గోన గన్నారెడ్డి/ద్వాదశగాథ

వికీసోర్స్ నుండి

ద్వాదశగాథ

విజయధ్వానం

1

వారముదినములు కాకతీయవీరులు, వీరభద్రులు, రెడ్డిభీములు, వెలమార్జునులు, మున్నూరు రాములు, బ్రాహ్మణ పరశురాములు, ముదిరాజు హనుమంతులు, బోయాంగదులు, గొల్ల బలరాములు ఎడతెరపిలేకుండా, సర్వకాలాలయందు యాదవసైన్యాలపై విరుచుకుపడి నాశనం చేసిరి. ముక్కలుచేసి నుగ్గునుగ్గుగా భస్మము సలిపినారు. చాళుక్య వీరభద్రుడు యుద్ధంలో ప్రాణాలు మరచిపోయి ఉద్ధతసత్వుడై దుర్నిరీక్ష్యపరాక్రముడై యాదవులను ముక్కలు చేస్తున్నాడు.

వారముదినా లయినవెనుక రుద్రదేవి తన సర్వసైన్యాలకు రెండు దినాలు విశ్రాంతి అని ఆజ్ఞ దయచేసినది.

కోటలోనుండి ఒత్తిడి లేకపోవడంవల్ల యాదవసైన్యాలను కొంచెము ‘అమ్మయ్యా’ అని గాలి పీల్చుకునే అదను దొరకినది. ఈ పదిదినాల యుద్ధానికి యాదవులు మూడులక్షలమంది ముక్కలయిపోయినారు. రెండు లక్షలమంది మృతులయినారు. గాయాలు తగిలినవారు ఎనభైవేలున్నారు. తక్కినవారు శత్రువులకు బందీలయినారు.

గోన గన్నారెడ్డి యాదవులకు దేవగిరినుండి ఆహారసామాగ్రులు రానివ్వడు. దేవగిరికి మహాదేవరాజు పంపిన చారుల నందరినీ దారిలోనే బందీలుగా పట్టుకొని శత్రువుల వార్తలన్నీ అందిపుచ్చుకొని ఆనందిస్తూ మహాదేవరాజు సైన్యాలను చిందరవందర చేయుచుండెను.

మల్యాల కాటయచమూపతి బలగాలకు, మల్యాల గుండయ మహారాజు వాహినులకు గన్నారెడ్డే ముఖ్యనాయకుడైన ఆ పదిదినాలు అతడు నడిపిన యుద్ధవ్యూహవిధానము వర్ణనాతీతము.

ఒక దినాన బళ్ళను ముందుపెట్టి ఎద్దులు లేకుండా బళ్ళను తోసుకుంటూ ఆతడు సైన్యాలను నడుపుతూ వెళ్ళినాడు. విరోధులకు ఈ బళ్లేమిటో ఆ చీకటిలో అర్ధముకాలేదు. గన్నయ్య అధర్మయుద్దం చేయలేడు. కాబట్టి తన సైన్యాలనుండి ‘గోన గన్నారెడ్డికి జై’ అని కేకలు వేయించాడు.

ఆ కేకలతో యాదవమూకలు భయపడి ఆ చీకటిలో దొరికిన ఆయుధములతో గన్నారెడ్డిపై విరుచుకుపడవలెనని ప్రయత్నము చేసిరి. కాని చక్రములో చక్రముగా వచ్చిన బళ్లు వారి కడ్డమయ్యాయి. గన్నారెడ్డి వీరులు హుమ్మని అగ్నిబాణాలు వర్షంలా శత్రువులపై కురిపించిరి. యాదవులలో కొందరు బళ్ళ అడుగున దూరి విరోధులను నాశనంచేయ ప్రయత్నం చేసిరి. కాని అదివరకే బళ్ళక్రింద గన్నారెడ్డిభటులు కాపలా ఉండుటచేత ఆ ప్రయత్నం చేసిన వారు నాశనం అయ్యారు.

బళ్ళు ముందుకు సాగుతున్నాయి. గన్నారెడ్డి వీరుల పరపిన అగ్నిబాణాలు యాదవసేనల శిబిరాలను అంటించాయి. ఆ మంటల వెలుగున ఇరు వాగులవారూ ఒకరికొకరు స్పష్టంగా కనబడినారు. మహాదేవుని బలాలు మంటల వెనుక దాగికొని మంట లార్పుచుండెను. యుద్దము ఘోరముగా సాగుచున్నది.

తెల్లవారుగట్ల ఉదయం ఒకజాము ఉందనగా గన్నారెడ్డి బలగాలు మాయమై పోయాయి. వారు వెళ్ళేటప్పుడు బళ్ళను లాగుకుంటూనే వెళ్ళిపోయినారు.

ఆ రాత్రి గన్నారెడ్డి శత్రువులను ఏ పదివేలమందినో హతమార్చినాడు. తన సైన్యంలో అయిదువేలమంది చనిపోయినారు.

ఆ రాత్రి యుద్ధముసంగతి గొంకప్రభువు, శ్రీ రుద్రమదేవి చక్రవర్తికి వార్త తెచ్చినాడు. చక్రవర్తి ఎంతో ఆనందించెను. అన్నాంబిక తను ప్రేమించిన వానికడకు పోయెను. ఆమె ఏమి చేయుచుండెనో అని రుద్రదేవి అనుకున్నది. గన్నారెడ్డి ఇప్పటికి నాలుగేళ్ళనుండి ఆంధ్రకాకతీయ మహాసామ్రాజ్యానికి చేసిన సేవ అపారము. గజదొంగ అయిననేమి అనికదా లోకైకసుందరి అన్నాంబిక అతని ప్రేమించినది. అలాంటి బాలికను గన్నారెడ్డి ప్రేమించగలడా?

ప్రేమకు కారణం వ్యక్తంగా కనబడదు. ఎందుకు ఎవరియందు ఎవరికి ప్రేమ కలుగుతుందో ఎవరు చెప్పగలరు?

యుద్ధకాలమందే మానవహృదయంలో ప్రేమ పరవళ్ళెత్తుతుంది. యుద్ధాల నుంచి వచ్చిన వీరుడు ప్రియురాలి వక్షఃస్థలముపై తలవాల్చి ఆమె హృదయగతులు దివ్యగీతము ఆలాపించగా, ఆ జోలకు నిదురపో గోరుతాడు.

ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి నాశనంచేసే సమయంలో అతడు రాక్షసుడే అవుతాడు. ఆలా రాక్షసుడైన మానవుని తిరిగి మానవునిగా చేయగలిగినది ప్రేమ. ప్రేమ ఎంత దివ్యమైనది! స్త్రీయే రాక్షసి అయినప్పుడు పురుషునికన్న వేయిరెట్లు ఎక్కువగా ప్రేమను వాంఛిస్తుంది. ఆమెను దివ్యురాలిగా చేసే తల్లి ప్రేమకు పురుషప్రేమయే ప్రాంగణము. ఆ ప్రాంగణములో తానువలచిన అతిలోకసుందరాకారుడు కర్కశురాలై, రాక్షసియై, మానవప్రాణాదనియైన తన్ను, మనుష్యులను గుర్తించలేని చూపులతోవచ్చే తన్ను ప్రపంచానికంతకు తానే సామ్రాజ్ఞిని అని వచ్చే తన్ను తననుండి రక్షించడానికి గాఢంగా హృదయానికి అదుముకొని తనలో ప్రళయతాండవం చేసే రాక్షసత్వాన్ని ప్రేమామృతంతో నాశనం చేయగలడా ఆ మహాపురుషుడు!

చాళుక్య వీరభద్రుని తాను చూచినక్షణమే అతడు తన జీవితానికి జన్మ జన్మలకు ఈశ్వరు డెట్లాఅయినాడు? ఏమి విచిత్రమైనదీ ప్రేమ? ఎంత తీయని బాధతో బ్రదుకుస్వరము నిండిపోతుంది? ఆత్మ ఒక్కటే అగుగాక, ప్రత్యగాత్మత్వము పొందిన ఒక్కొక్క వ్యక్తి ప్రపంచానుభూతులను ఒక్కొక్క విధంగా పొందగలుగును.

అన్నాంబిక గన్నారెడ్డికై పొందిన ప్రేమపరమార్థము, చాళుక్య వీరభద్రునికై తాను పొందిన ప్రేమపరమార్థము ఒకటే అయినా వివిధ మూర్తులుగా ఉంటవి.

వీరభద్ర ప్రభువునకు ఆపదలేమియు రాకూడదని తన హృదయములో ఉన్నది. అయినా క్షత్రియవీరుడు ప్రాణాలకుతెగించి యుద్ధము చేయవలసేఉన్నది.

వీరభద్రుడు పరమస్వామిగానూ, పరమశివుడుగానూ తనకు కనబడుతాడు. ఆయన వీరవిక్రముడై, పురుషోత్తముడు కావాలనీ తాను కోరుతుంది. యుద్ధములో అనవసరపు హానికి లోబడకుండా, ఆయన తమ నగరులోనే ఉండాలని తాను కోరుతుంది.

ఓహో ప్రేమ అత్యద్భుతము! ప్రేమయే ఒక వ్యక్తి! ప్రేమే సర్వ సృష్టికీ మూలము.

“చాళుక్యప్రభూ! మీరేమి ఆలోచించుచున్నారు?”

రుద్రదేవి తన నగరులో దేహము వేడెక్కగా, ఏవో మాధుర్యాలు తన్ను పొదువుకొనగా, వక్షము లుప్పొంగగా సిగ్గుపడుతూ తన మంచముపై వాలి పోయినది.

2

మహాదేవరాజు కాకతీయ మహానగరం ముట్టడించిన పదునాలుగవ నాటి ఉదయము మొదటిజామునుండి రుద్రదేవి సమస్తసైన్యాలతో కోటవిడిచి మహాదేవరాజు సైన్యాలపై ఉరికినది. అన్ని గోపురద్వారాలు, దిడ్డిదారులు తెరువబడినవి. కోటగోడలమీదనుండి నిరంతర బాణవర్షము శత్రువులపై కురిపిస్తున్నాడు. చాళుక్య వీరభద్రమహారాజు.

ఇన్నాళ్ళనుండీ మహాదేవరాజు బలగాలు మట్టిగోడను బద్దలుకొట్టడానికి చేసిన ప్రయత్నానన్నీ ఏనుగుపై కురిసినవానలా అయినవి. అక్కడక్కడ కొన్ని పెళ్ళలు మాత్రం విరిగిపడ్డాయి. దిడ్డిదారులు, గవనులు దరికిచేరడానికి అనేక పర్యాయములు వంతెనలు వేసినా అవి అగ్నిబాణాలచేత దహింపబడినాయి. పడమటి ద్వారాన్ని పట్టుకోవాలని మహాదేవరాజు విశ్వప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. బలగాల రక్షించే రక్షకచ్ఛత్రఫలకాలు సంతతధారగా కురియు శిలావర్షముచేత ముక్కలయినవి.

పదుమూడవ దినాన, మహాదేవరాజు సర్వదుర్గచ్ఛేదకయంత్రాలను ఉపయోగించి తూర్పుద్వారముపై గవిసినాడు. గడకర్ర తెప్పలు వందలకొలది గవనుల కీవలావల వేయించినాడు. వానిని సంరక్షిస్తూ కోటబురుజుల మీదికి వీరులు రాకుండా రెండునూర్ల చక్రగొట్టాలు వెనుక నిలిపినాడు. ఆ కొట్టాలపై నుండి మహాపరాక్రమంతో వీరులు శిలాప్రయోగయంత్రాలు, శతఘ్నులు, మహాబాణాలు ప్రయోగించుచుండిరి. ఆ చక్రకొట్టాలకు బలంగా వేలకొలది ఏనుగులు కవచ రక్షితములై దుర్గాలవంటి అంబారీలతో నిలచినవి. అందుండి వీరులు సంతతముగా అగ్నిబాణాలు ప్రయోగిస్తున్నారు. చిన్ననావలు వందలకొలది విశాలమైన కందకంలో వేసిరి. ఆ నావలపై వంతెనగా వెదురుదళ్ళు వేసినారు. దడులపై మట్టి వేసినారు. వంతెన సిద్ధమైనది. ఈవలావలనున్న దిడ్డుడకడను గూడా ఈలాంటి వంతెనలను వేయించినాడు.

ఆ పదుమూడవ దినమంతా అన్ని గోపురాలకడ, దిడ్లకడ ఇరువాగులవారికి భయంకరయుద్ధము జరుగుచున్నది. రాత్రంతా యుద్ధము జరుగుచునే యున్నది. కరిగిన సీసము, సలసలకాగేనూనె వర్షము కురుస్తున్నది.

వంతెనమీదనుండి ఏనుగులు, వీరులు వస్తున్నారు. ద్వారచ్ఛేదానికై కుంభస్థలాలకు కట్టిన బ్రహ్మశూలాలతో ఏనుగులు తలుపులను బద్దలుకొట్టుతున్నాయి. ఏనుగులకు సహాయంగా వీరులు చక్రయంత్రాలపై నున్న పెద్దయినుప గుదియలతో తలుపులు బద్దలుకొట్టుచున్నారు. పై నుండి కురిసే అగ్ని శిలాబాణవర్షాలకు వేలకొలది వీరులు మడియుచున్నారు. పైన గోడలమీద, బురుజులమీద వీరుడు తల ఎత్తేసరికి చక్రకొట్టాలనుండి బాణవర్షం కురియుచున్నది.

నాటి రాత్రికూడా తూర్పుద్వారందగ్గర ఎడతెగనియుద్ధం జరుగుచూనేఉన్నది. తక్కిన అన్ని ద్వారాలకడను మహాదేవరాజు అఖండమైన ఒత్తిడి కలుగజేయుచునే ఉన్నాడు.

పదునాల్గవ దినము ఉదయించినది. పడమట, ఉత్తర దక్షిణముల గవనులు, దిడ్లు ఒక్కసారిగా తెరచి, వేలకొలది బలములతో రుద్రదేవి వచ్చిపడెను. వంతెనలు కూలినవి.

ప్రసాదాదిత్యప్రభువు, చాళుక్య వీరభద్రుడు, నాగమనీడు, బాప్పదేవుడు, సోమనాథమంత్రి ప్రమథగణాలులా పైకురికారు. ఆ సమయములో గోన గన్నారెడ్డి అకుంఠిత వేగముతో తన అన్ని సేనలను ప్రోగుచేసుకొని తూర్పుద్వారానికి సూటిగా యాదవ మహాదేవరాజు సైన్యాలను చీల్చుకుంటూ, పద్మవ్యూహము చొచ్చివచ్చే అర్జునునిలా చొచ్చి రాసాగెను.

అ సమయంలోనే ఉభయ మల్యాల మహారాజుల సేనలు దక్షిణపుద్వారానికి ఎదురుగా మహాదేవరాజు మూకలను చీల్చుచు కాటచమూపతి, గుండయ ప్రభువుల ఉభయ నాయకత్వాన చొచ్చుకు రాసాగెను.

ఆ సమయంలో గోన విఠలభూపతి, సూరపరెడ్డి ఉత్తరపు గవనుకు ఎదురుగా సేనలతో యాదవుని బలగాలలోనికి జొరబడినారు.

ఈ పథకమంతా ఆలోచించి, అపసర్పనాయక శిరోమణి గొంకప్రభువు వలన అందరు నాయకులకు ఆజ్ఞ లంపి మహాదేవరాజు పన్నిన భయంకరపు ముట్టడిని రుద్రదేవి ఎదుర్కొన్నది.

ఆ దినమున ఆంధ్రవీరులు నెరపిన పరాక్రమము అప్రతిమానమైనది. సాయంకాలానికి యాదవ మహాదేవుని సేనలు నాలుగుభాగాలై కోటముట్టడి వీడి రెండు గవ్యూతులు వెనుకకు పోయినవి. కోటగోడనుండి యుద్ధముచేసి వీరులందరు కోటవెలుపలికి వచ్చివేసినారు.

తన అంగరక్షకులతో, చక్రరక్షకులతో, కవచరక్షకులతో రుద్రదేవి మహాశక్తిలా విజృంభించి యాదవ మహాదేవుని తెల్లవారునప్పటికి పది గవ్యూతులు తరిమినది. మహాదేవరాజు ప్రజ్ఞతో తన సేనలన్నిటిని కలుపుకొన ప్రయత్నిస్తూ ఉత్తరాభిముఖుడై, అతినష్టంలేకుండా దేవగిరి చేరడము ఎల్లాగా అన్న తీవ్ర సమస్యను ఎదుర్కొంటూ పారిపోవుచున్నాడు.

నాలుగు దినాలలో హతశేషులైన మూడులక్షల బలగము అయిదు ఖండాలుగా గోదావరి చేరింది. గోదావరి వరదతో గట్లు పొర్లి ప్రవహిస్తున్నది.

వెనుకనే రుద్రమదేవి తన అన్ని సైన్యాలను నడుపుకొంటూ మహాదేవరాజు సైన్యాలను నదీసంగమానికి దిగువ నాలుగు గవ్యూతుల దూరంలో తాకింది.

మల్యాల సైన్యాలను ముందు మంజీరదాటి ఆవలిఒడ్డున ఉండి మహాదేవరాజు నది దాటకుండా చేయుడని గోన గన్నారెడ్డి ఆలోచన చెప్పడంవల్ల ఉభయ మల్యాలసైన్యాలు, మంజీరకు ఎగువను నదిదాటి ఆవలిఒడ్డుననే మంజీరా గౌతమీ సంగమంవరకూ వచ్చి నిలబడినవి. గన్నారెడ్డి సంగమానికి ఇంకా దిగువనే రుద్రదేవి సైన్యాలను వదలి గౌతమినిదాటి ఈవలిఒడ్డుకు మహాదేవరాజును రాకుండా చేయాలని పోయింది.

కాని మహాదేవరాజు నాలుగుదినాల క్రిందటనే దేవగిరికి ప్రజ్ఞావంతులైన రహస్యచారులను పంపించిఉన్నాడు. ప్రతిష్ఠానములో సిద్ధముగావున్న ఏబదివేల నావలు నడుపుకుంటూ దేవగిరి సేనలో సగము వచ్చినవి. ఆ రాత్రి మహాదేవరాజు తన సేనలను ఆవలకు దాటించినాడు.

తెల్లవారుసరికి రుద్రమదేవికి మహాదేవుని గౌతమీతీర శిబిరము నిర్మానుష్యమై దర్శనమిచ్చినది.

3

గన్నారెడ్డి గోదావరిని సేనలతో దాటేసరికి మహాదేవరాజు దాటి గోదావరి తీరాన్నే అతివేగంగా దేవగిరికి ప్రయాణం సాగించాడు.

గన్నారెడ్డి వచ్చి గౌతమిలో తేలిపోవు నావలను పట్టించియు, తన నావలను తెప్పించియు చక్రవర్తిని దాటింప ఏర్పాటుచేసి తాను ఇరువదివేల అశ్వికబలాలను తీసుకొని యాదవ మహాదేవప్రభువును ఆటంకపెట్టుటకు ముందుకు పోయినాడు. మల్యాల సేనలకు, గోదావరీతీరాన్నే ఎగువకువచ్చి గోదావరి దాటవలసిందని వేగు పంపి హుటాహుటి అతివేగంగా వెడలిపోయినాడు.

తెల్లని రూపసంపదచే ఉచ్చైశ్రవమునకు బిడ్డయనదగిన యవనాశ్వముపై అశ్వినిదేవతవలె గన్నారెడ్డి పోవుచుండగా విశాలాక్షప్రభువు అతనికి జంటగా ఇంకొక తెల్లని కాంభోజాశ్వముపై వెన్నంటి యేగుచుండెను.

గన్నారెడ్డి, విశాలక్షప్రభువు యువతి అని గ్రహించాడు. ఆమె అన్నాంబికాదేవి అని గ్రహించాడు. మొదటిసారి విశాలాక్షప్రభువు తనకడకు వచ్చినప్పుడే అనుమానము కలిగెను. రెండవసారి వచ్చినప్పుడు అనుమానము తీరి నిజము పూర్తిగా గోచరించినది.

ప్రేమ ఎంతపనిచేయును! ఈ బాలిక వరదారెడ్డిని ప్రేమింపనందున ఆదవోనినుండి పారిపోయివచ్చినది. తానును ఆమెను ఎత్తుకపోయి పెళ్ళియాడ సిద్ధముగానుండ ‘రోగి పాలుగోరిదాడు, వైద్యుడు పాలుకోరినా’ డన్నట్లు ఆమెయే తనకుతానై వచ్చినది. ప్రపంచములో ఇంతటి సుందరాంగి ఉండనే ఉండదు. దేశాలు సంచరించిన తన కది స్పష్టమే, సర్వవిద్యలయందు ఆరితేరిన ప్రోడ. భయమెరుగదీ బాల. యుద్ధవిశారద. పురుషవేషమునగూడ ఈ బాలిక ఎంత దివ్య సౌందర్యముతో విరాజిల్లుచున్నది! ఆమె స్వారిచేయుట ఆకాశములో హంస ఎగురుచున్నట్లే. ప్రాణాలకు వెరువక యుద్ధములో అతిరథ శ్రేష్ఠునిలా తనకు కవచరక్షణ చేసే ఈ మనోహరాంగి బాలికయని తా నెరిగినట్లు ఆమెకు తెలియకూడదని, ఆమెను చిన్నవయస్సనే వంకతో ఇంటికి వెళ్ళిపొమ్మని ఎంత బ్రతిమాలినను విన్నదికాదు. సరికదా కోపముతెచ్చుకొని బాధనంది విచారముతో క్రుంగి పోయినది. తా నది చూడలేక తన సేవచేయుటకు అనుమతి ఇచ్చినాడు. ఆమె ఖడ్గయుద్ధము, ధనుర్యుద్ధము అసదృశములు.

పురుషుడుకాని స్త్రీకాని మారువేషాలు వేసికొని కొన్నిదినాలు మాయపెట్ట గలరు. ఆమె తనకడకు వచ్చిన మూడవదినాన కృష్ణానదిలో ఈదుటకై తా నామె బాలకుడే యనుకొని, బుజముచుట్టు చేయివేసి నదివైపు లాగినప్పు డామె ముడుచుకొని పోయినది. చిరుమీసాలతో సొంపుగా ఉన్న ఆమె మోము కందిపోయినది. తన ఒళ్ళు ఝల్లుమన్నది. పురుషుని ముట్టినచో ఒళ్ళు ఝల్లుమనునా? అప్పుడే అనుమానము తన హృదయములో కలిగినది.

పిమ్మట అతడు తనతో కృష్ణకు స్నానమునకు రాడు, ఎప్పుడు తన్ను చూడటానికి వచ్చినా సంపూర్ణకవచధారియై ఉండడము తన అనుమానానికి దోహదమిచ్చెను.

మరల తన్ను కలుసుకొన్నప్పుడు ఆ బాలునికి, ఆ జగదేకసుందరికి తలపై నొకరు ముసలప్రయోగము చేయడం సంభవించింది. ఆ బాలిక తూలి నిశ్చేష్టయై గుఱ్ఱముమీద కూలి గుఱ్ఱము కంఠము గట్టిగా పట్టుకొన్నది. వెంటనే తాను, ఆ శత్రువును రెండు తుండెములుచేసి, విశాలాక్షప్రభువును ఎత్తుకొని అక్కినమంత్రికి యుద్ధము నడప ఆజ్ఞయిచ్చి, తన గుఱ్ఱంమీద రెండు గవ్యూతుల దూరములోవున్న గ్రామములో శిబిరానికి తీసుకొనిపోయినాడుకదా!

మల్లికార్జునరెడ్డి తన వెనుకనే గుఱ్ఱముపై వచ్చినాడు.

తాను ఆ బాలకుని శిరస్త్రాణము విప్పగా జానువులవరకు వ్రేలాడే ఆమె తలకట్టు ముడివైచి దృశ్యమయినది. తల పై భాగం కొంచెం నలిగి రక్తము నిండి పోయినది. నీటితో ఆ రక్తము కడిగి, ఔషధములు పులిమి తలకు కట్టుకట్టి తాను.....

‘ఈ బాలిక అన్నాంబికాదేవి, నువ్వు మల్లికవుకాదా?’ అని మల్లికార్జున రెడ్డిని అడిగినాడు. ఆమె ఒప్పుకొని, ‘ప్రభూ! ఈమె అన్నాంబిక అని తెలిసినట్లు మీరు వ్యవహరించకండి. ఈమె సిగ్గుచే ఏపనినయినా చేయగలదు. మహారాజా! ఈ తల్లి మీపైన బద్దానురాగ! మీ రామెకు భగవంతులు! ఈ జన్మలో ఆమె మిమ్ముమాత్రమే వివాహం కాగలదట. లేనట్లయితే తనప్రాణమే భైరవునికి అర్పించుకుంటానని ప్రతిజ్ఞ పట్టింది’ అనిచెప్పెను.

4

దేవగిరికోటకు ఎల్లోరాగుహకు మధ్య ఎత్తయిన కొండలు, కొండలపై జనపదాలు ఉన్నవి.

దేవగిరికోటకు ప్రతిష్ఠానానికి మధ్య కొన్ని చిన్న గిరులు ఉన్నాయి. యాదవ మహాదేవరాజు సైన్యాలతో ప్రతిష్ఠానం చేరకముందే మల్యాలవారిలో పదియేనువేల అశ్వికసైన్యం ముందు ప్రతిష్ఠానానికి ఎగువనే గోదావరినదిని దాటింది.

గోన గన్నారెడ్డి దేవగిరి దారిలో రెండు కొండలమధ్య సేనలను నిలిపినాడు. మల్యాల సైన్యాలను వెళ్ళి దేవగిరిని చుట్టుముట్టమన్నాడు.

ఎనుబది ఘటికలు మహాదేవరాజుకు ముందుకువచ్చిన గోన గన్నారెడ్డి సాహిణి తనసేనను అర్థచంద్రవ్యూహంగా బండరాళ్ళవెనుక, చెట్లవెనుక, పొదలవెనుక నిలిపి, సిద్ధంగా ఉండెను. విశాలాక్షప్రభువు గన్నారెడ్డి వెనుకనే బాణ మెక్కుపెట్టి సిద్ధముగా ఉండెను.

గోన: విశాలాక్షప్రభూ! ఇంతవరకు మీరు జాగ్రత్తగా ఇతరుల ప్రాణాలను అత్యవసరమైనగాని బలిగొనలేదు. చేతులకు కాళ్ళకు బాణాలు నాటి వీరుల్ని యుద్దంనుంచి పరాఙ్ముఖులుగా చేస్తున్నారు. నా మీదకు ఏ వీరుడన్నా తలపడితే సింహమైపోయి, వాణ్ణి నేలకూల్చడానికి వెరవరేమి?

విశా: మహారాజా! నేను తమకు అంగరక్షకుణ్ణి. అదే నా పరమధర్మం. తక్కిన యుద్ధంతో నాకు పనిలేదు.

గోన: తక్కిన యుద్ధంలోకూడా మీరు పాలు పుచ్చుకుంటే జయము నిశ్చయము అని మీకు తెలుసుననుకోండి. అప్పుడు?

విశా: ప్రభూ! మీరు యుద్ధములో ఉంటే ఆ పక్షానికి జయంతప్పదు. జయం తెచ్చేది మీరు, మీకు అంగరక్షకుణ్ణి నేను.

గోన: నావల్ల జయంరాక, జయంతెచ్చే విధానం మీకు తోస్తుందనుకోండి, అప్పుడు?

విశా: అనవసరంగా అనుకోడాలు ఎందుకండీ? అలా ఎన్నటికీ జరుగదు. నా ప్రభువు విషయంలో నాకు అనుమానం కలగనే కలగదు. ఇక ఈ ప్రశ్నలన్నీ ఎందుకు?

గోన: నిన్ను ఓడించటం కష్టమేనయ్యా! ఏమంటావు మల్లికార్జునరెడ్డీ?

మల్లి: ముందు ముందు మీరు మా ప్రభువును ఓడించనే లేరని తెలుసుకొని తీరుతారు. చూస్తూ ఉండండి.

రెండు గడియల కొక దళము చొప్పున ఎక్కడఉన్నవారక్కడ నిలుచున్న ప్రదేశాలలో నిద్రపోయారు. పగలు గడచినది, రాత్రి గడచినది. ఎక్కడివారక్కడే అటుకులు భుజించువారు, నీరుత్రాగువారూనూ.

ప్రొద్దు ఉదయించిన ఆరుగడియలకు మహాదేవరాజు సేనలలో ముందు వాహినులు, వాలిపోయిన శరీరాలతో, ఎల్లాగో నగరదుర్గం చేరుకుందామని నిర్భయంగా, నిస్సంశయంగా వచ్చారు.

ఇంతలో ఒక్కసారిగా వేయిశంఖాలు ఆకాశం అంటేటట్లు గుండెలు వ్రక్కలయ్యే మహాధ్వానం చేసెను.

చెమటలు గ్రమ్మ, కాళ్ళు వణకిపోవ నిశ్చేష్టములైపోయినవి మహాదేవుని సేనలు.

“మీరు మీ ఆయుధాలన్నీ క్రిందపడవేసి, ఒకరి వెనుక ఒకరు రండి. ఈ దారిని మీ యిచ్చవచ్చిన చోటికి మీరు వెళ్ళవచ్చును” అని పొలికేకలు పెట్టినాడు ఆంధ్రవీరుడు గోన గన్నారెడ్డి. “అడుగు వెనక్కువేస్తే ప్రాణాలు దక్కవు” అని రెండవ కేక.

“ఈ ప్రక్కా, ఆ ప్రక్కా, ముందూ మేమున్నాము!” అని మూడవకేక.

“మేము గోన గన్నారెడ్డి సైనికులము. మా ప్రభువే ఇక్కడ స్వయంగా!” అని నాలుగవ కేక.

ఆ కేకలతో అడలి కత్తులు, బాకులు, చురియలు, శూలాలు, భల్లాలు, ధనుస్సులు, బాణాలు, డాళ్ళు క్రిందకు వదలి, పదివేలమంది వీరులు తలలు వంచుకొని ముందుకు సాగారు. అలా మూడు వాహినులు, ఆయుధాలు విసర్జించి ముందుకు సాగెను.

ఈ వార్త నెమ్మదిగా అక్కడికి మూడు గవ్యూతుల దూరములోఉన్న మహాదేవరాజునకు తెలిపి తక్కిన రెండు లక్షల పైచిల్లర సేనలను ఆపివేసినాడు.

ఆ దారి తప్పితే కొంచెం చుట్టుదారిని దేవగిరి చేరవచ్చును. అటు తర్వాత చూచికోవచ్చునని, మహాదేవరాజు సైన్యాలను దారి మళ్ళించాడు. ఈలోగా కోటకు ఉన్న ఒకేద్వారాన్ని అరికట్టి మల్యాల గుండయ కాటయ ప్రభువులు నిలిచినారు.

మహాదేవరాజు సైన్యాలు మళ్ళినాయి అనగానే ఆ దారిలో రెండువేల మంది అశ్వికులను నిలిపి గన్నయ్య అతివేగంగా చుట్టుదారిని దేవగిరినిచేరే ఎల్లోరా మార్గపు కొండల పైకి ఎక్కిపోయినాడు.

అతివేగంగా నగర సమప్రదేశం గడచి ఎల్లోరా గుహలప్రక్కనే దిగి కైలాసేశ్వరుని మ్రొక్కి ఆ కొండపాదందగ్గర ఉన్న సెలయేటికడ మహాదేవరాజు సైన్యాలను నిలిపినాడు.

ఎల్లోరా గ్రామము ప్రక్క తన సైన్యాలను నిలిపి మహాదేవరాజు ఈ గజదొంగను హతమార్చే సమయం ఇదేనని తన ఏబదివేల అశ్వికబలమును మిగిలిన వేయి ఏనుగులను గరుడవ్యూహం రచించి గన్నారెడ్డిపై తాకినాడు. అక్కడ గన్నారెడ్డి బలగంలో ఒక్కడూలేడు! గన్నారెడ్డి ఆ కొండ దారిలో ఇంకను వెనుకకు పోయిఉన్నాడు. మహాదేవుడు ఆ వ్యూహం చెదరిపోకుండా వేగముగా రాలేడు. ఇంతలో రాత్రి అయినది.

మహాదేవుడు తన సేనల నన్నిటినీ ఆపి, చారుల వార్తలకొరకు నిరీక్షించు చుండగా అతని ముఖ్య అపసర్పనాయకుడు వచ్చి ‘మహాప్రభూ! రుద్రమ్మ సేనలతో కోట ముట్టడివేసి సగంబలగాలను మనవేపు గన్నారెడ్డికి సహాయంగా పంపుతున్నది’ అని వార్త తెచ్చినాడు.

5

మహాదేవరాజు నిరుత్తరుడైనాడు. తనసేనల నాశనం తప్పదనుకున్నాడు. వ్యవధిలేదు. తాను కోటలోనికి వెళ్ళుటకు వీలులేదు. కోటలో వారు తనకు సహాయం చేయడానికి వీలులేదు. భోజనసామగ్రి అయిపోయినది. లక్షలకొలది క్షతగాత్రులైన బలగాలతో ఈ రాక్షసి ఆంధ్ర మూకలతో పోరాడుట ఎట్లు?

కవుల మాటలు అన్నీ పొగడ్తలే! తనకు భయపడి, ఆంధ్రులు ఆడదాన్ని సింహాసనం ఎక్కించారట. ఆడదాన్ని తానేమీ చేయనని వారికి ధైర్యమట! ఆలాంటివాడు తాను ఆడదానిమీదకే మహావీరుణ్ణని వెళ్ళినాడే! అబ్బ! రాజ్యతృష్ణ! రుద్రమ్మ ఆడదా? బ్రహ్మరాక్షసి! మహామారి! కాళరాత్రి! చీల్చిచెండాడి వెంట తరుముకు వచ్చింది ఆంధ్ర రుద్రమ్మ! ఏమి యుద్ధం! ఏమి పరాక్రమం! ఎంత నిర్వహణశక్తి! ఎంత వ్యూహరచనా చమత్కృతి! తన బలగాలు నాశనం కాకూడదు. విరోధి బలగాలు నుగ్గయి పోవాలి. చాలు; ఇక తనకు బుద్ధి వచ్చినది. కందిరీగలపుట్ట, ఆంధ్రులకు కోపం తెప్పించకు తండ్రి! అని తండ్రి చెప్పితే తాను విన్నాడా? వినక, తెచ్చుకున్నదీ విపరీతమయిన పరాభవం. ఇంతవరకు ఎన్నడైనా తాను కూర్చుకొని వెళ్ళిన మహాసేనలవంటి సేన కూర్చుకొని ఎత్తిపోయిన వీరులున్నారా?

తాను రుద్రమ్మ కెదురుపడక తనసైన్యాలతో ఏకొండలలోకో వెళ్ళిపోతే తనంటే ప్రజలకు గౌరవమూ, భక్తీ పూర్తిగా నశించిపోవును. మరి రెండు మూడు దినాల ప్రయతించుద మనుకుంటే, ఇంకా కొన్ని వేలమంది నాశనం అయిపోతారు.

మహాదేవరాజునకు మతిపోయినది; గౌరవం నాశనమయింది. పదిమందిలో తలయెత్తుకోలేడు, అందుకు తగినట్లు తాను రుద్రమదేవికి లోబడిపోతే ఇంకా తన్ను ఆమె ఏలాటి అగౌరవాలకు లోనుచేస్తుందో?

ఆయన, తనకు నమ్మకమయిన భవానీభట్టును, రుద్రదేవి సకలసేనాపతి అయిన చాళుక్య వీరభద్రునికడకు పంపినాడు.

ఆ రాయబారితో కలసి శ్రీ చాళుక్య వీరభద్రమహారాజు రుద్రదేవచక్రవర్తి దర్శనము చేసినారు. రాయబారి భవానీభట్టు మహాదేవరాజు ప్రతినిధిగా ఆంధ్ర చక్రవర్తియెదుట మోకరిల్లి “మహారాజాధిరాజా! మహాదేవప్రభువు తమ తప్పునకు విచారిస్తున్నాడు. విధిదుర్విపాకంవల్ల కన్ను గానక, ఆంధ్ర మహాసామ్రాజ్యము ఇట్టె వశమయిపోతుందనే ఆశతో, పెద్ద ఎత్తుగా జైత్రయాత్రకు వచ్చినారు. తమ పాదాల వ్రాలిక్షమార్పణ వేడి, శిక్షవిధించమని కోరుతున్నారు” అని మనవిచేసినాడు.

రుద్ర: భవానీభట్టుమంత్రీ! పాములను, దుష్టజంతువులను, రాక్షసులను క్షమించి లాభంలేదు. ఎప్పటికప్పుడు నాశనం చేయవలసిందే! అయినా తోటి దేశపాలకుడు, మా తండ్రిగారికి మిత్రుడయిన కృష్ణభూపతి కొమరుడు - అందుకని మేము మీరాజును ప్రాణంతో విడుస్తున్నాము.

భవానీ: చక్రవర్తీ! మేమందరము మహాప్రభువులకు యెంతోకృతజ్ఞులము. రుద్ర: సరేనయ్యా! మాకు కోపంలేదు. క్షత్రియులకూ, బ్రాహ్మణులకూ కోపం నాశనహేతువు. మేము వైద్యులము. మీ రాజుకు కలిగిన రాజ్యకాంక్ష రోగాన్ని మేము నివారణచేస్తాము. మీ రాజు మాకు కోటి సువర్ణాలు, మా సేవకులకు కోటి సువర్ణాలు, మా సేనలలో హతమారినవారి కుటుంబాలు పోషణకైకోటి హోన్నుఫణాలు అపరాధము చెల్లించాలి. గోదావరీ మంజీరా సంగమంవరకు ఉత్తరపుగట్టు శౌణరాజ్యపు సరిహద్దు. అక్కడనుండి మా శాసనంఉన్న మహోపల విజయస్తంభాల గురుతున తెలుగుగ్రామాలన్నీ మా రాజ్యంలో భాగా లవుతాయి.

భవానీ: చిత్తం మహాప్రభూ!

భవానీభట్టు వెళ్ళి మహాదేవరాజు కీ సంధి నియమాలు వర్ణించగానే, ఇంతటితో బయటపడినామని, కాలిచెప్పులు వదలి కిరీటం చేతులలో నుంచుకొని పాదచారియై నడచివచ్చి రుద్రమహాచక్రవర్తి పాదాల తన కిరీటముంచి, రుద్రదేవిఎదుట సమాలింగితభూతలుడై “అష్టమ చక్రవర్తీ క్షంతవ్యుడ” ననిసన్నని ఎలుగున వచించెను.

రుద్రదేవి చాళుక్య వీరభద్రమహారాజు వైపు సాభిప్రాయంగా చూడగానే, ఆయన వచ్చి శౌణమహాదేవరాజును లేవనెత్తి, దాపుననున్న పీఠాన కూర్చుండ బెట్టినాడు.

ఈవరకే సంధినియమాల వడుపున దేవగిరికోటనుండి కోశాధికారులు ఏనుగులపై మూడుకోట్ల సువర్ణాలు, రత్నాలు బంగారు పళ్ళెరాలకొనివచ్చి రుద్రమ చక్రవర్తి పాదాలకడ ఉంచినారు.

చక్రవర్తి అనుజ్ఞాతుడై, మహాదేవరాజును ఒక సింహాసనంమీద కూర్చుండ బెట్టినారు వీరభద్రమహారాజు. చక్రవర్తి పాదాలకడనున్న కిరీటంతీసి మహాదేవరాజు తలపై నుంచినాడు పెదఅక్కినమంత్రి.

అప్పుడు వందిమాగధులు సభామధ్యమునకు వచ్చి,

‘జయ జయ శ్రీ శ్రీసమధికపంచమహాశబ్ద! జయ జయ మహామండలేశ్వర! జయ జయ పరమమాహేశ్వర! జయ జయ వినయభూషణ! జయ జయ శౌణదేశ కటక చూరకాఱ! జయ జయ మహాదేవరాయ గర్వాపహరణ! జయ జయ అనుమకొండ పురవరాధీశ్వర! జయ జయ చలమర్తిగండ! జయ జయ పరబల సాధక! జయ జయ చతుస్సముద్రవలయదిక్పూరితకీర్తి! జయ జయ రాజరాజేశ్వర! జయ జయ మూఱురాయజగదాళ! జయ జయ శ్రీస్వయంభూదేవర శ్రీపాదపద్మారాధక! జయ జయ శ్రీ అష్టమచక్రవర్తీ!’

అని జయధ్వానాలు చేసిరి. సైనికులు, దళవాహినీముఖసేనాపతులు, ప్రజలు, మంత్రులు, సభికులు జయధ్వానాలు చేసినారు.

ఆ స్కంధావారమంతా విజయధ్వానాలతో నిండిపోయెను.