గురుజాడలు/కవితలు/డామన్, పితియస్
డామన్, పితియస్
వన్నె కెక్కిరి డమను పితియసు
లన్న యవనులు ముజ్జగంబుల
మున్ను: వారల స్నేహ సంపద
నెన్న సుకృతంబౌ !
ఒక్క నాడా సీమ జనపతి
యక్కజంబగు కోప భరమున
“వ్రక్కలించుము డమను శిరమ"ని
పలికె తలవరితోన్ !
చెక్కు చెదరక నిలిచి డమనుడు
“నిక్కమే కద చావు నరునకు?
యెక్క డెప్పుడు, యెటుల గూడిన
నొక్కటే కాదా?”
“మ్రందు టన్నది బొందె3 మార్చుట,
ముందు భవమున కలుగు విభవము
నందజేయుటె కాదె, యేలిక!
దండ మను మిషను ?”
“కాని యింటికి పోయి యొక తరి
కనుల జూచెద నాలు బిడ్డల;
పనులు తీర్చుకు మరలి వత్తును
యానతిండనియెన్ !”
వింత పలుకుకు విస్మితుండై
కొంత కరకరి తీరి నరపతి,
“యింత యిట్టల మిడునె విద్య”ను
చింత చిగురెత్తన్ !
అనియె నరపతి “యటులె కాని
మ్మవని కొంచము విపుల మందురు;
తనువు దాచను తగిన చోటులు
కలవు యెటు జనినన్.
“మించు చతురత మాట విరుపున
యెంచి నాడవు చెడ్డ మంచని;
పంచ ప్రాణము లందు ప్రేముడి
పరచునే? చెపుమా!
“ఆలు బిడ్డల చూతు వంటివి;
ఆలకించిన వారి శోకము,
తొలగు విద్యలు; తొలగు ధైర్యము
తొలగు నీతైనన్
“కాన నీకై తనువు నోడెడి
వాని నొక్కని జూపి చననగు;
మానవేశుని యాన తప్పిన
మాయదే జగము!”
లేచి పలికెను పితియసప్పుడు,
“రాచ సింగమ! ఒడలి కొడ లిదె!
వేచి యుంటిని బ్రతుకు ఫలముకు,
దొరికె నీ నాటన్" ||
“ఐన, చనుమనె” నవనిపతి, డా
మనుడు కొంచము తలచి, యిట్లను
“పనుపు, భటులను పనికి, యిప్పుడె
పోవ నేనొల్లన్ !”
వొకటి తలచును నరుడు మది; వే
రొకటి తలచును బ్రహ్మ వినమే?
పోక, రాకల నడుమ నడ్డము
లెన్నీ తలపడునొ!”,
“పొమ్ము, పొమ్మనె రేడు, “పొమ్మిట
రమ్ము, యీ నెల నిండు నంతకు;
లెమ్ము, చాలదె యదను పో, రా,
నడ్లు గడ్లైనన్.”
2
కడలి నడుమను కలదు సేమా
సనెడి ద్వీపము కవుల పుట్టిలు;
వాడి లేదట యినుని వేడికి
సీతు వలికైనన్-
ఋతువు కొక్కొక వింత రూపం
బతుల శోభాభాజనంబై
మతుల కొల్లల నాడు, స్వర్గం
బేమొ యా సీమ?
అందు నుండొక కొండ కోనను
సుందరంబగు భవనరాజము;
విందు కనులకు కడలి యెదురై
లీలలో లాడన్-
పక్షముల నారింజ, ఆలివు
వృక్ష షండము లుప్పతిల్లును;
ద్రాక్షపందిరు లింటి పంటలు
సొంపు పచరింపన్ !
నవ్వులకు నెనరులకు నిల్లై
నివ్వటిల్లెను భవనరాజము;
పువ్వులెత్తెను దాన నిలిచిన
మొండు మనసైనస్ !
తదియ చంద్రుం డబ్ది సోకెను;
చదల విడబడి, యిరులు బ్రాకెను;
అదను కాంచిన రిక్కమూకలు
అంతటను ప్రబలెన్ !
చారు తరముగ పసిడి పమిదల
బారు తీరి వెలింగె జోతులు;
వారి యంత్రము తళుకు ముత్తెపు
సరులు విరజిమ్మెన్
అలరు జిగురుల తోరణావళి
యలమి చుట్టెను జిలుగు కంబము
లుల్ల మలరగ నాటపాటలు
వుమ్మిరయి సెలగెన్.
ఘుమ్ము, ఘుమ్మని కమ్మతావులు
గ్రమ్మె ధూపము లాసవమ్ముల
దుమ్ము రేగెను నాటి పండువ
నిండు వేడుకతోన్ !
చుట్టలును, మిత్రులును, భ్రాతలు
చుట్టు మూగుచు డమను నడిగిరి
“యెట్టి వింతలు తెచ్చినాడవు
కలదు వేడ్క గనన్?”
పలికె డామను “యిలను ద్రిమ్మరి
పలు తెరంగుల జనుల గాంచితి,
తెలియ నేర్చితి మర్మమెల్లను
వారి విద్యలలో !”
“యెరుగ రాదని తొల్లి విబుధులు
మరుగు పరచిన మంతనంబుల
తిరుగుడులు మరలించితి, తీసితి
రాళ రప్పలలోన్ !”
“వింత నొక్కొక దాని కని, మును
యింత కెక్కుడు లేద నుంటిని;
వింత లన్నిటి వమ్ము జేసెడి
వింత వినుడింకన్”
“ఒకటే” ఆయెను రెండు మూడులు
“ఒకటే” ఆయెను కోటి సంఖ్యలు;
పెక్కు లొకటిగ జూచువాడే
ప్రాజ్ఞుడన వినమే?”
“నేను, తానను భేదబుద్దిని
రేని కాగ్రహ మొదవి డామను
కాని వాడని తలచి ప్రాణము
గోలు పొమ్మనియెన్.”
“ఒక్క వింతిది - పిరికి డామను
వొకటి వొకటికి సమము కద? వే
రొకడు నాకయి ప్రాణమిచ్చిన
చాలదా యనియెన్.”
“వింత రెండవ దిద్ది - నృపుడును,
చింత వాపుచు వల్లె యనియె, న
నంతరము నే నిటకు వచ్చితి
వింత కనగోరి -”
“కాన, మీరల నెవ్వ డిప్పుడు,
తాను, నేనను బుద్ధి తలపక
తనువు నాకై విడుచు వాడన
పలుక డొకడైనన్.”
“చింతవంతలు చిత్రితములై
అంతకానగ నయ్యె మోముల
“వింత యిదె!” యని పలికె డామను
వికసితాననుడై”
ఆట పాటలు అణగె నంతట;
మాటు మణిగెను భవనరాజము;
చాటు మాటున చార జొచ్చిరి
సఖులు చుట్టములున్.
“కల్ల జెప్పితి!” ననియె డామను
“యెల్లరెప్పటి యట్ల నలరుం
డుల్లముల!” వారపుడు “కొనుమివె
ప్రాణముల” నన్నన్.
పంజరమ్ముల నున్న పిట్టలు
మంజులారణ్యములు మరచెను;
శింజితములౌ కాలి గొలుసులు
శిక్షయని మరచెన్"
“దారిపోయే వారికొక్కటి
కారవాసర కల్పనాయెను;
దారి కాదిది దరి యటంచును
తలచుటొక వింతగ"
అనుచు, డామను డాసవమ్ముల
నాని పాడ దొడంగి మించెను;
కాని పండువ నందు కొండొక
కలక కన నయ్యెన్-
3
యెల్లి పున్న మనంగ పితియసు
యిల్లు నందొక విందు మిత్రుల
కెల్ల నాయెను, పితియసప్పుడు
పల్కె నీ పగిదిన్ !
“తెలియు వాడన నొక్కడే భువి;
తెలుపు వాడన నొక్కడే భువి;
పలు తెరంగుల సద్గుణాళికి
పట్టు వక్కండే.”
కనియు, నేర్చుట, వాని కడనే;
వినియు నేర్చుట, వాని వలనే;
అనగవలెనా, అతడు డామను
డన్న మాటొకటి?
లోకమందభిమాన ముంచియొ!
నాకు యశ మొనగూర్చ నెంచియొ,
నాకపతి, నా మిత్రు డామను
రాక నడ్డడొకొ!?”
“బ్రతికి, చచ్చియు ప్రజల కెవ్వడు
బ్రీతి గూర్చునొ, వాడె ధన్యుడు;
బ్రతికి డామను ప్రజల నేలును;
చచ్చి, నేనొకడన్.”
“మ్రందుటన్నది బొందె మార్చుట;
ముందు భవమున కల్గు విభవము
నంద, ప్రాజ్ఞుడు వగవ జెల్లునె
చెప్పుడీ” యనియెన్ !
“చదివి చెడితివి చాలున” నే నొక
“డొదవె యశమ"ని బలికె నొక్కం
“డదునునకు డామనుడు రాగా
యనియె నొక్కరుడున్.
అంత పితియసు కాంత పలికెను
కొంత గద్గదికంబు తోపగ,
“ఇంత వరకును ధైర్యమూనితి
మాట నమ్మికచే.”
వచ్చువాడయితేను డమనుడు
వచ్చు నింతకె; చావు కోసము
యిచ్చగించుచు తానె వచ్చునె
పిచ్చి వాడైనన్ !
“వత్తునన్నను, వారి వారలు
మొత్తమై, తా మడ్డుపడరే?
పొత్తులన్నవి సంపదలకే;
ఆపదల కగునే ?
వాని నను టే లింత? పతి తన
చాన నెంచక, బలగ మెంచక
తనువుమిత్రున కోడుటన్నది
తగవ? యది చెపుడా
“కష్ట సుఖముల కలిసి కుడుచుచు,
గోష్ఠి ప్రాణంబంచు నెంచుచు,
ఇష్టవర్తన నున్న చానను,
బాయుటొక మహిమా!?”
“విందు, నీల్గుట నిక్కమౌటను
యెందు, యెప్పుడదైన నొకటని;
యెందరో కల రనెడు వారలు
లేరు చనువారల్ !
“చదువు వారికి పెట్టి భ్రాంతులు
మెదడు కెక్కిన పాయ వందురు;
అదును లేదే దేనికైనను
అంద రెరుగనిదే
“పండ గలదని కాయ కుడుతురె?
తిండి యెల్లిది నేడు తిందురె?
అండ మందున చిలుక కలదని
అరచి జీరెదరే?”
బతకవలసిన కాల ముండగ
బతుక నొల్లమి కంటె పుట్టునె
బతుకు దునిమిన బతుకు భారము
పాయదే చెపుడా!
అది యటుండగ డమనుపై పగ
మది దలంచిన మానవేశుడు
బదులుగా గొనె పాప మెరుగని
ప్రాణి నేలనొకో?
“నరుని చావే కాంక్ష్య మేనియు
నరపతికి, నరులెంద రనుదిన
మరుగు వారలు యముని పురమున
కంత తనియడొకో?”
“తప్పు వొక యెడ దండ మొక యెడ
వొప్పెయని; నరపతికి దోచిన
వప్పగించెద నాదు ప్రాణము
డమను క"న్నంతన్,
నీడ వెలువడి నిలిచె ముందట
వేడ్క మోమున వెల్లివిరియగ
“వీడె డమనుం"డంచు నందరు
విస్మయము చెందన్ !
“ఆ మహామతి; అంత వేరొక
యమిత విక్రము డతని కెదురై
“డమన ! బతుకుము బతుకు మనె;
“రేడ” నిరి పలువురటన్ !
పలికె నరపతి "మిత్ర భావము
సలుపు డిక నీ సఖుడు నీవును;
అలఘు రాజ్యము ప్రేమ సంపద
కలతి యని దలతున్”
“విద్య లందలి మాయ మర్మము
దిద్ది చెప్పిందబల యొక్కతె;
విద్య లెరుగని ప్రేమ భరమును
వింతగా చూపెన్.”
వినగ తగినది వింటి నిచ్చట;
కనగ తగినది కాంచినాడను;
మనుజు లిద్దరు మగువ యొక్కతె
మాన్యు లీ జగతిన్.”
(ఆంధ్రభారతి 1910 సెప్టెంబరు)
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.