కాశీమజిలీకథలు/పదవ భాగము/222వ మజిలీ
పలుకుచు నొకపుష్పమాలఁ దెచ్చియతని మెడలో వైచినది. అతండు మోహాంధుండై తదనుగుణ్యములగు చర్యల జరుపుచు రాజపుత్రుఁడు వచ్చునేమోయని సంశయించుచుండ గ్రహించి రాజపుత్రిక యాజడుపుడిపియాథార్థమంతయుం దేలిపి యతని క్రీడారసవివశుంగావించి నది
శ్లో॥ సద్భావరాగదీపితమదనాచార్యోపదిష్ట చేష్టానాం
కఃపరిగణనంకర్తుంరతి చక్రావిష్ట రమణయోశ్శక్తః,
అని యెఱింగించి. . . . . . యిట్లు చెప్పందొడంగెను.
- __________
222 వ మజిలీ
జయమల్లుని కథ.
పురుషుఁడు రాగవర్ధనుఁడు వనిత రతిమంజరి వారిద్దరికే వినోదము లెట్లుండునో చెప్పనవసరము లేదు. కొన్ని యహోరాత్రము లొక్క గడియవలె గతించినవి. ఒక్కనాఁడు రతిమంజరి రాగవర్ధనునితోఁ బ్రాణేశ్వరా నాఁడు మీరెందుబోవుచు నీనగరమున కరుదెంచితిరి! నా నిమిత్తమే భగవంతుఁడు మిమ్మిందుఁ దెచ్చెనని తలంచెదను. అని ప్రస్తావముగా నడుగుటయు నతండు గుప్పున దనయన్నలవృత్తాంతమంతయు జ్ఞాపకమువచ్చి గుండెజల్లుమన నౌరా! నేనెంత మోహాంధుండనై తిని? ఆయ్యయో మా తలిదండ్రులకుఁ గ్రొత్త శోకము గలిగించినవాఁడనై తినే తన్వీ నేనిక్కడికివచ్చి యెన్నిదినములైనది? అనియడిగిన మూడుదినములైనదని చెప్పినది చాలుచాలు మూడుదినములా మాసము ఆహా! నెల దినములొక్క గడియవలెదోచినదిగదా చిత్రకూట నగరమునఁజిక్కుపడిన మాయన్నలజాడ దెలిసికొనుటకై పోవుచు దారిదప్పి యీయూరుసేరి యిందు మీవలపులఁ జిక్కుకొని ప్రపంచకము మఱచి పోయితిని. కానిమ్ము నేనిఁకనిందు నిలువరాదు పోయివత్తు ననుజ్ఞయిమ్మని పలికిన నక్కలికి వగచుచు నిట్లనియె.
మీ రొంటిగాఁ బోవలదు. మీ వార్త మాతండ్రికి దివఱకే చెప్పియున్నాను మంచియల్లుఁడు లభించెనని యతండు ముఱియుచున్నాఁడు కొన్ని సేనల వెంటఁబెట్టికొని పొండనిచెప్పినది అతండంగీకరించి యమ్మఱునాఁ డుదయకాలంబున నశ్వశాలకుఁబోయి తనకు దగినవారునము నరయుచున్న సమయంబున నిరువురు యోధులాదారిం బోవుచు రాగవర్ధనుని గురుతుపట్టి యందునిలువంబడి చూచుచుండిరి.
రాగవర్ధనుఁడొక ఘోటకమునేరి దానినాయత్తఱచి తీసికొని రమ్మని రాహుత్తులకు నియమించి యీవలకువచ్చినంత నాయోధులతనికి సలాములుచేసిరి. మీరెవ్వరని యడిగిన భర్తృదారకా! మేము దేవర యోధులమే మిమ్మువెదకుటకై మీతమ్ముఁడు జయమల్లునితో బయలుదేరివచ్చుచు మార్గ మధ్యంబున నతండు జిక్కువడఁ దప్పించుకొని మేమిక్కడికివచ్చితిమని చెప్పుటయు నతండు తొందఱగా వారి కిట్లనియె. మీరుమాయోధులా? మీమాటలేమియునాకర్థము కాలేదు. మాతలిదండ్రులు క్షేమముగానున్నారా? జయమల్లుఁడు చిక్కుపడెనంటిరి. ఆవృత్తాంతము సవిస్తరముగాఁ జెప్పుఁడనియడిగిన వాండ్రిట్లనిరి.
దేవా! మమ్మీ నగరముజేర్చి సత్రములోనిలిపి వారువపు రౌతులు మీ రాక నగరిలోనికిందెలుఁప గోట సింహద్వారముకడకరిగి తిరుగవచ్చునప్పటికిందు మీరు గనంబడలేదఁట నాలుగు దివసంబు లిందు వసించి వాండ్రు మిమ్ము వెదకివెదకి మీ జాడఁదెలియక పరితపించుచుఁ గ్రమ్మఱ మన వీటికరుదెంచి యావార్తఁ దెలియఁజేసిరి. జయదేవుఁడు వెనుకటి పగ మనంబునంబెట్టుకొని మిమ్ము జంపించెనని నిశ్చయించి మీ తలిదండ్రులు పెద్దగా దుఃఖించిరి.
అప్పుడు జయమల్లుఁడును ప్రతాపరుద్రుఁడు వారి నూఱడించుచు మీజాడఁ దెలిసికొని వత్తుమనిచెప్పి వారి నొప్పించి సేనలతో బయలుదేరిరి. అందుఁ బ్రతాపరుద్రుఁడొక్కఁడు సేనానివేశముకడ కరిగెను. సేనలతోఁగూడికొని జయమల్లుఁడు జయపురమునకు వచ్చుచు నొకనాఁడు సాయంకాలమున రామనగర సమీపంబున సేనతోవిడిసి పటకుటీరములు వైపించెను.
ఆ నగరాధిపతి దుందుమారుండనురాజు జయమల్లుఁడు తనపట్టణము ముట్టడింపవచ్చెనని తలంచి యర్ధరాత్రంబున సేనలతోఁబోయి నిద్రావిద్రాణములైయున్న చతురంగబలములను బరిమార్చి జయమల్లునిఁ బట్టుకొని కట్టించి తీసికొనిబోయి కారాగారంబునంబెట్టించెను. హతశేషులుకొందఱు పాఱి మన నగరంబునకుఁబోయిరి. మేమీ దెసకుఁ బాఱివచ్చి యిన్నగరంబుసొచ్చి మీజాడ యేమైనఁ దెలియునేమోయని వీధులందిరుగుచుంటిమి దైవికముగా మీరిందుఁ గనంబడితిరి. ఇదియే యక్కడి వృత్తాంతమని యెఱింగించిరి.
రాగవర్ధనుండావార్తవిని క్రోధమూర్ఛితుండై యేమీ! దుందుమారుండక్రమముగా మన సేనలంజంపి మాతమ్ముని చెఱసాలంబెట్టించెనా. కానిమ్ము వాని ప్రాయశ్చిత్తము ముందుగాఁజేసి తరువాతఁ జిత్రకూట నగంబుకడ కరిగెదంగాక అని నిశ్చయించి యప్పుడే మామగారినడిగి చతురంగ బలముల సహాయము తీసికొని మంచివేళ బయలుదేరి కతి పయ ప్రయాణముల రామనగర సమీపమున కరిగి యందు శిబిరములవైపించి దండు విడిసి యానృపతికిట్లు రాయబారము వ్రాసిపంపెను.
దుందుమారా! నీవశ్వత్థామవలె నర్ధరాత్రంబున మా సేనలపై బడి పరిమార్చి నిద్రించుచున్న మాతమ్ముని జయమల్లుని జెఱసాలం బెట్టించితివఁట నీవీక్షణమున మాతమ్ముని వెంటఁబెట్టుకొని వచ్చి తప్పు చేసితి రక్షించి విడువుఁడని పలుకుచు నా పాదంబులంబడి గడ్డి గఱచి బతిమాలికొనిన నీవు బ్రతికిపోవుదువు. లేకున్న నిన్నుఁ బుత్ర మిత్రా దులతో నాశనముచేసి నీకోటత్రవ్వించి కందకములఁ బాఱవేయింతు నిందులకు రెండు గడియలు గడువిచ్చితి గాచుకొనుము.
ఇట్లు రాగవర్ధనుఁడు.
ఆపత్రికం జదివికొని యాదుందుమారుండు గడగడలాడుచు జయమల్లు నొక్కనినే యశ్వ మెక్కించి యతని చెంతకుఁబంపెను. సందేశమంపిన గడియకాలములోఁ దనకడకరుదెంచిన జయమల్లుం జూచి రాగవర్ధనుం డాశ్చర్యపడుచుఁ గౌఁగిలించుకొని గారవించెను. అతండు రాగవర్ధనుం జూచి వెఱగుపాటుతో నమస్కరించెను.
రాగపర్ధనుండు తమ్ముడా ! దుందుమారుఁడు నిన్నుఁ గట్టించెనఁట సత్యమేనా యిప్పుడే వదలెనా ? యేమి చేసె? యధార్థము చెప్పుమని కారణము వినుదనుక నాకినుక చల్లాఱకున్నది. అని యడిగిన నతం డిట్లు చెప్పెను.
అన్నా ! నీవు గాలివానం దారిదప్పి జయపురంబున కరిగితివనియు నీతో వచ్చిన రౌతులు నిన్నొక సత్రంబున నిలిపి నీరాక నారాజున కెఱింగింప నరిగి తిఱుగవచ్చునప్పటికి నీవందు గనంబడ లేదనియు నీజాడనరయుచు నాలుగు దివసంబులం దుండి యాసాదులు తెలియక మరలి యింటికి వచ్చి యావార్త తండ్రిగారి కెఱింగించిరి.
రాజుల హృదయములు క్రౌర్య పూరితములై యుండును. అవమానింపఁబడినవారు నమ్మినట్లే యుండి యదనువచ్చిన తఱి పరిభవింపక మానరు. జయదేవుఁడు చిన్న వారలచే నోడింపఁబడిన వాఁడగుట నీసుబూనియుండును. రాగవర్ధనుం డొంటిగా నాపురి కరుగఁగూడదు. అరిగేఁబోఁ దనరాక రౌతులచేఁ బతికేల తెలియఁ జేయవలయును . జయదేవుఁడు రాగవర్ధను నవమానపఱచియుండు నని విచారించుచుండ నేనును బ్రతాపరుద్రుఁడును వారి నూఱడించి మమ్ముఁ బంపుమని కోరితిమి. అతం డెట్టకే నంగీకరించి మీరనన్యసామాన్య ప్రతాపగర్వితులని నే నెఱుంగుదును. అయినను వేగిఱించి యుద్ధమునకు దిగరాదు. సామముననే కార్యము నెఱవేరునట్లు ప్రయత్నింపవలయును. జాగరూకులై కార్యము సాధించుకొని రండు పొండని పలికెను.
ప్రతాపరుద్రుఁ డొక్కరుఁడు సేనా నివేశము కడకుఁ బోయెను. నేను బలముతో జయపురమునకు వచ్చుచు నొకనాఁడు రాత్రి యీనగరప్రాంతమునందు సేనలతో విడిసితిని. ఈదుందుమారుండు చారులవలన నారాక తెలిసికొని తెల్లవారిన మేము తమ్ముఁ బరిభవింతుమని జడియుచు మంత్రులతో నాలోచింపక యర్ధరాత్రంబున కొన్ని సేనలంగూర్చికొనివచ్చినిద్రించుచున్న మా పయింబడి మాబలములఁ జీకాకు పఱచి నన్నుఁ బట్టుకొని చెఱసాలఁ బెట్టించిన మాట వాస్తవమే మఱియు దఱువాత చరిత్రవినుము.
అతని మంత్రి మిక్కిలి బుద్ధిమంతుఁడు మఱునాఁడావార్త విని రాజునొద్దకుఁ బోయి మహారాజా ! రాత్రినత్యుపద్రవమైనపని గావించితిరి గదా! తాళధ్వజుండు లోకైకవీరుండు అతని కుమారుల బలపరాక్రమములు మొన్నఁటి సంగరములో మనము చూచి యున్నాము. వారి తమ్ముఁ డితఁడును సామాన్యుఁడు కాడఁట నిప్పునొడిగట్టినట్లా రాచపట్టిం గట్టించితివి హతశేషులీపాటి కావీటికి బోయి వారి కీవార్తఁ దెలిపియుందురు, వారు దాడివచ్చిన మన మోపఁగలమా ! అవి మృశ్యకారిత్వము హాని హేతువగుననియెన్నియోదృష్టాంతములు సూపియాభూపునిబశ్చాత్తాపతప్తునిఁ గావించెనఁట
మధ్యాహ్నంబున నారాజుకూఁతురు ప్రభావతియను యువతి యుపహారములు తీసికొని నేనున్న గదితలుపులు తెఱపించుకొని లోపలికివచ్చినది. ఆరమణీమణి సౌందర్యము లోకాతీతమైయున్నది. విస్మయముతో నేనామెంజూచుచుండ నావేదండగమన నాదాపునకు వచ్చి రాజపుత్రా! నేనీ ధాత్రీపతి పుత్రికను నాపేరు ప్రభావతి యండ్రు మాతండ్రి నిన్న రాత్రి మిమ్ముల నెవ్వరో శత్రువులనికొని తెలియక కట్టించి యీ చెఱసాలం బెట్టించిరి. తఱువాత మీకథవిని పశ్చాత్తాపముఁ జెంది మీ మొగముఁ జూడ లేక సిగ్గుపడుచు మీ సత్కారమునకై నన్నుఁ బంపిరి.
ఈ చెఱసాల కేళీభవమనికొని నన్నుఁ బ్రియరాలిగా నెంచి నామాట మన్నించి యీతప్పు సైరింపవలయును. మీ రాఁకలిఁగొనియుంటిరి. భుజింతురుగాక మాశుద్ధాంతమునకు రండని వినయముగాఁ బ్రార్థించినది. దాని యనునయవచనోదకము మదీయ కోపాసలముజల్లాఱఁ జేసినది. అచ్చిలుకలకొలికి చిత్తము నొచ్చునేమో యని యేమాటయు నాడనేరక నే నామె చెప్పిన ట్లొప్పుకొని యప్పుడే యప్పడఁతి వెంట నంతఃపురమున కరిగితిని.
అయ్యిందువదన నాకందు గావించిన విందు లిట్టివని చెప్పఁజాలను పిమ్మట నమ్మనుజపతి మంత్రిహిత పురోహితాదులతోవచ్చి నా పాదంబులంబడి శరణు వేఁడుకొనియెను. నే నభయహస్త మిచ్చితిని. వెంటనే యా వాల్గంటిని నాకిచ్చి వివాహముగావించెను. నేనత్తరుణీ రత్నము సల్లాపనైపుణ్యమునకుఁ జొక్కి ప్రస్తుత కార్యాంశము మఱచి నాలుగు దివసములొక్క గడియవలె వెళ్ళించితిని.
ఇంతకుఁ బూర్వమే నీవు పంపిన సందేశ పత్రికం జూచి జడియుచు దుందుమారుండది కూఁతునొద్దకనిపెను. ఆకొమ్మ యాకమ్మం జదివికొని యురముపైఁ జేయివైచికొని మనోహరా ! మాయన్నల తెఱంగే నెఱుంగనిదికాదు. వారు సెప్పినంతసేయుదురు. మీరువేగఁబోయి వారి కోప ముపశమింపఁజేయుఁడని ప్రార్థించినది. వెంటనే గుఱ్ఱమెక్కివచ్చితిని. ఇది నావృత్తాంతము అనిచెప్పి నీవిన్నినాళ్లెక్కడనుంటివి? జయదేవుఁడునిన్నుఁ భరిభవించుట యసత్యమాయనియడి. గిన నతండు తన యుదంతము సాంతముగా నెఱింగించెను. ఇట్లొండొరుల ప్రవృత్తులొండొరుల కెఱింగించుకొని యారాజకుమారు లిఱువురు సంతోషముతో దుందుమారుని కోటలోనికిం జనిరి.
రాగవర్ధనుని మిక్కిలి వినయముతో నర్చించి యా ఱేఁడు తానుజేసినతప్పును గాపాడుమని వేఁడుకొనియెను. అతండతనియెడఁ బ్రసన్నుఁడై తన సేనలనెల్ల జయపురముకనిపి జాగుసేయక వెంటనే తమ్మునితో గూడ పేరుగలవారుపములనెక్కి సముచిత పరివారము సేవింప నన్నలజాడ తెలిసికొనఁ జిత్రకూటగిరి పరిసరమున కరిగెను.
అం దుండి యిరువురు యోధులు తురగములెక్కి కన్యాకుబ్జపురంబున కరుగుచు దారిలో వీరికిఁ గనంబడి గుఱుతుపట్టి సలాములు సేయుచు భర్తృదారకులారా! మీరు సేమముగా వచ్చుచుంటిరా? మీయన్నలు సేమముగానున్నారు. పాతాళలోకమునుండి బైటికి వచ్చుచున్నారు. ఈశుభవార్త తలిదండ్రులు కెఱిగింపఁ బ్రతాపరుద్రుఁడుగారు మమ్మందుఁబంపుచున్నారు. మీరు గూడ నందుఁ బొండు. మేము పోయివత్తుమని చెప్పి యాసాదులు వెళ్లిపోయిరి.
ఆవార్తవిని రాజపుత్రులిరువురు ప్రహర్ష పులకితగాత్రులై యత్యుత్సాహముతో నాశైల శిఖరమున కరిగిరి. ప్రతాపరుద్రుఁడు వారి రాకఁ జూచి సంతోషించుచురాగవర్ధనుని వృత్తాంతంబడిగి తెలిసి ముఱియుచు జయమల్లుఁడు పెండ్లికొడుకయ్యెనని యెఱింగి తమకు మంచికాలము వచ్చెనని యానందించుచు నచ్చటి వార్తలన్నియు వారికిం జెప్పి పాతాళలోకమునుండి బంగారు రత్నములు మందసములతోఁ బంపిరి. వీరవర్మ భార్య పద్మసేనయు సుధన్వుని భార్య రత్నావతియు ద్విజటయు మఱియొక పొన్ని కొమ్మయు నమ్మకమగు దాస దాసీజనంబులు పైకివచ్చి నాశిబిరములోనున్నారు చూడుఁడు. అనిచెప్పి యచ్చటికిఁదీసికొనిపోయి వేఱువేఱువారివారి పేరులుచెప్పి చూపెను. అత్తరుణీమణులును మఱఁదులం గాంచి వారి నమస్కారము లందుకొని దీవించుచుఁ బెద్దగా నాదరించిరి. ఇంతలో గొలుసంతయుఁ బైకివచ్చినది. మందసములు దాపున నున్నవని పరిజనులువచ్చి చెప్పిన తోడనే యందఱు నాగుహాంతరమునకరిగిరి.
నిగళాంతమునందలి మందసములు నాలుగు గుహాంతరముచేరిపతోడనే పరిజనులు తలుపులు విడఁదీసిరి. వీరవర్మ సుథన్వుఁడు మఱియిరువురు వీరులు నందుండి యీవలకువచ్చిరి. మృతిజెందినవారు బ్రతికివచ్చిన నెంత సంతసింతురో యట్టి ప్రీతితోఁ దమ్ములు మువ్వురు వారిద్దఱం గౌగలించుకొనుచు నానందభాష్పములచే శిరంబులం దడియఁ బెద్దతడవెలుంగురాక కంఠములు డగ్గుత్తికఁజెంద నానందపరవశులై యుండిరి.
పిమ్మట వీరవర్మ తమ్ములనెల్ల నాదరించుచు నగ్గిరికూట శృంగాటకమునకుంజని యందొకచో విశ్రమించి వారుచేసినకృత్యములన్నియు గ్రమ్మఱఁదమ్ములకడ నుపన్యసించెను.
అన్నదమ్ము లొండొరులుపడినకష్టసుఖము లెఱింగించికొనుచుఁ గొన్ని దివసములా గిరిశిఖరంబున విశ్రమించిరి. సుధన్వుఁడు తాను వరించిన దేవకన్యకల సౌందర్యతిశయంబు, నాలోక రామణీయకము, వర్ణించుచుఁ దమ్ములనెల్ల విస్మయసముద్రములో నీదులాడఁజేసెను. వారినేమిటికిఁ దీసికొనివచ్చితివికావని యడిగిన నమ్మగువలు త్రికూటాంత ర్భాగమునుండి యీవలకు రారు. నాకెల్లకాలము నందుండుట కిష్టములేదు. విదేశమెంతసౌఖ్యప్రదమైనను స్వదేశవాసానందమునకు సరిపడదు. అప్పుడప్పుడువచ్చి పోవుచుందునని సమాధానపఱచితిని. అందలి యైశ్వర్య మీరత్నములే తెలుపుచున్నవి చూడుఁడు పెక్కే.ల ఆగ్గిరిశిలలన్నియు బంగారము మణులేకాని పాషాణములు కావు. ఒక్కరత్నము వెలకు మనరాజ్యము సరిపడదు. అప్పుడప్పుడు పోయి మనకుఁగావలసినన్ని మణులు తీసికొనిరాగలను. మనమందరము సుఖముగా ననుభవింతమనియచ్చట ముచ్చట లెఱింగించి నవియే పలుమూరు చెప్పుచుండఁ దనివి తీరక వినినవార్తలే మనలనడుగు చుందురు.
వీరవర్మ ప్రతాపరుద్రునితోఁ దమ్ముడా. మీవదిన చిత్రసేనకుఁబినతల్లికూఁతురు తేజోవతియను యువతి మిక్కిలి చక్కనిది. అదియు సప్సరస్సంజాత పద్మసేనతో సమముగాఁ బెనుపఁబడినది మీతమ్ములలో నెవ్వరికైనఁ బెండ్లిచేయుఁడని నన్ను బద్మసేన గోరినది. అందులకై యాయిందువదన నిందు దీసికొనివచ్చితిని. మన తమ్ము లిరువురు తరుణుల స్వీకరించిరి. నీవే యస్వీకృతదారుండవై యున్నావు. తేజోవతిం బరిగ్రహింపుమని చెప్పెను. ఆమాట కందరు ననుమోదించిరి. నాఁడే యాకొండశిఖరమున వారికి వివాహముఁ గావించిరి. అయ్యుత్సవములతోఁ బ్రొద్దులు పుచ్చుచున్న సమయంబునఁ గన్యాకుబ్జమునకరిగిన దూతలు పటురయంబున నరుదెంచిరాజదంపతుల సేమముదెలిపి మీరాకకైవారు గడియలు లెక్క పెట్టుచున్నారు. మావాచకశ్రవవణసమయమే ప్రయాణసమయముగాఁ జేయవలయునని కోరిరి. అనిచెప్పినంతఁ తొందరపడుచు వీరవర్మ యప్పుడే ప్రయాణసన్నాహము గావింపుఁడఁని యాజ్ఞాపించెను.
అచలమునుండి తెచ్చిన మణికనక వస్తువిశేషము లన్నియు నేనుంగులపై నెక్కించిరి శుద్ధాంత కాంతల నాందోళికా యానములు నధిరోహింపఁజేసిరి. రాజపుత్రులు గుఱ్ఱములెక్కిరి. భేరీభాంకారాది
భూరిధ్వానంబులు భూనభోంతరాళములునిండఁ జతురంగబలముల కోలాహలములు జలధి ధ్వానంబు ననుకుకరింవ మహావైభవముతో బయలుదేరి యెడనెడ శిబిరములువైచి విడియుచుఁ గతిపయ ప్రయాణంబుల నిజనగరమున కరిగిరి. గీ. వారిరాక రాక వారిరాశియుఁబోలెఁ
బొంగు చనుజు లెదురు పోవుటయును
ఆదరించి ప్రేమ నాలింగితులఁ జేసి
సేమమడిగి ప్రీతిజెందిరపుడు.
రతిమంజరియుఁ బ్రభావతీయు నంతకుఁ బూర్వమే యన్నగరంబుఁ జేరియుండిరప్పుడు
కం. రాకొమరులు వెస నిజభా
ర్యాకరములు గొనుచుఁబోయి రహి మకుటమణుల్
సోకఁగమ్రొక్కిరి పితృపద
కోకనదంబులకు బంధుకోటుల కాలమిన్.
సౌభాగ్యసుందరియుఁ బ్రహర్షాతిశయంబునఁ గొంతసేపుమేనెఱుంగక యానందాశ్రవులచేఁ బుత్రులశిరంబులు దడుపుచునక్కునంజేర్చికొని మూర్థాఘ్రాణంబు సేయుచుఁ గోడండ్రఁదీవించి తత్తద్వృత్తాంతమంతయువిని వారివారికులశీలనామంబు లడిగిన వీరవర్మనిరూపించి చూపుచు
సీ. అతలాథవతి యపత్యం బీ సరోజాక్షి
కడుసాధ్వి నీ పెద్దకొడుకు పత్ని
యిది సుధన్వుని కూర్మి యిల్లాలు కృప వాని
దాచి కాపాడిన ధన్యురాలు
జయదేవుపట్టి ముచ్చటఁబట్టి రాగవ
ర్థనునిఁ జేపట్టిన రమణియదియ
జనకు తప్పు సడల్ప జయమల్లుఁ గైకొన్న
దుందుమారుని ముద్దు దుహిత యిదియ.
గీ. పద్మసేనకుఁ చినతల్లి పట్టియీమె
దివ్యగుణథామ తేజోవతీ సునామ
నీదు నైదవ పుత్ర పాణినిగ్రహించె
నమ్మ చూడుము కోడండ్ర నైదుగురను.
వృత్తాంతశ్రవణ తత్పరయై మహాసంతోషముతో వెళ్లించినది.
తాను నారదుఁడననియు సంసారమాయా విలాసములఁ జక్కతి ననియు నించుకయు దెలిసికొనలేక కుటుంబసక్త యై యొప్పుచుండెను.
అని యెఱిఁగించి . . . ఇట్లు చెప్పందొడంగెను.
- __________
223వ మజిలీ
ఉత్తరదిగ్విజయము.
విద్యాసాగరుఁడు కళాభిరాముఁడు హరివర్మసుధర్ముఁడుసులోచనుఁడు వీరేవురు ప్రతాపరుద్రుని తరువాతివారు తాళధ్వజుని కుమారులు వారొకనాఁడు తండ్రి నికటమున కరుదెంచి నమస్కరించి యిట్లనిరి. జనకా! క్షత్రియులకు భుజబలాజిన్‌తమైన సంపదల ననుభవించుట యశస్కరము మాయన్న లేవురు పూర్వదిక్కంతయు జయించుటయేకాక లోకాతీత సౌదర్యంబునం బ్రకాశించు నించుబోఁడులఁ బెండ్లియాడి నిరుపమానమగు విభవముతో నింటికివచ్చిరి.
మే మమ్మహావీరులకు సోదరులము మీకుమారులము నగుట మాకుఁగూడ విజయ యాత్ర సేయవలయునని యభిలాష గలుగు చున్నది. నాలుగు దిక్కులలో నుత్తరదిక్కు మిక్కిలి పెద్దది. అం