కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/28వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఎవ్వరేమన్నను వారిజాడ యెక్కడనులేదు. రాజు పెద్దవాడయియున్నవాడు. భానుండనువానికే రాజ్యమిచ్చునని చెప్పుకొనుచున్నారు. ఎవ్వరికిని గాలము సమముగా నుండదుగదా? తత్పుత్రశోకము మాఱేని యుత్సాహము నడంగద్రొక్కినదని యచ్చటవార్త యంతయుం జెప్పెను.

అప్పుడు వారు క్రూరుల చేష్టలం గుఱించి వెరగుపడుచు దుర్జనుల శిక్షింపక పోవుటయు దుష్కృతమేయని తలంచుచు నప్పుడు తమనెలవునకుఁబోయి యమ్మరునాడు తమ రాకనంతయు బత్రికయందు వ్రాసి తండ్రి కనిపిరి. ఆపత్రిక చూచుకొని యారాజు సంతోషార్ణవంబున మునుంగుచు మేళతాళములతో నెదురేగి వారిని దోడ్కొనివచ్చి కోటలో ప్రవేశపెట్టి యాపూర్వకౌతుకముతో వారిమాట లాలింపుచు నాదినమున గడిపెను. వారితల్లులు ప్రాణావశిష్టులయి వారింజూచిన తోడనే చంద్రాగమనంబున సముద్రవీచికలవలె పొంగిరి.

అమ్మఱునాడొక సభజేయించి యారాజపుత్రు లిరువురు మంత్రిసామంత విద్వాంస పౌరవార మండితమయిన యాసభయందు దమ వృత్తాంతమంతయు నుపన్యాసముగా చెప్పి తమకు సోదరులు సేసిన ద్రోహకృత్యములన్నియు వక్కాణించిరి. ఆవృత్తాంతమువిని యందున్నవారెల్ల నారాజు మధ్యమపుత్రుల నిందించుచు వారిం గొనియాడదొడంగిరి.

వీరప్రతాపుడప్పుడే తనరాజ్యమంతయు పెద్దపుత్రుని యధీనము గావించెను. కావున విజయుడు రాజుయి దండ్యులయినవారిని విడచుట తప్పనియెంచి యా దుర్మార్గుల నిరువురను కోటముంగలనున్న స్తంభంబులంగట్టి వారమున కొకసారి పండ్రెండేసిదెబ్బలం గొట్టునట్లును వారితో గూడ రుచిరను మొగముమీద నుమియునట్లు నీరీతి సంవత్సరమువరకు చేయవలయుని శిక్షవిధించెను. వారియనంతరముగూడ నాకోట ముంగల వారి విగ్రహముల నినుపస్తంభములకుగట్టి సంవత్సరమునకొకసారి యట్లు చేయుచుందురు. ఈనగరమే యాసింధుభాయిది. చిరకాలమైసను నప్పటివారి సంతతివారు సేయించుచుండిరి.

ఇదియే వీనివృత్తాంతమని మణిసిద్దుడు చెప్పినవిని యా గోపకుమారుండు మిగుల సంతసించెను,

ఇరువది యెనిమిదవ మజిలీ

ఇరువది యెనిమిదవ నివాసదేశమం దొకతటాకముదాపుననున్న మంటపములో మూడు శిలావిగ్రహములున్నవి. వానిలో నొకదాని ముఖముమీద అంతా మహావిచిత్రమనియు, రెండవదాని భుజములమీద దైవయత్నమనియు మూడవదాని యొడలమీద నెవ్వరి కెవ్వరును లేరనియు పేరులు చెక్కంబడియున్నవి. ఆ పురుష విగ్రహముల కెదురుగా నొక స్త్రీవిగ్రహ మభిముఖముగా నున్నది. దాని భుజముల యందు విరాగిణియని వ్రాయబడియున్నది. ఆ వ్రాతలన్నియుం చదువుకొని గోపాలుం డత్యంతసంతోషముతో మణిసిద్ధునొద్దకుబోయి తదీయ జపావహనము వరకు నిరీక్షించి పిమ్మట తాను చూచివచ్చిన విగ్రహపువ్రాతలరీతి నెఱింగింపమని వేడిన నయ్యతిచంద్రుండు తలయూచుచు భోజునానంతర మందొకచో కూర్చుండి తద్వృత్తాంతమంతయు నంతఃకరణగోచరముఁ జేసుకొని యక్కథ నిట్లన చెప్పం దొడగెను.

దేవశర్మ యను బ్రాహ్మణుని కథ

ఆంధ్రదేశంబున మణిభద్రమను నగ్రహారంబున దేవశర్మయను బ్రాహ్మనుడు గలడు. అతండు వేదవేదాగంబుల జదివి గృహస్దోచితక్రియల యథావిధిం గావించినమాన్యులలో నుత్తముఁడని పేరుపొందెను ప్రాయమింత మీరినంత సంతానశూన్యుండగుటచే దేవశర్మ హృదయమున వైరాగ్యంబు దీపింప భాగవతాగ్రేసరుండయి హరిభజనము గావింపుచుండును అతనిభార్య మిత్రవింత యనునది.

క. కై సేసి బిడ్డపాపలతో సందడిలేమి నొడలు దొడలుఁ బిరుదిం
    తేసి కుచంబులు మెఱయం గాసుందరి పోతబొమ్మగతిఁ జూపట్టున్.

ఆ బ్రాహ్మణుం డుదయంబునలేచి ప్రాతఃకృత్యంబులు నిర్వర్తించుకొని గృహారామములోనున్న నూతినీరు రెండు యామముల దనుకఁ జెట్లకు బెట్టుచు బాటసారులకు దాహములిచ్చుచు హరిభక్తి వశంవదహృదయుండయి కుతపకాలంబున నింటికివచ్చి దేవతార్చన గావించి భుజించి వెండియుం దోఁకులబోయి సాయంకాలం వరకు నందుండి వచ్చుచుండును. మిత్రవిందయు నింటిలో మఱియెవ్వరును లేమిం జేసి తానే గృహకృత్యములన్నియుం దీర్చుకొని యలంకరించుకొని వంటజేసి పతి యింటికివచ్చినదోడనే పాదంబులుగడిగి శిరంబునం జల్లుకొనుచు నత్యంతప్రీతితో భోజనము పెట్టి యంపుచుండును. భార్యచేయు నుపచారములకు దేవశర్మ మిక్కిలి సంతసించుచు నామెను బతివ్రతాతిలకముగా దలంచుచుండెను.

ఇట్లుండ నొకనాడు వారింటికి నిరువురు బ్రాహ్మణులు బోజనార్ధ మరుదెంచి తలుపు మూసియుండుటచే వాకిటనుండి తలుపుతీయుడని యరచిరి. ఆ మాట విని యాబోటి వచ్చి తలుపుతీసినది. ఆమెం జూచి అమ్మా! మేము పరదేశులము మా కీపూట నింత యన్నము పెట్టెదవా? యని యడిగిన నేమియు మాటాడక యా బ్రాహ్మణి లోనికింబోయినది. ఆ పారులు దేశద్రిమ్మరులగుటచే నంతటితో బోక వెనుదగిలి లోపలకుబోయి ఏమమ్మా! మాటాడవు నిన్నే యడుగుచున్నారము. పొమ్మంటివా యని యెంత యడగినను మాటాడక వాగింజూడక యొకగదిలోనికిం బోయి తలుపు వైచికొనినది.

అప్పుడా బాడబులా పడతి నతండ వేఱొకలాగునం దలంచుచు నాయిల్లువెడలి యన్నార్థులయి పోవుచు దారిప్రక్కను గిలకలాగుచు నీరు చేదుచున్న దేవశర్మం గాంచి అయ్యా! మేము బ్రాహ్మణులము. అన్నముకొరకీ దాపుననున్న యింటికిం బోయితిమి. ఆ యింటి యిల్లాలు మంచి పుణ్యాత్మురాలు. మాతో లేదనియు నున్నదనియుం జెప్పక తలుపువైచుకొని దాగియున్నది. మేము విటులముకాము మమ్ము జూచి సిగ్గుపడనేలకొ తెలియదని యామె నాక్షేపించుచు మా కీపూటకు భోజనము పెట్టింపగలరా? యని యడిగిరి.

ఆ మాటలువిని దేవశర్మ సిగ్గుపడుచు అయ్యా! మీరమ్మగువను నిందింపకుడు. అది నాభార్య మహాపతివ్రత, నేను లేనిసమయములో నొరులతో మాటాడదు ఇతరులం జూడదు. ఆకథ మీరెరుగక తఱుముకొనిపోతిరి. మీరు విస్సంశయముగా భోజనమునకు రావచ్చును. నిందు స్నానముచేయుడు. కలసి పోవుదము వేళయైనదని పలికినవిని యా బ్రాహ్మణులు అయ్యా! యెరుంగకన్న మాటలు క్షమింపవలయునని యపరాధము చెప్పికొని యందే స్నానసంధ్యావందనాద్యనుష్టానములు తీర్చుకొని యా బ్రాహ్మణునితోఁగూడ వారింటికేగిరి.

మిత్రవిందయు వాడుకప్రకారము పతి కెదురువచ్చి పాదములు గడిగి శిరంబునం జల్లుకొని యడగులొత్తినది. మఱియు భర్తపంక్తిని వారికిఁగూడ మృష్టాన్నములు వడ్డించినది. అతిథులు దేవతార్చననిసి సాలగ్రామతీర్ధము పుచ్చుకొమ్మని యామెకు సంజ్ఞచేయగా నా యువతి నాథా! వీరు నా వ్రతం బెఱుంగక నన్నూరక పల్కరించుచున్నారు. నేను ప్రాణనాథుని పాదతీర్థముతప్ప నితర తీర్థములం బుచ్చుకొనను. ఇతరులం జూడను ఇతరులతో మాటాడదని తెలియజేయుండని పలుకగా వారు వెరగుపడుచు నప్పు డేమియుం బలుకలేక యాపోశనము పట్టి భోజనము సేయందుడంగిరి.

ఆమె వడ్డించునపుడు వారింజూడక పెడమొగముతో వడ్డించెను అది యంతయుఁ జూచి వారిలో సోమభట్టను నాతండు అయ్యా! మేమనేక దేశములు తిరిగితిమి అనేక శాస్త్రములు చదివితిమి. పెక్కండ్రు పతివ్రతలం జూచితిమి. అట్టివారి చరిత్రంబులు వింటిమిగాని యెందునను నీమెవంటి సతీమణిని చూచి యుండలేదు. ఇట్టికథయు వినియుండలేదు. బ్రాహ్మణారాధనము, దేవతారాధనము గూడ బతివ్రతకు నింద్యమని చెప్పుచున్నది.

మేలు మేలు! పుడమిలో నీమె యొక్కరితయే కాబోలు పతివ్రత, ద్రౌపతి, సీత, రుక్మిణి, అనసూయలోనగు వారు బ్రాహ్మణులం బూజింపలేదా దేవపాదతీర్థంబుల స్వీకరింపలేదా? ఇది యపూర్వవ్రతమని యాక్షేపించిన విని దేవశర్మ యిట్లనియె.

అయ్యా! మీకు నమస్కారము. మా తప్పులన్నియు క్షమించి భుజింపుడు. మీరనినమాట యథార్థమే నేనేమి చేయుదును? ఎంతచెప్పినను వినినదికాదు. అరుంధతివోలె ప్రవర్తింపవలయునని యున్నదట పోనిండు. ఎవరివ్రతము వారిది కదా! మనకేమి కొదువయని వినయసంపన్నములగు మాటలచే నతని కోపము చల్లార్చెను.

ఆ బ్రాహ్మణుడు దేవశర్మ వినయసంపత్తిం జూచి యేమియు మాటాడక భుజించిన వెనుక రెండవవానితో రహస్యముగా నిట్లనియె. ఆర్యా! యీయిల్లాలి చర్యలుంజూడ, గడు వింతగా గనంబడుచున్నవి. దీనిఁ గులటలలో మొదటిదానిగా తలంచెదను. దీనిటక్కులన్నియు నాయమాయకపు బ్రాహ్మణుడు నిక్కవములని నమ్ముచున్నాడు. నిజమైన పతివ్రత కిట్టినియమములుండవు. కొన్ని దినంబులిందుండి దీని దుండగములు పట్టుకొని మగనికప్పగించి పోవుదమని చెప్పిన నతండును సమ్మతించెను. అట్లిరువురు నాలోచించుకొని వారింటిలో భుజింపక యాయూఱ వేఱొకచోటవసియించి యా ప్రాంతమందే తిరుగుచు నాయింటిగుట్టంతయు గ్రహించి యొకనాడు జాము ప్రొద్దెక్కిన సమయమున నీరుతోడుచున్న దేవశర్మ యొద్దకుం బోయి అయ్యా! మాకు నాలుక యెండిపోవుచున్నది. దూరము నడచివచ్చితిమి. ఇంతదాహము తెచ్చితివేని బ్రతికిపోదుము ఈ నీరు పనికిరాదు. లోనికిబోయి మజ్జిగ తెచ్చియిండని యత్యాతురతగా ప్రార్ధించిన నతడు అయ్యా! దీనికింతగా వేడవలయునా? ఇదిగో, పోయి తృటిలో పుల్ల మజ్జిగ తెచ్చెదనని చెప్పి యాగిలకం గట్టిపెట్టబోయిన వలదు, వలదు, ఆలస్యమగును మేము పట్టుకొనియెదమని సోమభట్టందుకొని యాగిలక లాగుచుండెను.

అప్పుడు దేవశర్మ వేగముగా నింటికింబోయి తలుపులన్నియు మూయబడి యుండుటజూచి భార్య యింటిలో లేదనుకొని యీవలనుండియే తీయగలిగిన గడియ గల యొక తలుపు త్రోసికొని లోపలకుంబోయెను అట్టిసమయమున వంటయింటిలో మిత్రవింద యొకమూల వంటయగుచుండ నాదండ పెద్దపాలిగాపుతో క్రీడించుచుండెను

వెఱవకుము ఇంకను మీదొరవచ్చువేళ గాలేదు. గిలకచప్పుడు వినంబడుచున్నది. అదికట్టి స్నానము చేయునప్పటికి రెండుగడియలు పట్టును. నేను సమయము చెప్పెదనులే. ఈదినము పరదేశులెవ్వరును రాలేదు మనయదృష్టమే నిన్న నేమిటికి వచ్చితివికావు. మంచికూరలు వండియుంచితినిసుమీ! యని పలుకుచు నా నీచునినో కలసియుండ నాదేవశర్మ కన్నులారఁజూచి మాటలువిని యట్టె నిలువంబడ మ్రాన్పడి హా! పాపాత్మురాలా! యెంతటిదానావే? నీకతంబున పెక్కండ్రు బ్రాహ్మణులకు నపవిత్రాన్నము పెట్టి పాపము మూటగట్టికొంటివని తిట్టుచు సీ! యీ సంసారము నాకేటికని రోసి గిరాలున మరలి యా యిల్లు వెడలి “ఎంతచిత్రము! ఎంతచిత్రము!" అని పలుకుచు మఱియేమియు బలుకక యెచ్చోటికేని బోవుచుండెను.

అట్టిసమయమున నాబ్రాహ్మణు లిరువురు నెదురుగావచ్చి ఏమయ్యా! దాహము తెచ్చి యీయక పోవుచున్నావు. వింతలేమయినం గంటివాయని యడిగిన వారి కేమియు నుత్తరమీయక యెంతచిత్రమను మాటయే రామస్మరణగా నాయూరు విడిచి యొకత్రోవంబడిపోయెను. అట్లు పోయిపోయి సాయంకాలముకొక యూరు చేరెను. అందెవ్వరేని యెరంగినవారు గనంబడి పల్కరించిన నెంత చిత్రమనుమాట తప్ప మఱేమియు నుత్తరమిచ్చుటలేదు. దానంజేసి ఆతనికి వెఱ్ఱియెత్తినదని యూహించి యా యూరి బ్రాహ్మణు లతని బలాత్కారముగా దమయింటికిం దీసికొనిపోయి భోజనము పెట్టుచుందురు.

అట్లుండ దేవశర్మ యొకనాడు రాత్రి గ్రామములో నెచ్చటను బండుకొనక యూరి కనతిదూరములోనున్న శ్మశానవాటిక కవ్వలిభాగమున నొక శూన్యదేవీభవనం బుండుటచే దాని ప్రక్కను బరుండి భగవంతుని ధ్యానింపుచుండెను.

ఇంతలో నొకపురుషుడు చక్కగా నలంకరించుకొని యాగుడిలో ప్రవేశించెను మఱికొంతసేపటికి నొక్క చక్కని చక్కెరబొమ్మ శిరంబున గండదీపము పెట్టుకొని యుపహారము లెన్నియేని దెచ్చి యా గుడిలో దూరి తలుపువైచికొనినది దేవశర్మ యాగోడదాపుననే చీకటిలో బరుండియున్నకతంబున గండదీపముతో చండికాలములో బ్రవేశించిన యా చంచలాక్షింజూచి రూపమున కక్కజమందుచు నా గుడిదెస జెవి యొగ్గి వినుచుండెను. అప్పుడిట్టి సంవాదంబు వినంబడినది.

పురుషుడు ౼ సుందరీ! నీవల్లనాడు సాయంకాలమున జక్కగా నలంకరించుకొని మీ యింటిద్వార దేశంబున నొయ్యారముగా నిలువంబడి యాదారిం బోవుచున్న నన్ను గ్రీగంటిచూపున జూచితివి జ్ఞాపకమున్నదియా?

స్త్రీ -- జ్ఞాపకము లేకేమి? అదియేకదా మనకు బ్రథమావస్థ. అప్పుడే నాడెందము నీయందు లగ్నమైనది.

పురుషుడు - కుసుమచాపుడు నీ చూపులే తూపులుగా జేసి నను గొట్టినందున దగనిబాధం బడితినిగదా?

స్త్రీ - నేనో! అయ్యో అది బాధయో కాధయో చెప్పజాలను. అన్నము రుచింపదు, నిద్రపట్టదు, ఏమియుం దోచదు. ఎద్దియో యనుభూతమగువేదన హృదయంబున బాధింప దొడంగినది. ఒకనా డేదియుం దోచక మా పెరటిలోనున్న కదళీతరుకాండంబులఁ గౌగిలించుకొని నిన్నే ధ్యానించుచుండ నీజోగురాలు ముష్టికై మా యింటికి వచ్చి నన్నుజూచి గ్రహించి మెల్లగా పరితాపకారణంబడిగిన యథార్ధంబు వాక్రుచ్చితిని. ఆ పుణ్యాత్మురాలే నిన్ను వెదకి దీసికొనివచ్చి నా యభీష్టము నెరవేర్చినది. కటకటా! ఇట్టి బాధ శత్రువులకైన రావలదుగా.

పురుషుడు - అగునగు నది మంచిప్రోడయే. ఈ యుపాయము చెప్పినది అదియే నీవార్త నాకెఱింగించిన పిమ్మట మాకు సంఘటన మెట్లని యడిగితిని. అప్పుడది ఈ భూతావేశప్రకటన మంతయు బోధించి నీయొద్దకు వచ్చినది. నీవు మొదట నెట్లభినయించితివో చెప్పుము.

స్త్రీ - నాకు మన్మథభూతం బావేశించియున్నది. కావున స్రుక్కియుంటిని గదా, అది రోగవికార మనుకొని మావారు మందులిప్పించుచుండిరి. నీవాజోగిరాలిచే వార్తనంపిన పిదప నొకనాడు రాత్రి యూరక యేడ్వ మొదలుపెట్టితిని.

పురుషుడు - వనితా! కారణములేక ఏడుపు యెట్లువచ్చినది.

స్త్రీ - మనోహరా! నిన్ను దలంచుకొనినంతనే పొల్లుపొల్లుగా రాదొడంగినది. అట్టియేడుపు విని మావారు వెరచుచు నేముయేమి యని యడిగిరి నేను దలవిరియ బోసికొని వెఱ్రికేకలు వేయదొడంగితిని. అప్పుడు భూతము పట్టినదని నిశ్చయించి మాంత్రికుల రప్పించిరి. వాండ్రు విభూతిమంత్రించి మీదజల్లిన వారిమీద నుమియుచు గీరుచు దిట్టుచు నీరీతి గ్రూరచేష్టలం గావించితిని. ఇది పెనుభూతము, సాధారణముగా వదలునదికాదని మాంత్రికులు పెక్కండ్రు విసిగిపోయిరి.

పురుషుడు - మేలుమేలు! మంచి యభినయమే చూపించితివి తరువాత?

స్త్రీ -- అది మీరు నేర్పినదియేకాదా! పెక్కు లేల? మీరాకవేచి యెన్నితిట్టులో పడితిని ఎన్ని వేషము వేసితిని. మీరును గడుసువారే, భూతవైద్యుండనని వచ్చినప్పుడు మిమ్ము మొదట తిన్నగా జూడక వెనుకటిమాంత్రికులనట్ల యెదిరించితిని. నే నెవ్వండ ననుకొంటివి, తిన్నగా జూడుము. జ్ఞాపకమున్నదా? నీమనోభవభూతము వదల్చువాడ ననువరకు దెలిసికొంటినిసుడీ

పురుషుడు - మనోభవభూతం బను మాటవలన మీవారు గ్రహింపలేదు గదా?

స్త్రీ - ఆ మాత్రమా? నారోగము కుదిరినం జాలునని వేగుర దేవుళ్ళకు మ్రొక్కుచున్నారు అయినను మీరు శ్లేషకవులుగదా!

పురుషుడు - నీతో మీ వారెంతదూరము వచ్చినారు? నేను సాయంకాలమే వచ్చి ఇచ్చట గూర్చుంటిని. నీవాలస్యము చేసితివేమి?

స్త్రీ - అర్దరాత్రంబున జక్కగా నలంకరించుకొని యుపహారములతో గండదీపము నెత్తిపయి పెట్టుకొని యొక్కరితయే యూరిబయటనున్న చండికాలయము లోనికింబోయి యక్షిణికి బలియిమ్మని మీరు చెప్పినదే కాదా? ఆలాగుననే కావించిరి ఇంచుక వ్యతిరేకమయినచో భూతము వదలదని మా వాళ్ళకు భయము, ఇట్లొకనాడే చేయుమని చెప్పితిరేమి? మూడుదినము లయినను జెప్పవలసినది.

పురుషుడు - ఈ మాత్ర మవకాశము దొరికినది. నయముకాదా! ఇంతకన్న నెక్కుడుగా జెప్పిన నమ్మురెరా?

స్త్రీ - అగునగు నామాటయు సత్యమే. ఇదిగో పాపపుకోడి కూయుచున్నది.

పురుషుడు - నిజముగా నది కోడికూతయే అయ్యో! ఎంతలో దెల్లవారినది. అని పలుకుచు దన్ననుసరించియున్న పంచశరుని గృతార్థుం గావించెను.

అవ్వెలదియు దొలిదిక్కు వెలవెల బారుచుండ నఖక్షతంబులం దుడిచికొనుచు వీడిన క్రొమ్ముడి ముడివయిచుకొని కోక బిగియించి రైక గుస్తరించి యొడలు సవరించుకొని తెచ్చినపాత్రంబులు పుచ్చుకొని తలుపులుదీసి నలుమూలలు చూచి తటా లున దాటి యింటికిం బోయినది. వెంటనే యావిటుండును చండీకాలయంబుదాటి యెక్కడికేనిం బోయెను.

వారి మాటలచే దచ్చరిత్రమెల్ల వెల్లడియయినది. కావున దేవశర్మ హృదయంబున నయ్యో! నేనిందెవ్వరు నుండరని యిచ్చటికి వచ్చిన నిందును నాకీ పాపచర్యలు కనంబడెనే.

సీ. అయ్యయ్యో యిది యేమియన్యాయమో కాని
              యలసి నేనేమూల నణగియున్న
    పాపకృత్యములె కన్పట్టుచున్నవి కాని
              సుకృతకార్యం బొండు చూడఁబడదు
    వనితలందునఁ బతివ్రతలు లేనెలేరొ
              లోకమంతయును నిట్లేకసరణి
    నొప్పుచున్నదో లేక యూహించి దైవంబు
             కడంది నాకిటు చూపఁదొడఁగెనొక్కో
గీ. ఇంద్రజాలమొక్కొక్క యిది పురాకృత మహా
    పాతకంబొ యనుచుఁ బరితపించి
    యూరిలోనికరిగి యొక్క దేవాగార
    బాహ్యమంటపమునఁ బండె నతడు.

ఆ దినమున నా యూరిలో నొక బ్రాహ్మణుడు సంతర్పణ చేయుచు మధ్యాహ్నకాలంబున గుడిలొనున్న దేవశర్మను భోజనమునకుఁ దీసికొనిపోయెను. బ్రాహ్మణులు భుజించుచు నిట్లు సంభాషించుకొనిరి.

ఒక బ్రాహ్మణుడు - లోకములో భూతములు లేవందురు. చూచితిరా! ఈ బ్రాహ్మణపుత్రికను బట్టిన భూతమెంతదిట్టమయినదో? మొన్నటివరకు నత్తరుణిని వేపినదిగదా?

మరియొకఁడు - చివర కెవరివలన వదలినది?

మొదటియతఁడు - మొన్నను మంచిమాంత్రికుఁ డొకడువచ్చి కుదిర్చెనట. రాత్రి యాచిన్నది యుపహారంబులం గయికొని చండికాలయములోని కొక్కరితయే పోయి యాభూతమునకు బలి యిచ్చి వచ్చినదట. చిత్రమువింటిరా? తెల్లవారువరకు నాభూత మానాతిని బెక్కుచిక్కులుపెట్టి వదలలేక వదలలేక తెల్లవారుముందర వదలి పోయినదట. అప్పటినుండియు నాచిన్నది చక్కగా మాటాడుచున్నది.

మఱియొకడు - భూతములే లేవని వాదించు వారీకథ వినిన నేమందురో?

మొదటివాడు - మఱియొక దృష్టాంతరము చూడుడు, ఆ చిన్నది యెన్నడును తోడులేక వీథిలోనికి బోవుటకు వెరచునది. మంచి గుణవంతురాలు. దానిని జిన్నతనమునుండియు నేనెఱుంగుదును. భూతశక్తికాక యట్టిభీరువు నిన్నవర్ణ రాత్రంబున గండదీపము నెత్తిమీద నుంచుకొని శ్మశానభూములలోనుండి చండికాలయమునకు బోయి తెల్లవారువరకు నందుండి రాగలదా?

ఇంకొకడు - ఆపిల్ల చాల మంచిదని నేనును వినియున్నాను. భూతోచ్ఛాటన శాంతికొరకే కాబోలు నీసంతర్పణచేయుట.

మొదటివాడు - అవును. రెండునెలలనుండి వెంకటావధానిగారి పుత్రికకు భూతబాధవలన నిద్రాహారములు లేవు. నేడు సంతోషముతో సంతర్పణ యెక్కుడుగా జేయుచున్నాడు . ఒక్క కూతురు గర్భాదానమయి యారునెలలు కాలేదు. అత్తవారింటికయిననుఁ బంపలేదు అట్టిస్థితిలో విచారించుట యబ్బురమా?

మఱియొకడు — ఆమాట యథార్థమగును కాని భుజింపుడు. మాటలానక యాడుకొనవచ్చును. అధిగో నేతిజారీ యిటు వచ్చుచున్నది పిలువుడు.

అని యిట్లు వారాడుకొను మాటలువిని దేవశర్మ యోహో! లోకమంతయు నావలెనే మోసపోవుచున్నదిగదా. యని వెరగుపడుచు నది మొదలు "ఎంతచిత్ర " మనుమాటమాని “ఎంతవిచిత్రము ఎంతవిచిత్రము" అని పలుకజొచ్చెను అతండా యూరిలో కొన్ని దినములుండి యందుండి వేఱొక గ్రామమునకుఁ బోయెను ఆ గ్రామమందొక పశువులశాలలో పరుండియుండగా నంతకుముందు వసించియున్న యిరువురమాటలు వినుటచే నతనికి దెలిసిన విషయమేమనగా -

ఒక దంపతులు స్వదేశమున కరవు పుట్టిన నెక్కడికేనింబోవుచు నొకనాడరణ్యములో నొకచెట్టుక్రింద బసచేసిరట. అంతకుబూర్వమే యాచెట్టు క్రింద కొందఱు బాటసారులు వసియించియుండిరి. ఆ మిథునములో మగవాడు భోజ్యపదార్థముల గూర్చుట కందందు దిరుగుచుండ నతనిభార్య యాబాటసారులలోఁ గాళ్ళుజేతులు లేని యొక యధముని వరించి తన యభిప్రాయము వాని కెఱింగించినదట. ఇంతలో మగడు వచ్చుటయు నెవ్వరును లేనిసమయములో నతని నీరు దెమ్మని యొక నూతి యొద్దకనిపి యతడు నీరుచేదుచుండ వెనువెనుకంజని యతని నూతిలోఁ బడవేసి యావంగుని భుజములమీద నెక్కించుకొని మోచుచు గ్రామములోనికివచ్చి యతండు తనమగండని చెప్పినంజూచి ప్రజలు తదీయ పాతివ్రత్య గౌరవంబునకు మెచ్చుకొనుచు రూకలును గోకలును నిచ్చుచు సత్కరింపుచుండిరి.

ఇట్లుండ నూతిలోఁ బడినవానిని మార్గస్థులు జలముకయి యరిగి పయికిఁ దీసిన నతఁడు భార్యను వెదకికొనుచు దేశాటనము చేయుచు నొకచోట కుంటివానిని మోయుచున్న భార్యను జూచి పల్కరించిన నాబొంకరి యతండే తన కాలుచేతులు నరకినవాడని చెప్పి నమ్మించి రాజుచేత మొదటిమగని శిక్షింపజేసినదట.

ఆవృత్తాంతమే వేడుకగా పాకలోఁబరుండి వాండ్రు చెప్పుకొనుచుండ విని దేవశర్మ యుదయకాలంబున లేచి కాలుచేతులనుండి పురుగులు గారుచుండ గుష్ఠురోగపీడితుండయియున్న కుంటివాని భుజములపయి నెక్కించుకొని యసహ్యమించు కంతయులేక సంతోషముతో మాటలాడుకొనుచు నెక్కడికో పోవుచున్న యాకపట యువతిం గాంచి యేవగించుకొనుచు నతండౌరా! ఇది యంతకన్న విచిత్రముగా నున్నదేయని వెరగుపడుచు నదిమొదలు నంతకన్న విచిత్రము అంతకన్న విచిత్రము అంతకన్న విచిత్రము అని పలుకఁజొచ్చెను.

పాపాత్ములుండిన గ్రామములలో నుండుటయు బాపమేయని దేవశర్మ అందు నిలువక యప్పుడే మఱియొక యూరుచేరి యారాత్రి యెవ్వరింటికిఁబోక యొక గుఱ్ఱముసాల కనంబడిన నందుపరుండెను. అతనికి రాత్రులయందు నిద్రలేదు. కావున కన్నులుమూయకయే లోకవిపరీతములు ద్యానించుచు నిరసించుచున్న సమయంబున నర్థరాత్రంబునం జీకటిలో మబ్బులో మెరయు మెరపుతీగవలె నాభరణ కాంతులచే దళ్కుమని మెరయుచుఁ బంచభక్ష్యపరమాన్నములు గయికొని యొక వాలుగంటి యాసాలలోనికి వచ్చెను. ఆ చిన్నదానింజూచి దేవశర్మ యోహో! నా కన్నులు బాపపుకన్నులుగాబోలు ఎంతమారుమూల బరుండినను నేదో పాపకృత్యము నాకన్నులంబడుచున్నది. ఈచిన్నదియు మునుపటివారి వంటిదేయని తోచుచున్నది. పుణ్యకార్య మొక్కటియుం గనంబడదు. కానిమ్ము ఏమిచేయుదునని తలంచుచున్న సమయంబున నియ్యంబుజాక్షి యందుఁ బరుండియున్న యశ్వరక్షకునొక్కని మెల్లగా పిలిచినది.

వాడు కన్నులు నులిపికొనుచు లేచి రౌద్రాకారముతో నోసీ భ్రష్టుముండా! ఇంత ప్రొద్దు పోగొట్టితివేమిఁ నేనాకలితోఁ గొట్టుకొనుచుంటినే! క్రమముగా నీబుద్ధి చెడిపోవుచున్నది. చక్క చేసెద చూడుమని పలుకుచు నలుకమెయిం జెయి బిగించి మూతిమీద నొకగ్రుద్దు గుద్దెను. ఆవ్రేటుతో నాబోటి నోటిపండ్లు రాలి నేలంబడినవి. ఆనాతి వాని నేరికొనుచు అయ్యో? ఇట్లు కోపము సేయుదువు? నేనేమి సేయుదును. పళ్ళన్నియు రాలంగొట్టితివి. రాజుతో నేమని బొంకుదును? నీకెన్నిసారులు చెప్పినం దెలియదు. రాజును నిద్రబుచ్చి రావలయునా ? నాచిత్త మెప్పుడు నీయందే యుండును అయిన నేమిచేయుదును? మగనాలినగుటచే నాలస్యమయినది. సందుచూచుకొని వచ్చితిని. భక్ష్యములన్నియుం బాఱఁజిమ్మితివి. మంచివి నీకొరకు దెచ్చితిని గుఱ్ఱపు లద్దెలో పడిపోయినవి చూచి తినుము. నీదెబ్బవలన నాకేమియుం గోపములేదు, కాని బోసినోటిమాటలకే వెరచుచున్న దాన. కానిమ్ము. ఎద్దియేని బొంకి యీ నేరము రాజుమీదనే మో పెదనులే! యని వాని బ్రతిమాలుకొని తాను తెచ్చిన పదార్దములన్నియు వానిచే దినిపించి వానితో భోగించి యాకులట యేగినది.

ఆచర్యలన్నియుఁ గన్ను లారచూచి దేవశర్మ ముక్కుపయి వ్రేలిడికొనుచు మఱునాడు ప్రాతఃకాలంబున వీధింబడి పోవుచుండ రాత్రి పట్టపురాజు భార్యతో సరసమాడుచు పరిహాసమునకయి యతికోమలమయిన యామె బుగ్గమీద వ్రేలితో నొక వ్రేటు వేసినంత నయ్యింతి దంతములన్నియు రాలిపోయినవి. అందులకు పుడమి రేఁడు మిక్కిలి చింతించుచున్నాడు. ఆ దంతము లతికినవారికి మంచికానుక లిత్తురోయని చాటింపుచుండిరి.

ఆచాటింపువిని దేవశర్మ యాహాహా! లోకమంతా విచిత్రముగానే యున్నది. అంతా విచిత్రమే! యంతావిచిత్రమేయని యాశ్చర్యసాగరంబున మునుంగుచు నదిమొదలు “అంతా విచిత్రమే అంతా విచిత్రమే అంతా విచిత్రమే యని పలుకుచు నాయూరను వసియింపక యాదివసముననే వేరొక వీటికిఁ బోయెను.

ఆ పట్టణమందు నడివీధిలో నొక దేవాలయమున్నది. దాని యరుగుమీదఁ దఱచు నావీటిలోని బ్రాహ్మణులందరు పనిలేనిసమయమున వచ్చి కూర్చుండి యిష్టాలాపము లాడికొందురు. దేవశర్మ యాయూరు చేరిన నాలుగుదినములకు నొకనాడు కొందఱు బ్రాహ్మణులు చేరి యిట్లు మాటాడుకొనిరి

రామభట్టు - సోమశేఖరా ! వింటివిరా! మనమిదివరకు దైవయత్నము గాడితోనే వేగుచుంటిమి. పులిమీద పుట్రయనినట్లు యిప్పుడు అంతా విచిత్రంగాడొకడు మనయూరు చేరెనట. వానికిగూడ మనము వారములిచ్చి భోజనము పెట్టవలయునట. ప్రొద్దుట సభాపతి బంపిన పత్రిక నీకు జేరినదా?

సోమశేఖరుడు - నేను గ్రామాంతరమునుండి యింతకుమునుపే వచ్చితిని. అందలివిషయము లేమియో నాకు తెలియవు చెప్పుము.

రామ - నాలుగుదినములక్రిందట నంతావిచిత్రంగాడను వెఱ్ఱివాడొకడు మన యూరు వచ్చి దేవాలయములో వసించెను. వాడు దైవాయత్తముగాడివలెనే యెవ్వరితో నేమియు మాటాడడు నాలుగుదినములనుండి తిండిలేక పడియుండుటఁజూచి నిన్నను సభాపతి తన యింటికి దీసికొనిపోయి భోజనము పెట్టించెనట.

సోమ - సభాపతి మంచిపనియే చేసెను. వానికేమి సభాకట్నముల సొమ్ము ప్రోగుపడినదికదా! తరువాత?

రామ — అబ్బో! ఆమాత్రమా! ఒకనాటికే వానిభార్య సాధించెనట. దైవాయత్తంగాడికివలెనే వీనికిని వంతులు వేసికొని భోజనము పెట్టవలయునని యగ్రహార బ్రాహ్మణుల కందఱికిని పత్రికలు బంపినాడు అట్లు సమ్మతింపననిన వానిని వెలివేయించునట

సోమ - సభాపతి యుత్తరువు కఠినముగానే యున్నది. ఈమాటు తగవు రాకమానదు. ఇదివరకు దైవాయత్తముగాడి విషయమై వచ్చిన తగవు విన్నావా?

రామభట్టు - అదేమి? వినలేదు చెప్పుము.

సోమ - అగ్నిభట్టు, వరుణభట్టులు చరస్థిరరూపమైనతమయాస్తి పంచుకొనుచు నాబ్దికముల నగ్నిభట్టు పెట్టుటకును దైవాయత్తంగాడికి భోజనము వరుణభట్టు పెట్టుటకును మొదట నిర్ణయించుకొనిరట. తరువాత వరుణభట్టు పెండ్లాము తద్దినములు ఏడాదికొకమారు వచ్చునే దైవాయత్తంగాడికి వారమునకు రెండు సారులు భోజనము పెట్టవలయు, దీనిలో మాకు నష్టమున్నదని తగవుపెట్టి మొన్నను దైవాయత్తంగాడిని భోజనమునకుఁ బిలువనిచ్చినదికాదు. అందువలన వాని కాదినమున భోజనము లేకపోయినది. ఆసంగతి సభాపతి విని వరుణభట్టును మందలించుచు నింకొకసారి యిట్లు జేసితివేనిఁ గులములో వెలివేయింతునని చెప్పెనట. ఆమాటవిని యతనిపెండ్లాము ఏమైననునరే? మేము వాని కన్నముపెట్టమని చెప్పుచున్నది. మధ్యను వరుణభట్టునకు కంఠముమీదికి వచ్చినది.

రామ - అది కామసోమయాజులు కూతురు బుచ్చివెంకి కాదా. అది ఆలాటిదే. దాని కెవ్వరిభయము లేదు.

సోము --- ఇదివరకే తగవులు పడుచుండ నీయంతా విచిత్రంగాడిని యెట్లు పోషింతురో తెలియదు.

గుణవర్మ --- అంతా విచిత్రంగాడు అనగా మొన్న నీదేవాలయములోనికి వచ్చిన బ్రాహ్మణుడా యేమి? అయ్యో ఆయనది మాణిభద్రాగ్రహారము నేనెఱుంగుదును. మంచి యన్నదాత. పాపము వెర్రియెత్తి తిరుగుచున్నాడు కాబోలు. కటకటా యెంత యవస్థ వచ్చినది మార్తాండా! నీవెఱుంగవురా మనమా వేళను భోజనమునకు వెళ్ళితిమి.

మార్తాండుడు - ఓహో! ఆయనా! ఇంటిదరిని దారిప్రక్కలున్న తోటలో నీరుచేదుచుఁ దెరువరులకు దాహములిచ్చువాడు. ఆయన భార్యయేగాదు పోతబొమ్మ లాగున నున్నది.

గుణవర్మ -- నీచిన్నతనపు మాటలు మానినావుకావుగదా నీకు భోజనము పెట్టినందులకు ఫలమిదియా? భార్యమాట యెందుకు ?

మార్తాండుడు — కాదు కాదు. ఆమె మహాపతివ్రతయనియే చెప్పుచున్నాను. మనతో మాటాడినదా? భోజనము చేయునప్పుడు మన ముఖవైనం జూచినదా? పోలిక చెప్పితిని కాని మఱియొకటికాదు అతండైన మనమందరము భోజనము పెట్టవలసినదే. అంతా విచిత్ర మనుమాట కర్థమేమి?

గుణవర్మ - అతం డంతర్ముఖుడు. ఆయన యుద్దేశ మెవరికి దెలియును?

సోమశేఖరుడు — దైవాయత్తశబ్దమున కేమి యర్ధమున్నదో దీనికి నదియే పిచ్చివాండ్రమాటల కర్థము లేమిటి?

అని యిట్లు వారు కొంతసేపు సంభాషించుకొని యరిగిరి. సభాపతి శాసనప్రకారము దేవశర్మకును ఆయూరి పౌరులు వంతులువేసికొని భోజనము పెట్టుచుండిరి. అంతకుమున్ను కొన్ని నెలల క్రిందట దైవాయత్తము దైవాయత్తమని జపముచేయుచు నేమాటయు మాటాడని యొక పురుషుఁ డాయూరు వచ్చి యుండ నా బ్రాహ్మణు లతనికి వంతులు ప్రకారము భోజనము పెట్టుచుండుటచే నదిమొద లిరువురను నొకదినమే దీసికొనిపోదొడంగిరి. దానంజేసి దేవశర్మకును దైవాయత్తమునకును పరిచయము కలిగియున్నది. కాని యొండొరులు మాటాడుకొనుటలేదు. ఆ యూరి పుడమివేల్పు లొకని దైవాయత్తముగాడనియు మఱియొకరిని నంతావిచిత్రగాడనియు పిలుచుచుందురు.

తరువాత వారిరువురు జనసంఘమున్నచోట నుండక విజనప్రదేశములరసి వసియించువారు, శ్మశానవాటికలు దేవాలయములు చండికాలయములు తోపులు లోనగు తావులకుఁ బోయి రాత్రిబరుండువారు ఆ గ్రామములో వారినందఱు నున్మత్తులని తలంచిరి. దేవశర్మవృత్తాంతము దైవాయుత్తమునకు దైవాయత్తము వృత్తాంతము దేవశర్మకును దెలియదు. వారు జడభరతుడువలె నెవ్వరేపని చెప్పినను జేయుటయేకాని యిట్టట్టని చెప్పువారుకారు. ఏదిపెట్టినను భుజింతురు వారొకనాడు రాత్రి ఒకదేవాలయములో పరుండియుండగాఁ కొంచెము ప్రొద్దుపోయిన తరువాతను మబ్బుపట్టి -

సీ. వినవెఱ్ఱిఱంకు గుబ్బెతలతప్పులు దప్ప
              దాచుటకిది కన్నతల్లి యిల్లు
    కడుపు కక్కురితి పిల్పుడు గనుముదిలంజె
              వఱడులకిది పిన్న వయసుమందు
    గడికన్నగాండ్ర యక్కఱలకు నిలుచూచి
              పొరువుసొమ్మిడనిది పూట కాపు
    కలవర్తకులకన్ను గవలబాయనినిద్ర
             గదలింపనిది నిమ్మకాయపులుసు
గీ. ప్రభకు, బాపన కుముదినీ పత్రనేత్ర
    రంజనంబున కిది సిద్థాంజనంబు
    నా ఘనాఘన కాళిమోన్నతివహించి
    కటిక చీకటి జగమెల్ల గప్పికొనియె.

అట్లు జగంబంతయు నంధకారమయంబై మిన్ను మన్ను కానబడని సమయంబున నాకోవెల యావరణలోని కెవ్వరో యిరువురువచ్చి యిట్లు మాటలాడిరి.

పురుషుడు - కాంతా! నీవు చీటిలో వ్రాసినదంతయు బూటకమనుకొనియెదను మూడుసారులు నాకు సాంకేతములు చెప్పి వచ్చితివికావే. అంత ప్రీతి స్వాంతమునుండిన నేల రాకయుందువు.

స్త్రీ - ఆయ్యో! నేను పడిన పాటులు నీకేమియెఱుక మొదటిమాటు వాటముఁ జూచుకొని యా తోటలోని పాడుచావడిలోనికిఁబోయి తడిమికొనుచు నొకమూల బండియున్న యొకలింగని నీవనుకొని మెల్లగా లేపితిని. వాడు దైవాయత్తమని పలుకుచు లేచెను. అప్పుడు నేను భయపడుచు వేరొక మూలకుబోయి యడంగి యుండి వాడు తిరుగా నిద్రపోయిన తరువాత లేచి నలుమూలలు వెదకిన మఱియొక మూల మనుష్యునిజాడఁ దోచుటయు నాదాపునకుఁబోయి పిలిచిన నంతా విచిత్ర మనుచు వాడు లేచెను. అప్పుడు దైవాయత్తమనచు నంతా విచిత్రమనుచు వారు జపముచేయ మొదలుపెట్టిరి. అట్టిస్థితిలో నేనం దెట్లుందును.

పురుషుడు - అన్నా మంచి సమయము మిగిలిపోయెనే. అయ్యో! మనపాలిటి యమదూతలవలె నాపాపాత్ములెక్కడ ప్రోగుపడిరి. తరువాత?

స్త్రీ - తరువాత నేమియున్నది? ఇంటికిబోయి యేడ్చుచు మంచముపైపరుండి నిద్రబోయితిని. తెల్లవారకమునుపే మునింగిపోయినట్లు నామగడింటికివచ్చెను.

పురుషుడు - అంతవేగముగా రానేమి పని యున్నది? ఏమి చేసితివి? ఏమి చేసితివి?

స్త్రీ - మఱియేమియులేదు. ఆ వెఱ్రివెధవలకు నాదినమున మా యింటిలోవారము. అందుమూలమున వచ్చెను. లేకున్న నాలుగు దినములవరకు రాకపోవును.

పురుషుడు -- అదియు మనకు ముప్పైనదే పోనీ అమ్మవారి గుడిలోని కేమిటికి వచ్చితివికావు?

స్త్రీ -- రాకపోలేదు. వచ్చితిని. అచ్చటను ఆ దుర్మార్గులే యున్నారు పూర్వం వలెనే జరిగినది.

పురుషుడు - అయ్యో! యిదియేమిపాపము మన సాంకేతికముల గ్రహించలేదుకదా. వీళ్ళపని పట్టెదనుండు. తరువాత మూడవమాటు పాడుగోడలలోనికో?

స్త్రీ - నీతో జెప్పిన నవ్వెదవు నేనతిప్రయత్నము మీద నా మొండిగోడ యెక్కి క్రింది నేమియున్నదో చూడక తటాలున దుమికితిని ఆగోడ క్రిందనే అంతావిచిత్రంగాడు పరుండియుండెను. కావున నాకాలువానికాలిమీద బడినది. అప్పుడు దద్దరిల్లుచు లేచి అంతావిచిత్రమోయని యరచెను ఆయరపు విని దైవాయత్తంగా డవ్వలినుండి దైవాయత్తమో అని కేకవైచెను ఆ కేకలతో చుట్టుపట్లవాళ్ళులేచి అది యేమియోయని యచ్చటికివచ్చిరి ఆ సందడిలో దప్పించుకొని యింటిలో బడుటకు నాకు దుర్ఘటమైనది సంవత్సరమునుండి ప్రయత్నములు చేయగా మూడు సమయములు దొరికినవి. అవి మూడు నా మూడులు ముక్కలు చేసినారు. అప్పుడొక్క మాటైన నీజాడ గనంబడినది కాదేమి?

పురుషుడు - ఏమని చెప్పుదును. నేను మూడుసారులును నీవు వ్రాసిన వేళకే బయలుదేరితిని. కాని మొదటిమాటు పిల్లి, రెండవమాటు ఒంటి బ్రాహ్మణుడు. తరువాత తుమ్ము. ఈ యపశకునము లగుటయు వెనుకకు మరలుచు గొంతసేపుండి బయలుదేరగా నెవ్వడో యడ్డమువచ్చి మాట్లాడుట, పిలుచుట, ఈలాటి విఘ్నములు తటస్థించినవి ఇంతలో గాలము మిగిలిపోయినది నేను మూడుసారులు వచ్చితిని. కాని వేకువవేళ యగుటచే నేజాడయు గానబడక మరలిపోయితిని. ఇంతకు ఆనీచు లిద్దరే మససుఖము చెరిపిరి వారి తాళము రేపు పట్టెదను. చూడుము. వాళ్ళడ్డము రాకున్న నేను వచ్చువరకు నీపు నిల్చియుందువుగదా?

స్త్రీ --- ఇక దాచనేల? నేనే వారిపని పట్టవలయునని తలంచితిని. కాని సాగినదికాదు. నాకు వాళ్ళ పై మహాకోపము వచ్చినది.

పురుషుడు - కోపమువచ్చిన నేమిచేసితివి.

స్త్రీ -- మొన్న మాయింటిలో వాళ్ళకు వారము గనుక అన్నములో విషము కలిపి వడ్డించితిని.

పురుషుడు - మంచిపని చేసితివి శబాసు. తరువాత?

స్త్రీ - దైవము వాళ్ళయందే యుండెను. వడ్డించే యాపోశనము పట్టుడని చెప్పితిని. అంతలో నెక్కడినుండి వచ్చెనో మాయకుక్క మూడు గుమ్మములు దాటి వచ్చి వారివిస్తళ్ళు ముట్టుకొని పోయినది. అదిచూచి నామగడతి ఛాందసుడు గనుక నేను వచ్చినది కాని ముట్టలేదని చెప్పినను వినక యావిస్తళ్ళెత్తించి పారవేయించి మరల వడ్డించి పెట్టించెను. తెచ్చిన విషమయిపోయినందున దిరుగా పెట్టుటకు వీలు లేకపోయినది. లేకుంటే బాబు లీపాటికి స్వర్గములో నుందురు.

పురుషుడు - అయితే దీరిపోవును. కానిమ్ము వారిగుఱించి రేపాలోచింతము కాని యిప్పుడు ప్రొద్దుపోయినది. మాటలతోడనే కాలదహణమగుచున్నది. ఏ యంతరాయమువచ్చునో?

స్త్రీ - ఆవల నెవ్వరో యున్నట్లున్నది చూడుము.

పురుషుడు - (చూచివచ్చి) అయ్యో? ఆ ముండాకొడుకులే యిక్కడ బరుండి యున్నట్లున్నది. వాండ్రుగాక యీ పెంటలో శయనించే వారెవ్వరు?

స్త్రీ - బాబో ! మస మాటలు వినుచుండలేదుగదా? మేల్కొని యున్నారేమో చూచితివా?

పురుషుడు — తెలియదు. కదలుచునే యున్నారు. వినినను ఆ యున్మత్తులేమి చేయగలరు?

స్త్రీ - ఆలాగున ననగూడదు.చూచిరా. అని పలుకునంతలో నా మాటలన్నియు వారిరువురు వినుచుండిరి కావున దేవశర్మ అంతా మహావిచిత్రము అంతా మహావిచిత్ర మనియు దైవాయత్తము దైవాయత్తమనియు మూడేసిమార్లు పఠించి యూరకొనిరి. అదివిని యమ్ముదితయు నప్పురుషుండును తోకత్రెంపిన పెట్టవలె మాఱుమాటాడక జడుపుతో చెరియొకదారిం బారిపోయిరి.

అదిమొదలు దేవశర్మ అంతా విచిత్రమని పఠింపదొడగెను. మఱియు నా ఊరిలో స్వైరుణులు కొందరికి వారియునికి బరువై యా విషయ మొకనాడు నీలాటిరేవులో నాడుకొనగా విని యాపురుషులిరువురు నొకనా డెవ్వరికి దెలియకుండ నర్ధరాత్రంబున బయలువెడలి యొక యరణ్యమార్గంబున బోయిపోయి నాలుగు దినములకు సానుమంతమను నగరంబు చేరిరి.

అని యెఱిగించువరకు గాలము మిగులుటయు నప్పటికాకథ చెప్పుట చాలించి మణిసిద్దుడు తరువాత ప్రదేశమున దదనంతర వృత్తాంత మిట్లని చెప్పదొడంగెను.

ఇరువది తొమ్మిదవ మజిలీ

గోపా! వినుమా సానుమంత నగరంబునందు గొన్నిదినంబుల క్రిందట నెవ్వరి కెవ్వరును లేరు నెవ్వరి కెవ్వరును లేరని పలుకుచు నున్మత్తుడొకండు