గోన గన్నారెడ్డి/దశమగాథ

వికీసోర్స్ నుండి

దశమగాథ

యాదవులు

1

యాదవమహారాజు తనసైన్యంతో పది గవ్యూతులన్నా ప్రతిష్ఠాన నగరం దాటి రాలేకపోతున్నాడు. గోన గన్నారెడ్డి, మహాదేవరాజు ఆరు లక్షల సైన్యాన్ని అడుగు కదలనీయడు. అంతగా శత్రువుల ఒత్తిడి ఎక్కువైతే పదిఅడుగులు వెనక్కు వేస్తాడు. ఇరువాగులవారికి ఒక్క గౌతమీదేవి కాపుకాస్తున్నది. అన్నీ కొండలు, గుట్టలు, అరణ్యాలూ, ప్రతిగుట్టా, ప్రతికొండా, ప్రతిసెలయేరూ, ప్రతిఅడవీ గన్నారెడ్డికి కాపుదలగా ఉన్నవి. జగన్నాథరథంలా సాగిపోవలసిన యాదవసైన్యం అడుగడుక్కు విఘ్నం. అయ్యో చేసేదేమిరా అన్నట్లుగా ఉన్నది.

మహాదేవరాజు కోపం మిన్నుముట్టుతూవుంది. తా నిలా జైత్రయాత్ర సాగిస్తే ఎన్నాళ్ళకు ఓరుగల్లుపోవడం? యుద్ధవ్యూహాధ్యక్షుడు, సేనను చొప్పించుకు పోయే మగటిమి కలవాడు, ఎదిరించే శత్రువు మనస్సు తెలిసికొని యుద్ధం నడిపే భయాంకర ప్రతిభాశాలి అతడు. కాని అతన్ని ప్రతివిద్యలోనూ త్రోసి రాజనిపించ గల గండరగండడు గోన గన్నారెడ్డి అతని మహాసైన్య పురోగమనానికి ఆనకట్ట అయిపోయినాడు.

కొండలమీదనుంచి రాళ్లు దొర్లుకువచ్చి లోయలలోపోయే సైన్యాలు నాశనం అవుతూవుంటాయి. ఎంత నెమ్మదిగా నడచినా ఆశ్వికసైన్యాలుపైకి సాధారణ భూమివలె కనబడే సమతలముపై నడుచుచుండగా చటుక్కున గోతులలో పడిపోవుచుండెను. సెలయేరులలో నీరు తాగినవారు మత్తుచే పడిపోవుచుండిరి. నిర్జనంగా కనబడే చిట్టడవిని సమీపించే సైన్యాలమీద అఖండ బాణవర్షం కురిసి వేలకొలది సైనికులు ప్రాణరహితులై పడిపోవుచుండిరి.

గ్రామములలో జనంలేరు. పంటలులేవు. పశువులులేవు. పాలులేవు. గ్రామాలు మొండిగోడలతో, పళ్ళులేని చెట్లతో నిండివున్నాయి.

మహాదేవరాజుకు, అతని సేనానాయకులకు, మంత్రులకు ఈ విచిత్రయాత్ర అర్థమగుటలేదు.

మూడుసారులు గన్నారెడ్డి మహాదేవరాజు సైన్యాలకు వెనుకభాగములో వచ్చి తాకినాడు. సైన్యాలు నిలబడి యుద్ధం చేసేసరికి గన్నారెడ్డి సైన్యాలతో మాయమైనాడు. ముందుకు సాగకుండా విఠలధరణీశుడు, సబ్బప్రభువు, సూరన్న రెడ్డి, చిన అక్కినప్రగడ, రేచర్ల చినదామానాయుడు, చిన మల్యాల ప్రభువు రక్కసులలాంటి సైన్యాలతో అడ్డుపడుతున్నారు.

గన్నారెడ్డి మొదటిసారి మహాదేవుణ్ణి తాకినప్పుడు సైన్యం వెనుకనే వచ్చు వర్తకనగరమూ, పశునగరమూ పటాపంచలైపోయినాయి. గన్నారెడ్డి తృప్తితీర మహాదేవరాజు ధాన్యాదులను, పశువులను దోచుకున్నాడు. ఆ వెంటనే మాయమైనాడు. తరుముకువచ్చిన సైన్యాలను హతమార్చినాడు.

ప్రళయకాలరుద్రుడై మహాదేవరాజు గోన గన్నయ్యను చేతులతో నలిపివేయుద మనుకున్నాడు. ఖడ్గముతో కండకండలుచేసి గద్దలకు, కాకులకు ఎగురవేయవలె ననుకున్నాడు. దేవగిరికి నలభై గవ్యూతుల దూరంలో ఉన్న మంజుల గ్రామం దగ్గర విడిదిచేసినాడు. అప్పటికే అతని సేనలో గోనగన్నారెడ్డి ముష్కర క్రియవల్ల డెబ్బదివేలు మడసెను. ఆరు నెలలకు తెచ్చుకొన్న ఆహార పదార్థాలలో రెండు నెలల పదార్థాలు గన్నారెడ్డి దోచుక పోయాడు.

ఆతని సైన్యం మంజుల గ్రామానికి మూడు గవ్యూతులు ఉన్న గోదావరి కడనుండి పది గవ్యూతుల దూరములోఉన్న ధారునగరంవరకూ విస్తరించి ఉన్నది.

ఆహారపదార్థాలు సైన్యం మధ్యఉండేటందుకు ఏర్పాటుచేసి, ఈ మహా సైన్యంచుట్టూ ఆశ్వికసైన్యాలు, విలుకాండ్ర దళాలు సర్వకాలమూ యుద్ధసన్నద్దులై ఉండ ఏర్పాటుచేసినాడు మహాదేవరాజు, అనేక చారదళాలు విరోధిసైన్యాల రాక తెలియ జేయ ఏర్పాటు చేసినాడు.

రక్తాక్షి సంవత్సర జ్యేష్ఠ శుక్ల దశమినాడు దేవగిరిలో బయలుదేరి యీ జ్యేష్ఠబహుళ దశమికి ఇంకా మంజుల గ్రామంలోనే ఉన్నాడు మహాదేవరాజు. ఆరాత్రి మహారాజు ఆలోచనాశిబిరంలో, సర్వసైన్యాధ్యక్షులూ, మంత్రులూ చేరినారు.

మహారాజు సింహాసనంపై అధివసించి ఉన్నాడు.

ముఖ్యసేనాపతి సింగదేవప్రభువు (మహాదేవరాజు దాయాది) “మహారాజా! మన ఎనిమిదిలక్షల సైన్యాలలో రెండు లక్షల సైన్యాన్ని గన్నయ్యను తరమడానికి విడదీశాం, ఆ సైన్యం మంజీరానది తీరాలకు నైరుతిగా అతని సైన్యాలను తరుముతూనే ఉంది. ఇంతట్లో ఎక్కడనుండి వచ్చాడో ‘గోన గన్నయ్య’ అని మన సేనాపతులందరూ చికాకుపడుతున్నారు.

మహా: వీడు బ్రహ్మరాక్షసా, పిశాచా?

భవానీభట్టు (మహామంత్రి): మహాప్రభూ! ఈ గోన గన్నయ్యకు గజదొంగ అని పేరుపడింది అంతామాయ. వీడు రుద్రమదేవికి సహాయంగా ఏర్పడిన దొంగసైన్యాలకు నాయకుడు. సింగ: లేకపోతే సాధారణ గజదొంగతనం ఒకటీ చేయకుండా, రుద్రమ్మపై తిరగబడిన సామంతుణ్ణల్లా పట్టి హతమారుస్తాడా?

భవా: వీడు మన జైత్రయాత్రకు అడ్డం అనికాదు. కాని నేనుపెట్టిన ముహూర్తానికి ఓరుగల్లుకోట ముట్టడించలేకపోయాము.

జైతుగి (అశ్విక సైన్యాధ్యక్షుడు): రేపు మనం మంజీర ఎలాగు దాటడం?

సింగ: నిర్మలనుండి మల్యాల చౌండయ్య సైన్యాలతో అడ్డుపడేట్టు ఉన్నాడు.

మహా: సింగదేవప్రభూ! మన రెండులక్షల సైన్యాన్ని వెనక్కు రమ్మనండి. ఆ సైన్యం ఏభైవేల నావలమీద మంజీర గోదావరీ సంగమం దగ్గర కాకుండా దక్షిణంగా గిరికోటదగ్గర దాట ఆజ్ఞ ఇవ్వండి. ఆ దాటింపవలసిన బాధ్యత జై తుగిదేవ ప్రభువుది.

భవా: ఆ సైన్యాన్ని దాటనీయకుండా గన్నారెడ్డి ఒక ప్రక్కనుంచీ మల్యాల చౌండయ్య గోదావరి ఆవలిప్రక్కనుంచీ తాకవచ్చునుకాదా చక్రవర్తీ?

మహా: అవన్నీ ఆలోచించాము భట్టోజీ! దాటే సైన్యాన్ని మేము మొదట తెలియజేసిన కోటల విధానంతో తాత్కాలికపు కంపకోటలు ఏర్పాటు చేసుకొని శత్రువు వెనుకనుంచి మీదబడకుండా చూచుకొనండి.

జైతు: చిత్తం మహారాజా!

మహా: తక్కిన ఏభైవేల నావలలో మేము సంగమానికి ఎగువ బోధన గిరికడ దాటగలము.

సింగ: ఈలోగా మనదేశంనుండి ఆహారపదార్థాలను తీసుకొనివచ్చేటందుకు వెళ్ళిన రెండులక్షల సైన్యం వచ్చి కలుసుకుంటుంది.

మహా: మంజీర దాటగానే మన సైన్యాలను ఆరు సైన్యాలుగా విభజిస్తాను. ఒక్కొక్క సైన్యం అయిదారు గవ్యూతుల దూరంలో యాత్ర సాగించాలి. శత్రువు ఎదురుబడితే లెక్కచేయక ముందుకు సాగిపోయి శత్రువును చుట్టుముట్టి నాశనం చేయాలి.

శంకరదేవ (గజసైన్యాధ్యక్షు) : శత్రువుల సైన్యాలు తక్కువగా ఉన్నాయి అని కదా మనకు వేగువచ్చింది. ఆంధ్రాసామంతులు కొందరైనా మన వైపు చేరక పోయినా ఆ రుద్రమ్మకు సాయంవెళ్ళరు. అంతవరకు లాభం మహారాజా!

2

మంజీరానది దాటడం బ్రహ్మప్రళయమే అయినది యాదవునికి. లక్షల బలంతో నేర్పుతో మంజీరానదినిదాటి, కాకతీయుల నెగ్గినంత సంతోషము పొందెను. మంజీర దాటడంలో చౌండసేనాని ఏటి ఆవలనుంచి, ఏటి ఈవలనుంచీ గోనగన్నయ్య శౌణదేశవాహినులను చీల్చి చెండాడిరి. ఏటిలో యాదవుల పడవలను వందలకొలది ముంచినారు. గట్టుకు దిగకుండ గట్టుపైన చౌండసేనాని బలాలు మహదేవరాజు మూకలను శకలాలుగా ఖండించివేసెను.

ఏరుదాటి చూచుకొనేసరికి దాదాపు ఎనభై వేలమంది మనుష్యులు. డెబ్బది రెండు ఏనుగులు, రెండువేలచిల్లర గుఱ్ఱాలు యాదవులకు నష్టమయ్యెను. గాయపడినవారు లక్షకుపైగా ఉన్నారు. చాలా ఆహారపదార్థాలు నష్టమాయెను.

ఏరుదాటగానే చౌండసేనాని సేనలు వెనక్కు తగ్గిపోయాయి. గన్నారెడ్డి గజదొంగలు రెండుభాగాలై ఒకటి గన్నారెడ్డి నాయకత్వాన మరొకటి విఠలధరణీశుని నాయకత్వాన శౌణమహాదేవుని వెన్నాడించడము, అడ్డు తగలడము మొదలిడెను.

ఒక బలాన్ని నాశనంజేయవలెనని సాగినచో మహాదేవునికి ఆ బలం కనబడదు. సరేనని నిర్భయంగా సాగితే రెండవ గన్నారెడ్డి ధ్వజం అడ్డం. వెనుక నుంచి చౌండసేనాని చమువులు నిరంతరపుతాకిడి.

ఇంతలో వానలు ప్రారంభించాయి. వానలో గన్నారెడ్డికి బలం ఎక్కువా అన్నట్టు ఆతడు ప్రచండంగా విజృంభించి అడుగడుగునకు నాశన దేవతను ప్రయోగం చేస్తున్నాడు. చిన్నచిన్నఏళ్ళు, బలాలు ఉండడానికి తగిన నీళ్లు లేకపోవడం, రోగాలు జ్వరాలు అన్నియు నిరోధాలే!

మహాదేవరాజునకు వచ్చేది వానాకాలమని తెలియును. అందుకు తగిన సన్నాహాలతోనే యుద్ధయాత్ర ప్రారంభించినాడు. కోట్లకొలది చాపలను, వెదురు ఊచలనుకూడా పట్టించుకొని వచ్చినాడు. దానితో లక్షలకొలది నివేశాలు నిర్మించడం, వానలు వెలిసిన వెనుక ముందుకు సాగడం, ఈ రీతిగా అంచెలుగా యుద్ధయాత్ర సాగుచున్నది. గోన గన్నారెడ్డి బలాలు, చౌండుని బలాలు యాదవుని వాహినులను నాశనం చేస్తున్నవి.

ఎప్పుడు ఓరుగల్లు చేరుదుమా, ఎప్పు డా మహానగరం చుట్టూఉన్న పాళెములన్నీ ఆక్రమించుకొని, తాను నిశ్చయించుకొన్న వ్యూహం ప్రకారం ముట్టడి సాగించడమా అని తహతహ జనించినది మహదేవరాజునకు! నెల ముట్టడి సాగేసరికి ఆంధ్రులు కాళ్ళబేరానికి వత్తురు. ఆడదాని రాజ్యం అంటే అసహ్యము కొలది తనతో కలిసిపోదురు.

ఈలాంటి ఆశతో ఏమాత్రమూ పట్టుదల, యుద్ధపుబిగి సడలకుండా మహాదేవరాజు ప్రయాణం చేస్తున్నాడు. మహావాహినులతో.

గన్నారెడ్డి అంతకన్నా పట్టుదలతో, మాయతో, అఖండవేగంతో పిడుగులా శౌణ మహాదేవరాజు సైన్యాన్ని తాకుతాడు; కొంత సైన్యం నాశనంచేస్తాడు; ఆ వెంటనే మాయమవుతాడు. గన్నారెడ్డి విధానం అర్ధంచేసుకొని మహాదేవరాజు, కొన్ని కొత్త రక్షణలు సృష్టించాడు. రాళ్ళచక్రాలున్న కొండల్లాంటి బళ్లు కట్టించాడు. ఆ బళ్ళ పైన చిన్న చిన్న కఱ్ఱకోటలు, ఎనమండుగురు పదిమంది పట్టేవి కట్టించాడు. ఆ రథాలను ఎనిమిది ఎద్దుల జతలు లాగుతూఉంటాయి.

బండిమీద చిన్న కఱ్ఱకోట గోడలలో ఉన్న వీరులు బాణాలు వేయడానికి పెద్ద రంధ్రాలు చేయించినాడు. వీరిని సేనలచుట్టూ మహదేవరాజు ఉంచినాడు. విరోధి కనపడగానే, శత్రువునుచూచి కోటలబండ్లు ఆపు చేయించి వానిని కోట గోడలులా చేశాడు. ఈ ఏర్పాటు గన్నారెడ్డి బాగా అర్థంచేసుకున్నాడు. యుద్ధ చమత్కృతి అంతా ఎత్తుకు పైఎత్తులు వేయుటలోనే ఉంది.

గన్నారెడ్డి అక్కినప్రగడనుచూచి, “బావగారూ! ఇంతవరకు మన సైన్యాలు నాశనం కాకుండా విరోధి నాశనం అయేటట్టు చూస్తున్నాము. ఇప్పుడు ఈ యాదవుడు మంచిఎత్తే వేసినాడు” అని ఆలోచన చేసెను. గన్నారెడ్డి ఆ మాటలు అనగానే అక్కినప్రగడ నవ్వి “బావగారూ! మీకు గజదొంగలని పేరు ఊరికే వచ్చిందా? ఆలోచించండి ఒక కొత్తఎత్తు” అన్నాడు.

మహాదేవరాజు ఆరులక్షలమహావాహిని వేములవాడదగ్గర విడసి యున్నది. రెండులక్షలసేన ఇంతవరకు నాశనమయినది. వేములవాడ చుట్టుప్రక్కల గ్రామాలన్నియు మహాదేవరాజు సైన్యాలు ఆక్రమించాయి. వేములవాడకు ఉత్తరంగా పన్నెండు గవ్యూతుల దూరములో జగతపురిలో మాల్యాల చౌండసేనాపతివున్న శిబిరంలోనికి అక్కినప్రగడకూడరాగా చౌండమహారాజుతో మాటలాడటానికి గన్నారెడ్డి యేగెను.

3

చౌడసేనాని ఎనుబదిఏళ్ళ వృద్ధమహారాజు. కాకతీయ గణపతిదేవ చక్రవర్తి రాజ్యభారంపూని విజృంభించి, ఆంధ్రమహాదేశం అంతా కాకతీయ సామ్రాజ్యము వ్యాపింపచేసే సంవత్సరాలలో కొఱవి రాజ్యభారము వహించి ఉత్తరాంధ్రభాగములలో గోదావరి రెండుతీరాలలో శౌణ యాదవులు, గోండులు మొదలగువారు దాడులు వెడలకుండా రక్షిస్తూ, తన చక్రవర్తితో దక్షిణదేశ యుద్ధయాత్రకు, కమ్మనాటి యుద్ధయాత్రకు వెళ్ళి, యుద్ధక్రియా దక్షుడై చక్రవర్తి కుడిభుజమై, సంకినపురరిపుతిమిరమార్తాండ, సమరదేవేంద్ర, పెదముత్తుగండ, కోటగెలవట, దీపలుంఠక, దుష్టతురగరేఖారేవంత, గణపతిదేవ ప్రసాదౌత్తర రాజ్యలక్ష్మీ సమాశ్లిష్ట, రుద్రేశ్వర దేవశ్రీ పాదపద్మా రాధక, నిఖిల శత్రురాజమస్తక విదారణ, సకలాయుధప్రయోగకుశల, శౌణ దేశాధీశాది భుజబల గర్వాపహరణ మొదలయిన బిరుదాలు పొంది ముసలి తనంలోకూడా ఏమాత్రమూ శక్తిసడలని మహావీరుడై భీష్మునివలె శత్రుజన భీకరుడై రాజ్యము చేయుచుండెను.

చౌండసేనాని కుమారుడు కాటయచమూపతి, తండ్రిప్రక్కనే నిలిచివున్నాడు. గోన గన్నయ్య అక్కినప్రగడలు మందిరములోనికి రాగానే చౌండసేనా పతి లేచి, త్వరితగతి గన్నయ్యదగ్గరకు వచ్చి, ఆత డిచ్చు నమస్కృతు లందుకొనుచు, గాఢముగా కౌగలించుకున్నాడు. అక్కిన చౌండసేనానికి జయం సలిపి వేదాశీర్వాదాలు ఒసగినాడు. వారందరు ఉచితాసనా లధివసించిరి.

చౌండ: గన్నయ్యమహారాజా; మీ తండ్రిగారు నేనంటే ప్రాణం యిచ్చేవారు. వారికి మల్యాలవంశం అంటేనే ప్రాణం. అందుకనేగా మాజ్ఞాతి గుండయ్యప్రభువుకు తమ అమ్మాయిని ఇచ్చి ఉద్వాహం చేశారు.

గన్నయ్య: మహారాజా! తాము ఇంతవృద్ధులయ్యూ మా కందరికీ సిగ్గు వచ్చే విధానంగా యుద్ధం చేస్తున్నారు.

కాటయ: గన్నయ్యప్రభూ! మా నాయనగారికి వృద్ధులమైతిమే అనే విచారం పట్టుకొన్నది. చిన్నవారుగాఉంటే, శౌణయాదవుణ్ణి గోదావరి దాట నిద్దుమా అంటారు!

అక్కిన: అది నిజం కాటయమహారాజా! దేవగిరి యాదవులు, చౌండమహారాజులు యవ్వనంలో ఉన్నప్పుడు దేవగిరిప్రాంతాలు దాటి ఆంధ్రదేశం వయిపు కన్నెత్తి చూశారా ఎప్పుడయినా?

కాటయ: ఇంతకూ యాదవుల్ని మంజీర దాటకుండా చేయలేకపోయామని బాధపడుతున్నారు.

గన్నయ్య: ప్రభూ! తాతయ్యగారూ, అలా ఆలోచిస్తే ఎట్లా? మహాదేవరాజు నేలయీనినట్లు దండుతో వచ్చాడు. ఆంధ్రయుద్ధవిధానం బాగా గ్రహించి ఎత్తుపైఎత్తులు వేసుకువచ్చాడు.

అక్కిన: కాబట్టి మనం చేయగలిగినదల్లా యాదవుల సైన్యాలు ఎన్ని నాశనం చేయగలిగితే అన్నీ చేయడమే!

గన్నయ్య: అప్పుడు చక్రవర్తి తక్కిన యాదవసైన్యాలను పిండి గొట్ట వచ్చునుగదా!

చౌండ: గన్నయ్యమహారాజా! మీరు గజదొంగలై ఆంధ్రదేశానికి చేసిన మేలు సకల ఆంధ్రావని యెప్పుడూ మరచిపోదు. మా మనుమరాలు మల్లాంబికాదేవిని మీ తమ్ములకు చేసికోవలసిందని ప్రార్థిస్తున్నాను. మా చిన్న మనుమరాలిని సూరనరెడ్డి ప్రభువుకు అర్పించదలచుకున్నాము.

కాటయ: మేమూ మీతోపాటు దొంగలమే గన్నప్రభూ! మా అబ్బాయిలు యిద్దరు, మీతో వచ్చిచేరారు. గన్నయ్య: మా బావగార్లి రువురూ ప్రతియుద్ధంలోనూ అప్రతిమాన శౌర్యమూ, యుద్ధనిర్వహణదక్షతా చూపించారు.

చౌండ: వారిద్దరూ మొన్న మమ్ము కలుసుకొన్నప్పుడు మిమ్మల్ని, మీ తమ్ములను, చినఅక్కిన మంత్రులవారిని ఎంత మెచ్చుకొన్నారో?

గన్నయ్య: మహాప్రభూ! అవి అన్నీ వట్టి పొగడ్తలు. లేక భావగార్లు వేళంకోళము చేసి ఉంటారు.

కాటయ: అవి పొగడ్తలుకావు, వేళంకోళాలుకావు. వారిద్దరినీ చూచినప్పుడు నాకు నా శైశవదశనాటి మా తండ్రిగారి అద్భుత శక్తి జ్ఞాపకం వచ్చింది మహారాజా!

అక్కిన: ఆ మహారాజు మనుమలూ, తమ పుత్రులూ! తమ పరాక్రమం లోకవిదితం కాదా అండి.

చౌండ: చిత్తం, ఇక మన కర్తవ్యము?

గన్నయ్య: ప్రభూ! ఆంధ్రచక్రవర్తుల చల్లనిపాలనంలో ఆంధ్రప్రజలు కాటకాలు ఎరుగరు. ఈతిబాధలు ఎరుగరు. ఎప్పుడయితే యుద్ధాలు వస్తాయో అప్పుడే కాటకాలూ వెన్నంటుతాయి. యుద్ధం దావానలం వంటిది. ఆ దావానలం చెలరేగకుండా ఎక్కడ మంటలు అక్కడ ఆర్పివేయడం ఈ గజదొంగ కర్తవ్యం అనుకున్నా, ప్రజల సహకారంలేక రాజ్యాలు సాగవు. ప్రజలు విరోధిసైన్యాలు వస్తున్నాయంటే వారికి ఏవిధమైన సహకారం లేకుండా చేయాలి. తమ అభిప్రాయం సెలవియ్యాలి.

చౌండ: ఈ నూతనాయుధం ఎలా భావించగలిగారు ప్రభూ?

అక్కిన: బావగారు శత్రువుల నాశనంచేసే ఎత్తులు వేయడంలో కృష్ణునికే పాఠాలు నేర్పుతారులెండి!

గన్నయ్య: ఇంక యాదవుని బళ్ళకోట భస్మం చేయాలి. నూనెతో తడిసిన గుడ్డలు, ఎండిన చితుకులు నింపి, కాడులులేని బళ్ళు ఇరవై వేలయినా తాము సిద్ధము చేయించి విరోధి వచ్చే దారిలో నేలపైకి ఆ బండ్లు నలుమూలల నుంచీ దొర్లుకువచ్చే ప్రదేశాలలో సిద్ధంచేసి ఉంచాలి. దారులలో రాళ్ళూ రప్పలూ లేకుండా ఉంచాలి.

కాటయ: విరోధిచారులు ఈ బళ్ళను కనిపెట్టరా మహారాజా?

గన్నయ్య: ఈ బళ్ళు సిద్ధంగా ఉంచిన లోయలకు ఒక గవ్యూతి దూరంలో మన అశ్విక సైన్యాలు కొన్ని, విరోధుల్ని తలపడి ఘోరయుద్ధం చేస్తూ వెనక్కు అడుగులు వేస్తూ, వేగంగా బళ్ళవెనక్కు మాయంకావాలి. బళ్ళకు మంచి బరువు కట్టాలి. మన అశ్విక సైన్యాలను తరుముకువచ్చేవారి సైన్యాలమీద ఈ బళ్ళు దూకుతాయి. బళ్ళ వెనుకనుంచి మన అన్నిబలాలు దూకుతవి. ఈబళ్ళు అన్ని వైపులనుంచీ వచ్చిపడాలి. చౌండ: బాగుంది మహారాజా! బాగుంది. అందుకనే మీరుగజదొంగలలోమేటి.

4

ఆ శకటాగ్నిమహాస్త్ర ప్రయోగంవల్ల యాదవుని సైన్యాలు ఏబదివేల వరకు నాశనం అయిపోయాయి. యాదవుడు కాలాగ్నిరుద్రుడై ఆంధ్రులను కాలి క్రింద పురుగులుగా రాచివేద్దామన్నంత కోపం పొందినాడు. అయినా ఏమి చేయగలడు? ఇన్ని లక్షల సైన్యాలతో బయలుదేరికూడా ఆంధ్రుల ప్రతాపం ముందర అడుగడుక్కు పరాభవం పొందుతూనే ఉన్నాడు. అయినా పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉన్నాడు.

ఆంధ్రులతో యుద్ధం నల్లేరుమీద బండిపోకడ అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే ఏడెనిమిది వర్షాలు నిరంతరకృషిచేసి ఎనిమిది లక్షల సైన్యము, ఇరువదికోట్ల ధనము ప్రోగుచేసినాడు. ఆంధ్రులు చక్రవర్తులు, యాదవులు మహారాజులు మాత్రము. అనేక నదీవరద ప్రవాహసహితమై సస్యపూరితయై రత్నగర్భయైన ఆంధ్రమహాభూమి, చుట్టుప్రక్కల నున్న రాజుల కెప్పుడూ కన్నెఱ్ఱకు కారణమవుతూనే ఉండెను.

కాని ఆంధ్రులు మొక్కవోని మగటిమికల వీరులు. వాయువునైన అరచేత బట్టగల పరాక్రమవంతులు, శేముషీసంపన్నులు, విద్యాపూర్ణులు, యుగ యుగాలనుండీ ఆంధ్రులు సర్వదేశాలకు మకుటాయమానులై ఉన్నారు.

పరరాజ్యాలవారు ఆంధ్రదేశం ఆక్రమించుకొందామని ఎన్నిమార్లు ప్రయత్నం చేయలేదు? తొలుత వారు విజయాలు సాధించినా, తర్వాత ఆంధ్రులచే పరాభవం పొందారు.

తాను మాత్రం రాష్ట్రకూటులకన్న, హోయసలులకన్న, భల్లాణుల కన్న గొప్పవాడా? తన తాతలు యుద్ధాలు చేశారు, నెగ్గారు, ఓడిపోయారు. యుద్ధం చేయడమే రాచబిడ్డలవృత్తి. యుద్ధవిజయమే రాచవారి గౌరవము. యుద్ధము పెద్దవేట. వేటలేనివాడు నరమాంస భక్షకములూ, ద్వాదశ కాటకములలో ఒకటి అయిన అరణ్య మృగములు, మానవులకు భరింపలేనట్లే ఎక్కువయుద్ధాలు లేనినాడు మానవధర్మము కాలకూటవిషంలా పెరిగిపోతుంది అని మహదేవరాజు అనుకున్నాడు.

తన తండ్రి కృష్ణభూపతి దేవగిరి యాదవులకు తలవంపులు తెచ్చాడు. గణపతిదేవునకు భయపడి స్నేహమని తన రాజ్యం ఎల్లాగో దక్కించుకొన్నాడు. తాను యాదవుల ప్రతిభ శ్రీ మాధవుని కాలంలోవలె అప్రతిమాన కాంతితో వెలిగింపజేయలేనినాడు, తాను యాదవుడై తే నేమి, గాదవుడై తేనేమి? ఇంతకన్న అదను తన కెలా దొరుకుతుంది? ఆడది రాజ్యానికి రావడమా అని సామంతులంతా తిరగబడుచున్నారు. ఆంధ్ర రాజ్యం చాలాభాగం కబళింపవచ్చు, తనకు లోకువ అయినవాని నొక్కని ఓరుగల్లు సింహాసనం ఎక్కించి తాను నాటకం ఆడించవచ్చు, ఓరుగల్లులో మూడులక్షల సైన్యం, నాశనంకాగా మిగిలినది తనకు ఆరులక్షలుంటుంది. ఇక ఓరుగల్లుదగ్గర కలుసుకొనే విరోధి సామంతులు రెండు మూడు లక్షలై నా ఉంటారు. ఇప్పటికే తనతో కందూరి కేశనాయని బందుగులు కల్యాణి చోడోదయుని బందుగులు, మేడిపల్లి కాచయ బందుగులు రెండులక్షలవరకు సైన్యాలను తీసుకువచ్చి చేరారు. ఇంతకన్న యుద్ధవిజయసమయం తనకు కుదరదన్నమాట నిశ్చయం. నిశ్చయం.

అగ్నిశకట ప్రళయానంతరము సైన్యము సడలకుండా కూడదీసుకొని నూతనంగా సూచీవ్యూహాలు మూడు రచించి, తన వాహినులనన్నీ ముందుకు నడిపించసాగినాడు. సేనలను తరిమి తరిమి నడుపుచున్నాడు. ఏలాంటి అడ్డం వచ్చినా, దారిలోంచి తుడిచివెయ్యమన్నాడు. అత్యంతవేగంగా జైత్రయాత్ర సాగించే సేనల దారిలో పెద్ద అనీకాలైనా అడ్డగించలేవన్నాడు.

ఆనాటినుంచి మహాదేవరాజు సైన్యవేగం అడ్డగింపడానికి భయపడ్డారు గోన గన్నారెడ్డి, చౌండసేనాపతి మొదలైన వీరులు.

వేగవంతమైన నదికి ఆనకట్ట ఎవరుకట్టగలరు?

గన్నారెడ్డి మహాదేవరాజు సైన్యాలకు ముందుండడం మానివేసి, మళ్ళీ వెనుకనుండే తాకుట కారంభించాడు. అందు కొంతబలం ఏర్పాటుచేసి తానూ, చౌండ సేనాపతి కుమారుడు కాటచమూపతీ కలసి ఆశ్వికదళాలను మాత్రం అపరిమిత వేగంగా ముందుకు పదిహేను గవ్యూతుల దూరం తీసుకుపోయారు. ఈ వచ్చే వేగంతో మహాదేవరాజు రెండుదినాలకు ఆ ప్రాంతాలకు చేరగలడు. ఆ రెండు దినాలలో గోన గన్నారెడ్డి అగ్నికోట ఒకటి కట్టించాడు. గంధకపు ధాతువులతో అగ్ని స్తంభాలు సిద్ధంచేయించి, అవి అక్కడక్కడ మూడు గవ్యూతుల పొడుగునా అర్ధగవ్యూతి మందమున పాతివేయించినాడు. ఆ అగ్నికోటకు ఈవలావల తానూ, కాటయసేనాపతి ఆశ్వికదళాలతో పొంచుండినారు.

మూడవనాడు విరోధుల బలాలు చేరువకు రాగానే, ఆ అగ్ని స్తంభాలు అంటించినారు, గన్నయ్య ఆశ్వికులు. పొగలు, మంటలు ఆకాశంకప్పినాయి. ఈ సందు దొరకని అగ్నికుడ్యాలూ, భరింపరాని వాసనగల పొగలుచూచి, అతివేగంగా చొచ్చుకువచ్చే మహాదేవరాజు వాహినులు ఆగిపోయినవి. మహాదేవ రాజు తన భద్రగజంపై అధివసించి, ఆ దృశ్యంచూచి, విరోధిని మెచ్చుకుంటూ సేనలకు అగ్నిచక్రవ్యూహం రచించి నెమ్మదిగా వెనుకకు జరిపించినాడు.

అప్పుడు గోన గన్నారెడ్డి ఒకవైపునుంచీ, కాటయసేనాపతి ఒక వైపు నుంచీ ఆ వ్యూహ బంధాన్ని ఛేదించసాగినారు. ఇంతలో వెనుకనుంచి విఠలధరణీశుడు, చౌండసేనాని, సూరపరెడ్డి మహాదేవుని తాకినారు. ఒక దినమంతా మహాయుద్ధం జరిగింది. సాయంకాలానికి అగ్నులు చల్లారెను. వెంటనే రాత్రయినాసరే సైన్యం ముందుకు సాగిపొండని మహాదేవరాజు ఆజ్ఞయిచ్చాడు. సేనలలో ఏబదివేలమంది విగతజీవులయ్యారు.

ఆ వేగం వేగంతో మహాదేవరాజు నాలుగుదినాలలో వచ్చి, ఓరుగల్లు ముట్టడించినాడు. ఓరుగల్లుచుట్టు ఒక ఇల్లుగాని, గ్రామముగాని లేదు. మురికి గోతులూ, మండే ఊళ్ళూ వున్నవి. అనుమకొండ మట్టియవాడలు పూర్తిగా కుడ్యరక్షితములై శత్రువుల రాకకు సిద్ధముగా ఉన్నవి.

5

“ఓరుగల్లు నగరం ముట్టడించిన మగవా డేడీ? ఎవరయ్యా. కన్నులు తెరచి కాకతీయమహాసామ్రాజ్య ముఖ్యనగరం తేరిపారచూడగలడా? యాదవుడా? వానికి దుర్యోగము మూడినది” అని మహదాంధ్ర ప్రజ లాడుకొనజొచ్చిరి.

గ్రామ గ్రామాలలో ఆంధ్ర రెడ్డివీరుల కందరికి రక్తము పొంగిపోయినది. చక్రవర్తి శ్రీ రుద్రదేవి వలదని ఆజ్ఞలు గ్రామాలలో సాటింపుచేయడంవల్ల, రైతు బిడ్డలు కత్తులు తీయలేదు. ఆంధ్రక్షత్రియులైన రెడ్లు, పంటవారు, మున్నూరు కాపులు, ముదిరాజువారు పళ్ళు పటపట కొరికి, తమ ఇళ్ళలో పూర్వకాలమునుంచి ఉన్న ఇరుమొనల కడ్గాలు, ఖడ్గమృగ చర్పపు డాళ్లు, భల్లాలు తీయవలసిందే, కాని అలా ఎవ్వరూ యుద్ధసన్నద్ధులు కావద్దని చక్రవర్తి ఆజ్ఞ!

ఆంధ్రశూద్రులైన చాకలివారు, మంగలివారు, గొల్లలు, వుప్పరులు, కుమ్మరులు, ఆంధ్రారణ్యజులైన బోయలు, అనాదులు, కోదులు, చెంచులు, మాలలు, మాదిగలు, ఆంధ్ర వైశ్యులైన శ్రేష్ఠులు; ఆంధ్ర బ్రాహ్మణులైన మంత్రులు, వేదవేదాంగ పండితులు; ఆంధ్ర శిల్పబ్రాహ్మణులైన పంచానులు; ఆంధ్రమతముల గురువులు శైవులు, జంగములు, ఆరాధ్యులు, కాలాముఖాచార్యులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనులు అందరూ ఆంధ్ర చక్రవర్తిని అయిన శ్రీ రుద్రదేవిపై కత్తికట్టివచ్చిన యాదవుని ఖండఖండాలుగచేయ ఉగ్రులై పోయారు.

గ్రామాలలోకి యుద్ధం ఎప్పుడూ రాదు. ఆర్యనాగరికత అసుర నాగరికత విజృంభించిన పూర్వయుగాలనుంచీ ఎప్పుడూ యుద్ధానికీ, భారతీయ గ్రామానికీ సంబంధం కలుగలేదు. యుద్ధస్థలము ఇరువాగులవారు నిర్ణయించుకొని యుద్ధము చేయుదురు. కోటలచే రక్షింపబడే గ్రామాలను మాత్రము ముట్టడించుటకద్దు.

రుద్రమదేవి మహాదేవుని గోదావరీతీరంకడ ఎదురుకుందామని చూచింది కాని మహాదేవుడు ప్రతిష్ఠానపురంకడనే గోదావరి దాటడంచేత ఆ ప్రయత్నము మానుకున్నది. యాదవుడు అఖండ బలాలు కూర్చుకొని వస్తున్నాడు. దారిలో ఎదుర్కొనుట ఓటమిని ఎదుర్కొనుటే అని శివదేవయ్యమంత్రి ప్రయత్నము మాన్పినాడు.

గోన గన్నారెడ్డి తనసైన్యాలు చాలకపోవడంవల్ల శత్రువును కొలది కొలదిగా నాశనంచేస్తూ, చీకాకుపెట్టుతూ, ఆహారపదార్థాలు అందుబాటు లేకుండ చేస్తూ ముట్టడి వదలుకొని పారిపోయేటట్లు చేయాలని సంకల్పించు కొన్నాడు.

తన యావత్తు సైన్యముతో మహాదేవరాజును వెంటాడి గన్నారెడ్డి కలిగించిన నష్టము ఇంతంతకాదు. అతని సైన్యాలకు మల్యాలవారి సైన్యాలు తోడయ్యాయి.

ముట్టడి ప్రారంభించగానే, కంపకోటలోనుండి మహాదేవరాజును నిశిత బాణవర్షము ఎదుర్కొన్నది. మహాదేవరాజు ఆ మహానగరపు కోట గోడలను చుట్టిచూచివచ్చెను. కంపకోటచుట్టు ఉన్న కందకము చిన్న ఏరులా ఉన్నది.

కంపకోటకు చిన్నచిన్న బురుజు లున్నాయి. కంపకోటకు అర్ధగవ్యూతి దూరాన మహాదేవరాజు సైన్యాలు ఆగినాయి. వెదురు, పేము, ముండ్లకంపలు, పేడతో, గంధకంతో ఆకోటగోడ నిర్మితమైనది.

వీరులు కంపకోట పైనుండి యుద్ధంచేయరు. కంపకోట వెనుకతట్టుకు ఉన్న బురుజులమీదనుండి మేటి విలుకాండ్రు శత్రువును చీకాకుపరుస్తారు. ఆ బురుజులూ కంపతోనే నిర్మిస్తారు.

శత్రువులకు కంపకోట అంటేనే భయము, కంపకోట గోడల వెనుకనుండి బురుజులమీదనుండీ శత్రువులను బాణాలచేతా, శిలాప్రయోగాలచేతా, అగ్నివర్షం చేతా చీకాకుపరుస్తూ వుంటారు. ఒకవేళ కంపకోట పట్టుబడుతుందని భయంకల్గితే ఆకోటను కాల్చి తమ నగరంలోనికి చేరుకుంటారు.

మహాదేవరాజు కంపకోటచుట్టు అర్థగవ్యూతి దూరంలో ఇరువది చిన్న కోటల నిర్మాణానికి తలపెట్టి పని ప్రారంభించెను. ఈ ఇరువది కోటలను కలుపుచు ఒక చిన్నగోడ నిర్మాణం చేయించసాగాడు. ఆ గోడకు ముందు పెద్దగొయ్యి. ద్వారాలకు ముందుమాత్రం దారులు.

కోట ముట్టడి యంత్రాలు, దూలాలు, గొలుసులు మొదలయినవి బళ్ళమీద వచ్చినవి తీసి వానిని కూరుస్తున్నారు. వెదురుతో, పేముతో అల్లిన పెద్ద దడులను ఉప్పునీళ్ళలో ఊరవేసిన తోళ్ళు బిగిస్తున్నారు. ఆ దడులే యుద్ధం సాగినవెనుక కోటగోడలదగ్గరకు వెళ్ళేవారిని అగ్నిబాణాలనుండి, రాళ్ళవర్షమునుండి రక్షిస్తాయి. ఆ దడులు నిలబెట్టేందుకు సన్నదూలాలు సిద్ధమైనవి. ఏనుగులకు కవచాదులు సిద్ధమవుచుండెను. ఏనుగులమీద కోట అంబారీలు సమకూరుస్తున్నారు. గుఱ్ఱపు దళాలను రక్షించే పొడుగుడాళ్ళు బళ్ళలో నుంచి దింపుతున్నారు యుద్ధవీరులు, యుద్ధనాయకులు, దళపతులు, అశ్వపతులు, గజపతులు, ముఖపతులు నివసించే శిబిరాలు సిద్ధమౌచున్నవి. నగరపుకోట చుట్టుకొలత పదిహేను గవ్యూతు లున్నది. ఆ కొలతచుట్టు అర్ధగవ్యూతి నుండి ఒక గవ్యూతి మందముగా మహాదేవరాజు సైన్యము విడిసినది.

సేనలకు సరిపోవు ఆహారసామగ్రులుంచడానికి దండుమధ్య అక్కడక్కడ కోటగృహాలు నిర్మించారు. వానికి ఇరువది అంగల దూలములో అయిదువేల పచనగృహాలు నిర్మించారు. పచనగృహాలకు నూరు అంగల దూరములో వైద్యాలయా లున్నాయి. ఆశ్వికశాలలు, గజశాలలు వైద్యాలయాలకు నూరు అంగల దూరములో వున్నవి. ఆ పైన సేవకుల పాకలు, పందిళ్ళు, ఆ పైన స్కంధావార రక్షణపు కంపకోటలు.

నాశన మైనంత నాశనంకాగా, మహాదేవరాజు సేనలలో అయిదు లక్షల వీరు లున్నారు. దేవగిరినుండి బయలుదేరినవారు ఎనిమిది లక్షలు.

సేవకులు, వర్తకులు, బండ్లుతోలువారు, దాసీలు, వైద్యులు, మాంత్రికులు, చాకలివారు, మంగలివారు, వంటచేయువారు, ఉప్పరులు, బోయీలు, బళ్ళుతోలువారు, సూతులు మొదలయినవారు మూడు లక్ష లున్నారు, ఈ మహాజనము నంతటినీ చూచుకొని తాను వేసిన పథకమురీతిగా అన్నియు జరగడము చూచి మహాదేవరాజు జయము తనదేనని ఉప్పొంగిపోయినాడు.

తన స్కంధావారమంతా తిరుగుతూ అన్నివిషయాలు స్వయముగా మహారాజే కనుగొనుటచే వీరులకు, సేనాధిపులకు, సేవకులకు నిర్వచింపలేని సంతోషం కలిగింది.

మహాదేవరాజు వచ్చి మూడుదినా లయింది. ఇంతవరకు ఓరుగల్లులో అలికిడిలేదు. స్కంధావారం బయటా అలికిడి లేదు.