గణపతి/పన్నెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గణపతి

2 వ భాగము

పన్నెండవ ప్రకరణము

గణపతి మేనమామభార్య గర్భముఁ దాల్చెను. ఆమెకు నెల మసలినది మొదలుకొని గణపతి తల్లికి మనస్సులో నెన్నెన్నో కోరికె లుదయించెను. ఆమె కడుపున నాఁడుపిల్ల పుట్టవలయునని యామె యిష్టదైవముల వేయివిధముల వేఁడుకొనుచుండెను. ఇల్లు వాకిలి లేక మడులు మాన్యములు లేక విద్యాబుద్ధులు లేక రూపము లేక యున్న తన కుమారునకుఁ బిల్ల నిచ్చి వాని నొక ఇంటివానిని జేయుటకు లోకములో మేనమామ తప్ప మఱి యెవ్వరు లేరని యామె యూహించి, స్వలాభ పరాయణయై యట్టి కోరికలఁ గోరఁజొచ్చెను. ఆమె మనోబల మెట్టిదో కాని యామె కాఁడుబిడ్డయే కలిగెను. బిడ్డ పుట్టగానే నాకు కోడలు పుట్టినది, కోడలు పుట్టినది, యని యామె యరచి యానందాతిశయమున గంతులు వైచెను. పురిటాలిం జూడవచ్చిన యమ్మలక్క లందఱు గణపతికిఁ బెండ్లాము పుట్టిన దని సంతోషించిరి. ఆ మాట చెవిన బడినప్పుడెల్ల గణపతి మేనత్త మొగము చిట్లించుకొని "అయ్యో! నా కూఁతురు నీ నిర్భాగ్యునకాయిచ్చి పెండ్లి జేయునది" యని తనలో ననుకొను చుండును. పురుడు సుఖముగా వెళ్లిపోయెను. గణపతి తల్లికి సోదరుని భార్యమీఁదను నామె బిడ్డల మీఁదను మునుపెన్నఁడు లేని మహానురాగము నెలకొనెను. బాలెంతరాలిని మంచముమీఁదనుండి దిగనీయక పథ్యపానములు జాగ్రత్తతోఁ జేసి పెట్టుచు, బిడ్డకు నీళ్ళు పోయుట మొదలగు నంగరక్షలు తానే స్వయముగాఁ జేయుచుండును. బిడ్డ కారు మాసములు గడిచెను. అన్నప్రాశన మయ్యెను. విద్దెములు చేయఁజొచ్చెను. అత్త తాత యను మాటలు వచ్చెను. తనకు భార్య జనియించిన దన్న సంతోషము మనంబున గలుగుచుండినను గణపతి కిప్పుడొక క్రొత్త చిక్కు సంభవించెను. అతఁడు సంగడికాండ్రతో యథేచ్ఛగఁ దిరుగకుండఁ దఱచుగాఁ దన తల్లికి మేనత్తకుఁ బనితొందరలు గలిగినప్పుడు బిడ్డ నెత్తుకొని యాడించవలసిన పను లతనిమీఁదఁ బడెను. ఇది యతని కెంతో విసుగు బుట్టించు పని యయ్యెను. బాలికను వివాహ మాడవలె నను సంకల్పము గణపతికిఁ గలదు గాని యామె నెత్తుకొని యాడించి తన పనులను జెఱుపుకొనుట కెంతమాత్ర మిష్టము లేక పోయెను. ఎంతెంత యుద్యోగములు చేయువారికైనను దీరిక లుండును గాని యే ఉద్యోగము లేక గణపతికి నిమేష కాలమైనను దీరిక లేదు. ఒకవేళ నింటికడ నతఁ డుండవలసి వచ్చెనేని నట్టి కాలము వ్యర్థము కాకుండ నతఁడు గాఢనిద్ర పోవుచుండును. ఈ బిడ్డవలన నతనికి నిద్రాభంగము మొదలగునవి గలుగజొచ్చెను. అవి యతఁడు సహింపలేక యా విషయమై గట్టిగ నాలోచించి యొక యుపాయము పన్నెను. బిడ్డ నెత్తుకొమ్మని మేనత్త గాని మేనమామ గాని తనచేతి కిచ్చి వెళ్ళగానే యొక నిముస మెత్తికొన్నట్లేయుండి మెల్ల మెల్లఁగా గిల్లనారంభించెను. గిల్లిన తోడనే బాలిక గ్రుక్కవెట్టి యేడ్చుట సహజము కదా! అంత గ్రుక్కబెట్టి యేల యేడ్చుచున్న దని మేనత్తయో మేనమామయో పరుగెత్తుకొని వచ్చి యడిగినప్పుడు గణపతి నవ్వుచు "నేనేమి చేయగలను? అది నాదగ్గఱ నుండదు. నా మొగము చూడగానే యేడ్చు"నని యుత్తరము చెప్పుచుండును. నోరులేని పిల్ల కావునఁ దన కతనివల్లనే బాధ కలిగిన దని యా శిశువు చెప్పఁజాల నందున గణపతి యాతంత్రము కార్యసాధనమని పలుమాఱుఁ బ్రయోగింపఁ జొచ్చెను. ఈ ప్రయోగము వలన బాలిక గణపతిని జూడఁగానే పెద్దపెట్టున నేడ్వ నారంభించెను. "చూచినారా! అది నన్ను జూడగానే యేడ్చుచున్నది. నా మాట మీరు నమ్మరు!" అని గణపతి మేనమామతో మేనత్తతో ననుచుండును. ఒకటి రెండు సారులు బాలిక మేనెఱ్ఱగాఁ గందియుండుటఁ జూచి మేనత్త "ఏమోయీ గణపతీ! దీని కాలిమీఁద నెఱ్ఱగా కందిన దేమి? వీపుమీఁద నెత్తురు గ్రమ్మినట్లున్న దేమి?" యని యడిగెను. "కండచీమలు కుట్టినవి కాబోలు!" నని యతఁడు బదులు చెప్పెను. "నీ చంకనుండఁగా కండచీమ లేలాగున వచ్చి కుట్టినవోయి?" యని యామె మరల నడుగ "సరి సరి! బాగున్నదిలే! కండచీమలు కుట్టకపోతే నేను గిల్లినా ననుకొన్నావా? రక్కినా ననుకొన్నావా? ఎత్తుకుని యాడించినందు కేనో యక్షింతల గింజలు నాల్గు నా నెత్తిని వైవఁదలంచుకొన్నావా యేమి?" అని పెద్ద గొంతుకతో నఱచి బదులు చెప్పెను. అనవసర కలహము సంభవించు నని వానితో వాదింపక ఆమె లోనికిఁ పోయెను. తెనాలి రామకృష్ణుని పిల్లి పాలు జూడఁగనే పారిపోయినట్లు గణపతి మొగము జూడఁగానె బాలిక పెడమొగము పెట్టుకొని యతని కడకుఁ బోవుటయే మానెను. గణపతి కృతార్థుడయ్యెను. బిడ్డ యెంత గ్రుక్కపెట్టి యేడ్చుచున్నను మేనత్త గాని మేనమామ గాని దాని నెత్తుకొమ్మని మేనల్లునితో ననుట మానిరి. గణపతి బిడ్డను గిల్లినట్లో యేదో బాధ పెట్టినట్లో యనుమాన పడి మేనత్త సూటిపోటి మాట లనుచుండ, గణపతి తల్లి యవి సహింపక యిట్లనుచుండును. 'మా అబ్బాయి పిల్లను కొట్టినాఁడో తిట్టినాడో యని నీ కనుమానమున్నది కాబోలు? వాఁడాలాటివాఁడు కాఁడు. వాఁడెత్తికొనుట దీని కిష్టము లేదు. ఎందుచేత నంటే దానికి సిగ్గు. మావాఁడు దాని మగఁడు కనుక మగఁడెత్తికొని యాడించుట దాని కిష్టము లేదు. చిన్నపిల్ల కేమి సిగ్గని మీరనుకోవద్దు. దేవుఁడు వారి నిద్దరిని మగడు పెండ్లములుగా నేర్పాటు చేసినప్పుడు సిగ్గు దానంత టదే లోపలినుండి బయలుదేరును. లేనిపోని పాపముమాట లాడుకోవద్దు. నీకేమో గాని మా యబ్బాయి మీఁద లేనిపోని కోపము కలిగినది. మేనమామ పిల్లనిచ్చి మా అబ్బాయి నొక యింటివానిఁ జేయఁదలచు కొన్నాఁడని తెలిసి పిల్లను వాని కియ్యకుండఁ జేయవలెనని నీవీ పన్నాగము పన్నుచున్నావు. ఈలాటి బుద్ధులు నీకు కూడవు. నీకు గిట్టకపోతే గిట్టనట్టే యుందువుగాని యిటువంటి లేనిపోని నిందలు వేయకమ్మా!"

ఇట్టి మాటలచేత మనస్సులో నున్న కోపాగ్ని రగిలిమండక మానునా ? ఈ బిడ్డ మూలమున వారికిఁ దఱచుగా కలహములు సంభవించుచు వచ్చెను. ఆ తగవులు తీర్చలేక గృహ యజమానుఁడు విసిగికొని మొత్తుకొని యన్నము తినక పస్తుండి తన్నుఁ దిట్టికొని యొకప్పుడు భార్యనుగొట్టి రెండు మూడు దినము లింటికి రాకయుండును. పిమ్మటఁ గ్రమక్రమముగా వారికి సఖ్యత గలుగుచుండును. గణపతి మేనమామ నేమియు ననజాలక పోయినను దరచుగా మేనత్తను మేనమామ లేనప్పుడు సూటిపోటి మాటలని నొప్పించుచుండును. ఇట్లుండ శివరాత్రికి మేనమామ కోటిపల్లి తీర్థమున కేగ సమకట్టెను. గణపతి తల్లియుఁ దన్ను వెంటఁబెట్టుకొని పొమ్మని సోదరుని వేఁడుకొనెను. ఆ వేఁడుకోలు నంగీకరించి యత డామెం దోడ్కొని కోటిపల్లికి వెళ్ళెను. ఇంటి యొఫ్ఫ భార్యను బిడ్డని నిలిపి వారికి సహాయముగా నింటనే పండుకొమ్మని గణపతితోఁ జెప్పి యెన్నో బుద్ధులు చెప్పి మేనమామ చనియెను గాని యా బుద్ధులు మేనల్లుని కుడిచెవిలో బడి క్షణమాత్రమైన మనసులో నిలువక యెడమ చెవిలోనుండి యావ లకు బోయెను. ఒక్కనాఁడైన వేళ కతఁడు భోజనమునకు రాలేదు. ఒక్క రాత్రియైన నింటఁ బండుకొనలేదు. అట్లు రెండు దినములు చేసిన తరువాత మేనత్త గణపతిం బిలిచి 'యేమోయి ! సరిగా వేళకు భోజనమునకు రావు. చిన్నపిల్లను పెట్టుకొని నేనింట నొకర్తెను పండుకొనజాలకున్నాను' అని మందలించెను. మునుపే మేనత్తపై ద్వేషభావ మూనియున్న యాతని మనస్సున కా పలుకులు ములుకులవలె నాటి నొప్పి కలిగించెను. ద్వేషము ద్విగుణమయ్యెను. అంతమాట తన్నామె యన్నందుకు మరల నామె కేదైన పరాభవము జేయవలెనని సంకల్పము కలిగెను. ఆ విషయమై కొంతసే పతఁడాలోచింపఁజొచ్చెను. ఉపాయము పొడకట్టెను. ఆ యుపాయము భోజనసమయమం దతఁడు ప్రయోగింపఁ దలంచెను. మధ్యాహ్నము భోజనమునకు గణపతికి మేనత్త విస్తరినిండ నన్నము వడ్డించెను. ఉపాయ ప్రయోగమున కదే సమయమని గణపతి చివాలున పీటమీఁద నుండి లేచి విసవిస నడచి వీథిలోనికి బోయి దారిం జనుచున్న యొక బ్రాహ్మణుని బిలిచి లోనికిం దోడ్కొనిపోయి "అయ్యా ! చూడండి. ఈవిడ నా మేనత్త. ఎంతన్నము పెట్టినదో చూడండి ! నేను కుఱ్ఱవాడఁను కదా ! అమ్మవారికి కుంభము పోసినట్లు విస్తరినిండ రాసె డన్నము పెట్టినది. ఇంతన్నము నేను తినగలనా ? ఇది నామీఁద గిట్టక చేసిన పని కాని ప్రేమ చేత చేసిన పనియా? అన్నము తినలేక పాఱవైచిన పక్షమున తిన్నంత తిని పారవైచినంత పాఱవైచెనని నా నెత్తిమీఁద లేనిపోని నిందలు వేయుటకును, పెట్టిన యన్నము దిగబెట్టుట కాదని యేలాగో యొకలాగు తిన్నపక్షమున మా మేనల్లుడు పూటకు తవ్వెడు బియ్యపన్నము లకోటాకు మెతుకు లేకుండ తినునని వాడుకలు వైచుటకు యీమె యీపని చేయుచున్నది. ప్రతిదిన మీలాగుననే జరుగుచున్నది. ఒకసారి మీ వంటి పెద్దల కీ చిత్రము చూపించిన పక్షమున బాగుండు నని నేను మిమ్ము దీసికొని వచ్చితిని. నేనుమాత్రము అమ్మవారినా ? దున్నపోతునా ? నాది మాత్రము కడూపు గాక మడుగా యేమిటి ? " యని యా యన్నము జూపెను.

సాక్షిగా వచ్చిన బ్రాహ్మణుఁ డా యిల్లాలిం జూచి "అమ్మా ! ఇతఁడు పదునెనిమిది సంవత్సరములలోపు పిల్లవాఁడు కదా ; అంత యన్నము తినఁగలడనే మీరు పెట్టినారా ? లేక పొరపాటు చేత పెట్టినారా? కొంచె మన్నమే మొదట వడ్డించి కావలసిన పక్షమున మరల మారు వడ్డింపరాదా? రెండుసారులు తిరుగుట తప్పిదమా? పాప మా కుఱ్ఱవాఁడు మీరు పెట్టిన యన్నము ప్రోగు చూచి యడలిపోయినాఁడు. ఇదెంత మాత్రం బాగులేదు. మీ పెనిమిటి మాత్రమిటువంటి పని కొప్పుకొనునా?" యని మందలించెను. అనవుడు బ్రాహ్మణుని కామె తలుపు చాటున నొదిగి యుండి మెల్లగా నిట్లనియె. "అయ్యా ! మే రెరుఁగరు గాని మా గణపతి మామూలుగ తినగలంత యన్నమే నేను పెట్టినాను. గాని యెక్కువ పెట్టలేదు. అతని సంగతి మీకు తెలియదు. నామీఁద నేమో కోపము వచ్చి నలుగురిలో నన్ను రట్టు పెట్టుట కిట్ల జేయుచున్నాఁడు గాని నేను జేసిన తప్పు లేదు. ఆ యబ్బాయిని కంటగించుటకు నేనీలా గనలేదు. పోనీ నే నొక వేళ నిజముగా నన్న మెక్కువ పెట్టినా ననుకొన్నప్పటికీ అత్తా ! యన్న మెక్కువ పెట్టినావు తియ్యమనరాదా. మేనమామ నాలుగు రోజులు లేకపోగానే నన్నల్లరి పెట్టదలఁచినాడు." అని పలుక నా బ్రాహ్మణుఁడు "ఓరీ ! గణపతి ! నీ తల్లి వచ్చువరకు నీ వెట్లో గడుపుకొమ్మ"ని సలహా చెప్పి వెడలిపోయెను. గణపతి కోపావేశమున భోజనము చేయక యొక స్నేహితుని యింటికిఁ బోయి యన్నము దినెను. మిత్రుని యింటికి వెళ్ళినవాఁడు తల్లి వచ్చువఱకచ్చటనే భుజియించు నని మేనత్త యనుకొని, రాత్రి యతని నిమిత్తమై బియ్యము పోయలేదు. గణపతి రాత్రి భోజనమునకు సిద్ధమయ్యెను. "నీవు రావనుకొని నీకోసము బియ్యము పోయలేదు. వండిపెట్టెద నుండు"మని మేనత్త ప్రత్యుత్తరము జెప్పఁ జుట్టుప్రక్కల నున్న యాఁడువాండ్ర మగవాండ్ర బిలిచి "చూచినారా? రెండురోజులు మాయమ్మ గ్రామములో లేకపోఁగానే నాకీమె యన్నము పెట్టుట మానినది. వీళ్ళ కొంపలో నేను పొట్టకూటికున్నాని యావిడ యభిప్రాయము కాబోలు ! నే నన్నము లేక మాడి చచ్చిపోవలసినదేనా ? ఈ గ్రామములో నా కన్నము పెట్టువా రెవరు?" అని కల్లబొల్లి యేడ్పు లేడువఁ జొచ్చెను. ఆ యేడ్పు వినగానే చుట్టుప్రక్కలమ్మలక్కలకు జాలిచేత మనస్సులు కరిగిపోయెను. "మా యింటికి రా, నాయనా ! పట్టెడన్నము మా లోపల తినరా, నాయనా !" యని ముసలమ్మలు కొంద రనిరి. "నేనే వండి పెట్టెదనమ్మా ! మీ యింటి కెందుకు రావలె?" నని గణపతి మేనత్త వారితోఁ బలికెను. అందులో నొక్క ముసలమ్మ గణపతిం జూచి "నాయనా ! మేనమామ భార్య మేనత్త కాదు. పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు. నీ సంరక్షణము నీ తల్లికి విధాయకము గాని మేనత్త కేమి విధాయకమురా? ప్రేమ చేత పేగు పెరపెర కోసికొనిపోవు చున్నదా యేమి? రా నాయనా? నే కెంతన్నము కావలె? నాలుగు మెతుకులు. నీ వన్నము తినకుండ యీ రాత్రి పండుకున్నావన్నమాట మీ యమ్మ వింటే గొల్లున యేడ్చి మొత్తుకొనును. లేక లేక వరప్రసాదిలాగు నొక్కడవు పుట్టినావు. నీమీఁద గంపెడాశ బెట్టుకొని ఆ ముండ యున్నది. అన్నము తినక చచ్చిపోకు. మా యింటికి రా! యని చేయు పట్టుకొని నాలుగడుగులు వెనుకకుఁదీసికొని పోయెను. అది చూచి మేనత్త కోపించి " నా మేనల్లునిం దీసికొని పోవుటకు నీవెవతవు? అనుకొన్నప్పుడు నాల్గుమాట లనుకోగలము, లేనప్పుడు కలియగలము మాకు మాకు విధాయకము 'సత్తిరాజువా రింటికి నీ వెక్కడి తొత్తు' వన్నట్టు, నడుమ నీ వెవ్వరమ్మా? అన్న మీ రాత్రి పెట్టగలవు గాని యెల్లకాలము పోషింప గలవా? మేనమామ పెళ్లాము మేనత్త గాదని నోటికి వచ్చినట్లన్నావు. నీవా యబ్బా యికి మేనత్తవా, తల్లివా, పెత్తల్లివా ? యెవతెవని పిలిచినావు? చాలు చాలు నోరు మూసుకో!" యని కఠినముగాఁ బలికెను. మాటఁమీద మాట వచ్చెను. మాటలు తిట్లుగా మారెను. బారలు చాపుకొని వారిద్ద రొండొరులను దూషించుకొనుచు, తలిదండ్రులను చుట్టాలను బ్రతికియున్నవారికి చచ్చినవారిని నన్యోన్య మాతృవంశమున నేడు తరముల వారిని నిందించి, దెప్పుకొని గొంతులు పోవునట్లఱచి పోరాడి, కలహ మాడుట కోపిక లేక లోపలికిఁ పోయిరి. గణపతి తన పక్షము వహించిన ముసలమ్మను వెనుక వైచికొని మేనత్తను నాలుగు మాటలని యెట్టకేల కారాత్రి ముసలమ్మ గృహమందే భుజించి పండుకొనెను. గణపతి మరునాడు కూడ ముసలమ్మ యింటనే భోజనము చేయదలచెను. గాని గణపతి భోజన వైఖరి రాత్రి చూచిన తరువాత ముసలమ్మ గుండె బాదుకొని యట మీఁద వానె నెట్లయిన వదలించుకొనవలెనని తలంచి యుదయముననే గణపతిం జేరఁ బిలిచి " నాయనా ! ఈ పూట వెళ్ళు ! నా బియ్యము పోయ వలసినదని చెప్పు. పోయనంటే మా యింటి యొద్ద తినవచ్చును. ఎందుకు పెట్టదో చూడవలె దీని బాబుగారి ముల్లె తెచ్చిపెట్టు చున్నదా యేమి? నీ మేనమామ సొమ్మేకదా నీకు పెట్టుచున్నది. వెళ్ళి చెప్పిరా, యేమనునో చూత" మని మెల్లఁగా నుపదేశించెను. సరేయని చివాలున లేచి గణపతి యింటికిఁ బోయి "ఇదిగో నమ్మా ! ఈపూట మన యింటికే భోజనమునకు వత్తును. వంట చేయ వలసినది" యని చెప్పెను. "సరే" యని మేనత్త యూరకుండెను. ఆ మాట ముసలమ్మతో మరల జెప్పెను. ముసలమ్మ తన కొంపలో నుండి గణపతి వెడలి పోయినందుకు మనస్సులో మిక్కిలి సంతోషించి ప్రేమ ముట్టిపడునట్లుఁ బై కిట్లనియె. "ఓరీ ! గణపతి ! నీవు గుప్పెడన్నము మాయింట తిన్నంత మాత్రమున నాకు లోటు లేదు. నీ యిష్టము ఎక్కడ తిన్నా సరే. నీ యింటికి వెళ్ళుటకు నీ కిష్టము లేకపోయిన పక్షమున మా యింటనే తిను; కాని, దానింటికి వెళ్ళి దాని పొగ రణచవలె. రాఁగానె యీ సంగతులు మీ యమ్మతో చెప్పి మీ మేనమామతో చెప్పి చావగొట్టించు. ఒక్కమాటు జాతరైతేగాని బుద్ధి రాదు. పొగరెక్కి యున్నది. కట్టు పొగరుబోతు. గిద్దెడుప్పు నేను బదులు పుచ్చుకున్నాను. ఇరువదిసార్లు తిరిగి నిలువబెట్టి పుచ్చుకున్నది. ఉప్పు బదులు తీర్చక దీని ఋణమున నుండిపోదునా? దాని బుద్ధి యది చూపించుకొన్నది. గాని, మీ మామతో నేను కూడ చెప్పి ధూపమువేయ తలచుకొన్నాను. నీవుకూడ గట్టిగా చెప్పు. మేనల్లుడంటే ఇంత కిట్టకపోనా? గిట్టని వాళ్లున్నారు. అన్నము పెట్టనివా ళ్లెక్కడా లేరు. దాని సాంప్రదాయ మేలాటిది? దాని బామ్మ పెనిమిటి కన్నము పెట్టక వెళ్లకొట్టింది. ఆ ముసలివాఁడు హోరున నేడ్చి కాశీ రామేశ్వరాలు వెళ్లి యెక్కడనో చచ్చిపోయినాఁడు. ఇందుకే ఆడపిల్లను తెచ్చుకొనేటప్పుడు సాంప్రదాయాలు చూచి తెచ్చుకోవా లన్నారు. మనము తగిన ప్రాయశ్చిత్తము దీనికి చేయవలె. సరే, నాయనా ! నేను మడి కట్టుకోవలె నీవు వెళ్ళు. అన్నానికి మట్టుకిబ్బంది పడకు, నాయనా ! ఎప్పుడు లేకపోయినా నేనున్నాను" అని చెప్పి పంపెను.

గణపతి యిట్టట్టుదిరిగి రెండు జాము లగునప్పటికి స్వగృహమున కరిగి యన్నము పెట్టుమని మేనత్త నడిగెను. వెనుకటి దినమున నన్న మెక్కువ పెట్టినందుకు గొప్పయల్లరి చేసినాఁడని మేనత్త యీ దినమున గణపతికి విస్తరినిండ బెట్టక యన్నము కొంచెము తక్కువగాఁ బెట్టెను. అది చూచి గణపతి చివాలున పీటమీఁదనుండి లేచి విస విస వీధిలోనికి నడచిపోయి, దారిన వెళ్ళుచున్న బంధువు నొక్కని బిలిచికొని పోయి తన విస్తరిలో నున్న యన్నముఁ జూపి "చిత్తగించినారా ఈ దురన్యాయము! సరిగాఁ బెట్టక కడుపు మాడ్చి చంపు చున్నది. చూడండి ! విస్తరిలో నాలుగు మెతుకులు పెట్టినది. ఈ నాలుగు మెతుకులతో నా యాకలి తీరునా? పట్టెడన్నము పట్టెడుకూర తినఁగల ముండాకొడుకును గదా! ఈలాగున డొక్కమాడ్చి చంపవచ్చునా! నోరెత్తి మాటాడితే తంటా. ఎక్కువ పెట్టినా వేమంటే నాలుగు మెతుకులే పడవైచును. తక్కువ పెట్టినా వేమంటే గ్రామదేవతకు కుంభము తోడినట్లు తోడును. ఇంతకూ నా తల్లిముండ కోటిపల్లి వెళ్ళి కొంపతీసింది." అని చెప్ప, వచ్చిన చుట్ట మామె నుద్దేశించి యిట్లనియె. "అమ్మాయి! అర్థాన్నము బెట్టుట మహాదోషమని పెద్దలు చెప్పినారు. అలా గెప్పుడు చేయకమ్మా! కావలసిన దేదో పెట్టె మాట దక్కించుకో, తల్లి వచ్చినదాకా!" యని "ఓరీ గణపతి! నేనిక్కడనె కూర్చుందును. నీ వన్నము తిను. కావలసిన దేమో యామె వడ్డించకపోతే యామెనే చీవాట్లు పెట్టెదను." అని గణపతిని గూర్చుండ బెట్టి తాను ప్రక్కనుఁ గూర్చుండెను. గణపతి మేనత్త యా చుట్టము నదివరకె యెఱిఁగియుండుట చేత జాటునఁ దాగక యెట్ట యెదుటికి వచ్చి "అయ్యా! ఎగదీసిన గోహత్య దిగదీసిన బ్రహ్మహత్య యన్న సామెత నిజమైనది. మామూలుగా నతఁడు తినగలిగినంత యన్నమే నేను నిన్న విస్తరిలో పెట్టినాను. అమ్మవారికి తోడినట్లు కుంభముతోడినా నని కోపపడి యెవరో బ్రాహ్మణుని తీసుకొని వచ్చి కనుపఱచి నన్నల్లరి పెట్టినాఁడు. కావలసిన పక్షమున మారుపెట్ట వచ్చునుగదా యని నేనీ రోజు తక్కువ యన్నము పెట్టినాను. నాలుగు మెతుకులే పెట్టి కడుపు మాడ్చఁ దలఁచుకొన్నా నని మిమ్ము తీసికొని వచ్చి గొడవ పెట్టినాఁడు. ఇతనితో నేను వేగలేను. ఏదో మనసులో పెట్టుకుని పూట పూట కీలాగున నానా బాధలు పెట్టుచున్నాఁడు. అన్న మెక్కువుంటే తీయ మనవచ్చును. తక్కువుంటే పెట్టమనవచ్చును గాని వడ్డించిన విస్తరి వదలిపెట్టి వీధిలోకి వెళ్ళి, దారిన వచ్చు వారినిఁ దీసికొనివచ్చి, నన్ను రవ్వ పెట్టవచ్చునా? నావల్ల తప్పుంటే మేనమామగారితో చెప్పి నన్ను శిక్ష చేయించవచ్చును. తన తల్లితో చెప్పి చీవాట్లు పెట్టించవచ్చును. అంతేకాని పూటకూళ్ళదానిని దాసీదానిని యల్లరిచేసినట్లు ఈ లాగల్లరి చేయవచ్చునా?" అని కంటఁ దడిపెట్టుకొని గద్గదస్వరముతో మాట్లాడెను. అనవుడు బంధువుఁ డిట్లనియె. "అమ్మా! గృహకృత్యములలో నొకరు తగవు చెప్పుట కష్టము. అయినదేమో అయినది. ఆ మాట మీరు తలఁచుకోవద్దు. ఈ రాత్రియో రేపో అతని తల్లి వచ్చును. వచ్చిన తరువాత మరే గొడవ లుండవు. చిన్నతనము చేత వాడు చేసిన తెలివితక్కువ పనులు పాటింపక సర్దుకోవచ్చును. సరే; ప్రస్తుతము వానికి కావలసిన వస్తువు లొడ్డించండి. అన్నము తిన్నదాక యుండి తరువాత నా వెంట తీసికొనిపోదను." అనవుడు నామె మంచిదని కావలసిన వస్తువులు వడ్డించెను. గణపతి భోజనము చూచిన తరువాత చుట్టము గణపతి తిండిపుష్టి గలవాఁడనియు నతనికిఁ గొంచె మన్నము మాత్రమే పెట్టుట చేత మేనత్త లోపమనియు గణపతి చేసిన యల్లరికి గొంత కారణము లేకపోలేదనియిఁ దలంచెను. గృహకలహములలోఁ బౌర్వాపర్యములు విచారింపక నొకపక్షము మాత్రమే వినువారి కిట్టి యభిప్రాయములు దోఁచుట యాశ్చర్యము కాదుగదా ! ఆ సాయంకాలము కోటిపల్లి నుండి గణపతి తల్లియు, మేనమామయు వచ్చిరి. రాఁగానె గణపతి యాడిన విచిత్ర నాటక వృత్తాంత మంతయు మేనత్త తన యాడుబిడ్డతోను భర్తతోడను బూసగ్రుచ్చినట్లు చెప్పి తన కతఁడు గావించిన పరాభవమును దలంచుకొని వల వల యేడ్చెను. ఆ విషయమున భార్య నిర్దోషురా లని భర్త మనంబునకు నచ్చెను. నచ్చుటయు గణపతినిఁ జూచినంత మాత్రముననే మ్రింగి వేయవలె నన్నంత కోప మాయన మనస్సులో నుదయించెను. కాని గణపతి తల్లికి మాత్రము సోదరుని భార్య చెప్పిన నేరములు తలకెక్కలేదు. ఆమె యేదో గొప్ప యనాదరము చేసియుండబట్టి మిక్కిలి బుద్ధిమంతుడైన తన కొమారుఁ డిట్టి గొడవఁ జేసి యుండునే గాని యూరక మేనత్తకు నిష్కారణ పరాభవము గలిగింపఁడని యామె యభిప్రాయపడెను. అంతలో నంతకుముందు జరిగిన గొడవలలో గణపతి పక్షమూనిన ముసలమ్మ తీర్థయాత్రలు చేసుకొని వచ్చిన గణపతి తల్లింజూడవచ్చి, కోటిపల్లి వెళ్ళి సోమేశ్వరస్వామివారి దర్శనము చేసి ధన్యురాలైనందు కామెను శ్లాఘించి చెవిచెంత జేరి మెల్లఁగా " నా తల్లీ! నీవు లేని నాలుగు రోజులలో మీ వదినెగారు నాలుగు భాగవతము లాడినది. అది యెంతకయిన సాహసురాలే. నీ కొడుకుకు సరిగా నొకపూటైన అన్నము పెట్టలేదు. నాలుగు రోజులు నాలుగు యుగములై పోయినవి. అన్నము లేక విడ్డ అడలిపోయినాడు. ఒకపూట మా యింటికి తీసికొని వెళ్ళి పట్టెడన్నము పెట్టినాను. వాడివల్ల రవంత దోషమైన లేదు. అది కొంపలు మాపఁగల కొఱవి. దాని మొగము చూచితే పంచమహాపాతకములు చుట్టుకొనును. నీ కొడుకు చాలా మంచివాఁడు. కనుక నాలుగురోజులు ఎంతో ఓపికపట్టి బాధలు పడినాఁడు. నా బోటిదానినైతే కొంపంటించి లేచిపోదును. నీ బిడ్డను మాత్రము నీ వేమి తిట్టకు కొట్టకు" మని చెప్పి వెళ్ళెను.

తాను పడిన యభిప్రాయమే సరియైనదనియు, దన కుమారుఁడు నిర్దోషి యనియు నామె మరియు దృఢముగా నమ్మెను. మేనమామ గణపతిమీఁద మహాగ్రహము కలిగి యిల్లెగిరిపోవునట్లు కేకలు వేయజొచ్చెను. ఈ వృత్తాంతము తన మిత్రునివలన విని గణపతి యా పూట యింటికి రాక మున్ను దనపక్షము బూనిన ముసలమ్మ యింటిలోఁ గూర్చుండి మేనమామయొక్క నరసింహావతార చేష్ట లన్నియుఁ గనిపెట్టు చుండెను. అతఁ డిక్కడున్న వార్త యా ముసలమ్మ తల్లి కెరుకజేయఁగా నామెవచ్చి కొడుకుం గౌఁగిలించుకొని గట్టిగా నేడ్చినపక్షమునఁ దన సోదరునికి వినబడు నని శంకించి మెల్లగా నేడ్చెను. తల్లినిఁ గౌగిలించుకొని కుమరుఁడుగూడ నేడ్చెను. అన్యోన్యాలింగన పురస్సరముగా మాతాపుత్రులు కొంతసేపు రోదనము చేసిన తరువాతఁ దల్లి కుమారున కిట్లనియె.

"నాయనా! నీకెంత కష్టము వచ్చినదిరా! అన్నములేక నీ వెంత మల మల మాడిపోయినావో నీ కెంతయాఁకలైనదో, అలాటప్పుడు నన్నుఁ దలంచుకొని నీ వెంత యేడ్చినావో! ఆ వగలాడి కొంచెమైన జాలిలేక పెనిమిటితో నీ వడ్డమైనమాట లన్నావని చెప్పింది. దాని వలలోఁ బడిపోయి వాడు నిన్ను చంపివేయవలెనని యున్నాఁడు. నే నేమి చేతురా తండ్రీ!" అనవుడు గణపతి తల్లి కిట్లనియె.

"అమ్మా! విచారించకు, నావల్ల లోపము లేదు. మామయ్య పెండ్లాము చెప్పిన మాటలు పథ్యముగా గ్రహించి నా మీఁద గంతులు వేయుచున్నాఁడు. ఆడుదాని మాటలు విని నన్ను చావఁగొట్టుటకు సిద్ధమవుచున్నాఁడు. అతని యింటిలో మన ముండవద్దు. ముష్టి యెత్తియైన నిన్ను నేను పోషింపఁగలను. పోదాములే! 'పెండ్లాము బెల్లము తల్లి దయ్య ' మన్నట్టి సామెత నిజమయినది. ఇత నెంత, యితని యన్నమెంత? ఇతని యిల్లెంత? నూరుతిట్లు తిట్టి పట్టెడన్నము పెట్టినంత మాత్రమున లాభ మేమిటి? నాకా అన్నము వంటబట్టుటలేదు. రేపుదయము వెళ్ళిపోదములే! "అనవుడు నామె " నాయనా! తొందరపడకుఁ మామయ్యతో మన కెన్నో పనులున్నవి. అతనిదగ్గర పిల్ల వున్నది. పెండ్లాము కిష్టము లేకపోయినప్పటికి అతని నేలాగో వంచి పిల్లను మనము చేసుకొనవలెను. కోపపడకు! తమాయించుకో ! నిదానించు! తొందరపడకు. కార్యము సాధించుకోవలెను గాని చెడదీసుకోగూడదు" అని మందలించెను.

సరే యని గణపతి యెప్పుకొని తల్లినిఁ బంపి తానొకటి రెండు దినము లక్కడక్కడ భోజనముఁజేసి తరువాత మేనమామ లేనప్పుడు చాటుగా బోయి తినుచుఁ బిమ్మట మెల్లమెల్లఁగ మేనమామ కంటఁబడుచు నెప్పటియట్లు వుండెను. మేనమామయుఁ గ్రమక్రమముగ గోపపువేఁడి చల్లనగుటచే గణపతిని చూచియు నూరకుండెను.