కాశీమజిలీకథలు/పదవ భాగము/228వ మజిలీ
228 వ మజిలీ.
చిలుక బ్రహ్మరాక్షసుడైనకథ.
ప్రఫుల్ల - సఖీ ! కాళిందీ ! ఆకోయది శ్రీవిష్ణుని జగన్మోహనావతారమేమో యని తలంతు నయ్యారే! దానిసోయగ మేమని చెప్పుదును? నేను పంపిన మువ్వలు మీ చిలుకకుఁ గట్టితిరా? విశేషము లేమైనఁ గనంబడినవియా ?
కాళింది – (నవ్వుచు) నేనుగూడ నిన్నిట్లే యడుగుచున్నాను. నీమాట చెప్పినతరువాత మామాటఁ జెప్పెదము.
ప్ర - రుక్మివతియు నట్లే యనునా.
రుక్మివతి – సందియమేలా మేమిరువురము నిన్నామాట యడుగుటకే వచ్చితిమి.
ప్ర - చెప్పెద వినుండు. నాచిలుక నామువ్వలు గట్టినతోడనే మనోహరత్వమున నొప్పినది. తెలిసినదియా ?
కాళిం - తెలియ కేమి ? విను మని మా చిలుకలకును గట్టినంత మా కత్యంత ప్రియతమములై యొసంగినవని యెఱుంగుము.
ప్ర — బళాబళ! ఇట్టిచోద్యము లెన్నడును కని విని యెఱుం.గముగదా ! కానిండు మీప్రియతముల ప్రతిబింబములు తీసికొని వచ్చితిరా ?
కాళింది - ఆ. ఇవిగో చూడుము. నీమనోహరరూపము గూడ జూపింపుము అని పలికినది,
ప్రఫుల్ల వారిచ్చిన చిత్రఫలకములు రెండును జూచి యాశ్చర్యపడుచుఁ దాను వ్రాసిన కళాభిరాముని చిత్రఫలకము వానిప్రక్క జేర్చి మూడును నొక్కపోలికగానుండుట పరిశీలించి యౌరా! యీ కోయది యింద్రజాలవేదినివలెఁ దోచుచున్నది. చిలుక లేడ యీదివ్య పురుషు లేడ, అని విస్మయమందుచుఁ బ్రఫుల్ల సఖులారా! మీరు వారివృత్తాంతము లడిగితిరా యేమనిరనియడిగిన కాళింది యిట్లనియె.
సఖీ ! అడిగితిమి. ఒకఁడు సుధర్ముఁడఁట. ఒకఁడు సులోచనుఁడఁట. పేరులుమాత్రము సెప్పిరి. తమవృత్తాంతము కొంతచెప్పిరికాని యాపక్షిరూప మెట్లువచ్చినది యెఱుంగరు. నీచిలుక యేమన్నది మువ్వురు నన్నదమ్ములని తోచుచున్నది. అనుటయు ప్రఫుల్ల ఔను. నీవన్నమాట సత్యయే. మాచిలుకయు నట్లే చెప్పినది. నేఁడు కోయదాని గట్టిగా నిర్భందించి యడిగిన నంతయుం దెలియఁగలదు. మీచిలుకల నేమిజేసి వచ్చితిరి? ఎగిరిపోవుదుమని చెప్పలేదా. అని యడిగినది.
కాళింది సరిసరి ఱెక్కలువచ్చిన పక్షులు పోవుటకుఁ బ్రయత్నింపక నిలుచునా? బలవంతమున నాపితిమి మేము వేగఁబోవలయు నాకోయదానిం జూడవచ్చితిమి. దానిజాడ దెలిసినదియా? అని వారు దాపుననున్న పరిజనులకుఁ దెలియకుండ సాంకేతికముగా మాట్లాడు కొనుచుఁడ నింతలోఁ గోయదానిం దీసికొని భద్రిక యరుదెంచినది. మువ్వురు వింతగా దానిం జూచుచుండిరి. రాజపుత్రిక దానిఁ గూర్చుండనియమించి వీరె నాసఖురాండ్రు కేవలము నిన్నుఁజూచు వేడుకతో నరుదెంచిరి. నిన్న నీవు వత్తుననిచెప్పి రాక మాకాశాభంగము గావించితివి. నేఁడు నీచిలుకమగనిం దీసికొనివచ్చితివి కావేమి? అని యడిగినఁ గోయది యిట్లనియె.
అమ్మా! నామగఁ డింటికడఁ బనిగలిగి నిలిచెను. నేను నిన్న రాలేకపోయితిని. మీచిలుకలకు మామువ్వలు గట్టితిరా. వింతమాట లాడుచున్నవియా. అని యడిగిన వారు నవ్వుచు వింతలేకాదు. మనుష్యులవలె స్పష్టముగాఁ బలుకుచున్నవని చెప్పిరి.
అంతలో భద్రిక యవ్వలికిఁబోయి వచ్చి సఖులారా! వింత లపై వింతలు వినంబడుచున్నవి. వీండ్రిచ్చిన మువ్వలు కోమటియింట నున్న చిలుకలకుఁ గట్టిరఁట. అవి గుఱ్ఱములైనవఁట. ఆవర్తకులాగుఱ్ఱముల నమ్మంజూపిన దొంగిలించిరని వారి నిర్భంధించి రాజపురుషులు చెరసాలం బెట్టించిరఁట. ఆమాటలు వింతగాఁ జెప్పికొనుచున్నారు. వింటిరా. అని చెప్పిన విని కోయది అమ్మా! అది యేవీధిని? చిలుకలు గుఱ్ఱములైనవియా నాలుగా అని సాభిప్రాయముగా నడిగినది. భద్రిక అవునని యుత్తరము చెప్పినది.
రాజపుత్రిక — దొరసానీ ! నీవు మాయావినివివలె నున్నావు. నీ వమ్మిన మువ్వలగట్టిన జిలుకలు గుఱ్ఱములేకాదు. మనుష్యులుగూడ నగుచున్నారు. ఇందలికారణ మేమియో చెప్పినంగాని నిన్నుఁ బోనీయము అని పలికిన విని కోయసాని అమ్మా ! ఏచిలుకయైన మనుష్యుడై నదియా ? తెలిసినఁ జెప్పుమని కోరినది. చెప్పిన నేమిచేయుదువని రాజపుత్రిక యడిగిన అమ్మా! మాతంత్రము సఫలమైనదని సంతసింతు మిదియ మాయభిలాష యని పలికినది. వారట్లు మాట్లాడు కొనుచున్నంతలోఁ బురములో గోలాహలధ్వని వినంబడినది. ఆయల్లరి యేమియో తెలిసికొనిరమ్మని రాజపుత్రిక భద్రిక సంపినది.
అది సింహద్వారముకడ కరిగి వచ్చి యురముపైఁ జేయిడికొని అమ్మయ్యో! బోగముదానియింటనున్న చిలుకకుఁ గోయలిచ్చిన మువ్వలు గట్టినతోడనే అదియొకబ్రహ్మరాక్షసుండై కనంబడినవారినెల్ల మ్రింగుచున్నాడఁట. జనులూరక పారిపోవుచున్నారు. కోటతలపులు వేయించివచ్చితిని. నయమే! మనచిలుక లట్లైనవికావు. అని చెప్పినది.
ఆమాటలు విని కోయది బాబో బ్రహ్మరాక్షసుండనిన నాకు మిక్కిలి భయము. వాడిక్కడికి రాడుగద అని వెఱపనభినయించుచున్నది. రాజపుత్రిక యీయింద్రజాలమంతయు నీవలనం గలుగుచున్నది. ఇంద్రజాలపింఛికవు నీవే వెఱచిన మే మేమందుము. నీవిఁక నిజము చెప్పినంగాని నిన్నిక్కడినుండి కదలనీయమని పలికినది.
అంతలో మఱికొందఱుపరిచారిక లుప్పరిగలెక్కి చూచి వచ్చి అయ్యో! అయ్యో!ఆ రాక్షసుఁడు స్త్రీల మీఁదఁబడి పరిభవించుచున్నాడు. వాని కెగరుటకు సామర్ధ్యముండుట గోడలు, కోటలు దాని నాటంక పెట్టఁజాలవు. కోయదొర గుఱ్ఱమెక్కి వానిం దరిమితరిమి కొట్టుచున్నాఁడు. పక్షివలె నెగసి వాని కందకున్నాఁడు. మీరందఱు లోపలకుఁబోయి తలుపులు వేసికొనుఁడు. వాఁడిందు రాఁగలఁడని చెప్పిన విని కోయదొరసాని అమ్మయ్యో నామగఁడే వాని దరుముచుండుట స్వామి ! వెంకటేశ్వరుఁడా! నాభర్తం గాపాడుమని ప్రార్థించినది.
అంతలోఁ నారక్కసుఁ డెగిరివచ్చి కోటలోబడి యల్లరిసేయుచుఁ గ్రమంబున రాజపుత్రికయున్న యంతఃపురమున కరుదెంచెను. అందున్న దాసీజన మాక్రందనము సేయుచుండెను. కోయది తటాలున నందున్న గదిలోదూరి తలుపులువైచికొన్నది. వాఁడు వచ్చి కాళిందిం బట్టుకొని యీడ్చుకొనిపోవుచుండెను.
రాజపుత్రిక మొఱ్ఱోయని యఱచుచు వారి వెంటబడినది. అయ్యాహాహాకారరవంబు లాలించి యాగదిలోనున్న కళాభిరాముఁ డీవలకు వచ్చి
క. కైదువు కైదువు తెండో
యేదేనిం గలిగియున్న నిట వీనిశిర
చ్ఛేదము గావించెద నిం
ద్రాదిసురల్ ముదముజెంద నాహవకేళిన్.
అని పలికిన విని భద్రిక యందున్న కరవాల మొండు దెచ్చి వాని కిచ్చినది. అతం డది గైకొని యసురమీఁదికురికి,
క. నిలునిలుదై త్వా! యబలం,గలచెద వేమిటికి? రమ్ముకయ్యము సేయం
గలవాఁడవేని నాఁతో, బలముం జూపించిపొమ్ము ప్రాణంబులతోన్.
నెగసి కోటదాటి యవ్వలకుఁ బోవుచుండెను. అప్పుడారాజపుత్రుఁడు వాని బుజంబుననుండియే కరవాల ముంకించి కుడికరంబు నఱికి పారవైచెను. వాఁడు మేనంతయుఁ గ్రొత్తనెత్తురుగార గర్జించుచుఁ బరిటీలు తిరుగుచుండెను.
వానినిమిత్తమై గుఱ్ఱములెక్కి, తిరుగుచున్న మువ్వురు మహావీరులు ఆకసమున వానిఁ జూచి శరముల నేసి నొప్పించిరి. మఱియు గళాభిరాముఁడు సమయమరసి యయ్యడిదమున రెండవచేయి గూడ నరికినంత ఱెక్కలు విరిగిన పక్షివలె వాఁడు పెద్దధ్వనిచేయుచు నేలం గూలెను. అప్పుడు కోయదొరయు మఱియిర్వురు వీరులును వాని దాపునకువచ్చి కళాభిరాముని గ్రిందఁబడకుండఁ గాపాడియారక్కసుని యవయవములన్నియు ఖండించి వానిం గతాసుంజేసిరి.
అప్పుడు కళాభిరాముఁడు గుఱ్ఱములపై నున్న సుధర్మ సులోచనులం గురుతుపట్టి సోదరులారా! మీతో దిరుగుచున్న యీకోయ వాఁడెవ్వఁడు. హరివర్మ యేమయ్యె? విద్యాసాగరునివార్త. యేమైనం
దెలిసినదియా? మన మెందువిడిపోయితిమో జ్ఞాపకములేదు. మీరెప్పుడిక్కడికి వచ్చితిరి? ఈరక్కసుఁ డెవ్వఁడు అని యడిగిన వారు, అన్నా! మనవృత్తాంతము చాలగలదు. ఆనక జెప్పుకొందముగాక .అదిగో నీగుఱ్ఱము అందున్నది ఎక్కుము. ఇక్కడికి మనము ధన్యులమే!! అని పలికిన విని సంతసించుచుఁ గళాభిరాముఁ డాగుఱ్ఱమెక్కి వారితోఁగూడ నగరమువీధులఁ దిరుగఁజొచ్చెను. పౌరులు రాక్షసభయంబునఁ దలుపులుమూసి తీయకుండిన వీరునలువురు నాలుగువీధులకుంబోయి. గీ. పౌరులార! వెఱవఁబనిలేదు క్రవ్యాదుఁ
డీల్గె నిందు నస్మదీయహస్త
కలిత హేతిధారఁ గౌతుకమేపారఁ
దిఱుఁగుడింక వీధితెరవులందు.
అని పలుకుచుఁ బౌరుల భయమువాపి యంతకుముందు హతశేషులైన పురరక్షుకుల కుదుటుగఱపి రాక్షసదేహంబు గాల్పుఁడని నియమించి “యావీరు లెవ్వరో భగవంతులై వచ్చి తమ్ము రక్షించిరని ” పౌరులు స్తుతియించుచుండ నాసత్రంబునకరిగి యొండొరుల వృత్తాంత మొండొరులకుఁ జెప్పికొని యానందించిరి. అని యెఱిగించి -
- __________
229వ మజిలీ.
బ్రహరాక్షసునికథ.
అన్నగరాధిపతియగు సోమదత్తుండు వేటకుఁ బోయివచ్చుచు వార్తాహరులవలన నయ్యుపద్రవము విని నాఁటి సాయంకాలమున కే పురముజేరి యాయుత్పాతమునకుఁ బరితపించుచుఁ గోటలోనే చిన్న సభజేసి ప్రధానితో నిట్లనియె, అమాత్య శేఖరా ! మనవీట నెన్నడును నిట్టి విపరీతము జరిగియుండ లేదు. చిలుకలు గుఱ్ఱములగుటయు బ్రహ్మరాక్షసుఁడగుటయు మనుష్యులం జంపుటయు జాలవింతగా నున్నది. తంత్రవేత్త లెవ్వరైన వచ్ఛి నగరముపైఁ బ్రయోగము సలిపిరా ? ఆరక్కసుం బరిమార్చిన మహావీరు లెక్కడనుండివచ్చిరి? ఆవార్తయంతయు సవిశేషముగాఁ జెప్పుమని యడిగిన నామంత్రియంతకుమున్ను రప్పించియుంచిన బోగముదాని ముందుకుద్రోసి నీ వెఱింగిన కథ నీయింట నేమిజరిగినదియో చెప్పుమని యడిగిన నావేశ్య రాజునకు నమస్కరించి యిట్లనియె.