Jump to content

కుమారసంభవము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

శ్రీకంఠమూర్తిఁ బుణ్య । శ్లోకు మహాభాగు నిఖిలలోకారాధ్యున్
నాకేశభోగిసత్యగు । ణాకరు నచలాత్ము మల్లికార్జునదేవున్.

136


మ.

అతినీలాభ్రవిలంబియై పొలుచునీహారాద్రియుం బోలె స
త్సుతు సాయోద్భవక్త్రు నెత్తికొని సంతోషంబుతోఁ జూచుచున్
సతి నవ్వించుచు నవ్వుచున్నపరమున్ సర్వేశు దక్షప్రజా
పతి గాంచెన్ సితహాప్రభావిచలితబ్రహ్మాండభాండోదరున్.

137


వ.

కని సర్వాంగాలింగితమహీతలపునఃపునఃప్రణామసంస్తోత్రాదిసత్కారంబులు
సేయక దురభిమానంబున నహంకరించి యున్న దక్షునిం గని విరూపాక్షుం
డాక్షేపించి విముఖుం డైనం గని దక్షుండు దనుయల్లురందఱ చేసివసత్కారం
బులును మొదలియల్లుం డైనపరమేశ్వరుండు సేయమికి మనఃక్షుభితుండై క్రమ్మ
ఱ నిజనివాసంబున కరిగి తద్వృత్తాంతం బాత్మేశ్వరి కెఱింగించి మనఃఖేదంబున
నున్నదక్షప్రజాపతికిఁ దద్ధర్మపత్ని యిట్లనియె.

138


గీ.

తల్లిదండ్రులఁ బూజించి తగ వెఱింగి । మన్నపొడ వైననే యత్తమామ లనియె!
ప్రియ మెఱుంగు నాఁడిచ్చినబిడ్డ మనకుఁ । బాసె నని యుండుఁ డింక నాపలుకు లేల.

139


వ.

అనిన వెండియు నవమానానలోద్దీపితమనస్తాపంబు సహింపనోపక తదపకారం
బునకుం బ్రత్యపకారంబు సేయ నుద్యుక్తుండై యిట్లనియె.

140


తరు.

భువనంబు లన్నియుఁ బుట్టించి కశ్యపుఁడు వానిఁ గైకొని బ్రోచుచంద్రుండు
నవయవంబుల వాని నడచు ధర్ముండు నతిభక్తి నా కిచ్చె నర్చన లర్థి
నివి వారిలోనఁ దానే వెద్దపొంది యీశానుఁ డేఁ దనయింటికిఁ జన్న
నవమాన్యుఁ జేసె నాయల్లురు నేను నై తన్ను జేయుదు నాగమబాహ్యు.

141


వ.

అని విచారించి కృతనిశ్చయుండై మహాధ్వరప్రారంభాభిముఖుండై చతుర్దశ
భువనాంతరానేకజనంబుల రావించినం దదీయాజ్ఞాప్రేరితులై.

142

సీ.

హరిపితామహపురందరలోకపాలార్కవసురుద్రసురవైద్యవరమునీంద్ర
చారణగరుడప్రజాపతికిన్నరగంధర్వరాక్షసఖచరసిద్ధ
సాధ్యసురాహిపిశాచమరుద్గ్రహవిద్యాధరాప్పరోవిప్రమనుజ
దిక్కులశైలనదీసాగరాగమధర్మవేదపురాణతర్కశాస్త్ర
నిచయమాదిగాఁగ సచరాచరాత్మకం । జగుపదార్థ మెల్ల నాక్షణంబ
తగువిభూతి మెఱసి దక్షప్రజాపతి । యజ్ఞమునకు వచ్చె నతిముదమున.

143


వ.

తదనంతరంబ నిజకులపాలికాసమన్వితులై కశ్యపయమచంద్రులు దమతమ
విభవంబులు మెఱసి మహోత్సాహంబునం జనుదెంచి రంత నఖిలభువనాధీశ్వ
రాకీర్ణంబై కలకలస్యాదిసమస్తవస్తుసంపూర్ణంబై యతిరమణీయం బగునిజ
పురోత్సవంబు గని పరమానందహృదయుండై దక్షప్రజాపతి బృహస్పతిదత్తసు
ముహూర్తంబునం గ్రతుదీక్షితుండై పటుపటహపణవభంభడుత్తుంభమృదంగ
శంఖకాహళకాంస్యవేణువీణాతతవితతవిపంచికాఘనసుషిరాద్యాతోద్యధ్వానం
బుల నధ్వకరించి మంగళపాఠకపఠనానూనగానవేదాశీర్వాది నాదంబులు నిర్మధ్య
మానసముద్రఘోషంబు నధఃకరించి మ్రోయుఘనగర్జనరవంబులుంబోలె రోద
సీవివరాపూరితంబులై మహాధ్వని సెలంగుచుండ.

144


క.

బ్రహ్మరథ మెక్కి విష్ణు । బ్రహ్మాదికసకలదేవపరివృతుఁడై యా
బ్రహ్మఋషిసుతుఁడు దక్ష । బ్రహ్మ లసద్యాగమంటపంబున కరిగెన్.

145


వ.

ఇ ట్లధికతరవిభూతితో ధర్మపత్నీసమేతుండై యజ్ఞోపకరణద్రవ్యాద్యనేకద్రవ్య
పరిపూర్ణంబై నానావిధాలంకారాలంకారాలంకృతంబై యతిరమణీయం బైన
యజ్ఞశాల ప్రవేశించి యజమానస్థానంబు నలంకరించు చుండె నంత విధివిహిత
విధానంబుగ ఋత్విగ్గణంబులు త్రికుండంబుల జాతవేదాహ్వానంబు సేసి
యథాక్రమంబున హోమంబు సేయం దొడంగి రంత నక్కడ.

146


క.

తనవిభవము దక్షుఁడు ద్రిణ । యనుదేవికిఁ జూపి మెఱయ సని ముందఱు వం
చిన వనితలు గైలాసం । బునకు నరిగి కనిరి సకలభువనాధీశున్.

147


వ.

కని సర్వాంగీణప్రణాములై నిజగమనప్రయోజనం బెఱింగించి పరమేశ్వరాను
జ్ఞాతులై సతీదేవిం దోడ్కొని దివ్యవిమానారూఢులై మనోజవంబునం జను
దెంచి రంత.

148

క.

ఆతతమణిరుచిరనభ ము । ద్యోతింపఁగ నతులగతి రయోర్గతరుచి ను
ర్వీతల మద్రువఁగ నుల్కా । పాతం బనుకడఁకఁ దత్సభాసదు లులుకన్.

149


క.

జా నఱి పశుపతి నుఱక వి । ధానమహారంభుఁ డైనదక్షుం డనున
జ్ఞానికి మునుకొని వచ్చున । మానం బన నమరసతివిమానము వచ్చెన్.

150


వ.

వచ్చి ముఖమంటపోపకంఠంబున విమానావతరణంబు సేసినదాక్షాయణికిం జంద్ర
రేఖానేకవిద్యుల్లేఖానికరంబునుం బోలె శివగణికాసహస్రంబు పరివేష్టించి.

151


సీ.

కనదపాంగాషలోకనదీప్తు లుత్ఫుల్లకమలపుప్పోపహారములుఁ గాఁగ
నలసదోదూయమానామోదనిశ్వాసపవనంబు లగరుధూపములు గాఁగ
మహనీయజాజ్వల్యమానభూషామలరత్నప్రభాతు లారతులుఁ గాఁగ
మణిమయమంజీరఝణఝణత్కారాదిరుతము లింపారుసంస్తుతులుఁ గాఁగ
నభవమూర్తి యైనయాగాధిపతి కర్చ । లిచ్చుకరణి వినుతు లెసక మెసఁగ
నెలమి జన్నసాల కేతెంచిరా సభా । సదులు కౌతుకమున సంభ్రమించి.

152


వ.

ఇట్లు సనుదెంచుపరమేశ్వరుమహాదేవిం గని హరిపరమేష్ఠిపురందరాద్యఖిలసభా
సదు లాలోకనమాత్రఁ బ్రస్తుతించుచు మస్తకన్యస్తకరకమలముకుళు లగుచుండ
వచ్చి వినయంబున దక్షప్రదత్తమహాసనాసీనయై జగజ్జనకుం డైననిజజనకు
మహత్త్వవిభుత్వంబునకు మెచ్చుచు సురవరుల నెల్లను రావించి పరమేశ్వరు
రావింప భయస్థుండై నిజపుత్రి స్నేహంబున రావించె నని సంతోషించి సతీ
దేవి దక్షునకుఁ బ్రియసంభాషణభావంబున ని ట్లనియె.

153


గీ.

హరిపితామహదివిజేశ్వరాదిదిగధి । పతుల సురమునిద్విజుల రాఁ బనిచి వరదు
నభవుఁ బరఁమేశు రావింప వైతి నీవు । దలఁచి పిలిచిన భక్తవత్సలుఁడు గాఁడె.

154


వ.

అనినం బరమేశ్వరుం డనుపలుకు సహింపక దక్షుం డాక్షేపించి.

155


శా.

ఈలక్ష్మీశ్వరుం డీజగజ్జనకుఁ డీయింద్రాదిదిక్పాలు లిం
దీలీలావతి యిమ్మునీశ్వరగణం బీవిప్రసంఘంబు వే
దాలంకారులు వీరిలోనికి విరుద్ధాచారకంకాలకా
పాలోగ్రాహీదటాజినాస్థిధరుఁ డాభస్మాంగి రా నర్హుఁడే.

156

వ.

అనిన విని నవఘనాఘనధ్వని వినినకమలలక్ష్మియుం బోలె మదరిపడి లగ్గనోసి
దాక్షాయణి దక్షున కిట్లనియె.

157


మ.

త్రిజగన్నాథుఁ బవిత్రగాత్రుఁ గ్రతుమూర్తింబుత్తు సత్పూజ్యుఁడే
యజనాభీలకపాలశల్యధరుఁ డీయజ్ఞాదులం దంది యీ
ద్విజదేవాదులకుం గపాలకవచాస్థివ్రాతముల్ మేనులన్
నిజమై యున్నవి రుద్రచిహ్న లివె వీనిం బుచ్చి రా నేర్చిరే.

158


గీ.

వీరి కెల్లను దేవతావిభవ మొసఁగు । చున్న పరమేశు రావింప నొల్ల ననియె
దింక నీయజ్ఞఫలము నీ కిచ్చునట్టి । పెద్ద లెవ్వ రీవచ్చినపేళ్ళయందు.

159


సీ.

ధరణితలం బెల్ల నరదంబు చంద్రార్కబింబముల్ చక్రముల్ పృథుజవాశ్వ
ములు వేదములు పగ్గములు చతుస్స్వరములు ప్రణవంబు గసగోల బ్రహ్మసూతుఁ
డగపతి ఇల్లు పన్నగపతి గొనయంబు హరి గోల గరి గరుం డనల మమ్ము
పదముండు వేగంబు దివిజగణంబులు నెరపులై యీశుండు పురము లేయఁ
దలఁచినంతన భోరనఁ దమకుఁ దార । వచ్చి కెలసంబు సేసినవారె కారె
వీరిఁ బట్టి పరమేశుని విడుతు ననఁగ । వలదు నీ కీశుఁ డేలినవాఁడు కాఁడె.

160


క.

నెఱయఁగ నీ కిది కాదని । యెఱుగమి యీదేవగణము నేలినవానిం
గొఱగాఁ డని కైకొన కిం । దఱిఁ దెచ్చితి వీర లీశుదాసులు గారే.

161


వ.

అని పరమేశ్వరు సమస్తమరాధీశ్వరుల కధీశ్వరుండుగాఁ బలికిన విని దక్షుండు
సహింపక.

162


ఉ.

అన్నినయట్ల యిమ్మునిసురాధిపులం జెడనాడు చున్ననీ
యున్నతికంటె నాకు మొగమోడి సహించిరి గాక వీరిలో
నెన్నిననిన్ను రుద్రుని సహింతురి దేవత లన్న నల్కతోఁ
గన్నుల నిప్పులొల్కు[1]హరుకాదిలి దక్షునిఁ జూచి యిట్లనున్.

163


సీ.

నీకంటె హరి బుద్ధిలేకయె నిజనేత్రకమలంబు పూన్చి చక్రంబు వడసెఁ
బరమేష్ఠి నీకంటెఁ బరవిడియే శిర మొప్పించి నిత్యుఁడై యున్నవాఁడు

మఘవుండు నీకంటె మరులైయె క్రతుతతి నర్చించి దేవేంద్రుఁడై వెలింగె
నిఖిలదేవాలియు నీకంటె నవివేకులయియె సేవించి భోగాత్ము లైరి
వీర లిందఱకంటెను వెరవుమిగుల । నెఱుక ని కిప్పు డెందుండి దొఱకిపడియె
నగణితైశ్వర్యు శివుఁ బరమాత్ము నెఱిఁగి । యెఱిఁగి దూషింప నీకు నోరెట్టులాడె.

164


క.

వాదున నీహరి వేధయు । గాదే యురులింగమూర్తి కడగానక నేఁ
డాదిగ వెదకెద రట్టిమ । హాదేవుఁ డపూజ్యుఁ డనఁగ నెగునే నీకున్.

165


చ.

హరుఁ జెడనాడి వీరి కొనియాడెదు పెద్దయు నీవు చూడఁగా
గరళము మ్రింగి త్రైభువనకంటకు లైన గజాసురాదులం
బరువడి నోర్చి విశ్వము శుభస్థితి నిల్పినవాఁడు దొల్లి నీ
హరియె పితామహుండె దివిజాధిపుఁడే సురలే మునీంద్రులే.

166


మ.

హరునిగ్మించినవేదమార్గములు గా కాయాగముల్ సేయఁగా
వెర వొండెయ్యెది సద్విధిం గ్రతుసమాప్తిం బొందినన్ మిట్టినా
వరదుం డొక్కఁడు దక్కఁ దత్ఫలము లెవ్వం డీ సమర్థుండు నీ
సురసంఘంబులలోన నంచు సతి దక్షుం దూలఁబోఁ బల్కుచున్.

167


వ.

ఇట్లు పరమేశ్వరు వేదకర్తయు సకలకర్మఫలదాతయుఁగాఁ బల్కిన దక్షుండు
దుర్మదంబున సహింపక వెండియు నిట్లనియె.

168


ఉ.

ఎన్నఁడుఁ దొల్లి చర్మములు నెమ్ములు భూతియుఁ దాల్చి తాపసుల్
జన్నములందుఁ జొర్తురె విచారములేక సురేశ్వరాదులం
బన్నములాడి నీమగనిపక్షము వల్కెదు గాక బేల నీ
కొన్నమరుల్ జగజ్జనులు గొందురె వ్రాత్యులఁ బూజ్యు లందురే.

169


వ.

అనిన విని సతీదేవి కోపోద్దీపితచిత్తయై.

170


చ.

అఱిముఱి రుద్రు నెంతచెడనాడెదు సోమము ద్రాగియున్కి మై
యెఱుఁగక బిఱ్ఱెదో కలయ నిమ్మఖధూమము గప్పికొన్న దు
త్తుఱుగొని ప్రేలెదో ముదిసి దుర్మతివై కడు విభ్రమించి మై
మఱచితొ కాలకాలు నజమస్తకసంహరు నిట్లుపల్కుటే.

171

మ.

అమృతాంభోధి మధింప మందర మనంతాహిశుఁడేఁ బంచె శై
లము దాల్పన్ హరి బంచె మీఁద నజు నిల్పంబంచె వాసుక్యుఁ గ
వ్వముద్రాడై గిరి సుట్టఁబంచె వడిఁ దివ్వంబంచె దేవాసురౌ
ఘము సర్వేశుఁడు రాజుగాఁడె యెఱుఁగంగా రాదె నీ కెమ్మెయిన్.

172


సీ.

విశ్వంబు కావింప విశ్వాత్ముఁడై యష్టతనువులు సేకొని తనరువాని
నురులింగరూప హరివేధలకుఁ దనకడగానరా కున్నపొడవువాని
శరణార్థులకు దయావరములు నైశ్వర్యమూర్తి సేకొని యున్నకీర్తివాని
వార కనేకావతారముల్ హరి కురుకల్పంబు లజునకుఁ కఱవానిఁ
దా నచింత్యుఁ డనంతుఁ డనూనదాన । నిరతుఁ డక్షయుఁ డన నున్నపరముఁ
బరమయోగి నిశ్చలనిర్మలయోగబుద్ధి । నెఱుఁగ గా కీశుమహిను నీ కెఱుఁగగరాదె.

173


వ.

అనిన విని దక్షప్రజాపతి పశుపతి వేదబాహ్యుం డని తనపట్టినప్రతినయ పట్టి
క్రాలుచు వెండియు ననేకప్రకారంబుల దూషించుచున్న విని సతీదేవి హరిపర
మేష్టిపురందరబృందారక మునిబృందంబుల వేదంబుల ననలంబులం జూచి పర
మేశ్వరుండు మఖంబులం దపూజ్యుండే యనిన విని భయంబున నడనడ నడుం
గుచు దక్షు నిరాకరించి సమస్తలోకాగమంబులకుం గర్తయుం గర్మఫలప్రదా
తయు మఖప్రయోగాద్యఖిలపూజాస్థానంబులయందు నీశ్వరుండు పూజ్యుండు
గాఁ బ్రతిష్ఠించి బ్రహ్మవిష్ణువు లిట్లనిరి.

174


క.

ఏ మాదిమూర్తిదక్షిణ । వామాంగమునందుఁ బుట్టి వారక జననో
ద్దామపరిపాలనాదిమ । హామహిమలు వొందఁ గంటి మాశివుకరుణన్.

175


వ.

అని యందఱుం బ్రత్యేకంబ యివ్విధంబునం బలికిన విని దక్షుం డందఱ నా
క్షేపించి మీరు భిక్షువలనిభయంబున దాక్షాయణిపక్షంబునం బలికినం గర్మ
బాహ్యుం డైనపాషండుండు పూజ్యుం డగునె యని యెవ్వరిం గైకొనక
మీఁదులేక పలికిన విని సతీదేవి కోపోద్దీపితహృదయయై దక్షు నాహుతిగొన
నెగయునట్లు నడరిమేనిలో దనరుకోపాగ్నిధూమసమితి ముడివడి వడన రం
ధ్రముల వెడలె.

176


ఆ.

అధిపుఁ బలుకఁబలుక నడరి యాకాశంబు । దాఁకి సతిమనమున్నదరతరంబ
మాన కగ్నిలోన మలఁగ నే వోసిన । మాడ్కిఁ గోపవహ్ని మండి యెగసె.

177

క.

తనపతిఁ జెట్టలు పలికిన । జనకుం గని కోపవహ్ని సతిదేహము భో
రన మండె భానుఁ గని కెం । పున మండెడు సూర్యకాంతపుత్రికవోలెన్.

178


గీ.

అధిపుఁ [2]జెట్టలాడె నని దక్షుఁ గని । సతి కడరుకోపవహ్ని నొడలు గాలెఁ
వగవ నట్లై యెట్టివారికిఁ బ్రియనిరా । కరులఁ గాంచి యొడలు గాలకున్నె.

179


చ.

పొలయునశోకవల్లి విరిపువ్వులగుత్తులమీఁదఁ గ్రాలుకెం
దలిరులొ నాఁగ మై నడరి దందడి వహ్నిశిఖాకలాపముల్
గలకొనఁ బ్రేలి దూలికొని కాలె రయంబున లక్కబొమ్మ న
గ్గల మగువహ్ని చుట్టుకొని కాలురయంబున నిస్తుషంబుగాన్.

180


వ.

తదవసరంబున.

181


క.

భోరన నుడుగక చెలఁగుత్ర । యీరవముల పెల్లు సెడి మహీసురమునిబృం
దారకతతి దెస నురుహా । హారవములు సెలఁగె దన్మఖాగారములన్.

182


వ.

అంతక మున్ను కృతాంతకుండు తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సకల
భువనసంహారకారణాభీలకాలాగ్నిరుద్రోద్రేకంబున నభినయించువాఁడునుంబో
లె గోపానలోద్దీపితావేష్టితాతిభయంకరాకారంబు దాల్చిన.

183


మ.స్ర.

వివిధాస్త్రానేకజాతావిరలబహులసద్విస్ఫులింగాగ్నియుం ద
త్పవమానాహారవక్త్రప్రకటితవిషవిభ్రాజితోగ్రానలంబున్
సవికారాత్మాతికోపోజ్వలతరవిపులజ్వాలియుం గూడి పర్వెన్
భవభాలాభీలనేత్రోద్భవశిఖిశిఖలన్ బద్మజాండంబు దాఁకన్.

184


వ.

తదవసరంబున.

185


చ.

ఖురపదఘట్టనం ధరణి గ్రుంగ ఫణీంద్రుఁడు నుగ్గునుగ్గుగాఁ
బరువడి నూర్పులం దొరలిపాఱఁ బయోనిధులుం గులాద్రులుం
బొరిఁబొరిఁ ద్రుంగ శృంగహతిఁ బొంద దివంబు నజాండమున్ మహే
శ్వరువృషభంబు నాక్షణమ వచ్చెఁ ద్రిలోకభయంకరాకృతిన్.

186

వ.

అంత పుష్పదంతభృంగిరీటఘంటాకర్ణమహాకర్ణవిభోగవీరళంకరవీరభద్రరుద్రగణా
ధినాథు లొండొరులం గడవ నుద్రేకించి.

187


మ.

హరి మర్దింతుమొ బ్రహ్మఁ బట్టుదుమొ యింద్రాదృష్టదిక్పాలురం
బరిమారన్ వధియింతుమో త్రిదశులన్ భంజింతుమో లోకసం
హరణం బిప్పుడు చేయనెత్తుదుమొ విశ్వాధీశ్వరుం డీశుఁ డె
వ్వరి పై నల్గెనొ చూడుఁ డంచుఁ బ్రమథవ్రాతంబు రౌద్రాకృతిన్.

188


వ.

సంక్షోభించి విరూపాక్షుండు దక్షు నాక్షేపించు టెఱింగి పొంగుచు నతిరభసం
బునం బరమేశ్వరుముందఱికి వచ్చి మహాబ్రహ్మప్రళయవ్యవసాయంబునకు నురుత
రాఘాతసంప్లవోపక్రమంబునకు ననేకబ్రహ్మాండఖండనిఖండనవ్యాపారంబునకు
నే మేమ చాలుడు మను చున్నగణంబులందు గణముఖ్యులు దలతల మని వెడలి
విగర్వించి.

189


చ.

జలజభవాండ మంతయును జర్ఝరితం బగుచుండ వ్రచ్చి మున్
గులగిరు లుర్విమీఁద వడిఁ గూలఁగఁ ద్రోచి జగంబు లబ్ధులం
గలిపి మహాబ్ధు లన్నియును గంజభవాండము మేర కక్కడన్
వెలువడఁ జల్లి రౌద్రగతి విశ్వము నిప్పుడ సంహరించెదన్.

190


క.

పంకజనాభాద్యమలఁ । బొంకం బఱఁ బట్టి తెత్తు భూరిబలమునం
గింక జగంబుల మ్రింగుదు । శంకర యేఁ గలుగ నీకుఁ జనునే యలుగన్.

191


గీ.

ఎలుక మీఁదికోపమున ని ల్లేర్చునట్లు । దక్షుపై నల్గి జగ మెల్ల నీక్షణంబ
సంహరింపంగఁ దలఁచుట సన్నె వానిఁ । బట్టి తెచ్చెద వడి నన్నుఁ బనుపు దేవ.

192


వ.

అని యనేకప్రకారంబులం బ్రత్యేకంబ పలుకు చున్నగణాధిపతుల వారించి
గణాధీశ్వరుండు పరమేశ్వరున కభిముఖుండై ప్రళయకాలనీలఘనాఘనంబునుం
బోలె మహాధ్వని గర్జిల్లుచు.

193


ఉత్సా.

బలిమిఁ బట్ట కలిగి పాశుపతము దొడుగ నేఁటి క
గ్గలిక ములుక కాయ కెత్తుగల్లు గొనఁగ నేల ము
న్నెలుక వేఁట కుఱుమతిండి యేల నీకు నలుగఁగాఁ
దలము గలదె నన్నుఁ బనుపు దక్షుఁ బట్టి తెచ్చెదన్.

194

వ.

అస్మదీయజననీపరాభవం బింతయుం గావున నవశ్యంబుగ నిప్పని నాకు దయ
సేయవలయు నని పన్నుపడం బలుకు చున్నగణాధీశ్వరు తెగువ యెఱింగి దక్షా
ధ్వరధ్వంసంబు చేసి దక్షుం బట్టి తెమ్మని పరమేశ్వరుండు నియమించిన మహా
ప్రసాదం బని వీడుకొనియె నంత నాక్షణంబ.

195


ఉ.

స్థూలసమున్నతాంగులు చతుర్భుజఫాలతటాక్షశూలకా
పాలకఠోరకార్ముకకృపాణధరుల్ ప్రమథాధినాథు లా
భీలపరాక్రముల్ నిఖాలభీకరమూర్తులు వచ్చి రోలిఁ గం
కాలసమేతులై భువనకంపముగా గణనాథుపాలికిన్.

196


వ.

తదవసరంబున దేవగణాధీశ్వరి నిఖిలశాకినీడాకినీకూశ్మాండయోగినీగణపరివృతయై.

197


క॥

లోకాలోకములో గల । చీకటియెల్ల నొకపొడవు సేకొనియెనొ నా
నాకాశ మడరి వచ్చెను మ । హాకాళి మహాభయంకరాకారముతోన్.[3]

198


వ.

ఇట్లఖిలగణపరివృతుండై గణాధీశ్వరుం డతిరయంబున దక్షప్రజాపతిపైఁ బరి
గొని దక్షాధ్వరావాసంబు గని కోపించి నిజగణంబులకుం జేయివీచిన నాక్ష
ణంబ.

199


సీ.

క్రతురక్షుకులఁ దాఁకి కనుకనిఁ బోఁదోలి చూపఱ విదిశలు సొరఁగఁ దోలి
వడి జన్నసాలనివాసంబుగొని వేదికలు గ్రొచ్చి గుండముల్ గవియఁ ద్రోఁచి
ఋత్విగ్గణంబులఁ జత్వాలమున బాఁతి బలిమి సదస్యుల నలియమోఁది
యుపదర్శిమెడ నుల్పి యూపంబుతోఁ గట్టి పరిచారకుల బట్టి దారి సమరి
వహ్నిజిహ్వ రెండువ్రయ్యలుగాఁ గోసి పరిజనముల నేలపాలు చేసి
యాక్షణంబ ముట్టి దక్షాధ్వరం బశ్రమమునఁ జెఱిచి యార్చెఁ బ్రమథగణము.

200


ఉ.

ఆయవనీసురాసురచయం బురుసత్త్వుల నుగ్రులన్ మహా
కాయులం దద్గణాధిపులఁ గాంచుచు మీఁదికిమీఁద జీవముల్

వోయిరి కొంద ఱోడిచెడివోయిరి కొందఱు చుట్టుముట్టినం
గూయిడఁ జొచ్చి రుక్కడఁగి కొంద ఱలందురి భీతచిత్తులై.

201


వ.

ఇట్లతిభీషణశాసను లైనగణాధీశ్వరులకవిదల కప్పగింపక సురవరు లతిసంభ్ర
మంబునం బరిమొగంబు దప్పం గనుకనిం జనునవసరంబున.

202


ఆ.

వాహనంబు నెక్కి వచ్చి భయంబున । వడఁకి నేలఁ బడ్డవనజగర్భు
గమిచికొని మరాళకము వాఱెఁ జెందమ్మి । గఱచికొని రయమునఁ బఱచినట్లు.

203


ఆ.

గరుడినడుము మెడయుఁ గాలును గేలును । నిఱికికొనుచుఁ జక్రి వెఱచిపఱచె
ఘర్మజలము లొదలఁ గ్రమ్మంగ వర్షేంద్ర । చాపజలదభాతిఁ జదలఁ బొదలు.

204


ఆ.

వేఁటకాఱు ముట్టి వెనుకొనఁగా శ్వేత । నగము చఱికిఁ దారునమిలివోలె
నభ్రగజముమీఁది కాసహస్రాక్షుండు । ప్రాఁకి పాఱె బ్రమథరాజి యార్వ.

205


ఆ.

ఇక్కుముట్టి చక్కి నెక్కంగమఱచి సంభ్రమముఁ వొంది పిఱుఁదఁబ్రమథగణము
లార్వఁ బోతుమీఁద నడ్డంబుపడి యుప్పు । పిఱికివోలె వెఱచి పఱచె జముఁడు.

206


గీ.

ఉరుతరాబ్ధీశుఁ డయ్యును నోడి పాఱె । వరుణుఁ డలుగుచు నుడికె దేవాంగువోలె
గలుము లెడరైన నేమియు నిలువ వనుట । దగుభయాతురుఁడై నోరఁ దడియులేక.

207


క.

తనయొక్కినమానిసిఁ దా । ననయము నెక్కంగ మఱచి యాతనిఁ దనమూ
పున నిడికొని పఱచె భయం । బున ధనపతి తన్నుఁ బిఱుద భూతము లార్వన్.

208


వ.

తదవసరంబునం బ్రజాపతినికరంబు దక్షప్రజాపతిం బరిమొగంబు దప్పించుకొని
బ్రహ్మాండఖండంబున కరిగిన గణాధీశ్వరు లెల్లకడలను శోధంచి దక్షుం డున్నప
ట్టెప్పట్లను గానక కాందిశీకులై కనుకనిం జని సకలభువనాధీశ్వరుపైఁ బరిగొని.

209


క.

వల విచ్చినట్లు జగముల । కల లెప్పును గలయ నొక్కకవిఁ జని కోలా
హలముగ సురాసురోరగ । కులముల నాగణము ముంచికొని వచ్చివడిన్.

210


చ.

మునిమనుజాసురాహిసురముఖ్యుల వీఁపులతోళు లెత్తఁగా
మును గుదిగట్టి మోఁదియును ముందలకట్టులు గట్టి కొట్టియున్

జనఁ బెడకేలు గట్టియును జర్మపటంబులు డిగ్గనొల్చియున్
జెనసి మసంగి యీరసము సేసిరి తత్రమథాధినాయకుల్.

211


చ.

ఖలుఁ డని వజ్రిచేయి విఱుగంగ వడిం బడమోఁది రెత్తి దో
ర్బలమున దాఁకి యజ్ఞుతల పందలయెత్తిరి తద్గణాధిపుల్
కలుషముతోడ ముట్టి భగుక న్నొక దచ్చనపుచ్చి రుగ్రులై
బలువిడిఁ జుట్టి పూషుమునిపండులు డుల్లఁగ వ్రేసి రీసునన్.

212


స్ర.

కోపోద్రేకంబునం జేకొన కజు హరితోఁగూడ బంధించె దేవా
శాపాలేంద్రాదులు దత్క్షణమ పరిభవాసక్తులం జేసి దక్షుం
బాపాచారుం పదాధ్యాపదల కరుగుతద్బ్రహ్మబంధున్ దురాత్మున్
జూపుం డెచ్చోట నంచు సురలను బ్రమథుల్ చుట్టి దండించి రల్కన్.

213


వ.

తదవసరంబున శివద్రోహుం డైనదక్షుం డనునిద్దురాత్మునకై మహోగ్రాక్షగ
ణాగ్రణులచే నిగ్రహంబు వడు టేమిపని యని సురమునిజనంబు లండొరులం
గడవ.

214


క.

కనుగిట్టి చూపువారును । గనుమఱి చెడి పట్టఁజూపఁ గడగెడువారుం
గని కడపిపుచ్చువారును । గనుమఱుపడువారుఁ బరులఁ గనుఁగొనువారున్.

215


వ.

తదవసరంబున నతిభయభ్రాంతుండై కన్నవారలక మ్రొక్కుచు స్రుక్కుచు లోఁ
గుచు డాఁగుచు గోమేధికసదనంబులో బెదరి చూచు చున్నదక్షునిం గని గ
ణముఖ్యు లెఱింగి పట్టుకొని.

216


ఉ.

వీండె ఖలుండు దక్షుఁ డనువీఱిఁడిపాఱుఁడు వీఁడు సర్వవ
ధ్యుం డెడసేయకుండు శివదూషకు నాలుకగోసి యుప్పు నిం
పుండుఁ ద్రపుద్రవ మ్మొడలఁ బూయుఁడు లోహము గాఁచి నోరఁ బో
యుండు దురాత్ము చర్మపట మొల్వుఁడు గన్నులు మీఁటుఁ డుక్కఱన్.

217


వ.

అని యనేకప్రకారంబులం బలుకుచు నారకోచితదండంబుల దండించి నిజాధీశ్వ
రు డైనగణాధీశ్వరున కొప్పించి తన్నియోగంబున.

218


ఆ.

ప్రమథగణము దక్షుఁ బడఁగొట్టి కట్టుచుఁ । గాలుచేయుఁ బడియ గావడించి
మనుమృగంబు గట్టికొనువచ్చుబలువేఁట । కాఱుబోలె వచ్చి కనిరి శంభు.

219

వ.

తదవసరంబున.

220


సీ.

ఉరుశోకరసవార్ధి యుప్పొంగె నన మేన ఘర్మాశ్రుజలములు గడలుకొనఁగఁ
గడిసన్నతమ్మిఁ బాఁ కడరెనూ యన దీనవదనంబుపై నెఱుల్ సెదరితూల
ముఖలక్ష్మి భీతిఁ దమోవీధిఁ జొచ్చె నాఁ జాలియవిరివేణి వ్రేలుచుండఁ
గపవాసి యలఁదురుకలహంసరుతమునా నాక్రందనారావ మతిశయిల్లఁ
దొడరు నడుగు లిడుచు దుఃఖాతిశయమున దల్లడిల్లు చున్నదక్షుధర్మ
పత్ని వచ్చి పురుషుభైక్షంబు వేఁడుచుఁ జాలదవుల నభభు మ్రోలఁ బడియె.

221


వ.

ఇ ట్లనాథవృత్తి ననన్యశరణ్యయై శరణువేఁడు దక్షాంగనం గని కరుణాకరుం డైన
పరమేశ్వరుండు కారుణ్యదృష్టిం జూచిన కన్నెఱింగి.

222


చ.

హరకమలాసనాదు లభయం బభయంబు భయాతురార్తిసం
హర కరుణాత్మ విశ్వభువనాధీప మా కని చక్కఁజాగి ని
ర్జరపతి మ్రొక్కి యున్నఁ గని శంకరుఁ డంతన తద్దయారసా
భరితవిశాలనేత్రశతపత్రదళంబులఁ గప్పె నందఱన్.

223


వ.

ఇట్లు పరమేశ్వరదయావలోకనామృతరసప్రవాహాపగతభయసంతాపహృదయు
లైనసురవరులం దఖిలసురజ్యేష్ఠుం డైనసురజ్యేష్ఠుండు కరకమలముకుళవిన్యస్త
మస్తకుండై సమస్తవేదస్తుతులం బ్రస్తుతించి చతుర్ముఖుండు పంచముఖున కభిముఖుండై.

224


చ.

తనరఁ గ్రియాతిదక్షుఁ డగుదక్షుఁడు తత్క్రమవల్లభుండు స
న్మునిశతి ఋత్విజుల్ సురసమూహ సదస్యులు తత్ఫలంబు లిం
దనిశము నిచ్చు నీ వడఁచి తట్టె మఖం బిది కర్తభక్తిమైఁ
దనరని యజ్ఞమైన దుదిం దా నభిచారము గాకపోవునే.

225


వ.

అదియునుం గాక సకలభువనస్వామియైన నిన్నుం గులస్వామియని తలంపక సంబంధ
బంధుకృత్యంబున నితరజనసామాన్యుం డని యెల్లిదించి.

226


క.

బంధుఁ డని నిన్నుఁ దలఁచి స । బంధుం డయి పడుట దనకుఁ బాడియెమఱి ని
ర్బంధుఁ డగునిన్నుఁ గనియు స । బంధుండై దక్షుఁ డునికి పాడియె దేవా.

227

వ.

అనిన చతురాననచతురోక్తులకుం బరమేశ్వరుండు ప్రహృష్టమనస్కుండై దక్షు
నీక్షించి దాక్షాయణిపైఁ బ్రణయభావాకలితహృదయుండై యున్నగంగాధరు
నింగితం బెఱింగి పద్మయోని వెండియు నిట్లనియె.

228


క.

ఆనెపమున ద్రోహమునకు । వానిన పాందరసి యతనివంశం బెల్లన్
గానుపునఁ బెట్టి యార్చిన । నేనియుఁ జాల దిది పెద్దయే దక్షునకున్.

229


ఆ.

ఇంతద్రోహుఁ డయ్యు నితఁడు వధార్హుఁడే । యభవ నీవు దీని నవధరింపు
మవని బ్రాహ్మణో నహంతవ్య మనుపలు । కీవు నిలుపకున్న నేల తప్పు.

230


వ.

అని పరమేశ్వరుననుమతంబునం బ్రజాపతి దక్షప్రజాపతిబంధమోక్షంబు సేసి
యమృతాత్మకు శ్రీపాదంబులపైఁ బెట్టిన దదీయస్పర్శనంబున దక్షుండు తత్క్ష
ణంబ సచేతనుండై భక్త్యావేశంబునం బ్రణుతింప నభిముఖుండై.

231


లయగ్రాహి.

ఫాలతలవిస్ఫురితలోలతరభాసురవిశాలభయదాసురకరాళనయనాగ్ని
జ్వాల లొకొ పింగళజటాళియొకొ నాఁ బెరసి తూలి దివి భూషణచయాలుళికదీర్ఘ
వ్యాళనికరంబొకొ కరాళియొకొ నాఁ దనరి క్రాల వరనృత్యవరలోలుఁ డగుశ్రీకం
కాలధరు నుజ్వలకపాలధరు సన్నిశితశూలధరు నీశ్వరు దయాళు నుతియింతున్.

232


లయ.

ఉర్వర సలింపఁ గులపర్వతచయం బదర బర్వి భువి నంబునిధు లౌర్వశిఖియాడం
బూర్వసురనాగసురపూర్వదిగధీశయదువార్విభుధనేశ్వరులగర్వము లడంగన్
సర్వగుణముఖ్యులును సర్వగుణభూతములు నార్వ నహిభూషణములోర్వ దిశలన్ గం
ధర్వతతి వాడఁగ నపూర్వనటనాది యగుసర్వగతు సర్వమయు శర్వు నుతియింతున్.

233


లయ.

తాలరుతిగీతిరుతి మేలితతి వాద్యరుతిసాలరసవంతమయి యోలి నులియంబ్రో
త్తాలగతి మెట్టుచునుఁ గేల చరు లిచ్చుచును సాలి యనురాగమున గ్రాలుచు సుఖాబ్ధిం
దేలుచును మేముఱచి వ్రాలుచును గెత్తుచును రోలగతి నేత్రిభుజచాలనటతోఁ బ్రే
తాలయమునందు సుఖలీల నెఱసంజ ననునోలగతి వాడుశివు శూలి నుతియింతున్.

234


లయహారిణి.

కఱగళము ఘనఘనము తెఱుఁ గనఁగ నుఱికలును
గఱడియలు ద్రిపుచలును గిఱిడియలుఁ బెల్లై
యుఱుము లన వడిఁ జెలఁగఁ గొఱ నెలయు దనరుచులు

మెఱుఁగులన దశదిశల మెఱఁవఁ దలమీఁదన్
వఱలు సురనది దొలఁకి నెఱిఁజినుకులను గురియఁ
దరిమికొని తొలుమొగులు తఱియనఁగ నృత్యం
బొఱ నమరులలితగతి మెఱయుశివుఁ డజుఁ డమరుఁ
డుఱుఫలము లొసఁగునని యెఱిఁగి నుతియింతున్.

235


లయ.

కరనికర ముకువిటపవరము లనఁ గరతలము
లరుణరుచిఁ దలిరులన గరజములు పుష్పో
త్కర మనఁగ వనరుహజహరిదనుజమునిమనుజ
సురగగనచరభుజగగరుడగణయక్షో
శ్వరుల కతిదయ నొసఁగు వరఫలము లనిశమును
భరితమయి మధుసమయసురవరమహీజ
స్ఫురణ కెనయనఁ దనరు వరదు హితనటనరతుఁ
బరమపరుఁ బరమగురుఁ బరము నుతియింతున్.

236


క.

సురపానభోంతకాసుర । వరుణానిలధనదరుద్రవందితచరణున్
ధరణిజలవహ్నిమరుదం । బరరవిసోమాత్మమూర్తిఁ బరము నుతింతున్.

237


వ.

అని యనేకప్రకారంబులం బరమభక్తియుక్తిం ప్రస్తుతింప దక్షునకుం ద్ర్యక్షుండు
ప్రత్యక్షంబై తదీయాధ్వరఫలంబు సఫలంబుగాఁ బ్రసాదించి దక్షుం బ్రజాపతి
నియోగంబునంద నియోగించి.

238


ఉ.

ధర్మచరిత్రతాకలితతత్త్వమయాధికదీప్తిదీపికా
నిర్మలినప్రభాపటలనిర్గళితాఖిలలోకపూరితో
త్కర్మతమిస్రుఁ డర్థిజనకల్పమహీరుహకల్పుఁ డూర్జితాం
తర్ముఖముఖ్యుఁ డత్యధికదర్పకదర్పహరుండు సన్మతిన్.

239


క.

ఇష్టానిష్టవిముక్తుం డ । భీష్టఫలప్రదుఁడు సన్మునీంద్రారాధ్యుం
డష్టతమపరమతనుమయుఁ । డష్టార్థముఖాన్వయాబ్జహరితేజమునన్.

240


చ.

భావమరణాతురాంబునిధిపారుఁడు ఘోరమహోగ్రసత్వసం
భవగతసాగరోత్తరణబంధురభూచరసేతుభూతస
త్ప్రవిమలితాత్మతత్వపదపారగుఁ డాదిమునీశ్వరుండు స
త్కవిగమకిప్రశంసితుఁ డకారణమిత్రుఁడు పాత్రుఁ డిమ్మహిన్.

241

క.

రమణీరమణీయసురూ । పమయాంగజశస్త్రవజ్రపంజరనిభస
ద్విమలశివయోగతత్పరుఁ । డమలచరిత్రుండు మల్లికార్జునుఁ డెలమిన్.

242


మా.

విశదయశుఁడు ముక్తోద్వేగుఁ డస్పృష్ఠరాగుం
డశుభగతినివృత్తుం డార్యుం డార్యౌఘవర్యుం
డశనిధరవిలాసాయత్తుఁ డధ్యాత్మచిత్తుం
డిశరకమలినీపూర్ణేందుఁ డానందుఁ డెందున్.

243


గద్యము.

ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ
శిఖామణి నన్నెచోడదేవప్రణీతం బైనకుమారసంభవం బనుకథయందు ద్వితీ
యాశ్వాసము.

  1. హరుకాదిలి = పార్వతి (కాదిలి = ప్రియుడు, ప్రియురాలు - భారతికిఁ గాదిలిమువ్వురఁదొల్తపేరు " ఎ - హరి. ఆ1.)
  2. “నూఱు చెట్టలు సైరించి శిశుపాలుఁ జంపె.” ఉ.హరి. ఆ4.
  3. చీకటి శబ్దమున నఱసున్న లేకున్నను లక్షణవేత్తలు పొరపడిరి. దశ
    కుమారచరిత్రమున "మీకృపగోరి భూరుహసమీపము చేరితి.......చీకటి రాత్రినాగహరి
    సింధురసూకరపుండరీక భ । ల్లూకపరీతకాననములో మిము నూఱడి నిద్రసేసెదన్" దశ.
    ఆ. 7 “ఏక సితాతపత్రముగ నేలును వీరనృపాలుఁ డుత్తమశ్లోకుడు..........చీకటి
    యుం గళింగమను....జిల్క సముద్రము.” శ్రీనాథుఁడు. “చీకటిగవిసినవిబుధానీకం
    బోడి.” నిర్వ. ఆ.6. అఱసున్న యున్నట్లు ధూర్జటి, రామభద్రుఁడును బ్రాసముల
    యందుఁ బ్రయోగించిరి. అది ప్రాచీనకవిమతము గాదు.