Jump to content

కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/27వ మజిలీ

వికీసోర్స్ నుండి

చెప్పి యతనిమతి సంతోషపెట్ట యాదినంబున నా గ్రామంబున నివసించిరి. అని యెఱింగించి యప్పటికి వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుఁడు తదనంతర వృత్తాంతము దరువాయి మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.

ఇరువదియేడవ మజిలీ

గోపా! వినుమట్లన్నదమ్ములిద్దఱు సంభాషించుకొని మరునాడుదయంబున నయ్యూరువెడలి స్వదేశగమనోన్ముఖులై యరుగుచు నొకనాడు రాత్రికి భీమవర్మ పాలించెడి విజయపురంబున కరిగిరి.

అందు విజయునిచే స్థాపింపబడిన సత్రమునకు జని యీసత్రమెవ్వరిదని సత్రాధికారినడిగిరి వారు విజయుడను మహానుభావుడి సత్రమును గట్టించెననిచెప్పిరి. ఆతం డిప్పు డెందున్నవాడనని యడిగిన వారు స్వర్గమున సుఖముగా గూర్చుండిఉన్నారని యుత్తరమిచ్చిరి.

ఆ మాటలువిని విజయుడు తమ్మునితో రహస్యముగా దానచ్చట గావించిన కృత్యములన్నియు జెప్పి నలుమూలల దిరుగుచుండ నందొకచో నొక శిలాశాసనము కనంబడినది. అందు నతిపుణ్యాత్ముండైన విజయుండను ప్రధాని యీ సత్రమును గట్టించెను. అమ్మహానుభావుం డొకప్పుడు స్వదేశమునకు బోవుచు మార్గములో నకాలమృత్యువుచేత గబళింపబడియెను. ఆచంద్రసూర్యస్థాయియై యతని పేరిందు మూలమున భూతలంబున స్థిరంబై యుండుగాక. అని యున్న యక్షరంబులం జదువుకొని భీమవర్మనృపాలునికి దనయందుగల ప్రీతివిశ్వాసములకు మిక్కిలి సంతసించుచు మఱియు నచ్చటయున్న విశేషములన్నియుం జూచుచు లోనికిబోయిరి. వారి కందొక గదిలో మందధ్వనితో నిట్టి సంభాషణ విననయ్యె.

రాముడు -- అన్నా! వారికి మన యిద్దఱియందు మొదటినుండియు నసూయయే సుమీ. నేనీ కాంతతోనుండుట యిష్టములేక యెన్నియో జెప్పెను. మనలను నమ్మి తలిదండ్రులను విడచి కష్టములకోర్చి వచ్చిన ప్రియురాలిని విడుచుట నీతి యేమో నీవు చెప్పుము. అదియునుంగాక తాను పట్టుబడి యెంతబాధపెట్టినను నిజము చెప్పినదా? అది యొక్కటి చాలదా.

భానుడు - కాదా! తన్నాశ్రయించినవా రెట్టివారయినను విడువగూడదని నీతి కూడ నున్నది. మంచిపనియే చేసితివి. యెవ్వరి ప్రీతి యెవ్వరికి దెలియును.

రాముడు - పోనీ! తాను నాకు బెండ్లి చేసెదనన్న యువతి మాత్రము మంచిదియా? తన భార్య యొద్ద పనిచేయునదియట. వారిద్దరికీ మేమిద్దరము దాసులమై యుందుమనియే వానియభిప్రాయము.

భానుడు - వాని భార్యను నీవు చూచితివా? ఏ మాత్రపు చక్కనిది?

రాముడు - ఇంతయెర్రగా బొర్రగానుండగానే సరియా యేమి? ఏమో నా కంత రుచింపలేదు. నాకు రుచిరయే బాగున్నది. అయినను నేనంత తిన్నగా జూడలేదు.

భానుడు - వీణెమీటి రప్పింపక లేకపోయినావు?

రాముడు - అనేకపాటులు పడినాను. ఆవీణెమెట్లు సవరించుటయే దెలిసినది కాదు.

భానుడు - అవీణె యేమిచేసితివి?

రాముడు - దారిలో బత్తెములేక యొక బ్రాహ్మణున కమ్మినాను. దానివలన తవ్వెడు బియ్యము వచ్చినవి.

భానుడు - అయ్యో! ఎంతపని చేసితివి. ఆ బ్రాహ్మణుడెవ్వడో జ్ఞాపకమున్నదా?

రాముడు - ఆయన యొకమార్గస్థుడు, నివాసస్థలము దెలియదు. దారిలో దారసిల్లి తవ్వెడు బియ్యమునకు దుకాణముమీద బేరము జరుగుచుండగా దాననియిచ్చి పుచ్చుకొనియె

భానుడు - నీవు వీణ తెచ్చినది చంద్రు డెఱుంగునా ?

రాముడు - ( మెల్లగా) ఎరిగినదీసికొని రానిచ్చునా? కడతేర్చితిని.

బానుడు - ఊఁ హూఁ మనమిద్దరము వీరపురుషులమే.

రాముడు -- క్షత్రియవంశంబున బుట్టినందుల కామాత్రమైన పౌరుషము చూపమా? ఇందాక నీవు చెప్పిన విషయము పరధ్యానముగా విన్నాను తిరుగాఁ జెప్పుము. విజయుని జంపియే హేమను దీసికొని వెళ్ళితివా ?

భానుడు - దెబ్బతో గెడిపతిని యేమిలాభము. ఆరండ నా మాట వినినది కాదు.

రాము - అడవిలోనికి తీసికొనిపోయి నిర్బంధింపలేక పోతివా?

భానుడు - చేయవలసిన పనియంతయు జేసితిని. చంపుతానన్నను సమ్మతించినదికాదు. చివర కొకనూతిలో బడద్రోసితిని

రాముడు - మా మంచిపని చేసితివి చచ్చినదా? బ్రతికినదా?

భానుడు - అదినాకు దెలియదు. ఇంతలో నా ప్రాంతమందలి పల్లెటూరి బ్రాహ్మణుడొకడు స్నానార్థ మచ్చటికి వచ్చెను. మరి కొందరు వెనుక వచ్చుచుండిరి. దానంజేసి పారిపోయితిని

రాముడు - మంచి ప్రాయశ్చిత్తము చేసితివి. కానిమ్ము మనమిక నింటికిబోయి నిష్కంటముగా రాజ్యము చేసికొనవచ్చును.

భానుడు - అగుంగాని నేనొక్కరుండ నింటికివచ్చిన మన తండ్రి యాక్షేపించును. దేనినయినం బెండ్లియాడి పోవలయును. నీకీ రుచిర సరిపడియున్నదిలే.

రాము - దీనికింత యాలోచనయేల? ఈ వీటిలో నీయిష్టము వచ్చిన బోటి నేరికొనుము రాత్రి యా యింటికిబోయి కన్నమువేసి యా యువతిం దీసికొనివచ్చెదను. తెల్లవారువరకు నీ దేశము దాటి పోవచ్చును.

భానుడు -- అట్లయిన రేపు పట్టణమంతయు బిచ్చగాని వేషము వైచుకొని చూచివచ్చెదను. ప్రొద్దుపోయినది నిద్రబోవుదము. రుచిరకు నిద్రపట్టినది కాబోలు.

నాలుగుదినములనుండి నిద్రలేదు. చిన్న కన్నము వేసితిమి దాని గురించి కొన్ని చిక్కులు వచ్చినవి. దాటినవిలే! రాత్రికి రాత్రినడిచి యింతదూరము వచ్చితిమి. అందు మూలమున నిద్రపోయినది. లేకున్న మనకన్న నెక్కుడుగా మేల్కొనును.

అని లోపల రాముడును భానుడును ప్రొద్దుపోవుదనుక మాటలాడికొని నిద్ర పోయిరి. ఆమాటలన్నియు విజయుడును జంద్రుడును విని వెరగుపడుచు వారి తమ తమ్ములుగా దెలిసికొని యందొకచో వసియించి యిట్లు తలంచుకొనిరి. తమ్ముడా భానుడుచేసిన క్రూరకృత్యము వింటివా? నామెడమీద గత్తివైచి నాప్రియురాలిని బలవంతముగా నడవికి దీసికొనిపోయి తనమాట వినకపోయినందులకు నూతిలో బడద్రోసెనట. అయ్యో! యెంతకష్టము యీక్రూరవార్త నాచెవినేల పడవలయును. నాకతంబున నాసతీరత్నమున కెన్ని యిడుములు వచ్చినవి. ఇట్టిపాపాత్ములు కటికివాండ్రకుఁ బుట్టక యుత్తమక్షత్రియున కేమిటికి బుట్టిరో తెలియదు. వీరినిరువుర నిప్పుడే నఱికివేసెద. గటారి నిటుదెమ్మని యలుకయు శోకమును మదిగుదింపఁ బలికిన విజయుని వారించుచు జందు నిట్లనియె.

అన్నా! మావదినెకేమియు భయములేదు. జీవించియేయున్నది. వెంటనే యా నూతియొద్దకు వచ్చిన బ్రాహ్మణునివలన గాపాడబడియుండును. నామాట నమ్ముము. వీండ్రు మనకు సోదరులు. ఎట్టివారైనను మనము భరించి బుద్దిచెప్పవలయుగాని సంహరించుట యుచితముకాదు. మసగాత్రము చెడ్డదైన నేమిచేయుదమని యెన్నియో నీతివాక్యములు చెప్పి యతిని కోపము చల్లారజేసెను.

అంతలో దెల్లవారుటయు వారును వీరును సత్రముఖంబునం గారసిల్లిరి. విజయుని జంద్రునిం జూచి వాండ్రు తెల్లపోవుచున్న సమయంబున వీరిరువురును తమ్ములారా! కుశలముగా నుంటిరా! యని పల్కరించి కౌగిలించుకొనినంత వాండ్రును తత్సమయోచితముగా బ్రత్యుత్తరము లిచ్చిరి. అప్పుడు భానుడు అన్నా! ఆల్ల నాడు నీవును వదినయు దూరముగాఁ జెట్లక్రింద పరుండియుండ నేనొక చెట్టుక్రింద బండితి అప్పుడొక పెద్దపులి నాపయిబడివచ్చినఁ బాఱిపోయితిని. అదియు బెద్దదూరము నన్ను దరుముకొని వచ్చి దొరకంపోవుటచే నెచ్చటికో పోయినది.

తరువాత గొన్నిదినములకు వెఱపుడిపికొని మునుపటిచోటికి వచ్చితిని. మీ రెవ్వరు నచట గనంబడలేదు. అది మొదలు మీకొరకే వెదకుచుంటినని విజయునితో చెప్పెను.

పిమ్మట రాముడు తమ్ముడా! నీవాసత్రములో వేఱొకగదిలో బరుండితివికదా. నాడు యర్ధరాత్రంబున మమ్ము విమర్శించుటకై రాజభటులు లచ్చటికి వచ్చిరి. ఆజాడ దెలిసి మేము నీతో చెప్పకయే పారిపోయి వచ్చితిమని చంద్రునితోఁ జెప్పెను

ఈరీతి వారిరువురు తమరహస్యముల వారెఱుగరని బొంకిన విని విజయుడును చంద్రుడును విస్మయము జెందుచు నప్పటికి దగినరీతిగా మాటలాడిరి. పిమ్మట విజయుడు తమ్ములారా! మనము వచ్చి పెద్దకాలమైనది. మన తలిదండ్రులు మన నిమిత్తము చింతించుచుందురు. కావున నింటికి బోవుదము రండని పలికినం జంద్రుడు సమ్మతించెను. తక్కిన వారిరువురు మఱికొన్ని దినములు దేశాటనము చేయవలయునని చెప్పిరి.

విజయుడు అన్యాపదేశముగా వాండ్రను మఱియొకనాడు పెద్దగా మందలించిన గ్రహించి వాండ్రిరువురును రహస్యముగా మాటాడుకొని వారింజంప ప్రయత్నముచేయుచు నాకపటముఁ దెలియనీయక యిష్టులువోలె మెలంగఁ దొడంగిరి.

విజయుడు తనభార్య వృత్తాంతముఁ దెలిసికొనవలయునని బలవర్దనుడు పాలించెడు కరిపురము మార్గము ననుసరించి పయనములు సాగింపఁ దొడంగెను.

ఒకనాడొక యరణ్యములాఁ బోవుచు నొక యగాధకూపసమీపమున వారు భోజనార్థము వసియించియున్న సమయంబువ రుచిర నీటికై నూతియొద్దకుఁబోయి నూతిలోని జలము తొంగిచూచి యాశ్చర్యముఖముతోఁ బరుగిడివచ్చి ఓహో! యీ నూతిలో వింతలం జూచితిని ఇరువురుకాంతలు మునుగుచుఁ దేలుచున్నారు. వారు నాగకాంతలని తలంచెదను లేక తెరువరు లేవ్వరేని బ్రమాదంబున దానిలోఁ బడిరేమో తెలియదని పలికిన విని వారు నలువురు తటాలునలేచి యాకూపము నొద్దకు బోయి యాయువతు లెక్క డెక్కడని రుచిర నడిగిరి. రుచిరయు నిదిగో యీమూల తేలిరి. ఈమూల మునిగిరి విమర్శించి చూడుడు. అదిగో బుడగలు వచ్చుచున్నవని చెప్పుచుండ విజయుండును జంద్రుడును వంగివంగి చూడదొడంగిరి.

అట్టిసమయమున భానుడును రాముడును మెల్ల గా వెనుకకు వచ్చి వారికాళ్ళు పట్టుకొని చెరియొకరిని నానూతిలో బడవయిచిరి. కటకటా!

చ. తిమిరనివారణక్రియకు దీపము వారిధి విస్తరింపఁబో
    తముచలిబాప వహ్ని రవితాపభరంబడగింప నాతప
    త్రము కలుషంబులం జెఱుప ధర్మము బాల్బడియుండుఁగాని య
    క్కమలజుఁడున్సుఖోద్యముఁడుగాడు దురాత్మునిఁజక్కఁజేయగాన్.

అని భర్తృహరి చెప్పియున్నాడు. ఎట్టికార్యమునకైన సాధనమున్నదికాని దుర్జనునిఁ జక్కఁజేయుటకు సాధనము లేదుగదా ?

అట్లు వారిని నూతిలో బడవేసి వారిరువురు రుచిరతో కూడికొని యెందేని పోయిరి. ఆకపటమంతకుఁ బూర్వము వారు బోధించుకొనినదే.

విజయుడునుఁ జంద్రుడును నూతిలోబడి తాళదఘ్నమగును జలంబులమునింగి యడుగంటి వెంటనే పైకిఁదేలిరి. వారికి నీదుపాటవము గలిగియుండుటచేఁ దిరుగా మునుంగక యీదుచు ప్రమాదముచే బడినవారికి నూతగానుండుటకై నీటిమట్టముగా నందఱు ధర్మశీలుని పేరున కట్టఁబడియున్న పాషాణములుండుటఁ దిలకించి వాని నూతగాబట్టుకొని కొంతసేపటి కాయాసము దీర్చుకొనిరి.

అప్పుడు విజయుడు, చంద్రునితో తమ్ముడా నీవు నామాట వింటివికావు. వీరి నప్పుడే పరిభవించిన నింత రాకపోవనుగద. ఎట్టి పనిచేసిరో చూచితివా? ఇప్పుడేమి చేయగలము. ఇందుండి కేకలు వైచినను బై వారికి వినంబడవు. మహారణ్యమగుటచే నీదారిని నడుచువారు తఱుచుండరు. ఎవ్వడేని వచ్చినను మిగుల విస్తీర్ణమగు పగ్గం కాని గొలుసుగాని దెచ్చునా, అట్టిదిలేకున్న నతడేమి చేయగలడు ?

అయ్యో? మనకు యీత రాకున్నను జక్కనగుంగదా. వెంటనే మునింగి ప్రాణములు పోగొట్టుకుందుము. ఇప్పుడాహారములేక చివికి చివికి చావవలసిందే. ఏమిచేయుదుము రక్షించువారెవ్వరు?

అన్నా ! మహారాజు గర్భంబున జనియించి పెక్కు విద్యులనేర్చి మంచి బుద్దిమంతుల మనిపించుకొని తుదకీనూతిలో బలవన్మరణము నొందవలసివచ్చెనా? హా! విధీ?! ఎంత క్రూరుఁడ వై తివిరా? యని దైర్యము చెదర బెదురుదోప గోలున నేడ్చినంజూచి వారించుచు చంద్రుండిట్లనియె.

అన్నా! నీవింత బేలవైతివేమి? పుట్టినవారి కెప్పటికైనజావు నిక్కువ మేకద. అని యెఱింగియు దానికి శోకించుట ప్రాజ్ఞత్వముకాదు. అదియునుంగాక భగవంతుం డెవ్వని కెందెట్లు చావు వ్రాసెనో అట్లు జరుగకమానదు. కొంతకాలము దుఃఖము కొంతకాలము సుఖము ననుభవించుట మానవధర్మమై యున్నది. దేనికిని మనము స్వతంత్రులము కాము. మన కర్మకు గర్మయే కారణము. అది యెట్లులాగిన నట్లు పోవుచుందుము. ముందు మనకుమించి కర్మయుండిన నెప్పటికైన మందురావచ్చును వెనుక నేనుపడిన చిక్కులలో నిదియొక లెక్కా? నీవును వినియుంటివికదా? యని యెంతో దైర్యముతో దగుమాటలు చెప్పి యతనికి శోకము వాయ జేసెను.

అట్లు వారిరువురు మూడు దినములు దైర్యము విడువక గడియ యుగములాగున గడిపిరి అంతకంతకు నాఁ లి బాధింపుచుండ బెండుపడి యొడలి సారమడుగు చుండ నొడలెఱు గక యా ధర్మపాషాణమానుకొని కాళ్ళు దేలవైచుచు మాటాడుట కైన నోపికలేక కన్నులు మూసికొని యా నూతిలో మఱినాలుగు దినములు గడపిరి అప్పటికి స్మృతి దప్పినది. తలవాలవైచుకొని యారాతినానియున్న సమయంబున దైవికముగా నా ప్రాంతమందలి యూరిలో నొక భాగ్యవంతుని యింటికి దొంగలు కన్నమువైచి, వెండిబంగారములతో నిండియున్న పెట్టెనెత్తుకొనిపోవుచుండ జూచి యా యింటి యజమానుడు పదుగురితో వారిందరిమికొని వచ్చెను.

చోరులు పెద్దదూరము పెట్టెలతో బాఱిపోయివచ్చి యింక పట్టుకొందురని వెరపుగలిగినప్పుడు దైవగతి నాకూపము చేరువున నుండుటచే నామందసము లానూతిలో బారవైచి పాఱిపోయిరి.

ఆ గ్రామస్తులలో నొకడది జూచి వేగముపోయి యెదురుబడిన యాయజమాని కావృత్తాంతము జెప్పెను. అప్పుడా యజమానుడు గొలుసులను పగ్గములు దూలములు గంపను పెక్కులు దెప్పించి యీతకు గడదీరిన ప్రోడలను కొందఱినందు దింపెను.

అజ్ఞాని హృదయంబువోలె గాడతమోమయమైన యాకూపములో వాండ్రు దైర్యముతోదిగి నీటిమట్టమున గొలుసులపై నిలిచి పరిశీలించి చూడ ధర్మశిలలపై దలలజేర్చి చేతులతో బిగియబట్టుకొని వివశులై యున్న రాజపుత్రు లిరువురును గనంబడిరి.

వారింజూచి చోరులిందు డాగియున్నారని తలఁచి తమ్ము బరిభవింతురను వెరపుతో దొంగలు దొంగలని యరచుచు వడివడి యాగొలుసులనుండి పైకి బ్రాకికొనివచ్చి యా వృత్తాంత మా యజమానునికి జెప్పిరి. తరువాత నానూతిలోని కెవ్వరిని దిగుమనినను వెరపుచే సమ్మతించిరికారు.

అప్పుడా యజమానుఁడు పెద్దయెలుంగునఁ జోరులారా! మిమ్ములను నేను గాపాడెదను. మీ రీగొలుసు లెక్కిరండు. వెఱువకుడు దీనిలో గొంతసొమ్మిత్తు. నన్నూరక శ్రమపెట్టకుడని యరచియుఁ బ్రతివచనంబు గానక విసిగి యెక్కుడు రొక్క మిత్తునని యందు దిగుటకు బెక్కండ్ర ప్రతిమాలుకొనియెను.

విత్తమున కాసపడి గారాసులు కొందఱు సమ్మతించి కట్టుగా నానూతిలోనికి దిగి యా రాజపుత్రులం గాంచి పల్కరించి ప్రతి వాక్యంబు వడయక కొట్టబోయి యంతలో దైవప్రేరితమైన బుద్ధిచే నెత్తిన దండములు దింపి దాపునకుబోయిచేతుల నంటి కదల్చి కదలకున్న జూచి యూపిరిపరీక్షించి అయ్యో యీ దొంగలిందుదుమికి రాయిడిచే జేతనముంబాసిరి ఇక వీరింజూచి వెరవనేల. ఈశవము లేమిచేయగలదని యావార్త నా యజమానునికి దెలియజేసి యతని యనుమతిని వారి నిరువురను గంపలలో గూర్చుండబెట్టి త్రాడు గదిపిన వారిం బైకిలాగిరి.

అప్పుడు వికృతముగానున్న వారి శరీరములు చూచి యా యజమానుడు అయ్యో! ఇది యేమి. దొంగ లిందాకనే యిందు బెట్టెలు పారవైచిరని చెప్పిరే. వీరా దొంగలుకారు. నీటిలో నుండుటచే వీరిమేనులు దెల్లబడినవి. ఇంతలో నిట్టివికృతిని బొందనేరవు. వీరివలననే యీ వృత్తాంతము వినవచ్చునని పల్కుచు నతండు అన్నమును మజ్జిగయు దెమ్మని తమదూతల నూరిలోని కనిపెను.

ఆ దూతలు తృటిలో బోయి వానియాజ్ఞ చొప్పున నాహారవస్తువులం దెచ్చిరి మిక్కిలి సాధనముగా నతిదయాళుండైన యా యజమాను డాహారము వారినోట నెక్కించి మంటలువైచి కాపించి పండుకొనబెట్టెను. అప్పుడు వారిమేనుల చెమట పట్టినది. ఇంక జీవింతురని చెప్పుచు నింతలో నూతిలో దొంగలు పారవైచిన మందసములన్నియు గూలివాండ్రు తీసినందున వాని నన్నిటిని బండిమీద నెక్కించుకొని యా రాజపుత్రుల నాందోళికములమీద మెల్లగా దనయింటికి దీసికొనిపోయెను.

ఆ యజమానుడు చేసిన యుపచారములవలన నారాజపుత్రుల కామరునాడే స్మృతివచ్చినది. అతడు చేసిన యుపకారమునకు వారు మిక్కిలి సంతసించుచు దమ వృత్తాంత మంతయు నతనికి జెప్పి యతని మన్ననల వడసి, కొన్ని దినములందుండి శరీరములు స్వస్థత పడిన కొన్ని దినములకా యజమానుని యనుమతివడసి వెడలి కతిపయప్రయాణంబుల గరిపురంబునకు జనిరి.

అప్పురంబు రాజమార్గంబున జనుచున్న సమయంబున నొక భవద్వారంబున వీణావాదన పరీక్షామందిరము అనియున్న ప్రకటన పత్రికజూచి చంద్రుడు విజయునితో అన్నా! యీ ప్రకటన చూచితివా యిచ్చటివిశేషము లెట్టివో పరీక్షించి పోవుదమురమ్ము అనుటయు విజయుడు ఇప్పుడు ప్రొద్దెక్కినది. రేపువత్తుములే. ఎచ్చటను వీణ పేరు కనంబడనీయవు. నీ వీణ యిచ్చటికి వచ్చినదను కొంటివా యేమి.

అని మాటాడుకొనుచున్న సమయంబున నాలోపలినుండి యెవ్వరో వాకిటికి వచ్చిరి. చంద్రుడు వారింజూచి అయ్యా! యీ ప్రకటన యేమియది. వీణాగానము పరీక్షింతురాయేమి యని యడిగిన నందొకడు అగునగు నిందొక విపరీతపు వీణయున్న యది. అది పెక్కండ్ర గాయకుల బరిభవించినది. దాని శ్రుతివైచి పాడిన వారికి బారితోషిక మిప్పింతునని మా రాజపుత్రిక ప్రకటించినది. మీరు పాడగలిగిన జూడుడని పలికెను.

ఆ మాటవిని చంద్రుడు విజయుని చేయిపట్టుకొని దాని నిప్పుడు చూచివత్తం రమ్మనిపలుకుచు లోపలకు బోయెను.

అందు విశాలమగు చావడిలో బీఠంబున నొక వీణయుండుటయుం చంద్రుడు దాపునకుబోయి చూచి మొగము వికసింప అన్నా! యిది నాదియే నాదియే యని అరచుచు నతని కౌగిలించుకొనియెను.

తమ్ముడా! వేగిరింపకుము నిదానించి చూడుము అట్లుగంతులు వైచెదవేల? చూచినవారు నవ్వరాయని పలికిన నతండు సందియములేదు. అదిగో చూడుము. వీర బ్రతాప కుమారచంద్రయని నా పేరు కనంబడుచున్నది. ఆ పేరు నా ప్రియురాలు దీని నాకిచ్చినపుడు స్వయముగా జెక్కినది హా చారుమతి, నిన్నుజూచి ఎన్ని దినములయినదే. వెండియుం గనఁబడుదునా? రామా! సోదరుఁడవయ్యు నెంతపని జేసితివిరా. యని యున్మత్తాతాపములు పల్కుచున్న చంద్రుని వారించుచు విజయు డందున్న యధికారులతో, అయ్యా! మేమీవీణను మేలగించి పాడగలము దీనమాకు గలుగులాభమెద్ది! మీ రాజపుత్రిక యెవ్వతె ఆమె యిట్టి నియమమేమిటికి జేసినదని యడిగిన వారు ఆ వృత్తాంతమంతయు మాకు దెలియదు మీరు పాడగలిగిన మీ పేరులు సెప్పుడు. రాజపుత్రికకు జూపి శాసనము చేయించుకొని వత్తుము. ఇంతకు మున్ననేకులు వచ్చి యీలాగుననే పలికి చివరకవమానము పొందిపోయిరి. చక్కగా నిదానించి చెప్పుడని పలికిన దానికి సందియములేదు. నిక్కముగా బాడగలము. మేలగించలేక పోయితిమేని మా ప్రాణములు ఫణముగా జేసెదము. దీనికి మెచ్చి మీ రాజపుత్రిక యేమియిచ్చునో తెలిసికొనిరండని పలుకుచు చంద్ర విజయ యసు పేరు వ్రాసియిచ్చెను.

వారు సెప్పిన విషయములన్నియు వ్రాసికొని యాయధికారులు రాజపుత్రిక యొద్దకుఁబోయి యావృత్తాంతమంతయుఁ జెప్పిరి ఆకథవిని యాయువతి మితిలేని కుతుకము జెందుచు నాదివసంబున సభజేయుటకు నాజ్ఞయిచ్చి యాసమయంబునకుం దనకుమారునిఁ బండ్రెండేడుల ప్రాయముగలవాని నచ్చటికి బంపెను.

రాజపుత్రిక శాసనప్రకారము ఆ దివసంబున సాయంకాలము సభకూడుటయు నచ్చటికరుదెంచిన యబ్బాలునిం గాంచి విజయుఁ డౌత్సుక్యము దీపింప దృఢసౌహార్ద్రంబులగుచూపు లతనిపయిఁ బరగించుచు దమ్ముడా వీనిం జూచితివా? ఈ బాలుని యందు హేమలక్షణంబులు కొన్ని స్ఫురించుచున్నవి ఈ కపోలములు దానివే ఆహా! నా ప్రేయసి ముద్దుమొగ మెన్నడు చూచితినో వీనింజూడ దానిని జూచినట్లె యున్నది. అదియునుంగాక నా హృదయంబున వీని మొగముజూడ నపూర్వమగు నుత్కంఠ పుట్టుచున్నది. అది యిట్టిదని చెప్పలేను. ఒకవేళ వీడు హేమకొడుకు కాడుగద. అంతభాగ్యము నాకు బట్టునా! పూర్వ మొకనాడు నీవిట్లు స్రుక్కియుంటి వేమియని నేను హేమనడిగిన నాహారము రుచించుటలేదని యుత్తరమిచ్చినది. పిమ్మట నేను తరుణీ! నెలదప్పెనా యేమని పరిహాసమాడిన నా జవ్వని నవ్వి యూరకొనినది అది సిగ్గనుకొని నేనంతటితో నాప్రస్తావము మానితిని ఇంతలోఁ బయనము వచ్చినది. తరువాత మనసోదరుడు చేసిన కృత్యము నీవెఱింగినదేకద . అవియన్నియు దలచుకొన దుఃఖము పొల్లుగావచ్చుచున్నది. చూడుము! ఏమి కాలమహిమ అనిపలికిన విని చంద్రుండు అన్నా! నీవన్న మాట నిక్కువము కావచ్చును. వీనియందు నీపోలికయు గనంబడుచున్నది. నాకిదిగో కుడికన్ను అదరు చున్నది శుభసూచకమే. అన్నియు విమర్శింతము తొందరపడకుమని యోదార్చెను

ఇంతలో నాయధికారులు వీణముందుంచి మేలగించి పాడుడని తొందర పెట్టిరి. అప్పుడు చంద్రుడు దానిముందిడుకొని చక్కగాఁ దీగెలు సవరించి మెట్లు నొక్కి మేళగించి దాను చారుమతియొద్ద నభ్యసించిన మోహన యనురాగ మాలాపించి యొక కృతిపాడెను. అది వినినవారెల్ల మోహవివశులయి యేమియు దెలియక నృత్యములు జేయదొడంగిరి. అట్లు కొంతసేపు పాడి విరమించుటయు సభ్యులెల్ల నపూర్వగాంధర్వమునకు మెచ్చుకొనుచు చంద్రుని వేదెఱంగుల కొనియాడిరి.

అట్టి సమయంబున విజయుడు నిలువలేక యబ్బాలుని దరికింజీరి ముద్దిడు కొనుచు వత్సా! నీ వెవ్వనిపుత్రుడవు? నీ పేరేమి? రాజపుత్రిక నీకేమి కావలయునని యడిగిన నక్కుమారుం డొక్కింత విమర్శించి నేను విజయుని పుత్రుండను. మా తల్లి పేరు హేమ. నాపేరు గజదత్తుడందురు. నావృత్తాంతముతో నీకు బనియేమి అని యడిగెను

ఆమాటలు విని విజయుడు సంతోషామృతహృదయంబున మునింగినట్లు వివ శుండై యొక్కింతసేపూరకుండి కంఠము డగ్గుత్తిక జెందఁ దెరపితెచ్చుకొని యానందాశ్రువుల నద్దికొనుచు కుమారా? మీతండ్రి యెందున్నవాడని యడిగిన నది నాకుఁదెలియదు మాతల్లి యెఱుంగునని యాబాలుం డుత్తరమిచ్చెను. అప్పుడు సంతోషము పట్టజాలక విజయుండు తమ్మునికావార్తా యంతయుం జెప్పిన నతడా బాలుని మఱియు దర్కించి యడిగినవాడు విజయుని కుమారుడగుట నిశ్చయించి పెద్దతడవు ముద్దిడుకొనుచు వత్సా! మీతండ్రిని మే మెఱుగుదుము అతనికి మాకును బాంధవ్యమే కలిగియున్నది. అందుమూలమున నిన్నింతగాఁ జూచుచున్నారము. ఈ వార్త మీతల్లి కెఱింగింపుమని చెప్పిన నా రాజకుమారుడు వల్లెయని యుల్లము రంజిల్ల వారి యనుమతి వడసి తల్లి యొద్దకు బోయెను.

ఆరాజపుత్రికయు పుత్రునెత్తుకొని ముద్దాడుచు నాయనా! సభావిశేషములేమి? ఆవైదేశికుడు విపంచిని మేలగించెనా? అని యడిగిన నాబాలుండు అమ్మా! ఆ సభ కిరువురు వచ్చిరి వారి యాకారములు చూడ గౌరవకుటుంబములోని వారలుగా దోచుచున్నది వారిలో నొకడు వీణను మేలగించి హాయిగా పాడెను చెప్పనేల? యట్టి సంగీతమెప్పుడును వినియుండలేదని సభ్యులు కొనియాడిరి అది యట్లుండె. వారిలో మఱియొకడు నన్నుఁ జీరి ముద్దుబెట్టుకొనుచు నీతండ్రిపే రెవ్వరనియు తల్లి ఎవ్వతె యనియు లోనగు మాటలడిగిన దండ్రి విజయుండని చెప్పితిని. ఆమాటలు విని కన్నీరు విడచుచు మీతండ్రి యిప్పు డెందున్నవాడని యడిగిన మాఅమ్మకేగాని నాకుఁ దెలియదని చెప్పితిని అది విని యూరక చింతించుచు రెండవవానితో నా వార్త చెప్పెను ఆయనయు నన్నెన్నో యడిగి ముద్దుపెట్టుకొనుచు, తమకు నాతండ్రితో బాంధవ్యమున్నట్లు చెప్పి నీతో చెప్పమనెను. వారెవ్వరే? నాకును వారినిజూడ వేడుక పుట్టినిదిసుమీ? ఒకసారి పిలిపించి చూచెదవా? వారికేమియు నక్కరలేదట ఆ వీణ యిచ్చినం జాలునట? నీవు వారిఁ జూడగూడదా యేమియని యచ్చటిమాట లన్నియును జెప్పినవిని యప్పాటలగంధి దదీయరూపవిశేషంబు లడిగి తెలిసికొని పతి యనియు మఱింది యనియు నిశ్చయించినది.

పిమ్మట నౌత్సుక్యముతో వారిఁ దోడితేరఁ దగువారింబంపినవారుపోయి యా రాజపుత్రులంజూచి అయ్యలారా! మీ యదృష్టము మంచిది. మారాజపుత్రిక మీకు మంచి పారితోషిక మియ్యగలదు. మిమ్ములను నిలువంబడినట్లుగా నంతఃపురమున కే తీసికొనిరమ్మన్నది ఇంతకుముం దెవ్వరియందు నింతదయ జూపలేదని పలికిన విని విజయుం డిట్లనియె.

ఎన్ని సారులు చెప్పినను మీరు రాజపుత్రిక మాటయే చెప్పుచుందురు. ఈ దేశమునకు మగవాడు ప్రభువు లేడా యేమి? ఇచ్చటికి వచ్చినవారినెల్ల నంతఃపురమునకు రప్పించుకొనుచుండునాయేమి? మీ రాజపుత్రిక చారిత్రమెట్టిది? పేరేమి? పతి యెవ్వడని యడిగిన విని వారు అయ్యో మీ రెరుంగరా? ఇప్పు డామెయే దేశమును బాలించుచున్నది. తండ్రి స్వర్గస్థుడైనంత నతనికి పుత్రసంతానము లేమింజేసి యీమె యాధీనమైనది ఆమెపేరు హేమ. పతిపేరు విజయుడు. ఆయన యెందున్నవాఁడో తెలియదు. ఇందాక సభకు వచ్చిన చిన్నవాఁ డాయువతీరత్నము పుత్రుడు, సుగుణంబుల నామె నరుంధతి యని చెప్పనోపు. పవిత్రచరిత్ర యని మిక్కిలి స్తోత్రము చేయుచు వారిం దోడ్కొనిపోయి యంతఃపురమున విడిచిరి.

గజదత్తుడు వారి కెదురువచ్చి తీసికొని రత్నపీఠములం గూర్చుండబెట్టెను. అప్పుడు హేమ కాండపటములోనుండి వారింజూచి విజయుని గురుతుపట్టి సంతోషదుఃఖములు పట్టజాలక యట్టె తెర తొలగించుకొనివచ్చి యతని పాదంబులం బడి హాప్రాణనాథా జీవించి కుశలముగా వచ్చితిరా యని పలుకుచు శోకింప దొడంగినది.

అప్పుడు విజయుడు సంతోషముతో నాకాంతారత్నమును గ్రుచ్చియెత్తి యూరడించుచు పెద్దతడవు వివశుండై కుమారుని కౌగిలించుకొని తత్కాలోచితము లయిన మాటలచే కొంతసేపు గడపి పిమ్మట నాకొమ్మ కిట్లనియె.

కాంతా! నీవు న న్నేమిటికి విడిచివచ్చితివి? ఎందెందు సంచరించితివి? నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నమ్మగువ కన్నీరు దుడిచికొనుచు ననురాగసాంత్రములగు చూపు లతనిపై బరగించుచు నిట్లనియె

హేమ కథ

నాథా! మనము చెట్టుక్రింద నిదురించుచుండ మీసోదరుడు కృపాణము మీ మెడమీదవైచి నన్ను లేపి బలాత్కారము చేసిన నేనిదుర పరాకున నేమియుం తెలియక కొంతసేపు తొట్రువడుచుండఁ దానే మిమ్ము వధించినట్లు చూపిన నేను శోకముచే మూర్చపోయితిని అట్టిసమయమున నన్ను బలాత్కారముగా నొక మహారణ్యమునకుఁ దీసికొనిపోయెను. అందు నాకు కొంతసేపటికి తెలివివచ్చినఁ దనకు భార్య గమ్మని నిర్భంధించెను.

అందులకు నేను సమ్మతించితినికాదు. దానంగోపించి యా ప్రాంతమందొక నూయియుండ దానిలో నన్ను పడద్రోసి తానెచ్చటికో పోయెను.

ఇంతలో నొక బ్రాహ్మణుండు స్నానార్ధమై వచ్చి యందు నన్ను జూచి కనికరముతో పైకి దీసి యాప్రాంతమందున్న యగ్రహారములో నన్ను తనయింటికి తీసికొనిపోయి నావృత్తాంతమంతయు విని జాలి వొడమిన డెందముతోఁ గొన్నిదినములు దనయింట బెట్టుకొని కాపాడెను.

నే నప్పటికి నెలదప్పియుంటిని గనుక గర్భచిహ్నములు నాయందు చూచి యాభూదేవుడు కూతురువలె నన్ను చూచుచు నేను సంతతము మీకొరకు చింతించు చుండ నుదుట గరపుచు బరమానురాగంబున నన్ను బెనిచెను.

అంత పదియవమాసంబున నీశిశు వుదయించెను. ఏ కొదవయు రాకుండ నాకా బ్రాహ్మణుడు పురుడుపోసి వీనికి జాతకకర్మ నామకర్మాదులు యుక్తకాలంబునం కావించెసు. ఆయగ్రహార మరణ్యమధ్యమున నుండుటచే నీపాపని కైదేడులు వచ్చినప్పుడు వీడు పిల్లలతో నాడుకొనుచుండగా నరణ్యగజ మొకటివచ్చి జనులం బాఱదోలుచు వీథిలో నాడుకొనుచున్న నాముద్దులపట్టి నెత్తుకుని యడవిలోనికిం బోయెను.

ఆవార్తవిని నేను గుండెలు బాదుకొనుచు నెవ్వరు చెప్పినను వినక వీథింబడి యాయేనుగు పోయిన జాడం బో దొడంకితిని. పాప మా బ్రాహ్మణుండు నాతోగూడ వచ్చెను కొంతసేపు తిరిగితిమి. ఎందును మాతంగము గనబడలేదు. అప్పుడు నేను బలవన్మరణము నొంద నిశ్చయించి యాపాఱుని నింటికిం బొమ్మంటిని కాని అతడు నా యుద్యమం బెఱింగి నీకుమారునికి భయములేదనియు గొప్పరాష్ట్రాధి పతియగునని వెండియు బతితో సమాగమము గలుగుననియు లగ్నముగట్టి చూచితిననియు లోనగుమాటలచే నన్ను మృతినొందనీయక బలాత్కారముగా నింటికిం దీసికొని పొయెను.

నేను బుత్రశోకార్తినై నిద్రాహారములులేక కృశించి దిన మొక యుగముగాఁ బదిదినములు గడపినంతఁ బదునొకండవ దివసంబునఁ గొందఱు రాజభటులునేనున్న యగ్రహారమునకు వచ్చి యేనుగు ఎత్తుకొనిపోయిన పిల్లవానిని గన్నతల్లి యెందున్నదని యడుగుచు నా యొద్దకు వచ్చిరి.

వారింజూచి నే నేడ్చుచు దండ్రులారా! యీ పాపాత్మురాలి యవసరము మీ కేలవచ్చినది. నాముద్దులపట్టిం బట్టిన క్రూరగజము మీకు జిక్కలేదు గదా యని యడిగిన అమ్మా! నీవు చింతింపకుము నీపుత్రుడు కుశలియై యున్నవాడు. నిన్ను జూడ దొందరపడుచున్న వాడని చెప్పిరి.

ఆమాటలు చెవిని సోకినంత మేనుప్పొంగ నేమీ? మీరన్నమాట సత్యమే? ఎందున్నవాడు ఎట్లాగజము విడిచినది? నిజము చెప్పుడు. మీపాదములకు మ్రొక్కెదనని యత్యాతురముగ నడిగిన వారిట్లనిరి.

అమ్మా! మా రాజుగారికి వేటయందు మిక్కిలి పాటవముగలదు. తరచు వేటాడుచుందురు. మొన్న నీయడవికి వేటకువచ్చిరి. అప్పుడొక యేనుగు తొండముతో నీ గుమారునిజుట్టి పోవుచుండ గుంభమునం బెట్టుకొని నట్టడవిలో సంచరింపుచుండ నాభూపాలుండు చూచి, సవ్యసాచియుంబోలె గోదండంబుసాచి నైపుణ్యంబు మీరవాడి తూపులచే నక్కరిం బరిమార్చి యబ్బాలుని గాపాడి యెత్తుకొని ముద్దిడుకొనుచు అప్పా! నీ వెవ్వరివాడవు నీతల్లి పేరేమియని యడిగిన నబ్బాలు డూరక యేడ్చుచు అమ్మ, తాతయని చెప్పి యచ్చట నున్నారని యీ పల్లెదెస జేయిజూపువాడు అప్పుడు మారాజు మమ్ము జూచి యీ యరణ్యప్రాంతమందలి గ్రామములకుం బోయి యీ పుత్రుని వార్తం జెప్పి వీని తల్లిని దండ్రిని మన గ్రామము దీసికొనిరండు. పొండని పనిచిన వెదకికొనుచు నిచ్చటికి వచ్చితిమి. కావున నిన్ను దీసి కొనిపోదుము. రమ్మని పలికిన విని నేనును బయనమునకు దొందరపడుచు బుణ్యాత్ములారా? నాపట్టిని రక్షించిన సుకృతి యెవ్వడు? ఏ దేశము? ఎంతదవ్వున్నదని యడిగితిని.

అప్పుడు వారు అమ్మా! కరిపురప్రభువైన బలవర్ధనమహారాజుగారు నీపుత్రునుని రక్షించిరి ఆవీడు మూడుదినముల పయనములో నున్నదని చెప్పిరి. ఆమాటవిని నేను డెందమున దిగులు జనింప అయ్యో? అతడు మా తండ్రి యగుటంజేసి నన్ను గులటగా నెంచి శిక్షించునేమో కొలటేయుండని మనుమని దూషించకమానడు నిజము జెప్పిన నమ్మునా యని పెక్కు తెరంగుల దలచి యావిషయ మా బ్రాహ్మణునితో జెప్పితిని.

ఆ దయాళుండు పుత్రీ! నీవిందులకు వెరవకుము. నీతో నేనును వచ్చి నిన్ను నాకుతురుగా జెప్పి యతని మతిదెలిసిన పిమ్మట సమయోచితముగా నాదరించెద జింతింపకుమని పలుకుచు నా సోమదేవుడు నన్ను వెంటబెట్టుకొని నీవీటికి జనుదెంచెను.

శోకోపవాసములచే రూపు మాఱియున్నది కావున నన్నెవ్వరు గుఱుతుపట్టలేకపోయిరి. దానంజేసి యంతఃపురమునకు నేను నిరాటంకముగా బోయి యందాడుకొనుచున్న నా కుమారుని గాంచి మేనుపులకింపఁ గౌగిలించుకొని శిరము మూర్కొనుచు బెదతడవు లాలించితిని.

అట్టి యానందములోనున్న నాయొద్దకు నాబ్రాహ్మణుడు వచ్చి పుత్రీ! నీ కష్టము గట్టెక్కి నది మీ తండ్రి భార్యమాట విని నిన్ను దుష్టురాలిగా నెంచి నిన్ను వెదకితెప్పించి శిక్షించుటకయి ప్రయత్నము జేయుచుండ మీరు మొదట నివసించిన యింటి యజమానుడు మీరాడుకొనిన మాటలు గోడ వెనుకనుండి వినెనట అందు మీ సవతితల్లి జేసినదారుణకృత్యము నీసుగుణత్వ తెల్లమగు చుండెను కావున నావృత్తాంతమా పురుషుండ పృష్ణుండయి మీ తండ్రి కెఱింగించెను! ఆకథ వినినదిమొదలు నీ తండ్రి నీవృత్తాంతము తెలిసికొని రమ్మని నలుమూలలకు దూతలంబుచ్చెనట నీ కొరకు మిక్కిలి విచారించుచున్న వాడట నీ గుణములే కొనియాడునట భార్యను కారాగృహప్రాయమైన యింటిలో నునిచి నిజము చెప్పుమని నిర్బంధించుచున్న వాడట. కావున నీవృత్తాంత మాయనతో జెప్పి యచ్చటికి దీసికొని వచ్చెదనని చెప్పిన నేనును సమ్మతించితిని.

అప్పుడాయన వెళ్ళి ఏమిచెప్పెనో గోలుననేడ్చుచు మా తండ్రి నాయొద్దకువచ్చి నాపైబడి పెద్దతడవు విచారించెను. అతనింజూచుటచే నాకును వెఱ్ఱిదుఃఖము వచ్చినది. మమ్మునోదార్చుచు సోమదేవుండు నాశీలము గురించి మాతండ్రియొద్ద నెక్కుడుగా స్తుతిచేసెను.

అప్పుడతండు నా వృత్తాంతమంతయు నావలనం దెలిసికొని మా సవతితల్లిని చంపబోయెను. కాని నేను వారించితిని. మీకంఠంబున కత్తియుండుట జూచినంతనే మోహవివశనయితిని. కావున మీరే స్థితిలో నున్నవారో తెలియక మీక్షేమమరసి రమ్మని దేశదేశములకు దూతల నంపితిని ఏజాడయుం దెలిసినదికాదు. అట్లు కొన్నిదినములు గడచినవెనుక నొకనాడు భవదీయనామముద్రాంకితమయిన యుంగర మీవీటిలో నొకవైద్యు డమ్ముచుండ బట్టుకొని రాజభటులతని నాయుంగరముతో మా యొద్దకు దీసికొనివచ్చిరి. ఆయుంగరము దేవరవారిదనియు నాచెట్టుక్రింద బరుండినప్పుడు మీవ్రేల నున్నదనియు నేనెఱుంగుదును. కావున నా వైద్యుని సానుపూర్వకముగా నీకిది యెక్కడ దొరికినదని యడిగితిని౼

అతండు తానొకనాఁ డొక యరణ్యములోఁ బోవుచుండ నొక చెట్టుక్రిందఁ గత్తివ్రేటుదిని మృతప్రాయుడయి పడియున్న యొకపురుషుని బ్రతికించిన నతండది తనకు గానుకగా నిచ్చెనని చెప్పెను. ఆమాటవిని నేను బరమానందముతోఁ దర్కించి తర్కించి పలుమారడిగి యతనిమాట నిక్కువమని తోచినవెనుక నతనికి కానుకలెన్నియేని యిచ్చి యంపితిని.

ఇంతలో దైవవశంబున మాతండ్రికి మృత్యువాసన్నమగుటయు తనరాజ్య మంతయు నాయధీనముంజేసి దౌహిత్రుడెరిగిన పిమ్మట నతని పట్టభద్రుని చేయుమని చెప్పి యతండు స్వర్గస్థుడయ్యెను అదిమొదలు నేనీరాజ్యమును పాలించుచు మీరాకవేచి దేనివలనయినను మీవార్త దెల్ల మగునని యెవ్వ రేవింతవస్తువు దెచ్చినను నాయొద్దకు దెచ్చునట్లు నారాజ్యములో ప్రకటన చేయించితిని.

అట్లుండ గొన్నినెలలక్రిందట నీవీణె నొకబ్రాహ్మణుడు దెచ్చి యిది భూలోకపు వీణలపోలికగా లేదనియు దనకు వీణాపాటవము గలిగియున్నను దీని మేలగించురీతి తెలిసినదికాదని దీనికొక సత్రములో నొకబాటసారియు యమ్మెననియుం జెప్పి నాయొద్దకంపెను. నేనది విమర్శించిచూచి యందు వీరప్రతాప కుమారచంద్ర అని తీగెవలె చెక్కబడియున్న సామవర్ణంబులంజూచి చంద్రుడు సోదరుండని మీరు చెప్పియుంటిరి. కావున నతండు వచ్చినను మీవార్త దెలిసికొనవచ్చునను తలంపుతో నాబ్రాహ్మణునకు బారితోషిక మిప్పించి దీని నచ్చటనుండి యట్టిప్రకటన గావించితిని. ఆవీణాదండమే మీ దర్శనము చేయించినది. మీరాకకొరకే యిన్ని ప్రయత్నములు చేయుచుంటిని. ఇదియే నావృత్తాంత మిందొక యక్షరమయిన నసత్యములేదని యగ్ని చేతబట్టుకొని చెప్పగలను. నన్ను నిర్దుష్టరాలిగా నెంచి స్వీకరింపుడు వీనిం గజమిచ్చినది కావున మాతండ్రి వీనికి గజదత్తుడనుపేరు పెట్టెనని తనకథ యంతయుఁ జెప్పినది.

అప్పుడు విజయుండు గద్గదకంఠముతో సోమదేవభూదేవుం డెందున్నాడు. ఆయన కేమి యుపకారములు చేసితివని యడిగిన నొక యగ్రహార మిచ్చితినని చెప్పినది. ఇస్సిరో యిదియా నీవాయనకు చేసినమేలు చాలులే నీ యౌదార్యము వెల్లడియైనది. నీరాజ్యమంతయు నిచ్చినను నాపుణ్యాత్ముని రుణముతీరునా? సగము రాజ్యమయిన నీయలేకపోతివే నిన్నతడు కాపాడకపోయిన నేమయిపోదునని యాక్షే పించుచు నప్పుడే యాసోమదేవుని రావించి యతడుకోరిన దేశమంతయు ధారవోసెను.

పిమ్మట విజయుండును చంద్రుండును తాముపడిన యిడుమలన్నియు నా తరుణి కెఱింగించిరి. చంద్రుడా రాత్రి నొకగదిలో నా వీణంబాడి చారుమతిని రప్పించుకొని తనకథయంతయుం జెప్పిన నప్పడంతియు జింతించి యది మొదలా వీణమీదగాక యాకృతిని నోటితో బాడినను వచ్చుదాననని సమయముచేసినది. అతం డయ్యండజయానను రెండుదినములందుండ వేడికొని హేమ కామగువంజూపుచు బాంధవ్యమును గలిపెను. తదీయరూపలావణ్యాదివిశేషంబులు చూచి దేవయోనివిశేషుల సౌందర్య మత్యద్భుత మచింత్యమని చింతించి హేమ యా రామామణిఁ బెద్దగా మన్నించెను.

చారుమతి రెండుదినంబు లందుండి గజదత్తుని మిక్కిలి గారవించుచు దివ్యభూషాంబరంబు లిచ్చి యక్షలోకమున కరిగినది. పిమ్మట నా రాజపుత్రులిరువురు కుమారక్రీడాలాపవిలోకనకౌతురంబు దీపింపఁ గొన్నిదినంబు లందుండి తల్లిదండ్రులం జూడ వేడుకగలిగినంత నొకనాడు చతురంగబలముతో బయలుదేరి హేమయు గజదత్తుడును తోడరా గతిప్రయాణంబుల సింధుభాయినగరంబునకుఁ జని యూరికనతి దూరములోనున్న యొకతోటలో సేనలతో విడిసిరి.

తమవార్త గ్రామములో నెట్లు వెలయుచున్నదో తెలిసికొనవలయునను తలంపుతో నారాజపుత్రు లిరువురు ప్రచ్ఛన్నముగా నారాత్రి నావీటిలోనికిబోయి యొక యంగడియొద్ద గూర్చుండి కొన్నివస్తువులంగొని యాసెట్టితో వర్తకుడా! యీదేశపు రాజుపేరేమి? సంతతిగలదా? సంపన్నుడయి యున్నవాడా? యని యడిగిన నాకోమటి యిట్లనియె.

అయ్యా! మారాజునకుగల సంపద కుబేరునకులేదు కాని దైవికములగు చిక్కులు కొన్ని తటస్థించినవి. అతండు సంతానాపేక్షంజేసి నలువురు భార్యలను బెండ్లి యాడెను. పూర్వపుణ్యంబున నలుగురికి నలువురుపుత్రులు జనించిరి. వారి వివాహనిమిత్తము భార్యలు కలహించుటచే చాలినంత ద్రవ్యమిచ్చి యారాజు మీ యిష్టమువచ్చిన కన్యకలం బెండ్లియాడి రమ్మని పుత్రులను దేశములమీద కనిపెను.

వారువోయి పదునాలుగుసంవత్సరము లయినది. కొన్ని నెలల క్రిందట రెండవవాడును మూడవవాడు మాత్రము వచ్చిరి. పెద్దవాడును కడపటివాడును దారిలో తారసిల్లి తమసొమ్ము హరించి తమ్ము వంచించి తుదకొకనూతిలో బలవన్మరణము నొందినట్లు వీరిరువురు తండ్రితోఁజెప్పి యట్లు తాను తీసికొనివచ్చిన యొకచిన్నదానిచే సాక్ష్యమిప్పించిరి. ఆమాటలు వినినవా రెవ్వరును నమ్మలేదు. వారు వీరికంటె గుణవంతులును రూపవంతులు నగుటచే నట్టిపని చేయుదురా యని యందఱకు సందియముగానున్న యది. వారికిఁ జదువుచెప్పిన యుపాధ్యాయు లామాట లెంతమాత్రము నమ్మగూడదనియు వారు మిగుల గుణవంతులనియు చెప్పుచున్నారు. ఎవ్వరేమన్నను వారిజాడ యెక్కడనులేదు. రాజు పెద్దవాడయియున్నవాడు. భానుండనువానికే రాజ్యమిచ్చునని చెప్పుకొనుచున్నారు. ఎవ్వరికిని గాలము సమముగా నుండదుగదా? తత్పుత్రశోకము మాఱేని యుత్సాహము నడంగద్రొక్కినదని యచ్చటవార్త యంతయుం జెప్పెను.

అప్పుడు వారు క్రూరుల చేష్టలం గుఱించి వెరగుపడుచు దుర్జనుల శిక్షింపక పోవుటయు దుష్కృతమేయని తలంచుచు నప్పుడు తమనెలవునకుఁబోయి యమ్మరునాడు తమ రాకనంతయు బత్రికయందు వ్రాసి తండ్రి కనిపిరి. ఆపత్రిక చూచుకొని యారాజు సంతోషార్ణవంబున మునుంగుచు మేళతాళములతో నెదురేగి వారిని దోడ్కొనివచ్చి కోటలో ప్రవేశపెట్టి యాపూర్వకౌతుకముతో వారిమాట లాలింపుచు నాదినమున గడిపెను. వారితల్లులు ప్రాణావశిష్టులయి వారింజూచిన తోడనే చంద్రాగమనంబున సముద్రవీచికలవలె పొంగిరి.

అమ్మఱునాడొక సభజేయించి యారాజపుత్రు లిరువురు మంత్రిసామంత విద్వాంస పౌరవార మండితమయిన యాసభయందు దమ వృత్తాంతమంతయు నుపన్యాసముగా చెప్పి తమకు సోదరులు సేసిన ద్రోహకృత్యములన్నియు వక్కాణించిరి. ఆవృత్తాంతమువిని యందున్నవారెల్ల నారాజు మధ్యమపుత్రుల నిందించుచు వారిం గొనియాడదొడంగిరి.

వీరప్రతాపుడప్పుడే తనరాజ్యమంతయు పెద్దపుత్రుని యధీనము గావించెను. కావున విజయుడు రాజుయి దండ్యులయినవారిని విడచుట తప్పనియెంచి యా దుర్మార్గుల నిరువురను కోటముంగలనున్న స్తంభంబులంగట్టి వారమున కొకసారి పండ్రెండేసిదెబ్బలం గొట్టునట్లును వారితో గూడ రుచిరను మొగముమీద నుమియునట్లు నీరీతి సంవత్సరమువరకు చేయవలయుని శిక్షవిధించెను. వారియనంతరముగూడ నాకోట ముంగల వారి విగ్రహముల నినుపస్తంభములకుగట్టి సంవత్సరమునకొకసారి యట్లు చేయుచుందురు. ఈనగరమే యాసింధుభాయిది. చిరకాలమైసను నప్పటివారి సంతతివారు సేయించుచుండిరి.

ఇదియే వీనివృత్తాంతమని మణిసిద్దుడు చెప్పినవిని యా గోపకుమారుండు మిగుల సంతసించెను,

ఇరువది యెనిమిదవ మజిలీ

ఇరువది యెనిమిదవ నివాసదేశమం దొకతటాకముదాపుననున్న మంటపములో మూడు శిలావిగ్రహములున్నవి. వానిలో నొకదాని ముఖముమీద అంతా మహావిచిత్రమనియు, రెండవదాని భుజములమీద దైవయత్నమనియు మూడవదాని యొడలమీద నెవ్వరి కెవ్వరును లేరనియు పేరులు చెక్కంబడియున్నవి. ఆ పురుష విగ్రహముల కెదురుగా నొక స్త్రీవిగ్రహ మభిముఖముగా నున్నది. దాని భుజముల యందు విరాగిణియని వ్రాయబడియున్నది. ఆ వ్రాతలన్నియుం చదువుకొని