కాశీమజిలీకథలు/పదవ భాగము/224వ మజిలీ
మూయుచు మెల్లగా బోటీ! యిందిట్టిమాట పలుకఁగూడదు. చాటునకుఁబోయి మాటాడుకొందము రమ్ము అని చేయిపట్టుకొని యతని నొక విజనప్రదేశమునకుఁ దీసికొనిపోయి కూర్చుండఁబెట్టినది. ఆతండు వెండియునిట్లనియె.
అవ్వా! ఇందుఁ బురుషనామోచ్చారణమే పనికి రాదనుచున్నావు. తత్కారణము తెలిసికొన మఱియుఁ తొందరగానున్నది. అది యట్లుండె నీప్రమద్వర తలిదండ్రు లెవ్వరు? ఆమెకు వివాహ మైనదియా? మీకందఱకు నీమెయే యేలికయని తోచుచున్నది. ఈమెయేకాక యీమె చెలికత్తియలకుఁ గూడఁ బెండ్లికానట్లున్నది. మీకథ యెఱింగించి నాకు శ్రోత్రానంద మాపాదింపుమని కోరిన నావృద్ధ తమవృత్తాంత మిట్లు నివేదించినది.
అని యెఱింగించి, .....తదనంతర వృత్తాంతమిట్లు చెప్పెను.
- __________
224 వ మజిలీ.
ప్రమద్వరకథ.
కాశ్మీరదేశ ముత్తరదేశములలో నెల్లధసంపన్నమని ప్రసిద్ధివడసినది. ఆదేశమునకు రాజధాని శ్రీనగరము. దాని శ్రీవర్ధనుఁడనురాజు పాలించుచుండెను. కుబేరతుల్యుఁడగు నమ్మహారాజునకుఁ బెద్దకాలము సంతానము కలిగినదికాదు. ఆనృపునిభార్య నిత్యము సావిత్రీపూజ గావించుచుండునది. అద్దేవి ప్రసాదంబునఁ గొంత కాలమున కాభూకాంతున కొక యాఁడుపిల్ల కలిగినది. ఆశిశువుజాత కర్మోత్సవమునకు శ్రీవర్ధనుఁడు తనకు మిత్రులుగానున్న చక్రవర్తులకుఁ బెక్కెండ్రకు నాహ్వాన పత్రికలు పంపి రప్పించుకొనియెను. అయ్యుత్సవసమయంబున నమ్మహారాజు కోటిదీనారములు దానధర్మ ములుక్రింద వ్యయపెట్టెను. మహారాజులనెల్ల నధికవ్యయమున కోర్చి గౌరవప్రతిపత్తులతో సత్కరించెను. మఱియు నద్భుతతేజంబునఁ బ్రకాశించు నాబాలికామణికిఁ బ్రమద్వరయను పేరుబెట్టెను.
క్రమంబున వచ్చిన బందువులు ప్రభువులు సామంతులు తమ తమదేశములకుఁబోయిరి. వసుప్రియుఁడను నేపాళచక్రవర్తి మాత్ర మానృపతి కత్యంతమిత్రుఁడగుట నతని నిర్బంధమున మఱికొన్నిదినము లందు వసించెను. ఆడుపిల్ల పుట్టినతోడనే తలితండ్రులు దానికి సంబంధము లాలోచించుచుందురు. అందుఁ జక్రవర్తుల బిడ్డలకు దగిన సంబంధము దొరుకుట మఱియుఁ గష్టము. శ్రీవర్ధనుం డొకనాఁడు వసుప్రియునితో ముచ్చటించుచు నిట్లనియె.
మిత్రమా! యిప్పుడున్న రాజులలో మనకున్న మైత్రి యవ్యాజమైనది. ఇంటికిఁ బోయెదనని నీవూరక తొందరపడియెదవు. నీకుమారుని బారసాలకువచ్చి నేనాఱుమాసములు వసించితి జ్ఞాపక మున్నదియా? మఱియు నీతో నొకసంగతి ముచ్చటింపఁ దలంచుకొంటిని. అప్పుడే తొందరయేమని : పరిహాసమాడెదవేమో నాకిప్పటికి డెబ్బదియేండ్లు దాటినవి. నేఁటికిగదా యుత్సవమని పేరుపెట్టి మిమ్ముల నందఱిని రప్పించుకొంటి. నీకుమారునకైదేండ్లున్నవి. నాకు నీతో వియ్యమందవలయునని యభిలాషగానున్నది. అమాట నీతోఁ జెప్పుటకు నేటికి గదా నాకధికారము గలిగినది. వివాహమునకిప్పు డే తాంబూలములు పుచ్చుకొందము, అన్నివిధముల మన యిరువురకు సరిపోవును. మనమైత్రి దీన మఱింత బలమగు నీయభిప్రాయ మేమనవుఁడు నవ్వుచు నానరేంద్రుఁడిట్లనియె.
వయస్యా! నీయభిలాష నాకానందము గలుగఁజేయుచున్నది, కాని నెలయైన నిండకుండ బెండ్లికిఁ దాంమూలములు బుచ్చికొనిరనిన నొరులు నవ్వకమానరు. అదియట్లుండె. ప్రతిపురుషునకు నేదియో కొంతపిచ్చి యుండకమానదు. నీవుమంచిసమయములోనే ప్రస్తావము దెచ్చితివి కావున జెప్పెదవినుము. నాకుమారుసకుఁ జేసికొన దగిన గుణములుగల కన్య దొరుకుట కష్టము. నీకూఁతు నిప్పటినుండియు నట్టిదానిగాఁజేయ దలంపుగలిగియుంటివేని నాకుమారునకుఁబెండ్లిజేకొనియెదను.
శ్రీవ - నీకోడలి కెట్టిగుణము లుండవలయునో చెప్పు మిప్పటి నుండియు శిక్షించి యట్టిదానిగాఁ జేసెదను.
వసు — జనసంఘమందుఁ బెరిగిన కన్యకల నెట్లు శిక్షించినను సంపర్కదోషంబునఁజేసి దుర్గుణము లలవడకమానవు.
శ్రీవ — ప్రత్యేకము పండితుల నుపాధ్యాయులుగా నియమించి కావ్యనాటకాలంకార గ్రంథములు చదివింతును. పతివ్రతాచరిత్రముల బోధింపఁజేయుదును. ఇష్టమున్న సంగీతముగూడఁ జెప్పింతు వలదనిన మానిపింతును. ఏమందువు ?
వసు - సరి సరి. మంచిమార్గమే. పురుషులకడఁ గావ్యనాటకాలంకార గ్రంథములు చదివించినచోఁ గన్యకలకు వేరేకామతంత్ర రహస్యము లుపదేశింప నవసరములేదు. బిల్హణచరిత్రము నీవు చదివియుంటివా ! శ్రీవ - స్త్రీలు పురుషులకడఁ జదువఁగూడదనియా, కావ్యములే చదువఁ గూడదనియా, నీయభిప్రాయ మేమియో నాకుఁ దెలియకున్నది.
వసు — వయస్యా ! నాయభిప్రాయము వినుము. పురుషసహవాసంబునఁ గన్యకలకుఁ గామాది దుర్గుణము లుదయించును. అలవడిన గుణము బోఁగొట్టుకొనుట నరుంధతికిని శక్యముకాదు. పైకి మహాపతివ్రతలవలెఁ దోచుచుందురు కాని మనసుచేతను వ్యభిచరింపని స్త్రీయుండదు. నేను స్త్రీ చిత్తదోషముల బాగుగ నెఱుంగుదును. సుందరుఁ డైన వురుషుం జూచినప్పుడు స్త్రీకి బుద్ధిమారును.
శ్రీవ — అందుల కేమందువు ? స్త్రీలందరు వ్యభిచారిణులనియే నీయభిప్రాయము ?
వసు - అవును. సందియమేల? కాయముచేతఁ గాకున్నను మనసుచేత వ్యభిచరింపని వారుండరని శపథముజేసి చెప్పఁగలను.
శ్రీవ - మఱి నీకుమారున కాఁడుదానం బెడ్లిజేయవాయేమి?
వసు — అందులకే నీకూఁతు నిప్పటినుండియు శిక్షింపుమని చెప్పుచుంటిని.
శ్రీవ - ఎట్లు శిక్షింపవలయునో నీవే చెప్పుము.
వసు - -నాయభిప్రాయము వినుము, కన్య జ్ఞాసమువచ్చినది మొదలు భర్తమొగము జూచువఱకుఁ నీనడుమ బురుషుం జూడఁగూడదు. పురుషజూతి యున్నదనికూడఁ గన్యకుఁ దెలుపఁ గూడదు. నీకూఁతు నిగూడ స్థలంబున నునిచి యిప్పటినుండియు నట్లు శిక్షింతువేని గోడలిగాఁ జేసికొనియెదను. నాయభిప్రాయము తెలిసినదియా?
శ్రీవ - బలే. బాగు. నీకోరిక లెస్సగానున్నది. బాలిక పురుషశబ్ద మెట్లు వినకుండును ? తండ్రియు నన్నయుఁ బురుషులుగారా ? వారిం జూడకుండ నెట్లుండును ? అట్లున్నచో లోకజ్ఞాన మేమియుండును! అట్టిదానిం బెండ్లియాడిన నేమి యానందము ?
వసు — వయస్యా ! నాకున్న యనుభవము నీకులేదు. సహజానురాగముతోఁ గూడిన చేడియంగూడిన వేడుక యనిర్వాచ్యమైనది. పెక్కేల. నీకూఁతు నట్టిదానిగాఁ జేయఁగలిగితివేని నాకుమారునకుఁ జేసికొందను. లేకున్న నీప్రస్తావము కట్టిపెట్టుము.
శ్రీవ — మిత్రమా ! నీయభిప్రాయము వడువున నా బాలికం గాపాడెద. స్త్రీలచేతనైన విద్య చెప్పింపవచ్చునా?
వసు — భాషాభివృద్ధికొరకు జదివింపవలసినదియే కాని పురుషుఁడున్నాడను విషయముగల గ్రంథములు చదివింపఁగూడదు. సంగీతము చెప్పించవచ్చును. శ్రీవ — అట్లైన వినుము. మా దేశములో నుత్తరభాగమున మహారణ్యము గలదు. అందు స్వాదుజలఫలతరు మనోహరంబగు నుపవనంబొండు నందనవనంబునుబోలి యొప్పుచున్నది. అవ్వనంబుజట్టును బ్రహారిఁబెట్టించి యౌవనము వచ్చుదనుక నాపుత్రిక నందుంచి సమ ప్రాయముగలకన్యకలనూర్వురతోఁబోషింపించెదను. అనుమతింతువా?
వసు — (చెవిలో నేదియోచెప్పి) అట్లు చేయుము. దానివలనఁ బ్రమాద మేమియు జరుగదు. అని చేయఁదగిన నియమములన్నియు బోధించెను. వసుప్రియుఁ డంగీకరించి యట్టి యేర్పాటుఁ గావించెను. మహారణ్యమధ్యమందున్న యీవనముచుట్టు పెద్దగోడ పెట్టించి పడమరదెస నొక్కటే సింహద్వార మేర్పరచెను. ఇందనేక విచిత్రభవనముల నిర్మింపఁజేసెను.
ప్రమద్వరకు మూఁడేండ్లు దాటినతోడనే నూర్వుర ధాత్రేయుల దాసీసహస్రముల సమప్రాయము గలబాలికల వేయిమంది సహాయముగానిచ్చి చేయవలసిన కృత్యములన్నియుఁ బోధించి వీరందఱకుఁ చదువుచెప్పునట్లు నన్ను పాధ్యాయినిగా నియమించి యిదుఁ జేర్పించెను. ఇందున్న జవరాండ్రందఱు నామెతోఁ బెరిగినవారే. తలిదండ్రుల నెఱుంగనివారే. పెద్దదాసీలందరు దేశమునకుఁ బంపఁబడిరి సంవత్సరమున కొకసారి శ్రీనగరమునుండి శ్రీవర్థనుఁడు సంభారములఁ బంపుచుండును. స్త్రీలే తీసుకొనివత్తురు.
ఈవార్తలన్నియు నెఱింగినదాన నేనొక్కరితనే యిందుంటిని. తక్కినవారి కెవ్వరికి నీరహస్యము తెలియదు. శ్రీవర్థనుఁడు వసుప్రియుని యుపదేశంబున నీప్రాంతమందున్న యొక మహాయోగి నాశ్రయించి యేవియో వరములు వడసి వచ్చెనఁట. దానంజేసి మాకు వ్యాధులవలన మృగములవలనఁ జోరులవలన బాధగలుగుటలేదు. ప్రమద్వర సంప్రాప్తయౌనయై యున్నది. వసుప్రియుని కుమారుఁ డును నీసుకుమారిం బెండ్లియాడుట కుఱ్ఱూటలూగు చున్నాడఁట. ముందరి వసంతములో వీరికి వివాహముఁకాగలదునీవు క్రొత్తదానవు గావున నింతచెప్పవలసి వచ్చినది.
మఱియు నీరాక మాకాశ్చర్యము గలిగించుచున్నది. మాకోట సింహద్వార మెప్పుడు మూయఁబడి యుండును. నా సెలవులేనిదే తెఱచుటకు వీలులేదు. నీవిందుల కెట్లువచ్చితివో నీవృత్తాంతము చెప్పవలసియున్నది. మారాజవుత్రికకు నీయందింత ప్రేమ యెట్లుకలిగినది యో! యెఱింగింపుమని యడిగిన నతండు వెండియుఁ దనయవయవములు చూచుకొని పురుషుఁడుగానే యుండుట దెలిసికొని ఔరా! “ఇంతకధజెప్పిన యీ ముసలిదికూడ నన్నాఁడుదానిగానే సంబోధించినది. కానిమ్ము. ఇదియునుపకారమైనది. నేనుగూడఁ గపటముగానే మాట్లాడెదనని తలంచి " యామెకిట్లనియె.
అవ్వా ! నారాక మీకు విచిత్రము కలుగఁజేయకమానదు. మాది దక్షిణదేశము. నేను క్షత్రియవంశంబున జనించితిని. అశ్వారోహణాది వీరధర్మముల నాకు మిక్కిలి పాండిత్యము కుదిరినది. నేను తురగమెక్కి దేశసంచారముచేయుచుఁ బెక్కు దేశములుతిరిగి తిరిగి దైవప్రేరణంబున నీయరణ్యంబున కరుదెంచితిని. ఇందుమీకోట గోడ గనంబడినది.
ఉచ్చైశ్రవస్తుల్యమగు నాఘోటకము లంఘనపాటవంబున నన్నీ కోటలోఁ బ్రవేశపెట్టి తానునాకమున కరిగినది. తరువాత మీ రాజకుమార్తె గనంబడి తీసికొనివచ్చినదని తత్సమయోచితములగు మాటలచే నామె సందియమును బోగొట్టెను. ఆవృద్ధ తల్లంఘన ప్రౌఢిమకు వెఱఁగుజెందుచు సుందరీ! నీకింకను వివాహముకాలేదా! ఈతొలిప్రాయంబున దేశయాత్ర సేయుచుంటివేమి ! రాచవారికిది తగునా? బంధువు లాక్షేపింపలేదా? అని యడిగిన, నతండిట్లనియె. అవ్వా ! నీయెఱుంగని ధర్మములుండవు. స్త్రీలకు గోటలు నగడ్తలు శుద్ధాంతములు వస్త్రములు ఆవరణములుకావు. వృత్తమే యావరణమని చెప్పఁబడియున్నది. వసుప్రియునకుఁబురుషశబ్దమే వినని కన్యకం గోడలిగాఁ జేయుతలంపు గలిగినది. నాకు దేశసంచారము జేసి యాత్మేచ్ఛా విహారంబునం బెండ్లియాడువలయునని బుద్ధిపుట్టినది. ఇట్లే లోకులకు భిన్నాభిప్రాయములు గలిగియుండును. నే నింకను వివాహమాడలేదు. మీరాజపుత్రికతోమైత్రి గలిసినదికాదా. సజ్జన సహవాసంబు శోభనంబులఁ గూర్పకమానదు. ఆమెతో నేను వివాహమాడెదనని యుత్తరముచెప్పెను.
ఆమాటలువిని యావృద్ధ ముద్దియా నీసుద్దులువినినఁ బెద్దయు జదివినదానివలెఁ గనంబడు చుంటివి. నీకు లోకజ్ఞానము లెస్సగా నుండును. మారాజవుత్రికడ నెన్నఁడును. బురుషచర్యా ప్రసంగము తేవలదుచుమీ. ఈమాటయే జ్ఞాపకముంచుకొనవలయునని చెప్పుచుండఁగనే యొక పరిచారిక వచ్చి అవ్వా! ప్రమద్వర యుప్పరిగపైఁ గూర్చుండి సంగీతము వినుచున్నది. ఆమెపేరేమియో నాకుఁ దెలియదు క్రొత్తగా వచ్చినదఁటకాదా! ఆమెను వేగముగాఁ దీసికొని రమ్మన్నది. అని చెప్పిన విని వృద్ధకొమ్మా! పదపద ప్రమద్వర నీకొఱకుఁ వేచియున్నదట మఱచియైన నామాట పలుకకుమీ యని యుపదేశించిన వల్లెయని యతండు పరిచారికవెంట మేడమీఁదికిబోయెను.
అతనింజూచి ప్రమద్వర తటాలునఁ బీఠమునుండిలేచి నాలుగడుగులెదురువచ్చి చేయిపట్టుకొని తనప్రక్కపీఠముపైఁ గూర్చుండఁ బెట్టుకొని సఖీ ! మాయుపాధ్యాయిని వృద్ధాంగనం జూచితివా ? మాట్లాడితివా ! నీకుఁ దగిన సమాధానమిచ్చినదా ? అని యడిగిన నతండు చూచితిని. మాటాడితిని. నీయుపాధ్యాయిని మంచితెలివిగలదని యుత్తరము జెప్పెను. అప్పు డప్పడతి యతని రంజింపఁద లంచి కొంతసేపు సఖులచే వీణమీఁద బాడించినది. తానును గొంతసేపు పాడినది. రాజపుత్రుఁ డందలిలోపంబు లుగ్గడించుటయు వెఱఁగు పడుచుండ నాబిడ బోఁటీ! నీవు లెస్సగాఁ బాడఁగలవని తోచుచున్నది. ఏదీ యీవీణనందుకొని మంచిరాగము లాలాపింపుము అని యొకవీణ నతనిచెంత నునిపించినది.
అతండావీణయందలి లోపంబులం దెలుపుచు మెట్ల సవరించి చీలల బాగుఁజేసి తంత్రులమ్రోగించి మెఱుఁగు దుడిచి యద్భుతముగా మేలగించి మహామోహజనకంబులగు రాగంబులం బాడి యందుఁగల చేడియలనెల్లఁ బరవశలం గావించెను.
వైణికమహామహోపాధ్యాయుఁడని బిరుదునొందిన నారద మహర్షి రూపాంతరయగు సౌభాగ్య సుందరిచే శిక్షింపఁబడిన విద్యాసాగరుని వీణగానము విని యందలికాంతలు మోహాక్రాంతస్వాంతలై రనుట యబ్బురముకాదు. తద్గాన మభూతపూర్వము, అశ్రుత పూర్వమునగుట నెట్టివారిని రాగవ్యాప్తులం జేయకమానదు.
ఆగానము విని ప్రమద్వర లేచి గంతులువైచుచు నతని గౌఁగలించుకొని మోము ముద్దుపెట్టుకొనుచు ముద్దియా నీ వీగాన మెందు నేర్చికొంటివి? నాచే నిట్లు పాడింపఁగలవా? ఏదీ ఆమోహనరాగము మఱియొకసారి పాడుము అని సంభ్రమోద్వేగంబున మీఁదఁబడిగడ్డముబట్టికొని బ్రతిమాలు కొనియెను. అత్తఱి నతని చిత్త మెట్లుండునో విమర్శింపవలసియున్నది. క్రొత్తది, యౌవనవతి, రూపవతి, విద్యావతి యగుయువతి వచ్చి పైఁబడిన యప్పుడు కుసుమశరాసనవిలాస లాలసుండుగాకుండుట కతండు శుకుఁడా భీష్ముఁడా హనుమంతుఁడా! ఆమె దేహసంపర్కంబున సతనికిని నతతి దేహసంపర్కంబున నామెకును ననిర్వాచ్యమైన యానందముతోఁ గ్రొత్తవికారములు చిత్తంబులం బొడసూపినవి. అతం డామెపాడుమన్న రాగము పాడుచు నేర్పుమన్న గీతము నేర్పుచు శృంగారముచిలుకు పలుకులతో నక్కలికిని మరుములుకుల బారిం బడసేసెను. అతండు స్త్రీయనియే భావించుచుండియుఁ దదంగ మేళనంబు హృదయంబునఁ గ్రొత్తయనురాగము గలుగఁజేయుచుండ నయ్యండజగమన సంతతము నతనితోఁ గలసిమెలసి వర్తింపుచుండును. ఇరువురకు నొక్కటియే భోజనము ఒకటియే తల్పము ఒక్కటియే యభిలాషగాఁ గొన్నిదినములు గడచినవి. ప్రమద్వర యతనిం జూడక గడియ తాళదు. అతనిమాట జెప్పనవసరమేలేదు.
శ్లో. వినోపదేశం సిధ్ధహికామోనాఖ్యాత శిక్షతః
న్వకాంతా రమణోపాయే కోగురుర్మృగపక్షిణాం.
అంత నొకనాఁటిరేయి యత్తలోదరి యారాజపుత్రునితో నిట్లనియె. పడఁతుకా! ఇది యేమిగొడవ యిదివఱ కిట్టిపని సేసియెఱుంగమే మాబోఁటులీవిద్యయెన్నఁడుం జెప్పిరి కారేమి! వాండ్ర కిది తెలియదా? ఇది మిక్కిలి వినోదము గలుగఁ జేయుచున్నది చుమీ! అని పొగడుచుఁ దత్క్రీడావిశేష ములచేఁ దన్మయత్వము నొందినది.
అందున్నవారిలో నొక్కవృద్ధతక్క తక్కిన కన్యకలందరు ప్రమద్వరవలెనే శిశుతనంబుననె యందుఁ జేర్పఁబడినవారగుటయుఁ బురషోపసృత్తముల నేమియు నెఱుంగరు. అనుదినప్రవర్థమాన రాగాభివృద్ధితోఁ బ్రమద్వర తత్కేళీవినోదములం జొక్కుచుండ నొక్క నాఁడక్కుమారుం డామె కిట్లనియె.
రాజపుత్రుఁడు -- ప్రేయసీ ! మనకేళీవిశేషము లెన్నఁడును . మీయుపాధ్యాయినితోఁ జెప్పకుమీ!
ప్రమద్వర - చెప్పినం దప్పేమి?
రాజు - చెప్పకుండ నుండలేవా!
ప్రమ — ఉండలేను. నన్నామెయు మందలించదు. దీనిలో నేమి తప్పున్నది?
రాజు — లేదు లే, పోనిమ్ము నీతలిదండ్రు లెందున్నారు?
ప్రమ — తలిదండ్రులనఁగా
రాజ - నిన్నుఁ గన్నవారు
ప్రమ - కనుట యన నేమి?
రాజ - మీయుపాధ్యాయి నడుగుము
ప్రమ - అడిగిననునామెలోకరహస్యము లేవియు నాకుఁ జెప్పదు.
రాజ - నేనువచ్చిచాలదినములైనదిపోయివచ్చెద ననుజ్ఞ యిమ్ము.
ప్రమ —ఎ క్కడికిఁ బోవుదువు?
రాజ - ఎక్కడనుండివచ్చితినో అక్కడికి.
ప్రమ — ఆమాటలేవియు నాకు దెలియవు. నీవులేకున్న నిమిషము జీవింపనని యెఱుంగుము.
ఆమె ముగ్ధత్వంబున కతండు నవ్వుకొనుచుఁ గొన్నిదినంబులు మోహసాగరమున మునింగి తేలుచుండును. ఒకనాఁ డావృద్ధాంగన మేడమీఁద కరుదెంచి తొలుత రాజపుత్రుం గాంచి కాంచనగాత్రీ! నీచరిత్రము కడువిచిత్రముగా నున్నది. మాప్రమద్వర నీకతంబున మాతో ముచ్చటించుట మానినది. అంతకుమున్ను నిత్యము నన్నొకసారిచూడక మానునదికాదు. నీవు వచ్చినది మొదలు నన్నుఁజూడక పోవుటయేకాక వాహ్యాళి మానినదఁట. బయటకురాదఁట, వనవిహారముసేయదఁట. సంతతము సంతఃపురములోనుండి నీతో ముచ్చటించు చుండునఁట. ఇతర కన్యకలతోఁగూడఁ తిన్నగా మాటాడదని చెప్పుచున్నరు. నీవామెతో వింతమాటల లేమైనఁ జెప్పలేదుగదా? అని యడిగిన నతండు నవ్వుచు నవ్వా! ఆమాటలు నన్నడుగనేల? ఏమి చెప్పితినో ప్రమద్వరనే యడుగుమని యుత్తరమిచ్చెను.
అప్పుడు ప్రమద్వర లోపలిగృహుబునం బండుకొనియున్నదని విని యావృద్ధ మెల్లగా నామెయున్న గదిలోనికింబోయి మంచముపై గూర్చుండి, అమ్మా! ప్రమద్వరా! పండుకొంటివేల? నీయొడలిలో నారోగ్యముగా నున్నదియా? అని మీదఁ జేయివైచి రాచుచు నడిగిన నదరిపడిలేచి యాచిగురుఁబోఁడికన్నులు నులిమికొనుచునామెకు నమస్కరించి కడుపులో వికారముగానుండ నిప్పుడే పండుకొంటి నీవు వచ్చి యెంతసేపైనది? అయ్యో! తెలిసికొనలేక పోయితినే అని పలికిన నామె కావృద్ధ యిట్లనియె.
పుత్రీ! నీకిప్పుడు నాతోఁ బనియేమున్నది? క్రొత్తస్నేహితులు వచ్చి ముచ్చటింపుచుండఁ బ్రాతవారిమాట జ్ఞాపకముండునా? పది దినములనుండి నిన్నుఁ జూడవలయునని తలంచుచు నీమేడ లెక్క లేక యిప్పటి కతికష్టముమీద వచ్చితిని. నీవు నన్నెప్పుడైన నిన్నినాళ్లు చూడకుండనుంటివా? క్రొత్తగొడవలోఁ బడిపోయితివి. పోనిమ్ము, వికారమేమి? ఏదీ! వెలుఁగునకు రా? బరీక్షింతు నని పలుకుచు ద్వారము దాపునకుఁ దీసికొనిపోయి పరిశీలించినది.
గీ॥ మోము తెల్లనయ్యె ముగుదకుఁ బాలిండ్లు
వలములయ్యె కొనలు నలుపుఁజెందె
మేనికాంతి వింతమెఱసెఁ బిరుందులు
బలసె నడల మాంద్య మలరె సతికి॥
ఆలక్షణంబులు బరీక్షించి యావృద్ధ యుదరముపైఁ జేయివైచికొని, అమ్మయ్యో! కొంపమునిఁగినది. ఆక్రొత్త మగువ మగవాడు కాఁబోలు. నాఁడురూపునవచ్చి యిచ్చిగురుఁబోడిని మోసపుచ్చె. అక్కటా! నేనేమి సేయుదును? ఈవార్తవినిన రాజు నాకు శిరచ్ఛేదము సేయింపఁడా! ముందునెలలో వివాహముహూర్త ముంచితిమని నిన్ననే, శ్రీవర్ధనుఁడు వార్తనంపియున్నాఁడు. అని పలుకుచు గుభాలున నేలంబడి మూర్ఛవోయినది. ఆవార్తవిని పరిజనులందఱు వచ్చి, మూఁగికొని వెఱపుతో నుపచారములు సేయుచుండిరి.
ప్రమద్వర కారణము తెలియక తెల్లబోయిచూచుచు నవ్వా! అట్లు పరితపించితి వేమిటికి ?నాయొడలిలో దోషమేమియును లేదు. ఊరక పండుకొంటి. వెఱఁపులేదు. లెమ్ము. లెమ్ము అని పిలచిన నామె యెట్టకేలకు లేచి యాప్రోయాలు చూలాలగుట నిశ్చయించి ముక్కు పై వ్రేలిడికొని యౌరా! ఆమహారాజు గ్రామములోనుంచినఁ బురుష సంపర్కంబు గలుగునని మహారణ్యమధ్యంబున నిడి సంరక్షింపుచుండ నిట్లు జరిగినదా! సెబాసు! నేనీవార్త రాజునకుఁ దెలయఁజేయక తప్పదు. అతండేవచ్చి వీని శిక్షించుగాక. అని ధ్యానించుచుఁ గన్నుల నీరుగార్చుచుండ బ్రమద్వరయు నితరకన్యకలు తత్కారణము జెప్పుమని గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁ దొడంగిరి.
అప్పుడా ముసలిది రాజవుత్రిక నేకాంతస్థలంబునకుఁ దీసికొనిపోయి అమ్మా! నిన్నొక్కమా టడిగెదను జెప్పుము. ఆక్రొత్తదియు నీవు నేకశయ్యయందుఁ బండుకొనుచుంటిరిగదా? అప్పుడది ఏమిచేయు చున్నదియో నిజము చెప్పు మని యడిగినఁ బ్రమద్వరఁ అవ్వా! నా కది యేమియు హానిచేయుటలేదు. నీతోడు. వేడుకలు గలుగఁజేయుచున్నది. అని యదార్ధమంతయుఁ దెలియ జేసినది. ముసలిది యా మాటలువిని కోపస్ఫురితాధరయై నీకు లోకజ్ఞానము లేకపోవుటయు ముప్పునకే కారణమైనదని కసరుచు వెంటనే రాజపుత్రున్నొద్దకుం బోయి చురచురం జూచుచుఁ దులవా! నీవెట్టిపని సేయుచుంటివి? ఆఁడుదానననిచెప్పి యతఃపురద్రోహము సేయుదువా? నీగుట్టు బయలు బెట్టి నిన్నేమిచేయింతునో చూడుమని యదలించిన నతండు నవ్వుచు నిట్లనియె.
అవ్వా! నేనాఁడుదాననని నీతోఁ జెప్పితినా? మగవాఁడనని చెప్పితినా? మీరే నన్నాఁడుదానిగాఁ జేసితిరి. ఇప్పుడుమాత్రము నేనాఁడుదాననుగాక మగవాఁడ నెట్లగుదును? మీరంత తెలియనివారా? విమర్శించి మాట్లాడుమని యుత్తరమిచ్చెను. నీవు పైకాఁడు దానివలెనే కనంబడుచుంటివి. తక్కినవిషయ మెవ్వరెఱుంగుదురు? ఎట్లైననేమి? యిప్పుడు నాశిరచ్ఛేదము కాఁగలదు. ఈభారమంతయు నాశిరంబునఁ బెట్టి యారాజు దూరమందున్న వాఁడు. ఇప్పుడు నేనేమి చేయఁదగినది? ప్రమద్వర గర్భవతి యైనది. అక్కడ పెండ్లి ప్రయత్నములు సేయుచున్నారు. ఈవార్తవినిన నాయిద్దరి చక్రవర్తుల మనోరధములు వ్యర్ధములై పోవునుగదా! వారిక్కడికి వచ్చి యపరాధుల దండింపకుందురా! అని కినుకతో శోకముతో విస్మయముతో నేమేమో పలికినవిని యతం డిట్లనియె.
అవ్వా! నీవిప్పు డీవార్త మీరాజునకుఁ దెలియఁజేయుము. అతండువచ్చి పరీక్షించుఁగాక. నేనాడుదాననై తినా నాదోషము లేదు గదా. మగవాఁడనైతినేని యప్పటికిఁ దగినట్లు చేయఁగలవాఁడ. ఇందులకు చింతయెందులకు? అనుటయు నాయవ్వ ఔను నీవెంత వాఁడవు గాకున్న నీశుద్ధాంతమునకువచ్చి పగలెల్ల నాఁడుదానవై రాతిరి మగవాఁడ వగుదువా? మారాజపుత్రిక నాతో నిజముచెప్పినది. నీబొంకులు నిలువవు. కానిమ్ము. ఆరాజువచ్చి యడిగిన నిట్లే చెప్పుము. అని బెదరించుచు నప్పుడే యొక పత్రికవ్రాసి కోటతలుపులు తీయించి యవ్వల నిగూఢముగానున్న భటునిచే నాపత్రిక శ్రీవర్ధనునొద్ద కనిపినది.
ప్రమద్వర, ముసలిది తన నెచ్చెలితోఁ గలహించుచున్నదని విని సఖులతో నచ్చటికిఁబోయి అవ్వా! నీతగవేమియో నాకుఁ దెలియకున్నది? ఆమెతోఁ బోట్లాడుచుంటివఁట ఏమిటికి? ఆమె ఏమితప్పు జేసినది. నీగొడవ యేమియో నాఁకుదెలియదు. చెప్పుమన్న జెప్పవు? నేనేమి జేయుదును? అని యడిగిన ముసలిది అంతయు నీకు నాలుగు దినములలోఁ దెలియగలదు, పొమ్ము. మేడమీఁదకుఁ బొమ్మని యలుకతో నుత్తరము జెప్పినది.
ప్రమద్వర యతని చేయిపట్టుకొని సఖీ! రమ్ము రమ్ము. ఈ ముసలిదాని మాటలు లెక్కసేసికొనకుము. మేడమీఁదకుబోయి సంగీతము పాడుకొందము. రమ్మని పలుకుచుఁ దీసికొనిపోయినది.
శ్రీనగరంబున శ్రీవర్ధనుఁడు ముసలిదిపంపిన పత్రికం జదివికొని గుండెలు బాదుకొనుచు నేలంబడి మూర్ఛిల్లెను. నికటమున నున్న యతనిభార్య యాపాటుఁజూచి యడలుచు శైత్యోపచారములు సేసి యెట్ట కే దెప్పరిల్లఁ జేసినది. అయ్యయో! నాప్రయత్నమంతయు వ్యర్ధమైపోయినదిగదా! ఏమిచేయుదును. వివాహముహూర్తము సమీపించుచున్నది. వసుప్రియుఁ డీపెండ్లికిఁ పెద్దప్రయత్నము చేయుచున్నాడు. హా! దైవమా! నాకెట్టి యపకారము గావించితివి? అని యూరక దుఃఖించుచున్నఁ జూచి భార్య యిట్లనియె.
ప్రాణేశ్వరా! బిడ్డదగ్గఱనుండి విపరీతవార్తయేమైనవచ్చినదా? అమ్మాయి కుశలముగ నున్నదియా? వేగము చెప్పుఁడని యడిగిన నతండు కన్నీరు దుడిచికొనుచు నిట్లనియె. ప్రేయసీ! మనుష్యప్రయత్నము లెప్పుడు వృధలు. వృధలు. ప్రమద్వరను బురుషశబ్దము వినకుండ నరణ్యములోఁ గోటలో నునిచి కాపాడుచుంటిని. ప్రమాదమునఁ బురుషు లెవ్వరైన నందు జేరినచో స్త్రీలుగానే కనంబడుచుండునట్లు సిద్ధులవలనఁ వరములందితిని. అదియేముప్పైనది. స్త్రీలుగానే కనంబడుదురనుటకంటె స్త్రీలగునట్లు చేయుమని కోరిన నీప్రమాదము జరుగకపోవును.
గుఱ్ఱముతోఁ గోటదూకి యెక్కడనుండియో రాచకుమార్తె యొకతె లోపలఁ బ్రవేశించి ప్రమద్వరతో మైత్రి జేసినదఁట. ఇరువురు నేకశయ్యాగతులై క్రీడించువారఁట. ఇఁకఁ జెప్పవలసిన దేమున్నది? నీకూఁతురు గర్భవతియైనదఁట. అందున్న ముసలిది వ్రాసినది. అది మగవాఁడుకాడు. ఆడుది యేయనియు గర్భవతి యగుటకుఁ గారణము తెలియకున్నదనియు యేమేమో వ్రాసినది. ఈవరము మాట దానికి నేనుజెప్పలేదు. ఎవ్వఁడో యాకోటలోఁబ్రవేశించెను. వారికి స్త్రీవలెఁ గనంబడియెను. ఆముగ్ధ కేమి తెలియును? చీచీ! వసుప్రియుని మూలమున బంగారమువంటి పుత్రికను భ్రష్టజేసికొంటిని. అయ్యయ్యో! అతం డట్లు చెప్పినంతనే అది వెఱ్ఱి యూహయని యాక్షేపించక ముద్దులపట్టి నై దేండ్లు దాటకమునుపే యడవిపాలు గావించితిని గదా! సీ. సీ. నావంటిమూర్ఖుం డెందును లేఁడు. లేక లేక గలిగిన బిడ్డకుం దగిన మగనిం దేలేక యొకానొక మూఢునివశము జేసితిని. అని యనేక ప్రకారముల దుఃఖించుచు గోపము పట్టఁజాలక యప్పుడే గుఱ్ఱము నాయత్త పఱుపుండని నియమించి సముచితయోధ పరివృతుండై యాపురుషుం బరిమార్చుటకై యాయరణ్యమున కరిగెను.
క. అనియెఱిఁగించి యతీశ్వరుఁ
డనుమోదముతోడ సమయమగుటయుజని గో
పునితో నవ్వలినెలవునఁ
దనరఁగ వినిపించెనిటు కథాశేషమొగిన్.
- ___________
225వ మజిలీ.
చిలుక మువ్వలకథ.
ఉత్తరదేశమున దేవకూటమను పర్వతము కూట సముల్లిఖిత గగనంబై యొప్పుచున్నది. అన్నగంబున కుత్తరభాగమున గిరివ్రజమను గొప్పపట్టణము యలకాపురసదృశంబై ప్రకాశించుచున్నది. అప్పురంబునకు దేవకూటమే మూడుభాగముల కోటవలె నొప్పుచున్నది. ఆశైలశిఖరమెక్కినవారు పక్షులై యెగిరిపోవుదురని జనశ్రుతి