Jump to content

గురుజాడలు/కవితలు/లవణరాజు కల

వికీసోర్స్ నుండి

లవణరాజు కల

నిండు కొలువున లవణుడను రా
జుండె, జాలికు డొకడు దరిజని,
దండినృప! వొకగండు గారడి
      కలదు కను మనియెన్

అల్లపించ్ఛము నెత్తినంతనె
వెల్లగుఱ్ఱం బొకటి యంౘల
పల్లటీల్పస నొడయు నుల్లము
      కొల్లగొని వచ్చెన్

వచ్చి నిలిచిన వారువంబును
యచ్చెరువుపైకొన్న చూపున
మెచ్చ మేరలు గనకచూసెడి
       నృపుని కతడనియెన్

“ఉత్తమాశ్వంబిది సర్వేశ్వర!
చిత్రగతులను సత్వజవముల
చిత్తమలరించేని జనుమిక
        మనసుగలచోట్లన్”

చూపుదక్కగ చేష్టలుడిగెను
చూపరులు వేరగంద నృపునకు;
యేపుచెడి, వొకకొంత తడవున
        కెరిగి, నలుగడలన్

కలయజూసెను,కల్లనిజములు
కలకజెందిన మనసులోపల
మెల్లమెల్లన పూర్వజ్ఞానం
      బల్లుకొని పొడమ !

“యేడి జాలకు డేది యశ్వం
బేడు లేన్నో గడిచె” ననె నృపు
“డేడు నిమిషము లేవి ప్రభువా!”
      యనిరి తనభృత్యుల్!

కలదు లేదను రెండు భ్రాంతుల
కలయగూర్చుకు బుద్ది బలమున
కాలమహిమకు వెరగుజెందుచు
      లవణుడిట్లనియెన్

ఏడు నిమిషము లేడులాయెనొ?
యేడు నిమిషములందు యిమిడెనొ
యేడులెన్నో? యింతలంతలు
     చింత చేయునొకో!

యెక్కెనట వొక మాయగుఱ్ఱం
బొక్క నరపతి మనసు నిలవక;
యెక్కినంతనె పరవశంబై
     యెగసె నది యెటకో!

కన్ను మిన్నును కనని జవమున
కాననంబులు గడిచి యెన్నో,
యెన్న జీవం బొక్కటేనియు
     లేని మరుభూమిన్



మట్టి చనె, సంసృతిని జీవం
బట్లు, యిరులును మరులు వేళకు
తుట్టతుద కొక గున్న యడవిని
           బట్టి, గమనంబున్

మందగించిన, మానవేంద్రుం
డందుకొనె నొక కొమ్మ నల్లుకు
కిందు వ్రేలెడి తీవ; గుఱ్ఱము
          ముందువలె పరచెన్!

అడుగు పుడమిని తగిలి నంతనె,
బడలి యుంటను నిదుర పాలై
ఒడలు తెలియక వ్రాలి నరపతి
         చాగె మృతునట్లన్.

పిదప జన్మాంతరము తెరగున
నిదుర జారినవేళ కన్నుల
యెదట వెలసెను వింతలోకము
         సంౙ కెంౙయన్!

“వెలుగు నీడలు కనుల కింపై
మెలగి చెలగెడు నాకసంబున
వ్రేలు మబ్బుల యంచులంటను
          రగిలె రత్నరుచుల్.

పారె పక్షులు పౌఁజు పౌఁజుల;
జీరె కోయిల లొకటి వొకటిని;
దూరి గూడుల బాసలాడెను
         పిట్ట లెల్లెడలన్!



గగనరాజ్యము గ్రమ్ము వేడుక
మగటిమిని తన కళలు గూర్చుచు,
పగలు వెన్నున దన్ని సోముడు
           పైనమై వెడలెన్ !

తాడివనములు తూర్పు కొండను
గొడుగు లెత్తెను; చామరంబులు
నడిపె జీలుగులుడుగణంబులు
           దవ్వులను నిలిచెన్!

చల్ల గాలులు సాగి యలలుగ
జల్లు జల్లున రాల్చె పూవుల;
ఉల్ల మలరెను; ఆక లొక్కటె
           బడబవలె నడరెన్!

అంత చెవులకు దవ్వు దవ్వుల
వింత గానం బొకటి సోకెను;
సోకినంతనె పూర్వవాసన
            పిలిచి నట్లాయెన్ !

మరిచె నాకలి; మరలె నిడుములు;
పరవశుండై నృపతి, గానము
దరియ, గాంచెను శ్యామలాంగిని
           నొక్క జవ్వనినిన్.

అర మొగిడ్చిన కన్నుగవతో,
చెదరి యాడెడి ముంగురులతో,
బెదురు యెరగని బింక మొప్పిన
          బెడగు నడకలతో,

“కూటికడవను బుజముపై నిడు
వాటమది యొక మురువు గులకగ
పాట పాడెను, పాటలాధరి
          చెట్లు చామలకై !

పాట పాడెను, చెట్లుచామలు
కోటి చెవులను గ్రోలి యలరగ;
తాటి వనమున నాగి చంద్రుడు
          తాను చెవి యొగ్గన్.

ఎవని గూరిచి పాట పాడెనొ?
యెవని నామము ధన్యమాయెనొ?
లవణుడను మాటొకటి నా చెవి
          తాకినట్లయ్యెన్!

                 2

మంచివలె నిది మాయమగు నని
యెంచి, యించుక సంశయించక
కించలన్నియు తొలగి వెంబడి
           వేడి యిట్లంటిన్.

వినుము, కిన్నరి! నీకు దైవం
బన్ని శుభములు - గూర్చు గావుత!
నిన్న నుండియు నన్న మెరగని
           యాకలొక వంకన్!

“అంతకన్నను అధికతర మొక
వింత యాకలి మనసు గ్రాచెను;
యింత అంతని చెప్ప నేరక
          యిట్లు వెంబడితిన్!



అనగ కన్నియ, తిరిగి మెల్లన
నన్ను కన్నులు విచ్చి చూసెను;
పూర్ణ బ్రహ్మాండాధి రాజ్యము
             పూని నట్లయ్యెన్!

చూసి, కన్నులుడించి, మది తల
పోసి, మిన్నక తోవ సాగెను;
బాసె బింకము బెడగునడకల;
             ముగిసె గానంబున్!

పండు వెన్నెల కుముదవనిపై
నిండుగమ్మిన నీడ కైవడి
నిండె మోమున చింత యొక్కటి;
            మరల నేనంటిన్,

“అన్న మిడుటా కొన్న వారల
కెన్న సుకృత తమం బటంచును
మున్ను పెద్దలు బల్కి రది నీ
             వెరుగ కుండుదువే?

“భృత్యునైతిని నీదుమూర్తికి;
భృత్యునౌదును నీకు సుందరి!
మృత్యుముఖమున నున్న భటునకు
              నన్న మీవలదో?

చన్న బ్రతుకుల కొలిచి కుడిచిన
తెన్ను మనసుకు కొంత తోచెడి;
నిన్న యన్నదె, నేడు రేపులు
              అన్యు నెట్లగుదున్?

“మౌనమూనిన, మరల గలనని
మది దలంపకు” మంటి; కన్నియ,
గమన మించుక మందగించి
            శిరంబు వంచి యనెన్

“వన్నె మీరిన మేని పసతో
కన్ను మణగెడి రత్నరుచితో,
నన్ను తెలియక నాసచేసెద
            వయ్యొ! మాలిత నేన్,

“అయ్యకోసము కూడు కొందును,
ఇయ్యలే ననుమాట, హృదయము
వ్రయ్య చేసెడు; నాదు భాగ్యము
            కెవరి నేమందున్.

                 3

“అన్న పలుకు విసంపుభల్లము
కన్నవాడయి మనసు దూసెను
కన్నె కన్నుల నీరు గమ్ముట కాంచి
             ఖిన్నుడనై,”

కొన్ని నిమిషము లెన్ని యెన్నో
కన్న విన్నవి ధర్మముల నే
నెన్నుకొని, వొక పరమధర్మము
             నపుడు గనుగొంటిన్!

మలినవృత్తులు మాలవారని
కులము వేర్చిన బలియురొక దే
శమున కొందరి వెలికిదోసిరి
              మలినమే, మాల.

కులము లేదట వొక్క వేటున
పసరముల హింసించు వారికి;
కులము కలదట నరుల వ్రేచెడి
             క్రూర కర్ములకున్.

మలినదేహుల మాల లనుచును,
మలినచిత్తుల కధిక కులముల
నెల వొసంగిన వర్ణధర్మమ
             ధర్మ ధర్మంబే!

అనెడు నిశ్చయ మాత్మ దోపగ
వినుము, కన్నియ! యంటి యెదురై,
జనులు తెలియక పలుకు మాటకు
             జనదు వగవంగన్.

“మంచి చెడ్డలు మనుజు లందున,
యెంచి చూడగ, రెండె కులములు;
మంచి యన్నది, మాలయైతే,
             మాల నే అగుదున్!

“తెలివి యొలికెడి తేట కన్నులు
మురువు గులికెడి ముద్దు మోమును
వేల్పు చేడియలైన నేరని
             గాన మాధురియున్,

“చిత్తరవులందైన గనని ప
విత్రరూపపు సౌష్టవంబును,
ఉత్తమోత్తమ జాతిలక్షణ
             యుక్తి సంపదయున్.

“మాల యనువారున్న, వారల
మందబుద్దికి వగవవలె; తన
యందు లేని కొరంత కలదని
          వగవగానేలా?”

“నమ్ము నేనను మాట తెరవ! భ
యమ్ము వాయుము; కూటినిడి చే
కొమ్ము నా హృదయంపు రాజ్యము
          నిస్సపత్నముగాన్.”

వినియె వ్రీడా విస్మయంబులు
ఆననంబున పొడమి పోరగ
కనుల నెత్తుచు, డించుచును నను
           కాంత యిటు బలికెన్.

“తండ్రి కోసము తెచ్చు కూటిని
తిండికై యొరు కెట్టు లిత్తును?
పెండ్లియాడిన- పెనిమిటొకనికి
           పెట్ట ధర్మంబౌ!

తడవు ఆయెను; తల్లడిల్లుచు
తండ్రి నాకై యెదురు చూసును
అనుచు నన్ను తొలంగు భావము
            అతివ అగుపరచన్.

కరము బట్టి యురంబు యురమున
జేర్చి, ముద్దిడి కురులు దువ్వితి;
తాళవనమును వెడలి చంద్రుడు
            పక్కునను నవ్వెన్!

“ఆడబోయిన తీర్థ మెదురై
వేడబోయిన వరము వచ్చెను;
పెండ్లి యాడెద చంద్రు సాక్షిగ
            పెట్టు కూడంటి”న్.

మున్ను వేల్పులు వెన్ను చేతను
గొన్న యమృతము కన్న రుచులను
చెన్ను మీరెను కూడు, కన్నియ
            చేత నిడినంతన్ !

“వచ్చితివ యల్లుండ!' నీకై
వేచియుంటిని యింతకాలము;
యిచ్చితిని, చేకొమ్ము కూతులు
            ప్రాణమది నాకున్.

“వచ్చితిమి యెట నుండొ" అటబో
నిచ్చ మెండై యుండు మనమున;
పసిడి గొలుసులు, బిడ్డ నాకై
            పట్టి నన్నుంచెన్!

“ఇహము లోపలి మంచి యంతయు
యిమిడి యున్నది దీని ఆత్మను;
ముక్తికాంతై తుదకు నీ కిది
             ముందుగతి చూపున్!

“కరపినాడను పరము మరవక
యిహము నందున మనెడు మర్మము!
కోటితపముల పుణ్యఫల మిది
            కొమ్ము నీకి స్తిన్!

“మాలనైనను మలినవృత్తులు
మానుకుంటిని గురువు దయచే;
పొలములోపల పశుల మేపుచు
             పొట్ట పోషింతున్

మలినవృత్తులు మాన్పి, మాలల
వలస తెచ్చి యీ వనాంతము;
పల్లె కలదిట; ప్రాజ్ఞు లందలి .
              ప్రజలు మావారల్

పాడిపంటలు గలవు, తామర
తంపరలు మా పశులమందలు;
జంతుహింసను చేయనొల్లము;
              భూతదయ మతము!

కాని మనుజుని బుద్ది లోపల
కలవు, తన మే లొరుల కీడును
తలచు వృత్తులు; కానబోయిన
              కలచు నెవ్వారిన్.

మాన్పగలిగితి కత్తికోతలు;
మానవశమే; మాటకోతలు?
కత్తి చంపును; మాట వాతలు
              మాన వేనాడున్ !”

నాటునను గలయట్టి యిడుములు
కాటి యందును కలవు; ఓరిమి
యేటికైనను మందు; కలిగిన
              కలుగు సౌఖ్యంబుల్.”

“యేలుకొను దొండొరుల; సిరులకు
మిట్టి పడకుడు; కీడు మూడిన
నాడు కుంగకు డొరుల మేలుకు
            పాటుపడు డెపుడున్.”

అనుచు పలికెను వేదవాక్కులు
మమ్ము చేతులుబట్టి కన్నియ
తండ్రి; తొల్లిటి ఋషి యితండని
            తోచ చిత్తమునన్!

పండు గెడ్డము; నిండుకన్నుల
నిండ శాంతరసంబు పలుకుల
కడలి గాంభీర్యంబు, యొడలిని
             దివ్యతేజంబున్ !

కలిగి కూచునె రాజఋషివలె
రావికిందను రచ్చశిలపై
కొమ్మలను జొరి చంద్రకాంతులు
            మేన చెదరంగన్!

అంత నుండియు కొన్నిపంటలు
కాంతతో నట స్వర్గసౌఖ్యము
లొంది మంటిని; చక్రవర్తుల
            కొమరులను కంటిన్ !

చిత్త మా కొమరులను తగులుట
కొత్త శృంఖల యంచు మామ ని
వృత్తిమార్గముపట్టి, దేహము
           వాసె యోగమునన్!

పల్లెలోపల దొమ్ములాటలు
అల్లుకొనె, ఆనాట నుండియు
యెల్లవారలు పెద్దలగుటకు
           యెంచిచూడంగన్!

సన్నగిల్లెను సాగు పొలమున;
వున్న దెల్లను తిన్న పిమ్మట
తినిరి పెంచిన పశుల చంపుకు;
           అవియు కడతేరన్ !

చెల్లచెదురై పరచిరందరు
యెల్లదిశలను, పరచు ముందర
కొల్లకొని రేనున్న పొలమును
           పండి మేముండన్!

తెల్లవారిననుండి మేమును
పిల్లలము పడ్డట్టి పాటులు
ఝల్లుమనియెడు నొడలుతలచిన
            చాల, చెప్పంగన్!

“అడవియందలి కాయకసురులు
కుడవనేరక బడలె బిడ్డలు;
అడవి ద్రిమ్మరి కడకు ప్రాణము
            చేరి నేనుంటిన్!

“ప్రాణసఖి నను పిలిచియప్పుడు
పలికె స్మితముఖియై వినుండిక
చేయు కార్యములేదు; చెల్లెను
            ముందు గనవలయున్.

“కడకుజేరితి మీ భవంబున;
తడవులేదిక; మనసు తిప్పుకు
గడగవలె రాబోవు భవమున
           జ్ఞానసంపదకై.

“కష్టసుఖముల తీరు లెన్న న
దృష్టములు - మన సత్యవర్తన
కాచుగావుత, కావగలిగిన
           కన్న పసివాండ్రన్.

“చింతయుడుగుడు - చితిని జొత్తము
యింతకన్నను భాగ్యమున్నదె!
అంతమున మతియెట్టులుండునొ
           అట్టిగతి గల్గున్.

‘‘కలుగు భవములు కూడ నీతో
కలిసి గడుపుచు ముక్తి జెందెద-
కలదె నీ ప్రణయాతిరేకము
           కన్న సద్దతియున్?”

అనుడు, చింతలు వాసి, కైకై
జేర్చి జొచ్చితి మపుడు చితి”

                 5

పలికె నిట్టుల పలు విషాద స
మాకులేక్షణు డగుచు లవణుడు,
“కలగవల దిది మాయ సర్వం
            బనిరి శాస్త్రజ్ఞుల్.

లవణు డనియెను, బొమలు ముడివడ,
“కలగ వలదట! కల్ల యిది యట!
కలిగి నది లేదన్న యంతనె
            తొలగునట వేధల్..”

“పుస్తకంబులలోని మాటలు
విస్తరించుచు, ననుభవమ్ముల
తత్వమెరగక, శుకములగుదురు
            వొట్టి శాస్త్రజ్ఞుల్..

“యెప్పటికి అనుభూత నెద్దియొ
అప్పటికి యది నిక్కువంబే-
యెప్పుడో లోకంబు కల్లగు
             ననుట యిపుడెట్లో?”

“చిత్తమందున కీలితములై
నిత్యభేదము నిచ్చు తలపుల
నెత్తివైచును -లేరె! హా! యిది
              చెప్పగల ప్రాజ్ఞుల్?

"యెక్కడిది ఆ మాయదేశం
బెక్కడుందురు నాదుబిడ్డలు?
ఒకరైనను జూపలేరే
             నాడు ప్రాణసఖిన్?”

నృపుడు యిట్లని శోక భార
మ్మాపుకొన శక్యమ్ముగా కిరు
కేల కన్నులు మూసి, చింతా
             మగ్నుడై యుండెన్

అంత దుర్గద్వారసీమను
వింత కలకల వినగ నయ్యెను;
చెంత ద్వారకు డేగి నృపునకు
             తెల్పె "నొక మునియున్.”

వారువముపై నొక్క కన్నియ
వచ్చి నిలిచిరి ద్వారసీమను.”
“చెచ్చెరను తెమ్మ"నియె నరపతి
             నోట మాటుండన్!.

జొచ్చె నాస్థానాంగణం బపు
డప్సరాకృతి వొక్క కన్నియ;
అచ్ఛ వర్ణపుటశ్వరాజం
             బొక్క తాపసుడున్!.

పలికె తాపసు డతుల సౌఖ్యం
బధిప! నీ కౌగాక: యవనుడు,
సింధుదేశాధిపుడు, పితృసఖు
             డంపె కానుకగా.

తనదు గాదిలి పట్టి, యమ
వినయ విద్యా సద్గుణాన్విత;
కోరె నీ నెయ్యంబు; నీ గుణ
              సంపదకు నలరెన్."

“పంపె నీకీ యశ్వరాజం
బెందు లే దిద్దానికీ”డనె-
చెవిని మాటలు సోకి సోకక
           లవణు డక్కన్నెం

జూచె, స్మయ హర్షాతిరేకము
లాత్మ పెనగొన; డాసి, చేకొని
“వచ్చితివ, నా ప్రాణ సఖి” యని
            గద్దియను జేర్చెన్!


(ఆంధ్రభారతి, 1911 నవంబరు)