలసింది తాను. రుద్రదేవుడు ఉద్వాహమైన ముమ్మడమ్మకు నిజమైన వివాహం కావాలి. ఈ ధర్మం నిర్వహించబడాలి అంటే రుద్రదేవుడు సంపూర్ణంగా రుద్రదేవి కావాలి. ఆ పిమ్మట రుద్రదేవప్రభువే ముమ్మడాంబికకు భర్తను వెదకాలి!

స్త్రీ సకలాంధ్ర సామ్రాజ్ఞి అగుటకు వ్యతిరేకించి క్రోధోన్మత్తులై పరవళ్ళు త్రొక్కబోయే దక్షులకు వీరభద్రులు కావాలి. మహావీరులనుగన్న ఆంధ్రమాత కడుపు చల్లగా ఆ వీరభద్రులు శివజటాజూటోద్భవు లయినారు.

తనకు ఏనాటి కానాడు చారులు, యథార్హ వర్ణులు, ప్రణిధులు, గూఢ పురుషులు ఆంధ్రభూమండలం అంతటినుండీ వార్తలు తీసుకొని వస్తున్నారు.

మనస్సులోమాత్రం వికారం పొందినవారు, ‘స్త్రీ చక్రవర్తిని అవునా’ అని ఆక్షేపించేవారు, తామే మేటి మొనగాండ్రు గాదలచుకొన్నవారు, సన్నాహాలు చేస్తున్నవారు, సైన్యాలు కూర్చేవారు, రహస్యంగా రాయబారాలు నడుపుతున్నవారు - ఓహో! ఆంధ్రదేశం రాజద్రోహిమాండలికులతో నిండి ఉన్నది.

కాలవైపరీత్యము! యుధిష్ఠిర సింహాసనం ఈనాటి కటులైనది. ధర్మం సందుదారుల నడువవలసిన వ్రాత వచ్చింది. ఇంకను ఎట్టివ్రాత ఈ దేశానికి విధి వ్రాసి ఉంచినాడో?

ఈలా ఆలోచనలు తరంగమాలలా దొర్లుకువస్తూ ఉండగా శివదేవయ్య దేశికులు భోజనానంతరము తన ఆలోచనామందిరములో కూర్చొని ఉండిరి. ఇంతలో ప్రసాదాదిత్యనాయనింవారు దర్శనార్ధము వచ్చినారని లోనికి వార్తలు పంపినారు. వార్త తెచ్చిన శివభక్తునితో ప్రసాదాదిత్యుల ప్రవేశపెట్టవలసిందని చెప్పి శివదేవయ్య శివనామామృత శ్లోకాలు తీయని కంఠంతో పాడుకుంటూ ఉండిరి.

శ్రీ రేచర్ల ప్రసాదాదిత్యనాయనింవారు పద్మనాయక వెలమరెడ్లు. ఆ దినాలలో ఆంధ్ర క్షత్రియ కులాలవారికి భోజన ప్రతిభోజనాలలోగాని, వివాహాదులలోగాని నిషేధాలు లేనేలేవు. కాకతీయ వంశానికి మొదటినుండి రేచర్లవారు మాండలికులై, అంగరక్షకులై, వంశరక్షకులై కాకతీయరాజుల ప్రేమకు పాత్రులై ఉండిరి.

ప్రసాదాదిత్యులవారు లోనికి ప్రవేశించి శివదేవయ్య దేశికులకు పాదాభి వందన మాచరించి, వారిచే ఆశీర్వాదా లంది, వారిచే చూపింపబడిన ఆసనం అధివసించిరి.

ప్రసా: గురుదేవా! దేవగిరి యాదవులు ప్రబల సన్నాహాలు చేస్తున్నారని వేగులు మహాప్రవాహంలా వచ్చిపడుతున్నాయి. మనం ఏమరుపాటుగా లేముకదా?

శివ: యాదవులు మనదేశంమీదకు ఇప్పట్లో కన్నెత్తిచూడరు. శ్రీ సార్వభౌములవారు చిన్నతనంలో ఒకమాటు, నేను మంత్రిత్వభారం గై కొన్న క్రొత్తదినాలలో ఒకసారి శౌణయాదవులకు మరపురాని బుద్ధిచెప్పారు. ఆ రక్షలు ఇప్పటివరకూ మాయలేదు. కృష్ణభూపతి బొందెలోప్రాణం ఉన్నంతవరకూ యాదవ సైన్యాలు దేవగిరి దాటవు. మీరు నమ్మండి.

ప్రసా: మహాదేవరాజు తండ్రిమాట వినేదినాలు దాటిపోలేదుకదా అని?

శివ: మహాదేవరాజుకు తండ్రిమీద గౌరవంపోయి నాలుగు సంవత్సరాలయింది. కాని తక్కిన మాండలికులకు, సేనాపతులకు కృష్ణభూపతి అంటే అనన్యమైనభక్తి. ఆ కారణముచేతే మహాదేవుడు ఓరుగల్లు మహానగరాన్ని తలచుకొని నోరూరి చప్పరిస్తూంటాడు.

ప్రసా: అయినా మనం సర్వసిద్ధంగా ఉండవలెకదా?

శివ: గజదొంగ అయిన గోన గన్నారెడ్డి ప్రభావమువల్ల రేచర్లవారి, మల్యాలవారి, కోటవారి, నతనాటిసీమవారి సైన్యాలన్నీ సతమతమై చేయాడకుండా ఉన్నవి.

ప్రసా: అవునవును, అతడు మెరుములా ఒకసారి శ్రీశైలందగ్గర ఉంటాడు, ఇంతట్లో ఇటు మంత్రకూటందగ్గర కనబడుతాడు.

శివ: మీ రేచర్ల వారి పిల్లవాండ్రుకూడ కొంతమంది ఆ జట్టులో చేరారు. అతని సైన్యం నానాటికీ పెద్దదయిపోతున్నది.

ప్రసా: గురుదేవా! నిన్నసాయంకాలం మల్యాల గుండయ్య ప్రభువుగారు వచ్చినారు. వారితో వారి రాణిగారితో కలిసి ఆదవోని ప్రభువు కుమార్తె అన్నాంబిక వచ్చింది. గోన గన్నయ్య ఆ రాజకుమార్తెను ఆదవోని నుంచి ఎత్తుకొనివచ్చి అక్కగారిదగ్గర ఉంచితే గుండయ్య ప్రభువు ఆదవోని రాజుతో పోరాడటం ఒప్పక ఈ నగరం వచ్చాడని చారులు వార్త పట్టుకువచ్చారు.

శివ: కుప్పసానమ్మ, అన్నాంబిక ఈ దినము సాయంకాలమే మహారాజుల దర్శనం చేసుకుంటారు. అక్కడి సంఘటనలవల్ల ఆదవోని రాజుకూ మల్యాలవారికీ యుద్ధం వచ్చితీరుతుంది. కోటారెడ్డి మనవైపు ఉండవలసిన వాడు. అందుకని మీరు చక్రవర్తి పేరిట ఆదవోని ప్రభువుకు ఒక శ్రీముఖం పంపించండి. “అన్నాంబికారాకుమారి నారాంబా పేరంబా మహారాణుల శుద్ధాంతాలలో సగౌరవంగా చక్రవర్తి కన్నకూతురులా ఉంటుంది. వీలువెంబడిని రాకుమారికను ఆదవోని చేర్చగలవార” మని.

ప్రసా: ఏమిచక్కని ఆలోచన చేశారండీ గురుదేవా! ఓయి వెర్రి కోటారెడ్డి! ఏకపుత్రికావిషయంలో నీకు శ్రద్ధలేకపోతే ఆమె నీకు దక్కదని ఎంచుకోలేకపోయావుకదా!

శివ: ప్రసాదాదిత్యప్రభూ! శుభముహూర్తం చూచి శ్రీ కుమారరుద్రదేవప్రభువు చక్రవర్తికి పెద్దకొమార్తె అని ఏదో ఒక మహోత్సవ సందర్భంలో లోకానికి తెలియజేయవలసి ఉంది. ప్రసా: గురుదేవా! ఆ విషయంలో గోన గన్నారెడ్డి లోకమంతా చాటింపు చేస్తూనే ఉన్నాడు.

4

అప్పుడు శివదేవయ్య ప్రసాదాదిత్య ప్రభువును తీక్ష్ణంగా చూచి ‘సేనాధిపతీ! ఇప్పుడు రుద్రదేవ ప్రభువుపై కుట్రచేసివా రందరికీ ఒక్క మహానాయకత్వం ఏదో తెర వెనుక వుంది. ఆ నాయకత్వం ఎవరిదా అని వేయివిధాల ప్రయత్నంచేసి కనుక్కుంటున్నాను, కాని ఏవిధమైన ఉదంతం నాకు దొరకటంలేదు.’

“శివదేవయ్య దేశికుల గరుడలోచనాలు చూపుల కందని ఆ మహా వ్యక్తి ఎవరు గురుదేవా?”

శివ: ఆ విషయం తెలియకేకదా ఈ చిన్న చిన్న కుట్రదారులను విజృంభింపనిస్తున్నది.

ప్రసా: లకుమయ్యా?

శివ: లకుమయ్యాకాదు, కోటారెడ్డీకాదు, మరెవ్వరూకారు.

ప్రసా: యాదవప్రభువా?

శివ: యాదవప్రభువు తన కక్ష మొదటినుండీ సువ్యంక్తంచేస్తూనే ఉన్నాడు.

ప్రసా: హరిహర, మురారిదేవులా? వాళ్ళే అయితే నా చేతులతో వాళ్ళను నూనె పిండుతాను మహామంత్రీ!

శివ: కాదయ్యా సేనాపతీ! వాళ్ళ దినచర్య అంతా నాకు మరుక్షణం తెలుస్తోంది. నాశక్తిని వమ్ముచేస్తున్న ఆ మహావ్యక్తి ఎవరో, ఈ భయంకర నాటక సూత్రధారి! ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. నే నొకణ్ణే కాదు “ఆ మహావ్యక్తిఎవరో అని ఆకుట్రలో చేరినవారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాటకాన్ని నడిపే ఆ సూత్రధారి జ్ఞానాతీతుడై ఉన్నాడు.

ప్రసా: చివరకు మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయేమో గురుదేవా?

శివ: ఆ భయం నాకు లేకపోలేదు. ఇందుకు ఒకటే పాశుపతం వుంది. దాన్ని ప్రయోగించాను. మొదట అది సాధారణబాణం అనుకున్నాను, కాని అఖండాస్త్రమని నానాటికి వ్యక్తమవుతున్నది. ఆ సూత్రధారు డెవరో తెలుసుకొని, వానిని నాశనం చేయగలిగింది ఆ ఒక్క అస్త్రమే!

ప్రసా: ఉత్తమశక్తిసంపన్న అయిన ఒక్క మహారాజ్ఞి రాజ్యం చేయడానికి పురుషులకు ఇంత ఇష్టం లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంటున్నది! గాలితో ఏమి యుద్ధం చేయగలం? ఆ మగవాడు బయటపడితే మన బలా బలాలు తెలుసుకోవచ్చునుకదా? శివ: ఆ మనుష్యుని జాడలు కొంతవరకు వచ్చి ఆగిపోతున్నవి. రోగ మూలం తెలియకుండా, బాధబాధకూ మందు పుచ్చుకుంటే క్రొత్తబాధలు వస్తూ ఉండడమే కాని ప్రయోజనకారి కాదు.

ప్రసా: దేశికులవారూ! మీ ప్రయత్నాలు సాఫల్యం పొందకపోవడం అనేది ఉండదు.

శివ: దేశంలో ఉన్న నీచహృదయులకూ, తప్పుదారుల బడినవారికీ ఆ తెరచాటువ్యక్తి బలం ఇస్తున్నాడు. అతని ఉద్దేశం తానే చక్రవర్తి కావాలని! ఆ వ్యక్తి చాలాబలవంతుడు అయిఉండాలి. కాకతీయసామ్రాజ్య రహస్యాలన్నీ పూర్తిగా తెలిసిఉన్నవా డాతడు. ‘ఆడదా రాజ్యం చెయ్యడం’ అనే మిష ఆ పురుషుని అంబులపొదిలోని పెద్ద ఆయుధం. కాబట్టే ఆ ఆయుధంలోని సగం బలం తీశివేయడానికి భావి ఆంధ్ర సామ్రాజ్యభారం వహించబోయేది రుద్రమదేవి అని లోకం అంతా తెలియజేస్తున్నాము.

ప్రసా: మనకు బాసటఅయ్యే ప్రభువులు దేశంమీద ఉండకపోరు.

శివ: ఎవరినీ నమ్మకూడదయ్యా! చివరకు శ్రీ గణపాంభాదేవిగారి భర్తనూ నమ్మకూడదు. దినాలలాంటివి. అయినా నా వేగులవల్ల పూర్తిగా నాకు ఎంతో నమ్మకం కలిగినవారు, దిట్టమైనవారు అన్ని నాడులలోనూ ఉన్నారు. ఇప్పటికి మూడు తరాలనుంచి శాంతి, సుభిక్షము, ఐశ్వర్యము, ఆనందము అనుభవించే ఈ మహాదేశము, నేడు ఎవరో కొందరి దురాశలకు లోనై స్వనాశనం చేసుకోదు. అది మన ముఖ్యబలం. అందుకనే ప్రజలందరూ కాకతీయ సామ్రాజ్యానికి అండగా ఉంటారు.

ప్రసాదాదిత్యనాయకులు కలకదేరని మనస్సుతో శివదేవయ్య పాదాలకు నమస్కరించి అనుమతినంది వెడలిపోయెను.

ఆ వెంటనే ఒకవ్యక్తి శివదేవయ్యదేశికుల అనుమతిని వారికడకు వచ్చి సాష్టాంగనమస్కార మాచరించి, ఆజ్ఞకై తలవంచి దూరాన నిలుచుండెను.

ఆ వచ్చిన నూతనపురుషుడు ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన ముఖమందు వైదికతేజము తాండవిస్తున్నది. ఆయన వేదవేదాంగ పారంగతుడు, అద్వైతి. నాట్యశాస్త్రంలో దిట్ట. వేషాలు వేయడంలో ఆ ఉత్తమ బ్రాహ్మణు డద్వితీయుడు. ఆయనకడ అనేకులు గణికలు నాట్యశాస్త్ర మభ్యసించి అప్సరసలని పేరు పొందారు. ఆ బ్రాహ్మణుడు ఎల్లాంటి మారు వేషాలన్నా వేయగలడు. ఆ యా వేషాలకు తగిన భాషలు నేర్చినవాడు. చూపులు చేష్టలు, నడక అన్నీ ఆ వేషంలో పాలూ నీళ్ళూ కలిసినట్లు కలసిపోతాయి.

ఈమారువేషాలు వేసుకొనే బ్రాహ్మణచారులు శివదేవయ్యమంత్రికొలువులో పదునారుమంది ఉన్నారు. వా రందరూ పండితులు. కొందరు సర్వశాస్త్రపారంగ తులు, కొందరు కొన్నిశాస్త్రాలలో ఉద్దండపండితులు. ఆ పండితులు అందరూ దేశాలు తిరుగుతూ, కొన్ని దేశాలలో నివాసంచేస్తూ, ఎప్పటివార్త అప్పటికి శివదేవయ్య దేశికులకు అందజేస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణబృందానికి నాయకుడు సోమనాథబట్టు. ఆయన భరద్వాజగోత్రుడు, వారి కాపురము బుద్ధపురము. శ్రీ మల్యాలప్రభువంశానికి వారు పురోహితులు. ఈ సోమనాథభట్టోపాధ్యాయులకు మంత్రగురువు శివదేవయ్యదేశికులు.

కాకతీయసామ్రాజ్యాపసర్పగణానికి నాయకుడు ప్రసాదాదిత్యనాయడు. వారు తెచ్చే వార్తల విధానము వేరు. వాని విషయము వేరు. శ్రీ శివదేవయ్య మంత్రికి శిష్యులైన ఈ పండితులు తెచ్చు వార్తలు వేరు. ప్రసాదాదిత్య నాయకుని చారులు మూడు తరగతులవారు.

ఒకతరగతివారు ఓరుగల్లు నగరంలో అప్రమత్తులై తిరుగుతూ, అధర్మం తలెత్తకుండా చూస్తూఉంటారు. ఆ దళములో అయిదారువందలమంది చారులున్నారు. బిచ్చగాళ్ళవలె, శివయోగులవలె, యాత్రికులవలె, నగరములో నివాసముచేయు సాధారణపౌరులవలె, వివిధవృత్తులవారివలె వారు నివసించుతూ ఆ నగరానికి రహస్య తీక్ష్ణలోచనాలవలె ఉంటారు.

రెండవతరగతి చారులు దేశం అంతా తిరుగుతూ రాజకీయవిషయాలూ, ఇతర ధర్మవిషయాలూ కనిపెట్టుతూ ఉంటారు. మూడవతరగతి చారులు అఖండులు. వారెవరో ప్రసాదాదిత్యనాయకునకు, ఆయనక్రింద ఉద్యోగులైన తంత్రపాలునకు, ముఖ్యచారదాయకునికీ మాత్రమే తెలియును. ఈ చారులు వేయి మంది ఉంటారు. వీరు సర్వరాజ్యాలూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడి విషయాలు పోగుచేసుకు వస్తారు. వర్తకులుగా, వర్తకుల లేఖలుగా, పుణ్యక్షేత్ర యాత్రికులుగా తిరుగుతూ ఉంటారు. వీరందరూ బహుభాషావేత్తలు, వివిధదేశాచార జ్ఞానసంపన్నులు, చారులందరూ సర్వయుద్ధవిశారదులు.

సోమనాథభట్టోపాధ్యాయులు ఆనవాలుకట్టలేని వేషాన వచ్చి పాదాభివందన మాచరించి నిలుచుండగానే శివదేవయ్య దేశికులవా రా పురుషుని తేరిపార చూచినారు. ఆయన చూపు లా పురుషుని వైద్యుడు రోగిని చూచునట్లు, దూడలలో ఆవు తనదూడకై చూచునట్లు, స్వర్ణకారుడు వివిధరత్నాలను పరీక్షించునట్లు తీక్ష్ణముగా ప్రసరించునవి. అప్పటికి ఆయన ఒక నిర్ణయానికివచ్చి, చిరునవ్వుతో ‘సోమనాథార్యా! అంత పరిశీలన చేయకపోయినచో నేను నిన్ను గుర్తుపట్టలేక పోయే ఉందును’ అని పలికినాడు.

సోమనాథభట్టాచార్యు లప్పుడు నవ్వుచు, ‘ప్రపంచములో ఎవ్వరినైనా నేను మోసగించగలను. కాని నాగురుదేవులకడమాత్రం నా పప్పు ఉడికేదిలేదు’ అని తాను ధరించిన పాములవాని వేషమును కొంతతీసి అక్కడున్న ఒకపీఠంపై ఉంచి, శివదేవయ్యగారి పీఠంకడ ఇంకొకపీఠంమీద అధివసించి, ‘శ్రీ రుద్రదేవ ప్రభువునకు వ్యతిరేకంగా అనేకవిషయాలలో, నాడులలో, మండలాలలో కుట్ర విజృంభిస్తోంది. శ్రీ గణపతి రుద్రదేవసార్వభౌములవారు కోరలూ, నఖాలూ లేని పంచనఖమైపోయారని వారికి ధీమా ఏర్పడింది. ధరణికోటవారు, నిడుదప్రోలు వారు, కోన హైహయులు, కొలనిప్రభువులు, ఇందులూరివారు, కమ్మనాటివారు, నతనాటిసీమవారు, మల్యాలవారు, రేచర్ల వారందరూ, సారంగదేవులు, సాగివారు మనపక్షంవారు. ఆ విషయంలో మనకేమీ సందేహం అక్కరలేదండీ’ అని మనవిచేశాడు.

శివ: సోమనాథభట్టాచార్యా! మీరు నాకు తెలియని విషయాలు తెలియ జేయడంలేదు. నాకు మీరు కనిపెట్టవలసిన ముఖ్యవిషయం ఒకటి ఉన్నది. ఈ కుట్రకు మహానాయకు డొక డున్నాడు. ఎన్నివిధాల ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ నాయకుని ఉదంతం ఏమీ తెలియటంలేదు. ఆయన్ను మీరు కనిపెట్టండి. కాకతీయవంశ రక్షకులు కండి మీరు.

సోమ: నా యీ బొందెలో చైతన్యం ఉన్నంతవరకూ, నాకు శ్రీ సోమనాథదేవులు ప్రసాదించిన మేధాశక్తి ప్రసరించగలిగినంతవరకూ ఆ మహాపురుషు డెవ్వరో కనిపెట్ట ప్రయత్నం చేస్తాను. ఆశీర్వదించండి. ఇంటికి వెళ్ళకుండానే ఇదే దేశంమీద పడతాను.

శివ: సత్వర విజయప్రాప్తిరస్తు. దీర్ఘాయురస్తు. ఆచార్యా? వెంటనే వెళ్ళు. నీ దీక్షను కాకతీయసామ్రాజ్యము మరచిపోదు.

సోమనాథు డప్పుడు పాములవానివేషం పూర్తిగా సవరించుకొని, శివదేవయ్య పాదాలకు నమస్కరించి వారిచే అనుజ్ఞాతుడై వెళ్ళిపోయెను.

కాకతీయసామ్రాజ్యానికి శివదేవయ్యకు బూర్వమందు శ్రీ చెన్నాప్రగడ గణపామాత్యుడు మంత్రి. చక్రవర్తికడనే ఉండి, చక్రవర్తి సర్వసేనలకు అధిపతులైన సర్వసైన్యాద్యక్షు లొక రుంటారు. గణపతి రుద్రదేవ సార్వభౌమునకు జాయపసేనాని ప్రస్తుతము సర్వసేనాధ్యక్షుడు. వారికిముందు హేమాద్రిరెడ్డి సర్వ సేనాధ్యక్షులు, వీరుకాక ఆర్థికవిషయాలను గమనించు ప్రధాని యొకడుండును. నాల్గవమంత్రి మహాతలవరి యొకడుండును. ప్రధానిగా పమ్మిపుర పాలకులైన దేవనప్రగడ ఉండెను. మహాతలవరిగా మేచనాయకుడుండెను. ప్రోలరౌతు తంత్రపాలుడుగా ఉండెను.

మహామంత్రి రాజ్యాంగవ్యవహారములు చూచును ముఖ్యసేనాపతి రాజధానిలో ఉండు సామ్రాజ్యసేనల కధిపతి, ఆర్థికవేత్తయగు ప్రధాని సుంకములు, పన్నులు, అడవులు, గనులు, ఓడవర్తకము, వానివాని రాబడి, వివిధ విషయాలకైన వెచ్చము చూచుకొనుచుండును. తలవరి నగరరక్షణ, న్యాయవిచారణ మొదలైనవి చూచును. తంత్రపాలుడు మహామంత్రి ఆజ్ఞలను పరిపాలించు అధికారి. ఆ యా మంత్రులకడ వివిధోద్యోగులు, వివిధోపశాఖలు పాలనముచేస్తూ ఉంటారు.

5

రుద్రదేవమహా ప్రభువు శ్రీగణపతిదేవసార్వభౌముని ప్రథమపుత్రిక అనిన్నీ, కుమారులు లేకపోవడంవల్ల కొమరితనే సార్వభౌముడు యువరాజుగా నిశ్చయించి పురుషవేషమువేసి వీరవిద్యలన్నీ నేర్పుతూ, చివరకు జాయపసేనాని కొమరిత ముమ్మడమ్మను ఇచ్చి వివాహం చేశారనీ ఈ అఖండ ఆంధ్రసామ్రాజ్యానికి భావి చక్రవర్తిని శ్రీరుద్రదేవే అనిన్నీ, ఆమె శ్రీ రుద్రదేవ సార్వభౌములుగా చతుస్సముద్రముద్రిత భూమండలం ఏలుతూ వుంటారనీ, స్వస్తి, శ్రీశాలివాహనశక 1183 దుర్మతి సంవత్సర వైశాఖ బహుళ పంచమీ సోమవారంనాడు మహాసభలో శ్రీశ్రీశ్రీ మల్లికార్జునారాధ్య గురుమహాదేవుల అపరావతారమైన శివదేవయ్యదేశికుల వారు ప్రకటించారు.

సభఅంతా ఆనంద జయజయద్వానాలు కావించారు.

సభలో మహాసేనాపతులు, సేనాపతులు, మంత్రులు సామంతులు, వివిధ సభాసభ్యులు, వర్తకులు పండితులు అందరూ కిటకిటలాడుతూ ఉన్నారు.

ఇంతలో వేదాశీర్వాదదివ్యనాదాలు బయలుదేరాయి. శుభవాద్యాలు, సామ్రాజ్య భేరీభాంకారాలు వినిపిస్తూవున్నాయి. స్వయ భూదేవ, కేశవదేవాది దేవాలయాలలో గంటలు మారుమ్రోగుతున్నాయి. లాసికాబృంద వాచికాభినయ మధురస్వరాలు వినవస్తున్నాయి. వేదపనసలు పఠిస్తూ త్రయీపాఠులగు శ్రోత్రియులు సభాస్థలం లోకి వచ్చారు. వందిమాగధులు.

“బహుపరాక్, శ్రీశ్రీశ్రీ సమధిగతపంచమహాశబ్ద మహామండలేశ్వర, పరమమాహేశ్వర, అనుమకొండ పురవరాధీశ్వర, పరనారీసహోదర, లాడచోడ కటకచూఱకార మన్నియభేంటకార, విభవదేవేంద్ర, సత్యహరిశ్చంద్ర, శ్రీస్వయం భూదేవర దివ్యశ్రీపాదపద్మారాధక, పరవరప్రతాపాశ్రిత, వితరణచణ, శరణాగత వజ్రపంజర, పరబలసాధక, ఉపమన్యుప్రముఖ భక్తజనానందకార, వైరిసంహరణ, చతుస్సముద్రవలయ దిక్పూరితకీర్తి, సప్తమచక్రవర్తి, అదిరాజ చారుచరిత, రాజరాజేశ్వర, సుస్థిర నిజరాజాన్వయచంద్ర, ప్రత్యక్ష ప్రమథమగణావతార, సుజనైకమిత్ర, కదనప్రచండ, చలమర్తిగండ, శ్రీమన్‌మహారాజాధిరాజ! రాజపరమేశ్వర! శ్రీకాకతీయ గణపతిరుద్రదేవసార్వభౌమా! జయ జయ! జయ జయ” అంటూ స్తోత్రపాఠం చేసిరి.

సభికులందరు ఒక్కసారిగాలేచి, పూర్ణకంఠాలతో జయజయధ్వానాలు చేసిరి. అప్పుడు డెబ్బదిరెండు సంవత్సరాల ఈడున్న శ్రీగణపతిచక్రవర్తి, అనేక శివ యోగులు, జాయపసేనాని, మహాతలవరి తన్ను పరివేష్టించి వుండగా తెల్లని గడ్డము మీసాలతో వజ్రకిరీటంతో, బంగారుతొడిగి రత్నాలు పొదిగిన చేతికఱ్ఱ కుడిచేత ఆనుకొని, ఎడమచేయి జాయపనాయకమహాసేనాని భుజంమీద వుంచి నెమ్మదిగా నడుస్తూ, గరుత్మంతుని చూపులతో, గరుడనాసికతో భుజమువరకూ వ్రేలాడే చెవులకు మకరకుండలాలు ప్రకాశించుతూ వుండగా వేంచేసినారు.

అప్పు డా సార్వభౌముడు సాక్షాత్తూ హిమవత్పర్వతాకారుడై వుండెను. ఆ చక్రవర్తి తెల్లని నురుగువలె వుత్తుంగతరంగాలతో వుప్పొంగే సముద్రునిలా వుండెను.

వేదమంత్రాలు నింగిముట్టుతూవుండుగా శ్రీ గణపతిదేవసార్వభౌములు సింహాసనం అధివసించారు. శ్రీశ్రీశ్రీ రుద్రదేవప్రభువులు యువరాజ సింహాసనం అధివసించినప్పటినుండీ, చక్రవర్తి సార్వభౌమసింహాసనం అధివసింపలేదు. ఈ రెండేళ్ళతర్వాత ఇప్పుడు సింహాసనం అధివసించి నిండోలగ్నమున్న గణపతి మహాప్రభువు సుధర్మలో దేవేంద్రునిలా వుండినవారాయెను.

అంతలో మళ్ళీ త్రయీపాఠాలు, తుమ్మెదఝంకారంలా, మహానది వురవడిలా, సముద్రఘోషలా, మేఘగర్జనలా వినిపించినవి. భేరీభాంకార, నాగస్వర, శంఖ, కాహళ, ముఖవీణా, మృదంగాది శుభవాద్యాలు భోరుకొన్నవి.

అ సద్దున్నూ అయినవెనుక “శ్రీ శ్రీ సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర, అన్మకొండపురవరేశ్వర, పరమమాహేశ్వర, పతిహితచరిత, వినయవిభూషణ, శ్రీ స్వయంభూదేవర దివ్యశ్రీపాదపద్మారాధక, మూఱరాయజగదాళ, మహా మండలేశ్వర శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవమహారాజా! జయ జయ!” అని వంది మాగధులు పాటలు పాడినారు.

ఇంతలో శ్రీ కుమారరుద్రదేవ మహారాజులవారు గంభీరంగా నడుస్తూ వచ్చినారు. సార్వభౌములుతప్ప, తక్కినవారందరు లేచి నిలుచుండిరి. శ్రీ రుద్రదేవ ప్రభువు తన సేనాపతులతో, మంత్రులతో వచ్చెను. ప్రభువునకు కుడివైపుననే శ్రీశ్రీ చాళుక్యవీరభద్రమహారాజు నడచి వచ్చినాడు.

యువరాజు సార్వభౌమసింహాసనంకడకు వచ్చి తండ్రికి మోకరించి నమస్కరించెను. సార్వభౌముడు చేతులు చాచి, రుద్రప్రభువును అర్ధసింహాసనము అధివసింపచేసెను.

అందరును యథోవితముగ ఆసీనులైరి. నాగమదేవి అనే నర్తకి మేళముతో వచ్చి శంభువిజయమును నాట్యముచేసినది. ఆ వెనుక సంగీతశాస్త్ర నిధి అయిన కేతనామాత్యులు వీణపై రాయిగరగించు గాంధర్వవిద్య ప్రదర్శించినారు. ఆ వెనుక శివతత్వసారమునుండి ఒక పరమమాహేశ్వరుడై న ఆరాధ్యబ్రాహ్మణ గురువు శివ మాహాత్మ్యము సార్వభౌమునకు, సభ్యులకు పాడి వినిపించెను. అప్పుడు శివదేవయ్యదేశికులు ఈ ఆంధ్ర మహాసామ్రాజ్యంలోని సర్వ సామంతులకూ, బ్రాహ్మణోత్తములకు, సర్వప్రజలకు శ్రీ శ్రీ శ్రీ సార్వభౌములు తమ శ్రీముఖము ఈరీతిగా వినిపిస్తున్నారు. “శ్రీస్వయంభూదేవ దివ్యశ్రీ పాదారవిందాలను పూజించి శ్రీ శివప్రసాదలబ్ధమైన ఈ సామ్రాజ్యము యావత్తూ తమస్థానాన ప్రతినిధిగా తమ పెద్దకుమార్తెలైన శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవమాహారాజులం వారు పరిపాలిస్తారు. శ్రీ సార్వభౌములవారు తమ యావత్తుకాలమూ తపస్సుచేసుకోడానికి నిశ్చయించినారు. ఇది సార్వభౌముని పవిత్రేచ్ఛ. ఈ ఇచ్ఛను ధిక్కరించిన వారు భగవద్రోహులు, రాజద్రోహులు, ధర్మద్రోహులు” అని గంభీరంగా ప్రకటించారు. వెంటనే మిన్నుముట్టే జయజయధ్వానులు విరోధిరాజుల గుండె లవియ చేస్తూ సర్వ విశ్వమూ క్రమ్మినవి. విప్రాశీర్వాదాలు చెలగినవి. మహామంత్రి, మహా సైన్యాధ్యక్షులు, మహాసేనాపతులు, మహామండలేశ్వరులు, మండలేశ్వరులు, ప్రధానులు, రాజోద్యోగులు రాజప్రతినిధి శ్రీ కుమార రుద్రదేవ మహారాజులం వారికి మహారాజప్రాభృతా లర్పించుట మొదలుపెట్టినారు.

ఆ సభ రెండవయామం పూర్తి కాకమునుపే ముగిసినది. వందిమాగధులు కై వారాలుపేయ శ్రీ శ్రీ గణపతిరుద్రప్రభువు తననివాసం చేరినారు. తర్వాత రుద్రప్రభువులవారు తమ నగరికి విజయం చేసినారు.

6

కాకతీయసార్వభౌమ పరిపాలితమైన దేశాలన్నీ వీరశైవభక్తితో నిండి వున్నాయి. గురుమల్లికార్జున పండితారాధ్యులు ఋగ్వేద నియోగి బ్రాహ్మణ వంశంలో వుద్భవించారు. వారి తండ్రి భీమన, చాళుక్య భీమేశ్వర నగరంలో భీమేశ్వరస్వామివారి అర్చకుడై వుండేవారు. తల్లి గౌరాంబ. మల్లికార్జునారాధ్యుడు సర్వవిద్యాపారంగతుడు. ఆయన కోటిపలి సోమారామక్షేత్రవాసి అయిన ఆరాధ్య దేవర అనే గురువుకడ వీరశైవదీక్ష పొంది దృఢవ్రతుడగు వీరశైవాచార్యుడై నాడు.

శైవమత రహస్యాలన్నీ సమన్వయించి, వానిని శివతత్వసార మనే గ్రంథంగా రచించా డీ మల్లికార్జునుడు. దేశమంతటా వీరశైవమత ప్రచార మొనర్చెను.

ఆనాటికి బౌద్ధమత ప్రాబల్యం నశించిపోలేదు. వైష్ణవమతమూ పూర్తిగా వున్నది. జినమతము నశించిపోలేదు. మల్లికార్జునారాధ్యుని శిష్యుడైన పాలకురికి సోమనాథకవి ఆ పండితుని చరిత్రమూ, వారి శివతత్వసారమూ జానుతెనుగులో, అద్భుతమైన శైలిలో పండితారాధ్యచరిత్రము రచించెను. బసవపురాణమూ, ఈ గ్రంథమూ ద్విపదకావ్యాలుగా రచించినాడు. అనుభవసారము, చతుర్వేద సారసూక్తులు, సోమనాథభాష్యం, రుద్రభాష్యం, బసవరగడ, గంగోత్పత్తిరగడ, సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కారగద్యము, వృషాధిప శతకము మొదలైన గ్రంథాలెన్నో కూడా ఈ సోమనాథుడు రచించాడు.

వీరశైవులకు ఏమీ పరమత సహనములేదు. బ్రాహ్మణులను, వైష్ణవులను, బౌద్ధులను, జైనులను, చార్వాకులను వీళ్ళు కంఠోక్తిగా దూషిస్తూ, బాధిస్తూ, ఒక్కొక్కప్పుడు హతమారుస్తూ ఉండిరి.

కాని శ్రీ గణపతిరుద్రదేవమహాప్రభువులుగాని, శ్రీ రుద్రదేవప్రభువుగాని ఏమాత్రమూ ద్వేషంలేకుండా పరమతసహనం చూపుతూ ఉండిరి.

శ్రీ గణపతిదేవచక్రవర్తి మేనకోడలు బయ్యలమహాదేవి ధాన్యకటకంలో బుద్ధదేవునీ, అమరేశ్వరునీ సమంగా ఆరాధించేది. చెలికి గంగాధర మంత్రి బుద్ధుని విష్ణ్వవతారమూర్తిగాఎంచి హిడింబతీర్థములో బుద్ధదేవాలయం నిర్మించాడు.

ఓరుగల్లునగరం నిర్మిస్తూ శ్రీ రుద్రదేవమహారాజు బుద్ధదేవుని ప్రతిష్ఠ చేశాడు. ఈ దేవాలయం వీరభద్రేశ్వరుని దేవాలయం ప్రక్కనే ఉన్నది.

అనుమకొండలో కొలనిపాకలో జైనదేవాలయాలలో పూజలు విరివిగా సాగుతూ ఉండేది. గజదొంగ గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి పేరు ఆయన తండ్రి బుద్ధదేవునియందున్న భక్తిచే పెట్టుకొన్నదే! రాముని భక్తిచే లకుమయ్య అని రెండవ కుమారునికి పేరు పెట్టుకొన్నాడు.

కాకతీయ సామ్రాజ్య ప్రారంభకాలంలో శ్రీ రామానుజాచార్యుడు వైష్ణవ విశిష్టాదైత్వవాదం తీసుకొని శ్రీభాష్యం రచించి లోకం అంతా ప్రచారం చేశాడు.

శ్రీ గణపతిరుద్రదేవుని కాలంలో వైష్ణవం కొద్ది ప్రాబల్యం మాత్రం కలిగి ఉండేది. అనుమకొండలో, ఓరుగల్లులో కేశవదేవాలయాలు రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు. గోన బుద్ధారెడ్డి పెద్దకుమారునికి కన్నయ్య అని కృష్ణుని పేరూ, విఠలయ్య అని రెండవ కుమారునికీ పేర్లు పెట్టుకొన్నాడు.

ఓరుగల్లు చేరిన నెలదినాలకు అన్నాంబికయూ, కుప్పసానమ్మయూ శ్రీగన్నారెడ్డి కందూరుప్రభువైన కేశినాయకుని మహాయుద్ధంలో కూల్చి అఖండ విజయంసంపాదించినందుకు స్వయంభూదేవరకు, కేశవదేవరకు, మైలారదేవునకు, బుద్ధదేవునకు, వీరభద్రదేవునకు, ఏకవీరాదేవికి, కాకతిదేవికి మొక్కులు చెల్లించడానికి బయలు దేరారు.

బంగారం పొదిగి, రత్నాలుకూర్చిన శిబికలపై వీ రిరువురూ స్వయంభూదేవుని గుడి చేరి, తూర్పు హంసగోపురద్వారందగ్గర దిగారు. ఆ దినం సోమవారం. ఆ ఉదయకాలంలో ఆ గుడిఅంతా భక్తులైన స్త్రీ పురుషులతో నిండిపోయి ఉన్నది. మొదట సార్వభౌములపేర అర్చన జరిగింది. గురుమల్లి కార్జున పండితారాధ్య తనయులు శివారాధ్యులవారు స్వయంభూదేవర కర్చన జరుపుతున్నారు. శివనామమంత్ర పఠనంతో, గీతాలాపాలతో ఆ దేవాలయం అంతా మారుమ్రోగుతున్నది.

ఇంతలో మల్యాలప్రభువుల అర్చన వచ్చింది. వేయి నారికేళాల అభిషేకం జరిగింది. ఆరాధ్యులకు, వీరశైవులకు, మాహేశ్వరార్చన జరిగింది. బ్రాహ్మణులకు అన్నదానం జరిగింది. కుప్పసానమ్మ భూదానాదుల శాసనాలు వ్రాయించి మహా పండితులకు ఇచ్చింది. అన్నాంబిక పరవశురాలయి, సంతత శివనామోచ్చారణ పులకితయై గన్న ప్రభువునకు విజయాన్ని సమకూర్చినందుకు భగవంతునకు నిలువు దోపిడు లిచ్చింది. వివిధ దేవాలయాలలో పూజలన్నీ పరిసమాప్తి చేసికొని వారు తమ నగరు చేరుకొనేసరికి సాయంకాలం మూడవయామంకూడా దాటింది. అప్పుడు వారు భోజనాలు నిర్వర్తించి, అన్నాంబికాదేవి మందిరం చేరినారు.

అక్కడకు గన్నారెడ్డికడనుండి వచ్చిన వార్తాహరుని వారు రప్పించికొనిరి. రేచెర్ల ప్రభువంశంలోని ఆ పడుచువాడు కుప్పసానమ్మతో ‘మహారాణీ! కందూరి కేశినాయకుడు వర్ధమానపురంవారికి సామంతుడు. గోన గన్నారెడ్డి ప్రభువు రాజ్యార్హుడుకాడని అతడు వాదించాడు. వెనుక వరదారెడ్డిని మేము పట్టుకొని పీటలమీది పెళ్ళిని తప్పించినప్పుడు తాను గన్నారెడ్డిని పట్టుకుంటానని ప్రగల్భాలాడిన మహా వీరుడు. ఈ వార్తలన్నీ మా నాయకునకు అందినా అప్పుడు చిరునవ్వునవ్వి ఊరుకొన్నారు. కొద్దిదినాలక్రిందట చక్రవర్తిగారి సుంకాలధనం, ఇతరధనాలు, భరు కచ్ఛాన్నుండివచ్చే కోట్లు పణాలు విలువచేసే వస్తువులు, అన్నీ మా రేచెర్లవారిలో ఒకవీరుడు, ప్రసాదాదిత్యనాయక బాబయ్యగారి అన్నకుమారులు కతిపయసైనికులు వెంటరా పట్టించుకు వస్తూ ఉండెను.

ఆ సమయంలో ఈ కందూరి కేశినాయుడు పటాటోపంతో ఆడది రాజ్యం చేయడం, దానికి ఈ విలువగల వస్తువులు వెళ్ళడం అన్యాయం. ఇంతమంది మహా వీరులు ఉంటూఉంటే గణపతిదేవప్రభువు ఆడదానికి రాజ్యం అప్పగిస్తాడా? ప్రభువులంతా ఆడవాళ్ళయ్యారనుకున్నాడా?’ అంటూ పెద్ద సైన్యంతోవచ్చి, ఆ రేచర్ల ప్రభువును చంపి, చక్రవర్తి సైన్యాన్ని నాశనంచేసి, ఆ సంపద యావత్తు దోచుకొని కందూరినగరం చేరాడు.

కుప్పసానమ్మ: ఎంత అన్యాయం! ఎంత దౌర్జన్యం!

అన్నాంబిక: శ్రీ రుద్రదేవప్రభువులను అలా ఈసడించి మాట్లాడడమే?

రేచెర్ల చినదామానాయుడు: ఈ వార్త మాకు మరునాడే తెలిసింది మహారాణీ! కుప్పసానమ్మ: మా తమ్ముడికి వెఱ్ఱికోపం వచ్చిఉండాలి!

రేచెర్ల: ఆఁ! గన్నప్రభువు పక పక నవ్వాడు. ఆయన పకపక నవ్వితే మేమంతా ఉప్పొంగిపోతాము. మా విరోధులంతా గజగజలాడిపోతారు.

కుప్ప: ఎవరయ్యా మీ విరోధులు?

రేచెర్ల: ధర్మద్రోహులంతా మా విరోధులండీ.

అన్నాం: అప్పుడేమైంది మహారాణీ?

రేచెర్ల: వెంటనే తనదగ్గరఉన్న సగం దండును సిద్ధంకమ్మని ఆజ్ఞ ఇచ్చా రా ప్రభువు. మేమంతా సిద్ధం అయ్యాము. ‘దొంగలా కోటదూరి దాకొన్న ఆ హీనుణ్ణి ఆ కోటలోనే మనం జుట్టుపట్టి లాగి ఈవలవైచి హతమార్చాలి’ అని మా కాజ్ఞ.

‘ఆ రాత్రి ప్రయాణం. మాసైన్యం ఎనిమిదివేలు. అందరూ సింహాలు. ఇంచుకంతైనా అలికిడిలేకుండా మరునాడు తెల్లవారేసరికి ఎక్కడివారక్కడ మాయమైపోయారు. చిన్నచిన్న యాత్రికుల జట్టులలా ప్రయాణం చేయాలని నాయకుని ఆజ్ఙ. ఆ రాత్రికి కందూరు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలన్నిటిలో మావారు అణిగి ఉన్నారు. రాత్రి ఒకజాము గడిచేసరికి కందూరు కోటచుట్టూ మాసైన్యం చేరింది.’

7

“చేసినతప్పు ఎలాగాచేశాడు, తనకు భయమేమిటి” అని కేశినాయకప్రభువు అనుకొన్నాడు. కేశినాయక ప్రభువు చాలాకాలంనుంచి కోట బాగుచేయించుకొని లగ్గలపై మేటివిలుకాండ్లను, అప్రమత్తులైన ఆగ్నేయశస్త్రాయుధులను, శిలాయుధ ప్రయోగ నిపుణులను కాపలా పెట్టాడు. నగరికోటచుట్టూ ఉన్న అగడ్తలోనూ పూర్తిగా జలం నింపి, భయంకరమైన మొసళ్ళను ఆ అగడ్తలలో వదిలాడు. కోట ద్వారాలదగ్గర బురుజులలోను మెరికలలాంటి శూరుల్ని హెచ్చరికమై నిలిపిఉంచాడు.

“దెబ్బతిని పడిపోయిన వారిస్థానంలో వెంటనే నిలబడేటందుకు, అలసట పొందినవారిస్థానే వచ్చేటందుకు శూరులు సిద్ధంగా ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చిన మరునిమేషంలో తలుపులు తెఱచుకొని కోటబయటఉన్న శత్రువులను ఖండఖండాలుగా నరికివేయడానికి, కసకసత్రొక్కివేయడానికి, తరిమితరిమి నేలమట్టం చేయడానికి ఏనుగులు, అశ్వికులు, రథికులు నగరగోపురద్వారాలకడ, కోటగుమ్మాలకడ సిద్ధంగా ఉన్నారు. వీధి వీధి, ఇల్లు ఇల్లూ కోటలైపోయాయి. శత్రువుల ఒత్తిడి ఎక్కువైతే వెనుకనుంచి పోయి ఇతరప్రదేశాలు ఆక్రమించడానికి తగువిధానాలు అమరింపబడినాయి. అవసరమైతే ఇళ్ళూ, వీధులు తగలబెట్టి శత్రువుల అరికట్టడానికి కట్టుదిట్టాలు జరిగాయి.

ఈ సర్వసన్నాహం గోన గన్నయ్యకు వేగువచ్చింది. ఇంత జాగ్రత్తపడ్డా కేశినాయుడు కలలో కల, ఆలోచనలో ఆలోచనవంటి గన్నారెడ్డిని ఎల్లా నలువరింపగలడు?

కందూరులో గోన బుద్ధారెడ్డిసాహిణి పరాక్రమం, ఔదార్యం, ప్రేమ రుచి చూచినవారు వేలకువే లున్నారు. బుద్ధారెడ్డి మహారాజు పేరు చెప్పి దీపాలు పెట్టుకొని మొక్కులిడే తల్లులు ఆ నగరమంతా నిండి ఉన్నారు. వారందరికీ శ్రీ సర్వ భూమండలాఖండులైన గణపతిదేవ చక్రవర్తిపేరు విన్నంతనే భక్తి ఉట్టిపడుతుంది. వారేకదా కళ్యాణిరాజు గర్వం అణచి, భల్లాణుల పొగరు నాశనంచేసి, యాదవుల మదం నీటగలిపి దేశంలో శాంతం నెలకొల్పిన ప్రభువు! దేశంలో యుద్ధంవస్తే వానలు భయపడి పారిపోతాయి; మనుష్యుల ఆగ్రహాల మంటలకు నదులూ, చెరువులూ ఎండిపోతాయి. కరువు ‘అమ్మతల్లిలా’ విజృభించి సంహార తాండవం చేస్తుంది.

అపర రామచంద్రావతారమైన సప్తమచక్రవర్తి గణపతిదేవ ప్రభువులు బ్రతికిఉండగానే కేశినాయక ప్రభువునకు చెలగాటమా! అని ప్రజలు వణికిపోయారు.

ప్రజలందరూ బుద్ధారెడ్డి మహారాజు కొమారుడు, వీరవిక్రముడు గన్నారెడ్డి ప్రభువు అడవులుపట్టి పోవడం సహించలేకపోయారు. అదీగాక గన్నారెడ్డి లోక మోహనమైన వీరవిక్రమాలు వింటున్నారు. అతని తమ్ముడు విఠలధరణీశుడు అపర భీముడు. ఈ భీమార్జునుల జట్టులో శరభాలలాంటి, గండభేరుండాలలాంటి మహా వీరులు, యువకులు చేరారు.

“కందూరు నగరవాసులైనబాలురే గన్నారెడ్డి జట్టులో మేయిమందిఉన్నారు. గన్నారెడ్డి సైన్యంలో శిక్షణ పొందినవాడు పులిమీసాల పట్టి ఆడించగలడు. ఈ వేయిమంది బాలురు కందూరుపురంలో అనేక వేషాలతో చేరారు. కేశినాయక ప్రభువులు చేసిన దారుణచర్య వారి వారి చుట్టాలకు చెప్పారు. ఆ బందుగులలో వీరులు కేశినాయని దురంతానికి ఉగ్రులైపోయారు.”

ఇంతవరకూ కథచెప్పి ఆ చినదామానాయకుడు పిల్లలమఱ్ఱిప్రభువు రెండవ కుమారుడు పకపక నవ్వి ‘మహారాణీ! మా నాయకుని ఎత్తులు ఇంతవరకు ఎవ్వరూ పన్నలేదు. ఇక ముందున్నూ ఎవ్వరూ పన్నలేరు. స్వజన నష్టం కాకూడదు; విరోధులు దాసోహం కావాలి. అది గన్నయ్య మహారాజుకు మూలధర్మం’ అన్నాడు. కుప్పసానమ్మ: మా తమ్ములను గజదొంగలంటూఉంటే నాకు హృదయకంటకంగా ఉంటుంది.

అన్నాంబిక: మహారాణీ! నాకు శ్రీగన్నారెడ్డి దొంగ అనే భావం ఎప్పుడూ కలగలేదు.

కుప్పసానమ్మ: అయితే చక్రవర్తిని దుర్భాషలాడి అత డెందుకు ఓరుగల్లు విడిచిపోవాలి రాజకుమారీ?

అన్నాంబిక: అలా అని ఏ ఏ రాజ్యాలు వారు దోచుకున్నారో మీరు తార్కాణించగలరా మహారాణీ?

చినదామానాయుడు ఈ మందిరంలో దూరంగా నీడలు దట్టంగా ఆవరించి ఉన్నచోట కూర్చుండిఉన్న దివ్యసుందరియైన ఈబాలిక ఎవరు? ఈమెకు గన్నారెడ్డిప్రభువంటే అంతనమ్మక మేమిటో? అన్నాంబికాదేవి క్షేమంకూడా విచారించి రా దామానాయుడూ!’ అనికదా గన్నయ్యప్రభువు తన కాజ్ఞ ఇచ్చింది. ‘రాకుమారీ’ అని మహారాణి సంబోధిస్తున్నది. అవ్యక్తమైన దివ్యరూపంతో ఠీవిగా, పవిత్రభంగిమలో అధివసించిఉన్న ఈబాలిక తమ నాయకుని జీవితనాటకంలో ముఖ్యపాత్ర వహించబోతున్నదని మనసులో అనుకొన్నాడు.

కుప్పసానమ్మ! దామానాయకప్రభూ! ఆతర్వాత ఏమయింది?

దామా: మూడుదినాలు తన సైన్యానికి కోటపై తలపడే ఒక నూతన విధానం బోధించారు మా నాయకులు. ఈలోగా అంచెలమీద మారెండవ సైన్యంతో ఒక రహస్యప్రదేశంలో ఉన్న విఠలధరణీశునికి సైన్యం యావత్తూ నడుపుకొని రావలసిందని వేగు పంపించారు. ముందుగా తమ తమ్ములను మేఘాలమీద వచ్చి తన్ను కలుసుకోవలసిందనిన్నీ వార్తపంపారు.

“ప్రసిద్ధిచెందిన మొసలివేటకాళ్ళు మొసళ్ళవలెనే రాత్రిళ్ళు నీళ్ళలోకి జారి మొసళ్ళను వేటాడి చిత్రవధచేశారు. ఆవేటలో ఆరుగురి ప్రాణాలు పోయాయి.”

అన్నాంబిక ‘అమ్మా!’ అని చేతులతో కళ్ళుమూసుకొని గజగజ వణికి పోయింది. కుప్పసానమ్మ లేచి ఆమెదగ్గరకుపోయి మీద చేయివైచి ‘రాకుమారీ! యుద్ధాలలో ఈలాటి ఘట్టాలు అనేకం వస్తాయి. అది దురదృష్టం. రాజ్యాలు పరిపాలించేవారికి ఈలాంటివార్తలు వినడం తప్పదు’ అని అనునయించింది.

చినదామా: మహారాణీ! ఆ కందకంలో మొసళ్ళన్నీ నాశనం అయ్యాయి. మా సైన్యం అంతా సిద్ధంఅయింది. ఒకరాత్రి ఉద్దండమైన కేకలతో ముట్టడి ప్రారంభం అయింది. కోటమీదనుండి బాణాలు అగ్ని వర్షం మామీద వర్షిస్తున్నవి. కాని మా తలమీద అభేద్యమైన ఉక్కు ఫలకవితానం ఏర్పడింది. ఎడ్లులేని రెండెడ్లబళ్ళక్రిందనుండి మావాళ్ళు అగ్ని బాణాలు, గంధక బాణాలు పరపుతూ ఉన్నారు. గంధకం, సూరేకారం కలిపిన అగ్నిబాణాలు నగరకుడ్యాలపై పడి పెద్దమంటలతో మండుచుండెను. ఆ వెలుగులో వాడిగా బాణాలజడులు మహావేగంతో వెళ్ళి గోడలమీది వీరుల ప్రాణాలు కొంటున్నాయి. కందకాలలోనుండి అల్లరిచేస్తూ, ఈదులాడుతూ వీరులు శిలా పాతానికి అందక, అగ్నిపాతానికి అందక ప్రళయకాలంనాటి గడబిడ చేస్తుండిరి. దూరాననుండి మహాబాణయంత్రాలు వదలిన రజ్జునిశ్రేణులు వచ్చి లగ్గలకు తగిలి అక్కడ బిగిసి క్రిందికి వేలాడినాయి. ఒక వేయి నిశ్రేణు లట్లు తగలగానే, వీరులు చరచరా ఫలకాలు తలలకు బిగించుకొని చేతులతో కోతులులా కోటగోడ ఎగబ్రాక సాగారు. అగ్నిబాణాలు నిశ్రేణులను కోయడానికి వచ్చిన వీరులను హతమారుస్తున్నాయి. కొన్ని విశ్రేణులు కోయబడి వీరులతో పరిఘనీటిలో పడితే పుట్టెలతో సిద్ధంగా నీటిలో తేలియాడుతూ ఉన్నవాడూ, నీటిలో ఈదుతున్నవారూ ఆ వీరుల్ని రక్షిస్తూఉన్నారు.

“ఇంతలో నగరంలోనుండి ‘గన్నారెడ్డి! గన్నారెడ్డి! అని కేకలు వేస్తూ రెండువేలమంది కఱకువీరులు నగరకుడ్యాలపై రెండుమూడుచోట్లపడ్డారు. ఆ ప్రదేశాలలో లోకం పగిలినట్లు యుద్ధఘోష, సంకుల సమరమూ ఉద్భవిల్లినవి. ఆ బీభత్సములో కోటగోడలమీదకు వానరమూకలా గన్నారెడ్డి సైన్యం ఎగ బ్రాకింది.

‘గన్నారెడ్డి లోనికి వచ్చాడు’ అని గగ్గోలు పుట్టగానే కందూరు సైనికులకు ప్రాణాలమీద ఆశపోయి పారిపోయినారు. తమకు తెలియకుండానే వారి తలలు రాలిపోతున్నవి. ఈ గడబిడలో కోటనుండి యుద్ధం నడపడానికి వచ్చిన కేశి నాయకుడు ఒక కోటగుమ్మం తెరిపించి ఏనుగుల్ని, రథాల్ని, అశ్వికుల్ని కోట బయట ఉన్న గన్నయ్య సైన్యంమీదకు నడిపాడు. ఇంతలో విఠలధరణీశుడు అన్నగారి ఉపదేశాన్ని అనుసరించి ఆ బయలుపడిన సైన్యం ఎదుట పలాయన నాటక మాడి కేశినాయకసైన్యాలను దూరంగా తీసుకుపోయి, అక్కడ తనసర్వ సైన్యంతో ఆ సైన్యాన్ని చుట్టుముట్టి నాశనంచేయడం ప్రారంభించాడు.

“ఆసంగతి తెలిసికొన్న వెంటనే కేశినాయకుడు తన సైన్యం వదలి నగరం కోటలోనికి పారిపోబోయాడు. అత డలా వెళ్తూంటే -

‘కేశినాయకా! నిలు! నిలు!’ అంటూ గన్నారెడ్డి అక్కడకు చక్కా వచ్చాడు.”

8

“కేశినాయక ప్రభువు గన్నారెడ్డిమాట వినగానే నిలువునా నీరై పోయాడు. అతనికి ధైర్యం నీరై ప్రవహించింది. పదిక్షణాలు మాటరాక తెల్ల బోయిచూచినాడు. తన చుట్టుప్రక్కల పారచూచినాడు. ఎక్కడ చూచినా గన్నారెడ్డి సైన్యాలే అతని కంటికి కనపడ్డాయి.

“ఓరి గజదొంగా! రాక్షసుడా! నీకు దొరికాను, ఇకనేమి? చంపు’ అని కేశినాయకుడు - ఏడుపువస్తూంటే ఆపుకొంటూ మాట్లాడేబిడ్డలా - కేకవేశాడు. గన్నారెడ్డిప్రభువు పకపకనవ్వి ఓయీ దుర్మార్గుడా! నేను గజదొంగనా? చక్రవర్తి ధనం ఓరుగల్లు వెడుతూంటే నేనా దోచింది? నేనా ఆ చిన్నదళాన్ని పెద్ద సైన్యంతో వెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఒక్క మనిషన్నా మిగలకుండా నరికిపార వేసింది? ఏమిరా పిరికిపందా! కోట దుర్భేద్యం చేసుకొని, గోడల వెనుక దాక్కొని రాజప్రతినిధి శ్రీరుద్రదేవ మహారాజును వినరాని మాటలనే గజదొంగను నేనటరా? మాట్లాడవేం? నోరు వాతంకమ్మి పడిపోయిందా? ఓరి నీచుడా, నేను ద్వంద్వయుద్ధానికి రమ్మనడానికి కూడా నువ్వు తగవు. నీ కుట్రలన్నీ నాకు తెలిశాయి. నాకు రాజ్యం లేదని విచారంలేదు. కాని లోకంలో నీబోటి తుచ్ఛులు, స్వలాభపరాయణులైన పురుగులు, నిర్మల నీలాకాశంలా ఉన్నదేశాన్ని మహా ప్రళయ ఝుంఝూక్షుభితం చేస్తారు! పో! నీకోటలోనికిపో! ఇక ధర్మవిజయం చూడు. నీ కోటలో నిన్ను నా కున్న ఈ కొద్దిసైన్యంతోనే మట్టం కావించి లోకానికి నీతి చాటిస్తాను’ అని నవ్వుతూనే చెప్పినారు మహారాణీ!”

కుప్పసానమ్మ: పసిపాపలను ఉపలాలించే మా తమ్ముల చిరునవ్వు నే నెరుగనా?

చినదామా: మహారాణీ! గన్నారెడ్డిమహారాజుల అపారకరుణ వారితో రెండుదినాలు మెలిగినవారికి తెలుస్తుంది. తనసైన్యంలో చెంచులూ, కురమలూ, కడజాతివారినికూడా దయామయుడైన మా ప్రభువు ప్రేమతో ఆదరిస్తారు. అంత చిన్నవారైనా ఆ ప్రభువు మాకు తల్లీ, తండ్రీకూడా మహారాణీ!

రేచర్ల చినదామానాయని మాటలు వింటోంటే అన్నాంబిక హృదయంలో ఆనందం ఉప్పొంగిపోయింది. ఆమె కన్నులవెంట ఆనందాశ్రువులు అమృతబిందువులై ప్రవహించినాయి.

తన ప్రభువు, తన నాయకుడు, తన ఆత్మేశ్వరుడు భగవదంశసంభూతుడు. ఆ ప్రభువునకు తాను సేవచేస్తూ వేయిజన్మాలు గడిపినా తనకు తృప్తితీరదు. ఈ మహావీరుడే తనకు రాజాధిరాజు, భగవంతుడు.

అర్ధనిమీలితాలైన ఆ బాలిక విశాలనయనాలలోనుండి స్రవించు ఆనందాశ్రువుల గమనించి చినదామానాయని కన్నులలోనే నీళ్ళు తిరిగినవి. ఆ అశ్రువులను కంటితోనే మ్రింగి వెంటనే తన కథనము సాగించినాడు.

“మహారాణీ! కేశనాయకప్రభువు తలవాల్చికొని కోటలోనికి వెళ్ళి పోయినాడు. రెండురోజులు మేమూ వారూ చల్లగా ఊరకొంటిమి. ఇంతలో వర్ధమానపురంనుండి ఒకలక్షసైన్యంతో గోన లకుమయారెడ్డిప్రభువు స్వయంగా కేశినాయని సహాయానికి వస్తున్నారని విఠలధరణీశునికి వేగువచ్చింది. ఆయన అన్నగారితో ఆలోచించినారు. ఆ వేగువచ్చిన మరునిమేషంలో గన్నయ్య ప్రభువు ‘కోటమీదకు ఉరుకుతున్నా’ నని కేశనాయకునికి వార్త పంపి, ఇచ్చిన గడువు దాటిన మరునిమేషంలో కోటి పిడుగు లొక్కసారి విరుచుకు పడినట్లు కోటమీదకు ఉరికిరి ఒక్కసింహద్వారంపై ఆయన పెట్టిన ఒత్తిడి మహాపర్వత పక్షాలను ఛేదించే వజ్రపాత భయంకరమై మూడు గడియలలో ద్వారమును ముక్కలు చేసింది. తక్కిన ద్వారాలకడ ఒత్తిడి నటింపబడింది. గోడలపైకి ఎవ్వరూ వెళ్ళలేదు. కోటముఖద్వారం వెనుకకు కొన్ని వేల అగ్నిబాణాలు వర్షం కురిసినవి. బురుజులనుండి, గోపురగృహాలనుండి, లగ్గలనుండి శత్రువులు సంతత ధారగా వర్షించే ఆగ్నేయాది శస్త్రాలను లెక్కచేయక గుమ్మాన్ని కూల్చివేసినారు.

“మహారాణీ! పైనుండి కరగించిన ఇనుము, సీసము, కుతకుతలాడే నీళ్ళు పోశారు. మా వాళ్ళు కొందరు నాశనమయ్యారు. కాని మేము మోసుకు వచ్చిన కందనోలు శలాఫలకవితనాలు మాకు గోవర్ధనపర్వతాలైనవి. ఈ ఉపాయము గన్నారెడ్డి ప్రభువుదే.

“పై నున్న విరోధుల్ని చీల్చిచెండాడే నిశితశరపాతము, గంధకాస్త్ర పాతం ఊపిరాడకుండా మా వాళ్ళు కోటగుమ్మాలకడ లేవనెత్తిన ఉన్నతమైన పందిళ్ళ మీదనుండి కురిపిస్తున్నారు.

“మూడుగడియలలో మా ఏనుగుల తాకుడునకు, మా యంత్రములతాకుడునకు కందూరు దుర్గద్వారక వాటలూ రెండూ ఫెళ్ళున వెనక్కు విరిగి పడిపోయాయి. నిండివున్న మహాతటాకానికి గట్టుతెగితే వచ్చే ప్రవాహ ప్రపాతంలా మావాళ్ళు లోనికి చొచ్చుకుపోయారు. సంకులసమరంలో కొన్ని విచిత్రవిధానాలు గన్నయ్యమహారాజు మాకు నేర్పారు. సాంకేతికాలతో మాకు ఎదిరిని తెలుసుకోవడము, మా వారిని తెలుసుకోవడము అతిసులభం. మావా ళ్ళెప్పుడూ ముగ్గురు, అయిదుగురు, ఆర్గురు, ఎనమండుగురు ఉంటారు. అంతకన్న పెద్దజట్టు ఉండకూడదు. ఈ జట్లు విడిపోరు.

“ఒక ద్వారం పడిపోగానే తక్కిన ద్వారాలు లోనికి వెళ్ళినవారే తెరిచారు. రెండు ఘటికలలో యుద్ధం పూర్తి అయినది. రాచనగరిలో మాత్రం యుద్ధం చెలరేగుతున్నది. గన్నారెడ్డిప్రభువు, విఠలప్రభువు గండరగండలై వీరులతో నగరిని భేదించి లోనికి ఉరికారు. ఆ దినాన మా గన్నారెడ్డిప్రభువు ఎవ్వరూ తేరి చూడలేకపోయారు. సింహమై, శరభమై, పాశుపతాస్త్రమై శత్రువులను వేలకువేలు పలాయితులను చేయుటే కాని ఏపది పదిహేనుమందిని తప్ప సంహరించలేదు. “ఆయన కా కోపంతీరి, సాయంకాలపు సూర్యబింబంలా శాంతమూర్తి అయ్యేసరికి ఆయన ఎడమపాదం కందూరి కేశనాయని హృదయముమీద ఉన్నది. నాయనిదేహం రెండుఖండాలుగా చీలిఉన్నది.”

కుప్పసానమ్మా, అన్నాంబికా ఒక్కసారిగా కన్నులు మూసుకున్నారు.

“మహారాణీ! యుద్ధసమయంలో ఉత్తమమనుష్యుడు రుద్రమూర్తి అవుతాడు. నీచుడు పిశాచి అవుతాడు, గన్నారెడ్డిప్రభువు ప్రళయకాల రుద్రుడు, చక్రధర విష్ణువు.

“ఆయన వెంటనే కేశినాయకుని శవాన్ని గౌరవంగా, అతని కుటుంబానికి అప్పగించి, రాత్రి ప్రథమయామ మధ్యమందు తన సర్వసైన్యముతో మాయమయ్యాడు. ఈలోననే చక్రవర్తిసొమ్ము కేశినాయుడు దోచిన ధనము చక్రవర్తి కడకు కొన్ని దళాలు తీసికొనిపోయినవి.

చినదామానాయుడు కథ ముగించగానే అన్నాంబికా రాకుమారి లోనికి తుఱ్ఱున వెడలిపోయి చెలికత్తె నొకదానిని పిలిచి, వెలపొడుగు వస్త్రాదికములు, కొన్ని వజ్రములు దామానాయనికి ‘ఒక చెల్లెలు అర్పించిన’ వని బంగారు పళ్ళెరాన పెట్టి పంపినది.

మల్యాలనగరిలో మహోత్సవములు జరిగినవి. సేవకబృందానికి ఎన్నియో బహుమతు లీయబడినవి, బీదలకు అన్న వస్త్రదానములు చేయబడినవి.

ఆ దినమందే శ్రీరుద్రదేవమహాప్రభున కీవార్త తెలిసి వా రాశ్చర్యమందినారు. గజదొంగ గోన గన్నారెడ్డి ‘కందూరి కేశినాయక తలగొట్టుగొండ’ అయినాడా! అనుకొన్నారు.

కందూరు విడిచి గోన గన్నారెడ్డి మాయమైన మరుసటి ఉదయానికి గోన లకుమయారెడ్డి లక్షసైన్యంతో వచ్చినాడనిన్నీ, తన అనుగుభృత్యుడైన కేశినాయకుడు గన్నయ్యచే వధింపబడినాడని తెలిసి, ఆ మహాప్రభువు ప్రళయ ఝంఝామారుతానికి వణకిన మహావృక్షంలా వణకి, కోటలో పదివేలసైన్యం కాపువుంచి గన్నరాక్షసుని పట్టుకొనడానికి వెంటనే తక్కిన తొంబదివేల మహా సైన్యంతో బయలుదేరాడనిన్నీ శ్రీశివదేవయ్య మంత్రికి వేగువచ్చింది.

లకుమయ్య శ్రీ శ్రీ రుద్రదేవ ప్రభువునకు వ్యతిరేకించదలచిన రాజ ద్రోహులలో ఒకడని శ్రీ శివదేవయ్యదేశికులకు పూర్తిగా తెలుసును.

‘దూరదృష్టిలేని మూర్ఖులు తాము పన్నిన జాలంలో తామే పడి నాశనం అయిపోతారు. ఆ గజదొంగపైకి పోయి లకుమయ్య నాశనమైపోతాడు. ఈవిచిత్ర యుద్ధము గమనింపవలసినదే! గన్నయ్య తన పినతండ్రిని నాశనంచేయ ఇష్ట పడునా? ఇష్టమున్నా నాశనం చేయగలడా? ఎంత తీసినా లకుమయ్య గోన వంశారణ్య వృద్ధసింహమే. ఈ రెండు సింహాలలో ఏది విజయమందగలదో’ అనిశివదేవయ్య ఆలోచించి జేగంట మ్రోగించెను. ఆ పిలుపునకు వచ్చిన బ్రాహ్మణుని చెవిలో ఏదియో తెల్పెను.

9

ఓరుగల్లు మహానగరమునుంచి మహావేగంతో ఒక ఆశ్వికుడు బయలుదేరినాడు. దిక్కులు తెల్ల తెలవారుతుండగానే ఆ అశ్వికుడు మహామంత్రి ఆజ్ఞాముద్రిక చూపిస్తూ కోటద్వారమూ, నగరద్వారమూ దాటి మహావేగంగా ప్రయాణంచేస్తున్నాడు. ఆ మేలుజాతి అశ్వము పారశీకదేశమునుంచి వచ్చింది. హయహృదయము తెలిసి, తన్ను ప్రేమించేవానికి మాత్రమే మాటవింటు దా అశ్వము. తన ధర్మం నెరవేర్చటంలో సూర్యాశ్వాలే దానికి దీటు. ప్రతిఅశ్వానికి పేరు ఉంటుంది. కాని ఆ జాతి అశ్వాలన్నిటికీ వ్యక్తిత్వం ఉంటుంది.

చక్రవర్తి అశ్వశాలలో, ఈ ఉత్తమాజానేయాలు మూడువేలున్నాయి. దాని రౌతు లందరు అశ్వహృదయం ఎరిగినవారే. వారికి ఆ అశ్వాలు తమ బిడ్డలకన్న ఎక్కువ. ఆ అశ్వాలను ఉత్తములైన అతిథులను ఉపచరించినట్లుగా సూతులు, రౌతులు పోషిస్తారు.

‘వాయుసుత’ అనే ఆ గుఱ్ఱము ఒకసారి సకిలించి గాలిపీల్చి తల ఎత్తి తూర్పుదిక్కు గమనించి, ముక్కుపుటాలు విస్ఫారితంచేసి, ఖురాలతో నేలను ద్రవ్వుతూ నిలుచున్నది. ఒక నిమేషంలో కోటద్వారం, రెండవ నిమేషంలో నగరద్వారము దాటింది. మహామంత్రి ఆజ్ఞను చూపించుటే తడవు.

మహావేగంతో వెళ్ళే ఆ తురంగము చిన్నచిన్న గ్రామాలనేకం దాటింది. జాము ప్రొద్దెక్కేసరికి ఆ రౌతు రుద్రవరగ్రామం చేరాడు. ఆ గ్రామం బుద్ధపుర, వర్ధమానపురాది నగరాలకు పోయేదారిలో ఉన్నది. ఓరుగల్లు నగరానికా గ్రామానికి ఇరవై అయిదు గవ్యూతుల దూరం ఉన్నది. రుద్రవర గ్రామంలో సార్వభౌముల అశ్వశాల ఒకటి ఉన్నది. అది ఒక చిన్న కోటవలె ఉంటుంది. ఆ కోటలో ఎప్పుడూ పది అశ్వాలుంటవి. సార్వభౌమునివార్తలు దేశం అంతా పంపడానికీ, దేశవార్తలు సార్వభౌమునికి అందజేయడానికి అటువంటి అశ్వశాలలు దేశంలో పది పదిహేను, ఇరవై గవ్యూతుల దూరంలో అక్కడక్కడ ఏర్పాటుచేసినారు. ఈ యాశ్విక స్థానాలలో అశ్వికులు ఇతర విధు లేమీ నిర్వర్తించ నవసరములేదు. ఈ తురంగాలను యుద్ధాలకు ఉపయోగించరు.

మన అశ్వికుడు రుద్రవరం చేరి మహామంత్రి తన కిచ్చిన కమ్మఉన్న చిన్న మంజూషను ఆ శాలాధికారి కిచ్చెను. అతడు వెంటనే సిద్ధముగనున్న వేరొకరౌతు కది ఇచ్చి, గమ్యస్థానమును తెలియజేసెను. ఆ రౌతు నిర్దిష్ట మార్గాన్ని వెడలి పోయినాడు. ఈ రీతిగా అంచెలుగా ఆ కమ్మ ప్రయాణిస్తున్నది. ఈ కమ్మను గణకునిచే తాటియాకుపై వ్రాయించి ఉత్తరాల అంచెల మంజూషలో పెట్టించి తానే స్వయముగా కుచ్చులున్న పట్టుదార మొకదానిని చుట్టును చుట్టి శివదేవయ్యమంత్రి విచిత్రమైన ముడి నొకదానిని రచించినాడు. మరునాడు వేకువను ఆ కమ్మను గర్భమందు దాచుకొన్న ఆ మంజూష ప్రయాణం సాగించింది.

ఆ ఉత్తరము ప్రయాణముసాగించిన మరునా డుదయం ఈ అంచెల వార్త లందించు శాఖకు నాయకుడు శ్రీశివదేవయ్యదేశికుల దర్శనము ప్రార్థిస్తూ వారి సభలో కనిపెట్టుకొనియున్నాడు.

అర్థముహూర్తకాలానికి దేశికులు శివపూజను చేసికొని, అభ్యంతర సభా మందిరాన గూరుచుండి, వార్తాహర దళనాయకుని లోనికి రావలసిందని ఆజ్ఞ పంపినారు. ఆ నాయకుడు భయముక్రమ్మిన హృదయంతో మహామంత్రి కడకు పోయి పాదాభివందన మాచరించి, భక్తితో నిలబడినాడు.

“ఏమయ్యా! మావార్త గమ్యస్థానాన్ని చేరిందా?”

“మహాప్రభూ! మా వార్తాహరదళమును తాము కటాక్షించాలి. తమ లేఖ గజదొంగ గోన గన్నారెడ్డి చేతులలో పడినదండీ. అందు మా వార్తాహరుని లోపము లేదండీ!”

“ఏమిటీ! గజదొంగ చేతిలో పడినదా ఆ ఉత్తరము? అది ఎట్లా సంభవించినదయ్యా? సూర్యునిలా గతులు దప్పని మీ దళవీరుల ప్రజ్ఞలు ఉడిగి పోయినాయా?”

“మహాప్రభూ! మావార్తాహరులలో చివరి అంచెవాడు సాయంకాలానికి అమరపురం చేరబోతున్నాడు. ఆ ఊరింకా ఒక అర్ధగవ్యూతి ఉందనగా ఏబది మంది అశ్వికవీరులు మార్గాన్ని కీవ లావలనుండి వచ్చి మా వార్తాహరుని దారి అరికట్టారటండీ. మా వార్తాహరుడు తమ ఆజ్ఞాముద్రిక చూపించినాడటండీ. అయినా వారు లెక్కచేయక, వెనుకనుంచి గట్టివస్త్రం ఒకదాన్ని మావార్తాహరుని నెత్తిపై వేసి, ఆతనిని దిట్టమైన త్రాళ్ళతో బంధించారటండీ. వెంటనే మంజూష హరించికొని పోయినారటండీ!”

“దేశం అరాజకం వాత బడిందా?”

“చిత్తం మహామంత్రీ!”

“ఆ వెనుక ఏమయింది?”

“ఆ పిమ్మట మా వార్తాహరుడు కట్టుత్రాళ్ళతోనే మా శిబిరం చేరినాడటండీ. వెంటనే మేఘాలలాంటి అశ్వాలపై జట్టు కిరువురు చొప్పున చుట్టు ప్రక్కల ప్రదేశాలన్నీ వెదకడం ప్రారంభించాము.”

“మంచిది!” “అందులో ఒక జట్టు కెదురుగా నల్లని గుఱ్ఱం ఎక్కిన వీరు డొకడు తారసిల్లాడు ప్రభూ!”

“అందరూ వీరులే! కవిత్వం చెప్పలేనివాడు, వీరత్వం నెరపలేనివాడు ఈ దినాల్లో ఎవడున్నాడు?”

“చిత్తం, ఆ వీరుడు మా జట్టువాళ్ళను తార సిల్లి ‘మీ వార్తాహరుని కడ నుండి మంజూషను తస్కరించిన దొంగలకడనుండి, శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు జట్టులోని మే మా మంజూషను పాములనుండి గరుత్మంతుడు అమృతభాండము నెత్తికొనిపోయిన రీతిగా లాగికొన్నాము’ అని చెప్పి మాయమైనాడు దేవరా! పట్టుకొందామని ప్రయత్నించారటగాని లాభం లేకపోయిందని మా వాళ్ళు వార్త పంపారు.”

‘ఓహో!’ అని పక పక నవ్వి శివదేవయ్య దేశికులు ‘ఓ వార్తాహరదళాధిపతీ! ఈ విషయంలో మీ లోపం ఏమీలేదు. ఇకముందు వార్తలు పంపు విధానము కొంతకాలంవరకూ మార్పు చేయవలసివస్తుంది. ఇక నీవు వెళ్ళవచ్చును’ అని ఆజ్ఞ ఇచ్చినారు.

వార్తాహరదళాధిపతి వెళ్ళిపోయిన మరుక్షణంలో శివదేవయ్య దేశికులు పక పక నవ్వుకుంటూ “గజదొంగ గన్నారెడ్డి చేతులలో పడిందా ఆ ఉత్తరము? ఈదినాల్లో అన్నిదారులు గన్నారెడ్డినే చేరుతున్నవి. ఏలాంటివా డీ గన్నారెడ్డి! రేపు పినతండ్రితో యుద్ధం ఏలా చేస్తాడు? పినతండ్రి కొన్నిలక్షల సైన్యాన్ని పోగుచేసి శిక్షణయిస్తున్నాడట. లకుమయారెడ్డికి కాకతీయవంశమంటే ఇంతటి విరక్తి ఎందుకో? అన్నగారు బుద్ధారెడ్డి జీవించి ఉన్నంతకాలం సోదరభక్తితో రాజభక్తితో ఉండే లకుమయ్యకు ఆ తర్వాత ఆశ పుట్టింది. కాకతీయులుగాని, వారికి ముందు చాళుక్యులుగాని, వేంగీచాళుక్యులుగాని, చోడులుగాని, వారికిముందు పల్లవ చక్రవర్తులుగాని ఆశవల్లనే సార్వభౌము లయ్యారా?

“కానీ, ధర్మంకోసం, ప్రజలకోసం రాజ్యంచేసే ప్రభువులను ధిక్కరించి సామ్రాజ్యాలు స్థాపించాలని కుట్రచేసినవారు నాశనమే అయ్యారు.

“లకుమయారెడ్డి సామ్రాజ్యం స్థాపించాలని దీక్షవహించాడు. అందుకు విఘ్నేశ్వరపూజ అన్నకుమారునకు రాజ్యంలేకుండా చేయడం! భారతము కౌరవ పాండవ యుద్ధమేకదా! ఆయుద్ధం రాజ్యవాంఛవల్ల నేకదా ఉద్భవించింది! ఈ భయం కరవాంఛవల్ల అర్థమూ, ధర్మమూ నాశనమై, ప్రజాక్షోభ ఉప్పతిల్లుచున్నది.

“రుద్రదేవప్రభువు తండ్రిగారివలెనే జననష్టానికి ఓర్వలేరు. చతురుపాయాలలో మొదటి మూడింటివల్ల నే కార్యాలు చక్కబెట్టుకోవాలి అంటారు. “మొన్ననే విక్రమసింహపురంనుంచి శ్రీ జన్నిగదేవసాహిణి మహారాజు అపరవేదవ్యాసు లనదగిన తిక్కయజ్వభారతము ఉద్యోగపర్వము పంపించారు. వాగనుశాసనుడైన నన్నయ్యభట్టు పిమ్మట ఇంత మహోత్తమకవి లేడు. తిక్కనా మాత్యులు ఏమన్నారు?

చం. 'పగ యడగించు టెంతయు శుభం బది లెస్స, యడంగునే బగం
       బగ, పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే, కడుం
       దెగ మొదలెత్తిపోవ బగదీర్పవచ్చిన క్రౌర్యమొందు నే
       మిగతి దలంచినన్ బగకు మేలేమిలేమి ధ్రువంబు కేశవా!'

ఎంత లెస్సమాటలివి ?

శివదేవయ్యమంత్రి ఇలా తలపోసుకుంటూ ‘గన్నయ్య ఆ మంజూష తెరచి ఏమిచేయునో’ అనుకొనెను.

10

ఓరుగల్లు నగరంలో బ్రాహ్మణవాడ ఆవుపాలతో కడగిన ముత్యంలా ఉంటుంది. ఈ వాడలో దిగ్దంతులైన పండితులూ, వేద వేదాంగ పారంగతులూ, ఆరాధ్య నియోగిభక్తులూ, అద్వైతులైన నియోగులూ నివాసంచేస్తూ ఉంటారు. ఈ వాడ మహాపురమంత ఉంటుంది. ఈ వాడలోనివారందరికీ చక్రవర్తికొలువులో గాని, వివిధమండలేశ్వరుల కొలువులలోగాని, మంత్రులుగా, రాజోద్యోగులుగా, ఆస్థాన పండితులుగా, కవులుగా, పురోహితులుగా, గురుకులాచార్యులుగా, దేవాలయార్చకులుగా పను లుంటూ ఉన్నవి.

ఈ బ్రాహ్మణవాడలో రేచెర్ల ప్రసాదాదిత్యప్రభువునకు మంత్రిఅయిన అక్కినమంత్రి (శ్రీ అక్కినేపల్లి జానకిరామారావు జాగీర్దారుగారి పూర్వీకుడు) కౌండిన్యసగోత్రీకుడు, పిల్లలమఱ్ఱినగరవాసి, ఒక ఉత్తమభవనంలో నివాసంచేస్తూ ఉండెను. అక్కినమంత్రి పూర్వీకులు రేచెర్ల వంశానికి మంత్రులు. రేచెర్ల బ్రహ్మనాయని వంశంవారయిన శ్రీ కాటయప్రభువుకడ అక్కినమంత్రి తాతగారు సోమనా మాత్యులు మంత్రిగా ఉండేవారు. అక్కినమంత్రి తండ్రి భీమేశ్వరమంత్రి ‘శ్రీ సకలగుణాలంకార, పరనారీదూర, అమనిగింటి పురవరేశ్వర, వీరలక్ష్మినిజేశ్వర, దోర్భలభీమ, రణరంగధామ, వితరణకర్ణ, శౌర్యసౌపర్ణ, పతిహితాంజనేయ, శౌర్య గాంగేయ, సత్యరత్నాకర, దుష్టజనభీకర, మనుమకులాదిత్య, సుభటసంస్తుత్యనామాది ప్రశస్త’ శ్రీ రేచెరువుల కామిరెడ్డి ప్రభువులకు ముఖ్యమంత్రిగా ఉండెను.

అక్కినమంత్రి అన్నగారు మల్లికార్జునమంత్రి పిల్లలమఱ్ఱి ప్రభువైన నామిరెడ్డికడను మంత్రిగా ఉండెను. శ్రీ నామిరెడ్డి మండలేశ్వరుడు కామిరెడ్డిమహారాజు కుమారుడు. కామిరెడ్డి అన్నగారు బేతిరెడ్డి. ఆ ప్రభువున కొక్కడే పుత్రుడు, మల్లి రెడ్డి. అక్కినమంత్రి రేచెర్ల వంశంలో పేరుగన్న బేతాళనాయకుని కుమారుడైన ప్రసాదాదిత్యనాయకునికడ మంత్రిగా ఉండెను.

అక్కినమంత్రి అందలమెక్కి వందిమాగధులు పొగడుతూ ఉండగా కోటగుమ్మం దాటి నగరపాలకుడైన ప్రసాదాదిత్యప్రభువు నగరుచేరుకొని అక్కడ రాజసభలో ప్రవేశించినాడు. అక్కినమంత్రి ప్రవేశించగానే అ సభలోని వారందరు నిలిచి వారికి జోహారు లర్పించారు.

అక్కినమంత్రి ప్రతిభాశాలి, ఉత్తమ పండితుడు, శివభక్తుడు. అరువది మూడేండ్ల వృద్ధుడైన ఆ మంత్రి శివదేవయ్య దేశికులకు కుడిభుజంగా సర్వరాజ కార్యదక్షులై ఉండేవారు.

ఓరుగల్లు నగరపరిపాలన మొకఎత్తు, తక్కిన మహారాజ్య పరిపాలన మంతా ఒకఎత్తు. ఆంధ్రమహాసామ్రాజ్య మంతా, ఓరుగల్లునగరంలో ప్రతి ఫలిస్తూ ఉండేది. ఆ నగరంలో అన్నిశాఖలూ ఆముదం నూనెచే తడిపిన రథ చక్రాల ఇరుసులులా పాలింపబడుతున్నవి.

ఎగుమతి దిగుమతులు, వస్తువుల ఉత్పత్తి, వస్త్రపునేత, వానికి రంగుల అద్దకము, నగరాయుర్వేదము, ఆహారపదార్థముల సేకరింపు, అతిథిపూజ, న్యాయపాలనము, నగరరక్షకశాఖ, నగర మార్గనిర్మాణము, విద్య, సామంత రాజ్యతంత్రము, నగరపశుపోషణ, పశువైద్యము, నగరవినోదశాఖ, నగరోద్యానవనపోషణ, శాకముల మాంసముల అందుబాటు, విపణివీథులు ఈ మొదలయిన శాఖలన్నీ పురాధ్యక్షుడు చూచుకోవాలి. అక్కినమంత్రి ఆ పురాధ్యక్షునకు మంత్రాంగము

అక్కినమంత్రి కుమారుడు నలుబదిరెండు సంవత్సరముల ఈడుగల సోమయామాత్యులు సార్వభౌమసభలో వణిక్ శాఖామంత్రిగా ఉండెను. సోమయామాత్యునకు చినఅక్కినప్రగడ కుమారుడు. ఈ బాలకుడు పదునెన్మిది సంవత్సరాల ఈడువాడు. చిన్నతనములోనే ఉద్దండపండితుడై, సాంగవేదియై, అపర పతంజలి అని పేరు పొందాడు. అతడు గన్నారెడ్డితో కలసి, ఆ గజదొంగకు మంత్రియై, ఆంధ్ర సామ్రాజ్యమునందంతా సింహస్వప్నమైపోయాడు. కొడుకు దుశ్చేష్టితాలన్నీ తలచుకుంటూ సోమయామాత్యులూ, మనుమని ఆగడాలు తలచుకొని అక్కినమంత్రీ నలుగురిలో తలలెత్తుకొని తిరగడానికి సిగ్గుపడుతూ ఉండిరి.

అ ఉదయం అక్కినమంత్రులవారు సభదీర్చి కూర్చుండగానే ప్రసాదాదిత్యప్రభువు సభకు వచ్చారు. అందరూ లేచి నిలుచున్నారు. నాయకుడు అక్కినమంత్రికి నమస్కరించి, సింహపీఠి నలంకరించి, వ్యవహారాలు విచారించ ప్రారంభించినాడు.

నగరంలోని అభియోగాలన్నీ మహాతలవరే పండితసభ సహాయముతో విచారిస్తాడు. పెద్ద పెద్ద అభియోగాలు నగరరక్షక సభకు వస్తాయి. ఈ అభియోగ విచారణకాలంలో ఉత్తమ పండితులు, ధర్మశాస్త్రవేత్తలు, వణిక్ సంఘాధిపతి, నగరరక్షకునకు సహాయం చేస్తూవుంటారు. అక్కినమంత్రి ఆ పండితసభలో పెద్ద. ఈ అభియోగాలు, అర్ధాన్నిగూర్చి, వాణిజ్యాన్నిగూర్చి, సామంతుల సేవకుల మధ్య తగవులగూర్చి జరుగుచునుంటవి.

ఆ దుర్మతి సంవత్సర శ్రావణమాస బహుళ పంచమినాడు శ్రీ శ్రీ మహాసామంత వర్ధమానపుర మహారాజు లకుమయారెడ్డి, గన్నారెడ్డి ఓరుగల్లులో నివసించే తమ నగరును తన భృత్యులకు స్వాధీనం చేయవలసివున్నదని పుర రక్షక ప్రభువైన ప్రసాదాదిత్యునికడ అభియోగం తెచ్చినాడు. ఈ అభియోగం తేవడానికి, విచారణసమయంలో అందులో పాల్గొనడానికి, వర్ధమానపురం నుండి లకుమయారెడ్డి రెండవమంత్రి చిన్నయామాత్యుడు వచ్చినాడు. చిన్నయా మాత్యులు, అక్కినమంత్రియు దూరపుచుట్టాలు. చిన్నయామాత్యుడు, అక్కిన మంత్రితో కొంతవరకు మాట్లాడి, ఆవిషయమై విచారణను ప్రసాదాదిత్యప్రభువు ప్రారంభించగానే చిన్నయామాత్యుడు, గజదొంగ అయిన గన్నయ్య ప్రభువు వర్ధమాన రాజ్యానికి అర్హత పోగొట్టుకొన్నాడు కాబట్టి మానువనాటి ప్రభువుల స్వత్వాలన్నీ ఆయనకూ, విఠలధరణీశునకూ పోయాయనీ, అందుచే శ్రీ శ్రీ లకుమయారెడ్డి మహారాజు తిరిగి గోనప్రభువుల నగరిని ఆక్రమించవచ్చు ననీ వాదించాడు.

ధర్మశాస్త్ర నిర్ణయాధికారులైన పండితు లా విషయం చర్చించి చిన్నయామాత్యుని వాదన అంగీకరించి శ్రీ శ్రీ లకుమయారెడ్డి ప్రభువు ఆ నగరిని స్వాధీనంచేసుకోవచ్చు నన్నారు. ప్రసాదాదిత్య ప్రభువు అంగీకరిస్తూ తీర్పు చెప్పాడు.

11

అక్కినమంత్రి వృద్ధుడైనా జవసత్వము లేమీ సడలని యోగివంటివాడు. ఆ దినమున సభ రెండవజాము పూర్తి అగుటకు ఇంకను మూడుగడియలున్న దనగానే సభ చాలింపబడినది. ప్రసాదాదిత్యప్రభువు లేచి అక్కినమంత్రి అనుమతి నంది సభ చాలించి వెళ్ళిపోయాడు.

వెంటనే అక్కినమంత్రియు మోసాలకడ శిబికనెక్కి వందులు బిరుదులు పాడ, ధవళచ్ఛత్రము, ధవళాశ్వము ముందునడువ, సామంతభేరి మ్రోగుతూ వుండగా ఓరుగల్లు మహాపురంలో తమ నగరు చేరారు. మళ్ళీ స్నానసంధ్యానుష్ఠానాలు కావించి సరిగా ప్రొద్దు పడమటివైపు మళ్ళిన ఒక ఘడియకు కుమారునితో, పండితులతో, అతిథులతో కలసి మృష్టాన్న భోజనం చేశారు.

ఆంధ్రుల భోజనం జగత్ప్రసిద్ధము. మల్లెపువ్వలవంటి రాజనాల అన్నం, పప్పు, పచ్చళ్ళు, శాకాలు, ధప్పళము, చారు, పాలతో గోధుమ పిండితో చేసిన భక్ష్యాలు, కమ్మటి పెరుగు, ఘుమఘుమలాడు నెయ్యి - ఇవి ప్రతిదినమూ ఉండాలి. ఆంధ్రులలో రైతులు బలంకోసం జొన్నరొట్టెగాని, జొన్నన్నంగాని తింటారు. చుట్టాలువచ్చినా, పండుగ వచ్చినా రాజనాలు వండు కొంటారు.

అక్కినమంత్రి భోజనానంతరం అభ్యంతరచతుశ్శాలలో రత్నకంబళ్ళపై నధివసించి కుమారునితో, అతిథులతో తాంబూలచర్వణ చేస్తూఉండెను. కొంత కాలం విద్వత్‌గోష్ఠి జరిగింది.

ఎవ్వరూ ఎప్పుడూ, అక్కినమంత్రికడ మనుమడైన అక్కినప్రగడ విషయం ఎత్తరు. గజదొంగలలో గలసిన అక్కినప్రగడ తన మనుమడగుటకు ఆయన యెంతో బాధపడును. ఒక్కొక్కప్పుడు ఆయనకు పట్టరాని కోపంకూడా వచ్చేది.

తాంబూలచర్వణం చేస్తూఉండగా అక్కినమంత్రి సత్తముని దర్శనార్ధము కొందరు పండితులు వచ్చినారు. వారు దూరదేశాన్నుంచి వచ్చి, శ్రీ శివదేవయ్య మంత్రిగారి నగరులో వారిపంక్తిని భోజనంచేసి, అక్కినమంత్రి దర్శనార్ధము వచ్చినారు.

పదునారేడుల చిన్ననాడే దిగ్విజయయాత్రచేసి, సర్వభారతీయ పండిత ప్రకాండులచే ప్రశస్తులు పొందిన అక్కినప్రగడ ఏడని ఆ పండితులు అక్కినమంత్రిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో అక్కినమంత్రికి మితిమీరిన కోపం వచ్చింది. ‘ఆ పాపిమాట నాకడ తీసుకురాకండి!’ అని అక్కినమంత్రి ఖండితముగా చెప్పినాడు.

ఆ పండితు లొకరిమోము లొకరు చూచుకొనుచున్నారు. అప్పుడు అక్కినమంత్రి కుమారుడు సోమయామాత్యులు, విచారమేఘావృతమైన మోముతో ఆ పండితుల చూచి, ‘మావాడు గజదొంగ అయిన గోన గన్నారెడ్డి జట్టులో కలిసి పోయాడు. ఆ దొంగకు తాను మహామంత్రి అట! అప్పటినుండి మా నాయనగారికి మతి విరిగిపోయింది. మాదుఃఖానికి మేరలేదు. పండితుడైన కుపుత్రునికంటె మూఢుడైనా, కొడుకు గుణవంతుడగుట మేలు’ అంటూ సోమయామాత్యుడు నిట్టూర్పు వదిలాడు.

అప్పు డందులో సాహిత్యవిశారదుడు, వ్యాకరణవేత్త అయిన శ్రీధర పండితుడు, రాజరాజనరేంద్ర నగరవాసి సోమయామాత్యుని చూచి ‘చిత్తం! మీ అబ్బాయిగారు గోన గన్నారెడ్డితో చేరినట్లు మాకు తెలియదు. మే మందరము కృష్ణాతీరస్థమైన ఒక అడవిలో ప్రయాణంచేస్తూ కందనోలునుంచి వస్తూఉంటిమి. కందనోలు ప్రభువు వందిభూపాల తనయుడు మమ్మెంతో ఆదరించి, విలువగల బహుమతులిచ్చి, వీడుకోలిచ్చినాడు. ఆ ప్రభువు గోన గన్నారెడ్డిని ఆకాశమంటేటట్లు పొగడారు. ఆప్రభువును వదలి మేము తుంగభద్రదాటి ఏకశిలా నగరాభిముఖంమై వస్తూ ఉంటే, కృష్ణాతీరంలో ఒక అడవిలో మమ్ము గోన గన్నారెడ్డి సైనికులు అడ్డగించి గౌరవముగా తీసుకుపోయినారు. మా కళ్ళకు గంతలుగట్టి గన్నారెడ్డి సైన్యాలతో నివసించిఉన్న కోటకు కొనిపోయారు. అక్కడ మాకు వారిచ్చిన ఆతిథ్యం వర్ణనాతీతమే. మేము మీ అబ్బాయిగారిని ఆ సమీపాన ఎక్కడా చూడలేదండీ’ అని ప్రతివచన మిచ్చారు.

“గజదొంగ అనే చిహ్నాలేవీ మా కక్కడ కనిపించలేదు. కళ్ళకు గంత లెందుకని మే మాశ్చర్యమందినమాట నిజం. కాని, ఒకసారి వారికోట చేరిన తర్వాత మాకు వారుచేసిన గౌరవం అప్రతిమానం. ఇంతలో ఒకచిన్న మంజూష పట్టుకొని ఒక దళవాయి వచ్చి గన్నయప్రభువుకు అర్పించాడు. ఆయన ఆ మంజూషను కట్టిన ముడిని సునాయాసంగా విప్పి అందులో ఉన్న తాటియాకుల కమ్మనుచూచి ఈలా చదివినారు. ‘స్నేహితుడా! లకుమయారెడ్డి లక్షకాల్బలముతో, ఇతర సైన్యాలతో గన్నారెడ్డిని హతమార్చడానికి వెడుతున్నారు. గన్నారెడ్డి గజదొంగ ఏమిచేయగలడు? పినతండ్రికి దొరకక మాయమవుతాడు. అతనికి ఇది అదనుకాదనేసంగతి తెలుసు. అయిన మీరు మన రాజ్యవ్యవహారాలకు అపశ్రుతిలేకుండా జాగ్రత్తపడి ఉండవలయును. శ్రీ రుద్రదేవమహారాజు శ్రీ శ్రీ గణపతిరుద్రదేవ సార్వభౌముల పెద్దకుమార్తె అనిన్నీ, వారు సార్వభౌములకుగాను రాజప్రతినిధియై పరిపాలనం జేస్తూవుండగలందులకుగాను మహోత్సవం జరిపారు. కాబట్టి మీకు తెలియజేయడమైనది. దేవాలయాలలో, శాసనాదులలో ఇరువురిపేరా పూజాదికాలు, బ్రాహ్మణ పూజలు జరపవలసింది. ఆశీర్వాదాలతో శివదేవయ్య’ అని ఆ ఉత్తరం గన్నయ్యప్రభువు పైకి చదివారండీ” అని ఆ పండితు డూరకున్నాడు.

12

ఓరుగల్లు నగరంలో శ్రీ రుద్రదేవమహారాజు రాజప్రతినిధి అయినందుకు ఉత్సవాలు అఖండంగా జరుగుతూనే ఉన్నాయి. ఆ మహానగరంలో మహా రాజనగరులో, మండలేశ్వర నగరులలో, దేవాలయాలలో దినదినమూ నృత్య గీత వాద్యాలు, పండిత సన్మానములు, తోలుబొమ్మలు, కథాకాలక్షేపములు జరుగుతూ ఉండెను.

మహారాజనగరంలో నృత్యవిద్యాసంపన్నత సభికులకు చూఱలిచ్చే నర్తకీబృందంలో ఉత్తమురాలు మధుసాని. ఆ మధుసాని కిరువది అయిదు సంవత్సరాలు. బంగారురంగు హొరంగుతో, పోతపోసిన విగ్రహంవలె స్ఫుటత్వముగల అవయవాలతో భూమికి దిగివచ్చిన ఘృతాచిలా ఉంటుంది. ఆమె జాయపసేనాని ప్రియురాలు, శిష్యురాలును. జాయపమహారాజు ఆ దివ్యసుందరికి భరత, భామహ, వామభట్టోత్పల, రుద్రట, రుయ్యక, ఆనంద వర్థన, అభినవగుప్త, దండి, క్షేమేంద్ర, ఏకావళీకార, మమ్మట, ఉద్భట, హేమచంద్రాది మహామహుల అలంకార శాస్త్రములు నేర్పియు, నేర్పించియు ఆమెను మహోత్తమవిద్యాసంపన్నను చేసినాడు. (ఈమె మనుమరాలే పిమ్మట ప్రతాపరుద్రదేవుని వలపించిన మాచల్దేవి).

ఈమె నగరు - సార్వభౌముల నగరికి దక్షిణమున, ఆ నగరు కంటియున్న జాయపసేనాని నగరు - నంటియున్నది. ఈ నగరులో అనధ్యయన దినములలో తప్ప ప్రతిదినమునందు సాయంకాలము పందొమ్మిదవ నాళిక రాచనగరు మోసాల యందు మ్రోగినప్పటినుండి గోధూళికాలంవరకూ సభ జరుగుతుంది. ఆ సభలో పండితులు, కవులు, గాయకశ్రేష్ఠులు, నర్తకీమణులు తమ తమ విద్యలు చూపుతూ ఉంటారు. నెలకు ఒకసారి పూర్ణిమముందు శుక్రవారంనాడు కామేశ్వరీపూజానిరతురాలైన మధుసాని లేక మధుమావతీదేవి ఉదయమూ, రాత్రీ కామేశ్వరీదేవికి దివ్య నాట్యము అర్పిస్తుంది. ఆ సమయం దాహూతులయ్యేవారు పండిత వృషభాలు, రాజసింహాలు, కవిహంసలు, గాయకతల్లజులు, మంత్రిపుంగవులు మాత్రమే. ఆమె నాట్యప్రదర్శనం చూడడం తపఃఫలంగా ఎంచుకొనేవారు.

ఆంధ్ర నర్తకీమణులకు అత్యంత ప్రియమైనది నందికేశ్వర సంప్రదాయం. నాట్యము మూడుపాళ్ళు, నృత్తము ఒక పాలును వారు ప్రదర్శిస్తారు. ఆంధ్ర నాట్యము జగత్ప్రసిద్ధము. ఆంధ్రులంత నృత్యప్రియు లా దినాల ఇంకొకరు లేరు. సర్వశాస్త్రపారంగతురాండ్రై దేవగణికలకు పాఠాలు నేర్పడం ప్రాథమికవిద్యగా ఎంచుకొనే కైశికీమణులతో కామేశ్వరీకథ చెప్పుతూ నాట్యమాడే జక్కుల పురంధ్రులతో ఆంధ్రనాట్యవృక్షము పుష్పఫలావృతమై పెరిగింది.

నాట్యమున పూర్వరంగము ఇష్టదేవతా ప్రార్థనాత్మకమై, దివ్యగాథా నాట్యపూర్ణమై ఉంటుంది. ఉత్తరరంగము, ఉత్తమ మానవ చరిత్రాభినయపూర్ణము, చతుర్విధాభినయములతో, శృంగార కరుణ భక్తిరసాలుగా కావ్యాలు నాట్యం చేయబడుతాయి.

మధుసాని ఒక సార్వభౌమ నగరియందు మాత్రమే నాట్యముచేస్తుంది. శ్రీశ్రీ రుద్రదేవ మహారాజులు సార్వభౌమ ప్రతినిధిగా అభిషేకించిన ఆ ఉత్సవాలలో రుద్రదేవమహారాజుసభలో శుక్రవారాలు కానటువంటిన్నీ, అనధ్యయనదినాలు కానటువంటిన్నీ దినాలలో ఆ మహారాజు సభ నలంకరించి ఉండగా మధుసాని ఉదయం ప్రధమయామమధ్యమునుండి ద్వితీయయామ మధ్యంవరకూ ఏడున్నర ఘటికలు తానే నాట్యం చేస్తుంది.

ఆమె నాట్యసభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానింతురు. ఆ రుద్రేశ్వర నామక మహాసభలో సార్వభౌమ సింహాసనానికి దిగువగా రాజప్రతినిధి సింహాసనంపై రుద్రదేవి పురుషవేషంతో అధివసించిఉంది. ఆమెకు కుడిప్రక్క మహా మంత్రి గద్దెపై శివదేవయ్యమంత్రులవారు, ఎడమప్రక్క సర్వసైన్యాధ్యక్షుల వేదికపై జాయపసేనానులవారు అధివసించిఉండిరి. వారికి కొంచెం దిగువగా శివదేవయ్యగారికి కుడివైపున ప్రసాదాదిత్యులు, జాయపమహారాజుకు ఎడమగా మహా తలవరి ఉన్నారు.

అక్కడనుండి సభకు ఈవలావల ఆసనాలపై మహాసామంతులూ, సామ్రాజ్యప్రధానులు వారివారి మర్యాదలక్రమంగా పీఠికలపై అధివసించిఉండిరి. రాజప్రతినిధి సింహాసనానికి దిగువగా జగత్ప్రసిద్ధ పండితుల ఆసనాలుంటవి. వారికి దిగువగా రసికోత్తములగు సామంతులు, కళానిధులు, కోటీశ్వరులు, ముఖ్యాధికారులు మొదలైనవా రందరి ఆసనాలూ వుంటాయి. పండిత పీఠాలకు దిగువ ఉత్తమ రత్నకంబళిపరచిన స్థలంలో లాసికాబృందము, మృదంగద్వయం ఈవలావలగా, దేశికులైన పండితులు కుడివైపుగా, చెలియైన వేరొక గణిక ఎడమ వైపుగా మధుసాని నాట్యం చేస్తుంది. మధుసాని వెనుకగా శ్రుతిగాఉన్న గణికా బృందానికి కుడివైపునా, ఎడమవైపునా, ఒకవీణ, ఒక సైరంధ్ర. ఒక రావణ హస్తము, ఒక పిల్లనగ్రోవి ఉంటాయి.

మధుసాని శ్రీ రుద్రదేవప్రభువు ఆజ్ఞప్రకారం సభలో ప్రవేశించి రుద్రదేవికి, శివదేవయ్య దేశికులకు మోకరించి నమస్కరించి, లేచి జాయపసేనానికి తక్కుంగలవారికి నమస్కరించినది.

మధుసాని, కాముని వింటినారివలె బంభరవేణి మధుసాని; పంచబాణుని మందార బాణాలవంటి పీనపయోధరి మధుసాని; మీనకేతనుని కేతనంవంటి బెళుకులాడి మధుసాని; మదనుని చెరకువింటివంటి మధురోష్ఠి మధుసాని, రతితస్వంగి వంటి జవరాలు. మధుసాని నవ్వితే శరత్‌కాలమూ, నడిస్తే వర్ష కాలమూ, మాటలాడితే వసంతకాలమూ, కనులు మూసినచో శీతకాలమూ ఉదయిస్తవి.

అట్టి మధుసాని నాట్యసౌందర్యము ఉత్తమ కళాభిజ్ఞురాలగు శ్రీ రుద్రదేవి చూచి, గ్రహించి, ఆశ్చర్యమంది, ఆనందింపగలిగింది. శ్రీ శివదేవయ్య దేశికులు ఆమెనాట్యంలో ఉదయసంధ్యానటేశ్వర నృత్యచ్ఛాయలు చూచి ఆనందించినారు. తక్కిన వృద్ధులు, కౌమారులు, యౌవనులు అందరూ మహామధురనాట్యముతో కూడిన ఆమె సౌందర్యంలో మనస్సులను శలభాలు చేసుకున్నారు.

“ఓం వినాయక, విఘ్నరాజం వందే!
 ప్రమథ గణేశ్వర పాహిమాం, పాహిమాం!”

అని పూర్వరంగము ప్రారంభించింది. నాట్యభేదములలో ఇరువదినాలుగవదియగు పుష్పాంజలి నాట్యముతో ప్రారంభించి భృంగినాట్యముతో సమాప్తం చేసింది. ఆ వెనుక ఉత్తరరంగంలో శృంగారనాట్యం ఆరంభించి ఉత్తమ గీతాలు ఎత్తుకొని మధురమైన కంఠంతో వాచికాభినయమూ, పరమపవిత్రమగు సాత్వికాభినయమూ, మనోహర పద్మలతాహస్తాలతో, పద్మపత్రాక్షులతో, చంద్రబింబాస్యంతో, శంఖగ్రీవంతో, నునుకౌనుతో, ఘనకటితో, రంభోరులతో, పద్మపాదాలతో అంగాభినయమూ, నవరత్నఖచితాలంకారాలతో, దుకూల వస్త్రాదులతో, తనురాగ, లేప కజ్జల, పుష్పరాగాలతో ఆహార్యాభినయమూ ఆ ప్రౌఢ చూపించింది.

ఆమె నాట్యమాడినది కుమారసంభవ యక్షగానము, నవయౌవనవతియైన పార్వతి చెలితో అంటున్నది.

“నాతీ! ఏల నామనసూ నన్నూవిడిచిపోయే
 నా కలలు తోచేనే నాట్యమాడెడు ఒకడూ!
 జటలే తాల్చినవాడు, జాహ్నవి ముడిలో ఆడు,
 చంద్రశేఖరుడమ్మా సుందారీ విను, కొమ్మా!

 అప్పుడు చెలి ఏమన్నది?

“నగరాజూ నీతండ్రి నగుబాటుపాలౌ
 తగదమ్మా ఈ వలపు తలవంపులౌనౌ,

పార్వతి : “నాతో మేలం వద్దు
              నవ్వూలు కావమ్మా;
              నాగభూషణునొకని నలినాక్షి చూచితిని !
              నిద్దుర మెలకువవచ్చి నిలువెల్ల పులకిస్తి
              అద్దిరహృదయము మ్రోగె; అలమె సిగ్గులు నన్ను
                                                                 నాతీ .....
              ఒడలు ఝల్లునపొంగె కడలికెరటము రీతి
              చిడిముడిపాటున మనసు చేడె! వశముదప్పె
              ఎవ్వరే ఆ వయసుకాడు? ఎవ్వరే ఆ జటాధారి
              అవ్వరో! ఆ సుందరాంగుడు అంగముల విభూతివాడె?
                                                                      నాతీ.........
              చేతకలదే ఢక్కఒకటి; చేర్చెవహ్నిని ఇతరకరమున
              నాతి ఆ దివ్యమూర్తే నా తలంపుల నిండిపోయెనే!”

చాళీయమై, లవణియై, విద్యుద్భ్రమరకమై మధుసాని నాట్యము పాల సముద్రవీచికలా, మందమలయానిలంలా చంచలగతిని సభ్యుల ఆత్మలనే కరగించివేసింది.

నాట్యం పూర్తిఅయి ఆమె తాను వేషమువేసికొనే అభ్యంతర మందిరంలోకి రుద్రదేవ మహారాజుయొక్క, ఇతర సభాసదులయొక్క సెలవునంది వెడలిపోయినది. ఆమె లోనికి వెళ్ళగానే, ఒక వృద్ధ ఆమెకడకు వచ్చి ‘మధుమావతీదేవీ! శ్రీ జాయపమహారాజులంవారు సైన్యంతో బయలుదేరి లకుమయారెడ్డి సైన్యాన్ని ఎదురుకొనేందుకు అవసరమని శివదేవయ్య గురుపాదుల కోరిక. ఇది అతిరహస్యంగా జరగాలి. శ్రీ జాయపమహారాజులంవారు మూడవ సైన్యాన్ని పానగల్లు పంపించివున్నారు. ఆ పానగల్లు పట్టణంలో సారంగపాణిదేవమహారాజు తన సైన్యంతో సిద్ధంగా వున్నారట. నీవుకూడా శ్రీ జాయపమహారాజులవారితో బయలుదేరాలి. సంతోషానికి మీ రిరువురూ బయలుదేరి నట్లుండాలట. అవసరమైతే లకుమయప్రభువు సైన్యాన్ని నాశనంచేసి, లకుమయప్రభువును బందీగాపట్టి సగౌరవంగా ఓరుగల్లుకు కొనిరావలసిందని గురుపాదులు తమ ఆలోచనగా శ్రీమహారాజులంవారికి మనవి చేయమన్నారు’ అని రహస్యంగా నివేదించినది.

శివదేవయ్య దేశికులు శివావతారులని మధుమావతికి నమ్మకం. మధుమావతి భక్తురాలు. రాచరికపు వ్యవహారా లెరిగిన శేముషీసంపన్న. ఆమె శ్రీ శివదేవయ్య దేశికులు భావం అర్ధంచేసుకున్నది. ఆ మరునాడు శ్రీశ్రీ జాయపమహారాజులవారు మధుమావతితో, తన రాణివాసంతో సంగమేశ్వర పుణ్యక్షేత్ర దర్శనానికి పరివార యుక్తులై బయలుదేరారు.

13

రుద్రదేవి తిన్నగా అభ్యంతరమందిరం చేరి, కవచాదులు చెలులు విప్పగా, మరల జవ్వనియై, స్నానగృహానికి వెళ్ళింది. స్నానమాచరించి కులదేవతయైన కాకతీదేవి పూజచేసి, భోజనం పూర్తిచేసి, విద్యామందిరంచేరి పీఠమధివసించి, ఏవో గ్రంథాలు చెలులచేత తెప్పించుకొని, చదువుకొనుట ప్రారంభించింది.

ఎంత గొప్పవాడైనా, ధర్మపాలనాదక్షుడైనా, ప్రజానురంజకుడైనా, వీర విక్రముడైనా ప్రతిమహారాజు అవసానకాలమందూ, సామంతులు తిరగబడడం, ప్రక్కదేశాలరాజులు దండెత్తిరావడం, వారివల్ల ప్రజాక్షోభ కలగడం, కాటకం వస్తూఉండడం జరుగుతూ ఉంటుంది. తన తాతగారి రాజ్యకాలం ఆ కొద్దిసంవత్సరాలూ దేశం అంతా తలక్రిందులైనది. తన పెదతాతగారి చరమకాలం భీషణ వత్సరాలే.

తన తండ్రిగారు ఒక్కొక్కసంవత్సరము ఒక్కొక్కవైపు యుద్ధయాత్రసలిపి ఒక్కొక్కదేశం జయిస్తూ, ఈ సామ్రాజ్యము నిర్మింపవలసి వచ్చినది. నతనాటిసీమ ప్రభువు మేనత్తభర్త; వెలనాటివారు సవతి మేనమామలు. చాళుక్యప్రభువులు తమ కెప్పుడూ అనుకూలురు. ఆరువేలనాడు గిరిసీమ కొండపడమటి తూర్పుసీమలు తమకు చుట్టాలు. సింధనాటిసీమ పాకనాటిని మార్జనాటిని జన్నిగప్రభువు రాజ్యం చేస్తూవుండెను. ఆయన రాజభక్తి తంగయసాహిణి రాజభక్తికి వన్నెలు దిద్దుతుంది. ఇటు మానువ నాటి సీమలో రాజద్రోహం పూర్తిగా తలఎత్తింది. ఒక ప్రక్క ఈ గజదొంగ గన్నారెడ్డి, వేరొకప్రక్క అతని పినతండ్రి లకుమయమహారాజు యుద్ధం చేయబోతున్నారు. గన్నారెడ్డి ఎంత గజదొంగ అయినా సాధ్యమైనంతవరకు ప్రజా సంహారం లేకుండా వైరిసంహారముమాత్రం చేస్తున్నాడు. అది అంతవరకు నయం. ఈలా రాజ్యాలు పాలించేవారి తలపై ఉన్నభారం శేషునిభారానికి వేయిరెట్లవుతున్నది. రాజుల కెందు కీ ఆశ! ఈ ఆశతో ఎన్ని సామ్రాజ్యాలు జన్మించి నాశనమవుతున్నవి! రాజ్యాలకోసం బలమైనవాడల్లా ప్రయత్నంచేస్తూ తోటిరాజుల్ని, తనసైన్యాల్నీ హింసిస్తూ శాంతియుతమైన దేశాలలో సంక్షోభం తీసుకువస్తూ ఉంటారు.

రుద్రదేవి తాటియాకులపుస్తకం చూస్తున్నా, ఆమెమనస్సు ఈలా ప్రపంచ యాత్ర చేస్తున్నది.

ఆమె ఈ దినాలలో తన నగరిలో యువతి. మహారాజసభలో పురుషుడు! ఆమెకు శ్రీ శివదేవయ్య దేశికుల భావం పూర్తిగా అర్థమైనది. ఆమె సంపూర్ణ స్త్రీయై, ఆ ఉత్తమపురుషుడు, .... ఆ ఉత్తమచాళుక్యుడు.... ఆ.....ఆ చాళుక్యవీర భద్రుని ఎదుట నిలుచున్నది.

చాళుక్యవీరభద్రమహారా జానాడు తన్ను సంపూర్ణస్త్రీగా తోటలో చూచుట కామె పొందిన యానందము వర్ణనాతీతము. ఎప్పు డా మహాభాగుడట్లు ప్రత్యక్షమైనాడో, ఆ శుభముహూర్తములో తనలో ఉన్న అనంతానుమానాలన్నీ సూర్య కాంతికి మంచుకరిగినట్లు కరిగిపోయాయి. ఆ దివ్యపురుషుని ఎదుట తన జనకుడూ, తానూ, తనచుట్టూ నిర్మించిన పురుషత్వదుర్గకుడ్యాలు, బురుజులు రాలిపోయినవి. తాను స్త్రీయై జన్మించినకథకు, ఫలశ్రుతి అమృతకలశోపమానమై ఆనాడు ప్రత్యక్షమైనది. తన ఒడలు ఝల్లుమన్నది. తన దేహము ఉప్పొంగినది. తన హృదయము. మత్తిల్లినది. కన్ను లరమూతలు పడినవి. తన పెదవులు వణకిపోయినవి, ఫాలమున చిరుచెమ్మటలు పోసినవి. కంఠాన మధుబిందువు లలమిపోయాయి.

ఆ సాయంకాలము తా నెట్లింటికి వచ్చినదో? ఇంతలో దేశికులూ, ఆ ప్రభువూ తన్ను రుద్రదేవమహారాజుగా చూడడానికి వచ్చారు. లొంగని గుండెను దిటవుపరచుకొని వారికి తాను దర్శన మిచ్చింది. వారితో మాట్లాడిన ఆ కొలది కాలమూ తనకు అసిధారావ్రత నిర్వహణ మయినది.

తా నా మహాపురుషుని ప్రేమించుచున్నమాట నిశ్చయము. భగవంతుని మనం ప్రేమించమా? అంతియ ఈ ప్రేమయున్నూ, దూరాన్నుండే అ దివ్య పురుషుని ప్రేమిస్తూ, ఈ రాజ్యనిర్వహణరథం నడుపుకుంటూ, తనధర్మం తాను ఆచరిస్తుంది. అవివాహిత అయిన స్త్రీకి రాజ్యార్హత లేదంటారు. తన కా భాగ్యమే కలిగితే ఏ రాజక్షోభమూలేని సాధారణకన్యయై, జీవితరహస్యం తాను తెలుసుకోగలదు.

తన తండ్రి, తన గురువులు ఇరువురూ తా నెన్నిసారులు తన కీ రాజ్యం అక్కరలేదన్నా, ‘నీవు రాజ్యభారం వహించవలసినదే’ అని ఖండితముగా చెప్పినారు. తాను తండ్రిమాట వ్యతిరేకించడానికి సాహసించినా, భగవంతుని అవతారమైన గుర్వాజ్ఞ ఎట్లు వ్యతిరేకించగలదు?

సామంతులలో కుట్రలు, రాజద్రోహం; ప్రజలలో కలహాలు, వ్యాధి కాటకాల విజృంభణ, అతివృష్టి, అనావృష్టి బాధలు పొరుగురాజ్యాలవారి కాంక్ష ఇవన్నీ భరించవలసిన రాజధర్మ మెంత భయంకరము?

తాను స్త్రీయై, ఆనందజీవితయాత్రోన్ముఖవధువై, గృహిణియై, బిడ్డల తల్లియై, బహుకుటుంబినియై, సంసారయాత్ర సాగించవలసిన బాలిక! ఈలా కఠిన రాజ్యధర్మము నిర్వహించడం ధర్మవ్యతిరేకం కాదని తన గురువులిరువురూ తలవడం ఏలా పొసగిందో తన కిప్పుడు గ్రాహ్యంకాని విషయమే అయినది. అట్లు చేయకపోవడ మధర్మమనికూడా దేశికులు బోధించాడు. ‘రాజ్యార్హతకలిగి రాజ్యం చేయనివాడూ, ఋతుస్నాతయై పతినికోరిన భార్యను జేరనివాడూ, కలిగి యుండి అన్నార్తునకు భోజన మిడనివాడూ ఘోరపాపాల నాచరించినవాళ్ళు’ అని గురువుగా రుపదేశించారు.

తాను స్త్రీయని ప్రకటించి దేశికులు మంచిపనిచేశారు. తనకు సోదరులు లేనప్పుడు, తండ్రికి సోదరులు లేనప్పుడు, పెదతాతగారికి బిడ్డలు లేనప్పుడు, కాకతీయవంశానికి తా నొక్కతే రాజ్యార్హతకలదని నిర్ణయింపబడినయపుడు తాను రాజ్యం స్వీకరింపకుండా ఏలా ఉండగలదు?

ఈ విషయమై తనకూ, తండ్రిగారికీ, తమ దేశికులకూ దీర్ఘవాదోప వాదాలు జరిగినవి. తాను తనతండ్రివెనుక రాజ్యం చేసితీరవలసివచ్చింది. అలాటి ధర్మనిర్ణయం జరిగినవెనుక తన సర్వశక్తులతో మనోవాక్కాయ కర్మలచే ఆ ధర్మాన్ని ఆచరించితీరుతుంది. అది తన తపస్సు, తన జీవితం. తన ఆత్మ.

అలాంటి తపోమయ జీవితంలో పురుషుడు ప్రవేశించడానికి తావేది? పురుషుడుగా, హృదయేశ్వరుడుగా, ఆత్మనాథుడుగా తనకు ఈ రెండు మూడు నెలలలో ప్రత్యక్షమైన ఆ దివ్యుడు తనకు కాడు. ఆ రూపము, గంభీరకంఠ మాధుర్యము తనకు దూరం కావాలి.

“స్వయంభూనాథా! నేను అబలను. అసహజమైన పురుషధర్మం నేను నిర్వహించాలి. యుద్ధంలో సైన్యాలను నడిపించుకొని విరోధులపై దండెత్తి, పరస్పర విరోధిసైనికులు, నాసైనికులు నాశనమవుతూంటే చూడాలి! “తండ్రీ! స్వధర్మమూర్తీ! ధర్మరక్షణకోసం స్త్రీ పురుషులను శిక్షించాలి. బంధించాలి. ఎలా తప్పగలదు నీ ఆదేశం? అకుంఠితమైన ఈ భయంకర ధర్మం ఎంతకాలం నిర్వర్తించగలను?

“నాలోని సౌందర్యం నాశనమైపోవుగాక! నాలోని కాంక్షలు నుసిగా రాలిపోవుగాక! నా మనోనాయకుడు నాకు దూరమగుగాక!

“రాజ్యము వదలడానికి వీలులేదు. పురుషుని వదలలేను.

“ఈ కోలనైన చక్కని నామోము, రేఖలు ప్రవహించే ఈ దేహము, పొంకాలు తిరిగిన ఈ అంగాలు కృంగి, కృశించి, కర్కశరేఖలు తాల్చి నేను కురూప నగుదునుగాక!”

14

రుద్రదేవికి కన్నులనీరు జల జల ప్రవహించింది. ఆమెకు తా నర్జునుని నిర్వేదానికి లోనయిపోయినట్లు స్పష్టంగా తెలుసును. అయినా పొంగిపొరలి వచ్చే దుఃఖాన్ని ఆమె ఆపుకోలేకపోయింది. ఆమెను ధైర్యము పటాపంచ లయింది. ఏ చెలిఅయినా, సేవకురాలయినా చూస్తూరేమో అన్న సిగ్గు, కళ్ళు తుడుచుకుంది. కళ్ళు ఎఱ్ఱబడినాయి.

అలా క్రుంగిపోయి, ఆమె దీనహృదయై ఉన్న సమయంలో, ఆ కుతప కాలంలో శ్రీ రుద్రదేవప్రభువును దర్శించడానికి శ్రీ మల్యాల కుప్పమాంబికా దేవి, అన్నాంబికాదేవితో బంగారుపొదిగిన అందలాలనుండి నగరిప్రాంగణంలో దిగారు. వెంటనే ద్వారపాలకులు వారిని సగౌరవంగా తోడ్కొని అభ్యంతర మందిరాలలోనికి తీసుకొనిపోయి స్త్రీసభామందిరంలో కూర్చుండబెట్టినారు.

ఒక దౌవారిక పోయి విద్యామందిరకవాటందగ్గర నమస్కారం చేస్తూ ‘జయ జయ! శ్రీ మహారాజులంవారికి. శ్రీ మల్యాల కుప్పమాంబికాదేవి, శ్రీ అన్నాంబికాదేవి మహారాజుల దర్శనానికి వేంచేశారు’ అని మనవి చేసింది. ఆమాట వినడంతోటే రుద్రాంబికకు ఎక్కడలేని ధైర్యమూ కమ్ముకుంది. ‘వారిని సభాగృహంలో కూర్చుండబెట్టు’ మని ఆజ్ఞాపించి లేచి, విసవిసనడచి స్నానగృహం చేరి మోము కడుగుకొని దాసి అందిచ్చువస్త్రాన తుడుచుకొని, ఆమె కుప్పాంబిక, అన్నాంబికలు కూర్చొనిఉన్న స్త్రీ సభాశాల చేరింది.

దివ్యరూపంతో వచ్చిన ఒక బాలికనుచూచి మహారాణి ముమ్మడాంబికా అనుకున్నారు వా రిరువురూ! కాని వారు ముమ్మడాంబికను చూచే ఉండిరి. అంతకన్న పొడుగరియై దేవతాకన్యలా వచ్చిన ఈ బాల ఎవరు అని వారిద్దరూ తత్ క్షణమే లేచి ఆమెకు నమస్కరిస్తూ నిలుచున్నారు. రుద్రాంబ నవ్వుతూ చరచరా వారిరువురికడకు వచ్చి ‘ఏమమ్మా, అలా తెల్లబోయి చూస్తున్నారు. న న్నానవాలు పట్టలేదా?’ అని ప్రశ్నించి. ‘కూర్చోండి’ అంటూ తాను వారి ప్రక్కను అధివసించింది.

అప్పటికి రుద్రాంబమోములోని రేఖలు గమనించి, మాటలు విని వారిరువురూ ఈమె రుద్రమహారాజ్ఞి యని గ్రహించి అత్యంతాశ్చర్యం పొందినారు.

వా రిరువురూ రుద్రమహారాజ్ఞి పాదాలకు నమస్కరించినారు. రుద్రాంబిక వా రిరువురిని లేవనెత్తింది.

కుప్పాం: ఈమె అన్నాంబిక, శ్రీ కోటారెడ్డి మహారాజు కొమరిత!

రుద్ర: అవును, లకుమయ్యకుమారుని వివాహం చేసుకోవడానికి ఇష్టం లేకపోతే, మీరు ఆదవోని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీతో పారిపోయి వచ్చిన బాలిక. అన్నాంబికాకుమారీ! నీధైర్యమూ, సాహసమూ నా కెంతో ఆనందం కలుగజేసినాయి. మీరంతా ఈ నగరం రావడమూ నాకు తెలిసింది.

కుప్పాం: మహా .... మహా .... మహా ....

రుద్ర: మహారాణీ! అని పిలువుతల్లీ! మీకు భయమేమి? నేను ఇప్పుడు రాజునూకాను, రాణినీకాను, వట్టి రుద్రమ్మను!

కుప్పాం: మహారాణీ, తమ దయ అనుపమానం! ఈ బాలికను వెంట బెట్టుకొని మేము వచ్చినదినాలలో తమదర్శనం చేద్దామని సంకల్పించుకొంటిని. కాని ఇరువురు గజదొంగల అక్కనయిన నేను తమదర్శనం చేసుకోడానికి ధైర్యం లేకపోయింది.

రుద్ర: మరి యిప్పు డెలావచ్చింది ధైర్యం?

కుప్పాం: ఈ అన్నాంబికా కుమారి నన్ను దినదినమూ వేగిరపెట్టింది మ.... మహా..... మహారాణి!

రుద్ర: (చిరునవ్వుతో) కుప్పాంబికాదేవీ! మీకు ఇంకా అనుమానం వదలలేదు. నన్ను రుద్రాంబికా అనే పిలిస్తే ఆనందం పొందుతాను.

అని ఆమె మందహాసవదన అయింది. అన్నాంబికాకుమారి ఇంతలో చటుక్కునలేచి రుద్రాంబిక పాదాలకడ మోకరించి, మహారాణీ, గన్నారెడ్డి ప్రభువు ఉత్తమవీరుడు, సుగుణసంపన్నుడు, అలాంటి ఆ ప్రభువూ, సర్వవిధాలా వారికి దీటువచ్చే విఠలధరణీశుడూ ఏలా దొంగలయ్యారో నాకు అర్ధంకాలేదు. వారు నిజంగా గజదొంగలు కారు. మహారాణులవారు తమకు సహజమైన అపార కరుణతో వా రిద్దరినీ వారి అనుచరులతో క్షమిస్తే వారంతా తమసైన్యంలో చేరుతారు. శ్రీ గన్నారెడ్డి మహారాజు తమ కుడిచేయి కాగలడు మహారాణీ! వారి నందరినీ క్షమించండి’ అని కన్నుల నీరు ప్రవహింప ప్రార్ధించినది.

రుద్రాంబికాదేవి అన్నాంబిక మోము తీక్ష్ణంగా పరిశీలించి, ఒక్క నిమిషం పక పక నవ్వుతూ అన్నాంబికను గ్రుచ్చి ఎత్తి కౌగిటచేర్చుకొని, ‘అన్నాంబికాకుమారీ! నువ్వు వట్టి బేలవమ్మా! కరిగిపోయే హృదయం నీది! నువ్వు ప్రార్థించిన విషయం నేను బాగా పరిశీలించి తగినపని చేస్తాను.’ అంటూ ప్రక్కన కూర్చుండబెట్టుకొన్నది. రుద్రాంబిక కుప్పాంబికాదేవి వైపు చూచి, కన్నుమూసి తెరిచింది. ఆమెయు అవునన్నట్లు కన్నుమూసి తెరిచింది.

రుద్ర: అయితే! నేను శ్రీ శివదేవయ్య దేశికులవారిని ఈ విషయం పూర్తిగా విచారించి గన్నయ్యప్రభువుతో రాయబారాలు సాగించమంటాను.

కుప్పాం: మహారాణి! మా తమ్ములిద్దరూ పసివాళ్లు. మూర్ఖులై అలా గజదొంగలని అపకీర్తిపాలైనారు.

రుద్ర: కుప్పాంబికాదేవి! గన్నయ్యప్రభువు మూర్ఖుడంటే నేను ఒప్పను. రాజ్యాలు ఎల్లా స్థాపన అవుతున్నాయి? రాజులందరమూ బ్రహ్మ దేవుని భుజంలోనుంచి వచ్చారని నమ్ముతున్నారా? రాజరికం విశ్వపురుషుని భుజాలు అన్న ఉత్తమభావాని కది వ్యాఖ్యానం! పురాణాలు చదవలేదా దేవీ? ఎన్ని రాజవంశాలు రాలేదు, పోలేదు? శివదేవయ్య మంత్రులవారు మా కాకతీయ వంశచరిత్ర నాకు చెప్పారు. బొట్టభేత ప్రభువు మా పూర్వికు డెల్లాగో మాండలీకు లయ్యారు. ఆయన కంచిపల్లవులకు మాండలీకుడు! ఆయన చిన్నతనంలో విరోధులు వారి రాజ్యమైన అనుమకొండ , కొఱవిదేశం ఆక్రమించుకొంటే ఆయనకు సామంతులైన విర్యాల ఎఱ్ఱనప్రభువు ఆ విరోధిని జయించి కొఱవిదేశంలో మా పూర్వికుని సింహాసనం ఎక్కించి చనిపోయాడట. ఆతర్వాత ఎఱ్ఱప్రభువు భార్య కామమసాని తాను స్వయంగా సేనలు నడిపి, కాకతీయ మండలమైన నబ్బిసాహిర మండలం ఆక్రమించిన విరోధుల నాశనంచేసి ఆ బొట్టభేతప్రభువును తిరిగి కాకతిసింహాసనం ఎక్కించింది.

అన్నాంబిక: మహారాణీ! కాకతీయవంశము భగవంతుని దయవల్ల రాజ్యం సంపాదించినది.

రుద్ర: కుమారీ! రాజ్యాలు సంపాదించినవా రందరూ భగవంతుని దయవల్ల సంపాదించినవారే. ఈ భూమండలం ఏలే రాజులందరూ సూర్య వంశస్థులో, చంద్రవంశస్థులో! మనం అంతా ఆర్యధర్మం త్యజించిన దుర్జయ వంశస్థులం! మనం అంతా ఆర్యధర్మం తిరిగి గ్రహించినా యజ్ఞోపవీతం తీసివేయడంమూలాన సుక్షత్రియత్వం పోగొట్టుకొని, మనుమకులజులమై పోయాము. గన్నారెడ్డి ప్రభువు మాకు తెలిసినంతమట్టుకు ఏవిధమైన గజదొంగ తనమూ చేయలేదు. అల్లా చేసినట్లయితే శిక్షిస్తాము. లేకపోతే నెమ్మదిగా చెప్పించి రాజధానికి రప్పించుతాము.

అన్నాం: వారిరాజ్యం వారి కిప్పించరా మహారాణీ?

రుద్ర: గన్నారెడ్డి అలా పారిపోకపోతే ఇప్పించిఉండేవారమే. అతడు తాను వీరుడననుకొని పృథ్వీరాజ్యం వీరభోజ్యమని, స్వయంగా రాజ్యం తిరిగి సంపాదించుకోవాలని అనుకున్నాడేమో? వీటి అన్నిటికీ ఏమిగాని అన్నాంబికా రాకుమారీ! నువ్వు నాతో కొద్దిదినాలు ఉండుతల్లీ! కుప్పాంబికాదేవీ నాకోర్కె పాలించి ఈ బాలికను నాతో కొన్నిదినాలు గడపనీయండి.

కుప్పాం: మహారాణీ! తమ ఇష్టమే మాకు శాసనం. అవశ్యం ఉంచుకోండి. అమ్మాయి కవయిత్రి, అద్భుత గాంధర్వవిద్యా విలాసిని. ఆమెను మీరు వినితీరాలి.

15

ఆ సాయంకాలము రుద్రాంబ, అన్నాంబికా తోటలో విహరించారు. ఆ రాత్రి చుక్కలక్రింద కూర్చున్నారు. అన్నాంబిక రుద్రదేవికి తాను రచించిన పాటలు వీణ వాయిస్తూ మధురకంఠంతో పాడి వినిపించింది.

1

“శివుని శిఖపై వెలుగి చిన్నారి నెలవంక
 భవురాణి భ్రూమధ్య ప్రసరించి వెలుగు
 శివుని పెదవులనాడు ధవళ చంద్రజ్యోత్స్న
 భవురాణి చూపులో పర్వి లోకము నిండు.
 నా వియోగములోన నాతి వెన్నెలయేది?
 నా నవ్వులని చేరె నళినాక్షి చంద్రుణ్ణి.

2

“దొంగవాడట కృష్ణుడూ వెన్న
 దొంగిలించెడువాడె వెన్నుడూ
 దొంగలకు గురువటే దొంగలకు దేవుడటె
 అంగసల హృదయములు దొంగిలించెడువాడె
                                      దొంగవాడట......
 వలువలను హరియించి వనిత ఎక్కెనె పొన్న
 కలగని మనసుతో చెలువ వేణువునూదు
                                   దొంగవాడట.......

ఈ పాటలను పాడుతూఉంటే అన్నాంబిక కంఠంలోనుంచి ప్రవహించిన గాంధర్వవాహిని అలకనందలా అత్యంతశీతలమై భయంకరమై గజగజ వణికించింది. రుద్రాంబిక అన్నాంబికను తన హృదయాని కదుముకొని గట్టిగా కౌగిలించు కొంది. రాజ్యరథాశ్వపాశాలను ధరించిననూ కోమలమైన తన రెండుచేతులా అన్నాంబిక చెంపలబట్టి మోమెత్తి ఆమె కన్నులలోకి చూచి ‘చెల్లీ! నీవున్నూ నావలెనే బాధపడుతున్నావా? మనకన్న వ్యవసాయం చేసుకొనే రెడ్డిబిడ్డ నయంకదూ? నీ హృదయం అంతా నా కర్థమైంది. నీ తండ్రికి విరోధీ - గజదొంగా, నీ సార్వభౌమునకు విరోధీ - అపఖ్యాతికి నీడై వెన్నాడేవాడూ నాయకుడా? కష్టసుఖాలు దరికిచేరని రాణివాసంలో కుసుమకోమలి, ఒక మనోహరాంగి - నాయికా? ఈలాగే ఉంటాయి తల్లీ లోకంపోకడలు.’

“ఒక సార్వభౌముని కొమరిత, భావిచక్రవర్తిని - నాయిక! ఉత్తమ సామంతుడు, వీరుడూ - నాయకుడూ. స్త్రీలకు స్వాతంత్య్రం లేదు. అక్కగారూ! పురుషులకు స్వాతంత్య్రం ఉందంటాము. నిజంగాలేదు. పురాణాలలో ఒకరికై ఒకరు పుట్టి, ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు చేరడానికి ఎన్నో బాధల నంది చివరకు మనోరథసిద్ధి పొందుతారు. కాదా అక్కగారూ?”

“కాళిదాస కుమారసంభవంలో పార్వతి శివునికై విరాళి - లాభంలేక తపస్సు - అప్పుడు శివుడు పార్వతిని ఇదివరకే ప్రేమించి ఉన్నాడు గనుక వివాహం చేసుకుంటాడు. రామునికై సీత ఉద్భవించింది, వారిద్దరివివాహము అడవుల పాలు - లంకానగరశోకవనవాసం, లంకాయుద్దం - అగ్నిపరీక్ష - పట్టాభిషేకం! మన చరిత్రలు అల్లాఎందుకుంటాయి చెల్లీ? మనకీ రాజ్యాలు వద్దు. చక్కని నగలు, అందమైన వస్త్రాలు, ముద్దులుగులికే బిడ్డలు, కోరినభర్త! అవీ కావలసినవి. మనలో బడాయి లున్నాయి. గర్వం ఉంది. రాణులుగా ఏడాదికోసారి మనం నగలతో, అద్భుతమైన వస్త్రాలతో ప్రజల కంట బడుతాము. అప్పుడేగద మన అందాలను, ఐశ్వర్యాలను లోకమూ, లోకంలోని స్త్రీలూ చూచి మెచ్చుకొనేది చెల్లీ!”

అన్నాంబిక నిట్టూర్పు విడిచింది.

“ఇంకముందు మన జీవితం మన నాథులు, మన బిడ్డలు, సాధారణ భార్యలులా మనం భర్తజీవితంలో జీవితమై, అతని సంతోషం, అతని పాటు, అతని కృషి, అతని చెమట, అతని బాధ, అతని పశుత్వము చూచి, అతడు మన కృషీ, మన మాతృత్వము, మన దాసీత్వము, మన సంతోషం, మన బాధ, మన ఆట, మన పాట చూస్తూఉండగా - నాగలి లాగే రెండు పశువులూ, పడవను నడిపే చుక్కానీ గాలులుగా జీవితయాత్ర సాగించడానికి వీలుందా చెప్పు!”

అన్నాంబిక ఆశ్చర్యంతో మహారాణిని చూచింది.

“అంతఃపురాలలో పంజరాలలోని చిలుకలులా ఉండి, భర్త ఎప్పుడు వస్తే అప్పుడు పుత్తడిబొమ్మలులా వేషాలు వేసుకొని, మన అందాలు, మన భూషణాలు, మన చీరలు చూచేది మన దాసీలే అయినా సపత్నుల గొడవలలో పడి, కృంగి, కృశించి, మనబిడ్డలకు మనం పాలిచ్చుకోవడానికి వీలులేక, మన వంటలు మనం తినడానికి వీలులేక, అవసరమైన కూరలు, భక్ష్యాలుతింటూ, ఆరోగ్యంలేక, అందంపోయి నగలూ, చీరలే అందాలైతే రహస్యంగా ఏడ్చి ఏడ్చి కావ్యాలలోనూ శాసనాలలోనూమాత్రం ఎక్కి అదే పదివేలనుకొని సంతోషీస్తాం చెల్లీ!”

అన్నాంబిక కన్నుల నీరు క్రమ్మెను.

“రాజ్యంకోసం ఆ రాజకొమరుని పెండ్లి చేసుకోవాలి మనం! ముక్కూ మొగం ఎరుగము మనం. రాజ్యాలు పాలించే ప్రభువుల బిడ్డలము, రాజ్యాలు పాలించే ప్రభువుల భార్యలము, రాజ్యాలుపాలించే బిడ్డల తల్లులము. అందుచేత మన చుట్టూ గోడలు, మనపైన గోడలు, అనుకున్నచోటికి వెళ్ళడానికి వీలులేదు. వెళ్ళడానికి ఇష్టంలేకపోయినా, వెళ్ళవలసినచోటికి వెళ్ళితీరాలి.”

అన్నాంబిక రుద్రదేవి ఒళ్ళో వాలిపోయింది.

“రాజ్యాలకోసం అన్నదమ్ముల పోట్లాట, నాశనంచేసుకొనడం, మామకూ, అల్లుడికీ, బావమరదులకూ యుద్ధాలు - కౌరవయుద్ధం! చాళుక్య గణక విజయాదిత్య రాష్ట్రకూట కృష్ణరాజ యుద్ధం! ఏమి భయంకరమమ్మా ఈ రాచపుట్టువు?”

ఈ ఉపన్యాసం అంతా తెల్ల బోయి విన్నది అన్నాంబిక. ఆ బాలిక కన్నుల దొనదొన నీరు పొంగింది, జలజల అశ్రులు రాలిపోయాయి. రుద్రదేవి ఒడిలో తలపెట్టుకొని, నిర్వచింపరాని ఆవేదనతో కరిగిపోయింది రుద్రదేవి ఆ బాలికను మళ్ళీ కౌగిలిలోకి తీసుకొని “చెల్లీ, ఈ క్షణంలో నేను ఆంధ్ర సామ్రాజ్యానికి రాజప్రతినిధినీకాను, నువ్వు ఆదవోని మండలేశ్వరుల తనయవూ కావు. నువ్వు బాలికవు, నేను బాలికను. నువ్వు గన్నారెడ్డిని ప్రేమిస్తున్నావు. నేను చాళుక్య... చాళుక్య వీరభద్రుని ప్రేమిస్తున్నాను. నువ్వు కొంచెం నాకన్న నయం....”

అన్నాంబిక తలఎత్తి - కంటనీటితో ఉన్నా - మోము ప్రపుల్ల మై వికసించి వానతో తడిసిన పూర్ణకమలంకాగా నవ్వుతూ ‘మహారాణీ.....’ అని ఏదో చెప్ప బోయింది. వెంటనే రుద్రదేవి ఆ బాలిక నోరు మూసి “చెల్లీ, ఒంటరిగా వున్నప్పుడు, నేను నిన్ను ‘చెల్లీ!’ అంటాను. నన్ను నువ్వు ‘అక్కా!’ అని పిలు, తెలిసిందా? లేకపోతే నేను నువ్వు ఊహింపలేని బాధపడతాను. ఇది మనిద్దరి మధ్యా రహస్యం తల్లీ!” అన్నది. అప్పుడు అన్నాంబిక పకపక నవ్వుతూ లేచి నాట్యంచేస్తూ,

“తెలిసిందమ్మా నాకొక తియ్యని కమ్మని రహస్యమూ,
 దీనులపాలిటి మందారమ్మొక దేవికి మెత్తని హృదయమ్మూ;
 బంగారపు బొమ్మలకైనా పల పల మనునే ప్రణయమ్మూ
 పుత్తడి బొమ్మకు హృదయములోనే పురుషుడొక్కరు నివాసమ్మూ”

అని కిలకిల నవ్వింది

రుద్రదేవి ‘దొంగపిల్లా, అల్లరిచేస్తావా? నీపని ‘పడతా ఉండు’ అంటూ పీఠంనుంచి లేచి పరుగున వచ్చింది. అన్నాంబిక అందకుండా పరుగెత్తింది. రుద్రమ్మ తరిమింది. వా రిద్దరూ ఆ మందిరంనుంచి ఇంకో మందిరంలోకి పరుగిడిరి.

16

ఆ రాత్రి వా రలా పరుగెత్తుతూ ఉంటే, మహారాణి ముమ్మడమ్మ అక్కడకు వచ్చుటకు అనుమతి వేడుతూ ప్రతీహారిణిని పంపింది. చిన్నబిడ్డలా ఆటలాడుకొను రుద్రదేవికడకు దాసీలు ఎవ్వరును రా వెరచినారు. ఒక కొత్త ఆపె ఎవ్వరో దూరాన భయభక్తులతో నిలిచి ఉండడం అన్నాంబిక కనిపెట్టింది.

వగరుస్తూ, నవ్వుతూ అన్నాంబిక రుద్రదేవికడకు పోయి ‘అక్కా, ఎవ్వరో నీకోసం వచ్చారమ్మా’ అని తెలిపింది. రుద్రదేవి అన్నాంబిక దృష్టివైపు పరికించి ముమ్మడమ్మ ప్రతీహారిణిని చూచి అన్నాంబికను దగ్గరకు లాక్కొని ‘చెల్లీ! అల్లా పిలవాలి నన్ను; లేకపోతే నీపని పట్టించిఉందును. ఇక నా కొమరిత, నా చెల్లెలు, నా భార్య అయిన ముమ్మడాంబికను చూద్దువుగాని’ అంటూ రుద్రాంబిక ఆ ప్రతీహారిణిని దగ్గరకు రమ్మని సైగచేసి ‘మహారాణిగారు మా అలంకారమందిరంలోకి వస్తారుగాక! వారిని మేము ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము’ అని తెలిపింది.

ఆ ప్రతీహారిణి భక్తితో తలవంచి వెనుకకు నడుచుచు ముమ్మడాంబికాదేవి నగరిలోనికి వెళ్ళిపోయింది.

రుద్రదేవియు, అన్నమదేవియూ అలంకారమందిరంలోకి వెళ్ళినారు. అక్కడ వారు కూర్చుండి మాటామంతీ చెప్పుకుంటోంటే ఘల్లు ఘల్లుమని బంగారుగజ్జెలు చప్పుడుకాగా ముమ్మడమ్మ చెలికత్తెలతో గుమ్మందగ్గరకు వచ్చింది. చెలులు గుమ్మంకడనుంచి వెనక్కు వెళ్ళారు. ముమ్మక్క లోనికి వచ్చింది.

ఆమె లోనికి రాగానే రుద్రదేవీ, అన్నాంబికా లేచిరి. రుద్రదేవి ముమ్మడమ్మకు అన్నాంబికను చూపిస్తూ ‘దేవీ! ఈ బాల ఆదవోనిప్రభువుకు ఏక సంతానం, అన్నాంబిక. మన చెల్లెలు సుమా!’ అని తెలిపింది. ముమ్మడమ్మ పాదాలకు అన్నాంబిక నమస్కరించింది. ముమ్మడమ్మ నవ్వుతూ అన్నాంబికాదేవిని భుజాలతో లేవనెత్తి ‘చెల్లీ! నువ్వూ, నా భర్తగారూ ఆడుకుంటూ ఉండడము నాకు దాసీల వల్ల తెలిసింది. మా భర్తగారితో ఆటలాడుకొనేందుకు ఇంకో భార్య వచ్చిందేమో అని భయపడి, ఉడుకుబోతుతనంతో చక్కావచ్చాను’ అంటూ పక పక నవ్వింది.

ఆ ముగ్గురు బాలికలు విరగబడి నవ్వుకున్నారు. ఆనందంతో ఉప్పొంగి పోయారు. వారి హృదయాలు త్రివేణీ సంగమం అయ్యాయి. ముమ్మడమ్మా, రుద్రమ్మా మరింత సన్నిహితులగుటకు అన్నాంబిక కారణం అయింది. వారు దాగుడుమూత లాడుకొన్నారు. కథలు చెప్పుకొన్నారు. రుద్రదేవి తన మధురకంఠంతో పాటలు పాడింది. కర్షకవధువులవలె ఆడుకున్నారు.

రుద్ర: ఒసే పిల్లా! నేను పొలం ఎల్ల వల్సిందిగదా ఇంతకూడైన ఎట్టవేంటి?

ముమ్మ: నే నేటి సేసేది మారాజా! నన్ను మీ సెల్లెలు అన్నమ్మ వొన్నం వొండనిస్తే గంద.

అన్న: ఓరబ్బో! ఏటిమాటలు సెప్తుండవు వొదినా! నా అన్నకీ నాకూ తగువులాటెట్టి....

రుద్ర: నిన్ను అత్తింటికి పంపేయాలని సూస్తున్నదిగందా.

ముమ్మ: మా ఆడబిడ్డకు భరత ఎక్కడుండాడు?

రుద్ర: ఏమో ఏ అడవుల్లో వుండాడో?

అన్న: లేకపోతే ఏ రాచకొలువులో ఉండాడో!


ముమ్మ: ఓయి మారాజ!

            సద్దికూడూ మెక్కి సల్ల గుండావూ
            పొద్దెక్కినాదయ్య పొలమెల్లి పోవూ?

   రుద్ర: నారాణిసూస్తుంటె నాగుండెకొట్టు
           ఏరు వొరిణింతురే నిన్నోసి ఒట్టు

   అన్న: ఒకరంద మొకరిలో ఊగిపోతూ ఉంటె
          ఒయ్యారి నావొదినె ఒదలగలడే అన్న!

తమ పాటలకు తామే కలకలలాడేరు. రుద్రమ్మ ముమ్మడమ్మను చూచి ‘పెద్దచెల్లీ! ఈ రాత్రి ను వ్విక్కడే ఉండు. కాని నీ రహస్యం ఓటి నాకు తెలిసి పోయిందిలే! నేను భర్తను ఉండగా ఎందుకమ్మా మొన్న నా పట్టాభిషేక సమయంలో ఒకర్ని అంతదీక్షగా పారకించావు?’ అని ప్రశ్నించింది.

ముమ్మ: చూడు చెల్లీ! ఈ అక్క ఏమంటున్నదో! తాను పురుషుడై, రాజప్రతినిధై సింహాసనం ఎక్కి కూర్చున్నదీ! ఎదురుగుండా ఒక అందగాడు రాజప్రతినిధిని చూచి నిట్టూర్పులు విడవడమా? ఆ అబ్బాయినిచూచి రాజప్రతినిధి గారికి నిట్టూర్పు లెందుకు?

రుద్ర: అవునవును. ఆ అబ్బాయిగారి పక్క ఓచిన్నబ్బాయి సింహాసనం అధివసించి ఉంటే, ఆ చిన్నబ్బాయిని చూచి నిట్టూర్పులు ఓ తాయిలంగారే విడిచి అదంతా నామీద త్రోయడమా?

అన్నాం: హోహో! చిన్నక్కగారూ పెద్దక్కగారూ మీలోమీరు తగాదా లాడి అన్ని రహస్యాలూ వెల్లడించుకొంటున్నారా! చిన్నక్కా! ఎదుటివా రెవరు? పెద్దక్కా! ఎదుటివారి పక్కవా రెవరు?

ముమ్మ: ఎదుటివారు చాళుక్య.... రుద్ర: పక్కవారు చాళుక్య.....

అన్నాం: చాళుక్యఅంటే? ఇద్దరు చాళుక్యు లున్నారా ఏమిటి?

ముమ్మ: నాకు తెలియదు.

అన్నాం: చాళుక్యవీర....

ముమ్మ: అదే చాళుక్య...

అన్నాం: చాళుక్య మహా....

రుద్ర: అదే చాళుక్య....

అన్నా: సరేలెండి !

నాకు తెలిసిందమ్మ నాకు తెలిసింది
దొంగలిద్దరి గుట్టు దొరసాని వినవె!

రుద్ర: ఒక తాయిలంగారికి దొంగలంటే మా ఇష్టంట. దొంగ అనే మాట వినగానే వసంతంలో మల్లెలు వికసించిన ట్లయిపోతుందట!

ముమ్మ: దొంగలంటే నాకు భయమూ
            దొంగమాటెత్తేవు నయమూ!
            దొంగపిల్లా నీకు దొంగలన ప్రీతటే!
            దొంగల్ని తలచుకొని పొంగిపోతావుటే?

ముగ్గురూ తెల్ల వారేవరకూ మాట్లాడుకుంటూ ఉండిరి. రుద్రదేవి ఇరువురితో సకలాంధ్రదేశములోనూ కాకతీయవంశం అంటే కొందరు తిరుగుబాటు చేయబోతున్నారనీ, అందుకు కారణం తాను స్త్రీఅయి సామ్రాజ్య సింహాసనం అధివసింప నుండుటయే అనిన్నీ, అందుకు శ్రీ శివదేవయ్య దేశికులు, ప్రసాదాదిత్యప్రభువు ప్రతిఎత్తుకుగా చేస్తున్న కృషీ అవన్నీ చూచాయగా వివరించింది. రాజద్రోహం ఆచరించేవారి పేరులు మాత్రం బయటపెట్టలేదు.

మాటలు చెప్పుకొని చెప్పుకొని ఆ బాలలు ముగ్గురు విపులమై పాలసముద్రంలా ఉన్న రుద్రదేవి తల్పంపై ఒడ లెరుగక నిదురపోయిరి.