కుమారసంభవము/పీఠిక
పీఠిక
ఈమహాకావ్యమును రచించిన కవి నన్నెచోడదేవుఁడు. ఇతనికిఁ గవితాప్రౌఢిమను బట్టి కవిరాజశిఖామణి యనియు దిగ్విజయమునుబట్టి టేంకణాదిత్యుఁడనియు బిరుదములు గలవు. ఇతఁడు సూర్యవంశపు క్షత్రియుఁడు. ఇతఁడు కావేరీతీరమున వొరయూరను పట్టణము రాజధానిగా గోదావరీ సింహళ మధ్యదేశము నేలెను. వీనితండ్రి చోడపల్లి. తల్లి శ్రీసతి. ఇతఁడు క్రీ-శ.940లోఁ బాశ్చాత్యచాళుక్యులతో యుద్ధముచేసి రణరంగమున నిహతుఁడయ్యెను. తత్పూర్వము రాజ్యపదభ్రష్టుఁడై యజ్ఞాతవాసము సేసి మరల లబ్ధరాజ్యుఁడై కొంతకాలము రాజ్య మేలెను. ఇతనిగురువును గృతికర్తయునగు మల్లికార్జునఋషి ద్రవిడమండలమున శైవసమయాచార్యత్రయములో మేలిమి గన్న మాణిక్యవాచకునితో వాదించినట్లు తెలియుచున్నది. ఈ కవిశిఖామణిని గురించి యెక్కుడుగా రెండవభాగము పీఠికలో విస్తారము వ్రాయఁదలంచియున్నాను. ఇతడు కలావిలాస మను మఱియొక్క కావ్యమును గూడ రచించెను. అది నాకు లభింపకున్నను దానిలోని పద్యములు కవిసంజీవని, రత్నాకరము, అధర్వణచ్ఛందము, గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణిలో నుదాహరింపఁబడినవి. ఆపద్యములలోఁ గొన్నిటి నిం దుదాహరిచినయెడల సుముఖు లెవ్వరైనఁ దద్గ్రంథమును వెదకి దాని ననర్హమగు మరణమువలనఁ దప్పింతురను నాస గలుగుచున్నది.
సీ. | పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు | |
క. | తలపోయఁగ రుచులాఱును | గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముంజెడు నా | |
చ. | తొడవులు వెట్టు సంభ్రమముతోఁ దిలకించు మడుంగుగట్టు పైఁ | |
చ. | లలనలు కొందఱాత్మపతులం దగఁగూడినచెయ్వులన్నియుం | |
క్షేమేంద్రుఁడను నొకానొక కశ్మీరమహాకవి కళావిలాస మని సంస్కృతమున నొకగ్రంథము వ్రాసియున్నాడు. తెనుఁగుబద్యముల నన్నియుఁ గూర్చి పోల్చిచూడగా నద్దాని కిది తెనుఁగు గాదనియు నిందుఁ గథాభాగముకూడఁ గలదనియు సంస్కృతమున దానిలోఁ గథాంశములు లేకుండుటయు జూడఁగా రెంటికిని నామమాత్రసాదృశ్యము గలదని తేలినది.
ఈ కుమారసంభవము కాళిదాసు కావ్యమునకుఁ దెనుఁగు గాదు. ఇందుఁ బేర్కొనఁబడిన సంస్కృతకవులలో నుద్భటుఁడనువాఁడు భావగర్భమునుగల కుమారసంభవ మను కృతిని రచించినట్లు కవి చెప్పుచున్నాఁడు. కాశ్మీరకవులలో జయాపీడ సంస్థానవిద్యాపతియగు నుద్భటుడొక్కఁడు శ్రీ - శ. 900 లో కావ్యాలంకారసారసంగ్రహమును రచించి దానిలోఁ దన కుమారసంభవ కావ్యములోనుండి శ్లోకము లుదాహరించుకొనెను. కావున నాయుద్భటుని కుమారసంభవమే నన్నెచోడుఁడు చూచెనని యేర్పడుచున్నది. ఆగ్రంథమిప్పుడు లభించునది కాదు. దానిలోని శ్లోకముల నుద్భటుఁడు తనయలంకారగ్రంథమునందును, ప్రతీహారేందు రా జను వ్యాఖ్యాతయు, కావ్యప్రకాశమునందు, సంకేతమను వ్యాఖ్యానమునందు మాణిక్యచంద్రుఁ డను కవియు, వల్లభదేవుఁడును, ఉదాహరించియున్నారు. అయ్యుదాహృత పద్యములనన్నియుఁ బోల్చిచూడఁగాఁ దెనుఁగు కుమారసంభవ ముద్భటుని కావ్యమునకు దెనుఁగు గాదని యేర్పడుచున్నది. మఱియు నాశ్లోకములను బట్టి చూడఁగా నుద్భటుఁడు శబ్దచిత్రములయందును నప్రస్తుతశ్లేషలయందును బ్రీతి గలవాఁడని తోచుచున్నది. కొన్నిశ్లోకముల నుదాహరించినఁ జదువువారలు రెండుకావ్యములలో భేదమును గుర్తెఱుంగుదు రని చూపుచున్నాను. “విరళాస్తాదృశా లోకే శీలసౌందర్యసంపదః నిశాః కియత్యోవర్షేపి యా స్విందుః పూర్ణమండలః” “సాగౌరీశిఖరంగత్వా దదర్శోమాం తప్కృఃకృశాం, రాహుపీత ప్రభస్యేందో ర్జయంతీః దూరతస్తనుం” “యాశైశరీ శ్రీస్తపసా మాసేనైకేన విశ్రుతా | తపసా తాం సుదీర్ఘేః దూరాద్విదధతీమధ్య”, “దంతప్రధాసుమనసంపాణిపల్లవశోభినీం తన్వీంవసగతాం లీలాజటాషట్చరణావళిం”, "స్వయంచపల్లవాతామ్రభాస్వత్కరవిరాజీనీ | ప్రభాతసంధ్యేవాస్వాప ఫలలుబ్ధేహితప్రదా, ఇందుకాంతముఖీ స్నిగ్ధమహానీలశిరోరుహా | ముక్తాశ్రీ స్త్రీ జగద్రత్నం పద్మరాగాంఘ్రిపల్లవా | అపారిజాతవార్తాపి నందనశ్రీర్భువిస్థితా అబిందు సుందరీ నిత్యం గలల్లావణ్యబిందుకా” ఇత్యాదులు చూడఁగా, “యాతాస్తేరససారసంగ్రహవిధిం నిష్పీడ్య నిష్పీడ్య యే | వాక్తత్వేక్షులతాం పురాకతిపయే తత్త్వస్పృఃశ్చక్రిరే | జాయంతేద్య యధాసుధంరు రవయస్తే తత్ర సంతన్వతే | యే౽నుప్రాసకఠోరచక్రయమకశ్లేషాద్యల్కోడ్చనుం” అను మంశుకునిశ్లోకము స్మరణకు వచ్చుచున్నది. ఈకథ నితఁ డించుక మార్చి యున్నాడు. సంస్కృతకుమారసంభవకథలలో లేని గణపతిజననమును బార్వతీదాక్షాయణులు కైలాసవనభూముల స్వేచ్ఛగా విహరించు గజయూధములఁ జూచి యపూర్వరతిదత్తచిత్తులై గజరూపములు దాల్చి క్రీడింపఁగా గణేశ్వరుఁ డుద్భవించెననియు, రెండవది, శరవణమును సరస్సున సప్తర్షులభార్యలు జలక్రీడ సేయుచుండ నగ్నిహోత్రుఁడు మోహించి వారల సమీపంప వారిలో నరుంధతి తొలఁగినం దక్కినయార్గురును నగ్నిఁ బురుషునిగా గ్రహింపక శీతాపనోదనార్ధము నిరంబరలై సమీపింప నగ్ని వారిం గౌఁగిలించి తాను ధరించియుండిన శంభువీర్యభారమును దొలంగించుకొనెను. వారలు సద్యోగర్భంబు వడసి జడిసి గర్భపిండముల వెలార్చి కమలపత్రంబున నిడి యిండ్లకు మగిడి పతిశాపతప్త లయ్యుఁ బరమేశ్వరవీర్యధారణప్రభావంబున జ్యోతిర్లోకము సెందినట్లును మార్పులు కలిగించియున్నాడు. ఈమార్పు లీకవి చేసినవనియే యూహించెదను. ఎట్లైన నివి మనోరమములే. దీనిలో 12 ఆశ్వాసములలో 1200 పద్యములు గలవు. ముద్రితగ్రంథములలో లేని యపూర్వపదము లీకావ్యములోఁ గుప్పలుగా నున్నందున వాని సవరించి లేఖకదోషముల గుర్తెఱింగి సంస్కరించుటకు నవకాశము నాకుఁ జాలమిం జేసియు, నామిత్రులు పలువు రీకృతిలోఁ గొంతభాగమైన ప్రకటింప నన్నుఁ బురికొల్పుట వలనను, ఇటీవల నాకు లభించిన కొన్నిపూర్వకావ్యములు చక్కగా శోధించి ప్రాచీనపదసంగ్రహము చేసికొని దీని ముద్రించిన స్ఖాలిత్యములు మెండుగా నుండవనియు, పరదేశమునందు గ్రంథసామగ్రి చాలక యానుకూల్యము లేక యస్వతంత్రజీవనమున నకృతావకాశత్వమునను దీనిఁబూర్వభాగముగా నేడాశ్వాసములు 1000 పద్యములు మాత్రమే యిందుఁ బ్రచురించుచున్నాఁడను. ఈకృతి నన్నయభట్టుకంటే నూఱేండ్లు పూర్వము దైనను 1000 సంవత్సరములుగా నెవ్వరును గుర్తెఱుంగక యుండ దటస్థింపదనియు దీనిని నేనో మఱి యెవ్వరో రచించి గ్రంథప్రాశస్త్యమునకై ప్రాచీనులపేర వ్యవహరింపఁబడెననియు గ్రంథమును బ్రచురింపక మునుపే యొకవార్త పుట్టినది. ఇట్టివార్తను ఖండింపకున్న మహాపాపము. నాయట్టివాని కిట్టి కావ్యమును వ్రాయ సామర్థ్యము లే దనుట తెల్ల మనుట గాక నాచనసోమునికిఁ దరువాత నిట్టి కవిత గూర్చువాఁడే యాంధ్రదేశమునఁ బుట్టినవాడు కాఁడు. అధునాతనకవులలో నిట్టివాఁడు గల్గిన వాఁడు నిర్లజ్జుఁడై తననామగోపనము సేయ హేతువు గానరాదు. ఈకవి ప్రఖ్యాతుఁడు కాకపోవుటకుఁ గారణము :—
బహుళో సామాన్య మతిత్వేన తేషాంపరిగ్రహేలోకే, కామంగతాప్రసిద్ధిం సామాన్య కవయః అతవివ" అని యూహించవలయు. అయిననుఁ గుమారసంభవములోని పద్యము లథర్వణచ్ఛందము, పెద్దన లక్షణసారసంగ్రహము, కవిసంజీవని, రత్నాకరము, లక్షణశిరోమణి, వీనిలో నుదాహరింపఁబడినవి. అథర్వణుఁడు:
క. | మగణమ్ముఁ గలయ రగణము । వగవక కృతిమొదట నిలుపువానికి మరణం | |
యనియును బూర్ణబిందుప్రాసముక్రింద పద్యమును నుదాహరించెను. కవిసంజీవనిలో నెక్కటివళులక్రింద, స్మరతత్త్వసారము, కాశీశతకము, ముద్రారాక్షసము, భారతానుశాసనికము వీనిలోని పద్యము లుదాహరించి, నన్నెచోళునికుమారసంభవములోని "ఆయతమతినుత సప్తోపాయముల నెఱుంగవలయుఁ బ్రతిసామము భేదాయతి దానము దండము మాయోపేక్షేంద్రజాలమంత్రము లోలిన్" అనిమఱియు "పూని రహస్యం బాడెడుఁ వాని నీ దివానిరీక్ష్యవక్తవ్యం గాత్రే నైవచ నైవచ యనుమానితహితభాషణంబు మతి నిలుపదగున్" అని యిచ్చి యున్నాఁడు. వీనిలోఁ బైపద్యము 10వ యాశ్వాసమున నున్నది. క్రింది పద్యము దీనిలో లేదు. ఎచ్చటిదో యెఱుంగుటకును నలవి లేదు. పెద్దన లక్షణసారసంగ్రహములో 6వ ఆశ్వాసమునుండియు రత్నాకరకర్త 8వ యాశ్వాసమునుండియు బద్యము లుదాహరించియున్నారు. ఇందఱు చూచిన కృతి నేటి కెట్లు క్రొత్తనగును! అది యట్లుండ, నమరేశ్వరుని విక్రమసేనము, విన్నకోట పెద్దన ప్రద్యుమ్నచరిత, తిక్కనసోమయాజి విజయసేనము, కవి భల్లటుని విక్రమార్కచరిత్ర, పెమ్మన యనిరుద్ధచరిత్రమును ఎవ రెఱుంగుదురు. కవిలోకబ్రహ్మయను బిరుదుతో శతాధికకావ్యకర్త యగు పెద్దపాటి సోమనాధికవి నెవ్వ రెఱుంగుదురు? అతనియరుణాచలపురాణములోనుండి యొక్కపద్యము కవిసంజీవనిలోనుండి తీసి కూచిమంచి తిమ్మకవి యుదాహరించెను అతనికృతులలో శివజ్ఞానదీపిక, అరుణాచలపురాణము, కేదారఖండము ప్రౌఢములైనవి. మఱియును నన్నెచోళునిఁ బూర్వకవు లెఱుంగుదురా యనునంశమును సూచించుటకై పోలికపద్యములు దాపరించితివి. వానిలో ముఖ్యముగాఁ జక్కనకవియుం బింగళిసూరన, పూర్వకవిసూరన, తెనాలి రామలింగఁడు వీరు మొదలుగా భావచౌర్యమును జేసియున్నారు. పింగళిసూరన వీనిపద్యమును, రామలింగడు 823 పద్యమును జదివియే తమపద్యములు గూర్చిరి, జక్కన విషయమును జూడుఁడు.
సీ. | దుగ్ధాంబునిధి నిట్లఁ దోఁచెనో యని శేషుఁ బాన్పుగా హరి నీటఁ బవ్వడింపఁ | కుమా ఆ. |
సీ. | గంగాప్రవాహంబు కాఁబోలునని వశిష్ఠాదు లనుష్ఠాన మాచరింప | |
| దుగ్ధాంబునిధి యని తోయజాక్షుఁడు శేషపర్యంక మిడుకొని బవ్వడింపఁ | |
జక్కన విక్రమార్కచరిత్రము
వేయేల, యితని కావ్యమును దిక్కన, కేతన, మంచన, నాచనసోముఁడు, అమరేశ్వరుఁడు, విన్నకోట పెద్దన, సూరనలు, రామలింగ్ఁడు, కొందఱు లాక్షణికులును చదివినట్లు తెలియుచున్నది! "త ఏవవిదవిన్యాసా స్తావివార్థ విభూతయఁ। తథాపి నవ్యం భవతి కావ్యం గ్రధన కౌశలాత్" అనువాక్యము కేతన సోమనాథాదులయందుఁగూడ వ్యక్తమగుచున్నది.
నన్నెచోడుని కుమారసంభవము నానాధాలంకారములకును, నపూర్వవ్యాకరణలక్షణములకును, కొన్నిశబ్దచిత్రములకును, భావ, వ్యంగ్య, ధ్వనులకును లక్ష్యము లిచ్చుటయందుఁ బ్రథమగణ్యముగానున్నది. ఈ కవికిఁ బూర్వము సంస్కృతము నెందఱో మహాకవు లున్నను గ్రంథచౌర్య మగపడదు. "మదమున సత్కవి కావ్యము । నదరక విలుకాని పట్టిసమ్మును బరహృది | దమై తలయూపింపని యది కావ్యమె వాని పట్టినదియుం గరమే" యనునది మాత్రమే "కింకవే స్తస్యకావ్యేన కింకాండే సధనుష్మతః పరస్య హృదయే లగ్నం నఘూర్ణయతి యచ్ఛిరః" యనుశ్లోకార్ధమునుండి గ్రహింపఁబడినది. దీనిలోఁ గొన్నియత్యాశ్చర్యజనకము లగుభావములు గలవు. అట్టి పద్యము లీముద్రితభాగములోనే కొన్ని గలవు. వానికిఁ జూడఁగా "తత్తత్సమగ్రబహుశాస్త్రవిమర్శసిద్ధవైదగ్ధ్య దిగ్ధమతయో బహవః కవంతాం, యత్కించిదస్తితు మహాకవి వాగ్రహస్యం స్వప్నే౽సి తస్యకిల తేన దిశం స్పృశంతి" యనియు, "ఆసంసారం (సృష్టి) కవిపుంగవైః ప్రతిదివసగృహీత సారో౽పి । అద్యాప్యభిన్నముద్ర ఇవ జయతి వాక్పరస్పందః" అని మంకుకవాక్సతికవులు సూచించిన వాక్యములు నిక్కములని తోచుచున్నది. మఱియు నీకవి, "ఓలిన కడచన నఱువది । నాలుగువిద్యలకు నేర్పు నైసర్గికమై, నాలిన సుకవులకుం గా కేల తరమె కృతులు చెప్ప నెవ్వరి కైనన్" అని చెప్పుకొన్నట్లు సర్వజ్ఞుఁడని చెప్పుటకుఁ దగిన సూచనలు కావ్యములో నగపడుచున్నవి. ఆంధ్రకవులలో నిట్టివారు తిక్కన, నాచనసోముఁడు, ఎఱ్ఱాప్రెగ్గడయు మాత్రమే.
ఇతని కాలములో దీర్ఘము మీఁది యర్ధబిందువు పూర్ణబిందువుగానే వాడుచున్నట్లును కృష్ణదేవరాయలకాలమునకే యది యర్ధబిందు వయ్యెననియు నీకృతివలనఁ దేలుచున్నది. దీర్ఘములమీఁద నఱసున్నలు సోముఁడు కూడఁ బ్రయోగించి యున్నాఁడు. చూడుఁడు: ఉ. ఎంచినప్రేమ నీపదక మిమ్మని రుక్మిణి మున్ను వేడుడుం। పూంచినపూఁవు దక్కఁ బలుపోకలఁ పోవుచునుండు దేవుఁడున్ డాంచినసొమ్ము చేరె నకటా మదిఁ గోరని సత్యభా మకున్ । నొంచినవారిసొమ్ము లవి నోమని వారికి వచ్చునే యిలన్” "ఘంటాకర్లుఁడు నేన నాయనుజుఁ డీకాలాంతకుం డేము —ముక్కంటిన్... జంటన్... వెంటంబోయితిమేని" అని. ఇందు, ఏచుశబ్దమున నరసున్న యీయర్థమున లేదు; వేఁట యనుటకు వెంట యని రూపాంతరము స్థలాంతరమున నెచట లేదు. భీమకవి నృసింహపురాణమున, "వాండిమి నల్లసిద్ధి జనవల్లభుఁ డోర్పిన రాజు భీరుఁడై । యాండ్రను గానకుండ వృషభాంకము పెట్టి కొనంగఁ జూచితో । నేండిదె యేమి నీ వనుచు నెచ్చెలు లెల్ల హసింప నంతలో । మూండవకంటితోడి దొరమూర్తి వహించిన మ్రొక్కి రంగనల్" అని చెప్పియున్నది కావుననే శ్రీనాధునివఱకును నర్ధబిందుప్రాసమును సడలనీయక ప్రయోగించిరి. నన్నయాదులు నిర్బిందువు నర్ధబిందువును గలపిరని యప్పకవ్యాదులు చూపిన ప్రయోగములన్నియు వారియల్పజ్ఞానము సూచించుచున్నది. అప్పకవియు, కూచిమంచి తిమ్మకవియు నుదాహరించిన పద్యములన్నియు లక్షణసారసంగ్రహ, కవిసంజీవని, కవిచింతామణి లక్షణశిరోమణులు — వీనిలోనే యున్నవి. చీకటి, వీపు, శబ్దములలో నరసున్న లేదు. ఉన్నట్లు ప్రామాణికకవులలో బ్రయోగములు లేవు. కవిత్రయ, నాచనసోమ, నన్నెచోళ, కవిభల్లట, విన్నకోట పెద్దన్న శ్రీనాథ కేతనలు, ప్రాససంకరము సేసినవారు కారు. చీకటిశబ్దమునకు భారత దశకుమారచరిత్రలలోని ప్రయోగములు చూపితిని. వీపుశబ్దమునకు నాదిపర్వములోని ప్రయోగముగా "వీపున నబ్ధి నొక్కపృథివీధరమున్ దగఁ దాల్చెనంచు లక్ష్మీపతి” అని నృసింహ ఆ-4-180లోను, "వీపున మోపెఁ గఛ్ఛపము వెండిభుజంగమరాజు మస్తకస్థాపితఁ జేసె నీవు వసుధారమణిం బెదకోమటీంద్ర బాహాపరిరంభగుంభసముదంచితఁ జేయుట యింత యొప్పునే మోపరు లే మెఱుంగుదురు ముగ్ధలతోడి విహారధర్మముల్" అనియు నెఱ్ఱప్రెగ్గడ ప్రయోగించియున్నాఁడు. తీగ, శబ్దములో నరసున్న లేదు. 'డాగు' అనుటకు నెగయునను నర్థమున నరసున్న లేదు. మూగుశబ్దమునకు రెండురూపములు ద్రవిడ కర్ణాట భాషలలోఁ గూడఁ గలవు. బాగుశబ్దము ప్రాచీన నవీనరూపములు రెండు. ప్రాచీనరూపములో నరసున్న గలదు. "యాంగువా* యిర్ కళు మవ్వుయిరిడంగళుం । దాంగు ఱమణ్ణీట్టిర్ పణ్ లుఱవగుత్తు" అని మణిమేఖల - ఆ -6-199. ఇందు 'బాఁగు' అనఁ బ్రకాశము కావునఁ బైపదముల నుంచుకొని యప్పకవి, ముద్దరాజు రామన, కస్తూరిరంగకవి, గణపవరపు వేంకటకవి, తిమ్మకవి - వీర లుదాహరించిన సంకరప్రాసములు శోధించినయెడల నీపాండిత్యమే సంకరమని తోచును. ఆఁగు— ఇత్యాది గకారములమున్ను అర్ధబిందువు గలదా లేదా యనునంశమును, 'గ' కారము, 'వ' కారమైనచో లేదు, గాకున్న నున్న ట్లూహింపవలయు. మూగుశబ్దము మూవు అనురూపమును జెందుచున్నది. చూడుఁడు కుమారసంభవములో 461వ పద్యములో శబ్దాలంకారము. మఱియు శాసనములలో 'నాండు' అనియే యున్నది. కావునఁ బూర్వకాలమున దీర్ఘముమీఁద నెఱసున్నయే వాడినట్ల తోచుచున్నది. నాడు శబ్దమున 'ఆనాడు, నేడు, ఎన్నడు' అనునర్ధమున మాత్రమే యర్ధానుస్వారము గలదు. 'నాడు' దిన మనునప్పుడు లేదు. 'రెండవనాడు' అనునప్పుడు లేదు. ద్రవిడభాషలో ఆండ్రి ఇండ్రి, ఏండ్రు, అనినాఁడు, నేఁడు, ఎన్నఁడు అనియు, రెండునాళ్ అని రెండునాడులు అనియు వేఱవేఱ పదములు గలవు. కావున నుద్యోగపర్వములోఁ దిక్కన సంకరము చేసినవాఁడు కాడు. క్రౌంచపద, సరసిజ, గర్భబంధ కవితల లక్షణములలోఁ దప్పులు సెప్పిన యప్పకవ్యాదుల లక్షణసూత్రములు ప్రామాణికములుగా గ్రహించుట దోషము. ఇప్పుడు ప్రాచీన నవీన కావ్యములు చేతిలో నున్నవి. సుముఖులు చూడఁదగును. నన్నెచోళుడు, ఏనియను శబ్దమును నేనియని నాకారాదిగాఁ గూడఁ బ్రయోగించెను. కాబట్టియే నన్నయభట్టు - న్నేని... దిగ్ధరణీరవీందులు, ఆది - ఆ - 6. అను నకారాదిగాఁ బ్రయోగించె. ఇది తెలియక లాక్షణికులు దుస్సంధియు, యతికి వైకల్పికభావమును నన్నయభట్టున కారోపించిరి. చోళుని శబ్దప్రయోగములు పరమప్రామాణికములై కవిత్రయ పెద్దన సోమన కేతన మంచనాదుల ప్రయోగములకు సరిపోవుచున్నది.
ఉత్తరకథాప్రశంస
అష్టమాశ్వాసమున: బార్వతీవర్ణనమును, శివునిప్రస్థానమును, బౌరస్త్రీదర్శనమును, బ్రహ్మాదులవర్ణనమును, సాయంకాలవర్ణనమును, తమోవిజృంభణమును, చంద్రోదయవర్ణనంబును, విటాభిసారికావర్ణనంబు లంజికాప్రసాధనంబును బాంచాలాదివిటవర్ణనంబును సూర్యోదయంబును వివాహయత్నంబును, నవమాశ్వాసమున, శివపార్వతీప్రసాధనంబును, వివాహంబును, ఉద్యానవనవిహారంబును, జలక్రీడయును, కైలాసనిర్గమంబును రతిక్రీడావిహారంబును, దశమాశ్వాసమున నగ్ని దేవతలప్రేరణంబున వచ్చి శంభువీర్యతప్తుఁ డగుటయు గంగ కొసంగుటము, గంగాదేవి వల దనుటయు, శరవణసరోవరంబు దఱియుటయు, సప్తర్షిపత్నీదర్శనంబును, నరుంధతి పరిధానము ధరించుటయు, తక్కిన యాఱ్వురు నిరంబరలై యగ్నిచే నాలింగిత లగుటయు, సద్యోగర్భము దాల్చుటయు, గర్భవిచ్ఛేదము సేసి కమలపత్రంబులం దిడి గృహమునకుం జని శప్తలై జ్యోతిర్లోకంబు సెందుట, కమలపత్రంబునఁ గుమారుం డుదయించుటయు నారదాగమనంబును, ఇంద్రసందేశమును, ఐరావతకుమారయుద్ధంబును, ఇంద్రధావనంబును శివదర్శనంబును పార్వతీవాత్సల్యంబును కుమారుని సేనాపతిత్వంబును, ఏకాదశాశ్వాసమున తారకునకు దూతం బుచ్చుటయుఁ ప్రాతిదూత్యంబును, యుద్ధసన్నాహంబును వీరపత్నీప్రవాసదుఃఖంబును, దివసద్వయయుద్ధంబును ద్వాదశాశ్వాసమున తృతీయదివసయుద్ధమును తారకమరణంబును దివ్యాంగనాశేషాక్షతావర్ణనంబును గ్రంధకర్తృకవితోద్దేశమును వర్ణింపఁబడినవి.
దీనిలో నాశ్వాసాద్యంతపద్యములలోఁ గృతిపతియగు మల్లికార్జునకును శివునకు నభేదము సేయఁబడినది. ఈమర్యాద కర్ణాటభాషలో పంపభారతములోను గదాయుద్ధమునందును గూడఁ గలదు. గ్రంథాంతమునను "సరసాహారము రాగహేతు వను టజ్ఞానంబు పారావతో, త్కరముల్ చిక్కనిరాలు మ్రింగియు సదా కామార్తులై యుండుఁ గే, సరి సాంద్రామిషభుక్తియైనను సకృత్సంభోగ మందున్ మనో, హరసుజ్ఞానమ కాక రాగరసమం దాహారనిర్వృత్తియే.సీ. | బుద్ధీంద్రియంబుల పొలఁతులనాఁజాలు కర్మేంద్రియంబుల గర్వమడచి | |
అని చెప్పి
సీ. | జ్ఞానదీపంబు హృత్సదనంబులోఁ దాన దీవియగా నెంత దివురువారు | |
అనియు వ్రాసియున్నాడు.
దీనికంటెను మనోహరమైన కావ్యము పెద్దన ప్రద్యుమ్నచరిత్రము, చిమ్మపూఁడి యమరేశ్వరుని విక్రమసేనము నాచనసోముని కవిత కీడురాదు. పెమ్మన యనిరుద్ధచరిత్రము భావగాంభీర్యము పదపుష్టియుఁ గలదై యతిరమ్యముగా నున్నది. ఈమూఁటిలో భాగములు మాత్రమే లభించినందున నాంధ్రభాషాభిమాను లెవ్వరేని నాకుఁ దత్కావ్యములు పంపిన వాని ముద్రించి మాసిపోవుచున్న తత్కవుల కీర్తిచంద్రిక లుల్లసిల్లునట్లు చేసెదను.
ఈగ్రంథమును సంపాదించి ప్రచురించుటకై నా చేసిన దేహధనవ్యయములును మిక్కిలియయ్యె. గార్యాంతరప్రసక్తుఁడ నగు నాకు నవకాశము లేమింజేసి గ్రంథశోధనము చక్కఁగాఁ జేయక కొన్ని ప్రమాదములు విడిచితిని. ప్రాచీనపదములలోఁ గూడ నెక్కువ జ్ఞానము లేమిచేఁ గొన్నియెడలు సందిగ్ధములుగా నుండును. పాండిత్యము చాలక యిట్టిపనికిఁ బూనినందునకు నన్ను నిందింపక నాసదుద్దేశమును మాత్రమే గ్రహించి నాయందు మిత్రభావము ప్రకటింతురని యీకృతిఁ జదువువారి నెల్లరను మిక్కిలి విధేయతతోఁ బ్రార్ధించుచున్నాఁడను.
వనపర్తి
డిసంబరు 20 తేది - 1908
మా - రామకృష్ణకవి.