గణపతి/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాలుగవ ప్రకరణము

వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింపఁ దలచుకొనలేదు. అయినను ముఖ్యమైన వొకటి రెండు కలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమంది నప్పుడు వారికుభయులకు ననాదిబంధువులైన నేతివారు దయచేసి వారితోఁ గలసి మెలసి వివాహమున కెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధుమిత్రులైన కందావారు చెమ్మకాయలవారు బీరకాయలవారు చేమకూరవారు వంకాయలవారు మిరియాలవారు దోసకాయలవారు దయచేసి రేయింబవళ్ళు విరిగి ముక్కలగునట్లు పనిచేసి మెప్పువడసిరి. ఉప్పువారు మొదటినుండియు నచ్చటనే యుండిరి. కానివారి కన్నంభొట్లవారితో నంత యైకమత్యములేదు. ఉప్పు వారికిని మనపప్పువారికిని నతికినట్లంన్నంభొట్లవారితో నతకదు. ఉప్పువారికిఁ బంధుమిత్రులకుఁ గూడ నెక్కువ కలయిక నుండెను. గొల్లప్రోలునుండి చల్లావారు మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసినను మొదటినుండియు నన్నంభొట్లవారి కాప్తులగుట చేత వారి సమాగమెంతో రసవంతముగ నుండెను. ఉభయులకర్చులు పాపయ్యయె వహించుటచేత నన్నప్పగారు పుచ్చుకొన్న పండ్రెండువందల రూపాయలలో జిల్లిగవ్వయైన వ్యయము కాలేదు. కాక కాక యైన వివాహమగుటచేఁ బాపయ్య యధిక శోభస్కరముగ వివాహము జేసికొనఁదలచిఁ యైదుదినంబులుం బల్లకినెక్కి యూరేగెను. పాపయ్య దీర్ఘకాయుఁ డగుటచే బల్లకిలోఁ గూర్చుండినప్పుడు చిన్న చిక్కు సంభవించెను. అతని తలకు దండియు దండిపైఁ బఱచెడు పింజరియుఁ దగులుచుండుటచే నతఁడే పెండ్లికూఁతురు భావము వహించి తలవంచుకొనవలసినవాఁ డయ్యెను. అందుచేతఁ బల్లకిలోనున్న సమయములో నతనిని జూచినవారు మెడగుళ్లు వంగినవని కొందఱు, గూనివచ్చినదని కొందఱు, కాదు కాదఱువదియపడిలోఁ జిన్నపిల్లను వివాహమాడినందుకు సిగ్గుపడి తలవంచుకొన్నాఁడని కొందరు దోచిన విధముగననిరి. దీర్ఘకాయమునకుఁ దోడుగ నతఁడు లావుగలవాఁ డగుటచేతను, గూనంత బొజ్జగలవాఁ డగుట చేతను, దండాడింపు సమయమునఁ బెద్దచిక్కు సంభవించెను. వచ్చిన బంధువులలో మిత్రులలో బరిచితులలో నతని నెత్తుకొని దండాడింపు చేయఁగలవారు లేకపోయిరి. పాపము నేఁటికాలమునకుఁ బాపయ్య వొక యింటివాఁ డగుచున్నాఁడుగదా, యతని ముచ్చట మాత్రము తీరవలదా యని యొక బంధువుఁడు సాహసించి పెండ్లికుమారు నెత్తుకొని రెండు గంతులు వేయునప్పటికి నూనెసిద్ధివలెనున్న పాపయ్యబొజ్జ జారిపోవ లక్క గుమ్మడికాయవలె నతఁడు క్రింద గుభాలునఁ గూలెను. చట్ట నొప్పిపెట్టెను. పిమ్మట నతఁ డొకయరుఁగుమీద గూర్చుండి పెండ్లికుమార్తె మీఁద బగ్గుండ జల్లి యా యుత్సవ మైన దనిపించెను. ఇంక భోగము మేళమునుగురించి రెండుమూఁడు మాటలు చెప్పవలెను. పాపయ్య జన్మముచేత శుద్ధవైదికుఁడైనను జాలకాలము పునహానగరములో నివసించిన నాగరకుఁడగుటచే గొప్పరసికులలో జేరినవాఁడు కావున శృంగార దేవతలగు వేశ్యలులేని పెండ్లి పెండ్లికాదని యభిప్రాయపడి వెలయాండ్రకుఁ బ్రసిద్ధికెక్కిన పసలపూడి మండపేట మొదలగు గ్రామములకుఁ బ్రత్యేకముగ మనుష్యులనంపి మేళములకై ప్రయత్నించెను. అది వివాహకార్తియగుటచే మేళము లన్నియు నందందు గుదిరి యుండుటచేఁ దగిన మేళము దొరకలేదు. మేళముండితీరవలయునని పాపయ్య పట్టు పట్టెను. అందుచేత నతనిమిత్రుఁడొకమేళము దీసుకొనివచ్చెను. ఆవేశ్యపేరు చంద్రవదన. చిన్నప్పుడది మిక్కిలి చక్కనిదె కాని మశూచికపు మచ్చలు మొగమునుండుటచేతను కుడికాలుకొంచెము వంకరగనుండుటచేతను దానినెవ్వరు మేళమునకుఁ బిలుచుటలేదు. దానివెనుక తాళహంగు చేయునది పాటకత్తెయే కాని కొంచెము నత్తియగుటచే దానిపాట శోభించుటకు వీలులేక పోయెను. కుంటిదైననుసరే గ్రుడ్డిదైననుసరే నత్తిదైననుసరే నంగిదైననుసరే వేశ్య వివాహ కాలమునఁ బెండ్లి పందిరి నలంకరించవలయు నని పాపయ్య ధృడసంకల్పముఁ జేసుకొని యుండుటచే నమావాస్యనాఁటి చంద్రబింబమువంటి మొగము గల యాచంద్రవదననను బిలిపించి పాపయ్య మేజువాణి చేయించెను. వచ్చినబంధువులు దోషైక ద్రుక్కులు గాక గుణగ్రహణపారీణు లగుటచే మోరుచేతుల దాని యభినయమునకు సత్తిదాని గానవైఖరికిని మహానందభరితులై రాత్రి ప్రొద్దుపోవు వఱకు నుదయమున రెండు జాముల వరకుఁ మేజువాణిఁ జేయించుచుండిరి.

శుద్ధవైదికులగుటచే రసికత నెఱుంగక యిట్లువారు సంతసించిరని కొందరు పడుచువాండ్రన సాహసించిరి. కాని యా మాటలు మీరు నమ్మగూడదు. వారల్ప సంతోషు లనియు గుణమెంతవరకు నున్న నంతవఱకు గ్రహించి యానందించువారనియుఁ దలంపవలయును. వివాహము ముగిసెను, వివాహమైనందుకు మనపాపయ్య మిక్కిలి సంతసించెను. కానియతని మనస్సులో నొకవిచారముండెను. అత్తవారింటికి మనుగుడుపునకుఁ బోవుట మొదలగు ముచ్చటలు తీరుట కవకాశము లేక పోయినందున నది గొప్ప కొరఁతగా నతఁ డెన్నుకొనుచు వచ్చెను. అత్తమామలు వివాహమైన తరువాతగూడ గొంతకాలము మందపల్లెలోనె యుండి యల్లుడు తమయింటఁ జేయవలసిన మనుగడుపు తామే యల్లుని యింటఁ జేయఁసాగిరి. చూచువారికిఁ బాపయ్య మామగారై నట్లు నన్నప్పయల్లుఁడైనట్లుండెను. తనకు సరియైన గౌరవము జరగలేదని యల్లుడు బెట్టుజేయుట కవకాశము లేక పోయెను. కాని యన్నప్ప నడుమ నడుమ కొంతబెట్టుసరిచేసి యన్నముమాని యింటికి రాక తగవులాడఁజొచ్చెను. పాపయ్యమామగారిని బ్రతిమాలి యింటికి తీసికొని రావలసి వచ్చెను. అన్నప్ప వివాహమైన వెంటనే మూలస్థానము వెళ్ళఁదలఁచెను, కాని పదియాఱు దినముల పండుగైన తరువాత వెళ్ళుటమంచిదని యాగెను. ఆ పండుగ ముగిసిన తరువాత నన్నప్ప భార్యకు బెండ్లి బడలిక వలనఁ గొంచెము జబ్బుచేసెను. అది నివారణ మగునప్పటి కన్నప్పకే కొంచె మనారోగ్యము కలిగెను. అన్నప్ప తుదకు నెమ్మదిగా నున్న తరువాత బయలుదేరి పోవలయునని పంచాంగము జూడఁగా నొకనాఁడు వారము మంచిది కాకపోయెను. మరి యొకనాఁడు తిథి మంచిది కాకపోయెను. వేరొకనాఁడు నక్షత్రము మంచిది కాకపోయెను. ఇవి యన్నియు గుదిరి యెకనాఁడు బయలుదేరఁగా పిల్లి యెదురుగా వచ్చినందున నాదినమునకుఁ బ్రయాణ మాగిపోవలసి వచ్చెను. తిథివార నక్షత్రములు మరల గుదురునప్పటి కొక్క మాసము దినములు పట్టెను. అప్పుడన్నప్ప బయలుదేఱి వీధిలోనికి రాఁగానే యతని నిమిత్తమే కనిపెట్టుకొని యున్నట్లు చేతనొక పిడకయు బిడకమీఁద నిప్పును బెట్టుకొని వితంతు వెదురుగా వచ్చెను. క్రొత్త పెండ్లికూఁతుర్ని దీసికొని యట్టి దుశ్శకున సమయమున బయలుదేరుట యెంతమాత్రము సముచితముకాదని యన్నప్ప గిరుక్కున వెనుకకు మరలి తరువాత రెండుమూఁడు ముహూర్తములు ప్రయాణము నిమిత్తము పెట్టించెను. ఒంటిబ్రాహ్మణుఁ నొకసారి తెలికలి వాఁడొకసారి యెదురుగావచ్చి ప్రయాణమునిలిపిరి. వెయ్యేల, మందపల్లిలోనున్న వారంద రేదోవిధముగ నన్నప్ప ప్రయా ణమున కాటంకమే గలిగించిరి. మూల స్థానమునకు వెళ్ళి స్వగృహమున గాపురము జేసినయెడల దనసొమ్ము కర్చుపడునను భయమున నన్నప్ప యేదో వంక బెట్టి మందపల్లిని విడువక యల్లుని యింటనే తిష్టవేసుకొని తేరకూడుతినుచున్నాడని గ్రామస్తులు కొందఱు చాటుచాటున ననుకొనుచున్నట్లు విని యతఁడు తీవ్రకోపముదాల్చి మందపల్లివాసు లందఱుఁ దుంటరులని నీచులని తిట్టి “ఛీ! యీ గ్రామమం దొక్క నిమిషమై నుండగూడ” దని యల్లునిమీఁద గూడ గేకలు వైచి కూఁతును గొడుకును భార్యను దీసుకొని బయలు దేరెను. ఆ ముహూర్త బలిమి యెట్టిదియొగాని వారు పొలిమేర దాటి యైన వెళ్ళకమునుపే గొప్ప మబ్బు పట్టి యురుములతో మెరుపులతో నేనుఁగు తొండములావు ధారలతో గొప్ప వర్షము కురిసెను. అన్నప్ప సకుటుంబముగ నిలువున నీరై తడిసి మోపెడై దైవప్రాతికూల్యమున కేమియుఁ జేయఁజాలక విధిలేక మరల జామాతృగృహము జేరవలసినవాఁ డయ్యెను. అల్లుడు పదియవ గ్రహమని లోకమున నున్నసామెత యీ విషయమునఁ దారుమారై మామగారే పదియవగ్రహమైనట్లు లోకులకుఁ దోఁచెను. స్వగృహమున నున్నపు డన్నప్పకు పాతయుసిరిక పచ్చడియొ కాల్చినమిరపకాయయొ గంజియొ చింతపండు పచ్చడియొ నన్నమున కాధారముగ నుండినఁ జాలును. తత్త్వము మారిపోవుటచేతనో మఱి యేకారణముచేతనో యల్లుని యింట నున్నంతకాల మన్నప్పకు బాతబియ్య పన్నము పప్పు నధమపక్ష మొకకూర పచ్చిపులుసు మొదలగునవి కావలసివచ్చెను. నడుమనడుమ మినపసున్ని, యరిసెలు, వేపుడుబియ్యము నటుకులు మొదలగు నుపాహారములు కావలసి వచ్చెను. గాదిక్రింది పందికొక్కువలె మామగారు తనయింటఁ జేరి దోచుకొని తినుచున్నాడనియుఁ బూర్వము పునహానగరములో సంపాదించిన ధనము పెండ్లికుమార్తె యోలినిమిత్తమైననేమి, పెండ్లికర్చుల నిమిత్తమైన నేమి నవ్వలి ఖర్చులకైన నేమి మొత్తముమీఁద నన్నప్పగారి నిమిత్తమే వ్యయమైనదని పాపయ్యకు విచారము పుట్టెను. చూచిచూచి మామగారిని వెళ్ళగొట్టఁలేడు. వివాహమైన తరువాత పాపయ్యను కలిసికొన్నవారందఱు మామగారి యద్భుత ప్రజ్ఞావిశేషంబు లప్పడప్పుడు కైవారములు చేయుచుండుట చేత నన్నప్ప కాగ్రహము దెప్పించుటకిష్టములేదు. అన్నప్ప తనంతట తానువెళ్ళునట్లు కనఁబడలేదు. వివాహమై యప్పటి కారుమాసము లయ్యెను. అత్తగారి కుటుంబ భరణమునకైన వ్యయ మటుండఁగా మామగారప్పు డప్పుడు చేఁబదులు పుచ్చుకొన్న దేఁబదిరూపాయ లయ్యెను. మందపల్లి నీళ్ళు తనకి వేఁడి చేసినవని యన్నప్ప వారమున కొకసారి యావు నేతితో మంగలిచేత దల యంటించుకొని తలయంటుకూలియు నేతివెలయు నల్లునకె గట్టుచుండెను. భార్యవచ్చిన దన్న సంతోషముపోయి పాపయ్యకు మామగారి రూపమున శని దాపురమయ్యెనని విచారము పుట్టెను. శనిగ్రహపీడ వదలించు కొనుటకై దేశమందలి యెల్లవారు మందపల్లి బోవుచుండఁగా మందపల్లిలోనే యున్న పాపయ్యకు శనిగ్రహపీడ వదలక పోయెను. ఇది తిలదానముతో వదలెడి శనిగాదు; తైలాభిషేకముతో వదలెడి శనిగాదని పాపయ్య మునసబు కరణాల తోను గ్రామములోని తక్కిన పెద్దమనుష్యులతోడను నాలోచనలు చేయసాగెను. ఎవరికి దోఁచినట్లు వారు సలహాచెప్పిరి. నాయింటనుండిమీరు లేచిపోవలసినదని స్పష్టముగఁ జెప్పుటయె మంచిదని మునసబు సలహా జెప్పెను. ఉప్పు పప్పు బియ్యము మొదలగు పదార్థములు లింటలేకుండఁ జేసినీవు పది దినములే గ్రామమైన వెళ్ళవలసినదని కరణము హితోపదేశముచేసెను. ఆ రెండుపదేశములు బాపయ్య కంత రుచింపలేదు. ఇకఁ గొంతకాల మోపిక పట్టవలయునని యతఁడు నిశ్చయించుకొని పిల్లిమీఁదఁబెట్టి యెలుకమీదబెట్టి సూటిపోటిమాటలు మామగారి కర్థమగు నట్లనఁజొచ్చెను. పిచ్చుకమీఁద బెట్టి పీటమీఁదఁబెట్టి యన్నప్ప యల్లుడన్న మాటలకు దగినట్లు ప్రత్యుత్తరము జెప్పసాగెను. ఎట్టకేలకు పాపయ్య కోపిక క్షీణించెను. ఒక నాఁటి రాత్రి భోజనానంతరమున నూతి నరసింహ మనెడు మిత్రుని బిలిచికొనివచ్చి మామగారిని వెళ్ళిపొమ్మని యతనిచేత వర్తమాన మంపెను. నరసింహ మెంతో మృదువుగాను యుక్తియుక్తముగాను పాపయ్య యభిప్రాయమన్నప్పగారితో జెప్పెను. కాని యా పలుకులు వినగానే యన్నప్పకు వచ్చిన కోప మింతని వర్ణింప నలవిగాదు. గూర్చుండినవాఁ డువ్వె త్తుగలేచి యిల్లెగిరిపోవునట్లు బెద్దబెద్ద కేకలు వేయుచుఁ గొండ ముచ్చువలె గంతులువేయుచుఁ జేతులు బారలు జాపుకొని యాడుచుఁ దనకోపములోఁ గొంతభాగము నీవిధముగ వాక్యరూపమున వెళ్ళబుచ్చెను. "పునహా సతారాలలోజేరి పీనుగులు మోసుకొనునట్టివానికి మాణిక్యమువంటిపిల్లను దీసికొని వచ్చి కట్టబెట్టుట నాదే బుద్ధితక్కువ. తనవంశ మెక్కడ నిలువకపోవునో యని భయముచేత నాపిల్ల నిమ్మని యెందరిచేతనో నాకు వర్తమానమంపి నాకాళ్ళు, కడుపు బట్టుకొని బ్రతిమాలుటచేత బ్రాహ్మణవంశ మొకటి నిలువబెట్టిన పుణ్యము, బ్రతిష్టయుఁ గలుగునని పిల్లనిచ్చితిని. లేనియెడల నఱువదియేండ్ల వానికి నేను నాపిల్లనిత్తునా? పెద్దవాఁడైనప్పటికి సాంప్రదాయము కలవాఁడు పరువుగలవాఁడు గదా యనుకొంటిని గాని పరువుమర్యాదలు లేని వంటపూటివెధవ యనుకొనలేదు. ఇది యేమి పాడుగ్రామమొ కాని యీ దరిద్రగొట్టు గ్రామమునుండి యెన్నిసారులు పయనమై పోవఁదలచినను దుశ్శకునములె. ఊరునిండా మాయపిల్లులు, మాయముండలు. ఇంటిలోనుండి వీధిలోని కడుగు బెట్టితిమా యెదురుగా నొకముండ సిద్ధము. తొంగి చూచితిమా యెక పిల్లి సిద్ధము. శని గాని ప్రతిష్ఠగల గ్రామములో నింతకంటె నెక్కువుండునా! ఛీ! నాగౌరవము గంగపాలు చేసినావు. నాపరువు బండలు చేసినావు. నేనెంతో గౌరవముఁగ గాలక్షేపము సేయుచున్నాను. అత్తమామలకు నాలుగుదినములు పట్టెడన్నమైనను బెట్టలేక లేవఁగొట్టిన నీ పరువు మీఁద నిప్పులు పోయ, నీదిగూడ నొకబ్రతుకట్రా. ఇరుపార్శ్వముల నన్నదమ్ములుగాని యక్క సెల్లెండ్రుకాని చుట్టములుఁ బక్కములుగాని లేని సన్యాసి ముండాకొడుకు; వీఁడు దిక్కుమాలిన పాడకట్టు; గంజికాచి పోసెడు దిక్కైనలేదు; పెండ్లియైన మరునాటి నుంచియు సోలెడుబియ్యము తానే పొయ్యిమీఁదఁ బెట్టుకొని చేతులు గాల్చుకొని నిత్యవిధిలాగున వండుకొని తినవలె పాపమని జాలిపడి ఉపకారబుద్ధిచేత నేను పదిదినములు పనులు చెరుపుకొని గంపంత కమాటము వదలుకొని రెండుపూటలు నాభార్యచేతనే మడికట్టించి యీవల చెంబావలఁ బెట్టియెఱుఁగని నాకూతురుచేత పయిపని చేయించి వేడిచేసి నాకళ్ళుమసకలు గ్రమ్మినప్పటికి నాలోనేనే యోర్చుకొని నేను కూలివానివలె రాత్రింపవలు చాకిరీ చేయగా నా చాకిరీ విషమమైనది. ఛీ, నీకొంపలో నేనొక్కగడియ యుండను. ఓసీ! ప్రయాణమై మూఁట గట్టవే. పిల్లను పిల్లవానిని లేపవే, ఈ రాత్రి నీకొంపలో నుంటివనా ఛండాలుఁడే సరి”

అని లోనికివెళ్ళి నిద్రపోవుచున్నపిల్లలను లేపి తనబట్టలు కొన్ని, పాపయ్య బట్టలుకొన్ని, తన చెంబులు కొన్ని, పాపయ్య చెంబులు కొన్నికలిపి మూటగట్టుకొని యామూట నెత్తిని బెట్టుకొని యాలుబిడ్డలను వెంటబెట్టుకొని “నాకంఠములోఁ బ్రాణముండగాఁ నేనీకొంపలో దిరిగి యడుగుపెట్టను. ఇంతయవమానము జేసిన తరువాత నే నీ గ్రామము మరల రాఁగలనా? నేను కూటికి మొగము వాచలేదు. గుడ్డకు మొగమువాచలేదు. అల్లుఁడు పదియవగ్రహ మన్నమాట నాకిప్పుడర్థమైనది. నేటితో నాకు నాపిల్లకు ఋణముదీరిన” దని గుమ్మము దిగెను. ఆపలుకులకు మిక్కిలి కవలి పాపయ్య పునహానుండి తెచ్చిన దుడ్డుకఱ్ఱతో రెండుదెబ్బలు దీయఁదలఁచెను. కాని నూతి నరసింహ మతనిని వారించి మెల్లగా నన్నప్పతో నిట్లనియె “అన్నప్పగారూ! మీరు కొంచెము శాంతించవలెను. మీ యల్లుఁడు విశేషముగ ధనమున్న సంసారికాఁడు గనుకను నతని క్షేమము గూడ మీరు చూడవలయును గనుకను రెండు సంసారములు నతటు భరింపలేడు గష్టనిష్టురములు చెప్పుకొనుటకు మీరుతప్ప యతనికి మఱెవ్వరు లేరు గనుకను నేను మీ యుభయులకు గావలసిన వాఁడను గనుకను నాచేత రహస్యముగఁ దనసాధక బాధకములు వర్తమాన మంపినాఁడు. దీనికి మీరింత కోపపడవలసిన పనిలేదు. ఈ రాత్రియె వెళ్ళవలసిన యవసరము లేదు. స్థిమితముమీఁదఁ వెళ్లవచ్చును. అర్ధరాత్రమువేళఁ జిన్నపిల్లలను దీసికొని మీరెక్కడకు వెళ్ళగలరు? కాబట్టి యీరాత్రి యిక్కడ పండుకొని రేపుభోజనముచేసి వెళ్లవచ్చును నిలువుడి.” అని వేడుకొనుటయూ నన్నప్ప దెబ్బతిన్న త్రాఁచువలె నాగ్రహము రెట్టింప “నీ రాత్రిగాదు కదా గడియ యిక్కడుండను. అన్నంభొట్లవా రంటే యొక్క మాట మీఁదనె నిలఁబడగలవారు. ఇతని యింటిలో నిద్ర పోవుటకంటె శ్మశానములో నిద్రపోవుట మంచిది. నన్ను పలకరించవద్దు. నా నోరు మంచిదికాదు. మీయిద్దఱిపరువు సమానము గనుక మీకు కలిసినది, నాకుమీతో గలియదు. ఈ యాఱుమాసములు విధిలేక ముండ్లమీఁదు న్నట్టున్నాను. వెనుకదిక్కు లేనివారి నొక్కనిని విడిచి వెళ్ళినానను నింద నానెత్తిమీఁద లేకుండ మీ నోటితో మీరే వెళ్ళు మని చెప్పినారు కావున నింద నామీఁద లేకుండ సరిపోయింది. నన్ను మీరాపవద్దు, ఇదిగో వెళ్ళుచున్నాను” అని విసవిస నడువసాగెను. నిద్రామధ్యమున మేలుకొలుపఁ బడుటచేఁ గొడుకుఁ గూతురుఁ గన్నులు నలుపుకొనుచు వెంటఁ జనిరి. బిడ్డలవెనుక భార్య యరిగెను. అట్లువారు పయనమై రెండవ వీధికరిగి యొక్క యరుగుమీఁద బండుకొని తెల్లవారుజామున లేచి మరల పయనమై రేవుదాటి స్వగ్రామము జేరిరి. నాఁడు మొదలుకొని పాపయ్యకు మామగారికి నోటిమాటయు గంటిచూపును లేవు. ఉత్తర ప్రత్యుత్తరము లంతకుముందే లేవు. పాపయ్య మామగారి పోక శనిగ్రహవిమోచన మట్లు తలంచి తల తడిమి చూచుకొనెను. వివాహమైన రెండు సంవత్సరములకు భార్యయుక్తవయస్కురాలైనదని పాపయ్యకు వర్తమానము తెలిసెను. కాని మామగారు శుభలేకవ్రాయలేదు. పాపయ్య స్వయముగావెళ్ళి నిజస్థితిఁ గనుగొని యా వార్త నిజమయ్యెనేని పునస్సంధానము చేయవలసిన దని యడుగఁ దలఁచెను. కాని యల్లు డదివఱకు చేసిన మహాప రాధమును మరువఁదలఁచినను మామగారికి మరపు రాకుండుటచేత నతఁడు తన్నింటికి రానిచ్చునా, తనకు బట్టెడన్నము బెట్టునా, సొమ్ము కర్చుపెట్టియతఁడు పునస్సంధానముజేయునా యని సందేహము దోఁచెను. అందుచేత నతఁడుస్వయముగా వెళ్ళుటకంటె రాయబార మంపుట మంచిదని చెరువు సీతారామయ్య యను బంధువును మామకడ కంపెను. అతఁడు మూలస్థానము వెళ్ళి యన్నప్పగారిని గలిసికొని కూఁతురు రజస్వలయైనమాట సత్యమని యతనినోటనె విని పునస్సంధానము మాట తలపెట్టెను. అల్లునిమాటఁ దలపెట్టగానె యన్నప్ప నిప్పులుత్రొక్కిన కోఁతివలె చిందులు త్రొక్కి బిగ్గరగ నఱచుచు నిట్లనియె. “పాపయ్య కిప్పుడేను మామగారి నైనాను గాఁబోలు, నాకిప్పుడాయన యల్లుడైనాఁడు గాఁబోలు, చీఁకటిలో జాము రాత్రివేళ నన్ను తనయింటనుండి యాలుబిడ్డలతోగూఁడ లేవగొట్టినమాట తాను మఱచినను నేను మరువలేదు. నాడొక్కలో శూలించుచున్నది. అది జన్మజన్మములకైనను నాకు మఱపురాదు. నేను మధ్య వాళ్ళమాట నమ్మి నిష్కారణముగా నాపిల్లగొంతుక కోసినాను. అటువంటి మగనితో నాపిల్ల కాపురము చేయుట కంటె నాకు రెండవ మగపిల్లవాఁడు లాగున నాబంతి నింత యన్నము దిని యిచ్చటనె యుండగలదు. అత్తలేదు. ఆఁడబిడ్డలేదు, ఏకాకి ముండాకొడుకు వాఁడు. కాలు నొచ్చును, చేయి నొచ్చును, పిలిచినా పలుకువారులేరు; పట్టెడన్నము కంచములో బెట్టువారు లేరు; నారాయణ నారాయణా యీ పిల్లమాటే తలఁచుకొని నేను బెంగపెట్టుకొన్నాను. ఇన్నిమాటలెందుకు? నేను పునస్సంధానముజేయఁ దలంచుకొనలేదు.” అనవుడు సీతారామయ్య శాంతివచనముల నతని బతిమాలి కట్టకడపట నిట్లనియె “మహర్షులవంటి మహానుభావులు సయితము మనుష్యులు చేసిన పాపముల పరిహారము నిమిత్తము ప్రాయశ్చిత్తము విధించిరి. ప్రాయశ్చిత్తము లేనిదోషము లేదు. పొరబాటు లెవరివల్ల వచ్చినను, వచ్చినవె. అందుచేత పాపయ్యకుఁ గూడ నేదో ప్రాయశ్చిత్తము విధించండి. అనగా మీకాళ్ళు పట్టుకొని మిమ్ములను బతిమాలు మని చెప్పండి. ఏదోవిధముగ మనలో మనము సర్దుకొని పిల్లకాపురము పొత్తుచేయవలెను. కాని చెడగొట్టుట మంచిదికాదు.” అని పలుక నన్నప్ప తల పైకెత్తి కొంచమాలోచించి “సరే; పెద్దలు చెప్పినారు గనుక మీ మాటప్రకారము నేను నడచుకోదలచుకొన్నాను. ఏదోప్రాయశ్చిత్తము విధించుమన్నారు; గనుక మూఁడువందల రూపాయలు మూటగట్టి నాచేతికిచ్చిన పక్షమున మును పైన దేమిటో యైనదని వెనుకటిదంతయు మఱచి కార్యము చేసెదను. లేదా నాపిల్ల విధవాడ పడుచువలె నాయింటనెయుండును. ఈమాటలె పాపయ్యకు జెప్పండి; మూటలెగాని యిఁక మారుమాట లక్కఱలేదు. ఇన్నిమాటలులేవు నాతో” నని కంఠోక్తిగఁ బలికెను.

ఆ సందేశమును సీతారామయ్య యధోక్తముగఁ బాపయ్య కెఱిగించెను. మూఁడువందలరూపాయ లిచ్చుట యతని కిష్టములేదు. చేతులార పిల్లను వదలుకొనుట కంత కన్న నిష్టములేదు. కొన్ని దినములు వితర్కించి వితర్కించి యెట్టకేలకు మిత్రుల ప్రోత్సాహమున మూఁడు వందలరూపాయలలు మూటగట్టి సీతారామయ్య చేతనే పంపెను. వెండిబంగారములు బరిశుద్ధ పదార్థములె కావున స్వీకతించినవారి మనస్సులు గూడ పరిశుద్ధములు చేయును. రజతదర్శనము చేత నన్నప్ప కోపమంతయు నుపశమించెను. వివాహము పెండ్లి కొడుకువారియింట జరిగినప్పుడు పునస్సంధానముగూడా నచ్చట జరుపవలెనని యన్నప్ప నియమముఁ జేసికొని సకుటుంబముగ మరల మందపల్లి వెళ్ళెను. బ్రహ్మచర్యమువదలి భార్యతో నేకమైనం జాలునని పాపయ్యవారిని సగౌరవముగ నెదుర్కొని తీసికొనివచ్చెను. ముహూర్తమేర్పడెను. పునస్సంధానమయ్యెను. క్రొత్తపిల్ల యగుటచేత సిగ్గుపడుననియు మగనిదగ్గఱ బెదురు తీరలేదనియు వంట నేర్పవలసియున్న దనియుజెప్పి యన్నప్ప గర్భాదానమైన యాఱుమాసములవఱకు మందపల్లిలో నుండెను. మామగారి కోపపు వేఁడిమి మున్నూరురూపాయలను గ్రక్కించినందున నీసారి పాపయ్య నోరెత్తి పలుకలేదు. అత్తగారి యిష్టప్రకారము మామగారి యిష్టప్రకారము నడచుకొనెను. అంతలోనన్నప్పగారి పూర్వజన్మసుకృతము చేతనో ఈజన్మసుకృతము చేతనో పిచ్చమ్మకు నెలతప్పెను. వేవిళ్ళు ప్రారంభమయ్యెను. వేవిళ్ళబాధ పడుచు నిజముగ నొకపట్టెడన్నమైననుదినక మంచము మీఁదనుండి సరిగ లేవకయున్న కూతు నొక్కరిత సత్తాడు బిడ్డలులేని యత్తవారియింట విడిచిపెట్టి యెంతనిర్దయులైన తలిదండ్రులైనను వెళ్ళఁజాలనప్పుడు తన పుత్రికయె తనపాలిటి భాగ్యదేవతయని కల్పవృక్షమని భావించుకొనుచు బ్రియపుత్రికనెడబాసి యుండుటకన్న లోకనిందకైన నోర్చి దానిదగ్గఱనె యుండుట మంచి దనుకొనుచున్న గారాబు తలిదండ్రులు విడిచి రాగలరా? రమ్మని ఱాతిగుండెవాఁడైన ననఁగలడా? అక్కడ నుండబట్టి తన కెన్నోపనులు చెడిపోవుచున్నవనియు దనకు వెళ్ళకతీరదనియు జెప్పి యన్నప్ప రెండు మూడుసారులు పయనమయ్యెను. కాని యీసారి యల్లుడేబతిమాలి యాయననాపెను. అల్లుని మాట నన్నప్ప తీసివేయలేక యాగెను. పిచ్చమ్మకు తొమ్మిది నెలలు నిండెను. పదియవ మాసమున మూడుదినములు కష్టపడి యామె సుఖముగఁ బ్రసవించెను. మగశిశువు గలిగెను. ఏఁడవనాఁ డాశిశువు పోరుపెట్టెను. పిచ్చమ్మతల్లి కన్నప్ప గారి తండ్రి గంగయ్య కలలోఁ గనఁబడి తనపేరు పెట్టుమని కోరెను. అట్లె చేయుదుమని యింటిల్లిపాది మ్రొక్కుకొనిన తోడనే శిశువు పోరుమానెను. పదునొకండవనాఁడు పురిటిశుద్ధి కాఁగానె బారసాల యయ్యెను. బాలునకు గంగాధరుఁ డని పేరుపెట్టిరి. చంటిపిల్ల తల్లిని విడిచిపెట్టిపోవుటకు మనసొప్పక విధిలేక యన్నప్ప యల్లుఁడును, మఱికొందఱును బతిమాలిన పిదప మనుమనికి నాలుగు మాసములు వచ్చువఱకు నుండదలఁచెను. తరువాత నాఱవమాసమున నన్నప్రాశనము కాఁగానె యాముచ్చటఁ జూచి వెళ్ళదలచెను, అన్నప్రాశమైన తరువాత ప్రయాణమునకు మంచిముహూర్త మన్నప్ప వెదకిపెట్టెను. ఆముహూర్తపటుత్వ మెట్టిదో కాని యాసమయమున కన్నప్పగారి ప్రయాణ మాగిపోయి పాపయ్య కూర్థ్వలోక ప్రయాణము సంప్రాప్తమయ్యెను. గొప్ప జ్యోతిష్కుఁడు పెట్టిన ముహూర్తమగుటచే నప్పుడెవరికో యొకరికి ప్రయాణముకాక తప్పినదికాదు. పాపయ్య యదివరకు మూఁడు నాలుగు దినములనుండి వరుసగ శ్రాద్ధభోక్తయై పెసరపప్పు గారె లరిసెలుఁ దినియెను. వార్ధక మగుటచే నమితభోజనము సరిపడకపోయెను. ఆ దినములలో మందపల్లిలో మరిడిజాడ్యములు బయలుదేరెను. పాపయ్య దానివాతఁబడెను. లోకమునకు విశ్వాసములేదు. కోటి యనాథప్రేతలను గట్టిపుల్లల వలె కాల్చిన పాపయ్యను మట్టిచేయుట కెవ్వరు రారైరి. ఎట్టకేలకు మామగారును మఱియొకరును సాయముపట్టి యెట్టెటో సంస్కారము జేసిరి. అన్నప్ప మందపల్లి విడిచి పెట్టి వెళ్ళుటకు శాశ్వతముగ వీలు లేకపోయెను.