గణపతి/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము

భగీరథుఁడు మహాప్రయత్నము జేసి కష్టపడి గంగను భూమికిఁ దెచ్చి జగజ్జనులకు మహోపకారము చేసిన తెఱగున గంగాధరుఁడు కష్టపడి గంగను దెచ్చి కాకినాడ పురవాసుల కిచ్చి వారికి మహోపకారము జేయుచు గాలముఁ గడుపుచుండఁగా నొక వైపరీత్యము జరిగెను. అది కాకినాడ పురవాసులు చేసికొన్న దురదృష్టము వలన సంభవించినది. ఆపట్టణమందొక గొప్పవైశ్యునియింట వివాహము జరిగెను. విజయ నగరమునుండి మగపెండ్లివారు తరలివచ్చిరి. కన్యాప్రదాత లక్షాధిపతి, వరుని తండ్రియు నట్టివాడె. సుముహూర్త సమయమున వందల కొలది జామారులు శాలువలు పెద్దకాసులు పిల్లకాసులు కన్యా ప్రదాత సభలో వెదజల్లెను. కుండలములు ధరించినవారికి రుద్రాక్షలు దాల్చినవారికి పిండికట్టుపెట్టినవారికి పిల్లజుట్లవారికి దర్భాసనాల వారికి సిఫారసులు దెచ్చికొన్నవారికిని నివిశేషముగ ముట్టెను. అందు గంగాధరున కొక్కటియు ముట్టలేదు. అతని కెవ్వరు సిఫారసు చేయలేదు. అందుచేతఁ గాకినాడ పురవాసు లందరు గృతఘ్నులని యతఁడెంచుకొనెను. చెంబు చేతితో నెత్తి కాకినాడలో దాహము పుచ్చుకొన్న వారిలో ననేకులు గంగాధరునిపేరు తలంచుకొనవలసినదేకదా. వేదశాస్త్రములు రాక వెర్రికుక్కలవలె వీధులవెంటఁ దిరుగ బండవాండ్ర కెందఱకు మొగమాటమి చేత సిఫారసులచేత బండితసంభావనలు జామారులు ముట్టలేదు? అదివఱకు వెంకన్న సుబ్బిగాడు గంగన్న యను పేర్లుగల నిరక్షరకుక్షులు నీళ్ళ బ్రాహ్మణులు వంటబ్రాహ్మణులు నాఁ డాహితాగ్నులై వెంకటావధానులు, సుబ్బన్న దీక్షితులు, గంగప్ప సోమయాజులు నను బిరుదులు ధరించిరి. ఎన్నో దర్భాసనముల బూజు దులుపఁబడెను. ఎన్నో జారీ చెంబులెఱ్ఱగాఁ దోమబడి హస్తముల యందమరెను. ఎన్నో చినిఁగిన శాలువలు బుజముల నలంకరించెను. ఒక కోమటి యందుకొన్న వెలయాలి చెల్లెలి నుంచుకొన్న నొక వంట బ్రాహ్మణుని కా కోమటి సిఫారసు జేసి పండితుఁ డని పిల్లకాసిప్పించెను. ఆబ్రాహ్మణుఁడు గూడ శాలు వెక్కడో యెరువు దెచ్చికొని తలకుఁ జుట్టుకొని యాపూటకు గరిటి యావలఁ బారవైచి గంటము దాఁటియాకు చేతఁ బుచ్చుకొని గొప్ప పండితునివలె కనఁబడెను. గంగాధరున కట్టి యుపాయము చెప్పువా రెవ్వరు లేకపోయిరి. అతనికి స్వయముగ నుపాయము తోఁచలేదు. తోఁడి వంటబ్రాహ్మణునకుఁ బిల్లకాసు దొరకుటయెగాక పండితుడని గౌరవము గూడ సభలోనఁ గలిగినందున గంగధరుని కడుపులో మంట హెచ్చెను. మనంబున మత్సరము వృద్ధిఁ బొందెను. పురవాసులపై నలుక రెట్టింపయ్యెను. ఆనాఁటి కెట్లో కోపము లోలోపల జీర్ణముఁ జేసికొని యతఁ డింటికిఁబోయి సదస్యము నాఁడెక్కువ సంభావన దెచ్చుకొనుట కుపాయము వెదకుఁచు దనచేత నీళ్ళుమోయించుకొను నొకరిద్దరు పెద్దమనుష్యుల యెద్దకు వెళ్ళి సిఫార సిమ్మని యడిగెను. "నీవుఘనాపాఠివా? షోడశ కర్మాధికారివా? మహాపండితుడవా? ఏమని నీకు నేను సిఫారసు నియ్యఁగలను? నీళ్ళ బ్రాహ్మణునకు సిఫారసిచ్చిన పక్షమున నాగౌరవ ముండునా?" అని యొకఁడు బదులు చెప్పెను. "నేను పెండ్లివారి నెఱుఁగ" నని మఱియొకఁడు త్తరముఁ జెప్పెను. ఆ పలుకులు వినఁగానె గంగా ధరున కెంతకోపము వచ్చినదని చెప్పను? "ఛీ! మీకు విశ్వాసము లేదు. ఇకమీద మీ యిండ్లలో నీళ్ళు మోసితినా కాశీలో గోహత్య జేసినట్లె" యని మహాకోపముతో వారియిండ్లు వెడలివచ్చి "యొక నిర్భాగ్యుఁడు నాకు సిఫారసు చేయుటెందుకు? దేవుఁడిచ్చిన కాళ్ళు చేతులు నుండఁగా నొకరి నాశ్రయింపనేల" యని మఱెవ్వరిని సిఫార సడుగక స్వయం సహాయమె మంచిదని తత్ప్రయత్నముఁ జేయుచుండెను. సదస్యమునాడు బ్రాహ్మణసంతర్పణ మైనతరువాత సంభావన సాయంకాల మీయఁదలఁచి పెండ్లివారు భోజనానంతరమున బ్రాహ్మణులు నందఱ నొకదొడ్డిలోఁ బెట్టిరి. రెండువేల బ్రాహ్మణ్యము చేరెను. ప్రతివాఁడు ముందుగా సంభావన గ్రహింపవలయునని యొండొరులఁ ద్రోసికొనుచు ద్రొక్కికొనుచు విసనగఱ్ఱలతోఁ గొట్టుకునుచుఁ దిట్టికొనుచు బ్రాహ్మణులాకాశము పగులుతున్నట్లురచుచుండిరి. సంభావనలిచ్చుటకు మొదలు పెట్టునప్పటికి సాయంకాల మయ్యెను. గంగాధరుఁడు దృఢదీర్ఘ కాయుఁడగుటచేఁ దనకంటె ముందున్నవారి నెందఱినో వెనుకకు లాగివైచి ముందుకు వెళ్ళిపడి తన సంభావనకుఁ చేయిచాచెను. పెండ్లివారు వివాహ మైనవారికి రూపాయి చొప్పున బ్రహ్మచారుల కర్థరూపాయి చొప్పునను నీయఁదలఁచిరి. పాపము ! గంగాధరుఁడు ముప్పదియేండ్ల వయసువాఁడై చిన్న తాడిచెట్టంత పొడుగున్నను వివాహితుఁడు కాకపోవుటచే నేఁ డెనిమిది సంవత్సరముల వయసు గలిగి యతని మోకాలంత పొడుగై నలేని చిన్న బ్రహ్మచారులకు ముట్టినంత సొమ్మేముట్టెను. గంగాధరునివంటి ప్రజ్ఞాశాలికి మహాభిమానికి నిదియొక గొప్ప యవమానముకాదా? కన్యా ప్రధాన కాలమున జరిగిన యవమానమున కిది తోడై యతని మనస్సు మఱింత మండింపఁ జేసెను. వివాహము కాని వెలితి యప్పుడతనికిఁ గనఁబడెను. క్రతువులను జేసిన సోమయాజు లగ్నిగోత్రము నిమిత్తము వివాహము చేసికొన వలసి వచ్చినట్లు సంభావనల నిమిత్తము గంగాధరుడు వివాహము జేసికొన వలయునని యప్పుడు నిశ్చయించుకొనెను. సింహాచల మతనికి భార్యయై యుండినను భార్య యున్నదని చెప్పుకొనుటకు వొంటిపోగు జందెము దీసి నాలుగుజందెములు వేసికొనుటకు వీలులేదుకదా. పెండ్లి వా రర్థరూపాయ చేతిలోఁ బెట్టగానే విధిలేక యది పుచ్చుకొని గంగాధరుడు మనస్సులో నున్న మంటయొక్క పొగ యేమో యన్నట్లు కనుబొమలు బిరుసులై విజృంభింప ధుమధుమ లాడుచు నా వలకు బోయెను. ఆ దినమున సింహాచలము రెండురూపాయలు తెమ్మని యాజ్ఞాపించెను. పెండ్లివారు గొప్పవారు కదా రెండేసి రూపాయలిత్తురని యతఁడు నిశ్చయించుకొని వెళ్ళెను. కాని చేతిలోఁబడిన దర్థరూపాయి మాత్రమె యయ్యెను. రెండురూపాయలు దీసికొనివెళ్లక పోయినచో సింహాచలము చీపురుగట్టపూజఁ జేయును. అదీ మనసుపడి యొక వర్తకుని యొద్ద గులాబీరంగు పట్టురవికెల గుడ్డ వెలకుఁ దీసికొనిపోయెను. ఆ సొమ్ము మరునాఁ డుదయమున నిచ్చితీరవలె. ఈయని యెడల దనకుఁ గాని దానికిఁ గాని మాట దక్కదు. పాపము! గంగాధరునకు గొప్పచిక్కు సంభవించెను. ఇదియా గొప్ప చిక్కని చదువరులు నవ్వుదురు గాబోలు. ఎవరిమట్టుకు వచ్చిన గాని వారికి తెలియదు. మీ కిటువంటిచిక్కు సంభవించునపుడు గాని మీకు తెలియదు. ఈ విషద్రోగమునకు మంచిమందేది యని గంగాధరుఁడు కొండొక సేపాలోచించి యిట్లునిశ్చయించెను. "నేనిప్పుడె బజారునకు వెళ్ళి కోమటి కోటయ్యవద్ద సీమనూలుజందెములజతకొని మెడలోవైచుకొని సంబావననిచ్చునట్టి దొడ్డికి వెనుకవైపుననున్న గొడ యెక్కి దొడ్డిలో దుమికి రెండవసారి సంభావనకు వెళ్లెదను. మొగ మానవాలు తెలియకుండ విభూతి పాముకొని యెదను, దీనితో మరియొక రూపాయ చేతఁబడును. పైమాట చూచుకొనవచ్చు" నని నిశ్చయించుకొన్నట్లు వెంటనే జరిగించెను. పదివందల రూపాయలు కర్చుపెట్టినను లభించుటకు దుర్లభమైన పెద్దజందెము గంగాధరునకు క్షణములో మంత్రములతోఁ బనిలేక నాలుగుడబ్బులతో లభించెను. అతని బుద్ధికుశలతకు చదువరులు సంతోషింతురని మా యభిప్రాయము. నూతన యజ్ఞోపవీతధారణమైన వెనుక విభూతి పాముకొని క్రొత్తపలుపు మెడనిడ్డ దున్నపోతువలె వెలయుచు నతఁడు దొడ్డి వెనుకకుఁబోయి వానదెబ్బచేత మదురూడి పోయిన భాగమున మెల్లఁగా గోడ యెక్కెను. ఈశ్వరుఁడు తోడపడకపోయిన తరువాత మానవప్రయత్న మేమి సాగును? గంగాధరుఁడు దృఢశరీరము గలవాఁ డగుటచే నతని శరీరభారమున గోడ విరిగిపడెను. గోడలో గంగాధరుఁడు గూలెను. కుడిచెయ్యి విరిగెను. పడగానే కొంచముసేపు స్మృతిదప్పెను. వీధివైపునకుఁ బడినందున దారిబోవువా రెవరో చూచి గంగాధరుఁ డని తెలుసుకొని యొక బండిమీఁదఁ బడవైచి యింటికిఁ దీసికొనిపోయిరి. కొన్ని దినము లతఁడు మంచముమీద నుండి లేవనేలేదు. ఆసుపత్రికి వెళ్ళి వైద్యము జేయించుకొమ్మని కొంద రతనికి సలహా యిచ్చిరి. కాని యాసుపత్రి వైద్యులను దొరతనమువా రభిమానముచేత నిలుపుచున్నారు. కాని వారికి వైద్య మేమియుఁ దెలియదని మొదటనుండియు నతని నమ్మిక యగుటచే నతఁడా పొంతఁ బోవక కుమ్మరగురవయ్యను బిలిపించి ఏఁబదిరూపాయలిచ్చుట కొప్పుకొని చేయి వానిచేత తోమించుకొన నారంభించెను. చెయ్యి యెకవిధముగ స్వాధీన మగునప్పటి కారుమాసములు పట్టెను. ఆ యారుమాసములు తల్లి యన్నము దినిపించెను. ఏడవమాసమున నతని కన్నము దినుటకు మాత్రము చేయి స్వాధీనమయ్యెను. కావడి మోయుటకు బిందె లెత్తుటకు నది స్వాధీనము గాకపోయెను. కాఁబట్టి కాకినాడ పురజనుల భాగ్యదోషమున గంగాధరుఁడు పూర్వపు వృత్తి వదలవలసి వచ్చెను. తల్లి యక్కడక్కడ పనిచేసి యీ యాఱుమాసములతనిని బోషించెను. పైగా నూరురూపాయ లప్పయ్యెను. చిరకాల మన్నవస్త్రము లిచ్చి సకలసౌఖ్యము లిచ్చి పోషించిన కావడిబద్దను మట్లను మూలఁ బాఱవైవలసి వచ్చినప్పుడు సంపూర్ణ శస్త్ర సన్యాసము జేయు మహావీరుఁడు వలెను గదాగాండీవములు జమ్మిచెట్టుమీఁద దాఁచిన భీమార్జునుల వలెను గంగాధరుఁడు కన్నులనుండి జొటజొట బాష్పములు దొఱఁగ నేడ్చి యటమీఁద నుదరపోషణ మెట్లని విచారింపఁ జొచ్చెను. అతని చేయి విరిగిన దినములలోనె మాతామహుఁడైన యన్నప్ప యవతారముఁ జాలించెను. తండ్రి తన్నథో గతిపాలుచేసినను సహజమైన పితృ ప్రేమచేఁ బిచ్చెమ్మ కొంత వగచి యొకసారి తల్లిని జూడఁదలఁచెను. కాని కుమారున కన్నము దినిపించువారు లేకపోవుటచేతను విశేషించి గంగాధరుఁడు వెళ్ళఁదలఁచినందుకు మిక్కిలి దూషించుటచేతను మానుకొనియెను. గంగాధరుని భవిష్యద్వృత్తిని గూర్చి తల్లికి గూడ మనోవ్యధ కలిగెను. అందఱికంటె సింహాచలమున కెక్కువ విషాద ముదయించెను. గంగాధరుఁడు పరిత్యజించిన పక్షమునఁ గాకినాడ పట్టణములో దాని మొగముఁ జూచువారు లేరు. కావున దాని విచారమున కంతములేదు. నారు వోసిన దేవుడు నీరు పోయకమానఁడని గంగాధరునకు గట్టినమ్మకము కలదు. అతని విశ్వాస ప్రకారమె యతని కదృష్టము కలిసి వచ్చెను. కాకినాడలో నదివఱకు నగ్నిప్రచ్ఛాదనములు, తిలదానములు పట్టుచుండిన బ్రాహ్మణు డొకడు మృతినొందెను. ఆ స్థానమాక్రమించుటకుఁదగినవా రెవ్వరని పురవాసు లాలో చించుండ నంతలో గంగాధరుఁడు దానందుకుఁ దగిన వాడననిచెప్పి గ్రామపురోహితులను సభాపతులను నాశ్రయించెను. వచ్చిన దానిలోఁ గొంతభాగము వారి కిచ్చునట్లు గంగాధరు డొడంబడినందున వారా పదవి కితనినె పట్టాభిషిక్తుని జేసి యెఱిగినచోట్ల "నితఁడు మనల నందఱ నమ్ముకొన్నాఁడు గనుక నితనికే యియ్యవలయు" ననిచెప్పి యెఱుఁగనిచోట్ల నితడి పిల్లలు కలవాడు, బహుకుటుంబీకుఁడు పెద్దమనుష్యుఁ డని చెప్పి యెట్లో వా రీయఁదలంచుకొన్న దానికన్న నధికముగ నిప్పించి యుపకారముగ జేయఁజొచ్చిరి. అట్లు వచ్చిన ధన మతఁడు నాలుగు భాగములుగ విభజించెను. "శరీర మాద్యం ఖలు ధర్మసాధన" మన్నారు గనుక నొక భాగము తన సంరక్షణము నిమిత్తము, రెండవభాగము తనకు దానము లిప్పించిన పురోహితుల నిమిత్తము, మూడవభాగము తనకు బాహ్యప్రాణమైన సింహాచలము నిమిత్తము, నాల్గవ భాగము నిరుపేదయైన తన్ను నలచక్రవర్తి యంత వానిని జేసిన జూదము నిమిత్తము నతండు వినియోగించు చుండెను. ఈ వృత్తి యవలంబించిన తరువాత నెప్పటి కప్పుడు కావలసినన్ని ధాన్యము, లెక్కలేనన్ని పీటలు, నెంచరాని చెంబులు తినుటకు వీలులేనన్ని యరటికాయలు కందదుంపలు మొదలగు కూరలు విశేషించి యెన్నోమంచములు నెన్నో పరుపులు నెప్పటి కప్పుడు రొక్కము, కావలసినన్ని బియ్యము మొదలగునవి చేకూరఁ జొచ్చెను. ఎప్పటి కప్పుడీ వస్తువులతో నిల్లు నిండి చాలకపోయెను. విశూచి మశూచి మొదలగు జాడ్యములు ప్రబలినపుడు మంచములు మొదలగునవి స్థలము చాలమి, యింటికి పట్టుకొని వెళ్ళుటకు వీలులేక, యప్పటి కప్పుడె బేరములిచ్చి యమ్మివేయుచుండును, కూరలు కావలసినవారికి తల్లి దానము చేయఁజొచ్చెను. పూర్వము తాను తల్లియు జాపలమీదనే బండుకొనుచు వచ్చిరి. ఇప్పుడు తల్లికి మంచము పరుపు, తనకు మంచము పరుపు, సింహాచలముయొక్క గృహమున మూడు మంచములు మూఁడు పరుపులు, తనస్థితి కొంచెము స్థిరమైనతరువాత గంగాధరుఁడు కొంచెము త్రాడుబారి పురోహితుల కీయవలసినభాగము క్రమక్రమముగ నేదోవంక బెట్టి యెగబెట్టఁజొచ్చె. అందుచేత కొంచెము డబ్బుచేత నిలువజొచ్చెను. అదివరకునల్లమందుకైన సరిగాడబ్బు లేని తల్లి బియ్యము పప్పులు మొదలగునవి యిరుగుపొరుగువారికమ్మి కొంతసొమ్ము చేసికొనియెను. అతని జాతకమావిధముగ మహోచ్చదశ గలిగి పెళ్ళున వెలుగుచున్న కాలములో నతని కొక గొప్ప విపత్తు సంభవించెను. ఇంచుమించుగా గాకినాడ వచ్చినది మొదలుకొని యతని యర్థదేహమైయుండిన సింహాచలము కాలధర్మము నొందెను. సింహాచలము పెద్దదగుటచేత దాని మరణ మంత లోకవిరుద్ధముగ లేకపోయినను గంగాధరుఁడు చిరకాల సహవాసము చేత మిక్కిలివగచి పదిదినములన్నము దినక యేమియుం దోఁచక పిచ్చివానివలె దిరిగి మిత్రుల యారడింపుల వలనను మరికొందరు చేసిన జ్ఞానోప దేశము వలనను ధైర్యముఁ దెచ్చికొని కొంత దుఃఖోపశమనముఁ జేసికొనియెను, కాని సింహాచలము మీఁదఁ దనకు గల యనురాగాతిశయముఁ దెలియఁజేయుటకు దాని పేరుగ నొక్క పిల్లయైనను లేకపోయెను గదా యని పలుమాఱు విచారించెను. అయినను విచారించినఁ గార్యము లేదని గ్రహించి దాని కుత్తరగతులు కలిగింపవలెనని రమారమి యేఁబదిరూపాయలు కర్చుజేసి దాని కులమువాం డ్రందఱు మెచ్చున ట్లుత్తరక్రియలు చేయించి సంతర్పణ చేయించెను. జ్ఞానము వచ్చినతరువాత నతనికిఁ గలిగిన గొప్పకష్ట మిదియె. సింహాచలము బ్రతికియున్నపుడు మూఁడునాలుగు దినముల కొకసారి గంగాధరుఁడు దానికి నల్లమందుఁ గొనితెచ్చి యిచ్చుచుండువాఁడు, గావున నది మృతినొందిన తరువాత నాఱుమసముల వరకు నల్లమందు దుకాణము కనఁబడినపుడెల్ల నతఁడు పట్టరాని దుఃఖము గలిగి యే గోడకో జేరబడి కొంతసేపేడ్చి పోవుచుండును. దైవవశమున సింహాచలము తోడ స్నేహబంధము విడిపోయిన తరువాత గంగాధరుడు నిస్పృహుఁడై మఱి యొకతె సహవాస మపేక్షింపక వివాహముఁ జేసికొనవలయునని దీక్షగలిగి ధనము నిలువఁ జేయదలంచెను. కాని జూదపుపాక వానిప్రయత్నమునకు విఘ్నము గలిగించుచు వచ్చెను. అక్కడకు వెళ్ళకుండవలయు నని యప్పు డప్పు డతఁడు నిశ్చయము జేసికొను చుండును. కాని యభ్యాసముచేత ప్రయత్నము లేకయే కాళ్ళు వాని నక్కడకీడ్చుకొని పోవజొచ్చెను. జూదపుబాక జగన్నాయకపురములో సముద్రపు టొడ్డున నొక మూలగ నుండెను. గంగాధరుఁడు పనిలేనప్పుడు పట్టపగలును; పగలు పనియున్నపుడు తప్పక రాత్రివేళను భాగ్యవంతుని నిర్భాగ్యుని, నిర్భాగ్యుని భాగ్యవంతుని క్షణ కాలములో జేయగల యాద్యూత గృహమునకుఁ పరమభక్తుఁడు దేవాలయమున కరిగిన ట్లరగి యోపిక యున్నంత సమర్పించి వచ్చుచుండును. అతఁడు తీరికగనున్న కాలము సింహాచలము గృహమునకు ద్యూతగృహ్యమునకు సమానముగ విభజించెను. ఇప్పుదు సింహాచలయాత్ర కట్టుబడి పోవుటచే తత్కాలముఁగూడ ద్యూతగృహమునకె వినియోగింపఁ జొచ్చెను.

ఇట్లుండఁ బూర్వము తెనాలి రామలింగము యొక్క పిల్లికి పాలు చూడగనె భయము గలిగినట్లు జూదపుబాక పేరు చెప్పఁగానె గంగాధరున కడలు పుట్టించునట్టి వైపరీత్యమొకటి జరిగెను. ఒక యమావాస్య నాటిరాత్రి యేడెనమండుగురు జూదగాండ్రు మైమరపించు సంతోషముతో జూదమాడ నారంభించిరి. పొరుగూరి నుండి వచ్చిన యొక కాఁపువాఁడు నాటిరాత్రి లక్ష్మీకటాక్ష సంపన్నుఁడై యైదువందల రూపాయలు గెలుచు కొనెను. ఓడి పోయినందువలన గలిగిన పరాభవమునకుఁ దోడై ధన నష్టము జూదగాండ్రకు మేరలేని మత్సరము గలిగించెను. ఆ కాఁపువాడు గెలిచిన విత్తము మూటఁగట్టుకొని స్వగ్రామమునకుఁ బోవ సమకట్టెను. మరల జూదమాడ వలసి దని తక్కిన జూదరులు వానిని బలవంతము పెట్టిరి. ఎంత నిర్భంధించినను వాడుఁ పందెము వేయనని బిఱ్ఱబిగిసి కూర్చుండెను. గంగాధరుఁడుఁ గూడ కాఁపు వానిని జూచి "నీకిది న్యాయము కాదు. అందరిసొమ్ము నీవు గెలుచుకొని మూట గట్టుకొని పోవుట మంచిదికాదు. తెల్లవారినదాక నీ వాడి యప్పటి కెంత సొమ్ముండునొ యది పట్టుకొని పోవుట ధర్మ" మని హితోపదేశముఁ జేసెను. కాపువాడు గంగాధరుని మాటా లెక్క సేయఁ డయ్యె. ఇద్దఱు ముగ్గురు జూదగాండ్రావలకుఁ బోయి యేమో గుసగుస లాడి తిరిగి పాకలోనికి వచ్చిరి. కాఁపువాఁడు మూట పట్టుకొని లేచెను. అప్పు డిద్దఱు జూదగాండ్రు వానిని రెండు తన్నులు తన్ని నేలఁ బడవైచి నోట గుడ్డలు గ్రుక్కి చెప్పుల కాళ్ళతో గొంతుమీఁద ద్రొక్కి గడియలోఁ జంపిరి. అట్లు చేయుదు మని వారు గంగాధరునితో నాలోచింపలేదు. అంత పని జరుగునని యత డెన్నఁడు దలంపలేదు. అతఁ డాజానుబాహుడైనను మున్నెప్పుఁడు గ్రౌర్యమెఱుఁగని బ్రాహ్మణుఁ డగుటచే నతని కాళ్ళు గడగడ వడఁకెను. మేన ముచ్చెమటలుఁ బోసెను. అయ్యో! అయ్యో ! ! యను నవ్యక్త ధ్వని తప్ప యతనినోట మారుమాట రాదయ్యెను. తక్కిన జూదగాండ్రు కాఁపువాని శవమునకు రాళ్ళుకట్టి సముద్రములో బాఱవేయ వలయునని బండల నిమిత్తము వెదకు చుండగా నంతలో దొంగ లాంతరు చేతఁ బుచ్చుకొని జూదపు బాకలోఁ దమ కేర్పడిన మామూలు వసూలు చేసుకొనుటకై ముగ్గురు పోలీసువాండ్రక్కడకు వచ్చిరి. అందులో నొకడు హేడ్డు. తక్కినవాం డ్రిద్దఱు సామాన్య భటులు. ముందుగా వారు పాకలో బ్రవేశించఁ జూదగాండ్రకు నాయకుఁడైన వెంకటస్వామి లేఁడని యొకడుత్తరము జెప్పెను. ఆ పండుకొన్నవారెవరని యొక డడిగెను. రెండవవాఁడు మరికొంత ముందుకు బోయి చూచి "వాఁడు పండుకొనలేదు, చచ్చిపడి యున్నాఁ" డని హేడ్డుతో బదులు చెప్పెను. "ఓరీ తుంటరులారా! కూనీ చేసినారా ? ఇప్పుడు మిమ్ముందఱును బట్టుకొని స్టేషనుకుఁ దీసికొని పోదును. నిలువుఁడు నిలువు" డని హేడ్డధికారముఁ జేసెను. రాళ్ళ నిమిత్తము వెళ్ళిన వెంకటస్వామియు మఱియొకడును వారి రాక జూచి పిక్కల బలమును శరణుజొచ్చి తిరిగి చూడక యొక్క పరుగున నిల్లుజేరిరి. గంగాధరుఁడు తక్క తక్కినవారంద ఱా నరహత్యలో నేదో కొంతభాగము కలవారె. పోలీసువారిని జూడఁగానే గంగాధరుని మీఁది ప్రాణములు మీఁదికి పోయెను. హేడ్డు కోర చూపులు చూచి "యిప్పుడు మిమ్మందరను అరెస్టు చేసి నాము, పాక వదలి వెళ్ళవద్ద"ని హుంకరించి పలికెను. రాజభటులను బ్రసన్నుల జేసికొనుటలో నాఱితేఱిన జూదరులిద్దఱు ముగ్గురందులో నుండిరి. అందొకడు హేడ్డు నావలకు బిలిచి రెందు జేతులు బట్టుకొని యిట్లనియెను. "అయ్యా ! మీరిందులో మమ్మీలాగున శ్రమ పెట్టఁ గూడదు. ఏఁడాదికి మీకు ముప్పదిరూపాయలు మీ కానిస్టేబులు లందఱికి నేబది రూపాయలు, మీ యినస్పెక్టరుగారికి ప్రత్యేకముగా నూరు రూపాయలు, మామూళ్ళిచ్చుచున్నాము. అవిగాక మీపై యుద్యోగస్తులు వచ్చినా రన్నపుడు కోళ్ళు, కోడిగ్రుడ్లు, రెండు మూడుసారులు మేఁకలు, పాలు పెరుగు మీకిచ్చినాము. చిక్కువచ్చినపుడు కాపాడకపోయిన మేమేమి కావలసినది? అతనిని మేము చంపలేదు. వాఁడు జూద మాడుటకు వచ్చిన మాట నిజము. అతనికి రాఁగానే గుండెలలో నొప్పివచినది. జాముసేపు గిజగిజ తన్నుకొని చచ్చినాఁడు. ఇదిగో యైదువందల రూపాయల మూట; అది తమరు పుచ్చుకొని యనుగ్రహించి మమ్మొక దరికి జేర్పవలయును." ఆ మూట చూడఁగానే యతఁడు కూనీమాట మఱచెను. "ఏడిచినట్లెయున్నది, గుండెలలో నొప్పివచ్చి యితఁడు పోయినమాట నిజమైయుండవచ్చును. కాని త్వరగా నేదియొ యొకటి తేల్చుకొండి. రెండుజాములు దాటిపోయినది. మీరు మంచివాళ్ళన్నమాట నాకు తెలియను గనుక వదలివైచినాము. మఱియొకరైతే యీపాటికి మిమ్మందరను స్టేషనులో బెట్టియుందును. ఇఁక మేమిక్కడ నుండగూడదు. మీ పని మీరు చేసికొనుఁ"డని భటుల నిద్దరను వెంటబెట్టుకొని యతఁడు పాపము మూట గట్టుకొన్నట్లె యైదువందల రూపాయలు మూటగట్టుకొని భటులకు జెరియొక పాతికరూపాయ లిచ్చి తన జాతకము మిక్కిలి గొప్పదనియుఁ దనయట్టి యదృష్టవంతుఁడు లేఁడ నియు నెంచికొనుచు నింటికిఁ బోయెను. రాజభటు లరిగిన తరువాత కొందరు జూదరు లా శవమునకు రాళ్ళుగట్టి సముద్రములో పారవైచిరి. అదియెల్ల గంగాధరుఁడు చూచుచు నూరకుండెను. ఆ కార్యము వలదన్న పక్షమున వారు తన్ను గూడ చంపుదురేమో యని శంకించి నోరు మూసికొని యూరకుండెను. శవమును బాఱవైచి జూదగాం డ్రొకఁడు పోయిన దెస కొకఁడు పోవక జారిరి. అందఱు వెళ్ళినతరువాత గంగాధరుఁడు మిక్కిలి భయపడుచు మాటిమాటికి వెనుకకు ముందునకు జూచుకొనుచు నులికిపడుచు జగన్నాయకపురము దాటి కాకినాడ వెళ్ళి యొక యరుగుమీదఁ బండుకొని నిద్రపట్టక కాఁపువాని విగ్రహమె మాటిమాటికిఁ గన్నులముందర గనబడ వెరగందుచు లేచి కూర్చుండి తెల్లవారునఫ్పుడేటికిఁబోయి స్నానముచేసి యా దిన మన్నము దినక యే పనియుఁ జేయజాలక జబ్బుగానున్నదని ముసుగు పెట్టుకొని పండుకొని "యిక ముందెన్నడు జూదమాడకూడదు. నాయెత్తు ధనముపోసినను జూదపు బాకలోనికి వెళ్ళఁగూడదు, నేటితో నాకు బుద్ధివచ్చిన" దని నిర్ధారణము జేసికొనియెను. చేసికొనుటయేగాదు ఆనిర్ధారణము ప్రకారము యావజ్జీవము నడచుకొనియెను. ఎప్పుడైన జూదముమీద ధ్యానము పారెనా నాటిరేయి దారుణకర్మ యతనికి జ్ఞాపకమువచ్చి యా సంకల్పము మరల్చుచుండును. సింహాచలము మృతినొందుట చేతను జూదముమీఁద వైరాగ్యము పొడముటచేతను వివాహము గురిచేసుకొనుటచేతను గంగాధరుఁడు కొంతసొమ్ము నిలవఁజేసెను. అతని యిల్లు ధనధాన్య సమృద్ధిగలదై వెలయుచుండెను. పలుమారు చూచి మందపల్లి నివాసుఁడైన కోట కోనప్ప యను బ్రాహ్మణుఁడు పిచ్చమ్మ బ్రతిమాలినమీదట రెండు సంవత్సరముల వయస్సుగల తన కూతురిని నాలుగు వందల రూపాయలు పుచ్చుకొని గంగాధరున కీయ నిశ్చయించెను. అప్పుడు గంగాధరునకు నలుబది సంవత్సరములు వయస్సు. ముక్కుపచ్చలారని చిన్నబిడ్డను నలుబదియేండ్ల వాని కిచ్చి పెండ్లి చేయుచున్నావాయని కోనప్పను కొందరడుగ నత డిట్లనియెను. దైవానుగ్రహము కావలెను కాని చిన్నయేమిటి పెద్దయేమిటి,మొన్న నీ మధ్య పదియేండ్లపిల్లను పదియాఱేండ్ల పిల్లవానికిచ్చి లక్షాధిపతియైన యొక బ్రాహ్మణుడు వివాహము జేసినాఁడు. మూఁడు నెలలు తిరగకుండఁగనే పిల్లవాఁడు పోయినాఁడు. మా పినతండ్రిగా రరువదియేండ్లు వచ్చిన తరువాత పెండ్లి జేసికొని నలుగురు కొడుకులను కన్నాఁడు. అదృష్టము ప్రధానము కాని వయస్సుకాదు. అది యదృష్టవంతురాలైన పక్షమున మందేశ్వర స్వామివారి యనుగ్రహముచేతనైనను దానికడుపున నాలుగు కాయలు కాయకపోవు. ఇంతకు గంగాధరునియొక్క వంశము నిలబెట్టి పున్నెము గట్టుకొనవలెనని మంచి యుద్దేశముతో పిల్లనిచ్చుచున్నాను. కాని యెల్లవారివలె నేను కేవలము డబ్బే ప్రధానముఁ జేసికొని పిల్ల నిచ్చుచున్న యాశాపాతకుడను కాను. భాగ్యవంతునకు భూములున్న వానికి బ్రతిమాలి యెవరో యొకరు కాళ్ళు కడిగి వరదక్షిణనిచ్చి కన్యాదానము జేయుదురు. ఇటువంటి వానికి పిల్లనిచ్చుటయే యిచ్చుట. పిల్లమీద నాలుగువందలు పుచ్చుకొన్నప్పటికి మా కవి పెండ్లి కర్చులక్రింద సరిపోవును. అందులో మిగులునదిలేదు. మేము తిన్నదిలేదు. వట్టి యల్లరేకాని నాకిందులో లాభములేదు. ఒకవేళ పుచ్చుకొనుట దోషమైనప్పటికి వంశము నిలిపిన పున్నె మెక్కడిపోవును. వరుఁడా దిట్టమైనవాడు. కావలసినవాఁడు. మా పెద్దలు వాళ్ళ పెద్దలు గలసి యొక కుటుంబము లాగున నుండెడివారు. పెండ్లి కుమారునకు ముక్కు వంకర కన్ను వంకరలేవు. అన్నోదకము లిచ్చి యాలు బిడ్డలను బోషింపగల సమర్థుఁడు. సాంప్రదాయము మాట మనము వేరే నెంచుకొన నక్కఱలేదు. కాదాయెనంటె నీళ్ళుమోసి నాఁడా? దానికేమి, డబ్బులేనప్పు డేపనియైన జేయవచ్చును, అందుచేత నేను గంగాధరునకు నాబిడ్డను తప్పక యిచ్చెదను.

అనుకొన్నట్లు వివాహము జరిగెను. వివాహములో బెండ్లికూఁతురు మారము పెట్టి యరఁటిపండ్లు దిన్నందున జలుబుచేసి జ్వరమువచ్చి బాలపాపచిన్నె గనఁబడెను. కాని యగ్గిపెట్టెలు బొగచుట్టలు గంగాధరునియెద్ద నెప్పుడు సిద్ధముగ నుండుటచే నతఁడు బ్రహ్మాస్త్రమువలె పొగచుట్టదెబ్బ ప్రయోగించి భార్యను బ్రతికించు కొనియెను. పొగచుట్ట కాల్చుట దోసము కాదనియు నొకా నొకప్పు డది మహోప కారక మనియు దానివలన నెన్నో ప్రయోజనములు కల వనియు నప్పుడు గంగాధరుడు తన చుట్టుజేరిన బంధుగణము నకు జెప్పి చక్కని లంకాకుచుట్టలు హోమము జేసినపక్షమున దేవతలు సయితము దానివాసనలకు సొక్కి మనము చెప్పినట్లు విందురని యుపన్యసించి దాని రుచి దాని వాసన దానిషోకు నెఱుగని పరమ శుంఠలు గొందఱు వైదికులు తప్పందురు. కాని దాని సారస్య మెఱిఁగిన వారు దానిని మెచ్చుకొని యుందుదురని వక్కాణించి యదివర కలవాటు లేని వారందఱు నింకమీఁదనైన యలవాటు చేసికొని సౌఖ్యమనుభవించ వలసినదని హెచ్చరించి కట్టకడపట నిట్లనియెను. "నాకే శంకరాచార్య స్వాములవారి యధికార మున్నపక్షమున చుట్టకాల్చని చచ్చువెధవ లందఱిని వెలి వేయక పోదునా? ప్రతిదొడ్డిలోను పొగాకు మొక్కలు నాటించనా? చుట్ట కాల్చినవారి శరీరము వజ్రశరీర మగును. వాని కెప్పుడు రోగమురాదు. లంకపొగాకు కషాయము కాచి మూఁడు పూటలిచ్చిన పక్షమున యజ్ఞములు చేసిన సోమయాజులు వారికి శాస్త్రులవారికి ఛాందసము వదలిపోవును."

పెండ్లి సలక్షణముగ జరిగెను. పరిణయా నంతరమున గంగాధరుఁడు కాకినాడకు బోయి యెప్పటియట్ల తన వృత్తి యందుండెను. కాలక్రమమున సింగమ్మ బాలారిష్ట దోషములు గడచి పదమూఁడవ యేట రజస్వ లయ్యెను. ఏబదిమూఁడవ యేట గంగాధరునకుఁ పునస్సంధాన మయ్యెను. అప్పటికి అతని దురదృష్టవశమున దగ్గు సంభవించెను. కాని శరీరము దృఢముగానె యుండెను. గంగాధరుఁడు పునస్సంధాన మైన తరువాత మామగారి ప్రేరణముచేత గాకినాడ వదలి మందపల్లిలో నొకయిల్లుగొని యందు బ్రవేశించెను. కాపురమునకు వెళ్ళిన నాలుగేండ్లకు సింగమ్మకు వరప్రసాది యై పప్పుభొట్ల వంశ రత్నాకర పూర్ణచంద్రుడై, యీ కథానాయకుఁడైన గణపతి జన్మించెను.