గురుజాడలు/కవితలు/ముత్యాల సరము
ముత్యాల సరము
వెల్లువగ నారోగ్య సంపద,
లుల్ల మలరుచు నిచ్చుగావుత
తల్లి భారతమాత పంచమ
జార్జి కెల్లపుడున్.
జార్జి సమ్రాట్ఛాసనంబుల,
జాజి పూవుల దండ మాడ్కిని
రాజ రాజులు శిరములందున
దాల్చి మనవలయున్.
మర్మ మెరుగని ధర్మ మనియెడి,
నిర్మలంబగు నీతి పథమున
పేర్మి ప్రజలను మలచు నేర్పరి
జార్జి మనవలయున్.
భరతఖండం బెన్న డెరుఁగని,
నిరత శాంతి నొసంగి విద్యల
నెరయ నించిన యాంగిలేయుల,
రేడు మనవలయున్.
కొల్లబోతగ జంపి శత్రుల,
ఢిల్లి, పట్టము గట్టు బలిమిని
తొల్లి నల్లని దేవుడొక్కడ
జాత శత్రునకున్.
తెల్లవారలు నీతి నిపుణులు,
ఢిల్లి పట్టము గట్టి రిపుడే
కల్ల యెరుగని జార్జిరేని,
కజాత శత్రునకున్.
నల్లవాడును తెల్లవాడును
నెల్ల శుభములగూర్చు గావుత
తల్లి మేరీ మహారాజ్ఞికి
జార్జి నరపతికిన్.
1912 డిశంబరు మాసాంతంలో పంచమ జార్జి కలకత్తా నగరం వస్తున్న సందర్భంలో 'రాజ రాజుకు బహూకరించడానికి, “రీవారాణి అప్పారావుతో చెప్పి రాయించిన గేయం” ఇది. 1929లో గురజాడ రామదాసు ముద్రించిన 'ముత్యాల సరము'లో దీన్ని చేర్చారు. (కె. వి. ఆర్. మహోదయం - 1969 ప్రతి, పుట. 154}