గోన గన్నారెడ్డి/ఆనందవల్లి

వికీసోర్స్ నుండి

ఆనందవల్లి

సామ్రాజ్యాభిషేకము

1

ఓరుగల్లులో, రాజనగరిలో, మహాసభాభవనంలో స్వస్తి. శ్రీ రక్తాక్షి సంవత్సర శ్రావణశుద్ధ పంచమీ గురువారంనాడు లగ్నమందు రవిశుక్రులూ, ద్వితీయ మందు బుధుడూ, గురువు దశమమందుండగా, శని అష్టమమందు కుజుడు భాగ్య మందుండగా శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ చక్రవర్తి సామ్రాజ్య సింహాసనాభిషేకమహోత్సవం జరిగింది.

దేశదేశాలనుండి ఉత్సాహంతో మహామండలేశ్వరులు, రాజప్రతినిధులు, మహాసేనాధిపతులు, సామంతులు, రాజబంధువులు, ఇతరదేశాల రాజప్రతినిధులు, శివగురువులు, వైష్ణవ, అద్వైత, జైన, బౌద్ధ మఠాధిపతులు, మహామంత్రులు, మహాపండితులు, మహాకవులు, రాజోద్యోగులు, వణిక్ శ్రేష్ఠులైన కోటీశ్వరులు, గ్రామ పెద్దలు మొదలయినవారు ఆ పట్టాభిషేకానికి దయచేసినారు.

ఆషాడ పూర్ణిమ ముందుగనే రుద్రదేవి, వరాహ నందిధ్వజాలు ఆకాశమూ, దేశదేశాలూ తమ కాంతులతో నింపుతూ ఎగురుతూఉండగా తన మహానగరమునకు తిరిగి వేంచేసినారు. రాగానే మహాసభ చేసిం దామె.

ఆ మహాసభలో తన కుడివైపు శ్రీ శివదేవయ్య దేశికులతో చాళుక్య వీరభద్రుని, గోన గన్నయ్యను అధివసింపచేసింది. ఎడమప్రక్క ప్రసాదాదిత్య ప్రభువు, చాళుక్య మహాదేవరాజు, మల్యాల గుండయ, మల్యాల కాటయ అధివసించి ఉన్నారు. తంత్రపాల మల్లినాయకులు, నాగమనీడు, బాప్పదేవుడు, విఠలధరణీశుడు, సూరనరెడ్డి మొదలయినవారందరు యథోచితస్థానములందు ఉన్నారు. చినఅక్కినప్రగడ శివదేవయ్యమంత్రి వెనుకనే కూర్చుండెను. ఎదురుగా ఆసనాల అధివసించి లకుమయారెడ్డి ఆదవోని ప్రభువు, వరదారెడ్డి, ఇతరులూ ఉన్నారు.

భూసురశ్రేష్ఠుల వేదాశీర్వాదాలు సభికులపై అమృతము కురిసెను.

శ్రీ శివదేవయ్య దేశికులు ఆ మహాసభను చూచి చిరునవ్వుతో ఈలా సెలవిచ్చినారు: “ఈ మహాసభలో నేను ఒక ముఖ్యవిషయం ముందుగా చెప్పాలి. మీరంతా చాళుక్య వీరభద్రమహారాజు ప్రక్కనే ఉన్న శ్రీ గోన గన్నారెడ్డి మహారాజును చూస్తున్నారుకదా! ఆయన గజదొంగ! మహాప్రభువైన శ్రీ గణపతి చక్రవర్తులవారినీ, శ్రీ రుద్రదేవ చక్రవర్తులను వ్యతిరేకించి అనేకమంది బాలకులను వెంటబెట్టుకొని ఈ మహానగరంనుంచి వెళ్ళిపోయినాడు. అలాంటి ఆ పురుషుడు శ్రీ కాకతీయ దివ్యచ్ఛత్రంక్రింద ఉండే అనేకమంది సామంతులను నాశనం చేశాడు. మనదేశానికి స్నేహితులయిన చోళుల్ని, పాండ్యుల్ని, కటకాధీశుల్ని, భల్లాణులను, యాదవులను, గాంగులను నానా చిక్కులూ పెట్టాడు. పినతండ్రిని బందీ చేశాడు.

“కాని ఈ మహావీరుడు ఈ ఉత్తమకార్యాలన్నీ శ్రీ చక్రవర్తీ అనుమతి మీదనే చేశాడు.

“ఈయన గజదొంగ కావడం శ్రీ చక్రవర్తి అనుమతిమీదనే.

“ఈ మహావీరుడు జన్మించకపోతే కాకతీయసామ్రాజ్యం విచ్ఛిన్నమై ఉండును. ‘ఆడది రాజ్యము చేయడమా’ అని సామంతు లెందరో కుట్రచేశారు. అందులో ముఖ్యులు ఆ ఎదుట ఉన్న లకుమయారెడ్డి, అందరికి వెనకాలఉండి ఏమీ తెలియనట్లు నటిస్తూ అత్యంత రాజభక్తి వెల్లడిస్తూ ఉన్న వృద్ధులైన జన్నిగదేవమహారాజూ, మేము కనిపెట్టనేలేక పోయాము. ఆయన మొన్నవచ్చి నా పాదల వ్రాలి తన్ను క్షమించమని ప్రార్థించారు. శ్రీ చక్రవర్తుల ఎదుటపడడానికి సిగ్గు పడిపోతున్నాడు. ఆ రహస్యము మాకు బయటబెట్టినది గోన గన్నారెడ్డి మహారాజే!”

అని శ్రీ శివదేవయ్య దేశికులవారు ముగించగానే, ఒక్కసారి ఆ మహాసభలో ఉన్నవారంతా జయజయధ్వానాలు చేశారు.

అప్పుడు వైతాళికులు “జయజయ శ్రీ సమస్తగుణాకర జయ! శ్రీకాకతీయ కటకసన్నాహ జయ! శ్రీ రుద్రదేవ దక్షిణభుజదండ జయ! శ్రీ కడుపులూరి పురవరాధీశ్వర జయ! శ్రీ అరిగండభైరవ జయ! సాహసోత్తుంగ జయ! శ్రీ వీరవితరణోత్సాహ జయ! శ్రీ వీరలక్ష్మినిజేశ్వర జయ! శ్రీ మనుమకుల మార్తాండ జయ! మీసరగండజయ! శ్రీ ఉభయ బలగండజయ! శ్రీ గండరగండజయ! శ్రీ అభంగ గండభేరుండ జయ! శ్రీ హన్నిబ్బరగండ జయ! శ్రీ హరిమువ్వరగండ జయ! శ్రీ లాడవకువరపెండార జయ! శ్రీ గళమౌళిసంతర్పితశశిమౌళి జయ! శ్రీ కామినీజయంత జయ! శ్రీ దుష్టతురగరేఖారేవంత జయ! శ్రీ దుర్వార వీరావతార జయ! శ్రీ కోసగిమైలితలగొండుగండ జయ! శ్రీ ఉప్పలసోముని తలగొండుగండ జయ! శ్రీ వందిభూపాలుని తలగొండుగండ జయ! శ్రీ అక్కినాయకుని తలగొండుగండ జయ! శ్రీ మేడిపల్లి కాచయనాయకుని ఉరిశిరకుండ జయ! శ్రీ కందూరి కేశినాయని తలగొండుగండ జయ! శ్రీ రాపాక భీమనిర్దూమధామ జయ! శ్రీ నిరుపమసంగ్రామరామ జయ! శ్రీ తెఱాల కాటయదిశాటపట్ట జయ! శ్రీ ఏఱువ తొండగోధూమఘట్టనఘరట్ట జయ! శ్రీబేడ చెలుకినాయని నిస్సహణాపహరణ జయ! శ్రీ సహజకార్యాభరణ జయ! శ్రీ కోట పేర్మాడిరాయకంఠాభరణచూరకార జయ! శ్రీ చోడోదయపట్టసూత్ర తురంగాపహార జయ! శ్రీ నిజకీర్తిపూరిత బ్రహ్మాండకరండ జయ! శ్రీ వరబలోద్దండ జయ! శ్రీ పరబలసాధక జయ! శ్రీ సోమనాథదేవ దివ్య శ్రీపాదపద్మారాధక జయ! శ్రీ వర్థమానపురవరేశ్వర జయ!” అని వందులు గన్నారెడ్డిని కీర్తించిరి. సభ అంతా హర్షధ్వనులతో పొంగిపోయింది.

అప్పుడే అనేకులకు గన్నారెడ్డి నిజతత్వం గోచరించింది. కొందరు ఇదేమి గజదొంగ అని ఆశ్చర్య మందినారు. కొందరు గన్నారెడ్డి నూతన సామ్రాజ్యము స్థాపిస్తాడు కాబోలు అనుకున్నవారు రిచ్చవడి చూడసాగిరి.

గన్నారెడ్డి తల కొంచెం వంచి ఏమీ కదలక నిశ్చలవదనంతో నిలిచి ఉన్నాడు. ఆయన మోమున రాజభక్తి దివ్యకాంతి ప్రసరిల్లుచున్నది.

శ్రీ రుద్రదేవి చిరునవ్వుతో గన్నారెడ్డివైపు చూచి ‘శ్రీ గన్నారెడ్డి మహారాజా! నువ్వు నాలుగేళ్ళనాడు మాకడకూ, శ్రీ గురుదేవులకడకూ వచ్చినప్పుడు ప్రతిజ్ఞలు అన్నీ నెరవేర్చలేదేమో అని అనుమానించినందుకు మీ ప్రభువును మీరు....

గన్నారెడ్డి చేతులు జోడించి మనవిచేసెను. ‘మహారాజాధిరాజా! అష్టమ చక్రవర్తీ! భక్తునిబలం భగవంతునిదే అన్నట్లు, నా చక్రవర్తికి నేను బంటును. హనుమంతుని బలం రామునిలోనుండేకదా వచ్చింది.’

ఓరుగల్లు మహానగరమూ, కాకతీయ సామ్రాజ్యమూ సామ్రాజ్ఞి పట్టాభిషేకకాలంవరకూ చేసిన ఉత్సవాలు వర్ణనాతీతం. దేశం అంతట దినదిన తోరణాలు, దినదిన పండుగలు, నాట్యాలు, భగవత్కథా కాలక్షేపాలు, నాటకాలు.

సుంకాలు అన్నీ తీసివేసినారు. అన్ని మతసంస్థలకు చక్రవర్తి, మాండలికులు, రాజోద్యోగులు దానశాసనాలతో గ్రామాలు, భూములు, దేవాలయాలు నెలకొల్పినారు. చెరువులు, కాలువలు త్రవ్వించినారు.

నగరమంతా పార్వతీదేవి కళ్యాణంనాటి కైలాసంలా, లక్ష్మీదేవి వివాహం నాటి వైకుంఠంలా అలంకరించినారు.

దేశంలో ప్రసిద్ధికెక్కిన నర్తకులు, గాయకులు వచ్చినారు. పండితులు కవులు వేంచేసినారు. దేశదేశాల రత్నాలవర్తకులు తమ నిధులలో ఉన్న ఉత్తమ రత్నాల సేకరించి ఓరుగల్లుకు తరలించుకు వచ్చినారు. సామ్రాట్టుకు బహుమతులు ఇవ్వడానికి, తాము భూషణాలు చేయించుకోవడానికి సామంతులు, ధనేశులు రత్నాలు కొంటున్నారు.

శుభముహూర్తం కొలదిదినాలలో ఉన్నది. అటు నతనాటి సీమనుంచి మాధవ నృపతియు, వారి రాణి మహాదేవిన్నీ, వారి సోదరులు, వారి తల్లులున్నూ శ్రీ రుద్రచక్రవర్తి తల్లులూ అయిన మైళమ్మయున్ను, కుందాంబయున్నూ వేంచేసినారు. గణపవరంనుండి తెలుగు నాయక సామంతులు, స్వామినాయకుడు మల్లాప్రెగ్గడతో వేంచేసినాడు. (తెలుగు నాయకులు తెలగాలయ్యారు) గణపతిదేవ చక్రవర్తి దేవేరులయిన నారాంబ పేరాంబల మేనల్లుడు, జాయపసేనాని అన్నకొమరుడైన చిననారపనాయకుడు (కమ్మనాటి ప్రభువు) తన దేవేరులతో, బిడ్డలతో, తమ్ములయిన చోడమహారాజుతో వేంచేసినారు. (వీరు కమ్మవారు)

వేంగి దేశాధిపతి అయిన తెలుగురెడ్డి (తెలగా) నాయకుడు గణపతి రుద్రదేవుని సేనాపతి కాలపయనాయకుని కొమరుడు కాలపనాయకుడు వేంచేసినాడు.

నిరవద్యపురంనుంచి చాళుక్యవృద్ధులు ఇందుశేఖరమహారాజు వేంచేసినాడు. ధరణికోటనుండి కోట భేతమహారాజు గణపాంబతో కలిసి వేంచేసినారు. కోనసీమ నుండి హైహయ మహారాజులు, భీమవల్లభ నృపాలుడు తన దేవి అన్నమాంబతో కలిసి వేంచేసినారు.

జన్నిగదేవుడు వృద్ధుడై తన సంపూర్ణరాజప్రతినిధిత్వము అంబయదేవ త్రిపురాంతక దేవుల కప్పగించి, తాను పట్టాభిషేకానంతరము శ్రీ శైలాన తపస్సు చేసుకొన సంకల్పించాడు. సిందవాడనుండి, మార్జవాడినుండి అంబయదేవ త్రిపురాంతక దేవులు వేంచేసినారు.

ఈలా సకల బంధువులు, సామంతులు, ఉద్యోగులు కొలుస్తూఉండగా శ్రీ శివదేవయ్యమంత్రి, శివగురువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, పండితులు, ఆశీర్వాదం చేస్తూఉండగా శ్రీ రుద్రదేవ ప్రభువునకు సామ్రాజ్యాభిషేకం జరిగినది.

సంతోషముతో దేశాలన్నీ పాలసముద్రమై విరుచుకుపడినాయి.

పట్టాభిషేకమహోత్సవం అయినరాత్రి తన నగరికి రుద్రచక్రవర్తి చేరి, మహాతల్పం పై మేనువాల్చింది. అలసట పడినందుకు సొమ్మసిల్లి నిద్రరాదు.

పనికత్తెలు మహాప్రభువునకు అన్నీసమకూర్చి తాము వెడలిపోయినారు.

నగరి మోసాలకొట్టే ఘటికాఘంటలు మ్రోగుతూనే ఉన్నాయి కాబోలు, అవి ఆ మహాకోలాహలంలో ఎలా వినబడతాయి?

ఊరంతా జరిగే ఉత్సవాలు జరుగుతున్నాయి. తా మా ఉత్సవ మహాసభలో పీఠం అధివసించి ఉండవలసిందే!

అయినా రెండుఘటికలు విశ్రాంతి తీసుకోవడానికి, దృష్టి మొదలయినవి తీయడానికీ లోనికి రావలసివచ్చింది. ఇప్పుడే దాసీలువచ్చి తన వస్త్రాదికాలు, ఆభరణాలు మార్చి మళ్ళీ సభకు తీసుకొనిపోతారు.

తా నొక్కతే సింహాసనం పై కూర్చుండవలసివచ్చింది. చాళుక్య వీరభద్రమహారాజు తన వైపు చూస్తేచాలు! తాను చక్రవర్తి అన్నమాట మరచిపోతున్నది.

వెంటనే పర్యంకమునుండి దిగ్గనురికి రుద్రదేవి ప్రక్కనున్న జేగంట వాయించినది. వెంటనే ఆ దివ్యమందిరం బైటనుండి పలువురు దాసదాసీలు పరుగెత్తుకొని వచ్చినారు.

“సిద్ధం చేయండి, త్వరపడండి.”

సామ్రాట్టు వాక్కులు విని ఆ పరిచారికలు పదిలిప్తలలో మహారాణిని విష్ణుని కైసేసినట్ల అలంకరించారు.

“ముమ్మడాంబికను అలంకరించి తీసుకొనిరండి” అని చక్రవర్తి ఆజ్ఞాపించినారు.

సభలో అపరోధ స్థలంలో అన్నాంబికాది యువతులతో హాస్యపు మాటలు చెప్పుకుంటూ, నవ్వుకుంటూఉన్న ముమ్మడాంబిక చక్రవర్తి ఆజ్ఞ విని గుండె దడదడలాడ చెలికత్తెలవెంట అంతిపురికి పోయినది. అందు చెలికత్తె లామెను రతీదేవివలె అలంకరించారు.

అంతవరకు తమ అభ్యంతర సభామందిరంలోనే చక్రవర్తి కూరుచుండెను.

ముమ్మడాంబిక అలంకృతయై దగ్గరకు రాగానే రుద్రదేవి చిరునవ్వుతో “ముమ్మడాంబికరాణీ! నేను నిన్ను మూడేమాట లడుగుతాను. వానికి ‘ఏమీ సందేహించకుండా ప్రత్యుత్తరం చెప్పు’ అని అడిగింది. తెల్లబోతూ ‘అల్లాగే’ నని ముమ్మక్క జవాబు చెప్పినది.

రుద్రదేవి ముమ్మక్కచెవిలో గుసగుసలాడింది. ముమ్మక్క తెల్లబోతూ సిగ్గు పడుతూ అవునంటూ తలఊచింది.

రుద్రదేవి ఆనందంతో నవ్వి ముమ్మక్క చేయి పట్టుకొని చెలులు, మంత్రులు, అంగరక్షకులు దారిచూపిస్తూ ఉండగా మంగళవాద్యాలు ముందు మ్రోగుతుండగా దయచేసి, సభికులందరూలేచి జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా సింహాసనం ఠీవిగాఎక్కి ముమ్మక్కను ప్రక్కన కూర్చుండబెట్టుకొన్నది.

చక్రవర్తి, అందరూ ఆశీనులయిన వెనుక, శివదేవయ్య దేశికులతో “గురుదేవా! ఈ నిండుసభలో మేము ఒక విషయము మహారాజులకు, సామంతులకు తెలియచేయ దలచుకొన్నాము” అనిరి. శివదేవయ్య దేశికులు ముఖ్య వందికి సైగచేసిరి.

ఆ వంది వెంటనే తన శంఖమెత్తి సింహాసనం మ్రోలనుండి భోం భోం! అని ఊదినాడు. సభ నిశ్శబ్దమైనది. నాట్య మాగినది.

రుద్రచక్రవర్తి ముమ్మక్క సహాయంతో సింహాసనం దిగింది. సభఎల్ల వెంటనే నిలుచుండెను. గురుదేవు లొక్కరే కూర్చుండి యుండిరి.

చక్రవర్తి తన మెడలోని హారం తీసి, మందయానంతో, సిగ్గు తో మోము ఎఱ్ఱవార, చాళుక్య వీరభద్రునికడకు వెళ్ళి, కొంచెమువణికే కంఠంతో ‘మహారాజా! కాకతీయ సామ్రాజ్యంతో ఈ దాసురాలిని స్వీకరించ ప్రార్థన!’ అని తల వంచుకొన్నది. ‘మా ముమ్మక్క మహారాణి చాళుక్య మహాదేవ మహారాజును వరించుచున్నది’ అనెను.

2

లకుమయారెడ్డి తానుచేసిన తప్పులన్నీ ఒప్పుకొని, చక్రవర్తి క్షమాపణ అడిగి కుమారుడైన వరదారెడ్డిని వారి పాదాలకు అప్పగించినాడు. గన్నారెడ్డిని దర్శించి, ‘ప్రభూ! నేను మీ పినతండ్రిని కావడానికి తగనివాణ్ణి. అన్నగారి ఆజ్ఞ నిలబెట్టలేని మూర్ఖుణ్ణి. ఎట్టి శిక్ష కైనా తగినవాణ్ణి’ అని మనవిచేసెను.

గోన గన్నారెడ్డి: బాబయ్యగారూ! స్త్రీలు, రాజ్యాలు మనుష్యుల మనస్సులను పాడుచేస్తవి. విధిదుర్విపాకం అటువంటిది. మీరు ఆజ్ఞ ఇస్తే పాలిస్తాను.

లకు: తండ్రీ! పైత్యరోగికి అన్నీ పచ్చగా కనబడినట్లు, నాకా రోజుల్లో అధర్మపూరితాలయినవన్నీ ధర్మపూర్ణము లైనట్లు తోచాయి. ఈ రాజ్యం నీది. నీ ప్రతిభ అసమానం. భారతగాథల్ని మరపించేసే మీ చరిత్ర సువర్ణాక్షరాలతో శాసనాలుగా లిఖింపబడవలసినది. ఈ మహా సామ్రాజ్యాన్ని రక్షించిన అర్జునుడవు. నీ పాదాల వరవణ్ణి నే నొస్తున్నాను. నేను శ్రీ కాలాముఖమఠం చేరి తపస్సు చేసుకుంటూ ఈ చరమకాలం గడుపు తాను.

గన్నా: బాబయ్యగారూ! వరదయ్య నాకు విఠలయ్యతో సమానం. అతడే భువనగిరిని ఏలుకొంటాడు.

లకు: నాయనా! ఆదవోనివారి అమ్మాయిని నువ్వు చేసుకో! వరదయ్యకు మంచి సంబంధము చూడు. అతడు నీ బిడ్డసుమా తండ్రీ! నీ ఈడును మా అన్నగారు మూడుమూర్తులా నీ పోలికే. నీ తండ్రిని మరపించే శక్తిమంతుడవయ్యావు. ఆయన సుగుణాలన్నీ నీలో కాంతించాయి. ఇంక నేను వెడుతున్నా!

పినతండ్రి తన ప్రస్థానానికి అన్నీ సిద్ధంచేసుకొని ప్రయాణం సాగించాడు.

వరదారెడ్డి, విఠలధరణీశుడు, గన్నారెడ్డి మంత్రులతో, సేనాపతులతో కూడా ఓరుగల్లునుండి శ్రీశైలంవరకూ వారిని సాగనంపి తిరిగివచ్చారు! కుప్పాంబికాదేవి కొమరితను వరదారెడ్డికి ఇచ్చుటకు ఒప్పందంచేసి గన్నారెడ్డి తిరిగి ఓరుగల్లు వేంచేసినాడు.

వరదారెడ్డి విఠలయ్యను వదలడు. చిన్నన్నగారితో పెద్దన్నగారి వివాహం అయితేగాని తాను వివాహం చేసుకోనంటాడు. విఠలయ్య అన్నగారితోమాటలాడడు. అక్కినప్రగడకూ ధైర్యం చాలదు.

చక్రవర్తి ఆజ్ఞ అయినా గన్నారెడ్డి వర్థమానపురం వెళ్ళనే వెళ్ళడు. పట్టాభిషేకం మాట తలపెట్టితే ప్రతివచన మివ్వడు.

ఆ దినము చినఅక్కినప్రగడ, విఠలయ్య, సూరనరెడ్డి, వరదారెడ్డి, విఠలయ్య నగరిలో ఆసీనులై ఉన్నారు.

విఠ: ఏమిటి అన్నయ్యగారి ఉద్దేశం?

సూరన్న: నాకు యుద్ధం అంటే ఏమిటో తెలుసును. ఇలా మౌనవ్రతం పూనడం అంటే భయం కలుగుతుంది. ఎందుకు మనప్రభువు అలా గుఱ్ఱంఎక్కి దినదినమూ ఓరుగల్లు చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరిగివస్తూ ఉంటారు?

అక్కిన: ప్రేమ అనేది ఒక రోగం. అది సోకితే జ్వరం, తల తిరగటం, మతిపోవడం మొదలయిన లక్షణాలన్నీ కలుగుతాయి!

సూరన్న: వచ్చిందీ ఆ ప్రేమవిషయం? నాకుమాత్రం ఆ విషయాలేమీ తెలియవు. మల్యాల కాటయసేనాపతుల అమ్మాయిని ఇస్తామని మా తండ్రిగారు వార్తపంపారు. మానాయకులు ఒప్పుకుంటే నా కభ్యంతరం లేదన్నాను.

విఠ: ఆ విషయంలోనూ నాయకుల ఆజ్ఞే?

సూరన్న: భోజనవిషయాలలోనూ నాయకుల ఆజ్ఞే?

విఠ: బావా! త్వరగా నువ్వే వైద్యం చెయ్యాలి. వర్థమానపురం ఎప్పుడు వెళ్ళేది?

అక్కినప్రగడకూ గన్నారెడ్డి ఆవేదన అర్థంకాలేదు. అన్నాంబికాదేవిని తల్లిదండ్రులు ఆదవోనికి తీసుకుపోయారు. ఆమె పురుషవేషంతో గన్నారెడ్డిని ఛాయలా అనుసరించింది మా ప్రభువునకు యుద్ధం తప్ప ఇంకేమీ రుచించదేమో?

మొన్న చక్రవర్తి దేవగిరిలో ఉన్నప్పుడు ఱాపాక భీముడు బలగాలు కూర్చుకొని తాను స్వతంత్రుడననిన్నీ, స్త్రీ సామ్రాజ్యమున ఉన్న పురుషుడంత హీను డింకొక డుండడనీ తన రాజ్యం అంతా చాటించినప్పుడు పిట్టపిడుగులా బావగారు తమందరను నడుపుకుంటూ ఱాపాక చేరి, ఆవెఱ్ఱిబాగుల భీముణ్ణి నిర్థూమధామం చేశారు.

యుద్దవ్యూహా లెరిగినవాళ్ళకు ప్రణయవ్యూహారచన తెలియదేమో?

ఈ ఆలోచనలతో అక్కినప్రగడ తన ఇంటికి చేరినాడు. ఇంటికివెళ్ళి, ఆ సాయంకాలం స్నానంచేసి సంధ్యానుష్టానాలు తీర్చి తండ్రితో, తాతగారితో భోజనం చేసినాడు.

తాతగారు పెదఅక్కినప్రగడ, మనుమని విషయమంతా తెలిసికొన్నప్పుడు తన తెలివితక్కువకు ఎంతైనా చింతపడుతూ ఉండగా, చినఅక్కిన తాతగారిని చూచి “తాతయ్యగారూ! మీరేకాదు, ఎంతమందైనా మేము నిజంగా దొంగలము అయిపోయామనే భయపడినారు. తరువాత మేముకాకతీయ రాజ్యానికి విరోధుల్ని హతమారుస్తూ వుండడముచూచి మా చరిత్ర అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఉండేవారు” అని నవ్వుతూ అన్నాడు.

తాత: నాయనా! పెద్దవాడిని, లోకంలో తెల్ల గాఉన్నవి పాలు నల్లగా ఉన్నవి నీరు అని నమ్మేవాణ్ణి. అందుచేత అలా బాధపడ్డాను.

ఆ రాత్రి శయనమందిరమునకు చినఅక్కిన భార్య సౌందర్యనిధిలా వచ్చింది. దంపతుల అన్యోన్యసల్లాపాలలో అక్కిన “రాచకార్యాలేమిటి చెప్పవూ?” అని నవ్వుచూ ప్రశ్నించెను.

భార్య: మా అన్నగారు అలా దిగాలుపడి ఉంటున్నారు. అన్నాంబికాదేవి తండ్రితో ఆదవోని వెళ్ళలేక వెళ్ళింది. నాకూ ఆ రాజకుమారికి ఎంతో స్నేహం కలిసింది.

భర్త: అంటే నీ ఉద్దేశం?

భార్య: ఏమిటా? మీ ఉద్దేశమేమిటో నాతో చెప్పారుగనుకనా? నా ఉద్దేశం మీతో చెప్పటానికి? అనుచు ఆమె పకపక నవ్వింది.

అక్కిన: “దొంగపిల్లా! నాతో వేళాకోళం చేస్తావా? నీ పని పడతా ఉండు” అనుచుండగా ఆమె పకపకమంటూ పరుగెత్తింది. అత డామె వెనుక పరుగిడినాడు.

3

రుద్రదేవి తన భర్తను తానే వరించెను. ముమ్మడమ్మకు చాళుక్య ప్రభువు అంటే ప్రేమ కుదిరిఉండాలి. భార్యాభర్తలిద్దరూ తోడికోడళ్ళయినారు. చాళుక్య వీరభద్రుడు చక్రవర్తి అవుతాడా? ఇకముందుకూడా రుద్రదేవి పురుషవేషంతోనే ఉంటుందా? ఈలా లోకమంతా విచిత్రముగా చెప్పుకుంటున్నది.

ఒక శుభముహూర్తమున పేరోలగంలో శివదేవయ్యమంత్రి సభ్యులందరితోనూ “శ్రీ రుద్రదేవితప్ప ఈ కాకతీయ మహారాజ్యానికి చక్రవర్తులు ఇంకొకరు కారు. వారికి పుత్రులు ఉద్భవించి రాజ్యార్హత పొందేవరకు రుద్రదేవ చక్రవర్తులే రాజ్యం చేస్తారు. చాళుక్య వీరభద్రమహారాజు ఈ విషయం అంతకూ తమ అనుమతిని దయచేయించారు. వివాహముహూర్తము కార్తాంతికులు పెట్టు తున్నారు. ముమ్మడాంబికా వివాహముహూర్తమూ, ఆ ముహూర్తం దగ్గరనే ఏర్పాటవుతవి” అని తెలియజేసిరి.

ఈ వార్త వినగానే సభలో విజయధ్వానాలు మిన్నుముట్టినవి.

ఆ సామ్రాజ్యాభిషేకమహోత్సవ సందర్భంలో రుద్రదేవి స్వయంవర మహోత్సవము జరుగుతుందని శివదేవయ్య దేశికులు అనుకొనలేదు. చాళుక్య వీరభద్రమహారాజుకూడ ఆ సమయంలో ఆలాంటి సంఘటన సంభవిస్తుందని తలచిఉండలేదు.

రుద్రదేవి మాటలు ఆయనవీనులకు శారదవీణానిస్వనములై వినిపించాయి. అమృతప్రవాహాలు తనపై విరుచుకుపడినట్టయినది. ఆయన మ్రాన్పడి నిలుచుండిపోయినాడు. ఆయన కన్నులు తళతళలాడిపోయినవి. ఆయన మోము ద్వాదశార్కులవలె వెలిగిపోయినది. ఆయన ఆ దేవి కన్నులలో పవిత్రనృత్యం చేసే ప్రేమ కాంతులూ, ఆ సుందరాంగి పెదవులలో సురభిళమయ్యే ప్రణయ మాధుర్యాలూ గమనించి, లోకలోకా లావరించిపోయినట్లు, అమృతకలశము చేతుల కందినట్లు పులకరించి, తల వంచినాడు.

రుద్రదేవి, ఆయన మెడలో చెలికత్తె లందిచ్చిన పూలహారము వేసింది.

బంగారు కవచము ధరించి రత్నస్థగిత కిరీట కేయూర కుండలాది సార్వభౌమలాంఛనాలతో, దివ్యపురుషునిలా ఎదుట వెలుగు మూర్తి మాయమై, చాళుక్య వీరభద్రమహారాజు మనోనేత్రాలకు ఆనాడు క్రీడోద్యాన వనాన చివురుటాకులప్రోవై, కరడుకట్టిన అమృతధారయై, ప్రోగుపడిన వెన్నెలకిరణాలై తోచిన దివ్యసుందరరూపం తిరిగి ప్రత్యక్షమైనది.

ఆ దండవేసే రుద్రమహారాణీ కరస్పర్శచే, ఆయన పరవశుడై సర్వమూ మరచిపోయినాడు.

వివాహములోపల చాళుక్య వీరభద్రుడు రాచకార్యాలు మాట్లాడడానికి చక్రవర్తి అంతఃపురానికి వెళ్ళవలసి వచ్చెడిది. అక్కడ చెలికత్తెలు పరివేష్టించి ఉండగా రుద్రమ ఆయనకు దర్శనమిచ్చేది. ఇద్దరూ రాజ్య వ్యవహారములు ఎన్నో సమాలోచన చేసేవారు. చెలికత్తెలు ఏదేని పనిమీద ఇక్కడకూ అక్కడకూ వెళ్ళిపోయేవారు. ఆ సుందరమందిరంలో వారిద్దరే ఉండేవారు. ఆ విషయం కొంతసేపటివరకూ వారిద్దరికీ తెలిసేదికాదు.

ఆ విషయం గుర్తించగానే ఇద్దరూ చటుక్కున మౌనం వహించేవారు.

ఒకరి నొకరు చూచి నవ్వుకొనేవారు.

ఆయన సంశయము నామె గ్రహించి,

“ప్రభూ! రండి. నా గానమందిరానికి పోదాము” అని ఆహ్వానించేది.

రుద్రదేవి గానమందిరంలో చాళుక్య వీరభద్రుడు దంతపీఠాలపై ఉన్న వివిధదేశ విపంచులు చూచినాడు. అప్పుడు దేవి నవవధువులా సిగ్గుపడుతూ అక్కడ ఉన్న ఆంధ్రవీణ శ్రుతిచూచి, వేగవాహినీరాగానికి మెట్టు సవరించి, “సరిగ పధప” అని ఆరోహణమూ, “పధప గరిస” అని అవరోహణమూ అయిన మధుర మోహనరాగాన్ని ఆలాపించినది. వేగవాహిత మిశ్రరాగము.

ఆ రాగము హిమాలయాలలో ప్రవహించే మందాకిని.

నవయౌవన హృదయంలోని ఆవేగము ఏలాంటిదో వేగవాహినీరాగ మట్టిది. జౌడవ షాడవ రాగజన్య మవడంచేత దేవతలకు; మనుష్యులకు ఉద్భవించిన విద్యాధరివంటి దా రాగము.

మంచు కరగినది; అతిశీతలాలైన ఆ నిర్మలప్రవాహ నీరాలు జలజల ప్రవహించాయి. రాళ్ళపై విరిగినాయి; సుళ్ళుతిరిగినాయి, అతివేగంగా పారిజాత కుసుమపరిమళ పూరితమైన ఆ ఎత్తైన దేవభూమి లోయలలో పతనాలతో ప్రవహించాయి. వేగవాహినీ రాగస్వరా లా నీరాలు!

చాళుక్య వీరభద్రు డా రాగసౌందర్యంలో కరగిపోయి, ఆ దేవి రూపసౌందర్యంలో లయమౌతాడు.

సిగ్గుపడుతూ చిన్న బాలికలా రుద్రదేవి దీర్ఘ పక్షాల నెత్తి, ఒకలిప్త మాత్రం చాళుక్య వీరభద్రుణ్ణీ గమనిస్తుంది. ఆమెను చూచి ఆతడు, ఆతని చూచి ఆమె సిగ్గుపడతారు. కన్నులు నిమీలితాలు చేసుకుంటారు.

ఆమె తన తీయని కంఠమెత్తి ఆ వీణకు మేళవించి, అన్నాంబిక రచించి తనకు నేర్పిన పాటను వేగవాహినీ రాగంలో పాడింది.

“ఎవరున్నారు, ఈ నీలకాదంబినీమాలలో ఎవరున్నారు చంచలా!

 తళుకుమనిపోయావు దశదిశలు వెలిగించి
 బిలుకుమని కనులు మూతలుపడెను చంచలా
ఎవరున్నారు?

 గంభీరమై ఏవొ గళమాధురులు గురిసె
 గరళకంఠుని దివ్య గాంధర్వమా ఏమి?”

4

విజయదశమికి శ్రీగోన గన్నారెడ్డి పట్టాభిషేకమహోత్సవం వర్థమానపురంలో జరుగవలసిఉన్నది. గన్నారెడ్డిని ఎంతమంది వేడినా అవుననీ కాదని తెలుపడు.

చిన అక్కినప్రగడ ఎన్నిసారులు మనవిచేసినా గన్నయ్య నవ్వుతాడు. శుభముహూర్తంలో శ్రీ రుద్రదేవికీ శ్రీ చాళుక్య వీరభద్ర మహారాజుకు, శ్రీ ముమ్మడాంబికా రాజకుమారికీ శ్రీ చాళుక్య మహాదేవరాజుకు లోకాతీతమైన ఉత్సవాలతో వివాహా లయ్యాయి. ఇవన్నీ శ్రావణమాసంలోనే జరిగాయి.

సార్వభౌమ పట్టాభిషేకానికి వచ్చిన చుట్టాలందరు వివాహాలకు ఉండిపోయినారు. రుద్రదేవి చెల్లెలయిన శ్రీకోట గణపాంబాదేవి అక్కగారి ఆనందము చూచి, తానూ ఆనందముతో ఉప్పొంగిపోయినది. అక్కగారిని కౌగలించుకొని “అక్కగారూ! ఇన్నాళ్ళకు మీ మోము శరత్కాల పూర్ణిమలా వెలిగిపోతున్నది. ప్రేమ అలాంటిది. కాదంబరి కథ ఎరుగరా! ప్రేమపూరితజీవి తన విధానం మరుగైనచో ప్రాణాన్నికూడా పోగొట్టుకొంటుంది. మాబావగారు ఉత్తమపురుషులు, తమకు చక్రవర్తిత్వం అక్కరలేద్య, శ్రీ రుద్రదేవీనాథులుగా మాత్రం ఉంటామనీ అనడం ఎంతో ఉదారంగా ఉంది.”

“చెల్లీ! మీ భార్యాభర్త లిద్దరి ప్రేమమయజీవితము, ఆదర్శరూపం సుమా! మా మరదిగారు రాజ్యపరిపాలక సగం నీకే వదిలారనీ, నువ్వు స్త్రీలకు ప్రసూతి వైద్యాలయాలు, ఓడవర్తకులకు యవ సువర్ణాది ద్వీపాలలో వైద్యాలయాలు, పశువైద్యాలయాలు, సత్రాలు, విద్యాశాలలు, ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నావనీ, దేశంలో మరణదండన రద్దుచేశావనీ, ప్రతిగ్రామానికీ వ్యవసాయాభివృద్ధికి చెరువులు తవ్విస్తున్నావనీ నాకు ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.”

గణ: అక్కగారూ మీకుగన్నారెడ్డి కుడిభుజం కావడం మా కందరకూ మహాభాగ్యమయింది. మమ్మల్ని మా రాజ్యాన్నీకూడా కోట పేర్మాడిరాయని దౌష్ట్యాన్నుండి ఎంత ప్రజ్ఞతో రక్షించా రాయన.

రుద్ర: అవును చెల్లీ! మొన్న మేమంతా దేవగిరిలో ఉన్నప్పుడు గొంక ప్రభువు కుమారుడు సుబ్బనాయకుడు తెచ్చినవార్తవిని వెంటనే రాపాక భీమునిపై ఉరికాడు. భీముడు గోదావరితీరంలో దుర్గమస్థలంలో ఉండి అజేయు ణ్ణనుకున్నాడు.

గణపాంబ: గన్నయ్య పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుంది? మావారు రవ్వలతో వెలిగే ఒరతోనూ, రత్నపు పిడితోనూఉన్న మహాకరవాలం ఒకటి గన్నయ్యకు బహుమాన మిద్దామని సంకల్పించుకున్నారు.

రుద్ర: గజదొంగల జట్టంతా విడిపోయారుగాని గన్నయ్య ఓరుగల్లు వదలివెళ్ళడు.

గణ: అక్కగారూ! ఎంత విచిత్రం చేశారు మీరు! శ్రీ శివదేవయ్య దేశికులవారూ ఒప్పుకొన్నారటగాదా వారంతా గజదొంగజట్టు కావడానికీ?

రుద్ర: ఊరకే ఒప్పుకోవడం కాదు చెల్లీ! మేమంతా యువకులం, ఆ జట్టుకు పురుషవేషంలో ఉన్ననేను నాయకుణ్ణి; నా కెప్పుడూ కుడిచేయి గన్నారెడ్డి ప్రభువే. గన్నయ్య, చినఅక్కినమంత్రి వేసే ఎత్తులు నాకు మహా ఆనందం కలిగిస్తూ ఉండేవి.

గణ: ఇంతకూ మీరు వేసిన ఎత్తులన్నీ ఫలించినవి. రుద్ర: అన్నింటికన్నా ఆశ్చర్యమేమిటంటే చిన్నతనంలో గన్నభూపతి నాయకుడు కాగలడని అనుకున్నానుగాని ఇంతటి అతిరథుడవుతాడని అనుకోలేదు. ఏమి వ్యూహాలు! ఏమి యుద్ధం! అర్జునుడు పాఠాలు నేర్చుకోవాలి.

గణ: ఆ బలం, ఆ బుద్ధి, ఆ రూపం! మనకు అన్నగారులేని లోపం ఆయనవల్ల తీరింది.

రుద్ర: అవునుతల్లీ! మనకాయనే అన్నగారు.

తన్నుగురించి ఈలాంటి సంభాషణ జరుగుచున్నదని గన్నారెడ్డికి ఏమి తెలియును? తన నగరిలో రాత్రి భోజనానంతరము ఆయన పర్యంకము పై అధివసించి కనులు మూసుకొని పండుకొని ఉన్నాడు.

ఇంతలో అక్కిన అక్కడకు వచ్చెను.

అక్కి: మహారాజా! కనులు తెరవండి. కనులుమూసికొని పగటి కలలు కనుటకంటె గంధర్వాశ్వాలను అధివసించి ఈ వెన్నెలలో తిరిగివద్దాం రండి.

గన్న: అందుకనే నేను నీకు వార్త పంపానయ్యా బావగారూ!

ఇద్దరూ ఉత్తమాజానేయాల నధిష్టించి ఆ వెన్నెలలో ఓరుగల్లునగరందాటి, వేగం ఎక్కువచేసి ఉత్తరాభిముఖులై మాటలాడకుండా వెళ్ళుచున్నారు.

నాలు గైదు గవ్యూతులదూరం వెళ్ళగానే గుఱ్ఱాలవేగము కుదించి, పిమ్మట ఆపినారు. అక్కడ మామిడితోపులు, ఒక పెద్ద చెరువు, ఒక చిన్న గ్రామం, గ్రామ మధ్యమందు దేవాలయం కనబడుచున్నవి.

ఇద్దరు గుఱ్ఱాల పై వెన్నల్లో ఆ చెరువును, తోటలను, ఆకాశాన్ని నీటిలో ప్రతిఫలాలను, చిరుమేఘాలను, తనచుట్టూ ఆవరించిఉన్న వెన్నెలను గమనిస్తూ వెన్నెల్లో అప్లావితులౌతూ, అలా కదలక మెదలక బొమ్మలులా అయిపోయారు.

అలా వారు నాల్గయిదు ముహూర్తములకాల మున్నారు. ఆ వెనుక నిట్టూర్పు విడుస్తూ గోన గన్నారెడ్డి గుఱ్ఱమునుండి దిగి, కళ్ళెము గుఱ్ఱపుమెడపై విసరివేసి గుఱ్ఱాన్ని బుజంతట్టి, ‘గజదొంగల ఎకిమీడా! తిన్నగా ఆహారం మేసుకో, ఆ గడ్డిలో నీకడుపు నిండినంత; వెన్నెలతో నిండిఉంటుంది, దాని రుచి నీకే తెలుస్తుంది’ అని వదలినాడు.

“నా గుఱ్ఱానికి వెన్నెల అక్కరలేదయ్యా. ఇంత పచ్చిదనం ఇంత రసపూర్ణత ఉన్నగడ్డి కావాలిగాని!”

గన్నా: అవును. నా గుఱ్ఱం గంధర్వాశ్వమే!

అక్కి: రెక్కలేవి?

గన్నా : నీబోటి మానవులకు అవి కనపడవు! అక్కి: ఈ గంధర్వాశ్వం ఎక్కి ఏ గంధర్వలోకమో వెడదామని మా బావగారి ఉద్దేశం!

గన్నా: ఎందుకు బావా గంధర్వలోకం? ఇక్కడి నిర్వాహము చాలకనా?

అక్కి: ఏం? చంద్రాపీడునివలె ఏ కాదంబరినో దర్శింపవచ్చునుగా?

గన్నా: తాము పుండరీకులు కాబోలు. అయితే నీకు విరహ వేదన లేదు కాబట్టి బ్రతికిపోయినావు!

అక్కి: అమ్మయ్యా దొరికినాడయ్యా దొంగ! కాదంబరి కోసమా విరహం?

గన్నా: కాబోయే మామగారితో, చంద్రాపీడునికి విరోధము!

అక్కి: విరోధమేమి? ఒక వేళ ఆ గంధర్వరాజు హృదయంలో వెనకటి ఆలోచనలన్నీ ఉన్నాయే అనుకొందాము. కాని రెక్కలు తెగినపక్షిలా ఉన్న ఆ గంధర్వపతి ఏమి చేయగలడు?

గన్నా: అదేనయ్యా చంద్రాపీడుని ఆవేదనకు కారణం. మహాకవివి, ఆమాత్రం గ్రహించలేవా?

అక్కి: ఓహో! ఆ చంద్రాపీడు డెంత నిర్దయుడు! ఆవల మహాపతి వ్రత అయిన కాదంబరి జీవితమంతా వ్యధలపాలయి, చివరకు ప్రాణాలు కోలు పోవలసిందేకాబోలు!

గన్నా: హృదయధర్మ మలాంటిది బావా!

అక్కి: యువతీ యువకుల ప్రేమధర్మముకంటే ఇతర ధర్మాలు ఎక్కువనా బావగారూ!

గన్నా: మానమర్యాదలేకాదు బావగారూ! ఒక్కొక్కనిహృదయం అలాంటిది. రాచపౌరుషము అలాంటిది. రాజ్యగౌరవము, మర్యాద, దివ్యమైన ప్రేమను ముళ్ళకంచెలులా చుట్టి ఉంటాయి.

అక్కి: ప్రభూ! ఆదవోని ప్రభువును, విఠలధరణీశ మహారాజు యాదవుని కలవాలని వెళ్ళుతూన్నప్పుడు ఓడించారు, వదలినారు. శ్రీ అన్నాంబికాదేవికి ఆయన తండ్రి అగుటే అందుకు కారణం.

గన్నా: నా హృదయం, నా ఆత్మ సంపూర్ణంగా ఎరిగిఉన్న బావగారికి తెలియదా?

అక్కి: బావగారూ! అయితే రాజ్యలక్ష్మిని జయించి చేబట్టినట్లు శ్రీ అన్నాంబికాదేవిని చేపట్టండి!

గన్నా: బావగారూ! ఎంతవెఱ్ఱివాడవయ్యా! నే నెరుగని యువతి అయితే శత్రువును జయించి, బాలికను చేబట్టి ఉందును కాని నా జీవితంకన్న, నాఆత్మ ఎక్కువకాదా? అక్కినప్రగడ కంటినీరు చెమరించింది.

ప్రేమ ఎన్ని విచిత్ర మనోగతులను ఉద్భవింపచేస్తుంది! తన ఆత్మకన్న ఎక్కువగా ప్రేమించిన బాలిక నామె తండ్రి తన్ను ఆదరించి ఈయవలె. లేకున్న తన ప్రాణాన్ని, ఆ బాలిక ప్రాణాన్ని ద్వేషానికి బలి యీయడానికి ఈ మహాపురుషుడు వెరవడు.

పోనీ, తల్లిదండ్రుల విడచి అ బాలిక వచ్చినా, ఆమె నడిచేందుకు తన జన్మను రత్నకంబళివలె పరుస్తాడేగాని తన మహారాజు వివాహానికిమాత్రం ఒప్పుకోడు.

ఇక ఏదిదారి?

5

ఏదిదారి

అన్నాంబికాదేవి ఆదవోని వెళ్ళింది. తలిదండ్రులు అమ్మాయిని ప్రేమతో ముంచెత్తారు. వారిద్దరు వెనుకటి గొడవలే ఎత్తరు. ఆమె మనస్సు ఏమీ నొవ్వకుండా పువ్వులలో పెట్టినట్లు చూచుకొంటున్నారు.

కాని అన్నాంబికాకుమారి మనస్సులో ఉన్న బాధ ఎవరు గ్రహించగలరు? ఆమె తనకు తానై తల్లికిగాని, తండ్రికిగాని తన హృదయం తెలుపదలచుకోలేదు. తన హృదయం తెలిసిన చెలి మల్లికకుకూడా తల్లిదగ్గరగాని, ఇంకఎవ్వరి దగ్గరగాని ఆ ప్రస్తావన తీసుకురావద్దని స్పష్టముగా తెలిపెను.

తక్కిన చెలులకుగాని, దాసీలకుగాని, స్నేహితురాండ్రకుగాని, అన్నాంబిక పురుషవేషం వేసికొని యుద్ధము చేసెనన్న విషయమే తెలియదు. అలా పురుష వేషము వేసికొని గన్నారెడ్డికి కవచరక్షకురాలుగా వెళ్ళినది అన్న సంగతి అంతకంటే తెలియదు ఎవ్వరికీ!

ఆ మహాపురుషునికి ఎంత సేవచేస్తే తన జన్మ సార్థకమవుతుంది? తన అక్క, లోకానికి మహారాణి, సకల సద్గుణపుంజము రుద్రదేవి సామ్రాజ్ఞి, గర్వానికికాక, యశానికికాక, శుద్ధధర్మమూర్తియై రాజ్యము కాపాడిన మహాపురుషుడు లోకోత్తరుడుకాడా?

ఏశుభముహూర్తమున ఆ దివ్యపురుషుని తన రెండుకన్నులా చూచిందో అప్పుడే త న్నా పురుషునకు సమర్పణ చేసుకుంది. అందరూ తన్ను అనన్య సౌందర్యవతి అంటారు. ఆ వీరోత్తమునకు అర్పించుకొనడానికి తన సౌందర్యము ఒక అణుమాత్రం!

సౌందర్యము క్షణికము; ధర్మము శాశ్వతము. గోన గన్నారెడ్డి ప్రభువు ధర్మపురుషుడు.

ఇంక తా నా దేవతామూర్తిని ఎలా దర్శించగలదు? దర్శించడానికి వీలుండి దర్శనము చేయకపోయినా మనస్సుకు ఆరాటం ఉండదు. దర్శనముకాదు అన్న నిరాశ జీవితాన్ని మూలమంతా కదల్చివేస్తుంది.

“బాలకుణ్ణయి పది దినాలు నీకు చేసిన సేవ నాకు పదిజన్మలకు సరిపోయే సుకృతాన్ని సముపార్జించి పెట్టింది ప్రభూ!”

ఇంక ఆ స్వామికి తాను సేవ చేయనే వీలుండదా?

సేవమాట అలావుంచి ప్రాపంచకంగా ఆలోచించినా, తన కాతడు నాయకుడు. తా నాతనికి నాయిక. ప్రేమ ఎరుగని విహారాలూ, కలయికలూ వెండి బంగారాల కలయికలు! ప్రేమమూర్తులయిన భార్యాభర్తల కలయిక మేలిమి బంగారము మేలిమి బంగారము కలిసిపోయినట్లే!

ప్రేమించిన పురుషుడు ఉన్నాడనుటే ఆనందము. అతడు కనిపించిన నాడు మహదానందము. ప్రేమించిన పురుషుడు భర్తయగుట బ్రహ్మానందము. ఇంక ఆ భర్త భార్యను ప్రేమించుట బ్రహ్మానందాతీతమైన పరమేశ్వరత్వమే.

ఈ మహాపురుషుడు తన్ను ప్రేమిస్తున్నాడా! ప్రేమించకపోయిన పోనీ! తాను వైరాగ్యంతో ఆయన నామమే జపం చేసుకొనుచు కాలము గడుపగలదు.

తమ కుమారిత హృదయం కోటారెడ్డి మహారాజుకుగాని, మహారాణికి గాని ఏమి అర్థమవుతుంది!

ఇంక వరదారెడ్డికి ఆమెనిచ్చి వివాహం చేయడు. అయితే ఇక ఎవరి కిచ్చుట? బిడ్డ అందముచూస్తే దృష్టి తగులుతుందని తన మహారాణే పలుమారులు అంటుంది. అసదృశమైన తన కొమరిత అందానికి తగిన వరు డెవ్వరు?

కోటారెడ్డి ఆలోచనకు గోనగన్నారెడ్డి స్ఫురించనేలేదు. గన్నారెడ్డి విచిత్ర పురుషుడు. అతడు ఇంకను గజదొంగగానే కోటారెడ్డి మనోనయనాలకు కన్పించు చున్నాడు. ఆయన రుద్రదేవికి కుడిచేయిగా ఉన్నాడని రుద్రదేవి నిండుసభలో అనవచ్చుగాక! అబల అయిన ఆడది కాబట్టి అతడు చేసిన పనులు ఆమెకు ఉపకారాలయ్యాయి కాబట్టి ఆతన్ని పొగడింది. అతడు తాను దొంగతనంచేసి నాశనం చేసినవారు చక్రవర్తికి విరోధులయితే మరీ మంచిదని ఆలోచించాడు. అంతకన్న అతని గొప్పలేదు. ఏదో తన అక్కగారిని తీసుకొనివచ్చి, నగరినుండి పారిపోయిన మా అమ్మాయిని అప్పగించాడు. అది కొంత నయం! ఇంతకు తనకూతు రలా కోటనుండి పారిపోయేటట్లు చేయించడం ఎంత తలవంపుపని!

ఏదో, తన బిడ్డను ఎవరో ఉత్తముని కొకనికి ఇచ్చి.....

ఇంతలో పరిజనపరివేష్టితయై మహారాణి మహారాజు అభ్యంతరమందిరాలకు వేంచేసినది. మహారాజు లేచి, ఎదుర్కొని తీసుకొనివచ్చి ఒక పీఠికపై తన ప్రక్కనే కూర్చుండ బెట్టుకున్నారు.

రాజు: దేవీ! ఈలాగు దయచేశారు?

రాణి: మహాప్రభూ! అమ్మాయి వివాహం మాట ఏంచేశారు?

రాజు: నేను అదే ఆలోచిస్తున్నాను దేవీ! వందిభూపాలుని తనయుడు కందవోలు మహారాజు ఒకడు నాకు కనబడుతున్నాడు.

రాణీ: తన గురువైన గోన గన్నారెడ్డి మహారాజు వివాహం చేసుకుంటేగాని వివాహంచేసుకోననికదా ఆయన పంతంపట్టినట్టు మనమువింటిమి! రాజు: అవును మహారాణీ! ప్రయత్నముచేసి చూడవలెగదా?

రాణి: ప్రభూ! ఒక్కతే మనకు బిడ్డ! సర్వవిద్యలలోనూ సరస్వతిని మించేటట్లు పెంచారు. బాలుడయినా బాలిక అయినా ఆ ఒక్కతేగద మనకు? అమ్మాయి హృదయం ఏమిటో తెలుసుకోవద్దా?

రాజు: రాచకులాలలో వివాహాలంటే రాజనీతికి సంబంధించి ఉంటాయి. అక్కడ మన యిష్టము అయిష్టము ఎలా పనికివస్తుంది దేవీ!

రాణి: ఈలాంటి రాజనీతి పాటించే, వరదారెడ్డికిచ్చి చేయాలని పట్టు పట్టారు. అంతా వ్యతిరేకమయిపోయింది.

రాజు: మహారాణీ! ఏమిటి నీ ఆలోచన?

రాణి: ఆలోచనేకాదు, నా దృఢనిశ్చయంకూడా, అమ్మాయి ఉద్దేశం తెలుసుకొనడం మంచిదని!

ఆ మరునాడు మహారాణి కొమరితదగ్గర కేగెను. అన్నాంబిక ఎంత కాలమో విషజ్వరపీడితఅయి అప్పుడే విముక్త అయిన బాలికలా చిక్కిపోయి, ఉత్సాహరహితయై ఉన్నది. ఆమె పెద్దకళ్ళు ఇంకా పెద్దవాయెను. ఆమె నునుచెంపలు కాంతి కల్గిన బంగారు ఫలకాలులా ఊరుకున్నాయి. ఏదో నిస్పృహ! ఎప్పుడూ నిట్టూర్పు!

రాణి: తల్లీ! ఏమి అలా ఉన్నావు. వంట్లో బాగుండలేదా?

అన్నా: ఏమీ జబ్బులేదు. ఏదో దేశం మారడంచేత కాస్త నలతగా ఉంది, అంతే!

రాణి: మల్లికా, ఏమిటి అమ్మాయిగారివంట్లో? రాజవైద్యులు వచ్చి చూచారా? దాదిని పిలు.

మసలిదాది తిప్పక్క త్వరత్వరగా మహారాణికడకు వచ్చింది.

తిప్పక్క: అమ్మాయిగారికి దృష్టులు తీసివేశానండి. కులదేవతకు బలులు ఇప్పించానండి. సోది అడుగించానండి. వైద్యులచేత పరీక్ష చేయించానండి.

ఇంతట్లో అతి తొందరగా ద్వారపాలిక ఒక దాసీని వెంటబెట్టుకొని లోపలికి వచ్చి “మహారాణీ జయము! మహారాజులంవారు ఈ దాసిని తమ కడకు ఒక ముఖ్యవార్తతో పంపినారు” అని మనవి చేసెను.

రాణి: ఏమి టా వార్త?

దాసి: మహారాణీ జయము జయము! మహరాణీవారికడకు శ్రీ చక్రవర్తి కడనుండి ఒక సేనాపతి తమ దళముతో విచ్చేసినారండి. శ్రీ చక్రవర్తిగారూ, వారి భర్త శ్రీ చాళుక్య వీరభద్రమహరాజులంవారూ వారం దినాలలో సంగమేశ్వరం దర్శించుకొని, అక్కడనుండి ఇక్కడకువిచ్చేస్తారట అని వార్త తెచ్చినారు! మహారాజులంవారు ఈవారం దినాలలో అంతఃపురసిద్ధం చేయించవలసిందని కోరుతూ మహారాణిగారికి చెప్పవలసిందని నన్ను పంపించారండి. ఆ వార్త వినటంతోటే అన్నాంబిక మోము కలకలలాడి పోయింది. వాన కురిసిన వెనుక ఏరు పొంగినట్లాబాల ఉప్పొంగిపోయింది. సంపూర్ణ జ్యోత్స్నలు విశ్వము నిండినట్లు ఆమె మనస్సున శాంతి నిండినది.

“ఏమిటి మా అక్కే వస్తూంట! ఒహో! ఏమి అదృష్టము! అమ్మగారూ! మనదేశం కన్నుల కైలాసం కావాలి! మన ఆదవోని సౌందర్యరాశి అనిపించాలి! నేను మీ అంతఃపురంలో ఉంటాను. నా నగరు చక్రవర్తికోసం అలంకరిస్తాను! అమ్మగారూ! నా నగరుప్రక్క తోట ఆవలఉన్న అతిథి నగరు, మహారాజుగారికి విడిది! ఈ రెండూ నేను అలంకరింపిస్తాను. నాకు అనుజ్ఞ దయచేయండి!” అని దివ్యానందగీతంలా ఆమె తన తల్లిని వేడుకొన్నది.

తన బంగారుతల్లి ఆనందముతో ఆకాశగంగలో బంగారు కమలంలా వికసించడంచూచి మహారాణికూడా ఆనందపూర్ణ అయింది.

“అల్లాగే నాతల్లీ! అంతా నీ యిష్టం. నీ ఆనందం నా ఆనందంకాదా కన్నతల్లీ?” అని మహారాణి ప్రియమార కూతును కౌగలించుకొని మూర్థము ముద్దాడి తన నగరుకు వెళ్ళిపోయెను.

అది మొదలు దాసీజనులు ఎడతెరపి లేకుండా అన్నాంబికాదేవి ఆజ్ఞను ఆ రెండు నగళ్లు సౌందర్యపరమావధులుగా అలంకరించారు.

నగరంలోని రాజకుటుంబాల బాలికలు నాట్యంచేయడం, రాచకన్నెలు సంగీత ప్రదర్శనాలు చేయడం, సంగీత కళాభిజ్ఞులయిన వారకాంతలు కొందరు మేలుకొలుపుల గీతాలు పాడుట అన్నాంబికయే రచించి వారికి నేర్పింది.

అన్నాంబిక తల్లి గారి నగరులో ఒక భాగంలో తాను విడిదిచేసెను.

నగరం అంతా అలంకరించారు. ఆదవోని రాజ్యమంతయు అలంకరించినారు. రాజపథం పొడుగునా పందిళ్ళు, సత్రాలు, పశువైద్యశాలలు, అశ్వవైద్యశాలలు, నరవైద్యశాలలు, తోలుబొమ్మల నాటకాలు, వీధినాటకాలు, నృత్య ప్రదర్శనాలు ఏర్పాటయినవి.

ఇంక మూడుదినాలకు రుద్రదేవ చక్రవర్తి ఆదవోని వస్తుందనగా, రుద్రదేవి ఒక పరిచారికకు కమ్మనిచ్చి అన్నాంబికకు పంపెను.

చెల్లీ! నువ్వూ నేను కవలపిల్లలము. నాకు అందరాని జీవితానందఫలాలు నీవి. నిన్ను కౌగలించుకొని, నీమోముచూచి, ఇప్పుడు నాజన్మసర్వస్వమూ నిండిన నా ఆనందాన్ని నీకు అర్పించడానికి వస్తున్నా! ప్రేమమయీ! నీ అక్క రుద్రమ!” అని ఆ యుత్తరము!”

6

నాయికానాయకులు

చక్రవర్తి శ్రీ రుద్రదేవి భర్తతో ఆదవోని వచ్చుట సాక్షాత్తు పార్వతీదేవి పరమశివునితో కలసివచ్చుట, ఆదవోని రాజ్యమంతయు పండుగలతో మహానంద పూరితమైపోయినది.

చక్రవర్తి, భర్త అయిన శ్రీ చాళుక్య వీరభద్రమహారాజుతో పురవీధుల వెంట విడిదికి వెళ్ళడం అద్భుతమైన ఊరేగింపే అయినది. చక్రవర్తికి కందవోలు ఇచ్చిన స్వాగతం వర్ణనాతీతమైతే అంతకు మించిపోయింది ఆదవోనివారి స్వాగతం శ్రీ కోటారెడ్డిమహారాజుతేరు, చక్రవర్తితేరు వెనుకనే వెళ్ళుచున్నది.

చక్రవర్తి రథానికి ముందు అంగరక్షకోత్తముడైన ఒక యువకనాయకుడు ఉత్తమోత్తమ జాతికి చెందినదిన్నీ. ముప్పదిరెండు మహావాజి లక్షణాలు కలదిన్నీ, మూర్తీభవించిన వేగమయినదిన్నీ, దవళాతిధవళమైన వర్ణము కలదిన్నీ అయిన ఒక దివ్యాశ్వమునెక్కి స్వారీచేస్తూ ఉండెను. ఆ గుఱ్ఱానికి చేసిన అలంకారములే కొన్నిలక్షల బంగారు కర్షఫణాలు మూల్యము చేయునవి. ఆ ఉత్తమాశ్వముపై జితమన్మథుడు, ఉన్నతాకారుడు, సొబగుమీసాలవాడు, దీర్ఘ నయనాలవాడు, సమనాస వాడు, వేలాడే పెద్దచెవులు, ఆ చెవులకు హంసకుండలాలవాడు, నుదురు, కన్నులు, ముక్కు, నోరు, చెంపలు, చెవులు నారదవీణా గానంలా శ్రుతి కలిసినవాడూ, వీరనాయక శిరోరత్నమైనవాడు - ఆ యువకుడు విలాసంగా వెళ్ళుచున్నాడు.

సాధువైన గుఱ్ఱాన్ని స్వారీచేయవచ్చును, శక్తిచే గుఱ్ఱాన్ని లోబరచుకోవచ్చును. కాని చూపుతో, మాటతో, చేయితట్టుటతో అశ్వప్రేమను చూఱగొనే వాడే అశ్వహృదయజ్ఞుడు, ప్రౌఢతురగరేఖావంతుడు.

ఆ ఉత్తమాశ్వము, తనపై అధివసించిన పురుషుని సర్వవిశ్వంకన్న ఎక్కువగా ప్రేమిస్తున్నదన్న సత్య మా అశ్వచక్రవర్తి చూపులలో, తలత్రిప్పులో, నడకలో, చక్రాకారంగా వంచిన కంధరపు మడతలో ప్రత్యక్షమగుచున్నది.

ఎలాంటి పొగరు గుఱ్ఱమైనా, ఎలాంటి రాక్షసాశ్వమైనా ఆ యువకుని స్పర్శచే సాధువై పోవునని అతని ధృతాశ్వితసూత్రముష్టి చెప్పుచున్నది. ఎవ్వరీ సొబగులాడు! ఎక్కడో చూచినట్లున్నది. ఆదవోని సేనాపతులు, ఆదవోని రాచకుటుంబాలవారు, ఆదవోని ఉద్యోగులు అందరూ ఆ యువకుని ఎక్కడో చూచితిమనే అనుకుంటున్నారు.

ఎవరయ్యా ఈ ఉద్దతసత్వుడు! ఆయన ధరించిన కిరీట కేయూరాది లాంఛనాలున్నూ ఇదివరకు చూచినవే. నవ్వులు పూర్ణజ్యోత్స్నలులా వెదజల్లే ఆతని మోము పరిచితమైనదే! ఎవరోహో ఈ సుందరకుమారుడు!

అంతలో ఎవరో “అతడు గోన గన్నారెడ్డి” అన్నారు. “గోన గన్నారెడ్డి చక్రవర్తి ముఖ్యాంగరక్షకుడుగా వచ్చాడు. గోన గన్నారెడ్డి, గోన గన్నారెడ్డి గజదొంగ!” అన్న గుసగుసలు పట్టణమంతట ప్రాకిపోయెను.

“గోన గన్నయ్యే” ఆ మాట విద్యుల్లతలా వాడవాడలూ, భవనాలు, సౌథాలు, నగరులు, అంతఃపురాలు ప్రాకిపోయింది.

తన అంతఃపురప్రాంగణంలో అన్ని ఉత్సవవిధానాలు సంసిద్ధం చేసుకొని సముచితాలంకారదివ్యశోభనమూర్తియై, అర్థచంద్రాభిఫాలయై, తిలపుష్పసమానాసయై, దీర్ఘ వినీలపక్ష్మాచ్ఛాదితవిశాలనయనయై, నర్తిత మందహాసచంచల మధురపక్వబింబాధరోష్టియై, వేగంతో పరువులెత్తే గుండెలతో నిలుచునిఉన్న అన్నాంబికకడకు ఒక రాకుమారి వేగపునడకలతో వచ్చి ‘వదినా, గోన గన్నా రెడ్డి వచ్చినాడట’ అని చెప్పినది.

“ఏమిటీ! గోన గన్నారెడ్డి......గోన.... గో......గో.....న గన్నారెడ్డి!” అనే మాటలు ఆమె నోటనుండి వచ్చినవాయెను.

ఆమె ఒక్కసారిగా వివశత్వం పొందెను. ఆమెకాళ్ళలో బలము కరగి పోయెను. ఆమె గుండె కొట్టుకొనుట ఒక్కనిమేషము ఆగిపోయినది.

ఏలావచ్చా డా దివ్యపురుషుడు? ఎందుకు వచ్చా డా ఉత్తమ నాయకుడు? అయ్యో! ఏమహారాజు కోపానికి గురి అయ్యాడో, ఆ మహారాజు నగరానికే ఎందుకు వచ్చాడు?

తన గురువు, తన హృదయసింహాసనాధినేత, తన స్వప్నాంకిత మధుర నాయకుడు, తన దైవము తనకడకే వచ్చినాడా!

గంభీర మృదుమధుర కంఠస్వరాలతో తన్ను ‘విశాలాక్షప్రభూ’ అని పిలిచిన వన్నెకాడు!

మేటి సింహాల పూలచెండులా నాడగల పోటుమానిసి, సింహావలోకనంతో ఆంధ్రదేశం పాదాక్రాంతం చేసుకోగల వీరుడు, సర్వధర్మవిరాజిత ధీరోదాత్తుడు, కుమారస్వామి సన్నిభ సుందరుడు!

గోనవంశకలశాంబోధిరాకాసుధాకరుడు, శ్రీకృష్ణ నామాంకితుడు తన్ను వెతుక్కుంటూ వచ్చినాడా? ఆమె మోము, అరుణరాగాలతో నిండి ఉదయించే చంద్రబింబంలా ఉన్నది.

ఆమె మోము, ఆనందవీచికారాశిలా ఉన్నది.

ఆమె, ఒక్కసారి విరిసిన కలువల గుచ్ఛంలా ఉన్నది.

ఆమె ఆనందం ఆ వార్త తెచ్చిన రాకుమారి కనిపెట్టి ‘వదినా! నీ కెంత సంతోషము’ అన్నది.

ఇంతలో చక్రవర్తి నగర ముఖద్వారం దాటారని వార్త. ఇంతలో వివిధ మంగళవాద్య మేళ గీతాల తీయదనాలు పన్నీరు జల్లుచుండగా నగర ప్రాంగణంలో రథము ఆగింది.

అన్నాంబిక మందమలయానిలంవలె చక్రవర్తి రథంకడకు పరువెత్తింది.

భర్తను వారి విడిదికడ దింపివచ్చిన చక్రవర్తి, రథంనుండి వేగాన ఉరికి అన్నాంబికను గాఢమైన కౌగిలింతలో అదిమికొన్నది.

7

ప్రేమాంభోధి

రుద్రమదేవి పీఠం అధివసించగానే గోన గన్నారెడ్డిని చూచి ‘మహారాజా! ఈ బాలుణ్ణి మీరు ఎరుగుదురటకాదా?’ అని ప్రశ్నించెను.

గోన: మహాప్రభూ! యువకప్రభువును ఎరుగుదును. వీరు నాకు అంగరక్షకులుగా ఉండిరి.

రుద్ర: ఈ బాలుడు మీ సేవచేయడమే తనకు తారకమనిన్నీ, అందుకు మేము మిమ్ము ఒప్పించాలనీ చాలా ప్రాధేయపడినాడు. మాకు ఈ బాలునియందు చాలా కరుణ కలిగింది కాబట్టి మీకు వెంటనే వార్త పంపినాము.

గోన: చి.....చిత్తము మహా ప్రభూ!

రుద్ర: చక్రవర్తులమైన మాకు సేవచేయక ఇంకొకరికి సేవచేయాలనే పట్టు ఎందుకయ్యా. అని నేను చాలా కోపగించాను. కాని తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లని తగవులాడుతున్నాడు.

గోన: మహారాజా! తమరు సెలవిచ్చినట్టే నేను ఈ రాజకుమారునికు చెబుతున్నాను.

రుద్ర: కాని మన ఆలోచన లీయనకు రుచించుటలేదు. ఈ బాలుడు మీ కొలువు చేయడానికి ఈయన తండ్రిగారు శ్రీ కోటారెడ్డి మహారాజు మేము చెప్పిన విషయాలన్నీ గ్రహించి ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాకుండా తాము స్వయంగా వచ్చి మిమ్ము ప్రార్ధిస్తారట.

గోన: మహాప్రభూ!

రుద్ర: సరే! సరే! విశాలాక్షప్రభూ! మీరు ఇక వెళ్ళవచ్చును. గన్నారెడ్డిప్రభూ! మిమ్ము మా మహారాజుగారు కలుసుకోవా లనుకుంటున్నారు.

గోన: చిత్తం మహాప్రభూ!

విశాలాక్షప్రభువు ఒకవైపునకూ, గన్నారెడ్డిప్రభువు ఒకవైపునకూ చక్రవర్తికి మ్రొక్కి వెడలిపోయినారు. గన్నారెడ్డి తిన్నగా చాళుక్యవీరభద్ర మహారాజుకడకు వెళ్ళి వారి దర్శనం చేసుకొన్నారు. వీరభద్రమహారాజు గన్నారెడ్డిని చూచి, “ప్రభూ! నన్ను మీరు అపార్థం చేసుకోకుండా ఉంటే ఒక విషయం మనవి చేస్తాను. శుభకాలంలో పవిత్రసంఘటనలు మనకు కొన్ని సంభవిస్తాయి. అవి నిష్కల్మషభావంతో, పవిత్రహృదయంతో గ్రహించాలని కోరుతున్నాను. తమకు దేశికులు స్వహస్తనామాంకితమైన ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం స్వయంగా తమకీయాలని నేను తమవిడిదికి రావాలని సంకల్పించుకొని ఉండగా, తామే చక్రవర్తిగారి విడిదికి వచ్చారని తెలిసి తమ్ము కలుసుకోగోరి వార్తపంపాను” అని తెలిపినారు.

గన్నారెడ్డి సంతోషముతోలేచి, ఆ ఉత్తరమందుకొని కనుల కద్దుకొని మహారాజువారివద్ద సెలవుతీసుకొని, తన విడిదికి చేరినాడు. అక్కడ పేటిక తెరచి, కమ్మతీయగా అందులో “శ్రీ శ్రీ గన్నారెడ్డి మహారాజులను ఆశీర్వదించి -

“ప్రభూ, మీరు ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది మహోత్తమజాతిపురుషులలో ఒకరు. మీకై చిరంజీవి సౌభాగ్యవతి అన్నాంబికా కుమారి వెలసింది! ఆమెకై మీరు వెలసినారు. ఇది పరమ శివప్రీతికరం. పార్వతిని పరమేశ్వరుడు పొందకపోవడము ఎలాంటిదో, మీరుఅన్నాంబికా కుమారిని ఉద్వాహము కాకపోవడము అలాంటిది. ప్రాపంచకమైనవేవీ మీకు అడ్డం రాకూడదు. పరమధర్మమట్టిది. మేము స్వయంగా శ్రీ చక్రవర్తితో వచ్చి మీకు వివాహము, పట్టాభిషేకము జరిపిస్తాము. మిమ్ము ఆయురారోగ్యవంతులుగా, మహారాజ్యాభిషిక్తులుగా, పుత్రపౌత్రవంతులుగా శ్రీ సోమనాథదేవ దివ్యశ్రీపాదపద్మారాధకులుగా ఆశీర్వదిస్తూ శివదేవయ్య” అని చదివినాడు.

ఏమిటి? శివదేవయ్యదేశికులు! ఈ విషయంలో ఈలా చక్రవర్తి, మహారాజులు, దేశికులు అందరూ చేయిచేసుకొన్నారేమి? అనుకొంటూ అన్నాంబికాదేవిని తలపోసుకొంటూ ఆ బాలికను రత్నఖచిత సువర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి సర్వస్వము ఆ బాలికకు పూర్ణార్పణ చేయడానికి తానే సిద్ధం అయి ఉన్నప్పుడు, ఈ పూజ్యులందరూ అంతమధురాతి మధురకార్యము తనకు ఇష్టము లేదని అనుకొనుట ఎలా కలిగినది!

ఇంతలో శ్రీకోటారెడ్డి మహారాజులంగారు మంత్రితోకలసి తమరాక తెలియజేసి లోనికి విచ్చేసినారు. కోటారెడ్డి ప్రభువుకు గన్నారెడ్డి ఎదురేగి వారిరువురకు నమస్కరించి, సగౌరవముగా కొనివచ్చి ఉచితపీఠాల అధివసింపచేసి, తానున్నూ ఒక పీఠం అధివసించాడు.

కోట: ప్రభూ! తమకు సౌకర్యాలన్నీ జరుగుతున్నవో, లేదో?

గన్నా: చిత్తం ప్రభూ! మా ఇంటిలో జరిగినవాటికన్న ఎక్కువగా సౌకర్యాలు ఏర్పాటు చేసినారు.

కోట: ప్రభూ! తమచరిత్ర అంతా శ్రీ చక్రవర్తులు, మహారాజులంవారు మాకు తెలియజేసినారు. నాకు ముఖ్యస్నేహితులై మా తండ్రిగారిని ఆదవోని సింహాసనం అధివసింపజేసిన శ్రీ బుద్దారెడ్డి మహారాజుల కుమారులు, మిమ్మును గూర్చి అన్యధాగా ఆలోచించాను మందమతినై.

గన్నా: మహాప్రభూ! మీ రిలా ఆలోచించితే మేమంతా వేసినఎత్తు పారిందనటానికి ప్రబలసాక్ష్యం ఒక్క చక్రవర్తికి, శ్రీ రుద్రదేవ మహారాజులకు, శ్రీ శివదేవయ్య దేశికులవారికి తక్క, మా కుట్ర ఇంకొకరికి తెలియదు. ఇందులో తమరు ఒక్కరేకాదు పొరపడింది.

మంత్రి: గన్నారెడ్డిప్రభూ! తమశౌర్యము అర్జునునికే పాఠాలు నేర్పుతుంది. ఇంతవరకు ఈలాంటి పరమాద్భుత విక్రమచరిత్ర వినలేదు మా మహాప్రభువుగారికి విచారము అంతమైనది.

గోన: మంత్రిగారూ! మీ రెవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఆ దినాలలో కాకతీయసామ్రాజ్యాన్ని విచ్ఛిన్నంచేసే శక్తులు విజృంభించాయి. రహస్యముగా జన్నిగదేవులు రుద్రదేవ చక్రవర్తిపై కత్తికట్టినారు. అందుకు ప్రతీ అస్త్రంగా మేమాపని చేసినాము. మా పినతండ్రిగారి మాటలకులోనై మీ మహారాజు కొన్ని నెలలుతటపటాయించారు. అంతకన్న వేరులేదు. మాతండ్రిగారియందున్న ప్రేమకొద్దీమహారాజుగారు నాయందు వాత్సల్య ముంచవలసిందని మనవి.

మంత్రి: ప్రభూ! మారాజకుమారి సౌభాగ్యవతి అన్నాంబికాదేవి సకల సద్గుణగరిష్ట, అప్రతిమాన సౌందర్యఖని, అపరవిద్యాశారద. ఆ దేవిని తమకు వధువుగా అర్పించ మా మహారాజులవారు సంకల్పించి తమ్ము ప్రార్థిస్తున్నారు. గోన గన్నారెడ్డి మోము వికసించినది. ఆయన కన్నుల అమృతనీలాలు తిరిగినవి. గొంతుక అమృతబిందువులతో నిండిపోయి డగ్గుత్తికతో “మహామంత్రీ! మహారాజులు నన్ను ఈవిధంగా ధన్యుని చేస్తున్నారు” అన్నాడు.

ఆ సమయంలో గోన గన్నారెడ్డిప్రభువు, కోటారెడ్డిప్రభువుకు శ్రీరామచంద్రమూర్తిలా తోచినాడు. గన్నారెడ్డిమాటలు ముగుస్తుండగానే మంత్రిలేచి “తథాస్థు” అన్నాడు. వెంటనే రాజపురోహితులు, కవులు ఆ మందిరం లోనికి పరిజనులతో వేంచేసినారు. బేడ చెలుకినాయనిప్రభువు లోనికివచ్చి బంగారు పళ్ళెరాన కొబ్బరిబోండం, సర్వఫలాలు, పుష్పాలు, తాంబూలాలు, విలువగల వస్త్రాదులు గన్నారెడ్డి పీఠముముం దుంచినారు. గన్నారెడ్డి ఆశ్చర్యం పొందుచూ లేచి, కాబోవు మామగారు కోటారెడ్డి ప్రభువుకూ, పెళ్ళికూతురు మేనమామ బేడ చెలుకి నాయనికీ పాదాభివందన మాచరించగా వారు గన్నారెడ్డిని ఎత్తి తమ హృదయాలకు గాఢంగా అదుముకొంటూ ఆలింగనం చేసినారు.

శుభవాద్యాలు, మంగళగీతాలు మ్రోగుచున్నవి.

8

జయీభవ

చిన్నకుట్ర

ఆ తోటలో అక్కడే గోన గన్నారెడ్డి అన్నాంబికను కలసికొన్నాడు.

అందాలప్రోవైన అన్నాంబిక, అలంకారాలకే అందం దిద్దింది.

ఆమె వనవిహారం చేసింది. ఆ సాయంకాలం పూవుల వాసనలు తోటంతా కల్లోలాలు. ఆ పరిమళవాహినిలో హంసలులా, రుద్రదేవి అన్నాంబికలు నడయాడినారు.

“చెల్లీ! నేను దాక్కుంటాను. ఇక్కడే కళ్లు మూసుకుఉండు” అని రుద్రంబికాదేవి మాయమయింది.

అక్కడే గన్నారెడ్డిని తాను కలుసుకొన్నది అని ఇదివరకే అన్నాంబిక రుద్రాంబతో చెప్పిఉండడంచేత అక్కడే ఆమె కనులు మూసుకొని, రుద్రాంబిక దాగికొనినపిమ్మటకనులు తెరచి వెదకి పట్టుకొనవలెనని మహారాణి ఏర్పాటుచేసినది. ఆ ఉదయం చక్రవర్తి, గోన గన్నారెడ్డిప్రభువును రప్పించి “ప్రభూ! ఈ సాయంకాలం రాచనగరి మోసాలలో పదునాల్గవ ముహూర్తము కొట్టు నప్పటికి మీరు మా ప్రతీహారి చూపించిన స్థలమునకు పోయి, అక్కడ నేను కలుసుకొనడానికి నియమించిన వ్యక్తిని కలుసుకొని, నా యాజ్ఞగా మీరు ఆ వ్యక్తి కళ్ళకు కట్టిన చీనాంబరము విప్పవలెను. ఆ వ్యక్తి నా ఆజ్ఞ మీకు తెలియజేయగలదు.”

గోన గన్నయ్య జయ వాక్యాలు పలికి సెలవంది వెడలిపోయెను. ఏమిటి చక్రవర్తి ఆజ్ఞ! ఇంత రహస్యమేమి? ఒకవేళ కోటారెడ్డి మహారాజు వేరే ఏమీ కుట్ర సలుపడము లేదుకదా? అయితే ఈ వివాహాది సన్నాహమేమిటి?

అక్కినేపల్లి

చినఅక్కినమంత్రి శ్రీ కోటారెడ్డిప్రభువులతో సంప్రదించి, వారిమంత్రి పురోహితులతో ఆలోచించి ముహూర్తము నిశ్చయముచేసిరి. గన్నారెడ్డి వివాహము కాగానే ఇంకో శుభముహూర్తంలో తన రాణితో కలసి పశ్చిమాంధ్రరాజ్య ప్రతినిధి మహామండలేశ్వర సింహాసనం, వర్థమానపురంలో అధివసించే ఏర్పాటు చేసెను, అక్కిన.

చక్రవర్తి, గోన గన్నయ్య, కోటారెడ్డి ప్రభువులు అక్కినప్రగడను ఒక మండలానికి రాజును చేసినారు. అక్కినప్రగడ తన రాజ్యంలో అక్కినేశ్వరము కట్టించి (ఇది తర్వాత అక్కనేపల్లి అయినది) అచ్చట అక్కినేశ్వర, సోమేశ్వర, కేశవదేవతలను ప్రతిష్ఠించినాడు. అక్కినను గోన గన్నయ్యకు ముఖ్యమంత్రిగా గోన గన్నయ్యమహారాజు ప్రార్థించినాడు. చినఅక్కినప్రగడ “బావగారూ! మిమ్ము వదలి నేను ఉండలేను. నేనే మీ ఆస్థానమందుండబోకోరుతున్నాను” అన్నాడు.

“ఓ మహామంత్రీ! మహాకవీ! చక్రవర్తి ఆస్థాన శిరోరత్నంగా ఉండవలసిన మీరు నాకు మంత్రిత్వం చేయ నంగీకరించటం నాకు వరమివ్వడమే.”

అక్కిన లేచి గోన గన్నయ్యదగ్గరకు వెళ్ళగా మహారాజు లేచి, అక్కినను గాఢంగా హృదయానికి అదుముకొన్నాడు. కన్నులకుకట్టిన చీనాంబరము తడవికొనుచు చిరునవ్వు నవ్వుకొనుచు అన్నాంబిక కూరుచుండెను.

ఏలనో హృదయాన తేలె మధురామృతము
పూలు పూవులు ఒలికి సోలించె నాబ్రతుకు
తారకల వెలుగులో పారిజాతసుమాలు
చేరినవి ప్రేమకై చేయి జాపిన నన్ను

అని పాడుకొనుచున్నది. ఇంతలో మన్మథమూర్తిలా, పోతపోసిన మనోహరత్వంలా గన్నారెడ్డి అక్కడకు వేంచేసినాడు.

అన్నాంబికను చూడగానే అతని అడుగు ఆగిపోయినది. అతని హృదయము గతులు తప్పినది. అతని జీవితము పులకరించి అతని కన్నులలో పరమ పవిత్రాంబువులు గిఱ్ఱున తిరిగినవి.

ఈ త్రిలోకమోహనమూర్తికడకా చక్రవర్తి తన్ను పంపినది?

పూవుల పుటములు నేలవాలినట్లు పదములిడుచు గన్నయ్య అన్నాంబికను సమీపించి ఆమె కన్నుల వస్త్రము విప్పుచుండగా, అన్నాంబిక దొరికావు అక్కా! అని ఒక్కగంతున లేచి, గన్నారెడ్డిని కౌగలించుకొన్నది. ఇంతలో కళ్ళకుగట్టిన చీనాంబరము ఊడి క్రిందపడినది. కౌగలించుకొన్నది రుద్రాంబికాదేవిని కాదు.

అదీగాక గన్నయ్య పడపోయిన ఆ యువతిని గట్టిగా హృదయానికి అదుముకొన్నాడు. అప్పు డామె ‘ఎవరు?’ అంటూ కళ్ళుతెరచి చూచింది. ఆమె మోము ఎఱ్ఱకలువపూవులా కెంపువారింది.

ఏకారణంవల్ల నో ఇరువురు కౌగిలి వదలరు. ఇరువురూ త్రపాపూర్ణులవుతారు. తాను కౌగిలి విడిచిన రెండవవారేమనుకొందురో అని ఇరువురూ అనుకొని ఇరువురూ సెలవులువార నవ్వుకొన్నారు.

ఇరువురూ కౌగిళ్ళు వదిలారు. అన్నాంబిక ‘చక్రవర్తి!’ అని కాకలీ స్వనంతో పలికి లోనికి పారిపోయినది. గన్నయ్య ఉలికిపడి ఇటునటుచూచి ‘దొంగ విశాలాక్షప్రభూ!’ అంటూ అన్నాంబికవెంట పరుగిడినాడు. అన్నాంబిక తూలి ఒక పూపొదపై పడిపోయినది. గన్నయ్య అక్కడకువచ్చి ‘దెబ్బ తగిలినదా!’ అంటూ ఆమెను తనచేతులలోకి పూలచెండులా ఎత్తి హృదయాని కదుముకొని,

“మహారాణి! ఇన్నియుగాలు నిన్ను విడిచి ఉన్న నాదోషము నువ్వు క్షమించలేవా?” అని పెదవులు వణక పలికినాడు.