కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/కొలనుపాక - శాసనములు
కొలనుపాక - శాసనములు
1. ఇద్దరు రాజులచేత ఇవ్వబడిన శాసనమిది. కళ్యాణి చాళుక్య వంశమునకు చెందిన త్రిభువన మల్లదేవుడు (క్రీ.శ. 1076 - 1127) శ్రీ జగదేక మల్లుడు (క్రీ.శ. 1015 - 1043) ఇచ్చిన దాన శాసనమిది. ఇందు వీరిరువురు, జైన మతాచార్యుడైన చంద్ర సేనాచార్యునకు కొంత భూమిని దానముగా నిచ్చినటుల తెలుపుచున్నది. శ్రీ చంద్ర సేనాచార్యులవారు బహుశః కొలనుపాక యందలి జైన దేవళమునకు ఆచార్యుడై యుండ వలయును.
2. ఇది ఆరవ విక్రమాదిత్యుని క్రీ.శ 1099 కాలమునాటి శాసనము. విక్రమాదిత్యుని 22 వ రాజ్య సంవత్సరమున చేయ బడిన ఒక దాన శాసనము.
3. మూడవ తైలవుడు (క్రీ.శ. 1151 - 1156) చాళుక్యవంశజుడు ఇచ్చిన శాసనము.
4. రెండవ తైలవుడు (క్రీశ.990) నాటి శాసనము.
5. త్రిభువన మల్ల దేవుని శాసనము. (క్రీ.శ. 1076 - 1127) కన్నడ లిపి యందు కలదు. ఈ శాసనమునందు కుమారసోమేశ్వరుని వివిధబిరుదులను అభివర్ణించి అతను కొంతభూమిని సోమేశ్వరస్వామివారికి దానముచేసినటుల తెలుపుచున్నది.
6. కళ్యాణి చాళుక్యుల కాలమునాటి సంస్కృత శాసనము.
7. త్రిభువనమల్లదేవుడు (క్రీ.శ. 1076 - 1127) (చాళుక్యవంశజుడు) కొన్ని పన్నులవలన వచ్చు రాబడిని కొలనుపాక యందలి ఒక రెడ్డికి దానముచేసినటుల తెలుపు చున్నది.
8,9. తైలవుడు (క్రీ.శ. 973-997) ఇచ్చిన ఒక దాన శాసనము.
10. త్రిభువనమల్లుని (క్రీ.శ. 1076-1127) యొక్క మరియొక శాసనము.
11. కాకతీయరుద్రదేవుని సంస్కృత శాసనము. కాకతీయరుద్రదేవుని భృత్యుడొకడు కొల్లిపాకయందలి స్వయంభూ మాణిక్యతీర్థులవారికి నిత్యము రెండుపూటల జరుగవలసిన ధూప, దీప, నైవేద్యముల కగు ఖర్చునిమిత్తమై ఇచ్చిన దానమును సూసించుచున్నది.
12. కాకతీయ గణపతి దేవుని తెలుగు లిపియందు కల శాఅన మొకటి సోమేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాకారమందు కల చండికాంబ దేవత యొక్క గర్భ గుడి కెదురుగా కలదు. ఇది అసంపూర్తి శాసనము. ఇందు కాకతీయ దుర్త దేవుని "అనుమకొండ పురవరు" డని తెలుపు చున్నది. అదికాక రుద్ర దేవుని భృత్యుడొకడు (వాని పేరు కనిపించలేదు) కొంత భూమిని ఇచ్చట దేవునకు దానముగా నిచ్చినటులున్నది.
13. సోమేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణమందలి నూతి గట్టులో త్త్రలోక్య మల్లదేవుని శాసనమొకటి కలదు. ఇది కన్నడ లిపిలో నున్నది. ఇది అసంపూర్తి శాసనము. ఇందు చాళుక్యవంశ ప్రసస్తి మానవ్యస గోత్రోద్భవశ్య అని మొదలిడి, త్త్రైలోక్య మల్ల దేవుని బిరుదులన్నింటిని అభివర్ణిచు చున్నది.
14. సోమేశ్వర స్వామి వారి దేవాలయము దగ్గరలోనున్న కోనేటి గట్టున గల పెద్దబండరాయి మీద శాసనము. ఇందు వేల్పుగొండడు - కపనయ్య యని ఇద్దరి పేర్లను ఉదహరించు చున్నది.
15. సోమేశ్వర స్వామి వారి దేవాలయములో గల నంది విగ్రహము కల స్థంబము మీద శాసనము అల్లిడిమల్లయ్య యను పేరు నుదహరించు చున్నది. బహుశః ఇతను ఈ దేవాలయ నిర్మాణమందు పనిచేసిన ఒక స్థపతి అయి యుండ వచ్చును.
16. సోమేశ్వర స్వామి వారి దేవాలయ మంటపమందు ఒక పెద్ద రాతి తొట్టి కలదు. దాని మీద ఒక పేరు సూచించ బడినది. ఇది ప్రస్తుత వ్వహవారిక భాషయందున్నది. ఇందు రవిచెడి ధర్మయ్య యొక్క పుత్రులు ఈ తొట్టిని తయారు చేయించి స్వామి వారికి దానమిచ్చిరని వ్రాయబడెను.
-<•>-