గణపతి/పదునాల్గవ ప్రకరణము
పదునాల్గవ ప్రకరణము
భగవంతుడు గణపతికిఁ గావలసినంత యభిమానమునే ప్రసాదించెను గాని యైశ్వర్యమును బ్రసాదింపలేకపోయెను. మేనమామమీఁది కోపముచేత వేరింటి కాపురము చేయవలయు నని తల్లిం దోడ్కొనిపోయి పొరుగింట నిలుపఁగలిగెనే గాని, తన భుక్తికిఁ తల్లి భుక్తికి వొక్కపూటకు సరిపడునంత బియ్యమైన దేజాలకపోయెను. గణపతికిఁ దల్లికి నాగన్న మీఁదను గంగమ్మ మీఁదను గ్రోధమెక్కించి పుల్లవిఱుపు మాట లనియెడు సమిధల చేత ద్వేషవహ్ని రగుల్కొలిపిన యవ్వయు, దక్కిన యమ్మలక్కలును మాతాపుత్రులను రెండు మూడు పూటలు పోషించునప్పటికే కష్టమయ్యెను. తల్లికొడుకు లని లెక్క కిద్దరైనను రమారమి యేడెనమండుగురు మనుష్యులు గల కుటుంబమునకుఁ గావలసినంత సామగ్రి వారికి గావలసెను. గణపతి ప్రాయమున నిరువదేండ్ల లోపువాఁడైనను, జూపులకు వామనమూర్తి యైనను, జఠరాగ్ని వృకోదరుని జఠరాగ్ని వంటిదని యీ గ్రంథమునందే స్థలాంతరమున వర్ణింపబడియెఁ గదా! గణపతి భోజనప్రమాణముబట్టి యతని తల్లి భోజన ప్రమాణము జదువరులు మీ రూహించుకొన వచ్చును. అందుచేత సామాన్య గృహస్థులు వారిని భరించుట కష్ట మని వేఱె చెప్ప నవసరము లేదు. దినమునకు మూఁడు శేరులు బియ్యమున్న పక్షమున వారి కొకవిధముగా సరిపోవును. అది వచ్చునట్టి దారి పొడకట్టదయ్యెను. తల్లి కొడుకులు తన కొంపమీద బడి తిందురేమోయను భయమున బస యిచ్చిన యా యవ్వ గణపతినిఁ దల్లిం గూర్చుండబెట్టుకొని మూఁడవనాఁ డిట్లనియె. "ఓరీ గణపతీ ! మీ తల్లిని పోషింపవలసిన భారము నీది. కుక్కదానము పట్టి కుటుంబము పోషించు మన్నాఁరు. గనుక నీవు యాయవారము చేసి మీకు సరిపడిన బియ్యము తీసికొనిరా ! గ్రామములో నున్న పెద్దమనుష్యులను నల్గురను జూచి మేనమామ నన్ను, నా తల్లిని లేవఁగొట్టినాడని చెప్పు. ఏ ధర్మాత్ములకైన జాలి పుట్టవచ్చును. తలకొక కుంచెడు ధాన్యము వారివ్వవచ్చును. దానివలన మీ కుటుంబ పోషణ గావచ్చును. ముందుగా యావవార మారంభించు. మావారు రామేశ్వర యాత్ర వెళ్ళినప్పుడు కొనితెచ్చిన పెద్ద కుంభకోణపు చెంబున్నది. అది మానెడు బియ్యము పట్టవచ్చును. రేపటినుంచి నీ వభిమానపడక ఆలాగున చెయ్యి, నాయనా ? " యని యుపదేశింప గణపతి యా యుపదేశమునకు సమ్మతింపక యిట్లనియె.
" చెస్! నేను బ్రాహ్మణార్థములే మానివేయఁదలచుకొన్నాను. యాయవారము వృత్తి కొప్పుకొందునా ! అటువంటి మాటలు నాకు పనికిరావు. అమ్మా ! నా కొక యుపాయము తోచింది, విను ! కొద్దిరోజులలో మన మీ యూరు విడిచి వెళ్ళిపోదము. అంతవఱకు నీవు యాయవారము చేసి, బియ్యము తీసుకొనిరా ! ఈ గిరజాలతోను ముచ్చెలతోను నేను యాయవారము చేయుట బాగుండదు. నాకది పరువు తక్కువ. రెండు మూడు మాసము లాలాగు నీవు గడిపితే నేనేదో యుద్యోగము సంపాదించి యొకరికంటె యెక్కువగా నిన్ను పోషింపఁగలుగుదును. అంతవరకు మాటదక్కించు" మని ప్రత్యుత్తరము చెప్పెను. మాతాపుత్రులలో నెవరు భిక్షాటనము చేసినను నుపదేశము చేసిన యవ్వకు సమానమె గనుక యామె యా సలహా నంగీకరించి బిచ్చమున కామెం బురికొలిపెను. మరునా డుదయమునుండి యామె యాయవార మారంభించెను. ప్రతిదిన ముదయము గణపతికి గడుపునిండ జద్దియన్నము బెట్టి యామె గ్రామ సంచారము కరిగి రెండుజాములైన తరువాత వచ్చి స్నానము చేసి మడికట్టుకొని వంటచేసి కొడుకునకు బెట్టి తాను దినుచుండెను. గణపతి చద్దికూడు తిని తల్లి తెచ్చిన బియ్య మప్పుడప్పు డమ్మి పొగచుట్టలు కొనుచు, డబ్బు లేనప్పుడు బియ్యమే యిచ్చి యీతపండ్లు, జీడిమామిడిపండ్లు, వెలగకాయలు, రాచయుసిరికాయలు, చెఱుకుకఱ్ఱ ముక్కలు, నేరేడు పండ్లు మొదలగు చిరుతిండివస్తువులు వీధిలోని కమ్మవచ్చినప్పుడు దీసుకొనుచు, నున్నగా గిరజాలు దువ్వుకొని చుట్టలు కాల్చుచు, గ్రామము వెంటఁ దిరిగి తిరిగి రెండుజాము లగునప్పుడు టక్కు టక్కు మని ముచ్చెలు చప్పుడగునట్లు గృహమునకు వచ్చి "వంటైనదా లేదా!" యని గొప్ప యధికారి వంటకత్తె నడిగిన ట్లడిగి, యైన దన్నప్పుడు ముందు తనకే పెట్టుమని తిని 'కాలేదు, నాయనా ! ' యని యన్నప్పుడు 'దౌర్భాగ్యపుముండా ! పెంటముండ ! వంట పెందలకడ చేయక గుడ్డిగుఱ్ఱమునకు పండ్లుతోముచున్నావా? నీకు నాలుగు చెంపకాయలు తగులవలె, లేకపోతే బుద్ధిరా ' దని యొకప్పుడు మాటలతో పోనిచ్చుచు, మరి యొకప్పుడు చేయి విసరి రెండు తగులనిచ్చుచు, యధేచ్చముగఁ దిరుగ జొచ్చెను.
గ్రామస్థులలో గొంద రప్పుడప్పుడు గణపతి యొక్క స్వచ్ఛందవ్యవహారములఁ జూచి నవ్వుచు "ఏమిరా, యీయన్యాయము? చెట్టంత మగబిడ్డవు, నీ వుండగా మీయమ్మ బిచ్చమెత్తుకొనుట న్యాయమటరా? ఆ గిరజాలేమిటి? ఆ పొగచుట్టలేమిటి ? ఆ ముచ్చె లేమిటి? ఆ టక్కు టక్కు లేమిటి? తల్లి యాయవార మెత్తు టేమిటి, సిగ్గులేదా? పెద్దముండ, ఆవిడను పోషించుటకు మారుగా నిన్నే యావిడ పోషించవలెనా?" యని చివాట్లు పెట్టఁ జొచ్చిరి. అది విని గణపతి రోసము దెచ్చికొని తల్లిచేత బిచ మెత్తింపఁ గూడదని యామెను మాన్పించి తానే చెంబు దీసికొని యాయవార మారంభించెను. అదెట్లనఁగా నుదయమున లేచి చల్దికూడు దిని గిరజాలు దువ్వుకొని కోటు తొడుగుకొని తెల్లపంచె కట్టుకొని పొగచుట్ట నోటపెట్టుకొని కుడిచేతితో చెంబు పట్టుకొని యెడమచేతి తర్జనమధ్యమాంగుళీయములతోఁ పొగచుట్ట నోటనుండి పట్టుకొని యుమ్మి వేయుచు, యాయువారము చేయును. ఆ వేషమును జూడ గ్రామ మందలి స్త్రీ పురుషులు బాలురు పనులు మానుకొని వచ్చి గణపతితో నించుకసేపు పని లేకపోయినను బ్రసంగించి, పొట్టలు విచ్చునట్లు నవ్వుకొని వినోదించు చుందురు. గణపతి యక్షయ పాత్రము బుచ్చుకొని యెవరింటికైనను వెళ్ళి నప్పుడు వారు లోపలినుండి బియ్యము తెచ్చుట యాలస్యమైన పక్షమున, నచ్చట నిల్చియుండక వారి వాకిట మంచ మున్న యెడల మంచముమీఁద, తివాసి యున్న యెడల తివాసిమీఁదఁ, గుర్చీ యున్న యెడల గుర్చీమీఁదఁ గూర్చుండి యాలస్యముగ బిచ్చము దెచ్చినందుకు "ఇంత సేపెందుకు ఆలస్యమైనది? ఎల్లకాలము మీ యింటిదగ్గఱ నేను పడియుందు ననుకొన్నారా యేమిటి? మీరు నాకు నిలువుజీత మిచ్చినట్లున్నారు, నేను మీ వాకిట్లో నిలిచి యుండుటకు ! మీ నౌకరును కాను. పెద్ద మనుష్యుఁడు వచ్చినప్పుడు వెంటనే పంపక యీ యాలస్యమేమిటి?" యని మందలించు చుండును. గణపతి మందలింపులు స్త్రీ పురుషుల కాగ్రహము తెప్పించుటకు మారు మందహాసము సంతోషము గలిగించుచు వచ్చెను. ఈ తెరంగునఁ దల్లి కొన్ని నాళ్ళు, కొడుకు కొన్ని నాళ్ళు, యాయవారము చేసి పొట్ట పోసుకొనుచుండిరి. అంతలో నాగన్న కూఁతురు వివాహము సంభవించెను. వివాహమునకు విఘ్నము లాపాదింప వలె నని గణపతియుఁ దల్లియు బహువిధోపాయములు వెదుకఁ జొచ్చిరి. గణపతి కంటికిఁ గనఁబడిన వారి నెల్ల వివాహము కాకుండఁ జేయుట కుపాయము జెప్పు మని యడుగు చుండును. మేనమామయైన నాగన్నకు సన్నిహిత జ్ఞాతి యొకఁ డుండెను. అతని పేరు పుల్లయ్య. పుల్లయ్యకు నాగన్నకు సరిహద్దు గోడలఁ గూర్చియు, పొలములలో గట్ల గూర్చియు, నీళ్ళబోదెలం గూర్చియు, మనస్పర్థలు పొడమి విరోధములు బ్రబలి నందున వారికి మాటలు గాని శుభాశుభ కార్యములందు భోజన ప్రతిభోజనములు కాని లేవు. శక్యమైన యెడల నాగన్న కపకారము చేయవలె నని పుల్లయ్యయు, పుల్లయ్య కపకృతి చేయవలె నని నాగన్నయుఁ జూచుచుండిరి. అట్టి సమయములో నొకనాడు గణపతి పుల్లయ్య యింటికిఁబోయి నాగన్న కూతురుయొక్క వివాహము కాకుండఁ జేయుట కుపాయము చెప్పుమని యడిగెను. పుల్లయ్య ముహూర్త మాలోచించి "వహవ్వ! మంచియుపాయము దొరికిందిరా! గణపతీ ! ఇది సాగెనా బుచ్చి, రాయప్పకుఁ దక్కకుండ నీకే దక్కు" నని యుత్సాహముతోఁ బలికెను. పిల్ల తనకే దక్కు నన్న మాట వినఁబడగానే గణపతి సంతోషముచే హృదయ ముప్పొంగ "పుల్లయ్య మామ ! ఉపాయ మేదో త్వరగా జెప్పు! నాగన్నగాడి రోగము మన మందఱము చేరి కుదుర్చవలె" ననియెను. అనుటయు పుల్లయ్య యిట్లనియెను. "బుచ్చిని నీవె తీసుకొని పోయి రహస్యముగా నేదో యొక గ్రామములో దేవాలయములో పెండ్లి చేసుకో. దానితో నాగన్న రోగము రాయప్ప రోగము కూడ కుదురును. రాయప్పగాడికి రెండువందల రూపాయలూ తిరుక్షౌర మన్నమాటె. నీకు దమ్మిడీ ఖర్చులేకుండా పెండ్లి యగును. ఒకసారి పెండ్లియయిన పిల్లకు తిరిగి పెండ్లిచేయగూడ దని మన శాస్త్రము. ఏడువనీ మొత్తుకోనీ తిట్టనీ పెండ్లి మాత్రము చేయుటకు వీలులేదు. ఎప్పటికయినా బుచ్చి నీ పెండ్లామే, తప్పదు. ఈ పని నీవు చేసితివా మన గ్రామములో జనులే గాక చుట్టుప్రక్కల గ్రామముల వాండ్రుకూడ గణపతిగాడు బహద్దరురా ! మంచిపని చేసినాడని మెచ్చి సంతోషింతురు. కనుక నీ వీ విషయములో గట్టి పని చేయవలెను. ఇసుక తక్కెడకు వెంటనే పేడ తక్కెడ ఉండవలెను. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తగలవలెను" అని యుపదేశము చేయుటయు, గణపతి సంతోషించి, "పుల్లయ్యమామ ! నీ యుపాయము బాగున్నది. కాని యది యేలాగున నెరవేరఁ గలదు? ముందు మనకు పిల్ల స్వాధీన మగు టేలాగు? అది యొంటరిగా మనకు దొరుకునా ? దొరకినప్పటికిఁ దలిదండ్రుల విడిచిపెట్టి మనతో నది పొరుగూరు వచ్చునా ? బలవంతమునఁ దీసికొని పోదుమా యది యేడ్చి గోలచేయదా? ఆ గోల విని పదిమంది చేరరా? అప్పుడు మన ప్రయత్నము చెడిపోదా? అదిగాక యే గ్రామములో వివాహము చేసికోఁగలను? ఎవరికి దెలియకుండ ముందక్కడ బ్రయత్నము చేయవద్దా? డబ్బు కావలెఁ గాఁబోలు. నా దగ్గర డబ్బులేదు. వీటి కన్నిటికి నీవే యేదో యాలోచన చెప్పవలె" నని పలికెను. అడుగుటయు నతనికి పుల్లయ్య యిట్లనియె. "ఆ గొడవ నీకక్కరలేదు. కావలసిన సొమ్ము నేనే పెట్టుబడి పెట్టఁగలను. నీ తల్లి మాయింటి యాడుపడుచు. నీవు నాకు మేనల్లుడవు. నా దగ్గర నలుసంత ఆడపిల్ల ఉన్నపక్షమున నేనే నీకు పిల్లనిచ్చి పెండ్లిచేయవలసిన వాఁడను. వేయేండ్లు తపస్సు చేసినను కలిసిన సంబంధము దొర కునా ? నిర్భాగ్యుడు గనుక నాగన్న సంబంధము చెడఁగొట్టుకున్నాఁడు. దానికేమి. డబ్బుగొడవ నీ కక్కరలేదు. వానపల్లి దేవాలయములో నీకు నేను వివాహము చేయించగలను. పిల్ల నేదోవిధముగా నేనే తీసుకొని రాఁగలను. అప్పు డప్పు డాపిల్ల మాయింటి ప్రక్కనున్న కందర్పవారి యింటికి వచ్చి యాడుకొను చుండును. ఏదో మచ్చికవేసి పిల్లను తీసికొని రావచ్చును. నేను ముందుగా వానపల్లి వెళ్ళి పురోహితునిఁ గుదిర్చి ముహూర్త మేర్పాటుచేసి పూజారితో మాటలాడి భజంత్రీలను గుదిర్చి వచ్చెదను. బుచ్చి పెండ్లి దశమినాడుగదా తండ్రి యేర్పరిచినాడు. ఈ లోపుగా షష్టినాడో, సప్తమినాడో మనము తలంచుకొన్న పని చేసితీరవలెను. నీవు పంచమినాడే వానపల్లి వెళ్ళియుండు. నేను రేపు వుదయమున బయలుదేరి వానపల్లి వచ్చెదను. పాతిక రూపాయలు సొమ్ము మేనల్లుఁడవు కనుక నీ నిమిత్తము ఖర్చు పెట్టెదను. ఈ సంగతి మట్టుకు నీ వెవరితోను జెప్పవద్దు. మీ యమ్మకుఁ కూడ తెలియనీయవద్దు. ఆడుదాని నోటిలో రహస్యము దాగదు. పూర్వము ధర్మరాజులవారు "ఆడుదాని నోట రహస్యము దాగకూడ" దని కుంతికి శాపమిచ్చినారు. అప్పటినుంచి యాడుదానితో చెప్పిన ఏకాంతము లోకాంత మగును. ఇది మన కిద్దరికె గాని, యీ గ్రామములో మరెవ్వరికిఁ దెలియ గూడదు సుమీ!" అనవుడు గణపతి తన కాపూట వివాహ మైనట్లే మహానందము నొంది లేచి "పుల్లయ్యమామ ! నిజ ముగా నీవే నా మేనమామవు. నాగన్నగాడు నా మేనమామగాదు. నీ కున్న యభిమానము మఱెవరికి లేదు. ఈ దెబ్బతో నాగన్నగాడి రోగము కుదిరిపోవును. బ్రహ్మాస్త్రమువంటి యుపాయమిది. ఇక నేను వెళ్ళెదను. నీవు వానపల్లి వెళ్ళి వచ్చిన తరువాత మనము తిరిగి కలుసు కొందము." అని వెళ్ళెను. పుల్లయ్య వీధి వరకు వానిని సాగనంపి చిరకాలము నుండి నాగన్న మీఁద తనకుఁ గల క్రోధమును దీర్చికొనుటకుఁ దగిన యవకాశము లభించినదని మనంబున మిగుల సంతసించెను. నాగన్న మీఁది కోపము చేతనే పాతిక ముప్పది రూపాయలు కూడ నతఁడు ఖర్చుపెట్ట దలఁచెను. క్రోధమే పని జేయింపదు? పుల్లయ్య మరునాడు తెల్లవారుజాముననే లేచి వానపల్లి వెళ్ళి యచ్చట నున్న విష్ణు దేవాలయము యొక్క పూజారిని కలుసుకొని రెండు రూపాయలు వాని చేతిలోఁ బెట్టి రహస్య వివాహము జరుగునని యతనితోఁ జెప్పి సాయము చేయవలెనని కోరి పిల్ల తండ్రి పేరు మొదలైనవి చెప్పక తనకుఁ చిరకాల మిత్రుఁడైన ద్రావిడ బ్రాహ్మణుని మంథా మహాదేవశాస్త్రిని గలిసికొని తన సంకల్పమాయనతోఁ జెప్పి యాయన సమ్మతిం బడసి పురోహితుడుగా నుండవలె నని యతనినే గోరి రెండు రూపాయలు ముందాయనకిచ్చి మాఘశుద్ధ షష్టినాడు ముహూర్తము పెట్టించి బాజా భజంత్రీలను గుదుర్చుమని యతనితో చెప్పి తిరిగి వచ్చునప్పుడిట్లనియె "మహాదేవుడు బావ ! పిల్లను షష్టినాడు వీలైతే షష్టినాడు తీసికొనివచ్చెదను. సప్తమినాఁడు వీలైతే సప్తమినాడు తీసికొనివచ్చెదను. అందుచేత రెండు రోజులకు గూడ ముహూర్తములు పెట్టి మీ రుంచవలెను. నే నుత్తరము వ్రాసి యిచ్చి, పెండ్లికొడుకును మీ యింటికి పంచమినాడే పంపెదను. అతనికి మీ యింటిలోనే భోజనము పెట్టండి. దేవాలయములో రాత్రి వివాహములు చేయఁగూడ దని పెద్దలన్నారు. మీరు రాత్రి ముహూర్తము పెట్టినారేమి?" అని పలికెను. "రాత్రులు దేవాలయములో వివాహము చేయఁగూడ దని నే నెరింగినంతవర కే శాస్త్రములోనూ లేదు. అందుచేతనే రాత్రి ముహూర్తము పెట్టినాను. ఇటువంటి పిచ్చిపిచ్చి సందేహములు పెట్టుకొనక పిల్లను తీసికొనిరా! మూడు నిమిషములలో వివాహము చేయించెద" నని మహాదేవశాస్త్రి బదులు చెప్పెను. పుల్లయ్య సంతుష్టుడై వానపల్లి విడిచి స్వగ్రామమునముఁ బోయెను. అతడు వచ్చునప్పటికి గణపతి వాని వీథియరుఁగుమీఁద గూర్చుండెను. గణపతిం జూచి పుల్లయ్య మీఁదఁ జేయివైచి తట్టి "గణపతీ! నీ వదృష్టవంతుడవురా! నీ పేరుఫల మేమో గాని యెక్కడికి వెళ్ళితే అక్కడ దిగ్విజయమే. పురోహితుఁడు కుదిరినాఁడు. పూజారి యనుకూలముగా నున్నాడు. సమస్తము నేటివరకు శుభముగానే యున్నది. నీకు తప్పక కళ్యాణకాలము వచ్చినట్లు కనఁబడుచున్నది. కక్కు వచ్చినప్పుడు, కళ్యాణము వచ్చినప్పుడు ఆగదన్నారు, పెద్దలు. ఇంతకు నీ దినములు మంచివి యని బహూకరించెను. "మామా ! ఇది నీ చలవ గాని నా ప్రజ్ఞ యేమున్నది? నన్నొక యింటివానిం జేసినాడన్న ప్రజ్ఞ నీకు దక్కవలసియున్నది. నా మేనమామ బ్రతికి యున్నప్పటికిఁ జచ్చినవారిలో జమ. నీవే నా మేనమామవు" అని గణపతి ప్రత్యుత్తర మిచ్చెను. అనవుడు " పంచమి యెల్లుండేకదా! యెల్లుండి వుదయమున నీవు నా దగ్గరకు రా! ఉత్తరము వ్రాసి యిచ్చెదను. అది పుచ్చుకొని మహాదేవశాస్త్రి దగ్గరకు వెళ్ళుదువుగాని; వివాహ మగువరకు నీ వక్కడనే యుండవలెను. జాగ్రత్తసుమా! నోరుజారి ఎవరితోనైన రహస్యము బయలు పెట్టెదవేమో?" యని హెచ్చరించి పుల్లయ్య వాని నంపెను. గణపతి పరమసంతోషముతో నింటికిఁ బోయి మరునా డుదయమున వానపల్లి కరిగెను. బుచ్చమ్మ పెండ్లి పలివెలలో శ్రీ కొప్పులింగేశ్వ సామివారి యాలయములోఁ జేయవలె నని నాగన్న తలంచెను. గాని, రాయప్ప దేవాలయములోఁ జేసికొన్న వివాహము వలన వధూవరులకు ముచ్చటలు తీరవని గుడిలో పెండ్లి వల్లకా దనియు నైదుదినములు యథావిథిగ వివాహము జేయవలసినదనియు వ్యయ మంతయు, దానే చేయుదు ననియు నాగన్నయొక్కయత్తమామలతోఁ జెప్పి వారి నొడంబరచెను. అత్తమామ లొప్పుకొనగానే నాగన్నయు నొప్పుకొనెను. పుట్టింటనే తన కూతురు వివాహము జరుగుచున్నప్పుడు గంగమ్మ నిరుపమానందముతో నొప్పుకొన్న దని వేరుగా వ్రాయనక్కఱ లేదుకదా! పలివెలలోనె వివాహము జరుగును గావున నాగన్న స్వగృహమందు వివాహ ప్రయత్న మేమియుఁ జేయనక్కర లేకపోయెను. అప్పడములు వడియములు పెట్టించుట యరిసెలు వండించుట యటుకులు కొట్టించుట పందిళ్లు పాకలు వేయించుట మొదలగు సమస్త ప్రయత్నములు రాయప్ప తన పినతల్లి యొక్కయుఁ బినతండ్రియొక్కయు పెత్తనము క్రిందఁ జేయించెను. నాగన్న పుత్రికను, భార్యను దీసికొని మాఘ శుద్ధ సప్తమినాఁడు పలివెల వెళ్ళ నిశ్చయించెను. పెండ్లికూతురైన బుచ్చమ్మ నాలుగేండ్ల పిల్ల యగుటచే లక్కపిడతలు లక్కబొమ్మలు కఱ్ఱబొమ్మలు మొదలగునవి తీసికొని, కందిపప్పు, బెల్లపుముక్క మొదలగు నవి పట్టుకొని తన యీడు పిల్లలతో తఱుచుగా నాడుకొనుటకుఁ బోవుచుండును. షష్టినాడు సాయంకాల మా బాలిక పుల్లయ్యగారి యింటిప్రక్క నున్న యొక బ్రాహ్మణ గృహమున నాడుకొని నాలుగుగడియల ప్రొద్దువేళ మరల నింటికి బోవుచుండెను. ఆ బాలిక యొక్క రాకపోకలను మిక్కిలి జాగరూకతతోఁ గనిపెట్టుచుండిన పుల్లయ్య యామె యొంటిగాఁ బోవుచుండుటఁ జూచి యదివఱకే తాను గొని యుంచిన కర్జూరపుపండు పొట్లము విప్పి యామె చేతికిచ్చి "అమ్మాయి ! ఈ పండు తిను. మా యింటికిరా! ఆడుకొందువుగాని" యని యెత్తుకొని ముద్దుబెట్టుకొనెను. బుచ్చమ్మ ఖర్జూరపుపండుయొక్క యెరలోఁ బడి యది తినుచు మాటాడక యూరకుండెను. పుల్లయ్య యాబిడ్డ నెత్తుకొని "అమ్మాయి! మీ యమ్మదగ్గరకుఁ తీసికొని వెళ్ళనా ! రా !" యని చల్లగాఁ మాటలు చెప్పుచుఁ దా నదివఱకుఁ గుదిర్చి యుంచిన బండిమీఁద నెక్కించి బండి కీ ప్రక్క నాప్రక్క రెండు గుడ్డలు కట్టి మిక్కిలి వేగముగ బండి తోలుమని బండివానితోఁ జెప్పి "బుచ్చమ్మ ! నీకు లక్కపిడతలు కొని యివ్వనా? మంచి పరికిణీ గుడ్డ లున్నవి. నీవు కుట్టించుకొని కట్టుకొంటావా?" యని యిచ్చకము లాడుచు, ఖర్జూరపుపండు తినిన వెంటనే మిఠాయి పొట్లము చేతి కిచ్చి యేదో విధముగా నేడువకుండ రాత్రి నాలుగు గడియ లగునప్పటికి వానపల్లి తీసికొనిపోయి మహాదేవశాస్త్రి గారి యింటిదగ్గర బండి దిగెను. పూజారి గుడిలో సిద్ధముగా నుండెను. మహాదేవశాస్త్రిగారి యొక్క యేర్పాటుచేత రెండు కాగడాలు సిద్ధముగా నుండెను. భజంత్రీలు వచ్చి కూర్చుండిరి. మహాదేవశాస్త్రి యానాటి యుదయముననే గణపతిని దన యింటనే పెండ్లి కుమారుని చేసెను.
బుచ్చమ్మ బండిలోన నిద్దుర పోయినందున నామెను భుజముమీఁదఁ బండుకొనఁ బెట్టుకొని పుల్లయ్య మహాదేవశాస్త్రి యింటికిపోయి యతనిం బిలిచెను. గణపతియు మహాదేవశాస్త్రియు నత్యంత సంతోషముతో నాతని నెదుర్కొని నిర్విఘ్నముగా బాలికం దోడి తెచ్చినందుకు వానిని గడుంగడు బ్రశంసించిరి. అప్పుడు పుల్లయ్య మహాదేవశాస్త్రిం జూచి "ఏమోయి ! కన్యా ప్రదాన మెవరు చేయుదురు? ఆ మాట నీతోఁ చెప్ప మఱచితిని. అందు కెవరినైన గుదిర్చితివా లేదా?" యని యడిగెను. 'నీవు మరచిపోయినావు గాని నాకా మాట జ్ఞాపక మున్నది. కన్యధార పోయుటకు దంపతులను సిద్ధము చేసి యుంచినా? నని యతఁడు బదులుచెప్పెను. 'వహవ్వా ! మహాదేవశాస్త్రి యంటే సామాన్యుఁడా? బృహస్పతి వంటివాడఁవు నీ వుండగా మాకు లోటు జరుగునా? ఇంతకూ మీరు పెట్టిన ముహూర్తము మంచిది. ముహూర్త బలిమిచేతఁ బిల్ల దొరికినది గాని, లేకపోతే సామాన్యముగా దొరకునా? కాని, కన్యాప్రదానమునకు సిద్దమైన దంపతు లెవరు?" అని పుల్లయ్య యడిగెను. మహాదేవశాస్త్రి యిట్లనియె.
"ఎవరేమిటి? మా గ్రామములో మంగళంపల్లి నర్సయ్య యనే యొక బ్రాహ్మణు డున్నాఁడు. ఆయనది కృష్ణాతీరము కాపురము. మునుపు కొన్నా ళ్ళమలాపురములో నీళ్లకావళ్ళు మోసినాఁడు. అక్క డుండఁగా నరసాపురము నుంచి బ్రాహ్మణ వితంతు నొకర్తె లేచివచ్చినది. అది తలవెండ్రుకల విధవ; అమలాపురములో నున్నప్పుడే దానిని వీ డుంచుకొన్నాఁడు. దానికి కొంత కాలమునకు కడుపైనది. బిడ్డను చంపివేయుట కిష్టములేక, ఆ గ్రామము విడిచి దంపతుల మని చెప్పుకొని వారిక్కడఁ బ్రవేశించిరి. ఆబిడ విధవా రూపముం దీసివైచి పసుపు రాసుకొని కుంకుమబొట్టు పెట్టుకొన నారంభించినది. వాళ్ళ కిప్పుడిద్దరు పిల్ల లున్నారు. వారు దంపతులే యని మేముకూడ మొదట నమ్మినాము. తరువాత నా కీ రహస్యమంతయు నమలాపురపు బ్రాహ్మణుఁ డొకడు చెప్పినాడు. అది విని నరసయ్యను పిలిచి యడిగినాను. లేదు లేదని మొదట బొంకినాఁడు కాని చివరకు నా రెండు కాళ్ళు పట్టుకొని యేడ్చి బ్రతిమాలుకొన్నాడు. స్వాములవారి పేర వ్రాసి ఆంక్షపత్రిక తెప్పించి డొక్క బ్రద్దలు చేసెద నని నేను వానిదగ్గర పది వరాలు సొమ్ము గుంజుకొని రహస్యము బయటబెట్టక కాపాడినాను. వాఁ డిప్పుడు నగ్నప్రచ్ఛాదనలు చుట్టుప్రక్కల పది పన్నెండు గ్రామములలో పట్టు చున్నాఁడు. నా మాటంటె చాల గౌరవము. నేను గీచిన గీటు దాటడు వాఁడు. నేను చెప్పినట్టు చేయఁగలడు. ఆ దంపతులిద్దఱు గూర్చుండి కన్యాదానము చేయ నొప్పుకొన్నారు."
"సరే ! చాలా బాగున్నది. వారికిఁ ద్వరగా వర్తమానమంపండి ! పిల్ల నిద్రపోయినది. ఈ సమయములోనే గబ గబ ముడివేయ వలెను. లేచిన పక్షమున నేడ్చునేమో ! రండి దేవాలయములోనికి" అని పుల్లయ్య వారిం ద్వరపెట్టెను.
గణపతికి మెడలోఁ బెద్ద జందె మొకటి పడుటే ప్రధానము గాని కన్యాప్రదానము తల్లిదండ్రులే చేయవలె నను పట్టింపులేదు. అప్పుడు వారందరు దేవాలయమునకుఁ బోయిరి. తొలుత గ్రహించిన రెందు రూపాయలకుఁ దోడుగా మఱి రెండు రూపాయలు వచ్చునను నాసతో నర్చకు డచ్చటనే గూర్చుండెను. మంగళంపల్లి నరసయ్య పుత్రకళత్ర సమేతుఁడై వచ్చి కన్యాప్రదానమునకు సిద్ధముగఁ గూర్చుండెను. భజంత్రీలు మేళముసేయ నారంభించిరి. మహాదేవశాస్త్రి పుల్లయ్య చేసిన తంత్రము సఫలము చేయుటకై మంత్రములు చదువ నారంభించెను. అంతలో బుచ్చమ్మ బాజాల చప్పుడువలన మేలుకొని "మా అమ్మేది ! నన్ను మా అమ్మదగ్గరికి తీసికొనివెళ్ళు!" అని పెద్దపెట్టున నేడ్వ నారంభించెను. పుల్లయ్య మిఠాయి పొట్లమిచ్చెను. అఱఁటిపం డిచ్చెను. బెల్లపుముక్క జూపెను; కాని యవి యామె యేడ్పును నివారింపలేకపోయను. బ్రతిమాలెను; బెదరించెను; ప్రాణము విసిగి రెండు చెంపకాయలు కొట్టెను. ఎన్ని చేసినను బుచ్చమ్మ యేడ్పు మానలేదు. విఘ్నేశ్వర పూజ నిమిత్తము పళ్ళెములో బోసిన బియ్యము బుచ్చమ్మ క్రిందఁ బడి దొర్లి యేడ్చునప్పుడు కాళ్ళతో దన్ని పారబోసెను. ఈ యేడ్పు వల్ల జూడవచ్చిన వారు పిల్లను దొంగతనముగా దీసికొని వచ్చి నట్లు దెలిసికొని వివాహము చెడగొట్టెదరేమో యని గణపతి గుండెలు పీచు పీచు మనెను. తన కేదైన చిక్కు వచ్చునేమో యని పుల్లయ్య భయపడెను. కుశాగ్రబుద్ధియైన మహాదేవశాస్త్రి సమయోచితముగా నాలోచించి దేవాలయం యొక్క వీధి తల్పులు గట్టిగా మూసివేయించి పిల్లదాని యేడు పెవ్వరికి వినబడకుండ గట్టిగా మేళము చేయు మని భజంత్రీలతోఁ జెప్పెను. వారు గట్టిగా వాయించి యొకరిమా టొకరికి వినబడకుండఁ జేసిరి. పిల్లయేడ్పుగాని మహాదేవశాస్త్రి మంత్ర మూలుగానే యెవరికీ వినబడలేదు. ఏడ్చి, యేడ్చి పిల్ల నేలఁ బండుకొని నిద్రపోయెను. కదిపినయెడల మరల లేచి గోలసేయునేమో యను భయమున దానిని లేపక పండుకొని యుండగానే గణపతిచేత మహాదేవశాస్త్రి మంగళసూత్రములు కట్టించెను. నిద్రించుచుండగా గణపతి బుచ్చమ్మ తలమీద తలంబ్రాలు పోసెను. కాని బుచ్చమ్మ తలంబ్రాలు తనమీద పోయునట్టి భాగ్య మబ్బలేదని యతఁడు విచారించెను. ఏలాగో యొకలాగున వివాహమయ్యెను. మూడు పోచలు జందెము వదలిపోయి దూడకన్నెవంటి పెద్దయజ్ఞోపవీతము మెడలోఁ బడెను. మంగళస్నానము చేయించినట్లు కనబడ దేమని పూజారి ప్రశ్నవేయగా మహాదేవశాస్త్రి "మా యింటిదగ్గఱ మంగళస్నానములు చేయించి తీసికొని వచ్చినామయ్యా ! మంగళస్నానములు లేకుండ నేను వివాహము సేయింతునా?" యని యతడు తిరస్కారభావముగా బలికెను. " జడ జడపాళముగానే యున్నదే, మంగళ స్నానము లెట్లు చేయించితి" వని యతఁడు మరఁల బ్రశ్న వేయగా "జడ విప్పకుండగనె చేయించితి" నని బదులు చెప్పియతని రెండు రూపాయ లతనికిప్పించి, ఫలప్రదానము విశిష్టాద్వైత తాంబూల మతని కిప్పించి వాగ్భంధము చేయించెను. వివాహము సంపూర్ణమయ్యెను. బాలిక నడుమ నడుమ "అమ్మా !" యని యేడ్చుచు మరల నిద్రావశమునఁ గన్నులు మూయుచుండెను. బిడ్డను భుజముమీఁద బెట్టుకొని పుల్లయ్య మహా దేవశాస్త్రి యింటికి వెళ్ళి యక్కడ నొక మంచముమీఁద దానినిఁ బండుకొనబెట్టి తాను గణపతియు మహాదేవశాస్త్రియు మంగళంపల్లి నరసయ్యయుఁ గలసి భోజనము చేసిరి. భోజన మగునప్పటికి రెండుజాముల రాత్రి యయ్యెను. గణపతిని రెందు మూడు దినముల వర కక్కడనే యుండుమని చెప్పి పుల్లయ్య బుచ్చమ్మను దీసికొని బండి కట్టించుకొని మరల స్వగ్రామమునకు బయనమైపోయెను.
అక్కడ దీపాలవేళకు బిడ్డయింటికి రానందున గంగమ్మ చుట్టుప్రక్కల యిండ్లకుఁబోయి "మాపిల్ల మీయింటికి వచ్చినదా? మీ యింటికి వచ్చినదా?" యని యడిగెను. మాయింటికి రాలేదని కొందరు, వచ్చి యాడుకొని నాలుగు గడియల ప్రొద్దువేళనే వెళ్ళిపోయిన దని మరికొందరు చెప్పిరి. అంతకంతకు గంగమ్మకు భయమయ్యెను. కన్నుల నీరు పెట్టుకొనుచు గ్రామము నాలుగు మూలల వెదకెను. ఎవ్వరింటను బిడ్డ కనఁబడలేదు. నాగన్న కా వర్తమానము తెలిసి యతఁడు గూడ పరుగు పరుగున వచ్చి గ్రామమందలి గృహము లన్నియు వెదకుటయే గాక దొడ్లు, పొలములు, తోటలు, నూతులు, గోతులు వెదకెను.
ఎక్కడ వెదకినను బిడ్డ కనబడలేదు. బిడ్డ నెవ్వరో ద్వేషముచేతనో కాళ్ళనున్న చిన్నయందెల కాసపడియో చంపి పారవైచి యుందురని నిశ్చయించి యాలుమగలు మిగుల దుఃఖింప జొచ్చిరి. చుట్టుప్రక్కల వారందరు వారి నూరడింప వచ్చిరి. అన్నము వండుకొనక పొరుగువారు తమ యింటిలోఁ దినుమని బలవంత పెట్టినను దినక మూఁడుజాముల రాత్రివరకు శోకించి దుఃఖభారము చేతను నిద్రాభారము చేతను తెల్లవారు జామునఁ గన్ను మూసిరి. ఆప్తబంధువులు మృతి నొందుదురుగాక; సర్వస్వము నష్టమౌగాఁక ! మనుష్యుఁడు క్షుత్పి పాసానిద్రలకు మాత్రము లోఁబడక తప్పదుగదా! నాలుగు గడియలు వారికి గాఢమగు నిద్రపట్టెను. అప్పుడు పుల్లయ్య బుచ్చమ్మను భుజముమీఁదఁ బండుకొనఁబెట్టుకొని యెవ్వరు జూడకుండ నామెను నాగన్నగారి వీథి యరుగుఁమీఁద బండుకొనఁ బెట్టి పోయెను. బుచ్చమ్మ నిద్రావశమున నొడ లెరుఁగక యా యరుఁగు మీఁద గొంతసేపు పండుకొని మెలకువవచ్చి "అమ్మా! " యని పిలిచి గట్టిగా నేడువఁ జొచ్చెను. అప్పుడు నాగన్నకు మెలకువ వచ్చెను. అతడు తలుపు తెఱచి చూచునప్పటికి వెదకఁబోయిన తీఁగ కాళ్ళకుఁ దగిలినట్లు తనయరుఁగుమీఁదనే కనఁబడెను. "పిల్ల దొరికినది. పిల్లదొరికినది లేవవే!" యని కేకలు వేయుచు బిడ్డ నెత్తుకొని 'అమ్మాయి ! యెక్కడికి వెళ్ళినావు? ఎవరు తీసుకొని వెళ్ళినారు?' అని యడుగుచు లోపలకు దీసికొని పోయెను. గంగమ్మ భర్త కేకవిని, కలవరపడుచు లేచి "ఏదీ నాచిట్టితల్లి వచ్చిందా?" యని విసవిస భర్తకడకుఁ బోయి యాతని చంకనున్న బిడ్డను దానెత్తుకొనెను. తల్లిం గౌఁగిలించుకొని బిడ్డయు, బిడ్డను గౌఁగిలించుకొని తల్లియు నేడ్చిరి. అంతలోఁ జుట్టు ప్రక్కలవారందరుఁ జేరిరి. అప్పుడు తూర్పునఁ దెల్లవారెను. కాకులు కూయఁ జొచ్చెను. బుచ్చమ్మ మెడలో మంగళసూత్రము లగుపడెను. "ఇవిగో ! దీని మెడలో మంగళసూత్రము లున్నవి. ఎవరో తీసుకొని వెళ్ళి దొంగపెండ్లి చేసి కొన్నారు కాఁబోలు! ఎవరోగాదు. మాయచచ్చినాఁడు గణపతిగాడే యింతపని చేయగలవాఁడు. వీడి పెళ్ళి పెడాకులు గాను! ఎంతపని చేసినాఁడు. ఇవిగో! చూడండి పుస్తెలు!" అని గంగమ్మ మంగళసూత్రములు భర్తకుఁ దమ్ముఁ జూడవచ్చిన వారికిఁ జూపించెను. చూచి నాగన్న "ఔనౌను! ఇదిగో కాళ్ళకు బసుపు కూడ కనఁబడుచున్నది. కన్నుల కాటుక గూడ కనఁబడుచున్నది. పిల్ల యేడుపు వలన కొంతవరకు కాటుక కరగిపోయినది. పాప మెంత యేడ్చినదో యెంత బెంగ పెట్టుకొని నదో! "అమ్మా! నిన్నెవరు తీసుకవెళ్ళినారు? " అని కూతుఁనడిగె. మూఁడేండ్ల పిల్ల యగుటచే బుచ్చమ్మ మాటలు సరిగ రాక "వోరోబ్బి బన్నిమీద తీచికెళ్ళాడు." అని బదులుచెప్పెను. ఆమెను గణపతియే తప్పక తీసికొనిపోయి దొంగపెండ్లి చేసికొని యుండునని యచటివారందరు నిశ్చయించిరి. నాగన్నకు దుఃఖము కోపము మనంబున మల్లడిగొని నందున నవి యాపుకొనలేక పండ్లు పట పట గొరుకుచు "నోరెరుగని బిడ్డను దొంగతనముగా తీసికొనిపోయి పెండ్లి చేసికొని వీడు గృహస్థుడు కాదలచుకొన్నాడు కాఁబోలు! వెధవ పెండ్లి, బోడి పెండ్లి. ఆ వెధవ బ్రతుక్కు గృహస్థాశ్రమముకూడానా? ఆ పాడుముండకొడుకు ఘోటక బ్రహ్మచారియై చావవలసిందే గాని పెండ్లి కానిత్తునా? ఈపెళ్ళి పెళ్ళికాదు. ఆ వెధవ కిది పెండ్లాము కాదు. ఇదిగో! పెండ్లి పెడాకులు చేసినాను. నా కూతురికి నేను తిరిగి పెండ్లిచేయక మానను" అని మంగళసూత్రములు పుటుక్కునఁ ద్రెంచి పాఱవైచెను. అక్కడఁ జేరినవారిలో వద్దు వద్దా పని చేయవద్దని కొందరు, తుంటరిపని చేసినందు కా వెధవ కా శిక్ష కావలసినదే, యని కొందరు, శాస్త్ర మొప్పదని కొందరు, శాస్త్రము లేదు చట్టుబండలు లేవు, దొంగపెండ్లికి శాస్త్రమున్నదా? యని మరి కొందరు దోఁచిన చొప్పున బలుకఁ జొచ్చిరి. ఆ పలుకులువిని నాగన్న యిట్లనియె "ఆ శాస్త్రము చెప్పఁగలవాఁ రెవరో రమ్మను, నాకడుపు మండిపోవుచున్నప్పుడు ఆ శాస్త్ర మెందుకు. మీ శాస్త్రాలు గీస్త్రాలు తుంగలో వూరతొక్కుతాను. శాస్త్రాలు దొంగపెండ్లి చేసుకోమని చెప్పినవా యేమిటి? స్వాములవారు వెలివేసినప్పుడు చూచుకుందాములే. ఇదివరకు నేను నా పిల్ల నెవరి కియ్యదలచుకొన్నానో యతనికే యిచ్చివేసెదను. చూడు నాదెబ్బ. నా కూతురికి తిరిగి పెండ్లిచేయుటేగాదు. గణపతిగాడు కంటికగపడ్డాడా, చంపి, నెత్తురు బొట్టు పెట్టుకొంటా ననుకోండి. నరసింహమూర్తి హిరణ్యకశిపుని చంపి ప్రేగులు మెడలో వేసికొన్నట్లు వాడి ప్రేగులు నేను జందెముగా వేసికొనక మానను. సర్కారువారు న న్నురిదీసినను సరే. ఆ వెధవను నేను చంపక మానను. ఈ మారు వచ్చినాడంటే చచినా డన్నమాటే" అత డాలా గనుచుండ గంగమ్మ కంట దడిపెట్టుకొని గద్గద స్వరముతో నిట్లనియె. "ఒక్కగా నొక్క పిల్లగదమ్మా! అచ్చటా ముచ్చటా దీనివల్ల మాకు తీరు ననుకొన్నాము. సుఖముగా మే మిద్దరము పీఠలమీఁద గూర్చుండి చేతులార బిడ్డను కన్యాదానము చేయవలె ననుకొన్నాము. ఇంతలో మాయచచ్చినాఁడు మారీచుడు లాగ వచ్చి వాడి పెండ్లి పెడాకులుగాను వాడి దుంప తెగిపోను! వాడి కల్యాణం నేలబడ ! నా పిల్లకోసం నేను నిన్న రాత్రి యేడ్చినట్లు వాడితల్లి వాడికోసం యెప్పుడేడ్చునో, వాడి గూనె దింప; వాడి తల్లికడుపు మాడ, వాడింట పీనుగు వెళ్ళ, మా కండ్లలో దుమ్ముపోసి మాణిక్యములాగు ఆడుకొనుచున్న దానిని యెత్తుకొనిపోయి పుస్తెకట్టినడమ్మా. వీడి తాడు కోటిపల్లిరేవులో పుటుకు పటుక్కున తెంప! వాడి పిండాకూడు పిల్లులు తినిపోను. వాడి వంశము నిర్వంశముగాను. అంతంత మాటలడకూడ దంటారేమో మీరు. మేము వాడిచేత వాడి తల్లిచేత మహాకష్టాలు పడిపడి యున్నాము. అందుచేత నా ప్రాణం విసిగిపోయింది. ఆ చండాలపు ముండాకొడుకు నే మన్నప్పటికి తప్పు లేదు."
అనుచు గంగమ్మ గంగాప్రవాహమువంటి శాపపరంపరను నోటనుండి వెలివరచుచుండ నాగన్న తన తిట్ల చేత నామె తిట్లకు వన్నెపెట్టుచు గొంతు బొంగుబోవునట్లు మేనల్లుని చంపుదు నని తోడబుట్టిన పడుచుని జంపివేయుదు నని ప్రతినలు సలుపుచు వీథి ప్రహ్లాద నాటకములో నరసింహమూర్తి చిందులు త్రొక్కినట్లు చిందులఁ ద్రొక్కి పరుగు లెత్తినట్లు పరుగులెత్తెను. నరసింహమూర్తిని బట్టుకొన్నట్లు చూడవచ్చినవారాయనను బట్టుకొని నాటకము సమాప్త మైన దని ప్రేక్షకులొక్కరొక్కరే వెడలిపోయిరి. అన్నగారి ప్రతిజ్ఞలను, వదినెగారి తిట్లను గణపతియొక్క తల్లి ప్రక్కయింటి దొడ్డిలోనుండి విని, తన సోదరుఁడు కొడుకుం జంపివేయు నేమో యని భయపడి చప్పు చప్పున సోదర జ్ఞాతి యగు పుల్లయ్య యింటికిఁబోయి "పుల్లయ్యన్నయ్యా! నా మాటేమి చెప్పినావురా, నాయనా! గణపతిని మావాడు చంపి నెత్తురు బొట్టు పెట్టెకుంటా నని ప్రతిజ్ఞ చేసినాడు. నాబిడ్డను బ్రతికించరా, నాయనా! నాకు పుత్రభిక్షము పెట్టరా నాయనా! నే నేమి జేతునోయి పుల్లయ్య తండ్రీ ! నా గణపతిని నాకప్పగించవోయి పుల్లయ్యతండ్రీ! ఈ పెండ్లి వాడి ప్రాణముకోసమొచ్చింది గాబోలునోయి నాయనా? పెండ్లి లేకపోయినా బ్రతికిపోదువోయి తండ్రీ! వాడెక్కడున్నాఁడో చూపించవోయి తండ్రీ! వాడు కనబడకపోతే నేను బ్రతకలేను, నాయనా!" యని పలువిధముల విలపించి వానిని రక్షింపుమని వేడికొనెను. ఆమె దీనాలాపములువిని పుల్లయ్య "ఓసీ వెఱ్ఱి ముండ! నీవింత తెలివితక్కువదానవు గనుకనే వాండ్లు నిన్నీ లాగున యేడిపించినారు. నాగన్న పరవళ్లు తొక్కగానే సరటే? చంపుతా ననగానే చంపగలడా? నెత్తురు బొట్టు పెట్టుకోగలడా? ఈ యవక తవక కూతలకు కోతలకు వట్టి వెఱ్ఱిముండవు గనుక నీవు భయపడు చున్నావు కాని యెఱిగిన వా రెవ్వరు భయపడరు. ‘వెధవ నాగన్న కాఁబోలు వెలఁదిమగఁడు’ అన్నట్లు నాగన్న సంగతి యెవ్వ రెఱుఁగరు. వీరు గణపతిని చంపితే సర్కారువా రురితీయక మానుదురా? భయపడకు వెళ్ళు. గణపతి ప్రాణానికి నా ప్రాణ మడ్డము వేయగలను. ఏ భయము లేదు. మంగళసూత్రాలు తెంపివేసినాడు గాఁబోలేమి? తెంపనీ తెంపనీ ! కోర్టులో వ్యాజ్యము వేసి నాగన్న తాడు నేను తెంపుతాను. నీవు వెళ్ళు భోజనముచేసి, మా యింటికి రా. గణపతిని నేను తీసికొనివచ్చి నీ కప్పగింతునులే” యని ధైర్యము చెప్పి యామెను పంపెను.
పంపి, యానాటి సాయంకాలము బయలుదేఱి పుల్లయ్య వానపల్లి వెళ్ళి మహాదేవశాస్త్రి యింట మనుకుడుపు పెండ్లి కొడుకైయున్న గణపతిని జూచి మేనమామ యాడిన నాటకమంతయు దెలిపి యిట్లనియె,--
"నీ మేనమామ మోటముండకొడుకు. నీవు కంటబడితివా చప్పున దుడ్డు కఱ్ఱతో బుఱ్ఱ బద్దలు కొట్టగలఁడు. నెత్తి పగిలెనా ప్రాణము పోగలదు. తల్లి కొక్కడవు. ఆ ముసలి ముండ నిన్నే నమ్ముకొని యున్నది. కనుక నీవా గ్రామము పది దినములఁదాక రావద్దు. కాని మీ యమ్మ నిన్ను చూడవలెనని యేడ్చుచున్నది. దానినే నీదగ్గరికి పంపించెదను. పిల్ల పుస్తెలు తెంపివేసినా డని విచారింపకు ! నే నెక్కడో నొక చోట పిల్లను మాట్లాడి నీకు మరల వివాహము చేసెదను. ఒక వేళ నిన్నెవరైన పిలిచి పిల్లను దొంగతనముగా దీసికొని వచ్చి నీ కెవరు పెండ్లి చేసినారని అడిగిన పక్షమున నా పేరు చెప్పకు. నా కొంప ముంచకు. నాగన్న నా కొంప ముంచగలఁడు. ఏ పొలమో వెళ్ళి వచ్చునపుడు దారిలో నా తల పగుల గొట్టగలఁడు. ఈ మాట గట్టిగా జ్ఞాపకముంచుకో.” అని నొక్కి నొక్కి చెప్పి, తన పేరు బయట పెట్టకుండునట్లు చేతిలోఁ జేయి వేయించుకొని, మరునాఁ డుదయమున నింటికి వచ్చి గణపతి క్షేమముగా నున్నాఁడని శుభవార్త తల్లి కెఱింగించెను. తల్లియుఁ గుమారుని జూడఁ గోరినందున నొక కూలివానిని సాయమిచ్చి యామెను వానపల్లి పంపెను. ఆమెయు గూలివాని సాయమున వానపల్లి చేరి, మహాదేవశాస్త్రి గృహమున కరిగి పోత విగ్రహము వలె వీథి యరుగుఁమీఁద గూర్చున్న కుమారునిఁ జూచి, కౌఁగిలించుకొని యిట్లు విచారించెను. “నా తండ్రీ! పసుపు పారాణి కాళ్ళకు పెట్టుకొని, మొగమున కళ్యాణపు బొట్టు పెట్టుకొని కన్నులకు కాటుకపెట్టికొని బుగ్గను చుక్క బెట్టికొని, పల్లకిలో కూర్చుండగా చూడవలె నని యెంతో అంత ముచ్చటపడితిరా, నాయనా! నా కన్నులు కాలిపోను. ఆ యదృష్టము నాకు లేదురా, నాయనా! తక్కువ నోములు నోచినవారి కెక్కువ ఫలములు వచ్చునటరా, నాయనా! వంశము నిలుచు ననుకొన్నానురా నాయనా! పుల్లయ్య మన కుపకారం చేసినాడు గాని దైవమోర్చలేదురా, నాయనా! ఆ దుర్మార్గపు ముండకొడుకు మంగళసూత్రాలు తెంపి వేసినాఁడు, వాడిచేతులు పడిపోను ! పోనీ విచారించకు, నాయనా పెండ్లి కాకపోతే బ్రహ్మచారివై యుందువుగాని, నాకంఠములో ప్రాణ మున్నట్టయిన నిన్నేదో విధముగ గృహస్థుని చేయక మానను; నీవు బెంగ పెట్టుకోకు" అని యూరఁడబలికి గణపతిని ముద్దు పెట్టుకొని, యతఁడు దోడ్కొనిపోవ మహాదేవశాస్త్రి గారి లోపలికిఁ బోయి శాస్త్రి యొక్కయు, వారి యాఁడువాండ్ర యొక్కయు సన్మానము బడసి యాపూట నచ్చట నత్తెసరు పెట్టికొని భోజనము చేసెను. భోజనానంతరమున మాతాపుత్రులు తమ భవిష్యజ్జీవనమున గూర్చి గట్టిగా నాలోచింపఁ దొడఁగిరి. ఏనుఁగులమహలులో నున్న పక్షమున మేనమామ తప్పక చంపి వేయు నని భయము పుట్టెను. మఱియొక చోటికిఁ బోయిన పక్షమున నక్కడ జీవనోపాధి యెట్లని సంశయము పొడమెను. ఆ పూట వారి కాలోచనలు తెగలేదు. నాఁటి రాత్రియు మరునాడును గూడ వా రా విషయమై యాలోచించిరి గాని యిదమిత్థమని నిర్ణయింపలేక పోయిరి.