గణపతి/ఆఱవ ప్రకరణము
ఆఱవ ప్రకరణము
కూతురు గృహ మమ్ముకొనవలసినప్పుడైన నామెనొక సారి చూచుట కన్నప్పకుఁ దీరిక లేకపోయెను. కాపుర ముండుటకు మందపల్లిలో వారికి మరొకయిల్లు దొరకనందున గంగాధరుని దోడ్కొని పిమ్మట యేనుగుల మహలు గ్రామమునకుఁ పోయెను. మందపల్లి కేనుగులమహలు మిక్కిలి సమీపమున నున్నది. గోదావరి సప్తశాఖలలో నొకటియగు కౌశికి యను పాయ యేనుఁగుల మహలునకు మందపల్లికి నడుమ ప్రవహించు చుండెను. గోదావరిపాయ యను గొప్ప పేరేగాని యదియొక గొప్పకాలువవలె నుండును. మహైశ్వర్యసమన్విత మగు నొక గొప్పకుటుంబము వివాదములు పెరిగి రెండు కుటుంబములుగ భిన్నమైన వెనుక విభక్తకుటుంబ ములు తొల్లింటి సంపదను గౌరవమును గోల్పోయి లోకము లోని సామాన్య సంసారములవలె నుండు పగిది రాజమహేంద్ర వరము కడ విశాలమైన యఖండగౌతమి యను పేరువడసి నేల పైఁ జరచిన గొప్ప నీటి రేకువలె నొప్పుచుండు గోదావరి ధవళేశ్వరమునొద్ద నేడు పాయలుగ జీలిపోయినందున నా పాయలు వైశాల్యమునఁగాని జలసంపదయందుగాని గాంభీర్యమునఁ గాని యఖండ గౌతమిని బోలక సామాన్యనదులట్లు న్నవి. కొన్ని నామావశిష్టము లైనవి. కొన్ని యంతర్వా హినులైన వని చెప్పుదురు. కొన్ని స్వల్పములై గోస్తనీనది మొదలగు చిన్న యేళ్ళవలెఁ బాఱుచుండును. కౌశికి ఇట్టి వానిలోఁ జేరి పంటదినములలో బుష్కలముగ ధాన్యమున్న కతనఁ గడుపునిండ దిని దేహపుష్టి గలిగి ధాన్యమైపోయిన తరువాత ఫుష్టి లేక బడుగువ లెనుండు పేద రయితువలే వర్ష కాలమున వరద పొడిచి నపుడు కొంచెము విజృంభించి గాంభీర్యము గలిగి దుస్తరమై యుండి శీతకాలమందుఁ గాలినడ కను దాటుట కనువై మండు వేసంగి యందు నీ రేలేక తిప్పలు బయల్పడి యుండును. వాన కారున నేరు పొడిచి నప్పుడు మంద పల్లి యేనుగుల మహలు లన్నవి వేర్వేరు గ్రామములుగఁ దోఁచును, కాని వేసవి కాలమున నొక్కటే గ్రామమని భావింపవలసియుండును. గంగాధరుఁడు స్థలభాండ విసర్జము జేసి మందపల్లి విడచి యేనుగులమహలు చేరునప్పటికి రమా రమి యేఁడు సంవత్సరముల యీడుగలవాడై యేనుఁగు గున్నవలెనుండెను. ఏనుగుల మహలునకు రాకమునుపె గంగాధరున కుపనయనముఁ జేయవలయునని పిచ్చమ్మకు సంకల్పము కలిగెను.
బ్రాహ్మణకుమారునకు గర్భాష్టమునం దుపనయనము జేయవలయునని ధర్మశాస్త్రమునం దుండుటచేత నామెకుమారున కేడవయేఁట నుపనయనముఁ జేయఁదలంచెనని చదువరులూహింప వచ్చును. ఆ యూహ సరికాదు. గర్భాష్టమ మేమొ ధర్మశాస్త్రమేమొ పిచ్చమ్మకుఁ దెలియదు. ఉపనయన సంకల్పమున కొక్కటే కారణము గలదు. పేదతనము ప్రధానకారణము. అన్నవస్త్రములకు వారికి మిక్కుటమైన యిబ్బంది కలిగెను. గంగాధరుడు వయసున బిల్లవాడెకాని భోజనవిషయముఁ బెద్దవాఁడని చెప్పవచ్చును. ముమ్మారు మూఁడుసోలల బియ్యమతని కొకవిధముగ సరిపోవుచుండును. తల్లి వితంతువగుటచే మధ్యాహ్న మొకసోలడు బియ్యపన్నము మాత్రమె తిని రాత్రి యుపవసించు చుండును. మొత్తముమీఁద గావలసిన శేరుబియ్యమైన వచ్చెడిదారిలేదు. ఉపనయనము చేసెడు పక్షమున రెండుగ్రామములలో బ్రాహ్మణార్థములు చేయవచ్చును; పొత్తరలు పట్టవచ్చును. ద్వాదశీ బ్రాహ్మణుఁడుగ నమావాస్య బ్రాహ్మఁణుడుగ నుండవచ్చును; సంభావనకు వెళ్ళవచ్చును. కుమారుఁ డీవిధముగఁ దనపొట్టఁదాను బోసికొనుచున్న పక్షమున పిచ్చమ్మ తానెవరింటనైన చేరి వుదరపోషణముఁ జేసికొన వచ్చు నని యుపనయనముఁ దలపెట్టెను. ఉపనయనము జూచుటకు గాకపోయినను పీటలమీఁద గూర్చుండి జందెము వేయుట కైన నెవరు లేరు గావున నందులకైన నొక్కసారి రావలసినదని పిచ్చమ్మ తండ్రికి వర్తమాన మంపెను. కాని యన్నప్పకు వేదాంతము ముదురుటచే పిల్లవానికిఁ దండ్రిలేని కారణమున జందెమెవడు వేసినది కూలికేయని తలంచి మఱియొకరిచేత నది చేయించ వలసినదనియు దనకుఁ దీరికలేదనియు వర్తమాన మంపెను. పాపము పిచ్చమ్మ యెవ్వరినో బ్రతిమాలి జందెము వేయించి యుపనయనము మైనదనిపించెను. ఏ మంచిమూహూర్తమందు భిక్షాందేహి యనుమాట గంగాధరుని నోట వచ్చెనో కాని జన్మాంతమువఱకు నించుమించుగ నతఁడు దానిని వదలి పెట్టక యేదో విధముగ స్మరించుచు వచ్చెను. అదియె యతనికి తారక మంత్రమయ్యెను. ఉపనయనమైన యొకమాసమున కతఁడు ముందుగా యాయవారమారంభించెను. ఆ గ్రామములో సరిగా వారి సంసారమునకుఁ గావలసిన బియ్యము దొరుకుట దుర్లభమైనందున మధ్యాహ్నము మాధుకరము జేయుచుండెను. శ్రాద్ధభోక్తగా వెళ్ళిన నాఁడు మాత్రము మాధుకరము మానుచుందును. భగవంతుఁడు నిర్హేతుక జాయామాన కటాక్షముచేతఁ గొందఱకు బాల్యమునందె యీఁడునకుఁ దగినప్రజ్ఞ లిచ్చుచుండును. ఈశ్వరానుగ్రహముచేత భగవానుఁడగు శంకరాచార్యుడేడవ యేటనె సాంగవేదాధ్యయన సంపన్నుఁ డయ్యెనట. ఒకఁ డెనిమిదవ యేటనే కవిత్వముఁ జెప్పును. పూర్వజన్మ సుకృతముచేత గంగాధరునకుఁగూడ నట్టి యద్భుతప్రజ్ఞ చిన్న నాఁటనె కలిగెను. అది భోజన విషయమున ప్రజ్ఞ. అతని భోజన మీడునకుఁ దగినది కాకపోవుటచేఁ తల్లిదృష్టిదోషము తగులు నను భయమున గొంతకాలము తరచుగ బ్రాహ్మణార్థములకు బోనీయక మాధుకరవృత్తిచేత సంపాదించిన యన్న మతనికి బెట్టుచు నది మూఁడుపూటలకు సరిపోక యాయవారమెత్తి తెచ్చిన బియ్యము వండిపెట్టుచు గాలక్షేపము సేయుచుండెను. తల్లిప్రాణ మగుటచే బిడ్డ దృష్టి తగిలిన యెక్కడ చెడిపోవునో యని కడు భయపడుచు బ్రాహ్మణార్థముల కతడు పోయివచ్చిన తరువాత మిరపకాయలు దిగదుడిచి పొయిలోఁబోసియుఁ గచ్చిక లాముదములో ముంచి దీపము వెలిగించి చుట్టుద్రిప్పి వీధిలో బారవైచియు నుప్పు దిగదుడిచి నూతిలోఁ బారవైచియు బిచ్చమ్మ బహు విధముల దనయున కంగరక్షణ చేయుచుండును. ఇంటికి జుట్టములు వచ్చినపుడు పిచ్చమ్మ కుమారుని వారి పంక్తికెన్నఁడు రానీయదు. గంగాధరున కన్నాదరువులు విశేషమక్కఱలేదు, తఱవాణిలోని యన్న మూరఁగాయ గాని నీరుల్లి పాయగాని నంజుకొనుచు నది యెంతో యాప్యాయముగ దినును. తరవాణికుండ యతనిపాలిఁటి కమృతభాండమె. పెద్దవాఁడైన తరవాఁతఁగూడ గంగాధరుడు చిరకాల సహవాసముచేత గాబోలు తల్లినైన విడువగలెగెను కాని, యుల్లిని తరవాణికుండను విడువలేకపోయెను. వెయ్యేల? యది యతనికిల వేల్పు, ఈ నాఁటివారు ప్రాతఃకాలమునను పగలు మూఁడవజామునను కాఫీ కానీ టీ కాని త్రాగకపోయినయెడల నెట్లు తల నొప్పులచేత బాధపడి కూర్చుండినచోట నుండి లేవలేక పోవుదురో యానాఁడు గంగాధరుడు గూడ నట్లే యుదయమున తరవాణిఁ ద్రాఁగక యది కలిసిన యన్నము కొంచెము తినక యిల్లు వెడలఁడు. పలు పిండివంటలతో శుభకార్యముల యందును కుడుములు మొదలగు వానితో శ్రాద్ధముల యందును షడ్రసోపేతముగ భుజియించి వచ్చిన తరువాత సయితము గంగాధరుడుఁ డొకనిద్దుర దీసి సత్తుతపిలెడు తరువాణి త్రాగినగాని యతని ప్రాణము తెప్పరిల్లదు. ఎండబడి వచ్చెనా యతని కదే శరణ్యము. తరవాణి యంతచే టలవాటైనప్పుడు గంగాధరుడు శ్రాద్దభోక్తగ వెళ్ళిననాఁడు సయితము ముందుగా నది కొంచెము పుచ్చుకొని వెళ్లునా యని మీకు సందేహము గలుగవచ్చును. అట్టి సందేహములకు బనిలేదు, శ్రాద్ధము చెడదా యందురేమో; శ్రాద్ధము చెడనీ పితృదేవతలు చెడనీ గంగాధరుఁడు చెడఁడు. అదియునుగాక "అన్నము పరబ్రహ్మస్వరూపము, అది చేసినదోషములే" దని యార్యులు వక్కాణించు ధర్మోక్తులు పండితుల నోట వ్యర్ధముగ వచ్చుచుండును గాని యనుభవసిద్ధిఁ గలవు. గంగాధరుఁడా వాక్యములయందు దృఢ విశ్వాసము గలిగి యన్న మెప్పుడు తిన్న నెన్నిమారులుతిన్న నెంతతిన్న నెక్కడతిన్న తప్పులేదని నమ్మి నమ్మినట్లు నడచుచుండును. వివాహాదికార్యములలో నతఁడెక్కడికైన సంభావనలకు వెళ్ళినప్పుడు పదిమందిని జట్టుఁ జేర్చుకొని యతఁడు తరవాణి మీద యుపన్యాస మిచ్చునపుడు విని తీరవలయును. మతిలేని బ్రహ్మదేవుఁ డోర్వలేక యతనిని నిరక్షకుక్షిని జేసెఁగాని నిజముగ నతనికి విద్యా పరిచయమున్న పురాణమొ వ్రాసియుండును. వానింగూర్చి యతడు పెద్దవాఁ డైనతరువాత నప్పుడప్పుడు చేసిన యుపన్యాసములలోని సారాంశములు కొన్ని యీక్రింద నుదహరింపబడుచున్నవి.
"దేవతల కమృతము మనుష్యులకు తరవాణి బ్రహ్మదేవుడు విధించినాడు. అమృతము మీఁద విసుగెత్తి దేవతలు తరవాణి కొఱకు తపస్సు జేసినారు. కాని యిది వారికి దొరకలేదు. గ్రుక్కెడు తరువాణి త్రాగెనా చంద్రుని కళంకమిన్నాళ్ళుండునా? దినమునకు ముమ్మారు మూఁడు సత్తుగిన్నెల చొప్పున తరవాణి మండలము సేవించెనా సాంబమూర్తి కంఠములోని నలుపు హరించిపోదా? ఇది రెండు చుక్కలు నోటిలోఁ బడెనా శివునకు విసముఁదిన్న వెగటు నశింపదా? ఈ తరవాణి త్రాగియె భీముఁడు దుర్యోధనుని తొడలు విరుగఁ గొట్టెను. అర్జునుఁడు శత్రువులను జావఁగొట్టెను. వానరులు వారధిగట్టిరి, ఆంజనేయులు సము ద్రము దాటెను. లక్ష్మణస్వామి మూర్ఛపోయినపు డాంజనేయులు వెఱ్ఱిపడి సంజీవిఁ దెచ్చెను. కాని వుప్పుకలపిన పుల్లని తరవాణి గిద్దెడు నోటిలోబోసిన యొక పచ్చియుల్లిపాయ నంజుకొనబెట్టినచో గిరుక్కున లేచి కూర్చుండకపోయెనా? తెలివితేటలు లేవు. తరవాణికుండ నూరావుల పాడిపెట్టు, ఆవులకు గడ్డికావలె, గాదము కావలె ఒకపూట దూడ కుడుచుకొని పోవుట, మఱియొకపూట తన్నివేయుట మొదలగు చిక్కులు గలవు. తరవాణికుండ కట్టి చిక్కులు లేవు అదిలేని కొంప కొంపగాదు. రోగములువచ్చి నపుడు పాడుకషాయములు రుచిలేని యరఖులు త్రాగి గిజగిజ తన్నుకొనుటకంటే మాత్రవేసికొని తవ్వెడేసి తరవాణి త్రాగితే యెక్కడ జబ్బక్కడ యెగిరిపోవును. తరవాణి త్రాగుమని చెప్పని వైద్యుడు వైద్యుడా? కుడితి పశువుల కెంతబలమొ మనుష్యులకు తరవాణి యంతబలము."
ఇట్లు పలుమా రుపన్యాసములు చేయుటతో దనివిఁ జెందక తరవాణికుండలు కొందరి యిండ్లలో బోధచేసి పెట్టించెను. మిక్కిలి రుచిగానున్న వస్తువు దిన్నప్పు డెవరైన "వహవా! యిది యమృతము లాగున్నదిరా" యని మెచ్చి రేని గంగాధరుఁడు వెంటనే కోపపడి "ఛీ! అమృతము లాగున్నదనుచున్నావా? తరవాణిలాగున్నదని చెప్పు" మని చీవాట్లు పెట్టుచుండును. అట్టివాండ్రు చిన్నవాండ్రైన యెడల నట్టిమాటలిక నెన్నఁ డనవలదని బుగ్గలు నులిమి యొకటి రెండు చెంపకాయలు గొట్టుచుండును. ఇట్లు యాయవర మాధుకర వృత్తులచేతను బ్రాహ్మణార్ధములచేతను గంగాధరుఁడు తనపొట్ట బోసికొని మాతృసం రక్షణముఁ జేయుచుండెను. అట్లు కొంతకాలము నడచెను. గంగాధరునకు మిక్కిలి ప్రియమైన యుల్లిపాయ యొక్క వాసనవలె యతనికీర్తి యెంత కప్పిపుచ్చినను దాగక నలుదెసల వ్యాపించెను. తలుపులు వేసికొని తెల్లవారు జాముననె యెవ్వరు జూడకుండ నతఁడు తరవాణి యన్నము మిక్కిలి రహస్యముగఁ దినుచున్నను లోకులెట్లో యా విషయము గ్రహించిరి. నాలుగుగోడలనడుమ జరిగిన యారహస్య వృత్తాంతము బయట వడుటచే లోకు లనుకొనునట్లు గోడలకు చెవులే గాక నాలుకకూడ నున్నదేమో యని సందేహింపవలసి యున్నది. బ్రాహ్మణార్థములకు వెళ్లినప్పు డపరాహ్నము తిరిగెనేని తక్కిన బ్రాహ్మణు లాఁకలిచేత గిలగిల లాడుచుండగా గంగాధరుఁ డాకలిదప్పికలు లేక ఱాయివలె గూర్చుండుటచేతను వానినో రప్పుడప్పుడు ఉల్లిపాయ కంపు గొట్టుచుండుటచేతను నతఁడు తరవాణితో నభిషేకము జేసి చల్దికూఁడు నైవేద్యము పెట్టి యాత్మారాముని సేవించి యుండునని గ్రామవాసు లూహించి యొకటి రెండు సారులతనిని బిలిచి యడిగి దూషించి యతనిని బ్రాహ్మణార్థములకుఁ బిలుచుట మానిరి. కొంద ఱాతనికి వెలియని తమయిండ్ల శుభ కార్యములకు సయితము రానీయక పోయిరి. కొందఱు మాధుకరము పెట్టుట మానిరి. యాయవరము నందు సయిత మక్షయపాత్ర మునుపటివలె నిండుటలేదు. ఈకారణము చేత గంగాధరుఁ డేనుగుల మహలునుండి రంగస్థలము మార్పఁదలఁచెను. దీర్ఘాలోచనమీఁద గోదావరీ మండలమునకుఁ బ్రధాన నగరమైన కాకినాడ తన ప్రజ్ఞాప్రదర్శనమున కుత్తమరంగమని తోచెను. తోచుటయ తడవుగ నది తల్లితోఁ జెప్పి మరునాడు పయనమైపోయెను. పోయి యక్కడ మొదట రెండుదినములు సత్రములో దాను భోజనముజేసి తల్లి నత్తిసరుపెట్టుకొమ్మని చెప్పి పట్టణమంతయుఁ దిరిగి స్థితిగతులు పరిశీలించి కాకినాడలో నాకాలమున జనులు నీరు దొరకక విశేషమిబ్బంది పడుచుండుటచే వారిబ్బంది తీర్చుటకై తన జన్మము వినియోగింపఁ దలచెను. అతని నిర్ధారణము తల్లికూడ నంగీకరించినందున మరునాడె కావడిబద్దయు రెండుమట్లు గొని తెచ్చి మొదట నొకరిద్దరి వాడుకలు సంపాదించి నీళ్ళుమోయ నారంభించెను. అతని చాకచక్యము కార్యశూరత మొదలైనవి చూచి పట్టణ మందనేకులు వానిని నీళ్ళు పోయమని కోరిరి. దినమునకు ముప్పదికావిళ్ళైనను గంగాధరుఁడు మోసెననుట యతిశయోక్తిగాదు. కాకులు కూసినవేళ లేచి సూర్యాస్తమయ మగువఱకు నించుమించుగ నతడు కావిడి దింప డనుట నిశ్చయము. కొంతపైకము చేత జిక్కువఱకు నతఁడు సత్రము లోనే కాపురముండి పిమ్మట నొకచిన్న యిల్లద్దెకు పుచ్చుకొనెను. గంగాధరుని పేరు పట్టణమంతయు వ్యాపించెను. కలక్టరు కచేరీలోని గుమాస్తాలు మొదలగు వారు తమలోఁ దమరు సరససల్లాపములు చేసికొను నప్పుడు మనకన్న గంగాధరుడు మిక్కిలి యదృష్టంతుఁడు. చదువు రాక యతఁడు నెలకు ముప్పది రూపాయలు సంపాదించుచుండఁగా మన మెన్నో పరీక్షలలోఁ గృతార్థులమై పదియేను రూపాయలు తెచ్చికొనుట దుర్ఘటముగ నున్నదని చమత్కారముగఁ బలుకుచుందురు. తనచేత నీళ్ళు పోయించుకొనువారు నెలకొక్కఁనాడు రెండుపూటలఁ దనకు భోజనము పెట్టవలసినదని గంగాధరుడు నియమ మేర్పఱచి యట్లొప్పుకొన్నవారికె నీళ్ళు పోయుచుఁ దనతిండికీ దడవుకొన నక్కఱలేకుండ హాయిగఁ గాలక్షేపము సేయు చుండెను. ఎవరిపంచనైన సోలెడు బియ్యము కాచుకొని దల్లిందిను మనక ప్రత్యేకముగ నొక చిన్నయిల్లు గంగాధరుఁ డేల బాడుగకు పుచ్చుకొనవలయు నని మీకు సందేహము తోఁచవచ్చును. అందుకు ముఖ్యకారణ మిది. తనపాలిటి కల్పవృక్షమై కామధేనువై చింతామణియై ఈ కన్న తల్లివలె తన్ను చిన్ననాఁట నుండియు గాపాడుచుండిన తరవాణి కుండను బ్రతిష్టించుటకుఁ వీలున్నను దనగుట్టు దాగదనియు నెఱిగి యతఁడు ప్రత్యేకముగ నిల్లు పుచ్చుకొనియెను. నెలకు ముప్పదిరూపాయిలు సంపాదించుచున్నాఁడు గనుక గంగాధరుఁడు కావలసినంతధనము కూడబెట్టునని మీలో ననేకులు తలంపవచ్చును. కాని యట్లుతలంపఁగూడదు. ఎంతచెట్టు కంత గాలి యన్నమాట జ్ఞాపక ముంచుకొనుఁడు. అతఁడు నలమహారాజంతవాడై ధర్మరాజంతవాడై ధనము గడ్డిపఱకగఁ జూడ నారంభించెను. జూదమనందు మంచిపందెములు పెట్టుటకు నలమహారాజువలె రాజ్యముకాని ధర్మరాజువలె భార్యగాని గంగాధరుఁనకు లేకపోయినను, యధాశక్తిగ నతఁడు కష్టపడి సంపాదించిన విత్తమెప్పటి కప్పుడు పాచిద్రవ్యము లేకుండ నొడ్డుచుఁ దరుచుగ నోడిపోవును. అప్పుడప్పుడు డప్పులపాలగుచు సొమ్ముదాచవలసిన బాధ లేకుండఁ గాలము గడుపుచుండెను. ఎప్పుడైనఁ నతడు గెలిచినా యా సొమ్మదివఱకు చేసిన ఋణము దీర్చుట క్రింద పోవును. అప్పుతీరగా నించుక మిగిలెనా యది సింహాచలయాత్ర క్రిందసరిపోవును. చిత్తజల్లు సింహాచలమని యాయూర నొక వేశ్యాంగన కలదు. దాని వయస్సు గంగాధరుని వయస్సుకంటె రెట్టింపు గలదు. కాకినాడ పురవాసులలో ననేకు లదివఱకు సింహాచలసేవ చేసి చేసి విసిగి యితర దేవతా ప్రభావములు విని వారి సేవలకై పోయియుండుటచే నప్పుడు సింహాచలము పూజా నమస్కారములు లేక పాడు దేవాలయములో బూజు పట్టియున్న దేవతావిగ్రహము వలెనే యుత్సవములు లేక నల్లమందు కైనను సరిగా వచ్చుబడిలేక ప్రాతగుల్ల లొక్కొకటే యమ్ముకొని జీవనము చేయుచుండగా దాని పాలిటి దైవమువలె గంగాధరుఁడు వెళ్ళి యాదుకొని యప్పుడప్పుడు కొంత హిరణ్యము సమర్పించుచు దిక్కుమాలిన కుటుంబము నకుఁ దగిన సొమ్మతనకి భగవంతుఁ డీయలేదు. కాని యిచ్చిన పక్షమున నతఁడు గూడ దానికొక గొప్పమేడ మేటిసాహుకారులు తమ ప్రియురాండ్రకు గట్టించిన విధముగఁ గట్టించి యుండును, కోరినంత ధనమీయ లేకపోయినను గంగాధరుడుఁ సింహాచలమునకు శక్తివంచనలేక యుపచారములు చేయఁ దలఁచి తల దువ్వుట, తలయంటి నీళ్ళుపోయుట, గారెలు, బూరెలు మొదలగు పిండివంటలు స్వయముగా వండిపెట్టుట గుడ్డలుదుకుట, యంట్లుతోముట మొదలగు కార్యములు శంకాతంకములు లేక చేసి దానిమెప్పువడసి ధన్యుఁడగుచుండును. అతని యుదారభావమును దీని బట్టియే మీరు గ్రహింపవచ్చును. దానగ్రజన్ముఁడైన బ్రాహ్మణుఁడని గర్వింపక సందేహింపక యది నీచకులజు రాలని యేవగింపక యీపని యాపని యనక శంకింపక యట్టి యుపచారము చేసినవాడు సామాన్యుడా? కాకినాడలోనున్న కాలమున గంగాధరుఁడు కనబఱచిన ప్రజ్ఞనుగూర్చి యొకటిరెండు మాటలు చెప్పవలసియున్నవి. గంగను మోయుటచేత గంగాధరుఁడు సాక్షాత్తు గంగాధరుఁ డయ్యెనుననుట కల్పనాగౌరవముకాదు. శివుఁడు తలపై నిడుకొని గంగను మోసెను. మన గంగాధరుఁడు కావడిలో నిడుకొని గంగను మోసెను. ఆ గంగాధరుడు శూలము ధరించుటచేత శూలియయ్యెను. ఈ గంగాధరుఁడు కడుపు మానమెఱుఁగక తినినందున సంభవించిన పరిణామశూల గలఁవాడగుటచే శూలియయ్యెను. ఆ గంగాధరుఁడు శిరమున నర్ధచంద్రరేఖ ధరించెను. ఈ గంగాధరునకుఁగూడ శిరస్సునగాక పోయినమానె మెడమీదనర్థచంద్రప్రయోగములు చాలసారులు జరిగెను. గంగాధరుఁడనేక లక్షణములలో శివునకు సమానుఁ డగుటయేగాక నొక విషయమున నారాయణుఁ డంతవాడని చెప్పవచ్చును. క్షీరసాగరమందు శేషశాయియై నిరంతరమువసించుటచేత నారాయణుఁడను పేరు గలిగెను. నారమనఁగా జలము. ఆయనమనఁగా స్థానము. నారాయణుఁ డనగా జలమె స్థానముగా గలవాడు. గంగాధరుఁడుగూడ తరుచుగా జలగ్రహణార్థము చెరువులలో నుండుటచే నారాయణుఁ డని చెప్పుట తప్పుగాదు. ఒక్క నారాయణుని తోడనెగాదు, గంగాధరు ననేక దేవతలతోఁ బోల్చవచ్చును. గంగాధరుఁడు పాకశాసనుఁడు. పాఁకుడను రాక్షసుని శాసించుటచేత నీ పాకశాసన శబ్దము లోకమున దేవేంద్రుని యందు వర్తించుచున్నది. పాకమనఁగా వంటను శాసించుటచేట గంగాధరుని యందుఁగూడ నీశబ్దము సార్థకమని చెప్పవచ్చును. గంగాధరుఁడు వంట చేయునని యదివఱ కెక్కడను జెప్పియుండకపోవుటచే నితని యందాశబ్ద మెట్లు సార్థక మగునని మీ రనుమానింపలదు. ఒకఁడు తర్కవ్యాకరణములను రెండు శాస్త్రముల యందు నిర్దుష్ట పాండిత్యముగలిగి యుండియు నేదో యకటే యభిమానవిద్యగ స్వీకరించి యం దెక్కువ కృషిచేసి యుండవచ్చు. అట్లే గంగాధరుఁడు పాకశాస్త్ర మందును జలవాహన శాస్త్రమందునుగూడ నధికపరిచితుఁడై జలవాహన శాస్త్రమందె యధికాభిమానముగలిగి విశేషాభ్యాసము చేసెనని గ్రహింపవలయునేకాని పాక శాస్త్రమందు బరిచితి లేదని గ్రహింపఁగూడదు. ఈ కారణమున గంగాధరునఁకు బాకశాస్త్రమందుఁ బరిచితి గలదని మీ రొప్పుకొనక పొవుదురేని సింహాచలమునకిష్టమైన పిండివంట వండి పెట్టుచుండెడివాఁ డని యిదివర కుదాహరింపఁ బడుటచేత మీరీవాద మంగీకరింపవచ్చును. ఒక సంవత్సరము శ్రావణ మాసములో నీయింటిమీఁద కాకి యాయింటిమీఁద వ్రాలకుండ నాకసము చిల్లిపడునట్లు వాన కురియుచుండఁగా గంగాధరుఁడు జడివానలకు లెక్కపెట్టని దున్నపోతువలె నించుకేనియఁ జలింపక నెప్పటి చాకచక్యముతో నీళ్ళు మోయచుండుటఁజూచి చ్ఛందశ్శాస్త్రము నూతనముగ నేర్చికొని పద్యములు చెప్పవలయునని యుబలాటము బడుచున్న యొక బాలకవి గంగాధరుని ప్రజ్ఞ నొక విషయముగఁ బుచ్చుకొని కొన్ని పద్యములు రచించెను. ఆ పద్యములు లభింపలేదు. కాని వాని యందలి భావము మాత్రము మాకు లభించినందున క్షీరమును విడిచి దాని సారమైన మీగడముద్ద నిచ్చి నట్లు తత్సార మిందుఁబొందుపఱుపఁబడుచున్నది. "ఓగంగాధరా! నీప్రజ్ఞ వర్ణించుట కాదిశేషువునకు వేయినాలుకలు చాలవు. నీవు కావిడిబద్ద పట్టుకొన్నప్పుడు గాండీవము ధరిం చిన యర్జునుఁడు జ్ఞప్తికి వచ్చును. పచ్చడిచేయుటకు నీవు బండ పుచ్చుకొన్నప్పుడు నాగలిధరించిన బలరాముడు జ్ఞప్తికి వచ్చును. వడ్డించుటకు పళ్ళెము పుచ్చుకొన్నప్పుడు సుదర్శనచక్రము ధరించిన హరి మనంబునం దట్టును. నీపాకము నలపాక భీమపాకముల మించును. నీవు చిమ్మిలిముద్దలు మ్రింగుచున్నపుడు చూచినవారు పూర్వకాలము శంకరుఁడు కాలకూట విషపుముద్ద నిట్లె మ్రింగెనని సముద్ర మధన వృత్తాంతము జ్ఞప్తికి దెచ్చుకొని సంతసించు చుందురు. నీకీర్తి బుఱ్ఱ గుంజువలె ముంజవలె సున్నమువలె చల్లవలె విభూతివలె మరబియ్యపన్నమువలె ముసలివాని తలవలె నెంతో తెల్లనై దిక్కులయందు వ్యాపించియున్నది. ఆ కృతిపతికిని కృతికర్తకు నాకవిత్వమునకు 'తగు దాసరికి మెడపూసలకు' నన్నట్లు సరిపోయెను."