Jump to content

గణపతి/పదమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదమూడవ ప్రకరణము

తోఁబుట్టువు, మేనల్లుడు దనగృహమునందె యుండుట చేత నాదాయముకంటె వ్యయ మెక్కువై నాగన్నకు నలువది వరహాలప్పయ్యెను. మేనల్లుడైన గణపతి కుటుంబమునకుఁ జేయు నట్టిది కలహాదాయమే గాని యన్యము లేదు. ఋణప్రదాతలు నాగన్నను ఋణము దీర్చుమని పలుమారులు వేధింపఁ జొచ్చిరి. అప్పు వడ్డితో నేబది వరహా లయ్యెను. ఈ ఋణము దీర్చునట్టి యుపాయము నాగన్నకుఁ గనబడదయ్యెను. ఒకనాఁటి సాయంకాల మప్పులవాఁడు వ్యాజ్యము నేయుదునని మిక్కిలి తొందరసేయ, నాగన్న విషాదభరిత మనస్కుఁడై సరిగా భోజనము చేయక మంచముమీఁదఁ బండుకొనియుండఁ గంగమ్మ భర్త యవస్థజూచి ఋణవిమోచన కుపాయముఁ జెప్పఁదలంచి యిట్లనియె.

"ఈ లాగున బెంగపెట్టుకొని అన్నము తినక నిద్రపోక విచారపడినంత మాత్రాన ఋణము దీరునా? దీనికి నాకొక్క యుపాయము తోఁచినది. అది చెప్పుచున్నాను వినండి. నా యుపాయము మంచిదైతే నే చెప్పినట్లు చేయండి. లేకపోతే మానండి, మా పినతల్లికొడుకు రాయప్పను మీ రెరుగుదురు కదా! మన బుచ్చి పుట్టింది మొదలుకొని వాఁడు దానిని తనకిమ్మని నన్నడుగుచున్నాఁడు. ఆ మధ్య వాడిక్కడికి వచ్చినప్పుడు "ఓసి ! గంగమ్మా! మీ బుచ్చిని నాకిచ్చి పెండ్లి చేసి నాబ్రహ్మచర్యము వదల్పవే నావంశము నిలిపినదాన వగుదువు" అని యెన్నో విధముల బ్రతిమాలినాఁడు. వాడు పునహా వెళ్ళి ఐదారువందల రూపాయలు సంపాదించుకొని వచ్చినాఁడు. ముసలివాడు కాడు. ముక్కవాడు కాడు. నోటికి చేతికి యెంగిలి లేని సంబంధము. మనకు చేలోకువైనవాఁడు. మన బుచ్చిని వాడికిచ్చి పెండ్లిచేసినపక్షమున మన ఋణము దీరి పోవును. నాలుగేండ్ల పిల్ల గనుక నాలుగువందలు వా డివ్వగలడు. ఒక వందరూపాయలు వస్తువులుకూడ పెట్టుమని నేను చెప్పి పెట్టించగలను. ముప్పదేండ్లకంటె యెక్కువలేవు. కాలు నొచ్చినా కడుపు నొచ్చినా కాకిచేత వర్తమానమంపితే రెక్కలు కట్టుకొని వచ్చి, వాడిక్కడ వాలి మన పనిచేసి వెళ్ళిపోవును. మా నాయన కూడ మనపిల్లను రాయప్పకే యిమ్మని రెండు మూడు సారులు నాతో చెప్పినాఁడు. మాయమ్మ సరేసరి. నూరు సారులు చెప్పింది. మనకు నూరు వరహాలు చేతికిచ్చి పిల్లకు నూరు రూపాయలు నగలు పెట్టి ఉభయఖర్చులు తానే పెట్టుకొని పెండ్లి చేసికొని వెళ్ళునట్లు మా నాన్నద్వారా నే నేర్పాటు చేయగలను. పెండ్లి యిక్కడ చేసినను సరే మానాన్నగారి యింటిదగ్గర చేసి ననుసరే వాడొప్పుకొనును. ఈ సంగతి మీరు గట్టిగా ఆలోచించుకొని మాకేదో సమాధానము చెప్పండి. తరువాత మా నాన్నకు వర్తమాన మంపించెదను."

భార్య చెప్పిన యుపాయము నాగన్నకు నచ్చెను. రాయప్పకుఁ గాని మఱియొకరికిఁ గాని నాలుగువందలు పుచ్చుకొని, పిల్లకు వివాహము చేసినపక్షమునఁ దనకు ఋణవిమోచన మగునని యొక దారి యతని మనస్సునకుఁ బొడకట్టెను. గాని పుత్రికా వివాహము తలఁపునకు రాఁగానె తోఁబుట్టువు మాట యతనికి జ్ఞప్తికిరాగా సతీపతుల కీ క్రింది సంభాషణము జరిగెను.

"మా గణపతికి పిల్ల నీయకపోయినపక్షమున నా చెల్లెలు దుఃఖపడు నని మనసులో సందేహము కలుగుచున్నది."

"గణపతికి పిల్ల నిచ్చుటకంటె పెద్దగోదావరిలో దింపుట మంచిది. అతనిదగ్గర ఒక గుణమైన నాడెమైనది లేదు. పిల్లవాడు మరుగుజ్జు, బుద్ధులు పాడుబుద్ధులు; ఇల్లు లేదు. వాకిలి లేదు. భూములు లేవు, పుట్ర లేదు. తినబోతే అన్నము లేదు. కట్టబోతే గుడ్డ లేదు. ఏమి చూచికొని పిల్ల నివ్వను!"

"ఇల్లు వాకిలి భూమి పుట్ర విద్యాబుద్ధులు వుంటే పిల్లనెవరైన యివ్వగలరు. లేనివాడు కనుకనే మన మియ్యవలసి వచ్చినది."

"మేనల్లు డని జాలిదలఁచి గొంతుక కోయఁదలతురా! పెండ్లాము బిడ్డలకు అన్నము పెట్టుటకైన శక్తి యుండవలెనా లేదా? దానిమా టటుండనీయండి! ఇప్పుడు మనకు ఋణవిముక్తి కావలెనుగదా? గణపతి దగ్గర నాలుగు వందల రూపాయలు కాదుగదా నాలుగు రూపాయలు కూడ లేవు. మనకే మియ్యగలడు? పిల్లను మేనల్లున కుచితముగా నిచ్చి వివాహము చేసినపక్షమున అప్పులవాళ్లు మన యిల్లు వాకిలి అమ్ముకొని పోదురు. నిలువ నీడలేక మనము చెట్టుమీది పక్షులు లాగు దేశములపాలై పోవలెను. అందుచేత గణపతికి పిల్ల నియ్యవలె నన్నమాట తలచుకోవద్దు. నే చెప్పినట్లు మా రాయప్పకే యివ్వండి!"

"నీవు చెప్పినమాట సరిగనే యున్నది కాని ఆడుపడుచు దుఃఖపడిపోవునని నాకాలోచనగా నున్నది. లేక లేక దాని కొక్క పిల్లవాడు కలిగినాడు. ఏలాగైనా వాని నొక యింటివాని జేయ వలె నని దాని సంకల్పము. వాడు బుద్ధిలేనివాడన్న మాట నిజమే. అది నన్నే నమ్ముకొని యున్నది. అది యేడ్చిపోవును."

"పిల్ల నియ్యకపోతే ఆవి డేడ్చిపోవును. ఇచ్చిన పక్షమున నే నేడ్చి పోదును? ఇన్ను మాట లెందుకు. గణపతికి మీరు పిల్ల నియ్యదలచుకొన్న పక్షమున నే నే గోతులోనో దిగదలచుకొన్నాను. ఇది నిశ్చయము."

"లేనిపోని సాహసపుమాట లాడకు, తప్పు."

"మీ యిష్టము. నే నాలాగున జరిగింపదలచుకొన్న మాట నిజము." అంతటితో సంభాషణ ముగిసెను. నిద్రపట్టెను. తెల్లవారుజామున నాగన్న మేలుకొని భార్య చేసిన హితోపదేశముయొక్క పూర్వాపర్యములు స్థిమితముగా మనస్సులో విచారించి గణపతిని దనకూఁతు నిచ్చి వివాహము చేయుట వలన లాభములకంటె నష్టము లెక్కువ యున్నవని తెలిసికొని, యిల్లాలుచేసిన హితోపదేశమె సమంజసమై యున్న దని గ్రహించి, తన యభిప్రాయము భార్య కెరిగించి తన మనో నిశ్చయమును మామగారికిఁ దెలియజేయుటకయి జాబు వ్రాసెను. ఆ జాబు చూచుకొని యతని యత్తమామలు పెండ్లికొడుకయిన రాయప్పను వెంటబెట్టుకొని వచ్చిరి. ఈ బంధువు లేలవచ్చిరో నాగన్న తోఁబుట్టువునకుఁ గాని గణపతికిగాని స్పష్టముగ దెలియలేదు. కాని భార్యాభర్తలు పలుమారు గుస గుస లాడుటం బట్టియు, నత్తమామల రాకం బట్టియు వారనుమానపడిరి. కాని స్పష్టమగు వరకు నోరెత్తఁ గూడదని యూరకుండిరి. గంగమ్మ చెప్పిన ప్రకారముననె రాయప్ప నాలుగువందల రూపాయలు రొక్క మిచ్చుటకును, నూరురూపాయలు నగలు పెట్టుటకు, బాజాభజంత్రీలతోఁ దరలివచ్చి వివాహము చేసికొనుటకు నొడంబడి ఋణము దీర్చుకొనుటకు ముందుగా నేబది వరాలు అనగా రెండువందల రూపాయలు నాగన్న కిచ్చెను. నాగన్న ఋణము దీర్చి బాధానివారణము చేసికొనెను. అనంతరము నాగన్నయొక్క యత్తమామలును రాయప్పయు, వారి స్వగ్రామమగు పలివెలకుఁ బోయి ప్రధానముచేసికొనుటకు, ముహూర్తము నిశ్చయించుటకు రమ్మని నాగన్నకు జాబువ్రాసిరి. నాగన్నయు మంచి దినము చూచుకొని పలివెల వెళ్ళెను. మేనమామ ఋణము దీర్చిన సంగతి గణపతికిఁ దెలిసెను. అతఁ డా వార్త తల్లికిఁ జెప్పెను. తల్లి చుట్టుప్రక్కలనున్న యమ్మలక్కల కెరిగించెను. అమ్మలక్కలందరు సభజేసి భూమి విక్రయింపకుండ, గృహ మమ్మకుండ నాగన్న రెండువందల రూపాయలు సంపాదింప సమర్థుఁడు కాఁడనియు దనకూతును రాయప్ప కిచ్చి వివాహము చేయనొడంబడి యాతనియొద్దనే రెండువందల రూపాయలు పుచ్చుకొని ఋణము తీర్చుకొని యుండునని నిశ్చయించి, మేనల్లుఁ డుండఁగా మేనమామ పిల్లను పైవాని కిచ్చుట యధర్మమని నిర్ధారణముచేసి పిల్ల నిమ్మని గట్టిగా నడుగవలసిన దనియు నల్లరి చేయవలసిన దనియు బదిమందిని బిలిచి తగవు పెట్టవలసిన దనియు నాలోచన చెప్పిరి. ఆ యుపదేశము మాతాపుత్రులకు నచ్చెను. నాగన్న పలివెల వెళ్ళి ప్రధానము చేసికొని వచ్చిన తరువాత నొకనాఁడు రాత్రి భోజనానంతరమున సోదరుని బిలిచి తోఁబుట్టు విట్లనియె.

"అన్నయ్యా! మన బుచ్చి పుట్టింటి మొదలుకొని తప్ప కుండ దానిని నీవు గణపతి కిచ్చి పెండ్లిచేయుదు వని గంపంత ఆశపెట్టుకొని యున్నాను. నీవేమో రాయప్పకు పిల్ల నియ్యఁ దలంచుకొన్నానని గ్రామములో చెప్పుకొనుచున్నారు. ఇది నిజమేనా!"

"ఆహా! నిజమే. నేను మన బుచ్చిని రాయప్ప కిచ్చి పెండ్లి చేయఁదలచుకొన్నాను. ఈ వేళో రేపో నేనే ముందుగా నీతో చెప్పదలఁచుకొన్నాను. నీవే అడిగినావు కనుక చెప్పుచున్నాను. ఆ మాట నిజమే. ప్రధానము చేసికొని వచ్చినాను. ముహూర్త నిశ్చయముగూడ అయింది. పెండ్లి నెల్లాళ్ళున్నది. మాఘ శుద్ధ దశమినాఁడు సుమూహుర్తము."

ఆ మాట చెవినిఁ బడగానె యామె మహాపద వచ్చిన తెరంగున గుండె బాదుకొని మొత్తుకొని "అయ్యో ! అయ్యో ! నాయనా ! యెంత పని చేసినావురో, నా కొంప తీసినావురా, అన్నయ్యా ! నన్ను చంపివేసినావురా, అన్నయ్యా ! నా వంశము నాశనము చేసినావురా, అన్నయ్యా ! నా కొడుకును ఘోటకపు బ్రహ్మచారిని చేసినావురా, అన్నయ్యా!" అని యంతటితో నిలువక "ఓ అమ్మా ! ఓ నాయనా!" యనుచు మృతినొందిన తల్లిం దలంచుకొని కొంతసేపు తండ్రిం దలంచుకొని కొంతసేపు మగనిం దలంచుకొని కొంతసేపు పెద్దపెట్టున రోదనము చేసెను. ఏమో కీడు మూడిన దని చుట్టు ప్రక్కలవారందరుఁ జేరిరి. ఆ యమ్మలక్కల మొగములు గనఁబడగానే యామె దుఃఖము మరింత యధికమగుచు నామె దుఃఖపరవశయై "ఓ పుల్లమ్మత్తా! ఓ నరసమ్మ పిన్నీ ! ఓసీతమ్మ వదినే ! ఓ మాచమ్మక్కయ్యా ! విన్నారటె మీరు ! మాఅన్నయ్య మాబుచ్చిని నా గణపతి గాడి కివ్వక యెవరికో యిచ్చుకోదలచు కొన్నాడట! మా వదినకు నెల తప్పినది మొదలుకొని ఆడపిల్లే పుట్టవలెనని అది నా కోడలు కావలె నని యెంతో ముచ్చటపడి పుట్టెడాశ పెట్టుకొని యున్నాను. నా యాస లడుగంటిపోయినవే, పుల్లమ్మత్తా! నా కొడుకు దిక్కుమాలిన పక్షి అయినాడే, పుల్లమ్మత్తా! ఎవడో దిక్కుమాలిన ముండాకొడుకు వచ్చి పిల్ల నెత్తుకొని పోదలచుకొన్నాడు, పుల్లమ్మత్తా! ఇక నేనేమి చేతును? పుల్లమ్మత్తా ! పల్లకిలో గణపతి, బుచ్చి కూర్చుండగా ముచ్చటగా చూడవలె ననుకొన్నానే, అమ్మా! బుచ్చి బుల్లి చేతులతో గణపతి నెత్తి మీద తలంబ్రాలు పోయగా రెప్పవేయకుండా చూడవలె ననుకొన్నానే, యమ్మా! తలుపు దగ్గఱ పేరులు చెప్పించి వినవలె నని అనుకొన్నానే, అమ్మా! గంధాలు పూయించవలె ననుకొన్నానే అమ్మా! నాకన్నులు కాలిపోయినవే, అమ్మా! నేనెంత పాపిష్టి ముండనే, అమ్మా!" యని పరిపరి విధముల వన్నెలు చిన్నెలు పెట్టి యేడ్చెను.

ఆ యేడ్పు విని జాలినొంది చూడవచ్చిన యిరుగు పొరుగు పడతులు "మేనరికమంటే ఆడపడుచు ఆశపడక పోదు కదా. దాని కొడుకు బ్రహ్మచారియై పోవలసి వచ్చింది గనుక దాని కంత బాధగా నున్నది. మేనల్లు డేలాటివాడై నప్పటికి మేనమాక పిల్లనిచ్చుట న్యాయ" మని కొందరు, "అల్లరి చేయక అతని కాళ్ళమీదను బడి మెల్లగా బతిమాలు కోవే, నీ యన్న గారు ఎల్లవారివంటివాడు కాడు. ఎంతో మంచివాడు. నీ పెనిమిటి పోయినప్పటినుంచి, నిన్ను నీకొడుకును కడుపులో పెట్టుకొని ఆదరించి వేయి విధముల కనిపెట్టినాడు గదా" యని యొకతె, "ఏమి జూచుకొని పిల్ల నిమ్మనావమ్మా" యని మరి యొకతె, తోచిన భంగి పలుకఁజొచ్చిరి. ఆమె యేడుపు కొంత యణగిన తరువాత నాగన్న తోబుట్టువున కిట్లనియె.

"ఓసీ ! నీవు గయ్యాళితనము జేసి నన్నల్లరి పెట్ట దలఁచుకొన్నావా యేమిటి? నేను సుఖముగా బిడ్డవివాహము చేసుకో దలచుకొని ప్రధానము చేసికొని వచ్చినాను గదా! నా యింటిలో ఎవరో చచ్చినట్లు నీవు ఏడువవచ్చునా? శుభకార్యములు దలచుకొన్నప్పుడు ఆశుభముగా మాటలాడ గూడదు. నోరు మూసికో ! నీ కొడుకుకు పిల్లను ఏమి చూచుకుని యిమ్మన్నావు? గోష్పాదమంత భూమి లేదు. గిద్దెడు గింజలు వచ్చుట కాధారములేదు. పెండ్లి చేసిన తరువాత రేపు నీకొడుకు చచ్చిపోతా డనుకో, మనోవర్తికైన భూమి ఉండవలెనా? తల దాచుకొనుటకు కొంపైనలేదు. ఇంక నీకొడుకు గుణములు మాకు చెప్పనక్కరలేదు. ఎన్ని దుర్గుణము లుండవలెనో అన్ని దుర్గుణములు నీ కొడుకుదగ్గఱనే యున్నవి. అటువంటి నిర్భాగ్యునకు పిల్ల నేలా యియ్యగలరు? గుణముల మాటటుంచు నా కిప్పుడు రెండువందలు ఋణ మున్నది. ఆ ఋణము తీర్చుకోవ లెను. నాకు నీవు నాలుగువందల రూపాయ లియ్యగలవా, పిల్లమీద ? బుఱ్ఱ గొరిగించుకొనేందుకు గూడ యేగాణియైన దగ్గర లేక చిక్కుపడుచున్న ముండవు. నీవు నాలుగువందల రూపాయలు నాకిచ్చి పిల్లకు ముచ్చట తీరుటకు వందరూపాయలు నగలు పెట్టి పెండ్లి చేసికోగలవా? మేనల్లుడు గనుక తండ్రి చచ్చినప్పటి నుంచి అన్నవస్త్రము లిచ్చి పోషించినాను. నే నంతకన్న చేయవలసిన దేమీలేదు. నీ వేడ్చినప్పటికి మొత్తుకొన్నప్పటికి నేను పిల్ల నియ్యను."

అనవుడు సోదరి సొదరున కిట్లనియె. "అన్నయ్యా! యిల్లులేని మనుష్యులు భూమిలేని మనుష్యులు బ్రతుకటలేదా? చచ్చిపోయినారా? మనవాడుకదా, నాలుగూళ్లు తిరిగి ముష్టెత్తి భార్యను పోషించుకొనలేకపోవునా? లోకములో అందరికి భూములున్నవా? పుట్ర లున్నవా? గుణములు మంచివికా వన్నావు. చిన్నతనము కనుక అల్లరి చిల్లరగా తిరిగినాడే కాని పెద్దవాడైన తరువాత కూడ నీలాగే యుండునా? పై వేషాలే గాని గణపతి మనస్సంత మంచి మనస్సెవరిదిగాదు. వాడు జాలిగుండెవాఁడు. ఎంతో బుద్ధిమంతుఁడు. నీ పెండ్లాము మా మీద గిట్టక మమ్ము లేవగొట్టించవలె నని నీతో అయినప్పుడు కానప్పుడు కొండెములు చెప్పి నా మీద, మా అబ్బాయిమీద నీకు కోపము తెప్పించినది. దాని మందులు నీకు తలకెక్కినవి. దాని మాటలు పథ్యమైనవి. అది నా వుసురు పోసుకున్నది. నా వలెనే అదికూడా హోరున యెప్పు డేడ్చునో, దాని యాశ లెప్పుడడుగంటిపోవునో, దాని పుట్టింటివా రెప్పుడు బుగ్గయిపోవుదురో, నన్ను పెట్టిన వుసురు తగులకపోదు. ఆడపడుచు నుసురుపెట్టినవా ళ్ళక్కరకురారు. ఆడపడుచుల ఉసురు ఒక్కనాటితో పోదు. ఏడేడు తరాలు కట్టి కుడుపక పోదు. ఆడపడుచు నేడిపించినవారి వంశము నిర్వంశము కాకమానదు. ఆ దిక్కుమాలిన రాయప్ప యెక్కడ దొరికినాడురా, నాయనా ? వాని మొగము మండ ! వాని మొగాన ప్రేతకళే గాని మంచికళ లేదురా, నాయనా? పెండ్లియోగ మెక్కడున్నదో ఆ మొగానికి, నాకు తెలియదు?" అని రెండవసారి రుద్రపారాయణము చేసెను. గంగమ్మను నామె పుట్టినింటివారిని జామాత కావలసిన రాయప్పను నోటికి వచ్చినట్లు తిట్టుట చేత గంగమ్మ కోపించి యా తిట్లఋణ మాడుబిడ్డకు వడ్డీతో దీర్చెను. ఇద్దరు కలియబడి కొట్టుకొన్నట్లు కయ్యమాడిరి. అంతట నాగన్న కోపావిష్టుడై సోదరిం జూచి "యిష్టము వచ్చినట్లు కారుకూతలు కూసి నన్ను, నా భార్యను, నా యత్తవారిని నా యల్లుని నోటికి వచ్చినట్లు తిట్టుచున్నావు. సుఖముగా నేను పెండ్లి చేసుకోఁ దలఁచు కోగా నీవు అమంగళము లాడుచున్నావు గనుక నీవు నాయింటిలో నుండవద్దు. నీవు నీ కొడుకు ఈ క్షణం లేచిపొండి. ఒక్క నిమిషమున్నారంటే నే నోర్వను. పొండి. మీ సామాను లేమున్నవో తీసికొనిపొండి" యని కఠినముగాఁ బలికెను. మేనమామ తన విషయమై పలికిన పలుకులకుఁ దల్లి నాడిన మాటలకుఁ దగిన ప్రత్యుత్తరముఁ జెప్పవలె నని గణపతి రెండు మూఁడు సారు లుంకించెను. కాని బదులు చెప్పినచో మేనమామ బుఱ్ఱ వంగఁదీసి చావగొట్టు నని భయపడి నోరెత్తక "అమ్మా ! రావే; అతఁ డింటిలో క్షణ ముండఁగూడ దని, యతఁ డను చున్నప్పుడు సిగ్గులేక మన ముండఁగూడదు. అన్నము లేకపోతే నాలుగూళ్ళు ముష్టెత్తుకు తినవచ్చును, రా. మాటలు మనము పడఁగూడదు లే!" యని చేయి బట్టుకుని లేవఁదీసి తీసికొని పోయెను. ఆమె గొల్లుమని యేడ్చుచు వీధిలోనికిఁ బోయి "దేముడా, దేముడా ! నా తోడబుట్టినవాడు చచ్చిపోయినాడమ్మా ! నా పుట్టింటికి నాకు ఋణము తీరినదమ్మా ! నా పుట్టిల్లు బుగ్గి అయిపోయిందమ్మా! " యని కేకలు వేయుచు దోసెడు మన్ను తీసి యన్నగారి గుమ్మంమీఁద పారబోసి రవంతమట్టి తన నోట వేసికొని, తల బాదుకొని గుండె బాదుకొని లబలబ మొత్తుకొని, మున్ను గంగమ్మకు విరోధురాలైన యవ్వ యింటికి గణపతి యీడ్చుకొనిపోఁగా వెళ్ళి పెద్ద పెట్టున రోదనము చేసెను.