కుమారసంభవము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కుమారసంభవము

ప్రథమాశ్వాసము

శ్రీవాణీంద్రామరేంద్రార్చితమకుటమణిశ్రేణిధామాంఘ్రిపద్మా
జీవోద్యత్కేసరుం డాశ్రితజనలసితాశేషవస్తప్రభుం డా
దేవాధీశుండు నిత్యోదితుఁ డజుఁడు మహాదేవుఁ డాద్యుండు విశ్వై
కావాసుం డెప్పుడున్ మా కభిమతములు ప్రీతాత్ముఁడై యిచ్చుఁగాతన్.

1


సీ॥

రమణీయశృంగారరజతపర్వతము నా శోభిల్లు సిద్ధవిస్ఫూరిమూర్తి
ఆఫర్వతాగ్రహేమైకశృంగంబు నా నమరు జటామకుటాదిభాతి
ఆతుంగశృంగశిలాపూర్ణసరసి నా బొంగారు జాహ్నవిభూరివారి
అనిమ్నసరసీలిహారమరాళికాపఙ్క్తి నా నొప్పు కపాలలీల
యామహామరాళికాబర్హిణాంభోజపుష్పనిభసముద్ధభోగభోగి
సమితిఁ దాల్చి పొల్చుశంకరుఁ డంబికాధవుఁడు మా కభీష్టదాత గాత.

2


చ॥

హరివికచామలాంబుజసహస్రము పూన్చి మృగాంకుదండ వి
స్ఫురితమలాసితాబ్జమని పుచ్చఁగఁ జాఁచినచేయి చూచి చం
దురుఁ డది రాహుసావి నెఱఁదుప్పలఁదూలఁగఁ జారుచున్న న
య్యిరువురఁ జూచి నవ్వుపరమేశ్వరుఁ డీవుత మా కభీష్టముల్.[1]

3


ఉ॥

వీంగు నపారసత్వగుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు మున్నుదయమై నియమస్థితిఁ గొల్చి తద్దయున్
లొంగినపేర్మితో సఖిలలోకములుం దగఁ గాఁచుచున్నవే
దాంగు ననంతు విష్ణుఁ గమలాధిపు సంస్తుతిఁ దేల్చి సమ్మతిన్.

4

చ॥

అమితరజోగుణస్ఫురణ నావహమై పరమేశుదక్షిణాం
గమున జనించి భక్తిఁ జిరకాలము సద్విధిఁ గొల్చి తత్ప్రసా
దమున నజాండలోకజనితత్వసువేదకళాగమాదివి
శ్వము సృజియించి పొల్చునజు వాగ్విభు సంస్తుతిచేసి సన్మతిన్.

5


చ॥

అనుపమదివ్యమూర్తి యనునంతియ కాదు భవాష్టమూర్తులం
దును వరమూర్తి దాస ప్రభతోడ జగజ్జనరాజి కెల్ల నిం
దనయము దానదృష్టి యనునంతియ కాదు త్రిలోచనాదిలో
చనములు దానయైనరవి చారునిజప్రభ మాకు నీవుతన్.

6


చ॥

తను వసితాంబుదంబు సితదంతయుగం బచిరాంశు లాత్మగ
ర్జన మురుభర్జనంబు గరసద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్యసమృద్ధిగ నభ్రవేల నాఁ
జనుగణనాథుఁ గొల్తు ననిశంబు నభీష్టఫలప్రదాతగాన్.

7


క॥

తనజనకుఁ డురుస్థాణువు | జనని యపర్ణాఖ్య దా విశాఖుం డనఁగాఁ
దనరియు నభిమతఫలముల | జనులకు దయ నొసఁగుచుండు షణ్ముఖుఁ గొలుతున్.

8


క॥

హరుఁ డాదిగ సకలచరా | చరమయజీవాళి నెల్ల సతతముఁ గామా
తురులుగ వలగతిఁ జేసిన | మరుఁ డీవుత మఖిలవశ్యమతి మత్కృతికిన్.[2]

9


చ॥

మునిమనుజాశురాహిసురముఖ్యులు మున్నుగ సర్వజీవులం
దనవశ మర్థి జేసి మునుదర్పకు నోర్చినవీతరాగిఁ జి
ద్ఘనతను నీశు నాత్మశుభగస్థితి మైమెయి నర్ధనారిఁ జే
సిననగజాత మత్కృతిని జేకొని తత్సుభగత్వ మీవుతన్.

10


క॥

వేదాగమరూపమున మ | హాదేవు నపారగుణమహాస్తుతిసం
పాదిత యగుభారతి నేఁ | డాదిగ మత్కతికి నెలయునది గాక దయన్.

11


గీ॥

అన్యదైవవితతి నర్చించుకొలువు తా | డిడి ఫలంబుగొనుట పడయఁగనెడి
సద్వరిష్టఫలదు జంగమమల్లికా | ర్జునునిఁ గొలుపు మొసరుమునుఁగఁగొనుట.[3]

12

వ॥

అని సద్భక్తియుక్తి నిశ్చయించి.

13


క॥

శ్రీపీఠంబున నిడుకొన | శ్రీపాదుకలందు వ్రాలి సేవించెద నేఁ
బాపహతిఁ జెప్పి పుణ్యం | బాపాదింపంగ మల్లికార్జునదేవున్.

14


మ॥

అమలజ్ఞానసుదీపవర్తి గొని వృద్ధాచారుఁడై వేదశా
స్త్రములం దున్న సదర్థ మెల్లఁగొని విద్వత్ప్రీతి గావించువా
ని మహాత్ముం డనఁ బొల్చుపుణ్యనిధి వాణీముఖ్యు సర్వజ్ఞు జం
గమలింగం బగుమల్లికార్జును సదాకల్యాణుఁ గీర్తించెదన్.

15


వ॥

అని యిష్టదేవతానమస్కారము చేసి సమస్తదేవతాస్వరూపం బైనమదీయగురుచరణారవిందంబు లభినందించి.

16


క॥

కవితామృతోదయాంబుధి | కవిసజ్జనకునకు వస్తుకావ్యాబ్జరవిన్
గవితారంభంబుల స | త్కవు లభినందింతు రాదికవి వాల్మీకున్.

17


క॥

వేదాంతభారతపురా | ణాదులు సేయఁ డొకపేర్మి యనుచుం బొగడం
గా దెడ్డనజుఁడు నోపని | వేదము లేఱ్పఱిచె నండ్రు వేదవ్యాసున్.

18


క॥

భాసురమతి వాల్మీకి | వ్యాసాదులు చనిన జగతి వరకవితాసిం
హాసన మెక్కి కవీంద్రుల | దాసులఁగా నేలెఁ గాళిదాసుఁడు పేర్మిన్.

19


క॥

భారవియు వస్తుకవితను | భారవియునుఁ బరఁగి రుదయపర్వతశిఖరా
గ్రారోహణేంద్రకీలన | గారోహణవర్ణనల జనారాధితులై.

20


క॥

క్రమమున మద్భటుఁడు గవి | త్వము మెఱయఁ గుమారసంభవము సాలంకా
రము గూఢవస్తుమయకా | వ్యముగా హరులీల చెప్పి హరు మెచ్చించెన్.

21


క॥

కరములు దునుమం బరముని | వరదునిగాఁ గొలిచి కవితవలననె మగుడం
గరములు వడసి జగంబునఁ | బరఁగె మహాకవియనంగ బాణుఁడు పేర్మిన్.[4]

22

క॥

మును మార్గకవిత లోకం | బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్రవిషయమున | జన సత్యాశ్రయునితొఱ్ఱి చాళుక్యనృపుల్.

23


చ॥

సురవరులం గ్రమంబున వచోమణిసంహతి బూజ చేసి మ
ద్గురుచరణారవిందములకుం దగ సమ్మతిఁ జేసి కొల్చి వి
స్తరమతులం బురాణకవిసంఘము నుత్తమమార్గసత్కవీ
శ్వరులను దేశిసత్కవుల సంస్తుతిఁ జేసి మనోముదంబునన్.

24


వ॥

మఱియును.

25


క॥

గుఱు తెఱఁగి వస్తుచయమున | కొఱఁగెడు నాదెసకు వర్తియునుబోలె నిజ
మ్మెఱిఁగి కృతవస్తుసమితికి | వఱలఁగ మది నెఱుఁగువిబుధవర్గము దలఁతున్.

26


వ॥

మఱియు దోషగ్రాహు లగుకుకవివరాకులం బరిహరించితి నెట్లనిన.

27


క॥

మార్గకు మార్గము దేశియ | మార్గము వదలంగఁ దమకు మదివదలక దు
ర్గార్గపదవర్తు లనఁ దగు | మార్గవులం దలచ నలఁతి మహి సుకవులకున్.[5]

28


గీ॥

చెనసి గుణమైన దోషంబు సేయ నేర్చు | గుకవికృతులందు దోసంబు గుణముసేయ
నేరఁ డది యట్ల దొంతులు సేరి నాయి | దోర్పనేర్చుగా కదియేమి సేర్వ నేర్చు.[6]

29


గీ॥

నెఱయ రసవంత మగుకృతి కెఱఁగనేర | రల్పరసకృతి కెఱఁగుదు రలులకెల్లఁ
చెఱకు విడిచిన రసమున కెఱఁగి రాక | పిప్పి కరిగెడుఁగలపెల్లు వోలె.

30


వ॥

కావున.

31


గీ॥

తజ్ఞునం దేరనగుఁగవితావిశేష | మజ్ఞునం దేమి యెఱుఁగంగ నగు సమస్త
కనకవర్ణోత్కరమ్మును గానవచ్చు | వన్నె లెఱుఁగంగఁబోలునే వట్టిరాత.

32


వ॥

అది యెట్లనిన.

33


గీ॥

అన్యతారకవితతుల నాదరించి | వెలయ సత్కవిబుధగురుబలము వడసి
యొనర దైవజ్ఞునట్ల శుభోదయమున | దివ్యసుకృతిఁ బ్రతిష్ఠించుఁ దిరము గాఁగ.

34

చ॥

సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపుపెంపుతోఁ
బిరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన నర్థము లొత్తగిల్ల బం
ధురముగఁ బారాణముల్ మధుమృదుత్వరసంబున॥ గందళింప న
క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీల గ్రాలఁగాన్.[7]

35


సీ॥

మృదురీతి సూక్తు లింపొదవింప మేలిల్లు భావమ్ము నెలమి క్రీడావహముగ
మెఱుఁగులఁ గన్నులు మిఱుమిట్లు వోవంగఁ గాంతి సుధాసూతికాంతిఁ జెనయ
వర్ణన లెల్లచో వర్ణన కెక్కంగ రసములు దలుకొత్తి రాలువాఱ
దేశిమార్గంబుల దేశీయములుగా నలంకారములఁ దా నలంకరింప
నాదరించి విని సదర్థాతిశయముల | బుధులు నెమ్మనమున నిధులు నిలుప
వలవదే (రచింప) వరకవీశ్వరునకు | నూత్నరుచిరకావ్యరత్నవీథి.[8]

36


చ॥

పరఁగ సువర్ణబంధమృదుభావము గల్గియు లోను చూడఁగాఁ
బొర పగుచిత్రరూపమునుబోలె నసత్కవికావ్య మిమ్మహిన్
బరఁగు సువర్ణబంధమృదుభావవిశేషము లొప్పుదెల్వులన్
సరియగు రత్నపుత్రికయు సత్కవికావ్యము నొక్కరూపమై.[9]

37


ఉ॥

అక్కజమై మహార్థనివహంబు సరుక్తులు మెచ్చఁ జూచినం
గ్రుక్కిద మైనసత్కృతి యగుర్పగుఁగా కిలఁ జీకు లావుకం
ద్రొక్కినయట్లు నోరఁగొలఁదుల్ పురికొల్పఁగ నందులోన నొ
క్కొక్కఁడు సక్కనైనఁ గృతియుం గృతి యందురె నాని మెత్తురే.[10]

38

క॥

చతురోక్తుల నుతపదబహు | గతుల నలంకారభావకాంతిరసార్థో
న్నతిఁ గృతి నతిరసికులు వర | సతిగతి నెఱిఁగింపవలదె సౌభాగ్యమునన్.[11]

39


మ॥

పదబంధంబుల నగ్గలించి బుధశబ్దభ్రాజియై సద్గుణా
స్పదమై దుష్క హృత్సరోజవనముల్ భంజింపుచున్ భూరిస
మ్మదలీలన్ విలసిల్లి సత్కృతి జగన్మాన్యప్రభావంబునన్
మదనాగంబుమఁబోలెఁ గ్రాలవలదా మా ఱెందు లే కున్నతిన్.[12]

40


క॥

ముదమున సత్కవికావ్యము | నదరఁగ విలుకానిపట్టి నమ్మును బరహ్ళ
ద్భిధమై తలయూఁపింపని | యది కావ్యమె మలరిపట్టి నదియుం గరమే.

41


క॥

ఓలిన కడచన నరువది | నాలుగువిద్యలను నేర్పు నైసర్గికమై
వాలినసుకవులకుం గా | కేలతరమె కృతులు చెప్ప నెవ్వరికైనన్.

42


వ॥

అది యెట్లనిన.

43


క॥

వనజలకేళి రవిశశి | తనయోదయమంత్రకరిరతక్షితిపరణాం
బునిధిమధురురుపురోద్వా | హనగవిరహదూత్యవర్ణ నాష్టాదశమున్.

44


వ॥

పరిపూర్ణంబై దశప్రాణంబుల స్వప్రాణంబై నవరసభావభరితంబై షడ్త్రింశదలంకారాలంకృతంబై రమణీయం బైనదివ్యకథారంభంబున కభిముఖుండనై.

45


ఉ॥

పూని మహాగ్రహారపురపుత్రసమున్నతిదేవతాలయో
ద్యానతటాకసత్కృతినిధానము లాశశితారకంబు సు
స్థానములై మహిం బరఁగు జంగమమల్లయపేర సప్తసం
తానము లొప్ప సల్పుదు ముదంబునం దత్ప్రభునాజ్ఞ పెంపునన్.

46


వ॥

అందు నుత్కృష్టసంతానంబు కృతియకా నిశ్చయించి.

47


ఉ॥

జంగమమల్లి కార్జునుని సర్గకవిస్తవనీయసూక్తి యు
క్తిం గొనియాడి సత్కవితఁ గేనములే కనురక్త యైనభా
షాంగనఁదక్క నేలినమహత్త్వము లోకమునం బ్రసిద్ధిగా
భంగిగ విస్తరించెదఁ బ్రబంధము సద్రసబంధురంబుగాన్.[13]

48

సీ॥

శరధినీరులు పయోధరములు కొనివచ్చి కురిసి వారిధియందు యార్చునట్ల
చేన బండినవిత్తు చేనిక్త ఫలకాంక్షఁ బేర్మిఁ గ్రమ్మఱ వెదవెట్టునట్ల
రోహిణాచలపతి కూహించి వరరత్నసంచయంబున విభూషించునట్ల
తీర్థాళి కర్థి దత్తీర్థదకంబుల నెసకంబుగా నర్ఘ్య మిచ్చినట్ల
నింగి ముట్టి యున్న జంగమమల్లయ | వరమునందుఁ గనిన వస్తుకవితఁ
దగిలి వారియంద నెగడింతు రవికి దీ | పమున నర్చ నిచ్చుపగిదివోలె.

49


చ॥

గురువున కిష్టదైవమునకుం బతికిం గృతిచెప్పి పుణ్యమున్
వరమును దేజముం బడయవచ్చు జగంబుల నిశ్చయంబు మ
ద్గురువును నిష్టదైవమును గూర్చునిజేశుఁడు దాన నాకుఁగా
కోరునకు నిట్లు సేకుఱునె యొక్కట లాభము లెన్న యన్నియున్.

50


వ॥

అని యిట్లు మహోత్సాహంబున దివ్యకల్పంబు కల్పించు మహాకవిముఖ్యుండు.

51


సీ॥

కుతలంబు నడుకొనఁ గొలకొండగా నిల్పి శరనిధి గ్రొచ్చిరి సగరసుతులు
మిన్నులపైఁ బాఱుచున్నయే ఱిలఁ దెచ్చి వారాశి నించె భగీరథుండు
గోత్రాచలము లెత్తికొనివచ్చి కడచన్న రత్నాకరము గట్టె రాఘవుండు
జలధిమహీసతి మొలనూలుగాఁ జుట్టి పాలించెఁ గరిగరికాలచోడు
వరుస నిట్లు సూర్యవంశాధిపతు లంబు | నిధియు మేరగాఁగ నిఖిలజగము
నేలి చనినవారి కెనవచ్చు సుశ్లాఘ | ధనుఁడ నన్నెచోడజనవిభుండ.[14]

52


చ॥

అరినరపాలమౌళిదళితాంఘ్రియుగుం డయి పాకనాఁటియం
దిరువదియొక్కవేయిటి కధీశుఁడు నాఁ జనుచోడబల్లికిం
జిరతరకీర్తి కగ్రమహిషీతిలకం బనహైహయాన్వయాం
బరశశిరేఖ యైనగుణభాసిని శ్రీసతికిం దనూజుఁడన్.

53


క॥

కలుపొన్న విరులఁ బెరుగం | గలుకోడిరవంబు దిశలఁ గలయఁగఁ జెలఁగన్
బొలుచు నొరయూరి కధిపతి | నలఘుపరాక్రముడఁ డెంకణాదిత్యుండన్.

54


క॥

పాత్రుఁడ నసదృశకాశ్యప | గోత్రుఁడ సచ్చరిత నుభయకులశుద్ధుండన్
మిత్రాన్వయశేఖరుఁడఁ బ | విత్రీకృతదేహుఁడను వివిధయజ్ఞములన్.

55

వ॥

ఇట్లు విశిష్టగుణగణాలంకృతుండనై నెగడు నస్మదీయానూనప్రతిభార్ణవోదీర్ణ
చిరవస్తువిస్తారితోత్తమ కావ్యరత్నవిభూషణం బమృతాంశుభూషణావతరాం
బై విలసిల్లు జంగమమల్లికార్జునదేవునిఖిలజనశిరోవిభూషణామలదివ్యశ్రీపా
దంబు లాకల్పాంతస్థాయిగా విభూషించుట శేషజగజ్జనజేగీయమానంబు.

56


చ॥

రవికులశేఖరుండు కవిరాజశిఖామణి గావ్యకర్త స
త్కవి భువి నన్నెచోడుఁ డటె కావ్యము దివ్యకథం గుమారసం
భవ మటె సత్కథాధిపతి భవ్యుఁడు జంగమమల్లికార్జునుం
డవిచలితార్థయోగధరుం డట్టె వినం గొనియాడఁజాలదే.

57


వ॥

కావునం బరమశ్రీనగోత్తుంగమణిశ్రీసంగతమల్లికార్జునదేవతాకంబై జగంబులం
బ్రత్యక్షంబై ప్రవర్తిల్లుట జంగమమల్లికార్జునదేవుండై ప్రాణాయామాదిషడం
గోపాంగసకలయోగిజనారాధితుం డగుటం బరమయోగీంద్రుండై న్యాయవై
శేషికాదిషట్తర్కకర్కశుం డగుటం బరవాదిభయంకరుండై జన్మమరణా
దిదుఃఖార్ణవోత్తీర్ణస్తూయమానమానసు డగుటనుం బరమానందహృద
యుండై ఘోరసంసారపారావారోత్తరణ కారాణానూనవైరాగ్యనిరతుం
డగుట సమ్యగ్జ్ఞానస్వరూపుండై వేదషడంగశాస్త్రపురాణేతిహాసాగమాదిసకల
కళాస్వరూపాపారవాణీధరుం డగుట నిఖిలవిద్యాగురుండై సకలజనాభీష్టవిమల
జ్ఞానానూనఫలప్రదాయకుం డగుటం బరమస్వరూపుండై సమస్తవిద్వజ్జనమనో
మానసకేళీలాలసుం డగుటం బరమహంసస్వరూపుండై యత్యుత్తమపురుషార్థ
ప్రవర్తితుం డగుటం బురుషోత్తముండై నిఖిలముముక్షుజనైకధ్యేయాత్మకుం
డగుటం బరమబ్రహ్మస్వరూపుండై నిస్త్రయీగుణ్యపదార్థప్రవర్తితుం డగుట
గుణగణాతీతుండై సద్భక్తజనాత్మాలోకనైకహేతుభూతుం డగుట మునిజన
ముఖమణిముకురుండై నెగడు సద్గురుం డైనజంగమమల్లికార్జునదేవునకు.

58


క॥

శ్రీకంఠమూర్తి కమల । శ్లోకున కనఘునకు మితవచోనిధికి సుధీ
లోకస్తుతునకు విజ్ఞా । నాకారున కమితమతికి నచలాత్మునకున్.

59


క॥

సద్గురుఁ డనం జనునఖిలజ । గద్గురునకు సంతతోపకారికి మునివి
ద్వద్గురునకుఁ గవిబుధహిత । మద్గురున కపారధర్మమతికిన్ రతికిన్.

60


క॥

సంగాసంగవిదూరున । కంగజహరమూర్తి కభిజనాభరణునకున్
గంగాజలనిభకీర్తికి । జంగమమల్లయకు విబుధసంస్తుత్యునకున్.

61

క॥

అక్షయమూర్తికి నాశ్రిత । రక్షణదక్షునకు ధర్మరతిమతికిఁ గళా
దక్షునకు నమితునకు శుభ । లక్షణలక్షితున కిహలలాటేక్షునకున్.

62


క॥

కుందదరహాససురకరి । చందననీహారిహారశరదంబుదపూ
ర్ణేందునిభకీర్తిపరున క । నిందితగుణనిధికి నధికనిర్మలమతికిన్.

63


క॥

సత్వాదిగుణవిభూతికి । సర్వదయాళునకు నధికసంతుష్టునకున్
దత్త్వప్రకాశమతికి జి । తత్వఫలప్రదున కాత్మతత్త్వజ్ఞునకున్.

64


క॥

సంభద్గుణనిలయున । కంభోధిగభీరునకు మితాలాపునకున్
జంభారిభోగభాగికి । నంభోజాక్షునకు సజ్జనాభరణునకున్.

65


క॥

వినుతబ్రహ్మర్షికి న । త్యనుపమసంయమికి సజ్జనాభరణునకున్
మనుజాకారమహేశున । కనుపమచరితునకు మల్లికార్జునమునికిన్.

66


వ॥

పరమభక్తియుక్తి నావర్జితహృదయుండనై సకలభువనభవనావతారకారణుం
డైన పరమేశ్వరునవతారం బగుటయుం దదంశావతారంబుగా వ్యావర్ణించి
నా చెప్పంబూనిన దివ్యకథాసూత్రం బెట్టిదనిన.

67


స్ర॥

సతిజన్మంబున్ గణాధీశ్వరుజననము దక్షక్రతుధ్వంసముం బా
ర్వతీజన్మంబున్ భవోగ్రవ్రతచరితయ దేవద్విషత్క్షోభముం శ్రీ
సుతసంహారమ్ము భూభృత్సుతతపము నుమాసుందరోద్వాహమున్ ద
ద్రతిభోగంబుం గుమారోదయము నతఁ డనిం దారకుం బోరు [15]గెల్వున్.

68


వ॥

అనం బరఁగు సకలావయవంబులం బరిపూర్ణం బైనదివ్యకావ్యాంగనాసృష్టికర్తయైన.

69


సీ॥

విధి నియమంబున విశ్వంబు సృజియింప దక్షప్రజాపతిఁ దలఁచి మఱియుఁ
బ్రకృతిస్వరూపమై పరఁగు మహామాయఁ ద్రైలోక్యమాత నాధారశక్తి
భావించి సద్విధి నావహించుఁడు రూపలావణ్యగుణహావభావకాంతి
సుందరాకారవిస్ఫురణతోఁ బ్రత్యక్షమై యేమి వలతు నీ వడుగుమనిన
నాకుఁ బుత్రివై పినాకికిఁ బత్నివై । మిథునచరితఁ దగిలి మీరు లోక
జననములకు బీజశక్తులై యుండంగ । వరము గరుణ నొసఁగవలయు దేవి.

70

వ॥

అని యమ్మహాదేవివలన లబ్ధవరప్రసాదుండై యనేకవిధజపధ్యానసంస్తోత్రాదు
లం బరమేశ్వరుఁ బ్రత్యక్షంబు జేసి.

71


శా॥

దేవాధీశ సమస్తముం బడయ నుద్దేశించి మున్ భక్తి నీ
దేవిన్ సర్వపదార్థమూర్తి నిఖిలస్త్రీరత్నమున్ నీకు నే
నావాహించితి మీరు సన్మిథునచర్యాసక్తి మైకొన్న నా
కీవిశ్వోదయకార్యసిద్ధి యగు వాణీంద్రామరేంద్రార్చితా.

72


వ॥

అనినం బరమేశ్వరుండు సద్భక్తియుక్తి కనురక్తుండై సతీరత్నంబగు సతిం బరి
గ్రహించి తనకుం జతుర్విధభూతగ్రామసృష్టికర్తగా వరం బిచ్చిన మహాప్రసా
దం బని.

73


సీ॥

దక్షుండు దత్క్రియాదక్షత జగములఁ బ్రకటింపఁ దలఁచి యేఁబండ్ర సుతలఁ
బడసి వారలలోనఁ బదుమువ్వు రువిదల గారవంబున నిచ్చెఁ గశ్యపునకు
జీవితేశ్వరునకు జీవితైశ్వర్యుల నాఁ బదుండ్రఁ బరిణయము సేసె
నెలమితో మఱి యిర్వదేడ్గుర సుదతుల సురుచిరంబుగ సుధాసూతి కిచ్చె
వరుస నిట్లు దగినవరులకుఁ గూఁతుల । నిచ్చి సతియుఁ దాను నిచ్చ మెచ్చి
తన్నుఁ గన్న యావిధాతకంటెను దాన । శేషఁగాంచె నఖిలసృష్టిలోన.

74


వ॥

అంతట నప్పరమేశ్వరుండు దాక్షాయణిమనోహరాకారనవయౌవనభావహావ
విలాసవిభ్రమసౌందర్యగుణంబుల కంతకంత కనురక్తుండై.

75


క॥

మాటలఁ జెయ్వుల [16]బేటం। బేటముగా నలవరించె నెసఁగఁగ సలిలా
లాటతటనయనుఁ డింపుగు । కూటముల కపూర్వసురతగుణకోవిదుఁడై.

76


వ॥

ఇ ట్లయ్యిరువురు నన్యోన్యరాగాతిరేకంబునం గామకేళీలాలసు లగుచు.

77

సీ॥

కలహంసకలరవాకలితనిర్ఝరముల సారససరసాబ్జషండములను
రోలంబరుతిలతాందోలంబులను శుకమంజులస్వనపుష్పమండపములఁ
గలకంఠరణితమాకందవనములఁ బారావతధ్వనిమందిరస్థలములఁ
గేకికలధ్వానగిరికంధరంబుల లావుకనినదలీలాతలముల
నప్పటప్పటి కనురాగ మగ్గలింపఁ । గామరస మంతకంతకుఁ గడలుకొనఁగ
నలి రమించిరి కైలాసనగముమీఁదఁ । బరమసుఖలీల నాజగత్పతియు సతియు.

78


క॥

ఈవిధమున శివశక్తులు । భావజకేళీవిలోలభావంబుల నా
పోవక విహరించిరి నా । నావిధములఁ దగిలి రజకనగపార్శ్వములన్.

79


వ॥

తదనంతరంబ.

80


సీ॥

అనురక్తిఁ గడిగొమ్ముగొన మేయసల్లకీకబళనకాషాయగండములను
సల్లకీపల్లవసౌరభ్యమున కనుబల మైనమదగంధపరిమళంబు
మదగంధమునకుఁ దుమ్మెదపిండు సూఱ లీ బలసి ఘూర్ణిల్లుపే రులివిపెల్లు
నలిగీతి సెనిపెట్టి యాలించి విని సోలి పరవశులై యుండుభద్రకరులు
భద్రకరు లైనయూధాధిపతులు గాఁగఁ । గలసి సుఖలీల విహరించుకలభకరిణి
గజగణంబులఁ బొలుపొందుగజవనప్ర । భాతి గని మెచ్చుతో జగత్పతియు సతియు.

81


వ॥

తద్విశేషంబు లాలోకించుచున్నంత.

82


క॥

జంగ మకుత్కీలంబుల । నంగ మహీతలఘనాఘనంబులొ నా ను
త్తుంగతరనీలరుచి మా । తంగము లభిరామ మయ్యెఁ దద్వనభూమిన్.

83


గీ॥

ఉగ్రభానుకరాహతి కోడిపాఱి । వచ్చి తరువనదుర్గంబు సొచ్చియున్న
తిమిరపటలంబు నాఁ గాననమునఁ గలయ । నిండి ఘూర్ణిల్లుచుండె వేదండఘటలు.

84


వ॥

అం దమందమృగభద్రజాతిగిరిచరనదీచరోభయచరదేవాసురాంశకలభకరేణు
ధేనువామనభిక్షపోతికాదివన్ధ్యగజయూధంబులందు.

85


శా॥

గండారన్ మదసారభంబునకు బింకం బెక్కఁ గ్రోధాగ్నికిం
గొండాటంబుగ దానసంపదకు నాఘోషంబుగాఁ దీయ మా
చండాలివ్రజగీతరావముల కుత్సాహంబుతో నొక్కవే
దండస్వామి మదంబు సేసెఁ గరిణీధాముంబు లఱ్ఱాడఁగాన్.

86

వ॥

మఱియు నొక్కయెడ.

87


క॥

కరిమదగంధమునకు మధు । కరములు పండుకొని ముపరి కటికటముల భా
సుర మయ్యె నగతటంబులఁ । బరువదె మొగు లెఱిఁగి పేరఁబడినవిధమునన్.

88


మ॥

కరిణీబృందముఁ బాసి యొక్క మదనాగం బద్రిరత్నోరుకం
దరసంక్రాంతనిజప్రభాతిఁ బ్రతివేదండంబకాఁ జూచి దు
ర్ధరరోషంబునఁ బోరుచుండె నతిమాత్సర్యంబునం దా మహే
శ్వరుశైలేంద్రముతోడ నీలగిరి వెల్చం బోరునట్లున్నతిన్.

89


మ॥

కటితాలుస్తవరోమకూపకటిసత్కర్ణోష్ఠకోశాలి శీ
కరమేఘాతతచిక్కఘర్మజలరంగద్దానసంపూర్ణసా
గరసీదోన్మదసన్నుతాష్టమదముల్ గ్రమ్మం దదష్టాంగబం
ధురమై సింధుర మొప్పుచుండె నలిగీతుల్ నించు సోలంబునన్.

90


వ॥

తదవసరంబున ఘర్మాంశుకరాహతి కులికి తదీయాప్తబంధు లైనయరవిందంబుల
కలిగి దండింపం జొచ్చునట్లు వేదండంబులు కమలషండంబుల కరుగుదెంచె
మహోత్సాహంబున.

91


గీ॥

కొలను వన్యేభములు చొచ్చి కలయఁ గలఁపఁ । బులుపు లుండక వెలువడిపోయెఁ బోక
దగదె మాతంగదూషితం బగుసరోవ । రంబు సద్విజవర్జనీయంబు గాదె.

92


వ॥

తదవసరంబున.

93


గీ॥

పుష్కరషండములోఁ గల । పుష్కరమూలములు గబళములఁ గొనుచుం స
త్పుష్కరతలముల మునిమిడి । పుష్కరములఁ బెఱికివైచుఁ బుష్కరమునకున్.

94


క॥

తననీడ నీరిలోపలఁ | గని యది ప్రతిగజమ్ము సావి కడుకొని కోపం
బునఁ దాఁకి పోరఁ జచ్చెనొ । యన నొకకరి నీరిలో రయంబునఁ గ్రుంకెన్.

95


గీ॥

కరులదానంబులకు మధుకరము లెఱిఁగి । కుంజరమ్ములు నీరిలోఁ గ్రుంకియున్న
మీఁద సుడియుచునుండెఁ దుమ్మెదలు వాయ । కుదధి కెఱఁగిననీలనీరదము లనఁగ.

96


వ॥

తత్ప్రస్తవంబున.

97

సీ॥

కడిదోవ నొడళులు గడిగి నవాశ్వత్థవల్కలరసములు వఱలఁ బూసి
భాతితో నతిమృదుధాతురాగంబులు గొమరార గుంభస్థలములఁ బూసి
సల్లలితాశోకపల్లవనివహంబు కర్ణావతంసంబుగా రచించి
మానితం బగునవమాలికాస్తబకముల్ మురజలుగాఁ గంఠముల నమర్చి
కరము వెరవు మెఱసి కరిణులుఁ దారును । నభినవంబుగా మదాంధగంధ
సింధురములు మెఱయ శృంగారములు చేసి । కామకేళి సలుపఁ గాతరిల్లె.

98


వ॥

ఇ ట్లనేకప్రకారంబుల శృంగారంబు సేసి కామకేళీలాలసులై కరికరేణువు
లత్యంతానురక్తి నొండొండ నడరం దొడంగె నంత నందు.

99


శా॥

బేటంబేటముగా నిభంబు కరిణిం బ్రేమంబుతోఁ జేరి లా
లాటం బొత్తు లలాటపట్టమునఁ గేలంగేలు వేష్టించుఁ గ్రీ
గోటన్ మేమొరయున్ వరాంగములు సోకుం బుష్కరాగ్రంబునం
దాటోపం బొనరించుఁ గూడఁ బ్రియఁ గామాసక్తి నాసక్తిమై.

100


మ॥

హృదయాహ్లాదముతోడఁ బాయక సదానేకప్రకారంబులన్
మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభవిక్రీడితం
బది దాక్షాయణి సూచి కౌతుకరతైకాలీనభావాభిలా
షదృగత్యుజ్వలదీధితుల్ పఱపె నీశానాననాబ్జంబుపైన్.

101


వ॥

తదవసరంబునం బరమేశ్వరుండు నిజజీవితేశ్వరిక న్నెఱింగి దానికి సమ్మతించినం
గని సంతోషించి.

102


క॥

సతి గరిణి యగుడుఁ ద్రిజగ । త్పతి గరియై కూడె సతులు భావించిన యా
కృతిఁ గూడ నేర్పగాదే । యతిశయముగ నింగితజ్ఞు లగుఫల మెందున్.

103


గీ॥

ఆదిమూర్తులు శివశక్తు లచలమతులు । హరుఁడు సతియును సురతార్థు లై విహీన
తరము లగుమృగరూపముల్ దాల్చి । రనినఁ గాముమాయల నెవ్వారు నేమిగారు.

104


క॥

హరుఁడును సతీ రతిఁ దనుపఁగ । భరమై గజకేళిఁ గూడి పడసెను సుఖ మిం
కొరు లెట్లు సేర్తు రొకమెయిఁ । గరణంబులు పెక్కులేక కాంతలఁ దనుపన్.

105


వ॥

ఇట్లు పరమేశ్వరుండును సతీదేవియు సామజకేళీలాలసులై విహరించి రంత
సద్యోగర్భంబున.

106

క॥

పురుషాకారముఁ బటుమద । కరివదనముఁ గుబ్జపాదకరములు లంబో
దరము హరినీలవర్ణముఁ । గర మొప్పఁగఁ దాల్చి విఘ్నేశ్వరుఁ డుదయించెన్.

107


వ॥

ఇట్లు దాక్షాయణికిని సకలభువనభవనాధీశ్వరుం డైనపరమేశ్వరునకును గణా
ధీశ్వరుం డుదయించిన మహోత్సాహంబున.

108


మ॥

సురవాద్యంబులు మ్రోసె దిగ్వదనముల్ శోభిల్లె గంధర్వకి
న్నరగేయంబులు మించే దేవగణికల్ నర్తించి రింపారఁగాఁ
గురిసెం బువ్వులవాన దేవరవముల్ ఘూర్ణిల్లె నాదివ్యసిం
ధురయూధంబు మదంబు సేసె గణనాథుం రుర్వి జన్మించినన్.

109


వ॥

తదవసరంబున హరిపరమేష్ఠిపురందరాద్యఖిలదేవర్షిరాజర్షిప్రముఖాఖిలజగజ్జనం
బులు రజతాచలంబున కరుగుదెంచి మహోత్సవము సేయచుండి రంతఁ దదీయ
ప్రార్థితుండై పరమేశ్వరుండు శివగణసురగణాదిసమస్తగణాధిపత్యాఖిలక్రియారం
భాదిపత్యంబులతో యువరాజుపట్టంబు గట్టి పరమానందరసాబ్ధి నోలలాడు
చుండి రంత నక్కడ దక్షప్రజాపతి సకలజగజ్జనంబుల నిర్మించి సంతోషితహృద
యుండై యొక్కనాఁడు.

110


క॥

జలజాత్త్యంతకకశ్యప । కులభామిను లై నెగడ్తకుం జని బహుపు
త్రులఁ బడసి పేరుకొనుకూఁ । తులఁ జూడఁగ నరిగె నతికుతూహలబుద్ధిన్.

111


వ॥

చని నిజాగమనప్రయోజనంబు కశ్యపున కెఱింగించి పుచ్చిన.

112


మ॥

విని సంతోషముతోడ సంభ్రమములో వేగంబునం బ్రీతితో
మునిసందోహముతోడ శిష్యతతితో మూర్తంబు లైకొల్చువే
దనినాదంబులతోడ సంతతమహెత్సాహంబుతో వచ్చె ము
న్కొని తాత్పర్యముతోడ గశ్యపుఁడు దక్షుం గాన సద్భక్తితోన్.

113


వ॥

ఇట్లు సకళత్రంబుగాఁ జనుదెంచి సర్వాంగీణప్రణాముండై నిజమందిరంబునకుం
దోడ్కొని చని యర్ఘ్యపాద్యాదివిశేషార్చన లర్చించి మణికనకాదివస్తుని
చయంబునం బూజించినకశ్యపప్రజాపతిభక్తియుక్తి కావర్జితహృదయుండై దక్షుం
డాతని వీడ్కొని ధర్మరాజావలోకనకుతూహలపరుం డై చని ముందట.

114

స్ర॥

ఘనబృందానేకదేశాగతపథికజనౌఘప్రపాపాంగు నుగ్రా
శనిభీతార్తోరుశైలాశ్రయు నిఖిలనదీస్వామిఁ జంద్రాప్సరశ్శ్రీ
జనకుం గల్లోలమాలాచలితనిజకటక్ష్మాజరాజీలీలాసుం
గనియెం దక్షుండు రత్నాకడు నిఖిలమహీకామినీమేఖలాభున్.

115


వ॥

కని యమ్మహాఋషి మహాపరుషవజ్రివజ్రపాతభీతాయాతక్షోణిధరపక్షనిక్షేపక్షు
భితానేకనక్రచక్రతిమితిమింగిలతద్గళకుంభీరకుంభీనసాద్యనేకజలచరకులాకులితలు
లితాలోలకల్లోలానూనఫేనాయమానశుక్తిముక్తాఫలాభిరామం బైనయదియని
మెచ్చి మఱియును విశేషించుచు.

116


క॥

శరనిధిరత్నంబులు దివి । కరిగెనొ యని తారకముల నతులోర్మికరో
త్కరములు దెమల్చి తెల్చిన । పరుసున నవవిపులఫేనపంఙ్తులు వెలుఁగున్.

117


క॥

వనధిఁ గలనగము లన్నియు । ననిమిషపతిమీఁద నడువ నని యెగసెనొకో
యన నాకాశముఁ దాఁకఁగఁ । దనరఁగ నత్యున్నతోర్మితతి విలసిల్లెన్.

118


చ॥

ఉడుగనినీరిలోనఁ బడియుండఁగ నోపక బడబాగ్ని వే
ల్వడి వరతీరభూరుహకులంబులపై మొగిఁ గప్పునట్లు దం
దడి నరుణప్రవాళకలతల్ దరుసంహతిమీఁదఁ బర్వె చె
ల్వడరి తటాటవుల్ దనరు నబ్ధిబహిర్గణరత్నదీప్తులన్.

119


గీ॥

వనధినీ రెల్లఁ గొనిపోవఁ గని సహింప । కబ్దతతి గిట్టపట్టిన నరుగ నోప
కోలి దొంతులు గొని పడియున్నకారు । మొగుళు లనఁజూచి తటభూమి మొగళు లమరె.

120


క॥

సురగిరికర్ణికగా వి । స్తరతము లగుమండలములు దళములుగా న
వ్విరిదమ్మిఁ బోలి క్రాలుచు । శరనిధిలో నిఖిలధరణిచక్రము వొలుచున్.

121


క॥

హరిఁ దనగర్భమునఁ జరా । చరమయవిశ్వంబు దాల్చినను వాని సితే
తరమణివోలె ధరించిన । శరనిధిపెం పేరికైనఁ జనునే పొగడన్.

122


వ॥

అని యనేకవిధరత్నశీకరాకరం బైనరత్నాకరాశేషవిశేషంబులు బహుప్రకారం
బుల విశేషంచుచు ధర్మాకర్మఫలభోగాస్పదం బైనధర్మరాజుపురంబున కరిగె నంత.

123

ఉ॥

అర్మిలితో నగస్త్యముని యాదిగ దివ్యమునీంద్రులున్ మహా
ధర్మసమేతులై పితృపితామహవర్గము బ్రేతయూథముం
గర్మములుం జరారుజులుఁ గాలములుం దనుఁ గొల్చి
ధర్ముఁడు వచ్చి లోకగురు దక్షుఁ గళాగదక్షుఁ గానఁగాన్.

124


వ॥

ఇ ట్లెదుర వచ్చి భార్యాసమేతంబుగా వినయవినమితోత్తమాంగుండై కశ్యపు
కంటె విశేషార్చనలం బరితోషితుం జేసిన ధర్మరాజు వీడ్కోని చంద్రమండ
లంబున కరిగిన.

125


చ॥

కువలయబాంధవుండు హిమగోనికరావృతుఁ జేసి మాము కు
త్సవ మొనరంగ ముందటఁ బథశ్రమ కూర్చుచు వచ్చెఁ దారకా
నివహనిజోపధీకుముదినీపరివేష్టితుఁడై సుధాసము
ద్భవుఁ డమలాంగుఁ డెంతయు ముదంబున దక్షునిఁ గాన నెమ్మితోన్.

126


వ॥

ఇ ట్లెదురువచ్చి కశ్యపధర్మజులకంటె విశేషార్చనలు గావించిన సుధాకరు
వీడ్కొని సతీపరమేశ్వరావలోకనార్థియై యనేకదివ్యఋషిపరివేష్టితుండై చను
దెంచి.

127


క॥

ధరణిధరుఁ బార్థివశే । ఖరసంయుతు రాజవంశకమలార్కురథ
ద్విరదభటవాజిపరీవృతు । నరపతిగతిఁ బొలుచురజతనగపతి గనియెన్.

128


వ॥

కని తదీయమాహాత్మ్యంబున కాశ్చర్యహృదయుం డగుచుం దద్గిరిపాలకానుజ్ఞా
తుండై పరమేశ్వరాస్థానంబున కరిగి.

129


ఉ॥

మారమదప్రహారు గుణమండనమండితు నుందరాంగు దు
ర్వారభవాబ్ధిపారగు సువర్ణసవర్ణశరీరు సజ్జనా
ధారుఁ గవీంద్రగాయకబుధస్తుతుఁ గాశవికాసహాసది
క్పూరితచారుకీర్తి మునిపుంగవు జంగమమల్లికార్జునున్.

130


క॥

భవమరణాంభఃపూరిత । భవసాగరతరణసేతుపధ్ధతిఁ జేతో
భవనిశితకుసుమబాణో । ద్భవరాగవిముక్తుఁ గమలభవకులతిలకున్.

131

చ॥

గళమదమత్సరేంద్రియవికార మమత్వసమస్తసంగతా
గతవసులోభమోహభయకల్మషదుర్వ్యసనాదురీషణా
త్రితయమనోజమార్గణుఁ బ్రదీపితు నిర్మలినాంతరంగు నా
నతమునినాథ మస్తు జనస్తుతు జంగమమల్లికార్జునున్.

132


క॥

అక్షయనిఖిలకళాగమ । దక్షమహోదారు ధీరుఁ దత్వజ్ఞు లలా
టాక్షజనితోగ్రశిఖిముఖ । భక్షితపంచేషుదేహుఁ బరమోత్సాహున్.

133


మా॥

విగతసకలరాగద్వేషు నిర్ముక్తదోషున్
ద్రిగుణపదచరిత్రాతీతుఁ బ్రజ్ఞాసమేతున్
సగుణు నచలమోక్షాసక్తు సంసారముక్తున్
బొగడఁదగు దురాషాడ్ఫోగి నిర్వాణయోగిన్.

134


గద్య॥

ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ
శిఖామణి నన్నెచోడదేవప్రణీతంబైన కుమారసంభవం బనుకథయందుఁ బ్రథమా
శ్వాసము.

  1. సావి= అనెడుభ్రమతో, సావి, సవియొక్క రూపాంతరము. “శాటికల్ సవితదావాసంబు జేర్పంగ రేవుల డిగ్గన్” ఆముక్తమాల్యద. ఆ-౧. మే మిందుఁ బ్రయోగములు చూపునపుడు ముద్రితగ్రంథములనుండి పద్యభాగములను, అముద్రితగ్రంథములనుండి పూర్ణపద్యముల నుదాహరించెదము. ఆంధ్రభాషయందు ముద్రితాముద్రితప్రబంధములలో లేనిపదములకు ద్రవిళకర్ణాటభాషాకావ్యములలో మాకు లభించినంతపట్టు గూర్చెదము. విజ్ఞులు క్షమింతురు గాక.
  2. వలగతి = అనురాగపురీతితో
  3. మొసరుమునుఁగకొనుట = మకరందముతోడ సంపూర్ణముగా నందుకొనుట యని తోఁచుచున్నది.
  4. పరముని = శివుని. కరములు = చేతులు, కానుకలు. పరమశబ్దమునకు:- “పరముఁడు కంధరస్థలముపై నిడి వేడుక ముద్దులాడఁగాఁ | గరమున మౌళిగంగయుదకంబులు మెల్పున బీల్చి యావిశీ | కరములు భూషణేందునకు గౌరవతారఃలీలఁ జేయు త | త్కరివదనుండు మత్కృతికిఁ దాను ముఖస్థితితోడఁ దోడగున్.” అని యమరేశ్వరుని విక్రమసేనము.
  5. మార్గకవిత = డాంధ్రకర్ణాటాదికవిత
  6. నాయి = కుక్క
  7. ఒత్తగిల్ల = ఊఁదియుండఁగా
  8. కృతులకును రత్నములకును శ్లేష
  9. పొరపు = బోఱయైన, తెల్వులన్ = నీరులచే, చపులచే.
  10. అగుర్పు = పరులకు భయము కలిగించు పెంపు. ఈపదము ద్రవిడభాషలో
    ‘అగుర్పు’ అనియు, కన్నడమున “ఆగుర్వు’ అనియువాడఁబడును.
    “ముగిలం ముట్టిదపెంపు పెంప నొళకొం డుద్యోగ ముద్యోగదొళ్
    నెగ ళ్దాజ్ఞాబల మాజ్ఞెయొ ళ్తొదర్దగు ర్వొందొం దగుర్విం దగు
    ర్వుగొ ళుత్తి ర్పరిమండలం.” విక్రమార్జునవిజయము. ఆ-౧
  11. కృతికిని సతికిని శ్లేష
  12. కృతికిని మత్తగజమునకును శ్లేష
  13. కేనము = వట్టి పైగాంభీర్యము
  14. కొలకొండ = మానపర్వతము
  15. గెల్వున్ = జయము, గెలుపు
  16. బేటంబేటముగా = అనురాగప్రత్యనురాగములలో, “కనుబేటంబున నేట
    మైనహృదయగ్లానింబయోజాస్యకున్” దశకుమారచరిత్ర-ఆ-4, మేము తాళ
    పత్రగ్రంథములనుండియే యుదాహరించుచున్నందున ముద్రితగ్రంథములలోని
    వానికిఁ బాఠభేదములగపడును. పండితకవులు మేలేర్చికొందురుగాక.