గణపతి/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియవ ప్రకరణము

వివాహానంతరమున గణపతి కోమటులతోఁ గలసి స్వగ్రామము జేరెను. ఇతరుల సొత్తునకుఁ దన సొత్తునకు భేదము లేదను నద్వైతబుద్ధిచేతనైన నేమి, హస్తలాఘవము చేతనైన నేమి ముచ్చెల విషయమున ముచ్చట తీర్చుకొనుట కవకాశము కలిగినది. కాని కోటు విషయమున ముచ్చట తీరినది కాదని యతనికి బెంగపట్టెను. కోటుగుడ్డలున్న దుకాణములలో హస్తలాఘవము చేయుటకు వీలు చిక్కినదికాదు. పోనీ, కుట్టి సిద్ధముగా నున్న కోటులే హస్తలాఘవము చేసి సంపాదింపవలె నన్న నతని గుజ్జురూపమునకుఁ దగిన కోటులు దొరకుట యరుదు. స్వగ్రామము చేరిన నాలుగు దినములకుఁ దన బుద్ధి విశేషముచేత నార్జించిన ముచ్చెల నుపయోగింపవలె నని యభిలాష వొడమ, గణపతి మూట విప్పి జోడుదీసి చూచి దాని యందమునకుఁ గడుంగడు సంతసించి యది యున్న దున్నట్లుగాఁ దొడగుకొన్న పక్షమునఁ తన దొంగతనము వెంటనే బయట పడునని శంకించి దానికి మారురూపము గల్పింపఁ దలచి దాని మీఁద నున్న జల్తారు నూడఁబెరికి యావలఁ బారవైచి తొడిగికొని, మొదటి దినమున దన యింటిలోనె బదిసారు లిటునటు బచారు చేసెను. తన యైశ్వర్యముం జూచి చుట్టములు నెచ్చెలులు సంతోషింపఁవలెనని లోకమునఁ ప్రతి మనుష్యుడు గోరును గదా! అట్లే గణపతిగూడఁ దన భాగ్యవశమునఁ దనకు లభించినదియు నాగ్రామమున ననన్యలబ్ధమైనదియు నగు ముచ్చెలజోడు దొడిగికొని బంధుమిత్రుల కన్నులకు విందుసేయవలెనని తలంచి నోట చుట్ట వెలిగించి కుచ్చుతలపాగ జుట్టి రాజమహేంద్రవరము నందలి కొందఱు పెద్దమనుష్యుల వలెఁ జేతిలో కఱ్ఱ బట్టుకొని ముచ్చెలు దొడిగికొని టక్ టక్ మని చప్పు డగునట్లు నాలుగు వీధులు దిరిగి పనిలేని చోటసైత మాగుచుఁ దన చెలికాండ్రం బిలిచి యేదో సంభాషణ సేయుచు, 'మీ గాళ్ళవాపు మొగముమీఁదనె తెలియు' నన్నట్లు ముచ్చెలజోడు లభించె నన్న యానందము ముఖవికాసమె తెలియఁ జేయునట్లు విహరించెను. కొందఱు స్నేహితు లాతని జూచి "గణపతీ! పైజారు లెంతకు గొన్నావురా?" యని యడుగ నతడు వెలవెలబోయి తత్తరపడి నొకనితో నర్థరూపాయ యనియు మఱియొకనితో మూడుపావలా లనియు యొకనితో రూపాయ యనియు వేఱొకనితో "నాకిది రాజమహేంద్రవరములో నొక కోమటి పిల్లవాఁడు బహుమాన మిచ్చె" ననియు, ఇంకొకనితో "మామామ కొనిపెట్టినాఁడనియు" నొకరితో జెప్పిన విధమున మరియొకనితో జెప్పక పరిపరివిధముల బ్రత్యుత్తర మిచ్చెను. మిత్రు లనేకులు "గణపతి మిక్కిలి యదృష్టవంతుడు. అతఁ డేదోవిధమున దన కోరిక దీర్చుకొనును" నని శ్లాఘించిరి. ఒక రిద్దఱు మాత్రము "వీ డెక్కడనో దొంగతనముజేసి తెచ్చినట్లున్నాఁడు. కాని యెడల వీనికీ ముచ్చెలు బహుకరించువాఁడెవ్వడు? పెండ్లికి వచ్చినప్పుడు, వీనిదగ్గర నెఱ్ఱని యేగాని లే" దని నిరసించిరి. వారి మాటలకు గణపతి యెంతమాత్రము సరకు సేయక "చేతగాని కుంకలు, అప్రయోజక వెధవలు. తాము ప్రయోజకత్వముచేతఁ దెచ్చికొనలేరు. ఎవఁడైన సంపాదించుకొన్నయెడల దొంగతనమని సింగినాదమని జీలకఱ్ఱయని పేర్లుపెట్టి వెక్కిరించుచుందురు. ఈ నిర్భాగ్యులేమనుకొన్న నాకేమి? ఏలాగో యొకలాగున సంపాదించుట ప్రయోజకత్వము. దొంగతనము చేసినను సరె పట్టుబడకుండుట దెలివి. నేను కొంటే వీళ్ళ కెందుకు? నేను కొనకపోతే వీళ్ళకెందుకు? చేతనైతే సంపాదించు కొనవలె, లేకపోయిన నోరు మూసికొని యూరకుండవలె" నని తనమీద నిందారోపణము చేసినవారికి పది పుంజీల చీవాట్లంటగట్టి తన కాప్తులయినవారిని నలుగురిని వెంటబెట్టుకొని యిచ్చవచ్చిన చోటు లెల్ల విహరించి యింటికిఁ బోయెను. ముచ్చెలజోడు తొడిగికొని తన కన్నులకు బండువుచేయుచున్న కుమారుని జూచి తల్లి యానందించి రాత్రి భోజనమైన తరువాత గణపతి పండుకొనఁగా నతని ప్రక్కంజేరి యిట్లనియె "నాయనా జోడు మిక్కిలి బాగున్నది. మొట్టమొదట నది యిప్పటికన్న బాగున్నది. నీకిదేలాగు దొరికినది? నీవు కొన్నావా? ఎవరైనా బహూమాన మిచ్చినారా? దానిమీఁద జరీపోగు నీ వెందుకు తీసివేసినావు? ఎవరిదైన దొంగతనముగా దీసికొని రాలేదుకద. ఎఱ్ఱతలపాగాల బంట్రోతులు వచ్చి రెక్కలుగట్టి తీసికొనిపోదు రేమో యని భయము. అందుచేత నడిగినాను. ఏలాగున దొరికినదో చెప్పునాయనా! తెలియక దొంగతనముగ దెచ్చిన పక్షమున వారిది వారి కిచ్చివేయుదము. మామయ్య విన్నపక్షమున మిక్కిలి కోపపడి నిన్ను గొట్టఁగలడు. ఈ గడబిడ యెందుకు? ఉన్న దున్నట్టు చెప్పు. ఈ యూరి దయితే రాత్రివేళ గోడమీఁదనుంచి వారి దొడ్డిలో గిరవాటు వేయవచ్చును. పొరుగూరి దయితే మరియొకలాగు సర్దుకోవచ్చును!" అని మందలించుటయు నులకకుక్కిమీద బండుకొన్న గణపతి దిగ్గునలేచి కూర్చుండి, తల్లి కిట్లనియె అమ్మా! ఎందుకు నీకు భయము. ఇది యీ గ్రామములో నెవరిది గాదు. కోమటుల యింట వివాహమునకు నేను రాజమహేంద్రవరము వెళ్ళినప్పుడు నాయదృష్టవశమువల్ల నా కిది దొరికినది. దొంగతనము చేసినానో దొరతనమే చేసినానో సంపాదించినాను. కొడుకు గొప్ప ప్రయోజకుఁడయి ముద్దినుసు వస్తువులు సంపాదించుచున్నాఁ డని సంతోషింపక వెఱ్ఱిముండలాగు విచారించుచున్నా వెందుకు? అయినదానికి కానిదానికి విచారించిన దాని బ్రతుకు విచారపు బ్రతుకే యగును. ఈ గ్రామములోనే నే నెందుకును పనికి రాకున్నాను గాని రాజమహేంద్రవరంలో నేనంటే నెంతో గౌరవము. అక్కడివారు నన్ను నెత్తిమీఁద బెట్టుకున్నారు. ఏ దుకాణములోనికి నేను వెళ్ళినప్పటికి వర్తకులు బీరువాలు తెరచి మూటలు విప్పి ముద్దినుసు గుడ్డలు నాకు చూపించినారు. నన్ను దయచేయ మని మర్యాద చేసి దండము పెట్టినారు. నా కీ జోడు దొరికినది. దొరికినది దొంగవస్తువగునా? వీధిలో మనము నడచి వెళ్ళునపుడు మనకే వస్తువైన దొరకవచ్చును. అది మన దగునా కాదా? అలాగే నా కీ జోడు దొరికింది. ఒకరి చేతిలో నుండఁగా నేను లాగుకొనలేదు. ఒకరి పెట్టె బ్రద్దలు కొట్టి నేను దీసికొనలేదు. ఒకరి కాలి నుండి నె నూడఁదీయలేదు. నా పుణ్యమువలన నాకు దొరికినది. ఇదే దొంగతనమైతే మనము జేయుచున్న ప్రతిపనియు దొంగతనమే యగును. యజమానితోఁ జెప్పకుండ మనము దంతధావనము కొఱకు చెట్టునుండి యొక పండ్లుతోము పుడక విఱుచుకొందము. అది దొంగతనము గాదా? చెట్లనుండి పువ్వులు కాయలు కోసికొనుచున్నాము. అది దొంగతనము కాదా? కష్టపడి కన్నదూడలకు లేకుండ ఆవులను గట్టిపెట్టి పాలు పితుకుకొనుచున్నాము. ఇది దొంగతనముకాదా? దొంగతనముల మాట నాదగ్గఱ జెప్పకు. ఎవరి కేది ప్రాప్తమో ఆ వస్తువు వారిదగ్గర పడును. అది దొంగతన మనుట తెలివితక్కువ. ఇది నా కేలాగు వచ్చినదో రెండవ కంటివాఁడెఱుఁగఁడు. ఇందుకోసము బెంగపెట్టికొని నీవు చావనక్కఱలేదు! ప్రపంచ మంటే యేమిటో తెలియని యమాయకపు ముండవు. కనుక ఎఱ్ఱ తలపాగాల వారంటే నీకు భయం. నాకట్టి భయము లేదు. వాళ్లు నాదరికి వచ్చినారంటే తుపాకి వేయించఁ గలను. రెండుకోట్లు నా కుండనీ; ఆ కోట్లు తొడిగికొని, గిరజాలు నున్నగా దువ్వుకొని, కుచ్చు తలపాగ జుట్టి, ముచ్చెలు దొడిగికొని, బెత్తము చేతఁబట్టుకొని, టక్కు టిక్కు టక్కు టిక్కు మని బయలుదేరి నానంటే ఎఱ్ఱ తలపాగాల వాళ్ళు, నల్ల తలపాగాలవాళ్ళు, వీఁడెవఁడురా బాబూ! డిప్యూటీ కలెక్టరులాగున్నాఁడని తోకతెంచుకొని పోఁగలరు. నేనేమి? మునుపటి చచ్చు గణపతి ననుకొన్నావా యేమి? రాజమహేంద్రవరములో నెన్ని టస్సాలు నేర్చినా ననుకొన్నావు? ఎన్ని తమాషాలు నేర్చినా ననుకొన్నావు? గిరజా యెదిగినతరువాత, కోటు కుట్టించినతరువాత నాదర్జా యేమిటో మాకందఱకు తెలియఁగలదు. మానాయన సంపాదించిన బింది యేదైన నున్న పక్షమున నాకియ్యి. అమ్మియో, తాకట్టు పెట్టియో రెండు కోటులు కుట్టించుకుందును. కోటు లేనివారి కీ కలియుగములో గౌరవమే లేదు. కొంప లేకపోయినను భయము లేదు. భూములు లేక పోయినను విచారము లేదు. ఉద్యోగము లేకపోయినను కొరతలేదు. కాని కోటు లేకపోతే యావత్తు వెలితియే! కోటు లేని వాఁడు చిల్లిగవ్వ చేయఁడు. రాజమహేంద్రవరములో నున్న మగవాళ్ళందఱు కోట్లు వేసికొన బట్టియే మిక్కిలి గౌరవము పొందుచున్నారు. రెండు కోట్లున్న పక్షమున నేనీ గ్రామములో శిఖామణినై యుండెదను. అప్పుడు నేను తగవులు దిద్దఁగల పెద్దమనిషినై యుందును. అప్పుడు అందఱు నా దర్శనమే చేయుదురు. నన్నే యాశ్రయింతురు. నన్నే పిలుతురు. నాకే దండములు పెట్టుదురు. పూర్వకాలములో జడలు ఉంచుకొన్న మునీశ్వరులకే గౌరవము. ఈ కాలములో గిరజాలు పెంచుకొన్న పడుచు వాండ్రకే గౌరవము. పూర్వకాలములో మంచి కాషాయి వస్త్రాలు కట్టుకొన్నవాళ్ళే పూజ్యులు. ఇప్పుడు కోట్లు తొడిగికొన్న వాళ్ళే పూజ్యులు. పూర్వకాలములో దండము చేతిలో దాల్చినవారికి మర్యాద. ఇప్పుడు బెత్తము చేతితో బట్టుకొన్న వారికి మర్యాద. పూర్వము పావుకోళ్ళుఁ దొడిగినవాళ్ళది గొప్ప. ఇప్పుడు ముచ్చెలు, చెడావులు దొడిగికొన్న వాళ్ళది గొప్ప. కాలము మారిపోయినది. గౌరవమునకు కావలసిన నాలుగు వస్తువులలో నేను మూడు సంపాదించుకొన్నాను. అవేవనగా గిరజాలు, ముచ్చెలు, చేతికఱ్ఱ. నాలుగవది కోటు అవి రెండుండుట మంచిది. అధమపక్ష మొకటియైన గుట్టించి తీరవలెను. మామయ్య చూడకుండ మన బిందె యీవల పడవేసినా నా గౌరవము కాపాడినదాన వగుదువు. తల్లంటె నీవే తల్లివి, ఈ యుపకారము చేసితివా వేయిజన్మలకైన నీ కడుపుననే పుట్టవలె నని కోరుదును. ఇప్పుడు మనకు బిందె యెందుకు? మామయ్యగారు వాడుకొనుచున్నారు. మన కవసర మున్నప్పుడు వారెందుకు వాడుకోవలెను? రెండు కోట్లు కుట్టించుకొని, నేను తగు మనుష్యుడనైన తరువాత కావలసినన్ని బిందెలు సంపాదింపఁగలను. బిందెలే కావు గంగాళములు, గాబులు సంపాదింపఁ గలను. గౌరవము కోటులో నున్నది. దేవుఁడు కోటుజేబులో కూర్చుండును. ఆడుదానవు, అందులో మాయామర్మ మెరుగని దానవు కనుక నీకు తెలియదు, కోటు సంగతి. మగవాడను, చదువు కొన్నవాఁడను, ప్రయోజకుడను గనుక నాకు తెలుసు దాని సంగతి. ఈ పట్టున కోటు పురాణము వ్రాయమంటె కావలసినంత గ్రంథము వ్రాయగలను." అంతరాయములేని ధోరణితో గణపతి యుపన్యాసము చేయుచుండ నల్లమందు పట్టిచ్చుటచే నామెకు కునికిపాటు వచ్చెను. అందుచే నామె జోగి జోగి మంచము మీఁదనుండి క్రిందబడెను."ఓసీ! నీవెర్రి తగులబెట్ట! కునికిపాట్లు పడుతున్నావటె? పూట పూటకు కుంకుడు కాయంత నల్లమందు వుండలు మ్రింగి చెడిపోయినావు, సరే; యిప్పుడు పడుకో; రేపటి దినము మాటాడ వచ్చును" అని గణపతి పండుకొనెను. తల్లి నిద్రాభారముచేత గన్నులు తెరువలేక ప్రక్కవైచికొనలేక వట్టి నేలనే పండుకొనెను. గణపతి నిద్రించి, బిందె తీసికొనిపోయి యమ్మినట్లు, రెండుకోట్లు కుట్టించుకున్నట్లు, తిన్నగా నుదుకనందుకుఁ జాకలి దానితోఁ గలహమాఁడినట్లు స్వప్నములు గాంచెను. మరునాఁ డుదయమున లేచి గణపతి బిందె యిమ్మని తల్లిని మిక్కిలి పీడించెను. అమాయకురాలైన యా యిల్లాలు కొడుకు మాట లన్నియు వట్టి కోతలని తెలిసికొనలేక యవి సత్యములే యని నమ్మి బిందె దాకట్టు పెట్టియో, విక్రయించియో, రెండురూపాయలు తెచ్చి యిచ్చిన పక్షమున తన కుమారుఁడు మిక్కిలి గొప్పవాఁడై విశేషమగు ధన మార్జించి తన నుద్దరించునని తలంచెను. అందుచేత బిందె కుదువ బెట్టవలెనని యామెకూడా సంకల్పించెను. కాని సోదరుఁడు, సోదరుని భార్యయు జూచుచుండగా నట్టిపని చేయుట కిష్టము లేదు. వారా పని సాగనియ్య రని యామె యెరుగును. అందుచేత నామె మరునాడు రాత్రి సోదరుఁడు నిద్రించిన తరువాఁత గడచిన రాత్రివలెనే కుమారుని ప్రక్కలోఁ గూర్చుండి యిట్లనియె. "నాయనా! బిందె తాకట్టుపెట్టుట నా కిష్టమెకాని నీ మేనత్తయు నీ మేనమామయుఁ జూచుచుండ నట్టి పని చేయుటకు నాకిష్టము లేదు. అందులో ముఖ్యముగ నీ మేనత్త నిన్ను జూచి నప్పుడెల్లఁ కన్నులలో నిప్పులు పోసికొనును. నీవు పచ్చగా నుండుట యామె కెంతమాత్ర మిష్టములేదు. నీవు గిరజాలు దువ్వుకొని కోటు దొడిగికొని యల్లారుముద్దుగా నుండుట దాని కిష్టములేదు. అది చూచుచుండగా బిందె తీసికొనుటకు వీలులేదు. బిందె చిల్లి పడినందున నీళ్ళుపోసుకొనుటకు వీలులేక సున్నిపిండి కుంకుడు కాయలు పోసుకొనుచున్నారు. అది నేను తీసికొంటినా నీ మామతోఁ జెప్పి తిట్టించును. ఆవిడ నాలుగు దినములలో పురిటినిమిత్తము పుట్టింటికి వెళ్లును. మీ మామ పొలము వెళ్లుచుండును. అప్పుడు మనకు స్వేచ్ఛగా నుండును. గనుక బిందె నేనే తాకట్టుబెట్టి సొమ్ము తెచ్చి యిచ్చెదను. అంత వఱకు నోపికపట్టుము. అనవుడు గణపతి కోపించి పండ్లుకొఱికి "బోడి పెత్తనములు వెధవ పెత్తనములు మన బిందె మనము తీసికొనుటకు వీలులేక వచ్చినది. ఈ కోట్లు కుట్టించుకొన్న తరువాత మన మొకరియండ నుండకుండ హాయిగా స్వేచ్ఛగ నుండవచ్చును. సరే! నీయిష్టము వచ్చిన ట్లామె పుట్టింటికి వెళ్ళిన తరువాత చేయవచ్చు" నని పండుకొనెను. నాఁడు మొదలుకొని గణపతి యెప్పుడు మేనమామభార్య పుట్టింటికి వెళ్ళు, నెప్పుడు బిందె కుదువఁబెట్టి తల్లి రూకలు తెచ్చి తనచేతఁ బడవేయు, నెప్పుడు కోట్లు తాను కుట్టించుకొనుట కనువుపడు నని నడుచు నప్పుడును స్నానము చేయునప్పుడు భోజనము సేయునప్పుడును జిత్తంబు దానియందె నిలిపి, కాముకుండు తన ప్రియురాలి యం దనురాగము నిలుపునట్లు, భక్తుడు తన యిష్టదైవము నందు మనంబు నిల్చునట్లు తదేక ధ్యానపరాయణుఁడై యుండెను. అంతలో సమీపగ్రామమున నొక బ్రాహ్మణుని తండ్రి మృతి నొందగా పదుకొండవ దినమునను బండ్రెండవ దినమునను గణపతి మిత్రులతో శ్రాద్ధభోక్తగా నియమింపఁబడెను. ఈ కాలమునందువలెఁ గాక యా కాలమున గావలసినంతమంది శ్రాద్ధభోక్తలు దొరకుచుండెడివారు. ఒకప్పుడు గావలసినవారికంటె నెక్కున సంఖ్య లభించుటయుఁ గలదు. వారి కీయవలసిన దక్షిణ కూడ నిప్పటివలె నధికము కాక నాలుగణాలకు మించకుండెను. గణపతి తన మిత్రబృందముతో నచ్చటి కరిగి తన చెలిమికాండ్రను దనకు బరిచితులు గాని యితర గ్రామవాసు లగు భోక్తలను బిలిచి, స్నానపు నెపమున జెరువుగట్టునకుఁ దీసికొనిపోయి, రావిచెట్టు క్రిందఁ గూర్చుండబెట్టి పొగచుట్టలు గాల్చు నభ్యాసముగలవారి కందరకుఁ దలకొక చుట్ట నిచ్చి, తానొక చుట్ట వెలిగించి కాల్చుచు నీ క్రింది విధమున మాట్లాడెను.

"మీకందరకు నేనొక సలహా చెప్పదలఁచుకొన్నాను. అది మన కందరకు మిక్కిలి ఉపయోగకరమయినది. షోడశ బ్రాహ్మణార్థములు మన మందరము చేయుచున్నముకదా! కాబట్టి మన యవసరము బ్ర్రాహ్మణుల కందరకున్నది. భోక్తలుగా మనము కూర్చున్నందుకు మనకు వారు నాలుగణాలు రొక్కమో లేక యొక సైనుగుడ్డయో యిచ్చుచున్నారు. ఆ గుడ్డలు చిరకాలము మన్నవు. అవి ప్రేతకళ క్రక్కుచుండును. అవి కట్టుకొన్నవానికి మునుపున్న కళకాంతులు కూడ నశించును. మంచిగుడ్డలు వేసికొనవలె నని మనకుఁగూడ నుబలాట ముండునుగదా! అందుచేత మన మందర మొక కట్టుకట్టి భోక్తలకు సైనుపంచె లిచ్చుటకు మారుగా మంచి కోటుగుడ్డ లీయవలసినది; అలా గీయని పక్షమున మేము బ్రాహ్మణార్థములు చేయ మని స్పష్టముగా చెప్పవలసినది, మన మందఱ మొక్క మాటమీఁద నిలువబడిన పక్షమున మన కోరికె సిద్ధించును. కప్పల తక్కెడవలె నొకరితో నొకరు సంబంధము లేకున్న యెడల మనయందు గౌరవముండదు. ఒక్క మాటమీఁద నుంటిమా కర్మలు చేయువారు మన కాళ్ళ మీఁద బడుదురు. ఏమిటి మీ యభిప్రాయము? మీ కందఱకిష్టమా? అయిష్టమా? ఆ పలుకులు భోక్తలుగా వచ్చిన వారిలోఁ గొందరికి సంతోషకరములయ్యె. మంచి మంచి కోటులు దొడిగికొని తిరగవచ్చు నని వా రా సలహా బాగున్నదనిరి. కోటుగుడ్డ లెట్టివో యెఱుఁగనివారు కొందరందుండిరి. వారందరా సలహాకు సమ్మితింపక "ఛీ! కోటు గుడ్డ లేమిటి? పెద్దల నాఁటినుండి సైనుగుడ్డ లిచ్చుటే యాచారమైయున్నది. కోటుగుడ్డలిచ్చుట, పుచ్చుకొనుట గూడ మిక్కిలి యనాచారము. ఇది విన్నపక్షమున శంకరాచార్యులవారు మనల నందర వెలివేయుదురు. ఈ కట్టు కట్టితిమా దేశములో మన కుప్పైన బుట్టదు. కాఁబట్టి మీ జట్టులోకి మేము రాము" అని భిన్నాభిప్రాయు లయిరి. "ఇందు స్వాములవారు వెలి వేయుట కేమున్నది? మన మేమి యకార్యకరణము చేసినామని గణపతి పక్షమువారు రెండవ పక్షమువారి నడిగిరి. పాత పద్ధతులు విడిచి క్రొత్తపద్ధతు లవలంబించుటే తప్పు. శ్రాద్ధమున కోటుగుడ్డ లేమిటి? ఎవరయిన విన్నపక్షమున మొగము మీద నుమ్మి వేయుదురు రని వారు బదులు చెప్పిరి. మొగముమీఁద నుమ్మివేయుదు రన్నమాట గణపతికి, గణపతి పక్షము వారికి మహాగ్రహము కలిగించెను. తీవ్రములైన మాటలతో వారు కొంతసేపు యుద్ధము చేసిరి. ఆ మాటలు క్రమక్రముగ ముదిరెను. చేతులు కలసెను. కొందరు చేతులతో చెట్లకొమ్మలు బెడ్డలు పుచ్చుకొని కొట్టుకొనిరి. కొందరు జుట్టుపట్టుకొని నేలఁబడిరి. ఏడ్చువారు కొందరు, తిట్టువారు కొందరు, పాఱిపోవు వారు కొందరు మన గణపతికి కడపటి గుణములోఁ జేరెను. బెడ్డల దెబ్బలు తగిలి కొందరికి నెత్తురులు కారెను. అది నీళ్ళ రేవగుటచే నచటకు వచ్చిన స్త్రీలు స్నానము చేయవచ్చిన పురుషులు చుట్టుముట్టి వివాదకారణ మేమని యరసి, శ్రాద్ధములలో సైనుగుడ్డలకు మారు కోటు గుడ్డలు భోక్తలు పుచ్చుకోవలసిన దను విషయమును గూర్చి వివాదము పొడమి తుద కీ విధముగఁ బరిణమించిన దని విని, కడుపు చెక్కలగునట్లు నవ్విరి. భోక్తలుగా వచ్చినవా రిరువదిమంది. అందు బదునలువురు గణపతిపక్షమై యుండిరి. గణపతి పారిపోయి మరి యెక రేవున స్నానముచేసి తనపక్ష మున్నవారి కందఱకు వర్తమాన మంపి వారి కిట్లనియె. "ఒరే? మనకు వ్యతిరేకముగ నున్నవారికంటె మనమె యెక్కువమంది యున్నాము. మనము పట్టుపట్టితిమా యజమానుఁడు లొంగి తీరును. నేఁడు పదకొండో దినము. కాబట్టి పది యెనమండ్రుగురు బ్రాహ్మణులు కావలెను. మనము మానివేసితిమా సంఖ్య కుదురదు శ్రాద్ధము చెడును. అందుచేత మీరు మొత్తబడక నేను చెప్పినటులు చేయండి. సైనుగుడ్డలు వద్దోయి, కోటుగుడ్డలు కావలెనోయి యని నేను కనుసంజ్ఞ చేయగానే కేకలు వేయుఁడు. అప్పుడు చచ్చినట్లు మనము కోరిన దిచ్చితీరును. నవరాత్రములలో హాయిగా మంచికోటులు వేసికొని తిరుగవచ్చును. బ్రాహ్మణర్థము చేసినప్పటికి మనము కూడ శుభ్రమైన బట్టలు కట్టుకొని యుద్యోగస్తులవలె నుండవచ్చును. చూడండీ! నేను ముచ్చెలు తొడిగికొని బ్రాహ్మణార్థమునకు వచ్చినాను. ఎవరి వృత్తి వారిది. కూటికి పేదల మైనామని గుడ్డకు పేదలము కానవసరము లేదు. మనదీ శరీరమే; మనకూ ముచ్చట లున్నవి. కాఁబట్టి మనము తప్పక కోటుగుడ్డలే కోరవలెను. జ్ఞాపకమున్నదా? మరిచిపోరుగదా?" అనవుడు వారందఱు 'మరిచిపోము; జ్ఞాపకమున్నది. మీరు చెప్పినట్లే యందు ' మని యరచిరి. వారి మాటల యందు నమ్మికలేక గణపతి వారందఱిచేత గాయత్రీసాక్షి యనియు, దైవసాక్షి యనియు, నిన్ను జంపుకొన్నట్లే, నీ పొగజూచి నట్లే, అమ్మతోడు, బాబుతోడని యొట్లు బెట్టించుకొనెను. పిమ్మట నందఱు స్నానముచేసి, శ్రాద్ధకర్త గృహమున కరిగిరి. ఈ లోపున రెండవపక్షమువారిలోఁ గొందఱు కర్తగృహమున కరిగి, గణపతి చెరువుగట్టు దగ్గఱ రావిచెట్టుక్రింద భోక్తలనందరఁ జేరదీసి కోటుగుడ్డల నడుగమని యుపన్యసించుటయు దాము భిన్నాభిప్రాయులై యతని యుపదేశంబుల నిరాకరించుటయుఁ మాటలాడుట క్రమక్రమముగా ముదిరి పోట్లాడుటగా మారుటయుఁ దమ సంఖ్య స్వల్పముగా నుండుటచే దాము దెబ్బలు తిని యోడిపోవుటయు మున్నగు వృత్తాంత మంతయు నాతని కెఱింగించి తమ గాయములం జూపిరి. శ్రాద్ధభోక్తలు కోటుగుడ్డలు కోరుట కలికాల మహిమ అనుకొని యాకర్త దానికిందగు బ్రతి విధానము మనసులో నాలోచించి సిద్ధముగా నుండెను. అంతలో గణపతి మిత్రబృందముతో వెళ్ళి, కూర్చుండెను. రెండుజాములైన తరువాత బ్రాహ్మణుల యధాస్థానములఁ గూర్చుండఁబెట్టి కర్త యర్చింపఁ దొడఁగెను. అర్చింపఁబడువారిలో మొట్ట మొదటివాఁడు గణపతి. పసుపు గణపతి యైనతోడనె నిజమైన గణపతిపూజ వచ్చెను. పసుపు గణపతివలె నేమిచ్చిన దానితోనే తృప్తినొందక మన గణపతి బొజ్జనిండఁ గోరికలు పెట్టుకొనియుండెను. భోక్తకు వస్త్ర మియ్యవలసిన సమయమున తడిసిన సైనుగుడ్డ తెచ్చి కర్త యియ్యవచ్చినపుడు 'నేనీ గుడ్డ పుచ్చుకోను. మంచి కోటుగుడ్డేదైన నాకియ్యవలెను. మరొకటి నేను పుచ్చుకొన' నని పలికెను. కర్త యప్పలుకులు విని మిక్కిలి యచ్చెరువడి గణపతి వంక తేరిచూచి "ఏమీ! కోటుగుడ్డలే కాని పుచ్చుకొనవా? కోటుగుడ్డ లిదివర కెన్నడయిన పుచ్చుకొంటివా? కలికాలముచేత నేటి కాలమున నీ వొకఁడవు కోర మొదలిడినావు. నీకీబుద్ధు లెవరు గరపినా" రని మందలించెను. అనవుడు గణపతి "అయ్యా! నే వొక్కఁడనే కాదు. మా వాళ్ళకందఱ కట్టి కోరికలే యున్నవి. అడిగి చూడండి." "ఓరీ! ఏమిరా, మీ కేమి కావలెనురా" యని యరచెను. అరచుటయు గణాధిపతిమాట ననుసరించి ప్రమధ గణమువలెఁ దక్కిన పదమువ్వురు నేకకంఠముగ "మాకు సైనుగుడ్డలు వద్దోయి! కోటుగుడ్డలు కావలెనోయి!" అని ఇంటిమీఁదియాకు లెగిరిపోవు నట్లరచిరి. అదియెల్ల గణపతి చెప్పిన పాఠమే యని కర్త నిశ్చయించి కార్యవాదమే గాని ఖడ్గవాదము కర్తవ్యము గాదని క్షణ మాలోచించి, శ్రాద్ధము చెడకుండునట్లు మనసులో నొక యుపాయము పన్నుకొని యిట్లనియె. "సరే మీ కందఱకు సైనుగుడ్డ లిష్టములేకపోయిన పక్షమున మీకేమి కావలయునో యవే తెచ్చియిచ్చెదను. కాని యా గుడ్డ లిప్పుడు మా గ్రామములో దొరుకవు. కాకినాడకైనను, రాజమహేంద్రవరమున కైనను మనుష్యు నొక్కని బంపి యా బట్టలు తెప్పించవలెను. రేపు సాయంకాలమున కెట్లో తెప్పించెదను. ప్రస్తుతము కథ కానియ్యండి. సైనుగుడ్డ లెవరి కిష్టమో వారే పుచ్చుకోవచ్చు," యని యనునయించెను. గణపతి ప్రశాంతుఁడయ్యెను. అతనితో శిష్యగణ మంతయుఁ బ్రసన్నమయ్యెను. ప్రతిపక్షులు సైనుగుడ్డలు స్వీకరించి సంతుష్టులైరి. గణపతియు శిష్యులును రెండు దినములు కూడ నేమియు స్వీకరింపక కోటుగుడ్డలకై నిరీక్షించుచుండిరి.