కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/కొలనుపాక - చారిత్రక ప్రాముఖ్యత

వికీసోర్స్ నుండి

కొలనుపాక - చారిత్రక ప్రాముఖ్యత

కొలనుపాక గ్రామము నల్లగొండ జిల్లాలోని ఆలేరునకు సుమారు 6 కి.మీ. దూరములో నున్నది. ఆలేరు, సికింద్రాబాద్ - విజయవాడ రైలుమార్గములో సికింద్రాబాద్‌నకు 60 కి.మీ. దూరములో నున్నది. ఆలేరు నుండి రాష్ట్ర రవాణా శాఖ బస్సులు, మరి అనేక యితర సాధనముల ద్వారా కొలనుపాక చేరవచ్చును.

ఈ గ్రామనామము అనేక రూపాంతరముల చెందినటుల చరిత్ర పరిశోధనల వల్ల తెలియుచున్నది. తాడిమలింగ్ - నరిసిపూర్ తాలూకా మైసూరు నందు దొరికిన రాజేంద్ర చోళుని ఒక శాసనములో ఈ గ్రామమును కొల్లిపాకై అని పేర్కొనబడెను.[1] ఇది రాజేంద్ర చోళుని పదయవ రాజ్యపాలనా సంబ్వత్సరమున యియ్యబడ్డ శాసనము. సోమేశ్వర స్వామి వారి దేవాలయ సమీపమున కల వాగులో ఇసుక మేటయందు దొరికిన, ప్రస్తుత రాష్ట్ర ప్రదర్శనశాల, హైదరాబాద్ నందు భద్రపరచబడిన మూడు పంచ లోహ గంటలలో ఒక దానిమీద కల శాసనము ఈ విధముగా తెలుపుచున్నది.[2]

స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టిపూజ కనుక ఇచ్చట కూడ కొల్లిపాకేయ యను రూపాతమునే వాడినారు. పశ్చిమ చాళుక్య వంశపు రాజులు జగదేక మల్లుడు, త్త్రైలోక్యమల్లుని యొక్క శాసనము గూడా ఇదే రూపాంతరమును తెలుపుచున్నవి.[3] కొల్లిపాకేయ యనుమాట కొల్లిపాక కు కన్నడ భాషాంతరీకరణము. కాకతీయ రుద్ర దేవుని మొరిపరాల తెలుగు శాసనములో కొల్లిపాక యని మాత్రమే వాడబడి యున్నది.[4] విజయనగర రాజైన సదాశివ రాయల కాలమునాటికి ఈ నామము రూపాంతరము చెంది కొల్ పాక్ గా మారి ప్రస్తుతము కూల్ పాక్ లేక కొలను పాక యని పిలువబడుచున్నది.[5]

క్రీస్తు శకము పదునొకొండవ శతాబ్ది నాటికి ఈ గ్రామము ఒక ప్రసిద్ధ జైన యాత్రా స్థలముగాను, ఎల్లోరా, పటన్ చెరువు, కొబ్బాల్ మొదలైన జైన మహా పుణ్య క్షేత్రములలో సమాన స్థాయిలో నుండినటుల గోచరించు చున్నది. కొంత కాలము క్రితమె ఒక శ్వేతాంబర జైన దేవాలయము పునరుద్దరింపబడి పూజలు మెమలు పెట్టబడెను.

సోమేశ్వర స్వామి వారి ఆలయమునకు పశ్చిమముగా ఉన్న ఊబదిబ్బ మీదనున్న ఒక శిలా స్థంభము మీద ఒక శాసనము కలదు అది బహుశః మానస్థంభ గాని, కీర్తి స్థంభముగాని అయి యుండవచ్చును. ఇది పశ్చిమ చాళుక్య వంశజుడైన త్రిభువన మల్ల ఆరవ విక్రమాదిత్యుని నాటిది. అతని పుత్రుడగు కుమార సోమేశ్వరుని వరముగా చెక్కబడియున్నది. ఈ స్థంభమునకు నాలుగు ప్రక్కల శాసనములు గలవు. ఇందు సోమేశ్వరుడు పానుపుర గ్రామమును, కొలను పాకయందు కల "అంబిక యను జైన దేవతకు కానుకగా ఇచ్చినటుల ఇందు తెలుప బడెను. అటులనే ప్రెగ్గడ కేశి రాజు అను చాళుక్య ప్రభువు యొక్క దేవాదాయ, ధర్మాదాయ శాఖాదికారి అంబిక దేవాలయములో ఈ జయ స్థంభమును, తన చక్రవర్తి త్రిభువన మల్లుని పేర చెక్కించి పెట్టియుండునోపు. ప్రెగ్గడ కేశిరాజు జైన భక్తుడు.

షడక్షురినిచే వ్రాయబడిన రాజ శేఖర విలాసమునందు కొల్లిపాక శైవ మతాచార్యుడైన రేణుకాచార్యుని యొక్క జన్మస్థలముగా పోర్కొనబడినది. ఈ గ్రంధము ననుసరించి రేణు కాచర్యులు జైన మత ప్రవక్తలలో ముఖ్యుడనియు, అయోనిజుడనియు, ఇచ్చట స్వయంభులింగమైన సోమేశ్వరుని నుంచి ఉద్భవించి, చివరకు మరల అదే లింగములోన సిద్ధిపొందిరట. వీరు చాలకాలము వీర శవ మత ఉద్దరణకై పాటు పడిరి. పడక్షురుల వారు చెప్పుటలో, తేను కేశుడను శైవాచార్యునకు రుద్రమునీశ్వరుడను కుమారుడు కలిగెనని, తేను కేశులవారు, తమ యనంతరము రుద్రమునీశ్వరుకి లింగాయతే మతమున కధిపతిని చేసెనని వ్రాసినారు. తేను కేశుడి లింగాయక మత మందలి అయిదుమంది ముఖ్యగురువులలో ఒకరు. ఆయన కొలను పాకలో ఒక లింగాయత మతమును స్థాపించి దానికి తన కుమారుని మతాధిపతిగా నియమించెనట. ఇదంతా చెప్పి షడక్షురులవారు తాను గూడా ఈ లింగాయత మతాధిపతుల వంశములోని చిక్కవీర దేవునికి బంధువనని తెలుపుకొన్నాడు. ఈ చిక్కవీర దేవుడు రుద్రమునీశ్వర వంశ వృక్షములోని ఉద్దీన, గండలీశ్వర, అన్నడ నీశ, రేవణ సిద్ధి మొదలుగా గల వారి ననువర్తినని తెలుచున్నాడు.

వీరశైవాగగము ననుసరించి రేణుకాచార్యుడు మరెవరో కాదు, రేవణ సిద్దయ యనియూ, ఇతనే అగస్త్య మహామునికి సిద్ధాంత శిఖామణి యందు పొందు పరచిన స్థతస్థల సిద్ధాంతమును గూర్చి తెలియవరచెనని కూడ ప్రతీతి కలదు. ఇందు వలన మధ్య యుగమునకు పూర్వమే కొలనుపాక ఒక మహాశైవ పుణ్య క్షేత్రముగా భాసిల్లినదని తెలియ వచ్చు చున్నది.

మధ్యయుగమున కొలనుపాక దుర్భేద్యమైన కోటగా భాసిల్లినది. అయిదవ విక్రమాదిత్యుని కాలమునాటికి (క్రీ.శ. 1008 - 1015) యిది ఒక పెద్ద కోట. రాజేంద్ర చోళుని మూడవ రాజ్య పాలనా సంవత్సరమునకు చెందిన ఒక దాన శాసనములో అతను కొలకు పాట పట్టణమును పట్టుకొని నటుల తెలియు చున్నది. అంతకు పూర్వపు శాసనములు ఈ విషయమై ప్రస్తావన చేయనందున రాజేంద్ర చోళుడీ పట్టణమును క్రీ.శ 1013 -1014 లో పట్టుకొని యుండ వచ్చును. ఇతను అయిదవ విక్రమాదిత్యుని జయించి ఈ కోట స్వాధీనపరచుకొని యుండవచ్చును. ఆ కారణము వల్ల రెండవ జయసింహుడు (పశ్చిమ చాళుక్య ప్రభువు) క్రీ.శ. 1015 న రాజ్యమునకు వచ్చి, రాజేంద్ర చోళునితో అనేక మారులు యుద్ద మొనరించిననూ, కొలను పాక యొక్క ప్రతిపత్తి ఏమాత్రము మారినటుల లేదు. మొదటి జగదేక మల్లుని కాలమునకు (క్రీ.శ. 1033) చెందిన ఒక శాసములో కొల్లి పాకను మన్నే కలిమయ్య అను దేవున కంకిత మొనరించి నటుల తెలియున్నది గాన చోళ రాజు ఈ నగరమును తాత్కాలికముగ జయించినను ఇది చాళుక్య రాజుల క్రిందనే యుండెను.

మొదటి జగదేకమల్లుని తరువాత మొదటి సోమేశ్వరుడు రాజ్యమునకు వచ్చెను. ఇతనికి అహవమల్లుడను బిరుదు కూడ కలదు. ఇతని కాలములో అనగా క్రీ.శ. 1042 లో కుమార విక్రమాదిత్యుడు (తరువాతి ఆరవ విక్రమాదిత్య మహా రాజు) మొదటి రాజాధిరాజు (చోళ ప్రభువు) వీరికి యుద్దమునకు వెళ్ళి దన్నడయను చోట ఓడిపోగా, రాజాధిరాజు చాళుక్య రాజ్యములో ప్రవేశించి కొలను పాక వరకూ వచ్చి, దానిని దగ్ధము చేసినటుల శాసనములు తెలుపు చున్నవి. రెండవ సోమేశ్వరుడు క్రీ.శ. 1068 లో రాజ్యమునకు వచ్చి క్రీ.శ. 1078 వరకు రాజ్య పాలన సాగించెను. ఈ పది సంవత్సరములలోనూ, కొలను పాకకు సంబంధించినంత వరకూ ఎలాటి ముఖ్య సంఘటనలూ జరుగలేదు. ఆ తరువాత క్రీ.శ. 1076 లో ఆరవ విక్రమాదిత్యుడు రాజ్యమునకు వచ్చి సుమారు అర్థ శతాబ్ధము రాజ్యము చేసెను. ఈ సమయములో కొలనుపాక సుఖ శాంతులలో తులతూగినది.

ఆరవ విక్రమాదిత్యుని కాలమునకు చెందిన ఆరు శాసనము కొలను పాక యందు కలవు. అన్నింటికన్నా పురాతన మైనది క్రీ.శ. 1088 నాటిది. ఇందులో తొండరస చోళ మహారాజు కొలను పాక రాజ్యమునకు మహామండలేశ్వరుడుగా యుండినటుల తెలియు చున్నది. అతను ఇచ్చట పరివేష్టించి యున్న ఉత్త రేశ్వరునకు కొంత భూమిని దానముగా నిచ్చినటుల తెలుపు చున్నది. రామేశ్వర పండితుడను వాడు కొలను పాక వాస్తవ్యుడు. ఉత్తరేశ్వరుని గుడి యజమానిగా ఆ దానమును గ్రహించినట్లు తెలిపియున్నది. ఆ తరువాత క్రీ. శ. 1097 నకు చెందిన శాసనములో కొలనుపాక స్వయంభూ సోమేశ్వరులవారికి ఒక గ్రామము సర్వభుక్తముగా దానము చేయబడినటుల తెలుపుచున్నది. మరొక శాసనములో తొండయ్య చోళదేవ మహారాజును నతను కొలనుపాకకు మహామండలేశ్వరుడుగా ఉండినటుల తెలుపుబడెను. ఇతను ఇచ్చటనున్న విష్ణుదేవాలయమునకు కొన్ని దానములు చేసినటుల తెలుపుచున్నది.

మరియొకశాసనము చాళుక్య విక్రమశకము 29కి అనగా క్రీ. శ. 1104 నాటిది. ఇందులో పారమార వంశజుడు జగద్దేవుడనువాడు కొలనుపాక రాష్ట్రమునకు మహామండలేశ్వరుడై యుండగా మహారాజుకు సేనాపతి, సంధివిగ్రహి అయిన సోమలదండనాయకుడు రాజ్యపురోభివృద్ధికి, శాంతి సౌభాగ్యములకొరకై ఒక జగద్దేవనారాయణస్వామి వారి ఆలయము రాష్ట్రముఖ్యపట్టణమైన కొలనుపాకయందు నిర్మించినాడట. తరువాత చాళుక్య విక్రమశకము 31 అనగా క్రీ. శ. 1107 కు చెందిన దానిలో అనంతపాల దండనాయకుడు కొన్ని సుంకముల ద్వారా వచ్చు ధనమును కొలనుపాకయందలి జగద్దేవనారాయణస్వామివారి కైంకర్యమునకై దానముచేసినటుల తెలియుచున్నది. ఇక ఆఖరి శాసనము క్రీ. శ. 1125 నాటికి చెందినది. ఇందు మహామండలేశ్వర చాళుక్య గాంగపెరమాది కుమార సోమేశ్వరుడు, కొలనుపాక దండనాయకుని కోరినమేరకు అచ్చట అంబిక యను దేవతకు కొంత దానము చేసినాడట. నల్లగొండ జిల్లా గూడూరు గ్రామమునందు దొరికిన ఒక శాసనములో స్వామిపయ్య యనువాడు, కుమార సోమేశ్వరుని దండనాయకుడు కొలనుపాక రాష్ట్రమున కధిపతిగా ఉండినటుల తెలుపుచున్నది. [6]

ఆరవ విక్రమాదిత్యుని తరువాత మూడవ సోమేశ్వరుడు, ఆ తరువాత రెండవ జగదేకమల్లుడు రాజ్యమునకు వచ్చిరి. ఇతని కాలపు శాసనము కొలనుపాకయందు దొరకినది. ఇందు దుర్గ సంరక్షణాధికారి మనెవెర్గడె నన్నపయ్య యనువాడు సోమేశ్వరస్వామివారికి (స్వయంభూ సోమేశ్వరస్వామి) కొంత భూమిని దానముగా ఇచ్చినాడట. [7]

కళ్యాణి చాళుక్యవంశము క్షీణించినతరువాత వారిక్రింద సామంతులుగా నుండిన కాకతీయ ప్రభువుల పాలనలోనికి కొలనుపాక వచ్చినది. కాకతీయ రుద్రదేవుని శాసనము, మొరిపరాలలోనిది. క్రీ. శ. 1181 రుద్రమాంబ శాసనము వలన, కొలనుపాక తన పూర్వపు టౌన్నత్యమును పోగొట్టుకొనినట్లు తెలియుచున్నది. కాకతీయ రాజ్య ముఖ్యపట్టణమైన ఓరుగల్లు; ఇచ్చటికి చాలా సమీపములో నుండినందున బహుశ: వారు దీనిని ఒక రాష్ట్రముగాగాని, రాష్ట్ర ముఖ్యపట్టణముగాగాని యుంచియుండలేదు. కాని అప్పటికిని దీనిని అనేక ముఖ్యపట్టణములలో ఒకటిగా గుర్తించియుండిరి. కాకతీయ ప్రతాపరుద్రుని కాలమునాటి శాసనము ఒకటి ఇచ్చట దొరకినది. ఇందులో కాకతీయ ప్రతాపరుద్రుని క్రింది ఉద్యోగి రాష్ట్రకూట వంశజుడు, ఇచ్చట స్వయంభు మాణిక్య తీర్థేశ్వరస్వామి వారి త్రికాల ధూపదీప నైవేద్యములకై కొంతభూమిని దానము చేసినటుల తెలియుచున్నది.[8] కొలనుపాక ప్రభుత్వ పరంగా తనయాధిక్యతను కోల్పోయిననూ, ఇది ఒక ప్రధానపట్టణము గాను, మతపరముగాను పెద్ద పుణ్యతీర్థంగానూ ఉండినది. అందుకు నిదర్శనంగా, సోమేశ్వరస్వామివారి దేవళ గడపల మీదకల తతువాతి కాలంనాటి చిత్రములవల్ల తెలియుచున్నది.[9] అదేగాక ఇప్పటికిని ఈ గ్రామము సిరిసంపదలతో తులతూగుచుండుట మరొక ముఖ్య నిదర్శనము.


-<•>-

  1. ఎఫిగ్రాయా కర్ణాటికా: వాల్యూం III : పుట 34.
  2. లలితకళా వాల్యూం నంబరు 10: పుటలు 25 - 30.
  3. ఎపిగ్రాఫియా ఇండికా: వల్యూం నంబరు: III, పుట 230. ఎపిగ్రాఫియా ఇండికా : వాల్యూం నంబరు IV : పుట 323.
  4. హైదారాబాద్ ఆర్కలాజికల్ సీరీస్ నంబరు. 19. పుట 147.
  5. ఎఫ్. కీల్ హారన్: బ్రిటిష్ మ్యూజియం ప్లేట్స్ ఆఫ్ సదాశివరాయ: శక సంవత్ 1478. ఎపిగ్రాఫికా ఇండికా: వాల్యూం IV. పుట 22.
  6. చాళుక్యకుమార సోమేశ్వరుని ప్రశస్తి.
  7. సోమేశ్వరస్వామి దేవాలయమునకు చేసిన భూదాన శాసనము.
  8. ప్రతాపరుద్రుని శాసనము: సంస్కృతము: రిపోర్ట్ ఆన్ ఎపిగ్రఫీ (ఆంధ్ర ప్రదేశ్) 1965: పేజి. 62: శాసనము: 266.
  9. విజయనగరము, తరువాతి కాలపునాటి చిత్రములు కొన్ని ఇప్పటికిని మనకు కనిపించుచున్నవి.