Jump to content

కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/29వ మజిలీ

వికీసోర్స్ నుండి

పురుషుడు - మంచిపని చేసితివి శబాసు. తరువాత?

స్త్రీ - దైవము వాళ్ళయందే యుండెను. వడ్డించే యాపోశనము పట్టుడని చెప్పితిని. అంతలో నెక్కడినుండి వచ్చెనో మాయకుక్క మూడు గుమ్మములు దాటి వచ్చి వారివిస్తళ్ళు ముట్టుకొని పోయినది. అదిచూచి నామగడతి ఛాందసుడు గనుక నేను వచ్చినది కాని ముట్టలేదని చెప్పినను వినక యావిస్తళ్ళెత్తించి పారవేయించి మరల వడ్డించి పెట్టించెను. తెచ్చిన విషమయిపోయినందున దిరుగా పెట్టుటకు వీలు లేకపోయినది. లేకుంటే బాబు లీపాటికి స్వర్గములో నుందురు.

పురుషుడు - అయితే దీరిపోవును. కానిమ్ము వారిగుఱించి రేపాలోచింతము కాని యిప్పుడు ప్రొద్దుపోయినది. మాటలతోడనే కాలదహణమగుచున్నది. ఏ యంతరాయమువచ్చునో?

స్త్రీ - ఆవల నెవ్వరో యున్నట్లున్నది చూడుము.

పురుషుడు - (చూచివచ్చి) అయ్యో? ఆ ముండాకొడుకులే యిక్కడ బరుండి యున్నట్లున్నది. వాండ్రుగాక యీ పెంటలో శయనించే వారెవ్వరు?

స్త్రీ - బాబో ! మస మాటలు వినుచుండలేదుగదా? మేల్కొని యున్నారేమో చూచితివా?

పురుషుడు — తెలియదు. కదలుచునే యున్నారు. వినినను ఆ యున్మత్తులేమి చేయగలరు?

స్త్రీ - ఆలాగున ననగూడదు.చూచిరా. అని పలుకునంతలో నా మాటలన్నియు వారిరువురు వినుచుండిరి కావున దేవశర్మ అంతా మహావిచిత్రము అంతా మహావిచిత్ర మనియు దైవాయత్తము దైవాయత్తమనియు మూడేసిమార్లు పఠించి యూరకొనిరి. అదివిని యమ్ముదితయు నప్పురుషుండును తోకత్రెంపిన పెట్టవలె మాఱుమాటాడక జడుపుతో చెరియొకదారిం బారిపోయిరి.

అదిమొదలు దేవశర్మ అంతా విచిత్రమని పఠింపదొడగెను. మఱియు నా ఊరిలో స్వైరుణులు కొందరికి వారియునికి బరువై యా విషయ మొకనాడు నీలాటిరేవులో నాడుకొనగా విని యాపురుషులిరువురు నొకనా డెవ్వరికి దెలియకుండ నర్ధరాత్రంబున బయలువెడలి యొక యరణ్యమార్గంబున బోయిపోయి నాలుగు దినములకు సానుమంతమను నగరంబు చేరిరి.

అని యెఱిగించువరకు గాలము మిగులుటయు నప్పటికాకథ చెప్పుట చాలించి మణిసిద్దుడు తరువాత ప్రదేశమున దదనంతర వృత్తాంత మిట్లని చెప్పదొడంగెను.

ఇరువది తొమ్మిదవ మజిలీ

గోపా! వినుమా సానుమంత నగరంబునందు గొన్నిదినంబుల క్రిందట నెవ్వరి కెవ్వరును లేరు నెవ్వరి కెవ్వరును లేరని పలుకుచు నున్మత్తుడొకండు వచ్చియుండెను. అతనిని బిచ్చవానిగాదలంచి యన్నగరవాసులైన బాలకులు మూగికొని యెవ్వరికెవ్వరును లేనివాడని వెక్కిరింపుచుందురు.

అతండు తరచు విజనస్థలములయందు వసించుచు నెవ్వరేని తెచ్చియిచ్చిన యాహారపదార్థముల భుజించి యాకలి యడంచుకొనుచుండును. దేవశర్మయు దైవాయత్తము నాయూరుచేరిన రెండుదినములకే యాతని నొక దేవాలయములో గలిసికొనిరి. మువ్వురిచర్యలు నొకరీతిగా నుండుటచే జంటగా నాముగ్గురు నొక్క చోటనే వసించుచుందురు వారి సహవాస వరిచయములు చూచి యా పట్టణ ప్రజలు గుంపులు గుంపులుగాబోయి పల్కరించుచుండ నొకడు దైవాయత్తమనియు, నొకడంతా మహావిచిత్రమనియు నొకడెవ్వరి కెవ్వరును లేరనియు పల్కు చుండ నవివేకులు పిచ్చివాండ్రనియు, వివేకులు సుజ్ఞానులనియు తలంచుచుండిరి. వారెవ్వరితో నేమాటయు మాటాడక యొండొరులు సైతము పల్కరించుకొనక యొకడు వోయినట్టుగా తక్కిన యిరువురు బోవుచు జంట విడువక యొకచోటనే వసించుచుందురు.

మాలతి కథ

వారు మువ్వురు నొకనాఁడొక దేవాలయములో శయనించి యుండగా నర్థరాత్రంబున పదియారేడుల యీడుగల యొకచక్కని జేడియం దీసికొనివచ్చి యొక దంపతులు పురోహితునితోఁ గూడ నాగుడిలో నలుమూలలు వెదకి యొకచోటఁ బరుండియున్న దైవాయత్తమును లేపి కూర్చుండబెట్టి నమంత్రకముగా నతని శిరంబున జలంబులు ప్రోక్షించి పీటలపై నతనిపజ్జ నజ్జవరాలిం గూర్చుండబెట్టిరి.

పిమ్మట నాపురోహితుడు మెల్లగా పాణిగ్రహణ మంత్రంబులు జదువుచు నావధూవరుల నూత్నాంబరాభరణములచే నలంకరింప జేసి దైవాయత్తము చేతులు పట్టుకొని యా నారీరత్నము కంఠంబున మంగళసూత్రంబు గట్టించెను. తరువాత నా దంపతులు చెరియొకరిచేతను తలంబ్రాలు పోయించిరి.

అట్లు ప్రచ్ఛన్నవివాహముచేసి యా దంపతు లాదైవాయత్తమున కెన్ని యేని యాహారపదార్ధములిచ్చి యచ్చేడియం దీసికొని పురోహితునితోఁగూడ తెల్లవారకమున్ను తమ నెలవులకుఁ బోయిరి.

మఱునాడుదయమున నూతనవస్త్రాలంకార చందన భూషితుండై యున్న దైవాయత్తమును జూచి పౌరులు మిక్కిలి వెరగుపడజొచ్చిరి. దైవాయత్త మాదినంబున దమ్ముఁ గుడువ బిలిచిన బ్రాహ్మణునికి తన యొడలియున్న విలువగలతొడవులన్నియు నిచ్చివేసెను. మఱియు నద్దినంబున సాయంకాలమున దైవాయత్తము మనంబున నెద్దియో తలంపు బొడమినంత నయ్యూరు విడిచి యుత్తరాబిముఖుడై యెచ్చటికో పోదొడంగిన నతనితోడనే బయలువెడలి తక్కిన యిరువురు నడువఁ దొడంగిరి. అట్లు రెండుక్రోశములు దూరముపోవువరకు నొక మహారణ్యము పొడచూపినది.

పట్టపగలయినను వెఱపుగొలిపెడు యక్కాంతతారమున చీకటిపడుచున్నదను భయమింతయుఁ బూనక వారు కొంతదూరము వెడలినంత నాప్రాంతమందు విశాలమగు మఱ్ఱిచెట్టొకటి గనంబడినది.

అది భూనభోంతరాళములను శాఖోపశాఖలచే వ్యాపించి బ్రహ్మాండంబు నాక్రమింప విజృంభించి వింధ్యాద్రివోలె ననంతమై మొదలుకన్న లావుగలిగిన యూడలు వేనవేలు బలీయఁ బ్రతాంతరిత ఫలికాండంబు లరుణకనీలిక ప్రకారంబు సూచింప సహస్ర పద్మాక్షుండైన విశ్వరూపు ననుకరించి యొప్పుచుండెను.

ఖరకర భయంబున వెఱచివచ్చి తన్ను శరణుజొచ్చిన చీకటుల కభయ మిచ్చి రక్షించుచున్నట్లు, తదంతరముల మిట్టమధ్యాహ్నముసైత మంధకార మాశ్రయించి యుండును. లక్షలకొలది జను లొండొరులకు దెలియకుండ దాగి యుండవచ్చును. తస్కరులు గ్రామములు దోచికొనివచ్చి స్తేయంబులు దానిక్రింద విస్రబ్దముగా పంచుకొనుచుందురు. భూతభేతాళములందు నిరంతము నాట్యమాడు చుండును. క్రూరసత్వంబుల కాచెట్టునీడ యాలపట్టు పతంగసంతతికి నిశాంతము క్రూరవ్యాళములకు విహారభూమియై యొప్పుచున్న యావృక్షమునుజూచి యవ్విరాగులు నలువురును వెరపులేని వారగుటచే నది తమకు నివసింప నుచితప్రదేశమని తలంచుచు నూడలూతగాబూని కొమ్మలపై కెక్కి విశాలముగానున్న తచ్చాఖాంతరంబులఁ దలయొకచోటను బండుకొని యచ్చటివిశేషముల చూచుచుండిరి.

అంతలో నిరువురు తస్కరులొక బంగారుగంపను మోసికొని వచ్చి యాచెట్టుక్రింద దింపి యొండొరులిట్లు సంభాషించుకొనిరి.

స్థూలజంఘుడు - అయోముఖా ! ఈ చిన్నది నిద్రబోవుచున్నదా యేమి? ఎంత కుదిపినను లేవకున్నది. ఎత్తునుండి విసురుగా బడుటచే నలసట జెందియున్నదని తలంచెదను.

అయోముఖుడు -- కావచ్చును. కాని దీని రూపము చిరుతతనము సూచించు చున్నది. నేను భార్యలేనివాడనుగదా. తొడవులన్నియు మీరు దీసికొని దీని నాపాలిగా విడువుడు

స్థూలజంఘుడు - ఇప్పుడు నేనేమి చెప్పుదును. శంబరాక్షునభిప్రాయ మెద్దియో తెలియదు. మనయిరువురను వెలుపల నిలువబెట్టి వాడు కోటలోనికింబోయి దీని గంపలోనిడి దిగవిడిచెనుగదా మఱియేమి తేబోయెనో తెలియదు. వానిమాట గైకొనకయే మన మీమూట తీసికొని వచ్చితిమి. దీనిమాట పిమ్మట విమర్శింతము వాడింకను రాకున్నవాడు దీనినీతొఱ్ఱలోనిడి యచ్చటికిపోవుదము రమ్ము.

అయోము - దీనికి తెలివివచ్చిన పాఱిపోగలదు. నేనిందుండెదను. నీవు పోయి చూచిరమ్ము.

స్థూల — అబ్బో! నీయభిప్రాయము నాకు తెలియును. నిన్ను విడిచి నే నొక్కరుండ పోవను. పోయిన నిరువురము పోవుదమురమ్ము.

అయో - నేను రాజాలను. పోయిన నీవు బొమ్ము. మన యిరువురమాట యెప్పుడు కలిసినది, నీకంటె శంబరార్థుడే మంచివాడు అసలిబ్బిసరుహాక్షిని నాకొరకే తెచ్చెనని తలంచెదను.

స్థూలజంఘుడు - అట్లయిన లెస్సయేగదా. వాడువచ్చిన తరువాత నీయిష్టము కొలది కావించుకొందము. కాని యిప్పుడు వానిజాడ దెలిసికొనవలయును. "వాడు చిక్కెనేని యెక్కుడు ప్రమాదము రాగలదు."

అయో - స్థూలజంఘా! ఒకసారి యాపెట్టెమూత తెరవుము. అత్తెరవ ముద్దుమొగ మిందాక తొందరగా చూచితిని. తాటంకరత్నరుచులచే మెరయుచున్న చక్కనిచెక్కు లొక్కసారి ముద్దుబెట్టుకొనియెదను.

స్థూల - ఇది యుమ్మడి సొమ్ము. ఒక్కరుడు ముట్టగూడదు. వాడు వచ్చువరకు నేపనియు చేయనీయను. నీకు గోపము వచ్చినను సరియే.

అయో - వాడందు జచ్చిన నేమిచేయుదువు?

స్థూల - ఛీ! ఛీ! పాడుకూతలు కూయకుడు. వాడు చచ్చిన నీవా బ్రతుకు వాడవు.

అయో - లేకున్న మఱియేమి, నేను విరహార్తుండనై వేగుచుండ బానకములో పుల్ల లాగున నడ్డము సెప్పెదవేల దీని నీ పెండ్లాములాగునే చూచుకొనుచుంటివే. నాకును మూడవవంతు అధికారము గలిగియున్నది. కావలసిన నీవును మఱియొకసారి ముద్దుపెట్టుకొనుము.

స్థూల --- ఆమాటలేమియు నాచెవినసోకవు. శంబరాక్షుడు జాగుచేసినందులకు నామది కొట్టుకొనుచున్నది అకథ విచారింపుము

అయో - వాడీగంపను దీసికొనిపొండని మనతో చెప్పెనా యేమి ఇంత గండవు వాని యానతిలేక దీనినేమిటికి తీసికొనివచ్చితివి? దీని వాడు దింపెనో మఱి యొకడు దింపెనో యెవ్వరికిఁ దెలియును.

స్థూ - అగునగు నామాట సత్యమే తొందరపడియే వచ్చితిమి అదిగో సవారీ మూలుగు వినంబడుచున్నది, పరికింపుము. ఎవరైన నిచ్చటికి వచ్చు చున్నారేమో.

అయో - (చెట్టుకొమ్మలెక్కి.) నీపనియైనదిలే యిక దీని నానుకొమ్ము. అదిగో వేయికాగడలతో మహారాజుగారిట్లు వచ్చుచున్నారు. మన శంబరాక్షుడు పట్టుపడి మనవృత్తాంతము సెప్పగా మనలను బట్టుకొనుటకే వచ్చుచున్నట్లు తలంచెదను. నీపుట్టిమునిగినట్లు దాని మొగమైనం జూడనిచ్చితివి కావుగదా ఇక పాఱిపోవుదము లెమ్ము.

అని పలికికొనుచు వారిరువురు నాపుణక నొక తొఱ్ఱలో నునిచి యెక్కడికేని బారిపోయిరి. ఇంతలో వేనవేలు కొఱవిదెయ్యములు ఓంకారధ్వనులు సేయుచు దోడరా భైరవునితో వేడుక మాటలాడుకొనుచు బిశాచవాహితమైన శవాందోళిక మెక్కి అచ్చటికి వచ్చి పరచారిక విరచితమైన శల్యసింహాసనమున గూర్చుండి యిట్లు సంభాషించెను.

భూతరాజు - బైరవా! మనము దేశాటనము సేయ మొదలుపెట్టి సంవత్సరమైనది. పెక్కు శ్మశానములు ననేక గుహాంతరములు వేనవేలు కాంతారములు సూచితిమి. కాని యిట్టి మనోహరప్రదేశ మెందును జూచియుండలేదుగదా.

బైరవుడు - కాబట్టియే భేతాళు డీచెట్టు నునికిపట్టు జేసికొని విడువకున్నాడు. ఇది దేవర చెప్పినట్లుగా భూతభేతాళపిశాచాదులకు విశ్రమింప నుచిత్రప్రదేశమై యున్నది.

భూతరాజు - ఓహో భేతాళుని యునికిపట్టిదియేనా? అతండెందున్నవాడు మన కెదురుగా రాలేదేమి మనరాక అతనికిం దెలిసినదా?

భైరవుడు - నేను మహాశ్మశానమునుండియే వానికి నుత్తరము నంపితిని. అందినట్లు తిరిగి యుత్తరము సైతము వ్రాసియున్నాడు. ఆతం డేమిటికి రాలేదో తెలియదు.

భూతరాజు - ఏది యతండు వ్రాసిన యుత్తరము విప్పి చదువుము.

భైరవుడు - చిత్తము చిత్తము. అని యుత్తరము చదువుచున్నాడు. సకల భూతభేతాళపిశాచనిశాచర శిరోమణికిరణ నిరాజిత చరణయుగళుండైన భూతమహారాజుగారి చరణంబులకు వందనం బొనరించి సేవకుడు భేతాళుడు వ్రాసికొను విజ్ఞాపనపత్రిక. దేవరవారు అమాత్యబైరవునిచేత వ్రాయించిపంపిన యాజ్ఞాపత్రికంచదువుకొని పరమానందకందళిత హృదయారవిందుడనైతిని. అస్మన్నివాసమైన వటమహీరుహంబునకు దేవరవారు దయచేయుదివసంబునకు ప్రాయములో నున్న పెండ్లికాని క్షత్రియకన్యక కుత్తుక నులిమిన పచ్చినెత్తురుచే గాళికాశక్తిం దృప్తిపఱుపదలంచి యట్టి యువతిం దెచ్చి సిద్ధముగా నుంచవలయునని వ్రాయించితిరి? ఆ ప్రకారము గావించి దేవర యనుగ్రహమునకు బాత్రుడ నగుదునని విజ్ఞాపన జేయుచున్నవాడ. ఇట్లు తమ పాదసేవకుడైన భేతాళుడు.

భూతరాజు - (ఆయుత్తరము విని) ఓహో! దీనివలన దదీయభక్తివిశ్వాసములు తెల్లమగుచున్నవే. ఇట్టి యుత్తరము వ్రాసి యతం డేమిటికి నిలిచి ఉండలేదో తెలిసికొనుము.

భైరవుడు - చిత్తము చిత్తము, పలలప్రియా! యెందుంటివి. యిటురమ్ము.

పలలప్రియుడు - (ప్రవేశించి) దేవా! ఆజ్ఞయేమి? స్వామివారి పాదముల గనిపెట్టి యిందే యుంటిని

భైరవుడు - మనము భేతాళుని నివాసమునకు వచ్చితిమి. అతనిజాడ ఏమి యుం గనబడలేదు. ఉపహారము లేమియు సమకూరినట్లు తెలియదు. నీవు విమర్శించి యతని పరిచారకులెందై ననుండిరేమో తీసికొనిరమ్ము.

పలల ప్రియుడు--చిత్తము చిత్తము అని నలుమూలలు తిరుగుచు రౌద్రాకారముతో ఏమి యీభేతాళుని గర్వము పిశాచసార్వభౌముండువచ్చియుండ నెందు బోయెను. తనకింతన్న నావశ్యకమైన పని ఏమివచ్చినది. ఏడాది కొకసారి వచ్చెడు ప్రభువును సత్కరింపవలదా మంచివాడైన యెకిమీనియానతి ప్రణిధులు మన్నింపరను సామెత నిక్కువవయ్యేనే. కనంబడనీ యేమి చేయించెదనో, భేతాళదూత లెందున్నవారిని పెద్దయెలుంగున బిలుచుచుండ నొకదండనుండి యిరువురువన్చి దేవా యిదిగో మేమిప్పుడే వచ్చి యున్నామని చెప్పిరి.

పలల ప్రియుడు – మీ రెవ్వరు.

తామ్రకేశుడు - మేము భేతాళుని మంత్రులము. నా పేరు తామ్రకేశుడు వీని పేరు తుందిలోదరుండును.

పలలప్రియుడు - ఓహో! మీస్వామి యెందువోయెను. వానికింత కావరమేల వచ్చినది. భూతసార్వభౌముని యాజ్ఞప్రభావముల నెఱుంగడాయేమి.

తుదింలోదరుడు - మీస్వామి యట్టివాడు కాడు. కారణమును విని తరువాత నిందింపుడు.

పలల ప్రియుడు - అది యెద్దియో ప్రభువుగారి యెదుటనే చెప్పుదురుగాని రండని వారింగెంటుకొనిపోయి దేవా! ఇదిగో యిప్పటికి భేతాళుని దూతలు కన్నులు దెరచివచ్చిరి. ఎద్దియో చెప్పుచున్నారు వినుడు.

భూతరాజు - మీరు భేతాళుని మంత్రులా? ఆంతడెందువోయెను మారాక విని యున్నవాడా?

తామ్రకేశుడు - దేవా! వినుండు. భేతాళుండు పరాధీనుండై స్వామికార్య మెట్లు చక్కబెట్టగలడు అతండు విక్రమార్కమహారాజుగారివలన దపంబున స్వాధీనపెట్టుకొనబడినవాడని దేవర యెరింగియే యుందురు.

భూతరాజు - అవును ఆ మాట వెనుక మాతో నొకప్పు డతండు విజ్ఞాపన చేసికొనియెను. తరువాత?

తామ్రకేశుడు — అమ్మహారాజు తలంచినప్పు డతం డరుగకతీరదు.

భూతరాజు - అగు నామాటయు మేమువినియుంటిమి. పిమ్మట.

తామ్రకేశుడు - ఇప్పుడు నృపసార్వభౌముండైన భూపాలదేవచక్రవర్తిగారి మంత్రియైన విజయవర్ధనుడు తమక్రింద సామంతరాజులపాలనాప్రకారము లెట్లున్నవో విమర్శించుటకయి దేశయాత్ర చేయుచు నీనడుమ నజ్జయినికి వచ్చుచున్నామని విక్రమార్కునికి యుత్తరము వ్రాసిరట.

భూతరాజు -- చక్రవర్తులకు సామంతరాజుల పాలనా ప్రవృత్తుల దెలిసికొనుట యావశ్యకమయియున్నది. తరువాత?

తామ్రకేశుడు - ఆయుత్తరము చూచుకొని విక్రమాదిత్యు డెక్కుడుగా నా మంత్రికి విందులు సేయదలచి మిక్కిలి వ్యవధియుండగానే యాసన్నాహమంతయు చేయుటకు భేతాళుని దలంచుకొనియెను.

భూతరాజు - అదియుం నుచితముగానే యున్నది పిమ్మట?

తామ్రకేశుడు - అతండు వెళ్ళినప్పుడు మీరాక దలంచుకొని మిక్కిలి దుఃఖించుచు జేయునది యేమియును లేక కొంతసేపు ధ్యానించి మీరు కొన్ని దినము లరిగిన వెనుక నుజ్జయినికి రండని మాకును జెప్పి తానరిగెను.

భూతరాజు - పరాయత్తుం డేమిసేయగలడు. వాని లోపమేమియును లేదు. తరువాత-

తామ్ర - మేమతని యానతిరీతి నా ప్రోలికిఁ బోయితిమి. అప్పుడతం డందు విజయవర్దనునకు సత్కారము లపూర్వములుగా గావింపుచున్నాడు ఒక్కొక్కనాడు చేయు మహోత్సవములు రెండవనాడు జేయకుండ నారునెలలు జరుపవలయునట. అప్పుడతనికి మాతో మాటాడుటకే యవకాశము దొరికినదికాదు. స్వామికార్యము నందలి భక్తిచే నెట్టకేలకు దెరపిచేసికొని మాకు కొన్ని రహస్యము లుపదేశించి యంపెను.

భూత -- వానిని మాకుఁ జెప్పవచ్చునా?

తామ్ర - దేవరకుఁ జెప్పని రసాస్యము లున్నవియా? వినుడు.

ఇచ్చట కనతిదూరములో సానుమంతమను నగరమున్నది. ఆ ప్రోలు మందపాలుండను భూపాలుండు పాలించుచున్న వాడు. అతనికి మాలతి యనుకూతురు గలదు. సురగరుడోరగగంధర్వకిన్నరకులంబులలో నంతసోయగము గల కలకంఠి పుట్టియుండలేదు. మందపాలు డక్కన్యారత్నము నిప్పు డింద్రదత్తుడను నృపపుత్రున కిచ్చి వివాహముసేయ నిశ్చయించి యున్నవాడు. ఆ వివాహదివసంబును దేవర వచ్చు దివసంబు నొక్కటియే యగుటచే నావధూరత్నమును గౌరీపూజకు కూర్చుండబెట్టిన సమయంబున శాంబరి మో'హితఁ జేసి తీసికొనిబోయి దేవర కర్పింపుడని కొన్ని మంత్రము లుపదేశించి యంపెను. ఇదియే యతండు మాకుఁ జెప్పిన రహస్యము.

భూత - మంచి యుపదేశము గావించెను. భేతాళునివంటి విశ్వాసముగల బంటు మఱియొకడులేడు తరువాత మీరేమి చేసితిరి.

తామ్ర - మేమిరువురము నేటియుదయమున నారాజుగారి యంతఃపురములో ప్రవేశించి యందలి రహస్యములన్నియు గ్రహించి ముహూర్తకాలము ప్రతీక్షించి యుంటిమి. ఇంతలో నారాజపుత్రికను జక్కగా నలంకరించి గౌరీపూజ చేయింప గనకలతికలచే నల్లబడిన గంపలో కూర్చుండబెట్టి పరిచారిక లిటునటు దిరుగుచున్న సమయములో నే నాచిన్నదానిపయి మత్తుమందు జల్లి గంపతోగూడ నాపల్లవపాణి నెత్తుకొనిపోయి కోటమాటున నొకచోట నునిచి తుందరిలోదరుఁ డనుకొనినయట్లు చేయుచున్నాడో లేదోయని విమర్శించుటయు వెండియు లోనికిఁ బోయితిని.

భూత - సాధు, తామ్రకేశ, సాధు మంచి యుపకారము జేసితివి. మొదట తుందిలోదరున కేమని యుపదేశించితివి.

తామ్ర - మాలతీరూపముతో కూర్చుండుమని చెప్పితిని. అతండు మదుక్తప్రకారము గూర్చుండి వారు చేయుమనినట్లు చేయుచు వివాహానంతరమున గదిలోనికి బోయెసు. అంతవరకు నేను దాపుననుండి కాపాడుచుంటిని. పిమ్మట నాకోట దాటి మునుపటిచోటున నా చిన్నదానింగానక చింతించుచు నలుమూలలు వెదకివేసరితిని. ఎందును నాసుందరి జాడ గనంబడినదికాదు. అదిలేచి పారిపోయినదనుకొందమన్నను సూర్యోదయమయిన తరువాతగాని నానాతికిఁ దెలివిరాదు. అది దేవమాయయని నిశ్చయించి విచారముతో వచ్చిచుండ నీచెట్టు దాపుననే తుందిలోదరుడు నన్ను గలసి కొనియెను.

భూత - అయ్యో! యెంతమందమతివైతివి ? దానిం దీసికొనివచ్చి యిందుంచి పోయిన నేకొరంతయు లేకపోవునుగదా? తుందిలోదరుడు లోపల నేమిచేసెను. మాలతికథ యెఱుగునేమో యడుగుము.

తామ్ర - ఇదివరకే యడిగితిని. అతండు గదిలో ప్రవేశించి తన్ను పరిహాసమాడవచ్చిన యింద్రదత్తుని మేనిపయిని నఖదంతక్షతంబు బెక్కుడుగా నాటించిన వెరచుచు నతండు దయ్యము దయ్యమోయని యరవబోయిన నోరుమూసి మెదలకుండ పట్టుకొనియెత్తి యొక మహారణ్యమధ్యంబున బారవయిచెనట. మాలతిజాడ యేమియు నెఱుంగనని చెప్పినాడు. స్వామీ! మీయానతి గావింపమికి యీ నికృష్టుల యపరాధముల సయించి మన్నింప వేడుకొనుచున్నారము. దేవయానతి యేమియని పాదంబులం బడినంత భూతరాజు వారి నుపేక్షాభావంబునం జూచుచు నిలువుడు. మీ మాట తరువాత విమర్శింతుమని పలుకుచున్నంతలో తెల్లవారుసమయమగుచుండఁ జూచి యాతండు బలముతోగూడ నటకదలి వేరొక నివాసమున కరిగెను

అంతలో సూర్యోదయమయినది. రాత్రిజరిగిన చర్యలన్నియు వారు మువ్వురు చెట్టుకొమ్మల పయినుండి చూచుచుండిరి. కావుస బ్రొద్దుపొడిచిన కొంత సేపటికి నమ్ముద్దియకు దెలివివచ్చి తొఱ్ఱలోనుండి కదలలేక మొఱ్ఱపెట్టినంతనే యా మువ్వురును బోయి మెల్లగా నామగువను గంపతో నేలకు దింపిరి.

అప్పుడాచిన్నది వారినిజూచి మీరెవ్వరు? నన్నిచ్చటికినేమిటికి దీసికొని వచ్చితిరని యడిగిన నొకండు దైవాయత్తమనియు నొకండు అంతా మహాచిత్రమనియు నొకండెవ్వరికెవ్వరులేరనియు నుత్తరమిచ్చిరి.

ఆమాటలువిని అబ్బోటి అయ్యో! యిది స్వప్నమాయేమి? నిన్నటిరాత్రి మా యింటిలో మావారు నన్ను గౌరీపూజచేయుటకయి యీగంపలో కూర్చుండబెట్టిరే. నన్ను వీరెట్లు దీసికొనివచ్చిరి. నాకు నిద్రపట్టినదా యేమి తరువాత నేమి జరిగినదో నాకించుకయు జ్ఞాపకములేదు. పెండ్లికి విఘ్నము వచ్చినదికాబోలు. నన్ను వీరు ముగ్గురు దీసికొనివచ్చి విరాగపుమాటలు చెప్పుచున్నా రేమి దీనికెద్దియేని కారణముండకపోదని తలంచుచున్న సమయంబున గొందఱు రాజభటు లాయడవియంతయు వెదకికొనుచు నచ్చోటికి వచ్చి యచ్చిగురుబోణింగాంచి యత్యంత సంతోషముతో నిట్లనిరి.

రాజపుత్రీ! నీ విచ్చటి కెట్లువచ్చితివి. ఈ కొమ్మలసందున డాగియున్న వీండ్రెవ్వరు? మిమ్ముంగానక మీ తల్లిదండ్రులు మిక్కిలి పరితపించుచున్నారని అడిగిన వారితో మిమ్మని బహువనముతో మాటాడుచున్నారు. నేనుగాక మఱియొకరు గానంబడలేదాయేమి ? అనిపలికిన నక్కలికి కాకింకరు లిట్లనిరి.

అయ్యో నీ వెఱుగవుకాబోలు రాత్రి వివాహానంతరముస నిన్నును నీభర్తను గదిలోనికనిపి తలుపులు మూసిరిగదా. వేకువజామున దలుపులు తీసియుండుటజూచి నీసఖురాండ్రు తొందరపడుచు లోపలకుబోయి యందు మీయిరువురంగానక వేగము పోయి నీతల్లికిం జెప్పిరి. అమె పతితోవచ్చి మిమ్ముగానక పెక్కుగతుల బరితపించుచు నలుమూలలకు దూతలబుచ్చెను. మేమీ వటవృక్షము చోరులకు విహారదేశమని యెఱింగినవారమగుటచే నిచ్చటికి వచ్చితిమి. దైవవశంబున నీవిందు గనంబడితివి. నీభర్త యెందున్నవాడని చెప్పిన ముప్పిరికొను విస్మయముతో నప్పడంతి వారికిట్లనియె.

దూతలారా! మీమాటలు విపరీతముగా దోచుచున్న యవి నాకు వివాహ మెప్పు డయినది? గౌరీపూజ సేయకపూర్వమే యేమిటికో స్మృతి తప్పిపోయినది. నేను పతి మొగము చూచియే యెఱుంగను పతితో గదిలోనికి బోవుటెట్లు? అని చెప్పుచున్న సమయంబున నా వృత్తాంతము దెలిసి యక్కలికి తలిదండ్రు లచ్చోటికివచ్చి పుత్రికంజూచి కౌగిలించుకొనుచు పెద్దతడవుగారవించిన తరువాత దదాగమన వృత్తాంత మడుగుటయు వారి కవ్వారిజాక్షి యిట్లనియె.

నేను గౌరీపూజ జేయుటకయి గంపలో గూర్చుండినది యెరుంగుదును. పిమ్మట నేమిజరిగినదో నాకుందెలియదు. నేటి ఉదయంబున నాగంపతోకూడ నీవృక్ష కోటరమున నుండగా దెలివివచ్చినది. ఈ మువ్వురు నాప్రాంతమందుండుటచే నందుండి కదలలేక వీరిం జీరినవారు నన్నుదింపిరి పిమ్మట నేనువారిని మీరెవ్వరని యున్న నేమిటికిచ్చటికి దీసికొనివచ్చితిరని అడిగిననొకండంతా మహావిచిత్రమనియు నొకండు దైవాయత్తమనియు వేరొకం డెవ్వరి కెవ్వరును లేరనియు నుత్తరమిచ్చిరి. వారిమాటలు నాయవస్థ కనుకూలించి యున్నవని తలచుచున్నంతలో నీదూత లిచ్చోటికి వచ్చిరి. ఇదియే నేనెఱింగినకధ. వీరు చెప్పినమాటలచే నాకు మఱియొక విస్మయముకలిగినది. నాకు వివాహమైనట్లును పెనిమిటితో గదిలోనికి బోయినతరువాత వేకువజామున మేము గనంబడినట్లును మీరు చెప్పుచున్నారు. అది యెంతసత్యమో మీరే యాలోచించుకొనుడని పలికినది.

అబ్బోటిమాటలువిని వారును వెఱగుపడుచు పుత్రీ! ఈ చరిత్రయంతయు పిమ్మట విమర్శింతుముగాక. ఈ మువ్వురును మనయూరిలో వెఱ్ఱివాండ్రవలె సంచరించుచుండ నెల్లరును నిజమనుకొనుచుండిరి. నేటితో వీరిచేష్టలు స్పష్టపడినవి. తరుచు తస్కరులీరీతినే యున్మత్తులవలె గ్రామములో దిరుగుచు బ్రజలగుట్టు దెలిసినపిమ్మట సొమ్ములు దోచికొనిపోవుచుందురు. వీండ్రు గజదొంగలు. పెండ్లి సందడిలోనుండ నెట్లో కోటలో ప్రవేశించి మిమ్ములను మోసపుచ్చి తీసికొనివచ్చిరి. నీభర్తనెందో దాచియుంచినారని తలంచెదను. వీరిచేతనే నిజము చెప్పించెద చూడుమని కోపోద్దీపితుండయి పండ్లు పటపట గొఱుకుచు వీండ్రమువ్వురను ఱెక్కలు విరచికట్టి కశలతో బాదుచు వీటిలోనికిం దీసికొనిరండని కింకరులకాజ్ఞయిచ్చి మందపాలుండప్పుడే పుత్రికందీసికొని పరివారములో కూడ కోటలోనికిం బోయెను.

ఆభటులు శమనభటులట్ల చదులవాగార్భరుల దర్జించుచు పిడచేతులగట్టి యమ్మువ్వురను బగులగొట్టుచు క్రమంబున బట్టణపువీధులన్నియుద్రిప్పి ప్రజలుగుంపులుగావచ్చిచూచి యాశ్చర్యపడుచుండ రాజసభకు తీసికొనిపోయిఱేని మ్రోలనిలువం బెట్టిరి.

అప్పుడు రాజు మీరు నిజముచెప్పుడు విడిపింతును. ఇంద్రదత్తు నేమిచేసితిరి. మాలతినెట్లు తీసికొనిపోయిరని యెన్నివిధముల నడిగినను తర్జించినను భర్జించినను వారు పలికెడుమాటయే తప్ప మరేమియుంజెప్పరైరి దానంగోపించి మందపాలుడు వాని కారాగారంబున నుంపనియమించి యంతఃపురమున కరిగెను.

శుద్ధాంతకాంత లక్కాంతామణి వృత్తాంతమంతయువిని యొకరీతిం బలుకం జొచ్చిరి. వారిమాటలు తనకు మిక్కిలి విరుద్దముగా దోచినంత మాలతి మరియొకనాడు సఖులతో నిట్లు సంభాషించినది.

మాలతి - కలభాషిణి! నాకు వివాహమైనట్లును ప్రియునితో గేళీగృహంబున కరిగినట్లు మీరును చెప్పుచున్నారేమి ? మీకు మతిచెడినదా? లేక పరిహాసకల్పితమా?

కల - నీ వట్లనిన మే మేమని చెప్పుదుము. నీచేతులు పట్టుకొని యింద్రదత్తు శిరంబున ముత్తెపు తలంబ్రాలు వోయించిన దానను నేనుగాదా ?

మాలతి - రామరామ ఎంతయబద్ద మాడుచున్న దానవు నేను నిద్రపోవుచుండ నాచేత బోయించితివా యేమి?

కల - నీమాట వింతగా నున్నది. నీవప్పుడు వారచూపులచే బ్రియునిం జూచుచు మందహాసము సేయలేదా? జ్ఞాపకము దెచ్చికొనుము. అదియొకటేల కేళీ గృహంబునంగావించిన కృత్యంబులు పెక్కు లున్నవి. వానినన్నింటిని మరచిపోయితివా యేమి?

మాలతి -- వానిలో కొన్నింటి చెప్పుము .

కల - నీవు ప్రియుని చిటికెనంబట్టుకొని కేళిగృహంబున కరుగునప్పుడీ 'లలిత ' పరిహాసమాడ ద్వారమూతబూని లోపలకు బోవకున్న మేము చేతులవిదళించి పంపినకధ మరచితివా?

మాలతి - చక్కగా బొంకుచున్నావు. మఱియొకటి జెప్పుము.

కల - తల్పంబునల గూర్చుండినప్పుడు నీమేనంతయు నతండ గందమలంది స్తనములకు రాచినప్పుడు నీవేమిచేసితివో చెప్పుము.

మాలతి - కల్పనాశక్తి నీకు మిక్కుటముగా నున్నది. అదియు నీవే చెప్పుము .

కల - పోనీ నామాటలన్నియును నీకబద్దములుగా దోచుచున్నవి. ఈమధుర వాణి నడిగిచూడుము.

మాల - మథురవాణి! అప్పుడేమి జరిగినది?

మథు - అందులకు నీవు సిగ్గుపడుచుండ నీ లలిత యతనిచేయిబట్టుకొని మా సమక్షమున నీవిట్టిపని జేయకూడదు. మాచెలి సిగ్గుపడుచున్నది. ఆగందము దుడిచి వేయుమని చెప్పిన పురుషరత్నము తెప్పున నట్లు తుడిచన విషయము నేనెఱుంగుదును.

మాల - నీవును గలభాషిణియు మాటలాడికొనిరా యేమి?

మథు - సఖీ! మామాటలసత్యములా? మరియు దాంబూలచర్వణమునందేమి జరిగినదో యీకేసరిక నడిగి తెలిసికొనుము.

మాలతి - కేసరికా! నీ యుపన్యాసముకూడ వినిపింపుము.

కేసరిక - నీవెవ్వరిమాటల నమ్ముకున్న నేమిచేయుదుము. నేను కాదాకప్పురపువీడెము నీచేతను సగము కొరికించి యతనినోట నుంపించితిని. అతనిమొగముపై బన్నీరుజల్లినమాటయు నీకు జ్ఞాపకములేదా?

మాలతి - అయ్యయ్యో? మీరందరు నామీద లేనిపోనిమాటలు మోపుచున్నారేమి. ఇది మాయవలెనున్నది. మీరు చెప్పిన పనులొక్కటియు నేనెఱుంగను. నేను గంపలో గూర్చుండినపుడు చరగొనిపోయినట్లు గంపతో నేనందుండుటయే నిదర్శనముకాదా.

సకురాండ్రు -- అగునగు నామాట విమర్శింపదగినదే ఇప్పుడాయన ఎందున్నవారు ?

మరియొకతె - జామాతృవియోగ చింతాసంతాపిత స్వాంతుండయి కాంతామణితో నేకాంతముగా నంతఃపురమున మంతనము సేయుచున్నవారు.

మాలతి - పెండ్లికాని జామాతగురించి చింతయేమిటికి మీరు పడిన వెఱ్రి యభిప్రాయమే వారిని బాధించుచున్నది కాబోలును. మనమచ్చటికి బోవుదమురండు. అని సఖులతో నిష్క్రమించుచున్నది.

మాలతి సఖులతోఁగూడ తల్లిదండ్రులయొద్దకుబోయి వారితో తమ సంవాద ప్రకారమంతయు చెప్పినవిని మందసౌలుడు సత్కరముగా పుత్రీ! అగునగు ఇందు వైపరీత్య మైదటుల కనంబడుచున్నది. గంపలోనుండుటజూడ వివాహకృత్య మసత్యమైనటుల గనంబడుచున్నది. మాచేతులార కన్యాదానంబు గావించి యది యసత్యమని మేమెట్లు తలంతుము, ఈమాయను దెలిసికొన దుర్ఘటముగా నున్న యది. ఇంతయు నామువ్వురివలనం గలిగినది. వారినెంత దండించినను నిజముచెప్పకున్నవారలు. ఇంక వారి నురిదీయుటకాజ్ఞయిచ్చుచున్న వాడను. పిమ్మట విచారించుకొనెదముగాక యని పలికిన నక్కలికి యిట్లనియె.

తండ్రీ! వాండ్రు తస్కరులని తో చదు. అంతర్ముఖులవలె గనంబడుచున్నవారట. మనదూతలు వచ్చులోపల తరుకోటరమునుండి నేను మొఱ్లిన నన్ను బుడమికి దింపిరి. ఇంతకన్న మఱేమియుం జేయలేదు. క్రూరులయినచో నూరకుందురాయనుడు నయ్యెడయుండు వీండ్రు నన్ను తీసికొనిపోవుటకు కారణ మున్నది. మొన్నరాత్రి నిన్ను వీరిలో నెవ్వరికో కపటవివాహము గావించితిమి. ఆతగులము మనంబునం గలిగి వీరు నినుదీసికొనిపోయిరని తలంచెదనని పలికిన యచ్చిలుకలకొల్కి యులికిపడుచు నృపతి కిట్లనియె.

ఏమీ! నాకుఁ గపటవివాహము గావించితిరా? కపటవివాహమననేమి? పెండ్లి కాకమున్ను గూఢముగా దేవతాసపర్య చేయవలయునని చెప్పి చీకటిలో గుడికి తీసుకొనిపోయి చేసినదియా ? అటులఁ జేయుటకు కారణమేమన యా నరపతి యిట్లనియె.

అమ్మా! నీవుపుట్టిన కొన్ని దినంబులకు త్రికాలవేదియగు దైవజ్ఞుండొకడు వచ్చిన నతనినర్చించి నీజాతకపత్రికంజూపి భావిఫలస్థితి జెప్పుడని నేనడిగితిని. ఆతండది విమర్శించి విదేశీయుండగుటచే తనభాషతో నేదియోవ్రాసి యప్పత్రిక నిచ్చి యడిగెను. ఆభాష తెలిసితెలియని యొక బ్రాహ్మణునిచే చదివింప నీచిన్నదానికి పెండ్లి దినముననే మగడు చచ్చు ననియు రెండవవివాహము జరుగుననియు నందు సార్వభౌముడు పతియగుననియుఁ దెలియవచ్చినది.

ఆమాటనమ్మి భవదీయవైధవ్యము సైరింపక మొన్న నీకు ముందుగా నట్లు కపటవివాహము గావించితిమి. అదియట్లుండె. నిన్నటిదినం బీవిషయము విమర్శించి మరియొక బ్రాహ్మణుం డాపత్రికం జదివి మొదట జదివినవాని కాభాష లెస్సగాఁ దెలియకపోవుటచే నట్లు చెప్పెననియు దైవజ్ఞుడీ ముదితకు మొదటి వివాహభర్తయే చక్రవర్తి యగుననియు రెండవసారి పెండ్లియాడఁ ప్రయత్నించినవాడు పరలోక గతుఁడగుననియు వ్రాసియున్నాడని చెప్పెను.

రెండును బూటకములే యయినవి వెర్రివాడు చక్రవర్తి యెట్లగును? దైవజ్ఞులమాట నమ్మదగినదా! ఇప్పు డేమి చేయుటకుఁ దోచకున్నదని పలుకుటయు నక్కుటిలాలక యిట్లనియె.

అయ్యయ్యో! తండ్రి యైహికసుఖంబుల కాసపడి చెడుకృత్యంబులు చేయ దొడంగవచ్చునా? ప్రజల ధర్మాధర్మంబులరసి పాలించెడు రాజే యధమకార్యంబులం కావింపఁ గాదనువారెవ్వరు? స్త్రీలకు పునర్వివాహము శాస్త్రసమ్మతమైనదా? ఇట్టి యాచారమెందైన గలదా? సరివారువినిన నెంత యాక్షేపింతురు. నేనల్ల నాటి రాత్రి చర్యలేమియో యనుకొంటొని గాని యిట్లని దెలిసినచో బరమేశ్వరుడు వరించిన సమ్మతింతునా? ఎంత ! ప్రమాదము దాటినది. దైవమే నాకీయుపకృతి కావించెను. ఇక చాలు నామువ్వురిలో నన్నెవ్వనికిచ్చి పెండ్లి చేసితివో చెప్పుము. వానినే చక్రవర్తిగా భావించుకొనెదను. అతండే నా జీవితేశ్వరుడు. చక్రవర్తులుమాత్రము మెల్లకాల మీపుడమి స్థిరులయియుందురా యేమి? నాలుగుదినములు నెట్లనో కాలక్షేపము జేసికొనిపోవుట కింతయేల? అని యాక్షేపించు పుత్రికమాటలు విని యాధాత్రీపతి సిగ్గుపడుచు నొక్కొండ ధ్యానించుచు నిట్లనియె.

అమ్మా ! నీవన్నమాటట యదార్థము. నా బుద్దియే ప్రమాదము నొందినది' గతమునకు వగచినం బ్రయోజనము లేదుకదా? రాత్రి చీకటిలో లేపుటచే నా మువ్వురిలో నెవ్వరికిచ్చితినో గుఱుతుబట్టజాలను అప్పుడట్టి యవసరము లేకపోయినది. ఆనిడ్కువమిప్పుడు వారిని రప్పించి వారివలననే దెలిసికొనియెదనని పలుకుచు చెరసాలనుండి సగౌరవముగా వారిని రావించి జాంబూనదాంబరాభరణాదు లొసంగి యల్లన నిట్లనియె.

ఆర్యులారా! మీశాంతస్వభావములఁ దెలిసికొనలేక నిష్కారణముగా మిమ్ము బాధించిన నాయపరాధము సైచి మన్నింపవేడెద మొన్నటిరాత్రి దేవాలయములో మీలో నొకనికి నాపుత్రికను వివాహము గావించితిని కావున నతండెవ్వడో తెలుపవలయును. నాకూతురాతనినే జీవిత నిబంధమునిగా జేసికొని పరిచర్యఁ గావింపఁగలదని నుడివిన వాండ్రు వాడుకమాటలుదప్ప మరేమియుఁ బ్రత్యుత్తర మీయరయిరి.

తరువాత నాక్షితిపతి చతురోపాయంబుల వారిం దర్కించెను గాలి ప్రయోజనమేమియు లేకపోయినది దాన విసిగి యమ్మానపతి వారినప్పుడే విడచుటయు నందు నిలువక వారెందేనిం బోయిరి పిమ్మట నమ్మాలతియు నయ్యో! ఇదియేమి కర్మము. ఇప్పుడేమి చేయుదాన స్త్రీలకు పతియేదైవము. పతితోడిదె గతి. పతి యెవ్వడో తెలియక యతం డడవులపాలయి గ్రుమ్మరుచుండ నింటికడ దివ్య భోగంబులందుట నాతికి నీతియా? సీత దమయంతి లోనగుసతులు సుఖంబుల విడిచి కష్టంబుల లెక్కగొనక పతులవెంట నడవులఁ గ్రుమ్మరలేదా? వారికన్న నేనెక్కుడు దాననా? నేనును ఆయున్మత్తులవెంట గ్రుమ్మరుచుండ నెప్పటికయిన నాగళంబున మంగళసూత్రంబుఁ గట్టినయతండు దెలియబడకుండునా? అదియె కర్జంబని నిశ్చయించి హృదయంబున వైరాగ్యంబు దీపింప తల్లి దండ్రులమాటల పాటింపక, బంధువుల నుడుపుల లెక్క గొనక యొక్కదివసంబున మణిభూషణాంబరముల విడనాడి నారచీర ధరియించి విరాగిణి యనుపేరు పెట్టుకొని రహస్యముగా పురము వెడలి వారిజాడ లరయుచు దేశాటనము జేయఁ దొడంగినది.

అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు నాటికక్కథం జాలించి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంతంబు తరువాత మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.

ముప్పదవ మజిలీ

మాలతి కథ

వత్సా! వినమట్లు మాలతీలలనభోగంబులు స్వప్నోపగముల మాడ్కి యనిత్యంబులని నిరసించి కాషాయవస్త్రధారిణియయి యరుగుచు నొకనాఁడొక యరణ్యంబులో నెదురుపడినయొక బ్రాహ్మణునకు నమస్కరించుచు నయ్యా! మీరు తరచు దేశాటనము జేయువారువలె గనబడుచున్నారు. మీకెందయిన మువ్వురు వెఱ్ఱివారలు కనంబడిరాయని యడిగిన నప్పారుఁడు స్మృతినభినయించుచు నిట్లనియె.

కాంతా! ఈ ప్రాంతమందలి గ్రామములో నధికారులచే నాటంకబెట్టబడి యెవ్యరో మువ్వురుండుటమాత్రము జూచితిని. వారు మందపాల మహారాజుగారి యంతఃపురద్రోహముచేసి చెరసాలలో పెట్టబడి తప్పించుకొని పారిపోయినారట. వారిం బట్టుకొని యా గ్రామాధికారు లావార్త ఱేనికనిపినారట. వాండ్రను వెర్రివారని కొందఱును కారని కొందఱును నిరూపించుచున్నారు. నీవడిగినవారు వారేమయి యుండవచ్చును. వారు నీకేమి కావలయును? నీవిట్టి ప్రాయంబున గాషాయవస్త్రంబులం ధరించి యొంటియయి నడవుల గ్రుమ్మరుచుండనేల? నీరూపము త్రిలోకమోహనజనకమయి యున్నదే యని యడిగిన నప్పడతి యిట్లనియె.

ఆర్యా! నేనొక జోగురాలను, శిష్యురాలనగుటచే వారియవసరము కావలసి వచ్చినది. అంతకన్న మరేమియులేదని పలికి యక్కలకి యావిప్రుని ననుమతిం బడసి వడిగా నడచుచు నాటి సాయంకాలమున కాగ్రామముచేరి వారిం గలిసికొనినది. అప్పుడు వారొక చావడిలో బడవేయబడి యున్నారు. కావున నాపువ్వుబోణి వారి యవస్థకు మిక్కిలి పరితపించుచు నతిదీనములగు విలోకనములచే వారిమొగములు పరీక్షించుచు దాపున నిలువంబడియే యారాత్రి యెట్టకేల వేగించినది.

తమ్మెంత దైన్యముగా చూచినను యాచించినను యా చిగురుబోణితో వారేమియు మాటాడినవారుకారు వారిం గాచియున్న తలవరులు మరునాఁ డుదయ కాలంబున నధికారులయొద్దకుంబోయి అయ్యా! రాత్రి నాపిచ్చివాండ్రదాపున కొక తొయ్యలి వచ్చినది. ఏమి రహస్యముల మాటలాడికొనిరో తెలియదు. ఇంతదనుక నందేయున్నది. మీరువచ్చి చూడుడని చెప్పిన వారప్పు డక్కడకుఁజని యవ్వనితం గాంచి వెఱగుపడుచు పడుచా! నీ వేమిటికయి యిచ్చటికి వచ్చితివి? వీండ్రు నీ కాప్తులా ? నిజము చెప్పుమని యడిగిన నబ్ఫోటి యేమాటయుం జెప్పక తలవాల్చు కొన్నది.