కాశీమజిలీకథలు/పదవ భాగము/223వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని తెలుపుటయు నామె త్రిలోక సుందరులైన కోడండ్రఁ బడసితినని మురియుచు వారు దెచ్చిన కనక మణివస్తు విశేషంబులం జూచి యానందించుచుఁ బుత్రులుగావించిన పౌరుష చర్యలు తెలిసికొని యుబ్బుచుఁ బాతాళలోక విశేషములడిగి నవియే పలుమారలడుగుచు నందుఁబోవుట కుత్సహించుచు నాలోకము కుమారుల స్వాధీనములోనున్నదని గర్వపడుచు సుధన్వుని భార్యల దేవకాంతలఁ గూడఁ ద్రికూటగిరిమధ్యనుండి రప్పింపుఁడని కోరుచు గొన్నిదినము లాత్మజ వృత్తాంతశ్రవణ తత్పరయై మహాసంతోషముతో వెళ్లించినది.

తాను నారదుఁడననియు సంసారమాయా విలాసములఁ జక్కతి ననియు నించుకయు దెలిసికొనలేక కుటుంబసక్త యై యొప్పుచుండెను.

అని యెఱిఁగించి . . . ఇట్లు చెప్పందొడంగెను.

__________

223వ మజిలీ

ఉత్తరదిగ్విజయము.

విద్యాసాగరుఁడు కళాభిరాముఁడు హరివర్మసుధర్ముఁడుసులోచనుఁడు వీరేవురు ప్రతాపరుద్రుని తరువాతివారు తాళధ్వజుని కుమారులు వారొకనాఁడు తండ్రి నికటమున కరుదెంచి నమస్కరించి యిట్లనిరి. జనకా! క్షత్రియులకు భుజబలాజిన్‌తమైన సంపదల ననుభవించుట యశస్కరము మాయన్న లేవురు పూర్వదిక్కంతయు జయించుటయేకాక లోకాతీత సౌదర్యంబునం బ్రకాశించు నించుబోఁడులఁ బెండ్లియాడి నిరుపమానమగు విభవముతో నింటికివచ్చిరి.

మే మమ్మహావీరులకు సోదరులము మీకుమారులము నగుట మాకుఁగూడ విజయ యాత్ర సేయవలయునని యభిలాష గలుగు చున్నది. నాలుగు దిక్కులలో నుత్తరదిక్కు మిక్కిలి పెద్దది. అం దనేక దేశములు ప్రఖ్యాతములగు పర్వతములు ప్రసిద్ధములగు నరణ్యములు నతి పవిత్రమగు పుణ్యక్షేత్రములు పెక్కులు గలిగియున్నవి. తద్దిగ్విజయము సేయ వేడుకగలుచున్నది. సెలవిండని కోరిన నవ్వుచు నవ్వసుమతీశుం డిట్లనియె.

వత్సలారా! మీరింకను ధనుర్వేదము బూర్తిఁజేయలేదు. అన్నలు దూర్పుదెసకరిగి మణికాంతా వస్తువాహనములు సంపాదించికొనివచ్చిరిగదాయని మీరుకూడనట్లేయాపనికిఁ బ్రయత్నించుచున్నారు. ఒకరియదృష్ట మొకరికెన్నఁడును రాఁజూలదు విజయమనునది మాటలతో లేదు. మీయన్నలుపడ్డకష్టములుమరణ ప్రాయములుకావా? వారి పూర్వపుణ్యము శరణ్యమై మర్మములఁ గాపాడినది. అందఱికి నన్ని వేళలు సమముగానడువవు. అదియునుగాక మీయన్నలు తెచ్చిన ధన మనంతముగా నున్నది పది తరముల దనుక ననుభవించినను తఱుగదు ఇంటికడ సుఖంబుండుఁడని యుపదేశించిన విద్యాసాగరుం డిట్లనియె. తండ్రీ! భ్రాతృవిత్తమున జీవించువా రధములు కారా? మత్త మాతంగ కుంభపాటన దక్షంబగు హర్యక్షంబు క్షుద్రమృగమాంసమున కాసించునా? నిర్వక్రపరాక్రమంబున విజృంభించి చక్రవర్తుల బాదాక్రాంతుల గావించి తద్దత్తములగు విత్తముల విత్తములెన్న నీవసుమతియే రాజన్వతియని పేరువంద ననుభవింతుముగాక. అనుజ్ఞ యిండు మాతల్లిగారియాజ్ఞ గైకొని వచ్చితిమని పలికిన నతండు వారి యుద్యమము వారింపజూలక యెట్టకే ననుమతించెను.

వారేవురు వీరవేషముదాల్చి చతురంగ బలములు సేవింప శుభముహూర్తమున నిల్లువెడలి యుత్తరాభిముఖులై పోయిపోయి

సీ. మాళవ నేపాళ మగధ కాశ్మీక కో
             సల కురు ప్రముఖదేశములకరిగి

    తదధీశులను బ్రవిదారణంబునఁ గాంది
            శీకులఁగావించి చేవమీర
    శరణాగతుల నాత్మ శరణాగతులఁజేసి
            దురభిమానులనెల్లఁ బరిభవించి
    కప్పముల్గట్టి విక్రమగర్వితులకెల్ల
            విజయవార్తలఁ దెసల్వెలయఁ జేసి

గీ. తనివిసనకంత నుత్త రాంతము గనంగ
    దలఁచి చతురంగ బలసమేతముగా వెడలి
    చనిరి ప్రాలేయనగపరిసర ధరిత్రి
    కక్కుమారకు లధిక సాహసముతోడ.

పరమహిమాస్పదంబులగు నయ్యుత్తర దేశారణ్యంబుల సంచరించు చుండ నందలి వాతదోషంబునంజేసి పదాతులు రోగపీడితులై యొక్కరొక్కరుగా నీల్గుచుండిరి. మాతంగంబులు మదమెక్కి మావటీలఁ బరిమార్చుచుండునవి. గుఱ్ఱములు క్రమంబునక్షీణించుచుండెను. ఆదుర్దశంగనిపెట్టి యా రాచకుమారులు జనపదంబులకు మరలఁదలఁచు చున్నంతలో నొకనాఁడొక జంఝావాతంబు ప్రళయమారుతంబో యన శరవేగముగాఁ బాంసు దూషితమై వీవఁదొడంగినది.

ఆరాజపుత్రులప్పుడు భయపడుచుఁ దమతమ గుఱ్ఱములెక్కి యెక్కడికైన చాటునకుఁ బోవలయునని ప్రయత్నింపుచు భగ్నములైన శిబిరంబులఁ చెల్లాచెదరైన బలంబులఁజూచి పరితపించుచు నిలువఁజోటుగానక నిటునటు తిరుగుచుండ సముద్రతరంగమువలె నొక్క పెద్దగాలిత్రోవువచ్చి వారిని దలయొక చోటునకు గుఱ్ఱములతోఁగూడ నెగయఁజేసినది, అందు

−:విద్యాసాగరునికథ:−

విద్యాసాగరుండా వాతఘాతంబున వాఱువముతోఁగూడఁ జొప్పాకువలె నొకదెసకుఁ గొట్టుకొనిపోవుచుఁ జేతికిందొరికిన వృక్ష లతాగుల్మాదులఁబట్టుకొనినను నాగలేక గుఱ్ఱముపై పోయు పోయి సాయంకాలమునకుఁ బర్వతమువంటి యొకగోడ యడ్డమువచ్చుటయు నొడ్డుతగిలిన యోడవలె నాబాడబంబాగి నేలంబడినది. అంతలో గాలియుఁ జల్లారినది.

విద్యాసాగరుఁడు గుఱ్ఱమునుండి నేల కొఱుగుటచేఁ గొంచము దెబ్బతగిలినది. సవరించుకొనుచు మెల్లనలేచి గుఱ్ఱమున కాయాసము దీర్చి నలుమూలలు సూచెను. చీఁకటులు దెసల నావరించు చుండెను. అప్పుడేమూలనుండి యెంతదూరము వచ్చెనో యతనికిఁదెలిసికొనుట శక్యముకాలేదు. ఎటుసూచినను మహారణ్యమే కనంబడుచుండెను. తన్నాపినది పాషాణమోపర్వతమో గోడయో తెలియఁబడలేదు. ఏమిచేయుటకుఁ దోచక గుజ్జపుజీనునకుఁ జేరఁబడి యిట్లుతలఁచెను.

అయ్యో! ఇట్టి యుపద్రవమెప్పుడును గనివిని యెఱుగను. ప్రళయకాలంబున మహావాతంబు బయలుదేరి పర్వతముల దూదిపింజలవలె నెగరగొట్టుసని పురాణముల వినియుంటిమి. నేటి కామాట సత్యముగాఁ దోచినది. అబ్బా! ఆగాలివేగము దలంచికొనిన గుండె ఝల్లుమనుచున్నది. నాగుఱ్ఱము మిక్కిలి బలముగలది కావున నింత దూరము పరుగిడఁగలిగినది. ఆయుశ్శేషంబుండఁ బట్టినేనుదానిపైనిలువఁ గలిగితిని లేకున్నఁజావవలసినదే. మాతమ్ములేమైరో తెలియదు. న్నేఁటితో మాదిగ్విజయయాత్ర పూర్తియైనది. తండ్రిగారు జెప్పినట్లే యైనది. పులింజూచి నక్క వాతలుపెట్టికొను నట్లుగా మాయన్నలువలె వత్తుమని బయలుదేరితిమి. మంచిప్రాయశ్చిత్తమైనది. దేశాధిపతులం జయించి యింటికిఁబోక యుత్తరదేశారణ్యములఁ జూడవలయునని బుద్ధియేమిటికి బుట్టవలయును? ఈకాంతారములలో నేమియున్నవి! సీ! మే మే పురముగూడ వట్టి మూర్ఖులమైతిమి. కానిమ్ము ఇప్పుడువగచినంబ్రయోజనంబేమి? భగవంతుని సంకల్పమేమియో తెలియదు. జంతువులకు స్వతంత్రమేకలిగియున్న చోఁదలచినట్లుజరుగుచునే యుండును. కావున నిఁక దైవముపైనాధారపడ వలసినదే స్వప్రయత్నమేమియుఁబ్రయోజనకారికాదు. అని తలంచుచు నారాత్రియెల్ల నిద్దురబోపక పలువిధంబుల దలపోయుచుండెను.

అంతలోఁ బద్మినీకాంతుడు ప్రాగ్గిరికూట శృంగాటకం బధిరోహించెను. అప్పుడతండు కన్నులెత్తినలు మూలలు చూచుచు నోహో! ఇది నేనొక పర్వతమనికొంటిని కోటగోడవలెఁ గనంబడుచున్నది. ఇందు మహారాజులెవ్వరైనఁ గాపురముండిరేమో దీనిద్వారదేశ మెందున్నదియో చూచి లోపలికిఁ బోయెదంగాక అని తలంచుచు దన వాఱువము సేదదీరినవెనుక నధిష్టించి యాగోడనంటి యుత్తరముగాఁ గొంతదూరముపోయెను ద్వారదేశము గనంబడలేదు. అటుపైఁ బోవుటకు కంటకలతా గుల్మాదు లాగోడనంటి యల్లుకొని యుండుటచే శక్యమైనదికాదు.

తిరుగా వెనుకకువచ్చి రెండవదెస గోడననుసరించి కొంతదూరమే పోఁగలిగెను. పిమ్మటఁ బోవశక్యమైనదికాదు వెనుకకు మరలి మొదటి తావునకువచ్చి యాగోడ యుఛ్రాయము పాఱజూచెను. అక్కోట దనగుఱ్ఱము దాటగలదాయని యాలోచించెను. శక్యముగాదని నిశ్చయించి యందుగనంబడిన తెరపిని దనగుఱ్ఱమును నడిపించెను. కొంతదూరము బోవునంతఁ బిమ్మట దారిలేకపోయినది. వెండియు మొదటి చోటునకువచ్చి యచ్చటనే నిలిచి గుఱ్ఱమునుదిగి యందలి ఘానముచే దానిం దృప్తిపడఁజేసి తానేవియో ఫలములుదిని యాఁకలి యడంచుకొని యాకోటగోడదాటు నుపాయ మాలోచించు చుండెను,

చూడంజూడ నాగోడకొకచోఁ బైరాళ్ళు దొర్లుటచే రెండుబారలమొఱ్ఱి గనంబడినది. అందలి కుడ్యోఛ్రాయము కొలిచికొనిఁ దానిఁ దాటవచ్చునని నిశ్చయించెను. అతని వాఱువ ముత్తమజాతి లక్షణములుగలది. అతనిమనసు ననుసరించి నడుచునది ఱెక్కలుగలదివోలె నెగయఁగలదు.

అతండాతావు గుఱిజూచికొని గుఱ్ఱమెక్కిదూరముగాఁదీసికొనిపోయి యందుండి పరుగెత్తించి కళ్లెము పైకిలాగి యాగోడదాటింప నూతచాలక రెండుసారులువెనుకకు మరలవలసివచ్చినది. మూడవ తేప నతండు కళ్లెము బిగ్గరగాలాగి మడమలతో గొట్టుచుఁ బ్రాణములు వోయినను; నీమాటు కోటదాటక తప్పదని సంజ్ఞచేయుచు వేగముగాఁ దోలుటయు నాసక్తి తనకున్నశక్తియంతయు జూపి ఱెక్కలుగలది వోలె నెగసి యతికష్టముమీఁద నాగోడపై లంఘించినది.

పాప మాతురంగము రెండునిమషములు మాత్రమాగోడపై నిలువంబడి వెంటనే లోపలదూకుటచే నలయిక యెక్కువయగుట గిలగిలఁ దన్నుకొని ప్రాణములు వదలినది. దానిపాటుఁజూచి రాజకుమారుఁడు దుఃఖించుచు నయ్యో! యుచ్ఛైశ్రవంబుతోఁ బ్రతిఘటింపఁజాలు నాతత్తడి యిట్లు మిత్తిపాలగుటచే నీలోపలఁజేరిన సంతోషము విఫలమైనది. అక్కటా! దుర్ఘటంబగు పనిచేయించినా ప్రాణబంధువుం గోలుపోయితినిగదా! ఆహా యిట్టియుత్తమజాతి వీతి నాకీ జన్మమున లభించునా? నానిమిత్తమై తనశక్తియంతయుంజూపి మిత్తివాతంబడిన యీ జంతువుఋణంబెట్లు తీర్చుకొందును? ఆ మహావాతంబునంబడి కొట్టుకొనివచ్చునపుడు నాకించుకయు నొప్పితగులకుండ వెన్నునంగట్టికొనికష్టపడి తలపూవు వాడకుండ నన్నిందుఁ దీసికొనివచ్చి కాపాడిన యీపుణ్యాత్మురాలిట్లు సమసినంజూచుచున్న నావంటి కృతఘ్నుడెందైనంగలఁడా! హా! తురంగరత్నమా! హా! పరమోపకారీ హా! హరిప్రవరా! నన్ను విడచిపోయితివా ! నీప్రాణములర్పించి నాఋణముతీర్చికొంటివా! యీలోపల నా కేమిపనియుండి నీచే నిట్టి దారుణక్రియ జేయించితిని? నిరర్ధకవ్యాపారమున నిన్నుఁబరిమార్చిన నాపాపమెట్లు బాపికొందును. అనిదానిపయింబడి పెద్దయెలుంగున దుఃఖించుచు నవయవయముల ముట్టె ముద్దుపెట్టుకొనుచుఁ జెమ్మటలు వాయవీచుచు గొంత సేపున్మత్తక్రియల గావించెను. తనకుఁదాన యుపశమించుకొని మొలలోజొనిపియున్నకత్తిచే నందొక గర్తముత్రవ్వి దానినందు దొర్లించి దానిమేను బూవులచే బూజించి కన్నుల నీరుధారగాఁగారఁ బూడ్చి వేదికగాఁగట్టి దానిపైఁ దురగాకారముగా గీచిపలురకములఁ బూవులేరితెచ్చి హరిసహస్రనామములుచ్చరించుచుఁ బూజించి ప్రదక్షిణ నమస్కారములుగావించి దేవునివలె నర్చించెను.

నాఁ డెల్లఫలమైనందినక యుపవాసముండిమఱునాఁడుక్రమ్మఱఁ బూవులంబూజించి ధ్యానించి యాకలి యడంగ నేవియోపండ్లుభుజించెను. రాత్రుల నా వేదికపై శిరంబిడుకొని యాహరింధ్యానించుచు నిద్రపోవును. పదిదినంబులట్లు జరిపినంత నొకనాఁడురేయి నతనికలలో నాహరివరంబు గనంబడి రాజపుత్రా! నీవు నా నిమిత్తమై వగవం బనిలేదు నాకుత్తమలోకంబు కలిగినది, నీకృతజ్ఞతకు వేలుపులు మెచ్చికొనుచున్నారు. నీవిట గదలి పడమరగాఁ బొమ్ము నీకుమేలయ్యెడు గాక అని చెప్పినది.

అదరిపడిలేచి యాచిన్న వాఁడు కల తెఱంగరసికొని యోహో నావాహనము మృతిజెందియు నాకుపకారము సేయఁదలంచుచున్నది. నాజన్మావధిలో దీనిపేరు మఱచువాఁడనా! ఇందుఁబోయిన నా కేదియో మేలగునఁట తదుపదేశంబు గురూపదేశంబుగాఁ దలంచి పోయి చూచెదంగాక. అనితలంచి యప్పుడాచుట్టుప్రక్కలనున్న వృక్షలతావిశేషంబులం బరిశీలించి చూచెను.

కుసుమ కిసలయ ఫలదళ విలసితములగు నందలి పాదపలతా విశేషముల కాలవాలములు గట్టఁబడి నీరుపెట్టఁబడుచున్నది. అదివఱ కతండా యాలవాలములనీరు గ్రోలియు ఫలంబులఁదినియుఁ బుష్పం బులఁ గోసియు శోకావేశంబున దచ్ఛోభావిశేషంబు లేమియు గ్రహింపలేక పోయెను. అప్పుడా యారామ వినోదంబు లతని మానసమున కాశ్చర్యము గలిగించినవి.

ఓహో ! ఇదియొక యుద్యానవనము. ఇందలి కుసుమవాసన అపూర్వనాసాపర్వముగావింపుచున్నవి. యేమహారాజో యిందుఁగాపురముండి దీనింగాపాడుచున్నాడని తోచుచున్నది. పోయిచూచెదం గాక అనియాలోచించు మెల్లనలేచి యావేదికకు ముమ్మారు ప్రదక్షిణముజేసి పూవులుజల్లి నమస్కరించుచు నటకదలి కుసుమఫలభారసమ్రతరు లతా విశేషములఁజూచుచుఁ బడమరగా గొంత దూరము పోయెను. అక్కడనొక తటాకము మధురజలపూరితమై యతని కొహ్లాదము గలిగించినది.

అతండందు స్నానముజేసియాప్యాయనముగా నీరు గ్రోలిఫలములచే నాకలియడంచుకొనియందొక చూత వృక్షముక్రిందఁ గూర్చుండి చల్లగాలిసేవింపుచు నందలి విశేషంబులం బరికించుచుండెను.

అప్పుడు పడమరదెస విక్కిలి దవ్వులో నెవ్వరో గుఱ్ఱమెక్కి తనదెసకు బరువెత్తుకొని వచ్చుచున్నట్లు కనంబడినది. అతండులేచి నిదానించిచూచి యోహో నేనీకోటలో దూకితినని యెఱింగినన్నుఁ బట్టుకొనుటకిట్లు వచ్చుచున్నారు కాబోలు కాచికొని యుండవలసినదే అనియాలోచించి మొలలోనున్న యడిదము సవరించి చూచుచుండెను. దాపునకువచ్చినకొలఁది యావాఱువముపై నున్న వారు పురుషులా స్త్రీలా అని యనుమానముగలిగినది, అంతఁబదినిమిషములలో వచ్చి యవ్వాఱువ మానృపకుమారునిచేరువ నిలువంబడినది. అందు

గీ. జారుజడ యర్ధచంద్రునిమారు నుదురు
    పెద్దకన్నులు లేగౌను ముద్దుమొగము
    గబ్బిగుబ్బలు గలిగి చొక్కపు మిటారి
    నారి యొప్పారె స్వారి చిన్నారిగతులా

చ. వలిపపు చీర బంగరు లవంగపుటంచుల పైఁట గాలిచే
    దొలఁగ మిటారి గబ్బిచనుదోయి బయల్పడ జేర్చికొంచుఁ బై
    వలువ నెలంత వాఱువముపైఁ దగనిల్చియె విస్మయంబుతోఁ
    గలికి మెఱుంగుచూపు లెసగంగనె నానృపసూతి నయ్యెడన్.

అట్లు కనుంగొని మనంబుప్పొంగ నయ్యంగన తురంగమంబు డిగ్గ నుఱికి కలికీ ! నీ వెందుండి వచ్చితివి ! నీపేరేమి ? ఇంతకుమున్నెందుంటివి? నిన్నుఁజూడ వేడుకగలుగుచున్నది. నీకొఱకే కాఁబోలు నేఁడు నాబాడబము కళ్లెమెంతలాగినను నిలువక నీకడకు లాగికొని వచ్చినది. మామేడకుఁ బోవుదము రమ్ము. నీకు గుఱ్ఱమెక్కు పాటవము గలదా ? అని యడిగిన మఱియు నాశ్చర్యమందుచు విద్యాసాగరుండిట్లు తలంచెను.

ఆహా ! ఈమోహనాంగి నన్నంగనగాఁ దలంచి కలికీ యని పిలుచుచు సిగ్గువిడిచి మెలంగుచున్నది. కానిమ్ము అందులకుఁదగినట్లే యుత్తరముజెప్పెదంగాక అని తలంచి పొలతీ ! నా తెఱఁ గవ్వలఁ జెప్పెదంగాక ముందుగా నీయుదంత మెఱింగింపవలయును. నీపేరేమి? ఎవ్వని కూఁతురవు? నీకుఁ బెండ్లియైనదియా! ఈమహారణ్యమధ్యంబున నేమిటికి వసించితివి? అని యడిగిన నప్పడంతి యిట్లనియె,

చెలీ! నీ వడిగినమాటలేమియు నాకుఁదెలిసినవికావు. నాపేరు ప్రమద్వర యండ్రు. నాసఖురాండ్రం దున్నారు రమ్ము. నీమాటలకు వారు సమాధానము చెప్పువారు. ఈవాఱువ మెక్కుము పోవుదమని పలికిన నతం డనుమోదించెను. ఆమె ముందెక్కి యతని నెక్కించికొని తన నడుము బట్టుకొనుమని యుపాయము చెప్పినది. అతండట్లు చేసి తదంగస్పర్శంబున మేనం బులకలుద్భవిల్ల నోహో యీహరిణాక్షికి స్త్రీ పుం వివక్ష తెలియదాయేమి? కానిమ్ము. ఏమిచేయునో చూచెదంగాక అని యాలోచించుచుండ నవ్వేదండగమన రమణీ ! గుఱ్ఱమును వడిగాఁ దోలవచ్చునా భయములేదుగద అని యడిగినది. అతఁడు నవ్వుచు నీయిష్టము వచ్చినంతవడిగా నడిపింపుము నా కేమియు వెఱపులేదని యుత్తరమిచ్చెను.

అప్పు డప్పడఁతి మడమలతో నించుక సూచించినంత నాహయం బతిరయంబునఁ బరుగిడఁ దొడంగినది. కొంతదూరమేగునప్పటికిఁ గొందరు సుందరు లెదురుగాఁ బరుగెత్తుకొనివచ్చుచుండిరి. లలనా ! నిలు నిలు నిన్నీవాఱువ మెంతదూరము లాగికొనిపోయినది? అయ్యో నీవు పడితి వేమో యని యడలుచుంటిమి, నీజాడఁ దెలియక సఖులు నలుమూలలకుఁ బరుగిడిపోయిరి. నీవెనుకఁ గూర్చున్న జవ్వని యెవ్వతె? మన కోటలోని కెట్లువచ్చినది? అని యడిగిన నాప్రమద్వర యిట్లనియె.

బోటులారా ! నా ఘోటక మింతవిపరీతముగా నెప్పుడును లాగికొనిపోలేదు. ఖలీన మెంతలాగినను నిలిచినదికాదు. ఈచిన్నది యెవ్వతియో నాకునుం దెలియదు. ఈకిసలయపాణి యొక రసాల పాదపమునీడ గూర్చుండఁ నాబాడబమీచేడియ ననీడమునకుఁ దీసికొనిపోయి నిలువంబడినది. ఈమె నన్నేదియో యడిగినదికాని నా కేమియుం దెలిసినదికాదు. అంతయు నాసఖులు వక్కాణింతురు రా. రమ్మని గుఱ్ఱమెక్కించి తీసికొనివచ్చితిని. మీరు వేగరండు, మాటాడుదురుగాక. అని చెప్పి యప్పడఁతి గుఱ్ఱమును దోలినది. గడియలో నాహయంబు గమ్యస్థానము జేరినది అందు,

సీ. నానాప్రసూనప్రతాననీ కమనీయ
             కాయమానాఢ్య ప్రఘాణకంబు
    నవరత్నఘటిత సుందరకవాటద్వార
            దేహళీకుడ్య సందీపితంబు
    శుకపికోత్క్రోశ సంశోభితమణిభర్మ
            పంజరాఢ్యకపోత పాలికంబు

    నుకులీనచటుల ఘోటకఖురస్ఫుటిత భూ
             రచితాస్తరణమందురాయుతంబు

గీ. మణిరుచిభ్రాజితానేక మంటపంబు
    కాంచనాభ్రంలిహాంచితాగ్రప్రకాశ
    మగు మహాసౌధవరమొక్క డతనికందు
    భ్రాంతిగలిగించె నవ్వైజయంతమనఁగ.

ఆత్తురంగమ మామేడముంగలి ద్రాక్షపందిరికడ కరిగి నిలువంబడినంతఁ బెక్కెండ్రుతరుణు లరుదెంచి రందుఁగొందఱుకళ్లెము పట్టుకొనిరి. కొందఱు కై దండలిచ్చి యచ్చిగురుఁబోఁడిం దింపిరి. కొందఱు పాదుకలు దొడిగిరి, కొందఱు వింజామరల వీచిరి. కొందఱు క్రొత్త పుట్టంబుల గట్టించిరి. ఇట్లు సఖులుపచారంబులఁ గావింపుచుండ నంది కొనుచు నారాజకుమారుని కై దండగొని సఖీ ! వీరందఱు నాసఖురాండ్రే. మనము మేడమీదకుఁ బోవుదము రమ్ము. పాపము నీవు బడలియుంటివి. భుజంచి విశ్రమింతువుగాక యని పలుకుచుఁ నక్కలికి జిటికనవ్రేలుఁ బట్టికొని యతని మేడమీఁదికిఁ దీసికొనిపోయినది. ఆమె సఖురాండ్రందఱు నతని వింతగాఁ జూడఁదొడంగిరి.

విద్యాసాగరుఁ డా స్త్రీమండలమునుజూచి యాశ్చర్యమందుచు నయ్యారే! ఈతొయ్యలుల చరిత్రము కడు విచిత్రముగా నున్నది. వీరందఱు నన్ను స్త్రీఁగానే భావించుచున్నారు. కారణము తెలియదు. వీరికి నెనట్లగుపడుచున్నానేమో పరిశీలించెదంగాక అని తన్నుఁజూచుకొని తనరూతమున మార్పేమియుఁ గానక వారే పొరపడుచున్నారని నిశ్చయించెను. మఱియు నందున్న స్త్రీలకందఱకు నా సుందరియే యధికురాలని తెలిసికొని యాత్మగతంబుననిట్లుతలంచెను.

ఆహా! ఇది యింద్రజాలమో స్వప్నమో భ్రాంతియో కావలయును. ఇందున్న వారందఱు నన్ను స్త్రీగానే సంబోధించుచున్నారు. ఒకవేళ నే నిళునివలెఁ గలికినైతినేమో యనికొనిన నదియుం గానుపింపదు. ఇందుఁ బురుషుండెవ్వఁడు గనంబడఁడు. ప్రమద్వరకు లోకజ్ఞానమున్నట్లు తోచదు. తల్లిదండ్రులెవ్వరనినఁ జెప్పలేకపోయినది. ఇది కపటమేమో యనికొనిన నన్నుఁజూచి యిందెవ్వరు నవయవములఁ గప్పికనక సిగ్గుపడకున్నారు. మఱికొంత చనువుజేసికొని వీరి వృత్తాంతము తెలిసికొనియెదంగాక యని యాలోచించుచుండెను.

అంతలో మఱికొందఱుకాంత లాశుద్ధాంతమున కరుదెంచి యక్కాంచనగాత్రితో ముచ్చటించుచు నీమె యెవ్వతె? నీకీమెతో మైత్రి యెట్లు కలిసినదని యడిగిన విని ప్రమద్వర యీమెవార్త మీకిందాక దారిలోఁ జెప్పితినికాదా? ఈమె యెవ్వతెయో నాకునుం దెలియదు. ఈమెంజూచినతోడనే నాకు వేడుక గలిగినది. సఖురాలిగానెంచి తీసుకొనివచ్చితిని. నాకుఁబోలె నీమెకుఁగూడ మీ రూడిగములు సేయుచుండుఁడని నియమించినది.

అప్పుడప్పడఁతుకలు తమ కుపాధ్యాయునిగానున్న యొక వృద్ధాంగనయొద్దకుం బోయి క్రొత్తమత్త కాశిని రాక యెఱింగించుటయు నాజరఠ తొందరగా నయ్యంతఃపురమునకు వచ్చి యతనిం జూచి యిట్లనియె.

సుందరీ! నీవెందలిదానవు? ఈకోటలోని కెట్లువచ్చితివి? నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నతండు జిఱునగవుతో నిట్లనియె. అవ్యా! యిందున్నయన్నువలెల్లఁ బిన్నవయసువాండ్రే. వీరిలో నీవొక్కరితవే పెద్దదానవుగాఁ గనంబడుచుంటివి. వీరందఱు నాతోఁ బరిహాసమాడుచున్నారను కొన్నాను. నీవుగూడ నట్లేయడిగితివి? కానిమ్ము. ముందుగా నాప్రశ్నముల కుత్తరమిమ్ము. తరువాత నాకథఁ జెప్పెదంగాక. ఈమహారణ్యమధ్యంబునఁ బురుష సహాయములేక మీరందఱు నుండుటకుఁ గారణమేమి? అని యడిగిన నాముసలిది నోరు మూయుచు మెల్లగా బోటీ! యిందిట్టిమాట పలుకఁగూడదు. చాటునకుఁబోయి మాటాడుకొందము రమ్ము అని చేయిపట్టుకొని యతని నొక విజనప్రదేశమునకుఁ దీసికొనిపోయి కూర్చుండఁబెట్టినది. ఆతండు వెండియునిట్లనియె.

అవ్వా! ఇందుఁ బురుషనామోచ్చారణమే పనికి రాదనుచున్నావు. తత్కారణము తెలిసికొన మఱియుఁ తొందరగానున్నది. అది యట్లుండె నీప్రమద్వర తలిదండ్రు లెవ్వరు? ఆమెకు వివాహ మైనదియా? మీకందఱకు నీమెయే యేలికయని తోచుచున్నది. ఈమెయేకాక యీమె చెలికత్తియలకుఁ గూడఁ బెండ్లికానట్లున్నది. మీకథ యెఱింగించి నాకు శ్రోత్రానంద మాపాదింపుమని కోరిన నావృద్ధ తమవృత్తాంత మిట్లు నివేదించినది.

అని యెఱింగించి, .....తదనంతర వృత్తాంతమిట్లు చెప్పెను.

__________

224 వ మజిలీ.

ప్రమద్వరకథ.

కాశ్మీరదేశ ముత్తరదేశములలో నెల్లధసంపన్నమని ప్రసిద్ధివడసినది. ఆదేశమునకు రాజధాని శ్రీనగరము. దాని శ్రీవర్ధనుఁడనురాజు పాలించుచుండెను. కుబేరతుల్యుఁడగు నమ్మహారాజునకుఁ బెద్దకాలము సంతానము కలిగినదికాదు. ఆనృపునిభార్య నిత్యము సావిత్రీపూజ గావించుచుండునది. అద్దేవి ప్రసాదంబునఁ గొంత కాలమున కాభూకాంతున కొక యాఁడుపిల్ల కలిగినది. ఆశిశువుజాత కర్మోత్సవమునకు శ్రీవర్ధనుఁడు తనకు మిత్రులుగానున్న చక్రవర్తులకుఁ బెక్కెండ్రకు నాహ్వాన పత్రికలు పంపి రప్పించుకొనియెను. అయ్యుత్సవసమయంబున నమ్మహారాజు కోటిదీనారములు దానధర్మ