గురుజాడలు/కవితలు/పుష్పలావికలు

వికీసోర్స్ నుండి

పుష్పలావికలు


వెన్నెల గాయు కుందములు వేళ నెరుంగక బూయ కల్వలున్
జున్నులు జూరగా గుడిపి చొక్కుల నెక్కుడు తేల్చు తమ్ములున్
జెన్ను వహించె నీ కడను చేరగ నిమ్మిక యన్యమేలనే
వెన్నుని యాన యిచ్చెదను వేడిని సొమ్ముల నండ్రు కామినుల్.

మోసములాయె లావికరొ మొన్నను నే తొగలెత్త నీ కడన్
మూసె గృహంబు చేరుతరి మోమను చందురు గానమిన్ మదా
వాసము జేరి కల్వలకు బాసట జేయుట నమ్మితేని నిన్
గాసుల నోలలార్చెదను కాదనక న్మెయి రమ్మనున్ విటుల్.

గోరుల డాలు దండలకు గూర్పగ గెంజిగి నెర్రమొల్ల లిం
పారగ జూడగా గలిగె నన్నువ తెమ్మని తీసి యింటికిన్
జేరగ తెల్లవార గని చింతిలి తారును దెల్లవారి ర
య్యూరను గల్గు లావికల యోజలు చిత్రములంచు జవ్వనుల్.

నీ దండ చిక్కువడెనే
నా దండను చిక్కటన్న నగరే ప్రాజ్ఞుల్
నీ దండ నుంచికొనుమా
వాదుడుగు మటందు రచటి వనితలు విటులున్.

అరపది మోముల సామిని
విరులవి యొక రెండొ మూడొ విరియగ జేసెన్
విరుల వ్వారిగ బఱపెడు
విరుబోడులు విటుల తూల్చ వింతయె దలపన్.



కుసుమ శర విద్దు లయ్యును
కుసుమంబులె కొందు రచటి కోవిదులు విటుల్
విసమునకు మందు విసమగు
నసమాయుధు వేటు తీట లలరులె మాన్చున్.

చూతము మీ మీ జాతుల
నాతిరొ యన విటులు బల్కె నగి లావికలున్
ప్రీతిగలదేని జాతులు
జూతురె మా జాతులెల్ల జోద్యము లనరే.

చక్కదనంబు నశ్వరము చానరొ వింటివె నీవు నా యెడం
జిక్కతనంబు జూపు టిటు చెల్లునె లోభి ధనంబు సర్వముం
బొక్కసమందు దాచు గతి బొంగెడు నా వెలలేని సొంపు నా
మక్కువనెల్ల గొంటి వొక మాట నొసంగుట భారమయ్యెనే!

చక్కదనంబు నశ్వరము సత్యమె మక్కువ లెల్ల కాలమున్
మిక్కుటమై చెలంగునొకొ, మిత్రమ చీమలు చుట్టుముట్టుచుం
జక్కెర చెల్లుదాక బలు సందడి జేయుచు వీడు కైవడిన్
జొక్కపు ప్రాయ మేగు తరి సున్న కదా మగవారి మక్కువల్!