గురుజాడలు/కవితలు/కన్యక
కన్యక
తగటు బంగరు చీరె కట్టి
కురుల పువ్వుల సరులు జుట్టి
నుదట కుంకుమ బొట్టు పెట్టి
సొంపు పెంపారన్
తొగల కాంతులు కనులు పరపగ
మించు తళుకులు నగలు నెరపగ
నడక లంచకు నడలు కరపగ
కన్నె పరతెంచెన్
రాజవీధిని.
పసిడి కడవల పాలు పెరుగులు
పల్లెరమ్ముల పళ్లు పువ్వులు
మోము లందున మొలక నవ్వులు
చెలగ చెలికత్తెల్
వెంట నడిచిరి.
అంత పట్టపు రాజు యెదురై
కన్నె సొగసుకు కన్ను చెదురై
మరుని వాడికి గుండె బెదురై
యిట్లు తలపోసెన్
“ఔర! చుక్కల నడుమ చందురు
నట్లు వెలిగెడు కన్నె ముందర
వన్నె కాంచిన నగరి సుందరు
లంద రొక లెక్కా?
“పట్టవలెగా దీని బలిమిన
కొట్టవలెరా మరుని రాజ్యం
కట్టవలెరా గండపెండెం
రసిక మండలిలో"
నాల నడుమను నట్టి వీధిని
దుష్ట మంత్రులు తాను పెండెం
గట్టి కన్నెను చుట్టి నరపతి
పట్ట నుంకించెన్
మట్టి వచ్చిన దైవగతి కిక
దైవమే గతి యని తలంచుక
దిట్టతనమును బూని కన్నియ
నెట్ట నిటు పలికెన్.
“ముట్టబోకుడు, దేవకార్యం
తీర్చి వచ్చెద, నీవు పట్టం
యేలు రాజువు, సెట్టి కూతర,
నెటకు పోనేర్తున్”
చుట్టములు తన చుట్టు నిలవగ
భృత్యవర్గం కాచి కొలవగ
సెట్టి కరములు మోడ్చి రాజుకు
ఇట్లు వినిపించెన్.
“పట్టమేలే రాజ! బలిమిని
పట్టవలెనా? నీదు సొమ్మే
కాద కన్నియ? నీవు కోరుట
కన్న మరి కలదా
వైశ్యజాతికి వన్నె"
“గాని మన్నన జేసి మమ్ముల
బంధువర్గం, కులం పెద్దల"
ధర్మమన్నది అరసి కొంచెం
దారి కనపడితే,
“అగ్నిసాక్షిగ కన్నె గైకొని
ఆదరించుము మమ్ము, కానుక
లందుకొమ్మైం తంత వలసిన,
మనుచు జాతిన్”
నవ్వి హేళన నవ్వు, నరపతి
పల్కె, “నోహో! ధర్మ మార్గం
పట్టమేలే రాచబిడ్డకు
సెట్టి కరపడమా!
“రాజు తలచిందేను ధర్మం
రాజు చెప్పిందెల్ల శాస్త్రం
రాజులకు పేరైన పద్దతి
కాద, గాంధర్వం?”
“తడవు చెయ్యక తల్లడిల్లక
నేడు రేపని గడువు పెట్టక,
నెమ్మి గోరితివేని, కన్నియ
నిమ్ము !
లేకుంటే పొమ్ము!
“డేగ, పిట్టను పట్టి విడుచున?
కన్నె, యింటికి మరలి నడుచున,
తెమ్ము కానుక లిమ్ము, నీవిటు
వచ్చినందాకన్
కదల” నంతట సెట్టి పలికెను,
“దేవకార్యం ముందు, ఆవల
రాచకార్యం కాద, రాజా!
శలవు నీవిస్తె -
“యింటి దైవం వీరభద్రుడి
దేవళానికి పోయి యిప్పుడె
పళ్లెరం సాగించి వత్తును
పైని తమచిత్తం!”
“మంచిదే, మరి నడువు, మేమును
తోడ వత్తుము, దేవళంలో
అగ్ని సాక్షిగ కన్యకను మే
మందుకొన గలము.”
2
నాడు గుడిలో మండె గుండం
మంట మంటని ముట్టి యాడగ,
కన్న నరపతి గుండె దిగులై
పట్టు విడ జొచ్చెన్
భక్తి పరవశ మైన మనసున
దుర్గనప్పుడు కొలిచి, కన్యక,
ముక్తి వేడుచు వూడ్చి నగలను
శక్తి కర్పించెన్.
దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట
రక్త గంధం రక్తమాల్యం
దాల్చి గుండం చుట్టు నిలిచిన
జనుల కిట్లనియెన్.
“అన్న లారా తండ్రులారా
ఆలకించం డొక్క విన్నప
మాలు బిడ్డల కాసుకొనుటకు
ఆశలేదొక్కొ
కులము లోపల?
“పట్టమేలే రాజు అయితే
రాజు నేలే దైవ ముండడొ?
పరువు నిలపను పౌరుషము మీ
కేల కలగదొకొ?
“విద్య నేర్చినవాడు విప్రుడు
వీర్య ముండిన వాడు క్షత్రియు
డన్న పెద్దల ధర్మ పద్దతి
మరచి, పదవులకై
“ఆశ చేయక, కాసు వీసం
కలిగి వుంటే చాలు ననుకొని,
వీర్య మెరగక, విద్య నేర్చక
బుద్ధి మాలినచో
“కలగవా యిక్కట్లు? మేల్కొని,
బుద్ది బలమును బాహు బలమును
పెంచి దైవము నందు భారం
వుంచి, రాజులలో
“రాజులై మనుడయ్య!” ఇట్లని;
కన్య నరపతి కప్పుడెదురై
నాలుగడుగులు నడిచి ముందుకు
పలికె నీ రీతిన్
“పట్టపగలే, నట్టివీధిని
పట్టబోరే జారచోరులు,
పట్టదలచితి వింక నీవొక
పట్టమేలే రాజువట!
“కండకావర మెక్కి నీవీ
దుండగము తలపెట్టినందుకు
వుండడా వొక దైవమంటూ,
వుండి వూర్కొనునా?
“కులం పెద్దలు కూడి రదుగో!
అగ్నిసాక్షికి అగ్ని అదుగో!
కన్ను కోరిన కన్నె యిదుగో!
జాల మేలొక్కో?
“పట్టమేలే రాజువైతే
పట్టు నన్నిపు" డనుచు కన్యక
చుట్టి ముట్టిన మంట లోనికి
మట్టి తా జనియెన్!
పట్టమేలే రాజు గర్వం
మట్టి గలిసెను, కోట పేటలు
కూలి, నక్కల కాటపట్లై
అమరె
యెక్కడైతే కన్య, మానం
కాచుకొనుటకు మంట గలిసెనొ
అక్కడొక్కటి లేచె సౌధము
ఆకసము పొడుగై
పట్టమేలే రాజు పోయెను,
మట్టి కలిసెను కోట పేటలు,
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్.”
('ఆంధ్రభారతి 1912 అక్టోబరు,
“శశిరేఖ' 1912 నవంబరు)