గణపతి/ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐదవ ప్రకరణము

మనుష్యులు గతింప వచ్చును; కాని వారు సంపాదించిన యశస్సు వారి యనంతరమునఁ జాలకాలము నిలుచును. పాపయ్య కాలధర్మము నొందినాఁడు. కాని యతఁడార్జించిన ధనము చాలవఱకు వ్యయమైనను యశస్సు తరుగలేదు. వేదశాస్త్రంబులు చదువుకొననివారు జదువుట వ్రాయుటచేతగానివారు హాయిగా శవములు మోసికొని బ్రతుకవచ్చుననియు ధన మార్జింప వచ్చుననియు నాంధ్ర ప్రపంచమునకు బోధించిన ప్రథమాచార్యుఁ డతఁడే కదా. స్వదేశమున నన్నవస్త్రములు దొరకనప్పుడు విదేశములకు వెళ్ళి ప్రఖ్యాత పురుషులు కావచ్చునని తెనుఁగునాఁడు వారికి నేర్పిన పరమ గురువతఁడే కదా! ఏఁబది సంవత్సరముల వరకు స్వకాయకష్టపడి ధన మార్జించి తాను సంపాదించిన విత్తము విదేశములలో వ్యయముఁ జేయక స్వదేశాభిమానముఁ గలిగి వార్ధక దశయందు స్వస్థలమునకువచ్చి స్వగ్రామాభిమానముఁ బూని మందపల్లిలోనే నివసించి తాను జన్మించిన చోటనే మృతినొందిన దేశాభిమాని యితఁడే కదా! అందుచేతఁ నతఁడాంద్రుల కందఱకుఁ గాకపోయినను నతని యభిప్రాయముతో నేకీభవించు వారికైనను మాననీయుఁడు. ఈతని మార్గ మనుసరించి యీనాఁడు సయిత మాంధ్రులనేకులు విదేశములోనె గాక స్వదేశములో గూడ నొకరి నాశ్రయించవలసిన పనిలేని యావృత్తి నవలంబించి జీవయాత్రను జరుపుచున్నారు. పాపయ్య యొక్క యుత్తరక్రియలు నెరవేర్చిన తరువాత నన్నప్పకూఁతురు దగ్గఱచేరి యామెకు సంభవించిన దురవస్థకు మఱియొకసారి విలపించి యిట్లనియె. “అమ్మాయీ! నీమగనియొద్ద గొప్పగానో కొంచెముగానో ద్రవ్యమున్నట్లు విన్నాను. అతఁ డది యితరులకు బదులిచ్చి యున్నాఁడు. దస్తావేజులమీద నిచ్చినాఁడో నోట్లమీఁద నిచ్చినాఁడో తెలియదు. కాగితములు ముందుగఁ జూడనీ. ఊరకుంటిమా కాలదోషము పట్టగలదు. అటుతరువాత మనము చేయవలసిన పనిలేదు. చీమతలకాయంత సందు దొరకెనా యప్పు పుచ్చుకున్న వాండ్రెగబెట్టుటకె ప్రయత్నము సేయుదురు. లోకులు దుర్మార్గులు అందులో నీయూరివారు మరియు దుర్మార్గులు. అందుచేత సందువాపెట్టి తాళముచేయి నాచేతికిమ్ము; కాగితములు చూచి యవసరమైనపని చేసెదను.” అని బుజ్జగించి పలుకుటయు దుస్సహమైన నవవైధవ్య దుఃఖమున మఱగుచున్న పిచ్చమ్మ తన ప్రాణములు దాఁచిన పెట్టెతాళమిచ్చినదో యన్నట్లు సందువాపెట్టె తాళముచేయి దండ్రిచేతి కిచ్చెను. ఆతఁడు మెల్లగా నందులోనున్న నోటులన్నియుఁ దీసిచూడఁగా మొత్తము పదియేనువందల రూపాయలుండెను. ఆకాగితములు తీసికొని వెంటనే యతఁడు బాకీదార్ల వద్దకు వెళ్ళి యానోట్లు తిరిగి తనపేర వ్రాయమని కోరెను. భార్యయుండగఁ గుమారుఁ డుండ మీపేర నేల వ్రాయవలయునని యందుఁ గొందరడిగిరి. అట్టియనవసర ప్రశ్నముల కన్నప్ప యిట్లుత్తరము చెప్పెను. “అయ్యా! మీరనుమానించవద్దు. నా బిడ్డసొమ్ము నాకక్కఱలేదు. మగపిల్లలకంటె నాకాఁడుపిల్లల మీఁదనె ప్రేమ యెక్కువ. నా సొమ్ముదానికి పెట్టదలఁచుకొన్నాను. కానియెడల నీపదియేనువందల రూపాయలేమూలకు సరిపోవును. పిల్లవానికి వడుగు గావలెను; చదువు సంధ్యలు చెప్పించవలెను. బట్టలు పాతలు గావలెను. సంసార మనఁగా సముద్రము. మీకు తెలియని దేమున్నది. అదిగాక యీ వ్యవహారములో నేదైన నొకటి కోర్టుకెక్కెనా నాకూఁతు రాఁడదిగదా. అది కోర్టుకు రాఁగూడదు కదా? పిల్లవాడు కోర్టుకు వెళ్ళు టంతకంటే వీలులేదుగదా? నేనే కోర్టుకువెళ్ళి యావత్తు గ్రంధము జరిపించవలసిన వాడను. గనుక నాపేరనె కాగితము లున్నపక్షమున నెంతో వీలుగనుండును. నామాట వింటిరా మీకేదో కొంత సదుపాయము జేసెదను. ఆమాట నోట రాఁగానే కొందఱు బాకీదారులు వడ్డీమాను మనిరి. కొంద రసలులోఁ గొంత తగ్గించు మనిరి. కొందరు కొన్నిశంకలు బయలుదేరఁ

పిల్లవాఁడు చిన్నవాఁడు కదా అతఁడు పెద్దవాఁడైన తరువాత వెనుకటి కాగితములను బట్టి మామీఁద వేజ్యం వేసి మాకొంప లమ్మించును. అప్పుడు మీరును మీ మనుమఁడును సుఖముగ నుందురు, నడుమ మేము చెడిపోవుదుము. దీనికేమి చెప్పుదురని వారు స్పష్టముగ నడిగిరి. సమయోచితి బుద్ధికి బృహస్పతి యని చెప్పఁ దగిన యన్నప్ప దానిఁకి దగినయుత్తర మీయలేకపోవునా? పాపయ్య పేర నున్న నోట్లు మీ యెదుట జించివైచెదను. క్రొత్తగా మీరు నాయొద్ద బదులు పుచ్చుకొన్నట్లు నోట్లువ్రాసి యియ్య వచ్చును. మీరు నాకు వడ్డీ యియ్య నక్కఱలేదని పలికెను. ఈ యేర్పాటు బాకీదార్లకునచ్చెను. అందరును దిరిగి యన్నప్ప పేర నోట్లువ్రాసి యిచ్చిరి. ఇటువంటి విషయములలో నన్నప్ప మాట దప్పనివాడు. కావునఁ దనయల్లుని పేరనున్న వెనుకటి నోట్లు వానియెదుటనె ముక్క ముక్కలుగఁ జించిపారవైచెను. తాను వ్యవహారములో జేసినమార్పు కూతురి కెఱిఁగింపలేదు. ఎందుల కెఱిగింపలేదని యడుగుదురేమో, మగని పేరు చెప్పిన మాత్రమునను వానికాగితముల విషయమెత్తిన మాత్రమునను వాని సొమ్ముమాట సంస్మరించిన మాత్రమునను సముద్రమువలె దుఃఖము పొరలి పొరలిరాఁగా బిడ్డ బెంగఁ బెట్టుకొనునని చెప్పక యుండవచ్చును. లోకులు కాకులన్న మాట నిజము. కూఁతురు మనుమఁడు కోర్టులెక్కవలసిన యవసరం లేకుండ నొక్క బాకీదారుని యింటికివెళ్ళి యడుగవలసిన యవసరం లేకుండగా గాలదోష మెప్పుడు పట్టునోయని కాగితములు చూచుకొన వలసిన యవసరం లేకుండ నన్నప్ప కూతురుసొమ్ము తనసొమ్ముగ మనుమని వ్యవహారము తనవ్యవహారముగఁ జూచుకొనుచుండఁ గిట్టని వాండ్రు కొందఱు లేనిపోని నిందలతనపై వైచిరి. ఎవరేమకొన్న నతనికేమి? అతడు చేయఁదలచుకొన్న పని సూటిఁగ జేసెను. దూషణ భూషణ తిరస్కారంబులు దేహంబునకు గానిపరమాత్మకు లేవన్న మాట యన్నప్పకు సార్థకముగఁ దెలియును. బంధువులు గ్రామస్థులు బిల్లవాని కేమైన గొంత యాస్తి గలదాయని యన్నప్ప నడిగినప్పు డతఁడిట్లు చెప్పు చుండెను. "పాపయ్య పునహాసతారాలు వెళ్ళి యేదోమూట సంపాదించి తెచ్చినాడన్న పేరేగాని ప్రాణము బోవునప్పటికి పట్టుమని పదిరూపాయలు లేవు. దినవారములకర్చు నేనే పెట్టితిని. పిల్లవాఁడు మీ గ్రామస్థుడగుటచేతను, పాపయ్య మిమ్మునే నమ్ముకొని యుండుటచేతను మీరే వీరిని గాపాడవలెను".

ఇట్లనుటలో చిన్నప్ప యసత్యమాడెనని మనము తలంపఁగూడదు. పాపయ్య పోవునప్పటి కింటిలో రొక్కము పది రూపాయాలైన లేనిమాట నిజమే. ఉన్నసొమ్ము బదులిచ్చి యుండుటచే నన్నప్ప దినవారములకు కర్చుపెట్టిన మాట నిజమే. దినవారములు నలువది రూపాయలలో దేల్చెను. పాపయ్య కుటుంబమును గ్రామస్థులు పోషింపవలసిన మాట నిజమే. ఏలయన మనపాపయ్య భార్యపేరగాని కుమారుని పేరగాని చిల్లిగవ్వలేదు.

అల్లుఁడు పోయిన తరువాత నన్నప్ప యాఱు మాసముల కాలము మందపల్లిలో నుండి పిమ్మట మూలస్థానము వెళ్ళవలసిన పనియున్నదని ప్రయాణము లారంభించెను. అల్లుఁడున్నప్పుడతనికి మంచి తిథిగాని ముహూర్తముగాని శకునముగాని దొరకుటయె దుర్లభమయ్యెను. ఈసారి ప్రయాణయోగ్యములైన మంచితిథు లనేకములు లభించెను. తన్ను విడిచి వెళ్ళవద్దని కూతురు బహువిధముల బతిమాలెను. పరమార్థముల నెఱిగి పనిచేయువారికడ స్త్రీల దీనాలాపములు పనిచేయునా? దీనురాలైన బిడ్డలను విడిచివెళ్లుట న్యాయముకాదని గ్రామస్థులు మందలించినప్పు డన్న్నప్ప వారి కిట్లనియె. "అయ్యా! మీకేమి? పై నుండి యెన్నిమాటలైన జెప్పవచ్చును. మునుపు పాపయ్య సంపాదించి తెచ్చిపట్టుచుండెడివాడు గనుక నేనెన్ని దినము లున్నప్పటికి విచారము లేకపోయెను. క్రొత్తడబ్బు వచ్చునట్టి విధములేదు. నా కుటుంబముతో నేనిక్కడఁ గూర్చుండి తిన మొదలు పెట్టితినా వాళ్ళ కొంపగూడ పోవును. నేను నాయింటికి వెళ్ళి నాపొట్ట నేను పోసికొంటినా నాబిడ్డకు భారముండదు. దాని గంజియది త్రాగి దాని యిల్లది దిద్దుకొనుచుండెనా నేనప్పుడప్పుడు వచ్చి చూచిపోవుచుందును. ఇలా నాబిడ్డ క్షేమము కొఱకు చేయుచున్న పనిగాని మఱియొకటి గాదు. "ఆ యుత్తరము విని నమ్మినవారు నమ్మిరి. నవ్వినవారు నవ్విరి. విచారించిన వారు విచారించిరి. ఎన్ని విధములఁ దాను బ్రతిమాలినను వినక తండ్రి వెళ్లిపోవుటకై సంకల్పించుకొని యున్నాఁడని దృఢవిశ్వాసము దోఁచిన తరువాత నొకనాటిరాత్రి పిచ్చమ్మ తండ్రినిఁ బిలిచి దగ్గఱఁ గూర్చుండి పిల్లవాని నతని యొడిలో బెట్టి పొరలి పొరలి వచ్చు దుఃఖమాపుకొనలేక కొంతసేపేడ్చి గద్గదస్వరముతో నిట్లడిగెను. "నాన్నా! మీ యల్లుడు పోయి యిప్పటి కెనిమిది మాసములైనను నేను నోరెత్తి మాటలాడలేదు. ఏమున్నదో యేమి లేదో నే నెఱుఁగను. అర్థప్రాణములు నీచేతనే బెట్టితిని. నిన్నే నమ్ముకొంటిని. లోకులు కొందఱు మనకు సొమ్మియ్యవలెనని చెప్పితివిగాదా. ఆ సొమ్మేమైనది? పుట్టెడు దుఃఖముతో నున్నదానను నేనేమొగము పెట్టుకొని నిన్ను వ్యవహారము విషయమై యడుగనని నీవే నాకప్పగింతు వని యింతకాల మూరకొంటిని. నీదారిని నీవు వెళ్ళుచున్నావు. నాగతియేమిగా"నని అడుగుటయు నన్నప్ప హిమవత్పర్వతమువంటి ధైర్యహీనుఁడు గాక నిబ్బరమైన మనస్సుతో నిట్లనియను. "అమ్మాయీ! నీ భర్త మృతినొందు నప్పటికి నీకు నాలుగైదువందల రూపాయలు లోకులవల్ల రావలెను. ఎక్కువవడ్డీ కాసపడి పాపయ్య పైమీఁద బట్టలులేని ఫకీరు కప్పిచ్చెను. ఆ సొమ్ము చెట్టెక్కెను. ఒకఁడైనను నియ్యలేదు. నేను నానాకష్టములుబడి రేయింబవళ్ళు తడిమన్ను పొడిమన్నగునట్లు వాళ్ళ యిండ్లచుట్టుదిరిగి రెండువందల రూపాయలు వసూలుచేసినాను. ఆసొమ్ము మన మీయెనిమిది మాసములనుండి తినివేసినాము. నీగతి యేమందువా? ఇల్లు తనఖాబెట్టి నూరు రూపాయ లెవరివద్దనైన బదు లిప్పించెదను. ఆ సొమ్ముతో మీరిద్దఱే గనుక నొక సంవత్సరము కాపురము చేసితిరా తరువాత దేవుడున్నాఁడు. ఈ లోపుగ నేను కాలు చెయ్యి గూడదీసుకొని నీయప్పు నేనే తీర్చి నీకేదో యుపాధి గల్పించెదను. నిన్ను నేను వదలిపెట్టి యూరకుందునా? నాకవతల వ్యవహారమొకటి మించిపోవుచున్నది. గనుక నన్ను వెళ్ళనీ. నీ భర్త పోవుచు నిన్ను నీ బిడ్డను నా మెడకు గుదికఱ్ఱవలె గట్టిపోయినాడు." అని పలుకఁ దనపని వట్టిదయ్యెనని తెలిసికొని పిచ్చమ్మ కొంతసేపు వలవలయేడ్చి కొంత దుఃఖోప శమనమైన తరువాత "సరే; యిల్లు తనఖాపెట్టి రూపాయలుతెచ్చి యిచ్చి వెళ్ళు. తరువాత దైవమే యున్నాఁడని తన బిడ్డను దీసికొని గదిలోనికి వెళ్ళిపోయెను. ఆ మరునాఁ డన్నప్ప మనుమనిపక్షమున గుమార్తెను సంరక్షకురాలుగా నేర్పరచి యామెచేతనే నిశానిబెట్టించి నూరురూపాయ లిప్పించి తన బత్తెఖర్చుక్రింద రెండు రూపాయలుమాత్రమందులోనుంచి తీసి రెండుదినముల తరువాత మందపల్లి విడిచి మూలస్థానమునకు సకుటుంబముగఁ బోయెను. తరువాత మాసికములు పెట్టుటకుగాని తదితర కార్యక్రమములకుగాని యన్నప్పమందపల్లివచ్చుట కెంతమాత్రము దీరిక లేకపోయినది. పిల్లవానికి జబ్బుచేసినదని పిచ్చమ్మ వర్తమానము పంపినప్పుడైనను వచ్చి చూచిపోవుటకు సయిత మన్నప్ప కవకాశము గలిగినదికాదు. బహు కార్యాభారము పైన వేసికొన్నవారికి బంధుసమాగమము దుర్లభముకదా. పాపయ్యయొక్క సంవత్సరీకమున కైనను మామగారు రాఁజాలకపోయెను. మందపల్లిలోనున్న కాలమున నల్లునికి ప్రతి మాసిక మాసికమునకు మిక్కిలి శ్రద్ధతో నన్నప్ప నెతిగారెలు గారపుగారెలు కరకరలాడునట్లు మఱియొక వెపు రానిచ్చి వండవలసినదని వంటలకువచ్చినవారితో జెప్పుచుండుటచేత గారెలమీఁద ప్రేమచేతనైన సంవత్స రీకమునకుఁ దప్పక వచ్చునని యెఱిగినవా రనేకులనుకొనిరి. కాని కావలసినప్పుడెల్ల గారెలువండుకొని తినుటకు దగిన యేర్పాటు పాపయ్యవలన శాశ్వతముగ జరిగినందున నతఁడు రాలేదు. సంవత్సర మిట్టె తిరిగివచ్చెను. నూరు రూపాయలు గవ్వలవలె కర్చయ్యెను. అందుచేత మరల నూరురూపాయలు పిచ్చమ్మ బదులు పుచ్చుకొనియెను. నాలుగు సంవత్సరములగునప్పటికి యిల్లమ్మి వేయవలసివచ్చెను.