కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/కొలనుపాక - శిల్పములు
కొలనుపాక - శిల్పములు
1. ద్వారబంధము :- ద్వారబంధమున కిరువైపుల చెక్కడపు పనికలదు.
- (ఎ) గజలక్ష్మి :- ద్వారబంధమున కొక వైపున గజలక్ష్మి చెక్కబడియున్నది లక్ష్మీదేవి పద్మా సనాసీన అయి రెండు చేతులందు పద్మములను ధరించి యున్నది. అవి ఆమె భుజములవరకూ వచ్చియున్నవి. వజ్ర, వైడూర్యములు చెక్కిన బంగారు ఆభరణములను ధరించియున్నది. చెవులకు మకరకుండలములు కలవు. దేవి కిరీట మకుటధారిణి. రెండు ఏనుగులు ఇరువైపులనుంచి పుణ్యజలమును లక్ష్మీదేవి శిరస్సున అభిషేకించుచున్నవి. శిల్పశైలి దృష్ట్యా యిది. క్రీ. శ. 11 శతాబ్దమునకు చెందియుండవచ్చును.
- (బి) దక్షిణామూర్తి :- ద్వారబంధము రెండవవైపున దక్షిణామూర్తి రూపము చెక్కబడియున్నది. దక్షిణామూర్తి పద్మాసనముమీద వీరాసనములో కూర్చొని, ఒక కాలు అపస్మార పురుషుని వీపుమీద వేసియున్నాడు. ఇతను త్రినేత్రుడు, చతుర్‌భుజుడు. చేతులలో జ్ఞానముద్ర - వరదముద్ర - దండము - అక్షమాల కలిగియున్నాడు. జటామకుటధారి. యజ్ఞోపవీతము, చెవులకు శంఖపత్రమును ధరించెను. మెడయందు రుద్రాక్షమాల కలదు. సప్తఋషులు ఇతనిని పూజించుచున్నారు. దక్షిణామూర్తి ఆత్మయోగమును గూర్చి, సంసార బంధములనుంచి విముక్తి గురించి ఋషులకు బోధచేయునట. అతను ఆసీనుడైయున్న పద్మాసనము, అతిపవిత్రమైన "ఓం" కారమునకు నిదర్శనమట. శిల్ప శైలి దృష్ట్యా ఇది క్రీ. శ. 11 శతాబ్దమునకు చెందినది.
2. కోష్ఠపంజరము :- ఈ శిల్పము ఉబ్బెత్తు ప్రతిమ (Relief figure). ఇది దేవాలయ శిఖరమువలె మూడూంతస్తులతో చెక్కబడియున్నది. మొదటి అంతస్తునందు మామూలుగా కనిపించవలసిన దేవతా ప్రతిమలు (మూర్తులు) కనిపించుట లేదు. స్థల నిర్దేశము మాత్రము కలదు. శైలిదృష్ట్యా క్రీ. శ. 10 లేక 11 శతాబ్దమునకు చెందినది.
3. పార్శ్వనాథుడు :- ఇతను ఇరువది మూడవ జైన తీర్థంకరుడు. కాయోత్సర్గస్థితియందున్నాడు (ఎలాటివంపులు లేక నిటారుగా నిలుచొని యుండు స్థితి). మోకాలుక్రిందిభాగము, తీర్థంకరుని శిరస్సునకు ఆచ్ఛాదనగా కల పాముపడగలు విరిగిపోయియున్నవి. ఉంగరములు చుట్టుకొని, అప్పుడే చక్కగా దువ్వినటులున్న తలవెంట్రుకలు కలవు. చక్కని మెరుపుగలదు. ఈ విగ్రహము కూడ క్రీ. శ. 10 శతాబ్దమునకు చెందినది.
4. ధ్వజ స్తంభము :- ఇది సోమేశ్వరస్వామివారి ధ్వజస్తంభము. క్రీ. శ. 15 శతాబ్దమునకు చెందిన తెలుగు శాసనమొకటి దీనిమీద కలదు. దానిలో ఇది ఒక జయస్తంభమని, "రెసబరలగనె-------" కుమారుడైన యల్లప్ప స్థాపించినటుల తెలియుచున్నది.
5. గణపతి :- దేవాలయ ద్వారముదగ్గర, ఇరువైపుల గణపతి విగ్రహములు కలవు. వీనికి ఎలాటి కిరీటములు లేక, చెవులు కొంచెము చిన్నవిగ, ఉన్నవి. గణపతి చతుర్ భుజుడు. ఎడమ చేతియందు కల మోదకములను భక్షించుచున్నాడు. నాగఉదరబంధముకలదు. ఇవి బహుశ: పురాతనమై క్రీ. శ. 11 - 12 శతాబ్దమునకు చెందియుండనోపు. (చిత్రము - 2)
6. ఆంజనేయుడు : -పైన చెప్పిన ధ్వజస్తంభమునకు ముందుగా ఈ విగ్రహము కలదు. కుడిచేతియందు గద. ఎడమ చేయి చిన్ ముద్రను ధరించియున్నవి.
7. రాతిఫలకము :- చతురప్రాకారములో కల రాతిఫలకమిది. దీని మధ్య ఒక దేవతా విగ్రహము నిలుచుని యున్నటులున్నది. నాలుగు చేతులు కల ఈ దేవత పై రెండు చేతులందూ సర్పము, త్రిశూలము ధరించి యున్నాడు. మిగిలిన కుడిచేతియందు గద, ఎడమ చేయి కట్యవలంబితమై కలదు. అతను కంకణములు, కేయూరములు, యజ్ఞోపవీతము కలిగియున్నాడు. పెద్ద కుండలములు చెవులకు కలవు. ఇది బహుశ:అంత ప్రాచీన శిల్పముకాదు.
8. నటరాజు :- శివస్వరూపము: భుజంగత్రాస నృత్యము సల్పుచున్న నటరాజ విగ్రహమిది.[1] కొంచెముగా వంగిన కుడి కాలు అపస్మార పురుషుని వీపు మీద మోపి, ఎడమకాలు కొంచెము పైకెత్తినటుల చూపబడినది. నటరాజస్వామికి పదిచేతులు. అందు ముందరి రెండు చేతులు నాట్యరీతియందుకలవు. మొదటి ఎడమ చేయి దండహస్తము[2] (లేక గజ హస్తము) నందుకలదు. కుడిచేయి అభయ హస్తమునందుండి మణికట్టుదగ్గర సర్పవలయములు కలవు. కుడివైపునుండి వర్తులాకారముగా త్రిశూలము, పాశము, డమరుకము, ఖడ్గము (పరశు), డాలు, చక్రము, సర్పము చేతులందు ధరించియున్నాడు. కేశములు జటామకుటముగా ముడిచి దుర్దర పుష్పాలంకృతమై యున్నవి. యజ్ఞోపవీతము, ఉరుసూత్రము కూడకలవు. చేతి వ్రేళ్ళకు ఉంగరములు, కాలి వ్రేళ్ళకు మట్టెలు ధరించియున్నాడు. చాళుక్య శైలిలో సర్వాభరణాలంకృతుడై యున్నాడు. ఇది ఉబ్బెత్తు విగ్రహము (Bass Relief). తెల్లబండరాయి యందు చెక్కబడినది. బహుశ: క్రీ. శ. 11 శతాబ్దమునకు చెంది యుండును. (చిత్రము - 3)
9. మహిష మర్దని:- అమ్మవారు నాలుగు చేతులు కలిగి ఎడమచేతులందు శంఖము, మహిషముయొక్క తోక, కుడిచేతులందు ఖడ్గము, చక్రము ధరించియున్నది. శిల్పచాతుర్యమంత పురాతనముగా కనుపించదు. దేవి కంకణ కేయూరములు, మేఖలము, వదులుగా యున్న మొలనూలు, అనేక హారములు, కుండలములు ధరించియున్నది. అమ్మవారి తలదగ్గరి ప్రభామండలము అండాకారముగా కలదు. ఈమె కరండ మకుటధారిణి. కాని ఈ మకుటము హ్రస్వముగా కనిపించుచున్నది. అమ్మవారు కాశె బిగించి వస్త్రము ధరించియున్నది. క్రీ. శ. 12 శతాబ్దము.
10. వీరకలు:- ఒక శిలాఫలకములో కల విగ్రహమిది. కాని ఫలకము ఎక్కువభాగము విరిగిపోయినందున ప్రస్తుతము బాగా అలంకరించిన ఏనుగు మాత్రము కలదు. దానిమీద యుండిన వీరుడు, మిగతా వివరణ విరిగిపోయినది.
11. యాళి విగ్రహము:- ఈ జంతువు అతిభయంకరముగా కనుపట్టుచున్నది. కళ్లు మిడిగుడ్లు; గాండ్రింపునోరు; చిన్నవైన చెవులు; నిక్క బొడిచి వంచినతోక; ఈ మృగము మీదికి దూకగలదన్న భ్రాంతిని కలిగించుచున్నది.
12. దంపతులు:- రాతిఫలకము మీద మలచిన ఉబ్బెత్తు విగ్రహము: ఒక దంపతుల జంట బాగా అలంకరించిన ఒక ఏనుగు మీద ఎక్కిపోవుట సూచించినది. గొడుగువంటి ఆచ్ఛాదన వారి శిరస్సునకు కలదు. మగవాని చేతియందు ఖడ్గము కలదు. ఇరువురి వదనములు రూపుచెడియున్నవి. అతని శిరస్సున శిఖ, ఆమెకు ధమ్మిల్లము కలవు. (చిత్రము - 4)
13. చామర గ్రాహిణి:- ఈ స్త్రీమూర్తి చాలా సొగసైన త్రిభంగిమ రీతిలో నిల్చొనియున్నది. ఈమె ముఖలక్షణములు, నిలుచున్న భంగిమ అజంతా చిత్తరువులందలి స్త్రీ మూర్తులను పోలియున్నది. క్రీ. శ. 10 - 11 శతాబ్దము.
14. నాగిని:- దీర్ఘచతురస్రాకారపు ఫలకముపై ఒక నాగినిమూర్తి నిక్షిప్తమైయున్నది. అనేక ఆభరణములు ధరించిన నాగినికి ఒక పొడవాటి హారము స్తనముల మధ్యనుంచి వ్రేలాడుచున్నది. ఆమె కత్తి, డాలు ధరించియున్నది. మూడు తలల నాగేంద్రుడు ఆమె శిఅరస్సున కాచ్ఛాదన కలిగించుచున్నారు. దీని వల్లనే ఈమూర్తి నాగినియని మనము గ్రహించవలయును.
15. భైరవుడు:- భైరవుడు దిగంబరుడు.[3] చతుర్‌భుజుడు. అందు ఖడ్గము - త్రిశూలము ----(పాశము?) కపాలము కలిగియున్నాడు. కపాలమాల, రెండు కోరలతో భయానకముగా ఉన్నాడు. ఇది క్రీ. శ. 12 శతాబ్దమునకు చెందినది.
16. మహిషమర్దని:- మహిషాసురుని కాలితో త్రొక్కిపెట్టినట్లు త్రిభంగ మందు మలచిన పవిత్ర మూర్తి అతి సుందరముగానున్నది మౌక్తికధారిణి. సన్నగా, తీర్చిదిద్ది నటుల కనిపించుచున్న ఈమూర్తికి, ఆభరణ సంపద కొంత ఎక్కువగా ఉన్నటుల కనిపించుచున్నది. ఈ శిల్పము బాగుగా నునుపుచేయబడి యున్నది. కాని కొన్ని పెచ్చులు లేచిపోయెను. ఈమెకు ఎనిమిది చేతులు. అందు కుడిచేతులందు బాణము, డాలు మూడవచేయి విరిగియున్నది. ఎడమ చేతులందు కత్తి, విల్లు, త్రిశూలము ధరించి, మిగిలిన రెండు చేతులందు మహిషుని పట్టుకొనియున్నది. మహిషము తల తెగిపోగా, రాక్షసుడు మానవాకారముతో బయటికి వచ్చుచూ అంజలి ఘటించుచున్నాడు. సుకుమారముగా కనుపించు అమ్మవారి తనూలత మీద, బరువైన కరండమకుటము ఆకర్షణీయముగా నుండక, అసహజముగా నున్నట్లు కనుపించును. వనమాల, మణిమయ మేఖలము, కంఠహారము, వివిధహారములు, కంకణములు, కేయూరములు,కుండలములు ధరించి దుర్గాదేవి నిండుగా కనిపించుచున్నది. చాళుక్య శిల్పము. క్రీ. శ. 12 శతాబ్దము (చిత్రము - 5)
17. చాముండ:- చాముండ సప్త మాతృకలలో ఒకటి. ఇది ఒకింత పెద్ద విగ్రహము. చతుర్‌భుజ. నాలుగు చేతులందు ఖడ్గము, త్రిశూలము, డమరుకము, కపాలము, ధరించియున్నది. పద్మాసనాసీనమైయున్న ఈమె ఎముకల గూడుగా నుండును. పొట్ట వెన్నుకతుక్కొని, పళ్ళికిలించి, వ్రేళ్ళాడు స్తనములతో నిడువైన చెవులు, పెద్ద చెవితొఱ్ఱలు, చింకిరిజుట్టు, కపాల ముఖపట్ట ధరించి భయము గొల్పుచున్నది. వెడల్పైన కంఠహారము, నాగ కేయూరములు, సర్ప కుండలములు, నాగ కుచబంధము ఆభరణములుగా కలిగి విలక్షణముగా ఉన్నది. క్రీ. శ. 10 శతాబ్దము.
18. మహిషాసురమర్దని:- దుర్గాదేవి మహిషాసురుని తల నరకగా, కారెనుము మొండెమునుంచి మానవాకారముతో రాక్షసుడు అంజలి ఘటించి వచ్చుచున్నాడు. విగ్రహము బాగాపాడైయున్నది. చాళుక్య శిల్పము: క్రీ. శ. 11 - 12 శతాబ్దము.
19. వీరకల్లు:- దీర్ఘచతురస్రాకారపు రాతిపలకమీద ఏనుగు నెక్కి పోవు వీరుని చెక్కియున్నారు. దీనికిరువైపుల రెండు స్తంభములు చెక్కబడియున్నవి. వాటి మీదనుంచి వచ్చియున్న తోరణము మధ్యలో శిల్పము నిక్షిప్తమై యున్నటు లున్నది. తోరణమువల్ల శిల్పమునకు ఒక వినూత్నశోభ కలిగియున్నది. ఏనుగు బాగా అలంకరింపబడియున్నది. వీరుని ముఖము, చేతులు రూపుచెడి యున్నవి. వీరుని చేతియందు ఖడ్గము కలదు. కేశములు శిఖగా నేర్పడియున్నవి. శిల్పము అడుగు పీఠముమీద క్రీ. శ. 13 లేక 14 శతాబ్దమునకు చెందిన శాసనము కలదు. అందులో "లెంక అన్నయ్య" అని మాత్రము చదువ వీలుగానున్నది. మిగిలిన అక్షరములు బాగా చెరిగి పోయియున్నవి. ఈ అన్నయ్య లెంక కాకతీయ ప్రతాపరుద్రుని సేనానులలో నొకడు. రాయగజ సాహిణి, మాదాయ రెడ్డికి తమ్ముడు గావచ్చును. ఇతడు ముసల్మానుదండు నెదుర్కొనుచు వీరమరణము నొందెను. క్రీ. శ. 14 శతాబ్దము.
20 సప్తమాతృకలు:- ఒకే భద్రపీఠముమీద సుఖాసీనులుగా మలచిన శిల్పమిది. పెద్దపరిమాణములో శిల్పలక్షణములతో నున్నదీ శిల్పము. ఇరుపార్శ్వములందు గణపతి వీరభద్రులు చెక్కబడి మధ్య సప్తమాతృకలు చెక్కబడియున్నది. అంధకాసురుడను రాక్షసుడు అవిక్ర పరాక్రమముతో, అజేయుడై ప్రపంచము నంతటి భయభ్రాంతులు గొల్పుచుండగా పరమశివుడు దేవతలందరి శక్తుల యొక్క అంశములతో సప్తమాతృకలను సృష్టించి, అతని పీడను ప్రపంచమునకు లేకుండ చేసినాడట. ఇందు బ్రాహ్మి, మహేశ్వరి,కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ; ఇవికాక యోగేశ్వరి కూడా కలదని ఒక వాదన కలదు. ఆమెతో కలిసి ఎనిమిదిమంది కాగలరు. కాని సప్తమాతృకలు ఏడుగురు మాత్రమే యుండవలయును, (సప్త = ఏడు). ఒక్క వరాహ పురాణము తప్ప మిగిలినవన్నీ ఏడుగురిని మాత్రమే తెలుపుచున్నవి.[4] సప్తమాతృకలు క్రింది విధముగా చూపబడినవి:
వీరభద్రుడు:- ఈఫలకమందు మొదట వీరభద్రుడుండును. ఇతనిని వీణాధరశివుడని పిలుచుట కూడా కలదు. ఇతను త్రిశూలము, రుద్రాక్షమాల ధరించి మరి రెండు చేతులతో వీణవాయించుచున్నాడు. దండకడియములు, మురుగులు, కర్ణాభరణములు, ముత్యాలహారములు, మేఖలము, ధరించియున్నాడు. కేశములు జటాజూటముగా నేర్పడియున్నవి.
- ఎ. బ్రాహ్మి:- ఈ దేవి చతుర్‌భుజ. అందు కలశము, పండు, పాశము, అభయముద్ర కలవు. కంకణ కేయూరములు,మేఖలము ధరించియున్నది. కరండమకుట ధారిణి: దేవి పాదములవద్ద వాహనమైన హంస కలదు.
- బి. మహేశ్వరి:- ఈమెకూడా చతుర్‌భుజ. త్రిశూలము, ఫలము, డమరుకము, అభయముద్ర కలిగియున్నది. పైన దేవికి చెప్పిన అన్ని ఆభరణములనూ ధరించి యున్నది. వాహనమైన నంది పీఠము మీద చెక్కియున్నది.
- సి. కౌమారి:- ఈ దేవి చతుర్‌భుజ. అందుశక్తి, ఫలము, వజ్రము, అభయముద్ర కలిగియున్నది. ఈమె వాహనమైన నెమిలి పీఠము మీద చెక్కియున్నది. సర్వాభరణములను ధరించియున్నది.
- డి. వైష్ణవి:- ఈమె చతుర్‌భుజ. అందు శంఖము, ఫలము, చక్రము, అభయముద్ర ధరించియున్నది. గరుత్మంతుడు అళితాసనాసీనుడై పీఠముమీద చూపబడెను.
- ఇ. వారాహి:- చతుర్‌భుజ. అందు ఫలము, కలశము, అభయము కలిగి, నాలుగవ చేయియందలి రూపము బాగుగాలేదు. కరండమకుట ధారిణి, వరాహ (పంది) ముఖము కలది. మహిష వాహనము కలదు.
- ఎఫ్. ఇంద్రాణి:- చతుర్‌భుజ. ఆమె అంకుశము, ఫలము, వజ్రము, అభయముద్ర చేతులందు కలిగియున్నది. ఐరావతము (ఏనుగు) వాహనము, పీఠముమీద చెక్కియున్నది.
- జి. చాముండ:- ఈమె చతుర్‌భుజ. అందు త్రిశూలము, ఫలము, డమరుకము, అభయముద్ర ధరించియున్నది. కపాలములతో కూర్చిన ఉపవీతము (యజ్ఞోపవీతము) కలిగియున్నది. నక్క వాహనము పీఠము మీద చెక్కియున్నది.
గణేశుడు:- గణపతి చతుర్‌భుజుడు. అంకుశము, మోదకములు, దంతము, తావలము ధరించియున్నాడు. కరండమకుటధారి. సర్పఉదర బంధము, మిగిలిన ఆభరణములు ధరించియున్నాడు.
సప్తమాతృకలు, గణపతి, వీరభద్రుడు అందరూ ఒకే భద్రపీఠము మీద కూర్చొనియున్నారు. అందరకూ అర్థచంద్రాకారపు ప్రభామండలములు కలవు. అందరికి కంకణకేయూరములు, మేఖలము, ఉరుమాల, కారండమకుటము కలవు. కాశె బిగించిన వస్త్రధారణ కలిగియున్నారు. "త్రివళి" బాగా కనిపించుచున్నది.[5] ఇది చాళుక్య శిల్పము. క్రీ. శ. 11 - 12 శతాబ్దము.
21. భద్రకాళి:- (మహాకాళి) అర్ధచంద్రాకారపు ఫలకమందు చెక్కిన శిల్పము. చతుర్‌భుజ. పైచేతులందు డమరుకము, త్రిశూలము, క్రింది ఎడమచేయియందు అభయముద్రకలదు. నాలుగవచేయి విరిగిపోయినది. విగ్రహపు ఎడమ భాగమున నందివాహనము చెక్కియున్నది. కుడిభాగమందు వినాయకుడు కలడు. కాశెబిగించిన వస్త్రము, పట్టుదట్టీ, దాని పటకము ముందువ్రేళ్ళాడుచూ కలదు.
22. నాగశిల్పము:- నాగునకు నడుము క్రిందిభాగము సర్పరూపము పైభాగము మానవరూపము రెండు చేతులందు కత్తి, డాలు ధరించియున్నాడు. మణిమయ కిరీటము, అనేక హారములు కలిగియున్నాడు. ఇరు వైపుల ఒక నాగు నిలిచి పడగతో గౌరవముగా నీడనిచ్చుచున్నది. క్రీ. శ. 12 శతాబ్దము.
23. వీరకల్లు:- దీర్ఘ చతురస్రాకారపు రాతిఫలకములో మలచిన శిల్పమిది. ఇది రెండుభాగములుగా ఉన్నది. మొదటి భాగములో ఒక గుఱ్ఱపు రౌతు ఈటెను ధరించియున్నటులున్నది. రెండవభాగములో ప్రేయసీ ప్రియులు గుఱ్ఱము మీద స్వారీ అయి పోవుచున్నారు. గొడుగులాంటిది ఒకటి వారికి ఆచ్ఛాదన కలదు. గుఱ్ఱము బాగుగా అలంకరించియున్నది. మొదటి రౌతు పార్శ్వాకారము (Profile) నందు కలదు. క్రీ. శ. 12 శతాబ్దము.
24. పార్వతి:- ఇది ఒక ఊర్ద్వాంగ ప్రతిమ (Bust). అనగా నడుముకు క్రింది భాగము విరిగియున్నది. చేతులు కూడా విరిగిపోయినవి. దేవి కరండ మకుటధారిణి. సర్వాభరణములు ధరించియున్నది. క్రీ. శ. 12 శతాబ్దము.
25. ఫలకము:- రాతిఫలకము కొంతమేర విరిగిపోయినది. సోమేశ్వరస్వామి మధ్యను కలడు. స్వామివారికి మూడు తలలు. నాలుగుచేతులు. అందు అభయముద్ర, సర్పము, కమండలము (?) త్రిశూలము కలవు. సోమేశ్వరుని కుడి పార్శ్వమందు విష్ణుమూర్తికలడు. ఆయన మొదటి రెండు చేతుల అంజలి మోడ్చియున్నారు. పైరెండు చేతులందు శంఖము, చక్రము, ధరించియున్నాడు. మణిమయ కిరీట ధారి. ఇది పార్శ్వాకారమునకలదు (In Profile). విష్ణుమూర్తి వాహనము గరుడుడు. అళిదాసనమందు పీఠముమీద చెక్కబడియున్నాడు. ఇదిబాగా పురాతనమైనదిగా కనిపించుచున్నది. క్రీ. శ. 8 శతాబ్దమునకు చెందియుండవచ్చును.
26. ఫలకము:- ఈ ఫలకమందు చెక్కిన శిల్పమును నిర్ణయించుట కొంచెము కష్టము. ఇతను దండమును ధరించినను, దాని చివర పానవట్టపు ఆకారము కలదు. మిగిలినచేతులందు కలశము, పాశము, అభయముద్ర కలదు. గడ్డము, జటామకుటము కలవు. కీర్తిముఖపతకము కలిగినమేఖలము ధరించి యున్నాడు. ముత్యాలహారములు, కంకణములు, మొదలుగాగల ఆభరణములను ధరించియున్నాడు. బహుశ: ఈ ప్రతిమను బ్రహ్మగా గుర్తించవచ్చును. క్రీ. శ. 13 శతాబ్దము.
27. కోష్ఠపంజరము:- ఇది మూడు అంతస్థుల శిఖరముకలది. మొదటి అంతస్థునందు ఉమామహేశ్వర విగ్రహము చెక్కబడియున్నది. ఉమామహేశ్వరుడు చతుర్‌భుజుడు. అందమైన రూపుకలవాడు. రజోగుణమూర్తి. ఇతను భద్రపీఠము మీద ఆసీనుడై ఎడమకాలు మడిచిపీఠముమీద పెట్టి కుడికాలు క్రిందకు వ్రేళ్లాడు చుండునట్లుండును. జటామకుటధారి. కంకణ కేయూరములు, యజ్ఞోపవీతము కలిగి యుండును. శివుని వామపార్శ్వమున పార్వతీదేవి (ఉమ) యుండును. ఈమె కరండమకుట ధారిణి. ఎడమచేతియందు ఉత్పలమును ధరించి యుండును. (శివుడు నాలుగు చేతులందు అభయ, సింహకర్ణము,మృగము, పరశువు, గలిగి యుండును) ఇది క్రీ. శ. 11 - 12 శతాబ్దము నాటిది. చిత్రము - 6)
28. సూర్యుడు:- ఇది మొండి విగ్రహము (తలవిరిగి పోయినది). సమపదస్థానక మందు కలదు. రెండుచేతులందు సగము వికసించిన పద్మములను భుజముల వరకూ వచ్చువిధముగా ధరించియున్నాడు. ధోవతి, దానికి కటి బంధముకలవు. ఉదరబంధము కలదు. దాక్షిణాత్య సాంప్రదాయము ప్రకారము కాళ్ళకు మొనతేలిన పాదరక్షలు (Boots) లేవు.[6] క్రీ. శ. 12 - 13. శతాబ్దము.
29. నాగిని:- సగము మానవరూపము, సగము సర్పరూపము కలదు. కత్తి, డాలు ధరించియున్నది. ఒకేసరముగల హారముధరించి, కంకణ కేయూరములు మేఖలము ధరించియున్నది. కరండమకుట ధారిణి. రెండు సర్పములు,నిలువుగా రెండు ప్రక్కల నిలబడియున్నవి.
30. శివలింగము
31, 32. ద్వారపాలురు:- సోమేశ్వరస్వామి వారి దేవళము ముందర కల ద్వారపాలురు కొంచెముగా వంగి వారి చేతిగదల మీద ఆనినటులున్నారు. కోరమీసములు, మిడిగుడ్లు, కలిగియున్నారు. ఇది చాళుక్యశిల్పము. క్రీ. శ. 11 - 12 శతాబ్దము నాటిది.
33. వజ్రపాణి:- బౌద్ధమత మందలి దేవతయగు వజ్రపాణి విగ్రహము. బౌద్ధాగమము ననుసరించి వజ్రపాణి రెండుచేతులుకలిగి కుడిచేతియందు వజ్రము (చిరుతలాంటిది) ఎడమ చేతియందు కర్ణముద్రను కలిగియుండును. కపాలమాలను శిరస్సున ధరించియుండును. మెడలోకూడ కపాలమాలను మెలితిరిగిన పామును హారములుగా కలిగియుండును. వజ్రపాణి నిలుచుని కపాలముమీద నృత్యము చేయుచుండును. కాని ఈ విగ్రహము నడుము క్రిందిభాగము విరిగిపోయినందున ఎటులున్నదీ తెలియదు. (చిత్రము - 12)
వజ్రపాణి భయంకరరూపము కలిగినవాడు. ఇతను బౌద్ధమత మందలి తాంత్రికశక్తులకు సంబంధించిన సూత్రకారుడందురు. ఇతను బౌద్ధులకు శక్తి ప్రదాతయని ప్రతీతి. క్రీ. శ. 13 శతాబ్దము.
34. కార్తికేయుడు:- కుడిచేతియందు శక్తిని ధరించిన శిల్పమిది. ఎడమ పార్శ్వమున కార్తికేయునిభార్య వల్లీదేవి అతని కళ్ళలోనికి చూచుచున్నది. కుడివైపు పీఠముమీద అతని వాహనము నెమలి కలదు. వల్లీదేవి వస్త్రము ఆమె పిక్కల వరకూవచ్చియున్నది. కేశములు ధమ్మిల్లములోనున్నవి. కార్తికేయునికి మణిమయ కిరీటము కలదు. ఇతనికి ఒకశిరస్సు, త్రినేత్రుడు.
35. మహిషాసురమర్దని:- ఇది త్రిభంగ మందు మలచిన అందమైన మహిషాసురమర్దని విగ్రహము. రూపుకొంచెము చెడియున్నది గాని అందము చెడలేదు. మహిషముతల వేరుచేయగా, దాని దేహమునుంచి రాక్షసుడు మానవాకారముతో అంజలి ఘటించివచ్చుచున్నాడు. అమ్మవారికి ఎనిమిది చేతులు.మొదటి రెండు చేతులతో మహిషాసురుని పట్టుకొనియున్నది. మిగిలిన హస్తములందు ఖడ్గము, బాణము, త్రిశూలము, ఎడమ చేతులందు పాశము, చక్రము ధరించెను, ఒక చేయి విరిగిపోయియున్నది. బహుశ: అందు శంఖము ధరించి యుండును. చాళుక్య శైలిలో సర్వాభరణములు ధరించియున్నది. క్రీ. శ. 11 - 12 శతాబ్దము.
36. ఉమామహేశ్వరులు:- ఒక ఫలకమునందు శివపార్వతులు భద్రపీఠము మీద సుఖాసీనులైయున్నారు. నందివాహనము పీఠముమీద చెక్కబడియున్నది. శివునికి జటామకుటము, యజ్ఞోపవీతము కలవు. వామపార్శ్వమున పార్వతికలదు. ఈమెకు రెండుచేతులు. కుడిచేతియందు పద్మము, ఎడమచేయి సింహకర్ణమునందు కలదు. ఈమె కరండమకుట ధారిణి. ఈమె సర్వాభరణభూషిత అయి, శివుని భుజముల వరకూ వచ్చియున్నది.
37. సూర్యుడు:- కమల బాంధవుడు. తన రెండుచేతులందు సగమువికసించిన పద్మములను ధరించియున్నాడు. అవి అతని భుజములవరకూ వచ్చియున్నవి. ఉదరబంధముకలదు. పాదములకు పాదరక్షలులేవు.
38. కుబేరుడు:- ఇతను ధనపతి. ధనపతి యక్షవంశపు రాజు. కనుక అందరు యక్షులవలె కుంభోదరుడు (కుండపొట్టకలవాడుగా చూపబడెను). చతుర్‌భుజుడు. అన్ని ఆభరణములనూ ధరించియున్నాడు. ఉదరబంధము, మణిమయ కిరీటము కలిగియున్నాడు. అతని కుడిచేతియందు పుష్పము (పద్మము) కలదు.
39. ఆలింగన చంద్రశేఖరమూర్తి:- ఈ రాతిఫలకమునందు పార్వతీ పరమేశ్వరులు నిల్చొనియున్నారు. శివుడు తన వామహస్తముతో పార్వతిని ఆలింగనము చేసుకొనియున్నట్లు చూపబడెను (భుజముమీద చేయి వేసియున్నాడు). కుడిచెయ్యి తన నడుము మీద పెట్టుకొనియున్నాడు. శివుని శిరస్సున జటాజూటము కలదు. ఇరువురు ముఖములు చెడిపోయియున్నవి. పార్వతి తలవెంట్రుకలు ధమ్మిల్లముగా అమరియున్నవి. ఆమెవస్త్రము బాగా పొడవుగా పాదములను తాకుచూ ఉన్నది. సర్వాభరణ భూషిత.
శివుడు చతుర్‌భుజుడు. అతని చేతులందు కుడివైపునుంచి అభయహస్తము, త్రిశూలము, సర్పము (తావళము) ధరించి, నాలుగవ చేతితో ఆలింగనము చేసుకొని యున్నట్లు కలదు (నాలుగవచేయి పార్వతి భుజముమీద వేసియున్నది). పార్వతి వామహస్తమున నీలోత్పలము ధరించి, కుడిచేతిని నడుముమీదపెట్టుకొని త్రిభంగిమమందు నిలిచి యున్నది.[7] చాళుక్య శిల్పము. క్రీ. శ. 11 శతాబ్దము.
40. చాముండ:- సప్తమాతృకలలో ఒక మాతృక చాముండ. ఈమె చతుర్ భుజములు కలిగి అందు త్రిశూలము, కలశము, ఖడ్గము, డమరుకము, ధరించియున్నది. మామూలుగానుండు ఎముకలపోగు ఆకారముగాక ఈమె దృడముగా ఉన్నది. మామూలు ఆభరణములు (చాళుక్యశైలిని) ధరించియున్నది. క్రీ. శ. 12 శతాబ్దము. (చిత్రము - 7)
41. విష్ణువు:- ఇది చాలా అందమైన విష్ణువు విగ్రహము. స్వామివారు చతుర్‌భుజుడు. చేతులందు పద్మము, శంఖము, చక్రము, గద కలిగియున్నాడు. చతుర్ వింశతి మూర్తులందలి "గోవిందుని" రూపమిది. ఇరువురు చామరగ్రాహిణులు ఇరువైపుల కలరు. క్రీ. శ. 12 శతాబ్దము. (చిత్రము - 8)
42. సరస్వతి:- చదువులదేవి సరస్వతి. పద్మపీఠముమీద పద్మాసనాసీన అయియున్నది. మూడు యాళిమృగములు భద్రపీఠముమీద చెక్కియున్నవి. క్రీ. శ. 12 శతాబ్దము.
43. విష్ణువు:- సమపదస్థానకము నందలి విష్ణువిగ్రహమిది. చతుర్ భుజుడు. అందు శంఖచక్రగదా పద్మములు కలిగియున్నాడు. చాళుక్యలక్షణములు కల ఈ మూర్తి, చతుర్‌వింశతి మూర్తులందలి "కేశవమూర్తి" రూపముగానగును. కటిబంధము, కంకణ కేయూరములు, ముత్యాలహారములు, కర్ణాభరణములు కలిగియున్నాడు. కిరీటము చెడిపోయియున్నది. కిరీటమకుటము కానోపు, పాదముల తాకు ధోవతి, దానికి ముందు విపులముగా గల పటకము అందముగా ఉన్నది.
44. కోదండరాముడు:- విష్ణువుయొక్క దశావతారములందు శ్రీరామావతారమునకు ప్రత్యేకత కలదు. ఇతను సంపూర్ణ మానవుడని విజ్ఞుల అభిప్రాయము. ఇతను సామాన్యముగా త్రిభంగమందు కోదండము ధరించి సీతాలక్ష్మణ సమేతుడై యుండును. కాని ఇచ్చట కోదండరాముడు సమపద స్థానక మూర్తి. కుడిచేతి యందు బాణము, ఎడమచేతి యందు ధనుస్సు ధరించియున్నాడు. వస్త్రధారణ, ఆభరణములు విజయనగర శైలియందు కలవు. కిరీటమకుట ధారి. క్రీ. శ. 16 శతాబ్దము (చిత్రము - 9).
45. బ్రహ్మ:- చతురప్రాకారపు రాతిఫలకము. బ్రహ్మ పద్మపీఠముమీద నిలచియున్నాడు. కొంత విరిగిపోయియున్నది. చతుర్‌భుజుడు. మొదటి రెండు చేతులు అంజలిఘఠించియున్నవి. పైరెండు చేతులందు ఆజ్యస్థాలి (నేతికలశము) తావలము కలవు. ఇతనికి మూడు తలలు కలవు (నాలుగవది వెనుకయున్నటుల గ్రహింపవలయును). ఈ నాలుగు ముఖములు నాలుగు వేదముల సూచించును. వాటిని మణిమయ కిరీటము లలంకరించియున్నవి. (జటామకుటము యుండుట కూడ కలదు). హంస వాహనము పీఠముమీద కలదు. కటిసూత్రము, యజ్ఞోపవీతము మొదలగు ఆభరణములు దేహము నలంకరించి యున్నవి. శివునిదో లేక సావిత్రిదో ఒక చేయి శూలమును ధరించియున్నది, కాని విగ్రహము విరిగిపోయినది. పశ్చిమ చాళుక్య విగ్రహము. క్రీ. శ. 12 శతాబ్దము.
46. శివుడు:- జటాజూటధారి అయిన పరమశివుని రూపమిది. బాగా రూపు చెడియున్నది. శివుడు చతుర్ భుజుడు. కాని ఒక చేతియందు గద, మరొక చేతియందు తావలము మాత్రము కనిపించుచున్నవి. మిగిలిన చేతులు విరిగిపోయినవి. బహుశ: ఇది పాశుపతమూర్తి అయియుండవచ్చును. క్రీ. శ. 11 శతాబ్దము.
47. పరశురాముడు:- విష్ణువుయొక్క దశావతారములందు పరశురాముని గూడ చేర్చుట కలదు. ఇతనికి జటాజూటము, మునిరూపు కలవు. కుడిచేతియందు పరశువు (గండ్రగొడ్డలి), ఎడమచేయి సూచీ హస్తము కలవాడు. మోకాళ్ళు దిగని ధోవతి ఇతని వస్త్రధారణము. క్రీ. శ. 16 శతాబ్దము.
48, 49. ద్వారపాలురు. (శిల్పం 31 మరియు 32 చూడుడు).
50. నంది:- అద్దంలాగ మెరుగుపెట్టబడిన నల్లరాయియందు మలచిన కాకతీయ నందివిగ్రహమిది. విగ్రహస్వరూపముతో పోల్చిన దానికి చేసిన ఆభరణ సంపద కొద్దిఎక్కువనిపించును. ముత్యాలహారములు, బాగా ఉబికివచ్చినటుల స్థిరముగా కనిపించుచున్నవి. అన్నిలక్షణములు పరిపూర్తిగా రూపొందించబడ్డ ఈ విగ్రహము, కాకతీయశిల్పకళానైపుణికొక ఆణిముత్యమనిపించును. ముఖమునకు మువ్వలపట్టీ, అనేక ఇతర హారములు, కీర్తిముఖపు కుచ్చులు, మువ్వలహారము, అన్నీకలిపికట్టి వీపుమీద బ్రహ్మముడికి కలిపి చాలా అందముగా ఉన్నది. మెడలోని గజ్జలహారము అపురూపము. వీటన్నింటితో ఈ నంది తీర్చి దిద్దినటులున్నది. కాకతీయ, క్రీ. శ. 3 శతాబ్దము. (చిత్రము - 10)
51. శిలాఫలకము:- దీర్ఘ చతురస్రాకారపు ఫలకము. రెండుభాగములుగా విభజించబడినవి. పైభాగమునదు ఒక భక్తుడు శివలింగమును పూజించుచున్నాడు. రెండవ భాగమందు ఒక వీరుడుకలడు. రాతిఫలకమునకు నాలుగువైపుల వెడల్పైన అంచుకలదు. అంచుమీద క్రీ. శ. 10 శతాబ్దపు శాసనము కలదు. దానిని గ్రహించుట కష్టము. రెండవభాగమందలి వీరుడు ఈటెనుధరించి (ఎడమ చేతియందు) కుడి చేతియందు కత్తిని ధరించి యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నాడు. ఆతను యుద్ధము చేయుచున్నాడనుటకు నిదర్శనముగా అతని కాళ్ళదగ్గర యిద్దరు మృతవీరులు పడియున్నారు.
52. మహావీరుడు:- జైనతీర్థంకరులలో ఇరువదినాలుగవవాడైన వర్ధమాన మహావీరుని విగ్రహమిది. ఇతను పద్మాసనాసీనుడై యోగముద్ర యందున్నాడు. ఇతని తలమాత్రం ప్రస్తుతం మృగ్యం. ఇది బాగా మెరుగుపెట్టబడ్డ నల్లనికాంతులీను చున్నది. క్రీ.శ. 11 - 12 శతాబ్దము. (చిత్రము - 11)
- ↑ అపస్మారపురుషుని మీద మోపిన కుడికాలి మోకాలి కన్నా పైకెత్తిన ఎడమ కాలుయున్న భుజంగలలితమనియు, మోకాలికన్నా క్రిందికియున్న భుజంగత్రాస నృత్యమనియు నందురు. ఇవి రెండు తాండవ మందలి రీతులు.
- ↑ ఎడమ చేయి శరీరము మధ్యగా, సమాంతరముగా కుడివైపుకువచ్చి, హస్తము మణికట్టు దగ్గరనుంచి వంగియుండుట.
- ↑ ఈ రూపమును చేయుటయందు ఉత్తర దక్షిణభారత దేశములకు వ్యత్యాసము కలదు. ఉత్తరభారతమునందు పాదరక్షులు (పాదుకలు) చూపుదురు. దాక్షిణాత్యశిల్పములందు అవి సామాన్యముగా ఉండవు.
- ↑ వరాహ పురాణములో యోగేశ్వరి ఎనిమిదవ దేవి. ఈ పురాణమును బట్టి ఎనిమిది మాతృకలు, ఎనిమిది మానసికస్థితులను సూచించునని తెలుపుచున్నది. అందు యోగేశ్వరి కామము; మహేశ్వరి క్రోధము; వైష్ణవి లోభము, బ్రాహ్మి మదము; కౌమారి మోహము; ఇంద్రాణి మాత్సర్యము; యమి లేక చాముండ శూన్యము లేక అబద్దప్రచారము; వారాహి అసూయను సూచించును, ఇదిగాక అంధకాసురుడనగా అవిద్య, దీనిని శివునిచే అనగా ఆత్మవిద్యచే నిర్మూలించుట యని కూడా సూచనకలదు.
- ↑ పశ్చిమ చాళుక్య సాంప్రదాయములో అన్ని జైనమూర్తులందు త్రివళి కనిపించును. ఇది క్రీ. శ. 11 - 13 శతాబ్దము వరకూ తరచు యుండెడిది. త్రివాళి యనగా, బొడ్డు పైభాగమున ఉండు మూడు ముడుతలను రేఖామాత్రముగా చూపుట.
- ↑ దాక్షిణాత్య శిల్పములందు తప్ప మిగతా భారత దేశమందలి సూర్యుని శిల్పములన్నీ మొనదేలిన పాదరక్షలను ధరించియుండును. పద్మములు గూడా చాలా మటుకు బాగా వికసించినవిగా చేతులందు ధరించినటులుండును.
- ↑ పార్వతి తన కుడి పాదమును శివుని పాదముల మీద మోపి, కుడిచేతిని శివుని నడుము దగ్గర పెట్టి ఆలింగనము చేసుకొనవలయును.