Jump to content

కాశీమజిలీకథలు/పదవ భాగము/225వ మజిలీ

వికీసోర్స్ నుండి

నీకూఁతురు గర్భవతియైనదఁట. అందున్న ముసలిది వ్రాసినది. అది మగవాఁడుకాడు. ఆడుది యేయనియు గర్భవతి యగుటకుఁ గారణము తెలియకున్నదనియు యేమేమో వ్రాసినది. ఈవరము మాట దానికి నేనుజెప్పలేదు. ఎవ్వఁడో యాకోటలోఁబ్రవేశించెను. వారికి స్త్రీవలెఁ గనంబడియెను. ఆముగ్ధ కేమి తెలియును? చీచీ! వసుప్రియుని మూలమున బంగారమువంటి పుత్రికను భ్రష్టజేసికొంటిని. అయ్యయ్యో! అతం డట్లు చెప్పినంతనే అది వెఱ్ఱి యూహయని యాక్షేపించక ముద్దులపట్టి నై దేండ్లు దాటకమునుపే యడవిపాలు గావించితిని గదా! సీ. సీ. నావంటిమూర్ఖుం డెందును లేఁడు. లేక లేక గలిగిన బిడ్డకుం దగిన మగనిం దేలేక యొకానొక మూఢునివశము జేసితిని. అని యనేక ప్రకారముల దుఃఖించుచు గోపము పట్టఁజాలక యప్పుడే గుఱ్ఱము నాయత్త పఱుపుండని నియమించి సముచితయోధ పరివృతుండై యాపురుషుం బరిమార్చుటకై యాయరణ్యమున కరిగెను.

క. అనియెఱిఁగించి యతీశ్వరుఁ
   డనుమోదముతోడ సమయమగుటయుజని గో
   పునితో నవ్వలినెలవునఁ
   దనరఁగ వినిపించెనిటు కథాశేషమొగిన్.

___________

225వ మజిలీ.

చిలుక మువ్వలకథ.

ఉత్తరదేశమున దేవకూటమను పర్వతము కూట సముల్లిఖిత గగనంబై యొప్పుచున్నది. అన్నగంబున కుత్తరభాగమున గిరివ్రజమను గొప్పపట్టణము యలకాపురసదృశంబై ప్రకాశించుచున్నది. అప్పురంబునకు దేవకూటమే మూడుభాగముల కోటవలె నొప్పుచున్నది. ఆశైలశిఖరమెక్కినవారు పక్షులై యెగిరిపోవుదురని జనశ్రుతి యుండుటంబట్టి యెన్నఁడును గట్టియలకైన బౌరు లాకొండయెక్కరు. ఎక్కకుండ నధికారులుగూడఁ బెద్దప్రహరి పెట్టించిరి.

సోమదత్తుడనురాజు ఆదేశమును ధర్మంబునఁ బాలింపుచుండెను. గోపురద్వారమునఁ గావలియున్న యధికారులయనుమతిలేక చీమకైన నావీటిలోఁ బ్రవేశింపశక్యముకాదు. ఒకనాఁడావీటి నడివీధినుండి

క. పలురంగుల పూసల భూ
   షల మేనందాల్చి లలిత సమధిక తేజః
   కలిత యొక కోయనెలఁతుక
   చిలుకం దలదాల్చి ప్రీతి చెలువారంగన్ .

మాటలం బలికించి ముద్దువెట్టుకొనుచు బైడిమువ్వగుత్తులుగల తట్టఁ జంక నిడికొని చిలుకమువ్వలు చిలుకమువ్వలో యని కేకలు వెట్టుచు రాజమార్గంబునఁ దిరుగఁజొచ్చినది. పౌరు లాధ్వనివిని దాపునకుం బోయి యయెలనాగసోయగమున కచ్చెరవందుచు నీదే కులము ? నీ పేరేమి ? ఈమువ్వల వెల యెంత ? నీ మగఁ డెవ్వఁడు? అని యడిగిన కోయస్వరముతో భాబులార? మేము కోయవారము. కొండవాండ్ర కులగోత్రములతో మీకేమిపని? కావలసిన మువ్వలం దీసికొనుఁడు వీనివెల కొంచెమే కాని ఫల మధికముగానుండును. ఈ మువ్వలు గట్టినంత మాటలు రాని చిలుకలైనను వాచాలముగాఁ బలుకఁగలవని యెఱింగించినది.

అచిన్నది మాటాడినంజాలునని కొందఱు గోవాళ్లుతమకక్కర లేకున్నను మువ్వల బేరమాడి కొనుచుండిరి. కొందఱు మాయింటికి రమ్ము మువ్వలం గొనియెదమని కేకలువేయుచుందురు. చిలుకలున్నవారికేగాని యీమువ్వ లమ్ముటకు మాయజమానుని సెలవులేదు. అని పలుకుచు సందుగొందులకుఁ బిలిచినను బోవక యాకోయత. నడివీధింబడి తిరుగుచుండెను. ఆకాంతను వింతగాఁ జూచుచుఁ బౌరు లూరక మూగి వెనువెంట దిరుగుచుండిరి. సాయంకాలమునకుఁ దట్టలోనున్న మువ్వగుత్తులన్నియు నమ్మినది. చీఁకటిపడినతోడనే బసలోని కరిగినది. మఱునాఁడు బయదేరి క్రమ్మఱ నూరంతయుఁ దిరిగి నాఁడు జాముపొద్దువేళకే మువ్వల నమ్మినది.

మూడవనాఁడు రెండుజాములకే మువ్వలగుత్తు లై పోయినవి. నాలుగుదివసములు లట్లు పట్టణమంతయుఁ దిరిగి మువ్వలమ్ముచుండ నా యండజగమున సోయగము మాటలు చేష్టలు పౌరు లద్భుతముగాఁ జెప్పికొనుచుండిరి. ఆపట్టణప్రభువగు సోమదత్తుని కూఁతురు ప్రఫుల్ల యను చిన్నది మిక్కిలి చక్కనిది. చాల చదివికొన్నది. తొలిప్రాయములోనున్నది. అప్పడఁతి యెప్పుడును వింతవస్తువులజూడ వేడుక పడుచుండును.

భద్రిక యను పేరుగల యామెపరిచారిక యొకనాఁడామెకడకుంబోయి దేవీ ! ప్రఫుల్లా ! మనయూరొక కోయెదివచ్చి చిలుకలకు నగలుగాఁ గట్టదగు మువ్వలగుత్తులమ్ముచున్నది. దానిచక్కదనము నీవు జూచిన మిక్కిలి మెచ్చుకొనియెదవు. తదవయవములన్నియు మొలచినట్లు పోసినట్లు దిద్దినట్లొప్పు చున్నవి. ఆహా!

ఉ. కోయదియంచు దాని ననుకోఁదగదమ్మకచెల్ల! యద్భుత
     శ్రీయుతముల్ తదంగములు జేరలుమీరుఁ గనుల్ గళంబు నం
     కోయనఁబోల్చుఁ దేనెలొలుకుం బలుకం నగినంత నెన్నెలల్
     గాయుఁ గనం గుచద్వయవికాసము మోసముసేయు మానులన్ .

అక్కలికిచక్కఁదనం బటుండనిమ్ము. అక్కొమ్మ యమ్ముచున్న పైడిమువ్వలు చిలుకకాలికిం గట్టిన వింతగాఁ బలుకునఁట. మాటలు రాని చిలుకలఁ బలికించునఁట. మనము మొన్న క్రొత్తగాఁగొన్న కొండచిలుక లెస్సగాఁబలుకనేరదు. ఆకోయెతను మన హజారముకడ నిలిపివచ్చితిని. మనచిలుకం జూపింత మక్కాంతం దీసికొనిరానా? యని యడుగుటయు నవ్వుచు నారాజవుత్రిక భద్రికా! దీనికింత యుపన్యాసమేల ? వేగఁబోయి తీసికొనిరమ్మని యజ్ఞాపించినది. అది వోయి తృటిలో నాకుటిలాలకం దీసికొనివచ్చి రాజపుత్రికముందు నిలిపినది.

ప్రఫుల్ల యప్పల్లవపాణిసోయగ మాపాదమస్తకము విమర్శించి చూచుచు నాశ్చర్యపడి కూర్చుండ నియోగించి,

ప్రఫుల్ల - కోయెతా! నీపేరేమి?

కోయెది – నాపేరు కామాచ్చి.

ప్ర - నీకాపుర మేయూరు ?

కో - అమ్మా! కొండవాండ్రకు నొకచోఁ గాపురముండునా? అన్నియూళ్ళు మా కాపురములే.

ప్ర - నీకుఁ బెండ్లియైనదియా?

కో -- మాకుఁ బెండ్లియేమిటి ? మగని వరించుటయే పెండ్లి.

ప్ర - పోనీ నీవు మగని వరించితివా ?

కో - ఈచిలుకయే నామగఁడు చిలుకయే దైవము చిలుక మూలముననే యీయేసము. మాకులమునకుఁ జిలుకయే జీవము చిలుకనే వరించితిని.

ప్ర -- బోటీ! నీమాటలు మాకుఁ దెలియలేదు. మీకు జిలుకవలవ జీవనమంటివి లెస్సయే చిలుక మగఁడెట్లగును?

కో — అమ్మా! కోయమాటలు కొండమాటలుమీకెట్లు తెలియఁగలవు ? మగఁడనఁగా నెవ్వడు ప్రాణమిచ్చునో వాఁడే మగఁడు. నేను జిలుకను. నాకీచిలుక మగఁడు.

ప్ర - కోయెతో! నీవు నిజముచెప్పక కపటముగా మాట్లాడుచుంటివిగదా.

కో — అమ్మా! కోయవాండ్రకుఁ గపటములు దెలియవు. మీయింటఁ జిలుకలున్నవఁట చూపుఁడు వేగఁ బోవలయు.

ప్ర - కోయసానీ! కొలదిదినములక్రిందట మేమొక కొండ చిలుకం గొంటిమి. అది పండ్లుతినదు. మాటలాడదు. బగబెట్టుకొన్నది కాఁబోలు దానికి మాటలు నేర్పుము నీకు మంచి పారితోషిక మిప్పింతును.

కో - మామువ్వలంగొని చిలుకలకుఁ గట్టుటయేమాకుఁ బారితోషికము. అమ్మా! ప్రొద్దుపోయినది. ఏదీ! మీచిలుక నిటుతెప్పింపుఁడు. మువ్వగుత్తికట్టి పలికించి పోయెదను.

ప్ర - కలికీ ! చిలుకపలుకులకన్న నీపలుకులు విన ముచ్చటగా నున్నవి. మాయింటఁ గొన్నిదినములుందువా? నీకు మంచిపుట్టములు వస్తువులు దాల్చ నిప్పింతును.

కో - అమ్మయ్యో! మే మొరులపుట్టములు గట్టము. ఈరేయి నిందుండిన మాజట్టువాండ్రు శంకింపరా? చీకటిపడువేళ యగుచున్నది. తల్లీ! చిలుకం జూపవా! నేనింటికిఁ బోవలయును.

ప్ర - అబ్బా! సానీ, ఊరకపోయెదనని తొందరపడియెదవేల చీఁకటిపడిన సాయమిచ్చి పంపుదునులే. నీతలిదండ్రు లెందున్న వారు! ఇందువచ్చిరా?

కో - ఇందురాలేదు. వా రేదేశమో పాలించుచున్నారు. ఎందున్నారని చెప్పుదును?

ప్ర - కోయతా! మఱియొకమాట యడిగెదఁ జెప్పుము. మీ కులములోని యాఁడువారందఱు నీవలెనే యుందురా?

కో - అమ్మా! ఆమాట నే జెప్పఁగలనా! మీవంగడమువా రందరు మీవలె నుందురేమో చెప్పగలరా?

ప్ర - అబ్బో! కోయసాని గడుసుదియే. ఏమోయనుకొంటిని.

కో - అమ్మా! అడనివాండ్రము గడుసుఁదన మెట్లువచ్చును? ప్ర - నీకుఁ బిల్లలా?

కో - నేనే పిల్లను. నా కేటి పిల్లలు?

ప్ర - నీమగనికి నీయందిష్టమేనా?

కో — ఇష్టము కా కేమి? ఇదిగో నామగఁడు సంతతము నా నెత్తి పైనుండును.

ప్ర - ఈచిలుక నమ్మెదవా?

కో — అమ్మా! ఈచిలుక నామగఁడని చెప్పుచుండ నమ్మెదవా యని అడుగవచ్చునా ?

ప్ర - సానీ ! నీవు నిజము చెప్పక దాచుచున్నావు గదా.

కో - లేదు తల్లీ ! లేదు నిజమే చెప్పితిని. ప్రొద్దుపోయినది చిలుకం దెప్పింపవా ? పోవలయును.

ప్ర - సానీ ! నీ కీతొందర యేల. నీమువ్వలన్నియు నీవు చెప్పిన వెలయిచ్చి నేనే కొనియెదను. నీవు వీనినమ్ముట కిఁక మఱియొక వీధికరుగ నవసరములేదు. పోవలసియున్న రాత్రి భోజనముసేసి పోవుదువుగాని నీమగఁడు నీవెంటనే యున్నాడుగదా ? ఏవి ! నీబుట్టలో నెన్నిమువ్వగుత్తులున్నవి యో చూపుము. అన్నియుం దీసికొందుము.

కో - అమ్మా ! మీయొద్ద నొక్కచిలుకయే యున్నదఁట. అన్నిగుత్తులు నేమిసేసికొందురు. ఇదిగో యీగుత్తుమాత్రమే మీకిచ్చుచున్నాను. మీరే దాని కాలికిం గట్టుడు. నేను పోయివచ్చెద.

ప్ర - సరిసరి. అదియా నీయభిప్రాయము. మాయింటఁ జాల చిలుకలున్నవి. ఇవికాక మామంత్రికూఁతురు పినతల్లికూఁతురుగూడఁ జిలుకలం బెంచుచున్నారు. మాకు చాలగుత్తులు కావలసియున్నవి. అన్నియు నీయవలసినదే.

కో - అట్లైన వీనినన్నిటిఁ దీసికొనుఁడు. నాకు సెలవిండు పోయివచ్చెద. ప్ర - సొమ్మెంత యీయవలయునో చెప్పుము.

కో -- మీకుఁ దోచినంత యీయుఁడు గొప్పోరు. మీకడ బేరములాడుదునా రేపు వెండియువచ్చి సొమ్ము పుచ్చుకొనియెద నీ రాత్రి వీనినెల్ల మీ చిలుకలకుఁ గట్టుఁడు.

ప్ర - సానీ! మంచిమాట చెప్పితివి. రేపుపెందలకడ రమ్ము. నీతోఁ జాల ముచ్చటింప వలసియున్నది. నీనిమిత్తము ఈభద్రికనుద్వారము కడ నిలిపెదను. నీవు రేపురాకున్న నీకే నష్టముసుమీ!సొమ్ముచేరదు.

కో — మీకొఱకువత్తునా తల్లీ ! ఈరాత్రి మువ్వలఁ జిలుకలకుం గట్టి యెట్లుపలికినదియుఁ బ్రొద్దున జెప్పవలయుంజుడీ. ఇఁక ననుజ్ఞయిండు పోయివచ్చెదనని లేచి బుట్ట జంకనిడుకొని చిలుకను ముద్దాడుచు భద్రిక గోటగుమ్మముదనుక సాగనంపి తప్పక రేపు ప్రొద్దున రమ్మని చెప్పుచుండ వల్లెయని పలుకుచు వీధింబడి పోయి పోయి బాటసారులు నివసించు నూరిబయలునున్న పెద్దసత్రమునకుం జని యందొకగదిలోఁ బ్రవేశించి తననెత్తిపైనున్న చిలుక కేదియో యోషధి తగిలించినది. అది యంతలోఁ జక్కనిపురుషుండై నిలువంబడినది. అకోయత తానుగావించిన పనులన్నియు నాపురుషున కెఱింగించుచు నారాత్రిఁ తృటిగా వెళ్ళించినది.

___________

226 వ మజిలీ.

చిలుక పురుషుడైనకథ

కోయది యఱిగినవెనుక రాజపుత్రిక భద్రికతో దానియందమునుగుఱించి ముచ్చటించుచు మాటలు వర్ణించుచు సాహసము నభినందించుచు నిర పేక్షిత్వ మగ్గింపుచుఁ బైడిమువ్వల విమర్శించి అవి కేవలము సువర్ణముతోఁ జేయఁబడినవిగాఁ దెలిసికొని వెల తక్కువగా