కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/తుదిపలుకు
తుదిపలుకు
మానవుని విజ్ఞాన సముపార్జనమందు మ్యూజియంలయొక్క ముఖ్యపాత్రను గురించిన చైతన్యము ఇప్పుడే మనదేశములో కలుగుచున్నది. ప్రజలందు విద్యావ్యాప్తిని మ్యూజియంలద్వారా కూడా కలిగించవచ్చునని వైజ్ఞానికంగా పురోభివృద్ధి చెందినదేశములందు చాలా కాలం క్రితమే అవగతమైననూ మనదేశమునందది ఇప్పుడిప్పుడే జరుగుచున్నది. ఇటువంటి చైతన్యము "కొలనుపాక మ్యూజియం" వంటి ప్రాదేశిక ప్రదర్శనాలయములద్వారా ఇతోధికముగా జరుగుననుట నిర్వివాదాంశము. దేవాలయ ప్రాంగణములందు నెలకొల్పబడిన మ్యూజియంలలో కొలనుపాక ఒకటి. అచ్చటికి ఆ గ్రామప్రజలు, చుట్టుప్రక్కల గ్రామములవారే కాక దేశము నలుమూలలనుంచీ యాత్రికులు వచ్చి చూచుచున్నారు.
ఈ మ్యూజియమును దర్శించు ప్రజలు అక్కడ ఒక మ్యూజియం, అచ్చట విలువైన అనేక వస్తువులు జాగ్రత్తగా కాపాడబడుచున్నవని, వాటినిగురించిన విశేషములను తెలుపుచున్నారని చూచుటకు కాక, అచ్చట తమ మనసు కెక్కిన ఒక దేవాలయము, అందు తమ ఇష్టదైవము కలవని, వాటిని సేవింతమన్న సదుద్దేశముతో కూడ వచ్చుచున్నారు. ఈ విధముగా వచ్చిన ప్రజానీకము తమ కందుబాటులో నిక్షిప్తపరుచబడిన విజ్ఞానమును, శిల్పసాంప్రదాయ విశేషములనూ, ఇంకా అనేక విషయములను గ్రహించి ఆనందించుట ద్వారా ఈ మ్యూజియం నిర్మాణ ముఖ్యోద్దేశము అన్నివిధముల సిద్ధించినదని చెప్పవచ్చును.
ప్రతి మ్యూజియంయొక్క ముఖ్యోద్దేశము ప్రజాసేవ. ప్రజలందనేక తరగతులవారు (విజ్ఞానము, చదువువయస్సులందు) యుందురు. ఇటువంటి విభిన్న వర్గముల పౌరులకు, వారి ఆశయాలను దృష్టియందుంచుకొని వారి వారి కోరికల కనుగుణముగా మన ప్రదర్శన నేర్పాటుచేయవలయును.
కొలనుపాక మ్యూజియం శిల్పవిశేషములగురించి చర్చించుట కనువైన ప్రదేశము. ఈ మ్యూజియములో చాళుక్య కాలమునాటి సోమేశ్వరస్వామి వారి దేవాలయమందు కలదు. ఇచ్చటి శిల్పములుకూడ ముఖ్యముగా చాళుక్య కాకతీయుల నాటివి. కనుక చరిత్ర పరిశోధకులకు, విద్యార్థులకు ఇచ్చట విస్తారమైన వస్తుసముదాయము కలదు. కాకతీయ చాళుక్య శైలిరీతులు, అందలి ఏకత్వ భిన్నత్వములగురించి తెలుసుకొనుటకు ఇంతకంటే అనువైన ప్రదేశములేదు. అటులనే శాసనములమీద పరిశోధించువారికి కూడ అనేక శిలాశాసనము లిందుకలవు.
విద్యార్థులకు, పరిశోధకులకు, సాధారణ ప్రజలకు, కళాభిలాషులకు, ప్రతి ఒక్కరికి ఇచ్చట మనస్సుకు తృప్తికలుగును.
-<•>-