Jump to content

కాశీమజిలీకథలు/పదవ భాగము/227వ మజిలీ

వికీసోర్స్ నుండి

కున్నది. మాసోదరుల మాట జ్ఞాపకములేదు. అదియొక యింద్రజాలమువలెనున్నది. నావృత్తాంతము నాకు లెస్సగాఁ స్ఫురణకు రాకున్నది. ఈశుకరూపము నాకెట్లువచ్చినదో తెలియదు. నేనాకొండవాని చేతి కెట్లు వచ్చితినో తెలియదు. కోయది యిచ్చిన మువ్వలు గట్టినంతనే నిజరూపము దాల్చుట చిత్రముగానే యున్నది. ఆపుణ్యాత్ము రాలెవ్వతియో తెలిసికొనవలయు. దానియునికి యెందున్నదియో చెప్పుము. పోయి తెలిసికొని వచ్చెదనని యడిగిన నమ్ముదిత ముదిత హృదయయై యిట్లనియె.

సౌమ్యా ! మీరందుఁ బోనక్కరలేదు. మాకు మువ్వలిచ్చి పోయిన కోయది రేపుప్రొద్దున యిక్కడికి రాఁగలదు దాని కింకను వీనివెల యీయలేదు. దానివలన మీవృత్తాంతము తెలిసికొనవచ్చును. అంతదనుక భద్రముగా మీరిందు వసింపుఁడు మీ కే కొఱంతయునుండదు. మీరు కళాభిరాములు గదా. అన్ని విధములఁ బూజ్యులే. మాయతిధిసత్కారములఁ గైకొనుఁడని పలుకుచు నపూర్వోపచారములచే నారాధించుచు సుధు రాలాపములచే నతనిహృదయము గరుగఁజేసినది. అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది. తదనంతరోదంత మవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.

__________

227 వ మజలీ.

చిలుకలుగుఱ్ఱములైనకథ.

మఱునాఁ డుదయకాలంబునఁ భద్రిక రాజపుత్రికయొద్దకు వచ్చి భర్తృదారికా ! రాత్రి నీదర్శనమే యైనదికాదే. లోపలగదిలో నేమిచేయుచుంటివి? ఆమువ్వలు తీసికొనిపోయి కాళిందీరుక్మవతుల కిచ్చితిని. తమచిలుకలకుఁ గట్టెదమని చెప్పిరి. మఱియు ఱేపా కోయది వచ్చినప్పుడు కబురుచేయుమనిరి. మనచిలుక కా మువ్వలు గట్టితివా ! అని యడిగిన నయ్యువతి నవ్వుచుఁ గట్టితినికాని నీవు పెందలకడబోయి యా కోయసానిం దీసికొనిరావలయును. దానితోఁ జాల మాటాడవలసియున్నది. ద్వారముకడ వేచియుండుము పొమ్మని నియమించుటయు భద్రిక వల్లెయని యల్లన సింహద్వారముకడకుఁ బోయి కోయదానిజాడ నరయుచుండెను.

అంత కొంతసేపటి కొక కోయదొర చిలుకను బుజముపై నెక్కించుకొని చిలుకమువ్వలో యని యరచుచుఁ వీధింబడి వచ్చు చుండెను. భద్రిక వానింజీరి, కోయదొరా! నిన్ననొక కోయసాని యీలాటి మువ్వలే యమ్మఁదెచ్చినది. దాని నీవెఱుంగుదువా? అది నీకేమి కావలయునని యడిగిన వాఁడు అది నాపెండ్లామే. నేఁడు పని యుండి బసలో నిలిచినది. పైడిమువ్వ లేమైనం గొంటిరా ? చిలుకలకుఁ గట్టితిరా ? అని యడిగిన భద్రిక యిట్లనియె.

అయ్యో ! నేఁడా కోయదిరాలేదా ! దానికొఱకే యిందు వేచియుంటిని. నిన్న మాయంతఃపురమునకు వచ్చి చాలమువ్వ లమ్మినది. వానివెల నింకను నియ్యలేదు. నేఁ డుదయముననే వత్తునని చెప్పిపోయినది. మారాజపుత్రి క దానితోఁ ముచ్చటింపఁ జాలవేడుకపడుచున్నది. మంచి కానుకలీయఁ గలదు. ఇంటికిఁబోయి తీసికొని వత్తువా ? అని యడిగిన వాడు సానీ ! నేఁడువచ్చుటకు తీరికలేదు. రేపు ప్రొద్దున దప్పక పంపువాఁడ. నిందే వేచియుండుము అని పలుకుచు నాకోయదొర యవ్వలకుఁ బోయెను.

భద్రికయుఁ జిన్నవోయిన మొగముతోఁబోయి రాజపుత్రికతో నావార్త చెప్పినది. దాని మగని చక్కఁదనము పెద్దగా నామెయొద్ద నభినందించినది. ఆమాటలు విని రాజవుత్రిక, అయ్యో ! వానినిందు దీసికొని రాలేకపోయితివా ! అడవివాండ్రకడ మనకు( ఘోషా) యవ సరము లేదుగా. అనుటయు నట్లేచేయఁదలచితిని గాని నీవేమందువోయని సంశయించితిని. రేపు కోయదిరానిచో వానినే తీసికొని వచ్చెదనని చెప్పినది.

రాజపుత్రిక యంగీకరించి నేఁడు మధ్యాహ్నముగూడ వీధిం గాచికొని యుండుమని చెప్పి దాని నంపినది.

కోయదొర చిలుకమువ్వలోయని యఱచుచు రాజవీధులం దిరుగుచుఁ గ్రమంబున నొకకోమటివీధికిం బోయెను. ఆవీధిని వరుసగా సుబ్బిశెట్టి, రామిసెట్టి, పాపిసెట్టి, పెద్దిసెట్టి, అను పేరుగల నలువురు వర్తకుల దుకాణములున్నవి. సుబ్బి సెట్టికోయదొర కేకవిని తటాలున నంగడిదిగి వానికడకు బోయి వానిచేతనున్న మువ్వలబుట్ట బట్టుకొని కోయదొరా ! నిన్నవచ్చిన కోయది నీకేమగును? మాకుఁ గొన్ని పైడిమువ్వలమ్మినది. మీకడనున్న మువ్వలన్నియుఁ దీసికొనిరా? ఏకముగాఁ దీసికొనియెదమని చెప్పితమి అంగీకరించి పోయినది. మేము మారుబేరపు వర్తకులముగదా? ఏదో కొంచెము వెలతగ్గించి ఈమువ్వలన్నియునాకిచ్చి వేయుము తీసికొందును. అని యడుగుచుండ రెండవ యంగడివాఁడు రామిసెట్టి యట్టెలేచి యటవచ్చికోయదొరా! నీమువ్వలకు నేనిబ్బడి వెలయియ్యగలవాఁడ. నన్నియునాకిమ్మని కేకపెట్టెను.

పోపొమ్ము. నేనిదివరకే ధ్రువపరచుకొన్నాను. వీనిభార్యయే నిన్న బేరమిచ్చిపోయినది. తట్టవదలుమని సుబ్బి సెట్టి రామి సెట్టితో బోట్లాడుచుండెను. ఇంతలో మూడునాలుగు దుకాణముల వర్తకులు వచ్చి కోయదొరా ! యిటురా. నిన్నడవివానిఁజేసి వీరు మాయజేయుచున్నారు. సుబ్బి సెట్టికి నీభార్య జట్టి యిచ్చినదను మాట బూటకము వీని నెవ్వరికి నీయవలదు. పాట వేయుము. ఎవ్వరెక్కుడు సొమ్మిత్తురో వారికిత్తువుగాఁక. నీలాభమేలపోగొట్టుకొనియెదవు? అనిచెప్పిరి.

కోయదొర నవ్వుచుఁ జిలకలున్న వారికిఁ గాని నేనీ మువ్వ లమ్మను. మీకడఁ జిలుకలున్నఁ దీసికొనిరండు. వానికిగట్టి వింతగా మాటలాడింతునని చెప్పిన విని సుబ్బి సెట్టి కోయదొరా! చిలుకలు మా బంధువులయిండ్లలోనున్నవి. వారికొరకే కొనఁదలంచితిని. లేకున్న మా కవసరమేల? అని యడిగినఁ దక్కినవారు నట్లే పలికిరి. అప్పుడు కోయదొర యాలోచించి కానిండు. మీరు తగవులాడవలదు. మీనలువురకు సమముగాఁ బంచియిత్తు. నిన్ననిచ్చిన వెలయే యిండు. మీబంధువుల చిలుకలకుఁ గట్టుఁడు. అని పలుకుచుఁ దనయొద్దనున్న మువ్వల వారికి సమముగానిచ్చి తగినవెలఁ దీసికొనియెను. కోయవాఁడు వెఱ్ఱివాఁడులోకజ్ఞానములేనివాఁడనివాండ్రు తలంచిమువ్వలు తీసికొనిపోయిరి.

తరువాత సుబ్బి సెట్టి వాని నేకాంతముగాఁజీరి, కోయదొరా! నీకుఁ జిలుకమంత్రమేనా గఱ్ఱముమంత్రలే మైనా తెలియునా ? అని యడిగిన నబ్బో! మాకుఁ జిలుకమంత్రములకంటె గుఱ్ఱపుమంత్రములే యెక్కువగాఁ దెలియునని చెప్పెను. మేమొక గుఱ్ఱమును దెప్పించితిమి. దాని సుడులు లక్షణము పరీక్షించి యెంతవెలచేయునో చెప్పఁగలవా ? అని యడుగుటయుఁ గోయవాఁడు సందియమేలా? నాకా గుఱ్ఱమునుజూపుము. గుణదోషము లెఱింగింతునని చెప్పెను.

అప్పుడు సుబ్బి సెట్టి కోయదొరను రహస్యముగాఁ దన పెరటిలోనికిఁ దీసికొనిపోయి పలుపుత్రాటిచేఁ గట్టి వేయఁబడిన యాజానేయమగు నొక గుఱ్ఱమును జూపించెను. దానింజూచి కోయవాఁడు సంభ్రమముతో దాపునకుఁబోయి జూలుదువ్వుచు మేనునిమురుచు ముద్దుపెట్టుకొనుటయు నది హేషారవము చేయుచు నతని ముట్టెతో మూర్కొనుచుండెను.

సుబ్బి - కోయదొరా! ఈగుఱ్ఱము లక్షణములు పరీక్షించితివి గదా. మంచిదేనా?

కోయ - సెట్టిగారూ ! దీని మీరెక్క నుండి తెప్పించితిరి ? సుబ్బి - అబ్బో ! మాఅల్లుఁడు తూర్పురాజ్యమునుండి దీనిం గొనివచ్చెను.

కోయ - దీనికివెల యెంత యిచ్చెను ?

సుబ్బి - నీవు వెలగట్టిన పిమ్మటఁ జెప్పెదను.

కోయ -- దీనికింత వెలయనిలేదు. లక్షరూప్యము లిచ్చినను ఇట్టి గుఱ్ఱము దొరకదు.

సుబ్బి - సంతస మభినయించుచు, ఆలాగేమి ? మంచి మాట చెప్పితివి. మాయల్లుఁడు చిన్నగుఱ్ఱము తెమ్మనిన దీని నెక్కువ సొమ్మిచ్చి తెచ్చినాఁడు. దీని మేము భరింపజాలము. దీని నమ్మి పెట్టుము. నీకు బహుమతి నిత్తుము.

కోయ — అట్లే చేసెదంగాని లెస్సగా మేపుచుండుము. అని వారు మాట్లాడుచుండఁగా నాప్రక్కఁ గావురమున్న రామి సెట్టి తన గోడకు నిచ్చెన వేసికొని చూచుచు నామాటలన్నియు నాలించెను. కోయవాఁ డాయింటి గుమ్మము దిగినతోడనే రామి సెట్టి వానిం దనయింటికి రమ్మని సంజ్ఞచేసెను. ఆసన్నగ్రహించి యాసన్న వర్తియగు సుబ్బి సెట్టి వాని నందుఁబోవలదని యాటంకపరచెను. ఆవిషయమై వారిరువురును జేతులెత్తి తిట్టుకొనిరి. వారిజగడములు జూచి నవ్వుచు గోయదొర సుబ్బి సెట్టి మాట వినిపించుకొనక రామిసెట్టి యింటికిం బోయెను? కోయదొరం

రామి సెట్టి కోయదొరను మెల్లగా లోపలికిఁ దీసికొనిపోయి పారశీక జాతంబగు గుఱ్ఱము నొకదానిం జూపెను. కోయదొరం జూచి యావాఱువము గంభీరముగా సకిలించినది. అతఁడు దానిందువ్వుచు సెట్టిగారూ! మీరీగుఱ్ఱము నెట్లుసంపాదించితిరని యడిగిన నతండు సుబ్బి సెట్టి గుఱ్ఱమును నీవు జూచితివిగదా. అదియు నిదియు నొక్కచోటనే కొంటిమి. వీనిలో నేదిమంచిదియో వెల చెప్పుఁడని యడిగినఁ గోయవాఁడు సామీ! మీరు దీనింగొంటిరిగదా. వెలమీకుఁ దెలియదా? ఎఱుఁగనట్లు అడిగెద రేల! అని యుత్తరమిచ్చెను. సరే. నీవుసుబ్బి సెట్టి గుఱ్ఱము నమ్మెదననియొప్పుకొంటికివిగదా. దీనిగూడనమ్మి పెట్టుము. వానికన్న నెక్కుడు సొమ్మిత్తు నని చెప్పెను. అతం డొడంబడి యీవలకువచ్చి అట్లే తక్కిన వర్తకుల యిళ్ళకుగూడఁబోయియందలి గుఱ్ఱములఁజూచి సంతసించుచుఁ గోయదొర రేపువచ్చి వాని నమ్మెదనని చెప్పి యానాఁటి కింటికింబోయెను.

లోక మసూయాపరతంత్రమైనదిగదా! మఱునాఁడు సూర్యోదయముకాకమున్న యిరువురుభటులతో యవనకులస్థుఁడు దండనాధుఁడు సుబ్బిసెట్టి యింటికి వచ్చి వీధి నిలువంబడి.

దండ - అరే! సుబ్బి సెట్టికి ఎవడూరా యిక్కడ.

సుబ్బి - (గుండెఝల్లుమన నెదుటకువచ్చి సలాము చేయుచు) సాహేబుగారాండి నేనే సుబ్బి సెట్టిని.

దండ — అరే. బాంచోత్, నీవేనా! నీకీ ఘోడాకు చోరీ చేశావని నీపై మాకు హుకుంవచ్చింది. నీకీ ఏమి సెప్తావోయ్ .

సుబ్బి - సాహేబుగారూ! మామర్యాద మీఱెఱుఁగరా ! మేమాలాటి ఝూటాకోరుపనులు సేసేవారము కాము కిట్టనివారెవ్వరో మీకిట్లు తెలిపియున్నారు.

దండ — అరే. బాంఛోత్ మీకీఘఱ్ఱూలో ఘోడాకియున్నదాలేదా? అది సెప్పువోయి ?

సుబ్బి - మాయింట్లో యుండడమేమీ! రామి సెట్టి, పాపి సెట్టి పెద్దిసెట్టిగార్లింట్లో మాత్రము గుఱ్ఱములు లేవా! నన్నొక్కని నే నిర్భంధింతు రేల?

దండ - అరే. వాడికిజోలీ నీకీఏల! నీమాట సెప్పువోయి. సుబ్బి — మేము చోరీచేయలేదండీ. మాఅల్లుఁడు కొనితెచ్చిందియుందండి.

దండ - దానికి మాకు సూపూవోయి.

సుబ్బి - సాహేబుగారూ! వారిదికూడా సూడక నా దేసూడడ మేమండీ?

దండ - అరే. అందరిది చూస్తామోయి. పదపద లోపలకు

సుబ్బి - సాహేబుగారూ! పులావులోకి మంచి సన్నబియ్యం మున్నవి. తమయింటికి పంపనాండి?

దండ — అరే పులావుగిలావు ఇప్పుడు పనికిరావు. పదవోయి. నీఘర్రు సూడాలి. అని వానిం గెంటుకొని లోనికింబోయి పెరటిలో నాజానేయమైన గుఱ్ఱమును జూచి యాశ్చర్యపడుచు, అరే! కోమటీ! ఈఘోడా నీకీయెక్కడిది?

సుబ్బి - ఇది మాయల్లుడిదండీ. మాదికాదు. అతఁడు చాల భాగ్యవంతుఁడు మొన్న దీనినెక్కి యిక్కడకు వచ్చినాడండీ. ఎక్కడకొన్నాడో మాకుఁ దెలియదండీ.

దండ --- అరే కోమటీ! నీమాటలు ఝూటాగా నున్నవి. నీకీ అల్లునికీ ఈలాటి ఘోడాలూవోయి అని పలుకుచు నాగుఱ్ఱమును వీధిలోనికిఁ దోలించుకొనిపోయి నిలబెట్టి పరీక్షించుచుండెను.

సుబ్బి — సాహేబుగారూ! ఈలాటి గుర్రాలు వాళ్లయిళ్లలో గూడ నున్నాయిగందా. వారి నడుగ రేమీ? నన్నొక్కండనే నిర్భంధింతురా?

దండ - అరే నీకీతొందరయేలా! వారికీ ఘర్రులు చూస్తామోయి.

అమాటలు విని యావర్తకులుమువ్వురు తమ పెరటికోని గుఱ్ఱముల విప్పి రెండవదారిని వీధిలోనికిఁ దోలి తలువులువైచి యీవలకు వచ్చి నిలువంబడిరి. అప్పుడు దండనాధునితోఁ సాహేబుగారూ!వారే గుఱ్ఱములున్న వారు. వారిళ్లు చూడండని సుబ్బిసెట్టి బోధించెను. ఆమాటలు విని యావర్తకులు మువ్వురు సుబ్బిసెట్టినిదిట్టుచు సాహేబు గారూ! మాయిళ్లు వచ్చి చూడండి. గుఱ్ఱములు కనంబడనిచో వీఁడు జుట్టు గోయించుకొనునేమో యడుగండని తెలియపరచిరి.

అట్లు వారు మాట్లాడుచుండగనే యమూడుగుఱ్ఱములు వీధి తిరిగివచ్చి సకిలింపుచు మొదటి గుఱ్ఱముకడవచ్చి నిలిచినవి. సుబ్బి సెట్టి సాహేబుగారూ! చూచితిరా? ఇవిగో వాండ్రగుఱ్ఱములు మీహడావిడి చూచి పెరటిమార్గమున విడిచివేసిరి. వారి పెరటిలోనికిఁ బోయి చూచిన వీని చిహ్నములు గనంబడును పదుఁడని ప్రబోధించెను. అప్పుడు సుబ్బి సెట్టి భార్య గుమ్మముమీఁద నిలువంబడి మగని నుద్దేశించి నీవెప్పుడు నిట్లే తెలివిమాలినపనులు సేయుచుందువు, తోడివారు పెరటిలోని గుఱ్ఱములఁ బెరటిదారి నవ్వలకు దోలివేసి యేమియు నెఱుఁగనివారివలె వచ్చి నిలబడిరి. నీవొక్కడవే దొంగతనము చేసినట్లు పట్టుపడితివి. ఈగొడవలు మన కేల ? నిజము చెప్పరాదూ ? దీని నెక్కడనైన నెత్తికొనివచ్చితివాయేమి. మనము చిలుకంబెంచితిమి. కోయమంత్రమువలన నది గుఱ్ఱమైనది. మావలెనే వారికిగూడ గుఱ్ఱములైనవికాని వారు వానిం దాటించిరి. ఆమాట సాహేబుగారితోఁ జెప్ప రాదా? ఊరక గందరగోళము జెందెద వేమిటికని మందలించినది.

దండనాధుఁ డామాటలు విని అరే ఏమిరా అది మాకీ అట్లు కూయుచున్నది. చిలుక ఘోడాసేస్తుందీరా ఏమి. మాకీ అదియేమిటీ పనికిరాదు. పదపద. రచ్చకు పద. అని ఆగుఱ్ఱములతోఁ గూడ సుబ్బి సెట్టిని న్యాయస్థానమునకుఁ దీసికొనిపోయెను,

అని యెఱింగించువఱకుఁ గాలాతిపాతమైనది. పై మజిలీయం దవ్వలికథ మఱియుఁ జెప్పందొడంగెను.

__________