కాశీమజిలీకథలు/పదవ భాగము/221వ మజిలీ
లేవని చెప్పవచ్చును. వానినన్నియు మనదేశమునకుఁ దీసికొని రాఁదలంచితిమి. కావున నీగొలుసు చివర బిలపరిమాణముకన్న తక్కువగా వర్తులములైన మందసములఁగొన్ని గట్టించి దిగవిడుచు చుండుము వానిలో నీవస్తువులుంచి పంపుచుందుము. ఈబిలమొక మనుష్యుండు మాత్రము పట్టునంత వైశాల్యము గలిగియున్నది. కావున వరుసగా నాలుగైదు సంచులంగట్టించి విడువుము వానిలోమేము దూరి వచ్చు చుందుము, గాలి తగులునట్లిందుండి చర్మభస్త్రికలచే నూదింతుము. మేముపైకివచ్చుటకు నింతకన్న మంచియుపాయములేవియైనఁ దోచినచో నట్లుచేసి గొలుసు దిగవిడుచుచుండుము. ఎప్పటికప్పు డుత్తర ప్రత్యుత్తరములు దెలిసికొనుచుండవలయునని యెన్నియో విషయములందు వ్రాసి పంపిరి.
ప్రతాపరుద్రుఁడు వ్రాసినరీతిగా నొకదివసముమాత్ర మందు నిలిపి పిమ్మట నాగొలుసు లాగఁబడినది. పరమసంతోషముతో నా వింతజూచి రాజకుమారు లిరువురు నంతఃపురమునకరిగి భార్యలకుం జెప్పి కనకరత్నమండనాది విశేషముల మందసముల నెక్కించుచుఁ బ్రయాణసన్నాహములో నుండిరి,
అని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది మణిసిద్ధుండవ్వలికథ పైమజిలీయందిట్లు చెప్ప మొదలువెట్టెను.
- ___________
221 వ మజిలీ.
రాగవర్ధనునికథ
గోపా! వినుము తాళధ్వజుని మూఁడవకుమారుఁడు రాగవర్ధనుఁడు తండ్రియాజ్ఞబూని యన్నలజాడఁ దెలిసికొనఁబయలుదేరి గాలి వానచే దారితప్పి జయపురంబుఁ బ్రవేశించెనని నీవెఱిఁగియుంటివిగదా.. అప్పుడు తన్నగరాధిపతి జయుదేవుఁ డూరలేఁడు. అతనిభార్య దూతలవలన రాగవర్ధనునిరాకవిని తొట్రుపడుచుఁ దనకూఁతురు రతిమంజరింజీరి యిట్లనియె.
వుత్రీ! వీరవర్మతమ్ముఁడు రాగవర్ధనుఁడనువాఁడు ఎందోపోవుచు గాలివానందడిసి తడిపుట్టములతోఁ బెద్దసత్రమునందు నిలువంబడి యున్నాడట. వానియన్న వీరవర్మ మనకుఁగావించిన మేలు వేయి జన్మములకైన మఱువఁదగినదికాదు. మిదండ్రిగారూరలేదు. మంత్రి ప్రముఖులకు వార్తనంవునప్పటికిఁ బ్రొద్దుపోవఁగలదు. నీపరిచారికలలోఁ దెలివిగలదానినందుఁబంపి వానిరప్పింపఁగలవా! అనియడిగిన రాజపుత్రిక నవ్వుచు నిట్లనియె.
అమ్మా! అంతతెలివిగలపరిచారిక లెవ్వరునులేరు అట్లుపోయి తీసికొనివచ్చినను నాతో మాట్లాడి గౌరవింపదగిన పురుషుఁడెవ్వఁడు నిందులేడుగదా. కావున నేనుపురుషవేషమువైచికొనిపోయి వానిందీసికొనివచ్చెద రాత్రివిందుజేసి మఱునాఁడుపంపుదుముగాక అట్లైనమాటదక్కగలదు. అందులకు నీకు సమ్మతమైనంజెప్పుమని యడిగిన నప్పటికి వేఱొకతెఱువు లేమింజేసి యట్లుచేయుట కంగీకరించినది.
రతిమంజరితృటికాలములోఁ బురుషవేషమువై చిగుఱ్ఱమునెక్కి పాణిద్వారముననాసత్రమున కఱిగినది. ద్వారమునగుఱ్ఱమునుదిగిలోపలికిఁబోయి యిందు రాగవర్ధనులెందున్నారని విమర్శించుచుఁ దిరుగుచుండఁదడిగుడ్డలబిండుకొనుచు జలిచేవడకుచు నొకయఱుగుపయిఁ గూరుచున్న రాగవర్ధనుండు ఆమెమాటలు విని నేనే రాగవర్ధనుండనని చెప్పెను.
రాజపుత్రికయతనియాకార సౌష్ఠవమునకచ్చెరువందుచుఁ జేయి పట్టుకొని వయస్యా ! నేనీనగరాధిపతిజయదేవునికుమారుండ మీరాక చారులవలనవిని యరుదెంచితిని. మాతండ్రియూరలేఁడు మీరుతడిసి యిందున్న వారని విని యరుదెంచితిని యీపీతాంబరంబుల ధరింపుడు. నావెంటరండు పర దేశస్థులవలె నీసత్రమున వసించుట ధర్మమే! ఈ రాజ్యము మొన్న మీయన్నలు మాకిచ్చినదే కదా ముందుగా వార్తనంపిన సీమకడకెదురురాకపోవుదుమా లెండు లెండు. పుట్టంబులం దాల్పుఁడు అనిపలుకుటయు నతండేమాటయుఁ బలుకలేక సిగ్గుపడుచు దిగ్గునలేచి యామెయిచ్చిన పుట్టంబులంగట్టికొని వినయముతోఁ గృతజ్ఞతఁ జూపుచు నిప్పుడేపోవుదము మాదూతలు రానీయుండనియుత్తరము చెప్పుటయునాయింతియిట్లనియె.
వయస్యా! మీదూతలెప్పటికివత్తురో. అంతదనుక నీసమ్మర్దములోనుండుట కష్టముకాదా! వారికి నేనువార్తనంపిరప్పించెదంగాక లెండు. నాగుఱ్ఱమునెక్కుడు నేను మీగుఱ్ఱమునెక్కెదననిపలుకుచు నతనిచేనట్లు చేయించి తానాతని గుఱ్ఱమెక్కి ముందు నడిపించుచు గడియలో నతని కోటలోనికిఁ దీసికొనిపోయినది.
అందుఁ గ్లేశమువాయ నభ్యంగనక్రియ నుష్ణోదకస్నానము మృష్టాన్నసంతృప్తియుఁ గావింపఁజేసి పిమ్మట ననర్ఘమణి భూషణాంబరంబులం దాల్పంజేసి లోపలి సభాభవనంబునఁ గూర్చుండఁబెట్టి, కొంతసేపు వారాంగనానృత్య గానవినోదములచే నతని నారాధించినది. పిమ్మట రతిమంజరి యారాజకుమారుఁ దనయంతఃపురమునకుఁ దీసికొనిపోయి హంసతూలికాతల్పంబునం గూర్చుండఁ బెట్టి ప్రక్క పీఠంబునఁ దాను గూర్చుండి వినోదముగా నిట్లు సంభాషించినది.
రతిమంజరి -- వయస్యా 'సఖ్యంసాప్తపదీన ' మనియున్నది కదా. మీకు నిద్ర వేళయగుచున్నది. అయినను మీతోఁ గొంత ముచ్చటింపవలయునని వేడుక కలుగుచున్నది. మీదర్శనమంద యాశక్తియున్నది. నాతప్పులు మన్నింప వేఁడుచున్నాను.
రాగవర్ధనుఁడు - (కృతజ్ఞత ప్రకటించుచు) రాజపుత్రా! నేఁడు నీవునాకుఁగావించిన యుపచారములు వేయిజన్మములకై న మఱపు రావు. నాజీవితాంతముదనుక నీకుఁగృతజ్ఞుడనైయుండెద.
రతి – ఆమాటలు నే సహింపఁజాలను. మీయన్నలు నిల్పిన దివాణము మీకుఁబరిజనులమై యూడిగములు సేయఁదగినవారము మమ్మింతగాఁ గొనియాడఁదగదు.
రాగ — ఉత్తములిట్లే యాత్మగుణప్రస్తుతికి ననుమతింపరు కానిమ్ము. నీసుగుణములు నాకు సంతోషము గలుగఁ జేయుచున్నవి.
రతి - మీతోఁగొన్ని పరిహాసవచనములాడఁదలంచితినిమన్నింతురుగాక! మీమొగము పరీక్షించుచున్నాను. మీకు వేశ్యానృత్యగానప్రసక్తియందంత యభిరుచిలేనట్లున్నది యేమందురు?
రాగ -- నవ్వుచు, అవును. సత్యమే నాకువేశ్యలనిన నభిరుచి లేదు వినుము.
చ. గడుకొని మంత్రశక్తి నురగంబుల ఘోరవిషానలంబు పెం
పుడుపఁగవచ్చుఁ గానల మదోత్కట కుంభికృతప్రమాదము
న్గడువఁగవచ్చు నొక్కతఱినక్రముఖస్థుఁడు దాటవచ్చు నె
వ్వడుఁగణికాముకాగ్నిఁబడువాఁడుబయల్పఁడనేరఁడెన్నఁడున్,
రతి నవ్వుచు,
శ్లో. వేశ్యాజఘనరథస్థ, కులనారీం కస్సచేతనోగచ్ఛేత్
నహిరథమతీత్య కశ్చిద్గోయానేనావ్రజేత్పురుషః.
ఇందుల కేమందురు?
రాగ — అందుల కే తత్సంపర్కము కూడదనుచున్నాను.
రతి - పోనిమ్ము వయస్యా! నీవు శృంగారప్రబంధము లేవైనం జదివితివా.
రాగ — ఒహో నీకు శృంగారరసము చాలప్రీతివలెఁ దోఁచు చున్న దే.
రతి -- అవును వయస్యా వినుము. శ్లో. ఆయుస్సారో యౌవనమృతుసారః కుసుమసాయక వయస్యః
సుందర! జీవితసారో రతిభోగరసామృతాస్వాదః.
బ్రతికినదినములలో యౌవనకాలమే కాలము వసంతఋతువేఋతువు. రతిభోగరసామృత మనుభవించుటయే జీవితమునకు ఫలమని విద్వాంసులు వ్రాసియున్నారు.
రాగ - మంచిరసికుఁడవే! శృంగారప్రబంధములుచాలఁ జదివితివి కాబోలు.
రతి - చదువుటయేకాదు బహుదేశములు దిరిగి యాయాదేశ స్త్రీల విశేషములఁ దెలిసికొనివచ్చితిని మీకునిద్రలేనిచో వినిపించెద.
రాగ - నీవిట్టిమాటలఁ జెప్పుచుండ నిద్రయెట్లువచ్చును వినుపించుము తెల్లవారువఱకు మేలుకొనఁగలను.
రతి - శ్లో. చోళీచ్ఛన్నాయదికుచతటీదులన్ భాఘూర్జరీణాం
కచ్ఛాభావాదలఘుజఘనంతహిన్ శక్యావమర్షం
తద్వ్యత్యస్తం ద్రవిడ సుదృశామంతతః కింతస్స్యా
దేశత్రైకంభవతి సులభంతద్వదన్యత్ర చాన్యత్ .
ఘూర్జరస్త్రీలు జఘనంబున సన్ననివలువజుట్టి కుచతటంబు దృఢచేలంబుల బిగింతురు. ద్రవిడ స్త్రీలందులకు వినిమయముగా జఘనంబు ఘనవసనావృతంబు గావించి కుచతటంబు పటావృతంబు గాకుండఁ జేయుదు రొకొక్క దేశంబుననొక్కొక్క విశేషంబుగలదు మఱియు,
శ్లో. వాచిశ్రీర్మాధురీణాం జనకజనపదస్థాయినీనాం కటాక్షె
దంతె గౌడాంగనానాం సులలితజఘనే చోత్కల ప్రేయసీనాం
త్రైలింగీనాం నితంబె సఘనఘనరుచౌ కేరళీకేశపాశె
కర్నాటీనాంకటౌచ స్ఫురతిరతిపతిః ఘూర్జరీణాంకుచేషు.
పాండ్యదేశస్త్రీ వాక్కులందును విదర్భ దేశస్త్రీల చూపులందును గాడాంగనల దంతములందును నుత్కల త్రిలింగకర్ణాటదేశాంగ నల జఘనమందును గేరళాంరగల కేశములందును ఘూర్జరాంగనల కుచంబులందును మన్మధుండు తాండవమాడుచుండునిదియునుంగాక.
శ్లో. ఆంధ్రీపీనపయోధరైణనయనా సర్వాగుణాధికాదక్షిణీ
కర్ణాటీసురతోపచారచతురా లాటీ విదగ్ధాప్రియా
క్రూరా మాలవి కాకలాసునిపుణా నిత్యం మహారాష్ట్రికా
సౌరాష్ట్రీమృగలోచనా సువచనా ద్రవ్యప్రియా ఘూర్జరీ.
రాజపుత్రా! ఈదేశములన్నియు నేనుదిరిగి చూచితిని. ఇట్టి శ్లోకములు వేయిచదువగలను.
రాగ — వయస్యా ! ఏదేశస్త్రీయైననేమి తత్సభావమెట్టిదో తెలిసికొంటివా వినుము.
శ్లో. శ్రుతాపురాఁణె యాసాంచ చరిత్రమతిదూషితం
తాసుకో విశ్వనేత్ప్రాజ్ఞః ప్రజ్ఞానాంశ్చ గుణాశ్రయః.
శ్రుతులయందుఁ బురాణములందు స్త్రీ చరిత్రము దూష్యముగా వర్ణింపఁబడియున్నది. గుణవంతుఁ డెవ్వఁడు నట్టిస్త్రీని విశ్వసింపఁడు.
రతి - సరిసరి మంచిమాటయే పలికితిరి.
శ్లో. ఫలం ధర్మస్య విభవః విభవస్య ఫలం సుఖం
సుఖమూలాని తన్వంగ్య: వినా తాభ్యః కుతస్సుఖం.
ధర్మఫలము విభవము విభవఫలము సుఖము సుఖమూలములు స్త్రీలుకారా స్త్రీలులేనిదే సుఖమేల విభవమేల వినుండు.
శ్లో. ప్రజ్ఞాకలా యౌవనజాతి సంపత్సౌందర్య విద్యా మదగర్వితాభిః
సుదుర్లభాభిర్వర సుందరీ భిస్సంభోగసంజాత సుఖం కథంస్యాత్.
రాగ - అవును నీవు చెప్పినట్లు ప్రజ్ఞ కళ యౌవనము కులము సంపద సౌందర్యము విద్య యిన్ని గుణములుగల కలకంఠులు లభించుట పూర్వపుణ్యమే. కానిచో
శ్లో. వరమగ్నౌస్థితిర్హింస్రజంతూనాం సన్ని ధౌసుఖం
తతోపి దుఃఖదం పుంసాం దుష్టస్త్రీ సన్నిధౌ ధ్రువం.
హింసించు జంతువుల సమీపమునందు సుఖముగా నుండవచ్చునుగాని దుష్టస్త్రీ సన్నిధి వసించుట కడుంగడు కష్టమని చెప్పలేదా.
రతి — దుష్ట పురుషులకడ వసించుట స్త్రీలకు మాత్రమూ కష్టము లేదా వినుండు.
శ్లో. యేకామినీం గుణవతీంచసయౌవనాంచ
నారీం నరాః ప్రణయినీంచ విమానయంతి
తె భోఃకృషీవల వచః పరిదగ్ధ చిత్తై
గోన్ భిస్సమం పృథుముఖేషు హలేషు యోజ్యః.
గుణవంతురాలగు నిల్లాలి నవమానపఱచిన పురుషుని దుక్కి. టెద్దుప్రక్క నాగలికిఁ గట్టి దున్ను మని బుద్ధిమంతులు చెప్పియుండలేదా.
రాగ — ఓహో రాజకుమారా ! నీకు స్త్రీలయం దెక్కువ యభిమానము కలిగియున్న దే.
రతి - మనోహరా! మనోహరాకారముగల స్త్రీని జూచి మోహవివశుఁడు కాని పురుషుఁ డెవ్వఁ డున్నాడో చెప్పుము. మహర్షులుగూడ వారిం జూచి విహ్వలులై నట్లు పురాణములు ఘోషించుచుండలేదా! అది యట్లుండనిండు అడుగవలసిన మాట యడుగుట మఱచితిని. మీకు వివాహమైనదియా ?
రాగ - లేదు.
రతి - మీకుఁదగిన లావణ్యవతి దొరకక యింతవఱకు వివాహము మానితిరి కాబోలు,
రాగ - ఎట్లనుకొన్నను సరే..
రతి - రాజవుత్రా ! మిమ్మీరాత్రి నెట్లును నిద్రపోనీయను మాయింటఁ జక్కని గాయనీరత్నమున్నది. అనురూపరాగానులాప విలాసములచే మిమ్మారాధింపవలయునని యభిలాష పడుచున్నది. అనుజ్ఞయిత్తురే! అయ్యో! అమాట మఱచి యింతదనుక వృధాకాల హరణము గావించితిని గదా.
రాగ — ఈరేయి మీయధీనుఁ డనైతి నెట్లుచేసినను సంతోషమే. అనుటయు నిదిగోపోయి దానిందీసికొనివత్తునని పలికిలోపలికిఁ జని యరగడియలో దివ్యమాల్యానులేపన కనకమణి భూషాంబర విభూషితగాత్రియై జగన్మోహన, విలాసములో గరంబున వీణందాల్చి యొక శుఖవాణి యతనిచెంత కఱుదెంచి నమస్కరించినది. అతండా యెలనాగ సోయగము దిలకించి మేనుబులకింపఁ గుశుమశరసాయకములఁ బాఱింబడి తానెవ్వఁడో యక్కడికెట్లువచ్చెనో యంతకుమున్నేమిచెప్పెనో యంతయుమఱచి తద్రూపాతిశము నయనంబులఁ గ్రోలువాఁడు బోలె నూరక చూచుచు.
పొలఁతీ! నీవెవ్వతెవు! ఆ రాజపుత్రుఁడు రాలేదేమి? ఆవీణాభారంబు భరింపలేకుంటివి. నేలంబెట్టరాదా? అందుఁగూర్చుండుము. అని గద్గదస్వరంబునఁబలికిననక్కలికి కలికి చూపులునత నింజూచుచునిట్లనియె.
మనోహరాకారా! మా రాజపుత్రుఁడు తల్లిగారుపిలిపింపలోపలి భవనంబునకరిగెను. ఆయనవచ్చు దనుక సంగీతమునమిమ్మారాధించు చుండుమని నాకునియమించెను. నామాట మీతోఁజెప్పి యున్నాడఁట కాదా? దేవర యనురాగప్రవృత్తి యెట్టిదో తెలిసికొని పాట ప్రారంభించెద సెలవే యనవుఁడు నుత్కంఠతో నతండిట్లనియె.
మీ రాజపుత్రుఁడీరాత్రి వచ్చునా నెపముపన్ని తల్లిగారియొద్ద కరుగలేదుకద. అని యడిగిన సప్పుడఁతి యేమో యెంతలో వచ్చునోనాకుఁ దెలియదు రాకున్న మీకేమికొదవ దానురాలిందుండిసేవఁ జేయగలదు. మీయభీష్టమేదియో తెలుపుఁడని యడిగిన నతండు నీ కేది ప్రియమో అదియే నాయభీష్టము.
రాగ - ప్రబోధనము గానప్రకృతి ననుసరించి యుండు నీకుఁ దోఁచిన గీతంబులంబాడుమని నియోగించుటయు నమ్మించుబోఁడి యందలి పీఠంబునంగూరు చుండి విపంచి మేలగించి పంచమస్వరాను కరణముగా నాలాపించి తనకుఁగల గాంధర్వవిద్యా విదగ్ధత్వంబుఁ దేటపడ హాయిగాఁ బాడి యతని రాగసముద్రములో మునుంగఁ జేసినది.
అప్పుడతం డాత్మగతంబున నాహా యీగాయనీరత్నము కర్ణరసాయనముగాఁ బాడినది. ఈమెంజూడ నా రాజపుత్రుని చిహ్నములు గనంబడుచున్నవి. ఈయువతి యతని చెల్లెలు కాదుగదా చెల్లెలేయైనచో క్రొత్తవాఁడనగు నాకడ నిట్లు విస్రబ్ధముగానిలిచిపాడునా? నాచిత్తమీ మత్తకాశినింజూచినతోడనే సంకల్పభవాయత్త మగుచున్న దేమి? అయ్యో! రాజవుత్రుడు నాబుద్ధింబరీక్షించుటకుఁ గపటముగా నీమెనిందుఁ బంపెనా! ఈమెతోనతఁడు రాకపోవుట శంకా స్పదముగానున్నది. ఈయేకాంతవాసంబు నా కుత్కంఠఁగలిగించుచున్నది. ఈలలన కులకాంతయైన నగుంగాక వేశ్యయైన నగుంగాక దీనింగలియ వేడుకఁబొడముచున్నది. అని తత్తఱించుచుఁ దటాలున నాకుటిలాలక చేయుపట్టుకొని జవ్వనీ! నీనెవ్వతెవో చెప్పితివికావు. మనోహరముగాఁ బాడి నాహృదయ మాకర్షించితివి. నీకుఁ బారితోషిక మీయనున్నాడ గోరికదెలుపుమని యడిగిన నప్పడఁతి యించుకపటకోప మభినయించుచు నిట్లనియె.
పురుషోత్తమా! మా రాజవుత్రుడు మిమ్ము సత్కరించుటకై వినోదముగా నాచేఁబాడించెను. మీచే గానభృతినందుటకు నేను వేశ్యనుగాను మీరు పరస్త్రీ పరాఙ్ముఖులని చెప్పుటచేఁ జెంగట నిలిచి పాడితిని. మీరు సంతసించితి రింతియ పదివేలు నాకుఁ గానుక లవసరములేదు మఱియుఁ బరాంగన కరంబుఁ బట్టవచ్చునా? ఇది మీ దేశాచారముకాబోలు చేయివదలుండు పోయివత్తునని పలికి లేవఁబోయిన వారించుచు నతండిట్లనియె. నీవు మొదటఁజెప్పినమాట మఱచితివి. మీరాజకుమారుఁడు వచ్చుదనుక మిమ్మారాధించుచుండెద ననిచెప్పి యిప్పుడు లేచిపోయెద ననెదవేల. అది స్వవచన వ్యాఘాతముకాదా. మఱియుఁ బాటకు మెచ్చి కానుక నిచ్చెదనన్నఁ దప్పుగాగణించితివి. ఈ విపరీతమెక్కడను జూడలేదు. మీరాజకుమారుఁడు రానీ అతండు తప్పనిన నొప్పుకొనియెదనని పలుకుటయు నక్కలికి యిట్లనియె.
సరిసరి. ఆయనకుఁజెప్పిన నన్నే మందలించును. అట్లైన మీ చిటికెనవ్రేలియుంగరము నాకీయుఁడుమీ పేరు దలంచుచు ధరింతునని పలికిన పక్కున నవ్వుచు నక్కుమారుఁ డాయంగుళీయక మిచ్చెను. దానిం దాల్చుచు నాముదిత ముదితహృదయయై మనోహరా! నే నుంగరమడిగిన నవ్వితిరేల? తప్పాయేమి? అనుటయు నతండు తప్పులు మాకుఁదెలియవు. పాటకుమెచ్చి కోరికొనుమన వేశ్యలమా! అనితప్పుఁ బట్టితివి. ఇప్పుడీ యుంగరమెట్లుకోరితివి. అంగుళీయకము భర్తవలనఁ గాని పరపురుషునివలన లలనలు స్వీకరింపరు. దీనినేమిటికి కోరితివో యనినవ్వితిని. తెలిసినదియాయని నుడివిననవ్వి యవ్వనిత యిట్లనియె.
అయ్యో! ఆసాంప్రదాయము నాకుఁదెలియక దానింగోరితిని. అదియునుంగాక మీరు నాకరగ్రహణము జేయుట మీరన్నమాట బలపరచుచున్నది. దీనివలన మీరునాకు భర్తలగుదురాయేమి సరిసరి మీయుంగరము మీరు తీసికొనుఁడు అని పలుకుచుఁ దన వ్రేలి యుంగరము మఱియొకటి తీసి యంతడు వలదనుచుండ బలవంతమున నతని వ్రేలందొడిగినది. అతండది చూచికొని యోహో ఇది నా యుంగరముకాదు. మఱియొక టిచ్చితివేల! ఈవినియమంబు నేనన్నమాట ధృవపరచినది కదా అనితెలిపిన నత్తన్వి దైవసంకల్ప మట్లున్నది కాఁబోలు తెలియకయే యీకృత్యములు నిర్వర్తిల్లినవి. నన్ను మఱియొక పురుషుఁడు స్వీకరింపఁడు ఇఁక మీరే భరింపవలయునని పలుకుచు నొకపుష్పమాలఁ దెచ్చియతని మెడలో వైచినది. అతండు మోహాంధుండై తదనుగుణ్యములగు చర్యల జరుపుచు రాజపుత్రుఁడు వచ్చునేమోయని సంశయించుచుండ గ్రహించి రాజపుత్రిక యాజడుపుడిపియాథార్థమంతయుం దేలిపి యతని క్రీడారసవివశుంగావించి నది
శ్లో॥ సద్భావరాగదీపితమదనాచార్యోపదిష్ట చేష్టానాం
కఃపరిగణనంకర్తుంరతి చక్రావిష్ట రమణయోశ్శక్తః,
అని యెఱింగించి. . . . . . యిట్లు చెప్పందొడంగెను.
- __________
222 వ మజిలీ
జయమల్లుని కథ.
పురుషుఁడు రాగవర్ధనుఁడు వనిత రతిమంజరి వారిద్దరికే వినోదము లెట్లుండునో చెప్పనవసరము లేదు. కొన్ని యహోరాత్రము లొక్క గడియవలె గతించినవి. ఒక్కనాఁడు రతిమంజరి రాగవర్ధనునితోఁ బ్రాణేశ్వరా నాఁడు మీరెందుబోవుచు నీనగరమున కరుదెంచితిరి! నా నిమిత్తమే భగవంతుఁడు మిమ్మిందుఁ దెచ్చెనని తలంచెదను. అని ప్రస్తావముగా నడుగుటయు నతండు గుప్పున దనయన్నలవృత్తాంతమంతయు జ్ఞాపకమువచ్చి గుండెజల్లుమన నౌరా! నేనెంత మోహాంధుండనై తిని? ఆయ్యయో మా తలిదండ్రులకుఁ గ్రొత్త శోకము గలిగించినవాఁడనై తినే తన్వీ నేనిక్కడికివచ్చి యెన్నిదినములైనది? అనియడిగిన మూడుదినములైనదని చెప్పినది చాలుచాలు మూడుదినములా మాసము ఆహా! నెల దినములొక్క గడియవలెదోచినదిగదా చిత్రకూట నగరమునఁజిక్కుపడిన మాయన్నలజాడ దెలిసికొనుటకై పోవుచు దారిదప్పి యీయూరుసేరి యిందు మీవలపులఁ జిక్కుకొని ప్రపంచకము మఱచి పోయితిని. కానిమ్ము నేనిఁకనిందు నిలువరాదు