Jump to content

గణపతి/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము

గణపతి పూర్వులకు స్థిరాస్తి కొంత కలదు. కాని యది లోకులందఱకుఁ గల స్థిరాస్తి కాదు. లోకములో స్థిరాస్తి యనగా భూములు మాన్యములు మొదలగునవి. పప్పుభొట్ల వారికిఁగల భూములు రుద్రభూములు, మాన్యములు సామాన్యములు. ఇంక గృహవిషయము విచారించితిమా యెప్పు డెక్కడ నివాసముగ నున్న నదియె వారి గృహము. అది మొదట వారి గృహము కాకపోయినను గ్రమక్రమముగఁ జిరకాల నివాసము చేత నది వారిదెయగుచు వచ్చెను. గృహయజమానులు వచ్చి వీరిని లేచి పొమ్మన్న పక్షమున వీరెప్పుడు లేచువారు కారు. బలవంతముగ వారిని బంపివేయుట మనుష్య మాత్రునకు సాధ్యము కాదు. అందుచేత మందపల్లిలో వారున్న యిల్లు భుజబలముచేత సంపాదింపఁ బడిన దని చెప్పవచ్చును. గణపతి పూర్వులు లోక కుటుంబులు. వారి గ్రామమంతయు వారి స్వగృహముగానే వారి చేత భావింపఁబడుచుండును. ఎవరిపొలముగట్టుమీఁద మామిడిచెట్టున్నను కొబ్బరిచెట్టున్నను దాని కాయలు పప్పుభొట్ల వారివె. ఎవరిదొడ్లలో మంచిపాదులు పెట్టుకొన్నను వాని కాయలు పప్పుభొట్లవారివె. వారు చండశాసను లగుటచేత నిది యేమనుటకు వీలులేదు. ఇన్నిమాట లెందుకు? గణపతి పూర్వులు పురుష వృషభులు. అచ్చుబోసి విడచిన యాబోతులు సకల క్షేత్రములలో నెట్లు స్వేచ్ఛావిహారము సలుప వచ్చునో, పప్పుభొట్ల వారుగూడ నట్లె సకలగృహారామ క్షేత్రములలో విహారము చేయవచ్చును. కాని ప్రజల కాఁబోతులమీద మిక్కిలి భక్తియుండుటచే నవి తమచేలు మేయుట యిష్టము. పప్పుభొట్లవారియెడ భయము గలుగుటచే వారు తమసొత్తు హరించుట మనసులో నిష్టము లేకపోయినను భుజబలమున, వాగ్బలమున వారిని గెలువలేక మందపల్లి నివాసులూరకుండ వలసినవారైరి. మొత్తముమీద మందపల్లి గ్రామవాసులు భయభక్తులు గలవారని ప్రతిష్ట సంపాదించిరి. వారికి స్థిరాస్థి కొంత కలదని యీ ప్రకర ణారంభమున నుదాహరింపఁ బడినది. అది పితృపితామహార్జితమైన యాస్థి. అది దొంగ లపహరించుటకు వీలులేనిది. కావలసినంత శరీరపుష్టి చేయునట్టిది. ఎన్నితరములనుండి యనుభవించినను విఱుగు తఱుగు లేనిదగుటచే నక్షయము. అక్షయమనుటచేతను మ్రుచ్చు లపహరించుటకు వీలులేని దగుటచేతను శరీరపుష్టి చేయునదనుటచేతను భర్తృహరియొక్క వెఱ్ఱిమాటలు చదువుకొన్న వారు కొందఱు “హర్తకుఁగాదుగోచర” మను పద్యము జ్ఞప్తికిఁ దెచ్చుకొని యా స్థిరాస్థి విద్యయేమో యనుకొని భ్రమపడుదురుకాఁబోలు, అట్టి భ్రమలో బడవద్దు. పప్పుభొట్ల వారి పితృపితామహులు సంపాదించినది విద్యాధనము కాదు. అది వేదోక్తమైనది. అందుచేత శ్లాఘాపాత్ర మైనది. "బ్రాహ్మణస్య ధనం భిక్ష" మని మీ రెప్పుడును వినలేదా? శాస్త్రములు శిష్టాచారమును ననుసరించి వీలగు నంత వఱకు నడచుటయే వారికిఁ బరమధర్మ మగుటచే నితర బ్రాహ్మణుల వలె మ్లేచ్చభాషలు నేర్చికొని యుద్యోగములు సేయుట, కాఁపు వృత్తియగు వ్యవసాయము జేయుట మొదలగు నశాస్త్రీయ వ్యాపారములయందు వారు దిగక యక్షయపాత్రమునే వారు నమ్ముకొనిరి. భూములు సంపాదించిన పక్షమున నవి కొడుకులో మనుమలో యన్యాక్రాంతమును జేయ వచ్చును. ధనమార్జించిన పక్షమున నదియుఁ బుత్రపౌత్రులు పాడుచేయవచ్చును. లేదా చోరగ్రస్తము కావచ్చును. అక్షయపాత్ర పైవిధముగ నన్యాక్రాంతము చేయుటకు వీలులేనిదని చిరకాలము దీర్ఘాలోచనముఁ జేసిన మూలపురుషుఁడెవ్వఁడో తన వంశమువారికి స్థిరమై యుండునట్టి వృత్తినేర్పరచవలయునని యావృత్తి స్వీకరించెను. నాగలి పెట్టి నేల దున్నకుండ విత్తనములు చల్లకుండ వాన కురిసినది లే దన్న బెంగ లేకుండ మిడతలదండు మొదలగునవి వచ్చి పడునన్న విషాదములేకుండా నిద్రలేనట్లు రాత్రులు కాపు గాయకుండఁ బెట్టుబడి యక్కరలేకుండ దంపుకొన వలసిన యవసరము లేకుండ గాదులలోఁ బోసి కష్టపడి నిలువఁ జేసికొన వలసిన యగత్యము లేకుండ వారి కుటుంబమునకే దినమునకుఁ గావలసిన బియ్య మాదినమున నక్షయపాత్ర ప్రసాదించుచుండెను. వేదశాస్త్రసమ్మతమైన యట్టివృత్తి నవలంబించి వారెన్నో తరములు సుఖజీవనముచేసిరి. గణపతి పూర్వులలో నతని పితృపితామహుల చరిత్రము దక్క దక్కినవారి చరిత్రములు లభించినవి కావు. అతని పితామహుని పేరు పాపయ్య, పప్పుభొట్లవారు వైదికు లగుటచేత సాంగవేదా ధ్యయనము వారి కవశ్య కర్తవ్యమయినను వారు యజుస్సా మాధర్వణ వేదమును విడిచి ఋగ్వేదమునం దెనిమిదవ యఠ్ఠమును విడిచి తొమ్మిదవ యఠ్ఠమును మాత్రము విడువక ప్రాణపదముగ నెంచుకొని పారాయణముఁ జేయుచు వచ్చిరి. ఆ యఠ్ఠములో మన పాపయ్యకుఁగల ప్రజ్ఞ యసాధారణము. పదము క్రమము జట చెప్పఁగలడని చెప్పనే యక్కఱలేదు. ఆ యఠ్ఠములో నతడు ఘనాపాఠీ యని బిరుదుపొందెను. ఆరంభించినాఁడంటే గుక్క తిరగకుండ నోరు తడబడకుండ గొంతెండి పోకుండ గంటలకొలది కాలము పారాయణము జేయఁగలడు. అందఱుఁ జదివిన వేదమే పాడినదేపాడరా యన్నట్లు తానును జదివిన పక్షమున నందు గౌరవములేదని పప్పుభొట్ల వారీ యఠ్ఠమును ప్రత్యేకముగ వల్లించిరి. వంశ క్రమాగతమైన విద్యయగుటచేతను విశేషించి బుద్ధిజాతి మిక్కిలి గొప్పదగుట చేతను పాపయ్య కొన్ని కొన్ని క్రొత్త పనసలు కనిపెట్టి పూర్వులందరికంటె గొప్పవాఁడనిపించుకొనెను. పాపయ్యకు దక్కిన వేదాధ్యయనమన్నఁ దలనొప్పి. స్వాధ్యాయ మతని చెవిని బడినప్పుడు “ఈ బ్రాహ్మణులు చెవి గోసిన మేకల వలె యఱచు చున్నారు. వీళ్ళ గొంతులు కోయ” యని విసుఁగుకొనుచుండును. సామగాన మతని చెవిని బడినప్పుడు “వీళ్ళపాట తగులఁబెట్ట, ఏడిచినట్లె యున్నదిరా” అని తిట్టుచుండును. అతని వేదమున కొక్కటే స్వరము. కాని యిన్ని స్వరములు లేవు. అందుచేత నతనికిఁ దక్కిన స్వరములు సామము, నసహ్యములు, బ్రాహ్మణు లందరు యజన యాజనాధ్యయనాధ్యాపక ప్రతిగ్రహ షట్కర్మ నిరతులైనను నియోగులు మొదలగువారు యజ్ఞము చేయుటయె గాని చేయించుట మానిరి. వేదాధ్యయన మాచరించుటయె గాని యధ్యాపకత్వము మానిరి. దాన మిచ్చుటయె కాని పుచ్చుకొనుట మానుకొనిరి. వైదికు లీ షట్కర్మలు గూడదని శంక దెచ్చుకొని షట్కర్మలలోఁ గొన్ని కర్మలు దాముకూడ విడిచి కొన్నిటిని మాత్రమే గ్రహించెను. ఎన్నివిడిచి యెన్నిగ్రహించె నని మీ రడుగవచ్చును. అయిదింటిని విడిచి యాఱవది యగు దాన ప్రతిగ్రహము మాత్రము గ్రహించెను. ఆఱింటిలో మూఁడు కర్మలను విడిచిమూడింటిని స్వీకరించుటకు నియోగులకెంత యధికారముకలదొ ఐదింటిని విడిచి యొక్కటి స్వీకరించుటకు మా పాపయ్యకు నంత యధికారమె కలదు. ఇట్లనుటచేతఁ దక్కిన పంచకర్మల నత డెన్నఁ డాచరింపలేదని మీ రనఁగూడదు. అతఁడు కొన్ని దానము లప్పుడప్పుడు చేయుచువచ్చెను. అందుముఖ్యమైనవి రెండు కలవు. పితృదేవతలకు పిండప్రదాన మొకటి. తన మిత్రుల కప్పుడప్పుడు డిచ్చు పొగచుట్టలదానము రెండవది. యజ్ఞములు చేయలేదని లోకమున నతనికి నిష్కారణముగ నప్రతిష్ట సంభవించినది. కాని నిష్పక్షపాతముగ నతనిచరిత్ర వ్రాయుదుమేని నతఁ డొక యజ్ఞముఁజేసినాఁడని వ్రాయక తప్పదు. ఆయజ్ఞము నిమిత్తమతఁ డెవ్వరిని బాధింపలేదు. పందిళ్ళు పాకలు వేయలేదు. విశ్వప్రయత్నములు చేయలేదు. యధావిధిగ నతఁడె రెండవ కంటివాఁ డెఱుఁగకుండ జేసెను. అది యెట్లు చేసెనందురోవినుడు: ఆతఁడిరువదియేండ్లు వయస్సుగలవాడై నప్పుడు తల్లి రాత్రిరొట్టె కాల్చుకొనవలయునని మినుపపప్పుచేటలోఁబోసి వాకిటిలో నెండఁబెట్టుకొనెను. ఒక మేఁక యెక్కడనుండియో వచ్చి యాపప్పు దినుచుండెను. చత్వారముచేతఁ తల్లికది కనంబడలేదు. పాపయ్య వీధిలోనుండి వచ్చి యదిచూచి మేఁకను గొట్టుటకు మంచికఱ్ఱ దొరకకపోవుటచే సత్తువకొలఁది నొక్కతన్నుఁ దన్నెను. ఆ మేఁక పదిగజముల దూరమునఁబడి యొక్క యఱపఱచి వెంటనె చచ్చెను. ఆ వార్తవిని మేఁక యజమానుఁడగు గొల్లవాఁడు తన చుట్టములగుంపుతో వచ్చి యింటిమీఁదబడి మేఁకకు జరిగినంతపని పాపయ్యకు చేయవలయు నని సంకల్పించెను. కాని నలువురు జేరి మేఁకకు నాలుగు రూపాయలు వెలగట్టి చెరిసగము జేయుదుమని తునితగవుజేసి పాపయ్యచేత రెండు రూపాయలు వానికిప్పించి పంపిరి. యజ్ఞములోగూడ మేఁకలను జంపుటయె ప్రధానముగనుక పాపయ్యకు యజ్ఞఫలము చేకూరినదని చెప్పవచ్చును. లోకుల నందఱఁ బీడించి ధనము సంపాదించి పందిళ్ళు పాకలు వేయించి యన్నము దినకుండ మలమలమాడి కుమ్మరులచేత, మేఁకలను జంపించి కుండలములు వేసి కొన్నవానికి యజ్ఞఫలము దక్కి పాపయ్యకు దక్కకపోవునా? బ్రహ్మయు ఋత్విక్కులు నుద్గాతయు హోతయు నధ్వర్యుడు మొదలగువారక్కఱలేకుండ మంత్రములతో పనిలేకుండనతఁడు గాంధర్వవివాహమువలె యట్టహాసము చేయక రహస్యముగ యజ్ఞము చేయుటచే లోకులతనిని హీనునిగఁ జూచుచున్నారు. తక్కువ వర్ణమువారైన కుమ్మరుల చేత ముక్కు చెవులుమూసి బాధపెట్టి చంపించుటకంటె స్వఛ్ఛమైన బ్రాహ్మణుఁడు స్వయముగఁ జంపుటవలన మేఁకకు సద్యోమోక్షముసంప్రాప్తమైయుండునని యొక్కఁడైన నాలోచింపడుగదా. లోకములో న్యాయములేదు. ప్రస్తుతము లోకులేమనుకొన్నను పాపయ్యకు భవిష్యత్కాలమునైన రావలసిన కీర్తి రాకపోదు. ‘విద్యావిత్తకరీ’ యని యొక లోకోక్తిగలదు. పాపయ్య నేర్చుకొన్న తొమ్మిదవ యఠ్ఠముగూడ నొకానొక విద్యలోఁ చేరినదే కావునదానివలన నతఁడుధనసంపాదనమప్పుడప్పుడు చేయుచుండెను. పచ్చని తోరణము గట్టుకొని యెవరు వివాహము చేసుకొన్నను పాపయ్య నాఁడొక యవధాని బిరుదమో దీక్షితబిరుదమో సోమయాజి బిరుదమో వహించి యచ్చోటికిఁబోయి సంస్కారులతోఁబాటు తన్నుఁగూడ సత్కరింపవలసినదని కోరుచుండును. అట్లు వారు సత్కరింపనిచోఁ జిన్ననాటనుండియు ముష్టిజీవనమున కలవడి యుండుటచేత ముష్టియుద్ధము ప్రారంభించి పురోహితులను గన్యాప్రదాతను వధూవరులను తద్బంధుగణమును దన నవమాఠ్ఠముతోఁ గొంతవరకు దీవించి తోరణములు తెంపి పెండ్లి పందిరి యుద్ధభూమిగ మార్చి తన పంతము నెగ్గించుకొని సంభావన దండిగ లంకించుకొని వచ్చును. అందుచేత నతనికి బండబూతుల పాపయ్య యనియు, పిడిగుద్దుల పాపయ్య యనియు రెండు పౌరుషనామములు కలిగినవి. అధికారుల యిండ్లచుట్టుఁ దిరిగి వారి సేవకుల నాశ్రయించి పండ్లు పంచదార చిలుకలు మొదలగు సూడిద లంపి యధికారుల యనుగ్రహమునకుఁ బాత్రులై కొందరీ కలియుగమున బిరుదుల కనర్హు లయ్యు సంపాదించుచుందురు, పాపయ్య సంపాదించిన బిరుదము లట్టివికావు. బిరుదుల నిమిత్త మఁత డొకరి నెన్నఁడాశ్రయింపలేదు. అతని కంఠశక్తియు భుజశక్తియు నతనికి బిరుదులు సంపాదించిపెట్టినవి. కాని యధికారుల కటాక్ష వీక్షణముచేతఁ ప్రసాదింపఁబడినవి కావు. పాపయ్యకుఁ దొమ్మిదవయఠ్ఠము నేర్పిన గురు వెవ్వరైయుందురని మీకు సందియము తోఁచవచ్చును. అతనికి గురువే లేడు. గురుకుల వాసము లేకయె శుశ్రూషాపీడ లేకయే యెందఱు బహువిద్యలలో నధికప్రౌఢులైరని మనము వినుచుండుట లేదు. తన విద్యావిషయమున మన పాపయ్యయు నట్టి పట్టికలో జేరఁదగినవాఁడెసుఁడీ. ఇట్లనిన మీరు నమ్మక నవ్వ మొదలు పెట్టెదరు. వాల్మీకి ఛందో వ్యాకరణాది లక్షణ జ్ఞానము గురుబోధలేకయే సముపార్జించె నన్న మీ రహహా యని నవ్వి యానందింతురు. భాగవత ప్రణేత యగు పోతరాజు సహజ పాండిత్యము గలవాఁడని చెప్పినంత మాత్రముననె విశ్వసింతురు. సహజ పాండిత్య మొకరిసొమ్మా? ఈ విద్య యావిద్య యనకుండ సకలవిద్యలలో వారి వారి పూర్వజన్మవశముననో యదృష్టవశముననో సహజ పాండిత్య ముదయించుచుండును. కాఁబట్టి పక్షపాతము మాని పాపయ్యకు గూడ విద్యలో నట్టి ప్రతిభా విశేషము గలదని నమ్ముఁడు. అతని పుణ్యమేమో కాని పాపయ్యకు బాల్యము నుండియు నద్వైతసిద్ధి సహజముగానె గలిగినది. ఎంతెంతో శ్రమపడి యెంద రెందరో గురువులకు శుశ్రూషఁ జేసి శంకరభాష్య సమేతముగ దశోపనిషత్తులు భగవద్గీతయు బ్రహ్మసూత్రములు వల్లించిన మహానుభావులకె స్థిరమైనయద్వైతభావము సార్థక మందైనఁ గలుగుట మిక్కిలి కష్టము. అట్టియెడ నూనూగుమీసాలు మొలకలెత్తక మునుపె యుపనయనమైన గాక మునుపె గోగణము విడిచి యంగవస్త్రమును గట్టక మునుపె మాటలైనను సరిగరాకమునుపె స్వవస్తు పరవస్తు భేదజ్ఞానము నశించి పరవస్తువు లన్నియుఁ దన వస్తువులే యని నద్వైతభావము గలుగుట యెంత గొప్పమాట! అది యెంతవానికి లభియించును! పూర్వయుగములలో నట్టిబుద్ధి యనేకుల కుదయించి యుండవచ్చును, కాని కలియుగములో నది మందపల్లి నివాసుడగు పప్పుభొట్ల పాపయ్యకే సిద్ధించినది, నాణెములు కాని చెంబులు కాని వెండిగిన్నెలు కాని వస్త్రములు కాని తినియెడు పదార్థములు కాని యతని కంటఁబడెనా యెప్పుడో యవి యతనిచేత బడినవే. నీ వీ వస్తువు దీసితివా యని యెవరైన నడిగిన పక్షమున నతఁడు స్పష్టముగ లేదని చెప్పుచుండును. లేదనుటలో నతఁ డబద్ధమాడెనని యెవ్వరు దలంపఁ గూడదు. "గజం మిధ్య పలాయనం మిధ్య" యన్నట్లు వస్తువులేదు. దొంగతనము లేదని యభిప్రాయమై యుండవచ్చును. లోకులు కాకులవంటివారు కదా! పాపము ! పాపయ్య లేమిచేతనో యద్వైతభావము చేతనో హస్తచాపల్యము చేతనో చిరతరాభ్యాసము చేతనో హస్తలాఘవముఁ జూపు నభిలాష చేతనో గ్రామములలో నున్న కొన్ని యిండ్లలో జొరబడి కొన్ని వస్తువులను గ్రహించినాఁడనుకొనుఁడు. గ్రామవాసులు తమ పుట్టియంతయు మునిగిపోయినట్లు పెద్దగోలచేసి యతని నల్లరిపెట్ట దొడఁగిరి. పరుల వస్తు వేమిటి మన వస్తు వేమిటను భావము పాపయ్య కున్నట్లు వస్తువులు మన యింట నుండిననేమి పాపయ్య యింట నుండిన నేమి యను భావము గ్రామవాసులలో నొక్కరికైన లేకపోయెగదా! అందుచేత వీరు పాపయ్యతో బోల్సఁ దగరు. అట్టి యద్వితీయ భావ మతని కుండుటచేతనే పాపయ్య చరిత్ర మక్షరరూపముగ నాంధ్రదేశమున ప్రచార మగుచున్నది. అట్టిభావము శూన్య మగుటచేతనే మందపల్లి గ్రామవాసులలో ఘనులగు తర్కవ్యాకరణ జ్యోతిశ్శాస్త్ర పండితులున్నను వారి చరిత్రములు లిఖింపఁ బడుచున్నవా? గ్రామస్తులు చేసిన యల్లరి వలన వివాహయోగ్య వయస్కుఁడైన పాపయ్యకుఁ బిల్ల నిచ్చుట కెవ్వరు రారైరి. తన కుమారునకు వివాహము కాలేదని విచారించి విచారించి తల్లి కాలధర్మము నొందెను. ఆధీనము తప్పిన యాడుపడుచులు గాని మఱి యే యాడుదిక్కుగాని లేకపోవుటచే నతఁ డప్పు డప్పుడు వంట జేసికొనవలసి వచ్చెను. బ్రాహ్మణార్థముల వలన నతఁడు పొట్టబోసికొనఁ గలఁడు. కాని యందు మూఁడు నాలుగు చిక్కులు సంభవించినవి. మున్నూట యఱువది దినములు భోక్తయై యుండుటకు గ్రామమున మూడువందల యఱువది శ్రాద్ధములు లేవు. ఆ కాలమున మందపల్లిలోనున్న బ్రాహ్మణ గృహములే నలుబది యేఁబది, ఇంటికి రెండాబ్దికములకన్న నెక్కువగా నుండవు. అదియును గాక ప్రతివారు పాపయ్యనే పిలువరుద కదా? పిలువఁ దలంచుకొన్నవారు గూడ నితఁడు కలహప్రియుఁడని యెంచి పిలుచుట మానిరి. వస్త్రమీయ లేదనియొ దక్షిణ స్వల్పముగా నిచ్చినారనియొ నతఁడు గృహ యజమానితోఁ దరుచుగాఁ దగవులాడుచుండును. ఇతఁడు కంఠమెత్తి కేక లారంభించెనా భూదేవతలెగాక శ్రాద్ధమునకు వచ్చిన విశ్వదేవతలు పితృదేవతలు గూడ గడగడ వణఁకి పారిపోవుదురని గ్రామస్థుల యభిప్రాయము. అది యటుండ నిమంత్రితుఁడై పాపయ్య శ్రాద్ధ భోజనముఁ జేసి వెళ్ళునపుడు గృహయజమానుల కన్నుబ్రామి యేదో వీలు చూచుకొని గిన్నెయొ పంచ పాత్రయె పట్టుకొని పోవును. శ్రాద్ధభోక్తల కుదకుంభదానముఁ చేయవలయునునని శాస్త్రమందుండినను సాధారణముగ నట్లెవ్వరుఁ జేయలేకపోవుటచే పితృకర్మలు చేయువారి కుదకుంభ దాన ఫలముం గల్పింపవలయునని పాపయ్య యేవో పాత్రలు పట్టుకొని పోవుచుండు నని పౌరబ్రాహ్మణులు తెలిసికొనలేక యతనిని భోక్తగఁ బిలుచుట మానుకొనిరి. పిలువకబోవుట కిదియె ప్రధాన కారణమని చెప్పవచ్చును. ఉపకారణము గూడ మరియొక టున్నది. అది చెప్పకపోవుట దోషము కావునఁ జెప్పఁబడుచున్నది. పాపయ్య గంభీరకాయుఁడు. ఆకారమునకు దగిన యాకలి. యాకలికి దగిన భోజన సౌష్టవము నతనియందుఁ గలవు. అగ్నిహోత్రమునందు సర్వము హుతమైనట్లె యతని జఠరాగ్నియం దేది వేసినను వెంటనే హుతమైపోవును. అదృష్టవశమున నట్టి గాఢ జీర్ణశక్తి యతనికిఁ గలిగినందుకు సంతసింపక గ్రామవాసులలోఁ కొందఱు విరోధముచేత గొంద ఱసూయచేతను “ప్రతి మనుష్యునకు గర్భమందే జీర్ణకోశముండును; గాని పాపయ్యకు జీర్ణకోశము శరీర మంతట గల” దని పరిహాసాస్పదముగఁ బలుకజొచ్చిరి: కొందఱు దయ్యపుతిండియనిరి. అభాగ్యుల కాకలియెక్కువయని మఱికొంద రనిరి. చాటుచాటుననె గాని యతని యెదుటఁ బడి యెవ్వ రెట్టి మాట లనలేదుసుఁడీ. అతఁడు భోక్తగా వెళ్ళిన గృహమున శ్రాద్ధమునకు ముఖ్యమని పనసకాయ కూర వండిన పక్షమున వండిన కూరంతయు బాపయ్యయె భక్షించును. అతనిని బిలిచినప్పుడు గృహ యజమానులు గారెలు నరిసెలు సంతర్పణమునకు వండుకొన్నట్లు వండుకొనవలయును గాని సూక్ష్మముగఁ జేసికొనుటకు వీలులేదు. పైతృకములయందు సుష్టుగా భోజనము చేయువారిని బిలిచి పెట్టుట యెవరో కొందరికి సంతోషమైనను జన సామాన్యము కట్లుండదుగదా? పాపయ్యకు శ్రాద్ధభోజన మరుదగుట కది యెక హేతువయ్యెను. పాపయ్యయొక్క జీర్ణశక్తిని విస్పష్టముగఁ దెలియజేయుట కతని బాల్యమునఁ దండ్రి జీవించి యున్నపుడు జరిగిన యొక వృత్తాంత మిందు దెలుపుట సముచితము. భావికాలమున నేదో విషయమున మహా ప్రజ్ఞావంతులగు వారియం దా లక్షణాంకురములు బాల్యమునందె పొడచూపుచుండును. పాండవ సింహమని చెప్పదగిన భీమసేనుడు దుర్వార భుజబలశోభితు డని యెల్లవా రెఱుగుదురు కదా! ఆ మహాబల సంపత్తి యతని బాల్యమునందే గోచరమయ్యెను. కుంతీదేవి భీమసేనుఁడు పుట్టిన పదియవనాఁడు శుద్ధిస్నానముఁ జేసి కొడుకు నొడిలో వైచికొని దేవతా దర్శనమునకుఁ బోవుచుండెను. అప్పుడొక బెబ్బులి యామెందఱిమెను. పాండురాజు పులి నొక యమ్మున గూల వేసెను. కాని యా లోపున నామె భయపడి విసవిస పరుగిడ నారంభించెను. ఒడిలోనున్న భీమసేనుఁడు నేలఁబడియెను. నెత్తురుఁ గుడ్డగుటచే బిడ్డ యా దెబ్బకు మృతినొందెనేమో యని కుంతీదేవి తత్తరపడియెను. కాని బాలుని దేహము కందలేదు. నలగలేదు. అతని శరీర సంపర్కము గలిగినంత మేర యా ఱాతినేల పిండి పిండి యయ్యెను. అతనియందు వలెనే పాపయ్యయందుగూడ బాల్యమున నతని జఠరాగ్ని శక్తి ద్యోతకమయ్యెను. దృష్టిదోషము తగులునని తండ్రి యితరుల కది వెల్లడింపలేదు. పాపయ్య పదియాఱేండ్ల ప్రాయము వాఁడైనపుడు తండ్రి కుమారుని వెంటబెట్టుకొని కోనసీమలోఁ బ్రయాణము సేయుచుండెను. చలిదికూడు లేక పాపయ్య యెక్క యడుగైన నడువఁజాలఁడు. అందుచేఁ దండ్రి ఆనాఁడొక యూర నొక యింటి కరిగి “అమ్మ! మా కుఱ్ఱవానికి రవంత చలిదియన్నము దొరకునా” యని యడిగెను. కుఱ్ఱవాఁడు చలిదియన్నము గోరుచున్నాఁ డనఁగానే సాధారణముగ లేదనువారుండరు. పాపయ్య పదియాఱేండ్ల వయసువాఁడైనను నప్పటికే తండ్రివలె చెయ్యెత్తు మనుష్యుఁడయ్యెను. అయినను జనకుని దృష్టి కతడు కుఱ్ఱవాఁడెకదా! కుఱ్ఱవాఁ డనుటచేత గృహ యజమానులు వచ్చినవాఁడు పదియేండ్లవాఁడో యైదేండ్లవాఁడో యను కొని “అయ్యో నాయనా! పిల్లవానికి పట్టెడు చలిదియన్నము బెట్టమా? అదిగో చద్దివణ్ణాలగది, పెట్టుగుని తినుమనుఁడు. లేదా మీరు పెట్టవచ్చు” నని యా గదిఁ జూపిరి. ఆజానుబాహుఁడైన తన కుమారునిఁ జూచినపక్షమున వారు చలిది యన్నముఁ బెట్టరేమో యను భయమున నతఁడు మొదట వానిని వీధిలోనెయుంచి వెళ్ళి గదిచూచి వచ్చిన తరువాత నింటిలోని యాడువాండ్రు పనుల సందడి నున్నప్పుడు దొడ్డి దారిని తన బిడ్డనుఁ దీసికొనిపోయి యా గదిలోఁ బ్రవేశపెట్టి యన్నము బెట్టుకొని తినుమని చెప్పెను. ఆ గదిలో మానెడు బియ్యపన్న ముండెను. దానికి సరిపడిన యూరుగాయలు పచ్చళ్ళు నుండెను. తవ్వెడు గేదె పెరుగుండెను. రమారమి గిద్దెడు పేరిన నేయి యుండెను. పాపయ్య యాయన్నమంతయు వడ్డించుకొని యూరుగాయలు పచ్చళ్ళు నేయి పెరుగు మిగులకుండ సుష్టుగాఁ దిని యెప్పటియట్ల దొడ్డిదారిని వెలుపలకు వచ్చెను. భోజనము సమాప్తమైన తరువాతఁ దండ్రి యా యింటి యాఁడువాండ్రకడకుఁ బోయి “అమ్మా! మీ దయవలన మా వాఁడు చలిది యన్నము దిన్నాఁడు. నేను సెలవు పుచ్చుకొని వెళ్ళుచున్నా” నని చెప్పి వెళ్ళి పోయెను. ఆ యింట నైదారుగురు చిన్నబిడ్డలుండిరి. ఆ బిడ్డలందఱకు సరిపోవునని వారా యన్న మక్కడ దాచిరి. పాపయ్య తిని వెళ్ళిన గడియ సేపటి కా యిల్లాలు చలిది యన్నముఁ బిల్లలకు పెట్టనెంచి యాటలు మానిపించి వాళ్ళందరి నక్కడకుఁ బిలిచి కంచములుపెట్టి యన్నపాత్రఁ జూచునప్పటి కందులో నొక మెతుకైన లేదు. ఆ యిల్లాలు తెల్లబోయెను. కుక్క తినిపోయెనేమో యని మొదట నుకొనెను. కాని నూరుఁగాయలు పచ్చళ్ళుగూడ లేకపోవుటచే నట్లనుకొనుటకు వీలులేకపోయెను. ఇంటిలోనున్న యాఁడువాండ్రంద ఱక్కడఁ జేరి కొంతసేపు మీమాంసచేసి తుదకు బ్రాహ్మణకుమారుఁడే తినియుండునని నిశ్చయించి కుఱ్ఱవాఁడు మానెడు బియ్యపన్నముఁ దిన్నందుకు మనసులో మిక్కిలి యాశ్చర్యము నొందియు, బ్రాహ్మణునకుఁ బెట్టిన తిండికి కంటగించుకొనుట దోషమని నోరు మూసికొని యూరకుండిరి. పాపయ్య చరిత్రముగూడ భీమసేనుని చరిత్రము వంటిదే, ఆఁకలిలో నిద్దఱు వృకోదరులే. ఇద్దఱు మహాకోపసులే. అయినను వేదవ్యాసునివంటి మహాత్ముఁడు తన రచనా చమత్కృతి నంతయు జూపి వర్ణించుటచే భీమసేనుఁడు వంద్యుఁ డయ్యెను. అట్టి మహాకవి యాడుకొనక పోఁబట్టి పాపయ్య నింద్యుఁ డయ్యెను. ఇట్టి యితిహాసము లనేకములు కలవు. కాని గ్రంథవిస్తరభీతిచే నవి స్పృశియింపక కథలోని ముఖ్యాంశమే వర్ణింపఁబడును. ‘తల్లి చచ్చిన జిహ్వచచ్చు’ నను నార్యోక్తి పాపయ్యకడ నిశ్చయమైనది. సరిగా నతనికన్న మమరలేదు. వండుకొను కష్ట మటుండగా ముమ్మారు మూడు మానికెల బియ్య మతనికి గావలెను. అతండులములు, వానికి గావలసిన రసవర్గములు సంపాదించుట స్వగ్రామమున దుస్సాధ్యమయ్యెను. అదియునుంగాక వివాహముఁ జేసికొని వంశము నిలుపుకొన వలయునని గట్టిసంకల్ప మతనికిఁ గలిగెను; అతనికి విద్యఁజూచి పిల్లనిత్తురా? ధనముజూచి యిత్తురా? మళ్ళు మాన్యములు జూచి యిత్తురా? వరదిట్టము కావలసినంత యున్నది. కలియుగములో వరుని దార్ఢ్యము, సాంప్రదాయముఁ జూచు వారెవ్వరు? ఎల్ల పేదవాండ్ర విషయములో నయినట్లె పాపయ్య విషయమున వివాహము ద్రవ్యైక సాధ్యమయినది. ద్రవ్యము స్వగ్రామమున సంపాదించుటకు దగిన యనువులు లేవు. కాఁబట్టి దేశాంతరములకుఁ బోవలయునని పాపయ్యకు దృఢసంకల్పము గలిగెను. ఏ దేశమునకు బోవలయు నని యతఁడు మనస్సులో మీమాంసఁ జేసెను. కాశికిఁ బోవలయునని కొంతకాల మతఁడు తలంచెను. కాశిలోని సత్రములలో యధేఛ్ఛముగ భోజనము జరుగును. కాని వివాహము నిమిత్తము కావలసిన ధన మచ్చట దొరకదని యతని కెవ్వరోచెప్పి మహాపట్టణమందు దెనుఁగు బ్రాహ్మణులమీద నాదర మెక్కువగల దక్కడికిఁ బొమ్మని హితోపదేశము జేసిరి. ఆ మాట యతనికి నచ్చెను. తోడనే పునహాకు బ్రయాణమయ్యెను. అతని యింట లోకమంతట గల పంచభూతములే గాని యితరమైన యాస్తి యేమియునులేదు. పాత్రలు మృణ్మయపాత్రలు త్రాగుటకొక యిత్తడిచెంబు మాత్రమున్నవి. కట్టుకొనుటకు మూఁడు నాలు గంగవస్త్రములు కలవు. ఎన్నో తరములనుండి వంశపారంపర్యముగ వచ్చుచున్న యక్షయపాత్ర యుండవలయును గదా. అది యేమైనదని మీకు సందియము దోఁచవచ్చును. పాపయ్య బద్ధకముచేత నక్షయపాత్ర వ్యాపారము మానికొనెను. వ్యాపారము మానికొన్నను జాలకాలము నాఁటనుండి యచ్చివచ్చినపాత్ర దాచకూడదాయని మీకు సందేహము దోచవచ్చునేమో; అది తల యుత్తరించుకొని పోవు సమయమున కుపయోగింపబడెను. చీట్లపేకలో వచ్చిన దండుగ నిచ్చుకొనుట కాపాత్ర నుపయోగింపఁ బడెను. అది యొక్కటియె గాదు, అప్పుడప్పుడు హస్తలాఘవముచే నతని వశమగుచుండిన రాగి కంచు చెంబులు పంచపాత్రలు మొదలగునవి గూడ తన్నిమిత్తము వినియోగింపఁబడెను. పెట్టెలు లేవా యని మీ రడగవచ్చును. పెట్టెలలో దాఁచవలసిన వస్తువులు లేనప్పుడు పెట్టెలెందుకు? అందుచేత నతనికి సర్దుకోవలసిన సామగ్రులు లేకపోయెను. చిరకాలమునుండి బూజు పట్టుచున్న కృష్ణాజినమును దర్భాసనమును దీసి పాపయ్య బూజు దులిపి యెండలో వేసి దర్భాసనమును కృష్ణాజినములో వేసి కట్టి యొకనాఁడు తెల్లవారుజామున నా కృష్ణాజినమును భుజముమీఁద వేసికొని యిత్తడి చెంబు మూతికి గట్టిన యంగవస్త్రమును నడుమునకు గట్టుకొని ప్రాతధోవతిగట్టుకొని తలకొక ప్రాతయుత్తరీయమును జుట్టుకొని పునహాకుఁ బయన మయ్యెను. మార్గమధ్యమున నతఁడు గావించిన విచిత్రవివాదములు, హస్తలాఘవములు, లీలలు వర్ణింపఁ దొడఁగిన పక్షమునఁ బాఠకులకు విసుగుపుట్టునను భయమున నవి యెల్ల మానవలసివచ్చెను. బ్రాహ్మణుడెంత పేదవాఁ డైనను జేత నొక కాసుసయితము లేకుండ సేతుహిమాచల పర్యంతమగు దేశమంతయు దిరిగిరావచ్చును. ప్రతి పట్టణమున నున్న సత్రములు కొన్ని సత్రములలో నొక పూట మాత్రమే భోజనముఁ బెట్టుదురు. కొన్ని సత్రములలో రెండు పూటలు నిరుప్రొద్దు భోజనము పెట్టుదురు. కొన్ని చోట్ల భోజనముకాక కానియొ రెండుకానులో దక్షిణ గూడ నిచ్చెదరు. దక్షిణదేశమున కొన్ని సత్రములలో బాటసారు లగు వితంతువులు రాత్రి రొట్టె కాల్చుకొనుటకు పిండి గూడ నొసంగుదురు. సత్రములమాట యటుండఁగా బ్రాహ్మణుల కన్నము లేదను బ్రాహ్మణ గృహస్థులు సాధారణముగ నుండరు. కాబట్టి పాపయ్య చిల్లిగవ్వ చేతలేకుండ సుఖముగ వెళ్ళఁగలిగెను. ప్రాతఃకాలమునందు లేచి జాము ప్రొద్దెక్కు వఱ కతఁడు నడచి యొకగ్రామముః జేరి యచ్చట సత్రమున్న సత్రమును లేనిచో సామాన్య గృహస్థుల యిండ్ల భుజించి సుఖముగనిద్రించి మరల జాముప్రొద్దువేళ బయలుదేరి నడచి యేయూరికడ సాయంకాల మగునో యచ్చట బసజేసి యెవరి యింటనో భుజించి మరల వేకువను లేచి పయనము సేయుచుండును. ఈ విధముగ నతఁడు నాలుగు మాసము లగునప్పటికి సుఖముగ శ్రీమంతులగు పీష్వాలకు మున్ను రాజ ధాని యైన పునహాకుఁ జేరెను. పునహాలోఁ పూర్వకాలమున బాజీరాయఁడు మొదలగు పీష్వాలు రాజ్యధురంధరులై యున్న కాలమున బ్రాహ్మణపూజ విశేషముగ జరుగుచుండెను. అందు వేదాధ్యయన సంపన్నులకు జరిగెడుపూజ మిక్కిలి మెండు. భరతఖండ మంతటిలోను కృష్ణా గోదావరీ తీరవాసులగు బ్రాహ్మణులు మిక్కిలి గంభీరముగ నుదాత్తానుదాత్త స్వరితస్వరములు తప్పకుండ నపశబ్దము రాకుండ స్వచ్ఛముగ మనోహరముగ వేదము చదువఁ గలరని మహారాష్ట్ర దేశమున గొప్పవాడుక గలదు. ఆ ప్రఖ్యాతి కాంధ్రబ్రాహ్మణులనుటకు సందియములేదు. హిందూదేశమున ననేకభాషలున్నను నందులో ననేకములు సంస్కృతములే మాతృకగ గ్రహించినను నాంధ్రభాషవలె నవి సర్వవిషయముల సంస్కృతము ననుసరింపలేక పోయినవి. అక్షరముల దగ్గఱనుండి తెలుఁగుభాష సంస్కృతము ననుసరించిన కారణమున నాంధ్రులు సంస్కృత శబ్దములను స్వచ్ఛముగ నిర్దుష్టముగ నుచ్చరింపఁగలరు. తక్కినవా రట్లుచ్చరింపలేరు. వంగదేశీయుఁడు వేద మనఁబోయి బేదమనును. సద్గుణ మనఁబోయి షద్గుణమనును. ఓఢ్రదేశీయుఁడు జనకుఁ డనుటకు జొనొకొ యనును. ఇట్లే ఘూర్జర మహారాష్ట్ర ద్రావిడకర్ణాటాదిభాషలు సంపూర్ణ భాషలుగామి నాయాదేశస్థుల నాలుకలు సంస్కృతోచ్చారణమునకు సరిగా నలవడి యుండలేదు. సంస్కృతోచ్చారణమున కాంధ్రులే దక్షులు. ఆ కారణంబున శ్రీమంతులగు పీష్వాలు వారినిం బట్టి మహారాష్ట్రులందఱు ద్రిలింగదేశ బ్రాహ్మణుల నోటనుండి వేదమును వినవలయుననియు శ్రౌతస్మార్తాది కర్మలను జరిపించుకొనవలయుననియుఁ గుతూహలము గలిగియుండి యట్టివారు లభించినప్పుడు వారిని రావించి సకలవిధముల సమ్మానించి సకల పూజల సత్కరించి పంపుచుందురు. అందుచేత నాంధ్ర బ్రాహ్మణులలో స్వాధ్యాయవేత్తలు శ్రౌతస్మార్త ప్రయోగదక్షులు, శ్రీమంతుల కాలమునను శ్రీమంతుల రాజ్యమస్తమించిన వెనుకను గూడ పునహాసతారాలకుఁ బోవుచుందురు. అట్టి వేదవేత్తలు గర్మిష్టులుఁ బోవుచోటికి పొట్టకోసి కంచుకాగడాల వెదకినను నొక్కయక్షర ముక్కయైన గనబడని పాపయ్య యేమి చేయవలయునని వెళ్ళియుండెనోగదాయని యెల్లవారికి సందియము దోఁచక మానదు. ఘూర్జరులు మహారాష్ట్రులు మిక్కిలి దాతలనియు, గోదావరీతీర బ్రాహ్మణుడు వివాహార్థము యాచించినతోడనె రూకల వర్షము గురియుననియు నందువలన సులభముగ వివాహము జేసికొనవచ్చు ననియు నితరులవలన విని యతఁడు నమ్మెను. అదియునుగాక యాదేశమున శ్రాద్ధభోక్తకు సయుతము రూపాయకు తక్కువ దక్షిణనియ్యరనియు నందుచేత బ్రాహ్మణార్థములు చేసియె గోనెసంచెడు రూపాయలు సంపాదింప వచ్చుననియు నతని కాశపుట్టి వెళ్లెను. ఎట్టెటో యతఁడు పునహా జేరెను. చేరి సత్రములలో భోజన మారంభించెను. ఆవగాయ మాగాయ మొద లగునూరుగాయలను గోంగూరపచ్చడి తోటకూర బచ్చలకూర మొదలగు పులుసులు బెల్లపుటరిసెలు మినుపగారెలు వీశె బూరెలు గుమ్మడికాయ ధప్పళము మొదలగు తెనుఁగు వంటకములకు రుచిపడిన పాపయ్య నాలుకకు మహారాష్ట్ర దేశపు రొట్టెలు పలుచని పప్పులు కారములేని పచ్చళ్ళు మొదట నచ్చినవికావు. పచ్చిమిరపకాయ కారమునకతఁడు మొగము వాచి స్వయముగఁ జేసికొని మహాపదార్థముగ దాచికొని భోజనమునకు వెళ్ళినప్పుడు పొట్లముగట్టి తీసికొనిపోయి పంక్తిలోనున్న మహారాష్ట్రులు నివ్వెరపడి చూచి యితఁడు బ్రహ్మరాక్షసుడని తలంచునట్లది కలుపుకొని తినుచుండును. కొన్నినెల లగునప్పటి కతఁడు మహారాష్ట్ర భోజనమున కలవడెను. అలవాటు పడిన తరువాత మహారాష్ట్రులెవ్వరతని కందలేదు. పునహా వెళ్ళినతరువాత రెండు మూడు మాసముల కతఁడు వివాహము నిమిత్తము యోచన నారంభించెను. చదువు సంధ్యలురాని శుంఠయగుటచే రెండణాలు నాలుగు డబ్బులు రెండుడబ్బులు చేతులోఁ బెట్టినవారేకాని రూపాయ లిచ్చినవా రెవ్వరులేరు. దమ్మిడీకాసులెకాని పెద్దకాసు లతని చేత పడలేదు. ఆ కారణమున తానువిన్నట్లు మహారాష్ట్రులు గొప్పదాతలు కారని నమ్మిక తోఁచెను. ఎందుచేతనో మహారాష్ట్రులమీఁద నతనికి గొంత యనిష్టము గలిగెను. “మహారాష్ట్రులు మగవాండ్రు నాడువాండ్రు నను భేదము లేకుండ నందఱు వితంతువులె. మహారాష్ట్రుల కాచార వ్యవహార ములు లేవు. వీళ్ళు వట్టి శూద్రులు, పంక్తిబాహ్యు” లని చాటునఁ దనమిత్రులతోఁ జెప్పుచుండెను. ఏల యని వారడిగిన నతఁ డిట్లు ప్రత్యుత్తర మిచ్చును. “వితంతువులెగాని మనదేశములో రొట్టెలు తినరు. ఈ దేశములో మగవాండ్రుగూడ రొట్టెలు తిందురు. కాన వారు గూడ వితంతువులే, భోజనకాలమందు మహారాష్ట్రులలో దృష్టిదోషములేదు. మనదేశములో వేదపండితుఁ డన్నమాట యక్కఱలేదు. ఎటువంటి బ్రాహ్మణుఁ డైనను శూద్రుఁడు రవంత తొంగిచూచినప్పటికి బ్రాహ్మణుఁ డన్నము వదలి పెట్టి లేచి వెళ్ళును. ఈ పాపిష్టి దేశములో బ్రాహ్మణుఁడు భోజనము చేయుచుండఁగా శూద్రుఁడు చూచుటయెగాక ఆ గది లోనె తానొక విస్తరి వేసికొని వేరు పంక్తిలో బ్రాహ్మణుని కెదురుగఁ గూరుచుండి శూద్రుఁడు భోజనముచేయును. ఈ దేశములో వట్టి మాలకూడు. అటువంటి పాడుదేశములో నీ వెందుకున్నా వందురేమొ కాలము తప్పి వచ్చినప్పుడు వసుదేవుఁడు గాడిదకాళ్ళు పట్టుకొన్నాడు. పొట్ట గడవక వీళ్ళనాశ్రయించవలసివచ్చినది. అదిగాక మరాటివాండ్రు పుల్లాకులలోఁ దినునట్టివాండ్రు; ఎట్లందురా? మనవలె వా రాకులలో భోజనము సేయరు. పళ్ళెములలోను గిన్నెలలోను తిందురు. అవి కడిగి దాఁచికొందురు. కాని పాఱవేయరు. తిని పాఱవేసినవి పుల్లాకులు కావా?” రహస్యములో నిటువంటి సంభాషణలు సేయుచున్నను బహిరంగముగఁ బాపయ్య వారిని వేవిధములుగ ధనమునిమిత్తము స్తోత్రములు చేసినను మనోరథము సిద్ధించలేదు. వివాహమునకు సొమ్ము ప్రోగుపడు నట్లు కనంబడలేదు. యాచనవల్ల దొరికినది సంభావనవల్ల నార్జించినది బ్రాహ్మణార్థములవల్ల చేఁజిక్కినది పాపయ్య పొగచుట్టలకుఁ దమలపాకులకు వక్కలకునడుమనడుమ నంగళ్ళకుఁబోయి కొని తిను లడ్డు బందరుఫేణి మొదలగు మధురాహారములకు సరిపోయెను. కాని మిగులుటలేదు. ఇంతదూరమువచ్చి వివాహము జేసికొనకుండ మరల స్వదేశమునకుఁ బోవుట యప్రతిష్ఠ యని యతఁడు భావించి తనవంటివారికి సొమ్ము చేతినిండ సమకూర్చునట్టి వృత్తినేదేని నవలంబింపవలయు నని సంకల్పించుకొనెను. అట్లు చేయుటలో నతఁ డొక క్రొత్తవృత్తి నారంభింపఁదలంచెను. ఒక నెల దినములు విచారించి యతడొక నిశ్చయమునకు వచ్చెను. ఆవృత్తి యాంధ్రుల కాశ్చర్యముగలిగించునట్టిది. మహారాష్ట్రులు మెచ్చునట్టిది. ఆపత్సమయమున నక్కఱకు వచ్చునట్టిది. ఎప్పటి కప్పుడు చేతిలో రొక్కము పడునట్టిది. అందఱకుఁ దనతోఁ బని గలిగించునది. ఏనుఁగు పాడివలె తరుగనిది. విరుగనిది. అట్టి యపూర్వమైన వృత్తి యేదందురా వినుఁడు. ఆంధ్రబ్రాహ్మణులు ముఖ్యముగ గౌతమీ కృష్ణవేణీ తీరవాసులు, నందు ముఖ్యముగ రామచిలుకలవలె గోఱవంకవలె నర్థము దెలియకుండ నొకరు చెప్పినదాని బండవల్లెవేసి స్వాధ్యాయము చెప్పుటకును శ్రౌతస్మార్త కర్మలు నిరాఘాటముగఁ జేయించుటకును కావ్యనాటకాలంకార గ్రంథములు తర్కవ్యాకరణ జ్యోతిష వేదాంతాది శాస్త్రములు నేర్చి పాఠము చెప్పుటకును గొన్ని క్రతువులు చేయుటకును మాత్రమే బహుసమర్థులనియుఁ దదితర వ్యాపారములకు వారనర్హులనియు దేశమున నొక గొప్ప యప్రతిష్ట కలదు. పాపయ్య యవలంబించిన వృత్తి యాంధ్రులకు సంభవించిన యా గొప్ప యప్రతిష్టను దొలఁగించునదికూడ నయ్యెను. ఆవృత్తి కధమపక్షమునలుగురైన నుండవలయును. గాఁబట్టి పాపయ్య తాను వెళ్ళినకొలఁది దినములకె తనవలెనే గంపంత యాశ పెట్టుకొని తన వలెనే భగ్నమనోరధులై యిందందు తిరుగులాడుచున్న మఱి మువ్వురను శిష్యులుగ స్వీకరించెను. ఆ నలుగురుఁ గలిసి తాము ప్రత్యేకముగ యజ్ఞములు చేయలేకపోయినను కోటియజ్ఞఫలప్రదమైన వ్యాపార మారంభించిరి. “అనాథప్రేత సంస్కారరేణ కోటియజ్ఞ ఫలం లభేత్” అని యార్యోక్తి కలదు. దిక్కులేని శవములను గాల్చుటచేత కోటియజ్ఞ ఫలము లభించునని యా వాక్యమున కర్థము. అది పుణ్యజనోచితమైన వృత్తియని పాపయ్య దాని నుపక్రమించెను. మొట్ట మొదట నతఁడు ధరలు చవుకగానే యుంచెను. కాని పనితగిలిన కొలఁది ధరలు హెచ్చింపవలసి వచ్చెను. అటువంటివృత్తి నవలంబించుటకు బురికొల్పిన యతని నిపుణత, బుద్ధిఁ జూచి యోర్వలేకను నాంధ్ర బ్రాహ్మణులు తక్కిన వ్యాపారములకు సమర్ధులుకారని లోకమున నున్న యప్రతిష్ఠను దొలఁగించుటకుఁ దగినట్లు కృతజ్ఞులు కాకను దెలివిమాలినవాండ్రు కొందఱు పాపయ్య పరోక్షమునను నెట్టయెదుటను నిందించి కొన్ని ప్రశ్నలడుగుచు వచ్చిరి. అందుగొన్ని ప్రశ్నలివి. “నీ వీ వృత్తినేల యవలంబించితివి? పుణ్య మందువా, సొమ్ము దీసికొనకుండ శవదహనము జేసిన పక్షమున నది పుణ్యము. దిక్కులేని శవములుఁ గాల్చుట పుణ్యము. నీవు మోయుశవములు వెనుకదిక్కుగలవె. అవి యనాధ ప్రేతలుగావు. ఆంధ్రులకు నీమూలమునఁ దలవంపులు వచ్చుటలేదా?” అటువంటి వెఱ్ఱివెఱ్ఱి ప్రశ్నలకుఁ దగినట్లు నతఁడీ క్రిందివిధమున సమాధాన మిచ్చెను. “బ్రతికియున్న వారికి దిక్కుండును కాని పీనుఁగులకు దిక్కెక్కడుండును. కాబట్టి శవము లన్నియు ననాధప్రేతలే. వారికిమోసెడు వారే దిక్కు. మేమే వారికి గతి. ఇది గౌరవమైనవృత్తి. నీళ్ళు మోసి వంటలుచేసి గోడలు పెట్టి యిండ్లు నేసి మనుష్యులెట్లు సంపాదించుచున్నారో నేను గూడ భుజములు కాయలు కాయునట్లు శవములను మోసిమోసి కష్టపడి చమట యోడ్చి సంపాదించుచున్నాను. నాసొమ్ములో గ్రుడ్డిగవ్వయైన నన్యాయార్జితము లేదు. అంతయు న్యాయార్జితమె. నాలుగు మాటలు చెప్పి నాలుగు గడియలలో నాలుగువందలో నాలుగువేలో గడించు ప్లీడరు డబ్బుకంటె నానా కశ్మలవస్తువుల నమ్మి సొమ్మార్జించు వర్తకుని డబ్బుకంటె పండినను మండినను దప్పక సొమ్ము పుచ్చుకొను సర్కారు సొమ్ముకంటె వడ్డి వ్యాపారముజేసి మళ్ళు మాన్యములు కొంపలు గొడ్లు దయలేక యమ్మించి లక్షాధికారులగువారి సొమ్ముకంటె నా సొమ్ము న్యాయమైనది. నాకొక్క గవ్వ నెవ్వరు నుచితముగ నీయనక్కరలేదు. నే నొకరిదగ్గరికివెళ్ళి చేయి జాచి యాచింపను. ఒకనియింటికి వెళ్ళి నింద్రుఁడవని చంద్రుఁడవని వానిని భూషించి వాని సమయగుదాక కని పెట్టుకొని యుండి పీకి పీడబెట్టి విసిగించి తిట్లుతిని నాలుగు డబ్బులు సంపాదించి సంతోషించు యాచకుని వృత్తికంటె నావృత్తి ఘనమైనది. వేదముఁ జదువుకొనలేదని శాస్త్రముఁ జదువుకొనలే దని నన్ను మీరు నిందించుచున్నారు. వేదము చదువుకొన్న వారి వృత్తి యేమిటి? ముష్టి. శాస్త్రమునేర్చి కొన్న వారి వృత్తి యేమిటి? ముష్టి. చదువుకొని ముష్టి యెత్తుటకంటె చదువుకొనక పీనుఁగుల మోయుట మంచిది. ఆ ముష్టి విద్యలు నాకక్కఱలేదు. ఒకరింటికి వెళ్ళనక్కఱలేదు. నా యింటి కందఱును వత్తురు. అందఱకు నాతో పనిగలదు. నేను కాలుమీఁద కాలువేసుకొని యింట్లో కూర్చుండి నప్పటికి నాయింటి కందఱువత్తురు. నావృత్తి వరహాలచెట్టు. ఎప్పటికప్పుడె పంట. ఇది నెల జీతముల వృత్తికాదు. అది వట్టిపాడువృత్తి. ముప్పది దినములు రాత్రియు బగలు పనిజేసి పదో యిరువదోరూపాయలను సంపాదించుట యేమి ప్రయోజకత్వమ? నన్నాక్షేపించువారిలోఁ గొందఱు యాచకులె. కొందరుపెద్దలు సంపాదించిపెట్టిన భూములమీఁద జీవించువారు. అటువంటి వారందఱు మనోవృత్తి ముండలు. తనభుజశక్తి మీఁద సంపా దింపలేనివాఁడు, పిత్రార్జితము నమ్ముకొని కాలక్షేపము సేయువారు, వట్టి యప్రయోజకులు. నేను గట్టిప్రయోజకుఁడను, నాభుజశక్తివల్ల జీవనముచేయుచున్నాడను. పల్లకి మోయుట యెటువంటిదో కటుకు మోయుట యటు వంటిదె. పెండ్లి పల్లకి మోతకు డబ్బుపుచ్చుకొనుట న్యాయమై దీనిమోతకు డబ్బు పుచ్చుకొనుట యన్యాయమగునా? నా వలన మీకు తలవంపులు వచ్చుచున్నవా? తెనుఁగువాళ్ళు మరెందుకుఁ బనికిరారన్న యపకీర్తిఁ దొలఁగించి యేపనిలోఁ బెట్టినను సరె తెనుఁగువారు సమర్థులేయని లోకములో వెల్లడిఁ జేసినాను. అందుకైన నామీద మీకు విశ్వాసము లేదే! ఛీ! మీతో మాట్లాడఁ గూడదు. పొండి” అని యెదుటివాఁడు మరల నోరెత్తలేనట్టు యుక్తులు చెప్పి తన యుక్తులు చాలనప్పుడు తన తొమ్మిదవ యఠ్ఠము పారాయణముఁ జేసి “శేషం కోపేన పూరయేత్” అను మాట సార్థకముజేయుచుండెను. పాపయ్య యే సుదినమున నే మంచి ముహూర్తమునఁ దనవృత్తి నారంభించెనో కాని యది దిన దిన ప్రవర్థమాన మయ్యెను. పునహా పెద్దపట్టణ మగుటచేఁ బ్రతిదినమతఁడు రెండు మూఁడు పరియాయములు రుద్రభూమికి బోవలసిన పని గలుగుచుండెను. మశూచి విశూచి వచ్చిన కాలములో నతఁడు భూతగణపరివృతుఁడైన సాక్షాత్ రుద్రుఁడు వలె శిష్యసమేతుడై తరుచు శ్మశానములలోనే యుండుచు వచ్చెను. పని తొందరచే నొకానొకదిన మతఁడు భోజనముఁ జేయక పోవుటయుఁ దన పొలములోనికే యన్నము దెప్పించు కొని తిను వంటకాపువలె శ్మశానమునకే పది రొట్టెలు తెప్పించుకొని యెట్లో తీరికఁ జేసికొని యారొట్టెలు నోటిలో వేసికొని మరలఁ బనిచేయ తటస్థించుచుండును. మూరెడేసి పొడుగు పొగచుట్టలు నోట వెలుఁగుచున్న సమయములో పాపయ్యను శిష్యులను రాత్రులు దూరమునుండి చూచువారు కొఱవిదెయ్యములు శ్మశానములో విహరించు చున్నవని పలుమాఱు భయపడి పరుగులెత్తుచు వచ్చిరి. అన్నివృత్తులలో ధర్మమున్నట్లె పాపయ్యవృత్తిలోఁగూడ కొంత ధర్మముండెను. పేదపీనుఁగుల నప్పుడప్పుడు మూల్యము గొనకుండ నతఁడు తీసికొని వెళ్ళుట కలదు. తన యనిష్టుల కడను ధనవంతుల యొద్దను నెక్కువధనము గ్రహించుట కలదు. ఒకరి కడ నెక్కువ, యొకరికడ తక్కువ యేల తీసికొందువని యెవరైన నడిగినప్పు డది వ్యాపారము; సమయము కొలఁది బేరము ధాన్యాదులధర నేఁడు పుట్టి యిరువది; యెల్లుండి ముప్పది యుండగూడదా” యని వారి వాదములు ఖండించుచుండును. శవమునకు నాలుగు వరహాలు నెనిమిది వరహాలు పదివరహాలు పుచ్చుకొనుటయెగాని, తక్కువ లెక్కలేదు. మఱియు వరహాల లెక్కయెగాని చిల్లర లెక్కలేదు. లోభత్వము చేతను ధనహీనతచేతను గొందఱు ప్రేతబంధువులు సహాయము చేయుమని వేడినప్పు “డీసారి గాదు మరియొక సారి చూడవచ్చును లెండి” యని బదులు చెప్పుచుండును. అనవుడు వారది యమంగళముగనెంచి “ఛీ యిదియేమయ్యా! ఈ సారికె మే మింత ఘోరదుఃఖ మనుభవించుచుండ మఱి యొకసారి యిటువంటిది రావలయు నను చున్నావా?” యని వారు దూషణపూర్వకముగ నడుగుటయు నతఁ డిట్లు ప్రత్యుత్తర మిచ్చును. “ఏమంత ఓగాయిత్యము, ఈ పోయిన వాఁడొక్కఁడు తప్ప మీ యింట మఱియెవ్వరు జావరా. ఉట్టిఁ గట్టుకొని యూరేగుదురా? చిరకాల జీవులా యేమిటి? దేహములుకాని యివి లోహములు కావుగదా “జాతస్యమరణం ధృవం” అను మాట వినలేదా? ఎప్పటికైన మీరందఱు నాచేతిలోఁ బడువారె.” అతనితో వాదముఁ జేయుట కార్యభంగముఁ జేసికొనుట యని యెవ్వరు మాటలాడేవారుకారు. ఈ శవదహనమునకుఁ దోడుగ నేకమహా పిండ భక్షణ మతనికి విశేషధనమును గూర్చెను. బ్రాహ్మణుఁడు మృతినొంది నప్పుడు ముప్పది రెండు చిన్న చిన్న యన్నపిండములు నేతిలోముంచి బ్రాహ్మణునిచేతఁ దినిపింపవలయునని ధర్మశాస్త్రముగలదు. అదె యేక వాహమందురు. అవితినుట మిక్కిలి తప్పు. గొప్ప యమంగళము, అందుచేత నవి తినుట కొప్పుకొనరు. అందుచేత నెల్లవారు నవి యగ్ని హోత్రమున హుతము సేయుదురు. ఎక్కడో దేశాన కొక్కఁడు మహాశూరుఁడు బయలుదేఱి పిండమునకొక్కొక్క వరహాపుచ్చుకొని యవి తిని పదిమంది తిట్టి కొట్టుదురను భయమున నెవరికి గనఁ బడకుండ రాత్రివఱ కేదో గదిలోఁ గూర్చుండి పాఱిపోవుచుండును, ఆ పిండములు బ్రాహ్మణులు తిన్నపక్షమునఁ దమ పితృ దేవతలు తప్పక మోక్షపదమున బ్రాపింతురని మహారాష్ట్ర బ్రాహ్మణులకు నమ్మిక గలదు. అందు గౌతమీ గృష్ణవేణీతీర బ్రాహ్మణులు అన్నచో వేరు కొరతలేక తమపెద్దల నిమిత్తము వైకుంఠద్వారములు తెఱచి యుండునని వారి దృఢవిశ్వాసము. అట్టివా రెవ్వ రిదివఱకు వారికి దొరకక పోవుటచే నేక వాహపిండము లగ్నిహోత్రము పాలగు చుండెడివి. పాపయ్య వెళ్ళిన తరువాత నట్టి కొరత తీరిపోయినది. వైకుంఠ కైలాసలోకముల ద్వారములు ముద్దలు మ్రింగుటకు తెరవఁబడిన పాపయ్య నోరువలెనే యెల్లప్పుడు తెఱవఁబడి యుండును, అగ్ని హోత్రునినోట కరక్కాయ గొట్టి పాపయ్య ముప్పది రెండు ముద్దలు నేతిలో ముంచిన ముద్దకు రెండు వరహాలు మూడువరహాలు సమయముకొలదిఁ లాగివేయుచుండును. సర్వభక్షకుఁడైన యగ్నిహోత్రునకైనను నెయ్యిసరిగా జీర్ణముకాక యజీర్ణము చేసియుండెను. కాని పాపయ్య యెన్నఁడు నజీర్ణ మెఱుగడు. పూర్వపువారు భయముచే రహస్యముగ దినుచు వచ్చిరి. పాపయ్య కట్టి భయములేదు. కావున నతఁడు బహిరంగముగఁ దినుచు వచ్చెను. పాపయ్య నమ్మినదానిని సరిగ నాచరించునట్టి మహాశూరుఁ డని చెపుట కేమి సందియము కలదు? ఈ విధముగ నిర్భయముగ రెండుపనులు నిటీవల ననేకులు చేసిరి. కాని వారందఱు పాపయ్య శిష్యులే. అట్టివారందఱుఁ బాపయ్య పేరు చెప్పి దీపము బెట్టి మొక్కుకొనవలెను. అది యతఁడు పెట్టిన భిక్షమె. పై రెండు వృత్తులవల్ల పాపయ్య నెలకువందల కొలది రూపాయ లార్జించెను. కాని యది యంతయు నిలిచినది కాదు. ఎంతచెట్టు కంతగాలి, అర్థప్రాణములు కవలపిల్లలు. అడుగడుగునఁ బ్రాణమున కెన్ని గండము లున్నవో యర్థమున కన్నిగండములె యున్నవి. పాపయ్య గొప్పదాత. అది వఱకు బ్రాహ్మణులు బ్రాహ్మణులకేగాని దాన మియ్యరని గొప్ప యప్రతిష్ట గలదు. ఆయప్రతిష్ట పాపయ్య తొలగించి శూద్రులకుఁ గూడ దానము లియ్యఁ జొచ్చెను. మగవారికి దానము లిచ్చుట మనలో బూర్వాచారము. ఆ యాచారమును మార్పుచేయఁదలఁచి యతఁ డాఁడువండ్రకె దానము లీయఁజొచ్చెను. కుంటివాండ్రకు గుడ్డివాండ్ర కేదేనివిదల్చుట యతని కిష్టములేదు. వారేదో ఘోరపాపముఁ జేయబట్టి భగవంతుడు వారిని దండించుటకై యంగవైకల్యము వారికి బ్రాప్తింపఁ జేయుటచే నట్టివారిని మనము డబ్బిచ్చి పోషించిన పక్షమున రాజద్రోహులను రక్షించిన వారిపై రాజునకుఁ గోపము వచ్చినట్లె యీశ్వరద్రోహులను రక్షించిన పక్షమున నీశ్వరునకు మనపైఁ గోపము వచ్చి మహానరకమున ద్రోయునని యతఁడు నమ్మి యటువంటివారి కేమియు సాయము చేయక రూపరేఖా విలాసములు గలిగి ప్రాయము గలిగి హొయలు గలవారికె నేవైన గుప్తదానములు చేయుచుండును. పాత్రదాన ప్రవీణుడైన పాపయ్య కతమున నెందఱో చాకలి సానులు, మంగలి మగువలు, గమళ్ళ గరితలు, నీడిగ యెమ్మెకత్తెలు సాలిజవరాండ్రు గొల్ల గుబ్బెతలు బాగుపడిరి. ఈ దానములు లేని పక్షమున బాపయ్య బంగారుగోడలుకట్టి యుండును. కాని లక్ష్మి పక్షపాత మనస్కురాలు; అందుచేత మగవాని యండనుండక తనజాతి యాఁడువాండ్ర గడకు బోయెను. అదిగాక పాము కన్న గ్రుడ్లన్నియు బ్రతుకునా? పులికిఁ బుట్టిన పిల్లలన్నియు బ్రతుకునా? నల్లేరు చెట్లన్నియు నెదిగి వృక్షము లగునా? అట్లయినచో జగము లాగునా? ప్రతివాఁడు సంపాదించిన దంతయు నిలువచేసిన పక్షమున జ్యేష్టాదేవికి నిలువనీడయుండునా? పాపయ్య కిప్పటి కేబది సంవత్సరములు వచ్చినవి. పునహాకు వచ్చి యిరువదిసంవత్సరము లైనది. పోయినవి పోగా నతనియొద్ద మూడు వేలరూపాయలు నిలిచినవి. అప్పుడప్పుడొక మారువాడీయెద్ద కొంత సొమ్మతడు నిలువచేసి యుండుటచే నీమాత్రమైన గనబడినది. ఆ సొమ్ముగూడ నెన్నో సారులు తీసికొనుటకితడు ప్రయత్నించి మారువాడిని గట్టిగా నడిగెను. కాని “బ్రాహ్మణుఁడు దిక్కు లేనివాఁడు ఏ పడుపుకత్తె యింటనొ యే శ్మశానములోనో యాకస్మికముగ జచ్చిపోగలడు. అప్పుడీ సొమ్మంతయు మనకే దక్కగలదు. వీని కిప్పు డెందు కిచ్చి చేతఁజిక్కినది పోగొట్టుకొనవలయు” నని యా మారువాడీ తలంచి పాపయ్య వచ్చినపుడెల్ల యేదో వంక జెప్పి పంపివేయు చుండును. ఎట్లైన నేమి, మారువాడీ మనోరథము భగ్నమైనది. మారువాడీ మశూచికమువచ్చి మృతినొందెను. అతని కొడుకు పాపయ్య సొమ్మిచ్చి వేయ దలచెను. పాపయ్య కప్పుడు పెండ్లిమాట జ్ఞప్తికి వచ్చెను. మూలస్థానములో నొకపిల్ల యున్నదని యతనికిఁ దెలిసి తన కిమ్మని యా పిల్ల తండ్రికి వర్తమానమంపెను. ఆ వర్తమానము తెలిసిన తరువాత బాలిక తండ్రి యగు అన్నంభొట్ల అన్నప్పగారు పిల్లకు బండ్రెండు సంవత్సరములు వయస్సు కావున పండ్రెండువందల రూపాయ లీయవలసినదనియు మూడువందలరూపాయలు నగలు పెట్టవలసిన దనియు నుభయమంగళసూత్రములు బెండ్లికొడుకె చేయించుకొని యుభయులఖర్చులు బెండ్లికొడుకు పెట్టుకొని మందపల్లిలో గాని వేంకటేశ్వరులవాడపల్లిలో గాని పెండ్లి చేసికొనవచ్చుననియు నతనికి వర్తమాన మంపించెను. అది విని కళ్యాణకాలము తనకు నేఁటి కాసన్నమైన దని పాపయ్య సంతసించి యా పద్ధతి కొడంబడి మారువాడీ యొద్దనుండి రాజమహేంద్రవరములో నున్న నారాయణకర్నుగాని మీఁదికి మూఁ డువేల రూపాయలకు దర్శనహుండిపుచ్చుకొని పునహానగరము విడిచి బయలుదేఱెను. అతఁడా నగరము విడిచినపు డెందఱు స్త్రీలు కంటఁ దడిబెట్టిరని చెప్పను! చాపచుట్టలు గిరవాటు వేసినట్లు తమయూరి శవములను మోయువారు లేరనియు ననర్గళముగ నేక వాహపిండములు గుటుకుగుటుకున మ్రింగి తమ పెద్దలకు వైకుంఠ ద్వార సోపానము లెక్కించువారు లేరనియు నగరవాసు లెంతో విచారించిరి. పాపయ్య పునహాను విడుచుచున్నాఁడు గావున నతని విషయమై యిక్కడనె యొకమాట చెప్పవలయును. అందఱు తమతమ వృత్తులలో నిగ్రహానుగ్రహ సమర్థులైనట్లె పాపయ్యయుఁ దనవృత్తిలో నట్టివాఁడు. అనుగ్రహించెనా యథాశక్తిగా శవ మూరక మోయును. కోపించెనా దండించును. ఇందుకొక తార్కాణము గలదు. ఒకనాఁ డొకపేటలో నొకయింట నైదేండ్లపసిబిడ్డ మృతినొందెను. గృహయజమానునికడ రెండువరహాలు పుచ్చుకొని యాబిడ్డను మూటఁగట్టి రాత్రియగుటచే నది తన విరోధియైన యెక మహారాష్ట్రుని వీధియరుఁగుమీదఁ బెట్టి పాఱిపోయెను. మఱునాఁడా గృహస్థులు లేచి యది యేదో యనుకొని విప్పిచూచి భయపడి కళవళపడి యమంగళముగ భావించి పాపయ్యను బిలిపించి తీసివేయమని ప్రార్థించిరి. పాపయ్య తన ప్రాతకసి తీరునట్లు పాతిక రూపాయలక్కడ పెట్టించి యా పీడానివారణముఁ జేసెను. ఇఁక విన ననేకోదా హరణములుగలవు. గ్రంథవిస్తర భీతిచే మానవలసి వచ్చె. పాపయ్య రాజమహేంద్రవరములో హుండీమార్చుకొని మందపల్లి వెళ్ళి యిల్లు కట్టుకొని మూలస్థానమునుండి అన్నంభొట్ల అన్నప్పగారిని సకుటుంబముగ రావించి పండ్రెండువందలు వారి కిచ్చి మూడువందలు నగలుపెట్టి సంబంధము గుదిర్చినవానికి నూరురూపాయలు రుసుమిచ్చి యన్నప్పగారి కుమార్తెయైన పిచ్చమ్మను వివాహమాడెను.