గణపతి/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎనిమిదవ ప్రకరణము

చదువరులారా! మీరెన్నడైన జన్మమధ్యమం దొక పిల్ల పిశాచమును జూచియుందురా? "ఓహోహో ! పిశాచగణములో జేరినవారికె గాని పిశాచములు కనఁబడవు. మేమట్టి పిశాచగణములో జేరిన వారము కాదు కనుక పిల్ల పిశాచమును గాని పెద్ద పిశాచమును గాని జూచి యెఱుఁగ" మని మీరు సంగ్రహముగ నాప్రశ్న కుత్తర మిత్తురు కాబోలు. సరే అట్లయిన క్షమింపుఁడు. పిశాచముల మాట నెత్తదలఁచు కొనలేదు. పోనీ మఱియొక మాట కుత్తరమిండు. మీరెన్నడైన నొక కొండ ముచ్చును జూచియుందురా? చూచియుందురా యని నేను వేరే వేరే యడుగనక్కఱలేదని దలంచెదను. ఏలయన, గొండముచ్చు దర్శనము జేయనివా రెవ్వరుందురు? పండితరాయలని ఢిల్లీశ్వరునిచేత బిరుదు పొందిన జగన్నాధ పండితుడు చెప్పినట్లు మహోన్నత వృక్షశాఖలు పీఠములుగ కిచకిచలు సరససల్లాపములు బరుకులు కరపులు బంధు సత్కారముగఁ దోటలలో దొడ్లలో గొలువు దీర్చియుండు నీ కిష్కింధా పురాగ్రహా రీకుల మొగము లెవ్వ రెఱుంగరు? మానవజాతికెల్ల మూల పురుషుఁ డని ప్రకృతి శాస్త్రజ్ఞలచే నిర్ణయింపఁబడి కళత్ర వియోగముచే నంతరాయము లేని యలమట నొంది రఘురామునకు సముద్ర బంధన మందును, లంకా విజయము నందును రావణ కుంభకర్ణాది దుష్టరాక్షస సంహార మందును మిక్కిలి తోడ్పడి చాంచల్యమున కెల్ల నిలయమైన యా మర్కటము నొక్కమారు స్మరియింతురేని మీకిహ పరములు రెండును గలవు. ఇహ మెట్లు కలుగును, పరమెట్లు గలుగునని మీకు సందేహము దోఁచ వచ్చును. పరబ్రహ్మ స్వరూఁపుడని ప్రాచీనులచే వర్ణింపబడి శ్రీరాముని సేవకులని దలఁచుకొన్నంత మాత్రమున మీ పాపపుంజము భస్మపటల మగును. ఇదే పరము. ఇహమనేది యన, మర్కట రూపము మనసున నిల్చినంత మాత్రమున మన కధానాయకుని రూపు రేఖా విలాసములు కొంతవఱకు దేటపడవచ్చును. ఒక కొండముచ్చున్నదని కొనుఁడు; తోక లేదను కొనుఁడు. అది మనుష్యాంగన యొడిలో నుండి పాలుద్రావుచున్న దనుకొనుఁడు. అది చెట్టు కొమ్మ మీఁద గాక యొకయింట నొక నులకమంచము కుక్కి మీఁదఁ బండుకొన్న దనుకొనుఁడు; దాని మొగముమీఁద తిరుగలి గంట్లవలె మాశూచకము మచ్చలున్న వనుకొనుఁడు; కుడికన్ను మెల్ల యనుకొనుఁడు; కుడి కంటిలో గొప్ప కందిగింజంత కాయ యనుకొనుఁడు. చేతులు మోరులు దిగినవనుకొనుడు, దొడ్డికాళ్ళను కొనుఁడు. మొదటనే గుజ్జురూప మనుకొనుఁడు, ఆగుజ్జునకు దగిన బొజ్జయున్న దనుకొనుఁడు. శరీరమునిండ రోమకళ యనుకొనుఁడు. మనస్సు మఱియొక పదార్థముమీదికి గాని యాలోచన మీఁదికి గాని చలింపకుండ నిశ్చలముచేసి యొక్కనిముసము మీరు ధ్యానము జేయుచు రేని గణపతి రూపము మీకు భావగోచర మగును.

గణపతి సహజముగానె వికృతరూపుఁడు. మశూచికమా మీద మెరుగులు దిద్దినది. మొదలే కోతి; యామీద దయ్యము పట్టిన దన్నట్లు మొదలే కురూపియైన వానికి మశూచికము వికారములు తెచ్చినపుడు వానియంద మిక వేరెచెప్ప వలయునా? గణపతి పుట్టిన రెండుమూడు మాసములకే గంగాధరుని తల్లియగు పిచ్చమ్మ కాలధర్మము నొందెను. గంగాధరుఁడు తన కుమారుఁడు చెడ్డ నక్షత్రమున జన్మించుటచె తనతల్లి మృతినొందె నని విచారించి నాయనమ్మ గండమున బుట్టిన వెధవఁ వీడని తరచుగాఁ దిట్టుచుండును. ఆ గ్రామమున జ్యోస్యుల జోగావధానులను గొప్పజ్యోతిశ్శాస్త్రజ్ఙ డుండెను. గంగాధరుఁ డాయన యొద్దకుఁ బోయి "అయ్యా! నాకుమారుడు పుట్టిన మూడు నెలలకే మాయమ్మ చచ్చిపోయెను. వీఁడి మూలమున నింకెవరు చచ్చిపోవుదురు యని భయ మగుచున్నది. కాబట్టి వీని జాతకము వ్రాసి మీరెవ రెవరి కేమిగండము లున్నవో యేమి శాంతులు చేయవలెనో చెప్పవలె" నని యడిగెను. అనవుఁడు జోగావధానులు మీ పిల్లవాఁడు జన్మించిన తిథి, వారము, నక్షత్రము చెప్పిన పక్షమున జాతకము వ్రాసెదనని బదులు చెప్పెను. అన గంగాధరుఁడు తలయెత్తిపైకిచూచి కొంచె మాలోచించి వ్రేళ్ళుమడచి లెక్కపెట్టి "అయ్యా ! మావాఁడు పుట్టినరోజు సరిగా జ్ఞాపకము లేదు. ఉండండి. ఆలోచించి చెప్పఁగలను. వెంకన్నపంతులుగారి తల్లిగారి నెలమాసికము రేపనఁగా నా రాత్రి దీపాలవేళ నెట్టినాఁడు. నీ కేలాగున జ్ఞాపకమున్న దందురేమో వినండి. మరునాఁడు బ్రాహ్మణార్థమునకు రమ్మని వెంకన్నపంతులు గారు నన్ను పిలవవచ్చినారు. నా పెండ్లాము నొప్పులు పడుచున్నది. పురుఁడు రాకపోయిన పక్షమున రేపు రాఁగలను. వచ్చిన యెడల రానని చెప్పినాను. ఆయన వెళ్ళిపోయిన గడియలోనే వీఁడు జన్మించినాఁ" డని యతఁ డుత్తరము చెప్పెను. సరే వెంకన్నపంతులు గారెప్పుడు పోయినారో నీ వెఱుఁగుదువా? యని జ్యోతిష్కుఁ డడుగుటయు గంగాధరుడు తమ గ్రామములోని కెవరో తూర్పునుండి గొఱ్ఱగేదె లమ్మ దెచ్చినారే అప్పుడు; అదెప్పుడో చెప్పగలను. వినండి అమ్మవారి జాతరి యెల్లుం డనగా నేనప్పు డమ్మవారికి బలి నిమిత్తమై మేఁక కోసము తిరుగుచుండఁగా "వెంకన్న పంతులు గారు పోయినారు. మీరు మోతకు రావలసినద" ని నన్ను" నరిసిగాడు పిలిచి తీసికొనిపోయినాడు. మఱొక సంగతి "కంచరి కామాక్షిగారి పశువులపాక కాలిపోయినరోజండి" యని కొన్ని సంగతులు జ్ఞాపకము చేసెను. ఆ సంగతులనుబట్టి గణపతి యొక్క జన్మదినము జోగావధానులుగారికి స్ఫురింపలేదు. గొఱ్ఱగేదె లెవరు తెచ్చిరో యెప్పుడు తెచ్చిరో యాయనకు జ్ఞాపకము లేదు. ప్రాణము విసికి యెట్టకేల కాయన వెంకన్నపంతులుగా రెప్పుడు పోయినారో యాయన కొడుకు నడిగి తెలిసికొనిరా; దానిని బట్టి నెలమాసిక మెప్పుడైనదో పంచాంగము జూచి మీ పిల్లవాని జాతకము వ్రాసెదను. మూఁడు రూపాయలు మాత్రము తీసికొనిరా యని చెప్పి పంపెను. ఆ సాయంకాలముననె గంగాధరుఁడు మూడురూపాయల ముడుపు చెల్లించి వెంకన్నపంతులు గారి మరణదినము కుమారునడిగి తెలిసికొని వచ్చి చెప్పెను. మరునాడు సాయంకాలమునకె జాతకము వ్రాయఁ బడియెను. జాతకము తాటియాకు మీద వ్రాసి యది గంగాధరునకిచ్చి జోగావధానులు "గంగాధరుఁడూ ! నీవాఁ డఖండ ప్రజ్ఞావంతుఁడై దేశదేశములందు మహాప్రసిద్ధి కెక్కి నీ వంశమున కెంతో పేరుప్రతిష్ఠలు తెచ్చును. ఇంతకు నీయదృష్టము మంచిది. నీ పుణ్యముచేత నీకు సుపుత్రుడు కలిగినాడు. ఇటు వంటి జాతకము నే నెక్కడ చూడలేదు సుమీ, మీయింట నిక నెవరికి గండములు లేవు. ఉన్న గండమేమో ముసలమ్మ మీద కొట్టుకొని పోయినదని స్తుతించి సంతోషపఱచి పంపెను. గంగధరుఁడు తనకొడు కేరాజు నొద్దనైన మంత్రియే యగునో లేక చతుశ్శాస్త్ర పండితుఁడే యగునో ధనము సంపాదించి కోటికి పరుగెత్తునో సర్కారువారియొద్ద గొప్ప యుద్యోగము చేయునో యేదో గొప్ప యైశ్వర్యము కుమారున కున్నదని పలుకుచుఁ దన యింట నెవరికి మఱి గండములు లేవని చెప్పినందుకు మిగుల సంతుష్టి నొందుచు జాతకమున్న తాటియాకు నింటికి బోయి పడమటింటి వసారా చూరులో విభూతిబుట్ట కట్టిన చోటునకు సమీపమున దోసెను. జోగావధానులుగారి జ్యోతిష్యము గణపతి విషయమున మిడతంబొట్టు శకునము వలె గొంతవరకు నిజమయ్యెను. దేశదేశములయం దతడు ప్రఖ్యాతుఁడగు నను మాట యక్షరాల నిక్కమయ్యెను. ఇఁక మీద గండములు లేవని యాయన చెప్పిన మాటమాత్ర మబద్ధమయ్యెను. వరప్రసాదివలె జనియించిన యీ కుమారుని ముద్దు ముచ్చటలు కన్నులార జూచి యానందించుటకును జాతకములో సూచింప బడిన ప్రకారము కుమారుఁడు ప్రసిద్ధి పురుషుఁడై యుండగా గనుగొను భాగ్యము గంగాధరునకు లభియించినది కాదు. గణపతికి నాలుగేండ్లైన నిండక మునుపే గంగాధరుఁడు మృతి నొందెను. గణపతి కప్పటి కుపనయనము కాకపోవుటచే గంగాధరున కుత్తరక్రియలు బాలకుని మీఁదనె కర్తవ్యము పెట్టి మేనమామ చేసెను. గంగాధరుని యొద్ద నున్నఁ ధన మతఁడుండఁగానే చాల మటుకు వ్యయమయ్యెను. మిగిలిన దతఁడు పోయిన సంవత్సరము లోపుననె కర్చుపడెను. సంసారము మొదటికి వచ్చెను. గణపతి మాతృసమేతముగ మేనమామ యింటనె ప్రవేశించెను. అతని స్థితి కొంచెము బాగుండుటచే నతఁడు మేనల్లుని దోబుట్టువును గొంతకాలము పోషింప గలిగెను. గణపతికి గర్భాష్టమం దుపనయనము జరిగెను. బలిచక్రవర్తిని వంచించుటకై పూర్వకాలమవతరించిన వామనమూర్తియొక్క యవతార మన్నట్లు, కర్కోటకుడు కఱచినపిదప బాహుకుండను పేరుతో ఋతుపర్ణు నాశ్రయించి యున్న సాక్షాన్నల రూపమట్లు చూచువారి కెంతో నవ్వుపుట్టించుచు గణపతి భూమికి జానెడై వడకపెండ్లికొడుకై పీటలమీఁదఁ గూర్చున్నప్పుడు చూచినవారిదె యదృష్టము. గాయత్రీ మంత్ర మతనినోట నుచ్చరింపఁజేయుట పురోహితుని తరమైనది కాదు. గాయత్రీ మంత్రము వచ్చుగాక రాకపోవుగాక మెడలో జందెము పోగులు మాత్రము పడెను. అక్షరాభ్యాస మైదవయేటనే యైనను నుపనయనమైన తరువాతనె గణపతిని బడికి పంపించిరి. చదువు సంధ్యలు రెండును సమానముగానె వచ్చెను. గణపతియొక్క తెలివితేటలకు గాయత్రి మంత్రముపదేశించు నపుడు పురోహితుఁ డెంత సంతోషించెనో యోనమాలు చెప్పునపుడు వ్రాయించునపుడు పంతులుకూడ నంతే సంతోషించెను. గణపతిని బడి కంపుట తల్లికి, మేనమామ నష్టకష్టములలో నొక కష్టమయ్యెను. గణపతి పాఠశాలకు బోవు నప్పుడు జరిగెడు నుత్సవమును భాగవతము, జలక్రీడలు మొదలగు నాటలు జూచుటకు బోయినట్లె పోయి యూరులో ననేకులు తీరుబడి చేసికొని చూచి సంతోషించుచుందురు. గణపతి యాకారము చేతను వయస్సు చేతను మిక్కిలి కుఱ్ఱవాఁడైనను వానిని బడి కొక్కడు తీసికొని పోవజాలఁ డయ్యెను. ఆ పని తల్లికి సాధ్యము కాకపోయెను. పంతులుగారు చింతబరిక పుచ్చుకొని ప్రతి దినము నుదయమును సాయంకాలమునను బొరియలవంటి నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని రావలయును. ఆ నలుగురు యజ్ఞపశువును బడద్రోసినట్లు గనపతిని నేలబడద్రోసి కాళ్ళిద్దరు చేతులిద్దరు బట్టుకొని తీసుకొని పోవుచుందురు.

గణపతి సమయోచితముగ వీలువెంబడి తన పాలిటి యమ కింకరులవంటి యానలుగురు పిల్లలను గోళ్ళతో బరికియు గిల్లియు వాడి పండ్లతో గరిచియుఁ గాళ్ళతో దన్నియు నిట్టట్టు విసిరి తలతో గొట్టియు మీఁద నుమిసియు నోటికి వచ్చినట్లు తిట్టియు నూరందరు జేరునట్లు కేకలు వైచియుఁ పూట పూటకొక నాటక మాడుచుండును. పంతులుగారు వజ్రాయుధమువంటి చింతబరికెలతో నెడనెడ వీపుమీద సమయోచితముగ వడ్డించుచుండును. బరకులు కరపులు తన్నులు, గిల్లులు మొదలగు బహుమానములలో గురువు గారికి భాగము లేకపోయినను శరపరంపరలై వెడలు తిట్లలో మాత్ర మాయనకు పెద్దభాగమె వచ్చుచుండును. బడికి వెళ్ళిన తరవాత సయితము గణపతి గురువుగారిని సుఖముగ నుండ నిచ్చువాఁడు కాడు. కన్నుమూసి తెరచునంతలో నతఁడు మాయమగు చుండును. చుట్టుప్రక్కల వెదకి వెదకి పంతులు కనుగొనలేక విసుగు చుండును. బడిపేరు చెప్పగానె గణపతికి నడుము నొప్పి కాళ్ళతీత కడుపునొప్పి, గుండెపోటు, తలనొప్పి మొదలగు రోగములు పొడచూపుచుండును. ఈ రోగములు నప్పుడప్పుడు పంతులుగారు బెత్తము నుపయోగించి చికిత్సలుచేసి కుదర్చుచుందురు. ఎన్నిమారులు చికిత్సలు చేసినను వాని కారోగము మాత్రము కుదరలేదు. ఎల్లరోగములు చికిత్సలకు సాధ్యమగునా? బడిమాని యేపని చేయమన్నను మన గణపతికి పరమానందము. బడిపేరు చెప్పగానే యతని మొగము వెలవెలబోవును. ఈ మహాపద దప్పించుకొనుటకై యతఁ డెన్నో యుపాయములు పన్నజొచ్చెను. తెల్లవారుచున్న దనఁగానె యతని కెంతోభయము. ఏలయన మేనమామ బడికి పొమ్మనును. అందుచేత నతఁడు దినమంతయు రాత్రిగానె యుండవలయునని కోరుచుండును. పంతులుగారికి రోగము రావలయునని యతఁ డెన్నిమారులో కోరెను. కోరుటయెగాదు, ఒకసారి చీకటితోనే లేచి కాకులు కూయకమున్నె యమ్మవారిగుడికిఁబోయి తలుపు దగ్గఱ నిలిచి "అమ్మవారా తల్లీ మా పంతులుగారికి విశూచి జాడ్యమైన మరి యేరోగమైన దెప్పించి చంపితివా నీకు బలిసిన కోళ్ళను రెంటిని యెత్తుకువచ్చి బలి యిచ్చెదను. లేదా ముష్టియెత్తియైన మంచి మేఁకపోతును బలియిచ్చెద" నని దండముపెట్టి మ్రొక్కుకొనెను. కాని ఆ యమ్మవారి కతఁ డేమి విషము పెట్టెనో కాని యతని మ్రొక్కులు సరకు గొనక పంతులు జోలికి పోక యారకుండెను. ఎన్నోమారులు చలిది నైవేద్యములు వేఁడి నైవేద్యములు చలిమిడి పానకములు గ్రహించి యొకటి రెండుసారులు గరగలుకూడ గైకొని యాదేవత యవసరము వచ్చినపుడు కృతఘ్నురాలై తన పనిచేయక తనయెడ ననాదరణము చూపినందుకు గణపతి కెంతో కోపము వచ్చినది కాని యమ్మవారగుట చేత తనకేదేని యాపదగలిగించునను భయముచేత నామెను దూషింపక యూరకుండెను. బడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కడుపునొప్పి బాధ నభినయించి యూరక వామురసము శొంఠిరసము ద్రాఁగుచుండును. తలనొప్పి లేకపోయినను రెండు కణతలు పట్టుకొని చాలభాధ నభినయించి కణతలకు శొంఠి గంధము మెత్తును. బడికి బోవకుండుటకై యత డెన్నోసారులు రోగము పేరుచెప్పి మిరియాల రసముగూడ ద్రాగెను. ఒకనాడు గణపతి నడుము నొప్పియని బడిమానగా మేనమామ చిత్రమూలరసము తీయించి పట్టు వేయించెను. దాని మంట కయిన నతఁడు సహించెను కాని బడికి పోవుట కిచ్చగింపఁడయ్యె. ఒకటి రెండుసారు లాదుండగుఁడు గాజు పెంకుతో దన శరీరము గీచికొని కోతిపుండు బ్రహ్మరాక్షసియగునట్లు దానిని గొప్ప పుండు చేసికొని యెన్ని మందులు వైచినను పుండు మానకుండునట్లు ప్రయత్నముచేసి కొన్ని దినములు బడిమానెను. పాఠశాలాపత్తు తప్పించుకొనుటకై యతడు దాఁగని చోటు లేదు. ఎక్కని చెట్టు లేదు, దూరని డొంకలేదు. ఒకనాఁడు పొణకలోఁ గూర్చుండును. ఒకనాఁ డటకమీద నెక్కి కనబడకుండును. పాడుగృహములలోఁ గూర్చుండును. గణపతి బుద్ధి పాదరసమువంటి దగుటచేత బడియాపదఁ దప్పించుకొనుటకై యత డెన్నో ప్రయత్నములు చేసెను. కాని జీవచరిత్రలు సరిగా వ్రాయువారు లేకపోవుటచే నవియెల్ల మనకు దొరికినవికావు. చదువరుల యదృష్టవశమున నటువంటి వొకటి రెండు మాత్రము లభించినవి. అటువంటివి లభించినప్పుడు వ్రాయక పోవుట చరిత్రయెడ మహాదోషము జేయుటయని గ్రంథవిస్తర దోషమునకైన నొడఁబడి వాని నీక్రింద నుదాహరింపవలసివచ్చెను. గణపతి కొకనాఁడు తెల్లవారుజామున నాలుగు గడియల ప్రొద్దుండఁగా మెలకువ వచ్చెను. పెందలకడ మెలఁకువ వచ్చినప్పుడు దైవప్రార్థనము జేసుకొనవలసినదని తల్లియు మేనమామయు నతినితో జెప్పుచుందురు. కాని యట్టిపనిఁ జేయుట కతనికెన్నడవకాశము చిక్కలేదు. తెల్లవారుచున్న దనగానే పంతులు గారు, పాఠశాల పంతులుగారి చేతిలో బెత్తము వాని కన్నులకు గట్టినట్లెదుట కనఁబడుచుండును. ఆ యాపద నెట్లు తప్పించుకొన వలయునని యుపాయములు వెదకుటతోడనే కాలము వెళ్ళిపోవుచుండును. ఆ నాఁ డతఁడు తెల్లతల్లవారుచుండఁగా లేచి దొడ్డిదారికి పారిపోయి చాకిరేవు కరిగి పెద్ద చాకిబానక్రిందదూరి కూర్చుండెను. నాలుగు గడియలు ప్రొద్దెక్కిన తరువాత చాకలివాఁడు రేవునకుఁ బోయి తన గూననెత్తిచూచునప్పటికి దానియడుగున గణపతి కూర్చుండియుండెను. పంతులు తనజాడ తెలుసుకొని వచ్చెననుకొని గణపతి గూన యెత్తగానె పాఱిపోయెను. తన గూన బగులగొట్టుటకు వీఁడెవఁడో ప్రయత్నము జేయుచున్నాఁడని చాకలి వానిని దరముకొనిపోయెను. లేడివలెఁ పఱుగెత్తుచున్న యా డింబకుని బట్టుకొనలేక మరలి వచ్చెను. మఱియొకనాఁడు బడికి బోవనందుకు మేనమామ కోపించి యీతజువ్వతో నెత్తురు వచ్చునట్లు కొట్టెను. ఆ సాయంకాలము మేనమామ వీధిలోనికి వెళ్ళినతరువాత నేనీ దెబ్బలు తినలేను. చచ్చిపోవుచున్నానని గణపతి తల్లితోఁ చెప్పెను. తల్లి బతిమాలి కోమటింట నటుకులు బెల్లము జీడెలు గొనిపెట్టి యోదార్చెను. గణపతి యవియెల్లభక్షించి మేనమామ నెట్లయిన లొంగదీయవలయునని సంకల్పించి రాత్రియైన తరువాత నిల్లుకదలి వెళ్లుట కతనికి మిక్కిలి భయమగుటచేత తనవంటి దుండగునే మఱియొకనిని సాయము రమ్మని వాని సహాయమున మేనమామ భోజనము చేయుచుండగా దొడ్డిలోనికిఁ బోయి యాపిల్లవాఁడును దానును దోడుపట్టి రాయియొకటి నూతిలోఁ బడ వైచిరి. ఆ చప్పుడేమిటని మేనమామ తల్లినడిగెను. అంతలో గణపతి సహాధ్యాయి యైన బాలుడు వచ్చి మీపిల్లవాడు నూతిలో బడినా డండోయియని కేకవైచి పారిపోయిను. మేనమామ భోజనమువదలి అయ్యో! అయ్యో ! యని లేచెను. సింగమ్మ అయ్యో కొడుకో, అయ్యో కొడుకో నేనేమి జేతునురా తండ్రీ యీ దిక్కుమాలిన చదువు నీ ప్రాణము కోసము వచ్చినదిరా తండ్రీ యని గుండెలు బాదుకొనుచు నేడ్చుచు మొత్తుకొనుచు దనయన్న గారిం దిట్టుచు బడిపంతులను దూషించుచు దైవమును దూఱుచు దన యదృష్టమును నిందించు కొనుచు నూతికడకు బోయి నూతి చుట్టు దిరుగు చుండెను. ఆ గోల విని చుట్టుప్రక్కలవా రందరు జేరిరి. మేనమామ తాళ్ళు దాగరలు నిచ్చెనలు మొదలైనవి సిద్ధము చేసి యీతనేర్చిన సాహసుల నిద్దఱను బాలుని వెదకుటకై నూతిలో దింపెను. ఎంత వెదకినను బాలుఁ డగుపడలేదు. ఊబిలో గూరుకు పోయి నాఁడని కొందదు పడగానె చేపలు తినివైచినవని కొందఱు బావిలో బాలుఁడు పడలేదని కొందఱు ననజొచ్చిరి. సింగమ్మ తానుగూడ నూతిలోదిగి చచ్చెదనని నూతియంచుపై గూర్చుండెను. అక్కడ నున్న వారందఱు పట్టుకొని యాత్మహత్య జేసికొన గూడచని మందలించి యిల్లుచేర్చిరి. పిల్లవాఁడేమై యుండునని మేనమామ తలపోయ జొచ్చెను. నిన్ను బెదరించుటకై కుఱ్ఱవాఁ డీయల్లరి చేసియుండును, కానికుఱ్ఱవాడు నూతిలో బడలేదని యక్కడ చేరినవా రతనితోఁ జెప్పిరి. కళేబరము కనఁబడక పోవుటచే సింగమ్మకుగూడ తనకొడుకు బావిలోబడలేదని నమ్మకము కలిగెను. ఆ రాత్రి తల్లియు మేన మామయు నిద్రపోలేదు. రెండుజాములైన తరువాత వారి యింటిపొరుగుననున్న యొకబ్రాహ్మణుడిద్దఱు బాలకుల బట్టి తోడ్కొని వచ్చి యిందులో మీపిల్లవాఁడు, ఈ తోడిదొంగ లిద్దఱు జేసిన దుండగమిది. అంతే కాని నూతిలో బడలేదని చెప్పి వప్పగించెను. తల్లి గణపతిని జూచి "నాయనా! బ్రతికివచ్చితివా" యని కౌఁగిలించుకొని యేడ్చెను. మేనమామ గుండెబాదుకొని యెంత దుర్మార్గుడవురా నీ నిమిత్తము నాప్రాణమెంత యలజడి పడినదిరా? ప్రాణ నష్ట మటుండగా లోకములో నా కెంతో యప్రతిష్ట వచ్చినదని నేనెంతో కుళ్ళి యేడ్చుచున్నాను. సరే; నాయదృష్టము బాగుండబట్టి నీకు నూతిలో బడవలయు నని యిచ్చ లేకపోయిన దని తన చెల్లెలిని నుద్దేశించి "ఓసీ ! సింగమ్మా నీ కొడుకుతో నేను వేగలేను. నా యెముకలు చిట్లము కట్టి పోవుచున్నవి. వీనికోసము నేనెన్నో బాధలు పడియున్నాను. ఇకమీద నేను పడజాలను. అల్లరి పిల్లవాడై నప్పుడు కొట్టవలసి వచ్చును. మంద లించగానె నూతిలోపడి గోతిలోపడి చచ్చిపోవుదు నని బెదరించిన పక్షమున నే నెట్లు వేగ గలను. నేను కొంతకాలము మిమ్ములను సంరక్షించినాను. ఇక మీఁద మీ యిష్టము వచ్చిన చోటికి వెళ్ళి పొండు యని కఠినముగ బలి కెను. ఆ పలుకులు విని సింగమ్మ కంట దడి పెట్టుకొని "అన్నయ్యా! నీవాలాగున నంటే నేనిఁక గంగాప్రవేశము కావలసినదే. పిల్లవాఁడల్లరి చేయునపుడు శిక్షింపవద్దని యెవ్వరన్నారు. నేనుమాత్రము కొట్టనా తిట్టనా? కాకపోయినా వీఁడు బండ వాడగుటచే నాకిన్ని పాట్లు వచ్చిన" వని తనకొడుతో వచ్చిన రెండవ పిల్లవానిని చూచి "యీ దొంగ పిల్లవాఁడే మాపిల్లవాని బుద్ధి విరిచి పాడుచేయుచున్నాఁడు. అంతకు ముందింత పాపము లేదు. వీఁడెవఁడో మాయింటికి మారకుఁడు బయలు దేఱినాఁడు. నూతిలో మా వాఁడు పడనిదె పడినాఁడని కేకవైచి పాఱిపోయినాడు. ఈపాడు పిల్లల మూలమున నేను బ్రతుక లేకున్నాను. మా యింటికి రావద్దంటే మానరు. ఇది నా కర్మ" మని మొత్తుఁకొనెను. అప్పుడు సింగమ్మతో సోదరుఁ డిట్లనియె. "నేఁడు మొదలుకొని నీకొడుకు నా చెప్పుచేతలలో నున్న పక్షమున నాచేతనైనట్లు నేను బాగుచేసెదను. నేను కొట్టినను, తిట్టినను పడవలయును లేదా మీకు, నాకు సరి. ఈ మాటు నీకొడుకు పాఱిపోయినాఁడా కాలికి బొండ వైచెదను." అనవుడు సింగమ్మ "నీయిష్టము వచ్చినట్లు చేయవచ్చు నాయనా ! చదువు రాక పోయినప్పటికి బుద్ధి కొంచెముంటే చాలునని నే నేడ్చుచున్నాను. బుద్ధికూడ లేకపోయినది కదా!" యని యేడ్చెను. అక్కడ చేరినవారు తలకొక మాట యని యెవరిదారిని వారు జారిరి. సింగమ్మ కుమారుని పండుకొనబెట్టి తానును కొంతసేపు విల పించెను. ఆమె సోదరుడును తన గదిలోనికిఁ బోయి నిద్రించెను. మరునాటి నుండి గనపతి యెప్పటియట్లె బడి పెద్దపులి యని భావించి యా గుమ్మ మెక్కక పోవుటయేగాక వేళకు భోజనము నకు రాక యెంత వెదకిన గనఁబడక రాత్రులుమాత్ర మింటికి వచ్చుచుండెను. మేనమామ విసిగి బండ చేయించి గణపతి కాలికి దగిలించెను. అతనిం జూచుటకు విద్యార్థులు తీర్థ ప్రజవలె వచ్చిరి. అభిమానధనుఁడైన గణపతి వారిని జూచి మొదట సిగ్గుపడియెను. కాని తరువాత సిగ్గు పడవలసిన యవసరము లేదనుకొని యెప్పటి యట్ల ముచ్చటలాడుచును మనసు గలసిన మిత్రులను బిలిచి యెవరు లేనప్పుడు వారితో "నోరీ ! మా మామ లోపల భోజనము చేయునప్పుడు దొంగతాళము తెచ్చి నా బండదీసి నన్ను వదిలించరా! హాయిగా మనమిద్దఱము తిరగవచ్చును" నని హెచ్చరించు చుండును. అతని యుపదేశ ప్రకార మొక రిద్దరతని కొకటి రెండు సారులు సాయము జేసిరి. ఈసారి యతఁడు సాయంకాల మింటికి రాక స్నేహితుల యిండ్లనె విందు లారగించుచు మేనమామకు నాలుగైదు దినములవఱకు గనఁబడక పోయెను. కనఁబడగానే మేనమామ యల్లునకు మొట్టికాయలు, గుద్దులు, చరపులు, చెంపకాయలు, తొడపాశములు కానుక యిచ్చి యలుకదీర్చి యింటికి దీసికొని వచ్చెను. ఇప్పటికి గణపతికి పదియేండ్లు నిండెను. అప్పుడప్పుడు పంతులు గుంటయోనమాలు వ్రాయించి చెప్పిన చదువుటవలన నైదు బరులు గుణింతములు నేర్చి పుస్తకము పట్టెను. మఱి రెండు సంవత్సరముల పాటు చదువుకొన్న పక్షమున దన కొడుకు బడిపంతులుపని చేసియైన నింత యన్నము దెచ్చుకొని తినగలఁడని తల్లి దలంచు చుండెను. కాని దానికి దగిన యవకాశములు గణపతికి గలుగవయ్యెను. మిత్రు లెక్కువైరి. వ్యాపారము లధిక మయ్యెను. ఇంట తీరిక నిముసమైన నిలుచుటకు లేకపోయెను. కష్టపడి చీట్ల పేక యాడుట నేర్చుకొనియెను. తురుపులాట దొంగాట పట్లాట మొదలగు వానియందెంతో నేర్పరి యయ్యెను. డబ్బు పెట్టి పేకాడవలయునని యతని కుత్సాహము కలిగెను. కాని పాపము ! దైవ మతనిని భాగ్యవంతుల యింట బుట్టింపక నిఱుపేదల యింట బుట్టించెను. "ధన మూల మిదం జగత్త" ను మాట మొదటిసారి యతనికిఁ దోచెను. ఆ యాట నారంభించిన తరువాత మేనమామ విభూతిబుట్టలో వైచుచున్న డబ్బులు తల్లి తన వదినెగారు చూడకుండ బియ్యమమ్ముఁకొని యుప్పబుట్టలోను గూటిలోను దాఁచుకొన్న డబ్బులు మాయమైపోవ జొచ్చెను. మేనమామ కప్పు డప్పుడు మేనల్లుని మీద ననుమానము కలిగి యావిషయము చెల్లెలి కెఱిఁగింప యామె యభిమానము చేతనో నిజముగా నమ్మి యుండుట చేతనో "అన్నయ్యా ! నీ మేనల్లుడు దగ్గఱ మఱియే దుర్గుణ మున్నదన్న నొప్పుకొనవచ్చును. కాని దొంగతన మున్నదని యొప్పుకొనలేను. ఇదివఱ కెన్నడు జూడఁ లేదు. చూడని మాటలు మన మనగూడదు. దుండగుఁ డగుట చేత వీఁడే పాపములకెల్ల భైరవుఁ డని యపవాదము వచ్చు చున్నది. విఘ్నేశ్వరుని చవితినా డక్షతలు నెత్తిమీఁద వైచికొనకుండ ముందుగా జంద్రుఁని జూడవద్దని నేనెన్ని మాట్లు చెప్పినను వినఁడు. విన నందుకు దానిఫల మనుభవించుచున్నాడు. ఇంతకు నేను చేసికొన్నపాపము. లేకలేక వంశాన కొక్కఁడు పుట్టినాడు వానిమీఁద దొంగతనములు వచ్చిపడుచున్నవి. నేనేమి చేయగల" నని యుత్తరము చెప్పెను. "సరే ముందు ముందు నీకే తెలియగల" దని సోదరుఁ డూరకుండెను. తల్లియు మేనమామయు డబ్బులు జాగ్రత్త పెట్టి దాఁచుకొన జొచ్చిరి. అప్పుడు పేకాటకు పైకము దొరకక గణపతి పొరుగిండ్లకుఁ బోయి యధాసందర్భముగ దొరికినంత వఱకు హస్తలాఘవము చేసి యాటలలో పడిన ఋణము దీర్చి కృతకృత్యుఁ డగుచు వచ్చెను. పేకాటలోని స్నేహితులు చాలమంది పొగచుట్టలు కాల్చువారగుటచేత గణపతిగూడ చుట్టలు కాల్చవలయునని సరదా పుట్టెను. ముందుగా సరదా తీర్చుకొనుటకై గోగుపుల్లలు కాల్చెను. తరువాత నచఁటి చొరుగు చుట్టలుచుట్టి కాల్చి కొంతవఱ కుత్సాహము దీర్చికొనియెను. కాని మిత్రులందఱు బొగచుట్టలు కాల్చుచుండగాఁ దానచఁటి చొరుగు చుట్టలు కాల్చుట తన కెంతో యవమానకరముగ నుండెను. అందుచేత నతఁడు బొగచుట్టలే కాల్చువలయునని నిశ్చయించుకొని యనుభవముగల స్నేహితులతో నాలోచించి పాటియాకు మిక్కిలి గాటుగానుండి వికారపెట్టును. కావున గాటు తక్కువగ నున్న లంకాకుచుట్టలు కాల్చుట మంచిదని యొక స్నేహితు నడిగి యొక చుట్ట బుచ్చుకొని కాల్చెను. అది వికారపెట్టెను. వమనమయ్యెను. మిత్రు లతని నొక చాపమీఁద బండుకొనబెట్టి కొంచెము చింతపండు దెచ్చి యతని నోటవైచి యుపచారములు జేసిరి. వికారపెట్టినదికదా, ఇది స్పృశింప గూడదని గణపతి తలంపలేదు. తన సంగడి కాండ్రందఱు వికారము లేకుండ యధేచ్చముగ గుప్పుగుప్పన లంకాకు చుట్టలు బాటియాకు చుట్టలు కాల్చి సుఖించుచుండగా వికారపెట్టినదని తన యొంటికి సరిపడదని తా నది కాల్చుట మానిన పక్షమున మిత్రమండలిలో దన కప్రదిష్ట సంభవిల్లునని తన్న ప్రయోజఁకుడనుకొందురని భయపడి యశఃకాముఁడగుటచే నెట్లైన వీఁడు చుట్టలు కాల్చుటలో దిట్టయని పేరు సంపాదింపవలయునని నిశ్చయించి కుశాగ్రబుద్ధి యగుటచే నట్లు నిరంతరాయముగ చేయుట కుపాయములు వెదకెను. తదేకధ్యానముతో నున్న యా బుద్దిమంతుని కొక యుపాయము బొడగట్టెను. వికారపెట్టినప్పుడు మొదటనె పాత యుసిరిక పచ్చడి కాని రెండేండ్లనాటి నిమ్మకాయ ముక్కగాని నార దబ్బకాయ ముక్కకాని పాతచింతకాయ పచ్చడికాని నోటిలో వైచుకొన్న పక్షమున వికారమడఁగునని గ్రహించి చుట్టకాల్చుట నిర్వికారముగ నలవా టగువఱకు నెవరినో యొకరి నడిగి యావస్తువులలో నేదోయొకటి తెచ్చి తాగి కష్టపడి యలవాటు చేసికొని దినమునకు నూరుచుట్టలు కాల్చినను వికారపెట్టనంతటి దిట్టయయి మిత్రవర్గములో నప్రతిష్టపాలు గాకుండ బొట్టివాఁడు గట్టివాడుఁరా యని పేరు వడసెను. గణపతి పూనికవంటి పూనిక దేశములో నెందరికి గలదు? ఎందరో తెలివితక్కువవాండ్రు చుట్టలు వికారపెట్టగానె యొక దండము పెట్టి మానవైచిరి కాని గణపతివలె దాని యంతము కనుగొనువారు కలరా? అందుచేతనె యతని చరిత్రము పురాణ మైనది.

చిన్ననాట నుండియు గుఱ్ఱమెక్కవలయునని గనపతి కుబలాటము గలిగెను. మందపల్లిలోను నేనుగుల మహలులోను గుఱ్ఱములే లేవు. అప్పుడప్పుడు దూరపు టూళ్ళ నుండి గాజుల వర్తకులు గుఱ్ఱములెక్కి తన యూరికి వచ్చినపుడు గణపతి వారికడ కరిగి వారిని బతిమాలి ఆవకాయముక్కయో మాగాయముక్కయో తల్లి జూడకుండ నింటనుండి పట్టుకొని నాలుగు చుట్టముక్కలు కొసరిచ్చి యొకసారి గుఱ్ఱముమీఁద నెక్కించమని వారిని వేడుకొని యెక్కి నాలుగు వీధులు దిరిగి తనకు గలిగిన యశ్వారోహణవైభవము తోడిసంగతికాండ్రకు గలుగనందుకు గర్వపడుచు మార్గమధ్యమున వారు కనఁబడినప్పుడు వెక్కిరించుచు నుబలాటము దీర్చుకొనుచుండును. ఈ యయిశ్వర్య మేడాదికి రెండుమూఁడు సారుల కంటె నెక్కువగ లభించుటలేదు. ఒకరిని యాచించి యెరువు గుఱ్ఱమెక్కి రెండుమూఁడు గడియలు స్వారి వెడలుట గణపతికి లజ్జాకరముగనుండెను. సాధ్యమైనంతవఱకు సొంతవాహనముగాని నిరంతరము గ్రామమునందె యుండు వాహనముగాని సంపాదింప వలయునని యతఁడు సంకల్పించు కొనియెను. ఆశ్వములు మొదలైన వర్థజాధ్యములు, అర్థములేని గణపతివంటి వ్యర్థున కవి యెట్లు సాధ్యమగును? సాధ్యముకానిచో నుబలాటము తీరు టెట్లు? అశ్వారోహణమందలి యాత్సుక్యము దీర్చుకొనుటకై యతఁ డుపాయములు వెదకెను. గుఱ్ఱము లేనప్పుడు దానికి బదులుగా మనుష్యుఁ డెక్కి తిరుగుటకు వీలైనది మఱియొక జంతువు లేదా యని యతం డాలోచించెను. గాడిదె నేల యెక్కగూడదని యతఁడు విమర్శింపఁ దొడఁగెను. గాడిద నెక్కిన పక్షమున గలిగెడు లాభనష్టములేవి యని యత డిట్లు వితర్కించెను. "గుఱ్ఱమువలె దానికిగూడ నాలుగు కాళ్లున్నవిగదా, మనుష్యులను మోయగలదు గదా, కడుదూరము నడువ గలదు గదా, రూపమున భేదముతప్ప గుణములయందు భేదమేమియు గనఁబడదు. విశేషించి గుఱ్ఱమునకు గుగ్గెళ్ళు దాణా పెట్టవలెను. గాడిదెకు గుగ్గెళ్ళక్కఱలేదు. ఏ బీటిలో వదిలిపెట్టినను నే చేనిలో వదిలిపెట్టినను దా నంతటది మేత తినివచ్చును. గుఱ్ఱమున కొక సాల గావలెను. గాడిదె కక్కఱలేదు. ఏ చెట్టుక్రింద వదిలినను నేబైట దిరిగినను భయములేదు. గుఱ్ఱమును మాలీసు చేయుట కొక కాపరి కావలెను. వానికి జీతమీయవలెను. అందుకు డబ్బు కావలెను. గాడిదె కట్టి కాపరి యక్కఱలేదు. అశ్వమునకు సుళ్లు మొదలైనవి చూడవలెను. మంచి సుళ్లు లేని గుఱ్ఱమైనచో యజమానుని కొంపదీయును. గాడిదెకు సుడి చూడనక్కఱలేదు. గుఱ్ఱములు సొమ్ము కర్చుపెట్టి కొనవలెను. గాడిదను వెలయిచ్చి కొననక్కఱలేదు. చాకలివాండ్రవద్ద కావలసినన్ని యున్నవి. గుఱ్ఱముమీఁద జీను వేయవలయును; కళ్ళెములు కావలెను. గాడిద కవియేవియు నక్కఱలేదు. దానికి సంరక్షణ మక్కఱలేదు. అంగరక్షల పనిలేదు. వెల యక్కఱలేక సులభసాధ్యమై కొంగు బంగారమువలెనున్న గాడిదెను వదిలి గుఱ్ఱమునకై దేవులాడుట వెఱ్ఱితనము. అందుచేత సర్వవిధముల గాడిదెయే శ్రేష్ఠము. కాదాయనంటె నలుగురు నవ్వుదురు. ఒకరి నవ్వు జోలి నాకెందుకు? నన్ను జూచి నవ్విన పక్షమున వారిని జూచి నేను నవ్వెదను. వారి మొగమాటము నాకేమి? నేను కుక్క నెక్కుదును, గుఱ్ఱము నెక్కుదును, గాడిదెనెక్కుదును" అని పూర్వపక్షములు సిద్ధాంతములు తన మనంబున జేసికొని యెట్టకేలకు గార్ధభవాహన మధిరోహించుట కతడు కృతనిశ్చయుండయ్యెను. తమకు బట్ట లుదుకు చాకలివారి యింటికిఁబోయి నాలుగు చుట్టముక్కలు వానికి దానమిచ్చి వాని గాడిదెను యెరువిమ్మని యడిగెను. ఆమాట వినఁగానె వాడు నవ్వి "బాపనోరు గాడిదె నెక్కకూడదండీ తప్పు తప్ప"ని మందలించెను. చాకలి వెధవవు బ్రాహ్మణునికంటె నీ వెక్కు వెరుగుదువా? అవతవక ప్రసంగములు చేయక తీసికొనిరా. నీవు నీగాడిదె నీయకపోతే మఱియొక గాడిదెను తేగలను. ఊరునిండ కావలసినన్ని గాడిదెలున్నవి. నీ గాడిదెనే యిచ్చి తివా ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు, కూరలు నీకు దెచ్చి పెట్టుచుందును. నేనప్పు డప్పుడు బ్రాహ్మణార్థములు చేయుచుందును. చేసినప్పుడు నావిస్తరిలో వడ్డించిన యరిసెలు, గారెలు యజమానులు జూడకుండ చెంబులలో పెట్టి కాని దొన్నెలలో బెట్టికాని దాచితెచ్చి నీ కిచ్చుచుందును. భోజనమునకు వెళ్ళినప్పుడుగూడ నీలాగే బూరెలు తెచ్చిపెట్టుదును. కావలసినన్ని చుట్టలు నప్పుడప్పుడు డబ్బులు నీకు బహుమాన మిచ్చుచుందును. లేనిపోని శ్రీరంగనీతులు చెప్పక తీసికొనిరా నీ గాడిదెనని తిట్టి యాసగొలిపి వాని నొడంబఱచెను. వాఁడును దన మైలగుడ్డలు మోయునట్టి గాడిదెను తీసికొనివచ్చి యెదుట బెట్టెను. గణపతి కప్పటికి పదునాలుగేండ్ల వయస్సున్నను వయసుకు దగినంత పొడగరి గాకపోవుటచే దానిపై కెక్కలేక చాకలివానిని క్రింద గూర్చుండఁ బెట్టి ముందు వాని భుజముమీఁదనెక్కి పిమ్మట గార్దభవాహన మధిరోహించెను. కళ్ళెము లేకుండ దానిమీఁద నతడు కూర్చుండుట కిష్టము లేకపోయెను. త్రాటియాకులు గుది కళ్లెముగ నుపయోగింపుమని చాకలివాఁ డుపదేశించెను. "చదువు కొన్న వానికంటె చాకలివాఁడు మేలన్నమాట నిజమైనది. నీ యుపాయమే బాగున్నది. నీవే కట్టి తీసికొనిరా" యని చెప్పి వాఁడు కట్టితెచ్చిన త్రాటియాకుల గుది కళ్ళెముగఁ బెట్టి దానిని చేతఁబట్టుకుని వెనుక నడచుచుఁ జాకలివాఁడు గాడిదెను దోలుచుండ పై యుత్తరీయము కుచ్చువచ్చునట్లు తలకు జుట్టి చుట్ట వెలిగించి నోట బెట్టి గుప్పుగుప్పుమని పొగలెగయ నీత బెత్తముతో గాడిదను నడుమనడుమ గొట్టి యదలించుచు ముందుగా జాకలివాండ్ర యిండ్లదగ్గఱ తరువాత దక్కిన వీధుల వెంబడిని దిరిగెను. ఆ మహోత్సవము జూచుటకు వీధివీధిని బిన్నలు, పెద్దలు స్త్రీలుఁ బురుషులు గుమిగూడిరి. పట్టాభిషేక మహోత్సవ సమయమున బసిడియంబారివైచిన మదపుటేనుఁగు నెక్కి నగరమందు నూరేగు మహారాజుకైనను నైరావతము నెక్కి యమరావతి పురమునందు త్రిమ్మరు దేవేంద్రునికైనను నంతటి సంతోషము నంతటి గర్వము ప్రాభవమునుండదని నిశ్చయముగా జెప్పవచ్చును. గార్ధభవాహనారూఢుఁడైన గణపతి తన్ను ప్రజలు చూడవచ్చినప్పుడు సిగ్గుపడలేదు. చిన్నబోవలేదు. సందియము నందలేదు. జంకలేదు, ముప్పది నలువది మంది చిన్న పిల్లలు గార్ధభమువెనుక జేరి చప్పటలు జరచుచు గేకలు వైచుచు ద్రాటియాకులు, బుట్టలు, చేటలు వాయించుచు నల్లరిజేయసాగిరి. గాడిదె బెదరి పరుగిడజొచ్చెను. ఆతొందరలో నది త్రాటియాకుల కళ్ళెము తెగకొరికెను. గణపతి తన్ను గార్దభము పడవైచునని ముందుకు జరిగి వంగి దాని చెవులు గట్టిగా బట్టుకొనెను. చెవులు నొప్పి పెట్టుటచే నది మఱింత పరుగెత్తెను. అదృష్టవశము వలన నప్పుడు గార్ధభ యజమానుఁడగు చాకలివాడు ముందుకు బోయి యాపెను. అందుచే గణపతి నేల గూలుట తప్పెను. ఇంతలో నతని మేనమామ కొందఱు బాలకుల వలన మేనల్లుని ఖరవాహనారూఢ వృత్తాంతము విని కోపోద్రేకమున నొక దుడ్డుకఱ్ఱ చేతబట్టుకొని తిట్టుచు నతని కెదురుగా వచ్చెను. మేనమామను జూడగనే గణపతి వాహనముమీద నిలువలేక గుభాలున దాని మీఁద నుండి నేలకు దుమికి కాలి సత్తువకొలఁది పరుగెత్తెను. గణపతిమీఁద బడవలసిన దుడ్డుకఱ్ఱ తనమీఁద బడునేమో యని చాకలివాఁడు గాడిదె నక్కడ విడిచి పిక్కబలము జూపెను. వెంట నున్న పిల్లలు నానా దిశలకు బరుగెత్తిరి. పాఱిపోవుచున్న మేనల్లుని బట్టుకొనుట యసాధ్యమని మేనమామ వానివెంట నరుగక గణపతిని, గాడిదను, రజకుని నిందించుచు గృహంబున కరిగెను. అనంతరము మూడు దినముల వఱకు గణపతి మేనమామ యొక్క కోప శిఖవేఁడిమి మందగింపనందున ఇంటి కరుగుటకు వీలులేక పోయెను. "ఆ దౌర్భాగ్యుడు నా యింటికి వచ్చెనా కుక్కను కొట్టినట్లు దుడ్డుకఱ్ఱతోఁ గొట్టి చంపెదను. ఈ దుర్మార్గుని మూలమున నాకెన్నో తలవంపులు వచ్చుచున్నవి" యని మేనమామ తన్ను జూడవచ్చిన వారితో ననుచుండినట్లు గణపతికి వినవచ్చెను. మేనమామకు మిత్రులైన వారు కొందఱు గణపతిం గలిసికొని "కుఱ్ఱవాఁడా ! నీకిదేమి వినాశ కాలమురా, ఏనుగు నెక్కినవారున్నారు. గుఱ్ఱము నెక్కినవారున్నాదు. కాని బ్రాహ్మణకులములో బుట్టినవాఁడు గాడిద నెక్కగా నెక్కడ జూడలేదు. నీ మూలమున దనకెంతో యప్రతిష్ట వచ్చుచున్నదని నీ మేనమామ యేడ్చుచున్నాడు. ఈ పాడుబుద్ధి నీ కెవరైన నేర్పినారా నీకే బుట్టినదా. ఇటువంటి యవకతవక పనులు మాని తిన్నగా నడచుకొంటివా మీమామతోఁ జెప్పి నిన్నింటికి జేర్చెద" మని మందలించిరి. అనవుడు గణపతి నవ్వి వారి కిట్లనియె. "అయ్యా ! గాడిద నెక్కిన దప్పేమున్నది? భాగ్యవంతుడు వరియన్నము దినును. పేదవాడు జొన్నకూడు తినును. అగ్రహారీకు లంటు మామిడి పండ్లు తిందురు. పేదవాఁడు జీడిమామిడిపండ్లు తినును. అలాగే యెక్కువ డబ్బున్న రాజేనుఁ గెక్కును. కొంచెము డబ్బున్న వాఁడు గుఱ్ఱ మెక్కును. గవ్వైన లేనివాఁడు గాడిద నెక్కును. దానికి దీనికి భేదమేమి? గుఱ్ఱము సకిలించును. గాడిద యోండ్రము పెట్టును. దీనికికూడ జీనువైచి కళ్ళెము పెట్టి డెక్కల కినుప నాళములు వేయించి నడక నేర్పించి ముద్దుచేసిన పక్షమున గుఱ్ఱమును మించియె యుండును. పనికి మాలినదని పదిమంది పేరుపెట్టినచో నది పనికిమాలినదె యగును. గాడిదె నెక్కుట వలన గొప్పలాభ మున్నది. అదియేది యనగా, ముందు గాడిదె మీద స్వారీ నేర్చుకొన్న పక్షమున గుఱ్ఱపు స్వారి సులభ మగును. ఇవి యన్నియు నటుండనిండు. గాడిద యెంత గొప్పదో మీ రెఱుఁగుదురా ? శ్రీకృష్ణమూర్తి వారి తండ్రియైన వసుదేవు డంతవాడు తన కాపద వచ్చినప్పుఁడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడా? ఏనుఁగు కాళ్ళు పట్టుకొన్నాడా? గోవు కాళ్లు పట్టుకొన్నాడా? గుఱ్ఱముకాళ్ళు పట్టుకొన్నాఁడా? ఆ మహాపత్సమయమున వసుదేవుఁడు దానికాళ్ళు పట్టుకొనకపోయిన పక్షమున కృష్ణమూర్తి బ్రతుకకనేపోవును. నేను దానిమీద నెక్కి తిని. కాని వసుదేవునిలాగ కాళ్ళు పట్టుకొనలేదు. గాడిద నెక్కుట తప్పని నా మేనమామఁకు దోఁచిన పక్షమున మంచి గుఱ్ఱము నొక దానిని కొని యిమ్మని చెప్పండి. అది యిచ్చెనా గాడిద నెక్కుట మానెదను.

గణపతి పలుకులు విని వారందఱు జిఱునగవు నవ్వి "వీని బ్రతుకు కాల. పొట్టచించి కంచుకాగడాల వెదకినను నొక్క యక్షరమైనను గానరాని వీఁడు తనపనికిఁ గావలసిన పురాణ సాంప్రదాయములఁ గూడ నెఱుఁగును. వీఁడు వసుదేవుని సాటువు దెచ్చికొన్నాఁడు. పొట్టివానికి బుద్ధులు పుట్టె డన్నమాట నిజమైనది. వీఁడు దేవతలకు సైతము పంచాంగము చెప్పఁగలవాఁడు. వీనికి మన ముత్తరము చెప్పలేము పదండి" యని వెడలిపోయిరి. గణపతి యొక్క ఖరవాహనారోహణ వృత్తాంతము విని యది యనార్యకార్య మనియు, నతఁడు సజ్జనదూరుఁ డనియు వట్టి నిర్భాగ్యుడనియు మీరు నిశ్చయింతురను సందియము కలుగుచున్నది. అట్లు మీరు తలంచుట న్యాయము కాదు; ఏలయన, నిట్టివా రనేకులు గలరు. ఎవరి మాటయొ యెందుకు. అసాధరణ ప్రతిభా సమేతులగు దేవతలం జూడుఁడు. దేవతలకెల్ల దొరయై ముజ్జగంబుల యేలికయై కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలగు కామప్రధాన పదార్థముల కొడయఁడైన నిర్జరేంద్రునకు మేఘములు వాహనములు. నీరు గాలి మెఱుపు పొగ మొదలగు పదార్ధములతోఁ జేయఁబడిన మేఘమా యతనికి వాహనముగ నుండవలసినది. తక్కిన వేల్పులం జూడుఁడు. సకల యాగములకు సకలస్మార్త కర్మలకు నాధారమైన యగ్ని హోత్రునకు వాహనము గొఱ్ఱె. దక్షిణ దిక్కునకు నాయకుడైన యగ్ని హోత్రునకు వాహనము గొఱ్ఱె. దక్షిణ దిక్కునకు నాయకుఁడై ధర్మాధర్మ విచార నిపుణుఁడైన యమధర్మరాజునకు వాహనము దున్నపోతు; జలాధినాయకుఁడైన వరుణుఁడు మొసలిపై నెక్కును. మహాబలుఁడై సముద్ర జలముఁ బై కెగర గొట్టియు మహావృక్షములఁ గూల్చియు క్షణకాలమున జగన్నిర్మూలనము జేయఁగల వాయుదేవుఁడు లేఁడిమీఁద స్వారిజేయును. "ఆదౌ పూజ్యో గణాధిపః" యన్నట్లు సకల శ్రౌతస్మార్త కర్మలకు ముందు పూజనీయుఁ డగు గణాధిపతి యెలుక నెక్కి పందికొక్కునెక్కి బయలు దేఱును. ఉమా మహేశ్వరులకు కుమారుఁడైన గణపతి కింతకంటె వేరు వాహనము లేకపోయెనా? కొంపత్రవ్వునట్టి యెలుకా వాని తురంగము. సకల గృహవర్తి యగు మార్జాల చక్రవర్తి కొక్క కబళముగ నుపయోగపడు నెలుక మీఁద నా ప్రమధ గణపతి యెక్కగా మన గణపతి గాడిద మీఁద నెక్కుట తప్పా? అతని మాట యటుండనిండు. లక్ష్మీనారాయణుల పుత్రుడయిన గరళ కంఠునివంటి మహాదేవుని జయించిన జోదై చండ శాసనుఁడయి సకల లోకంబులంగల సకల జంతువులను బూవు టమ్ములతో గొట్టి పడవైచునట్టి మన్మధునకు వాహనమేమో యెఱు@గుదురా? చిలుక. ఆ మన్మధుని తండ్రియగు నారాయణుని తురంగమేమొ యెఱుఁగుదురా? బొల్లి గ్రద్ద. ఎక్కడ దిక్కులేనట్లు తండ్రి కొడుకులైన మాధవమన్మధులు రెక్కాడినగాని బ్రతుకలేని దిక్కుమాలిన పక్షులపై నెక్కుచున్నారు. అనంతకోట్యవతారంబులనెత్తి పరాత్పరుఁడనియుఁ జరాచరాత్పరుఁడనియు వ్యాసవసిష్ఠ వామదేవాది మహర్షుల చేతవినుతింపఁ బడిన శ్రీమన్నారయణుఁ డెక్కుటకు లోకమున బొల్లిగ్రద్ద తప్ప వేరువస్తువులు లభింపవా? ఇక శివుని మాట తడవబనియేలేదు. ఆయన వెల్ల యెద్దునెక్కి విహారము చేయును. అడ్డమైన గడ్డి కఱచునట్టి పశువు మీదనా శివుడెక్కవలసినది? మహేశ్వరుఁ డెంతవాఁడు? లలాట నేత్రజ్వలన కీలల చేత నిమిషార్థమున విష్ణు పుత్రుఁడగు దర్పకుని బిడికెడు బూడిద చేసినాఁడు. క్షీరసాగర మధన కాలమున సముద్ర గర్భమునుండి బొడమి లేచిన హాలాహల విషము సకలలోక భయంకరమై వ్యాపించి బ్రహ్మండము భస్మీపటలముఁ జేయునటులుండ ముప్పది మూడు కోట్ల దేవతలు వెఱచి రక్షింపుమని చేతులు మోడ్చి మ్రొక్కి తన్ను వేఁడ కరుణాళువై వెన్నముద్దవలె యా విషపు ముద్దను మ్రింగి యత్తరి నప్పాలసంద్రమునఁ బుట్టిన గల్పవృక్షమును నైరావతమును నుచ్ఛైశ్రవము నింద్రునికిచ్చి లక్ష్మీకౌస్తుభముల విష్ణునకిచ్చి తన లోకాపకార శీలతయు నిస్పృహత్వమును వెల్లడి చేసెను. అట్టి మహనీయు డెద్దెక్కుట బాగున్నదా? ఈయన కుమారుడఁగు కుమారస్వామి జగత్రయ కంటకుఁడగు తారకాసుని శక్తిప్రయోగమున సంహరించి వేల్పుల కృతజ్ఞతకుఁ బాత్రమయ్యెను. ఇతఁడు క్రౌంచ పర్వతము భేదించిన మహా యోధుఁడు. అతఁడు దేనిమీఁద నెక్కునో యెఱుఁగుదురా? నెమలిమీఁద వన్నెల చిన్నెల బండారమే కాని నెమలి గొప్పయేమున్నది? బ్రహ్మదేవుఁడు చతురాననుఁడఁట. సురజ్యేష్టుఁడఁట, హిరణ్యగర్భుఁడఁట, ప్రజాపతియఁట, వాణీ నాథుఁడఁట, సృష్టి కర్తయట. వానచుక్కలు మీఁదఁ బడిన మాత్రాన తోఁక త్రెంచుకొని పాఱిపోవు హంస వీని వాహనమఁట. మహిషాసుర మర్దిని యగు కాత్యాయని సింహ మెక్కును. నిగ్రహానుగ్రహ సమర్థులు, నిరుపమాన మహిమాన్యులు, కళ్యాణ గుణ సంపన్నులు, కామరూపులు, సకలలోక పూజ్యులు, సరధర్మ పరి జ్ఞాతలు నైన దేవతలె గొఱ్ఱెనెక్కి, బఱ్ఱెనెక్కి, యెలుకనెక్కి, యెద్దునెక్కి, గ్రద్దనెక్కి, మఱియు నిచ్చవచ్చిన జంతువులనెక్కి పులుఁగులనెక్కి బెదురులేక బిడియము లేక సిగ్గులేక చింత లేక తిరుగుచుండ నే ప్రజ్ఞలేక మనుష్య మాత్రుడై కించిజ్ఞుడై బాలుఁడైన గణపతి గాడిదనెక్కి దిరుగుట యేమితప్పు? దున్నపోతు యొక్క యతిశయ మేమి? మూషికము యొక్క ముఖ్యతయేమి? గాడిదచేసిన కానిపనియేమి? అభిమానము చేత నెద్దులనుఁ దున్నపోతులను నెక్కినవారిని మహర్షులు పురాణములలో గొనియాడగనే మీరును బళిబళీయని మెచ్చి పూజించుచున్నారు. గణపతి డబ్బులేని పేదబాపనయ్య కొడుకగుటచేత గాడిద నెక్కి నంత మాత్రమున నిర్భాగ్యుఁ డనుటకు సాహసించు చున్నారు. పక్షపాతమె ప్రేమ గలిగించును. పక్షపాతమె యేవ గలిగించును. గుణశూన్యుఁ డైనను మెచ్చి పొగడు వారున్న పక్షమున గుణరత్నాకరుఁ డగును. మెచ్చి కొనియాడు వారు లేనప్పుడు గుణరత్నాకరుఁడు సయితము శుంఠయగును. నోరు గలవాండ్రు గొందఱఁ జేరదీసిన దేవానాం ప్రియుఁడు సతతము మహా పురుషుఁడుగ పరిగణింపఁ బడుచున్నాఁడు. ఆలంబము లేని వాఁడణఁగి పోవుచున్నాఁడు. మా గణపతి యాత్మ గౌరవము గలిగి స్వప్నములోఁ గనఁబడి తన వృత్తాంతముఁ జెప్పబట్టి యది వ్రాయు వారొకరు దొరకబట్టి యీ మాత్రము గ్రంథమైన బయలుదేఱినది. కాని లేకపోయినచో నేమి కావలసినది? అడవిలో బుట్టి అడవిలో బెఱిగి యడవిలో రాలిపోయిన యుమ్మెత్త పువ్వువలె సముద్రములో బుట్టి సముద్రములో బెఱిగి సముద్రములో నణఁగిపోయిన నత్తగుల్లల ప్రోగులలె నితని చరిత్రము లోకమందు ప్రసిద్ధము గాక యుండును గదా. ఎట్లో యొక యట్లు చరిత్ర ప్రసిద్ధమైనది. కాఁబట్టి యతఁడు గార్దభ మెక్కినంత మాత్రమున నింద్యుఁడని మీరు భావింపవలదు.