గణపతి/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

పదునొకండవ నాఁటి రాత్రి గ్రామచావడి యరుఁగు మీఁద గణపతి మిత్రబృంద సమేతుఁడై పండుకొని నెచ్చెలులతో నిట్లు ప్రసంగించెను.

"ఒరే! యజమానుఁడు కాళ్ళబేరమునకు వచ్చినాడు కాని యతఁ డేదో నాలుగు తుక్కుగుడ్డలు తెప్పించి యివే కోటుగుడ్డలు పుచ్చుకోండి యనునేమో అందుచేత మనము మంచి గుడ్డలు కోరుకోవలెను. ఏ రకము గుడ్డలు బాగుండునో మన మాలోచించుకొనవలెను. చలికాలములో తొడుగుకొనుటకు మంచి బనారసు గుడ్డలు కావలెనని కోరుకొందమా, లేకపోయిన మంచి పట్టుబట్టలు కోరుకొందమా? అతలష్ గుడ్డ లడుగుదమా? ఏ రంగు గుడ్డ లడుగుదము? చారల గుడ్డలున్నవి అందులో తెల్లచారలు నల్లచారలు పచ్చచారలు నెఱ్ఱచారలు గల గుడ్డలున్నవి. మనలో నెవరెవరి కేగుడ్డలు బాగుండునో యవి కోరుకోవలెను. నా మట్టుకు నాకే గుడ్డ బాగుండునో మీరు చెప్పండి!" అనుటయు "ఒరే! గణపతి నీ కెఱ్ఱబనారసు గుడ్డ బాగుండునురా" యని యొకఁడు. "నల్లబనారసు బాగుండునురా, రంగు రంగులో కలిసిపోవు" నని యొకఁడు, "ఒరే చాఱల గుడ్డ బాగున్నదిరా, పెద్దపులిలాగ నుండగల" వని వేఱొకఁడు పలికెను. "ఛీ! మీ సలహాలు నాకు బాగులేవు. నేను పట్టుగుడ్డ కోటు కుట్టించుకొందును. వంగపండు చాయ పట్టుగుడ్డ మీఁద నా కెంత కాలము నుండియో మనసుగా నున్నది. ఆ" గుడ్డ నిమ్మని నేను కోరెదను. మీరేమందురు?" అని గణపతి వారి నడిగెను. "సరే! యదే కోరు" మని వారైక్యకంఠ్యముగఁ బలికిరి. ఎవరి గొంతెమ్మకోరికె వాఁడు కోరెను. మాట లాడుచుండఁగానే యొక్కొక్కరి కన్నులు మూతపడెను. అందఱు గుఱుపట్టి నిద్రించిరి. అందఱు తమ కిష్టములైన గుడ్డను కోట్లు కుట్టించుకుని ధరించుకొని తిరిగినట్లు స్వప్నములు గాంచిరి. తాను కుట్టించుకున్న వంగపండు చాయకోటు తన స్నేహితులలో నొకఁ డెరువు పుచ్చుకున్నట్లు, మరల దానిం దెచ్చి యీయక యపహరించినట్లు గణపతి కలగని, కోపముతో కలలోనే స్నేహితునిమీఁద చేయి విసరెను. కోటు నపహరించుట కలలోని వార్తయైనను చేయి విసరుట వలన దన ప్రక్కనె నిద్రించుచున్న మిత్రునకు మాత్రము చెంపకాయ గట్టిగాఁ దగిలెను. దానితో నతఁ డులికిపడి లేచి "యెవఁడురా నన్ను కొట్టినాఁ" డని బిగ్గరరా నఱచుచు నల్లరి జేసెను. గణపతికి మెలఁకువ రాలేదు. తక్కినవాఱందరు లేచిరి. మేలుకొన్న వారందఱు ప్రయత్నముమీఁద గణపతిని మేల్కొల్ప నతఁడు తాను నిద్రలో సల్పిన దుండగ మెఱుగక నతనికిఁ దగిలిన దెబ్బకుఁ గారణ మేమి యని పలువిధముల విచారించి యెట్టకేల కిట్లనియె. "ఒరే! అప్పుడప్పుడు దయ్యములు వచ్చి మనుష్యులు నిద్దురపోవు చున్నప్పుడు బాధపెట్టుచుండును. ఒకప్పుడు రాత్రులు మనము పండుకొనఁ బోవునప్పటి కేమియు లేక తెల్లవారు నప్పటికి శరీరము మీఁద రక్కులు గీరులు గనఁబడును. ఒకప్పుడు తెల్లవారు నప్ప" టికి మన చేతులు వాచును. నిద్రలో నన్నెవరు బరికినారు? ఎవరు రక్కినారు? ఎవరు విరిచినారు? దయ్యమువచ్చి యాపనులు చేయుచుండును. నిన్ను కూడ దయ్యమే కొట్టియుండును. దయ్యమని భయపడవలసిన పనిలేదు. ఇవి ప్రతిదినము జరుగుచున్న ముచ్చటలే. అవి కొంటెతనము కోస మిటువంటి పనులు జేయును గాని హాని చేయుటకుఁ గాదు. చిన్నపిల్ల లెవరైన మనకు ముద్దుగాఁ గనబడి నప్పుడు మనము వాళ్ళ బుగ్గ గిల్లియో చిన్న చెంపకాయ గొట్టియో చేతిలో నున్న వస్తువు లాగికొనియో వారిని మన మేడిపించుచుందుము కదా! తమాషాకే మన మాపని జేయు చుందుము గాని బిడ్డల నేడిపించుట కని యుద్దేశ మున్నదా? అలాగే దయ్యములు గూడ మంచి యుద్దేశముతోఁ జమత్కారము కోస మిటువంటి పనులు చేయును. కాబట్టి భయపడ నక్కఱలేదు." ఆ యుపన్యాసము విని దెబ్బ తిన్నయతఁడు సంతుష్టుఁ డయ్యెను. అప్పుడు తెల్లవారు జామగుటచే మేలుకొన్న వారిలో గణపతి దక్క తక్కినవారు మరల నిద్రింపరైరి. అంతలో నాల్గవ జాము కోడి కూసెను. కొంత సేపటికిఁ దెల్లవాఱెను. కాలకృత్యములు దీర్చికొని గణపతి సపరివారముగ యజమానుని కడకుఁబోయి "అయ్యా ! కోటు గుడ్డలలో మీ ఇష్టము వచ్చినవి దెప్పించుటకు వీలులేదు. మేము మా కోరికలు చెప్పెదము. ఆ ప్రకారము దెప్పింపవలెను. నాకు వంగపండు చాయ పట్టుబట్ట కావలెను. తక్కిన వాండ్రు తమకు గావల సిన గుడ్డలు తామే చెప్పుదు రడుగండి!" యని చెప్పెను. యజమానుఁడు ముందు మాట లాడక యప్పలుకులు విని గణపతి వంక తేఱిచూచి "సరే! మీమీ కోరికల ప్రకారమె చేసెదను లెండి" యని బదులు చెప్పెను. తక్కిన వాండ్రుఁ గూఁడ దమ మనోరథములు దెలిపిరి. అనంతరము గణపతి వారి నందఱను వెంటఁబెట్టుకుని చెఱువునకుఁ బోయి స్నానముచేసి వచ్చెను. ఆ దిన మేడుగురు భోక్తలే కావలసినను యజమానుఁ డందఱు భోక్తల కన్నము బెట్టి సంతుష్టులఁ జేసెను.

భోజనానంతరమున మాకు సెలవు దయ చేయుఁ డని గణపతి ప్రముఖులు యజమాను నడిగిరి. "మీరు కోరిన బహుమానము లీ రాత్రి దెప్పించుచున్నాను. రేపుదయమున మీరు వెళ్ళవచ్చు" నని యజమానుఁడు బదులు చెప్పెను. సంతుష్టహృదయులై వారంద ఱచ్చట నా రాత్రి నిలువఁదలఁచిరి. గణపతి యాకారముచేత గాకపోయినను గొప్ప యాకలిచేతనైన వృకోదరుం డగుటచే నతనికి నా రెండు దినములలో రాత్రి మిక్కిలి యాఁకలిబాధ కలిగెను. ఉదయమున జల్ది కూడు లేకపోటొకటి, రాత్రి మజ్జిగన్నమైన దొరకక పోవుట యొకటి ఈ రెండు లోపముల చేత నతఁడు మధ్యాహ్నమునఁ గుడుముల తోడను సుష్టుగా భుజించినను రాత్రి పేరాకలికి నకనకబడి, తెల్లవారు నప్పటికి వాడి వత్తియయ్యెను. పండ్రెండవ నాఁటి రాత్రి క్షుధానలము యొక్క దండయాత్ర కాతని గర్భకోశ మాగజాలక పోయెను. అందుచే నతఁ డుదరశాంతికై ప్రయత్నములు చేయఁజొచ్చెను. ఒక నిముస మాలోచించి నప్పటి కుపాయము దోఁచెను. ఆ గ్రామమున నతని తల్లికి దూరపు జుట్టమైన యొక ముసలమ్మ యుండవలెనని యతనికి జ్ఞప్తి వచ్చెను. రాఁగానె తన మిత్రబృందమును విడిచి యా యవ్వ బస యెక్కడని గ్రామమున భోగట్టచేసి తెలిసికొని, యామె యింటికిఁ బోయి పలుకరించి తన్నెఱిఁగించుకొనెను. ఆ యవ్వయు నతనిని గౌరవించి వచ్చిన పని యడిగి, యతఁడు భోక్తగా వచ్చిన వాఁడని యతని నోటనే విని, బ్రాహ్మణార్థపు మైల సోకినందున దూరముగాఁ గూర్చుండు మని నాలుగు మాటలాడి 'నాయనా! పొయ్యిమీఁద రొట్టె వైచినాను. మాడిపోవుచున్న దేమో' యని లోపలికి బోయెను. గణపతి పడమటింటి గుమ్మము ముందరే గూర్చుండెను. రొట్టె కాలిన తరువాత ముసలమ్మ పడమటి యింట హద్దు గోడవద్ద రొట్టెతో నున్న బూరెల మూఁకుడు పెట్టి, బిందెడు నీళ్ళు తోడి తెచ్చుకొనుటకు దొడ్డిలోని నూతి కడకుఁ బోయెను. ఆ బూరెలమూకుఁడు చూచినది మొదలు కొని గణపతి కన్ను లా రొట్టెమీఁదనే యుండెను. నూరూరఁ జొచ్చెను. ఎంత కాలమునుండియో తినుట కేమియు లేక మలమల మాడుచున్న వానివలె నతఁడెట్లయిన దానిని గ్రహించి తిని ప్రాణము నిలుపుకొన సంకల్పించెను. పొట్ట యుపాయముల పుట్ట యగుటచే నాలశ్యము లేకయే యతని కుపాయము దోఁచెను. కుక్క యచ్చటికి రాకపోయినను గణపతియె తత్కాలమున శునకరూపమెత్త మూఁకుడు జరజర లాగి "ఛీఛీఛీ! లేలే కఱ్ఱదే!" యని కేకలు వైచెను. ముసలమ్మ బిందె యెత్తుకుని వచ్చు చుండఁగా నీ మాట లామె చెవిని బడెను. పడుటయు విసవిస నడిచి "నాయనా! కుక్క వచ్చినదా యేమిటి? దానితల బ్రద్దలైపోను. ఆ నల్లకుక్క నా నెత్తురు పీల్చివైచుచున్నది. కొంపత్రవ్వి రొట్టె ముట్టుకోలేదుగదా" యని బిందె దింపెను. అనవుడు గణపతి యిట్లనియె. "అయ్యో! అవ్వా! నేను పరధ్యానముగా నటువైపు తిరిగి కూర్చుండఁగా మూఁకుడు జరజరలాగినట్లు చప్పుడైనది. ఇట్టె తిరిగిచూడఁగా నల్లకుక్క లాగున్నది. వెంటనే దానిని కొట్టితిని. ఈ దారినే పాఱిపోయినది. పెద్ద గుఱ్ఱములా గున్నది. పాపము సిద్ధముగా నున్న రొట్టె పోయినది. నూతికి వెళ్ళినప్పుడు కుక్క బాధ యున్నది. జాగ్రత్తగాఁ జూచు చుండు మని చెప్పినావు కావు. పాపము! నీ వీరాత్రి యూరక పండుకోవలెను గాఁబోలు! కొంచె మటుకులైన నానవైచికొని తిను." అనుచుండ నా ముసలమ్మ ఇట్లనియె. "నాయనా ! అటుకులున్నవి. చిటికలో నానవైచికొని తినగలను. కాని రొట్టె పోయినందు కే విచారము లేదు. ఇప్పుడీ కుక్క యెంగిలి ముట్టుకొని స్నానము చేయలేను. పెద్దదానను, కొంచెము జబ్బుగా నున్నది. ఎలాగా యని యాలోచించు చున్నాను." అనవుడు గణపతి చివాలున లేచి "అవ్వా! నేను పరాయి వాడనా? నేను నీమనుమఁడనె యనుకో! నేను మైల భోజనము చేసినాను గనుక రేపుదయమున స్నానము చేయవలెను. ఈ రాత్రి నాకు భోజనము లేదు. ఈ బూరెల మూఁకుడు చెఱువు గట్టునకు దీసికొనిపోయి రొట్టె యే కాపుల కుఱ్ఱవానికో బెట్టి మరల మూకుఁడు దెచ్చి నీకప్పగించి యీ స్థల మలికి వెళ్ళెదను" అని యామె మైలపడకుండునట్టి యుపాయము జెప్పెను. రొట్టె పోయినందుకు ఆమె విచారింపక కుక్కయెంగిలి ముట్టుకొనకుండఁ దనపాలిటి దైవమువలె గణపతి వచ్చి తనకు సహాయము చేసి నందుకు సంతసించి "నాయనా ! ఈ పని నేనే నీకు జెప్పుటకు సందేహించి యూరకుంటిని. కావలసిన వాఁడవు గనుక మనస్సులో నెరమరిక లేక యీ పని కొప్పుకొంటివి. ముసలమ్మ మీఁద నెంతో యభిమానముతో ఎక్క డున్నానోయని వెదకికొనివచ్చి నాకీ పూట సాయము జేసితివి. రేపు శుద్ధిస్నానము చేసి మా యింట పట్టెడు మెతుకు దిని వెళ్ళు, నాయనా! " యనెను. "రేపు గ్రామములో నున్న పక్షమున నాలాగే చేసెదనులే, ఇదిగో బూరెల మూకుడు తీసికొనిపోవుచున్నాను. వెంటనే వచ్చెద" నని చెప్పి యాబూరెల మూఁకుడు చెఱువుగట్టుకుఁ దీసికొని పోయి పాలు గోరుచున్న మిత్రుల కీమాట చెప్పక రావిచెట్టుక్రింద బెట్టుకొని రొట్టె రవంతయు మిగులకుండ దిని నీళ్ళుద్రాగి గఱ్ఱున త్రేన్చి, యా మూకుఁడు తానే తోమి కడిగి యవ్వ కప్పగించి కుక్క ముట్టుకొన్న చోట గోమయముతో నలికి శుద్ధిచేసి ముసలమ్మను వీడ్కొని వెన్నెల రాత్రియగుటచేతను రెండు గడియల ప్రొద్దు కంటె నెక్కుడు కాకపోవుట చేతను నిర్భయముగా మిత్రులున్న చోటికి వెళ్ళి పండుకొనియెను.

మరునాడు తెలతెల వాఱుచుండగా భోక్తలు పండుకొన్న చోటి కొక బ్రాహ్మణుఁడు వచ్చి గణపతిని లేపి యజమానుఁడు పిలుచు చున్నాడని చెప్పెను. గణపతి కన్నులు నులుము కొనుచు లేచి తన మిత్రులం జూచి "ఓరీ! కోటుగుడ్డలు వచ్చినవి కాఁబోలు, అందుకే నా నిమిత్తమై యాయన వర్తమానమంపించినారు. నేను వెళ్ళి యిప్పుడే వచ్చెదను. మీరిక్కడుండుడి" యని చెప్పి యాతనివెంట నడచుచు "ఏమయ్యా ! ఎందుకు నాకోసము వర్తమాన మంపించినారు? గుడ్డలు తెప్పించినారా యేమిటి? మంచివేనా గుడ్డలు? చాఱల గుడ్డలు వచ్చినవా? చాలా త్వరగా దెచ్చినారే, గుడ్డలు!" అని గుడ్డల విషయమై తనకుగల యాత్రము దెలుపఁ జొచ్చెను. తోడుకొని పోవుచున్న బ్రాహ్మణుడు వాని మాటలు విని తనలోఁ దాను నవ్వుకొనుచు "ఎందుకు వర్తమాన మంపించినారో నేనెఱుంగను. మంచి మంచి గుడ్డలు వచ్చినవని చెప్పుకొన్నారు. అందులో మీకు మిక్కిలి ప్రశస్తమైన బహుమానము చేయదలంచు కొన్నారని విన్నాను!" అని చమత్కారముగాఁ బ్రత్యుత్తరము జెప్పెను. అప్పుడు గణపతి మన సెట్లున్నదో వర్ణింపఁ దరమా? యజమానుఁడు తాను కోరిన గుడ్డ లిచ్చినట్లు తానది జంగము చేతి కిచ్చి కుట్టించుకొన్నట్లు, తొడుగు కొన్నట్లు, షికారు చేసినట్లు గూడ నతని కప్పుడే తోఁచెను. ఏ జంగము చేతి కిచ్చి కోటు కుట్టింతునా? యని యాలోచింపఁ దొడంగెను. స్వగ్రామమందున్న కుట్టుపనివాండ్రు పల్లెటూరి వాండ్రగుటచే కత్తిరింపులు సరిగా జేయ లేరనియు, గుట్టు నాజూకుగా నుండదనియు దలచి యాగుడ్డ బట్టుకొని రాజమహేంద్రవరము వెళ్ళి యచ్చట మిక్కిలి సొగసుగాఁ గుట్టు జంగము చేతికిచ్చి కుట్టించుట మంచిదని నిశ్చయించుకొనెను. తక్కిన శ్రాద్ధబోక్తలవలెఁ దాను సైనుగుడ్డ పుచ్చుకొనక తోడి బ్రహ్మచారులచేత గట్టికట్టుకట్టించి తన కోరికె ప్రకారము కోటుగుడ్డలే పుచ్చుకొన గలిగినందుకుఁ దన పంతము నెగ్గించు కొన్నందుకు మిక్కిలి సంతోషించుచు గణపతి యతని వెంటఁ బోయెను. ఆ బ్రాహ్మణుఁ డతనిని యజమానుని యింటిలో మిక్కిలి లోపలి గదిలోనికిఁ దీసికొనిపోయెను. యజమానుఁడు మంచముమీఁద గూర్చుండెను. ఆయన యొద్ద మెరియలవంటి వంటబ్రాహ్మణు లిద్దఱు నిలిచియుండిరి. గణపతి రాఁగానే యజమానుఁ డతనిని జూచి "ఏమయ్యా! కోటుగుడ్డలు రాలేదు. సైనుగుడ్డలు తీసుకొందువా లేదా!" యని యడిగెను. "నాకు సైనుగుడ్డ లక్కఱలే" దని కోపమును గ్రక్కు మొగముతో నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. "అట్లైన నీవిప్పుడేమి చేసెదవు? చేతులు నలుపు కొనుచు వెళ్ళిపో" యని యజమానుఁడు పలికెను. "అబ్బ ! చేతులు నలుపుకొనుచు వెళ్ళిపోవలెనే? ఈ మాత్రపు దానికి మమ్మెందు కాపవలెను! తప్పక యిచ్చెద నని శ్రాద్ధము సరిగా జరిపించుకొని, యేఱుదాటి తెప్ప తగుల వైచిన ట్లవసరము తీరిన పిదప చేతులు నలుపుకొనుచు వెళ్ళు మందురా? సరే! ఈ మాటు అవసరము దాటినదిగదా యని మీరు సంతోషించు చున్నారు గాబోలు ! ఇంతటితో నైపోయినదా? ఈ వేళ కాకపోతే రేపైనా తిరిగి అవసరము రాదా? మీరు చావరా? మీ బందుగులు చావరా? అప్పుడు భోక్తలతో నవసరముండదా? అప్పుడే మీ పని చెప్పగలను. తొందర పడకండి. ఇల్లలకగానే పండుగ కాలేదు. తొందర పడకండి! తద్దినపు మంత్రము జెప్పెడు వాండ్రతోను భోక్తలతోను అవసరము లేనివాఁడు లోకములో లేఁడుగదా!" యని గణపతి క్రోధావేశంబున నౌచిత్య మెఱుఁగక నోటికి వచ్చినట్లు బ్రసంగించెను. యజమానుని మనసులో నదివఱకే రవులుచున్న కోపాగ్ని నా పలుకులు మండించెను. కోపాగ్ని ప్రజ్వరిల్లుటయు యజమానుఁడును "ఊరకున్నా రేమిరా?" యని ప్రక్క నిలిచిన వంట వాండ్రతో ననియెను. అనుటయు నా వంటవాం డ్రిరువురును గణపతిని బట్టి కొల్లాయి గుడ్డతో నతనిని పందిరిపట్టె మంచపు కోటికిఁ గట్టి వైచిరి. యజమానుఁడు క్రొత్తగా చెట్టునుండి కోసి తెచ్చిన పొడువాటి యీత జువ్వ తీసికొని "భడవా? తుంతరి వెధవా! శ్రాద్ధబ్రాహ్మణార్థములు చేసి పదిమంది నాశ్రయించి" బ్రదుకవలసిన కుంకవు! నాలుగు కొల్లాయి గుడ్డలు కట్టుకొని కాలక్షేపము చేయవలసిన చచ్చుపీనుఁగవు! నీకు కోటులు నీటులు కావలెనా ! పోకిరీవేషములు వేయఁదలఁచి, భోక్తగాఁ గూర్చుండి యర్చించిన తరువాత గొంతెమ్మ కోరికలు గోరి శ్రాద్ధము భంగము చేయుదువా? ముందెన్నఁడయిన నిటువంటి పనులు చేయవు గదా?" యని యా జువ్వతో వీపుమీఁద రెండు దెబ్బలు కొట్టెను. పాపము, గణపతి 'స్థానబలిమి గాని తన బలిమి గాదయా విశ్వదాభిరామ వినురవేమ' యనినట్లు పూర్వకు బింకమంతయు వదలి "బాబోయి! బాబోయి! ఇకముం దెన్నఁడు చేయనండి ! రక్షించండి ! బుద్ధితక్కు వొచ్చింది, నా వల్ల !" యని యేడ్చుచు వేడుకొనెను. బ్రాహ్మణుని - అందులోఁ దన యింటికి శ్రాద్ధ భోక్తగా వచ్చియున్నవాని - నంతకంటె నెక్కువగా శిక్షింపఁగూడదని యా రెండు దెబ్బలతోనె శిక్ష చాలించి, కట్టు విప్పించి యిట్లనియె. "జాగ్రత్త ! బుద్ధిగల్గి బ్రతుకు. మన దేశములో బ్రాహ్మణులంటే మిక్కిలి భక్తి గనుక బ్రాహ్మణుఁడేమిచేసినను జెల్లు ననుకొంటివి కాబోలు. భోజనము దగ్గఱ నీ వాగడము చేయుటయే గాక మీరు చావరా, మీ బందుగులు చావరా యని మొదలు పెట్టితివి. ఈ లాగున మఱియొకసారి ప్రేలితివా త్రవ్వి పాతిపెట్టించెదను. చర్మము నొలిపించెదను. నీ ఋణము నే నుంచుకొన దలఁపలేదు. ఒక్కొక్క భోక్తకు రెండేసి సైనుగుడ్డలు మేమీయఁ దలఁచుకొన్నాము. నీకు నీ జట్టుపిల్లలకు రావలసిన సైనుగుడ్డ లివిగో ! ఇవి మూటగట్టుకొని తీసికొనిపోయి వారి కిచ్చి తిన్నగా నీ దారినపో !" యని గుడ్డలమూట జూపెను. గణపతి కిక్కురుమనకుండ నెంతో బుద్ధిమంతుఁడై యా మూట పట్టుకొని కన్నుల నీరచ్చటనె తుడిచి కొని తన మిత్రు లున్న చోటి కరిగెను. గణపతి మిక్కిలి సొగసైన గుడ్డలు తెచ్చునని వాటిని జూడవలయునని మిత్రు లెంతో ముచ్చటపడుచు వాని యాగమనమునకు నిరీక్షించు చుండిరి. అంతలో గణపతి గుడ్డలమూట తీసికొని వెళ్ళుటయు మూటలో నున్నవి ముద్దినుసు కోటుగుడ్డ లనుకొని పండ్లగంప చుట్టు పిల్లలు మూగినట్లు వా రాతని చుట్టు మూగి, మూట క్రిందకి లాగి విప్పి చూచి విస్మితులై "ఇదేమిరా ! గణపతీ ! చిట్టచివరకు సైనుగుడ్డలే పట్టుకొని వచ్చినావు. వ్రతము చెడినను ఫలము దక్కవలయును గదా! మనము రెండు విధముల భ్రష్టులమైతిమి. నలుగురితో మనకుగూడ నీ గుడ్డలే యిచ్చినప్పుడు పుచ్చుకొనక తెగనీల్గితిమి. కోటుగుడ్డలు కావలెనని గోల చేసితిమి. ఇప్పు డా సైనుగుడ్డలే రహస్యముగాఁ బుచ్చుకొనుచుంటిమి. మాచేత నీవు కట్టుగట్టించి మమ్మల్లరిపాలు చేయుటకా, యీగొడవ. నిన్ను నమ్ముకొనుట కుక్కతోక పట్టుకొని గోదావరీదుట! ఇటు వంటి పని యేల చేసితివి? ఈ గుడ్డలు పుచ్చుకొమ్మని నీతో మేము చెప్పితిమా? మా యిష్టములేకుండ నీ వేల తేవలెను" అని యిష్టము వచ్చిన ట్లతనిని మందలించిరి. కారణ మేదో చెప్పకపోయిన పక్ష మున వారు సంతుష్టిచెందరు. గావున గణపతి నిమిష మాలోచించి వారి మనస్సులు తృప్తి పొందించుటకై యిట్లు చెప్పెను. "ఓరీ ! వెఱ్ఱికుంకలారా ! దండుగు బేరములో దిగుటకు నే నంత పిచ్చివాఁడనా? దీని కొక కారణమున్నది. చెప్పెద వినుండు. పాప మా యజమానుడు మిక్కిలి మంచివాడు. కాని డబ్బులేదట ! యింటి డాబు, వాకిలి డాబే గాని-డబ్బు లేదట. సంసారము మేడిపండు వాటముగా నున్నదట! ఆయన నన్ను రప్పించిన పని యేమను కొన్నారు? పాపము! సంపన్నగృహస్థుడు నన్ను బిలిపించి నా రెండు చేతులు బట్టుకొని 'నాయనా గణపతీ! ఇవి చేతులు గావు కాళ్ళుసుమీ, నా పరువు కాపాడవలెను. నేను వట్టి వ్యర్థుఁడను. ఋణములబాలై యున్నాను. ప్రస్తుతము కోటుగుడ్డలు నీకియ్యలేను. ఇప్పటి కీ సైను గుడ్డలు పుచ్చుకొని సంతోషించవలసినది. మీస్నేహితులు నీవు చెప్పినట్లు నడుచుకొందురు. నీ కున్న పలుకుబడి నిజముగా మహారాజునకైన లేదు. నీ స్నేహితులతో మాట్లాడి వారి నొడఁబరచి నన్నొకదరికి జేర్చవలె' నని వేడుకొన్నాఁడురా! అంతవాఁడు నాచేతులు పట్టుకొని ఎంతో వినయముతో వేడుఁకోగానే నా మనసు కరిగిపోయినది. నేను రెండవమాట చెప్పలేకపోయినాను. మీ చేత తిట్లు పడినను సరే కాని యాయన కోరిక ప్రకారము చేయవలెనని యీ మూట పట్టుకొని వచ్చినాను. మీయిష్టము వచ్చినట్లు చేయండి. మీరు తిట్టినను సరే, కొట్టి నను సరే నాకిష్టమే. నేను స్వలాభము చూచుకొనలేదు. ఆబ్ర్రాహ్మణున కుపకారము చేయవలయునని యిట్లు చేసినాను." అని సత్యమును గప్పిపుచ్చి, తన పరాభవము వారికిఁ దెలియకుండ మాటువేసి యిచ్చవచ్చిన తెఱగున దంభములు కొట్టెను. వారు యథార్ధస్థితి నెఱుఁగరు. కావున నిది సత్యమని నమ్మిరి. అంత దీనముగా బ్రతిమాలుకొన్నప్పుడు మన మొప్పుకోవలసినదే యని కొందరనిరి. అంత చేతగానివాఁడు మొదట మనము కోరిన కోర్కెల దీర్చెదనని యేల ప్రజ్ఞలు కొట్టవలెనని కొందఱనిరి. శ్రాద్ధము చెడిపోవునని యాప్రకారము చేసెనని మరికొంద ఱనిరి. "ఇంతకు మన యదృష్టములు బాగుగ లేవు. మనము కోటు తొడిగికొనునట్టి యోగము మనకుఁ బట్టలేదు. మన మొగముల కటువంటి భాగ్యము గూడనా!" యని యొకఁడనెను. "తొందరపడకండి ! ఆ భాగ్యము నేడు పట్టకపోయిన మఱియొకనాఁడు పట్టదా?" యని గణపతి పలికెను.