Jump to content

గోన గన్నారెడ్డి/చతుర్థగాథ

వికీసోర్స్ నుండి

చతుర్థగాథ

అన్నాంబిక

1

ఆయ నెంత ఠీవిగా ఉన్నారు! అవును. పూజ్యులైన గోన బుద్ధారెడ్డి సాహిణి మహారాజ పుత్రుడైన పురుషునకు మహారాజఠీవి రాకుండా ఏలా ఉండ గలదు?

అన్నాంబిక అంతుదొరకని ఆలోచనలతో తన అంతఃపురంలో సంగీత మందిరంలో దిండ్లు అలంకరించిన ఒక రత్నకంబళిపై, మెత్తని పట్టుదిండుపై ఒరిగి కూర్చుండియున్నది. ఆ మందిరమునిండా అనేక వాద్యవిశేషాలు వివిధ పేటికలలో ఉన్నవి. ఆమె ప్రక్కనే వల్ల కి ఒకటి మంజులాంగుళీస్పర్శ నాకాంక్షించి ఉన్నది. ఆ మందిరమంతా రత్నకంబళ్ళు పరచి ఉన్నవి. వానిపై పట్టుదిండ్లు అక్కడ అక్కడ ఉంచబడినవి.

అన్నాంబిక పద్మాసనం వేసుకొని కూర్చుంది వీణామతల్లిని ఒడిలోనికి తీసికొని,

“లోక భీకరులైన దొంగల
 మూకలను పాలించు అలక
 న్నాకు చరితము వల్ల కీ! పలు
 పోకలను పాడేవు తగునటె వల్ల కీ !”

అని ఒక పాట ఆలపించినది.

ఆమెకు కంట నీరు తిరిగిపోయినది. వసంతకాలంలో తొలకరి చినుకులు హృదయమందు దాచుకున్న చిన్న మేఘాలులా ఆమె కన్నుల నీరుకమ్ముకుంది.

“కొండరాళ్ళో, దండకాటవో
 ముండ్లదారులో, మండుఇసుకో
 నిండెనేమో హృదయమందున
 దండువెడలే దొంగటే?”

అన్నాంబిక సౌందర్యం ఆంధ్రలోకంలో వింతగా చెప్పుకుంటారు. అన్నాంబిక విద్య, అన్నాంబిక శేముషీసంపన్నత ధూపకరండమునుండి దెసలన్నీ కమ్మే పరిమళంలా దేశాలన్నీ ప్రసరించింది.

మహారాష్ట్ర యాదవుడు, చోళ పాండ్యదేశ దాక్షిణాత్యప్రభువులు, కదంబ గాంగులు, కుంతల చాళుక్యుడు అన్నాంబికను వాంఛించారు. అయినా కోటారెడ్డి తోటిమండలేశ్వరుని తనయునకు ఆ దివ్యశారద అన్నాంబికను ఉద్వాహం చేయ సంకల్పించాడు. కోటారెడ్డి ఆ బాలిక హృదయం ఏమి అర్థం చేసికోగలడు?

శ్రీ గణపతిదేవ చక్రవర్తి తన బాలికనే రుద్రదేవునిగా పెంచినాడని ఏలా ఊహించాడో, అలాగే తాను తన కుమార్తెను బాలునిగా పెంచాడు, అక్కడ శివదేవయ్య మంత్రి ఇక్కడ ఏడీ? తోడి ప్రభువులు నవ్వుతున్నారని అనుకున్నాడు. తన తనయమీద నిష్కారణకోపం వహించి ఎందుకో మండిపోయినాడు.

అత్యంతపాపం చేసుకొన్నవానికిగాని బాలికలు జన్మించరట, అందులో, బాలురు కలుగకుండా ఒక్క బాలికలే ఉద్భవించినవాని జన్మరౌరవాది నరక హేతువట, కోటారెడ్డి ధర్మశాస్త్రం అతని హృదయంలోంచే జన్మం పొందింది! ఆ ధర్మాన్ని పాలించే ప్రభువు ఆయనే! ఒక్కొక్కనాడు తన ఒంటి కూతును చూస్తే ఆదవోని ప్రభువుకు అపరిమిత ప్రేమ. ఒక దినం పుత్రికను, పురుషవేషంతో ఉండేదినాల్లో, తనతోపాటువచ్చి అర్ధసింహాసన మెక్కి రాజకార్యాలలో పాల్గొను మనేవాడు. మరొక్క దినాన, ‘నీవు బాలుడవై ఎందుకు పుట్టలేదు అన్నమదేవి! దుస్తరమైన నీ విధిని నేను దాటప్రయత్నం చేయడమేమిటి?’ అనేవాడు.

అన్నమదేవికి వరదారెడ్డి సాహిణిని వివాహమాడ ఇష్టంలేదని కోటారెడ్డికి దేవేరి స్పష్టంగా తెలియజేసిన సమయంలో అవు ననుకొన్నాడు. మళ్ళీ శుభముహూర్తము నిశ్చయంచేస్తున్నాము అని లకుమయారెడ్డి వార్తనంపగానే శుభ మనుకొన్నాడు.

“చిన్నబిడ్డలకు ఇష్టానిష్టములేమిటి? అన్నాంబిక ముక్కుపచ్చలారని కసుగందు. మంచీ చెడ్డా ఆమె కేమి తెలుస్తుంది? మహారాణి తనకు అన్నాంబిక ఒకర్తే సంతానం కనుక చిన్నతనాన్నుంచీ అల్లారుముద్దుగా పెంచుకొంది. అందువల్ల ఆ బిడ్డ ఏమంటే తానూ అదేఅంటుంది. రాచరికపు విషయాలు ఆడవారి కేమి తెలుస్తాయి?” అని వందిభూపాలు డన్నాడు. పాపం అంతదిట్టమైన వీరుడై కూడా అలా గన్నారెడ్డి చేతుల్లో హతమారిపోయా డేమిటి? కందవోలంతా బట్టుకొని ఆ పాపి రాజ్యం సాధించాడు: కోటంతా బాగుచేయించాడు. మహావీరుడు ఉప్పల సోమప్రభువు గన్నయతల తెస్తానని ప్రభులోకంముందు అన్నమాటలు ఎదురుతిరిగి అతని తలనే గన్నా రెడ్డి పాదాల ముందు పడవేయించాయి.

ఆ ప్రభువు శవాన్ని మంచిగంధపు పేటికలో ఆయన రాజధానికి సగౌరవంగా పంపాడట, ఆ గజదొంగ, ఆ పరమపాపికి గౌరవంచేయడం కూడా తెలుసునా? వాడుకదా పీటలమీది పెళ్ళి చెడగొట్టినాడు. వాణ్ణి, వాడి తమ్ముణ్ణి వివాహ సభామందిరంలోనే స్తంభాలకు కట్టి వివాహం వైభవంగా చేయాలి. ఆదవోని మహాప్రభువులను అవమానంచేసి బ్రతికిపోయిన మగవా డింతవరకు ఎవడున్నాడు? ఏది ఎట్లయినా అన్నాంబిక వివాహం త్వరగా ముగించాలి.

ఈ నిర్ణయానికి రాగానే ఆదవోని ప్రభువు అంతరంగికురాలైన అంతఃపురపరిచారిక నొకరితను ఆలోచనామందిరంలోనికి రా నాజ్ఞ పంపినవాడయ్యెను. ఆమె వచ్చి ప్రభువునకు మోకరించి లేచి నిలుచుండి ‘ఆజ్ఞ’ అని చేతులు జోడించినది.

“నీవుపోయి, మహారాణిగారితో రాజకుమారికి మళ్ళీ వివాహముహూర్తము స్థిరమయిందనీ, బాలికల ఇష్టా నిష్టాలు ఉత్తమ రాజకీయాలకు అడ్డం రాకూడదనీ, రాజకుమారి భక్తితో వివాహసంసిద్ధయై ఉండవలసిందనీ మహారాణి నా ఆజ్ఞగా తెలియ జేయవలసిందనీ మనవిచేయుము.”

ఆ పరిచారిక చిన్ననాటనుండీ అంతఃపురాలలో పెరిగినది. అంతఃపుర స్త్రీలలో బలముకలవాళ్ళను ఏరి, యుద్ధవ్యవసాయనిపుణులుగా శిక్షనిస్తారు. వారు పురుషులతో సమంగా యుద్ధంచేయగలరు. అంతఃపుర రాజకీయాలు సాధారణంగా వారు పట్టించుకోరు. తమ ప్రభువులకు, దేవేరులకు అత్యంత భక్తితో సేవచేస్తూ అవసరమైతే ప్రాణాలు సమర్పించడానికి ఏమీ వెనుదీయరు.

ఆ పరిచారిక తిన్నగా మహారాణికడకుపోయి, ప్రభువు తన కప్పగించిన సందేశం వారికి మనవిచేసింది. మహారాణి ఆశ్చర్యమంది, అమ్మాయి వివాహం విషయంలో ఏలాటి విషమసమస్యలు తమరాజ్యానికి రానున్నాయో అని భయపడి, భవిష్యత్తు తమ కులదేవత విశాలక్షీదేవి కరుణవల్ల నే సుఖంగా పరిణమించాలని కనులుమూసి ప్రార్థించుకొన్నది.

2

తండ్రిగారి ఆజ్ఞ విన్నది అన్నాంబికాకుమారి. వివాహానికి రెండవ ముహూర్తము నిశ్చయమయిందని శుభలేఖలతో వర్ధమానపుర రాజపురోహితుడు ఇరవై ఐదు ఏనుగులతో, మూడునూర్ల ఆశ్వికులతో, వేయిమంది సర్వాయుధో పేతులగు సైనికులతో, బంగారు కట్టుల అందలం ఎక్కి ఆదవోని వచ్చాడు.

ఈ విధంగా ముహూర్త నిశ్చయ పత్రిక ఒక్క చక్రవర్తుల కుటుంబ వివాహ విషయంలోనే యాత్రచేస్తుంది. లకుమయారెడ్డి ప్రభువునకు తన హృదయంలో చక్రవర్తిత్వం సిద్ధింపనే సిద్ధించింది. మండలేశ్వరులలో తనకున్న సైన్యబలం ఇంకెవరికి ఉన్నది! ఒకలక్ష విలుకాండ్లను లకుమయారెడ్డి ప్రభువు సన్నద్ధం చేశారు. మూడునూరుల పోతరించిన మదగజాలు, పదియేను వేలమంది రాహుత్తులు, మూకబలగం మూడులక్షలూ, వేయి రథాలు వర్ధమానపురం కోటలో, కోటచుట్టూ గ్రామాలలో, శిబిరాలలో సిద్ధంగా ఉన్నాయి. అనేకులు మండలేశ్వరులు తమతమ సైన్యాలతో బాసటగా ఉన్నారు.

అలాంటి శ్రీశ్రీ వర్ధమానపురవరాధీశ్వర, సంతతార్చిత శశిమౌళి, రాయజగదాళ, మహామండలేశ్వరులైన లకుమయారెడ్డి మహారాజాధిరాజు కడనుండి యువరాజు వివాహానికి లగ్నపత్రిక అంత వైభవంగా రాకపోవుటెట్లు?

“వెనుకటి వివాహప్రయత్నం సాధారణం. ఆ ముహూర్తము తప్పిపోవటమే మంచిదయింది” అనుకొన్నారు కోటారెడ్డి ప్రభువు. లగ్న పత్రికతో అంత వైభవంగా వర్ధమానపుర రాజపురోహితులు రావడం ఎంత ఉచితము! ప్రభువు ఎంతో గర్వపడినాడు.

పురోహితునితో భట్టులు, నర్తకులు, సంగీతవిద్వాంసులు, వేదవేదాంగ పారంగతులు, పండితులు, జంత్రవాద్యమేళాలవారు వేంచేశారు. ఆదవోని రాజపురోహితుడు అంత వైభవంగానూ ఎదురేగి, సగౌరవంగా వర్ధమాన రాజపురోహితుని కోటలో ఒక హర్మ్యంలో ప్రవేశపెట్టించాడు.

పండితసభలు జరుగుచున్నవి. ఆదవోని పట్టణం అంతా శృంగారింప బడింది. ఉత్సవాలు జరుగుచున్నవి. శుభముహూర్త నిశ్చయానికే ఇంత అఖండోత్సవం జరుగుతూఉంటే ఇంక వివాహం దేవేంద్ర వైభవంతో జరిగి తీరుతుందని ప్రజ లనుకొన్నారు.

స్వస్తి శ్రీ శాలివాహన శక 1183, దుర్మతి సంవత్సర వైశాఖ శుద్ధ --- బుధవారంనాడు, రోహిణీయుక్త కన్యాలగ్నమందు శ్రీశ్రీశ్రీశ్రీ సమస్త ప్రశస్తి సహిత, భండనోత్తుంగ, తురగరేవంత, పరబలసాధనం పతిహితా చరణ, గండరగండ, గండభేరుండ, సత్యహరిశ్చంద్ర, శౌచగాంగేయ, శరణాగత వజ్రపంజర, సకలజనస్తుతి, పరనారీదూర, బంధుచింతామణి, సూర్యోదయ రాజ్యసముద్ధరణ, సకలవిద్యావినోద, విభవపురందర, వివేక చతురానన, విప్రజనాశ్రయ, చతుర్ధకులకుముదినీరాజ్యవర్ధనచంద్ర, పెనమనుంగోత్ర వడ్లూరిపురాధీశ్వర గడికోట మల్లవంశ భానులైన శ్రీశ్రీశ్రీ కోటారెడ్డిప్రభువులవారు తనయకు వివాహం నిశ్చయం చేశారు.

ఆ మహోత్సవసమయంలో కార్తాంతీక శ్రేష్ఠుడు కౌండిన్యగోత్ర పవిత్రుడు సోమనాథ భట్టులవారు, ఆ ముహూర్తప్రాశస్త్యం ఆదవోని మహాప్రభువునకు, శ్రీవర్ధమాన రాజపురోహిత పెద్దిభట్టులవారికి వినిపించి, వేయిన్నీ నూటపదహారు సువర్ణాలు, అనేక దుశ్శాలువలు, మూడుమారుతుల భూమి అలంకృత గృహము, నూరుగోవులు బహుమానము లంపినవాడాయెను.

అన్నాంబిక ఒక రహస్యగవాక్షంద్వారా ఈ దృశ్యం యావత్తూ చూస్తూ వెడనవ్వు నవ్వుకొన్నది. కోసగి మైలిని ప్రాణం చూరగొన్న వాడు, ఉప్పల సోముని తలగొండుగండడు, వందిభూపాలుని ప్రాణాపబోరుడైన ఒక భయంకరవ్యక్తి ఆ మహోత్సవమధ్యమందు నిలుచుండి పకపక నవ్వుతూన్నట్లు ప్రత్యక్షమైనాడు. ఆమెగుండె దడదడమనగా కళ్ళు మూసికొన్నది. ఆ దర్శనము మాయమైనది.

ఆత డంత భయంకరుడా! మరి అతని మోము ఎంత ప్రసన్నంగా ఉన్నది! అతడు చిరునవ్వు నవ్వని నిమేషం ఒకటైనా ఉండగలదా? మొదటి ముహూర్తంనాడు తనకు ప్రత్యక్షమైన ఆ మహాభాగుని రూపమే నేడు ఛాయామాత్రంగా ప్రత్యక్షంకాగా ఆమె అనుకొన్నది.

ఎంత ఉన్నతమూర్తి! అతడు గజదొంగా! ఎక్కడ దొంగతనం చేసినా డాయన? ఎందువల్ల? ఏమిటా గజదొంగతనం? ఇం దేదో మహా రహస్యం ఉన్నది. ఆ మహాపురుషుని మూర్తిలో, మోములో, చూపులో గజదొంగతనం ఏది? గజదొంగలు అందంగా ఉండగలరా? ఆసురికమైన సౌందర్యము హిరాణ్యాక్షునిలా, దుర్యోధనునిలా తామసికమై ఉంటుంది.

గన్నారెడ్డి ద్రౌపదిస్వయంవరంనాటి అర్జునునిలా ఉన్నాడు. అతడు ఆ దినమందు తాను తెర తొలగించినప్పుడు తన్నంత కరుణతో చూచినాడు. ఆ చూపులలో వెన్నెల కిరణాలు ప్రసరించినవి. ఆ చూపులలో సామగానాలు వెల్లివిరిసినవి. ఆ చూపులలో విశాలాక్షీదేవి నవ్వులు ప్రకాశించినవి.

అటు ఉప్పల సోమున వధించి, వెంటనే సైన్యంతోవెళ్ళి కందవోలు ముట్టడించి, కోటలోనివారందరూ ఏమరుపాటున ఉండగా కోటలో ప్రవేశించి ప్రభువును బందీ చేసినాడట! ఈ గాథను కందవోలునుంచి అంచెలమీద వార్త తెచ్చిన చారుని చెల్లెలయిన తన అలంకారిక చంచలాక్షి చెప్పింది.

వందిభూపాలుడు కర్కోటకుడు. తన ప్రజలను ధర్మహీనుడై అనేక బాధలకు లోనుజేసిన క్రూరకర్ముడు. తనతండ్రి ఈనాడు శ్రీ గణపతిదేవ సార్వభౌముని పై, రుద్రదేవమహారాజుపై కత్తికట్టినారే! కాని చక్రవర్తి అంటే పరమభక్తితోకొలిచే దినాలలో, తనకు పదమూడుసంవత్సరాల ఈడు ఉన్నప్పుడు వందభూపాలుడు రాజుకాడు, రాక్షసుడు అని అనేవారే! అలాంటిది, ఈ దినాలలో ఆయనకు తండ్రిగారు స్నేహితులైనారు. వెంటనే గోన గన్నారెడ్డి చేతిలో హతమారిపోయినాడు.

కందవోలులో మహాసభచేసి వందిభూపాలుల విచారించినారట. ప్రజలందరూ భయముతీరి, తమ కా వంది చేసిన అన్యాయాలు, అవమానాలు చెప్పినారట. అయినా వందిభూపాలుని కాశీకి పోవలసిందని గన్నారెడ్డి హితవు గరపినాడట. వందిభూపాలుడు గణపతిదేవ ప్రభువును, గోన బుద్ధారెడ్డి ప్రభువును, గన్నారెడ్డిని, విశ్వేశ్వర శివదేశికులను అనరానిమాట లన్నాడట. అంతవరకూ గోన గన్నయ్య నవ్వుతూనే ఉన్నాడట. అప్పుడా వందిభూపాలుడు శ్రీశ్రీ రుద్రదేవప్రభువును, “తుచ్ఛివాంఛలు తీర్చుకోడానికి పురుషవేషం వేసికొన్న ఆడముండ” అన్నాడట! “దొరసానమ్మగారూ! అప్పుడు గన్నారెడ్డి తెల్లటి మంటతో మండే రోహిణీకార్తెనాటి మధ్యాహ్నసూర్యుడై, ‘ఛీ నోరు మూయుము పాపీ!’ అని లేచి ఫెళ్ళున వందిభూపాలుని చెంప పగులగొట్టి, చేయిబట్టి బరబర సింహాసనంమీదనుంచి లాగి, ‘పిశాచీ! నీ సింహాసనం నీకే ఉంచి, శ్రీ శ్రీ రుద్రదేవులకు దాసుడ వౌతావేమో అని నిదానించాను. కాని మనుష్య జన్మయెత్తిన అతిహీనుడుకూడ భక్తితో రుద్రదేవుల పేరు తలుచుకుంటాడు. గజ దొంగనయినా నేను మన చక్రవర్తి బిడ్డ నెవరు హీనంగా మాట్లాడినా వానిప్రాణం కొంటానని ప్రతిజ్ఞ పూనినాను. నువ్వు నాకుకూడ అపశయం తెస్తావు’ అని పలికి ఒకతన్ను తన్నినాడట. ఆవేళలో గన్నారెడ్డిని ఎవ్వరూ తేరి చూడజాలకపోయినా రంటమ్మా దొరసానమ్మగారూ! వందిభూపాలుడు గుఱ్ఱమెక్కి ఎక్కడికో వెళ్ళి పోయానాడట. అతనితో ఒక్క వీరుడైనా వెళ్ళడానికి నిరాకరించాడట. ఆ ప్రభువు భార్య ఇదివరకే కాలగతిపొంది కైలాసము చేరింది. కుమారుడు తలవాల్చివచ్చి గన్నారెడ్డికి తనకత్తిని సమర్పించి మాటలేక నిలుచున్నాడట. ‘తమ్ముడూ! ఈ రాజ్యం నీది. చక్రవర్తికి సేవచేస్తూ ధర్మం నాలుగుపాదాలా నడుపు’ అని గన్నారెడ్డి చెప్పి కోటలోనికి చక్రవర్తి విరోధులను రానీయవలదని చెప్పి తన సైన్యాలతో మాయమైనాడట. రెండుదినాలక్రిందట సంగమేశ్వరంలో వందిభూపాలుడు తాను చేసిన పాపాలకు నివృత్తిగా గండకత్తెర వేసికొన్నాడటమ్మా!” అని చంచలాక్షి అన్నమాంబికకు చెప్పింది.

ఆ మాటలన్నీ స్మృతిపథానికి రాగా అన్నాంబిక గవాక్షంలోనుంచి తాను చూసే శుభముహూర్త నిశ్చయోత్సవం మరచి ఆ గన్నారెడ్డినే హృదయంలో నింపికొన్నది.

3

‘గజదొంగ అయిన పురుషునికి సార్వభౌమునిపై భక్తి ఎట్లు?’ అని అన్నాంబిక తన తోటలో విహరిస్తూ ఆలోచింపదొడంగెను.

ఈసారి ఆ గజదొంగ తన వివాహము తప్పిస్తాడా? పెళ్ళికుమారుణ్ణి ఆలాగు ఆదినాన ఎత్తుకొనిపోవడానికి కారణం వివాహం తప్పించడానికా? కాకపోతే, మరెందుకు? ధనానికి ఆశపడలేదు. అహంకృతిచేతనా? లేక వట్టి కక్షచూపించడానికా? లేక ‘జాగ్రత్త’ అని పినతండ్రిని హెచ్చరించడానికా?

వివాహం తప్పించ నవసర మేమున్నది? ఏమో అతడు గజదొంగ అగుటకు వెనుక ఏ మహాచరిత్ర ఉన్నదో? దాసీలమాటలలో పినతండ్రి అతని రాజ్యం అపహరించడంవల్లనూ, చక్రవర్తి ఆ విషయంలో ఏమీసహాయం చేయకపోవ డంవల్లనూ, మనుష్యలోకంఅంటే అసహ్యంకలిగి అలా అయినాడని అనిపించింది.

రేపటిదినం ఆమెకు ప్రధానమహోత్సవం చేస్తారట. ఇదివరకు అతి తొందరగా వివాహం కావాలని ప్రధానమహోత్సవం జరపకుండా, వివాహానికి తరలి వచ్చారు పెళ్ళివారు. ఈపట్టున అన్నీ సక్రమంగా జరుపుతారట. అప్పుడు చక్రవర్తి అన్న భయము ఉన్నదట. ఇప్పుడు లేదట! ఇప్పుడు లకుమయారెడ్డే చక్రవర్తి అయినాడట! అందుకనే శుభముహూర్తపత్ర సమర్పణ తంతు ఇంత విచిత్రంగా జరుగుచున్నది.

ఎందు కీ గజదొంగ రూపము తన స్మృతిపథాలనుండి వీడదు? మొదటి చూపులోనే ఆతడు తనహృదయాన్ని గంటుచేసి, ఆ దారివెంట ఎవ్వరూ చొర రాని తన ఏకాంత భావహర్మ్యము చేరినాడు. గజదొంగలు కన్నమువేయరుకదా! ఆనాడు తాను తెర ఒత్తిగించి ఆ గజదొంగను చూచుటే దోషమైనదా? ఆనాటి నుండి ఒక్కక్షణమైనా ఈ తన చిన్నతనపు జీవితానికి శాంతి దూరమైనది.

పదునెనిమిది సంవత్సరాల అరవిచ్చు మల్లెపూప్రాయపు మసృణకోమల గాత్ర, ఆ బాలిక యౌవనక్షేత్ర ప్రథమగోపుర వినిర్గత సుందరి.

బంగారపువర్ణం ఆంధ్రయువకులకు కోరికలపంట. అందులో ఆమె తనుచ్ఛాయ మేలిమియే.

ఆ బంగారునకు కుసుమమసృణత్వము ఆంధ్రబాలికల స్వత్వము. ఆ మేలిమి బంగారు పూవుల లాలిత్యానికి గంధరాజ పరిమళము. ఆంధ్రయువతీ సౌందర్య సాధారణగుణము. హిమవన్నగసానువికసితదివ్యపుష్పసౌరభమై, సేవచేసే చెలులకే మైమరపు కలుగచేస్తుంది అన్నాంబికాకుమారి సౌందర్యము.

కోలమోములో, సోగకన్నులలో వాలుచూపులు, చిన్ననోరు, బంగారు సంపెంగ నాసిక సరియైన శ్రుతిలో కూర్చబడిన ఆ బాలిక మోమును ఆదవోని రాజసభాలంకారుడైన వృద్ధకవి త్రిపురాంతకేశ్వరమంత్రి ఈలా వర్ణించాడు :

“ఆ నవమోహనాంగి దరహాస వికస్వరలోచనద్వయా
 నూనత జూచియేమొ యతనుధ్వజమందలి మీన మట్టులే
 నాన వహించె, శ్రీకర వినమ్రము పద్మము వాడిపోయె, ఏ
 లో ననలెల్ల రాలెను, విలుంఛితమై యది వాలిపోవగన్.”

ఈ పద్య మా మహాకవి నిండుసభలో తండ్రియొడి నలంకరించిన ఎనిమిదేండ్ల బాలికయైన అన్నాంబికపై ఆశువుగా గానంచేశాడు. ఈపద్యం సర్వాంధ్ర మండలాలా ప్రతియువకునిచే పాడబడి ప్రసిద్ధమైన చాటువై పోయెను.

ఆమె కన్నుల అందాన్ని ప్రతికవీ వర్ణించాడు. నీలోత్పలపు అందం నీచోపమ మైన దా కన్నులకు? వదినగార్లయిన వివిధ పద్మాలకన్న, సహోదరీమణులైన తెల్ల, ఎఱ్ఱ, అరుణ కలువలకన్న, ఈ నీలికలువ చిన్నది; అత్యంత మనోహరరూపం కలది. పొడుగాటి పూవు, కోలయైన రేకులు, అర్ద్రతను పుణికిపుచ్చుకొన్న అనన్య మనోహర నీలకాంతి ఆ కొనల నలమికొన్నది. ఆకాశనీలిమ ఆ నీలికలువకడ ఓనమాలు నేర్చుకోవలసిందే! చిన్నదైన ఈ కుసుమబాలికలోని నీలిమకు దీటైనది శ్రీకృష్ణడింభకుని సౌందర్యంలోనే గోచరిస్తుందట!

ఈ పూవుపుటాల పోలిక కనులుగల సుందరాంగులు సర్వప్రపంచంలో ఇరువురు మువ్వురు మాత్రమే ఉంటారట. వారిలో శిరోరత్నము అన్నాంబికాదేవి. ఆ కన్నులు అరమూతలో అనంతమాధుర్యాలను అందంగా దాచుకున్నవి. అవి తమ సోగతనంలో అమృతధారలను ప్రవహింపచేస్తాయి. అవి తమ లోకాతిశాయి నీలిమచే అనంత వినీలత్వాన్ని ప్రత్యక్ష మొనరుస్తున్నవి.

వసంతకాలం యువతీయువకుల తీయనిబాధ. యుగాలనుంచీ యువతీ యువకులదే ఆ కాలం. లోకాల యౌవనపు కోర్కెలన్నీకూడి వసంతమయింది.

తెల్లవారగట్ల కొంచెం చలితో వసంతమాస ప్రథమదిన ప్రారంభం. ఉదయమందు ఇక ప్రత్యక్షం కాబోవు సౌందర్యదర్శన కుతూహలానందమత్తత. వసంతభానుడూ నవయౌవనుడే! అతడు మత్తతతో లేవలేక కొంచెం వ్యవధిగా లేస్తాడు.

పుఁస్కోకిల-

“ఎచ్చటే పికబాల ఏమావినీడలో
 ఏతింత్రిణీ పల్ల వాచ్ఛాదనమ్ములో
 కువకువల కులుకుతూ కూర్చుంటి నిర్దయత
 కో కో యనుచు పిలుచు ఈ కృపణనే వినవు?”

అని విరహగీతిక పాడుకొంటున్నది.

    రసాలంలో పురుషపుష్పము ప్రియురాలిని వెదకుటకై తుమ్మెదను ఆపి,

“చెలికాడ తుమ్మెదా! పలు కిదే వినరార
 వలపు నా రాణి ఏ వలవంత పాలవునొ
 ఈ శాఖ విడనాడ నా శక్యమేగాదు
 పాశమై విధి నన్ను బంధించె నీరీతి
 నాలోని హృయదమ్ము నాలోని ప్రేమమ్ము
 నీలనీలములైన నీ పక్షములమోసి
 నా నాతి కర్పించి నా ప్రేమకథ తెలిపి
 నా ప్రాణసఖుడవై నన్ను రక్షించరా”

అనుచు షడ్జమశ్రుతి నాలపించెను.

ఇంతలో దుర్భర ప్రణయావేదనతో జేగురంది లేచినాడు దివిమీదకు యువ భానుమంతుడు.

“ఏదొ నా ఒడలిలో వేదనాజ్వర మొదవె
 ఈ తాప మిటు లొదివ నేమి కారణమొ?
 ఏదొ నా ........................................
 ఒళ్ళు ఝల్లనిపొంగు కళ్ళలో మత్తతలు
 ముళ్ళమీదను రథము వెళ్ళినట్లేతోచు”

ఆ సొబగుగాని పాట విని చిరునవ్వుతో పద్మినీబాల త్రపావతియై తల ఎత్తింది. వసంతము పద్మినీబాలది. వేసవి సంజ్ఞాదేవిది. శీతకాలంలో ఛాయాదేవి భర్తపజ్జ చేరుతుంది.

అన్నాంబికాదేవి ఇటూ అటూ తిరుగుతూ పూవులతో మాటలాడుతూ, కృతిమ శైవలిని ప్రక్కనే మెత్తని గడ్డిపైకూర్చుండి, ఉదయాన మహాసభలో జరిగిన వివాహలగ్నపత్రికాసమర్పణోత్సవమునుగూర్చి ఆలోచిస్తున్నది.

అన్నాంబికాదేవిని ఇందీవరాలోచన అన్న మహాకవి త్రిపురాంతకేశ్వరుని పలుకులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్నాంబిక చిరునవ్వు నవ్వుకొన్నది.

చెలికత్తెలను తనతో రావలదని ఆజ్ఞ ఇవ్వడంవల్ల, వారందరూ ఆవలనే దూరదూరంగా చుట్టుప్రక్కల పూలమొక్కలచాటున అన్నాంబికను కనిపెట్టు చున్నారు. ఆ చైత్ర బహుళ తదియనాడు చంద్రుడు ఆరు ఘడియలే ఆలస్యంగా వస్తాడు. చంద్రుడు వచ్చి పదిమెట్లు పైకి ఆకాశంమీదకు సాగగానే లోనికి వెళ్ళి పోదామని అన్నాంబిక కూర్చునిఉన్నది.

ఆకాశంలోని అరుణరాగాలు ఒకవిధంగా కరుణగలవే! ఆ రాగాలు కూడుకొని యువతుల హృదయాలలోనికి చేరుతాయి. అప్పు డా బాలల స్వప్నాల మాధుర్యం ద్రాక్షసారాయంలా మత్తు తాలుస్తుంది. ఆ అమృతము వారి పెదవులలో పోటెత్తుకు వస్తుంది. ఆ దివ్యసుధను ఆస్వాదించే నాయకులు మత్తు పొంది ఒడలు తెలియక తమ నాయికల ఎన్ని విధాలో చీకాకుపరుస్తారట.

ఈ విధంగా త్రిపురాంతకేశ్వరుడు తన వాసవదత్తా కావ్యంలో పద్యాలు రచించాడు. ఆ వృద్ధుని శృంగారరసవైచిత్రి అన్నాంబికకు నవ్వు పుట్టించింది. వృద్ధుని కిది ఏమివెఱ్ఱి అనుకొన్నదామె.

నేడు ఏదో అనిర్వచనీయ సౌందర్యము నీటిలో తేలిపోవు పుష్పపుటాలులా తనకు అస్పష్టంగా తోస్తున్నది. ఎందుకా పద్యాలన్నీ చీకటిపడే సమయంలో తన స్మృతిపథాన్ని ప్రత్యక్షం అవుతున్నవి?

ఆమె ధరించినది తెల్లని పట్టుశాలి నూలుచీర. సరిగపూలు అచ్చటచ్చట కుట్టిఉన్నాయి. మామిడి పిందెలతో అరచేతి వెడల్పు సరిగంచు. ఆమె తొడుగు కొన్న స్తనదుకూలకంచుకము వంగపండు చాయగలది. ఆ కంచుకము అంచులో ముత్యాలపూవులు కుట్టిఉన్నవి. ఉదయమందే ఆమెకు వట్టివేళ్ళనూనె తలంటి, గంధపొడి పిండి నలుగు పెట్టి, జాతీపరీమళజలాల స్నానమాడించి, మెత్తని సెల్లాల తడియార్చి వదులు జడవేసి మల్లెమొగ్గలు ముత్యాలకూర్పులా అలంకరించారు. అ మల్లెమొగ్గలు ఇప్పుడు విచ్చినాయి. ఉదయం చెలులు తన్ను ధరింపచేసిన కుసుంబా పట్టుచీర, పసిమిబంగారు స్తనదుకూలము, కమలారుణపు పట్టుచీర వెంటనే మార్చింది.

ఆ నగలన్నీ ఊడ్చింది. ఇప్పు డామె అన్నీ ముత్యాలనగలే పెట్టుకొన్నది. లాలాటికమూ పెద్దముత్యమే. అన్ని నగలూ ముత్యాలవే! ఉదయం పద్మరాగ రత్నాభరణాలు, మధ్యాహ్నం గోమేధికాలంకారాలు, సాయంకాలం ముత్యాలు కూర్చిన ఆభరణాలు దాల్చు నామె.

ఇంతలో చంద్రుడు ఎఱ్ఱటి మహాపద్మంలా తూర్పున ఉదయించాడు.

అన్నాంబికాకుమారి పడే వేదన ఆమె కేమి అర్థమవుతుంది? అన్నాంబిక పుంజీభవించిన స్వచ్ఛసౌందర్యసత్వం. స్వచ్ఛసౌందర్యశక్తిప్రవాహం కర్పూర సైకతాలపైనే ప్రవహిస్తుంది. పవిత్రహృదయభూములనే తడుపుతుంది.

అన్నాంబికాసౌందర్యమహాఝరి పోటెత్తి, పరవళ్ళెత్తి, కరడుకట్టిన మూర్ఖజనకాజ్ఞాశిలలను ఛేధించుకొని ప్రవహింప జలజలలాడుతున్నది. అది ఆ బాలిక కేమి తెలుస్తుంది!

చంద్రుడు గబగబ ఆకాశంలోకి తేలుకొని వచ్చాడు. చంద్రునివైపుచూస్తూ కృష్ణతదియనాటి చంద్రుడు రాకాచంద్రునికన్న అందము తక్కువవాడా అనుకుంటూ, గజదొంగ గోన గన్నయ్య కృష్ణతదియనాటి చంద్రుడు అతడు రాకాచంద్రుడు కాలేడా అనుకుంటూ అన్నాంబిక ఇటు తలతిప్పింది.

నవ్వుతూ ఎదుట గోన గన్నారెడ్డి నిలిచి ఉన్నాడు.

4

అన్నాంబికకు ఒక్క నిమేషం ప్రాణచలన మాగిపోయింది.

గన్నారెడ్డి వసంతమూర్తిలా, రూపంపొందిన యౌవనంలా, పోతపోసిన వీరత్వములా, ఉత్తమశిల్పి ఊహలోని ధీరోదాత్తపురుషునిలా చిరునవ్వుతో నిలుచుండి, అన్నాంబికకు నమస్కరించి, తీయని మందర స్థాయిలోని షడ్జమస్వరంతో “అన్నాంబికాదేవీ! ఈ గజదొంగను చూచి భయపడకు, నీకు కాకతీయవంశం అంటే భక్తి ఉన్నదా? అని ఒక ప్రశ్న. రెండవది, మీకు శ్రీ గణపతిరుద్ర సార్వభౌములన్నా, శ్రీ రుద్రమహారాజు లన్నా భక్తిఉన్నదా? మూడవప్రశ్న, ఈ మహాదేశంలో ధర్మం నాలుగు పాదాలా నడవాలని ఉన్నదా అనీ - ఈ ప్రశ్నలు అడుగుతున్నాను” అని కొంచెం విషాదచ్ఛాయలు తోచే వాక్యాలతో అడిగాడు. అన్నాంబిక మాటాడలేదు. అతని సమున్నతదేహము, అతని గంభీర ముఖాకృతి, రేఖామనోహరత్వము, విశాలఫాలము, లోతులై, వెడదలైన లోచనాలు, దీర్ఘ సమనాసిక, చిరుసోగమీసాలు, పెద్దచెవులు, ఆ చెవులన వేలాడే హంస కుండలాలు, పోతపోసిన కాంచనకంఠము చూస్తూనే లేచి నిలిచింది.

ఇంతటి మహాపురుషుడు దారిదోపిడికా డెట్లయినాడు? నాలుగవ ఏడు అతని తల్లి దండ్రులు పోయిరని విన్నది అన్నాంబిక. తల్లి పెంపకంలేని బాలుడు, తండ్రి శిక్షలేని కుమారుడు - పాపం! ఈ ఉత్తమపురుషుడు తప్పుదారుల పడిపోయినాడు. అయ్యో, భయంకరభటరక్షితమైన ఈ శుద్ధాంతవనానికి ఎలాగు వచ్చా డీయన! ఏపరిచారిక అయినా ఈయనను చూస్తే! రక్షకభటులకు తెలిస్తే!

“రాజకుమారీ! ఈ పెళ్ళివల్ల దేశంలో రాజద్రోహం రుద్రతాండవం చేస్తుంది. నీవు వరదారెడ్డి రాకుమారునే వివాహం చేసుకోవచ్చును కాని కొంతకాలం ఈ వివాహం కాకూడదు.”

“ఈ వివాహం ఎప్పుడూ కాకూడదు” అన్నది అన్నాంబిక. గన్నారెడ్డి ఆశ్చర్యం పొందాడు.

“ఎందుచేత?”

“నా కీ వివాహం ఇష్టంలేదు. నేను శ్రీ లకుమయారెడ్డిగారి కుమారులను నా భర్తగా ఊహించుకోలేదు. ఊహించుకోలేను.”

“అయితే మొదట ఆ వివాహానికి ఎలా ఒప్పుకున్నారు మీరు?”

“కన్యకకు తండ్రి ఆజ్ఞ అనుల్లంఘనీయము”

“ఇప్పుడు ఆ ఆజ్ఞ లేదా?”

“ఇప్పుడు మీ మాటలలో వ్యక్తమయిన చక్రవర్తి ఆజ్ఞ జనకాజ్ఞకన్న బలవత్తరమైనది ప్రభూ!”

“నేను గజదొంగను. నన్ను ‘ప్రభూ’ అనకండి.”

“నాకు మీరు గజదొంగలుకారు!”

“మీ కా వివాహం ఇష్టంకాకపోతే, రేపు ప్రధానమహోత్సవం ఏలాగు?”

“రేపు ప్రధానమహోత్సవం జరుగదు. రేపు మావాళ్ళు ప్రాణంలేని నాబొందిమాత్రమే చూడగలరని, నేను ఈ ఉదయమే నిశ్చయించుకొన్నానుప్రభూ!”

“రాజకుమారీ! అల్లా అనకండి! మీరు మీ తండ్రులకు ఏక సంతానం. వారికి గర్భశోకం కూర్చుడంకంటె పాపం యింకొకటి ఉందా? తలి దండ్రులకు గర్భశోకం కలిగించే బిడ్డలు వేయి శిశుహత్యలు చేసినవాళ్ళవుతారు రాజకుమారీ! నా మనవి వినండి. మీరు వెంటనే నాతో రండి. గజదొంగ గన్నారెడ్డి ఆదవోని రాజకుమారికను ఎత్తుకుపోతాడు! మీరునాతో రావడానికి సందేహించ నక్కరలేకుండా మా అక్కగారు శ్రీ మల్యాల కుప్పసానమ్మ దేవినికూడా తీసుకువచ్చాను. ఆమె సపరివారంగా ఆదవోనిపురం బయట మిమ్ము హృదయానికి అదుముకోడానికి సిద్ధంగా ఉన్నారు.

“మహారాజా! మీరు నన్ను ఎట్లా తీసుకువెళ్ళగలరు? మా తండ్రిగారు ఈ నగరం యావత్తూ చీమదూరరాని కట్టుదిట్టాలు చేశారు!”

“అన్నాంబికాదేవీ! దొంగ ఇంటికి కన్నంవేసినప్పుడు పారిపోయే సావకాశాలన్నీ కల్పించుకొనే వస్తాడు. అందులో నేను గజదొంగను!”

“ప్రభూ! నేను మీతో రానుకాని కుప్పాంబికాదేవిని కలుసుకుంటాను. మార్గం ఉపదేశించండి.”

“మంచిది దేవీ.”

గోన గన్నారెడ్డి తన్ను ‘దేవి!’ అని సంబోధించగానే అన్నాంబిక గుండె గుబగుబలాడింది. ఏదో ఆనందం ఆమెను అలమివేసింది. మోము ప్రపుల్లమై పోయింది.

“మీరు మీ అంతఃపురంలోకి వెళ్ళగానే, సంపూర్ణకవచధారులైన బాలకుని వేషం వేసుకొని, మోమంతాకప్పే శిరస్త్రాణం ధరించుకోండి. ఈ నా ఛురికను చేతదాల్చి, దానితో వీధులలోకి వచ్చేయండి. వీధులలో కాపలా తిరిగే సైనికులలో ఎవరైనా ఎఱ్ఱపట్టు కాసెకోక ధరించుకొన్నవారు మీదగ్గరకువచ్చి ‘గన్నారెడ్డి కనపడ్డాడా’ అని అడిగితే, ‘ఆ గజదొంగా!’ అని మీ రనండి. అతడు ‘ఆ గోన వంశంలోని హాలాహలమే’ అంటాడు. మీ రాతని వెంట వెళ్ళండి. మా అక్క గారిని కలుస్తారు” అంటూ గోన గన్నారెడ్డి ఒక్క ఉరుకున పూలపొదల్లో మాయ మయ్యాడు.

అన్నాంబిక తొందరిగా అంతఃపురంలోకి వెళ్ళిపోయింది.

తమరాజకుమారితో మాట్లాడుతూ ఉన్న పురుషుడు గన్నారెడ్డి అని, అప్పుడే ఆకాశంపై విహారానికి వచ్చిన చంద్రకాంతిలో, సాయం మసక మసక కాంతుల్లో దూరదూరాన ఉన్న చెలులు ఆనవాలు కట్టలేకపోయారు.

ఎవరా ఈ పురుషుడు, నిర్భయంగా శుద్ధాంతవనానికివచ్చి చిన్నదొరసానమ్మగారితో మాట్లాడుతున్నాడు! అని వా రాశ్చర్యమందినారు. ఇది మాయగా ఉన్నది అనుకొని, రాజకుమారి లోపలికి పరుగెత్తుకొనిపోగానే వారును లోనికి పరువిడినారు.

ఎచ్చటను రాకుమార్తె కనపడలేదు. నగరికి ముందున్న ప్రాంగణమందు ఉన్న ద్వారరక్షకుల్ని అడిగితే వా రొకబాలుడు వెళ్ళినాడనీ, ఆ బాలకుడు రాజకుమారి చేతిముద్ర చూపించాడనీ, ఆ బాలకుని తాము పోనిచ్చామనీ వారు తెల్పారు. వెంటనే మహారాజుకు అమ్మాయిగారు నగరిలో లేరని తెలిపారు. గోన గన్నారెడ్డి శుద్ధాంతవనములోకి వచ్చినాడని ఎక్కడో అల్లరి పుట్టింది.

ఇంతలో రాకుమారి కనబడుటలేదన్న గగ్గోలు బయలుదేరింది.

5

గోన గన్నారెడ్డి ఆదవోనిలో ప్రవేశించాడని అల్లరి పుట్టించింది గోన గన్నారెడ్డి అనుయాయులే! ఊరంతా గగ్గోలు! ‘రాజకుమార్తె అంతఃపురంలో నుంచి మాయమైంది’ అనే వార్త రాజకుమారి కా శుద్ధాంతంలో కలిగిన గగ్గోలు వల్ల తెలిసిపోయింది.

రాజకుమారి పురుషవేషం వేసుకొని తన కతిసన్నిహితురాలైన చెలిమికత్తెను పిలిచి, దానిని ఒక పీఠమునకు బంధించి ‘నువ్వు ఏమీ అనుకోకు! నాకు గోన వరదారెడ్డిసాహిణిని వివాహం చేసుకోడం ఏమీ ఇష్టంలేదు. రేపు ప్రధానమహోత్సవము జరిగితే నేను ఒప్పుకొన్నట్లవుతుంది. ఈ పురము వెలుపల శ్రీ మాల్యాల గుండయమహేశ్వరుని దేవేరి శ్రీ కుప్పాంబ వచ్చి ఉన్నదట. నే నామెను కలుసు కుంటాను. నేను వెళ్ళగానే ని న్నెవరైనా వచ్చి విప్పిరా సరే, లేదా, నువ్వు విప్పుకున్న సరే తక్షణం నువ్వు మహారాణిగారికి తెలియజేయవచ్చు” అని చెప్పి మాయమైపోయిందట.

ఆదవోనిపురంలో ఎవరు దొంగలో, ఎవరు సైనికులో ఆ రాత్రి తెలియడము దుర్భరమే! తెల్ల వారేవరకూ సేనాపతులు, చారులు, ఆశ్వికులు పురంలో, నగరంబైటా, కోటలో వెతికారు. దొంగలజాడగాని, చిన్నదొరసానమ్మగారిజాడగాని ఎక్కడా తెలియదు. ఆదవోనిదగ్గర ఉన్న చిన్నపల్లె అరుంధతిపాలెంకడ ఆశ్విక సైన్యం, ఇరువది రథాలు, పది ఏనుగులు ఉండెనట. మల్యాల గుండయ ధరణీశు సైన్యాలన్నీ కలసి వెళ్ళిపోయాయట.

ఆదవోని మహాప్రభువు కోటారెడ్డికి మతిలేదు. ఒకసారి దుఃఖముతో క్రుంగిపోతాడు, ఒకసారి కోపంతో రుద్రమూర్తి అయిపోతాడు. ఒకసారి అవమానంతో మండిపోతాడు. కోటారెడ్డిప్రభువు సమీపంలోకి ఎవరు వెళ్ళగలరు? ముఖ్యమంత్రులు, ముఖ్య సేనాధిపతి, మహాకవి ఎవరూ ఆయన్ను తేరిచూడలేక పోయారు. ‘సేనలన్నీ ఆయత్తంచేసి కోట సంరక్షణకు పదాతిసైన్యం ఉంచి, సర్వఆశ్వికదళాలు, గజసైన్యాలు, రథాలూ తిన్నగా వెళ్ళి, జాడతీస్తూ ఆ మల్యాల సైన్యాన్ని నాశనంచేసి, ఆ కుప్పసానమ్మను, అమ్మాయినీబందీలుగా పట్టుకు రావలసింది’ అని కోటారెడ్డి ఆజ్ఞ ఇచ్చాడు.

వెంటనే ఉదయం ఆశ్వికసైన్యాలు, గజయూధాలు, రథాలు హుటాహుటి బయలుదేరినవి. మహావేగంతో చొచ్చుకపోతున్నాయి. మల్యాలవారి సైన్యాలు తుంగభద్రనది వైపునకు సాగిపోయాయని తెలిసింది. జాముప్రొద్దెక్కి నప్పటికి సైన్యాలు కందనోలుకు రెండుగవ్యూతుల కెగువను తుంగభద్రను చేరినవి. అక్కడ మల్యాలవారి సైన్యాలు కందనోలుకు చేరినట్లు తెలిసి, కోటారెడ్డి మండలేశ్వరుని సైన్యాలను నడిపే శ్రీ బేడ చెలుకినాయుడు పటాటోపంతో వెళ్ళి కందనోలు ముట్టడించాడు.

బేడ చెలుకినాయుడు, ఆదవోని రాజ్యంలోని మోదుగల్లు దుర్గాధిపతి. మోదుగల్లు ఆదవోనికి ఇరువది గవ్యూతుల దూరము ఉంటుంది. కోటారెడ్డి ప్రభువునకు బేడ చెలుకినాయుడు మేనత్తకొడుకు. చెలుకినాయుడు పేరుమోసిన సేనాపతి. అతనికి బంగారు అంచులు, మణులుపొదిగిన బంగారు పూవులచే అలంకరింపబడి, పంచలోహాత్మక కలశం కలిగి, వెండితొడుగు గలిగిన మహాఢక్క ఉన్నది. అ నిస్సాణము పూర్వం ఇంద్రునిదట! ఇంద్రుడు రాక్షసులమీదకు పోయే సమయంలో, ఆ నిస్సాణము తనంతటతానే మ్రోగుతుందట! ఆ సహస్రమహామేఘ గర్జనకే లక్షలకొలది రాక్షసులు ప్రాణాలు కోల్పోయేవారట!

ఆ విజయనిస్సాణాన్ని ఇంద్రుడు చంద్రున కిచ్చెను. చంద్రుడు దానిని పురూరవున కీయగా, ఆతని వంశమునుండి పాండవులకు, వారినుండి కళ్యాణపురపు చాళుక్యులకు సంక్రమించినదట. వారివంశమువాడైన బేడ చెలుకినాయడద్దానిని ఆదవోని సైన్యమహావాద్యాన్ని చేసినాడు. చాళుక్యుడు చెలుకి అయినాడు.

ఆ మహాఢక్క బరువే ఒక అర్ధబారువు ఉంటుందట. దానిని మోయగలిగినది మహాగజాలుమాత్రమే. ఆ నిస్సాణాన్ని మోయించకలిగినవారు అజేయులైన ముష్టియుద్ధవిశారదులే.

ఆ దివ్యనిస్సాణము అనేకసముద్రా లొక్కసారి విరిగినట్లు, వేయి ఉరుము లొక్కసారి ఉరిమినట్లు కందనోలు ప్రజలకు వినబడసాగింది. ఆ మహానాదానికి శిశువులగుండె లవిసినవి. స్త్రీలు మూర్ఛపోయినారు. నాయకులు మ్రాన్పడినారు.

కందనోలుచుట్టూ తుంగభద్రానదీ, ఆనదిలోకలిసే ఐంద్రీనదీ ఉన్నాయి. ఈ రెండు నదులనూ కలిపే పెద్దకందకం ఉంది. కోటను ముట్టడించే సాధనాలూ ఒక లక్ష కాల్బలమూ పంపించవలసిందని చెలుకినాయుడు శ్రీ కోటారెడ్డి ప్రభువునకు అంచెవార్త పంపినవా డాయెను.

కందనోలుకోటలో వందిభూపాలుని తనయుడు శ్రీమల్యాల గుండాధీశుని దేవేరి కుప్పమాంబికారాణినీ, ఆదవోనిప్రభువు తనయను శ్రీ అన్నాంబికాదేవినీ సగౌరవంగా ఎదుర్కొని, రాచనగరులలో ఒక ఉత్తమహార్మ్యము వారికి విడిదిగా ఇచ్చినాడు. చారులు బేడ చెలుకినాయుడు ఆదవోని సైన్యాలతో ఎంతదూరం వచ్చిందీ, ఎటువస్తున్నదీ వార్తలు తెస్తున్నారు. చెలుకినాయుడు కందనోలు కడకు వచ్చేటప్పటికి కోట ఎటువంటి ముట్టడికైనా సన్నద్ధం చేయబడింది.

వందిభూపాలుని తనయుడు శ్రీ ముప్పరెడ్డి మహారాజు ప్రజ మెచ్చు గండడై, పతిహితాంజనేయుడై, గురుకార్యనిర్వహణానికి ప్రాణాలనైనా సమర్పించడానికి సిద్ధంగా ఉండెను. ముప్పరెడ్డి మహారాజుకు గురువు గజదొంగ గోన గన్నయ్య. ఆయన వాక్యమే అతనికి పరమమంత్రము. ఆయనకు యుద్ధనిర్వహణ విధానమంతా ఉపదేశించి, గన్నయ్య బేడ చెలుకినాయుడు రాకుండానే మాయమైనాడు.

కోటలో భీమునిలాంటి మహాసత్వుడు విఠలధరణీశుడు ముప్పరెడ్డికి బాసటగా నిలచి ఉన్నాడు. ఎక్కడచూచినా విఠలధరణీశుడే! మహోన్నతమైన అతనిరూపు చూచి ప్రజలందరూ ఆనంద మందుతారు. అపరభీమసేనుడని అతనికి పేరుపెట్టు కొన్నారు. విఠలధరణీశుని సాహసకార్యాలు దేశికవులు కావ్యాలుగా, గీతికలుగా రచించి పాడుతూఉంటారు.

తెల్ల నాపరాళ్ళతో నిండిఉన్న కందనోలు ప్రదేశమంతా ఎంతో విచిత్రంగా ఉంటుంది. కోటగోడలకూ, బురుజుగోడలకూ ఇతర ప్రదేశాలనుండి పెద్దరాళ్ళు తెప్పించి పూర్వప్రభువులుపయోగించారు.

చెలుకినాయుడు రెండునదులమధ్య కోటకు కొంతదూరంగా మొనలుతీర్చి నిలుచున్నాడు. ఏనుగుల కొన్నిటిని, ఆశ్వికులను తుంగభద్రకు ఆవల కాపుంచాడు. ఐంద్రీనదికి ఆవల కొన్ని ఏనుగులు, ఆశ్వికులు కాపలా కాస్తున్నారు. తాను తక్కిన సైన్యాలతో రెండునదులమధ్య కాపున్నాడు.

పదాతులులేక కోటపై బడుట మరణంతో సమానం. అందుకని చెలుకినాయుడు అప్రమత్తుడై, పదిహేను గవ్యూతుల దూరమందున్న ఆదవోనినుంచి సైన్యాలు ఎప్పుడు వస్తాయా యని ఎదురుచూస్తుండెను.

అర్ధయామము ప్రొద్దున్నదనగా ఆదవోనివై పునుంచి పదియేనువేలమంది విలుకాండ్లు, పదివేలమంది మూకబలము, నూరు ఏనుగులు, రెండువేలమంది ఆశ్వికులు వస్తున్నారని ఒక చారుడు తొందరగా వచ్చి తెలిపినాడు.

ఆశ్వికదళాలు ఎక్కడనుంచి వస్తున్నవి? రథసైన్యాలు రావటం ఏమిటి? నూరుగజాలు ఆ వచ్చేసైన్యంలో ఏమిటి? అని చెలుకినాయుడు ఆశ్చర్యపడుతూ,

‘ఎవరివా సైన్యాలు? ఎక్కడనుంచి వస్తున్నవి?’ అని ప్రశ్నించాడు.

‘చిత్తం మహాప్రభూ! అవి ఎవరివోనండీ. బహుశా గన్నారెడ్డి వేమోనండీ.’

‘ఏమిటీ! గన్నారెడ్డివే?’ బేడ చెలుకినాయని గుండెల్లో రాయిపడింది. ఇదివరదాకా చెలుకినాయుడు పరాజయం ఎరుగడు భల్లాణులపైన దండెత్తినప్పుడుగాని, కుంతలదేశముపై దండెత్తినప్పుడుగాని, ఎదిరి బలాబలాలను నిర్ణయించుకొని అందుకుతగినట్లు యుద్ధ వ్యూహం అమర్చుకొని, అతిజాగ్రత్తగా సైన్యాలనునడిపి, విజయాలు పొందేవాడు.

తన యుద్ధనిపుణత్వం మెచ్చి, చక్రవర్తి శ్రీ గణపతిరుద్రదేవులవారు ‘రణముఖభైరవ’ అని బిరుదము నిచ్చారు. ఎవడీ గోన గన్నడు? ఏమి వీడి ధైర్యము? వీడు అదృష్టవంతుడా, లేక మహావీరుడా?

ఎప్పుడూ భయ మెరుగని బేడ చెలుకినాయనికి మొదటిసారి కొంచెం గుండెల్లో అదటు ప్రవేశించింది.

తాను మొనలు నిలిపిన విధానం అర్జునుడు మెచ్చుకోతగినది.

కోటకు కొంచెందూరంలో నాలుగువందల ఏనుగులు, పదహారువందల విలుకాండ్లతో సిద్ధంగా ఉన్నవి. వారు వెనుకబలం. ఆ బలం బాసటగా ఆరాబోయే పదాతిదళం కోట ముట్టడించగలదు.

కోట ముట్టడికి ఏనుగులు రెండువందలు. ఈ ఏనుగులు గోడకు ముందుంచి పదాతులు రాగానే కోటతలుపులు పగులగొట్టించుటకు ఉపయోగించదలచుకొన్నాడు.

ఈ ఏనుగుల గోడకు వెనుకగా తాను ఇరువదివేలమంది ఆశ్వికులతో సిద్ధంగా ఉన్నాడు. ఈ అశ్వసైన్యానికి వెనుకగా మూడువందల ఏనుగులు సిద్ధంగా ఉన్నవి. ఒక్కొక్క ఏనుగుపై ఇరువురు నిలుచుండు విలుకాండ్రు, ఇరువురు కూర్చుండు విలుకాండ్రు సర్వసన్నద్ధులై ఉన్నారు.

తన మహానిస్సాణమున్న గజము తన రథానికి ముందుగా తన్ను రక్షిస్తూ ఉన్నది.

గోన గన్నారెడ్డి సైన్యం రెండుభాగాలై చీలిందట. గజాలు తుంగభద్రా నదిని దాటి వెళ్ళినవట. అశ్వికులు ఐంద్రీనదిని దాటి వెళ్ళిరట. పదాతిజనం చెలుకినాయని అశ్వికసైన్యానికి అర్ధగవ్యూతి దూరంలో ఆగిపోయినదట.

ఆ ఆగిపోయిన సైన్యము తాము నిలిచిన ప్రదేశం ముందు చిన్న చిన్న కందకాలు తవ్వుతున్నారట, నాపరాళ్ళ గోడలు చిన్నవి పేర్చుచున్నారట.

ఈ విషయం చారులు వార్త తేగానే చెలుకినాయుడు తొందరపడగూడదని ఆలోచించి, ఆదవోనినుంచి కాల్బలాలు, విలుకాండ్రు వచ్చేవరకూ వేచి ఉండాలని నిశ్చయించినాడు.

6

రాత్రి ఒకయామం జరిగింది. రెండవయామం జరుగుచున్నది. అంతా నిశ్శబ్దంగా ఉన్నది. కోటలో సైన్యాలు, కోటచుట్టూ సైన్యాలూ, కోట గోడల పైన సైన్యాలు, కోటచుట్టూ సైన్యాలను ముట్టడించిన సైన్యాలు అన్నీ యుద్ధం గొడవే మరచి నిద్రపోతున్నాయా అన్నట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. రాత్రి రెండవ యామం పూర్తిఅయి మూడవయామపు కోళ్ళు ఆ చుట్టుప్రక్కలఉన్న శివారు గ్రామల్లో ‘కొక్కరొ కో’ అని అరచేటప్పటికి ‘జై స్వయంభూదేవేశ్వరా జై’ అని రోదసీకుహరం మారుమ్రోగేటంత భయంకరధ్వనితో కోటలోనుండి వచ్చిన విఠలధరణీశుని సైన్యాలనుండీ, చెలుకినాయని సైన్యాలను అరికట్టిన గోన గన్నారెడ్డి సైన్యాలనుండీ మహాధ్వని బయలు దేరింది.

ఎంత అప్రమత్తులై ఉన్నా చెలుకినాయని సైన్యాలు ఆ ధ్వనితో దద్దరిల్లి పోయినవి. కోటవైపునుంచి సైన్యాల వత్తిడి ఎక్కువయింది. విఠలధరణీశుని ఉరుములాంటి సింహనాదాలు చెలుకినాయని సైన్యాలదగ్గరగా వినపడుతున్నాయి. కోటవైపుతిప్పిన ఏనుగులమీద ఉన్న విలుకాండ్రను ఎడతెగకుండా పుంఖాను పుంఖాలుగా బాణాలు వదలండని చెలికినాయుడు ఆజ్ఞాపించాడు. కాని విఠలధరణీశుడు ఫలకాలను ఒక మహా ఛత్రంలా భల్లయుద్ధవిశారదులైన గండరగండలైన వెయ్యి మంది జోదులను ఒక తరంగముక్రిందను, వారివెనుక యింకొక వెయ్యిమంది విలు కాండ్రు రెండవ తరంగముక్రిందను, మూడు నాలు ఐదు తరంగాలక్రింద నూరేసి ఏనుగులను, ఆ తరంగములవెనుక ఆ ఐదువందలమంది ఆశ్వికులు చెలుకినాయని సైన్యాలమీద విరుచుకుపడ్డారు. ఏనుగులమీదనుంచి విలుకాండ్రు చెవి కంట నారులను లాగి రివ్వున బాణాలను వదిలిపెట్టుతూ ఉంటే ఆ బాణాలు మహిషాలమీద పడు వానచినుకుల్లా వృధా అయిపోతున్నవి.

అయినను ఒక్కొక్క బాణము ఒక్కొక్క భల్లధరుని ఫలకంలోంచి చొచ్చుకుపోయి ఆ వీరుని దేహంలోంచి దూసుకుపోయి ప్రాణాలు అపహరించే కాలాహి అవుతున్నది.

ఆ భల్ల వీరులు చెక్కు చెదరక అయిదారు బాహువుల మహాభల్లాలతో గజ యూధాన్ని తాకినారు. గజయుద్ధం చేయడం ఉత్కృష్టమైన వీరవిద్య. గజవేగం కన్న ఎక్కువవేగం కలిగి, తొండంపట్టుకు, దెబ్బకు తప్పికొని అతివిశమైన దీర్ఘ ఛురికలతో తొండమును కోసివేయకలిగి, మేరువులాంటి పాద ప్రహారాలను మెరుముల్లా తప్పించుకొనేవాడే గజయుద్ధవిశారదుడు.

వీరికి బాసటగా వచ్చిన ఆశ్వికులు పొడుగాటి వేణుదండాలకు చివరనూనెలో తడిపిన గుడ్డలనుకట్టి భల్ల వీరులు ఏనుగులను తాకగానే ఈ ఆశ్వికులు ఒక్క క్షణంలో చెకుముకులుకొట్టి ఈ పొడుగాటి కాగడాలు వెలిగించారు. ఆ కాగడాలు ఏనుగుల ముఖాలలోకి చొప్పించారు.

ఇదంతా కొన్ని నిమేషాలలో జరిగింది. ఒక్కుమ్మడి చెలుకినాయని ఏనుగులన్నీ భయపడి గీపెట్టుతూ వెనక్కు తిరిగాయి. మావటీలు ఏనుగులను ఆపుచేయలేకపోయారు. చెలుకినాయుడి సైన్యాలన్నీ చిందరవందర అయిపోయాయి. అప్పుడు యుద్ధవిశారదుడైన చెలుకినాయుడు తన మహానిస్సాణ గజాన్ని తుంగభద్రానదీ నీరాలలోనికి దింపినాడు. ఆ నిస్వాణధ్వని విని చెలుకినాయని సైన్యాలన్నీ తుంగభద్రలోనికి దిగినవి. తుంగభద్రను దాటిన చెలుకినాయని సైన్యాలు ఇదివరకు అక్కడ కాపలా కాస్తూయున్న సైన్యాలతో కలసి ఉత్తరాభిముఖము పట్టి అతి వేగముగా పారిపోవడం ప్రారంభించాయి. ఐంద్రి ఆవల సైన్యాలు విఠలునికి దాసోహ మన్నాయి.

తెల్ల తెల్లవారిపోతున్నది, ముందు బేడ చెలుకినాయని నిస్సాణగజము, ఆ వెనుక చెలుకినాయుడు రథందిగి అధివసించిన గజము, ఈ రెంటిని వెన్నంటి తక్కిన సైన్యాలు! కందనోలు యుద్ధంలో తన సైన్యానికి అట్టే నష్టం కలగ లేదని చెలుకినాయుడు సరిచూచుకున్నాడు.

బాగా తెల్లవారేటప్పటికి కృష్ణవద్దకు వచ్చాయి సైన్యాలు, ఆ వసంత కాలంలో ఈషత్ కృశాంగిఅయిన కృష్ణానది వేగముగా ప్రవహిస్తున్నది. చెలుకినాయుడు కృష్ణఒడ్డుననే సైన్యాలను పడమటగా త్రిప్పి కొంత దూరం పోనిచ్చి దక్షిణానికి మరలి ఆదవోని సైన్యాలను కలుసుకుందామనిన్నీ ఆ సైన్యాలతో వెళ్ళి కందనోలు ముట్టడించి నేలమట్టం చేయాలనిన్నీ సంకల్పించాడు.

కాని కృష్ణ ఒడ్డుననే పడమటగా వెళ్ళుతున్న బేడ చెలుకినాయని సైన్యాల వెనుక ప్రక్కనుంచి విఠలధరణీశుని సైన్యాలూ, ముందుప్రక్కనుంచి గోన గన్నారెడ్డి సైన్యాలూ చుట్టుముట్టాయి. గన్నారెడ్డి చెలుకినాయనిచారుణ్ణి ఒకణ్ణి పట్టుకొని వానిచేత చెలుకినాయుడు తన నిస్సాణం గోన గన్నారెడ్డికి సమర్పించి తిన్నగా ఆదవోని పట్టణం చేరుకునే నియమంమీద ఆదవోని సైన్యాలకు ఏమీ ఆపదరాకుండా వదలిపెడతానని వార్త పంపించినాడు. చెలుకినాయుడు అఖండకోపంతో మండిపోయారు. తమప్రాణాలతో గన్నా రెడ్డిని, విఠలయ్యను బందీలుగా పట్టుకొని ఆదవోనికి తీసుకు వెళ్ళక వదలనని చెలుకినాయుడు ఎదురు వార్త పంపించాడు.

ఆ వార్త గోన గన్నారెడ్డి విని పకపక నవ్వుకున్నాడు. తనవార్త గన్నారెడ్డికి వెళ్ళి అందేలోపుగా బేడ చెలుకినాయని మహాసేనానాయకుడు కృష్ణానది పునాదిగా అర్ధచక్రవ్యూహము రచించుకొని గన్నారెడ్డి విఠ్ఠలధరణీశుల విజృంభణ కెదురుచూస్తూ సిద్ధమై ఉండెను.

గన్నారెడ్డి సైన్యాలు విఠ్ఠలధరణీశుని సైన్యాలు ప్రావుక్రోశం దూరం వెనుకకు నడిచాయి. మండిపోయే ఆ వసంత మధ్యాహ్నపు టెండలో చెలుకినాయని సైన్యాలమీద ఎడతెరిపి లేకుండా అగ్నిబాణం కురియడం ప్రారంభించింది. అందులో చెలుకినాయుడు తన రథం దిగి అధివసించిన మత్తగజముపైనా, నిస్సాణమ్మోసే గజము ముందుననూ భరింపరాని దుర్వాసనలు వెద జిమ్ముతూ గంధకబాణములు మండుతూ పడుతున్నవి.

ఆ పొగలకు ఏనుగులు రెండూ ఉక్కిరి బిక్కిరి అయి ధైర్యాలను వీడి అగ్ని బాణాలకు చిందర వందరై పారిపోతూ ఉన్న ఆదవోని సైన్యాలను వీడి కృష్ణలోకి ఉరికి ఎటు వీలయితే అటు పారిపో ప్రయత్నం చేసినవి.

బేడ చెలుకినాయని ఏనుగున్ను, అతని విజయనిస్సాణగజమున్ను గన్నారెడ్డి సైన్యాలకు చిక్కాయి. తక్కిన సైన్యాలను గన్నారెడ్డి పారిపోనిచ్చాడు.

గన్నారెడ్డి: బేడ చెలుకినాయకప్రభూ! నీ విక్రమానికి మా జోహారులు. అయినా ఈ గజదొంగ మాయలముందు నీవీమి నిలవగలవయ్యా! కాబట్టి నువ్వు నీ ప్రభువు కోటారెడ్డి మహారాజుగారి మనస్సు త్రిప్పు, శ్రీ రుద్రదేవ మహారాజు స్త్రీ యే. ఆవిషయంలో మీరందరూ అనుమానించినది నిజం. ఏమీ సందేహంలేదు.

బేడ చెలుకి: ఆడది ఎప్పుడైనా నా రాజ్యం చేసినదయ్యా!

గన్నారెడ్డి: ఇప్పుడు ఎందుకు చేయకూడదు? ఆమె దివ్యస్త్రీ. ఆమె అవతార మెత్తిన లలితాంబ!

బేడ చెలుకి: గన్నారెడ్డి! నువ్వు గజదొంగవా?

విఠలధరణీశుడు: మేము గజదొంగలం, దారిదోపిడిగాళ్ళం.

గన్నారెడ్డి: మా దొంగతనాలకు అడ్డంరాని కారణంచేత చక్రవర్తన్నా, ఆయన కుమారి శ్రీ శ్రీ రుద్రదేవ ప్రభువులన్నా మాకు భక్తి.

బేడ చెలుకి: అధర్మయుద్దం చేసి నన్నోడించావు.

గన్నారెడ్డి: ఓయి వెఱ్ఱిప్రభూ! నేను ఇంతవరకు ఎప్పుడూ అధర్మ యుద్దం చేయలేదు. అన్నాంబికాదేవి మా అక్కగారి నగరంలో ఉంటున్నది. మా అక్కగారిని పట్టుకోడానికి వచ్చావు కాబట్టి నీ ప్రసిద్ధనిస్సాణము మేము అపహరిస్తున్నాము.

7

కాకతీయవంశానికి సేవకులై, మహాసేనాపతులై, మహామాండలికులై మల్యాలవంశ్యులు ప్రసిద్ధిపొందిరి. ఈ వంశముపోరు ఇటు బుద్ధపురములో అటు కొండపర్తిలో ప్రభువులై రాజ్యం చేస్తూ ఉండిరి.

ఓరుగల్లు మహానగరానికి నైరుతిగా డెబ్బదిగవ్యూతుల దూరంలో శాలివాహనుల కాలమునుంచి ప్రసిద్ధికెక్కిన బుద్ధపురమనే నగరం రాజధానిగా గణపతిదేవ - ప్రసాద - ప్రసూత ప్రాచ్యరాజ్యలక్ష్మీ సమాశ్లిష్ట దక్షిణ భుజదండుండును, సమర సమయాఖండలుండును, సంకినపురాధినాథరిపు తిమర మార్తాండుండును, పెదముద్దుగండమిండుడును, బాచ మహారాణీ బాచమహా రాజపుత్రుండునూ, మల్యాలవంశ కలశాంభోధిచంద్రుడును, వారనారీయౌవనవన వసంతుండును, దుష్టతురగరేఖారేవంతుడును, అసిముసలకార్ముక ప్రముఖ నిఖిలాయుధ కుశలుండును, కీర్తివిశాలుండును, రాజసమాజ జేగీయమాన నిజభుజ విజయుండును, విక్రమ విజిత విజయుండును, శ్రీ కుప్పాంబా మానససరోవర విహరమాణ రాజహంసుడును, శ్రీ విశ్వనాథదేవ దివ్యశ్రీ పాదపద్మారాధకుండును, రిపుకులభేదకుండును అయిన శ్రీ శ్రీ మాల్యాల గుండయ దండాధీశ్వరుడు రాజ్యంచేస్తూ ఉండెను.

ఆ మహారాజు దేవేరి వర్ధమానపురాధీశ్వరుడైన గోన బుద్ధారెడ్డి మహారాజు కొమరిత, గజదొంగ గోన గన్నారెడ్డి అక్కగారు, గన్నారెడ్డి బేడ చెలుకినాయని నిస్సాణాపహర్తయైన ముహూర్తానికి వారం దినాలకు, ఆదవోని ప్రభు తనయను అన్నాంబికాదేవిని సగౌరవంగా తోడుకొని బుద్ధపురం చేరినదాయెను.

కుప్పాంబికాదేవి ముప్పదియారేండ్లది. కుప్పాంబికాదేవికి ముగ్గురు సంతానం. పెద్దవాడు బాచయ్య. బాచయ్యప్రభువు పన్నెండేండ్లవాడు. రెండవకుమారుడు చొప్పప్రభువు ఎనిమిదేండ్లవాడు. మూడవవాడు గణపతిదేవ ప్రభువు నాలుగేళ్ళబిడ్డడు. కుప్పాంబికాదేవి తమ్ముడైన గోన గన్నారెడ్డి ప్రోత్సాహంవల్ల భర్త అనుమతితో అన్నాంబికాదేవిని తనతో తీసుకొని రావడానికి కొంతసైన్యముతో బయలుదేరి కృష్ణానదీ తుంగభద్రానదీ రెండూ దాటి ఆదవోని వఱకు వెళ్ళినది. ముగ్గురుబిడ్డలు బుద్ధపురంలోనే ఉండిపోయిరి. ఆ రాత్రి ఆ మహారాణి ఆదవోనిదగ్గర అరుంధతిపాలెంలో విడిదిచేసి ఉన్నప్పుడు అన్నాంబికా రాకుమారి పురుషవేషంధరించి గోన గన్నారెడ్డి సైన్యానికి చెందిన ఒక దళం వెంబడి తనదగ్గరకు వచ్చేటప్పటికి అతిసంతోషముతో ఆ బాలికను తన హృదయానికి అదుముకొన్నది.

కుప్పాంబిక కాయశరీరంగల బంగారు శలాకలాంటి మనోహరాంగి. ముగ్గురు బిడ్డల తల్లియైనా సడలిపోని జవ్వనపు బిగువు కలది. కుప్పాంబికా దేవికి భర్త అంటే భగవంతుడే, బుద్ధారెడ్డి గారాబుకూతురై గోనవంశ దుగ్ధాంభోధిలో మందారవృక్షంలా ఉద్భవించి మల్యాలనందనవనాన్ని తేజరిల్ల చేస్తూ చొచ్చింది.

కుప్పాంబికాదేవి తమ్ముళ్ళ నిద్దరినీ అత్యంతప్రేమతో తల్లి అనంతరం పెంచింది. తండ్రిపోలికలు మూడుమూర్తులా పుణికపుచ్చుకున్న పెద్దతమ్ముణ్ణి, మేనమామ అయిన శ్రీ విరియాల భీమనృపతిలా, అపర భీమునిలా ఉన్న విఠల ధరణీశుని అచంచలమైన ప్రేమతో పెంచింది.

గన్నారెడ్డి తెలివి, బుద్ధి, చదువు అనుమకొండ మహావిద్యాక్షేత్రంలో ప్రసిద్ధిపొందినాయి. అలాంటి గన్నారెడ్డి ఎందుకు శ్రీ గణపతిదేవ రుద్రదేవ మహాప్రభువులకు ఎదురుతిరిగినాడో ఆమెకు ఏమీ తెలియదు. కాని అందులోని రహస్యం ఏదో తన భర్తగారగు శ్రీ గుండయమహారాజుకు తెలియును. ఆయన కుప్పాంబికను చూచి “దేవీ, మా బావమరదులు గన్నారెడ్డీ, విఠలధరణీశుడూ ఏవో కొన్ని మహత్తర కారణాలుండి గజదొంగలయ్యారు. కాని నేను విన్నంతవరకు వాళ్ళు దారులు ఎక్కడా దోచినట్లెరుగను, ఇక ముందును దోచబోరు. ఉత్తరోత్తరా మీకు కొన్ని రహస్యాలు చెప్తాను. గన్నారెడ్డి యుద్ధవీరులలో మేటిరత్నం. నీ పినతండ్రిగారు లకుమయారెడ్డి భూపాలుడు మీ తమ్ముళ్ళ నిద్దరిని అన్యాయం చేయ సంకల్పించుకొన్నారు. అ సందర్భములో వీరుడైన గన్నారెడ్డి ఎట్లు ఊరకొనగలడు” అని చెప్పినారు.

భర్త చెప్పిన ఈ ముక్కలు విని కుప్పాంబికాదేవి హృదయం పొంగి పోయింది. ఆ రాత్రి అన్నాంబికాదేవి పురుషవేషంతో తన దగ్గరకు అలా రాగానే ఆమెను కౌగలించుకొని “తల్లీ, అన్నాంబికా రాజకుమారీ! రాజకీయాలు ఎప్పుడూ యిలా కర్కశంగా ఉంటాయి. మీరు మీ తండ్రిని, తల్లిని వదలి ఈలా రావలసిన అత్యవసరాన్ని గూర్చి మా తమ్ముడు గన్నారెడ్డి ప్రభువు నా కన్నీ చెప్పినాడు. ఈ సంఘటనవల్ల ఈ కుటుంబాలన్నిటికీ ఏయే కష్టాలు వస్తాయో అవి అన్నీ మనం భరించవలసి ఉండెను” అని చెప్పింది.

అన్నాంబికాదేవి: కుప్పసానమ్మదేవీ! మీ భర్త గుండయ మహారాజుల వారు వితరణంలో కర్ణుని, శిబిని చిన్నబుచ్చుతున్నారు. వారికి తగిన దేవేరులు మీరు. మీ ఇద్దరి దాంపత్యము అనన్యము. అలాంటి మీకు తమ్ములైన గోన గన్నారెడ్డి ప్రభువు గజదొంగలంటే నేను నమ్మను. నాకు వరదారెడ్డి రాకుమారుని వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేదు. అందుకని ఈ వివాహం తప్పించాలని ప్రయత్నంచేసే మీ తమ్ముల సహాయం నేను అంగీకరించాను.

కుప్పసానమ్మ: సంతోషం తల్లీ, మనం వెంటనే బయలుదేరాలి.

ఇంతలో గోన గన్నారెడ్డి ప్రత్యక్షమై వారిని ప్రయాణం చేశాడు. ఆ రాత్రి రాత్రి వారు కందనోలు చేరుకున్నారు. కందనోలులో రెండు దినాలు ఆగి కృష్ణా తుంగభద్రా సంగమమైన సంగమేశ్వరమునకు పోయి ఆ పుణ్యతీర్థంలో క్రుంకులిడి సంగమేశ్వరుని అర్చించి బ్రాహ్మణులకు విరివిగా దానా లిచ్చి రెండు దినాలల్లో బుద్ధపురంవచ్చి చేరిరి.

బుద్ధపురంలో అన్నాంబికాదేవి, గన్నారెడ్డికీ బేడ చెలుకినాయనికీ జరిగిన యుద్ధ పర్యవసానం ఏమైందో అని ఆతురతతో కనిపెట్టుకొని యుండెను. కుప్పాంబికా మహారాణిని ‘వార్తలేవైనావచ్చినవా’ అని అడుగుచుండెను.

వీరు బుద్థపురంవచ్చిన మూడవదినానికి గన్నారెడ్డి, విఠ్ఠలధరణీశులు మహారాణి అంతఃపురానికి వచ్చారని వార్తవచ్చింది. ఆ వార్త వినడంతోనే అన్నాంబిక హృదయం ఒకగంతువేసింది. ఆమెకు గన్నారెడ్డి వచ్చారనే వార్తతో పాటు ఒక మహానిస్సాణ ధ్వని బుద్ధపురమంతా మారుమ్రోగింది. ఆ గంభీరధ్వని వినడంతోనే అన్నాంబిక తన మేనమామ అయిన బేడ చెలుకినాయనింవారి నిస్సాణాన్ని గన్నారెడ్డి విజయప్రాభృతంగా కొనివచ్చినారని అర్థం చేసికొన్నది. ఆమెలో ఏదో సంతోషం, ఏదోభయం ఆవరించుకున్నవి. ఎవ రీ గన్నారెడ్డి? ఈ గజదొంగ అంటే తన కింత కుతూహలం ఎందుకు? ఈయన మహాపురుషుడా? హీనుడా? తాను ఇట్లా తల్లిదండ్రులను వదలి ఇంత విచిత్రంగా ఈ బుద్ధపురం రావటం ఏమిటి?

అన్నాంబిక ఆమెకై ఏర్పాటుచేసిన శుద్దాంతనగరిలో ఉపథానాల పల్యంక పీఠముపై అధివసించి వేయి ఆలోచనల పాలయింది. ఎంత ఆలోచించినా హాస సుందరమైన గన్నారెడ్డి మోము ఆమె హృదయాన్ని చిందరవందర చేస్తున్నది. తా నా పురుషుని ప్రేమిస్తున్నానని ఆమె నిశ్చయానికి వచ్చింది. ఆ నిశ్చయం ఆ బాలకు కలగడంతోటే ఆమె గజగజ వణకిపోయింది. యుద్ధవిక్రమంలో, సౌందర్యంలో అర్జునుడై ఈ మహాభాగుడు గజదొంగ అని కళంకం సంపాదించుకొన్నా డేమిటి? తన్ను పెండ్లి కూతురునిచేసి చిన్న బంగారురథముమీద అధివసింపచేసి, బంగారుపువ్వుల పట్టుతెరలు కప్పి వివాహమందిరానికి తన్ను తీసుకువస్తూ ఉండగా తెర ఒత్తిగించి ఈవిచిత్రకథానాయకుని తాను చూచినప్పటినుంచి తన మనస్సు ఆయనపై లగ్నమైయుండి ఉండాలి. అది పవిత్ర ముహూర్తమో, దుర్ముహూర్తమో?


8

తా నీ మహాపురుషుని, ఈ గజదొంగను, ఈ పరమోత్తమ వీరుని ప్రేమిస్తున్నమాట నిజం! ఈ ఉత్కృష్టమూర్తి ఈవిధంగా తన జీవితాకాశం ఆక్రమించిన వెలుగుమూర్తి అయినాడేమి! అదేనాప్రేమ? ఈప్రేమనేనా శకుంతల దుష్యంత దర్శనముచే అనుభవించినది! తన్ను ఆ మహాపురుషుడు ప్రేమించగలడా? ఈ వీరాధివీరుడు, ఈఉత్తమ దుర్జయాన్వయుడు తన్ను ప్రేమించకపోయిన క్షణం తనజన్మతీరినట్లే! లోకమే తలక్రిందు లగునుగాక, సర్వభువనాలూ మండిపోవునుగాక, తా నీ వీరుని చెట్టపట్టకుండ నెవరు వారింపగలరు?

“ఈ వీరుడు గజదొంగ అగునుగాక. తానును గజదొంగ అవుతుంది! ఆయన రాజ్యాలు నగరాలూ దోచనీ, తానును అలాగే చేయగలదు. ఆయన ప్రేమకై తపస్సుచేసి, ఆయన చూపులకై తేజస్సుల వెలిగించి, ఆయన ప్రేమ భాషణలకై సర్వశ్రుతులూ స్పందింపజేసి, ముల్లోకాలనూ గగ్గోలుపరగలదు తాను” అని ఆమె ప్రతిజ్ఞ గై కొంది. ఆ ఆలోచనతో ఆమె ఉప్పొంగిపోయింది. వేయి మనోహరరాగాలు ఏక రూపొంది, అమృతప్రవాహమై ఆమెను చుట్టివేసినవి. ఆమె పులకరించిపోయినది. ఆమె జీవితంలో ప్రతిఅణువు గన్నభూపతిపై ప్రణయముచే దివ్యత్వము పొందింది.

ఇంతలో కుప్పాంబికాదేవికడనుండి అన్నాంబికను దర్శించుటకు అనుమతిని కోరు పిలుపు వచ్చింది. అన్నాంబిక పీఠమునుండి లేచి తాను మహారాణిరాకకై గౌరవంతో ఎదురుచూస్తున్నదని ప్రతివార్త పంపినది. కొంతసేపటికి కుప్పాంబిక అన్నాంబికకడకు వచ్చినది.

అన్నాంబిక తొందరగా ముందుకు నడచివచ్చి ‘మహారాణీ! మీరు నన్ను అనుమతి వేడడం సమంజసముగా లేదు. మనము దగ్గరచుట్టాలము. నేను మీకన్న చిన్నదానను’ అని కన్నుల నీరు తిరుగ మనవిచేసింది.

కుప్పాంబిక అన్నాంబిక చేతులుపట్టి దాపుననున్న ఆసనముపై ప్రక్కన కూర్చుండబెట్టుకొని ‘రాజకుమారీ! మీరు ఆదవోని ప్రభువుల కుమారికలు. మీకు ప్రధానోత్సవం చేయబోయేముందు మాతమ్ముడు మిమ్ము ప్రోత్సహించి తల్లి దండ్రులను వదలి పారిపోయి వచ్చునట్లు చేసినాడు. మీరు మా అతిథులు. తల్లిదండ్రులను విడిచి వచ్చినందుకు మీమనస్సు ఏదైనా కించపడుతోందేమోనని మాతమ్ముడు కనుక్కొమ్మన్నాడు’ అని అనునయపు మాటలు పలికినది.

అన్నాంబిక: మహారాణీ! నేను గన్నారెడ్డి ప్రభువులతో ఏమీ అనుమానం లేకుండా వరదారెడ్డి రాకుమారుని వివాహం చేసుకోడానికి ఇష్టంలేదని స్పష్టంగా మనవిచేసి ఉన్నాను. ఆదవోనినుంచి నేను పారిపోయివచ్చే వీలు ఆ ప్రభువు కల్పించకపోయినట్లయితే నా వజ్రపుటుంగరములోని విషము త్రాగిఉందును.

కుప్పాం: అన్నాంబికాదేవీ! మీరు మీ తలిదండ్రులను విడచి ఏదో పర్యవసానం తేలేవరకూ నాదగ్గిర ఉండగలరా?

అన్నాం: మహారాణీ! మా నాయనగారు నేను ఇక్కడ ఉన్నాను అని తెలియగానే కోపగించి, తనసైన్యాలు, తనస్నేహితుల సైన్యాలతో వచ్చి మీ కోట ముట్టడించవచ్చును. మీ సైన్యాలతో అనేకమంది వీరులు మడియవచ్చును. ఇందుకు నాకు ఒకే ఉపాయం తోస్తూఉన్నది. నన్ను ఓరుగల్లు పంపించండి. అక్కడ శ్రీ రుద్రదేవి మహాప్రభువుగారి అంతఃపురంలో ఉంటాను.

కుప్పాం: ఎంత ఆలోచనమ్మా మీది! మీరన్నట్లే మా తమ్ముడున్ను చెప్పినారు. మీ తండ్రిగారవడంవల్ల ఆదవోని ప్రభువును ఏమి చేయడానికీ తనకు ఇష్టంలేదట!

అన్నాం: వారికి కృతజ్ఞురాలను. కుప్పాం: నేనూ, బుద్ధపుర మహాప్రభువులూ బయలుదేరి శ్రీ గణపతి రుద్రదేవ సార్వభౌములను, శ్రీరుద్రదేవ ప్రభువులను దర్శించడానికి వెళ్ళాలను కుంటున్నాము. రేపు పూర్ణిమ వెళ్ళిన తదియనాడు అందరమూ బయలుదేరి వెళ్ళుదాము.

అన్నాం: నావల్ల మీ కందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయికాదా!

కుప్పాం: అదేమమ్మా ఆ మాటలు? ఒకసారి మా తమ్ముడు మీ క్షమాపణ అడగాలని.....

అన్నాం: నా క్షమాపణా? ఎంతమాట! వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పించవలసి ఉన్నది. వారి దర్శనము చేయిస్తారా?

కుప్పాం: రోగీ, వైద్యుడూ పాలే కోరుతారు ఒక్కొక్కప్పుడు.

చిరునవ్వు ఆమె మోమున ప్రసరింప అన్నాంబికచేతిని గ్రహించి కుప్పాంబిక తన అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి అభ్యంతర సభాగృహంలో ఒక సింహ పీఠికపై కూర్చుండబెట్టింది.

చెలులు పలువురు వచ్చి, అన్నాంబికకు, కుప్పాంబాదేవికి లత్తుకపెట్టి కుంకుమపూవు పాపటను అద్ది, గంధం, పరిమళతైలాలు అలదినారు. ఒక చెలి బంగారు పళ్ళెరమున అమూల్యాభరణాలు తీసుకొనివచ్చి ఆమెకు అలంకరించింది. ఆమెను అలంకారమందిరానకు కొనిపోయి, వెలపొడుగుచీర, ఉపవీతము, స్తన చీనాంబరము కట్టినారు.

మరల అన్నాంబికాకుమారిని కొనివచ్చి వా రామెను ఉచితపీఠంపై అధివసింపచేసినారు. ఇంతలో వా రిద్దరి అనుమతిని వేడుతూ గోన గన్నయ్య వార్త పంపినారు. అన్నాంబికా రాకుమారి అనుమతి ఇచ్చినది.

గన్నారెడ్డిని చూచుట యనగనే ఆమెకు మహానందమైనది. ఆయనకై త న్నలంకరిస్తున్నారని ఆమె పారవశ్యం పొందింది. ‘ఆయన వరుడై, తాను వధువైననాడూ ఇలాగే అలంకరిస్తారా?’ అని ఆమె ప్రశ్నించుకొన్నది.

ఒకసారి మెరుపుమెరసినట్లు ఆ పురుషుని చూచింది! రెండవసారి తోటలో చంద్రకాంతిలో అస్పష్టంగా తొందరపాటులో చూచింది ఆ సందర్శనాలే చాలు, ఆయన దివ్యవిగ్రహము తనహృదయంలో అనంతకాలం నిలిచిఉండుటకు. ఎంతటి ఉన్నతరూపము! ఏమి దేహచ్ఛాయ! ఏమా బలరూపసంపద! ఏమి ఆఠీవి! కుమారస్వామి కా ఠీవి ఉండగలదా? ఆ నడకలో ఎంతటి విలాసము! ఆయన కంఠమాధుర్యము తన శ్రవణలోకంలో దివ్యగీతాలు రచించినది! సంతతహాస ప్రపుల్ల మా మోము. ఆ సోగమీసాలు, ఆ విశాల నేత్రాలు, ఆ కాటుకకళ్ళు, తెల్ల దానిమ్మగింజలవంటి పలువరుస! ఓహో! ఆ బాహువులబలం శ్రీరామచంద్రుని వింటిని విరువగలదు. ఆ బాహువుల బలం పువ్వులనైన నల్పలేదు. ఆ బాహువులు స్వామిద్రోహుల పిండిగొట్టగలవు. కందనోలులో ఈ ఉత్తమపురుషుని రాజశుద్ధాంతంలోని దాసీ లందరు ఎంత కృతజ్ఞతతో ఎంత మనోహరంగా వర్ణించారో!

ఇంతలో గోన గన్నారెడ్డి మందగమనంతో లోనికి విచ్చేసినాడు.

అన్నాంబికాదేవి లేచి నిలుచుండి గోన గన్నారెడ్డికి నమస్కరించింది. అక్కగారికి ప్రభువు నమస్కరించాడు.

‘అక్కయ్యగారూ! మీ ప్రయాణం, శ్రీ ఆదవోనిప్రభుకుమారి ప్రయాణం సౌఖ్యంగా కొనసాగిందా?’

కుప్పాం: గన్నయా! ‘మీ యుద్ధం ఏమయిందో’ అని మేము కళవళ పడుతుంటిమి!

అన్నాం: విజయనిస్సాణం కొనివచ్చినందుకు సంతోషం.

గన్నయ్య: మీకు ఎవరు చెప్పారు?

అన్నాం: దాని ధ్వనియే చెప్పింది.

గన్నయ్య: బేడ చెలుకినాయనింవారిని సగౌరవంగా ఆదవోని పంపించాము.

కుప్పాం: ఏమంత దయతలచినారు తమ్ముడూ?

గన్నయ్య: నే నెప్పుడయినా కఠినాత్ముడనా? గజదొంగను కావచ్చు.

అన్నాం: ‘గజదొంగ’, ‘గజదొంగ’ అని అస్తమానం అనకండి.

9

అన్నాంబికా రాకుమారి అతితీవ్రంగా అన్నమాటలకు గోన గన్నయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. తాను ‘గజదొంగ’ అయితే నేమి, కాకపోతే నేమి ఈ బాలికకు? ఆడవారి ఆలోచనలన్నీ అదోరీతిగా ఉంటాయి. ఈమె తన తమ్ముడును, పినతండ్రి కుమారుడును అయిన వరదారెడ్డిని వివాహం కావడానికి ఇష్టంలేక బాధపడుతూ, ప్రాణత్యాగమైనా చేసికొనుటకు సిద్ధమయివుంటే తా నామెను ప్రధాన మహోత్సవంనుండి తప్పించి తీసుకొనిరావడంవల్ల, తాను సత్పురుషు డనుకొంటున్నది కాబోలు! ఏమి వెఱ్ఱితనం?

ఆడవారిలో మహోత్తమురాలు, ఆంధ్ర మహాసామ్రాజ్యయువరాజ్ఞి రుద్రదేవి మహారాణివారు ఒక్కర్తే! తక్కినవాళ్ళూ మంచివారే! వారందరూ అనుకూలురైన భర్తలపజ్జచేరి, ముత్యాలవంటి బిడ్డలగని పెంచి పెద్దవారనిచేసి, కౌసల్యవంటి, యశోదవంటి, తన తల్లి వంటి, తన అక్కగారివంటి తల్లులుకావాలి. ఒక్క రుద్రదేవప్రభువునకే స్త్రీ అయినా, పురుషధర్మమైన యుద్ధము చెల్లుతుంది. తక్కినవారు పత్నులు, తల్లు లవడానికి ప్రయత్నించాలి.

కుప్పాం: ఏమయ్యా తమ్ముడూ! ఏమి ఆలోచిస్తున్నావు? గన్నా: (ఉలిక్కిపడి) ‘ఏమీలేదు అక్కా! మీరూ, బావగారూ, శ్రీ అన్నాంబికా రాకుమారిగారూ ఎప్పుడు ఓరుగల్లుపురం ప్రయాణమై వెళ్ళేది?, అని ఆలోచిస్తుంటిని.

కుప్పాం: రేపు పూర్ణిమ వెళ్ళిన తదియకదా?

గన్నా: మీరు వెళ్ళగానే, ఈ గజదొంగ విషయమై శ్రీ రుద్రదేవ ప్రభువులు, శ్రీ శివదేవయ్య మంత్రుల్ని అనేక విధాలుగా ఒత్తిడి చేయవచ్చును.

అన్నాం: ప్రభూ! మీరు మాతోరండి, నేను వెళ్ళి మహారాజయిన రుద్రదేవ ప్రభువుల పాదాల వాలి తమ్ము క్షమింపుమని వేడుకొంటాను.

గన్నారెడ్డి తనలో ‘మళ్ళీ ఈమె ఏదో మొదలు పెట్టింది బాబూ’ అనుకుంటూ, పైకి ‘రాజకుమారీ! నా పరాకృతఫలం నేను అనుభవింపక తప్పదు గదా! ఎవ రేమి ప్రయత్నం చేసినా లాభంలేదు! పైగా ఆ రుద్రప్రభువు నా రాజ్యం మా పినతండ్రి అనుభవిస్తూంటే, ఒక్క పిసరంతైనా అది అధర్మమని శ్రీ లకుమయారెడ్డి ప్రభువులకు వార్త పంపినారుకారు. అలాంటి వారి గొడవ నా కక్కరలేదు. నా గొడవ వారి కక్కరలేదు! నాకొరకు మీరు ఆయాసం చెందకండి.’

అన్నాంబిక ఆ మాటలు విని ఎంతో చిన్నబుచ్చుకొన్నది. అయినా ఈ వీరుని కోపం తనమీద కాదు, రుద్రదేవుల ప్రభువుల మీద అయినట్లు స్పష్టమేకదా, తనంటే ఈషణ్మాత్రం గౌరవం కలిగినా, గన్నారెడ్డి ఆ ముక్కలనేవారు కాదు.

అన్నాంబిక కించపడుట గన్నారెడ్డి కనిపెట్టి ‘రాజకుమారీ! అలా అన్నానని మీరు ఆశ్చర్యం పొందకండి! నేను మొరకుణ్ణి; మీరు సదుద్దేశంతో, దయతో అన్నమాటలు మీ ఉత్తమహృదయాన్ని తెలుపుతాయి. అందుకు నేనూ, మా తమ్ముడూ తమకు కృతజ్ఞులం. నవనీత హృదయంగల మిమ్ములను మాపై క్రోధం వహించి ఉన్న రుద్రదేవ ప్రభువులు ఏమంటారో అని భయం. ఇది మీరు అన్యధా తలచకండి’ అని వేడికొను మాటలు కాకువుతో అన్నాడు. ఆ మాటలకు అన్నాంబిక కలతతేరి, ‘ప్రభూ, నేను సెలవు తీసుకొంటాను’ అని హర్మ్యంలోకి మందాక్రాతవవృత్తములా నడిచి వెళ్ళిపోయింది.

గన్నారెడ్డి తన కర్కశత్వానికి తానే తెల్లబోయి, మ్రాన్పడి అట్లే కూరుచుండిపోయినాడు.

కుప్పాంబిక తమ్ముని చుఱచుఱ చూచి ‘తమ్ముడూ! మీరు అన్నాంబికా రాజకుమారి మనస్సు అలా నొప్పించినా రేమిటి?’ ప్రత్యుత్తరము కోరని ప్రశ్నవేసి, కుందిన హృదయంతో లోనికి వెడలిపోయింది.

గన్నారెడ్డి అట్లే నిలుచుండిపోయినాడు. తనలో ఏదో విపరీతస్థితి సంభవించి ఉండడంచేత ఎవరన్నమాటలకూ ఎప్పుడూ విసుగుచెందని తాను ఈ దినాన తల్లిదండ్రులను వీడి, రాజకీయపు సుడిగుండాలలో పడిన ఒక అమాయికపు బాలికను, తనయందు ఉత్తమ గౌరవంతో ఏదోచేయాలని ఉన్న ఒక గుణశీలను ఆవిధంగా మనస్సు నొప్పించినా డేమిటి? ఏలాగు తాను ఆ బాలిక ననునయించుట? అప్పుడే అరవిచ్చు మందార పుష్పంలా ఉన్న ఈ శాంతశీలను మనస్సు నొప్పించగలిగిన తన చెయిదము క్షమింపరానిది. ఈ దినాన తనకు జరిగిన సంఘటన తనకు ఒక్క నిమేషమేని మరువరాని అప్రమత్తతను నేర్పుతున్నది. ఈనాటినుండి శత్రుల అడ్డగించుటలో తక్క ఇతర చేష్టలలో పరమశాంతత చూపించవలసి ఉన్నది.

గన్నారెడ్డి ఇతికర్తవ్యతామూఢుడైనాడు. ఏలాంటిమగవారితో నైనా తాను వ్యవహరించగలడు, కాని స్త్రీలవిషయం వస్తే తా నేమి చేయకలుగును? వారి జీవితాలకూ, తనకూ సంబంధం ఏమిటి? స్త్రీల హృదయం తన కేమి తెలియును? పురుషులకు కోపం వచ్చే విషయాలు వారికి నవ్వు కలిగించ వచ్చును. ఒక స్త్రీకి నవ్వు కలిగించే విషయం, వేరొక వనితకు క్రోధ కారణం కావచ్చును.

ఇంతకూ లలితాస్వరూపిణి ఆ బాలికను తన అక్కగారే సముదాయించునుగాక!

ఈ ఆలోచనతో గన్నారెడ్డి తన విడిదిలోనికి వెళ్ళిపోయినాడు.

• • •

అన్నాంబికాదేవి తన సౌధంలోనికి రూపెత్తిన ప్రసన్నతలా వెళ్ళగానే ఆమె చెలికత్తె అయిన మల్లిక పరుగునవచ్చి పాదాల నంటినది. అన్నాంబిక అతిసంతోషంతో మల్లికా! నువ్వటే? ఎప్పుడు వచ్చావూ? ఒసే ఎట్లావస్తివి? ఆదవోనినుంచేనా?, అని ప్రశ్నలవర్షం కురిపిస్తూ మల్లికను రెండు భుజాలూ పట్టి లేవతీసింది. కళ్ళ నీళ్ళతో నవ్వుతూ, మల్లిక రాజకుమారిని చూచి, ‘దొరసానమ్మగారూ! అమ్మయ్యా మీరేమయ్యారో తెలియక మహారాణీగారు, మేమూ పడిన బాధ ఇంతా అంతానండీ! మీరు కందనోలు వెళ్ళడం, అక్కడనుంచి ఆదవోని చేరడం మాకు వార్తలు వచ్చాయి. అప్పటికి మా మనస్సులు కుదుటపడ్డాయి’ అని తొందరగా, ఆనందంగా మాట్లాడింది.

అన్నాంబిక: నాకోసం అంత బాధపడ్డారటే?

మల్లిక: చిత్తం, దొరసానమ్మగారూ!

అన్నాంబిక: నాయనగారు ఏమన్నారు?

మల్లిక: నాయనగారు ప్రళయకాలరుద్రునిలా ఉన్నారు. ఆయన దగ్గరకు ఎవ్వరూ వెళ్ళలేకుండా ఉన్నారు. వారు బేడ చెలుకినాయనిం వారిని అన్నమాటలు విరోధులనుకూడ ఎవ్వరూ అనరు. ఆయన విజయ ఢక్కాను గన్నారెడ్డి దోచడం చాలా బాగా ఉందట. ఒక్క సైనికు నయినా పోగొట్టుకోకుండా తిరిగిరావడం ఆడవారి కొక్కరికే చెల్లుతుందట! మగవాడు ముసలాడై, ఆడదాని చేతులో రాజ్యం నడవడంవల్ల పరువుగల రేడులవంశాలన్నీ ఆడవాళ్ళ వంశాలయ్యాయట. ఒక్క మగవాడూ లేడట! అందుకనే పురుగులలాంటి, తేళ్ళలాంటి దొంగలూ, హీనులైన కొండజాతి వాళ్ళకన్నా నికృష్టులైన దారిదోపిడిగాళ్ళూ బయలుదేరారట. లోకం అంతా నిండిన ఈ కల్మషాలన్నీ నాశనంచేసి ధర్మరాజ్యం తాము స్థాపిస్తారట, చిన్న దొరసానమ్మగారూ! ప్రభువువారికి నిద్దట్లోనన్నా క్రోధం తగ్గుతుందో లేదో అనే నా అనుమానము.

అన్నాంబిక: నువ్వు ఎలావచ్చావే ఇక్కడికి?

మల్లిక: అదో వింతకథండీ, దొరసానమ్మగారూ! నాలుగు రోజుల క్రిందట తమ నగరిలో తోటలోనికి వెళ్ళానండీ, ఆ తోటలో తిరుగుతూ ఉంటే నాతోటున్న తక్కిన దాసీలు కొంచెం దూరమయ్యారండీ, తమరిని గురించే ఆలోచించుకుంటూ ఓ పొదరింటి దగ్గర కూలపడ్డానండీ అమ్మా. అంతలో ఎక్కడనుంచో ఆ సందె చీకట్లో ‘మల్లికా! నీకు అన్నాంబికాదేవంటే గాఢమయిన అపేక్షకదా?’ అని వినబడింది దొరసానమ్మగారూ! అడిలి, బేజారై, మాటరాక వణికిపోయానండీ తల్లీ! ‘భయపడకు! నీకు అన్నాంబికా రాకుమారంటే ప్రేమయేనా?’ అని మళ్ళీ వినబడింది. ఈపట్టు వెనక్కు తిరిగి చూచానండీ, ఆ పొదరింటిప్రక్క చీకట్లలోనుంచి ఒక పురుషుడు లేచి, కూర్చుండి ‘మల్లికా, నన్ను గన్నారెడ్డి ప్రభువులు పంపారు. మీ చిన్న రాణీ గారు ఆదవోని చేరి ఉంటారు. వారికి నువ్వు దగ్గర ఉండటం ఉత్తమంకదా! కాబట్టి నిన్ను ఆదవోని తీసుకువెళ్ళమని వారు నల్గురను మమ్ము ఆజ్ఞ ఇచ్చి పంపారు. ఇప్పటికి నాలుగు దినాలనుంచి మాలో ఒకరమైనా ఈ తోటలో కాపలా కాస్తున్నాము. నేటికి నీదర్శనమైంది. మే మా మహాపురుషునకు బంటులమై నాచిన్న చిన్న రాజ్యాలకు ప్రభువులము నేను రేచెర్ల సోమారెడ్డిని. నాతో వస్తే ఆదవోని తీసుకొని వెళ్తాను అన్నాడండీ. నాకు తమ మాట వినేవరకు ప్రాణం లేచివచ్చిందమ్మా! సరే వస్తానన్నానండీ!

అన్నాం: చాలా చిత్రంగానే ఉంది, ఆ వెంటనే వచ్చి వేసినావా మల్లికా?

మల్లి: వెంటనే ఎట్లాగండీ! ఊరు కాపలా పాండవుల శిబిరం, భేతాళుడు కాపాడినట్లేనండీ! అలా మహారాజులుంగారు కట్టు దిట్టాలుచేశారు.

అన్నాం: ఎందు కా కట్టుదిట్టాలు? నే నెలాగ వస్తిని.

మల్లి: ఏమో మీరు వెళ్ళినట్లు వట్టి గాలివార్తే! అందుకని ఆ సోమారెడ్డి ప్రభువు నన్ను వెంటనే చేయి దొరకపుచ్చుకొని హారీతిపులుగు సాయం కాలం పెంటికోసం కూసినరీతిగా కూసినారండీ. దానికి ప్రతిగా పెంటి హారీతి కూయిడినట్లు తోట నాలుగు మూలలనుంచీ వినబడ్డాయండీ. నా కా పురుషుడు కూసినట్లు తెలియకపోతే నేను ‘ఏదో పక్షి కూస్తోంది’ అనుకొనే దాన్నండీ. తర్వాత మేం బయలుదేరాము. ఆ వనానికి చుట్టూ ఉన్న పెద్దగోడ దగ్గరకు ఉత్తరంగా నడుపుకుంటూ తీసుకుపోయాడండీ. ఆ డొంకల్లో పిల్లి అడుగులతో నెమ్మదిగా ఏలా తీసుకొనివెళ్ళాడో సోమారెడ్డి ప్రభువండీ. అక్కడకు పోగానే ఆయనలాగే రాజవేషాలు ధరించివున్న నలుగురు రెడ్డి ప్రభుకుమారులు చారులలా వచ్చి కలుసుకొన్నారు. ఎలా దాటించారో నన్ను చెండులా! నన్ను అవతలికి దింపారు. అంతకుముందే నన్ను ఒక మూలగా పోయి పురుషవేషం వేసుకొమ్మని ఆదవోని సేనాపతుల లాంటి వేషానికి సరిపోయే వస్త్ర కవచాదులు నాకు యిచ్చారండీ. నేను చాటుగా పోయి పురుషవేషం వేసుకువస్తే వారు నాకు కవచాలు తొడిగారండీ. మేమందరం ఆదవోని సైన్యపు ఉప సేనాపతులలా ఉన్నాము. ఆ తరువాతనే కోటగోడ దాటాము. ఆ ప్రక్కన ఉన్న ఒక యింటి దొడ్డిలో ఆరు గుఱ్ఱాలున్నాయండీ. మేము గుఱ్ఱాలెక్కి నిర్భయంగా ఉత్తరపు కోట గోపుర ద్వారాన్ని చేరుకొన్నాము. కోటగుమ్మం దాటే సాంకేతికపు మాటలు వాళ్ళకు తెలుసును కాబోలు! ఆ గుమ్మము దాటి అంచెలు అంచెలుగా ఈ ఊరు ఇంతకు ముందు నాలుగు ఘడియల క్రితం చేరుకున్నామండీ. నన్ను వారు తిన్నగా కుప్పాంబాదేవి మహారాణిగారి నగరంలోకి తీసుకువచ్చి విషయం చెప్పి ఒక దాసీకి అప్పగించారు. ఆ దాసీ తన గదిలోకి తీసుకువెళ్ళింది. నేను అక్కడ నా ఆడ వేషం మళ్ళీ వేసికొని ఆ దాసీ తమ నగరికి దారి చూపిస్తే ఇక్కడకు వచ్చానండీ. ఇంతట్లో తమరు ఇక్కడకు వచ్చారు.

అన్నాంబిక: నీ చరిత్ర బృహత్కథాగ్రంథంలో కథలా ఉందే! నీవు రావడం ఒక పండుగలాగే ఉంది. ఇచట ఏంత ప్రేమతో చూచినా, కావలసినవాళ్ళు దగ్గర ఉండటం విషయం వేరు.

వాళ్ళిద్దరూ మాటా మంతీ చెప్పుకుంటూ కాలం గడిపారు.

ఆ రాత్రి అన్నాంబికకు ఎన్ని ఘడియలకూ నిద్రపట్టదు. ఎంత అందగాడా గన్నారెడ్డి ప్రభువు! ఎంత ఉత్తమ వీరుడు! లలితములై కనబడుతూ దృఢములైన ఆ వీరుని చేతులు తన్ను ఆ మహాపురుషుని హృదయానికి దగ్గరగా అదుముకోగలవా! లోతులై వెడదలైన ఆ సుందరాంగుని కన్నులు తన్ను చూచిన వెంటనే ఆనంద కాంతులతో సూర్యో దయాలవలె వెలిగి పోగలవా? పూలతో సింహాసనము అమర్చి ఆయనను అందు అధివసింప జేసి తా నా మనోహరమూర్తి పాదాలకడ యుగ యుగాలు అధివసించి ఆ దివ్యపురుషుని కాంతిలో తాను లయమైపోతూ, ఆ స్థితికి నిత్యత్వం సంపాదించుకో గలదా?

ఆయనవేళ్ళు తన ముంగురుల నెట్లు సవరించగలవు? ఆయన చూపులు తనచూపులలో ఎట్లు సంగమించగలవు? అతన తనతో వర్ణనాతీత పరమరహస్య సంభాషణలు ఏనాడు జరుపగలరు?

‘గజదొంగ’ యట! ఏమిటా గజదొంగతనము? తన హృదయాన్ని దొంగిలించడంలోమాత్రం ఆయన ‘గజదొంగ’ కావచ్చు. ఏకాలమందైనా, ఏబాలిక అయినా ఇలా తనవలె తన సర్వాధినాథుడైన పురుషుని స్మరిస్తూ నిద్రరాక కాలమంతా కరిగి ఒకే మహాప్రవాహంలా ప్రవహించేటట్లు ఆలోచించుకుంటూ ఉండ గలదా?

‘గజదొంగవా స్వామి! కన్న మేతువ ఏమి!

స్వజన దూరాగతను విజితురాలను నీకు.’

అని కూనిరాగంతో పాడుకుంటూ అ హంసతూలికాతల్పంపై దొర్లుతూ మూడవయామపుఘంటిక కోటమొగసాలలో కొట్టిన కొద్దివేళకు ఆమె గాఢనిద్రా పరవశురా లయింది.