గోన గన్నారెడ్డి/ఏకాదశగాథ
ఏకాదశగాథ
శివదేవయ్య
1
వచ్చిపడ్డాడు మహాదేవుడు. అతని ముట్టడి వేళకు ముహూర్తము కట్టి శివదేవయ్య విప్పారిన మోముతో, చిరునవ్వుతో తల పంకించాడు. శివదేవయ్య విశ్వేశ్వర శంభువునకు శిష్యుడు. గణపతి రుద్రదేవ చక్రవర్తి కూడా విశ్వేశ్వర శంభువునకు శిష్యుడు. విశ్వేశ్వర శంభువు గోళకీ మఠాధిపతి. వంగదేశమందలి దక్షిణ రాధామండలంలోని పూర్వగ్రామ నివాసి. విశ్వేశ్వరశంభువు గోళకీ మఠాధిపతులలో నేడవవాడు. గోళకీమఠము లకులేశ్వర సంప్రదాయానికి చెందిన మఠము. లకులేశ్వరుడు మాళవుడు. ఆంధ్ర శైవాగమవేత్త అయిన అమరేశ్వరుని శిష్యుడు. అమరేశ్వరుడు క్రీస్తుశకారంభమునందు ధాన్యకటకమునకు అనతిదూరంలో కృష్ణా తీరంలో ఉన్న అమరేశ్వర మహాక్షేత్ర నివాసి, వీ రిరువురు సాక్షాత్తు శివుని అపరావతారులనే ప్రతీతి.
అమరేశ్వరము నిర్మించినది దూర్వాసమహర్షి యట. ఆ మహర్షి పాశుపతము, కాలాముఖము అని పేరు పొందిన అతి పురాతన శైవసంప్రదాయము ఆంధ్రదేశము నందు నిర్మించెను. ఈ సంప్రదాయము సింధునదీ తీరాన క్రీస్తుపూర్వం ఆరువేల సంవత్సరములపై నుండి వర్ధిల్లి ఉన్నది. ఆది వేదములంత ప్రాచీనమని మహర్షులంటారు. సింధుతీరవాసులు కృష్ణా గోదావరీ తీరాలకు వలసవచ్చినప్పుడు తమతో ఈ శైవసంప్రదాయాన్ని కూడా తీసుకొనివచ్చి కడలిపురంలో, కృష్ణపురంలో, కురంగపురంలో, శ్రీశైలంలో, అమరేశ్వరంలో, ద్రాక్షారామంలో, మంత్రకాళేశ్వరంలో పట్టీస్వరంలో మఠాలు ఏర్పాటుచేసిరి.
ఆలాంటి మహోత్తమ సంప్రదాయానికి చెంది, గోళకీ మఠాచార్యుడైన శివదేవయ్యమంత్రి ఆంధ్రారాధ్య నియోగి బ్రాహ్మణుడు. ఈ గోళకీమఠం మొదట స్థాపించినది సద్భావశంభువు. ఈయన శిష్యుడు సోమశంభువు. ఈ మహాశైవుడు అనేక గ్రంథాలు రచించి ప్రఖ్యాతి కన్నాడు. ఈ యన శిష్యుడు వామశంభువు. ఆయన శిష్యుడు శక్తిశంభువు. శక్తిశంభువు శిష్యుడు కీర్తిశంభువు. వీరి శిష్యుడు విమలశంభుడు. ఆయన శిష్యుడు ధర్మశంభువు. ధర్మశంభువు శిష్యుడు విశ్వేశ్వర శంభువు.
ఈ గోళకీ సంప్రదాయానికి మొదట మఠము హిమాలయ పాదమైన గోమతీతీర త్రిపురి మహానగరము. ఈ మఠము త్రిపురికి దాపుననున్న గోళకి కొండలపై ఉండేది. కాబట్టి గోళకి మఠము అని పేరు తెచ్చుకున్నది. ఈ పాశుపతమతము శుద్ధశైవము. శుద్ధశైవమతానికీ వీరశైవమతానికీ చాలా తేడాలుండేవి.
శివదేవయ్య దేశికులు మహాకవి. తెలుగు నుడికారం అమృత ప్రవాహాలు కట్టే ‘పురుషార్థసార’ మను నీతిగ్రంథం రచించారు. ఈ మహాభాగుని గురించే తిక్కన మహాకవి,
“వసుమతీనాథ యాత డీశ్వరుడుగాని
మనుజమాత్రుడు గాడు పల్మాఱు నితని
యనుమతంబున నీవు రాజ్యంబు నేలు”
అని పాడియున్నారు.
విశ్వేశ్వరశంభువు పరమశివునివలె గణపతిదేవ చక్రవర్తి మహానగరం దాపున నిర్మింపబడిన మఠమధ్యమందు అష్టస్తంభ మండపంలో బంగారు సింహాసనంపై వ్యాఘ్రాజనంపై అధివసించి జటామకుటకిరీటులై, రుద్రాక్షహారాలు ధరించి అపరశంభువై తేజస్సుతో వెలిగిపోతూ శైవవేదాంత రహస్యాలు శిష్యులకు సర్వకాలమూ ఉపదేశిస్తూ ఉండెను.
విశ్వేశ్వరశంభువు శివసాయుజ్యం పొందినప్పటినుండి గోళకీ మఠానికి ఎనిమిదవ గురువు శివశంభువు అయ్యెను. ఈయన ఎన్నో దానశాసనాలు త్రిపురాంతకాది దివ్యక్షేత్రాదులయందు వేయించినాడు.
మహాదేవరాజు సకల భారతావనికీ తలమానికమైన ఓరుగల్లు మహాపురాన్ని ముట్టడించినాడన్న మొదటివార్త తెలిపిన తన శిష్యునకు బంగారు తాపడం చేసిన నూటఎనిమిది పంచముఖ రుద్రాక్షలుగల తావళాన్ని శ్రీ శివదేవయ దేశికులవారు బహుమానమిచ్చినారు. ఇది శుభవార్తయా అని ఆ శిష్యుడు సందేహించాడు. ఆ శిష్యుని మోముపై ప్రత్యేకమైన ఆశ్చర్యకాంతులు పరిశీలిస్తూ శివదేవయ్య దేశికులు చిరునవ్వు నవ్వి.
“ఆశ్చర్యం ఎందుకోయీ! యాదవులు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి ఇదే తుది పర్యాయం. ఇంకొక్క నూరు సంవత్సరాలవరకు ఈ మహానగరంపై ఎవ్వరూ దాడిచేయలేరు” అన్నారు.
శిష్యుడు: మహాదేవరాజు దండెత్తకుండా ఉంటే?
శివ: ఇంక నెవరో ఒకరు దండెత్తి తీరుదురు. ఈ పట్టు ఈ మహా నగరాన్ని ఇంకొకరు ముట్టడిస్తే ఈ నగరప్రాణం కడగట్టుతుంది.
శిష్యుడు: ఎన్నాళ్ళు జరగగలదు గురుదేవా?
శివ: ఎన్నాళ్ళు జరిగినా భయంలేదు. విరోధికి ముట్టడి సాగినకొలదీ నష్టం.
శిష్యు: అది అనుభవ విరుద్ధముకాదా దేవా? శివ: అనుభవ విరుద్దం అంటావేమి? నీ కేముంది అనుభవము? ఎన్ని ముట్టడులు చూచావు?
శిష్యుడు: ముట్టడులనుగూర్చి విన్నాను గురుదేవా.
శివ: ఓయి వెఱ్ఱివాడా! ముట్టడించినవాడు, ముట్టడింపబడువానికి, లోకువ. ఆతని బలం ఎక్కువ నాశనం అవుతూ ఉంటుంది. అదిన్నీగాక తన దేశం వదలి ఎంతోదూరం వచ్చి ఉండడంచేత ఎక్కువనష్టానికి పాలవుతాడు. అలాంటివాణ్ణి ఓడించి తరమగలిగితే, వాడు మరెప్పుడూ తలెత్తుకోలేడు.
శిష్యు: చిత్తం!
శివ: చిత్తమేమిటి వెఱ్ఱివాడా! రాజకీయాలు అతిగహనంగా ఉంటవి. మల్యాలగుండయ కాటయల సేనలు అసాధారణాలు. అందరికన్న ప్రళయమే అయిన గోన గన్నారెడ్డి ధాటికి ఈ నీచుడు నిలువవద్దూ? అవన్నీ అల్లాఉంచి రుద్రమదేవి యుద్ధనిర్వహణశక్తి అప్రతిమానం. ఆమె అపరాజితా దేవి! ఆమె ధైర్యమూ, స్థైర్యమే కళ్ళారా చూడటము లేదటయ్యా!
శిష్యు: చిత్తం మహాప్రభూ!
శివ: ఇంకో రహస్యం ఉంది. ఇదివరదాకా శ్రీ రుద్రదేవ చక్రవర్తి విరోధులను, ఇతరులను ఓడించి నాశనం చేశారు. ఇప్పుడు ఈ చక్రవర్తినియే స్వయంగా యుద్ధనాయకత్వం వహించి, లోకానికి స్త్రీ శక్తి అకుంఠితమని చాట బోతున్నది. ఇంతటితో స్త్రీలు ఎందుకూ పనికిరారు. వారికి రాజ్యార్హతలేదని వాదించే శుష్క జీవుల మాట వ్యర్థం కాబోతున్నది.
శిష్యు: గురుదేవా! మూర్ఖుణ్ణి నాఅపచారం మన్నించండి.
శివ: నీ అపచారానికి ప్రాయశ్చిత్తము, నువ్వు శివభక్తులైన గణాచారులలో చేరి, కోట వెలుపలి వార్తలు నాకు తెలియచేస్తూ ఉండడమే!
2
శివదేవయ్యమంత్రి రథమెక్కి నగరరక్షణపు ఏర్పాట్లు ఎలాఉన్నాయో చూడడానికి వెళ్ళాడు. ఆయన భటులు, శిష్యులు, పండితులు, సేనాధికారులు కొలుస్తూఉండగా సరాసరిగ తూర్పుద్వారందగ్గరకు పోయినారు. అక్కడే పరాశక్తి అపరావతారమై పురుషవేషంతో, కవచాదులతో ఉత్తమాశ్వం ఎక్కి అంగరక్షకులు, ముఖ్య సేనాధికారులు, సచివులు కొలువ రుద్రదేవి దర్శనమైనది. అందరు తమ తమ వాహనాలు దిగి గురుదేవులకు నమస్కారంచేసి, ఆశీర్వాదాలు పొందారు. శ్రీ చక్రవర్తితో తంత్రపాలుడు ప్రోలరౌతు ఉన్నాడు. ప్రోలరౌతు కుమారులు ఎక్కినాయుడు, రుద్రినాయుడు, పినరుద్రినాయుడు, పోతినాయుడు అనే నల్వురు అంగరక్షకులుగా ఉండిరి. వల్లయనాయకుడు అశ్వరక్షకుడుగా ఉండెను. మారంరాజు, ప్రోలంరాజు, దారపనాయుడు, మారినాయుడు కవచ రక్షకులుగా ఉండిరి.
మొదటి కోటయైన కంపకోటను రక్షింప ప్రసాదాదిత్యనాయుడు తన వంతుగానూ, రెండవ మట్టికోటను రక్షింప చాళుక్య వీరభద్రుడు తన పైననూ వేసుకొన్నారు. మూడవ రాతికోటను రక్షింప జాయపసేనానిని చక్రవర్తిని నియమించెను. లోని నగరుకోట రక్షింప చాళుక్య మహాదేవరాజు నియమింపబడినాడు.
ప్రసాదాదిత్యుని పుత్రుడైన రుద్రసేనాని నగరపాలకుడుగా, తూర్పుద్వారాల రక్షకుడుగా ఏర్పాటయ్యెను. నాగచమూపతి పడమటిద్వారాల రక్షకుడుగా, పైకిపోయే సేనల కధిపతిగా నియమితుడైనాడు. మున్నూరు కాపు కులజులు, సకల సేనాపతి పట్టసాహిణి, పడికము బాప్పదేవ మహారాజు ఉత్తరపు ద్వారాలకు కోటలలోని సైన్యాల కాయుధాలు అందీయడానికి ఏర్పాటయినారు. దక్షిణపు ద్వారాలకు, సేనల భోజనాదికాలకు బెండపూడి ప్రోలయమంత్రి నియమితుడైనాడు.
భూమికోటకు ఎనిమిదిగవనులు ఒక్కొక్కదిక్కుకు రెండు రెండు గవనులున్నాయి. పదునెనిమిది దిడ్లు - మూలకు మూడు, దిక్కుకు ఒకటి, తూర్పునకు మాత్రం మూడు చొప్పున - ఏర్పాటు చేయించినది రుద్రమదేవి.
కంపకోటకు గవనులు నాలుగు, దిడ్లు ఎనిమిది ఉన్నవి. రాతికోటకు గవనులు నాలుగు దిడ్లు ఎనిమిది చేర్చిన దామె. రాతికోటకు లోతట్టున సోపానాలు పెట్టించినది. రాతికోట అలంగముమీద బంధువులైన వీరవరులు కాపున్నారు.
పిల్లలమర్రినుంచి వచ్చిన రేచెర్ల బేతయ బంధువులైన వెలమవీరులు కంపకోట కావలికాచుచుండిరి. వారికి బాసటగా గార్ల నుంచి వచ్చి రేచర్ల వీరు లుండిరి. బుక్క మాచయరెడ్డి గద్వాల సామంతుడు తన సైన్యాలతో మట్టికోట తూరుపు గోడపై ఉత్తరపుదిక్కున ఉండెను. గురుగుంట సోమప్ప నాయకుడు మాచయరెడ్డి దక్షిణంగా ఉండెను. గోపిరెడ్డి అమరచింతేశ్వరుడు ఆయనకు దక్షిణంగా ఉండెను. చక్రవర్తిచే అనుజ్ఞాతుడైన, వృద్ధుడయిన జన్నిగదేవసాహిణి తన రాజ్యం అంబయదేవునికి అప్పగించి వీరులతో మట్టికోట దక్షిణ పశ్చిమకుడ్యములపైన బురుజుల పయిన నిలచినాడు.
కందనోలు ప్రభువు ముప్పడిప్రభువు మట్టికోటకు ఈశాన్యదిశను బురుజులపై నిలిచినారు. రాతికోటకు లోతట్టున ఇటుకకోట కట్టించినాడు చాళుక్య వీరభద్రుడు.
కొమ్మ ఒక్కింటికి ఇద్దరు, బురుజుకు ఏబదిమంది, దిడ్డికి నూర్వురు, గవనులకు ఏనూర్వురు వీరులు నిలచిరి. అంగకు ఇద్దరు ముందువరసను, వారికి బాసటగా ఎనమండుగురు వెనుకను ఉన్నారు. కోటద్వారాలన్నీ గడచి చక్రవర్తియు, శివదేవయ్యమంత్రి, చాళుక్య వీరభద్రుడూ, అంగరక్షకాదులూ, మట్టికోటకు పోయి, గోడఎక్కి విరోధుల పటాటోపాలన్నీ చూస్తూ సాయంకాలానికి తిరిగి నగరులు చేరినారు.
రుద్రదేవి శివదేవయ్య పాదాలకు సాగిలబడి ఆశీర్వచనంపొంది నగరులోనికి పోయినది. అన్నమదేవి మహారాజు నగరానికి పది గవ్యూతుల దూరంలో ఉన్నాడన్న సమయంలోనే రుద్రదేవి ఆలోచనమీద పురుషవేషం వేసికొని, మల్లికకు పురుషవేషంవేసి ఎక్కడకేని వెళ్ళిపోయెను.
ముమ్మడాంబికాదేవికూడా పురుషవేషం వేసికొని చక్రవర్తికి కుడిచేయిగా ఉండటానికి ఉబలాట పడుతున్నది. అందుకు చక్రవర్తి ఆజ్ఞ ఈయలేదు. ఆ కారణంవల్ల ముమ్మడమ్మకు ఎంతో కోపంగా ఉన్నది.
రుద్రదేవి లోపలికివెళ్ళి కవచాదులు. వస్త్రాలు ఊడ్చి, స్త్రీ వస్త్రాదులు ధరించి పూజకు కూర్చున్నది. పూజ ముగించి ‘ఈ యుద్ద పర్యవసానం ఏమవుతుందా’ అని ఆలోచనాధీనయై భోజనం చేస్తున్నది. ఆమె ప్రక్కనే భోజనంచేసే ముమ్మడాంబిక మూతిముడుచుకొని భోజనం ఏలాగో చేస్తున్న విషయం కొంతసేపటికి కాని రుద్రదేవి గ్రహించలేకపోయింది.
రుద్ర: చెల్లీ! ఏమిటా భోజనం?
ముమ్మ: నా చక్రవర్తి నన్ను ఆజ్ఞాపిస్తే నేను ఎక్కువ తినవచ్చును. కాని అది నాలో ఇమడగలదని అనుకోను.
రుద్ర: అంతకోపంవస్తే ఏమి చెప్పను? నేను మగవీరునిలా తిరిగి తెచ్చుకొనే అపయశం చాలదూ?
ముమ్మ: నన్నంటే అనండి, మిమ్ములననుకొని అబద్ధమాడకండి.
రుద్ర: సరే, నీకు అంతకోపమైతే నాతో రావచ్చును. కోటలు దాటివెళ్ళి యుద్ధం చేయవలసివస్తూ ఉంటుంది. అలాంటప్పుడు.....
ముమ్మ: అన్నాంబికను ఎల్లా పంపించారు?
రుద్ర: అన్నాంబిక విషయమూ, నీ విషయమూ ఒకటేనా చెప్పు? అన్నాంబ గన్నారెడ్డిని ప్రేమించినది. ఆమెకు ఏది అడ్డమైనా లెక్కచేయదు.
ముమ్మ: నేను మిమ్మల్ని ఒకనాడు సర్వసృష్టికన్నా ఎక్కువగా ప్రేమించాను. మీరు ఆడవారు కావడం నాదా తప్పు?
రుద్ర: సరే! సరే! నా కన్న తక్కువగా ప్రేమించేవ్యక్తి ఇక ఎవరు?
ముమ్మ: అప్పుడు మీతో ఉండాలనే కోరనుగదా!
రుద్ర: అయితే త్వరలో అలాంటి పెద్దమనిషిని వెదకాలి.
ముమ్మ: వెదకేవరకూ మీతోనే ఉండనియ్యండి!
రుద్ర: ఏమితంటా తెచ్చిపెట్టావు? ముమ్మ: నేను తంటా తెచ్చిపెట్టేదాన్నయితే నన్ను ఎందుకు పెళ్ళిచేసుకొన్నారు మగవేషంతో?
రుద్ర: నీ బాధ్యత నా ఒక్కరిదే కాదు చెల్లీ!
ముమ్మ: దేశంలో అందరిమనుష్యులదీ మీ బాధ్యతకాదా? అయినా మీరు ఎందుకు యుద్ధంలో నాయకత్వం వహిస్తున్నారు?
రుద్ర: రాజు అల్లా వహిస్తుండాలి!
ముమ్మ: రాణులుమాత్రము బాధ్యత వహించనక్కరలేదు కాబోలు!
3
రుద్రదేవి తన సేనాపతుల నందరినీ, ఆ రాత్రి తన ఆలోచనామందిరానికి పిలిపించింది.
“మీరు ఆంధ్రవీరులు, పగఱకు వెన్నియని మేటిశూరులు. విరోధిని పూర్తిగా ఓడించడానికి నెల దినాలకన్న ఎక్కువకాలం పనికిరాదు. పది దినాల లోపుగా మనం విజయం పొందగలం అని నే ననుకోను?
“మన యుద్దవిధానం మనకోటను రక్షించుకోటంకాదు అని మీరు నిస్సందేహంగా నమ్మండి. శత్రువును సర్వనాశనం చేసి ఓడించడమే మన కర్తవ్యము. అది ఒక్కటే మన ధర్మము. మన కోటబలం అందుకే ఉపయోగపడాలి.
“ఒక్క నిమేషము శత్రువునకు విశ్రాంతి తీసికొనే వ్యవధి ఈయకూడదు. గవనులు వెడలి వారి పై బడి నాశనం చేస్తూ ఉండడము, వారి ఒత్తిడి ఎక్కువైతే కోటలోకి వచ్చివేయడము! అన్ని గవనులనుండి ఒక్కసారి ముందుకు దుమికి వెనక్కు రావడం, ముందుకుపోతే జాగ్రత్తతో పోవాలి!
“ఈ నాటికి మూడవదినం శత్రువులను కంపకోటకడకు రానిచ్చి, పోరు మంచిపట్టుగా ఉన్న సమయంలో కంపకోట అంటించాలి. అంటించేముందు తక్కిన సైన్యము మట్టికోటలోనికి వచ్చివేయాలి! అగ్నిహస్తులు మాత్రం అగ్ని ముట్టించి లోపలికి వచ్చివేయండి! శత్రువు రక్షణకోసం వెనక్కు తగ్గగానే అగ్ని ఆరిపోయే సమయంలో అన్ని సింహద్వారాలనుంచి, దిడ్లనుంచీ లక్షమంది పైకురికి శత్రువును చీకాకుపరచండి, శత్రువుబలం ఎక్కువ అయ్యే విషయం మేము కోటగోడమీదనుంచి చూచి మహాకాహళాలు ఊదిస్తాము. కాహశళాల ధ్వని విని నెమ్మదిగా వెనక్కు అడుగువేయండి. పైకివెళ్ళే సైనికులందరూ శిరస్త్రాణాలపైన ఎఱ్ఱతలపాగాలు చుట్టుకొనండి. మన సైనికులు గోడదగ్గరకు వస్తూవుంటే శత్రువు మా బాణపు సేతకు రాగానే బాణవర్షం కురిసి ఆపుతాము. మన సైన్యం నిలబాటుచేసి, శత్రువును రెండవసారి తలపడండి. అప్పుడు మహా భేరీలు మేము మ్రోగించగానే ప్రతి సైనికుడు లోపలికి వచ్చివేయవలసిందని మా ఆజ్ఞ! ఈలోగా ఆసమయంలోనే ఉభయమల్యాల సైన్యాలు గన్నారెడ్డి గజదొంగలు వెనుకనుండి శత్రువులపై ఒత్తిడి ఎక్కువ చేసేందుకు మా ఆజ్ఞ అక్కినాయక ప్రభువు మనవారికి అందిస్తాడుగాక!”
అని చక్రవర్తి గంభీరవచనాలతో సేనాపతులకు తెలియజేసి సభ చాలించినారు.
ఆ మరునాడు ముమ్మడమ్మను వీరోచితవేషం వేసికొమ్మని తనవెంట తీసుకొని శివదేవయ్యమంత్రిని దర్శించడానికి పోయి వారు తమ తపోమందిరంలో ఉండగా దర్శించి సాష్టాంగనమస్కారా లాచరించింది చక్రవర్తిని. అంగరక్షకులు ఆ దేశికుల నగరానికి సింహద్వారం కడనే ఉండిపోయినారు.
తపస్సు చాలించి ఆ పరమమాహేశ్వరుడు, పరమమాహేశ్వరి అయిన చక్రవర్తినిని, ముమ్మడమ్మను ఆశీర్వదించి “మహారాజా! మీరు నిశ్చయించిన ప్రథమయుద్ధ ప్రయోగము అమోఘమైనది. దానివల్ల శత్రువుకు కలుగబోయే నష్టము అపారము, మీరే దర్శింతురుగాక! లోకంలో ఆడువారి కులపతిత్వం ఎందుకు మహర్షులు తీసివేశారో!” అన్నారు.
రుద్రదేవి: గురుదేవా! స్త్రీకి కులపాలకత్వం మహర్షులు ఊరికేతీసివేశారంటారా? ఆలోచించే తీసివేశారు. ఎప్పుడు యుద్ధం జరుగుతోన్నదని విన్నా గజగజ వణికిపోతాను.
శివ: పిల్లవానికి ముల్లు గుచ్చుకుంటే తల్లి తీసివేయగలదా?
రుద్ర: తప్పక తీసివేస్తుంది!
శివ: పిల్ల వానికి బాధ అని ఊరుకోరాదూ?
రుద్ర: కత్తిపుచ్చుకొని కుమారునకైనా శస్త్రచికిత్స చేయగలదా బాబయ్యగారు?
శివ: పాము కరిస్తే, విషం పీల్చివేయవలసి ఉంటే తన ప్రాణనష్టాని కన్నా వెరవకుండా పీలుస్తుందికాదా తల్లి.
రుద్ర: తన ప్రాణాన్ని అర్పించడానికి, స్త్రీ ఎప్పుడూ సిద్ధమే!
శివ: తన కొడుకు ప్రాణం రక్షించడానికి, కొడుకును బాధపెట్టలేక, కొడుకును చంపివేసుకొంటుందా?
రుద్ర: (మౌనం)
శివ: కాబట్టి దేశానికి తల్లి అయిన రాణి, తనబిడ్డలయిన దేశప్రజలను రక్షించడానికీ, యుద్దం చేయడానికీ సందేహిస్తుందా?
రుద్ర: తానే, ధర్మంగా రాజ్యంచేస్తాను అనుకోడం అహంభావంకాదా? శివ: తన్ను ఓడించి రాబోయేవాడు రాక్షసుడు కాజాలడనీ, ప్రజలను రక్షిస్తాడనీ ఆ రాణికి నిర్థారణగా తెలియునా?
రుద్ర: ఇవన్నీ తలచుకుంటోంటేనే నాకు ఆవేదన కలుగుతో ఉంటుంది. పరమశివుడు మానవలోకాన్ని ఇన్ని కష్టాలతో ఎందుకు ఉద్భవింప జేశాడు? ఒకరు రాజ్యాధిపతులా, ఒకరు గంగిరెద్దుదాసరులవంటి బిచ్చగాండ్లు!
శివ: బిచ్చగాండ్లు అయి పడేకష్టాలు ఎక్కువ ఏముంది? రాజ్యాధికారులు పడని కష్టాలు ఏమున్నాయి? మహారాజా! సర్వవిశ్వంలో ఈ మనుష్యుడే జ్ఞాన ఉపాధి. అతడే ‘ఏమి?’ అనే ప్రశ్న వేసుకొంటున్నాడు. భక్తులు, జ్ఞానులు, అవతారపురుషులు కష్టాలలో కుంగిపోయి మానవజాతిని ఉద్ధరించడానికి అనేక ఆవేదనలకు లోనవుతారు. బుద్ధుడు చావు, ముసలితనం, రోగం చూచి అవి లేకుండా చేయాలని ప్రయత్నించి చివరకు ప్రపంచం మాయ, అది తెలుసుకున్న వారిని కష్టాలు ఏమీ చేయవు అని తీర్మానించుకున్నాడు. బీదవారికే మోక్షం సుకరం అని తెల్పడానికి కాబోలు, రాముడు శబరి ఎంగిలి తిన్నాడు. శ్రీకృష్ణుడు కుచేలునికి ప్రాణ స్నేహితు డయ్యాడు. అయినా ఏదో మార్పులతో ప్రపంచం అలానే ఉంది.
రుద్ర: గురుదేవా! మనుష్యుల గుంపులు ఎల్లాఉన్నా ప్రత్యేకవ్యక్తి పరమాత్మను తెలిసికొనడమే మహాకర్మ అవుతుందికాదా?
శివ: నిజం తల్లీ! అయినా నీ చుట్టుపక్కల ప్రపంచం చూచి దాని సంతోషాలలో, బాధలలో ఒకటౌతూ, నువ్వు ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ ప్రపంచం నిజమనుకుంటూ, కాదనుకుంటూ, ఒక దివ్యనాటకంలో పాత్ర అవుతూ, చరించటం ఎంత విచిత్రమైన విషయం?
రుద్ర: అందుకే ‘నువ్వు నిష్కామంగా కర్మచేయి, ఫలం నాకు వదలు’ అని శ్రీకృష్ణభగవాను డన్నది.
శివ: అదేగా పాశుపతం చెప్పేది తల్లీ! ఇంతకూ జీవితమహాయుద్ధం ముందర, ఈ అఖండ ఆత్మయుద్ధం ముందర మనం ఒనరించే యుద్ధాలు దివ్విటీ ముందర దీపాలవంటివి.
రుద్ర: చిత్తం.
శివ: చిత్తమని నిస్పృహచెంది వెళ్ళకు! మన పౌరుషాలు, మన జ్ఞానాలు, మన ఖ్యాతులు, మన ఆవేశాలు దేహయుద్ధానికీ, ఆత్మయుద్ధానికీ కూడా ఉపకరణాలు. ఏయుద్ధంలోనైనా మనమే విజయం పొందాలి. ఎవరికివారే నరులు, తక్కినవారు ఉపకరణాలు. ఎవరికివారే పరమశివులు, తక్కినవారు పాశుపతాస్త్రాలు, ఎవరికివారే పశుపతులు, తక్కినవారు పశువులు! దేశికుని గంభీరవచనాలు విని ఉప్పొంగి, రుద్రదేవి దేశికునకు పాదాభివందన మాచరించి వెడలిపోయినది.
ముమ్మడమ్మ గురువులకు నమస్కరించి ‘చక్రవర్తికి కలిగిన అనుమాన మేమిటి? అది గురువుగా రెట్లా తీర్చారు? వారి సంభాషణ ఇంచుకంతయినా తనకు బోధపడకపోయినదేమి?’ అనుకుంటూ రుద్రదేవి వెనుకనే తన గుఱ్ఱం నడిపించుకుంటూ వెళ్ళినది.
4
గోనగన్నారెడ్డి యాదవుణ్ణి సంపూర్ణనాశనంచేసే ఎత్తులు ఆలోచిస్తూ తాను విడిదిచేసిఉన్న ఒకపల్లెటూళ్ళో గ్రామణి ఇంట్లో మండువాలో పచారుచేయుచూ ఉన్నాడు. అతని కోలమోము, సోగమీసాలు, విశాలమైన కన్నులు, వెడదనుదురు ఆలోచనారేఖలతో బిగిసివున్నవి.
అప్పుడే ద్వారపాలకుడువచ్చి “మహారాజా! విశాలాక్షప్రభువు వేంచేసినాడు” అని మనవిచేసినాడు.
“ఏమిటీ! విశాలాక్షప్రభువా? రానీ?” అన్నాడు గన్నారెడ్డి. అతని హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఈ బాలుడు తన హృదయం చూరగొన్నాడు. ఆ బాలకునియందు వాత్సల్యం, సౌందర్యం, మైత్రి అన్నీ కలిసిన ఏదో ఒక దివ్యానురాగం కలిగింది. తెలివైనవాడు, చదువుకొన్నవాడు, ఉత్తమ వీరుడు. కాని మాటలో, కంఠస్వరంలో కొన్ని కొన్ని విషయాలలో బాలికలా అయి ఊరుకుంటాడు. ఆ చిన్న చేతులు అంత మృదువులేమి? కాని కత్తి పట్టుటలో అఖండ ప్రజ్ఞ చూపిస్తాడు. మగవీరులులా కనబడే స్త్రీలు, మగరాయని పనులు చేసే స్త్రీలూ, బాలికలలా ఉండేబాలురు ఉంటారు కాబోలు.
అతని బాల్యమూ, అతని లేతదనమూ చూచి, తనకు ఆ బాలకుడంటే అంతప్రేమ కుదరడానికి కారణం అయింది.
ఇంతలో విశాలాక్షప్రభువు పటాటోపంగా లోపలికి ప్రవేశించి, “మహారాజా! నమస్కారము” అని గన్నారెడ్డి పాదాల కెరగినాడు. మహారాజు విశాలాక్షరెడ్డిని గ్రుచ్చిఎత్తి రెండుభుజాలమీద చేయివేసి సంతోషంతో “విశాలాక్షప్రభూ! నన్ను మర్చిపోయావే అనుకున్నాను. కాని నీ రెండు కమ్మలూ నాకు చాలా ఆనందం చేకూర్చాయి. ఆ ఉత్తరాలలోని మాటలు కాదుసుమా!”
విశా: మరి దేనికి మహారాజా!
గోన: నేను దేవుణ్ణనీ, దేవుని తమ్ముని కుమారుడననీ పొగడితే మాత్రం కష్టంగాఉంది ప్రభూ! విశా: మరి ఎందుకు మీకు ఆనందం చేకూరింది?
గోన: ఆ ఉత్తరాలకే.
మల్లికార్జునరెడ్డి (గుమ్మంకడనుండి): మహాప్రభూ! ఉత్తరాలు చిత్రలేఖనాలులా అందముగా ఉన్నాయనా ప్రభువునకు ఆనందం కలిగింది?
గోన: చక్కని మొగలిరేకుల కమ్మలు, వ్రాలు ముత్యాలు, ఉత్తరం పెట్టినది దంతపు పేటిక. శిల్పవిన్యాసము మనోహరము, అంతవరకు నిజము.
విశా: అదా, మీరు చూచి ఆనందించినది మహాప్రభూ!
గోన: నే నట్లాఅంటినా? ఆనందానికి మాకు వేరేకారణం కనబడక, అవి అయిఉంటాయని అను కొన్నాను.
విశా: నే నేమీ అనుకోలేదు. ప్రభువులు మర్యాదకు అంటున్నారు, అంతే.
గోన: ఓహోహో! మర్యాదకు మనస్సులో కోపమున్నా పైకి నవ్వుతారా? నా తత్త్వం అదికాదు. నా మనస్సులో ఉన్నదే పైకివస్తుంది. నీ స్నేహానికే ఆనందించానయ్యా ప్రభూ!
విశా: మహారాజా! ఎల్లాగు ఈ యాదవపిశాచాన్ని మనం వదలించడం?
గోన: దెబ్బకు దయ్యాలు గడగడ లాడుతవి. ఇక పిశాచాలు లెక్కా? మహాదేవరాజు శిబిరాలు నిర్మాణం చేసుకోనిచ్చాను. శిబిరాలు నిర్మించినవాడు స్వపురంలో ఉన్నవానితో సమానమే! ఓ పట్టున శిబిరాలు వదలలేడు. శిబిరాలు వదలలేనివాడు శిబిరాలు లేనివానికి లోకువకదా?
విశా: నగరానికి కోటగోడలుంటాయి రక్షించడానికి. శిబిరాన్ని రక్షించడానికి గోడలుకూడా ఉండవుకదా?
గోన: ఈ మూర్ఘపు మహాదేవుడు కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండే వాడివలనే అక్కడక్కడ మట్టి బురుజులు, గోడలు కట్టిస్తున్నాడు.
విశా: తన సైన్యాలను రక్షించడానికి ఏదయినా చేయాలికదా మహారాజా.
గోన: అవును ప్రభూ! అవును. కోటచుట్టూ విరోధులకోట! చక్రవర్తికి విరోధిని జయించడం కష్టమే.
విశా: కాని...
గోన: కాని ఏమున్నది! అతన్ని విజయాన్ని పొందనిచ్చే దెవరు? నీ రాకవల్ల నాకు ఒక చక్కని ఆలోచన తట్టింది. ఈ దెబ్బతో మహాదేవరాజు తోక ముడుచుకొని దేవగిరికి పరుగెత్తాలి.
విశా: ఏమిటండీ అది?
గోన: చెప్తాను తర్వాత. ఈలోగా కొన్ని సంగతులు తెలుసుకోవాలి. ఇంతలో చక్రవర్తికడనుండి ఆ మరునాడు మధ్యాహ్నము సూర్యుడు నెత్తి మీద ఉన్న వేళకు మహాదేవరాజు సైన్యాలపై ఒత్తిడి ఎక్కువ చేయవలసిందని ఆజ్ఞ వచ్చిందని మల్యాల కాచయప్రభువు గన్నారెడ్డికి వార్త పంపినాడు.
ఈ మూడు సైన్యాలు మూడువైపులా కాపలా కాచినారు. ఎక్కడో దూరాన నుండి ఆశ్వికసేనలు, గజాలు, రథాలు బయలుదేరి వేగంగా వచ్చి మహాదేవరాజు సైన్యాలకు వెనుకదెసతాకినవి. ఈ తాకిడి ప్రళయంలా ఉండడంవల్ల మహాదేవరాజు సైన్యాలు ఎన్నో వెనుకవైపునకు తిరిగి ఆ మహావర్తాన్ని ఎదుర్కొన్నాయి, గన్నారెడ్డి ఆశ్వికసైన్యాలు వేగంగా వచ్చి విరోధుల్ని తాకి బాణాలు వదలడం, మళ్ళీ అంతవేగంతోనే వెళ్ళిపోతుండడం అనే ఆవర్తయుద్ధవిధానం ఉత్తమమయిందని తెలియజేసినాడు. మహావేగంతో వెళ్ళేవాడు గురికి దొరకడు. అతడు ప్రయోగించే బాణాలుగాని, భల్లాలుగాని, తోమరాలుగాని నిలిచియున్న విరోధులకు తగిలి తీరుతాయి.
ఈ ఆవర్తవిధానం చూచి భ్రమసిపోయి శత్రువులు వేలకొలది కూలి పోతున్నారు.
సరిగా ఆ సమయంలో కంపకోట వదలి ప్రసాదాదిత్యప్రభువు లక్షమంది సైనికుల్ని విరోధిపై ప్రయోగించాడు. శత్రుసైన్యాలు ద్విముఖమై యుద్ధం చేస్తున్నాయి.
ప్రసాదాదిత్యప్రభువు, శత్రువు తాత్కాలికంగా నిర్మించుకొన్న గోడలను అనేకప్రదేశముల బద్దలుకొట్టించి లోనికి ప్రవేశించాడు. పోరు ఘోర మయ్యెను.
ఆసమయంలో వేయి మహాకాహళపు మ్రోతలు విననైనాయి. కంపకోటకు ముందుకు రెండుపాయలుగా ఏనుగులువచ్చి ప్రసాదాదిత్యునికి బాసట అయినాయి. ప్రసాదాదిత్యుని సైన్యాలు నెమ్మదిగా వెనక్కు తగ్గుచు మళ్ళినవి; వారిమీద విరుచుకుపడేవారిని గజసైన్యాలు నిలువరించినవి. గజసైన్యాల వెనుకకు ప్రసాదాదిత్యుని బలాలు మళ్ళగానే ఏనుగులు వెనుకకుమళ్ళి కంపకోటలోని దిడ్లవెంటలోని కేగినవి.
మహాదేవరాజు శత్రువులు ఓడినారని తలచి ఒత్తిడి ఎక్కువ చేసినాడు. ఆ సమయంలో మల్యాలవారు, గోన గన్నారెడ్డి ఆవర్తయుద్ధం మాని నిలచి పోర సాగిరి. కాలిబలగాలు ముందుకు జరిగాయి.
ఇటు మట్టికోటలోనివారు కంపకోటదగ్గరకు రాకుండ శత్రువును నిలువరించినారు. కంపకోటనుండి ఒత్తిడి తక్కువైనది. శత్రువులు తమ వేగం తాము ఆపుకోలేక, ఎదిరివారు కంపకోటను కాపాడుకోలేకుండా ఉన్నారని, కంపకోటపై విరుచుకుపడినారు. ఇంతట ఫెళఫెళారవాలతో, నూనెలతో తడుపబడి గంధకాదులతో సిద్ధమై యున్న కంపకోట అంటుకొన్నది.
5
కంపకోట అంటుకొన్న వెంటనే భుగభుగ మనే మంటలు ఆకాశంపై దుమికాయి; మంటలతోపాటు నూనెపొగలు, గంధపు పొగలు నాసికారంధ్రాలలో దూరి వీరుల కళ్ళు మూసినవి. ఆపుకోలేని దగ్గు వచ్చినది.
వేగంతో ముందుకురికిన యాదవబలాలు వెనక్కు మళ్ళలేక మంటలలో పడిపోయినవి. హాహాకారాలు, గోలలు నభోంతరాళం నిండిపోయినవి.
సువ్వు సువ్వున వేగంతో మహావర్షపాతంవలె బాణాలు శత్రువుల ప్రాణాలు హరిస్తున్నాయి. రెండు గడియలకు శత్రువులు తెప్పరిల్లి వెనుకకు మరలిరి. మంటలు తగ్గెను. ఆంధ్రసైన్యాలు మంటల వెనుకనుండి ఉధృతంతో శత్రువులపై కురికెను. ఓరుగల్లు కోటగోడలు పగిలినట్లు ఆంధ్రసేనలు విరుచుకు పడినవి. చెక్కు చెదరకుండా, వ్యూహనిర్మాణం చెడకుండా, నిధిలా, ఆ వాహినులు శత్రువుల నాశనం చేస్తున్నవి. తమ గోడలలోనికి పోయికూడా శత్రువులు రుద్రదేవి బలగాలను ఆపలేకపోయినారు. శత్రువుల తాత్కాలిక కుడ్యాలు కూల్చి శత్రుశిబిరాలలోనికి చేరి, రుద్రదేవే ముందుండినడిపే ఆ ఆంధ్రవాహినులు విరోధిబలగాలను నాశనం చేస్తున్నవి. మహారాజు తన యుద్ధకౌశల్యమూ, పౌరుషమూ, ఓడిపోతానన్న భయము చేత కల్గిన కోపమూ మూడు త్రేతాగ్నులుగా విజృంభించి రాక్షసునిలా పోరాడినాడు. యాదవసేనలు తమ నాయకుని మెప్పుపొందే భయంకర యుద్ధము చేసినవి.
వీరనష్టంకాకుండా యుద్ధం చేయదలచుకున్న రుద్రదేవి ఆజ్ఞచొప్పున గోన గన్నారెడ్డి, మల్యాలనాయకులు ఆవలివైపునుండి భయంకరమైన యుద్ధం ప్రారంభించినారు. ఇటు రుద్రమ ఆజ్ఞచొప్పున భేరీలు మ్రోగినవి. రుద్రమదేవి సైన్యాలలో కొత్తసైన్యాలు వచ్చి పదాతులకు, ఆశ్వికులకు రక్షణ కల్పింపగానే ఆ యా బలాలన్నీ కోటలోనికి వెళ్ళిపోయినవి. ఏనుగు బలాలు కోటచేరినవి.
కోటదగ్గరకు యాదవసేనలు రావడానికి వీలులేదు. అటు గోన, మల్యాల సేనలు వెనుకకు జరిగి మాయమైనవి.
ఆ దినమందు యాదవసైన్యాలలో ఒకలక్షఏబదివేలమంది వీరులు మరణించినారు. గాయాలు తగిలినవారు, ఆంధ్రులకు దొరికినవారూ పెక్కు వేలమంది. ఆంధ్రసైన్యాలలో మృత్యులైనవారు, గాయాలు పడినవారు, విరోధులకు చిక్కినవారున్నూ ముప్పదివేలు.
యాదవమహారాజు గుండెలలో రాయిపడింది.
కోటపైకి వెళ్ళకుండాఉంటే తనకు నష్టమే! కోటపైకి వెళ్ళినచో తన సేనలకే నష్టం ఎక్కువ సంభవిస్తోంది. ఎలాగో ఉత్తమమైన విధానం అవలంబించి ఆంధ్రనగరం స్వాధీనం చేసుకోవాలి.
తాను కోట ముట్టడి వదలి ఇతర నగరాలమీదికి వెళ్ళితే మంచిదేమో? కోటలోఉన్న ఆంధ్రులకు బలం ఎక్కువ అవుతున్నది. కోట ఈవలకు వచ్చిన ఆంధ్రులను యాదవులు నాశనం చేయగలరు.
అయినా తా నెందుకు తొందరపడడం? చుట్టుప్రక్కల గ్రామాలవారంతా ఓరుగల్లుమహాపురంలోనే ఉన్నారని తనకువచ్చిన వార్తలే నిజమైతే నగరంలో పదునాలుగులక్షల జనం ఉన్నారు. ముట్టడి నిలబాటుచేసినట్లయితే ఇన్ని లక్షల మందీ, ఉన్న ఆహారపదార్థాలను ఒక నెలదినాలలో తినివేయగలరు. జాగ్రత్తగా ఉంటే ఇంకొక్క పదిహేను దినాలపాటు ఈడ్చుకురాగలరు. అంతవరకు తాను ముట్టడి నిలబాటు చేయగలిగితే, కోట తన స్వాధీనం అయి తీరుతుంది.
తనకు ఆంధ్రుల యుద్దవిధానం యావత్తు విశదమైపోయింది. అందుకని తొందరపడక తనశక్తి ఆంధ్రులకు తెల్లమయ్యేటట్లు చేస్తాడుగాక, అనుకొనుచు మహాదేవరాజు, ఆ రాత్రి పనివారలచేత తన కోటగోడలు, బురుజులు బాగుచేయించాడు. వెనుకనుండి మల్యాలవారి సైన్యాలు, గోన గన్నారెడ్డి సైన్యాలు తన్ను పొడువకుండా ఆవైపు చిరుకందకాలు, కంపకోటలురెండు శ్రేణులుగా కట్టించాడు. తాను ముట్టడి నిలబాటు చేయదలచుకున్నాడు.
ఈ లోగా వేగులవారిని పంపి దేవగిరిలో ఉంచిన లక్షసైన్యంలో ఏబది వేలమందిని, ఆహారపదార్థములు తెప్పించుకొన సంకల్పించాడు.
కోటలోను, గన్నారెడ్డి శిబిరంలోను తమ మొదటివిజయానికి ఆంధ్రులు విజయోత్సవం చేసుకున్నారు. గన్నారెడ్డి తనతో సమముగా యుద్ధముచేసిన విశాలాక్ష ప్రభువును చూచి ‘విశాలాక్షప్రభూ! నువ్వు నాకు కుడిచేయివి సుమా’ అని మెచ్చుకొన్నాడు. విశాలాక్షప్రభువు మోము ప్రపుల్లమై వెలిగిపోయినది. ‘మహారాజా! మీకు కుడిచేయినిగాను. మీ పాదాలమ్రోల ఉండడమునకు శక్తిమాత్రం సంపాదించుకొంటున్నాను’ అనినాడు.
గోన: ప్రభూ! మీరు, యుద్ధంచేసే సమయంలో సర్వకాలమూ నా రక్షణకొరకే చూస్తే ఎలాగు?
విశా: లేకపోతే మీకు అంగరక్షకుణ్ణి ఎల్లా కాగలను? గోన: మరి మిమ్మల్ని రక్షించేవారు?
విశా: నాకు మల్లికార్జునరెడ్డి ఉన్నాడుకదా ప్రభూ!
గోన: మల్లికార్జునరెడ్డి?
విశా: ఇల్లా యుద్ధం చేసేవారందరికీ అంగరక్షకులు ఉండాలా మహారాజా?
గోన: ఉండాలని నా ఉద్దేశంకాదు. ప్రతివీరుడూ తన్నురక్షించుకొంటూనూ ఉండాలి. విరోధులను నాశనమూ చేయాలి.
విశా: నాయకునికిమాత్రమే అంగరక్షకులు ఉండాలి. ఆయన సర్వసైన్యానికీ ప్రాణంకాదా ప్రభూ!
విశాలాక్ష ప్రభువు కన్నులు మెరిసినవి. ఆయనమోము వెలిగిపోయినది. గోనగన్నారెడ్డి హృదయం ఎందుకో కొట్టుకొన్నది.
శివదేవయ్యమంత్రి గురుసింహాసనంపై కూర్చుండినారు, సన్నని పొడుగాటి మనిషి, కోలమోము, అతివిశాల ఫాలము, గరుడ నాసిక, ముక్కుకుదగ్గరలో ఉండే లోతుకళ్ళు, పెద్దచెవులు, వెడల్పాటి నోరు, పొడుగుగా పెరిగిన జటలపై రుద్రాక్షకిరీట మున్నది. ముత్యాలు పొదిగిన బంగారు అర్దచంద్రాభరణ మా కిరీటముపై నున్నది. నల్లని కోలబొట్టు మూడవ నేత్రంలా ఫాలాన వెలుగుచున్నది. ఆయన మెళ్ళో రుద్రాక్షమాలలున్నవి. వజ్రాలు పొదిగిన లింగకాయ నాయక మణిలా, ఒక రుద్రాక్షమాలకు వేలాడుచున్నది. ఫాలంపై, చెవులపై, భుజాలపై, విశాలవక్షంపై, మెడపై, ముంజేతులపై, పొట్టపై, వీపుపై విభూతిరేఖలున్నవి.
కైలాసశిఖర హిమసానుపీఠముపై పరమశివునిలా శివదేవయ్యమంత్రి స్ఫటికాసనస్థుడై, భక్తజనపరివృతుడై కూర్చున్నాడు. శైవతత్వవిచార దక్షులు కొందరు, పరమత దూషణవాదులు కొందరు, భక్తులు, గురుపాద ద్వంద్వారాధకులు, రాజకీయవిచారణదక్షులు, ఉద్యోగులు, పండితులు, శాస్త్రజ్ఞులు, మహాకవులు, ఉభయభాషావేత్తలు, తాంత్రికులు, శిల్పులు, జ్యోతిష్కులు, సిద్ధాంతులు, ఆగమవేత్తలు, మొదలైనవా రెందరో ఆ మహామహుని సభలో నిండి ఉండిరి.
శివదేవయ్య అందరితో సహస్రావధానంలా ప్రశ్నోత్తరాలు జరుపుచున్నను ఆ సాయంకాలం జరిగిన మహాయుద్ధాన్నిగురించే ఆలోచిస్తున్నారు.
తాను రుద్రప్రభువుకు ఆలోచనలు చెప్పగూడదు. ఆ ఉత్తమురాలు తన రాజ్యము తానే రక్షించుకోవాలి. తన సార్వభౌమత్వము తానే నిర్మాణము చేసుకోవాలి. ఆమె గణపతిదేవుని కొమరిత. స్త్రీలలోని పరిపాలనాదక్షణ కళాపూర్ణము, శక్తియుతము. పురుషునిశక్తి అత్యంత బలయుతము. పురుషుడు విరోధుల లోబరచుకొన్నా, తన ప్రాభవం కోరుతాడు. స్త్రీ ఇతరులను జయించినా వారిపూజ ఆశిస్తుంది. రెండు శక్తులూ రుద్రమాంబలో యమునా గంగా సంగమమయ్యాయి!
ఈతల్లి స్త్రీరాజ్య మెంత ఉత్కృష్టమో లోకానికి చాటగలదుగాక. పురుషుడు విభూతులను సంపాదింపగలడు. వాటిని ఉత్తమంగా కాపాడవలసింది స్త్రీగదా? పురుషుడు సృష్టికర్త స్త్రీ సంరక్షణకర్త్రి. ఇది మహాభావవిషయంలో, భౌతికంగా స్త్రీ బిడ్డలను కనాలి, పురుషుడు ఆ శిశువులను రక్షించాలి. ఈ భౌతిక సత్యంలో నుండే తాంత్రికవాద ముద్భవిల్లింది.
ప్రేమకు విముఖుడయిన శివుడు కాముని దహిస్తే దేవి ఏమవుతుంది? విశ్వసౌందర్యాన్ని ప్రేమించి భోగించగల ఆమె దివ్యరాగము పురుషునిలో లేకపోతే విశ్వానికే నాశనం! పరమేశుని ఇచ్ఛ సృష్టిస్థితిలయాలు. నాశనశక్తి భండాసురుడయినది. ఆ నాశనశక్తిని పురుషుడు నాశనం చేయలేకపోవుట విచిత్రము. దేవిని ధ్యానించివాడు పరమేశుడు. తాను ఏమీ చేయలేడు. దేవి ఎక్కడ? సర్వమూ ఆహుతి అయిపోయినది. తానే ఆహుతి అయినాడు. తన ఇచ్ఛ ఆహుతి అయినది.
ఆ దివ్యాగ్నిలోనుంచి దివ్యకామ అయిన దేవి కామేశ్వరిగా ఆవిర్భవించింది. ఉపాధిలేనిశక్తి ఎట్లు? పురుషుడే కామేశ్వరుడు. కామకామేశ్వరి, రాజరాజేశ్వరి అనే భావం విశ్వవిశ్వాలకు, అనంతకాలానికీ మూలమంత్రం, ఆ మంత్రానికి అధిదేవత కాముడే అయినాడు.
అలాంటి ఈ విశ్వంలో, విశ్వానికి మధ్యమయిన ఈ భూమిలో, రాజులు రాజ్యాలకోసం, మతకర్తలు ధర్మాలకోసం, పండితులు తమ వాదాలకోసం విజిగీషులై జైత్రయాత్రలు చేయడం ఎందుకు?
ధనం, భోగం, కీర్తి ఈ మూడూ బ్రతికివున్నన్నాళ్ళే ఉంటాయి. కీర్తి కొన్ని నూర్ల సంవత్సరాలు వుండవచ్చును. ఎంతమంది రాజులు దానశాసనాలు వ్రాయించలేదు. అవి జరుగుతున్నాయా? ఎంతమంది తాత్విక ధర్మస్థాపనలు జరుపలేదు? అవి ఏమయ్యాయి? పరమశివుడే లే డనలేదా బౌద్ధులూ, జైనులూ? ఈ దేశంలో స్త్రీ పురుషులు ఒకనాడు బౌద్ధులు; మరొకనాడు జైనులు; ఈనాడు శైవు లౌతున్నారు.
శైవంమాత్రం ఎన్నివిధాల రూపం పొందటంలేదు. అన్ని తత్వాలు తాత్కాలికమే. కాని వర్తమాన నాటకంమాత్రం తప్పదు.
మహాదేవరాజు ఓరుగంటికి వచ్చాడు. ఏమి కట్టుకుపోతాడు? ప్రాణాలా?
అతడు వచ్చాడని మనం రక్షించుకోవడం ఏమిటి? ఇదిఅంతా ప్రళయ నటేశ్వర మహాభావము. పులితోలో, ఏనుగుతోలో నడుమున కట్టుకొని, కంకాళాలు ధరించి, ముమ్మొనవాలు, డమరుకము, అగ్ని మూడు హస్తాల దాలిచి అభయహస్తంతో సృష్టి స్థితిలయాత్మకము లయిన కోటివేల కరణాలతో అంగ హారాలతో నృత్యనృత్తాలతో, అభినయాదులతో, దివ్యగాంధర్వంతో, సర్వ విశ్వ భావంతో తాండవం చేస్తాడట. అన్నీ ఆ తాండవంలో భావమాత్రములే.
శివదేవయ్యమంత్రి చిరునవ్వు నవ్వుకొన్నాడు. శిష్యులంతా లోగొంతుకలతో ఏవేవో చర్చించుకొంటున్నారు.
అంతలో రుద్రదేవచక్రవర్తి హఠాత్తుగా లోనికి దయచేసి గురువునకు సాష్టాంగనమస్కారము చేసింది.
అచ్చటనున్న భక్తులంతా లేచారు. గురుదేవులు తమ ఆలోచనా పథంనుండి మరలి, చటుక్కున లేచి “మహారాజా! రండి అధివసించండి” అని కోరినారు. రుద్రమదేవిన్నీ, శివదేవయ్య దేశికులున్నూ తమ తమ ఆసనా లధివసించగానే భక్తులంతా తమ ఆసనా లధివసించి యుద్ధ విషయాలు వారిద్దరూ మాట్లాడుకొంటూ వుంటే విందామని కుతూహలం పడుతున్నారు.
రుద్ర: నాయనగారూ! ఇంతవరకూ మనదే జయం. మహాదేవరాజు చిందరవందర అయిపోయినాడు. విన్నారా?
శివ: విన్నాను మహారాజా! మీ మనస్సులో ద్వాదశార్కులు ప్రతిఫలింతురుగాక! మీ హస్తాలలో పాశుపతాది దివ్యాస్త్రాలు భాసించుగాక! మీ చూపులలో ఫాలనేత్రాగ్ని వెలిగిపోవుగాక! మీ శత్రువు పరాభూతుడగుగాక! మీకు శుభమగుగాక!
ఆ సభలో ఉన్నవా రందరు ఉప్పొంగిపోయారు.