Jump to content

గణపతి/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

గణపతి యింటికి రాక పరిగృహంబున వసియించుట మాతులునకు మనఃఖేదము గలిగింపకపోయినను దల్లికిఁ దగని తల్లడపాటును గలిగించెను. మధ్యాహ్నము భోజన మైన తరువాత నామె సొదరుఁడు చూడకుండ కొడు కున్నకడకుఁ బోయి వాని బ్రతిమాలియుఁ జీవాట్లు పెట్టియు బెదరించియు నెన్నో విధముల నింటికి రమ్మని యడుగుచు వచ్చెను. నిజముగ మేనమామ దుడ్డుకర్రతో బుర్ర పగులగొట్టునని నమ్మి తెనాలి రామ కృష్ణుని పిల్లి పాలపేరు చెప్పగానె భయబడి పరుగెత్తినట్లు గనపతి యిల్లుపేరు చెప్పగానె యులికిపడి "నేనా యింటికిరాను. నీ యన్నగారు దుడ్దుకర్రతో నన్ను కుక్కను గొట్టినట్లు కొట్టి చంపివైచును. నేను చచ్చిన తరువాత నీవేమి చేయఁగలవు? అన్నము లేక చచ్చిపోయెద గాని దుడ్డుకర్ర దెబ్బతిని చావను. నేను గాడిద నెక్కిన దన కెందుకు? నాజోలికి రానని యాయన గారు వర్తమానము పంపిన పక్షమున నేను వచ్చెదను. లేనిచో రా" నని బదులు చెప్పెను. తల్లి యది విని దిగులు గుండెతో నింటికి జని రెండు దినములు గడచిన తరువాత నొకనాఁడు సోదరుని జూచె యిట్లనియె "నాయనా ! కుఱ్ఱవాఁడింటికి వచ్చుట లేదు. ఎంతో బెదిరిపోయినాడు. వాండ్ల యింటను వీండ్ల యింటను దిరుగుచున్నాఁడు. దొరికిన పూట తినుచున్నాఁడు. లేనిపూట లేదు. చిక్కి శల్యమైనాడు. కన్నులు గుంటలు పట్టినవి. ఇంటిలో నడుగుబెట్టగానె నీవు చంపివైతువని భయము గలిగినది. నీవు రమ్మంటే వాఁడు నిర్భయముగ వచ్చి నీ పంక్తి నింత గంజి యన్నము దిని వెళ్లును. చిన్నప్పటినుండియు నీవే వాఁడు చేసిన తప్పులు భరించి పెంచినావు. చెడ్డ సహవాసములచేత జెడిపోయి నాఁడు. మేనమామవైన నీవే. తండ్రివైన నీవే వెనుకటి లాగుననె యీసారికూడ తప్పులు క్షమించి యింటికిరానీ, ఈ పర్యాయము గాడిద నెక్కకుండ బుద్ధి జెప్పెదను" అనవుడు సోదరీ వచనములకు భద్రాచల మిట్లనియె. "అమ్మాయీ ! గాడిద మీఁద వానిని జూచినప్పుడు నా కోపమాగక కుక్కను గొట్టినట్లు దుడ్డుకఱ్ఱతో గొట్టెదనని నేనన్నమాట నిజమే. దుడ్డుకఱ్ఱకాదు, వాఁడు చేసిన పనికి రోకలితో వాని తల చితుకబొడువవలయునని నాకున్నది. కాని కోపము వచ్చినప్పు డన్నంతమాట చేయగలమా? ఈ దుర్మార్గుని దుండగముల నన్నింటిని నేను కడుపులో బెట్టుకొని భరించలేదా? పేగు తీపిచేత నట్లు భరింపవలసి వచ్చినది. పాలకోసము ఱాయి మోయమన్నాఁడు. మన వంశము దెన్నడులేని పాడుపని జేసి వీఁడప్రతిష్ట దెచ్చుచున్నాఁడని నే నేడ్చుచున్నాను. కాని నీకొడుకును జంపవలయునని కాదు. చీలవలయునని కాదు. వచ్చి యెప్పటిలాగున నుండుమని చెప్పు. ఇంకొకసారి యిటువంటి పని జేసెనా తాటికమ్మతో వెన్ను బ్రద్దలు కొట్టెదనని చెప్పు. నీవు చేయుచున్న గారమునుబట్టి వాఁడు చెడిపోవుచున్నాడు. గారము గజ్జెల కేడ్వగా వీఁపు దెబ్బల కేడ్చిన దన్నట్లు దెబ్బలు లేకపోబట్టి వానికా వినాశకాలము వచ్చినది. పరువు మర్యాదలు వాఁడు జంపుకొన్నాడు. తన తండ్రి యెంతవాడో తన తాత యెంతవాడో యివతల నేనెటువంటివాఁడనో వాడెఱుఁగడు. గాడిదనెక్కి కుక్కనెక్కి వాఁడేదో గొప్పవాఁడనైనా ననుకొనుచున్నాడు., నాకవి కిట్టవు. వచ్చి జాగ్రత్తగా నుండుమను" ఆ పలుకులు సింగమ్మకు మేరమీఱిన సంతోషము కలిగించెను. అంతకు ముందు కుమారునకుఁ దనకు శాశ్వత వియోగ మగునని బెంగబెట్టుకొనెను. సోదరుని వాక్యములవలన బెంగ తీఱినందున నాకు యేనుఁగు నెక్కినట్లు సంతసించెను. ఆ పూటనె యామె వెళ్ళి కొడుకును దోడితెచ్చి యెప్పటివలె నింట నుంచెను. గణపతి రెండుమూఁడు దినముల వఱకు మేనమామ యొద్ద మిక్కిలి భయభక్తులు కలిగి యేజోలికిఁబోక యిల్లుకదలి వెళ్ళక జాగ్రత్తగ నుండెను. కాని వీరణము చప్పుడు వినఁగానె పైత్యపు మేని వానికి శివ మెత్తినట్లు మిత్రులను జూడఁగానె యతనికి ఉత్సాహము మరల నంకురించెను. నాలుగు పొలిమేరలనడుమ నున్న నేల యంతయు నతనికి విహారభూమి యయ్యెను. అన్ని తోట లతనివె. అన్నిదొడ్లతనివె. పండిన మామిడి చెట్ల కడకుఁ బోయి తాళ్ళు రువ్వి పచ్చికాయలు పడగొట్టి సంగడి కాండ్ర చేత నుప్పుకారము దెప్పించి యా కాయలు గరిగమ్మతో గోసి కొనియొ పండ్లతో బీకియొ ముక్కలుచేసి కార మద్దుకొని తిను చుండును. తోటకాపులు దూరమునఁ గానఁబడిన తోడనె వారి యదలింపు మాటలు చెవులఁ బడినతోడనె తానును జెలికాండ్రును లేళ్ళవలె బరుగెత్తి పోవుదురు. నేర్పరులయిన శిష్యుల కాళ్ళకు బందములు వైచి కొబ్బరి చెట్లెక్కించి కాయలు తీసి పగులగొట్టి నీరుద్రావి గుంజు తినుచుండును. నీలాటరేవులలో సాయం కాలమప్పుడు నిలువఁబడి బెడ్డలువిసిరి నీటికుండలు పగుల గొట్టు చుండును. కుండ పగులగానె తూనీఁగలాగు పఱుగెత్తుచుండును. పట్టువడినప్పుడు చెంపకాయలు పుష్కలముగఁ దినుచుండును. ఒకనాఁ డొక జామి తోటలో దోరగా బండిన పండ్లు గణపతియు మిత్రులును శిలావర్షము గురిపించి నేల గూల్చుచుండ నంతలో గాఁపువాఁడు వాండ్ల కెదురుగా రాక వెనుకపాటున వచ్చి యొకచేతితో గణపతిని మఱియొకచేతితో వాని స్నేహితులలో నొకనిని బట్టుకొని బరబర లాగికొని పోయి వారి నిరువుర నొక చేట్టునకు రెక్కలు విఱిచికట్టి చింత బరికెలతో నెత్తురు దొరగునట్లు కొట్టి యెన్నఁడు తోటదరికి రాననిపించి పంపెను. అభిమానవంతుడైన గణపతి యీ పరాభవము తన తోడిదొంగయైన యా బాలునకు దక్క రెండవవానికి దెలియకుండ జాగ్రత్తపెట్టెను. అట్లతద్దియు, నుండ్రాళ్ళతద్దియు వచ్చెనా గణపతి సంతోష మింతింత యని వర్ణింపనలవి కాదు. నాటి మధ్యాహ్నమె కొందఱు స్నేహితులను వెంటఁబెట్టుకొని పొదలలోనికి, రుప్పలలోకి, దుబ్బులలోనికి జని రెండు బుట్టలు పల్లేరుకాయలు, కొంత దూలగొండ, పది యీతజువ్వలు, రెండు బుట్టలు బొమ్మరాళ్లు బెడ్డలు దెచ్చి యొకచోట దాఁచును. రాత్రి భోజనములు చేయగానె పండుకొని తోడి బాలకులందఱుఁ దెల్లవారుజామున లేచుచుండ తాను రెండుజాముల రాత్రివేళనె లేచి తల్లిని మేలుకొలిపి తల్లిసాయమున నిరుగుపొరుగువారి యిండ్లకుఁ బోయి యచ్చటి బాలురను లేపి మరల గృహంబున కరిగి చప్పుచప్పున మొగము గడిగికొని యుల్లిపాయల పులుసుతోను నువుపొడుముతోను, పొట్లకాయ పరమాన్నముతోను, గేదె పెరుగుతోను, భోజనముచేసి కొన్ని పల్లేరుగాయలు మూటగట్టుకొని భుజముపై వైచికొని రాళ్ళబుట్ట యొకటి యెడమచంక నిరికించుకొని నోట చుట్టవెలిగించి కుడిచేత నీతజువ్వ పుచ్చుకొని కేకలు వైచుచు వింతవింత పాటలు పాడుచు వీధులవెంటఁ దిరుగును. ద్వాపరయుగమునం దెన్నడో శ్రీకృష్ణుని మీది యాగ్రహముచే దేవేంద్రుడు రాళ్ళవాన గురిపించెనని భాగవతము హరివంశము మొదలగు మహాపురాణములయందు వర్ణింప బడుటయె గాని కలియుగమం దట్టి రాళ్ళవాన నెవ్వరు జూచి యెరుగరు. ద్వాపరమున నిజముగ నట్టివాన గురిసెనో లేదో చెప్ప జాలము గాని మన గణపతి నిజముగ నెన్నో రాళ్ళవానలు గురిపించెను. మగవారు లేక కేవల మాఁడువాండ్రే యున్న యిండ్లమీఁదను నందు ముఖ్యముగ ముసలియవ్వలున్న యిండ్లమీఁదను గణపతి హస్తములు రాళ్లు విసురుటలో భారత రణమందు గౌరవసేనపై నవలీలగ శరపరంపరలు కవదొనలనుండి తీసి యెడమ లేకుండఁ ప్రయోగించిన యర్జునిని హస్తము దలపించును. ఆ విషయమున గణపతి సవ్యసాచియని చెప్పవచ్చును. తెల్లవారుజామున లేచి చలిదియన్న మారగించి చిన్ని బిన్ని మొదలగు పాటలు పాఁడుకొనుచుండు నాడపడుచు లున్న చోటికి మెల్లమెల్లఁగ జని యేచాటున నుండియో మూఁటవిప్పి పల్లేరుకాయలు తీసి వాళ్ళ కాళ్ళనడుమ జల్లును పల్లేరుకాయ లా కాలునకు గుచ్చుకొని యీ కాలునకు గుచ్చుకొని జవరాండ్రు కళవళము పడి నానాముఖముల బరుగులెత్తుచుందురు. కొందరు తిట్టుచుందురు. కొందఱు తమ మగవాండ్రను బిలిచికొని వచ్చుచుందురు. గణపతి మెఱపుతీగవలె మాయమగును. తన స్నేహితులలో గొందరి వీపులమీద దూలగొండ రాయుచుండును. దురదలెత్తి వారు వీపులు బరికికొని పరుగులెత్తుచున్నప్పుడు మహా నందభరితమై యుండు గణపతి మొగముచూచి తీరవలయును. ఫొటోగ్రాపు లాకాలమందు విరివిగా లేవుగాని యీనాటివలె నవి పుష్కలముగ నుండిన పక్షమున గుణగ్రహణ పారీణుఁడైన యెవఁడైన నతని ప్రతిరూపము దీసియుండిన పక్షమున నట్టి ప్రకృతి యెంత వినోదకరముగ నుండును? ఎంత జగన్మనోహరముగ నుండును? ఎన్ని కోట్ల ప్రతులు కర్చైయుండును? గణపతి యొక్క మూర్తివిశేషము జూచుభాగ్య మాంధ్రమహాజనులకు లేదు. మూర్తియంతయుఁ చూచుభాగ్యము లేకపోయినను దానిండ్లమీఁద రాళ్ళు విసరినప్పుడు, స్త్రీలు కాళ్ళనడుమ పల్లేరుకాయలు చల్లినప్పుడు, సంగడికాండ్ర మేనులకు దూలగొండి రాచినప్పుడు ముసలమ్మలు, యువకులు, స్నేహితులుఁ దన్ను దిట్టుచుండ నత్తరి పండ్లిగిలించి యతఁడు నవ్విన నవ్వైన బ్రతిబింబములో జూచు భాగ్యముండినను మనము ధన్యులమైయుందుము. మందభాగ్యుల కట్టి ధన్యత యేలగలుగు? రూపదర్శనమువలన గలుగు సంతోషము లేకపోయినను శ్రీకృష్ణలీలల కన్నను మిక్కిలి రమణీయములైన గణపతి లీలలలో గొన్నిటిని జదివి యానందించు భాగ్యమబ్బినది కనుక చదువరులు కొంతవఱకదృష్టవంతులె. గణపతికి క్షీరపానమునందు మిక్కిలి యాసక్తి. పాలు కొని త్రాగుట కతనిదగ్గఱ డబ్బులేదు. అనేకోపాయములచే సంగ్రహించిన డబ్బు పొగచుట్టల కైన దిన్నగా సరిపోదు. కొనుటకు డబ్బులేనంత మాత్రముచేత పాలుత్రాగుట మానుకొనునంతటి మూర్ఖుడుకాఁడు. కావున గణపతి క్షీరసంపాదనము కొక యుపాయము గనిపెట్టెను. పొలమునుండి సాయంకాల మింటికి తిరిగివచ్చు నావులను, గేదెలను వీధులవెంట దిరుగు మేకలను బట్టుకొని యొకప్పుడు బందమువైచియు మఱొకప్పుడు వేయకయు బాలుపిదికి యతఁడు త్రాఁగుచుండును. ఆవులు తమ తమ గృహంబులకుఁ బోయిన తరువాత యజమానులు పాలు పిదుక దమకింప వని పాలియ్యక పోవుటఁజేసి తమ యావులకు దృష్టి తగిలినదనియు దయ్యములు పట్టినవనియు మనోవేదన జెంది దిగతుడుపులు తీసి సోదెకుఁ బోవుచుందురు. వారి కళవళము వారి చిత్తక్షోభము జూచి యేమియు నెఱుఁగనివాఁడు వోలె నటించుచు దన యఖండ ప్రజ్ఞయెగదా వారిని వ్యాకులపెట్టు చున్నదని సగర్వముగ మనంబున గులుకుచుండును. కావలసిన ఖర్చులు చేసికొనుటకు గణపతి చేతిలో డబ్బు కొంచమైనను లేకపోవుట గొప్పవిచారకారణమయ్యెను. మేనమామ డబ్బులు విభూతి బుట్టలో బెట్టుట మానెను. తల్లి గూళ్ళలో వైచుట మానెను. ఏదో నిరంతరము నమలుచుండవలయును కాని, గణపతి నోరూరకుండదు. కొబ్బరి కురిడీలు, శనగయుండలు, పేలవుండలు, తాటితాండ్ర, తేఁగలు, జీళ్లు, శనగపప్పు మొదలైన వస్తువులూరక యిచ్చువారెవ్వరు లేరు. తోఁటలోనికిబోయి మునుపటి వలె దోచుకొని వచ్చుట కంత వీలులేదు. ఏలయన దోఁటకాఁపు లీబందిపోటు దొంగల విషయమై మిక్కిలి జగరూకులై యుండిరి. సూక్ష్మబుద్ధి గలవాఁడగుటచేత గణపతి యావిషయమై కన్నులు మూసికొని రెండవచింత విడిచి యొక్క జామాలోచించి యెట్టకేల కొకయుపాయము పన్నెను. డబ్బు కావలసి వచ్చినపుడతఁడు చుట్టుప్రక్కలనున్న చిన్నచిన్న గ్రామములు కరిగి గ్రామమందలి బ్రముఖుల నందఱ జూచి మాతండ్రి చనిపోయినాఁడు. పేదసంసారము. దినవారములు జరిగించుకొనుటకు డబ్బులేదు. మీరందఱు సాయముచేసి యీ బ్రాహ్మణ కర్మ యేలాగైన గడతేర్చి నన్నొకదరికి జేర్చవలయు. శ్రాద్ధకర్మ చేయకపోయిన యెడల బందుగులు వెలిపెట్టుదురు. చనిపోయిన వానికి మంచి గతులు గలగవు. తండ్రి పోయినందుకే నే నేడ్చుచుండగా మీదు మిక్కిలి శ్రాద్ధము పెట్టుటకయిన డబ్బు లేకపోయినదని నేనిట్లు బిచ్చమెత్తవలసి వచ్చినది. తండ్రి దినవారములకూడ డబ్బు లేనంత దురవస్థ నాకు భగవంతుడు తెచ్చిపెట్టినాఁ " డని కన్నుల నీరు పెట్టుకొని రానిదు:ఖము దెచ్చిపెట్టుకొని యేడ్చును. పదునాలుగు సంవత్సరముల పిల్లవాఁడు పితృరుణ విముక్తడు కాఁదలఁచి యాచించుటయె జాలి గలిగించును. అట్టియెడ నబ్బాలుని కన్నుల బాష్పోద్గమ మయ్యెనా యట్టియెడ నెవని మనసు కరుగదు. ఎవనికపుడు చుమ్మలు చుట్టదు. ఆ యా గ్రామములలోని జనులతని బూటకములు నమ్మి యెవరికిఁ దోచినమట్టుకు వారు సహాయము చేయుచుందురు. ఒక్కొక్కనాఁ డతనికి రెండు మూఁడు రూపాయలు గూడ దొరుకుచు వచ్చినవి. సాధ్యమైనంత వరకతఁడు వెళ్ళినయూరు వెళ్ళకుండ నీవ్యాపారము సాగించు చుండెను. విధిలేకయె మఱచిపోయియె మునుపు జమాబంది యైన గ్రామమె మరల వెళ్ళవలసి వచ్చినపుడు తండ్రి చచ్చి పోయినాఁడన్న మిష సాగదని తల్లి చచ్చిపోయినదని వంక బెట్టును. తల్లి యింటఱాయి లాగున నుండఁగ నామె చనిపోయిన దని చెప్పుటకు నోరెట్లు వచ్చినదని మీరు సంశయింతురు కాఁబోలు. అట్లు సంశయింపవలసిన పనిలేదు. ఏలయన "జాతస్య మరణంధ్రువ" మ్మను మాట మీరు విన్నారుగదా. 'పుట్టిన వాఁడు గిట్టక మానడ' ని దీనియర్థము, ఆ మాటయందు గణపతికి మిక్కిలి విశ్వాసము కలదు. తన తల్లి యెప్పుడో చావక మానదని గణపతి యెఱుఁగును. ఎప్పుడైనను జచ్చిపోవలసినదె కనుక తనకు డబ్బవసర మున్నప్పుడు చచ్చిపోయినదని చెప్పుట చేత నెంతమాత్రము పాపములేదని గణపతి యాశయము. పది సంవత్సరముల తరువాత జరుగఁదలచిన కార్యము పది సంవత్సరములముందు జరిగినదని చెప్పుట తప్పుగా నతఁ డెంచలేదు. ఒకప్పుడు తల్లిమాసికమని బిచ్చమెత్తును. ఒకప్పుడు తండ్రి తద్దినమని యడిగికొనును. ఒకప్పుడు తాను ప్రయాణము చేయుచుండఁగా మార్గమధ్యమున దొంగలు కొట్టి చెంబులు గుడ్డలు బత్తెపుఖర్చు నిమిత్తము దగ్గరనున్న డబ్బు తీసుకున్నారని చెప్పి ముష్టి యెత్తును. కొన్ని గ్రామముల కరిగి యతఁ డీక్రింది విధముగఁ భిక్షాటనము జేసెను. "అయ్యా ! నా తల్లి కెందరో బిడ్డలు చచ్చిన తరవాత నేను పుట్టితిని. నేను పుట్టినపుడు మా తల్లి నన్ను తిరుపతి తీసికొని వెళ్ళవలయునని మ్రొక్కుకొన్నది. పేదవాండ్ర మగుటచేత మ్రొక్కు తీరినదికాదు. ఏడుకొండల వెంకటేశ్వర్లు వడ్డికాసుల వాడన్నమాట మీకు తెలియునుకదా! అతని మ్రొక్కులు, ముడుపులు చెల్లకపోయినయెడల వెండి బెత్తములతోను బసిడి బెత్తములతోను వీపు పగులఁ గొట్టునని మీరంద ఱెఱిగిఁయె యున్నారు. రాత్రులు దెబ్బలు తినలేక నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నాకీశ్రమ మీరు తప్పించవలెను. వెంకటేశ్వరుల వారికిఁ వెండి చెంబొకటి చేయించి నేను ముడుపు చెల్లించవలెను. దాని కేబది రూపాయలు కావలెను. నదగ్గఱ గ్రుడ్డిగవ్వ లేదు. బ్రాహ్మణ బాలకుని యాపద తప్పించవలసిన భారము మీపై నున్నది. ఈ సహాయము జేసిన మీకెంతో పున్నెముండును. వెంకటేశ్వరుల వారిచేత దెబ్బలు తిని చచ్చిపోకుండా నన్ను మీఱందరు గాపాడవలయును. నాకు మీరే తల్లి, మీరే తండ్రి" యని యడుగుటయు వాని దీనాలాపనముల విని మగవాండ్రు, నాడువాండ్రు జాలినొంది తోఁచినసహాయము చేయుచు వచ్చిరి. ఈ వ్యాపారములో దిరిగిన తరువాత గణపతియెద్దకు ప్రతిదినము కొంచెముగానొ కుప్పగానొ డబ్బు నిలువయుండ జొచ్చెను. కావలసినన్ని పొగచుట్టలు, కావలసినన్ని తమలపాకులు కొనుట కవఁకాశము గలిగెను. అతడు స్నేహితుల కప్పుడప్పు డొకయణా, రెండణాలు బదులియ్యజొచ్చెను. గణపతి భోజనమునందు మహాగణపతీతుల్యుఁ డగుటచే నెంత డబ్బు వచ్చినను వాని యుపాహారములకె సరిపొవుచు వచ్చినది. ఈ విధముగ వ్యాపారము చిరకాలము సాగినదికాదు. ఒక గ్రామవాసులు మఱియొక గ్రామమునకు గార్యాంతముమీఁద వెళ్లుట తటస్ధించుచుండును. కావున గణపతియొక్క చేష్టలు క్రమక్రమముగ బయలుపడెను. జనులకు విశ్వాసము తగ్గెను. చుట్టుపట్ల గ్రామములలో నతని మాటకుఁ జెల్లుబడి లేకపోయెను. అందుచే మునుపటివలె నతనిచేతినిండ డబ్బుచిక్కుట కవకాశము గలుగదయ్యెను. మరల నతనికి డబ్బు సందర్భమైన యిబ్బంది తటస్థించెను. ఆ యిబ్బంది గడచుటకై యతఁ డొకనాఁడు దీర్ఘముగా నాలోచించి వైదికులపాలిఁటి కల్పవృక్షమని కామధేనువని చెప్ప దగిన శ్రాద్దభోజనమె శరణ్యమని నిశ్చయించెను. సామాన్యమైన యాబ్దికమునకు మంత్రితుఁడై పోయిన వానికి నొక్కడబ్బుకంటె నెక్కువ దొరకదు. మాతాపితృభక్తి యత్యధికము గలవారు రెండు డబ్బు లిచ్చుచుందురు. మిక్కిలి భాగ్యవంతులగువారు వస్త్రము లిచ్చి యొక యణాగాని రెండణాలుగాని దక్షిణ నిత్తురు. కడపటివారు మిక్కిలి యరుదుగ నుందురు. అట్టి బ్రాహ్మణార్థములకు బోయినపక్షమున గడుపునిండ భోజనము లభించుటయె తప్ప దక్షిణ బాగుగ దొరకదని షోడశబ్రాహ్మణార్థములు చేసిన పక్షమున జేతినిండ బుష్కలముగ సొమ్ముండునని తద్విషయమై ప్రయత్నించెను. చుట్టుప్రక్కలనే బ్రాహ్మణుఁడు చనిపోయినను బదియొకండవనాఁడును, పడ్రెం డవనాఁడును విఘ్నేశ్వర పూజాసమయమున స్థాపింపబడు పసుపు గణపతితో బాటు మూర్తీభవించిన శ్రాద్ధదేవతవలె పితృలోకమునుండి వచ్చిన ప్రేతవలె మన గణపతి వుండితీరవలయును. గణపతి తిండిపోతని చదువరు లిదివఱకె యెఱుఁగుదురు. భోజన విషయమున నతని ప్రజ్ఞ యాకారమునకుఁ దగనిది. అతని విగ్రహము పొట్టిదైనను వాని యాఁకలి మిక్కిలి పొడుగుది. బ్రహ్మదేవుఁ డతని కీయదలఁచిన ప్రజ్ఞయంతయు జీర్ణకోశమునందు పెట్టెను. శ్రాద్ధబోజనముల యం దతఁడు మెక్కునట్టి యరిసెలు, గారెలు, కుడుములు మొదలగునవి పుంజీల లెక్క ప్రకారము చెప్పుకొనుట సుకరముగాని విడిగా లెక్కించుట సుకరము కాదు. బోజనవిషయమున నతఁడు సర్వభక్షకుఁడని చెప్పవలెను. ఇది యిష్ట మది యిష్టములేదన్న మాటలేదు. ఏమియు దొరకనప్పుడు పెసరకాయలు, కందికాయలు, శనగకాయలు, జొన్నచేలలో నూచబియ్యము, తాటిపండు మొదలైనవిగూడ నతఁ డారరించును. శ్రాద్ధభోజనముల వలన నతనికి మరల కొంత డబ్బు దొరకఁ జొచ్చెను. ఆ దినములలో నతని జీవచరిత్రలో నొక్క మార్పు తెచ్చుటకు సమర్థమైన కార్యమొకటి జరిగినది. ఏనుఁగుల మహలునుండి కోమటు లొకరు రాజమహేంద్రవరములో వివాహసంబంధము నిశ్చయించి తరలివెళ్ళిరి. పెండ్లికుమారునకును గణపతికిని మొదటినుండియు జీట్లపేక దగ్గఱ స్నేహమగుటచే నతఁడు ప్రియమిత్రుడైన గణపతిని తన వివాహమునకు రమ్మని పిలిచెను. మిత్రుని యభీష్టసిద్ధి చేయఁదలఁచి మిత్ర విధేయుఁడైన గణపతి వారితో గలిసి వెళ్ళెను. రాజమహేంద్రవరములో నున్న కాలమున గణపతి క్రొత్త ప్రపంచమున నున్నట్లుండెను. ఆ పురవీధులలో నడచునట్టి తన యీఁడు బాలకుల కందరకు గిరజాలుండుట యతఁడు చూచి యా బాలకులవలె తాను గూడ గిరజాలు నున్నగాదువ్వి చెవుల సందుననుండి వెనుకకు దువ్వి మడిచి యుంగరములుగఁ జుట్టి తిరగవలెనని యతని కుబలాటము గలిగెను. పిల్లజుట్టుపై నతని కెంతో యసహ్యము కలిగెను. గిరజా లుంచుకొనని వాని బ్రతుఁకెందు కనిపించెను. ఎన్ని జన్మలయందు మంచి తపము చేసిన యదృష్టవంతులకో గాని గిరజా లుంచుకొనునట్టి భాగ్యము కలుగదని యతఁ డనుకొనియెను. అనుకొన్న విషయ మాచరణములో బెట్టుటలో నతఁ డగ్రగణ్యుడని పూర్వచరిత్రము వలన మీరు తెలిసికొని యుండవచ్చును. ఒకనాఁటి రాత్రి యీరీతి ననుకొనెను. మరునాఁ డుదయమున బెందలకడ లేచి భజంత్రీ మేళములోనున్న యొక మంగలిని బిలిచి తన పిల్లజుట్టు గొరిగివైచి గిరజాలు పెట్టుమని కోరెను. వెంటనే మంగలివా@ డతనికోరిక ప్రకారము చేసెను. ఆ మహాకార్యము చేసినందుకు మంగలివాని కొక యణా యిచ్చి తదృణము దీర్చికొని కృతకృత్యుఁ డయ్యెను. అట్టి నూతన వేషముతోనున్న గణపతిని జూచి పెండ్లివారిలో సంతసింపని వారు లేరు. ఏదో ఘనకార్యము చేసినవాడువోలె నన్యులకు దుర్లభమమైన సువర్ణకిరీటము మస్తకమున ధరించిన వాఁడువోలె నాఁటి దినమంతయు గణపతి మిక్కిలి యుత్సాహము గలిగి చూపులలోను, మాటలలోను, నడకలలోను, ముఖవైఖరిలోను గర్వముట్టిపడునట్లు సంచరించెను. పెండ్లివారితో వచ్చిన యువజను లందఱును జతురోక్తులయం దాశక్తిగల కొందరఱు పెద్దలును నాఁటి దినమున వేశ్యల మేళమున కరుగక గణపతి చుట్టుఁ జేరి వారి మాటలు విని వాని చేష్టలు చూచి వినోదము నొందిరి. పెండ్లికొడుకు చేత సిఫారసు చేయించుకొని పెండ్లికి వచ్చిన యాఁడువాండ్ర దగ్గరనుంచి సంపంగ నూనె దెప్పించి లేత మొక్కలకు మంచి యెరువు వైచు కాఁపువాడువలె తన తలకు రాసుకొని వెండ్రుకలు త్వరగా యెదుగు సాధనములేవి యని దన కన్నులకు బండువుగా నుండునట్లు పెద్ద గిరజాలను పెంచుకున్న వారిని పలుమారు గ్రుచ్చి గ్రుచ్చి యడుఁగజొచ్చెను. పరిహాసము చేయుటలో మిక్కిలి ప్రౌఢుఁడైన యొకానొక యువజనుఁడు గణపతిని రహస్యముగా నొకచోటికిఁ దీసికొనిపోయి యతని శిరోజ వృద్ధి యందత్యంతాసక్తిగలవాడు వోలెనతని చెవిలో నిట్లనియెను. "అగరు నూనెతోను, సంపంగి నూనెతోను దలవెంట్రుక లేపుగాఁ బెరుగవు. మంచి వంటయాముదము దెచ్చి నాలుగు దినములు రాచితివా వానచినుకులు పడగానె చికిలింత మొలిచినట్లు వెంట్రుకలు చురుకుగా నెదుగును. నేనట్టి దోహదము చేయబట్టి నా గిరజాలింత సొంపుగా నెదిగినవి. నీ వెంట్రుక లెదుగుట మన సులో నిష్టములేనివారు నేను చెప్పిన దోహదము చేయవద్దని నీకు దుర్భోదనలు చేయవచ్చును. వా రెన్ని చెప్పిననుసరె నీ వది వినవద్దు. సరిగా నెను చెప్పినట్టు చేయుము' ఆ యుపదేశముచేసి యతఁ డరిగెను. అది యెవరికిఁ జెప్పక బ్రహ్మోపదేశమువలె మనసులోఁ బెట్టుకొని రాత్రిభోజనాంతరమున నందఱు నిద్రాసక్తులైన సమయమునఁ జాకలివాండ్రు కాగడాల నిమిత్తమయి యిత్తడిసిద్దెలతో దాచుకొన్న యాముదము వారు చూడకుండ దొంగతనముగా రెండుచేతుల నిండబోసికొని తలకు రాసుకొని పెద్దమనుష్యులు కూర్చుండుటకుఁ వైచిన తివాసీమీద కరిగి దిండుమీఁద తలబెట్టుకొని పండుకొనియెను. మరునాఁడు గణపతి కాకులు కూసెడువేళనె లేచి గోదావరికరిగి రాగిడిమట్టితోఁ బలుసారులు తల రుద్దుకొని స్నానముచేసివచ్చి మరల బట్టలు కట్టుకుని కూర్చుండి కనబడిన వారినెల్ల బిలిచి "నా గిరజా లేమైన నెదిగినవేమో చూడు" డని యడిగెను. గణపతియొక్క విచిత్ర చరిత్ర మదివఱకె సువ్యక్తమై యున్నందున వారందఱు నగుమోముతో " నీ వేమి దోహదము చేసితివో కాని మిక్కిలి యేపుగా నీ వెంట్రుకలు పెరుగుచున్నవి. నిన్నటికి నేఁటికి నెంతో భేదము గనిపించుచున్నది. ఆ విధముగానె దోహదము చేయుచుండుము. నీతల జొన్న చేనువలె నెదుగునని చెప్పిరి. అతఁడాముదమె శిరోజవృద్ధికి దివ్యౌషధమని నిశ్చయించి యదియె యుపయోగింపఁ దలఁచెను. చాకలివాం డ్రుదయమున లేచి తివాసులు జభుఖాలు దులుపునప్పుడు దిండుమీఁద మెండుగా నుండిన యాముదపు మరకలు చూచి దానిమీద నాముద మెట్లయ్యెనని యెల్లవారి నడుగఁజొచ్చిరి. అడుగఁబడిన వారందఱు "మే మెఱుఁగము; మే మెరుగ" మని బదులుచెప్పిరి. చాకలివాఁడొకఁడు గణపతి నట్లు ప్రశ్నించుటయు నతఁడు మిక్కిలి కోపించి "ఎవడవురా నీవు తాహతెరుగకుండఁ బెద్దపిన్న తారతమ్యము లేక నన్నిట్టి ప్రశ్న లడుగుచున్నావా? నీ యంతర మేమి? నా యంతర మేమి? నీకు బొత్తిగా భయభక్తులు లేవు. చూడు పెళ్ళివారితో జెప్పి నిన్నేమి చేయింతునో నీవు తుంటరిలా గనపడుచున్నావు. నేనేమి తల కాముదము రాసుకొని దీనిమీఁద పండుకొన్నా ననుకొన్నావా యేమి జాగ్రత్త. బుద్ధి చెప్పించెదను. దొంగవెధవలు మీరే యాముదసిద్దెలు తెచ్చి దిండుమీఁద బెట్టినారేమో, అది గాకపోతే యాముదపు చేతులతో మీ రిద్దిండు ముట్టుకొని సవరించినా రేమో, లేకపోతే మీరిద్దిందు ముట్టుకొని సవరించినారేమో, లేకపోతే దానిమీఁద నాముదపుమరక లెట్టువచ్చు" నని విడిదియింటఁ బ్రతిధ్వను లగునట్లు గొంతు బొంగురు వోవునట్లు కేకలు వైచెను. ఆ కేకలతో నంద రక్కడకు చేరి చాకలివాండ్రనదల్చి యవ్వలకుఁ బొమ్మని చేసిన సంభాషణమును బట్టి గణపతియే తలవెంట్రుక లెదుగునిమిత్త మెవరో పరిహాసకుఁడు చెప్పినమాటలు విని తల కాముదము రాచికొని యుండునని మనసులో నిశ్చయించుకొని చిరునవ్వులు నవ్వుకొనుచు "గణపతీ! చాకలివాండ్రు బుద్ధిపొరబాటుచేత నిన్నాలాగున ననిరి. నీవంటివాఁ డిటువంటి పని చేయునా? కాని యా దొంగ యెవడో మన మందర మీరాత్రి కలిసి పట్టుకొంద" మని వెడలి పోయిరి. ఆనాఁటి రాత్రిగూడ గణపతి గతరాత్రమునందు వలె శిరస్సునకు తైలమర్దనము నందభిలాషగలవాఁడై రజకులు పండుకొన్న నెలవున కరిగి మెల్లగా నొకసిద్దె వంచెను. చాకలివాండ్రలో నొకఁడు సారా త్రాగివచ్చి పండుకొని సమీపమున బొరలుచు మరల ద్రాగుటకు నొక సీసానిండ సారాతెచ్చి సిద్దెలప్రక్క బెట్టుకొనియెను. గణపతి చీకటిలో నది కనిపెట్టలేదు. ఆ రజకుఁడు గణపతినిజూచి తన సారా దొంగిలించుకొని పోవుట కెవఁడో దొంగ వచ్చెనని భావించి "దొంగ తొత్తుకొడుకా! నా సీసా దొబ్బుకొనిపోవుటకు వచ్చినావా" యని లేచి వెన్నుమీఁద రెండు చరపులు చరిచి తిట్టనారంభించెను. ఆ చరపుల చప్పుడు తోను, దిట్లతోను దక్కిన చాకలివాండ్రు మేల్కాంచి దొంగవచ్చినాఁడనుకొని గణపతిని బట్టుకొనిరి. అతఁడు ప్రతిష్ఠా రక్షణ మందు మిక్కిలి జాగరూకుఁ డగుటచే సుమూహర్త సమయము నను సదస్యమునాడునుఁ దనకు దొరికిన సంభావన డబ్బులు చాకలివాండ్ర చేతులలో బెట్టి తనను నలుగురిలో నగుబాట్లు సేయవలదని చేతులు పట్టుకొని వాండ్రను బ్రతిమాలి యాముదపు మరకలు దిండుమీద చేసినది తానే యని యొప్పుకొని వారి బారినుండి తప్పించుకొని పోయెను. ఈ పరమ రహస్యమును జాకలివాండ్రు తిరుమంత్రమువలె నెవరికిఁ జెప్పకుండ దాఁచదలచిరి కాని వారి కడుపులలో ఇది యిమిడినదికాదు. నోట నువుగింజ నానని తుచ్ఛులనోళ్ళలో రహస్యము దాఁగునా? చాకలివాండ్రు, మంగలివాండ్రతోను మంగలివాండ్రు బాకాలూదు దూదేకుల సాహేబులతోను, వాండ్రు తమయాప్తులతోను జెప్పఁగా బరమరహస్యము సూర్యోదయ మగునప్పటికె గుప్పుమని వెల్లడియయ్యెను. అందఱు గణపతిని జూచి ముసి ముసి నవ్వులు నవ్వువారె. అందఱు నతని తలమీఁద జేయివైచి గిరజా లెదిగినవాయని పరిహాసము చేయువారె. అందరు శిరోజవృద్ధికి దోహదములు చెప్పువారె. వెండి, బంగారు దొంగలుపోయి యాముదపు దొంగలు బయలుదేరినా రని యొకఁడు, తల వెంట్రుకలు పెరుగుటకు తగిన దోహదమాముదమే యని యొకఁడు, తైలముకంటె మొట్టికాయలు డిప్పకాయలు వెంట్రుకల వృద్ధికి మంచి యౌషధమని యొకఁడు చమత్కారముగ మాటలాడిరి. గణపతి తక్కిన మాటలకు సరకు చేయలేదు. కాని యాముదపు గొంగలు వచ్చినారన్నపుడు మాత్రము కొంత ప్రసక్తిని గల్పించుకొని యాముదము దొంగిలించునట్టి నిర్భాగ్యు లెవ్వరుండరు. చాకలి వెధవల మాటలు నమ్మి మీరుకూడ గంతులు వైచుచున్నారని ప్రత్యుత్తర మిచ్చెను. "గుమ్మడికాయలు దొంగ" యనగా బుజము తడిమి చూచుకొన్నట్లు పెండ్లికి వచ్చినవారిలో నింతమందియుండగా "ఆముదము దొంగయున్నపుడు నీవే పూసి కొని రానేల" యని మిత్రు లెగతాళిచేయఁ జొచ్చిరి. న్యాయము చెప్పినాను. కాని నాకెందుకని గణపతి ప్రత్యుత్తరము చెప్పి, ఎంద రెన్నివిధము లెగతాళి చేసినను వాని భావము గ్రహింపలేక తనగుట్టు బయటపడలేదని నమ్మి సంచరించెను. రాజమహేంద్రవరమున జనులను జూడఁగా నతనికి మఱియొక యుబలాటము గలిగెను. చెప్పులు మోటవాండ్రు దొడుగుకొన వలసినవె కాని నాగరికులకుఁ దగనివనియు,నాగరికులు పాదము లకు దొడుగుకొనవలసినవి ముచ్చెలో చడావులోగాని చెప్పులు కావనియు నతని మనస్సునకుఁ దట్టెను. తట్టినతోడనే యతఁడు తన పాఁత చెప్పు లమ్మఁజూపెను. ఆ చెప్పు లతని కాలునకేగాని మరియొకరి కాలునకు సరిపడనివగుటచే నవి కొనువారెవ్వరు లేకపోయిరి. సంపాదించిన డబ్బులు చాకలివాండ్రకు లంచమిచ్చుటక్రింద వెచ్చబెట్టబడినందున క్రొత్తజోడు కొనుట కతనికడ డబ్బులేకపోయెను. అదిగాక ముచ్చెలు కొనుట మంచిదా చడావులు కొనుట మంచిదా యను విషయ మతఁడు విచారణ చేయ దొడఁగి సంగడికాండ్రనడుగజొచ్చెను. "మిట్ట ముచ్చెలు నీకాలికెంతో యందముగ నుండును. అవి తొడుగుకొని టక్కు టిక్కుమని నీవు నడిచితివా చూచువారి కెంతో ముచ్చటగ నుండును. కాబట్టి ముచ్చెలే కొనుమని యొకఁడు సలహా చెప్పెను. ఒంటియట్ట చడావు నీ పాదమున కెంతో సొగసుగ నుండును. చడావు తొడిగికొని అవి కిఱ్ఱుకిఱ్ఱుమని చప్పుడు చేయుచుండ నీవు వీధులవెంట నడుచునపు డెల్లరకు ముద్దుగా నుండును. కాబట్టి చడావులే కొనవలసిన దని మరియొకఁ డాలోచనము చెప్పెను. చేతిలో డబ్బు లేకపోయినది కాని గణపతి ముచ్చెలు చడావులు కూడ కొనఁగోరెను. రెండింటిని గొనుమని యడిగిన బాగుండదని తనలో దానె విచారించు కొని పెండ్లి కుమారునికడ కరిగి కొంతసే పామాట లీమాటలాడి యతఁడు గూడ తన గిరిజాల విషయమై కొంత పరామర్శచేసిన పిదప తన మనోరథ మెఱిఁగింప దలఁచి యిట్లనియె "నీ వింత వైభవముగ వివాహము చేసికొను చున్నందుకు నాకేదైన మంచి బహుమానము నీవు చేయవలెను. ఎలాగైనను నీవొక జామారుగుడ్డ నా కీయకపోవు. జామారు నాకక్కరలేదు. ఈ మధ్య షొడశ బ్రాహ్మణార్థములలో నాకేడెనిమిది గుడ్డలు దొరికినవి. బట్టల కరవు లేదు. నాకిప్పుడు కావలసినది మంచి పెద్దాపురపు పైజార్ల జోడు. పొట్టివాడ నగుటచేత మిట్ట పైజార్ల జోడు నా కాలి కందముగా నుండునని మనవాళ్ళు చెప్పినారు. దాని ఖరీ దర్థరూపాయి. ఏలాగైనను నీవు నాకిది కొనిపెట్టక తప్పదు. ఏమిటి నీ యభిప్రాయము? నాకోరిక తీర్చెదవా లేదా?" అనపుడు పెండ్లికుమారుఁ డిట్లనియె "నాదగ్గఱ డబ్బులులేవు. నాలుక పెరికికొన్నను మాతండ్రి నాచేతికి రాగిడబ్బైన నీయఁడు. సదస్యము నాఁడు నీవు చూచితివిగదా రూపాయ రూపాయ సంభావన వచ్చునని బ్రాహ్మణు లెంతో యాసపడి రాఁగా మా యయ్య బేడ బేడ యిచ్చి సాగనంపినారు. బ్రాహ్మణులు తోరణములు తెంపినారు. ఎంతో గందరగోళమైనది. నీ సంభావన డబ్బు లేమి చేసికొన్నావు? అవిపెట్టి కొనరాదా" అని యతఁడు పలుక గణపతి "గోదావరిలో స్నానముచేయుచుండగా మూట విడిపోయి సంభావనడబ్బులు పడిపోయినవి. నీవంటివాని నాశ్రయించినందుకు నా కోరిక తీరకపోవలసినదేనా? పోనీ మీ నాన్న చేత బదు లిప్పించు. రెండు షోడశబ్రాహ్మణార్థములు చేసి నీ యప్పు తీర్చెద" నని యుత్తరము చెప్ప పెండ్లికుమారుఁడు "మా యయ్య నా సిఫారసుమీద నీ కప్పియ్యఁడు. అట్టియాస బెట్టుకొనకు" మని ప్రత్యుత్తర మిచ్చి పంపెను. గణపతి భగ్నమనోరథుఁడైనను ముచ్చె లెట్లయిన సంపాదించి తీరవలయునని కృతనిశ్చయుఁడై ఉపాయాన్వేషము జేయఁజొచ్చెను. ఉపాయము పొడగట్టెను. అతని యదృష్టవశమున నా సాయంకాలము బంధువైన వైశ్యుఁ డొకడు పదియేండ్ల వయసుఁగల తన కుమారుని వెంటబెట్టుకుని పెండ్లివారిని జూడవచ్చెను. అప్పుడు రెండు గడియలరాత్రి యయ్యెను. ఆతని కుమారుఁడు జరీపని చేసిన ముచ్చెలజోడు తొడుగుకొనివచ్చి యది గుమ్మము ముందరవిడిచి లోనికిఁ బోయెను. అది ముద్దుల మూటగట్టు చున్నట్లు గణపతికిఁ దోచెను. ఎట్లయిన నదిగాని యటువంటిది గాని తన కుండినపక్షమున తన జన్మము ధన్యమగునని యతఁడు భావించెను. కొంచెముసే పిట్టట్టు బచారుచేసి తనపాద మందులోబెట్టి సరిపోవునేమో యని చూచెను. అది సరిగా నతనికి సరిపోయెను. అటువంటిది, మఱియొకటి దొరకనప్పు డిదియె తాను గ్రహింపఁదగునని నిశ్చయించి యటుచూచి చేయిజూచి జోడు తీసి యుత్తరీయమున జుట్టి దొడ్డిదారిని బోయి తన బట్టల మూటలో బెట్టెను. ఆ కోమటియు గుమారుఁడు దాంబూలము పుచ్చుకొని వీథిగుమ్మముకడకుఁ బోయి చూచునప్పటికి జోడు కనఁబడలేదు. జరీపనిచేసిన ముచ్చెలజోడు కావలయునని కొడుకెంతో ముచ్చట పడగా కోమటి యాకాలమున నట్టిజోళ్ళకుఁ బ్రసిద్ధికెక్కిన పెద్దాపురమునం దది పురమాయించి చేయించి తెప్పించెను. ఆ పూటే కొడుకది తొడిగికొనివచ్చెను. కుఱ్ఱవాఁ డేడుపు మొగముపెట్టి యింటికిఁ బోయెను. విడిదిలో జోడు బోయినదని పెండ్లికుమారుని తండ్రి యెంతో నొచ్చుకుని కూడ వచ్చిన వారినందఱనడిగెను. కాని యది బయలుపడలేదు. అక్కడున్న వారందఱు దొంగిలించిన వానిని నోటికి వచ్చినట్లు తిట్టిరి. వారితోపాటు గణపతియు నాలుగు తిట్లు తిట్టెను. గణపతి కార్యవాది కాని ఖడ్గవాది కాఁడు గనుక కార్యసాధనము నిమిత్తమై తిట్లన్నియుఁ బడెను. బెండ్లివారు మూటలు పరీక్ష చేయుదురేమో యని భయపడి గణపతి తనమూట తీసికొనిపోయి వేరొక యింట బెట్టెను. మొత్తము మీఁద దొంగతనము బయలు పడకుండ జాగ్రత్తపడి జోడు సంపాదించెను. గిరజాల యుబలాటము ముచ్చెల యుబలాటము దీరిన పిదప గణపతికి మఱియొక కోరిక పుట్టెను. పుట్టి బుద్ధి యెఱింగిన తరువాత నతఁడు కోటు తొడిగి యెఱుఁగఁడు. చీట్లపేక లోపలి కోటులే కాని శరీరాచ్ఛాదనము చేయు కోటు అతఁడు చూచి యెఱుఁగడు. తల్లి చిన్నప్పుడు ముద్దునిమిత్తము బొందుల చొక్కాలు రెండు కుట్టించెను. కాని యవి చిరిగిపోయెను. కోటు తొడిగిన మనుష్యుఁడతని కెంతో విచిత్రనరుఁడుగ గనఁబడెను. రెండుకోట్ల రూపాయ లున్నను హాయిగా దొడిగికొనుటకు రెండు కోట్లు లేనిపక్షమున వాని జన్మంతయు వ్యర్థము. పశువునకు వానికిని భేదమే లేదని యతని మనంబునకుఁ దోచెను. ఎటులైన నొక కోటు గాని, రెండు కోట్లు గాని కుట్టించుకొనవలయునని తలఁచి చేత డబ్బులేనందు కతఁడు విచారించి గుడ్డలు చేతితో స్పృశించియుఁ గన్నులం జూచియు ధన్యత జెందవలయునని మంచి కోటుగుడ్డ లున్న దుకాణము లన్నింటికి జని యెంత వెలయైన నిచ్చి కొనువానివలె మూటలు విప్పించి గుడ్డల నన్నింటిని బేరమాడి చేతిలో నాణెము చూచి రంగు వెలియదు కదా? చాలకాలము మన్నునుగదా? యని యడిగి తక్కువ వెలల కడిగి బేరము కుదరక వెడలిపోయినట్లు దుకాణములు విడిచి వెళ్ళెను. ముచ్చెలజోడు సంపాదించిన విధమున నీకోటు గుడ్డలు సంపాదించుట కెంతమాత్రము వీలు చిక్కకపోయెను. ఆ రాత్రి యతని కా విచారము చేత నిద్రయే పట్టలేదు. అప్పు డతఁడు తన మనంబున నిట్లనుకొనెను. "తద్దినములకు షోడశములకు బ్రాహ్మణులకుఁ బనికిమాలిన సైనుగుడ్డ లిచ్చెదరు. కాని శుభ్రమైన కోటుగుడ్డలు రెండు మూఁడు తెచ్చి యిచ్చిన పక్షమున నెంత బాగుండును. తెలివితక్కువ ముండాకొడుకులు స్వయముగ దెలిసికొనలేరు. ఆలోచనలు చెప్పిన వారిమీఁద మూరెడు కోపము. కోటుగుడ్డ లియ్యనిచోటికి బ్రాహ్మణార్థమునకు వెళ్ళవద్దని బ్రాహ్మణార్థములు చేయు కుఱ్ఱవాండ్రందరఱకు నచ్చచెప్పి కట్టు కట్టించెదను. అప్పుడుకాని వాండ్రరోగము కుదరదు!" అట్లనుకొనుచుండఁగ మెల్లమెల్లగ నిదురపట్టెను.