గురుజాడలు/కవితలు/భొట్టు, సమస్యాపూరణం
స్వరూపం
భొట్టు
నూగు మీసపు కట్టు
కానరాని బొట్టు
నోటాన సిగరెట్టు
కోటు వింత కుట్టు
చేకఱ్ఱ జిలుగు వెండి కట్టు
నీలగిరి కొలను గట్టు
పై విహరించు వైష్ణవ భొట్టు.
సమస్యాపూరణం
మ. కలిచేతన్ విమతిత్వ మొందుచు మహా కామాంధకారంబునన్
కులధర్మంబు పరిత్యజించి గణికన్ గూడిమ్మ అమ్మా నినున్
బలుమార్వేడెదమంచుఁ బల్కెదరహో పాండిత్యమూహింపకే
వెలవాల్గంటి కుమారులౌదురు గదా విప్రోత్తముల్ రావణా!
(రీవారాణి అప్పలకొండయాంబకు సమస్యా పూరణం అంటే చాలా ఇష్టమట. “వెలవాల్గంటి కుమారులౌదురు గదా విప్రోత్తముల్ రావణా!” అనే సమస్యను ఆమె ఆస్థాన పండితులకిచ్చారట. గురజాడ పూరించిన పద్యమిది. కె.వి.ఆర్. మహోదయం, 1969 ప్రతి, పుట. 123)