గోన గన్నారెడ్డి/నవమగాథ

వికీసోర్స్ నుండి

నవమగాథ

ఉత్తమచాళుక్యుడు

1

ఉత్తమ చాళుక్యుడైన వీరభద్రమహారాజు శ్రీ శివదేవయ్య దేశికుల ఆజ్ఞచే ఓరుగల్లులో ఉండిపోవలసి వచ్చినది. రుద్రచక్రవర్తి ఓరుగల్లుకోట బాగుచేయించే ముఖ్యకార్యమున కై వారిని నియోగించిరి.

ఆ మహారాజు ఒక్కక్షణికమేని విశ్రాంతి ఎరుగక నిరంతర కృషిలో మునిగిపోయినాడు. ఓరుగల్లు దుర్గసంరక్షణ కాకతీయ మహాసామ్రాజ్యానికి మూలస్తంభము. ఆంధ్రక్షత్రియవంశాలు తన ప్రాణాలేని ఒడ్డి ఆ కోట కాపాడవలసినదే!

యుద్ధవ్యూహరచనావిధానమునుగూర్చి, దుర్గసంరక్షణగూర్చి సమాలోచించుటకు రుద్రదేవి, శివదేవయ్యమంత్రి, చాళుక్య వీరభద్రుడు, ప్రసాదాదిత్యనాయకులు, జాయపసేనాని, పడికము బాప్పదేవులు రహస్యాలోచన మందిరంలో కూడినారు.

యాదవ మహాదేవరాజు ఓరుగల్లుపై ఎత్తివచ్చుటకు సర్వసన్నాహాలు చేయుచున్నట్లు ఏదినాని కాదినము వేగు వచ్చుచున్నది.

రుద్రదేవి సింహాసనముమీద, తక్కినవారు యధోచితాసనాలమీద అధివసించారు. అన్నాంబిక కూడా రుద్రదేవితోపాటు పురుషవేషముతో ఆమె ప్రక్కనే వేరొక పీఠముపై ఆసీన అయిఉన్నది. గొంకప్రభువు అప్పుడే వచ్చి చక్రవర్తికి, మహా మంత్రికి, పెద్దలకు నమస్కరించి ఆసనము నధివసించెను.

గొంకప్రభువు: మహాప్రభూ! మహాదేవరాజు జైత్రయాత్ర విజృంభించింది. అతడు గోదావరిని ప్రతిష్ఠానపురందగ్గర దాటి సర్వసైన్యాలతో నదీతీరంవెంటే వస్తున్నాడు.

శివదేవయ్య: నిన్నటి మీవార్త ఆయన గోదావరి దాటుతున్నాడనే కదా?

గొంక: అవునండీ. అది నాలుగుదినాల క్రిందటిమాట. ఇంక శంఖచారత్వము నడిపించి నిశ్చయం చేసుకొన్నాము.

చాళుక్య: నేను మా లక్ష సైన్యంతో వెళ్ళి మంజీరదాటకుండ మహాదేవుణ్ణి అరికట్టాలని ఉంది. మహామంత్రీ! రుద్ర: తామందరు మా అభిప్రాయం వినండి. మనకు కోటలోనూ, చుట్టుప్రక్కలా ఉన్న సైన్యము నాలుగులక్షలు మాత్రమే. మహాదేవరాజు ఎనిమిది లక్షల సేనతో వస్తున్నాడు.

శివ: దారిలో అడ్డగించడం ఉత్తమం కాదంటారా?

ప్రసా: తెలుగువీరులు ఒక్కొక్కరు ఇరువదిమందిపెట్టు అని మహాప్రభువులకు మనవి చేసుకుంటున్నాను. నాకూ, చాళుక్య మహారాజులుంగారికీ వారిని ఎదుర్కొనే ఆజ్ఞ దయచేయండి.

బాప్పదేవుడు: మహాప్రభూ! నే నీమధ్య వీరభోజనం లేక పస్తులుంటున్నాను. నాకున్నూ సెలవు దయచేయ కోరుతున్నాను.

రుద్ర: తమకందరికీ మేము కృతజ్ఞులం. కాని, ఇప్పుడు ఏ ఒక్కరికి గాని, అందరికిగాని, కొందరికిగాని, మహాదేవరాజును ఎదుర్కొనే అనుమతి యివ్వలేము. ఒక వార్తకోసం ఎదురుచూస్తున్నాము. అది రాగానే మేము తమ అందరికి కర్తవ్యం విశదీకరించగలం.

అన్నాంబిక అప్పుడు చక్రవర్తిని తనవైపు చూడదని గ్రహించి, లేచి, వారికి నమస్కరించి, లోనికి వెళ్ళిపోయెను. ఆమె పదిక్షణికములలో తిరిగి ఒక కమ్మ చేతపుచ్చుకొని, లోనికివచ్చి అది చక్రవర్తికి ఇచ్చెను. పట్టువస్త్రము వలె మెత్తగా, పొడుగుగా ఉన్న మొగలిరేకుపై మషీవర్ణాలతో లిఖింపబడిన ఆ లేఖను చక్రవర్తి గొంకప్రభువును చదువ నియమించినారు.

గొంకప్రభువు ఆ కమ్మను సవినయంగా మోకాలిపై వంగి అందుకొని తన స్థానము చేరి నిలిచి చదువ నారంభించెను.

“మహారాజాధిరాజా, అష్టమ చక్రవర్తీ! నిన్నటిదినం అనగా శక సంవత్సర 1182 రక్తాక్షి సంవత్సర జ్యేష్ఠ బహుళ పాడ్యమి బుధవారంనాడు రాత్రి మహాదేవరాజు గోదావరీతీరంలో దండువిడిసి ఉండగా గోన గన్నారెడ్డి అనే ఒక గజదొంగ ఏబదివేల సైన్యంతో విరుచుకుపడి మహాదేవరాజు సైన్యాలను డెబ్బదివేలవరకూ హతమార్చి, మహాదేవరాజు సంసిద్ధుడయ్యేలోపునే సైన్యంతో మాయమైపోయినాడు. అతన్ని వెంబడించి నాశనం చేయవలసినదిగా రెండులక్షల సైన్యాన్ని మహాదేవరాజు వాండ్లవెనుక పంపించినవా డాయెను. ఇది మమ్మేలిన వారికి మనవిచేస్తూ మహా ప్రభువుల సేవకుడు మిరియాల ముమ్మరాజు.”

ప్రసాదాదిత్య ప్రభువు శివదేవయ్య దేశికులవంక చూచి, “గురుదేవా! గోన గన్నారెడ్డి మనం చేయవలసిన పనిని మనకోసం చేసిపెడుతున్నాడు! ఇది విచిత్రమే!” అని మనవి చేసెను.

శివ: వీరభద్రమహారాజా! తమ అభిప్రాయం సెలవియ్యండి.

వీర: గన్నారెడ్డి ప్రభువు చాలా ఉత్తమకార్యం చేశారు. అంతకొద్ది సైన్యంతో ఆరితేరిన ఉత్తమనాయకునిలా యుద్ధం నడిపారు. శివ: ముందు మన కర్తవ్యం?

వీర: అవసరమైతే గన్నారెడ్డి ప్రభువుకు మనం సహాయం పంపించి మహాదేవరాజు బలం తగ్గించాలి. ఓరుగల్లు ఎంత దుర్భేద్యమైనా చాలా కాలం ముట్టడి జరుగకూడదు.

శివ: మీ ఉద్దేశ్యము మాకు అవగతమైంది. జాయపమహారాజుల వారూ! వెంటనే ఏబదివేల సైన్యము గన్నారెడ్డి సహాయానికి పంపండి. ఆ సైన్యానికి తంత్రమాల మల్లి నాయకులు నాయకత్వం వహిస్తారు. మనం దుర్గరక్షణ నిర్వహిద్దాము.

సభ పూర్తికాగానే చాళుక్య వీరభద్రమహారాజు తమ నగరు చేరిరి. గుఱ్ఱపు స్వారి, ధనుర్యుద్ధపరిశ్రమ, ఖడ్గయుద్ధము, సూర్యనమస్కారాలు చేసి స్నానము చేసి పూజసలిపి, భోజనమాచరించి, కొందరు పండితులతో శాస్త్రచర్చచేసి, ఆ వెనుక వీణావాదనము విని, రాత్రి రెండవయామమధ్యమున శయనమందిరమున కేగిరి.

తెల్లవారుటకు రెండుఘడియ లున్నదనగా తీయని మేలుకొలుపులు మురళితో ఒక గాయకుడు పాడుచుండ చాళుక్య వీరభద్రమహారాజు లేచి, కాలోచితకృత్యా లాచరించి, అలంకృతులై, సపరివారులై, నగరపాలకుడైన ప్రసాదాదిత్య ప్రభువుతో, మహాతలవరితో బయలుదేరి నగరసంచారముచేసి, సర్వ యుద్ధసన్నాహాలు, నగరరక్షణసన్నాహాలు స్వయముగా చూచి, పరిశీలించి, కావలసిన మార్పులు ఆజ్ఞాపించి ఇంటికి వేంచేసిరి.

స్నాన మాచరించి, పూజాదికము లొనర్చి, సభలోనికివచ్చి ఇష్టాగోష్టి సలిపి, రాజకీయ వ్యవహారాలు చర్చించి, భోజనానికి దయచేసిరి. ఆయన పంక్తిలో సేనాపతులు, రాజబంధువులు - ఎవరో పదునైదుగురు ఎప్పుడూ ఉండవలసినదే!

భోజనానంతరము తాంబూలచర్వణకాలమందు మరల గాంధర్వ గోష్ఠి ఇతరుల నగరులకు అతిథి అయినప్పుడుమాత్రము నర్తకీమణుల నృత్యగోష్ఠి చిత్తగింతురు. తమ ఇంటిలో స్త్రీ లుండ గూడదని నిషేధించిరి.

2

చాళుక్య వీరభద్రమహారాజు రుద్రమదేవి రాజ్యపాలనము నిష్కంటకము చేసి తాను హిమాలయాలకు పోవుటే యుక్తమని నిశ్చయించుకొనెను. తాను సామ్రాజ్ఞి ని ప్రేమించినాడు. ఆమె తన్ను ప్రేమించుట ఎట్లు? ఒక స్త్రీ తన్ను ప్రేమించగలదని ఆశపడు పురుషుడు ఉత్తమహృదయము కలవాడు కాడు; స్త్రీ పురుషులు ఒకరికొర కొకరయినప్పుడు ప్రేమింపజేయు నవసరమేమి? ప్రేమ అద్యంతరహితము. ప్రేమికులు ఒకరినొకరు అనాదిగా జన్మజన్మలుగా ప్రేమించుచుందురు. అట్టివారు చూచుట, ప్రేమించుట రెండును ఒకేక్షణంలో సంభవించును.

ఒకరినొకరు ఎరుగకుండగనే ఒకజన్మంలో స్త్రీ పురుషులు ప్రేమింతురు. వారు చూచుకొనుట అనగా, రహస్యముగా ప్రవహించేనది బాహ్యాన వ్యక్త మగుట మాత్రమే. దానిని ప్రేమ అని మన మందుము.

ఒక స్త్రీ తన్ను ప్రేమించిన పురుషుని చూడనేని చూడకపోవచ్చు. ఒక పురుషుడు తన్ను ప్రేమించిన స్త్రీని ద్వేషించి యుండవచ్చు, ఆ ప్రేమను గమనింపకపోవచ్చు. అప్పుడు ప్రేమధర్మము సంపూర్ణము కాలేదని నిశ్చయమేకదా! అటులయ్యు భగవంతుని మనము తెలిసికోనట్లే, భగవంతుని వ్యక్తరూపమయిన ప్రేమను తెలిసికోలేము.

చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవి కాత్యాయనీదేవి అవతారమే అని నమ్మినాడు. ఆమె తన్ను ప్రేమించుట అసంభవము. అవతారమూర్తి కానిచో ఏస్త్రీ తన స్వీయస్వత్వముచే సామ్రాజ్ఞి కాగలదు? చక్రవర్తులకు కుమారులు కలుగక, బాలికలు మాత్రమున్న చరిత్ర లెన్నియో ఉండినవి. వారందరు చక్రవర్తిను లగుదురా? అట్టి పదవికి అర్హులు పుట్టుకతోనే వ్యక్తమగుట కద్దు.

పురుషవేషముతో ఉన్నప్పుడు ఆ అవతారస్వరూపమును చూచినాడు. అప్పుడామె ఒక దివ్యమూర్తిగా తనకు వ్యక్తముకాలేదా? ఆమెకు రాని భాషలు, శాస్త్రాలు లేవు. ఆమె సౌందర్య వరసీమ, అల్పుడయిన తా నెక్కడ, ఆమె ఎక్కడ? ఒక మహావంశమునకు తుదిరెమ్మలు తాను, తన తమ్ముడును. దివ్యత్వము జారిన వంశమునుండి చక్రవర్తి పదియారు చిహ్నాలూ విడిపోవును. అవి యెల్ల కాకతీయవంశమును వరించెను. ప్రతి వంశానికి చక్రవర్తిత్వ. ధనేశత్వాలు ఏనాడో వదలిపోవలసినవే. వానికి ఇంతకాల మాయుర్దాయము అని ఉన్నది. ఇక్ష్వాకువంశము, హైహయవంశము, కురువంశము, శిశునాగవంశము, నందవంశము, మౌర్యవంశము, శాతవాహనవంశము, దక్షిణేక్ష్వాకువంశము, సాలంకాయన, విష్ణుకుండిన, బృహత్పాలాయన, పల్లవచాళుక్య వంశాలు సామ్రాజ్య సింహాసనాలు అధివసించాయి, అంతరించాయి. ఈనాడు కాకతీయులు చక్రవర్తులు.

తన చేయి చూచి, జాతకము చూచి, గోపాదక్షేత్రాన కొలదికాలము నివసించిన ఒక మహాయోగి ఏమి వర్ణించినాడు? నీ వంశాన ఇంకొక చక్రవర్తి పుట్టును. ఆతనికి, నీకు విచిత్ర పితామహసంబంధ ముండును అని ఏమో! భవిష్యత్తు తనబోటి మూఢమానవులకు మూడడుగుల దూరములోఉన్నను కనబడదు కదా!

చాళుక్య వీరభద్రుడు నిదురజెందినాడు. అ మరునాడు శ్రీ రుద్ర చక్రవర్తి ముమ్మడాంబికాదేవితో కలసి వడ్డంగలకు బుద్ధగణపతిని పూజింప బయలుదేరినారు. ఆ దేవుని పూజించి ఆ దిన మక్కడ విడిదిచేసి, ఆ తెల్లవారుగట్ల బయలుదేరి ఏకవీరామహాదేవీ దర్శనార్థము మొగిలిచెర్లకు పోయి అక్కడ అయిదుదినాలు అఖండార్చనలు జరిపింప నిశ్చయమైనది. శ్రీ రేచర్ల ప్రసాదాదిత్యుని కుమారుడైన రుద్రసేనాని మూడువందలమంది వీరులతో ఆమెకు అంగరక్షకుడుగా వెళ్ళినాడు.

ఆమె వెళ్ళి అయిదురోజు లయినది. చాళుక్య వీరభద్రమహారాజునకు ప్రతిదినము తన ఇష్టదేవతను చూడకపోవుటచే మతిపోయినట్లే అయినది. ఆయనకు ఏదియో ఆవేదన కలిగెను. తన దేవతామూర్తితో ఏశుంభనిశుంభులు తలపడుదురో? ఆమెను తేరిచూడజాలువా రెవ్వరు? అయినను రాక్షసత్వానికి ఉచితానుచితాలు ఏమి తెలియును? తన బలము తా నెరుంగలేని రాక్షసహృదయుడు ఏమి చేయునో! అటుపిమ్మట లోకము నెంత తలక్రిందు లొనర్చినను ఏమిలాభము?

ఆయన వేగముగా శివదేవయ్య దేశికులకడకు పోయినాడు. వారికి పాదాభివందన మాచరించి, ఉచితాసనముపై కూరుచుండి, ‘గురుదేవా! హృదయములో ఏదో గాఢమైన ఆవేదన కలుగుతున్నది’ అన్నాడు.

“రాబోయే భయంకరయుద్ధం ప్రతిఆంధ్రవీరుని హృదయంలోనూ ఆవేదన కలుగజేస్తూ ఉన్నది.”

చాళుక్య: స్వామీ! యుద్ధావేదనకన్న ఇంకనూ తీవ్రమైనదిది.

శివ: యుద్ధంలోకి ఉరికే ప్రతివారికీ ఆలాగే ఉంటుంది. మహారాజా! యుద్ధంలో ప్రవేశించిన వెంటనే ఈ ఆవేదన తీరుతుంది. అప్పడు యుద్ధతంత్రం నడిపే ఆతురత ఒక్కటే ఉంటుంది. ఈ ఆతురతా, యుద్ధపూర్వకాల వేదనా కలసి, భరింపలేని బాధ హృదయంలో కుములుతూ ఉంటుంది.

చాళుక్య: చిత్తం. కాని నా ఆవేదన యుద్ధానికి సంబంధించిందే కాదు, భగవాన్!

శివ: దాని స్వరూపం ఏమాత్రమూ తెలియదా తమకు?

చాళుక్య: చక్రవర్తి కొద్దిమంది అంగరక్షకులు కొలుస్తుండగా మాత్రమే మొగలిచర్ల గ్రామం దయచేసిఉన్నారు.

శివ: లక్షలకొలది ఆంధ్రవీరులు! ఆంధ్రనాయకులు, సుక్షత్రియులు నిండి ఉన్న ఈ ప్రదేశాలకు విరోధు లెవరు రాగలరు మహాప్రభూ!

చాళుక్య: చిత్తం. అయినా ఏదో నిర్వచింపలేని ఆవేదన భగవాన్!

శివ: ప్రభూ, మీబోటి ఉత్తములకు వట్టి ఆవేదనలు కలుగవు. నేను మహారుద్రుని ధ్యానిస్తాను.

చాళుక్య వీరభద్రుడు వారి పాదాలు కెరిగి ఆశీర్వాదమంది తన నగరు చేరెను. ఆ రాత్రిఅంతయు ఆ గాఢావేదన అణుచుకోలేకపోయెను. వఱు వాతనే లేచి ద్వారపాలకునికి తన ఉత్తమాశ్వాన్ని సిద్ధముచేయుమని ఆజ్ఞ యిచ్చి, తాను సర్వాయుధోపేతుడై ఆ అశ్వరాజమును చెంగున అధివసించి మొగలిచర్లాభి ముఖుడై ప్రయాణము సాగించెను.

3

కాకతీయ దేవాలయశిల్పము చాళుక్యశిల్పమున గొన్ని మార్పులు కల్పించినది. ఆంధ్ర శాతవాహనుల కాలములో గుహావాస్తు, స్తూపవాస్తులతోపాటు, దేవాలయవాస్తుకూడా వర్ధిల్లినది. ఆంధ్రులు బౌద్ధులుకాకమున్ను అనాదియగు శైవమత మవలంభించినారు. ఆర్యజాతియగు ఆంధ్రజాతి వేదధర్మాన్నీ అసురికమైన శైవధర్మాన్నీ సమన్వయముచేసి ఉత్తమధర్మపథ మొకటి సృష్టించెను. ఆంధ్రులు కాకతీయులకు రెండువేల సంవత్సరాలకు పూర్వమే గోదావరీ కృష్ణాతీర భూములన్నియు ఆక్రమించి ఈ ప్రదేశాలలో అదివరకే నివాసంచేసే రాక్షస జాతులను లోబరచుకొని వారిని తమకు దాసులను చేసికొనిరి.

ఆంధ్రులు తమతోపాటు తెచ్చిన దేవాలయశిల్పము అద్భుతమయినది. వారు గోడలు కట్టుటకు రాళ్ళను ఉపయోగించలేదు. వివిధ మృత్తికలను కలిపి, ఇటుకలుచేసి వానితో నాలుగైదు అంతస్థుల భవనాలు నిర్మించేవారు. అటుల ఇటుకలతోనే వారు దేవాలయాలు నిర్మించుకొనేవారు.

బౌద్ధయుగంలోను ఆంధ్రులు స్థూపాలు ఇటుకలతోనే నిర్మించిరి. విగ్రహాలకు, ద్వారాలకు, ఆయకస్తంభాలకు శిలలను ఉపయోగించెడివారు. కొండలు తొలిచి చైత్యాలుగా, విహారాలుగా, గుహలు నిర్మించేవారు! ఇక్ష్వాకుల కాలములో రాతిలో ప్రథమచైత్యగృహ నిర్మాణము జరిగెను. పల్లవులకాలములో ఒకేరాతితో చెక్కిన దేవాలయాలు నిర్మాణము చేసినారు. ఆంధ్రశిల్పులు చాళుక్యుల కాలము నాటికిగూడ పూర్వరీతినే దేవాలయాలు ఇటుకలతో, సున్నముతో కట్టుచు, మండపాలు, స్తంభాలు, విగ్రహాలు రాళ్ళతో నిర్మింపసాగిరి. రాను రాను చాళుక్య కాలపు టంతమున ఆంధ్రశిల్పులు ప్రతిభతో గర్భాలయ ముఖమండప మధ్యమండప వివాహమండపాలు శిలలతో నిర్మించి, శిఖరాలుమాత్ర మిటుకలతో నిర్మించిరి.

కాకతీయ చక్రవర్తుల కాలములో స్తంభశిల్పము, ద్వారశిల్పము ఇంకను అపూర్వకౌశలముతో ముందునకు సాగెను. దేవాలయశిఖరము గూడ చాళుక్యకాలపు రూపమునుండి, మార్పుపొందెను. చాళుక్యశైవము, సాధుశైవము, కాకతీయశైవము, వీరశైవము, వీరశైవశిల్పము వైష్ణవవ్యతిరేకముకాదు; జైన వ్యతిరేకము వీరశైవ శిల్పముతో వీరభద్ర నందికేశ్వర లింగమూర్తుల వికాసముచే నిండిపోయినది. వట్టి లింగమూర్తి పూజతో తృప్తిపడిన చాళుక్యశిల్పి శైవలీలావినోది అయినాడు. రాష్ట్రకూట వంశావరణంలో కాకతీయ రసపూర్ణ జీవిత ప్రాబల్యాన ఆంధ్రశిల్ప నృత్య విన్యాసకుడు, దివ్యసౌందర్య లీలావిలాసుడు, అలంకార పూరితాత్ముడు ఆయెను.

మొగలిచర్ల కాకతమ్మగుడి శ్రీ కాకతీయ ప్రోలమహారాజు ప్రథమ తనయుడయిన శ్రీ రుద్రచక్రవర్తి కట్టించినాడు. ప్రసిద్ధాంధ్ర శిల్పి ఎఱ్ఱయఒజ్జ నిర్మించినదది. ఆచార్య ఎఱ్ఱయఒజ్జ ప్రసిద్ధ ఆంధ్రశిల్పి బ్రాహ్మణవంశమువాడు; సకలాగమశాస్త్రవేత్త, వేదవేదాంగ పారంగతుడు. ఆతని శిల్పికౌశలము అనుమకొండ రుద్రేశ్వరాలయంలో ఆకాశచుంబియయినది. ఆ ఎఱ్ఱయఒజ్జ తండ్రి కామయఒజ్జ ప్రోలమహారాజుకాలంలో శైవాలయాలు, జైనాలయాలు నిర్మించినాడు. కామయఒజ్జ తండ్రి రాణ్మహేంద్ర పురనివాసి. ఆతని పూర్వీకులు ద్రక్షారామ, భీమారామ, సోమారామ దేవాలయాలు నిర్మించారు. షట్సహస్ర దేశవాసి అయిన మహాచార్య భీమఒజ్జకు ఎఱ్ఱయఒజ్జ మేనల్లుడు.

ఎఱ్ఱయఒజ్జ ముఖమండపంలో నిర్మించిన ఎనిమిది స్తంభాలకు నాలుగు వైపుల ముప్పదిరెండు విధాల అలంకారశిల్పము విన్యసించినాడు. అంగుష్ఠ ప్రదేశంలో కేశసదృశమయిన శిల్పము చూపరకు హృదయస్పంద మగునట్లు అద్భుతముగా విన్యసించినాడు.

దేవీ గర్భాలయద్వార సౌందర్యము వర్ణించ నలవికానిది. ద్వారఫలకముపై దేవీనాట్యము విన్యసించెను. ద్వారమున ఎనిమిది ఫలకములలో ఒక ఫలకము లతాయుక్తము, ఆ లతల రెండువైపులా రెండురథాలు, పైన ఇంకొక వాద్య విశేష ఫలకము లతాఫలకమునుండి ఉబ్బెత్తుగా ముందుకు వచ్చింది. శంఖ కాహళ వేణువులు, నాదస్వరాది ముఖ్యవాద్యాలు, డమరుమర్దళ మృదంగాది చర్మవాద్యాలు, రావణహస్తాది తంత్రీవాద్యాలు అనేకులు వాయించుచు నాట్యం చేస్తున్నారు. ఆఫలకానికి ముందు మరల లతాఫలకము. ఆ లతా ఫలక మీవల ద్వారపాలక ఫలకము. ద్వారపాలక ఫలక మీవల భక్తఫలకము! మరల లతాఫలకము.

ఏకవీరాదేవి విగ్రహవిన్యాసంలో ఎఱ్ఱయఒజ్జ చూపిన శిల్పసౌందర్యము అలౌకికము. ఏకవీరావాహనమయిన సింహంలో ఎఱ్ఱయఒజ్జ బ్రహ్మదేవునే ఓడించినాడు.

ఎఱ్ఱయఒజ్జ పనితనం గమనిస్తూ పూజానంతరం రుద్రదేవి అన్నాంబికతో చర్చ సాగించింది.

రుద్ర: చెల్లీ, మా పెద్ద తాతగారి ఆస్థానశిల్పి ఎఱ్ఱయఒజ్జ ఈ ఏక వీరాదేవి గుడిని నిర్మించాడు. అనుమకొండ రుద్రేశ్వరమునూ ఆయనే నిర్మించాడు. అన్నాంబిక: అక్కగారూ! ఈ శిల్పి ప్రతిభ అనన్యంగా కనిపిస్తున్నది. ఈయన దేవాంశసంభూతుడై ఉండాలి అక్కగారూ. ఆ లతలు మొలిచినట్లున్నవే గాని మలిచినట్లు లేవు.

రుద్ర: ద్వారఫలకం పైన దేవీనాట్యం ప్రత్యక్షమవుతుంది.

అన్నాం: ఆ నాట్యసౌందర్యం శరత్పూర్ణిమలా లోకాలు ఆవరిస్తున్నది.

రుద్ర: అమృతగంగ శివుని జటలలో అవతరించినట్లుంది.

అన్నాం: సృష్టిమూలమైన త్రిభంగములో ఆ దేవి చిరునవ్వు నవ్వుతున్నది.

రుద్ర: దేవీభాగవతంలో దేవిని నాట్యకళోద్భవ అన్నాడు వేదవ్యాసులు.

అన్నాం: ఆమె నవ్వు వెన్నెలగా, ఆమె చూపువెలుగుగా....

రుద్ర: ఆమె మోము ఆకాశముగా, వంగిననడుము త్రిభువనాలుగా...

అన్నాం: ఆమె స్తనములు సర్వకళలుగా, కంఠము భక్తిగా....

రుద్ర: ఆమె భుజములు శాస్త్రాలుగా, ఆమె చేతులు విజ్ఞానవిచారణగా....

అన్నాం: ఆమె నాభి మాయావర్తంగా...

రుద్ర: ఆమె పెదవులు సర్వరసాలై..

అన్నాం: ఆమె కటి సర్వప్రేమలై, ఆమె ఊరువులు సకలాధారాలై...

రుద్ర: జంఘలు జీవమై...

అన్నాం: ఆమె సర్వవిశ్వమై...

రుద్ర: ఆమె నాట్యమే సృష్టి స్థితి లయాలై..

అన్నాం: జయ! జయ! సకల భావరూపా!

రుద్ర: జయ! జయ! లాస్య నాట్య తాండవమూర్తీ!
        జయ జయ ఏకవీర! మా అనుగుతల్లీ!
        జయ మమ్మా నీకు మేము బిడ్డలమమ్మా!

జేగంటలు మ్రోగునవి. వా రిరువురు నిమీలితనేత్ర లైనారు. త్రిభంగాకారయైన ఏకవీర తప్తజాంబూనదాభయై, కాంచనారుణపరిధానయై, జ్వలితాగ్ని శిభాభ సర్వభూషణ భూషితయై రుద్రాంబకు ప్రత్యక్షమైనది. ఆమె విశ్వనాట్యము చేస్తున్నది. ఆమె లలితపదగతులకు వేణుగానాలవలె, చిగురు జొంపాలువలె హస్తములు ఆడుతున్నవి. ఆ మూర్తి కన్నులనుండి ఒక మహాతేజం రుద్రాంబ హృదయంలో ప్రవేశించి లయించినట్లయింది. రుద్రదేవి సర్వ విశ్వమధ్యస్థయై పులకరించిపోయి, ఏదో దివ్యమత్తతలో ఒక లిప్తమాత్రము చైతన్యరహితయైనది. సర్వమాధుర్యాలు ఉత్తంగతరంగాలై సుడులు తిరిగి, ఆ సుళ్ళమధ్య లయాత్మకమై వేయిరాగాలు సంశ్లేషింప, సర్వవర్ణపూరితయై ఏకావీరాదేవి నాట్యం చేస్తున్నది. ఆ పరమపవిత్రదర్శనమున పరవశయైన అన్నాంబిక హృదయాన కంఠమాలనుండి ఒక పుష్పము ఎగిరివచ్చి వ్రాలి కరిగి హృదయంలో లీనమైనట్లుతోచి అన్నాంబిక చైతన్యరహితురాలైనది. ఇరువురు ఒక్కసారి కనుల ఆనందబిందువులునిండ రెప్పలు తెరచినారు.

4

ఏకవీరాదేవి పూజలు పూర్తిచేసుకొని రుద్రదేవి, అన్నాంబికా, ముమ్మడాంబలతో మొగలిచర్లనుండి సాయంకాలమున బయలుదేరెను. రుద్రదేవి, ముమ్మడమ్మ, అన్నాంబిక నాలుగు అశ్వములు పూన్చిన రథముపై అధివసించి ముందు వెనుకల అశ్వికులు కొలిచిరా ప్రయాణము సాగించిరి. రేచర్ల రుద్రారెడ్డినాయుడు అంగరక్షకులకు నాయకుడై అప్రమత్తుడై ఉండెను.

ఆ వానకారున సస్యశ్యామలమై దేశం పచ్చని క్రొత్తవస్త్రము కట్టుకొన్న యిల్లాలులా కలకలలాడుచున్నది. వాన కురియబోయె ఉక్కపోతలతో ప్రజలందరకు చెమటలు పోస్తున్నవి. పొలాలలో రైతులు వ్యవసాయమనే దివ్యయజ్ఞాలు ప్రారంభించినారు. వానకోయిల అరుపులు, ఆలమందల అంభారవాలు, రైతులు అదలింపు కేకలు మందరశ్రుతిజనిత కాంభోజరాగమై ఆ సాయంకాలాశావలయమున నిండినది.

ముమ్మక్కదేవి, అన్నాంబిక, రుద్రదేవి - యాదవమహాదేవునివల్ల సంభవించబోయే దారుణ యుద్ధము, భయంకర రక్తపాతము, ప్రాణనాశము, ప్రజా సంక్షోభములనుగూర్చి మాట్లాడుకొనుచుండిరి.

రుద్రా: చెల్లీ! యుద్ధాన విజయం తెచ్చేవి రెండు. ఒకటి ఎదుటివాడిబలం సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం. రెండవది ఎదిరి బలాన్నిబట్టి మనం వ్యూహరచన చేసుకోవటం.

అన్నాం: అక్కగారూ, వ్యూహరచనలో భేదము లుంటాయనా మీ ఉద్దేశము.

రుద్రా: అవునమ్మా చెల్లీ! యెదుటివాడిబలం ఎక్కువయితే ఆత్మరక్షణ కొరకు వ్యూహాన్ని రచించుకొని, యెదుటివాడిబలం మనలను తాకినకొలదీ నానాటికి హీనమయ్యేటట్టు చూడాలి. నీరసించినాడని తెలియగానే శత్రువుపై విజృభించి నాశనం చేయాలి.

ముమ్మక్క: అక్కగారూ! శత్రువుయొక్క బలమే తక్కువగా ఉండి మన బలం ఎక్కువగా ఉంటుంది; శత్రువు దుర్భేద్యమైన వ్యూహం రచించుకొని వుంటాడు. అప్పుడు శత్రువుమీదికి వెళ్ళడము మనకు నష్టమే కదా! రుద్ర: నిజమే. అప్పుడు సర్వకవచభేదకమైన యుద్ధవిజృంభణ సాగించి శత్రునాశనం చేయాలి, ఈ రెండు యుద్ధాలలో గన్నారెడ్డి అసమాన ప్రజ్ఞావంతుడు,.

అన్నాం: గన్నారెడ్డిది దొంగపోటుగాదా, అక్క గారూ!

రుద్ర: గన్నారెడ్డిని యెవరైనా గజదొంగ అంటే చీల్చేసేదానివి, ఇప్పుడు ఇలా అంటవేమి చెల్లీ!

ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. రుద్రదేవి ప్రేమతో అన్నాంబికను, ముమ్మక్కను కౌగలించుకొని, ‘చెల్లీ! మనుష్యునిజ్ఞానం ఎంత సంకుచితమైనది! మూడడుగులు ముందుకు, వేయి అడుగులు వెనక్కు చూడలేని అజ్ఞానంతో నిండి ఉంటాడు సర్వవిశ్వమూ ఆవరించిఉన్న పరమ రహస్యాల ఛాయలన్నా మనకు తెలియవుసుమీ.

రుద్రాంబికాదేవి నిట్టూర్పు విడిచింది. తమ పరితాపాలన్నీ మరచి పోయి ఏవో ఆలోచనలలో అన్యమనస్క లైఉన్న వారి మువ్వురకు ఒక్క సారిగా వేయి పిడుగులు విరిగిపడినట్లు గగ్గోలు వినబడింది. నాలుగువేలమంది సైనికులు రుద్రదేవి రథమును, అంగరక్షకురను చుట్టుముట్టారు. అంగరక్షకులను ఇనుప గోడలా చేసి, రుద్రసేనాని రథాన్ని ఆపుచేసి ముందు నుంచున్నాడు. హరిహరదేవ, మురారి దేవులు రుద్రసేనాని ముందర ఆగినారు.

మహావీరుడును, యువకుడు అయిన రుద్రసేనాని హరిహర మురారి దేవుల ఉద్దేశము కనిపెట్టి, తానెన్నడూ పొందని భయముచే గజగజ వణకిపోయినాడు. ‘శ్రీశ్రీ రుద్రదేవి చక్రవర్తికి ఎలాంటి ఆపద కలుగుతుందో! ఎప్పడూ ఊహించ లేని విధంగా ఈ ఆపద వచ్చిపడిం’దని రుద్రసేనాని కళవళ పడుచున్నాడు.

హరిహరదేవుడు ఉచ్చైస్వనంతో - రేచర్ల రుద్రదేవుల వైపు చూస్తూ, ‘ఓయి రేచర్లరుద్రుడా! నువ్వేమిచేయగలవు? మే మిరువు రన్నదమ్ములము ప్రాణాలకు తెగించినవారము. మృత్యుదేవతాస్వరూపులు మా నాలుగువేల మంది సైనికులు. కాబట్టి నీవు నీ ప్రాణం దక్కించుకొని వెళ్ళిపో. మేము మా చెల్లెలు రుద్రదేవిని మా కోటకు బందీగా తీసుకొనిపోతున్నాము’ అని తెలిపినాడు.

రుద్రదేవికి, అన్నాంబికకు, రేచర్ల రుద్రునికి - ఎవరికీ నోట మాట రాలేదు. మురారిదేవుడు వెడనవ్వు నవ్వుచు ‘సకల జంబూద్వీపానికి మకుటమయిన ఆంధ్రదేశాన ఆడది రాజ్యం చేయడానికి ధర్మం ఒప్పుకోదు. రుద్రచక్రవర్తి వెనుక సింహాసనం అధివసించవలసినది మా తండ్రిగారు. దొంగలై, అధర్మపూర్ణులై మహాదేవరాజూ, గణపతిదేవుడూ సింహాసనా లెక్కినారు. అయినా ధర్మస్వరూపులు అపరజినదేవులు అయిన మా తండ్రిగారు మాటలాడక, లెక్కచేయక ఊరుకొన్నారు. ఆ యధర్మానికి మకుటాయమానంగా రాచగద్దెమీద ఆడదా నెక్కించటమా!’ అన్నాడు.

అప్పుడు ముమ్మక్క రథంమీద లేచి నిలుచుండి, ‘హరిహరదేవ మహారాజా! తాము ఈ విషయం శ్రీ గణపతిదేవ చక్రవర్తులనే అడిగి ధర్మ నిర్ణయం ఎందుకు చేసుకోలేదు?’ అని ప్రశ్నించింది.

మురా: మాకు ఆడవాళ్ళతో మాటలు పనికిరావు. రేచర్లరుద్రుడా! ఏమంటావు? నీ సైన్యాలన్నీ ఆయుధవిసర్జనం చేస్తాయా, ఎక్కడివారి నక్కడే హతమార్చమా?

హరి: మీరు ఆయుధాలు విసర్జించి, గుఱ్ఱాలు దిగి నడచిపోండి. లేదా, రుద్రదేవీ, ముమ్మక్క.... ఆ మూడో అమ్మాయిల ప్రాణాలు దక్కగలవని మేము చెప్పలేము.

5

తన ఉత్తమాశ్వం పై ప్రళయ ఝంఝలా, ధనుర్వినిర్ముక్త శఠంలా, భక్తుని కాంక్షలా శ్రీచాళుక్య వీరభద్ర మహారాజు మహా ప్లతగతిని పోవుచుండెను. ఆయన ఆలోచనలు లోకాలంతటా పరువిడుచున్నవి. రక్షకసేనా పరివేష్ఠితయై యున్న సామ్రాజ్ఞికి భయమేమిటి? అది తనలో ఉన్న కోర్కెలవల్ల ఉద్భవించిన భయముకాబోలు! అయినా ఇప్పుడు అక్కడక్కడ సామంతులలోఉన్న దుష్టత్వాలు, యాదవుల దుండగీడుతనం తలచుకొనగా, మనస్సు పరిపరివిధాల పోవుచున్నది. తీరా, తాను రుద్రాంబికను కలుసుకొన్నప్పుడు ఏ ఆపదా లేకపోయినచో తన యత్నము నవ్వులపాలగును. అంతకంటె ఆపద ఏమీ సంభవించదుకద! ఒక వేళ ఏమూలనో ఒదిగిఉన్న ఆపద విజృంభిస్తే, తనరాక ఆ ఆపత్తును అరికట్టగలిగితే తాను వెళ్ళకపోయి ఉండడము ఈ భూమి ఉన్నంతకాలము మరువరాని భయంకర సంఘటనగా పరిణమించవచ్చునుగదా?

రాజసేవలో ఛాందసమున్నా క్షమింపవచ్చునుగాని ప్రమత్తతఉంటే కోటి జన్మలకైనా క్షమార్హముకాదు. ప్రేమసేవా అంతే! ఒక రేమను కొందురో యని ధర్మాచరణం ఉపేక్షించుట అధర్మమే అవుతుంది. ధర్మాచరణం లోకాభిప్రాయ సంబంధము కలది కానేకాదు.

చాళుక్య వీరభద్రుడు వడ్డపల్లెకు జాముప్రొద్దెక్కునప్పటికి చేరినాడు. వడ్డపల్లె పురవాసులు చాళుక్య వీరభద్రమహారాజు ఒంటిగా రావడంచూచి ఆశ్చర్యమందినారు. గ్రామాధిపతీ, పెద్దలూ వీరభద్ర మహారాజునకు గౌరవాలన్నీ జరిపినారు. మహారాజు స్నానాదికాలన్నీ నెరవేర్చి బుద్ధగణపతికి సహస్రనామ పూజాది అర్చనలు అర్పించి, అచ్చట ఒక సేనాపతి ఇంట భోజనమాచరించి, విశ్రయించి మొగలిచెర్లకు ఏకవీరాదేవిని అర్చింప తన ఉత్తమ అశ్వము నెక్కిప్రయాణ మాయెను. వడ్డపల్లెనుండి నూర్గురు అశ్వికులు మహారాజుననుసరించారు. మొగలిచర్లకు చేరినవెంటనే అచ్చట దేవికి వీరభద్ర మహారాజు పేర అర్చనలు జరిగినవి, వడ్డపల్లెలో, మొగలిచర్లలో మహారాణి పూజలు చేయించిన వైనము తెలియవచ్చెను.

పూజలు పూర్తిచేసుకొని మొగలిచర్ల నుంచి తన్ననుసరించిన అశ్వికులతో శ్రీ చాళుక్య వీరభద్రమహారాజు ప్రయాణము సాగించెను. మూడు గవ్యూతుల దూరము వచ్చేసరికి దూరముగా ఒక చిన్న సేన ఆగిఉన్నట్లు వీరభద్రమహారాజునకు పొడగట్టెను. వెంటనే తన సైనికుల కందరికీ ఉత్సాహపూరిత వచనాలు పలికి, తన చిన్నసేనను అర్ధచంద్రవ్యూహంగా రచించి ముందుకు చొచ్చుకొని పోయినాడు వీరభద్రమహారాజు.

హరిహరదేవ మురారిదేవులకూ, రుద్రమకూ దూరంగా ఏదోచిన్న సైన్యం వచ్చుచున్నట్లు కనబడినది. ఆ సేనవచ్చేలోపలనే రుద్రదేవిని హతమార్చాలని హరిహర మురారిదేవులును; తన సైన్యమూ తన ప్రాణమూ బలియిచ్చి అయినా ఆ సేన వచ్చేవరకూ చక్రవర్తిని రక్షించితీరాలని రేచర్ల రుద్రప్రభువును సిద్ధమై ఉండిరి.

రేచర్ల రుద్రుడు హరిహరదేవుని చూచి ‘ఓయి వెఱ్ఱిమహారాజా! మీరు శ్రీరుద్రచక్రవర్తిని హతమార్చి లాభం పొందాలని చూస్తున్నారు. కాని చక్రవర్తిని హతమార్చడానికి ప్రయత్నించేలోగా మీ ప్రాణాలు మీకు దక్కితేకద? ఇది నేను హాస్యంగాగాని, బడాయిగాగాని అనుటలేదు’ అనెను.

రుద్రదేవి హరిహరదేవునిచూచి ‘హరిహరదేవప్రభూ! నువ్వుగానీ, నీ తమ్ముడుగానీ నన్ను పట్టుకోలేరు. నాలుగువేలమంది సైనికులతో, గజములతో దారికి అడ్డంరావడానికి నువ్వు సాహసించావు. నలభైవేలసేనతో, గజాలతో వచ్చినా నీకు విజయంకాదు. నీ ప్రాణం కోల్పోవడమే అవుతుంది’ అని తెలిపినది.

అన్నాంబిక లేచి రథముమీద నిలుచుండి ‘ఓయి అవినీతిపరుడా! దొంగ తనంవల్ల రాజ్యాలు నిర్మాణంకావు. మగటిమి కలవాడవయితే ఇదివరకే నీ రాజ్యం నువ్వు నిర్మించుకొనే ఉందువు. మా ప్రాణాలు పోవుగాని మీప్రాణాలు మాత్రం బలి అవుతాయి’ అని కేకవేసి బాణం ఎక్కుపెట్టి హరిహరదేవునిపై గురిపెట్టింది.

ఆ వెంటనే మురారిదేవుని బాణంవచ్చి అన్నాంబిక ధనుస్సును రెండు తుండెములు చేసెను. మురారిదేవుడు మరల బాణం సంధించే లోపుగా, ఒక నిశితభల్ల మెక్కడినుండియో మహా వేగమున వచ్చి ఆతని కంఠాన సువ్వున లోతుగా నాటుకొన్నది. ఇది ఏమి అని ఆశ్చర్యపడి అటు చూచేసరికి ఆ ప్రక్క ఎత్తయిన రాళ్ళ గుట్టమీద శ్రీ చాళుక్య వీరభద్రుడు ఇరువదిమంది విలుకాండ్రతో నిలచి యున్నాడు. ఆవిలుకాండ్రమధ్య వీరభద్రుడు ప్రమధులమధ్య కుమారస్వామిలా ఉన్నాడు. వీరభద్రుని ధనుస్సు త్రిపురాసులపై నెత్తిన పాశుపతంలా ఉన్నది.

మురారిదేవుడు మరల ధనుస్సునెత్తి రుద్రమవైపు గురిచూచినాడు. అమరుక్షణంలో అతడు మృత్యుదంష్ట్రవంటి బాణము గుండెను దూసుకొని పోగా ఏనుగుపై విగతజీవుడై పడిపోయినాడు.

హరిహరదేవుడు రౌద్రాన జేవురించి అంగరక్షకుడు ఫలకము నడ్డుపెట్టగా తన మహా ధనుస్సును ఎక్కుబెట్టి చాళుక్య వీరభద్రునిపై పది బాణాలు వదలెను. ఆ పదిబాణాలు పదిరెట్లు పెరిగి తిరిగి అతనినే తాకినవా అన్నట్లు ఆ ఏనుగు అంబారీని నూరుబాణాలు కప్పినాయి. హరిహరదేవుని ఫలక ధారి ప్రాణము వదలి ఏనుగుపై పడిపోయినాడు.

వీరభద్రుడు ప్రళయకాలరుద్రుడై కదలికలేక ఎడతెరపిలేని క్రూరభల్లాల ప్రవాహము కట్టించి హరిహరదేవుని కవచము, శిరస్త్రాణము చీల్చివేసినాడు. ధనుస్సు ఎత్తుకొనే వీలులేక ఏనుగుపై హరిహరదేవుడు మార్ఛితుడైనాడు.

రేచర్ల రుద్రప్రభువు ఎలుగెత్తి ‘చక్రవర్తిపై కత్తిఎత్త సాహసించగల పిరికిపంద లెవ’రని భూనభోంతరాలు పగుల కేకవేసి తన చిన్నసైన్యాన్ని హరిహరదేవుని సైన్యాన్ని తాకుమని కొమ్ము ఊదినాడు.

ఆజ్ఞ యిచ్చుట తరువాయిగా ఉద్దండులైన ఆ అంగరక్షకులు హరిహర దేవుని సైన్యం పై విరుచుకొనిపడిరి. శ్రీ చాళుక్యవీరభద్రుడు ఆ రాళ్ళగుట్టమీద నుండి పిడుగు ప్రవాహం దొర్లుకు వచ్చినట్లు హరిహరదేవుని సైన్యం జొరబడగానే ఆయన ధాటికి నిలువలేక సైన్యాలు వీగిపోయినవి. వీరభద్రునితో గ్రామ వీరభద్రుడు, వీర ముష్టులు ‘ఆశ్వరభ శరభా’ అనుచు ఒళ్లు తెలియని ఆవేశముతో హరిహరదేవుని సైన్యముపై బడినారు.

ఈ రెండు అగ్నులమధ్యపడి హరిహరదేవుని సైన్యము నుగ్గునుగ్గయి పోయినది. హతశేషులు తెగిన హారములోని పూసలుగా దెసల చెదరిపోయారు. వీరభద్రులు మహావేగముతో త్రిశూలాలతో హరిహరుని గజాన్ని పొదివి ఎంత మంది పిండియైనను లెక్కసేయక పరశులతో, భల్లాలతో ఆ ఉత్తమగజాన్ని ముక్కలుగా చీల్చి, అంబారీలో క్రిందపడిన హరిహరదేవుని చిన్న చిన్నకండలుగా నఱకివేసిరి.

చాళుక్యవీరభద్రుడు అత్యంత వీరావేశంతో రుద్రదేవుని రథం సమీపించి ‘చక్రవర్తిని క్షేమమా’ అని అడిగినాడు. రుద్రసేనాని హరిహరుని చిత్రవధ చూడలేక మోమటుతిప్పుకొనియుండి వీరభద్రుని మాట వినగానే ఆ ప్రభువువంక చూచి చిరునవ్వు నవ్వినది. చాళుక్య వీరభద్రునికోపము పాలు విరిగినట్లు విరిగిపోయినది.

6

చాళుక్యవీరభద్రుడు రుద్రదేవ చక్రవర్తిని, అన్నాంబికను, ముమ్మడాంబికను రాత్రికి ఓరుగల్లు గొనిపోవుసరికి హరిహరమురారిదేవుల రాజద్రోహ సంఘటన, వీరభద్ర మహారాజు వారిని నాశనముచేయుట నగరమంతట ప్రాకిపోయినది. శివదేవయ్య దేశికులు వెంటనే రాచనగరుకువచ్చి చక్రవర్తిని క్షేమమడిగి ‘ఈ దేశములో పరిపూర్ణశాంతి వచ్చేవరకు చక్రవర్తిని సరియైన అంగరక్షక బలము వెంట రాకుండ ప్రయాణం చేయకూడ దని మనవిచేసిరి.

రుద్ర: బాబయ్యగారూ! ఎంతకాలం జాగ్రత్తతో భయపెట్టి సైన్యాల పెంచి, రాజ్యం పాలించగలం? రాజ్యపాలన ధర్మరక్షణకోసం అధర్మ బలంతో రాజ్యాలు నిలబెట్టగలమా?

శివ: ధర్మరక్షణకు అధర్మమార్గం పనికిరాదు భయంచేత రాజును తన్ను రక్షించుకొమ్మని ధర్మశాస్త్రాలు చెప్పవు. మానవహృదయంలో కాంక్ష కుములుతూ ఉంటుంది. రాజ్యం చేయవలెననే దురాశతో ఎవరైనా నిరాయుధు డైన రాజు పై విరుచుకు పడవచ్చును; సుదుర్లభు డైన ఉత్తమ ప్రభువు తన్ను దా నేమరకూడదు.

రుద్ర: కవులు, గాయకులు, పండితులు, మహాఋషులు నిరాయుధులై, నిర్భయులై ఎలా జీవిస్తున్నారో రాజులుకూడా ఒక్కధర్మమే బలంగా రాజ్యం చేయవద్దా గురుదేవా? దైవబలంకాక రాజ్యాలు పశుబలం మీద ఆధారపడి ఉన్నంత కాలం భగవంతుడే జగత్తునుండి మాయమై పోయినట్లుకాదా?

శివ: రుద్రప్రభూ! మానవుడు ధర్మపథం తప్పినప్పుడే రాజ్యాల అవసరం కలుగుతుంది. ప్రపంచం ధర్మక్షేత్రమైనప్పుడు, రాజ్యాలూ, రాజులూ, చతురంగబలాలూ, కోటలూ, కందకాలూ, రక్షకభటులూ, చారులూ, ఆయుధాలూ అస్త్రాలూ అవసరమేమిటి?

రుద్ర: ఆస్థితి ప్రపంచానికి ఎప్పుడయినా లభిస్తుందా బాబయ్యగారూ?

శివ: అలాంటిస్థితి లోకానికి ఒక్కసారే సాధ్యము!

రుద్ర: కృతయుగంలోనా?

శివ: కృతయుగంలోనూ కాదు! కృతయుగంలో మానవజీవితము శైశవావస్థలో ఉన్నది. శిశువులు దేవతాస్వరూపులు. వారికి ప్రభువులు దేవతలే! కాబట్టే శిబి, దధీచి మొదలయినవారు; వేణుడు, నహుషుడు, దక్షుడు మొదలయినవారు అప్పుడు ఉండేవారు. రుద్ర: ఇంక ఎప్పుడా దివ్యయుగం అవతరించడం?

శివ: మహారాజా! అనేకచోట్ల కృతయుగాలలో ఒక్క మహాపవిత్ర కృతయుగం ఉద్భవిస్తుంది. ఆ కాలంలో శైవ, బౌద్ధ, జైన, వైష్ణవ మతాలుండవు. మ్లేచ్ఛులు, ఆర్యులు, దస్యులు, అనురులు అనే తేడాలుండవు. బీదలూ, ధనవంతులూ ఉండరు. పాలించేవారూ, ప్రజలూ అనే వర్గాలుండవు. అభిమానం, గర్వం, అహంకారము, ఆశ, క్రోధము, కామం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఏమీ ఉండవు. మానవులప్పుడు దేవతలై పరతత్వం చేరుతారు ప్రభూ!

రుద్ర: ఈలోగా ఈలా మనుష్యులు సర్వబాధలు అనుభవిస్తూ ఉండ వలసిందేనా?

శివ: అప్పుడప్పుడు ప్రతిమనుష్యుడూ ఏదో మహత్తర సన్నివేశమందు భగవత్సమాను డవుతూ ఉంటాడు. కొందరు మనుష్యులు బ్రతికివున్నంతకాలమూ దేవతలుగా ఉండి అవతారం చాలిస్తారు. భక్తులు ఉద్భవించి తమ తమ వుత్తమ కర్మలద్వారా లోకానికి దారి చూపిస్తూ ఉంటారు.

ఈ ధర్మరక్షణార్థం స్త్రీ అయ్యూ తాను ఎన్ని భయంకర మృత్యు నాట్యాలు చూడవలసిఉంటుందో అని రుద్రదేవి అనుకొనుచు దేశికులకు వీడుకోలు ఇచ్చి అభ్యంతర గృహాలలోనికి పోయినది.

శ్రీ చాళుక్య వీరభద్ర మహారాజునకు ఏదో ఆవేదన జనించి తనకై అరుదెంచినారా? ఎంత విచిత్ర సంఘటన! సైన్యములేక ఒక్కరు వచ్చినారా? అది ఎంత అవివేకము! వడ్డపల్లినుండీ, మొగలిచర్లనుండీ వీరముష్టులనూ, వీరభద్రులనూ, ఆ మహారాజు వెంటబెట్టుకురావడము విచిత్రమైన విషయమే.

హరిహరదేవులు తన్ను హతమార్చియుందురు. ఆరీతిగా తన ప్రాణము పోయి ఉన్నట్లయితే, కాకతీయ సింహాసనంకోసం ఈ దారుణసంగ్రామాలన్నీ ఉద్భవించకుండా ఉండునుకదా!

చాళుక్య వీరభద్ర మహారాజు యుద్ధం జరుగుతున్నంకాలం దుర్నిరీక్ష్య తేజు డై, యుద్ధం కాగానే చంటిబిడ్డవలె ‘తాము క్షేమంగా ఉన్నారా?’ అని అడిగినారు. ఆ ఉత్తమ చాళుక్యునకు అంత భయంకర క్రోధం ఉద్భవించడానికి కారణం, తన కప్పుడు సంభవించిన ఆపదేకాబోలు? ఆ సమయంలో తాను మాటే మరచిపోయి ఆడుపులిలా, తన పురుషుడు శత్రువుల నాశనం చేస్తూంటే చూచి ఆనందంతో ఉప్పొంగిపోయినదేమి!

ప్రతి స్త్రీ తన పురుషుడు బలంతో విజృంభించి శత్రువుల నాశనం చేస్తూ ఉంటే, చూస్తూ ఉప్పొంగిపోతుంది కాబోలు. అదేకాబోలు గురుదేవులు వచించిన మానవపశుత్వము; రాజుల కందుకే వేట అన్నా, కోడి, గుఱ్ఱం, ఏనుగు, పెద్దపులి పందేలన్నా ఇష్టము. ఇంతలో ముమ్మక్క అన్నాంబలు స్నానాలాచరించి, వస్త్రాలు ధరించి దేవకన్యలులా వచ్చారు. రుద్రమ అదివరకే స్నానమాచరించి చీనీ చీనాంబరాలు ధరించిఉన్నది. వారిద్దరూ వచ్చుటచూచి ‘పాపం! వీ రిరువురూ సంపూర్ణ యౌవన వతులైన కన్యలై, తనవలనకదా పెళ్ళికాక ఉన్నారు’ అనుకున్నది.

తానే పెళ్ళికాని కన్యయై ఉన్నదే! స్త్రీలకు పెళ్ళి అయితీరాలన్న ధర్మశాస్త్ర ప్రమాణ మున్నది. పురుషులు పెళ్ళికాకుండా ఉన్నా పతితులు కాకపోవడమేమి? పురుషుడు పరస్త్రీగతుడైనా, అతడు భార్యతో దాంపత్య ధర్మము నెరవేర్చడానికి అర్హుడు స్త్రీ ఒకసారి పరపురుషరతయైతే భర్తతో దాంపత్యం నెరవేర్చడానికి అర్హురాలుకాదు. ఈ ధర్మనిర్ణయాలు రావడానికి సహస్రకారాణా లుండవచ్చు.

ఇంతలో ముమ్మక్క రుద్రమదేవికడకువచ్చి “అక్కగారూ! చాళుక్య వీరభద్ర మహారాజు అంత చిన్నబాలునిలా అయిపోయినారేమిటి? అని అన్నాంబిక నన్ను మూడుసారు లడిగింది” అని చిరునవ్వుతో తెలిపింది.

“అల్లరిపిల్లా! పెద్దలంటే భక్తిలేకుండా వేళాకోళాలుచేస్తావా?” అంటూ రుద్రాంబ తరుముకువచ్చింది. ముమ్మక్క పారిపోయి అన్నాంబిక వెనుక దాగెను.

అన్నాం: ఉండండి అక్కగారూ! నాకు నిజంగానే అనుమానం కలిగింది ఏమి చేయమంటారు? (పక పక నవ్వును)

రుద్ర: అల్లాగా! నిజమైన అనుమానం కలిగిందే! దానికి నిజమైన ప్రత్యుత్తరం గోన గన్నారెడ్డిని అడిగి తెలుసుకోవాలి.

ముమ్మక్క: (అన్నాంబిక వెనుకనుంచి ముందుకువచ్చి) అమ్మయ్యా, ఓ తాయిలంగారికి మా చక్కని ప్రత్యుత్తరం వచ్చింది. అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

అన్నాం: ఓ చాళుక్య మహాదేవరాజు నడిగితే అనుమానాలు గినుమానాలూ ఏమీ వుండవనే అంటారు.

రుద్ర: మహాదేవరాజేమిటి చెల్లీ?

అన్నాం: ఏమీలేదు అక్కగారూ! మొన్న మనం వడ్డపల్లెకు వెళ్లకమునుపు ఓ తాయిలంగారు తదేకదీక్షతో మీ సభలోవున్న ఒక మహాపురుషుని తెరల వెనకాలనుంచి చూస్తున్నారు. ఇది మొదటిసారికాదు. మీరు సేనానాయకుల సభ చేసిన దినాన, మీ ఆలోచనామందిరంలో అవరోధ జనంవుండే చోటనుంచి గవాక్షం గుండా ఆతాయిలంగారే ఆ మహాపురుషుని చూస్తుంటే నేను దొంగలా కనిపెట్టుతున్నాను.

ముమ్మక్క: అమ్మ దొంగా! అన్నాం: నేను దొంగనే అని ఒప్పుకొన్నానుగా!

రుద్ర: తర్వాత ఏమయింది?

అన్నాం: ఆ తాయిలంగారు నిట్టూర్పు విడవడం, శ్రీవారికి కళ్ళు అరమూత లవడం, చెంపలు ఎరుపెక్కడం చూచానులెండి! ఇంకేం భార్యా భర్తలూ తల్లీ కూతుళ్ళూ, అక్కా చెల్లెళ్ళూ అయిన ఓ యిద్దరు రాజ కుమార్తెలు తోడికోడళ్ళవుతారు కాబోలు అనుకున్నాను.

రుద్ర: ఆసిదొంగా! నన్నుకూడా కలిపావూ, నీపని చెబుతా!

అన్నాం: గుమ్మడికాయ దొంగలు.

అందరు పక పక నవ్వుకొనిరి.