Jump to content

కుమారసంభవము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

కుమారసంభవము

తృతీయాశ్వాసము

శ్రీకంధరపరతత్వా । లోకనతత్పరుఁడు నిశ్చలుం డఖిలసుధీ
లోకానందితకల్పా । నోకహుఁ డగుమల్లికార్జునుండు నెగడ్తన్.

244


వ.

సకలభువనాధీశ్వరుం డైనపరమేశ్వరుండు హరిపరమేష్ఠిపురందరాద్యఖిలసుర
వరపరివృతుండై నిఖిలకులాచలప్రభావవిజితరజతశిఖరిశిఖరమణిరమ్యహర్మ్యతలా
లంకృతోత్తుంగసింహాసనాసీనుండై భృంగిరీట పరిహాసపేశలాలాపహాస్యాలాప
వ్యాకులితలలితహాస్యరసరసాయనపూరితాస్థానమందిరుండై పరమానందంబున
నుండెనంత నక్కడ.

245


సీ.

రోహిణాచల మనురూఢిగా కం దింత మహనీయరత్నసామగ్రి గలదె
వింధ్యాద్రితో సురల్ విరస మెత్తిరిగాక గ్రహచక్ర మది యింత గడచియున్నె
హాటకరుచియకా కమరేంద్రుగిరి కింత పరమౌషధీప్రభాభాతి యెత్తె
హరుఁ డర్ధపతిచెల్మి కందుండెఁ గా కింత రమ్యమే వసియింప రజతశైల
మజుఁడు దనవిద్య మెఱయ గులాద్రు లొండ్లు । వడసెఁ గా కుర్వి దాల్పంగ భరమె దీని
కనఁగ నగచక్రవర్తి మాహాత్మ్యవైభ । వాలయం బగు పేర్మి హిమాలయంబు.

246


చ.

సురవరవాహినీధరుఁడు శుభ్రశరీరవిభాసి నీలకం
ధరపరిశోభితుండు గుణధాముఁడు దుంగతనుండు భూధరా
భరణుఁ డుమాసమన్వితుఁ డపారవిభూతిసమేతుఁడై మహే
శ్వరుఁడునుబోలె నొప్పు హిమవంతుఁ డనంతమహత్త్వసంపదన్.

247


సీ.

హేమాద్రివిస్తార మెంత సప్తాశ్వుండు నిచ్చలు నోరెల వచ్చునట్టె
తారాచలమువ్రేఁకఁదన మెంత వింశతిబాహునిచే నెర్తువడియెనట్టె
పెరిఁగినవింధ్యాద్రి పెం పెంత కలశుఁ డెడగాల మెట్టిన నడఁగెనట్టె
నెగడుమంధరగిరినిలు పెంత కఱభోగి దీర్చినఁ జిఱ్ఱునఁ దిరిగెనట్టె
యనఁగ విస్తారమున వ్రేఁకఁదనమునందుఁ । బెంపునందును నిలుపున బెఱనగముల
నుఱక తనలోన నవ్వుచు నున్నకరణి । వెలుఁగు శీతాద్రి ప్రాలేయవిమలరుచుల.

248

చ.

సురపురిరమ్యహర్మ్యమణిశుభ్రతలాగ్రవిలాసహాసియై
యురుకనకాగ్రశృంగమున నొందినతారకపఙ్క్తి శీతభూ
ధరపతి చూడఁ జూడ విదితం బగునిర్మలినాంగభాతితో
నురగఫణాగ్రరత్నరుచిరోగ్రకపర్ధధరేశ్వరాకృతిన్.

249


గీ.

శీతగిరిమీఁద మదకరుల్ సీత్కరించు । నెలుఁగు నవఘనారవ మని యెసఁగియాడు
నమ్మిపదుపులు గడునొప్పు నగవిభునకు । బలసి పట్టినపింఛాతపత్రిభాతి.

250


గీ.

శిశిరభూమిధరోద్దామశిఖరమణుల । గదిసి తారాగణంబులు గలసియున్న
మణిగణాన్వేషణులు కీడుమణులు సావి । పాయఁ ద్రోతు రం దవి గనుపట్టకున్న.

251


గీ.

సన్నుతంబుగ నాహిమవన్నగంబు । గాంచనాద్రీంద్రు మెచ్చదు గంపురేని
కనకరుచి యేల యని చంపకప్రసూన । పరిమళాకీర్ణసౌవర్ణభాతి మిగిలి.

252


గీ.

విలసితోత్తుంగశశికాంతశిలలఁ గదిసి । యరుగుశశి గని శిలలెల్లఁ గరఁగి పెరిగి
తెరలి పఱతెంచువఱోడిఁ దేలిపాఱు । నుడుగణేశుండు వెండిపేరోడవోలె.

253


గీ.

సలలితం బగుశశికాంతశిలలరుచులు । నింద్రనీలోపలద్యుతు లెనసి వెడల
పక్షులెల్ల సితాసితపక్షయుగళ । సహితమై చూడ నొప్పు మాసములవోలె.

254


ఆ.

నెగసి సుడిసి తావి మిగులుచుఁ దరులతా । కలితపుష్పరజము గాలిఁ దూలి
పొలుచునగవిభునకుఁ బొంపట్టుచేల నా । కసము మేలుకట్టు గట్టినట్లు.

255


గీ.

పాయక గిరితటమునన మేయుచుండు । నున్నతద్విరదేంద్రంబు లొప్పుఁ జూడ
బర్వతాధీశుఁ డగుట నప్పర్వతంబు । బలసి కులగిరుల్ కొలు వున్నభంగివోలె.

256


సీ.

సమీపగతిఁ గ్రాలుజంగమలతలతో నడపాడునురగకన్యకలచెలువు
వెలుఁగొందుమణిపుత్రికలగెడ విహరించువరనిధానాధిదేవతలచెన్ను
సానుసంగతమేఘసౌదామనులఁ గూడి పొలపాడుఖచరాంగనలబెడంగు
మందారచందననందనసంగతి నెలసిన వెలమురితలనయంబు
మనసులురులు కొల్ప మండనాంగానోక । హములఁ బొంది చూచునమరసిద్ధ
చారణాదివరకుమారాంగభూషణద్యుతుల । హిమనగేంద్ర మతిశయిల్లు.

257


చ.

అరుదుగఁ జంద్రకాంతినిలయంబులలో విహరింతు రర్థిఁ దా
రరయఁగ నెల్లవారికి బయల్పడితోఁపఁగ నంద కొంద ఱ

చ్చెరువుగ నింద్రనీలరుచి చీకటిలో రమియింతు రొప్పున
త్యురుతరలీలతో బయల నుండియు నెవ్వరుఁ గానకుండఁగన్.

258


మ.

సరసచ్ఛత్రమహీరుహావళి నిజచ్ఛత్రాళిగా వచ్చుఖే
చరరాజున్యులు బాలపల్లవలసచ్ఛత్రావళిం బొల్చునా
మరుఁ గ్రీడింతురు లీల జంగమలతామధ్యంబునం గ్రాలుత
ద్వరకాంతరు వరలక్ష్మి చెన్నుఱరు నా వర్తింతు రం దిమ్ములన్.[1]

259


మ.

కలయం గిన్నరగీతిఁ గూడ మృదురేఖం బాడుమత్తాళిసం
కులముల్ గింపురుషాంగనాతతి యెలుంగుల్ వించు భావించు మా
టెలుఁగుల్ నింపుగ నిచ్చుకోవిలలు దేవేంద్రాంగనామంజుభా
షలతోడం దగుమాఱుమాట లెలమిన్ సంధించుఁ జిల్కల్ మొగిన్.

260


సీ.

ఉరుతమపటలంబునున్కిప ట్టిది యని నెఱి నిర్లు గొనునింద్రనీలరుచులు
బున్నమవెన్నెలప్రోదిప ట్టిది యని కాంతంబు లగుశశికాంతరుచులు
వెలుఁగొందురేయెండవీడుఁబ ట్టిది యని రాజితం బగుపద్మరాగరుచులు
క్రొక్కారుమెఱుఁగులయిక్కప ట్టిది యని తారముక్తాహారతరలరుచులు
బ్రచురమాధవోోద్యానంబుపసిమి కెల్ల । నాటప ట్టిది యని గరుడాండరుచులు
మెచ్చి చూచుచు వేమఱుఁ బిచ్చలింతు । రమరకన్యక లతులహిమాచలమున.[2]

261


వ.

అని వర్ణింపదగినవర్ణనలం గడచి సకలసుగుణమణిగణంబులు నిజఘనమణిగణం
బులతో బన్నసరంబులై వెలుంగునజాండకరండపూరితకర్పూరపాలీశలాకయుం

బోలెఁ దేజరిల్లు ప్రాలేయకుత్కీలచక్రవర్తి నిఖిలస్త్రీరత్నం బైనమేనక నిజాగ్ర
మహిషింగాఁ బరమసుఖలీలఁ బ్రవర్తిల్లుచుండు నంతఁ బరమేష్టివరప్రసాదంబున.

262


క.

మేనకకు నా హిమాద్రికి । మైనాకనగంబు పుట్టె మణికనకమయూ
ఖానూనభాసహాసిత । భానుద్యుతివిదితదివిజపతిగిరిపేర్మిన్.

263


వ.

ఇట్లుదయించిన మైనాకనగంబు కులిశికులిశపాతభీతిం బయోనిధినిమగ్నం బైన
నపగతపుత్రావలోకనసుఖతత్పరులై చింతించి.

264


క.

వా రిరువురు సద్విధి శ । క్త్యారాధన సేసి రతిశయస్థిరభక్తిం
గోరిక వదలక తమకడు । పార సతీదేవి కూతుఁరై జన్మింపన్.

265


వ.

ఇట్లు పరమభక్తియుక్తి నారాధించినం గరుణించి నిజదేహవిదాహకరం బైన
కోపానలంబునకుం బరమేశ్వరువియోగానలంబునకు శిశిరోపచారంబు సేయం
దలంచినదియునుంబోలె హిమవంతంబునకుం జనుదెంచి దాక్షాయణి ప్రత్యక్షం
బై వారుకోరినవరంబు దయసేసి పరము దేహార్ధంబు మెయిమెయిఁ గయికొనం
దలంచి పరమపవిత్రక్షేత్రం బైనమేనకాదేవిగర్భంబునం దవతరించె నంత మేన
కకుం గ్రమక్రమంబున.

266


ఉ.

తోరము లయ్యెఁ జన్నుఁగవతోన తొడల్ తనుకాంతితోన తె
ల్సారె విలోకనంబులుఁ గుచాగ్రతలంబులతోన యారు గ
ప్పారెఁ గచంబుతోన వలు లల్లన డిగ్గఁబడందొడంగె శృం
గారముతోన పాల్పడరె గర్భవిలాసము మందహాసమున్.

267


ఉ.

ఆధవళాయతాక్షి విషమాక్షు సదాశివు నిచ్చ మెచ్చ నా
రాధన సేయఁగోరు నుడురాజశిఖామణిఁ జూడఁ దారభూ
మీధర మెక్కఁగోరు నెడ మేనక మానక భక్తియుక్తి గం
గాధరుఁ గొల్వఁగోరు మది గౌరిమనంబున గోర్కి గూడఁగాన్.

268


సీ.

తళుకొత్తి మిన్నేటితరఁగల గ్రమ్ముక్రొన్నురువుల గురులపై విరులఁ బెనుప
మెఱుఁగులఁ గ్రిక్కొనుకొఱనెలఁ గేతకిదలములతో వేణి నెలవుకొలుపఁ
జెలువొందుపులితోలుఁ జిత్రితాంబరము కాంచిదామకముతోఁ గటి నమర్పఁ
దలతల వెలుఁగు వేఁదలలరత్నము లొప్పు నహినాథమణిహారయష్టితోడఁ

గదియ నురమునం దొడగోరుగర్భపంజ । రమున వసియించియును నిజరమణుఁడైన
యీశునర్ధాంగ మెక్కటి యెక్కనెత్తు । నగజకోర్కులఁ బెనఁగి మేనకయు నెలమి.

269


క.

తరుణవిభూదయమునకుం । బరిపూర్ణం బగుసుధాబ్ధిపరుసున నాసుం
దరికిఁ గ్రమంబున గర్భము । పరిపూర్ణంబయ్యె నిష్టఫలసంపదతోన్.

270


వ.

తదవసరంబున శుభముహూర్తంబున.

271


సీ.

వేలావనమునందు విలసిల్లువిద్రుమవల్లిక యుదయించువడువవోలెఁ
బూర్వదిక్సతి కతిస్ఫురణతో నుతసుధాకరరేఖ యుదయించుకరణివోలెఁ
ద్రిదివంబునందు సమ్మద మొందఁ గల్పలతాంకుర ముదయించునట్లువోలె
దేవతానదికి శోభావహమ్ముగ హేమరాజీవ ముదయించురమణవోలె
వరవిడూరభూమి వైడూర్య ముదయించుతెఱఁగువోలె దిశలు తేజరిల్ల
మానినీలలామ మేనక కుదయించె రాజవదన శైలరాజకన్య.

272


మ.

వివిధామోదవిమిశ్రితానిల మొగిన్ వీచెన్ మరుద్దుందుభుల్
దివిరెన్ భోరనఁ బుష్పవృష్టి గురిసెన్ దేవాంగనాగాన ము
త్సవలీలన్ వినిచెన్ సమస్తభువనోత్సాహంబు సంధిల్లె ది
గ్వివరంబు ల్వెలిఁగెన్ నిధుల్ దెఱచె నుర్విం గౌరి జన్మించినన్.

273


వ.

అంత హిమవంతుం డంతఃపురసహితం బనంతసంతోషరసాపూరితాంతరంగుం
డగుచు నిజోత్సవంబులోన పురోత్సవంబు నొనర్చుచు దీనానాథవిద్వజ్జనంబుల
నపారవసుధారాసారంబులం దేల్చుచు సమందానందుం డగుచు నుండె నంతం
బార్వతి శరచ్చంద్రరేఖయుంబోలె సకలజననయనేందీవరానందకరంబై వెలుం
గుచుం గ్రమక్రమంబున.

274


సీ.

పరమేశుమన ముద్దపరి ముట్టి సాధింప నెత్తినగతిఁ దలయెత్తఁ దొడఁగె
హరునూరుపీఠంబునం దుండు వెర విట్టి దనుగతిఁ గూర్చుండుననువు వడసెఁ
నొకధాత్రి తను దాల్ప నోపదన్ గతి ధాత్రిపై నిజధాత్రి చేపట్టి నిలిచెఁ
గలహంసకులమందగమనంబునయ మిట్టి దనిచూపుగతి [3]నడపాడఁ దొడఁగె

రాజకీరములకు రసవంతముగఁ బల్కు । మెలపు దెలుపుకరణిఁ బలుకఁగఱచె
హిమనగేంద్రునింట నీడితైశ్వర్యంబు । జరుగునట్టు లగజ పెరుఁగదొడఁగె.

275


మ.

స్ఫురదాలోకనదీప్తులం గణములం బొల్పొందఁగాఁ జూచుచున్
దరహాసద్యుతు లాననాంబుజముపైఁ దళ్కొత్తఁగా నవ్వుచున్
జరణాంభోరుహరాగదీధితు లిలం సంధిల్లఁ దట్టాడు న
గ్గిరిరాజాత్మజ తల్లిదండ్రు లను రాగిల్లన్ మదిన్ దాదితోన్.

276


క.

గిరిసుత దొలుపలుకుల సు । స్వర మొదవఁగ నోంనమశ్శివాయ సదాస్మ
ద్వరదాయ నమః శంకర । శరణు మహాదేవ నీవ శరణనఁజొచ్చెన్.

277


వ.

మఱియు శైశవక్రీడావినోదంబులయందు.

278


చ.

తరుణులు చిల్కబొమ్మలును దంతపుబొమ్మలు మేలిగాజుబ
న్నరులును మ్రానిచొప్పికలు నల్గడ నోలిన పేర్చి లీల జో
కురబొమరిండ్లఁ జేయ నగుగూళ్ళును వండుచు బొమ్మపెండ్లి మా
సరముగఁ జేసి యాడ నగజాత శివార్చన సేయు నయ్యెడన్.

279


వ.

ఆసుకుమారి కౌమారంబునందు.

280


సీ.

హరుమ్రోల సద్భక్తి నాడుచోటన నాట్యవిషయమ్ము లన్నియు వెలయఁగఱచె
లీల నీశ్వరునంకమాలిక ల్వాడుచో గీతభేదంబులరీతు లెఱిఁగె
శివురూపు పల్మఱుఁ జిత్రించి చూచుచో, వినుతంబుగాఁ జిత్రవిద్య పడసె
శశిమాళిఁ జిత్రపూజలు సేయుచోటఁ బత్రచ్ఛేదకుసుమబంధములు నేర్చె
మఱియు నఖిలలోకమాన్యంబు లగువిద్య । లెల్ల నివ్విధమున నెసకమెసఁగ
నభ్యసించె నీశ్వరార్చనాబలమున । హరుఁడు గురుఁడు గాఁగ నగతనూజ.

281


వ.

మఱియుం గౌమారానంతరంబున లేఁదీగెకుం గవ్వం బెక్కునట్లు పువ్వునకుం
దావి వొందునట్లు చిత్రరూపంబునకు మెఱుం గెక్కువిధంబున నిఖిలజనమనో
రామం బగుచు.

282


చ.

మలఁపఁగ నున్నకల్పలత మన్మథునారి నమర్పనున్న కో
మలతరపుష్పబాణమహిమద్యుతిఁ జూడఁగ నున్నపద్మకు

ట్మళ మలరంగ నున్న మధుమంజరి నా మదజృంభితాంగదో
హలరుచి నొప్పె గౌరి నవయౌవనసంగమలీల డాలుఁగాన్.

283


వ.

ఇ ట్లభినవమధుసంగతిం దనరుప్రద్యుమ్నునుద్యానవనంబునుం బోనియౌవనమదా
భ్యుదయంబున.

284


క.

మెలుపునుఁ గేపును సుస్థితిఁ । దలిరులయం దేని లేదు తమ కుమవలనన్
నిలుకడయగు నని తత్పద । తలముల నెలసెననఁ బాదతలము వొల్చున్.

285


క.

సరసప్రవాళములపై । సరసిజరాగమణు లోలి సంధిల్లెనొ సుం
దరరాగలతాకందాం । కురములొ నా నుంగుటములు కోమలి కమరున్.

286


క.

అరుణాంబుజదళములలోఁ । బరగు తణిత్తిషలు నించి పై నభ్రకముల్
పొర లెత్తి కదియమూసిన । కరణి నుమాదేవిపదనఖంబులు వెలుఁగున్.

287


క.

తననీచయోని పడుటే । లని సకళత్రమును నుమపదారాధన కొం
దినవిష్ణుకమఠరూపమొ । యనఁ దగి మీఁగాళ్లు లగజ కందం బొందున్.

288


క.

సిందూరపిండములొ మరు । కందుకములొ సత్ప్రవాళకఫలంబులొ నా
నందములై రాగలతా । కందము లన మడమ లచలకన్యక కొప్పున్.

289


క.

అతనుం డోఁపనిశిపు వశ । గతుఁ జేసి భవాని మదనుకవదొన లతిలోకో
న్నతి నాఁచికొనియెనో యను । గతిఁ జిఱుఁదొడ లమరు వ్రీహిగర్భాభములై.

290


క.

స్మరమందిరమ్ము శోభా । కరముగ మెఱుఁగారుపసిఁడికంబము లనఁగాఁ
గర మొప్పు నగతనూజకుఁ । గరభోరులు వొలుచు మదనకరికరలీలన్.

291


క.

గురుకుచవహనభరంబునఁ । బొరిఁబొరిఁ బేదకపు నఱిగిపోఁ బోయిన ద
ద్భరవహనమునకు భరపడు । కరణిం జఘనంబు సతికి ఘనమై యమరున్.

292


క.

కనుఁగొని యీశ్వరుదృగ్రుచు । లను విపులవహిత్రముల నపాంగజనార్ధిం
జనఁ దిగిచి ముంచుసుడి యది । యనఁ దగి యావర్తనాభి యద్రిజ కొప్పున్.

293


క.

మారుమఘవేది మధ్యమొ । యారతియద్దంబు పిడియొ యున నెంతయుఁ బొ
ల్పారఁ గడు నలికమై సుకు । మారికి మధ్యంబు సింహమధ్యము వోలెన్.

294

క.

ఉదరమను చందనంబున । హృదయాంభోజాతనాళ మేర్పడి తనకొ
ప్పొదవి వెలిఁ దోఁచెనో యన । నుదతికి నూఁగారుదీగె సుందర మయ్యెన్.

295


క.

పొరిఁగొనుదలము జవ్వనమున్ । సిరిగుచముల కెక్క నడవఁ జేసినకార్త
స్వరసోపానములన ము । త్తరఁగలఁ దగు నంగజాబ్ధితరఁగలు వోలెన్.

296


క.

ఆంధ్రీస్తనాపహాసులు । సంధృతమధుపాబ్జముకుళసదృశము లతినీ
రంధ్రములు గుచము లఖిలపు । రంధ్రీజనతిలక మచలరాజాత్మజకున్.[4]

297


క.

కేళీవర్తము లన రతి । కేళీసదనంబు లనఁగ గింశుకకళికా
మూలము లనఁ గామలతా । మూలము లన గౌరిబాహుమూలము లమరున్.

298


క.

శివునంగముష్టి విరిఁగ । సవిరళముగఁ బట్టి ప్రాఁక నని కడునెమ్మిన్
నిపుడు నవకల్పలతికల । పవిదిని మృదుబాహులతలు పార్వతి కొప్పున్.

299


క.

రుచిరాశోకదలద్యుతి । నచలజకరతలము లొప్పు నతిశయరాగో
పచితరతిరాజపల్లవ । రచితోభయమేఖడంబరంబులబోలెన్.

300


క.

దురుచేత నుండి హరుగె । ల్వరు దుమచే నుండి గెల్వ నౌ నని సుమనః
శరములు గరముల నెలసిన । కరణిఁ గరాంగుళము లచలకన్యక కొప్పున్.

301


క.

వరదము లగుకల్పలతాం । కురములొ విషమాస్త్రనిశితకోరకవిశిఖో
త్కరము లనఁ గరజములు సుం । దరి కగు నరుణోత్పలాగ్రదలములపోలెన్.

302


క.

వినుతరుచిఁ బొల్చు నానన । మను నాదర్శంబుపిడియొ యతిమృదులీలం
జను బోఁకపోదెయో యన । ఘనరుచి నగసుతకుఁ గంబుకంధర మమరున్.

303


క.

అమృతోద్భవులగు మీలో । నమరదు పగ యని సుధాకరాబ్జములకుఁ గూ
టము దనముఖమునఁ జేసెనొ । యుమ యన రదనాంశుగండయుగగతి వొల్చున్.

304


క.

మానిత మగుగుడరసమున । నూనినతుండీరఫలమొ యొగి తేనెతల
న్నాని మృదువైనపవడమొ । నానద్రిజ తొప్పమోవి నయమై యొప్పున్.

305

క.

కులిశద్యుతి కైన ముక్తా । ఫలతరలవిభాతితోడఁ బ్రతి యనఁ దుహినా
చలతనయకు గౌరికిఁ దలఁ । కల వెలుఁగుచు శిశిరరుచిరదశనము లొప్పున్.

306


క.

వదనాంబుజ మనువాణీ । సదనము మణిభిత్తియుగళసంకాశములై
మదనకరముకురయుగరుచి | ముదితకు మృదుతరకపోలములు సెలువొందున్.

307


క.

మనసిజవారిధి గట్టిన । కనకాచలసేతు వనఁగఁ గమలాననకాం
చనకర్ణిక నానయ నా । ననమధ్యమునందు గౌరినాసిక యొప్పున్.

308


క.

తెలిమొగమునందు లోలా । క్షులపొలపం బమరునాచకోరము లతులా
మలశశిబింబములోఁ బడి | వెలలక చెలరారుచుండు విధమున సతికిన్.

309


క.

హారము లాశ్రితభాషా । సారము లా సకలవస్తుసంపూర్ణాలం
కారంములు శ్రీవర్ణా। కారంబులు చెవులు సుకవికావ్యము వోలోన్.

310


క.

ఆముఖలక్ష్మికిఁ బెట్టెడు । చామర లన దృఙ్మరీచిజలనిధికి హరి
స్తోమ మనఁ బొలుచు నగజకుఁ । గాముధనుఃఖండభాతిఁ గరివంకబొమల్.

311


క.

కొఱనెల సుధారసంబునఁ । గఱవోవగ నొరసి కడిగి కౌముదితోఁ గ్రొ
మ్మెఱుఁగుల విదల్చికొని పై । మెఱుఁ గిడున ట్లొప్పు నగజమృదునిటలరుచుల్.

312


క.

అప్పొలఁతి కురుల శివు మన । సొప్పరి తనుఁ దగులఁబెట్టునురు లన నెరులై
కప్పారి కొదమెతుమ్మెద । లుప్పయనము సేసి నట్టి యొఱపున నొప్పున్.

313


క.

చమరీతతియుఁ గలాప్తులు । నుమకేశతమాలతరలతోగ్రాటవిలో
రమియింపగఁ దగుననఁ దగి । సమమగుహరినవ్యనీలచలదలిసమమై.

314


క.

స్మరకలహంబునఁ బతిదెస । గిరిసుత దిరుఁడైన నక్షకేళి మహేశున్
మరుఁడు దగిలించి గెలుపఁగఁ । గర మమరిన ....... గతినింపొప్పున్.

315


వ.

అని యనేకప్రకారంబుల వర్ణింపం దగినవర్ణనల కమరి.

316


సీ.

మధుసమాకలితమై మవ్వ మారినమారునవలత నా మేన నవక మెక్కె
దరుణి చేసోఁకినఁ దావి పొంపిరివోవుతమ్మి నాఁ దగుసుగంధంబు సుడిసె
మది శరత్సంగతి మత్తిల్లి క్రాలురాయంచ నా మదమందయాన మమరెఁ

దాలిమి రససేవ సోలి ముద్దాడురాచిలుక నా వెడఁదొక్కుఁ బలుకు లొప్పె
మరుఁడు శృంగారలక్ష్మిఁ జిత్తరువు నెఱయ । వ్రాసి తెమ్మెర లాయువు వోసినట్లు
సుందరాకృతిఁ ద్రైలోక్యశుభగ యయ్యె । శైలనందన యౌవనసంగమమున.

317


క.

మెఱుఁగుల కచిరత శశికిం । గఱగును మణికనకములకుఁ గాఠిన్యము [5]లేఁ
బొఱకుం గాష్ఠము దక్కఁగ । మెఱుఁగెల్లను వచ్చి గిరిజమేనన నిల్చెన్.

318


చ.

తలతలఁ బ్రజ్వరిల్లుసితధామకలంకముఁ బాచి వక్త్రమం
డలరుచి పర్వె దిక్కులఁ గడల్కొని చూపఱు సంచలించి బి
ట్టులుకఁగ వాణి మన్నెరసి యొండొకభంగి సురంగమయ్యెఁ జూ
పులు పొలపంబు గైకొనియె భ్రూలత లంతకుఁ జెన్ను వింతగాన్.

319


వ.

మఱియును.

320


సీ.

శశిబింబమణిహేమసౌదామనీచయోత్కరకాంతు లన్నియు నరసి తెచ్చి
వనలతాపుష్పపల్లవబిసకోమలవిభవంబు లన్నియు వెదకి తెచ్చి
కర్పూరచందనకాశ్మీరమృగమదామోదంబు లన్నియు ముంచి తెచ్చి
పరివాదినీశుకపరపుష్టవధుకరారావంబు లన్నియు రాచి తెచ్చి
హావభావరూపలావణ్యసారముల్ । త్రిభువనముల నేర్చి తెచ్చి నేర్పు
సూపఁ దలఁచి యాఁడురూ పజుఁ డొనరించె । నని నుతింప నొప్పు నగతనూజ.

321


వ.

మఱియు నఖిలలావణ్యపుణ్యాధిదేవతయు నశేషసౌభాగ్యలక్ష్మియు నపారగుణ
మణిగణభూషణార్ఘనాయకమణియు నిఖిలభర్తృదారికావిమలముక్తాఫలహార
తరలసరసీరుహరాగరత్నంబునుం బూర్ణయౌవనాలంకృతయు నై యొప్పుచున్న
పార్వతిం జూచి హిమవంతుం డనంతసంతోషరసాపూరితాంతరంగుండై.

322


క.

వేదనిధానము గన్న । ట్లాదరితమునం దనూజ నగ్గించుచు నా
హ్లాదమున దగినవరుఁ డిం । ద్రాదిసురలలోన నెవ్వఁ డగునో యనుచున్.

323


వ.

డోలాయమానమానసుం డగుచున్నయెడ.

324


చ.

గొనకొని సామగానమునకున్ మెఱుఁ గిచ్చుచతుస్వరంబులం
దెనకొని మ్రోయ వీణె మొరయించుచు రాగరసప్రవాహమో

యనఁగఁ బిశంగజూటరుచు లంబుదమార్గమునందుఁ బర్వభో
రనఁ జనుదెంచె నారదమహాముని తద్గిరిపాలుపాలికిన్.

325


వ.

ఇట్లు చనుదెంచునారదమహామునిం గని యతిసంభ్రమంబున నెదురువచ్చి వినయ
వినమితోత్తమాంగుండై యాసనపాద్యద్యశేషార్చనలవిధి నభ్యర్చితుం జేసిన
గిరిపతికి నమ్మునిపతి గరుణించి హితోపదేశంబు సేయందలంచి శివశక్తిభేదంబు
లు దెలిపి పార్వతిపూర్వప్రపంచంబు విశేషించి యెఱింగించి మఱియు నాతనికి
మనోనిశ్చయంబు సేయ నభిముఖుండై.

326


క.

ఈ దేవి లోకజనని మ । హాదేవున కగ్రమహిషియై పేర్మి సురేం
ద్రాదుల కర్చితయగు నని । యాదేశము సేసి యమ్మహాముని సనియెన్.

327


క.

హిమవంతుఁ డెలమిఁ ద్రైలో । క్యము కలవడ నేలినంతకంటె మనోరా
మున నిజతనయఁ గులదై । వమ కాఁ గొనియాడుచుండె వదలక నెమ్మిన్.

328


వ.

తదవసరమ్మున.

329


గీ.

సతివియోగాగ్ని మనములో సంతతంబు । దగిలికొని కాల దానికిఁ దనుపుసేయఁ
దలఁచియో కాదు నిక్కమ దపము సేయ । వలచియో హిమగిరికి నీశ్వరుఁడు వచ్చె.

330


వ.

ఇట్లు చనుదెంచి తదుపకంఠప్రదేశంబున నవతరించి.

331


సీ.

రసరసాయననిర్జరప్రవాహానూనగంగాప్రవాహశీకరము లడరఁ
దనుపార నెలరారుఘనసారసురదారుమందారచంపకచందనములఁ
లలిన సర్వర్తుకఫలపుష్పపల్లవభరితలతాగుల్మతరువనముల
సురుచిరశశికాంతసూర్యకాంతానర్ఘమణిహేమమయకుట్టిమస్థలముల
వంశరుద్రాక్షమాలూరకింశుకముల । హంసకీరమయూరవిహంగమముల
ఋష్యసారంగమృగచమరీమృగములఁ । బావనం బగుదివ్యతపోవనంబు.

332


వ.

కని యంత సహకారకర్పూరనారికేరనమేరుదేవదారుమందారపారిజాతజంబూ
జుంబీరాశోకాసేకలతామందిరాంతరంబున హిమవంతునిరంతరోపార్జితానంత
పుణ్యఫలంబునుంబోలె నవదాతశిశిరద్యోతితశశికాంతశిలాతలంబు సమాధిస్థా
నంబు స్వీకరించి నందిమహాకాళాదిగణముఖ్యుల నిజయోగంబులంద నియమించి.

333

గీ.

హిమనగంబుపైఁ బొలుపొందు హేమశిఖర । మనఁగం దనరారు కెంజెడ ల్పెనచికట్టి
యందుఁ జుట్టినదివిజాపగామలప్ర । వాహమన నహిబంధంబు వఱల బిగిసి.

334


గీ.

క్షీరవారాశి కెఱఁగిన కారుమొగులు । కరణి శశికాంతవేదిపై గౌరుతోలు
పరచి విలసిల్లు నందుండి పరమపరుఁడు । వొలిచె నొగిమొగులునైఁ దటిత్పుంజమనఁగ.

335


సీ.

పద్మాసనస్థుఁడై భావించి శోషణదాహనఫ్లావనతర్పణముల
దేహోదయాత్మప్రతిష్ఠలు విధియించి యాగమరీతి బ్రహ్మాంగవర్ణ
విన్యాసములు దీర్చి విమలాత్మదీపంబు ప్రణవసంపుటముగాఁ బ్రజ్వలించి
వడి బాహ్యవర్తన ల్విడిచి ప్రత్యాహారగతి మనస్సంతర్ముఖమ్ము సేసి
తన్నుఁ దానె కాంచి తనయందుఁ జేతోలయంబు చేసి నిశ్చలాత్మయోగ
మయసుఖామృతాబ్ధి మగ్నుఁడై వరదుండు నిరతిశయసమాధినిష్ఠ నుండె.

336


క.

ఆధ్యాత్మమూర్తి బ్రహ్మహ । రీధ్యేయాత్మకుఁడు సురవరేణ్యుఁడు సకలా
రాధ్యుఁడయి తనరు తాను స । మాధ్యవహితేలీయమానమానసుఁ డయ్యెన్.

337


గీ.

తనకు బర మొండులేదనఁ డనరి వెలుఁగు । చుండు పరమేశ్వరుండు దా నుగ్రతపము
చేసె భక్తులు దనుఁ బ్రీతిఁ జేరవచ్చు । తెరువుఁ దాఁ దీర్చి చూపెడుతెఱఁగువోలె.

338


ఉ.

అంతకుమున్న సన్మతి బురాంతకురాకయు వచ్చియున్నవృ
త్తాంతము మేలుగా నెఱిఁగి యాహిమవంతుఁ డనంతసంభ్రమా
త్యంతమనోనురాగమునప్పుడవాజివరూధదంతిసా
మంతవిలాసినీస్వజనమంత్రిపురోహితభృత్యయుక్తుఁడై.

339


వ.

నిజాశేషకులకళత్రపుత్రీసమేతుండై చనుదెంచి పరమేశ్వరునిం గని ముహుర్ముహు
ర్మహీతలాలంకృతసర్వాంగుండై నిజదేహాదిసమస్తరాజ్యవిభవంబులు నీశ్వరు
శ్రీపాదంబులక నివేదించి.

340


క.

వినుతించుచున్నగిరిపతిఁ । గని గిరీశుఁడు సన్మనమునఁ గారుణ్యాలో
కననార్థి సుధారసవా । రినిమగ్నునిఁ జేసి సురవరేణ్యునిఁ జేసెన్.

341


వ.

ఇ ట్లచలాధీశ్వరుం డీశ్వరుకరుణామృతరసప్రవాహాఫ్లావితుం డగుచు నీశ్వరారా
ధనానంతసంతోషితాంతరంగుం డగుచు నుండునంత కొంతకాలంబునకు రుద్రుం
డు గిరీంద్రున కనేకవరంబు లొసంగి నిజపురంబున కరుగుమని నియోగించిన.

342

క.

విని కాని యెన్నడును నినుఁ । గని యెఱుఁగరు హరిసరోజగర్భామరస
న్మును లిట్టి నీస్వరూపముఁ । గని యియ్యెడఁ బాసిపోవగా నోపుదునే.

343


వ.

అని కరంబులు మొగిచి దీనాననుండై యున్నవానిభక్తియుక్తికిం గరుణించి సక
లలోకాభీష్టఫలవృద్ధికేదారాత్మకుం డగుట, గేదారేశ్వరుం డన నిప్పురంబున
వసియించెద నోడకుండు మనిన దానికిం బ్రసాదం బని.

344


సీ.

ఈబాల దన్నుఁ దా నెఱిఁగికోలె ననన్యశరణ్యయై యహరహంబు
నిన్న కొల్చుచుముందు నీ విందు మాపుణ్యమునంజేసి వచ్చుట విని ముదమునఁ
జూడంగ వచ్చె నిన్ జూచినకోలె భక్తావేశమునఁజేసి జీవ మెడలఁ
బాసిన మీపొందు వాయనోపదు పాసి తలరుఁ గావున నిచ్చఁ దగినవరువుఁ
బనులు సేయుచుండుఁ బార్వతియునికికి వరద యిచ్చగింపవలయు ననిన
నతనివిన్నపమున నంతకు భక్తవత్సలుఁడు నెమ్మనమున సంతసించి.

345


వ.

అదత్తప్రతివచనుండైన దానికి మహాప్రసాదం బని యనేకమాణిక్యాకల్పలేపాంబ
రాలంకృతం బైనకన్యాంతఃపురంబులోన.

346


క.

అక్షితధరపతి శివుఁ బ్ర । త్యక్షముగాఁ గొలుచుచుండు మని తత్పరుఁడై
శిక్షించి గౌరి నందు సు । రక్షితముగ నునిచి నిజపురంబున కరిగెన్.

347


వ.

అంతం బార్వతియు నీశ్వరారాధనాసక్తయుక్తయై భక్తియు ననురక్తియు నంత
కంత కగ్గలించుచుండ.

348


సీ.

చమరీజబర్హమార్జనులఁ బరీక్షించి నయమున సమ్మార్జనంబు సేయుఁ
గర్పూరతైలార్ద్రకస్తూరికాకర్దమంబుల ననులేపనంబు సేయుఁ
గాశ్మీరమాంజిష్ఠగరుడాండహరినీలముక్తాఫలంబుల మ్రుగ్గు వెట్టుఁ
గుసుమపల్లవలతాకోరకంబులఁ జిత్రదామంబు లొనరించుఁ దావిమిగులఁ
బుష్పమందిర మొనరించుఁ బుణ్యవారి । సౌరభము లించి మణికలశముల నించు
నచలపతిసుత మది నిట్టు లహరహంబు । శివున కనురక్తిఁ బరిచర్య సేయుచుండె.

349


చ.

పొలుపుగఁ జంద్రశేఖరుతపోవన మంగజచక్రవర్తిదో
ర్బలమున ముట్టి చూఱగొనఁ బంచినదం డొకొ నాఁగఁ బొల్చి క

స్యలు దనుఁ గొల్చిరా నచలనందన సుందరలీల నిచ్చలుం
గొలుచుచు నుండె భక్తినహికుండలమండితగండమండలున్.

350


సీ.

మొన లావులించి వాసన సల్లఁ బసికొని లేఁదేటిగము లేఁగులింపకుండ
నెడ సూఱగొని వేచి సుడియుతెమ్మెరలచేఁ బొడముపుప్పొడి వోలివోవకుండఁ
దరణిహటమున మే యెరలి పద్మినిమేన మొలతెంచుమధుమద మొలుకకుండ
మేల్కని గోమిని మెలఁగి మైమురిసిన బొదిగొన్నయకరువు సెదరకుండఁ
దెలిసి జక్కవ లొండొంటిఁ గలయఁదారు । కలకలంబున రేకులు గదలకుండ
మున్నకొనివచ్చి గణికాసమూహితోడ । గిరిజ పూజించెఁ బసిఁడితామరల వరదు.

351


ఉ.

చారుతరావధాననుతశాశ్వతకీర్తిరసప్రవాహసం
పూరితరోదసీకుహరుఁ బుణ్యసనాతనమూర్తి సజ్జనా
ధారు సమస్తలోకజనతానుతపాద సరోజుపీఠు శృం
గారభవారి నర్థిజనకల్పమహీజము మల్లికార్జునున్.

352


క.

అనవరతదానరతుఁ బా । వనతరశుభమూర్తి భక్తవత్సలు జనతా
వినుతమతిక్రమభవసం । గనివృత్తు మునీంద్రవరశిఖామణి ననఘున్.

353


ఉ.

సత్యవిలాసు నాదిముని సచ్చరితుం గవిగాయకారిసం
స్తుత్యు ననూనదాననిరతుం గరుణాకరు సజ్జనాంబుజా
దిత్యు వినిర్జితాంగభవుఁ దీర్ణభవార్ణపు శేముషీసురా
మాత్యు సదాత్మయోగిజనమండను జంగమమల్లికార్డునున్.

354


క.

ధీమణి నాశ్రితజనర । క్షామణిఁ గవిగమకివాగ్మిగాయకనటచిం
తామణి సన్మునిగణచూడా । మణి నిహలోకవరనిటలతటనయనున్.

355


వనమయూరము.

మేరునగధీరు నిరమిత్రు సుచరిత్రున్
వారిధిగభీరు నిరవద్య జనవంద్యున్
చారుతరమూర్తి శాంతు గుణవంతున్
మారహారు సర్వజనమాన్యు మునిమాన్యున్.

356


గద్యము.

ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ
శిఖామణి నన్నెచోడదేవప్రణీతం బయిన కుమారసంభవం బనుకథయందుఁ
దృతీయాశ్వాసము.

  1. ఛత్రవృక్షమునుగుఱించి: "ఛత్రివద్దండపత్రాయానాలిచానచోన్నతా । సుక్షీరాఛత్రి
    ణీనామారసబంధకరీమతా” అనిమంథానభైరవతంత్రము. ఇది 64 దివ్యౌషధులలో
    నొకటి “ఛత్రిణీ త్రివిధాప్రోక్తా వృక్షకందలతాల్మికా । రసబంధే ఛత్రవృక్షోలతాకందే
    రసాయనే” ఖండకాపాలికతంత్రము.
  2. రేయెండ = ఈ రెండలు, బాలాతపము. రేయెండయను పదమునకు వెన్నెలయను
    నర్థమున నాకుఁ బ్రామాణిక కవిప్రయోగములు చిక్కవయ్యె. కాశీఖండమున “ఒకదీవిఁ
    దొలుసంజ....నుదయించు మఱుసంజ యొండుదీవి । నొకదీవి నిండుచంద్రికలు
    మిన్నులువ్రాఁకు నొకదీవి రేయెండ యుబ్బికాయు.” ఆ-1 లోనున్నది. ఇందు రేయెండ
    నిండుచంద్రికకు విరోధముగా నాతపార్థమున నుపయోగింపబడినది. ఈరు అనుపద
    ము వర్ణప్లుతియను విధిచే, రే। యనియగును. ఎలఁదీగె | లేఁదీగె. ఇత్యాదులు.
    ఈ రెండు రేయెండ రూపాంతరములు.
  3. నడపాడ నడువ = “నడపాడనేర్చిన నవకంపునునుదీఁగె” కేయూరబాహుచరిత్ర. ఆ4.
  4. “ఆంధ్రీకుచాలింగితఁ..........సోయం సంప్రతి రాజశేఖరకవిర్వారాణసీం వాంఛతే.”
    అని యాంధ్రీస్తనములు కాఠిన్యమునకుం బ్రసిద్ధంబులుగా వర్ణింతురు.
  5. లేఁబొఱ = పల్లవము